Saturday, 14 February 2015

హిందూ ధర్మ ప్రహేళికలు-రామకధా విశ్లేషణం

సీ||  యేమయా రామయా యేదయా నీదయా!
         మాకు నీవేకదా మేటి వేల్పు?

         ఎన్నియో బాధలూ ఎంతయో వేదనా
         మోసిమోసీ మరీ మోయలేని

         వాడనై నేడిలా వేడుతున్నానయా!
         కావవే దేవరా కాస్త శాంతి

         నివ్వు నా తండ్రిగా! నీటిలో ముంచినా
         నావలా తేల్చినా నీవెనంటు

తే||  చేరినానుగా, స్వామి?నా చేయి పట్టి
        నాకు నీవెతోడై సదా నన్ను తప్పు 
        చేయనీక నీ బిడ్డలా చూసుకోవ
        యా - త్రిలోక పాలా, దయాపాశహస్త?!
(08/02/2015:ఇందులో రామనామం లోని "ర" గణం మాత్రమే వాడాను,"మ" గణం వాడకూదు గాబట్టి అందులోని అకారంతో ధ్వనిసామ్యం వున్న "హ" గణం వాడాను!)
_______________________________________________________________
శ్రీ గురుభ్యో న్నమః

          అవతార ప్రాధాన్యాన్ని బట్టి కాలక్రమాన్ని లెక్కిస్తే రామకధ ముందుగా వచ్చినా మొదట గ్రంధస్థ మయింది మాత్రం మహాభారతమేనని కొందరి వాదన!అరణ్యపర్వంలో ధర్మరాజుని చూసి పలకరించిన మునులు నువ్వొక్కడివే కాదు మంచివాళ్లయి వుండి కూడా కాలం కలిసిరాక బాధలు పడినవాళ్ళు గతంలో కూడా వున్నారు,వాళ్ళకి లాగే నీ కష్టాలూ తీరుతాయిలే అని ధైర్యం చెప్పడం కోసం చెప్పిన కధల్లో ప్రముఖమైనవి నలచరిత్ర, రామకధ.రామాయణం యొక్క ముఖ్యకధ అంతా అదే వరసలో నడవటాన్ని బట్టి వాల్మీకి తనకంటూ శాశ్వతత్వాన్ని సాధించుకోవటానికి ఆ చిన్న కధని వుపయోగంచుకున్నాడని అనుకోవాలి.ఒక దీపం మరో దీపాన్ని వెలిగించినట్టు ఒక కవి మరో కవికి వుషారు నిచ్చాడు!

          సామాన్య జనం పై రెండు కధలతో మమేకం కావడం కూడా వాళ్ళు పడిన కష్టాలను తమ కష్టాలతో పోల్చుకుని తమ కష్టాలు కూడా అట్లాగే పోతాయనే ఆశ కలిగించడమే! ఆ కవులు తమ కధలకి కోరిన ప్రయోజనం కూడా ఆ కధ చదివిన వాళ్ళు విన్నవాళ్ళు తమ కష్టాలకి కుంగిపోయి అర్ధాంతరపు ప్రాణత్యాగాలకి పోకుండా ఆ కధలోని నాయకుడి లాగే వీళ్ళు కూడా పోరాడి గెలవాలనే వుత్సాహాన్ని తెచ్చుకోవడమే!రోగీ పాలే కోరాడు వైద్యుడూ పాలే ఇచ్చాడన్నట్టు ఆ ప్రయోజనం పూర్తిగా సిధ్ధించాలంటే కధ ఆకుకీ పోకకీ అందకుండా పోయి పాఠకుణ్ణి కంగారు పెట్టగూడదు,కధానాయకుడు చదువరి లాగే వుండి, చదువరి ఆ పాత్రలో తనని చూసుకోవడం మొదలయ్యాక రచయిత మెల్లగా అతన్ని యే రకం మనస్తత్వంలో నిలబెట్టాలని అనుకున్నాడో అవన్నీ కధానాయకుడి ప్రవర్తన లోని అంశాలుగా సన్నివేశాల్ని కల్పించి చూపించాలి - ఇన్ని గొడవ లున్నాయి జగధ్ధితం కోసం సాహిత్య రచన చెయ్యాలంటే?!

      అవన్నీ తనకి పుష్కలంగా వున్నాయనే ధీమా వుంది గనకనే "నా రామకధ ఈ ప్రపంచంలో నదులు పారుతున్నంతవరకూ పర్వతాలు స్థిరంగా వున్నంతవరకూ నిలిచి వుంటుంది" అని గొప్పగా చెప్పుకున్నాడు!సాహిత్య రచన అనేది మొదలయిన తర్వాత ప్రపంచంలోని యే భాషకి చెందిన కవీ తన సృజన గురించి ఈ మాట అనడానికి సాహసించ లేదు?తను రాసిన దాన్ని పదేళ్ళ తర్వాత తనే మర్చిపోయే రకం చెత్త సాహిత్యాన్ని సృష్టించిన మనిషి వాల్మీకి కన్నా నా తెలివి యెక్కువ నాకందులో తప్పులు కనబడ్డాయి అంటే తెలివైన వాడెవడయినా నమ్ముతాడా?మరి, కొన్ని దశాబ్దాల తర్వాత మరో కమ్యునిష్టు మేధావి రామాయణం గురించి చాగంటి వారూ మల్లాది వారూ కూడా చెప్పని విషయాల్ని చెబుతూ ప్రశంసించినప్పుడు జనం యెవరిని నమ్మాలి?మూలకధ అదే అయినా ఉపకధలకీ కొన్ని ముఖ్యమయిన సన్నివేశాలకీ యెక్కడెక్కడో లింకులు కనబడుతున్నాయంటే అవన్నీ తెలుసుకునే రాశాడని అనుకోవాలి గదా!అంతటి విజ్ఞానిని ఇంతటి అజ్ఞాని వెక్కిరించటానికి పూనుకోవటమే దరిద్రమయితే దాన్ని అభిమానించే వాళ్ళు కూడా వుండటం మరీ నికృష్టం కాదా?!

