Thursday, 19 February 2015

ఈ విభజన నామ సంవత్సరంలో ఒక యవనిక యేదో జారుతున్నట్లనిపిస్తున్నది!

అంతము లేని యీ భువనమంత పురాతన పాంథశాల; వి
      శ్రాంతి గృహంబు; నందు నిరుసంజలు రంగుల వాకిళుల్; ధరా
                                        క్రాంతులు పాదుషాలు బహరామ్ జమిషీడులు వేనవేలుగాఁ
                                        గొంత సుఖించి పోయి రెటకో పెఱవారికిఁ జోటొసంగుచున్!

      ఈ ఒక్క సంవత్సరం లోనే కవులు,కళాకారులు చాలామంది కీర్తిశేషు లయ్యారు?!నిన్ననే డి.రమానాయుడు అస్తమించాడు!సినిమా నిర్మాతల్లో హీరో లాంటివాడు?నిర్మాత పరిశ్రమకి యెంత ముఖ్యమో అందరికీ తెలిసింది రామానాయుడు ద్వారానే.యెన్నో సినిమాలు తీసినా ఒక్క ముక్కలో యెవరీ రామానాయుదు అని చెప్పాలంటే "ప్రేం నగర్ ప్రొడ్యూసరు" అంటేనే అందరికీ తెలుస్తుంది! 

      చిన్న వయస్సు లోనే నిర్మాతగా మారింది కూడా రామానాయుడే అనుకుంటాను.మొదటి సినిమా రాముడు భీముడు -యెత్తుకోవడమే పెద్ద హీరోతో,అదీ దబల్ రోలు?యే కాస్త అటూ ఇటూ అయినా నెత్తికి చెంగూ మొహం మీదే జోకులూ గ్యారెంటీ! అయినా సరే కధ కున్న సత్తాయే యెక్కువ అని తెలిసే ధైర్యం చేశాడోమో!ఆ హీరోనే తన మీద తనకున్న అతి నమ్మకంతో అయిదు వేషాలు వేసినా అట్టరు ఫ్లాపు అయిపోయింది గదా?కేవలం తెలుగులోనే కాదు అన్ని భాషల్లోనూ సినిమాలు తియ్యాలనుకోవడం చూస్తే సినిమా అంటే అతనికి యెంత వదలని పిచ్చి?!

      అంటే అన్నానంటారు గానీ అసలు విషయం వొదిలేసి కొసరు విషయం యెత్తుకున్నానని కొందరు విసుక్కుంటారేమో గానీ ఈ మధ్యన వరసగా పోతున్న వాళ్ళ చావులు మొదలయిన తొలినాళ్ళ నుంచీ ఒక ముక్క లోపల్లోపలే తన్నుకుంటున్నది!వీళ్ళంతా రాష్ట్రం ఒక్కటిగా వున్నప్పుడు 23 జిల్లాల వాళ్ళని సమానంగా పలకరించిన వాళ్ళు!!ఒక పదేళ్ళ తర్వాత వెనక్కి చూసుకుని రెండు రకాల జీవితాల్నీ పోల్చుకుని యేడ్చే ఖర్మ నుంచి తప్పుకుని పోతున్నారు?ఒకరకంగా చూస్తే వాళ్ళు అదృష్తవంతులు!కాలపురుషుడు గజ్జె కదిలించి ఆడే చిరనర్తనంలో ఈ గజ్జె సవ్వడి వెనక కవ్వడి చెప్తున్న ముచ్చట యేమిటో తెలుసా?!


      యాభయ్యేళ్ళ వటవృక్షం కూలిపోయింది?పక్షులన్నీ చెల్లా చెదరవ్వాల్సి వుంది!కూలిన అదురుకి గాలికెగెరిన వాటికి తిరిగి వాలడానికి చెట్టు కూడా లేక గాల్లోనే గిరికీలు కొడుతున్నాయి కొన్ని పక్షులు?యాభయ్యేళ్ళలో అంతో ఇంతో యెదిగి కొంచెం తలెత్తి చూస్తే 23 జిల్లాలకీ కలిపి లక్ష కోట్ల బడ్జెట్టుతో ధీమాగా వుండి దక్షిణాదిలో రాజకీయంగా సాంస్కృతికంగా పెద్ద రాష్ట్రంగా వున్నాము అని సొంతోషపడుతున్న సమయంలో పాలకుండ భళ్ళున పగిలింది?!పాలన్నీ ఇంకిపోయాయి.ఒక్కటిగా వుండి యెంతో కొంత యెదిగిన ధీమా అంతా యేమయింది?ఇప్పుడు విడిపోయాక రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ముష్టి కబుర్లు చెప్తున్నారెందుకు?తెలంగాణా ముఖ్యమంత్రి ప్రభుత్వ భూముల అమ్మకానికి దిగాడు!నాలుగు చోట్ల వున్న ఆఫీసు లన్నిట్నీ ఒక చోటికి చేర్చి మిగతా మూడిట్నీ అమ్మాలట?10 జిల్లాలకే లక్ష కోట్ల బడ్జెట్ వేశాడు?యెంత గట్టిగా లెక్కేసినా ఆదాయం 6000 కోట్లు మించేలా లేదు-ట! మిగతా కొరతంతా భూములమ్మడంతోనే పూడుతుందా?సంక్షేమ పధకాలే రెండు వందలు-ట?ఒక్కోదానికీ హీనపక్షం ఒక కోటి వేసుకున్నా 200 కోట్లు ఆదాయం లేని ఖర్చు.కులానికి పది కోట్లకి తక్కువ కాకుండా అడిగిన వాడిది పాపం అన్నట్టు కేటాయించేస్తున్నాడు.డప్పులు మోగించుకోవటానికీ రికార్డింగు డ్యాన్సులకీ తప్ప యెందుకు పనికొస్తాయనే ఇంగిత జ్ఞానం కూడా లేదు?!


