Saturday, 7 February 2015

దోపిడీ->యుధ్ధం->రాజ్యం->కులం->అణిచివేత?->వైప్లవ్యం!

ఈ దేశం ఒకప్పుడు యుధ్ధాలు లేని,అసమానతలు లేని,దోచుకోవడం అంటే యేమిటో తెలియని ఒక వ్యవస్థలో కొంతకాలం బతికింది!పైగా తారతమ్యాలు అంచనా వేస్తే ఆ కాలంలో పరిఢవిల్లిన మిగతా ప్రాంతాల సంస్కృతి కన్నా అన్నింటిలో అగ్రాసనం ఇవ్వదగిన ఒక సంస్కారవంతమైన నాగరక జీవన వృత్తాన్ని పదిహేను వందల సంవత్సరాలు 5 మిలియన్ల జనసమూహం పాటించి నిలబెట్టడం ఇప్పటికీ మనం గర్వంగా చెప్పుకోదగినదే!దానినే చరిత్రకారులు "సింధు లోయ నాగరికత"గా పిలిచి యెన్నో పరిశోధనలు చేసి మనకి తెలియని మన ప్రాచీనుల గొప్పదనాన్ని మన కళ్లముందు నిలబెట్టారు.వెతికి చూసినా యుధ్ధానికి వుపయోగపడే పరికరాలు లేవు?యెంత శోధించినా మతానికి సంబంధించి మూఢనమ్మకాలు వున్న ఆధారాలు కనపడలేదు?తర్వాతి కాలంలో శైవులు శివుడి గానూ, బౌధ్ధులు అవలోకితేశ్వరుడి గానూ, జైనులు తీర్ధంకరుడి గానూ భావించిన యోగముద్రలో కనబడుతూ జంతువులతో పరివేష్టించబడిన "పశుపతి" ప్రముఖంగానూ శక్తి వుపాసనకి మూలమైన "మహా మాత" మూర్తి మాత్రమే కనబడుతున్నాయి.ప్రత్యేకంగా అతిపెద్ద మందిరాలు లేకపోవడం చేత ఇవ్వాళ మనం చేస్తున్నట్టుగానే యెవరికి వారు వ్యక్తిగతంగా పూజలు చేసుకునే వారని అనుకోవాలి!

ఇలాంటి గొప్ప వ్యవస్థ యెందుకు అదృశ్యమై పోయింది? యెక్కువమంది పరిశోధకులు తీర్మానించిన దాని ప్రకారం కాలం కలిసిరాక,విపరీతమైన చలికి తట్టుకోలేక,నిరంతర వర్షాలకి అతలాకుతలమైపోయి విధిలేని పరిస్థితుల్లో ఆ నగరాలని వొదిలేసి మరింత లోతట్టు ప్రాంతాలకి చేరి అప్పటికే అక్కడున్న ప్రజలతో యుధ్ధాలు చేసి గెలిచి కొత్త చోట్లలో కొత్తగా ఋతుపవనాల మీద ఆధారపడిన సేద్యాన్ని అలవాటు చేసుకుని ఒక కొత్త యుగంలోకి ప్రవేశించారు.క్రీ.పూ 1900 ప్రాంతాల మధ్యన విరాజిల్లిన సింధు నాగరికత క్రీ,పూ 1700 ప్రాంతానికి ఋగ్వేద కాలంలోకి మారింది.ఇది భారతదేశ చరిత్రలోకల్లా నిరంతర యుధ్ధాలతో,యుధ్ధాలలో గెలుపు కోసం యజ్ఞయాగాదుల పేరున సరికొత్త ఆరాధనా పధ్ధతులు తలయెత్తిన కాలం.అందుకేనేమో ఋగ్వేద సాహిత్యంలో శక్తిని,గెలుపును,వృధ్ధిని కోరుకునే సాహిత్యమే యెక్కువ? ఇక్కడ నాకు ఒక విషయం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది - ఇప్పటికీ సంతృప్తి కలిగించే జవాబు దొరకనంత అస్పష్టంగా వుండి మార్మికంగా ఉంటున్నది!వీరు నిజంగా సింధు నాగరికతా శిధిలాల నుంచి వచ్చిన వారేనా అనేది?యెందుకంటే ఋగ్వేద సాహిత్యంలో గానీ మిగిలిన వైదిక సాహిత్యంలో గానీ ఇవ్వాళ కనుక్కున్న సింధు లోయ నాగరికతకి సంబంధించిన ప్రస్తావనలు లేవు,యెందుకని?!

నా వూహ అయితే కొత్తగా సాహిత్యసృష్టి నేర్చుకున్న వెంటనే కళ్ళముందు జరుగుతున్న కోలాహలం ప్రధానంగా రికార్డు చెయ్యాల్సిన అవసరం వుండటం వల్ల ముందు వాట్ని గ్రంధస్థం చేసి ఆ తర్వాత పాత విషయాల్ని గుర్తు చేసుకోవడం మొదలు పెట్టేసరికి సింధు నాగరికత నాటి విషయాలు అస్పష్టమై పోయి కధలుగా మారి అప్పటి వ్యక్తులు రూపం మార్చుకుని పురాణ పురుషులుగా నిలబడ్డారని అనుకోవాలి!"ఇమ్మోర్టల్స్ ఆఫ్ మెలూహా" రచయిత విజయవంతంగా చేసింది ఇప్పుడు మన ముందు శివుడిగా పూజలందుకుంటున్న ఒకప్పటి సామాన్య మానవుణ్ణి అత్యంత వాస్తవికంగా చిత్రించడమే!

వైదిక కాలానికి సంబంధించిన జ్ఞానమంతా క్రీ.పూ 1500 - 1200 మధ్యలో సంకలించబడిన ఋగ్వేద సంహిత నుంచే  లభిస్తున్నది!ఇతర రాజ్యాలని ఆక్రమించే వుద్దేశంతో యేర్పరచిన "అశ్వమేధ యాగం" ప్రముఖంగా వర్ణించబడింది. ప్రముఖమైన "బ్రాహ్మణ","క్షత్రియ","వైశ్య","శూద్ర" వర్ణాలు నాలుగూ ప్రస్తావించబడినాయి,కానీ ఇవి అక్కడున్న వ్యక్తుల ప్రాధాన్యతని సూచించే విధంగానే వున్నాయి తప్ప జన్మకు అనుసంధానించటం అనేది తొలి వైదిక కాలంలో జరగలేదు!ఇక్కడే మరొక విశేషాన్ని కూడా ప్రముఖంగా చెప్పుకోవాలి.సింధు నాగరికత ద్వంసమైపోయి వారు చెల్లా చెదరవటం కేవలం ఒకే దిశలో జరగలేదు.అన్ని వైపులకీ వెళ్ళగా మన వైపుకి వచ్చిన వారు ఇక్కడ తమ పూర్వీకుల గురించి చెప్పుకున్న విషయాలూ ఇవ్వాళ్టి భారత దేశపు సరిహద్దుల కవతల వున్న సంస్కృతుల లోని ప్రాచీన సంస్కృతికి సంబంధించిన విషయాలూ ఒకే రకంగా వున్నాయి!అందుకే ఇక్కడి కొందరు అఖండ భారత్ పేరుతో ఆఫ్ఘనిస్థాను కూడా మనదే అంటున్నారు?వీటిని భాషా కుటుంబాలు అంటారు.ఇండో ఇరానియన్ భాషా కుటుంబం యొక్క వారసత్వం ప్రకారం మన దేశాన్ని ఆక్రమించిన ఆంగ్లేయులు కూడా మనకి సోదర జాతి అవుతారు?"మదర్ - మాతర్","బ్రదర్ - భ్రాతర్" లాంటి చిన్న చిన్న మాటల్లోని పోలికలే కాదు భాషా శాస్త్రవేత్తలు ఇంకా గహనమైన పోలికల్ని కూడా పట్టుకోగలిగారు!