          రామాయణంలో మొట్టమొదటి మార్మిక సన్నివేశం అహల్యా సంక్రందనం?!రాముణ్ణి దేవుడిగా కొలవడానికి జనానికి వచ్చే మొదటి వూహ "అహల్యకి శాప విమోచనం కలిగించినట్టు మన బాధల్నీ తొలగిస్తాడు" అనే ఆశ!రాయిని నాతిగ చేసిన రామపాదరజం యొక్క మహిమల్ని యెంతోమంది కవులు,భక్తులు కీర్తనల్లో గానించి పులకించిపోయారు?కానీ ఒక ముఖ్యమయిన విషయం - వాల్మీకి రాముడికి యే విధమయిన మహిమలూ ఇవ్వలేదు.పూర్తిగా మనలాగే నవ్వాడు,కోపగించుకున్నాడు,సంతోష పడ్డాడు - అచ్చం మనలాగే భార్య కనపడకపోతే పొర్లిగింతలు పెట్టి యేడ్చాడు?!అసలు కధ అహల్య రాయిలాగా రోడ్డు పక్కన పడివుంటే రాముడు నేనిప్పుడు ఈ రాయిని తన్నాలి గాబోల్ను అని డైరెక్టరు గారు చెప్పినట్టు చేసే ఇవ్వాళ్టి చెక్కమొహం విశ్వనటుల్ల్లాగా పోయి తన్నడమూ ఆ రాయి కాస్తా గ్రాఫిక్సులో మోకాటి తండా వేసిన ఆహల్యగా మారడం లాగానూ జరగలేదు!విశ్వామిత్రుడు తనతో తీసుకు వెళ్ళినప్పుదు కుర్రాళ్ళకి బోరు కొట్టకుండా పురాణ కధలూ అవీ చెప్పడం దారిలో వచ్చే ఆశ్రమాలకి సంబంధించిన కధలూ అవీ చెప్పడం అనే వరసలో అహల్యా గౌతముల కధ కూడా చెప్పి ఆశ్రమం కనబడగానే "ఇక్కణ్ణించే ఒక నమస్కారం చేసుకుని ముందుకు పద" అన్నాడు, కానీ రాముడు నాకు స్వయంగా గౌతముల వార్ని చూడాలని వుంది అంటాడు!ముచ్చట పడి తన అవసరం కోసం వెంట తిప్పుకుంటున్న శిష్యుడు ముచ్చట పడుతున్నాడు గదా అనిపించి "సరే పద!" అని ఆశ్రమం వైపుకి నడవటం మొదలు పెట్టారు!ఇది తెలిసిన గౌతముడికి అహల్యకి తను వేసిన శిక్ష నుంచి విడుదల చెయ్యక తప్పలేదు!అందరూ అపోహ పడినట్టు గౌతముడు రాయిలా పడి వుండమని శపించలేదు."మనుషులకి కనపడకుండా,నువ్వేమి తింటున్నావో యెవరికీ తెలియకుండా భస్మరూపివై - అంటే జీవించి ఉందా మరణించిందా అనేది తెలియకుండా బతుకు"  అని శాసించడమే తప్ప రాయిలాగా మారే శాపం ఇవ్వలేదు? ఇప్పుడు ఆశ్రమానికి వస్తున్న వాళ్ళు లోకారాధ్యుడైన విశ్వామిత్రుడూ, అప్పటికే ఋషుల్లో ఫలానా దశరధుల వారబ్బాయి,వశిష్టుల వారి శిష్యుడూ యెప్పటికయినా మనందరికీ పనికొచ్చే వాడూ అని తెలిసిపోయిన రాముడూ, అంతటి వాడే అయిన అతని తమ్ముడూనూ!సాంప్రదాయం ప్రకారం ఇంటికి వచ్చిన అతిధులకి మర్యాదలు కాళ్ళకి నీళ్ళీవ్వడంతో మొదలౌతాయి.అది కూడా పెళ్ళి కాని ఆడపిల్ల వుంటే తప్పనిసరిగా తనూ లేదంటే భార్య గానీ చెయ్యాలి.లోపలి కెళ్తే కాళ్లకి నీళ్ళిచ్చే మనిషి లేదనే విశ్వామిత్రుడు మొదట ముందుకు పదమన్నది!ఆ మర్యాద జరిపించాలి గాబట్టి తన శిక్షని తనే రద్దు చేశాడు గౌతముడు!ఇదంతా చూడాలని అడగటం వల్ల జరిగింది కాబట్టి  అడిగిన రాముణ్ణి గురించి ఒక విశేషణంలా వాడిన మాట కధలోకి రాయిని తీసుకొచ్చింది?!రాముణ్ణి దేవుణ్ణి చేసింది!

          అసలు అహల్యా గౌతముల కధలోనే మరింత నిగూడత వుంది!N.T.R తీసిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా చూసిన వాళ్లకి ఆ సన్నివేశానికి ముందు నెర్రెలు విచ్చిన బీడు భూమినీ తర్వాత నాట్లు వేస్తున్న వరిపొలాల్నీ చూపించటం గుర్తుందా?మన పౌరాణికాలన్నీ వ్యవసాయ సంస్కృతిలో తలబంటిగా మునిగిన వాళ్ళు రాసినవి గాబట్టి దానికి సంబంధించిన విషయాలు సందర్భానికి తగ్గట్టుగా వుంటే అక్కడ నిక్షేపించటం జరుగుతుంది!"అహల్య" అంటే నాగలి వెయ్యని భూమి అని అర్ధం!"గోతమ" అంటే గోవుల్ని పోషించేవాడని అర్ధం.అహల్యను కూడిన ఇంద్రసూర్యు లిద్దరూ వ్యవసాయాన్ని నష్టపరిచే అతివృష్టీ అనావృష్టీ అనేవి!ఇద్దరు పరపురుషులతో సంగమించిన తర్వాత కూడా అహల్యకి పంచమహాపతివ్రతల్లో స్థానం చెక్కుచెదరకుండా అలాగే వుంది అంటే తాత్కాలికంగా ఆ భూమి సేద్యయోగ్యం కాకపోయినా ఆ భూమిలోని సారం పూర్తిగా నశించలేదని!నార్మన్ జాకోబీ అనే ఫ్రెంచి పండితుడు మొత్తం రామాయణమే వ్యవసాయ సంస్కృతికి సంబంధించిన విశేషాల్ని పాత్రలుగా సన్నివేశాలుగా రూపు దిద్దిన కధ అని వ్యాఖ్యానించాడు.ఇక్కడి అర్ధం ఒక వ్యవసాయ దారుడు తనకి ప్రాప్తించిన భూమిలో యెంత కష్టపడినా అతివృష్టీ అనావృష్టీ వేధించటం వల్ల విసుగు పుట్టి సేద్యభూమిని బీడునేలగా వదిలేస్తే ఒక సులువు తెలిసిన రైతు కౌలుకి తీసుకుని దాన్ని వ్యవసాయ యోగ్యంగా మార్చి అప్పజెప్పటం అనే పైకి వాచ్యంగా కనపడని మరో రహస్యమైన కధ దాగి వుంది?!ముందూ వెనకా ఆ రెండు దృశ్యాల్నీ పనిగట్టుకుని చూపించటం వల్ల N.T.R ఆ రకం విశ్లేషణలు చదివాడనే తెలుస్తుంది!

