Wednesday, 14 November 2018

సనాతన ధర్మం అంటే ఏమిటి?అది ఎందువల్ల ప్రత్యేకమైనది!

          "ధార్యతే ఇతి ధర్మః" - పరమార్ధ దృష్టితో చూస్తే అందరినీ ధరించి పాలించు విశేషస్వరూపమునే ధర్మం అనీ వ్యవహార దృష్టితో చూస్తే పాటించే మనిషికి సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెట్టే అలవాట్లనూ ఆ అలవాట్లు మనస్తత్వంలో స్థిరపడేటందుకు అవసరమైన ఆలోచనా పద్ధతిని శాసించే నియమాలని కలిపి ధర్మం అనీ అంటారు.ఈ ధర్మం అనే ఒక్క మాటని పుట్టించి నిర్వచించి విశ్లేషించి నిరూపించి మానవ జీవితానికి కేంద్రస్థానంలో నిలబెట్టటమే సనాతన ధర్మం యొక్క విశిష్టత!

          ప్రాచీన భారతీయ సనాతన ధార్మిక సాహిత్య సృష్టికర్తలు ధర్మపాలన అనే పేరున సత్యవాక్పరిపాలన, పరోపకారము, భూతదయ, బ్రహ్మచర్యం/ ఇంద్రియనిగ్రహం, దానశీలత, ఆహారశుద్ధి, విద్యుక్తకర్మాచరణం, శాంతస్వభావం, క్షమాగుణం అనే లక్షణాలను ప్రతి ఒక్కరికీ ఆవసరమైన లక్షణాలని పేర్కొన్నారు.అవి "మాకు నచ్చినవి, కాబట్టి చెయ్యండి!" అని చెప్పి వదిలెయ్యలేదు - ఎందుకు మంచివి అనే విషయాన్ని కూడా చెప్పారు,ఎట్లా వాటిని అనుష్ఠించాలో కూడా చెప్పారు.అట్లాగే లోభం, క్రోధం, మోహం వంటి అధర్మ సంస్కారాల్ని కూడా "మాకు నచ్చలేదు, కాబట్టి చెయ్యకండి!" అని కాక ఆ దుష్టత్వాలకు అలవాటు పడటం వల్ల కలిగే నష్టాన్ని చెప్పి వాటిని వదిలివెయ్యడానికి సులువైన మార్గాలను కూడా సూచించారు.

          శ్రీ మహాభారత కావ్యనాయకుడైన యుధిష్ఠిరుడు తన ధర్మానికి కట్టుబడి ఉండే తీవ్రత్వాన్ని బట్టి ధర్మరాజు అని పేరు సంపాదించాడు.శత్రువులు అతనిని కష్టాల పాలు చెయ్యటంలో ఇతని సంపదని హరించటంతో పాటు ఇతన్ని ప్రలోభపెట్టి ఇతని చేత అధర్మ కార్యాలను చేయించాలనే ఉద్దేశం కూడా ఇమిడి ఉంది - అయినా నిగ్రహం కోల్పోకుండా నిలబడి భగవత్స్వరూపుడైన శ్రీరాముడి కన్న విశిష్టమైన స్థానాన్ని అందుకున్నాడు!ఇది కూడా సనాతన ధర్మం యొక్క ప్రత్యేకతలలో ఒకటి - ధర్మమే దైవం,దైవమే ధర్మం, ధర్మపాలనకు కట్టుబడిన ప్రతి మానవుడూ దైవసముడే!

          "సనాతనస్య ధర్మ ఇతి సనాతన ధర్మః" - "సనాతనుని యొక్క ధర్మమును సనాతన ధర్మమని అందురు". ఇది షష్ఠీ తత్పురుష సమాసం - స్థాపిత స్థాపక సంబంధాలను సూచించే ఈ సాంకేతిక పదాన్ని బట్టి సనాతనుడైన భగవంతుని చేత స్థాపించబడినది గనక ఇది సనాతన ధర్మం అయ్యింది!జైనులు, బౌద్ధులు, యూదులు, జొరాష్ట్రియన్లు, క్రైస్తవులు, మహమ్మదీయులు - మహావీర తీర్ధంకరుని, శాక్యముని గౌతమబుద్ధుని, ప్రధమ ప్రవక్తయైన  అబ్రహామును, దార్శనికుడైన జరతూష్ట్రను, దైవపుత్రుడైన జీసస్ క్రీస్తును,ఆఖరి ప్రవక్తయైన మహమ్మదును ఆయా మతాలకు మూలపురుషులని నమ్ముతారు.అట్లాగే సనాతన ధర్మాన్ని పాటించే వారు తమది సనాతనుడైన భగవానుడి చేత స్థాపించబడినది తప్ప యే ఒక్క మానవుడూ దీనికి స్థాపకుడు కాదని విశ్వసిస్తారు!

          కొందరు హైందవేతర మతప్రచారకులు రాముడినీ, కృష్ణుడినీ, శివుడినీ తమ మతప్రవక్తలతో పోలుస్తున్నారు - వారి మతాలలో ప్రవక్తలు ఎట్లాగో హిందూమతంలో వీరు అట్లాంటివారని వక్రభాష్యాలు చెప్తున్నారు.ఇది తప్పు - హిందూమతాన్ని స్థాపించినది సనాతనుడైన భగవంతుడు,ఆయనకు తప్ప ఇంకెవరికీ కర్తృత్వం లేదు!రాముడూ కృష్ణుడే కాదు శివుడూ విష్ణువూ కూడా తమ యోగసాధన వల్లా ధర్మపాలన వల్లా యోగీశ్వరులై కీర్తించబడుతున్నారు - అంతే!

          సనాతన ధర్మం తప్ప మిగిలిన వాటిని మూడు విధాల వర్గీకరించవచ్చును - 1).భూతకాలమున ఉండి వర్తమానమున లేనివి, 2).భూతకాలమున లేక వర్తమానమున ఉన్నవి, 3).వర్తమానమున ఉండి భవిష్యత్తున ఉండనివి.సనాతన ధర్మం ఈ మూడు తెగల్లో దేనికీ సంబంధించినది కాదు.ఇతర ధర్మాల కంటె ముందునుంచీ ఉన్నది, ఇప్పటికీ కొనసాగుతున్నది, ఇకముందు కూడా అన్ని ప్రత్యేకతలను నిలబెట్టుకుంటూ కొనసాగుతుంది!కొందరు హిందువులకి ఈ మధ్యనే హిందూ మతం అంతరించి పోతుందేమోనని భయం పట్టుకుంది - ఆ భయం అర్ధం లేనిది. 

          "యత్ జన్యం తద్ అనిత్యం" అనే ప్రకృతి నియమం అనుల్లంఘనీయం.కొన్ని దుష్కర కార్యాలను సాధించటానికి భగవంతుడు అనేక రూపాలను ధరించి కూడా తన కర్తవ్యం పూర్తి కాగానే అవతారం చాలించాడు - తను పెట్టిన నియమాన్ని తను కూడా ఉల్లంఘించటం లేదు!ఆ లెక్క ప్రకారం పుట్టుక ఉన్న ఇతర ధర్మాలు నశిస్తాయేమో గానీ పుట్టుక లేని సనాతన ధర్మం ఎప్పటికీ నశించదు - అనుష్ఠించిన వారు రక్షణ పొందుతారు, అనుష్ఠించని వారే నశిస్తారు. దృశ్యమాన ప్రపంచంలోని సకల వృక్షజాతులూ జంతుజాలమూ ఆఖరికి శిలాఖండాలు కూడా ఈ ధర్మాన్ని పాటిస్తుంటే కొందరు మనుషులు పాటించనందువల్ల ధర్మం నశిస్తుందనుకోవడం అమాయకత్వమే!

          అన్ని విభక్తి ప్రత్యయాలతో కూడిన నిర్వచనాలను పరిశీలిస్తే సనాతనుడైన భగవంతుని చేత స్థాపించబడినది కావటం వల్లనూ స్వతః సనాతనమైనది కావటం వల్లనూ దీనిని విశ్వసించి పాటించిన వారిని సనాతనులను చేస్తుంది.

          సనాతన  ధర్మం ప్రతి ఒక నైష్ఠికుడికీ చెప్పేది మరణానంతరం పొందబోయే స్వర్గనరకాదులను గురించి కాదు, జీవంతో ఉన్నప్పుడే ఈ ప్రపంచంలోనే భగవంతుణ్ణి చూసి, విని, స్పర్శించి ఆనందించి అతనిలో ఐక్యం కావడం గురించి నొక్కి చెప్తుంది!సనాతన ధర్మాన్ని నిష్ఠగా పాటించే ప్రతి మానవుడూ  మొదట ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది పిదప పరమాత్మ సాక్షాత్కారాన్ని అనుభవించి మరణ సమయానికి  గతానుగతికమైన పాపరాశి మిగిలి ఉంటే దాన్ని తగ్గించుకోవడానికి వీలైన ఉత్తమజన్మనీ పాపరాశి శూన్యస్థితికి చేరుకుంటే ఇంక జన్మ లేని మోక్షస్థితిని అందుకుంటాడు - అది తను యే భగవానుడి నుండి విడివడి జన్మపరంపరలోకి వచ్చాడో ఆ భగవంతుడిలో లీనమైపోవటం అవుతుంది!

          మొదట తెలుసుకోగానే  అసాధ్యం అనిపించే ఇంతటి సంక్లిష్టమైన లక్ష్యాన్ని కూడా చాలా సులభంగా సాధించగలిగేటట్లు మానవాత్మలను సిద్ధపర్చటం కోసం ప్రాచీన భారతీయ ఋషులు ఎంతగానో శ్రమించి ఎన్నో మార్గాలను ఏర్పరచారు,ఎన్నో ఉపాయాలను చూపించారు,శ్రమ తెలియకుండా ఉండేటందుకు ఎన్నో ఆనందాలను సమకూర్చారు - శ్రద్ధ ఒకటి ఉంటే చాలును ఈ ధర్మానుష్ఠానం ద్వారా సాధన పూర్తయ్యాకనే కాదు సాధన మొదలు పెట్టగానే ఆనందం, పరమానందం, బ్రహ్మానందం అనే స్థాయిల్లో ఏదో ఒకదాన్ని పొందవచ్చును!