వైదిక కాలంలోని రాజ్యం మొదటిసారిగా అధికారాన్ని కంద్రీకృతం చేసుకుంటూ యేర్పడింది!కురు వంశం అప్పటి చిన్న చిన్న తెగల నుంచి యుధ్ధాలు చెయ్యడంలో నేర్పరులైన వాళ్ళంతా వాళ్లలో వాళ్ళు కలిసిపోయి ఒక వున్నతమైన వంశంగా ప్రభవించింది.వీరిలో "పరిక్షిత్", "జనమేజయుడు" అనే ఇద్దరు తండ్రీ కొడుకులు అప్పటి రాజ్యానికి కావలసిన అన్ని హంగులూ యేర్పరచారు.పెరుగుతున్న జనాభాని పోషించడానికి అవసరమైన భూమి కోసం ఇతర్లని దోచుకోవడానికీ ఇతర ప్రాంతాలకి విస్తరించడానికీ యుధ్ధాలు అవసరమైనాయి.యుధ్ధానికి నాయకత్వం వహించి గెలిపించగలిగిన వాడు రాజయ్యాడు.యెంత లెక్క ప్రకారం వ్యూహాలు పన్ని పోరాడినా గెలుపు అదృష్టాన్ని బట్టి వుండటంతో దైవబలాన్ని సాధించుకోవడం కోసం పురోహితుడు అతనికి అవసరమయ్యాడు.యుధ్ధానికి అవసరమైన వనరుల్ని సమకూర్చగలిగిన వైశ్యుడు రాజ్యానికి మూలస్తంభం అయ్యాడు.యుధ్ధం తప్పనిసరి అయినప్పుడు కొన్ని పనులు తప్పనిసరిగా చెయ్యడానికి కొందరు తప్పనిసరిగా అవసరం గనుక శూద్రులు అందుకు వుపయోగపడ్దారు.యుధ్ధ పరికరాల అవసరమే లేని ఒక అధ్భుతమైన నాగరికతలో యెంత హీనపక్షంగా లెక్కేసినా వెయ్యేళ్ళ పాటు ప్రశాంతంగా గడిపిన జనసమూహమే కాలాంతరంలో యుధ్ధమే సమస్తంగా బ్రతికే జీవన విధానానికి మారడం ప్రపంచ చరిత్రలోని అత్యంత దుర్భరమైన విషాదా లన్నింటిలో ఒకటి?!

క్రీ.పూ 12వ శతాబ్దం వచ్చేసరికి ఋగ్వేద సాహిత్యం సంపూర్ణంగా సృజించబడి రాజ్యం యొక్క స్వభావం పూర్తిగా నిర్వచించబడి క్రీ.పూ 6వ సతాబ్దానికి 16 మహాజనపదాలు యేర్పడి భారత దేశపు స్సంస్కృతిలో అత్యంత ప్రముఖమైన కుల స్వభావాన్ని ప్రజల మనసుల్లో సుస్థిరం చేశాయి!.వీటన్నిటిలో మగధ ఇవ్వాళ్టి ప్రపంచ రాజకీయ వేదిక మీద అమెరికా స్థానానికి దీటయిన స్థానాన్ని ఆక్రమించడానికి కారణం ఆ రాజ్యంలోని విస్తారమైన ఇనుప ఖనిజపు నిధులు!ఈ మగధ చరిత్ర క్రీ.పూ 600 నాడు హర్యంక వంశంతో మొదలవుతుంది.క్రీ,పూ 424 నంచి శిశునాగ వంశం మొదలైంది.రాజు బలహీనుడైతే మంత్రో సైన్యాధిపతో అతన్ని హతమార్చి తమ పేరుతోనే ఒక కొత్త వంశాన్ని కల్పించుకోవటంతో కొత్త రాజవంశం అవతరించేది!ఈ శిశునాగుల కాలంలోనే గౌతమ బుధ్ధుని ప్రవచనాల ఆధారంగా బౌధ్ధ మతం, మహావీరుని బోధనల ఆధారంగా జైన మతం ఆవిర్భవించాయి.ఈ శిశునాగ వంశంలోని పదవ రాజు గారి బార్యకి ఆష్థాన క్షురకుడు చాలా మోహాన్ని పుట్టించాడు!అంతే,రాజుగారు హతమై పోయాడు - మహా పద్మ నందుడు నంద వంశ స్థాపకుడిగా రాజయ్యాడు!రాజవ్వగానే ఆ రాణిని ఖైదు చేసి పట్టపురాణి హోదాని వేరొక స్త్రీకి కల్పించాడు - తెలివైన వాడు గదూ?!

అయితే ఈ క్షురకుణ్ణి రాజుగా సాటివాళ్లంతా అంగీకరించడం అనేది "నందో రాజా భవిష్యతి" అనే గట్టి సంకల్పంతో రాజ్యాన్ని వృధ్ధిలోకి తీసుకొచ్చిన రాక్షస మంత్రి ఇతనికి విశ్వాసపాత్రుదైన మంత్రిగా దొరకడం వల్ల్లనే సాధ్యపడింది.రాజ్యం యెంత వృధ్ధిలోకి వచ్చినా ఇతడి కొడుకైన ధననందుడి తోనే వంశం అంతరించి పోయింది.ధననందుడికి యెనిమిది మంది కొడుకులు.అందర్నీ కలిపి నవనందులనే వాళ్ళు. చాణక్యుడు అప్పటికే అలెగ్జాంర్ యొక్క ప్రమాదాన్ని గుర్తించి మగధ రాజుని కలిసి అలెగ్జాంరు సైన్యాన్ని నిరోధించగలిగిన శక్తివంతమైన రాజ్యం గనుక అతన్ని సిధ్ధపరుచుదామని అక్కడికి వస్తే నందుని కొడుకులు నిర్లక్ష్యంగా అతన్ని అవమానించారు.దానితో అలెగ్జాండరు గురించి మర్చిపోయి నందహతకుల్ని భూస్థాపితం చెయ్యడంలో కృతకృత్యుదు కావడంతో చాణక్యుని శిష్యుడైన చంద్రగుప్తుడు రాజుగా మౌర్య వంశం మొదలైంది.ఈలోపు అలెగ్జాండరు తనంతట తనే మగధ వరకూ రాకుండానే వెనుదిరగడంతో మగధకి అలెగ్జాండరు పోటు తప్పింది!