          ఇంద్రుడూ సూర్యుడూ కోడికూతతో గౌతముణ్ణి నదికి పంపించాక గౌతముడి వేషంలో వచ్చి పక్కన జేరారనే సినేమా మసాలా దట్టించి చెప్పలేదు అహల్య కదని వాల్మీకి! అలా జరిగి వుంటే నీ వేషంలో ఉండటం వల్ల నువ్వనుకున్నాను నా తప్పేమిటి అని అహల్య నిలదీసే అవకాశం లేదా?తమ నిజరూపాల్లో మేము ఫలానా అని తెలిపి అహల్యని యే బలాత్కారమూ చెయ్యనక్కరలేకుండానే తమ కోరిక తీర్చుకున్నారు?వాల్మీకి ఇంత నిక్కచ్చిగా కుండబద్దలు కొట్టినట్టు వాళ్ళిద్దరూ  నిజరూపాల్లోనే వున్నారనీ పైగా అహల్య అంగీకారంతోనే అదంతా జరిగిందనీ తెలిసిన మరుక్షణం మనకి చాలా సందేహాలు వస్తాయి - రావాలి కూడా!ఇద్దరు పరపురుషుల్ని సంగమించినా గౌతముడు వేసిన శిక్షని భరించడమే తప్ప పంచ మహాపతివ్రతల్లో ఆమె స్థానానికి మాత్రం భంగం రాలేదు,యెందుకని?రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఇద్దరు మగవాళ్ళలో ఇంద్రుడికే భయంకరమైన శాపాన్ని ఇచ్చిన గౌతముడు సూర్యుణ్ణి యెందుకు వదిలేశాడు?నా విశ్లేషణ ఇది:ఇప్పటి వుద్యొగినులు బాసు చెయ్యి పట్టుకుంటే వెంటనే వేరే వుద్యోగం తెచ్చుకోగలిగితే అక్కడ వుద్యోగం మానెయ్యటం లేదా పరిస్థితి తప్పనిసరిగా ఆ వుద్యోగమే చెయ్యాల్సిన విధంగా వుంటే ఇష్టం లేకపోయినా లొంగిపోయేటటువంటిదే అహల్య పరిస్థితి కూడా!యెదురుగా వున్నవాళ్ళలో ఒకడు స్వర్గాధిపతి మరొకడు కర్మసాక్షి.తను తిరస్కరించడం వల్ల వాళ్ళకి క్రోధం కలిగితే భర్తకి హాని చేసే ప్రమాదం వుంది.ఇక్కడ జరుగుతున్నదేమిటో తెలియకపోవడం వల్ల వీళ్ళు యేదయినా చేస్తే గౌతముడు తనని తను రక్షించుకోలేని పరిస్థితి!అవినీతి,నేరం అనే వాటి నిర్వచనాలు పాతకాలపువైనా కొత్తకాలపువైనా అన్ని న్యాయసూత్రాల లోనూ ద్రోహబుధ్ధితో పూనుకుని చేసినప్పుడే ఆ మనిషికి కర్తృత్వం ఆపాదించడం జరుగుతుంది!అహల్య మనసులో జారత్వం లేదు గాబట్టి తెలిసి చేసినా తెలియక చేసినా దోషానికి పరిహారంతో సరిపెట్టేసి ఆ సన్నివేశానికి ముందూ ఆ సన్నివేశం జరుగుతున్నప్పుడూ ఆ సన్నివేశం తర్వాతా అహల్య మనసా వాచా కర్మణా గౌతముడి క్షేమాన్ని కోరుతూనే వుండటం వల్ల పంచమహాపతివ్రతాల్లో ఆమెకున్న స్థానం అలాగే వుంది!అహల్య గనక తిరగబడి,"నేనెలా పుట్టానో నీ దగ్గిర కెలా వచ్చానో నీకూ తెలుసు.మా నాన్న బ్రహ్మదేవుడు మా అమ్మ సరస్వతి తన సృష్టిలో యేదీ పరిపూర్ణంగా వుండకపోవటాన్ని చూసి వెక్కిరిస్తుంటే వుడుకుమోత్తనం తెచ్చుకుని అన్నిటా సర్వొత్తమంగా ఉండేటట్టు సృష్టించి కూడా షరా మామూలే అన్నట్టు ఇంద్రుడు అంతగా ఆశపడి తనకిమ్మని అడుగుతున్నా నొసటి రాతలో అన్యాయం చేసి నీ భార్యగా పంపించాడు!నా తండ్రి చేసిన తెలివితక్కువ పనికి బలయి గడుపుతున్న ఇంత దుర్భరమైన జీవితంలో ఒకే ఒక్కసారి ఈడూజోడైన వాళ్ళతో కూడితే తప్పేంటి?" అని నిగ్గదీస్తే గౌతముడు కోపానికి బదులు జాలి చూపించాల్సి వచ్చేది కాదా?సూర్యుడు ఇంద్రుడు ప్రలోభపెట్టగా వచ్చాడు.గౌతముడి ముందు తప్పు వొప్పుకుని తల దించుకు నిలబడ్డాడు.ఇవ్వాళ్టి న్యాయసూత్రాల్లో కూడా అప్రూవరయి అసలు ముద్దాయిని పట్టిచ్చే సహాయం చేసినా తప్పు వొప్పేసుకుని శిక్షకి తలొగ్గినా తక్కువ శిక్షతో సరిపెట్టెయ్యడం గానీ అసలు యే శిక్షా లేకుండా వొదిలెయ్యటం గానీ చేస్తారు గదా!ఇక ఇంద్రుడికి వేసిన శిక్ష పూర్తి స్వభావం తెలిస్తే వొళ్ళు జలదరిస్తుంది!కళ్లని కాకుండా అక్షులు అని పిలిచే వాటిలో కుష్టు రోగులకి చర్మం చిట్లి కనబడే గాయాలు కూడా వున్నాయి!గౌతముడు ఇంద్రుడికి ఇచ్చిన శాపం మొత్తం దేవలోకాన్నే జలదరింపజేసింది, యెందుకంటే ఆ భయంకరమైన రూపాన్ని చూడాల్సింది వాళ్ళే గదా!దానికి సర్దుబాటుగా తనవైపు చూసుకుంటే తనకి తప్ప మిగిలినవాళ్లకి మామూలుగానే కనబడే విధంగా శాపం తీవ్రతని తగ్గించారు!యెంతటి నేరమయినా చేసేటప్పుడు పేరుకున్న తిమ్మిరి కరుగుతుంది గనక సర్దాగానే వున్నా ఒకసారి నేను అలా చేసి వుండాల్సింది కాదు అనే గిల్ట్ తొలచడం మొదలయితే ఆ మనిషి నరకాన్ని చూస్తాడు!ఇంద్రుడి కిచ్చిన శాపం మనిషిలోని అపరాధభావన?!ఆ ఉపకధకి రామాయణ కధలో వున్న ప్రాధాన్యమేమిటో అందులో మనం నేర్చుకోవలసిందేమిటో తెలియక పోవడం వల్లనే "నదికి పోలేదా స్వామీ" అంటూ క్యామిడీ నాటకంగా చూపిస్తే జనం కూడా నిజం సీను కూడా ఇలాగే జరిగింది కాబోలనుకుని నవ్వుతూ చూశారు?!