          సనాతన ధర్మానికి ఆద్యంతాలు లేవు.సృష్టి స్థితి లయ విభూతు లన్నింటా ఇమిడిపోయి వాటిని నడిపిస్తూ ఉంటుంది.ప్రళయంలో సైతం నశించదు - బీజ రూపంలో నిద్రాణమై ఉండి సృష్టి మొదలైనప్పుడు చైతన్యవంతమై సకల భూతాళికీ రక్షణ నిచ్చే మనోగతమైన సంస్కారాల్నీ  క్రమబద్ధమైన జీవన విధానాల్నీ ప్రసాధించి శాసించేది సనాతన ధర్మమే!త్రికరణ శుద్ధిగా సనాతన ధర్మాన్ని పాటించేవారికి మరణానంతరం లభించే స్వర్గసుఖాల కన్న వెయ్యి రెట్లు అధికమైన ఆనందానుభూతి జీవిత కాలంలోనే అనుభవంలోకి వచ్చి మరణానంతరం జన్మలు లేని కైవల్యం సిద్ధిస్తుంది.మొత్తం సనాతన ధర్మం వేదములు, స్మృతులు, సాధు సంతుల సదాచార ప్రసంగాలు, ఆత్మకు ఆహ్లాదాన్ని కలిగించే సత్కర్మలు అనే నాలుగు పాదాల పైన నిలబడిన ఒక చతుష్పాత్తు, గోమాత!సనాతన ధర్మం జీవుడు తన సహజాతి సహజ ఉపాధిగతమైన సాంఘిక జీవన పరిధిలోనే ఎలా ప్రవర్తిస్తే తరిస్తాడో బోధిస్తుంది.

          సనాతన ధర్మం  మానవులు సత్యవాక్పరిపాలన, అహింసాయుత వర్తన, త్యాగనిరతి, ఇంద్రియనిగ్రహం, పరోపకారం, అస్తేయం, నియమపాలన వంటి దైవీయ ప్రవృత్తులను అలవాటు చేసుకుని వ్యక్తిగత జీవితంలో ప్రశాంతతనీ సామాజిక జీవితంలో గౌరవాలనూ అందుకుని ప్రశాంత చిత్తులై తమ చరమ లక్ష్యమైన మోక్షసాధన కోసం ప్రయత్నించటానికి ప్రేరణ ఇస్తుంది, ఉత్తేజితం చేస్తుంది,దైవసముల్ని చేస్తుంది!మనుస్మృతి ధర్మం యొక్క పది లక్షణాలను ఇలా క్రోడీకరించి చెప్తుంది:

శ్లో.ధృతిః క్షమా దమోస్తేయం, శౌచ మింద్రియ నిగ్రహః
ధీర్విద్యా సత్యమక్రోధో దశకం ధర్మ లక్షణం!
(మనుస్మృతి VI - 92)

          "ఓర్పు, క్షమ, దమం. అస్తేయం, శౌచం, ఇంద్రియనిగ్రహం, ధీ, విద్య, సత్యం, అక్రోధం - ఇవి ధర్మము యొక్క పది లక్షణాలు" సనాతన ధర్మం ఐహిక సుఖాలను ఆశించటాన్ని వ్యతిరేకించదు, కానీ ఇంద్రియనిగ్రహాన్ని ప్రశంసించి మితిమీరిన భోగలాలసత గురించి హెచ్చరికలు చేసి అంతిమ నిర్ణయాన్ని మన విచక్షణకే వదలి వేస్తుంది.ఈ స్వేచ్చను మరి యే ఇతర ధార్మిక శాఖ ఇంత విస్తృత స్థాయిలో ఇవ్వలేదు!

          ఎంతమంది అనుసరిస్తున్నారు అనే అంకెల్ని మాత్రమే లెక్కకి తీసుకుని ప్రస్తుతం మూడో స్థానంలో ఉందని బెంగ పెట్టుకుని మొదటి స్థానం కోసం ఇప్పుడు మొదటి స్థానంలో ఉన్న ఇతర మతాల్ని అనుకరించటం కోసం అంగలు వేస్తున్న హిందువులు ఇంత స్వేచ్చను అనుభవిస్తున్న  ప్రజాస్వామిక పద్ధతిలో మా మతంలో చేరితే చాలు మీ రోగాలూ కష్టాలూ మటుమాయం అయిపోయి వైభవాలు దక్కుతాయనే లాభసాటి వ్యాపార ఒప్పందాలూ మేము చెప్పినట్టు వినాలే తప్ప ఎందుకూ ఎలా ఏమిటని అడక్కూడదనే హేతువుకు స్థానం లేని మూర్ఖపు నిబంధనలూ మేం చెప్పేది నమ్మకపోతే మా దేవుణ్ణి మీమీదకి ఉసిగొల్పుతాం, ఆయన మిమ్మల్ని రోగాలతోనూ చావులతోనూ శిక్షిస్తాడనే బెదిరింపులూ ఏవీ లేకుండా కేవలం వ్యక్తుల స్వయం నిర్ణయాత్మకతతో ఇంతమంది ఈ ధర్మానికి బద్ధులై ఉన్నారని తెలుసుకుంటే బెంగ పోయి హుషారు వస్తుంది!


          ఇతరులకి అబద్ధాలు చెప్పేవాళ్ళు ఆ అబద్ధాల్ని నిజాలని నమ్మి చెప్పటం లేదు,ఎదటివాళ్ళని నమ్మించటం కోసమే శతవిధాల ప్రయత్నిస్తూ  అత్యవసరమైతే తాము కూడా నమ్ముతున్నట్టు నటిస్తారే తప్ప వాళ్ళు అవి నిజాలని నమ్మరు!మనం గనక నిజానిజాలు నిర్ధారించుకోకుండా అబద్ధాల్ని నమ్మితే మనకే నష్టం అనేది రెండు మూడు సార్లు అనుభవంలోకి వచ్చాక తప్పకుండా తెలుస్తుంది.అది తెలిశాక మనకి ఆ అబద్ధాలు చెప్పినవాళ్ళ నిజస్వరూపం తెలియడం వల్ల బలమూ దమ్మూ దన్నూ ఉంటే నాలుగు తన్ని కచ్చి తీర్చుకోవటమో అది కుదరకపోతే వాళ్ళనుంచి దూరంగా పారిపోవటమో చేస్తాం - ఈ విధమైన వాస్తవిక జ్ఞానం  పుష్కలంగా ఉండటం చేత ప్రాచీన భారతీయ సనాతన ధార్మిక సాహిత్య సృష్టికర్తలు తాము సత్యానికి కట్టుబడి సత్యవాక్పరిపాలనని అన్నింటికన్న సర్వోత్కృష్టమైన స్థానంలో నిలబెట్టి మనల్ని కూడా సత్యం వైపుకే నడవమని పదే పదే నొక్కి చెబుతున్నారు!

          వరసలో మొదట చెప్పటమే కాదు లోనారసి చూస్తే సనాతన ధర్మం మొత్తం సత్యం పునాదుల మీద నిర్మించబడినట్టు తెలుస్తుంది.మన వలెనే మానవజన్మ ఎత్తిన రాముడు మనకు పూజనీయుడై దైవసముడు కావడానికి తను సత్యానికి కట్టుబడిన పద్ధతియే కారణం కదా!సత్యం యొక్క గొప్పతనాన్ని శ్రుతి ఇలా ఉగ్గడిస్తున్నది:

మం.సత్యాన్నాస్తి పరోధర్మః, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ
సత్యేన వాయు రావాతి, సత్యేనాదిత్యో రోచతే
దివి సత్యం వాచః ప్రతిష్ఠా, సత్యే సర్వం ప్రతిష్ఠితం
సత్యేన సువర్గా ల్లోకాత్ చ్యవంతే కదాచన
సతాం హి సత్యం, తస్మాత్సత్యే రమంతే!

          "సత్యమును మించిన ధర్మము లేదు. సత్యమే జ్ఞానమును అనంతమునైన బ్రహ్మస్వరూపము. సత్యము వలననే వాయువు వీచుచున్నది. సత్యము వలననే వాక్కు శాశ్వతమగుచున్నది. సత్యమునందే సర్వజగత్తును సుప్రతిష్ఠితమై యున్నది. సత్యము వలననే మానవులు స్వర్గాదుల నుండి చ్యుతులు గాకుందురు. సత్యమే శాశ్వతము. అందుచేతనే మహాత్ములు సత్యమునందే రమించుచున్నారు"

          "యోవై ధర్మః స సత్యంవై తత్" అని బృహదారణ్యకోపనిషత్తు ఉద్ఘాటించి చెప్పడం వల్ల సత్యము వేరు ధర్మము వేరు కాదు, ధర్మమే సత్యము లేక సత్యమే ధర్మము అని సనాతాన్ ధార్మిక సాహిత్య సృష్టికర్తలు భావించినట్లు స్స్పష్టమౌతున్నది.సత్యవాక్పాలన గురించి మనుస్మృతి ఇలా చెబుతున్నది:

శ్లో.సత్యం బ్రూయా త్ప్రియం బ్రూయాత్,న బ్రూయా త్సత్య మప్రియం
ప్రియంచ నానృతం బ్రూయాత్ - ఏష ధర్మః సనాతనః
(మనుస్మృతి VI-138)

          "సత్యమునే పలుకుము ప్రియమునే పలుకుము.సత్యమైనను అప్రియము పలుకకుము.ప్రియమైనను అసత్యమును పలుకకుము." - ఇంతకన్న ఎక్కువ ఎవరైనా చెప్పగలరా?అలా చెబితే సుత్తిలా ఉండదూ!

          సత్యం తర్వాత సనాతన ధర్మం ఎక్కువ కీర్తించినది పరోపకార పరాయణత్వాన్ని. "పరోపకారార్ధ మిదం శరీరం" అన్న శ్రుతివాక్యం అసలు ఈ శరీరం మనకు లభించిదే పరోపకారం కోసం అని చెప్తున్నది కదా!