నందుడికి విధేయుడిగా వున్న రాక్షసుణ్ణి చంద్రగుప్తుడికి మంత్రిని చెయ్యడానికి వేసిన రాజకీయపు యెత్తుగడల నేపధ్యంగా రచించబడిన "ముద్రా రాక్షసం" నాటకపు ఇతివృత్తం సంస్కృత సాహిత్యంలో అత్యంత విభిన్నమైనది - ఇప్పటి దిటెక్టివ్ కధల్లో వుండే టెన్షన్ పుట్టించే గుణం అంతర్లీనంగా వుంటుంది?!ఇప్పటికీ ప్రాచీన కాలపు రాజరికాలు యేవిధమయిన సాంప్రదాయాల్ని పాటించేవి అనేది తెలుసుకోవడానికి చాణక్యుని "అర్ధశాస్త్రం" అనే గ్రంధం ఒక్కటి చాలు.ఇందులో శూద్రుల స్థితి గురించి నిర్మొహమాటంగా "శూద్రుడికి సొంత ఆస్తి సమకూరితే దాసవృత్తి చెయ్యడు గనక శూద్రుడి దగ్గిర పోగుపడిన చిల్లిగవ్వనైనా సరే లాగివేసుకోవటం చట్టవిరుధ్ధం కాకపోగా రాజు తప్పనిసరిగా చెయ్యాల్సిన ముఖ్యమైన పని" అని తేల్చి చెప్పాడు!ఇటువైపు నుంచి ధార్మిక విషయాలలో "శూద్రుడు తనంతట తను వేదం చదవడం కాదుగదా ఆ దారిన దూరంగా వెళ్తున్నప్పుడు పొరపాటున చెవిన పడ్డా ఆ శూద్రుడి చెవుల్లో సీసం కరిగించి పొయ్య" మనే రకం సుభాషితాలు మరింత క్రూరమైనవి - చేశారో లేదో తెలియదు గానీ మాటలు మాత్రం మిగిలి వున్నాయి?!వీటి నన్నిట్నీ దుందుడుకు ప్రస్తావనలుగా కొట్టిపారేసినా శంబుక వధని సమర్ధించలేరు గదా!తపస్సు చెయ్యడం పట్ల శ్రధ్ధ అనే బ్రాహ్మణ స్వభావం అతని మనస్సులో వుండటం వల్ల అతన్ని బ్రాహ్మణుడిగా గుర్తించడానికి బదులు మృతశిశువును కారణంగా చూపించి చంపించటం అన్యాయమే కదా?అయితే ఒకటి - అప్పటి బ్రాహ్మణులు చేసిన దానికి ఇప్పటి బ్రాహ్మణుల్ని నిందించి ప్రయోజనం లేదు.ఇప్పటి బ్రాహ్మణుల్లో చాలామందికి నాకు తెలిసిన మాత్రం కూడా తెలియదు అప్పటి విషయాల గురించి,యేదో పెద్దవాళ్ళు చెప్పారు అని పాటించటమే తప్ప అందరూ అవన్నీ అర్ధమయి పనిగట్టుకుని కులాధిపత్యాన్ని చూపిస్తున్నారని చెప్పలేం.వాళ్లలోనే వీటిని దగ్గిరగా చూసి అసలు అర్ధం తెలుసుకుని వ్యతిరేకించి పోరాడిన సంస్కర్తలు గూడా పుట్టారు మరి?

అయితే ఇన్ని సహస్రాబ్దాల పాటు ఈ వ్యవస్థ యే తిరుగుబాటూ లేకుండా వొద్దికగా యెలా వుంది?ఇంతకాలం బద్దలు కొట్టకుండా వుండటానికి ఇక్కడి ప్రజలు క్షాత్రం లేనివాళ్ళు కాదుగదా!ఇతర దేశాల్లో బానిసల పేరుతో చేసినట్టు గొలుసుల్ని కట్టి బంధించి చేయ్యలేదు గదా,విపణి వీదిలో పెట్టి అమ్మలేదు గదా - మరి దీన్ని దుర్మార్గం కింద యెలా లెక్కిస్తాం?ఈ కులవ్యవస్థని అంతం చెయ్యాలనుకునే వాళ్ల మీదకి సంధించబడే ఈ ప్రశ్నలు బలమైనవి గనకనే వాళ్ళూ నోరెత్తలేక పోతున్నారు.తమ కులంలోనే కులాన్ని గట్టిగా పట్టుకుని వుండేవాళ్ళని చూసి,తమలోనే తమ కులం పట్ల ఆత్మీయత వుండటం చూసి -  దీన్ని యెలా బద్దలు కొట్టాలో పాలుపోని స్థితిలో నిలబడ్డారు.కులవ్యవస్థలోని కీలకం యేమిటంటే కులానికీ వృత్తికీ అనుబంధాన్ని యేర్పరచారు - దాన్నొక ఆదాయమార్గం చేశారు!దానితో ఒక వృత్తిలో నైపుణ్యం వున్నవాళ్ళకి సొంత ఆస్తి లేకపోయినా జీవనం గడుస్తుంది కాబట్టి సర్దుకుపోయారు.ఆ వృత్తి ద్వారా వచ్చే జీవనోపాధిని తమ పిల్లలకి నికరంగా సంక్రమింపజెయ్యడం కోసం ఒక వృత్తికి సంబంధించిన వాళ్ళు తమలో తామే పెళ్ళిళ్ళు చేసుకుని దాన్ని క్రమబధ్ధం చెయ్యడం తప్ప మరో మార్గం లేకపోయింది!ఆరకంగా ఆ కాలంలోని అన్ని దేశాల్లో సాటి మనుషుల్ని బానిసలుగా చేసి కిరాతకంగా ప్రవర్తిస్తే "సూర సుబ్బన యోర్మధ్యే సుబ్బనః కించిదుత్తమి?సుబ్బనః రక్తపాయీ చ సూరనః శల్యభక్షకః(సూరన సుబ్బనల్లో సుబ్బన కొంచెం మంచివాదు - సుబ్బన రక్తం పీల్చి వొదిలేస్తాడు? సూరన యెముకల్తో సహా నమిలేస్తాడు!)" అన్నట్టు ఇక్కడ కులవ్యవస్థ అనే బంగారు పంజరాన్ని సృష్టించారు?!

స్వయంపూర్ణ గ్రామ వ్యవస్థ అని సామాజిక శాస్త్రవేత్తలతో వర్ణించబడిన ఒకవైపు నుంచి చూస్తే అధ్భుతంగానూ మరోవైపు నుంచి చూస్తే కిరాతకంగానూ కనబడే ఈ ద్విముఖ వ్యవస్థ పారిశ్రామిక విప్లవం ఇచ్చిన అతుత్సాహంతో అప్పటివరకూ చలనం లేకుండా వున్న మిగతా దేశాలలో భూకంపాల్ని పుట్టించిన ఆంగ్లేయులు ఇక్కడ కూడా అడుగు పెట్టడంతో పునాదులతో సహా కదిలిపోయింది.సముద్రయానాన్ని నిషేధించి అప్పటిదాకా అపురూపంగా పట్టి వుంచిన బంగారు పంజరం ఆంగ్లభాషాద్యయనం వల్ల వీచిన కొత్తగాలుల దెబ్బకి మూడొంతులు ద్వంసమైంది!గాంధీ - నెహ్రూ ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన వాళ్ళు,పైగా ఒకరంటే ఒకరికి అభిమానం వున్న గురుశిష్యులు అయినా వారిద్దరి మధ్యనా విభేదాలు రావడానికి కారణ మేమిటో ఇప్పటికీ చాలామంది గ్రహించలేకుండా వున్నారు!గాంధీ తన వుపన్యాసాలన్నిటి లోనూ తనకి ప్రాచీన హిందూ సాంప్రదాయాల పట్ల వున్న మక్కువనీ ముఖ్యంగా కుల వ్యవస్థని మరీ అంత క్రూరంగా కాకుండా కొంచెం సుకుమారంగా తయారు చేసి అయినా సరే యధాతధంగా వుంచాలనే వుద్దేశం వెలిబుచ్చే వాడు?ముస్లిములకి ప్రత్యేక నియోజకవర్గాలకి వుదారంగా వొప్పుకుని దళితులకి ప్రత్యేక నియోజక వర్గాలకి అడ్డం తిరిగడానికి సరయిన కారణం చెప్పలేదు - మొండిగా వ్యతిరేకించటం తప్ప?నెహ్రూ యేమో తనకి వ్యామోహంగా వున్న కమ్యునిజం ప్రభావంతో ఈ సమస్తాన్నీ బద్దలు కొట్టెయ్యాలని ఆవేశ పడే వాడు!అయితే వర్గరహిత సమాజం యెట్లా వుంటుందో కార్ల్ మార్క్సు గారికే అవగాహన లేక వేదాంతం చెప్పడం వల్ల నెహ్రూకి కూడా ప్రత్యామ్నాయం లేక ఇద్దరి పైత్యాల్నీ సంతృప్తి పర్చే ఒక దిక్కుమాలిన విధానాన్ని జనం మీదకి ప్రయోగాత్మకంగా వొదిలాడు.అటు పూర్తిగా కమ్యునిజమూ ఇటు పూర్తిగా క్యాపిటలిజమూ కాని మధ్యేవాదపు సోషలిజాన్ని కళ్ళు మూసుకుని పాటించేశాడు?!లెక్క ప్రకారం నడపాల్సిన ఆర్ధిక వ్యవహారాల్ని గవ్వలిసిరే మహలనోబిస్సు కప్పజెప్పాడు?!