           రామాయణంలో మొట్టమొదటి గందరగోళపు సన్నివేశం - పట్టాభిషేకం?!మొదట్లో అంత భీకరంగా పంతం పట్టి అడవులకి పంపించిన కైక భరతుడితో వెళ్ళినప్పుడు చాలా దుఃఖపడుతుంది!అందువల్లనే కాబోలు కొందరు వ్యాఖ్యాతలు పట్టాభిషేకాన్ని తప్పించటానికి దేవతలు కైకకి మాయపొర కమ్మించారు అనే రకం కల్పనలు చేశారు?కొందరు జాతక రత్నాలు వశిష్టుడు తప్పుడు ముహూర్తం పెట్టాడు,అందుకే అట్టా జరిగిందీ అని కూడా తీర్మానించేశారు.కొందరు వాస్తు పండితులు సీతాపహరణాన్ని లక్ష్మణుడి మీదకి తోశారు పర్ణశాల వాస్తువిరుధ్ధంగా కట్టాడు,అందుకే అట్టా జరిగిందని!కానీ పట్టాభిషేకం అట్లా భ్రష్టు పట్టిపోవటానికి కారణమైన అసలు విలన్ దశరధుడు?!కైక కూడా మంచిదే పాపం!మొదట పట్టాభిషేకం వార్త మంధర ద్వారా వినగానే సంతోష పడుతుంది అమాయకంగా!అంటే పుట్టింటి వాళ్ళు తనని ఇక్కడికి పంపించేప్పుడు తనకి పుట్టిన వాడే రాజవ్వాలని కండిషన్ పెట్టి పంపించటాన్ని పట్టించుకోకుండా రాముడు రాజవటానికి మానసికంగా తను కూడా సిధ్ధంగా వున్నదనే గదా?మంధర పూర్తిగా చెప్పాల్సింది చెప్పాక అప్పుడు మొదలైంది అసలు భీభత్సం, అవునా?యేమి చేప్పింది మంధర!"తల్లీ నీకు అసలు విషయమే తెలియదు గానీ కౌసల్య మందిరంలో పండగ చేసుకుంటున్నారు!అన్ని విషయాల్లోనూ నీకు చెప్పి చేసే రాజుగారు ఈ విషయం మాత్రం నీకు చెప్పలేదు చూశావా?అందరూ కలిసి నీచుట్టూ వుచ్చులు బిగిస్తున్నారు!" అని బోధపర్చింది?ఈ మంధర యెవరు?కైక పుట్టింటి నుంచి ఇక్కడ తమ కూతురికి అన్నీ సరిగా జరుగుతున్నాయా లేదా అని కనిపెట్టుకుని వుండటానికి వచ్చింది కదా, మరి జరిగేవి అనుమానం పుట్ట్టించే విధంగా వున్నప్పుడు కైకని హెచ్చరించకపోతే తన బాధ్యతని విస్మరించినట్టు కాదా!ఇంతకీ దశరధుడు చేసిన పనులేమిటి?సరిగ్గా ఒక్కరోజు ముందు భరతుణ్ణి మేనమామ ఇంటికి పంపించాడు!హఠాత్తుగా నిండుసభలో ఇప్పటికిప్పుడు నేను రాముణ్ణి రాజుని చెయ్యాలని అనుకుంటున్నాను,ముహూర్తం వెంఠనే పెట్టండి అని వశిష్టుణ్ణి తొందర పెట్టాడు!తెలిసి చేసినా వుషారు కొద్దీ చేసినా దశరధుడి ప్రవర్తన అంతా కైకని అనుమానించి అన్నీ పూర్తి చేసేసి అప్పుడు చెబుదామనే ప్లానుతో చేసినట్టుగానే వుంది!అందుకే కైకకి అంతగా కాలింది?!ఇప్పటికీ ఆడవాళ్ళ మనస్తత్వంలో ఒక ట్విస్టు వుంటుంది గమనించారా - చేప్పి చేస్తే యెంత దుర్మార్గం చేసినా సహిస్తుంది గానీ భర్త చేసింది మంచిపనే అయినా వేరే  వాళ్ళ ద్వారా తెలిస్తే మాత్రం తన కోపం తగ్గేదాకా నరకం చూపిస్తుంది,అవునా?!వాల్మీకి మహా గడుసువాడు - ఒకవైపు నుంచి చూస్తే దశరధుడు కావాలనే చేశాడు అని అనిపించేటట్టూ మరోవైపు నుంచి చూస్తే పాపం అనవసరంగా తొందరపడి అన్యాయంగా కొడుకు మీద బెంగతో కక్కటిల్లి చచ్చిపోయాడేమో అనిపించేటట్టూ సన్నివేశాలని రన్నింగ్ కామెంటరీ లాగా చెప్పేసి వొదిలేస్తాడు తప్ప తనుగా యేమీ చెప్పడు?!మన సంస్కారాన్ని బట్టి నాలాంటి శాడిష్టు అయితే ముసలోడు కావాలనే చేశాడు ఆ శాస్తి జరగాల్సిందే అనుకుంటాడు,శ్యామలీయం మాస్టారి లాంటి శాంతమూర్తు లయితే దశరధుడి మీద జాలిపడి క్షమించేస్తారు!