శ్లో. హే బాల!లోకసేవార్ధం కృత్స్నం త్వజ్జీవితం సదా
అర్పయిత్వా హర్షేణ సార్ధకం కురు యత్నతః!

          "ఓ మానవా! ఎల్లప్పుడు పరోపకారార్ధము నీ జీవితమునంతటిని సంతోషముతో అర్పించి ప్రయత్నపూర్వకముగ నీ జీవితమును సార్ధకము చేసుకొనుము." - ఇక్కడ హర్షేణ, యత్నతః అనే రెండు మాటల్నీ వాక్యపూరణ కోసం వాడలేదని గమనించాలి.ఎందుకంటే, పరోపకారం అనేది మనసులో ఏడుస్తూ మెహర్బానీ కోసం చెయ్యకూడదు. అట్లాగే అవకాశం దొరికితే చెయ్యడం కాదు,మన స్థాయిలో పూనుకుని ఎంతో కొంత పరులకి ఉపయోగపడితేనే ధర్మం నిలబడుతుంది!


          సనాతన ధార్మికుల  శాస్త్రీయత అంతా ఇంద్రియనిగ్రహం గురంచి మిగిలిన అన్నింటికన్న ఎక్కువ సార్లు చెప్పడంలోనే తెలుస్తుంది - ఎన్నిసార్లు "ధర్మం నీకు క్షేమాన్ని కలిగిస్తుంది!అధర్మం నీకు నాశనాన్ని తెచ్చిపెడుతుంది!" అని చెవినిల్లు గట్టుకుని చెప్పినప్పటికీ ఇంద్రియాల మీద అదుపు లేనివాడికి తొలి అడుగు క్షణిక సుఖాల వైపుకే పడుతుంది - సర్వభ్రష్టం అయ్యాక తెలిస్తే ఎంత, తెలియకపోతే ఎంత? మధ్యలోనే తెలిసినా  ఆ సమయం అంతా వృధాయే కదా -  ప్రాచీన గురువరేణ్యులలో కూడా కొందరు ఈ స్థితిని కొతకాలం అనుంభవించి కాబోలు "ముందు తెలిసెనా ప్రభూ!అన్ని చైదములు చేసి యుందునా?" అని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు!

          సనాతన ధార్మిక సాహిత్య సృష్టికర్తలు కీర్తించిన మరొక విశిష్టమైన లక్షణం క్షమాగుణం.క్షమ అంటే కష్ట నష్టములను గానీ పరుష వాక్యాలను గానీ సహించి మనని కష్టపెట్టిన వారిమీద ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోకుండా మౌనంగా ఉండిపోవటం.

శ్లో.నరస్యాభరణం రూపం, రూపస్యాభరణం గుణః
గుణస్యాభరణం జ్ఞానం, జ్ఞానస్యాభరణం క్షమా!


          "మానవుని యొక్క ఆభరణం రూపం.రూపం యొక్క ఆభరణం గుణం.గుణం యొక్క ఆభరణం జ్ఞానం.జ్ఞానం యొక్క ఆభరణం క్షమ" - అంటే,మానవునికి రూపం కన్న గుణం కన్న జ్ఞానం కన్న క్షమయే శోభని ఇస్తుందని పై శ్లోకం చెబుతున్నది.అందుకే సత్పురుషులు,ముముక్షువులు,భగవంతుడు ఇతరుల తప్పుల్ని  క్షమిస్తూ ఉంటారు.

          మోక్ష సాధనకు వైరాగ్యం చాలా అవసరం. తన చుట్టూ ఉన్న సమస్తాన్నీ దోషదృష్టితో చూసి విషయవాసనల పట్ల జుగుప్సను పెంచుకుని వస్తుగతమైన వాంచలను తిరస్కరించటాన్ని వైరాగ్యం అంటారు.మానవునికి వైరాగ్యం అనేక కారణాల వల్ల కలుగుతుంది - దుఃఖము చేత కలుగు వైరాగ్యము, భయము చేత కలుగు వైరాగ్యము, వివేకము చేత కలుగు వైరాగ్యము.వీటిలో మూడవది శ్రేష్ఠమైనది.మొదటి రెండూ దుఃఖము గానీ భయము గానీ తొలగిపోగానే వాటి వల్ల కలిగిన వైరాగ్యం కూడా మాయమైపోయే అవకాశం ఉంది.

          యుగాన్ని బట్టి యుగధర్మం ఉంటుంది.కలియుగంలో మనుషులు దానం చేత తరిస్తారని పరాశర స్మృతి ప్రకటిస్తున్నది.

శ్లో.తపః పరం కృతయుగే,  త్రేతాయాం జ్ఞానముచ్యతే
ద్వాపరే యజ్ఞమేవాహుర్దాన మేకం కలౌయుగే!

          "కృతయుగంలో తపము, త్రేతాయుగంలో జ్ఞానము, ద్వాపరయుగంలో యజ్ఞము కలియుగంలో దానము ముఖ్యమైన ధర్మాలు." - తన స్వార్జితమైన గో హిరణ్యాదులను మూల్యం తీసుకోకుండా శాస్త్రవిధి ననుసరించి తనకు వాటిపై గల హక్కును వదులుకుని యోగ్యుడగు మరొకనికి పూర్తి హక్కులను ఇవ్వడమే దానం అని నిర్వచించటాన్ని బట్టి ఏది పడితే అది ఎవడికి పడితే వాడికి ఎలా పడితే అలా ఇచ్చేది దానం కాదని తెలుసుకోవాలి. తన కష్టార్జితాన్ని మాత్రమే దానం ఇవ్వాలి.యోగ్యులైన వారికే దానం ఇవ్వాలి.ఇతరేతరమైన ప్రతిఫలం ఆశించకుండా దానం చెయ్యాలి.దానం ఇచ్చే వస్తువు మీద వ్యామోహం పూర్తిగా తెంచుకున్నాకనే దానమివ్వాలి.

          కాలం అనే ఒక తన్మాత్రను గురించి ప్రాచీన భారతీయ విజ్ఞానులు తెలుసుకున్నది మాత్రమే జ్ఞానం అని వేదం అనిదంపూర్వమైన రీతిలో స్థాపించి కాలాన్ని సద్వినియోగం చేసుకోవటమే మానవులకు పరమలక్ష్యం అని నిర్దేశించటం ఒక్కటే సనాతన ధర్మాన్ని ఇతర ధర్మాల కన్న అత్యున్నతమైన స్థాయిలో నిలబెడుతున్నది!

          వైదిక సూత్రాల ప్రకారం మానవుడు ఎప్పటి వరకు తనకు జీవిత లక్ష్యమును నిశ్చయించుకొనడో అప్పటి వరకు అతని జీవిత కాలము వ్యర్ధము.ఒకసారి లక్ష్యాన్ని నిర్దేశించుకున్న మానవుడు ప్రతి క్షణం ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి ప్రయత్నించాలి,ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆగిపోకూడదు,నిరాశలో నిలిచిపోయి దిక్కులు చూడకూడదు,నిరంతరం లక్ష్యం వైపుకు ప్రయాణిస్తూనే ఉండాలి.


శ్లో.ధనే నష్టే పునః ప్రాప్తుం, శక్తి స్యాద్యస్య కస్యచిత్
గత కాలస్తు నాయాతి - ఏవ మీశ్వర శాసనం!

          "ఎవడైనను ధనం పోగొట్టుకుంటే మరల సంపాదింప వచ్చును. ఎవడైనను శక్తిని పోగొట్టుకుంటే మరల సంపాదింప వచ్చును. కానీ గడిచిన సమయం మాత్రం తిరిగి రాదనేది ఈశ్వర శాసనం." - కాబట్టి ప్రతి మనిషీ రోజులో మెలకువగా ఉండే సమయాన్ని తనకు అనుకూలమైన రీతిలో విడగొట్టుకుని ఆ ఏర్పాటు ప్రకారం అలసటకు తావు లేని పద్ధతిలో తన లక్ష్యాన్ని చేరుకోవాలి.


          మన చుట్టూ కనిపించే మనుషుల్ని మూడు విధాలుగా వర్గీకరించవచ్చును - మనల్ని ద్వేషించేవారు, మనల్ని ప్రేమించేవారు, మనపట్ల ఉదాశీనులు.లక్ష్యము పట్ల ధృవనిశ్చయమున్న వ్యక్తికి ఈ మూడు విధాలైన వ్యక్తులూ సహాయకారులే అవుతారు.

          హిందువులు యజ్ఞయాగాదులలో చేసే జంతుహింసను నిరసించి దానిమీద పోరాడటం కోసం గౌతమ బుద్ధుడు బౌద్ధమతాన్ని స్థాపించి అహింసకు పెద్ద పీట వేశాడనీ అప్పటివరకు హిందువులకు అహింస అంటే ఏమిటో తెలియనే తెలియదనీ చెప్పేవారు వైదిక సాహిత్యమే అహింసకు ఎన్నో నిర్వచనాలను ఇచ్చి అహింసా పరమో ధర్మః అని కీర్తించిందనేది యెందుకు మర్చిపోతున్నారో!

          భక్తిమార్గంలో మానసిక పూజ అత్యంత ప్రధానమైనది.ఈ పూజలో అష్టభావనాసుమాలతో భగవానుని అర్చిస్తారు.ఆ అష్ట పుష్పాలు ఇవే:

శ్లో.అహింసా ప్రధమం పుష్పం, పుష్ప మింద్రియనిగ్రహః
సర్వభూతదయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః
శాంతి పుష్పం, తపః పుష్పం, ధ్యానపుష్పం తధైవచ
సత్య మష్ట విధం పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్!