దీనివల్ల్ల యదార్ధంగా జరిగింది కులవృత్తుల మీద పట్టును కోల్పోయి ఆర్ధికంగా మరింత దిగజారడం, ఒకే పనికి అన్ని కులాల వాళ్ళూ పోటీ పడటం వల్ల మనుషులు కులానికి మరింత గట్టిగా అంకితం కావడం, కులం పేరుతో రాజకీయ లబ్ధిని కోరుకుని వైషమ్యాలు పెంచుకోవడం తప్ప దేశపు మొత్తం పరిస్థితిని నిక్కచ్చిగా లెక్కించినా ఆర్ధికంగా అభివృధ్ధినీ సాధించలేదు,సామాజికంగా సంస్కారాన్నీ మెరుగు పర్చుకోలేదు!గాంధీ అంతరాంతరాల్లో కోరుకున్నట్టుగానే అప్పటి రాజవంశీయులూ, జమీందార్లూ,కాకుంటే భూస్వాములూ చట్టసభల్లో యెన్నికల పేరుతో జరిగే హంగామా చాటున తప్పు యెక్కడుందో మహామేధావులకి కూడా అంతుపట్టనంత చక్కని వక్రమార్గంలో ప్రవేశించి అధికారం తమ నుంచి జారిపోకుండా చూసుకోగలిగారు!ఇప్పటికీ విద్యారంగానికి అతితక్కువ నిధులు కేటాయించటం,అర్హతలు వున్న టీచర్లు యేళ్ళ తరబడి యెదురు చూస్తున్నా,వారందర్నీ నియమించడానికి సరిపడిన ఖాళీలు వున్నా వాటిని భర్తీ చెయ్యకపోవటం,ఇంకా యెన్నివిధాల వుపాయాలు వున్నాయో అవన్నీ వుపయోగించి ప్రభుత్వ పాఠశాలల్ని నీరసంగా తయారు చెయ్యటం అనుకోకుండా జరిగే పొరపాటు అనుకుంటున్నారా?కాదు,విద్యని కింది అంతరువుల్లో వున్నవాళ్ళకి చేరనివ్వకుండా వాళ్లని పాకీపనులకీ,మంగలి పనులకీ,చాకలి పనులకీ మాత్రమే పరిమితం చెయ్యడం అనే వ్యూహం వుంది ఆ నిర్లక్ష్యం వెనక?!

నిజానికి మంచి అవగాహనతో గట్టి సంకల్పంతో ప్రయత్నిస్తే తొలి పద్దెనిమిదేళ్ళూ అప్రతిహతమైన అధికారాన్ని అనుభవించిన నెహ్రూ యెంతో కొంత మార్పుని సాధించగలిగి వుండేవాడు!ఇవ్వాళ వున్న పరిస్థితి మరీ దారుణమైనది? వెనకటి రోజుల్లో యెవడికి వాడికి కులవృత్తి పట్ల వున్న ధీమాతో ఒక కులంవాళ్ల మీద మరో కులంవాళ్ళు జోకులేసినా సర్దుకుపోయే స్పోర్టివ్ మనస్తత్వం వుండేది - ఇప్పుడు కాస్తకీ కూస్తకీ మనోభావాలు దెబ్బతినడం అనే ధోరణిని చూస్తున్నాం?!స్వతంత్ర భారత ప్రప్రధమ ప్రధాని ఈ దేశప్రజలు తనపైన వుంచిన నమ్మకాన్ని తనకి తోచిన కొత్త ప్రయోగానికి వుపయోగించుకోవడంతో పరిస్థితి మరింత దిగజారింది?అసలే ప్రతి కులంలోనూ వుపకులాలు కూడా వుండి పొరలు పొరలుగా వున్న ఇక్కడి వాస్తవ జీవిత దృశ్యాన్ని పట్టించుకోకుండా అక్కడెక్కడో మెరుస్తూ కనిపించిన యెర్రమావుల వెంట పరిగెత్తేసరికి కొండనాలిక్కి మందేస్తే వున్న నాలిక వూడినట్టయింది! ఇప్పటి పరిస్థితి గురించి కామ్రేడ్ అనూరాధ గాంధీ విశ్లేషణ చాలా బాగుంది!దాదాపు నా అవగాహన కూడా అదే కాబట్టి ఇక్క మళ్ళీ అదంతా చెప్పడం లేదు!దళిత అనుకూల ప్రభుత్వం అనే వూహని మొదట్లో చాలా గట్టిగా వ్యతిరేకించాను,వారి నుంచి వచ్చిన ప్రతిస్పందన చూసి నాకు దానిపట్ల బలమైన వ్యతిరేకత యేదీ లేకపోవటం వల్ల అంతే నిజాయితీగా దాన్ని గురించి చాలా కూలంకషంగా పరిశోధించాను,దాని ఫలితమే ఈ పోష్టు!ఆ వూహ కూడా సరయిన ఫలితాన్ని ఇవ్వదనే అనిపిస్తున్నది నాకు.తెలంగాణాలో రాజయ్య వ్యవహారం పైకి కనబడేటంత సూటిగా జరగలేదు కాబట్టి గట్టి సాక్ష్యంగా చెప్పలేను గానీ అధికారంలో వున్నవాడు అవినీతి పరుడయితే దళిత ప్రాతిపదికన అక్కడికి చేరినా సాటి అవినీతిపరుల్తో చాలా ఈజీగా కలిసిపోయి మార్పుకి కావల్సిన సామాజిక సంస్కరణలకి అనుకూలంగా వుండడు అని అర్ధం చేసుకోవడానికి పనికొస్తుంది.

మార్క్సిష్టులు గతించి పోయిన చరిత్రనీ వర్తమాన సమాజాన్నీ అద్భుతంగా విశ్లేషించగలరు,కానీ  భవిషత్తు గురించిన సూత్రీకరణల దగ్గిర కొస్తే మాత్రం సైన్సు కెక్కువా మతానికి తక్కువా అన్నట్టు పిడివాదనలకి దిగిపోతారు?!యెందుకంటే ఇవ్వాళ యెన్నికల్లో నిలబడే బూర్జువా కమ్యునిష్టులు మొహమాట పడి చెప్పరు గానీ కమ్యునిష్టు సిధ్ధాంతం ప్రకారం విప్లవానికి సాయుధ పోరాటం తప్ప మరో దారి లేదని మార్క్స్ తెగేసి చెప్పాడు,లెనిన్ కూడా అదే చేశాడు?!సాయుధ పోరాటం అనగానే నెత్తురు చూస్తే కళ్ళు బైర్లు గమ్మే రకాలు ప్రతి చోటా వుంటారు గనక అదంత గబుక్కున ముందుకు దూకదగిన పరిష్కారం కాదు!నాకున్న అవగాహన మేరకు ఇవ్వాళా రేపూ మహాధ్భుతమైన మార్పుల్ని సాధించలేం.