          చాలామంది రాముడు తండ్రి మీద వున్న ప్రేమ వల్ల పితృవాక్య పరిపాలన కోసం సింహాసనాన్ని త్యజించి వనవాసం వెళ్ళాడని అపోహ పడుతున్నారు!జరగకూడని హాని అంతా జరిగి మఠధ్వంసం అయ్యాక అప్పుడు దశరధుడు రాముడు కనబడగానే "నువ్వు నన్ను ఖైదు చేసి రాజ్యాన్ని హస్తగతం చేసుకో" మంటాడు!నిజంగా కూడా రాముడు ఆ పని చేస్తే కధ అక్కడితో ఆగిపోయి వుండేది.ఎందుకంటే,కైక కూడా రాముడి రాజరికాన్ని వొప్పుకుందంటే మిగతా ప్రభుత్వాధికారులు అప్పటికే విధేయులై పోయి వుండాలి గదా?అన్నింటికీ కైక చుట్టూ తిరుగుతూ భర్త తనని నిర్లక్ష్యం చెయ్యడం లోటు తప్ప కౌసల్య హోదా కూడా తక్కువదేం కాదు.ఆవిడ అయోధ్యా నగరానికి రక్షకురాలు!ఆవిడ అధీనంలో వున్న బలగం చాలు నగరాన్ని గుప్పిట్లో పెట్టుకోవటానికి!రాముడు లెక్క ప్రకారం రెండు విషయాలు ప్రస్తావిస్తూ జవాబు చెప్పాడు - "మాట ఇచ్చినది ఇక్ష్వాకు వంశానికి సంబంధించిన రాజు.ఆ మాట పొల్లు పోతే నీ రాజపదవికీ మన వంశచరిత్రకీ కళంకం గనక ఆ పని పొరపాటున కూడా చెయ్యను." అని తిరస్కరించి "పట్టపు రాణి స్థానంలో వున్నా నీ పక్షపాతం వల్ల ఇన్నాళ్ళూ నన్ను చూసుకుని బతికింది నా తల్లి,ఇప్పుడదీ లేకుండా చేశావు!నేను లేను గదా అని తనకి దుఃఖం కలిగించే పని చేస్తే మాత్రం సహించను?" అని హెచ్చరించాడు.ఈ కటువైన మాటల్లో తండ్రి మీద ప్రేమ కన్నా తండ్రి యొక్క బహుభార్యాత్వం పట్ల వున్న అసహ్యమూ అందులో కూడా పక్షపాతం చూపించి యెవరో ఒకరి వైపుకి మొగ్గి మిగతా భార్యల్ని చిన్నచూపు చూడటం పట్ల వున్న తిరస్కారమూ కనపడటం లేదా?!సరిగ్గా ఈ పాయింటు మీదనే - తండ్రి చేసిన తప్పు తను చెయ్యకూడదనే పట్టుదల తోనే  అరుంధతీ వశిష్టుల్ని దగ్గిర్నుంచి చూసిన రాముడు యేకపత్నీవ్రత దీక్షని పాటించాడు!దశరధుడు గుండె బద్దలై మరణించింది రాముడితో యెబాటు వల్ల కాదేమో, రాముడి అంతరాంతరాల్లో తనపట్ల వున్న అసహ్యం అనుకోకుండా బయట పడటం వల్లనేమో!లేదంటే పధ్నాలుగేళ్ళ తర్వాతైనా వస్తాడనే ఆతో బ్రతికి వుండే వాడేమో?!ఈ మొత్తం భీభత్సం అంతా పూర్తయ్యాక కైక సాధించింది శూన్యం?!భరతుడు కూడా తల్లినే తప్పు పట్టడం, రాముణ్ణి తిరిగి తీసుకు రావాలని ప్రయత్నించి అది కుదరక (భలే తమ్ముడు లెండి!పాదుకలడిగి అడివిలో అన్నగారికి చెప్పులు కూడా లేకుండా చేసేడు?) తను రాముడి ప్రతినిధి గానే శృంగిబేర పురం నుంచి పరిపాలన సాగించటంతో భర్తని పోగొట్టుకుని కొడుకు దృష్టిలో చెడ్డదానిగా నిలబడింది!నిదానంగా చెయ్యాల్సిన పని హడావిడిగా చేసిన దశరధుడు ఒక్కరోజులో తన జీవితాన్ని యెంత భయంకరమైన మలుపు తిప్పుకున్నాడు?!