          ఇక్కడ అహింసను ప్రధమ పుష్పంగా కీర్తించడం  దాని ప్రాధాన్యతను చెప్పడం కోసమే కదా!అహింస యొక్క ప్రాముఖ్యతను ప్రజల దృష్టికి తెచ్చి జనులందరు దానిని పాటించునట్లు చేయుటకే ధర్మప్రచారం జరుగుతుందని వ్యాసభగవానుడు మహా భారతంలోని శాంతిపర్బంలో చెప్పాడు.

          మరి ఇంత అత్యున్నతమైన భావ పరంపరతో ప్రపంచం మొత్తాన్ని ఉత్తేజ పరహగలిగిన శాస్త్రీయ చైతన్యం కలిగిన సనాతన ధర్మం ఆస్పృశ్యత అనే ఒక  దురాచారాన్ని ఎలా కొన్ని శతాబ్దాల పాటు సాంఘిక నేరం అని చెప్పదగిన స్థాయిలో పాటించింది?భర్త చనిపోతే బతికి ఉన్న అతని భార్యని కూడా బలబంతాన చితి మీదకి నెట్టేసేవాళ్ళని తెలుస్తున్న వింటుంటేనే ఒళ్ళు జలదరించే భయంకరమైన దురాచారాల్ని కూడా తొలగించుకోగలిగిన వాళ్ళు ఈ ఒక్క దురాచారాన్ని తొలగించుకోలేక ఎందుకు సిగ్గుతో తల దించుకుంటున్నారు?ఇంగ్లీషువాళ్ళ నుంచి స్వతంత్రం తెచ్చుకున్నాక అంబేద్కర్ అనే ఒక వ్యక్తి రాక్షసమైన పట్టుదలతో రాజ్యాంగంలో కఠినమైన నియమాలు ఏర్పరచటం వల్లనూ ప్రత్యేక చట్టాల్ని రూపొంధించటం వల్లనూ ఈ తరంలో బలహీనపడింది గానీ లేకపోతే ఇప్పటికీ కొనసాగుతూ ఉండేది.అంబేద్కర్ తండ్రి ఇంగ్లీషువాళ్ళ సైన్యంలో మంచి స్థాయిలో ఉండటం వల్ల ఈయన పైకి రాగలిగాడు గానీ లేకపోతే ఈ మార్పు కూడా వచ్చి ఉండేది కాదు.అంబేద్కర్ పని చేస్తున్న కోర్టులో ఈయన తక్కిన వాళ్ళకన్న అత్యంత ప్రతిభాశాలి అయినా పక్కన కూర్చునే పాటి సమానస్థాయి గౌరవం కూడా ఇవ్వలేదు - క్లర్కులూ బంట్రోతులూ కూడా ఫైళ్ళని మిగిలిన వాళ్ళకి చేతికి అందించి ఈయనకి మాత్రం ఠాప్పున చప్పుడయ్యేలా బల్ల మీదకి విసిరేవాళ్ళంటే ఆయన హృదయం యెంత వుడికి పోయి ఉంటుందో ఆలోచించుకోండి!

          కొద్ది రోజుల క్రితం వరకు నాకు అస్పృశ్యతని గురించి తెలిసింది చాలా తక్కువ, ఎక్కువ తెలుసుకోవాలనే ఆసక్తి కూడా లేదు.కానీ, ఈ మధ్యనే నా బ్లాగులోనే ఒక పోష్టు దగ్గిర ఒక చిత్రమైన సన్నివేశం నడిచింది.ఒక వ్యాఖ్యాత నన్ను "అస్పృశ్యతని గురించి మీరేమైనా పరిశోధించారా?దాని గురించి పోష్టు రాశారా!" అను అడిగితే నేను అది ముగిసిపోయిన కధ కదా, పైగా సున్నితమైన విషయం కాబట్టి భవిష్యత్తులో కూడా రాయకపోవచ్చు అని జవాబు చెప్పాను.అయితే, ఒక అనామక హిందూద్వేషి దీనికి చాలా విచిత్రంగా స్పందించాడు - నేనే ప్రశ్న వేసి నేనే జవాబు చెప్పి నాటకం ఆడినట్టు ఆరోపించాడు!నాకు చాలా అయోమయం అనిపించింది - ఎన్నోసార్లు ఎన్నో బ్లాగుల్లో ఎంతోమందితో ఎన్నో యుద్ధాలు నా సొంత ఐడితోనే చేసిన నాకు నా సొంత బ్లాగులో వేరే ఐడితో కామెంట్లు వేసుకోవాల్సిన ఖర్మ దేనికి?ఇతనే కాదు హిందూద్వేషుల వాదనలన్నీ ఇలాగే అఘోరిస్తున్నాయి.ఒకసారి హిందూద్వేషం పుట్టాక తెలివితేటలు పోతాయా! తెలివితేటలు పోయాక హిందూద్వేషం పుడుతుందా!

          నాకు ఇలాంటి తెలివితక్కువ వాగుడు అసహ్యంతో కూడిన చిరాకు నిండిన విసుగును కలిగిస్తుంది!ప్రపంచంలో ఉన్న ప్రతి విషయం గురించీ నేను రాయను.మొదట నాకు కుతూహలం పుట్టాలి.నాకు కుతూహలం కలగని విషయం గురించి ఒతరుల కోసం  నేను ఎప్పుడూ రాయను.నాకు కుతూహలం లేకుండా రాస్తే రాధయె రుక్మిణి పోష్టులా ఏడిసినట్టు ఉంటుంది.కానీ, అస్పృశ్యత గురించి అప్పటివరకు నాకు లేని కుతూహలాన్ని ఈ కో.మె.మే(కోడిమెదడుడుమేధావి) పుట్టించాడు - వీళ్ళకి ఇంత ద్వేషం పుట్టించిన అస్పృశ్యత యొక్క ఆదీ అంతమూ చూడాలని కుతూహలం అప్పుడే పుట్టింది.

          ఒక కీలకమైన ప్రశ్నకు జవాబు వెతుకుతూ పరిశోధన మొదలుపెట్టాను.తర్వాత కాలంలో దురాచారం కింద పరిగణించబడిన సతీ సహగమనం,కన్యాశుల్కం,వరవిక్రయం వంటివి మొదటి రోజుల్లో ఒక చారిత్రకమైన అవసరం వల్ల ఉనికిలోకి వచ్చాయి.ఈ దేశం మీద దాడికి వచ్చిన ముస్లిం మతానుయాయులు వారి అలవాటు చొప్పున ఓడిపోయిన వారి స్త్రీలని చెరచటం,బానిసల కింద మార్చటం లాంటివి చేసేవాళ్ళు గనక ఆ నీచమైన బానిసత్వానికి తలవంచలేక దానికన్న అగ్నికీలలకి ఆహుతి కావడమే నయం అనిపించంది,ఆ కాలంలో అది సదాచారమై ఆ భయం లేని కాలంలో అది దురాచారం అయింది.ఆస్తుల పంపకంలో ఒక వ్యక్తి తగ్గడం,జీవితకాలం పాటు పోషించాల్సిన భారం తప్పడం లాంటి దురాశలు అండ లేని ఆడవాళ్ళని బలవంతంగా చితుల మీదకి తోసెయ్యడానికి  కారణం అయి ఉంటాయి. అయ్యవారిని చెయ్యబోతే కోతి అయినట్టు కొందరు సత్పురుషులు అందరి చేత మంచిపనుల్ని చేయించటానికి పెట్టిన నియమాలు ఆషాఢభూతుల చేత చెడు ఫలితాలని ఇవ్వటం అప్పుడప్పుడు చాలాచోట్ల జరుగుతూనే ఉంటుంది - స్త్రీకి రక్షణ కోసం వివాహ వ్యవస్థని ఏర్పరిస్తే దాన్ని స్త్రీకి చెరసాలని చేశారు,ఆ చెర నుంచి తప్పించటానికి స్త్రీస్వేచ్చని ప్రతిపాదించి ఉద్యమించి సాధించి చూపిస్తే కొందరు స్త్రీలు విశృంఖలత్వానికి తెగబడి చట్టబద్ధమైన వ్యభిచారం చేస్తున్నారు!ఆస్తుల వారసత్వం నుంచి అస్థుల నిమజ్జనం వరకు అన్నింటినీ మగాళ్ళకే కట్టబెట్టి అందరూ మగపిల్లల కోసమే ప్రయత్నించి ఆడపిల్లని చంపటం లాంటివి చెయ్యటంతో ఆడపిల్లలకి కరువొచ్చి వాళ్ళని డబ్బిచ్చి కొనుక్కోవాల్సి వచ్చింది - అదే కన్యాశుల్కం అనే దురాచారానికి మూలం. ఆడపిల్లల క్రయవిక్రయాలు లాభసాటి కావడంతో మగపిల్లల సంఖ్య తగ్గి వరశుల్కం/వరవిక్రయం/వరకట్నం అనే దురాచారం మొదలైంది.సహగమనం నుంచి మొదలుపెట్టి పరిశీలించి చూస్తే అన్ని  దురాచారాలనీ వాటి ఉద్భవం, వైభవం, నిధనం అనే మూడు దశల్లోనూ ప్రయోజనం,క్షేమం,ఆత్మరక్షణ, లాభం వంటి ఆర్ధిక విషయాలే మనుషుల్ని శాసించాయనేది తెలుస్తుంది. ఇలా మిగిలిన అన్ని దురాచారాలకి మొదలూ తెలుస్తున్నది, దాని వెనక ఉన్న ఆర్ధిక పునాదీ కనపడుతున్నది.మరి, అస్పృశ్యత యొక్క తొలినాటి రూపం ఏమిటి?దాని వెనక ఉన్న ఆర్ధిక పునాది యేమిటి?

          అస్పృశ్యత లనేవి చాలా ఉన్నాయి,కానీ అనువంశికమైన అస్పృశ్యతయే కదా దురాచారం అని పిలువబడుతున్నది.ఇది ఎప్పుడు మొదలైందో తెలుసా!బౌద్ధమతం పుట్టి పెరిగి హిందూమతాన్ని ప్రభావితం చేసి తను బలహీన పడుతున్న దశలో వికృత రూపం దాల్చింది!