స్వైన్ ఫ్లూ యెందుకొస్తుంది?!అపరిశుభ్రమయిన వాతావరణం వల్ల!మన పరిసరాలు పరిశుభ్రంగా వుండనంత కాలం చికెన్ గన్యా, స్వైన్ ఫ్లూ మరొకటీ మరొకటీ వేధిస్తూనే వుంటాయి.పోనీ వచ్చాక నయం చెయ్యగలుగుతున్నారా అంటే డాక్టర్లకే స్వైన్ ఫ్లూ అంటే యేమిటో తెలియక పేషెంట్లకి వైద్యం చెయ్యడానికి ముందుకు రావడానికి బదులు వాళ్లే దూరంగా పారిపోతున్న పరిస్థితి వుంది!అనారోగ్యాన్ని నిరోధించే ఆస్పత్రులే అనారోగ్య నిలయాలుగా వున్నాయి.రోగికి ఇవ్వడానికి మందులు లేని పరిస్థితి యెందుకు దాపరించింది? "స్వచ్చ భారత్" అని సెలెబ్రిటీలకి చీపుళ్ళిచ్చి హడావిడి చేసి దానిపేరుతో ప్రత్యేకంగా నిధులు పంపిణీ చేసే బదులు ప్రజారోగ్య శాఖ మరియు నగర పారిశుధ్య శాఖ అనే రెండూ ప్రభుత్వంలోని విభాగాలే కదా - వాటి పనితీరుని మెరుగు పరిస్తే ప్రతి పక్షాలు అభ్యంతరం చెబుతాయా వుగ్రవాదులు చెయ్యనివ్వబోమని బెదిరిస్తారా?శరీర మాద్యం ఖలు ధర్మ సాధనం అన్నారు గాబట్టి మొదటిదిగా దీన్ని చెబుతున్నాను.ప్రభుత్వంలో ఆరోగ్య పరిరక్షణకి సంబంధించిన శాఖల నుంచి గరిష్ఠ ప్రయోజనాన్ని సాధించాలి!


ఇవ్వాళ్టి కులవ్యవస్థ తమకి అన్యాయం చేస్తున్నదని తెలుసుకుని పోరాడుతున్న వాళ్ళు చదువుకోవటం వల్లనే గదా అలా తయారయింది!చదువుకున్న ప్రతివాడికీ వుద్యోగం రాకపోయినా చదువు లేకపోవటం వల్ల తనకి జరిగే అన్యాయాల నుంచి తప్పించుకోగలుగుతాడు గదా?విద్యాశాఖని పనిగట్టుకుని దాన్ని నిర్వీర్యం చేసే రెసిడెన్షియల్ స్కూళ్ళ యజమానుల తొత్తుల నుంచి లాగిపారేసి కింది కులాల వాళ్ళు కూడా అతి తక్కువ ఖర్చుతో తమ పిల్లలకి మంచి చదువులు చెప్పించుకోగలిగే విధంగా ప్రభుత్వ పాఠశాలల్ని పనిచేయించాలి.సాధ్యపడదేమో అనే అనుమానం కూడా లేకుండా తప్పనిసరిగా సాధించాల్సిన లక్ష్యమిది!


దేశం నిండా యెక్కడ చూసినా పరిశ్రమలూ వ్యాపారాలూ తామర తంపరగా విస్తరించినా అధిక సంఖ్యలో ప్రజలు వాళ్ల వుత్పత్తుల్నే కొని వాడుతున్నా మనం యెవరిని వుధ్ధరించాలని అనుకుంటున్నామో వాళ్ళింకా చేతిపనులతోనే హస్తకళలతోనే సతమతమవుతున్నారు!నాణ్యతలోనూ సౌకర్యంలోనూ బహుళజాతి కంపెనీల మరపనివాళ్ల కన్నా యెంతో ముందు వున్నా మార్కెట్ అనుకూలతల్ని గమనించకపోవడం వల్ల వెనకబడుతున్నారు.నేత పనివాళ్ళని వుదాహరణగా తీసుకుంటే వాళ్ళ కౌశలం అమోఘమే అయినా డిజైన్లు మాత్రం తాతల నుంచీ అలవాటయిన వాటితోనే సరిపెట్టుకుంటున్నారు, అందువల్లనే అవి కొనుగోలు దారుల్ని త్వరపడి కొనేటంతగా ఆకర్షించలేకపోతున్నాయి!కొత్త డిజైన్లని అతివేగంగా రూపొందించుకోవడానికి వాళ్లకి కంప్యూటరు ప్రపంచంలోని గ్రాఫిక్ డిజైనింగ్ స్కిల్స్ వుపయోగపడవచ్చు.ఇంటర్నెట్ పరిజ్ఞానం మధ్యదళారులు లేకుండా తమ వుత్పత్తులకి తామే మార్కెట్ సృష్టించుకోవడానికి వుపయోగపడవచ్చు.ప్రతి ఒక్కరికీ నేర్పాల్సిన పనిలేదు వాళ్లలో వుత్సాహంగా నేర్చుకోగలిగిన వాళ్లకి నేర్పితే చాలు వాళ్ళు మిగతావాళ్లకి సహాయ పడతారు!అయినా మొదటి రెండూ నిక్కచ్చిగా జరిగీతే పూర్తి ఆరోగ్యంతో సరయిన విజ్ఞానంతో వున్నవాడు ఖాళీగా వుండడు గనక తన కాళ్ళమీద తను నిలబడటం అనే మూడోది దానంతటదే జరుగుతుంది!ప్రభుత్వంలో వున్నవాళ్ళు ప్రజల్ని తమ బతుకులు తాము బతకగలిగేలాగ చెయ్యకుండా తమ మీద ఆధారపడి బతికేలాగ వుంచేస్తేనే కేవలం తాము చేసే మంచిపన్లకి కృతజ్ఞతగా వచ్చేసారి కూడా తమకే వోట్లు వస్తారనే నికృష్టపు తెలితేటలు చూపించడమే ఇంత చిన్నచిన్న పనులు కూడా జరగకపోవడానికి కారణం!


ఆర్ధికపరమయిన వెనుకబాటుతనం కన్నా సామాజికంగా చెయ్యని తప్పుకి అవమానించబడటం మనిషిని మరింత బాధపెడుతుంది!"ఘర్ వాపసీ!" అని హడావిడి చేస్తున్న వాళ్లని "కిస్కా ఘర్?ఘర్ కహా హై?" అని అడిగితే యేమి జవాబు చెబుతారు?మాల కులస్థులూ మాదిగ కులస్థులూ హిందూ మతంలో భాగమే,కానీ వాళ్ళకి దేవాలయ ప్రవేశం నిషేధం!చట్టం ఒకటి అఘోరించింది గాబట్టి ముఖాన తలుపెయ్యకుండా రాష్ట్రపతి స్థానంలో వున్న వాడు వచ్చినా గడప దాటి బైటికెళ్ళగానే మైల పడిపోయినట్టు శుధ్ధి తంతులు చేస్తారు!అలాంటి పనులు చెయ్యకుండా నిగ్రహంగా వుండి సాటి మనుషులుగా గుర్తిస్తే ఇక్కడున్న వాళ్ళు సంతోషంగా సామూహిక వుత్సవాల్లో పాలు పంచుకునే వాతావరణం కల్పిస్తే బయటికి వెళ్లే అవకాశం యెందుకు వుంటుంది?మతమార్పిడులు డబ్బు ఇవ్వడం వల్ల కన్నా ఇక్కడ గౌరవం లేకపోవడం వల్లనే జరిగినాయని అందరికీ తెలుసు,అయినా డబ్బుతో మార్చడాన్నే ప్రముఖంగా యెందుకు చెప్తున్నారు?ఇవ్వాళ హిందూధర్మం బలహీనపడిందనేది నిజమె,కానీ ఘర్ వాపసీ పరిష్కారం కాదు - మన ఆధ్యాత్మిక సంస్కృతి మారాలి!కన్యాశుల్కంలో బండివాడు "బ్రాహ్మల్లో కూడా మంచివాళ్ళు వుంటారన్నమాట?!" అన్నట్టు కమ్యునిష్టుల్లో వున్న కొందరు మంచివాళ్ళు హిందూధర్మం గురించి ఒక చక్కని విశ్లేషణ చేశారు.హిందూధర్మాన్ని స్వయంచాలిత గడియారంతో పోల్చారు - అంటే తనకి తనే కీ ఇచ్చుకుని నడవగలిగే లక్షణం వున్నది అని అర్ధం!ఒడిదుడుకులు హిందూధర్మానికి కొత్త కాదు.శైవులూ వైష్ణవులూ కొంతకాలం తన్నుకు చచ్చారు.పెద్దలు కల్పించుకుని హరిహర మూర్తిని సృష్టించీ శివుడు యోగముద్రలో విష్ణువుని తలుస్తాడనీ విష్ణువు యోగనిద్రలో శివుణ్ణి ధ్యానిస్తానీ కధలు కల్పించి శాంతపర్చారు!బహుశా వుదారులైన ముస్లిము ప్రభువుల పాలనలో అనుకుంటాను ముస్లిములు ప్రార్ధనా సమయంలో చదివే కల్మాని అల్లోపనిషత్తుగా సంస్కృతీకరించినదీ బ్రాహ్మణులే!మళ్ళీ తనకి తనే కీ ఇచ్చుకోవాల్సిన సమయం వచ్చింది ఇప్పుడు, లోపాల్ని దిద్దుకోవడం ద్వారానే హిందూ ధర్మం తిరిగి తల యెత్తుకుని నిలబడుతుంది!చర్చిల్నీ మసీదుల్నీ వారి వారి మతాల వారికి అప్పజెప్పేసి హిందూ ఆలయాల్ని మాత్రం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధ్వర్యంలోకి తెచ్చిన లౌకికవాద ప్రభువులు దానికి పూనుకోవాలి.సమాజంలోని మేధావులు నిర్మాణాత్మకంగా సహకరించాలి.ఈ తరం అలాంటి మౌలిక సంస్కరణల పట్ల నిర్లక్ష్యంగా వుంటే ఇక యెప్పటికీ అది సాధ్యపడక పోవచ్చు?!