          భరతుడు వచ్చే సమయానికి రాముడూ సీతా మంచి రొమాంటిక్ సీనులో వున్నారు?తమ్ముడు గారు చంపి తెచ్చిన మాంసాన్ని వొరుగులుగా యెండబెట్టి "సీతా!ఈ ముక్క బావుంది,తీసుకో" అనీ "కాదు కాదు,ఇదింకా బావుంది - మీరూ తిని చూడండి" అనీ ఒకరికొకరు తినిపించుకునే సరదాలో వున్నారు!ఇది యెందుకు చెప్తున్నానంటే పైన చెప్పానే రామాయణాన్ని అంత గొప్పగా పొగిడిన కమ్యునిష్టు మేధావి ఈ దృశ్యాన్ని వర్ణించగానే రామభక్తులంతా మూర్ఖంగా రెచ్చిపోయారు?తెరవెనక యెంత గందరగోళం జరిగిందో తెలియదు గానీ తర్వాత కొద్ది వారాల్లోనే ఆ సీరియల్ ఆగిపోయింది?మరి కొన్ని వారాల్లోనే అసలు ఆంధ్రజ్యోతి కూడా అదృశ్యమైపోయింది!వీళ్ళ పిచ్చి గాకపోతే రాజుగారబ్బాయి మాంసం తింటే తప్పా?ఆయనేమన్నా వైదీక బ్రాహ్మణోత్తముడా?రాముడికి పెట్టిన నియమం నారచీరలు గట్టుకుని వనవాసం చెయ్యమని గానీ మునివృత్తి చెయ్యమనీ కాదు,మౌనిత్వం వృత్తీ కాదు!ఇంకొక్క మెలిక చెప్పి తిన్నగా సీతాపహరణం దగ్గిరకి జంప్ జిలానీ ఐపోతా!రాముడు చంపిన కబంధ,విరాద మొదలైన కొందరు రాక్షసుల వధ జరిగాక వాళ్లలోంచి ఒక తేజస్సు రాముడిలో లీనమైనట్టుగా వర్ణించిన జ్ఞాపకం వుంది!శ్రీకాంత్ చారి లాంటి నాలో తప్పులు పట్టడం కోసం యెదురు చూసేవాళ్ళు పొరపాటున ఆ భాగం గనక ముక్కస్య ముక్కః చదివితే రాముడికి వాల్మీకి మహత్యాలు అంటగట్టలేదన్నావుగా,మరి దీనికేం చెప్తావు అని నిలబెట్టి వుతికి ఆరేసే ప్రమాదం వుంది గనక దాని విశ్లేషణ కొంచెం క్లుప్తంగా చెప్పి ముగిస్తాను!

          కబంధుడి వర్ణన ఇలా వుంటుంది:తల లేదు,పొట్టలో నోరు,యోజన దూరం వరకూ చాపగలిగిన చేతులు?అంతరార్ధం లెక్క ప్రకారం ఇవన్నీ మనిషిలోని దురాశకి రూపచిత్రణలు!చంపగానే తేజస్సు రాముడిలో లీనమవ్వటం వెనక దుష్టగుణాల్ని వున్నతీకరించటం అనే సూచన వుంది.మామూలుగా మనకి దుష్టగుణాల్ని గురించి చెప్పే వారంతా నిగ్రహం,శమం,దమం గురించి మాత్రమే చెప్పారు గానీ వాటిని వున్నతీకరించటం అంటే యేమిటో యెవరూ చెప్పలేదు.ఈనాటి ఒక సైకో అనలిష్టు చెడు లక్షణాల్ని పోగొట్టుకోవటానికి, "మీ పక్కింటి కుర్రాడు మీ ఇంట్లో అల్లరి చేస్తున్నాడనుకోండి,యేమి చేస్తారు?వాడి తలిదండ్రుల్ని పిలిచే లోపు మీ ఇంట్లోని విలువైన వస్తువుల్లో దేన్నో ఒకదాన్ని పగల గొట్టనూ వచ్చు!ఒకటే దారి - వాడిని మెల్లగా మచ్చిక చేసుకుని ఆ కబురూ ఈ కబురూ చెబుతూ చల్లగా గుమ్మం దాటించి తలుపేసుకోవటం, ఇదంతా చాలా ఓర్పుగా నేర్పుగా చెయ్యాలే తప్ప పిల్లాడే గదాని తన్నేస్తే పగబట్టి వేధిస్తాడు?!" అని ఒక సరదా పిట్టకధ చెప్పాడు.వాల్మీకి సూచించిన దుష్టగుణాల్ని వున్నతీకరించటంలో వున్న ప్రాక్టికాలిటీ కూడా ఇదే!

          సీతాహరణం జరిగిన కాలాన్ని లెక్కిస్తే పట్టాభిషేకం తప్పిపోవటం లాగే దురదృష్టం మరోసారి విరుచుకు పడ్డట్టు అనిపించి యెలాంటివాడికయినా అలాంటివి పగవాడిక్కూడా జరగకూడదనిపించేటంత జాలి వేస్తుంది ఆ దంపతుల మీద!సీతాహరణం జరిగాక వెతుక్కుంటూ తిరిగి తిరిగి శబరి ద్వారా సుగ్రీవుణ్ణీ కలుసుకోవడానికి సుమారొక రెండు మాసాలు గడిచినట్టు చెప్తాడు,వాలివధ తర్వాత రాజ్యం రాగానే సుగ్రీవుడు కొన్ని రోజులు నిర్లక్ష్యం చేస్తాడు,లక్ష్మణుడి ధాటికి జడిసి అగ్గగ్గలాడుతూ వొచ్చిపడి వర్షాకాలంలో వెతకటం కష్టం అది కాగానే వెతకటం మొదలు పెడతానంటాడు,ఇదంతా జరిగి హనుమంతుల వారు చెట్టుకొమ్మల మీద నుంచి సీతా రావణ సంవాదం వింటున్నప్పుడు వాడు "ఒక మాసం లోపు నాకు లొంగకపోతే మరుసటి రోజున ప్రాతఃకాల భోజనం చేస్తాను నిన్ను?!" అంటాడు. రావణుడు సీతతో ఆ కారుకూత కూసిన నెల తిరిగే లోపు రణభూమిలో హతమారిపోయి తనే కాకులకీ గద్దలకీ ప్రేతభోజనమై పోయాడు!మాయ మొదట దుర్మార్గుడితో వాడి అంతాన్ని వాడి నోటితోనే చెప్పిస్తుంది యెదరున్న సజ్జనులకి చేస్తాననేటట్టు?అప్పుడు హరి రంగంలోకి దిగి వాడు యేదయితే యెదటివాళ్ళకి చేస్తానని విర్రవీగాడో వాడికి దానినే విధిగా చేసి చూపిస్తాడు - హరిమాయ?!అఖిలాండకోటిబ్రహ్మాండనాయకుడు సమయమెరిగి చేసే దుష్టశిక్షణ అట్లాగే వుంటుంది!,రావణ వధ జరిగాక వీళ్ళు పుష్పకం మీద వెళ్ళేనాటికి భరతుడు అగ్నిప్రవేశానికి సిధ్ధమై వున్నాడు - ఇవన్నీ యెంత వుజ్జాయింపుగా లెక్కేసినా పదమూడు సంవత్సరాల తర్వాతే జరిగి వుండొచ్చు ఆ దుర్ఘటన?!