          మొదట్లో అందరూ ఈ అస్పృశ్యతని తీసుకెళ్ళి ఆర్య-ద్రవిడ సిద్ధాంతానికి అంటు కట్టేశారు - వారి దాని ప్రకారం ఎక్కడినుంచో ఇక్కడ లేని గుర్రాల్ని ఎక్కి వచ్చి నల్లగా ఉన్న స్థానికులైన ద్రవిడుల్ని గెలిచి విజయ  గర్వంతో మిడిసిపడే తెల్లగా ఉన్న ఆర్యులు జాత్యహంకారం కాలి నుంచి తల వరకు ఎక్కిపోయి "జన్మతోనే మేము అధికులం!జన్మతోనే మీరు అధములు!" అని మతగ్రంధాల ద్వారా ప్రకటించి అమాయకులైన దళితుల్ని నమ్మించి దోపిడీని శాశ్వతం చేసుకోవటానికి వేసిన బృహత్తర ప్రణాళికయే అస్పృశ్యత!

          ఆర్య-ద్రవిడ సిద్ధాంతం అబద్ధమని తేలిపోవటంతో దానితో పాటు దీన్ని కూడా చెత్తబుట్టలోకి పారేశారు.మిగిలిన వాటిల్లో అంబేద్కర్ విశ్లేషణయే వాస్తవానికి దగ్గిరగా ఉండి అన్ని పరిశోధనల్నీ పరీక్షల్నీ తట్టుకు నిలబడింది - ఇవ్వాళ అందరూ అస్పృశ్యతకి సంబంధించి అంబేద్కర్ సూత్రీకరణల్నే పరమప్రమాణం అని ఒప్పుకుంటున్నారు.

          చారిత్రకపరమైన ఆధారాల ప్రకారం అస్పృశ్యత పూర్వ సామాన్య శకం 600 నుంచి సామాన్య శకం 200 మధ్యన పొటమరించి సామాన్య శకం 200 తర్వాత ఉధృత స్థాయికి చేరుకున్న్నది.సామాన్య శకం ఏడవ శతాబ్దిలో భారత దేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు Xuanzang కసాయివాళ్ళు,జాలర్లు,తలార్లు,నృట్యగాన ప్రదర్శనలు ఇచ్చే నటులు,పాకీవాళ్ళు పంక్తిబాహ్యులు/అస్పృశ్యులు అనే పేరున  గ్రామాలకీ నగరాలకీ బయట నివసించేవారని వర్ణించాడు.అంబేద్కర్ అస్పృశ్యతని పాటించటానికి రెండు బలమైన కారణాలను పేర్కొన్నాడు - మొదటిది బౌద్ధమతం ప్రచారం చేసిన అహింస,ముఖ్యంగా జంతుహింసని నిరసించటం అనేది అతి ప్రభావాన్ని చూపించి జంతుహింసని నిషేధించారు.అయితే అప్పటికే ఆహారం కోసం గానీ ఇతర అవసరాల కోసం గానీ వదిలెయ్యటానికి వీల్లేనంత గట్టిగా అలవాటు పడినవారు వాటిని వొదులుకోలేకపోవటంతో వైదిక కాలంలోని చండాలురకి విధించిన సాంఘిక బహిష్కారాన్నే వీరికీ విధించారు.అయితే వైదిక కాలంలోని చండాలత్వం అనువంశికం కాదు.వైదిక కాలం నాటి చండాలత్వం ఆధునిక కాలపు చట్టాల్లోని యావజ్జీవకారాగారం వంటి ఆ వ్యక్తికి మాత్రమే పరిమితమైన శిక్ష - సంతానం తిరిగి సమాజంలోకి వచ్చి గౌరవప్రదమైన జీవితం గడిపే వీలు ఉండేది.

          వెలివేతకి గురి కాబడిన సమూహాలు అన్నీ జంతువధ వంటి అంటురోగాల్ని వ్యాపింపజేసే వృత్తులకు సంబంధించినవారు కావడం గమనించాలి. నృత్యగానవినోదులలో మద్యపానం,మాంసభక్షణం, విశృంఖలత్వం ఉండటం పంక్తిబాహ్యానికి కారణమైందని అందరికీ తెలిసిందే కదా.ఆయా వృత్తులలోనే అటువంటి ఇబ్బంది ఉండటంతో వాటికి సిద్దపడినవారు ఈ వెలివేతని కూడా మౌనంగానే భరించారు - స్పార్టకస్ అధ్వర్యంలో జరిగిన బానిసల తిరుగుబాటు వంటివి భారతదేశంలో జరిగినట్టు లేదు.దీనికి కారణం అస్పృశ్యత బానిసల వ్యవస్థ కంటే కొంత సుకుమారమైనది కావటమే!

          అక్కడి బానిసల వ్యవస్థలో వలె ఇక్కడి బహిష్కృతులు అసలు అస్తిత్వం లేని పరాధీనులు కారు,వారి వృత్తి వల్ల ఆదాయమూ సొంత ఆస్తీ కుటుంబ జీవితమూ అన్నీ ఉండేవి.కానీ, వృత్తికి సంబంధించిన అపరిశుభ్రత, అపరిశుభ్రత వల్ల వచ్చే అంటువ్యాధుల భయం వీరిని సాటి మనుషుల నుంచి  గౌరవ మర్యాదలకు నోచుకోని దయనీయమైన స్థితిలోకి నెట్టివేశాయి. వైదిక కాలంలోని చండాలురకు వలె ఒక తరంతో అంతమైపోకుండా తరాలకు తరాల్ని కబళించటానికి మరో చిత్రమైన కారణం పులి మీద పుట్ర్లా వచ్చి పడింది.ఈ అస్పృశ్యత ఉనికిలోకి వస్తున్న కాలంలోనే సమాంతరంగా లాభసాటి వృత్తుల వారు కౌశలం పెంచుకోవటానికి ఒక్కచోట చేరి వాళ్ళలో వాళ్ళే పెళ్ళిళ్ళు చేసుకుంటూ వాళ్ళ పిల్లలకి తమ విద్యని వారసత్వం చేసుకోవటం వల్ల కులవ్యవస్థ బిరుసెక్కి పోయింది.దీనితో బహిష్కృతుల సంతానం  ప్రధాన స్రవంతిలోకి రావడానికి దారి మూసుకుపోయింది.

          ప్రజలని విడగొట్టి అధికారం దక్కించుకోవాలనే దురద ఉన్నవాళ్ళు తప్ప చరిత్రని నిజాయితీతో అధ్యయనం చేసినవారు ఎవరూ కులవ్యవస్థకు గానీ అస్పృశ్యతకు గానీ బ్రాహ్మణులే మూలకారణం అని నిదించలేరు.తన కులానికి జరిగిన అన్యాయం తెలిసి తను అనుభవించి ఉద్యమించి కేవలం ఒక్క తరంలోనే వూహించని స్థాయిలో అస్పృశ్యతని బద్దలు కొట్టగలిగిన అంబేద్కర్ మహాశయుడికి లేని నోటి దురద అంబేద్కర్ చేసిన కృషిలో వెయ్యో వంతు కూడా చెయ్యలేని కంచె ఐలయ్యకీ కదిరి కృష్ణకీ ఎందుకు పుడుతున్నది?బ్రాహ్మణులు చేసింది అప్పటికే సమాజం యొక్క ఆమోదం పొందిన దాన్ని record చేసి తర్వాత తరాల వారికి communicate చెయ్యటమే!ఒక దురాచారం ఏ ఆర్ధిక పునాది మీద పైకి లేచిందో ఆ పునాది అట్లాగే ఉన్నంతకాలం మనుషులు వ్యక్తిగతమైన ఉద్రేకాలతో ఎంత భీబత్సం చేసినా ఫలితం శూన్యం.

          ఆర్ధిక పునాది మారకపోవటంతో వ్యవస్థీకృతమై కొన్ని శతాబ్దాల పాటు కొనసాగిన ఈ దుస్థితి మీద ఒక గట్టి దాడి చేసిన తొలి వ్యక్తి జ్యోతి బా పూలే - దంపతు లిద్దరూ కలిసి విద్య యొక్క ప్రాధాన్యతను గుర్తించి దళితులకు చదువు పట్ల ఆసక్తిని కలిగించి మంచి పునాదిని వేశారు. ఆ తర్వాత శ్రీ B.R.Ambedkar గారు తమ ప్రయత్నం మొదలుపెట్టారు.తన సమకాలికులలో అత్యంత ప్రతిభావంతుడైన న్యాయదృష్టి గల శ్రీ అంబేద్కర్ గారు అస్పృశ్యత అనే మురికిని కడిగేసి సనాతన ధర్మాన్ని పరిశుభ్రం చేయాల్ని అహరహం శ్రమించారు.కానీ మోహన్ దాస్ కరంచంద్ గాంధీతో సహా అప్పటి మూర్ఖ హిందూ నాయకులు అడుగడున అడ్డు తగులుతుండటంతో విసుగెత్తి పోయి సా.శ 1956 అక్టోబరు నెలలో “I was born a Hindu, but I solemnly assure you that I will not die as a Hindu.” అని ప్రకటించి రెండు అనుచరులతో బౌద్ధమతాన్ని స్వీకరించారు.అసలు 1935లోనే సూత్రప్రాయంగా హిందూమతాన్ని వదలడానికి నిశ్చయించుకుని అన్ని హైందవేతర మతాలనూ పరిశీలించి మిగిలిన వాటిని తిరస్కరించి బౌద్ధమతమే తగినదని ఎంచుకోవటానికి అంత సమయం పట్టింది.