హెగెల్ గతితార్కిక బావవాదం అని చెప్పినదాన్ని తిరగేసి ఆర్ధికానికి ముడిపెట్టి గతితార్కిక భౌతికవాదంగా మార్చానని చెప్పుకున్న మార్క్స్ అంతిమ లక్ష్యమైన వర్గరహిత సమాజం గురించి చెప్పడానికి వచ్చేసరికి మళ్ళీ దాన్ని తిరగేసి భావవాదపు కల్పనలతో నింపెయ్యడంతో ఆ లక్ష్యం యెంత ఆశించదగినదయినా ఇంతవరకూ భూమి మీద ఆవిర్భవించలేదు గాబట్టి యెప్పటికయినా సాధ్యపడుతుందంటే నమ్మడం కష్టం!కానీ భారతదేశానికి నేను సూచించే లక్ష్యం మాత్రం ఒకప్పుడు ఈ భూమి మీదే చాలా కాలం పాటు మనగలిగింది!ఇవ్వాళ యెందుకు చేస్తున్నామో కూడా తెలుసుకోకుండా అమరికన్ తరహా జీవనవిధానాన్ని కాపీ కొడుతున్నట్టు కాకుండా సింధు నాగరికత లోని ప్రజల జీవన విధానం నుంచి అసలైన స్పూర్తిని ఆచరణలోకి తెచ్చుకోవాలి!దానికి తోడుగా ఆర్ధిక విధానంలో మార్క్సిష్టులు చెప్పే అదనపు విలువని సమాజపరం చెయ్యడం అనే లక్ష్యాన్ని యెవరి పెత్తనమూ లేకుండానే ఒకప్పటి మనవాళ్ళు వొప్పుకుని పాటించిన దేవీభాగపు సాంప్రదాయాన్ని పాటించాలి!ఈ రెండూ సాధించగలిగితే భారత దేశం యెప్పటికీ ప్రపంచానికి ఆచార్య స్థానంలోనే నిలవడం తధ్యం!!ఒకే సారి పది అంచెల్ని వర్ణిస్తే భయసంకోచాలతో మొదటి అడుగే పడదు గనక ఇప్పుడున్న స్థితికి అతి దగ్గిరగా వున్న మెట్టుని చేరుకోవడానికి సాధించాల్సిన మూడు విషయాల్ని మాత్రమే సూచించి వొదిలేస్తున్నాను,నాలుగోది కొసరు!


నిజాని కివన్నీ మనం గొంతు చించుకుని అడగక్కర్లేదు, చట్టసభల్లో అడుగుపెట్టే రోజున వాళ్ళు చేసే ప్రమాణాల్లో వాళ్ళు వుధ్ధరిస్తామని చెప్తున్నవే. వీటిని నిక్కచ్చిగా చేస్తే అయిదేళ్ళు కాదు యాభయ్యేళ్ళయినా వాళ్లని అధికారంలో వుంచడానికి ప్రజలు వెనకాడరు?!కానీ వాస్తవ సమస్యలకి వాస్తులో పరిష్కారాల్ని వెదుక్కునేవాళ్లకి అది అర్ధం కావడం లేదు!ముహూర్తాలు చూసి మంత్రివర్గ సమావేశాలు యేర్పాటు చేసుకుంటే దారిలో వున్న ముళ్లకంపలు వాటంతటవే మాయమౌతాయా?పాతకాలం వాడైన నిజాము ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు,ప్రజలకి చదువు చెప్పించలేదు అని తప్పులు పట్టి గర్జించే అర్హత నిజంగా వీళ్ళకుందా?ఆధునికులమని చెప్పుకునే వీళ్ళ లౌకికత్వం వెల్లివిరిసే ప్రజాస్వామ్యబధ్ధమైన పరిపాలన కూడా అట్లాగే అఘోరిస్తున్నది గదా!



మంత్రాలకి చింతకాయలు రాలవు,వాస్తు వైభవాల్ని తీసుకు రాలేదు,స్వాప్నికులు యదార్ధాన్ని చూడలేరు!సృజించే శక్తి భూమికీ స్త్రీకే వుంది!పూజించి తీసుకుంటే సకల సంపదల్నీ ఇచ్చే భూమిని ఇష్టారాజ్యంగా అమ్మడం పాడుచెయ్యడం చేసేవాడిని దరిద్రం వెతుక్కుంటూ వొచ్చి కావిలించుకుంటుంది!మెప్పించి అందుకుంటే అన్ని సుఖాల్నీ ఇచ్చే స్త్రీని హింసించి ఆనందించాలనుకునేవాడు పరలోకంలో కాదు ఇక్కడే ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తాడు!యేది సత్యమో అదే శివమైనదీ అవుతుంది!యేది శివమో అదే సుందరమూ అవుతుంది!!


సత్యం శివం సుందరం!!!

22 comments:

  1. సత్యం గెలవాలని కోరుకుందాం,పోస్ట్ లో సత్యం ఉంది,చాలా మంచి ఉయోగకరమైన పోస్ట్
    అద్భుతంగా ,సంక్షిప్తంగా చెప్పినందుకు ధన్యవాదములు
    అందరూ మారి మంచిగా ఉండాలి అని కోరుకోవడమే పరిష్కారమా?
    మార్పు అంటే కోరుకోవడమేనా?
    >>ఒకప్పుడు ఈ భూమి మీదే చాలా కాలం పాటు మనగలిగింది!ఇవ్వాళ యెందుకు చేస్తున్నామో కూడా తెలుసుకోకుండా అమరికన్ తరహా జీవనవిధానాన్ని కాపీ కొడుతున్నట్టు కాకుండా సింధు నాగరికత లోని ప్రజల జీవన విధానం నుంచి అసలైన స్పూర్తిని ఆచరణలోకి తెచ్చుకోవాలి!దానికి తోడుగా ఆర్ధిక విధానంలో మార్క్సిష్టులు చెప్పే అదనపు విలువని సమాజపరం చెయ్యడం అనే లక్ష్యాన్ని యెవరి పెత్తనమూ లేకుండానే ఒకప్పటి మనవాళ్ళు వొప్పుకుని పాటించిన దేవీభాగపు సాంప్రదాయాన్ని పాటించాలి!
    పరిష్కారం కనబడుతోంది,కాని పరిష్కారానికి మార్గం కనబడడం లేదు
    రాజకీయ నాయకులూ ఏ కులం అయిన మార్పు కోసం ప్రయత్నించ లేనంత వరకు పరిస్థితి ఇలాగే కొనసాగాలా?
    మార్పు రాజకీయ నాయకుల్లో రావాలని కోరుకోవడమే పరిష్కారమా ?
    మొత్తం మీద చాలా బాగా రాసారు,మీరు ఈ పోస్ట్ కోసం చాల సమయం వెచ్చించి ఉంటారు,అందుకే పోస్ట్ లో ఏ మాత్రం విభేదించే అంశాలు లేవు ..
    ధన్యవాదములు
    ...అభిమాని
    --శ్రీనివాస్

    ReplyDelete
    Replies
    1. మిమ్మల్ని సంతోషపెట్టగలిగాను!అలోచన అంటూ రగిలితే తొలి అడుగు పడితే మార్పు తప్పకుండా వస్తుంది!