        యెక్కడి అయోధ్య!యెక్కడి చిత్రకూటం!యెక్కడి రాజభవనం?యెక్కడి పర్ణశాల?మాంసం వొరుగులే పంచభక్ష్య పరమాన్నంగా తిన్నారు!అడివిలో మాత్రమే దొరికేవీ రాజభవనంలో దొరకనివీ అయిన ప్రతిదాన్నీ దాచి పెట్టుకోవటమే సీతకున్న వ్యాపకం! అయోధ్య వెళ్ళాక మిగిలిన ఆడవాళ్ళకి చూపించి "మేం ఇంత హాయిగా బతికాం తెలుసా!" అని గొప్పగా చెప్పుకుని వాళ్ళంతా కుళ్ళుకునేలా చెయ్యాలని ఆలోచిస్తున్న అతి సామాన్యత్వం సీతది!ఆ ఘటన జరక్కుండా వుండి ప్రశాంతంగా అయోధ్యకి తిరిగి వెళ్ళగలిగీతే కల్పవృక్షపు తరుచ్చాయల్లో గడిపినట్టుగా అనిపిస్తూ ఒక మధురానుభవంలా మిగిలిపోవలసిన వనవాసం శూర్పణఖ అనే కాముకురాలి రంగప్రవేశంతో విషవృక్షపు గంధక ధూమం విసిరికొట్టినట్టుగా అనిపిస్తూ గుర్తు చేసుకోవడానికే మనస్కరించనంతటి భయంకరమైన అనుభవంగా మారింది,యేమి నాటకీయ విషాదం?!

          ఈ శూర్పణఖ లంకాధిపతి అయిన రావణుడి చెల్లెలు!వాడు యెడాపెడా యుధ్ధాలు చేస్తూ ఆ హడావిడిలో దీని మొగుణ్ణి కూడా మట్టగించేస్తే ఇది పోయి నేను బతికేదెట్టా అని గగ్గోలు పెడితే పోయి దండకారణ్యాన్ని యేలుకో మంటే పుట్టింటోళ్ళూ తరిమేశారూ కట్టుకున్నోడూ ఖతమైపోయాడూ అని పాడుకుంటూ ఖుషీ ఖుషీగా బతికేస్తున్నది మహాజనానికి మరదలు పిల్లలాగ! సీత ఖర్మ కాలి దీనికి రాముడు నచ్చాడు?వింత వింత మేకప్పు లేసుకుని తక్కుతూ తారుతూ వొచ్చి రాముణ్ణి అడిగేసింది తన కోరిక తీర్చమని!మొత్తం కధలో యెవరితోనూ హాస్యాలాడని గంభీర మూర్తి రాముడు దీనిమీద జోకు లెయ్యడం చూస్తే ఆ ఆడమనిషి యెంత చవకబారుదో అర్ధం చేసుకోవచ్చు!పెళ్ళి చేసుకుని సాధికారిక శృంగారంతో పరస్పరం ఆనందించాలనే ఔన్నత్యపు కోరిక కూడా కాదు కేవలం నరాల వేడి చల్లబరుచుకోవాలనే పశుకామపు సరదా?అన్నా చెల్లెళ్ళిద్దరిదీ భలే జారత్వపు జాతం - చెల్లెలు పరాయి మొగోడ్ని మోహిస్తే అన్న పక్కోడి పెళ్ళాన్ని ఆశించాడు!వీళ్ళిద్దర్నీ గౌరవనీయులుగా నిలబెట్టి రాముడు శూర్పణఖని చూసి చొల్లు కార్చుకున్నాడనీ సీత రావణుణ్ణి లోలోపల ఇష్టపడిందనీ ఆ పాతివ్రత్యమూ ఈ యేకపత్నీవ్రతమూ జనంలో మెప్పుకోసం చేసిన నటననే విధంగా మసిపూసి మారేడుకాయ చేసి వెక్కిరించాలని చూసిన వాళ్ళు అన్నింటినీ యదార్ధాల ప్రాతిపదిక మీద విశ్లేషించాలని చెప్పే ఘనమైన కమ్యునిష్టు తాత్విక చింతన ప్రకారం చూసినా నిజంగా గౌరవనీయులేనా?

        దాని తింగరితనానికి రాముడు నవ్వేసి "అమ్మాయీ!నేను పెళ్లయిన వాణ్ణి.నాకిలాంటి వాటి మీద వ్యామోహం లేదు. పెళ్ళి చేసుకున్నా సవతి పోరు వుంటుంది. మా తమ్ముడున్నాడు,నాకన్నా అందగాడు" అని లక్ష్మణుడి కేసి పంపించాడు.నిజమే గదా నల్లోడి కన్నా ఎర్రోడు మాంచి షోగ్గా వున్నాడనుకుని లక్ష్మణుడి దగ్గిర కెళ్తే "చూశావుగా!తమ్ముణ్ణని కూడా చూడకుండా కులుకుతూ నాతో పన్లన్నీ చేయించుకుంటున్నాడు!నాపక్కన జేరితే నీకూ ఈ చాకిరి తప్పదుగా!యెందుకొచ్చిన గోల చెప్పు?!" అని తనూ నవ్వాడు.దాంతో ఈ యెగతాళి అర్ధమయి కోపమొచ్చింది, ఇంతలో సీతని చూసింది, అన్ని సింగారాలతో వున్న తనకన్నా నారచీరల్తోనే సీత అందంగా యెందుకుందనేది ఆలోచించకుండా అందంగా వున్న ఆడది పెళ్ళాంగా వుండటం వల్లనే నన్ను కాదంటున్నాడు అనే రీజనింగు తీసుకుని సీతని చంపడానికి బయల్దేరింది?!అది సీతని చేరే లోపు  అప్పటిదాకా ఆడదనే భావంతోనే తిట్టడం దేనికిలే అని అలా హాస్యాలకి దిగిన రాముడు తమ్ముణ్ణి హెచ్చరించటం కోపమొస్తే ముందూ వెనకా చూడకుండా కాటువేసే పాములాగా లక్ష్మణుడు కన్నుమూసి తెరిచేలోగా దాని ముక్కూ చెవులూ కోసెయ్యడం జరిగిపోయింది!గాయాలకి కట్టు కట్టుకుందో లేదో వాల్మీకి చెప్పలేదు గాబట్టి ఆ రూపంతోనే పోయి ఖరధూషణుల్ని వుసిగొలిపింది.వీళ్ళు 14,000 మంది సైన్యంతో వచ్చిపడినా ఒకే ఒక్క కోదండంతో రాముడు పాస్పోర్టు లడక్కుండా వొచ్చినవాళ్ళందరికీ ఎంట్రీ ఇచ్చే యమసదనానికి పంపించటంతో ఇంకా మొండిగా అదే వూపుతో పెద్దన్న రావణుడి దగ్గిరికి పోయి పడింది!సీత అందం గురించి వర్ణించి చెప్పి యెత్తుకొచ్చి పండగ జేస్కోమని నీచపు సలహా ఇచ్చింది, యేమి ఆడతనం దానిది?తను చెడింది గాక తన చెత్తకోరిక తీరడానికి అడ్డంగా వున్నదని మరొక ఆడదాన్ని చెడగొట్టాలనుకునే ఆడదాన్ని యేమని పిలవాలి?ఆ ఆడదాన్ని మంచిదని కధలు చెప్పి సమర్ధించిన మరో ఆడదాన్ని యేమని పిలవాలి?