          దుర్భరమైన అణచివేతకు గురవుతున్న దళితులకు తమ దీనత్వాన్ని పోగొట్టుకోవటానికి చేస్తున్న యుద్ధంలో ఉత్సాహాన్ని కలిగించే ఒక మతాన్ని ఇవ్వాలనుకుని తను ఆశించిన లక్షణాలన్నీ బౌద్ధంలో ఉన్నాయని బౌద్ధంలోకి ప్రవేశించారు.కానీ ఆంబేద్కర్ బౌద్ధమతం స్వీకరించే సమయానికి బౌద్ధం కూడా చాలా మారిపోయింది - Japan లోని Buraku జాతివారూ Korea లోని Paekchong జాతివారూ Tibet లోని Ragyappa జాతివారూ అస్పృశ్యతని అనుభవిస్తూనే ఉన్నారు!అయితే శ్రీ అంబేద్కర్ గారు తన సొంత అధ్యయనంతో బౌద్ధంలోని ప్రగతి శీలమైన మౌలిక భావాలను మాత్రం  తీసుకుని నవయాన బౌద్ధం అనే ఒక కొత్త శాఖని ప్రారంభించారు గానీ ఆయన కీర్తిశేషులు కావటంతో సమర్ధులైన యువనేతలు లేని ఆ నవయాన బౌద్ధం నాగపూరు , ముంబాయి వంటి నగరాల్లోనూ ఉన్న అతి తక్కువ మంది సభ్యులతో అసంఘటితమై ఉంది.

          పునాదిని మార్చుకోకుండా పైపై మెరుగులు చూసి భ్రమపడి ఎన్ని మతాలు మారినా మన రాత మారక విసుగు పుట్టటం తప్ప నిజమైన సుఖశాంతులు లభించవు!ఎన్నో ఆటుపోట్లను చూసిన హిందూ పురాణ యువతి ఒక పొరపాటుకు యుగాల పాటు కుమలడం, అనవసరం!కాలచక్రం తిరిగేటప్పుడు కింద ఆకు పైకీ పైని ఆకు కిందకీ వెళ్ళడం సహజం!ఏడిచేవాడిలోనూ ఏడ్పించేవాడిలోనూ వాడే ఉండి విఠలుడు ఆడుతున్న లీలా వినోదం ఇది!ఆదమరిచి మనం ఉన్నప్పుడు వెనక నుంచి తోసి కింద పడేస్తాడు!దెబ్బ తగిలి మనం కుములుతుంటే ఓదార్చకుండా పెద్ద  పెద్ద కళ్ళతో మన కళ్ళలోకి చూస్తూ  నవ్వుతాడు - గొప్ప మాయ గాడు!మనకి "నేను ఏడుస్తుంటే వీడు నవ్వుతాడా?" అని కచ్చి పుట్టి వెంటపడితే "ఇది నేర్పడానికేరా నేను నవ్వింది!" అని పకపకా నవ్వుతూ దూరంగా పారిపోతాడు!ఈయన గారి ఉత్తమ ఇల్లాలు లచ్చిందేవి ఈయన కన్న చిలిపి మాతల్లి!నిన్నూ నన్నూ ఒకచోట కూలేసి ఒక్క గోరుముద్దనే ఇద్దరి మధ్యన తిప్పుతూ "పెట్టేస్తున్నా,పెట్టేస్తున్నా, లటుక్కున పట్టెయ్యాలి,గుటుక్కున మింగెయ్యాలి - ఇదుగో వాడికి పెట్టేస్తున్నా!" అని వూరిస్తుంది!నా కడుపాత్రం కొద్దీ నేను లాక్కుంటే నివ్వు బిక్కమొగం పెడతావు, నీ కడుపాత్రం కొద్దీ నువ్వు లాక్కుంటే నేనుబిక్కమొగం పెడతాను!ఇద్దరికీ పోటీ పెట్టి ఇద్దరి కడుపులూ నింపటమే అమ్మల గన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, సురాసురుల కడుపారడి బుచ్చెడి అమ్మ తన పెనిమిటితో కలిసి ఆడుతున్న లీలా వినోదపు జగన్నాటకం!ఇంత హడావిడి దేనికీ అంటే కాలక్షేపం కోసం!ఎల్ల కాలమూ అన్నీ అమిర్చి పెడుతుంటే పిల్ల వెధవలకి బద్ధకం పెరిగి పోదూ!అనంత కాలం పాటు చీమ చిటుక్కుమన్నా వినపడేటట్టు నిశ్శబ్దంగా ఉండాలంటే బోరు కొట్టదూ!అర్ధం కాకపోతే ఇద్దరికీ ఏడుపు, అర్ధం చేసుకుంటే ఇద్దరికీ నవ్వు - అంతగాక ఇదంతా ఏమిటి?

          వేదం వినిన శూద్రుడి చెవుల్లో సీసం మరగబెట్టి పోశారనీ ...వేదం చదివిన శూద్రుడి నాలుక కోశారనీ..బ్రాహ్మడిని తిట్టిన శూద్రుడి నోట్లో సలసల కాలే ఇనుప కడ్డీని దోపారనీ ..బ్రాహ్మల్ని ఏ అంగంతో శూద్రులు అవమానిస్తే ఆ అంగాన్ని నరికేశారనీ ..ఏ పురాణంలో నైనా, ఏవంటి పండితులు గుర్తించి ఇతిహాసంలో నైనా, ఏ చరిత్ర గ్రంధంలోనైనా ఉందా?లేనప్పుడు.. మనుస్మృతిలో కనబడుతున్నాయి కాబట్టి మొత్తం హిందూ మతాన్ని శూద్ర వ్యతిరేకిగా దళిత ద్వేషిగా ముద్ర వేయటం సబబేనా?

          సాధారణంగా లోకంలో ఏ రచయిత అయినా తాను రాసే వాటిలో పొంతన ఉండేలా జాగ్రత్త పడతాడే! మరి, విజ్ఞుడు, విశాల దృష్టి కలవాడు, విశ్వమానవులందరికీ అన్ని కాలాల్లో పనికొచ్చే విషయాలు చెప్పినవాడు అని ఎందరో పాశ్చాత్య మేధావులు మెచ్చుకున్న మనుధర్మశాస్త్రకర్త తను చాటుతున్న ధర్మసూత్రాలలో పొంతన ఉండేట్టు చూసుకోడా? అతడే ప్రకటించిన  నియమాలు , ప్రమాణాలకు, మొత్తంగా అతడి ధర్మశాస్త్రం తీరుకు విరుద్ధంగా అపభ్రంశాలు కనబడితే అవి తర్వాత కాలంలో ఎవరో ప్రబుద్ధులు చొప్పించినవని స్పష్టమే కదా?

          మనుస్మృతిలో ప్రక్షిప్తాల గోల బాధిత సామాజిక వర్గాలలో చైతన్యం పెరిగిన తర్వాత మాత్రమే వినవస్తున్నది కాదు.  మహర్షి దయానంద సరస్వతి, విశ్వనాథ్ నారాయణ్ మండలిక్, భారతరత్న పి.వి.కాణే వంటి పండితులు గుర్తించినదే. 

          అన్నిటికంటె పరమ ప్రమాణం వేదం. దానిలో ప్రక్షిప్తాలు లేవు. వేరు వేరు పాఠాలు లేవు. ఎక్కడా ఒక అక్షరం పొల్లుపోకుండా, ఎవరూ మార్చటానికి వీలు లేకుండా తిరుగులేని కట్టడితో అనాదిగా కాపాడబడుతూ వస్తున్నది కాబట్టి వేదం విషయంలో సందిగ్ధత లేదు. ఆది మూలం వేదం అని మనువే చెప్పినందున వేదంలో చెప్పినదానికి విరుద్ధంగా మనుస్మృతిలో ఏదైనా చెబితే అది మనువు అభిప్రాయం కాదని నిరాకరించవచ్చు.  ఒకవేళ వేదం వారించకపోయినా, ధర్మశాస్త్రంలో నిషేధం లేకపోయినా, శిష్టాచారానికి వ్యతిరేకం కాకపోయినా .. అవన్నీ తెలిసి వాటిమీద పరిపూర్ణ గౌరవం ఉండికూడా ఏదైనా విషయం తన అంతరాత్మ అంగీకరించలేకపోతే మనసుని చంపుకుని దానిని పాటించాల్సిన పని లేదని మనువే మినహాయింపు ఇచ్చాడు. అన్యమతాలకు చెందిన ఏ ధర్మశాస్త్రమూ మానవులకు అనుమతించని వెసులుబాటు ఇది.

          అస్పృశ్యత అనేది భారతదేశంలో క్రమేణ అంతరించి పోతున్నది.ఏనాడు అది ప్రభవించి వృద్ధిని పొందిందో ఆనాటి ఆర్ధికపునాది ఈనాడు ధ్వంసమై పోయింది గనక మళ్ళీ ఉధృతమయ్యే ప్రసక్తి లేదు.హిందువులు తమకు ప్రమాణమైన వేదం చెప్పని అస్పృశ్యతను తమ మనసుల నుంచి మనుషుల మధ్యనుంచి సమూలం పెరికివేయాలి.హిందువులు వైదిక ధర్మం నుంచి దూరం కావడం చేతనే స్వదేశంలో దుస్సహమైన పరాధీనతనీ పరదేశాల్లో దుర్భరమైన ద్వితీయ స్థానాన్నీ అనుభవిస్తున్నారనేది చరిత్ర కళ్ళముందు దివిటీలు కట్టి చూపిస్తున్నది గనక హిందువులు తిరిగి వైదిక ధర్మంలోకి నదవటంవల్లనే నారాయణ ప్రణయినీ నయనాంబువాహపు తాకిడికి దుష్కర్మఘర్మం మరోసారి తగలనంత చిరాయు దూరం వరకు తొలగిపోయి ఆనందకందమనిమేషమనంగతంత్రం సిద్ధిస్తుందనేది వ్యాసపరాశరాదిషిర్డీసాయినాధపర్యంతం ఉన్న నా గురుపరంపర పాదాల మీద ప్రమాణం చేసి చెబుతున్న శాశ్వత సత్యం!ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!


సత్యం శివం సుందరం!!!

Tuesday, 6 November 2018

వేదాలు అపౌరుషేయం అనడం హేతుబద్ధమేనా?వేదాన్ని హిందూఋషులకి చెప్పినట్టే బైబిలుని కిరస్తానీయులకీ ఖురానును మహమ్మదీయులకీ ఇచ్చి ఉండవచ్చు కదా - అవి కూడా దైవగ్రంధాలే అనుకోకూడదా!