      Delete
    2. నా సంతోషం కాదు ఇక్కడ!సత్యం విదితం కావాలి ..!నేను సంతోషించినా మీరు సంతోషించినా చివరికి సత్యమే గెలుస్తుంది..

      Delete
    3. అవును,సత్యం శివం సుందరం!
      మార్పు తప్పకుండా వస్తుంది -
      నాకా నమ్మక ముంది.

      Delete
  2. chaala chakkani visleshanatho, nammikatho raasina mee vyaasam aakattukundi. meerannattu kula rahitha samaajam anetuvantidi ippudunna naayakulaku pattadu - kaaranam, daani valana telikaga vacche votlu jaaripothayanna bhayam. prabhutvaalu kulaanni, mathanni gurthinchakunda, aaperuna jarige e akrutyaalakina theevramina shiksha vidhinchina naade, ee kula picchi, matha gajji vadulutayi. arthikamga balaheenamina vaariki maatrame prabhutva cheyuta kalpinichi andariki uchita vidya andinchina naade nijamina abhivruddhi aashinchavacchu anukuntaanu.

    mee shodhanaatmaka, sandarbhochitamina vyaasaniki marokka maaru abhinandanalu. marinni asaktini kalinche, alochana rekettinche vishayaalu mundu mundu raayagalarani aasistunnanu.

    namaste
    anjaneyulu bvsr

    ReplyDelete
  3. Well researched n well said, quite enlightening

    ReplyDelete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. >> కాలం కలిసిరాక,విపరీతమైన చలికి తట్టుకోలేక,నిరంతర వర్షాలకి అతలాకుతలమైపోయి విధిలేని పరిస్థితుల్లో ఆ నగరాలని వొదిలేసి మరింత లోతట్టు ప్రాంతాలకి చేరి

    దీనితో నేను ఎకీభవించలెకున్నాను. అంతకాలం ప్రశాంతంగా జీవించ గలిగారంటే, వాళ్ళకనుకూలించిన వాతవరణమే అయ్యుండాలి. పైగా అవి మైదానాలని మీరే అంటున్నారు. అవి లోయలు, అడవులతో పొలిస్తే అత్యంత సురక్షితమైన ప్రాంతాలు.

    ReplyDelete
    Replies
    1. @chiranjeevi.Y
      ఆ అంశం గురించి పరిశోదహన చేసిన గ్రూపులలఓ మెజార్టీ దానినే బలపరుస్తున్నారు.

      ఒక సన్న్వేశం యెలా జరిగి వుండొచ్చు అని అనుకున్నాక దాన్ని సమర్ధించేవి యేవైనా వున్నాయా అని చూడటం,వాటిలో మెరుగైనది తీసుకోవతం చేశాను.

      నాకూ ఇంకా కొన్ని సందేహాలు మిగిలి పోయాయి.వాళ్ళూ వీళ్ళూ ఒకరేనా అనే సందేహం కూడా తీరలేదు.అప్పటి శాతిపిపాసకీ తర్వాతి యుధ్ధప్రీతికి పొంతన లేదు మరి!

      వీళ్ళు లోతట్టుకు వెళ్ళి యుధ్ధాలు చహెసిన వాళ్ళ సంస్కృతి యేమితి?అది అసలు తెలియకుండా యెందుకు వుండిపోయింది?ఇదంతా ఉత్తర దేసంలో జరిగింది!మరి దక్షిణాదిన పరిస్థితి యెలా వంది?

      ఇవన్నీ తెలుసుకుని మరో పోష్టు రాస్తాను.

      Delete
  6. హరిబాబు గారు,
    గాంధీ గారి పై మీరు రాసిన అభిప్రాయాలు హేతువాదుల అభిప్రాయలతో ఏఖీభవిస్తున్నాయి. మీరు ఏ పుస్తకాలు చదివి ఇటువంటి అభిప్రాయలకు వచ్చారు?

    ReplyDelete
    Replies
    1. @SriRam
      మొదట్లో అందరిలాగే గాంధీ అంటే అభిమానం వుందేది.యేకంగా అతని ఆత్మకధ కొని చదివేసాను.అతను మొట్ట మొదత అహింసా విధానాన్ని సమర్ధిస్తూ కాంగ్రెసు సభలో చేసిన తొలి ప్రసంగం మక్కీకిమక్కీ నాకిష్తమయిన కొతేషన్ల పుస్తకంలో రాసుకున్నాను!

      మీరు హేతువాదులు అని కమ్యునిష్టుల గురించి అంటున్నారా వేరేవాళ్లని విదదీస్తున్నారా?

      యేది యేమయినా చరిత్ర నాకు ఇష్తమయిన సబ్జక్తు గనక మళ్ళీ మళ్ళీ భారత స్వాతంత్ర్య సంగ్రామం పార్తును చదువుతున్నప్పుడు నాకు అనుమానాలు రావ్దం మొదలైనాయి.నా "కాంగ్రెసుని ద్వషించదం నా జన్మ హక్క్కు - మోహన్ దాస్ గాంధీ" పోష్తులో చేసిన విశ్లేషనలు చాలామటుకు నా సొంత అనుమానాలకి దొరికిన రుజువులే!

      మొన్న మార్చి 2వ తారీఖు ఆంధ్రజ్యొతిలో "ఘరే-బైరె" అనే రవీంద్రుడి నవల గురించిన వ్యాసం చదివాను.అప్పటి వరకూ నాకున్న రవీంద్రుడు ఈ స్వతంత్ర పోరాటానికి యెందుకు దూరంగా వున్నాడో అనే సంధేహానికి జవాబు దొరికింది!విదేశీ వస్త్ర దహనం+స్వదేశీ వుద్యమాన్ని ఇవ్వాళ జాతిని యేకం చెయ్యడానికి దారితీసిన మహోద్యమం అని ప్రచారం చేశారు గానీ ప్రజలు మతాలవారీగా చీలడానికి అదే కారణమైందని ఆ కధలోని పాత్రల ద్వారా సోదాహరనంగా చెప్పాడు రవీంద్రుడు!

      అంటే గాంధీ యొక్క పైత్యకారి వాదనల వల్ల భవిష్యత్త్తు యెలా వుందబోతుందో రవీంద్రుడు తొలిదసలోనే కనిపెట్టి తన మాట చెల్లుబడి అయ్యే అవకాశం లేదు గనక మర్యాదగా తనే వుద్యమానికి దూరమయ్యాడు!