      ఇటు చూస్తే చెన్నై నుంచి వలస వచ్చిన నాటి దృశ్యం మళ్ళీ కనబడుతున్నది!రాజధాని లేదు.ఆర్భాటంగా మొదలు పెట్టిన రాజధాని యెప్పటికి పూర్తవుతుందో తెలీదు?ముఖ్యమంత్రి నన్ను చూడండి,నా సమర్ధతని చూడండి ఇక్కడ పెట్టుబడులు పెట్టండి అని దేశాలు పట్టి అడుక్కుంటున్నాడు?తిరుగుడు ఖర్చులన్నా గిట్టుబాటవుతాయో లేదో?అటు చూస్తే నిజాము కట్టిన భవంతులు తప్ప మొత్తం కూలగొట్టి కట్టే వూపు కనబడుతున్నది!మొత్తం మీద తెలుగువాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళి మొదటిసారి కలవక ముందరి కాలాన్ని మళ్ళీ చూడబోతున్నారు ఈ తరం వాళ్ళు?!సరిగా ఇదే రకం సన్నివేశం మహాభారతంలో నడిచింది! సత్యవతీ మాతతో వేదవ్యాసుడు "అమ్మా!ఇప్పటి కేమి చూశావో చూశావు. గతకాలమె మేలు వచ్చు కాలం కంటె. ఇప్పుడు చూసిన వాటికే ఇలా అయిపోయావు.ముందు ముందు జరిగేవి ఇంకా భయంకరంగా వుండవచ్చు" అని ఆవిణ్ణి ప్రయాణానికి సిధ్ధం చేశాడు!


      కాలపురుషుడు బల్ల మీద వున్న పాత పావుల్ని మొత్తం తుడిచేస్తున్నాడు!కొత్త పావుల్ని సిధ్ధం చేస్తున్నాడు?కొత్త రాష్ట్రం,కొత్త రాజధాని,కొత్త తరం,కోటి ఆశలు అంతా కొత్తగా వుంది కానీ - అదిరిందయ్యా చంద్రం అని మాత్రం అనుకోలేకుండా వున్నాం?ద్వేషబీజాలు నాటడం చాలా తేలిక!విత్తనం లా చూస్తే అవి కూడా అన్ని విత్తనాల లాగానే అమాయకంగానే వుంటాయి!కానీ అవి మొలిచి పెరిగి పెద్దయి అసలు ఫలితం యేమిటో చూపించాక అందుకు కారకు లయినవాళ్ళు మాత్రం సొంతానికి దక్కించుకోవలసింది దక్కించుకుని తప్పుకుంటారు.అప్పటికి బల్లమీద మిగిలిన పావులు వాటి ఆట అవి ఆడాక తప్పదు గదా,కష్టమయినా నష్టమయినా?!



ఇల చదరంగ; మందు జనులెల్లరు పాపు; లహస్సులున నిశల్
   దెలుపును నల్పుగళ్ళు; కదలించును రాజును బంటుఁ దక్కు పా
  వుల విధియాటకాఁడు; పలుపోకలఁ ద్రిప్పును గళ్ళు మార్చు, న
                                    వ్వల నొకటొక్కటిం జదిపివైచు నగాధ సమాధి పేటికన

4 comments:

  1. చాలా డిప్రెస్సింగ్ వాస్తవాలు. బాగా ప్రెజెంట్ చేశారు మీరు.
    కాలం గురించి అన్ని వేల సంవత్సరాల క్రితమే వూరికే అనలేదుగా మహానుభావుడు వేదవ్యాసులవారు.

    ReplyDelete
  2. హరి గారూ ,

    చక్కటి టపా . అన్నీ ఖనిజాల్లాంటి నిజాలే . అంటే విలువైనవనే .

    ReplyDelete
  3. Great....inka cheppalsinavi chaalaa vunna chaala chala baaga cheppaaru.
    teluggodu pattedevarikee ...ayina antha swayamkrutham kadaa.

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...