Sunday, 25 December 2016

హర హర గంగే!హరిత సస్య తరంగ నూపుర మంగే!

ప:హర హర గంగే!హరిత సస్య తరంగ నూపుర మంగే!

చ:
సప్తస్వర తరంగ ప్రకంపిత నాదఝరీ ప్రకటిత సంగీత గంగే!
హస్తముద్రాత్మకః ఆంగికం యస్య భువన పాద నర్తన గంగే!
ఆర్యజన మేధో జనిత సంఖ్యసంజ్నాత్మక గణితశాస్త్ర గంగే!
త్రికోణచతురస్రవలయసర్పిల రూపరేఖా చిత్రకళాత్మ గంగే!    ||హర హర గంగే||

చ:
సౌందర్య గంగే!మాధుర్య గంగే!సాహిత్య గంగే!
విజ్ఞాన గంగే!కళావినోద గంగే!రసానంద గంగే!
లాస్య గంగే!హాస్య గంగే!సాశ్రు గంగే!జీవగంగే!
భువన త్రయ సంసేవిత సకల కళాత్మక గంగే!                       ||హర హర గంగే||

చ:
గోదావరీచ నర్మదేచ నీలకావేరీచ
యమునేచ సరస్వతీచ సగంగే!
కృష్ణేచ తుంగభద్రేచ ప్రాణహితేచ
సకల నదీనద జలాత్మక గంగే!                                          ||హర హర గంగే||

చ:
సగరపుత్ర పాపహంత భగీరధ గంగే!
సకలజన పాపహంత గౌతమ గంగే!
సాధుహృదయపుత్రి జాహ్నవగంగే!
దివిజ గంగే!భువిజ గంగే!శుభాంగే!                                    ||హర హర గంగే||

చ:
సమతా గంగే!మమతా గంగే!జయతా గంగే!
స్వస్థద గంగే!వర్షవృష్టిద గంగే!వృద్ధిద గంగే!
నమో విష్ణు పాదోద్భవ గంగే!అఖిలం గంగే!
నమో శంకర శిరఃస్థితాం గంగే!నిఖిలం గంగే!                        ||హర హర గంగే||

Friday, 23 December 2016

అందరు మొగుళ్ళూ భీమవరమెళ్ళి బిందెలు దెస్తేనూ నా మొగుడూ కాకినాడెళ్ళి కుండలు దెచ్చాడే!"

     కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడంటారు,పోయే కాలానికి తగ్గట్టు కాంగ్రెసుకి రాహుల్ బుజ్జాయి దొరికాడు - నీ సోకు మాడ!ఏం తెలివి?ఏం తెలివి?మొగుడు కొట్టినందుకు కాదు తోడికోదలు నవ్వినందుకు ఏడుస్తున్నానన్న అమ్మల్ల్లక్కల పాటి పౌరుషం కూడా లేదే - ఖరమ!

     "నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు?" అని కూడా అనేశాడు."మీరు మనసారగా నేడ్వనీరు నన్ను!" అని ఇదివరకే అనేసినట్టున్నాడు."లేవు నాకుగాదులు,లేవు నాకు ఉషస్సులు!కలవు నాకు కన్నీటి ముత్యాల సరాల దొంతరలు!!" అని సరిపెట్టుకునే కాలం తొందర్లోనే ఉన్నట్టుంది.వరస చూస్తుంటే కాంగ్రెసురహితభారతం రాహులు బాబు మూలంగానే వచ్చేట్టుంది:-)

     ఒఖానొఖప్పుడు హఠాత్తుగా ప్రజాసేవకు సెలవుచీటీ ఇచ్చి బాఘా ఏడ్చి మొహం కడుక్కుని  వచ్చాడని తెలియడంతో కాంగ్రెసు పార్టీ లోపల ఉన్న వారికీ బయటుండి కాంగ్రెసు పార్టీని అభిమానించే వారికీ సరికొత్త ఆశలు మోసులు వారాయి,వాడిన పూలు వికసించినట్టు మాడిన మొహాలు తేటబారాయి - యువనేత కొత్తరక్తం పుంజుకుని కొత్తతెలివితో మోదీని ఇరగదీస్తాడని!షెర్లాక్ హోమ్స్ కధలు చదివి అపరాధ పరిశోధనలో ఆరితేరి భూకంపాలు పుట్టించాల్సింది పోయి చంపక్ కధలు చదివి ఒళ్ళు మర్చిపోయి వయసు తగ్గిపోయి బుద్ధి మట్టమైపోయి పాత సూట్ కేసుల పిట్టకధలు ఎత్తుకుంటున్నాడు.కొండనాలిక్కి మందేస్తే ఉన్న నాలిక వూడినట్టు తయారయింది పరిస్థితి - కక్కలేకా మింగలేకా కాంగ్రెసోళ్ళు కుడితిలో పడ్ద ఎలుకల్లా అల్లల్లాడిపోతున్నారు:-(

     తోటకూర నాడే చెప్పకపోతివి గదే అని తల్లి దవడ పగలగొట్టిన దొంగకొడుకు పాటి కూడా బుర్రలు పనిచెయ్యని సన్నాసులకి ఈ పోటుగాడు మేధావి అనిపిస్తాడు, ఆ లెక్కన ఈయన పార్టీ పవరులోకి రావాలంటే జనాలంతా అట్టనే ఉండిపోవాల ఈయనా,దిగంబరం,మనమోహనూ బయటపెట్టిన ఇండియా పోరి పోగ్రెస్ రిపోర్టు ప్రకారం - కొంపదీసి దేసమంతా ఇంకా అట్టాంటి సన్నాసులే ఉండారా నాయ్నా?