          హిందువుల పవిత్రగ్రంధమైన వేదాన్ని అపౌరుషేయం అంటారు.అపౌరుషేయం అంటే మనుషులు సృష్టించినది కాదు అని అర్ధం. - దాదాపు ప్రపంచంలోని అన్ని మతాలూ తమ మతానికి ఆధారమైన మూలగ్రంధాన్ని దేవుడు తమకు ఇచ్చిన పవిత్రగ్రంధం అంటున్నాయి - మరి,వేదం ప్రత్యేకత ఏమిటి?

          మొదట ఇతర గ్రంధాల చరిత్రని చూసి తర్వాత వేదం గురించి తెలుసుకుంటే వేదం యొక్క ప్రత్యేకత అర్ధం అవుతుంది. ప్రస్తుతం హిందూమతం కాక ప్రపంచంలో ఎక్కువమందికి తెలిసినవి - జుదాయిజం, క్రైస్తవం, ఇస్లాం, బౌద్ధం.వీటిలో ఆ మతం యొక్క మొత్తం అనుష్ఠానం ఆ మతాన్ని స్థాపించిన ఒకే ఒక వ్యక్తి ముఖతః వచ్చినవి.బుద్ధుడు ఆ మతాన్ని స్థాపించకముందు వైదిక ధార్మిక సాహిత్యంలో మంచి పాండిత్యం ఉన్నవాడు. దేవుణ్ణి గురించి చెప్పకుండా పూర్తి లౌకిక మరియు భౌతిక విషయాల ప్రాతిపదికన ధర్మచక్రప్రవర్తన పేరుతో ఒక భిక్షు సంఘాన్ని నిర్మించాడు గనక బౌద్ధులకి దేవుడు ఇచ్చిన గ్రంధం అంటూ ఏదీ లేదు.జుదాయిజం మూలపురుషుడైన అబ్రహాం తోరాని నిర్మించబోయేనాటికి చక్కని సంస్కారం ఉన్న నాగరికుడి వలెనూ ఆధ్యాత్మిక విషయాల్లో పండితుడి వలెనూ కనబడతాడు - తాను జిజ్ఞాస కొద్దీ దేవుణ్ణి కొన్ని ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టుకున్నానని ప్రకటించాడు, తోరా నిర్మాణం కూడా ఒక శిష్యుడికీ అతని గురువుకీ మధ్యన జరిగిన ప్రశ్నోత్తరావళి మాదిరి ఉంటుంది.

          క్రైస్తవుల పాత నిబంధన అబ్రహాము యొక్క తోరాకు అసలుకీ నకిలీకి మధ్య తేడా తెలియనివ్వని రూపమార్పిడితో అలరారుతూ ఉంటుంది!ఇక సారం తెలిసినవారు మహమ్మదీయుల ఖురానును అరబిక్ భాషలోకి తర్జుమా చెయ్యబడిన తోరాకు జిహాదిక్ హింసని కలిపిన పొడిగింపు అని అంటారు.ఆ జిహాదిక్ హింసని ప్రేరేపించే కొత్త చేర్పిడి భాగాల్ని తీసెయ్యడానికి మహమ్మదీయులు పొరపాటున కూడా ఒప్పుకోరు - అది తీసేస్తే తమ మతం జుదాయిస్టు మతానికి నకలు అయిపోతుందని వారికీ తెలుసు.పోనీ జుదాయిజమునే అనుసరించవచ్చు గదా అంటే ఇప్పుడు తమకు దఖలు పడుతున్న ద్రవ్యాకర్షణ తగ్గుతుందని భయం!

          ఇంతకీ ఇవి పుట్టిన తేదీలు ఇటీవలివి గనక ఎప్పుడు పుట్టిందో తెలియని సనాతన ధర్మాన్ని పాటించే మన ముందు నిలబడి తమ మతాన్ని సృష్టించినవారు మనం పూజిస్తున్న రాముడూ కృష్ణుడూ వంటి ఉన్నారో లేరో తెలియని కల్పితవ్యక్తులు కాక వాస్తవ వ్యక్తులు గాబట్టిన్నీ తమ మతగ్రంధాలు వారి అనుభవసారం గాబట్టిన్నీ వాటిలో రక్తమాంసాలు గల వ్యక్తులకు పనికొచ్చే ఆదర్శప్రాయమైన సంగతులు వున్నాయని గొప్పలు చెప్పుకునే ఆ రెండు మతాల ప్రచారకుల గొంతులో పచ్చి వెలక్కాయ పడేటట్టు విశ్వసనీయమైన ఆధారాలను వెదికి చూస్తే జీసస్సూ మహమ్మదూ అనే ఈ  ఇద్దరూ కల్పితవ్యక్తులు అనిపిస్తారు.జీసస్ గురించి ఇటీవలి పోష్టుల్లో చెప్పాను కదా,మహమ్మద్ విషయం కూడా అంతే!ఈ ప్రవక్తల చారిత్రకతని చూడాలంటే వారి మతగ్రంధాలకి బయట ఇతరుల సాహితీరూపాల్లోనూ తిరుగు లేని ఆధారాలైన శిలాశాసనాల్లోనూ చూడాలి.అలా చూస్తే మహమ్మద్ యొక్క చారిత్రకతని రుజువు చేసే సాక్ష్యాలు కూడా చాలా తక్కువ!అయితే జీసస్ కన్న ఇతను అదృష్టవంతుడు - బలహీనమైన సాక్ష్యాలే అయినా సంఖ్యలో కొంచెం ఎక్కువ ఉన్నాయి.వాటిలో కూడా ఎక్కువ భారతీయుల పుణ్యమే!సింధ్ ప్రాంతానికి చెందిన ఒక హిందూ రాజు మహమ్మదుకి వూరగాయల జాడీని కానుకగా పంపించడం ఒకటి చెప్పుకోదగిన సాక్ష్యం,సరిగ్గా మహమ్మదు కూలగొట్టేనాటికి మక్కా తీర్ధయాత్రకి బయల్దేరిన ఒక కేరళ ప్రాంతపు హిందూ రాజు విషయమే కూలగొట్టక మునుపు అది శివాలయం అనడానికి సాక్ష్యం.ఇలాంటి బలహీనమైన సాక్ష్యాలు తప్ప అతను ఎక్కడ పుట్టాడని చెబుతున్నారో ఆ ప్రాంతపు చరిత్రలో అతని ఉనికిని నిర్ధారించే సాక్ష్యాలు లేవు.అదీ గాక తమది కాపీ మతం కాబట్టి కాపీ కొట్టిన ఆనవాళ్లు తెలియకుండా ఉందేటందుకు వాళ్ళే పూనుకుని ధ్వంసం చేసిన చరిత్రలో వీరి ప్రవక్తకి సంబంధించిన ఆధారాలు కూడా నాశనమై వుంటాయి.అసలు భౌతిక అస్తిత్వమే తెలియని పరిస్థితిలో వాళ్లు ఏమి చదువుకుని ఎంత పాండిత్యం సంపాదించి ఇంత గంభీరమైన జ్ఞానసంపద వెల్లివిరిసే పుస్తకాల్ని రచించగలిగారో ఎట్లా తెలుస్తుంది!

          పేరుకి గొప్ప కుటుంబం, డబ్బున్న సాములని తప్పిస్తే ఇద్దర్లో ఎవరికీ చదువు లేదు, పాండిత్యం  లేదు, గురుశుశ్రూష చేసి జ్ఞానం ఆర్జించిన దాఖలాలు లేవు.అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి తను చెప్పదల్చుకునది ప్రజలకి  చెప్పటానికి ఈ అనామక గొర్రెల కాపరీ ఈ నిశానీ బానిసల వ్యాపారీ తప్ప ఇంకెవరూ దొరకలేదా ఆయా మానవ సమూహాల్లో?అసలు దయనీయమైన విషయం, దేవుడు తమ ప్రవక్తలకి చెప్పిన పరమ సత్యాలతో కూడిన దైవగ్రంధాలు అని చెప్పబడుతున్న బైబిలు,ఖురాను ఎంత అసభ్యకరమైన విషయాలతో నిండి వున్నాయంటే కొన్ని దేశాలలో ముఖ్యంగా టూరిస్టుల ఎద్దడి ఉండే నగరాలలో వీటిని బహిరంగ వేదికల మీద చదవటాన్ని నిషేధిస్తున్నారు - మరి,ఇంత అసభ్యతని తీసుకెళ్ళి దేవుడికి అంటగడుతున్నట్టు లేదూ వారి నిర్వాకం!

          అయితే, హిందువులకు పరమ ప్రమాణమైన వేదం ద్యోతకం కాబోయే ముందు వైదిక ఋషులు వీళ్ళ ప్రవక్తల వలె నిశానీలు కాదు,అప్పటికే గురుశుశ్రూష ద్వారా తగినంత జ్ఞానం సంపాదించి తమకు అర్ధం కాని ఒక విషయం గురించి తపస్సు చేస్తున్నవాళ్ళు!"For every meditation there must be a target" అనేది ఇవ్వాళ రోజువారీ ప్రశాంతత కోసం చేసే మామూలు మెడిటేషన్ ప్రక్రియకి ముఖ్యమైన సూత్రం - అట్లాంటిది ఏ లక్ష్యమూ లేకుండా తపస్సు మొదలుపెట్టరు కదా!మరి, అంత శ్రమపడి కనుక్కున్న దాన్ని కూడా "ఇది నా గొప్పే!ఇది నా గొప్పే!నాకు తప్ప ఇంకెవరికీ తెలిసేది కాదోచ్!" అని గొప్పలు చెప్పుకోకుండా "అయ్యా!ఇది నా గొప్ప ఎంత మాత్రం కాదు,ఆ దేవుడే నాకు చెప్పాడు.నేను నిమిత్తమాత్రుణ్ణి" అని ఎందుకు వినయం చూపించారు?

