Wednesday, 15 February 2017

యుద్ధాల సంగతి సరే, శాతవాహనుల కాలంలో సమాజం ఎట్లా ఉండేది?

     తొలి శాతవాహనుల్లో శ్రీముఖ శాతకర్ణి రాజ్యాన్ని స్థాపించి నిలబెట్టినా 1వ శాతకర్ణి మహా బలంతో పరాక్రమించి ప్రస్తుతం మనం చూస్తున్న భారతదేశంలోని అన్నివైపులకీ వ్యాపించి "దక్షిణాపధపతి" అనే బిరుదు సంపాదించాడు.ఉత్తరం వైపున ఖారవేలుణ్ణి కూడా జయించి మగధ వరకూ వ్యాపించాడు!తూర్పున నర్మద వరకూ వ్యాపించి శకుల నుంచీ గ్రీకుల నుంచీ జరుగుతున్న దండయాత్రల్ని నిరోధించి దేశాన్ని సుస్థిరంగా నిలబెట్టాడు.రెండు అశ్వమేధాలూ ఒక రాజసూయం చేసిన ఘనుడు!

    మలి శాతవాహనుల్లో తన పూర్వీకులు పోగొట్టుకున్న భూభాగాల్ని శకుల నించి మళ్ళీ సాధించి నిలబెట్టిన క్రీ.శ 1వ శతాబ్ది నాటి గౌతమీపుత్ర శాతకర్ణి ప్రముఖుడు.బౌధ్ధులకి చెప్పుకోదగిన రీతిలో దానాలు చేసి మతాతీతంగా వ్యవహరించాడు.బ్రాహ్మణుడు కావటం వల్ల "యేక బ్రాహ్మణ" అనే బిరుదును సాధించాడు!

    రాజు దైవాంశసంభూతుడనే మూఢనమ్మకాలు లేకుండా ధర్మశాస్త్రాల కనుగుణంగా కడుచక్కని పరిపాలన సాగించారు అందరు శాతవాహన ప్రభువులు.రాజుకు సలహాలు ఇవ్వడానికి మంత్రిమండలి అనే ఒక సలహాదారుల బృందం ఉండేది,రాజ్యం పెద్దది కావడంతో భాగాలుగా విభజించి పరిధిని బట్టి ప్రాంతాలకు "రాజ","మహాబోజ","మహారధి" నామాలతో అధిపతుల్ని నియమించారు.సమాజం లోని ప్రజానీకం నాలుగు తరగతులుగా వర్గీకరించబడి ఉంది - పైన చెప్పుకున్న అదిపతులు పైస్థాయిలోని ప్రభు వర్గం,దానికి కింది అంతరువుగా అమాత్యులూ మహామాత్రులూ వంటి ఉద్యోగశ్రేణులూ తమ వ్యాపారకౌశలంతో రాజ్యపు సంపద పెంచే ప్రజ్ఞ వుండి సమాజంలో మంచి పరపతి గల్గిన వణిక్ప్రముఖులూ, మూడవ సామాజిక అంతరువులో ఇప్పటి మధ్యతరగతి కుటుంబాలతో పోల్చదగిన వైద్యులూ కవిగాయక శిఖామణులూ రైతులూ కుమ్మర్లూ కమ్మర్లూ,అన్నిటికన్నా కింది అంతరువుల్లో ప్రధాన వృత్తులకి అనుబంధమైన వృత్తి పనివాళ్ళయిన వడ్రంగులూ జాలర్లూ వంటివాళ్ళు వుండేవాళ్ళు!స్త్రీలు విద్యావంతులు కావడమే కాకుండా యెలాంటి అభ్యంతరమూ యెదుర్కొనకుండా మతసంబంధమైన కార్యక్రమాలకి అధ్యక్షత వహించగలిగేవాళ్ళు, అప్పటికి చిన్నవాళ్లయిన కొడుకుల కోసం రాజ్యాన్ని రక్షించి యుధ్ధాలు చేసి అశ్వమేధాలు చేసిన శౌర్యప్రతాపాలను పుణికి పుచ్చుకున్న గొప్ప రాణులు చాలామంది ఉన్నారు!ప్రభువులే తమ గురించి తాము "గౌతమీపుత్ర","వాసిష్ఠీపుత్ర","కౌశికీపుత్ర" అని చెప్పుకుంటూ తమ తల్లుల పేర్లని గౌరవసూచకంగా భావించారు గదా!