      Delete
  7. మీరు హేతువాదులు అని కమ్యునిష్టుల గురించి అంటున్నారా!
    గాంధీ,అంబేద్కర్ పై మీరు రాసింది చదివితే ఆంధ్రా హేతువాద, కమ్యునిస్ట్, ఒక్కమాటలో చెప్పాలంటే ఇజాల రచయితలు రాసే భావాలకు కొంచెందగ్గరగా ఉన్నాయనిపించింది. అందువలన అడిగాను. వాళ్ళు వారి ఆంధ్రా కోణం లో నుంచి రాస్తారు

    ReplyDelete
  8. *శూద్రుడికి సొంత ఆస్తి సమకూరితే దాసవృత్తి చెయ్యడు గనక శూద్రుడి దగ్గిర పోగుపడిన చిల్లిగవ్వనైనా సరే లాగివేసుకోవటం చట్టవిరుధ్ధం కాకపోగా రాజు తప్పనిసరిగా చెయ్యాల్సిన ముఖ్యమైన పని*

    ఈ కాలంలో ఉద్యోగాలు చేసేవారు శుద్రులకిందేవస్తారు కదా! చాణుక్యుడి కాలంలో శూద్రుల సంపద దోచుకోవటానికి ఎన్ని పన్నులేశారో, ఎంత వసులు చేశారో తెలియదు గాని, నేడు మన ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ,ఉద్యోగాలు చేసుకొనే వారి పై వేయని పన్నులేదు. నాకైతే ఇప్పుడే ఎక్కువ పన్నులు వేస్తున్నారనిపించిది. చాణుక్యుడి కాలం లో ఇన్ని పన్నులు ఉన్నాయని అనుకోను.ఆయన కాలంలో ప్రజలను చిల్లిగవ్వతో (సున్నాతో) వదిలాడు. నేడు ప్రజలు హోం లోన్ అప్పులతో (చిల్లిగవ్వకన్నా తక్కువ అంటే నెగటివ్) మిగులు తున్నారు..

    http://sriramugk.blogspot.in/2015/03/tax-structure-in-india.html

    ReplyDelete
    Replies
    1. TAX STRUCTURE IN INDIA

      1) What r u doing?
      Ans. : Business
      Tax : PAY: PROFESSIONAL TAX!

      ☑ 2) What r u doing in Business?
      Ans. : Selling the Goods.
      Tax : PAY SALES TAX!!

      ☑3) From where r u getting Goods?
      Ans. : From other Area/State/Abroad
      Tax : PAY CENTRAL SALES TAX, CUSTOM DUTY & OCTROI! AND NOW LBT & LPT.

      ☑ 4) What r u getting in Selling Goods?
      Ans. : Profit
      Tax : PAY INCOME TAX!

      How do you distribute profit ?
      Ans : By way of dividend
      Tax : Pay DIVIDEND DISTRIBUTION TAX.

      ☑ 5) Where u Manufacturing the Goods?
      Ans. : Factory
      Tax : PAY EXCISE DUTY!

      ☑ 6) Do u have Office / Warehouse/ Factory?
      Ans. : Yes
      Tax : PAY MUNICIPAL & FIRE TAX!

      ☑7) Do you have Staff?
      Ans. : Yes
      Tax : PAY STAFF'S PROFESSIONAL TAX!

      ☑ 8) Doing business in Millions?
      Ans. : Yes
      Tax : PAY TURNOVER TAX!
      Ans : No
      Tax : Then pay Minimum Alternate Tax (MAT).

      ☑ 9) r u taking out over 25,000 Cash from Bank?
      Ans. : Yes, for Salary.
      Tax : PAY CASH HANDLING TAX!

      ☑ 10) Where r u taking your client for Lunch & Dinner?
      Ans. : Hotel
      Tax : PAY FOOD & ENTERTAINMENT TAX!

      ☑11) r u going Out of Station for Business?
      Ans. : Yes
      Tax : PAY FRINGE BENEFIT TAX!

      ☑12) Hav u taken or given any Service/s?
      Ans. : Yes
      Tax : PAY SERVICE TAX!

      ☑ 13) How come u got such a Big Amount?
      Ans. : Gift on birthday
      Tax : PAY GIFT TAX!

      ☑ 14) Do u have any Wealth?
      Ans. : Yes
      Tax : PAY WEALTH TAX!

      ☑ 15) To reduce Tension, for entertainment, where are you going?
      Ans. : Cinema or Resort
      Tax : PAY ENTERTAINMENT TAX!

      ☑ 16) Hav u purchased House?
      Ans. : Yes
      Tax : PAY STAMP DUTY & REGISTRATION FEE !

      ☑17) How u Travel?
      Ans: Bus
      Tax : PAY SURCHARGE!

      ☑18) Any Additional Tax?
      Ans. : Yes
      Tax : PAY EDUCATIONAL ADDITIONAL EDUCATIONAL & SURCHARGE ON ALL THE CENTRAL GOVT.'s TAX !!!

      ☑ 19) Delayed any time Paying Any Tax?
      Ans. : Yes
      Tax : PAY INTEREST & PENALTY!

      ☑20) Do you want growth of india.?
      Ans: offcource Yes .

      Pay electricity tax, water tax, education tax, & other taxes, which is used by defulter people.

      ☑21) INDIAN :: can i die now??
      Ans :: wait we are about to launch the FUNERAL TAX....!!!!!!...

      Delete
    2. These tax structures are universal. There was tax on windows in Britain for a period of 150 years. Funeral tax is not new :)

      Delete
  9. Sir,

    Thank you for you information.

    apart from the reasons mentioned above drought and Infectious Diseases may also made impact on their migration


    1. Can we get any additional information by tracing the languages spoken by sindh people during their civilization and is there any similarity between present & past language spoken by sindh culture surroundings.

    2. In south indian languages there is similarity between telugu and kannada. Sir, can you explain how south indian languages are formed.

    ReplyDelete
    Replies
    1. దక్షిణ భారతపు ప్రాచీన చరిత్ర చాలా తక్కువ!ప్రస్తుతం 2003లో యానిమేషన్ ద్వారా చూపించిన మానవ సమూహాల చరిత్ర అని చెప్తున్నది కూడా వాస్తవం కాదేమో అనిపిస్తున్నది!యెందుకంటే,లక్షన్నర సంవత్సరాల క్రితం ఆఫ్రికా ఖందంలో పుట్టిన మానవ జాతి సుమారు 80,000 సంవత్సరాల క్రితం గంగా సింధు మైదానం చేరిందని చెప్తున్నారు.కానీ ఆ కాలానికి పూర్వమే దక్షిణ భారతదేశంలో రాతియుగపు మానవ సంస్కృతికి సంబంధించిన అవశేషాలు బయటపడుతున్నాయి.మరి వీళ్ళు ఇక్కడికి ఎలా వచ్చినట్టు?తమిళులు సంస్కృతం కన్న తమిళమే ప్రాచీనం అని చెప్తున్నది నిజమేనా?

      భూఖండాలు విడిపోకముందు ప్రాచీన మానవజాతి ఆవిర్భవించి ఖండాలు విడిపోయాక ఇప్పుడు ఆఫ్రికాలో పుట్టారని మనం అనుకుంటున్నవాళ్ళు భారత్ వైపుకే రావడం అనేది దూరమైన తమవాళ్లని వెతుక్కుంటూ రావడంలా జరిగి ఉండవచ్చునని నా అనుమానం!కానీ.ఖండాలు విడిపోవదం మిలియన్ల సంవత్సరాల వెనక జరిగింది!చరిత్ర పరిశోధకులు తేల్చి చెబితే తప్ప ఆసక్తి కొద్దీ తెలుసుకునే మనలాంటివాళ్ళు తెలుసుకోవడం కష్తం.

      Delete
  10. Sir,

    Thank you for your information.

    Sir, do you visited saraswathi mahal library located at thangavore.

    In Erode surroundings some group of people talk a language with mixture of tamil and kannada words.

    In coimbatore surroundings some group of people talk a language with mixture of telugu and tamil words.

    ReplyDelete
    Replies
    1. No,I have never been in those places!
      But,I am doing some R&D on antiquity of tamil for my next post,there I will touch about these language family and their relations.

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...