          ఆ సత్యం ద్యోతకం కాబోయే ఒక నిముషం ముందు కూడా మరు నిముషం తమకు ఆ సత్యం ద్యోతకం కాబోతున్నదని  వారికే తెలియని విషయం ఆ పద్ధతిలో సత్యాల్ని దర్శించిన వైదిక ఋషులందరికీ అనుభవైకవేద్యమే గనుక అలా గొప్పలు చెప్పుకుంటే పరిహాసపాత్రులు కావడం తప్ప ప్రయోజనం ఉండదు!"ఆ మతాల ప్రవక్తలకి సాధ్యం కానిది ఈ వైదిక ఋషులకి ఎట్లా సాధ్యపడింది?తమ శ్రమతో సాధించిన దాన్ని కూడా ఉన్నాడో లేడో తెలియని దేవుడికి అంటగట్టటం అబద్ధం చెప్పడం కాదా?కొందరికి మాత్రమే ఇట్లాంటివి సాధ్యం కావడం మనుషుల్లో అసమానతలని పెంపొందిస్తుంది కదా!వీటిలో హేతుబద్ధత లేదు.ఇవన్నీ సుర అనగా కల్లు తాగి వాగిన లొల్లాయి పాటలు మాత్రమే." అనేవాళ్ళకి ఒక నమస్కారం పెట్టి వూరుకోవడం తప్ప మనం వాళ్ళ చేత వేదాలు గొప్పవి అని ఒప్పించడం అసాధ్యం!

          వాస్తవం చెప్పాలంటే ప్రస్తుతం అన్నింటినీ పరిశోధించడానికీ సర్టిఫికెట్లు ఇవ్వడానికీ పనికొచ్చే ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా వైదిక ఋషులకి సత్యం ద్యోతకమైన పద్ధతిలోనే ఎదిగింది, ఎదుగుతున్నది, ఎదుగుతుంది కూడాను.చిన్న చిన్న ఉదాహరణలు చెప్తే సంశయాస్పదులకి ఎక్కదు గనక కొంచెం పెద్ద సంగతినే చెబుతాను.మన ఆలోచనలూ జ్ఞానమూ కంటికి కనబడవని అంటారు - అది కొంతవరకే నిజం,ఆలోచనలూ జ్ఞానమూ జ్ఞాపకాలూ మెదడులో కొన్ని రసాయనిక చర్యల వల్ల ఉత్పన్నమయే మాలిక్యూల్స్ రూపంలో భద్రపరచబడి ఉంటాయి.ఈ విషయాలని Neuro Physiology స్టడీ చెస్తుంది.ఈ సైన్సు యొక్క ఎదుగుదలలో Otto Loewi చేసిన రెండు కప్పల ప్రయోగం నిరూపించిన సత్యం అత్యంత ముఖ్యమైనది.

          ఇతను చేసిన ప్రయోగం చాలా సంక్లిష్టమైనది - "The experiment consists of a preparation of two frog hearts. The hearts are kept alive and beating in separate beakers containing Ringer’s solution. One of the hearts has the intact vagus nerve connected, which when stimulated is known to slow down the heart. Loewi electrically activated the vagus nerve which slowed down the corresponding heart. He then took some liquid bathing this heart and transferred to the second beaker which contained another heart. The second heart immediately slowed down. The only reasonable explanation to this effect is as follows. When the vagus nerve was activated it released a substance which dissolved in the surrounding liquid. It was this substance that slowed down the first heart. When this liquid was transferred to the second beaker, it slowed the second heart too. Thus the (vagus) nerve acted on the heart not by direct electrical action but by a chemical means."ఇంతకు  ముందు మన చెయ్యి కాలి చుర్రుమనగానే దాన్ని గ్రహించిన మొదటి నాడీ కణం దాని వెనకాల ఉన్న రెండవ నాడీ కణానికి దాన్ని ఎలా అందిస్తుందో తెలిసేది కాదు - ఎందుకంటే, నాడీకణాల మధ్యన ద్రవంతో నిండిన ఖాళీ స్థలం ఉంటుంది!ఇతని ప్రయోగం మొదటి నాడీ కణం ఒక పదార్ధాన్ని ఈ ద్రవంలోకి వదిల్తే  రెండవ నాడీ కణం ఆ ద్రవంలో వ్యాపించిన ఈ పదార్ధం తనకి తగిలినప్పుడు దానికి తగ్గట్టు స్పందిస్తుంఫనే విషయాన్ని రుజువు చేసింది.అయితే అతను ఈ ప్రయోగాన్ని రూపొందించిన విధానం చాలా చిత్రమైనది - తనకు కలలో కనిపించిన దృశ్యాన్ని నిద్ర లేవగానే మొదట ఒక కాగితం మీద రాసుకుని దాన్ని యధాతధం చేసేశాడు!

          మొత్తం కధనం అతని మాటల్లోనే తెలుసుకుంటే మరొక చిత్రమైన విషయం బోధపడుతుంది - "The night before Easter Sunday of [1920] I awoke, turned on the light and jotted down a few notes on a tiny slip of thin paper. Then I fell asleep again. It occurred to me at 6.00 o’clock in the morning that during the night I had written down something important, but I was unable to decipher the scrawl. The next night, at 3.00 o’clock, the idea returned. It was the design of an experiment to determine whether or not the hypothesis of chemical transmission that I had uttered 17 years ago was correct. I got up immediately, went to the laboratory, and performed a simple experiment on a frog heart according to the nocturnal design."చూశారా!Chance indeed favored the prepared mind, with Luck playing her mystical part.జాగ్రదవస్థకీ సుషుప్తికీ తేడా తెలియకుండా అతను శ్రమిస్తున్నాడనేది వాస్తవం,అయినా అతనికి సత్యం గోచరించింది మాత్రం సుషుప్తిలోనే - ఆ ప్రాచీన కాలపు వైదిక ఋషీ ఈ ఆధునిక కాలపు విజ్ఞానీ సత్యాన్ని ఒకలాగే దర్శించారు.అందుకే చాలా ఆధునిక విజ్ఞాన శాస్త్ర పరిశోధనలు వైదిక ఋషుల ఆవిష్కరణల్ని యదార్ధం అని నిరూపిస్తున్నాయి.

          నాలుగు వేల సంవత్సరాల వెనకటిదిగా చెబుతున్న అగస్త్య సంహిత అనే వైదిక విజ్ఞాన గ్రంధంలో విద్యుచ్చక్తిని ఉపయోగించి యంత్రాలను నడిపే విధానం ఉన్నది.ప్రస్తుతం వోల్టా తయారు చేసిన బ్యాటరీ వర్ణనని మర్చిపోయి అగస్త్య సంహితను అనుసరించి మట్టి పాత్రలతో ఘటమాలను ఏర్పరచి విద్యుద్దీపాలను వెలిగించగలిగారు, యంత్రాలను నడిపించ గలిగారు!మన ప్రాచీనులు కట్టిన ఆలయాలు అంత ఎక్కువ శిల్పకళతో కూడి ఉన్నప్పటికీ అంత తక్కువ కాలంలో ఎలా కట్టారో అని చరిత్రకారులూ పరిశోధకులూ వారు ఆశ్చర్యపడి మనల్ని కూడా ఆశ్చర్యపరచటానికి  కారణం మన ప్రాచీనులు విద్యుచ్చక్తిని ఉపయోగించి రాత్రులలో కూడా పని చేశారనీ యంత్రాలను ఉపయోగించారనీ వూహించలేకపోవటమూ నమ్మలేకపోవటమే!ఒకే మహాశిలని నిలువుగా తొలుచుకుంటూ పోయిన కైలాసనాధ దేవాలయ నిర్మాణంలో ఒక విచిత్రం ఉంది.సూర్యకాంతిని అద్దాల ద్వారా గానీ మరే విధంగా గానీ ఉపయోగించుకోలేని చోట్ల కూడా అత్యంత సూక్ష్మమైన వివరాలను ఎట్లా చెక్కగలిగారు?అంత స్థాయిలో పని చెయ్యడానికి అవసరమైన వెలుతురు కోసం కాగడాల్ని వాడితే ఏదో ఒక స్థాయిలో పైకప్పు మసితో పొగచూరిపోవడం ఖాయం - మసితో గోడలూ పైకప్పూ పొగచూరని వెలుతురు విద్యుద్దీపాలు లేకుండా అసాధ్యం!

          అగస్త్యుడనే ఒక వ్యక్తి తను ఆర్జించిన విజ్ఞానంతో తయారు చేసిన దాన్ని వేదానికి ఎట్లా అంటగట్టాలి అనే ప్రశ్న అర్ధం లేనిది - అసలు వేదమే మతగ్రంధం కాదు, విజ్ఞాన శాస్త్రం!మానవుడు భౌతిక ప్రపంచంలో సుఖజీవనం సాగించడానికి అవసరమైన విషయాలే వేదం అంటే ఎవరూ నమ్మలేరు, కానీ అదే నిజం!ఈ లెక్కన హిందువులకి మతగ్రంధం అనేది లేనే లేదు,ఇంక మతం అంటే గ్రంధం ఉండి తీరాల్సిందే అంటున్న వారితో దీన్ని మతం అని ఒప్పించడమే కష్టం, వాళ్ళ మతం కన్న గొప్ప మతం అని ఒప్పించడం మరీ కష్టం!

          అయితే హిందువులు అందుకు ఎంతమాత్రం సిగ్గుపడాల్సిన పని లేదు.యూరుల తోరా యూదుల్ని మాత్రమే తరింపజేస్తుంది,క్రైస్తవుల బైబిల్ క్రైస్తవుల్ని మాత్రమే తరింపజేస్తుంది,ముస్లిముల ఖురాన్ ముస్లిముల్ని మాత్రమే తరింపజేస్తుంది - కానీ వేదం సకల మానవాళినీ తరంపజేస్తుందనేది వ్యాసపరాశరాదిషిర్డీసాయినాధపర్యంతం ఉన్న నా గురుపరంపర పాదాల మీద ప్రమాణం చేసి చెబుతున్న గంభీరమైన సత్యం!ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!


సత్యం శివం సుందరం!!!