    వ్యవసాయం,వ్యాపారం రెంటినీ సమానంగా సంరక్షించడంతో ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లిన కాలమది!వ్యాపారస్థులకీ అన్ని రకాల వృత్తుల వారికీ ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన సంఘాలు వుండేవని తెలుస్తున్నది - అవి మొత్తం ఆ వర్గానికి చెందినవారి ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉండేవి.ఇక్కడి తీరప్రాంతానికి చెందిన సుపార, కళ్యాణి వంటి ప్రముఖమైన రేవుపట్నాల నుండి  ఈజిప్టు, రోము వంటి దూర దేశాలతో ఖండాంతర వ్యాపారం కూడా జరిగింది. పైఠాన్,నాసిక్ లాంటి మహారాష్ట్ర నగరాలు ఈ కాలంలో ఈ సంపదతో పెరిగినవే!ఆ రకంగా ఈనాడు ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికన్ పౌరుల వలె భౌతికజీవనంలో అత్యున్నత స్థితిని శాతవాహనుల కాలంలోని మన పూర్వీకులు అనుంభవించారు!

   ఇక ఆధ్యాత్మికంగా చూస్తే స్వయంగా బ్రాహ్మణులైనా సర్వధర్మసమభావనతో ఇతర మతాల్ని కూడా ఆదరించారు - దాదాపు వీరి రాజ్యంలోని అందమైన గుహాలయాలన్నీ బౌధ్ధుల విహారాలూ స్థూపాలతో నిండిపోయాయి!అసలైన అధ్భుతమూ సహిష్ణుతకి పరాకాష్ఠగా చెప్పుకోవలసిన విషయం శకులూ గ్రీకులూ కుషానుల వంటి విదేశీయుల్ని కూడా హిందూమతంలోకీ బౌధ్ధమతంలోకీ ఆహ్వానించి కలిపేసుకోవటం ఆనాడే జరిగిందంటే ఇవ్వాళ ఘర్ వాపసీ అనే చిన్న విషయానికే కొందరు శాంతిభద్రతలకి సంబంధించిన సమస్యల్ని కూడా సృష్టిస్తున్నారంటే ఆనాటి మనవాళ్ళని చూసి మనం పొంగిపోకుండా ఉండలేము గదా!

    ఒకప్పుడు ఆకాశవాణి కార్యక్రమాలు ఉదయంలో విన్నవాళ్లకి శాలివాహన శకం పేరుతో సంవత్సరం చెప్పడం గుర్తుండే ఉండాలి - దాని ప్రారంభకులు శాతవాహనులే!ఇవ్వాళ క్రీ.శ అనేది యెందుకు విశ్వవ్యాప్తమైన కాలమానంగా గుర్తించబడుతున్నది?యెక్కడికి వెళ్ళినా తమ సంస్కృతి గొప్పది కావటం వల్లనే తాము గొప్పవాళ్ళమైనామనే అహంకారంతో తమవైన వాటిని అక్కడి స్థానికుల మీద రుద్దెయ్యటం వల్ల జరిగింది!మన ప్రభుత్వం అధికారికంగా ఆకాశవాణిలో వినిపించే ఆ రెండు కాలమానాల్లో శక సంవత్సరం మొత్తం భారతదేశానికి సంబంధించినదయితే శాలివాహన శకం మనం ఉన్న ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినది.మనం కూడా నిజాయితీతో కూడిన వ్యాపారంతో సరిపెట్టుకోకుండా దుర్మార్గంగా వ్యాపించి ఉంటే ఇవ్వాళ ప్రపంచ మంతటా క్రీ.శ బదులుగా శాలివాహన శకం ప్రకారం సంవత్సరాల్ని చెబుతూ ఉండేవాళ్ళేమో!ఇవ్వాళ ప్రపంచం సంగతి దేముడెరుగు మనవాళ్ళకి మన సంస్కృతిని గురించి చెప్పటానికే సందేహించవలసి వస్తున్నది!ప్రాదేశికంగా ఉత్తర దక్షిణ భారతాలను కలుపుతూ ఉన్న భూమిని పరిపాలించటం వల్లనూ, అంతకి ముందర చాలాకాలం నుంచి మౌర్యులకి విధేయులుగా వుండినందువల్లనూ ఆర్యసంస్కృతి దక్షిణానికి విస్తరించటానికీ ఆ రకంగా దేశమంతా సాంస్కృతికంగా యేకత్వాన్ని సాధించటానికీ శాతవాహనులే కారణమైనారు!