     అయ్యా!పేరుకే దుర్యోధనుడు నేను కర్ణుణ్ణి చూసుకుని యుద్ధానికి దిగుతున్నానని అన్నాడు గానీ మొత్తం 18 రోజుల్లో 10 రోజులు భీష్ముడూ మిగతా 8 రోజుల్ని ద్రోణుడూ,శల్యుడూ,కర్ణుడూ పంచుకున్నాక తసమదీయులైన కౌరవసేన విషయం వదిలేస్తే అస్మదీయులైన పాండవుల వైపున ఆ అయిదుగురూ వాళ్ళ పిల్లలూ తప్ప ఇంకెవరూ మిగల్లేదు - ముసలాళ్ళ అనుభవం ముందు కుర్రాళ్ళ హడావిడి ఆంజనేయుడి ముందు వేసిన కుప్పిగంతులు!తన పరాక్రమంతో ఒక్కొక్క గెలుపుకీ ఒక్కొక్క పేరు చొప్పున పదిపేర్లు తెచ్చుకున్న అర్జునుడు కూడా సిగ్గు పడకుండా శిఖండిని ముందు పెట్టుకుంటే గానీ పని జరగలేదు - అట్టాంటిది ఈ బుజ్జాయి ఆ గడుగ్గాయిని గెలుస్తాడా - హవ్వ!ఈ శిఖండిని ముందు పెట్టుకుని కాంగ్రెసుని గెలిపించగలిగిన అర్జునుడు ఎవడు?

     బాలానాం రోదనం బలం అంటారు,అందుకే గాబోలు గొప్ప సమయస్పూర్తితో ఏడుపు కార్యక్రమం పెట్టుకున్నాడు.ఆంధ్రాలో ఒక బుగ్గల రుద్దుడు ఓదార్పులు చేసిన అనుభవజ్ఞుడు ఉన్నాడు - అతని దగ్గిర ప్రైవేటు చెప్పించుకుంటే బాగుంటుంది.ఒకవేళ ప్రైవేటుకి వెళ్లాలంటే శుక్రవారం మాత్రం వెళ్ళకూడదు - ఆంధ్రాగన్ శుక్రవారం చాలా బిజీ!పాటకి నేనూ ఆటకి మా అప్పా అన్నట్టు ఎప్పటికప్పుడు సెల్ఫ్ గోల్ చేసుకుని తెల్లమొహం వెయ్యడంలో ఇద్దరికిద్దరు సరిజోడు చిన్నోళ్ళు!

     మొదట్లో నేనూ బీదాబిక్కీ ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకునుంటే బాగుండేదని అనుకున్నా గానీ విశేరెడ్డి లాంటోళ్ళ దగ్గిర బయటపడుతున్న కట్టల్ని చూశాక నమ్మకం కుదిరింది ఇట్లా తప్ప ఇంకోట్లా వీళ్ళు బయటపడి ఉండేవాళ్ళు కాదని!వేలు పెట్టే సందు దొరికితే కాలు దూర్చేవాళ్ళు,విడుదల చేసిన ఆరుగంటల్లోనే కాలు కదపకుండా తళతళలాడే కొత్తనోట్లని ఇళ్ళకే తెప్పించుకోగలిగినవాళ్ళు,నిలువు బొట్లూ అడ్ద బొట్లూ పెట్టి భక్తుల మాదిరి దేవస్థానాల్ని కూడా అపవిత్రం చేస్తున్నవాళ్ళు సామాన్యుల కోసం అని చెప్పి ఏమాత్రం వాళ్ళకి దారి తెరిచే వెసులుబాటు ఇచ్చినా దాన్ని ఉపయోగించుకోకుండా వొదుల్తారా?నేను పాత పేపర్లు తిరగేస్తుంటే కనబడింది 2000 నోటు విడుదల చెయ్యాలన్న నిర్ణయం చాలా ముందే జరిగింది - అంతా ప్లాను ప్రకారం వేసిన ట్రాప్!"అంచెలంచల మోక్షము చాల కష్టమె భామినీ!" అని ఎంత మొత్తుకున్నా లాభం లేదు, సీతయ్యలాగే మోదీ కూడా ఎవ్వరి మాటా వినడు - ఆడంతే,అదో టైపు!

     "ఎవరు పేర్చిన నలుపు వారు పూసుకోక తప్పదన్నా!" అన్నట్టూ "కట్టలు కట్టలనియేవు ఈ కట్టలెవరివే సిలకా!" అన్నట్టూ "చెరసాలకు వేళాయెరా!" అన్నట్టూ పేరడీ తత్వాలు రాసే క్రియేటివిటీ ఉన్నవాళ్లకి మంచి గిరాకీ ఇప్పుడు!మోదీ కేవలం నోట్ల రద్దు ఒక్కటే చెయ్యలేదు - ఈడీ,ఐటీ లాంటి మదగజాల్ని ఫుల్ పవర్లు ఇచ్చి వొదిలాడు.టెలిఫోన్లు ట్యాప్ చెయ్యడం దగ్గిర్నుంచి వాళ్ళకి తెలిసిన విద్యలన్నింటినీ ప్రయోగిస్తున్నారు - ఎంతకాలం నుంచి కసిగా ఉన్నారో గానీ!ఇంక అవినీతిపరులకి "పోతే పోనీ పోరా ఈ పాపపు జగతిన శాశ్వతమెవడురా!" అనే తత్వం ఒక్కటే నిక్కచ్చిగా బోధపడాల్సి ఉంది.ఎవరు ఏడ్చినా ఎవరు నవ్వినా ఆట మొదలయ్యాక ఆడాల్సిందే,ఇప్పుడిక మోదీ కూడా ఆపలేడు!


అంతం కాదిది ఆరంభం మాత్రమే - ఖబడ్దార్!