          ఆ చెల్లికి అన్న గదా!పెళ్ళయితేనేం,పిల్లయితేనేం,తల్లయితేనేం,పండు ముసిల్దైతేనేం అనుకునే ఇవ్వాళ్టి కక్కుర్తిగాళ్లకి మూలపురుషుడు గదా! వీడు పోయి మారీచుడి ముందు పెట్టాడు ఒక మాస్టర్ ప్లాను?ప్లాను సంగతి తర్వాత రాముడి పేరు వినగానే వాడు కంగారు పడ్డాడు?!చిన్నప్పుడు విశ్వామిత్రుడికి సహాయంగా వెళ్ళిన చోట అల్లరి చేస్తున్న మారీచ సుబాహులనే వాళ్లలో వీడూ ఒకడు.సుబాహుణ్ణి ఆగ్నేయాస్త్రంతో కొడితే వాడు బూడిదై పోయాడు!ఒకే అస్త్రం రెంసార్లు వాకూదు గనక వీణ్ణి వాయువ్యాస్త్రంతో కొడితే చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి "కొట్టిందెవరో తెలీదు గానీ లేపింది మాత్రం నన్నే" అన్నట్టు అక్క కొడితే ఇక్కడ కొచ్చి పడ్డాడు వీడు!ఆ దెబ్బకి రాక్షసత్వం వొదిలేసి కందమూలాలు తింటూ తపస్సులో మునిగి వున్నాడిప్పుడు?వయస్సులో రావణుడి కన్నా పెద్దవాడయ్యుంటాడు - ముక్కచివాట్లేశాడు!"యెప్పుడో కొట్టిన దెబ్బకి ఇప్పటికీ చుక్కలు కనిపిస్తున్నయి నాకు,రాముడు అనే పూర్తిపేరు గాదు ర అనే అక్షరం వినపడ్డా వులిక్కిపడి చస్తున్నాను,నీకీ యెదవ సలహా యెవడిచ్చాడో గానీ లంకకి చేటు తెచ్చినట్టే,మర్యాదగా వెనక్కి వెళ్తే క్షేమంగా వుంటావు" అని యెంత చెప్పినా "ఎహే,అసలు యెత్తుకొచ్చింది నేనని తెలియదు గదా నేనేసిన ప్లాను ప్రకారం - నామాట వింటావా నాచేతులో చస్తావా?" అనేసరికి మారీచుడు "నీలాంటి పాపిష్టోడి చేతుల్లో చావడం కన్నా ఆలాంటి పుణ్యాత్ముడి చేతుల్లో చావడమే బెస్టు!" అని విసుక్కుంటూ వొప్పుకున్నాడు.హ్యారీపోటరు కధల్లో మాదిరి ఈ మారీచుడికి జంతువుగా మారే శక్తి వున్నట్టూ ధ్వన్యనుకరణ కూడా తెలిసినట్టూ కల్పించాడు వాల్మీకి!రావణుడి ప్లాను మారీచుడు కాంచనమృగం లాగ మారి రామలక్ష్మణుల్ని దూరంగా తీసుకెళ్తే తను ఒంటరిగా వున్న సీతని మళ్ళీ రామలక్ష్మణులు తిరిగొచ్చే లోపు తన ఆనవాళ్ళు కూడా తెలియకుండా యెత్తుకు పోవాలని.మరీచిక అంటే యెండమావి!కాంచనమృగం అంటే బంగారు లేడి!అన్ని కాలాల్లోనూ కొందరు ఆడవాళ్ళు మిగతావాళ్ళ కన్నా గొప్పగా కనబడాలని యెక్కువ బంగారం కోసం భర్తల్ని యెండమావుల వెంట పరిగెత్తిస్తూ ఆ ప్రయత్నాలు బెడిసికొట్టి అనంతవిషాదాన్ని మూటగట్టుకోవటం చూస్తుంటే వాల్మీకి యెంత రియాలిటీని చూపిస్తున్నట్టు?!

          సీతకి ఇక్కడివన్నీ పోగేసుకుని అయోధ్యకి తీసుకుపోవాలనే అమాయకపు ముచ్చట వుండటం రావణుడికి కలిసొచ్చింది!లక్ష్మణుడు రోజూ అడివంతా కలయదిరిగేవాడు గనక ఇప్పటి దాకా కనబడనిది ఇప్పుడెలా వచ్చింది రాక్షస మాయ కావచ్చునన్నా భార్య గారాబంగా అడిగితే వుబ్బులింగడై యెంత కష్టమయినా తీర్చాలనుకునే మామూలు భర్త మనస్తత్వంతో మర్మమయితే చేదించి వస్తాన్లే నువ్వు మాత్రం సీతని వదిలి పోవద్దు అని చెప్పి రాముడొక్కడే వెళ్ళాడు?మరి లక్ష్మణుణ్ణి దూరంగా పంపించాలి గదా!విసుక్కుంటూ వెళ్ళినా క్రియేటివిటీ వున్నవాడు గాబట్టి దానికి ఠస్సా మారీచుడు వేశాడు - చస్తూ చస్తూ రాముడి గొంతుతో ఆర్తనాదాలు చేశాడు.కాలం కలిసిరాకపోతే తాడే పామై కరుస్తుందన్నట్టు రాముడు వీరాధివీరుడని తెలిసినా సీత భయపడి పోయి లక్ష్మణుణ్ణి సాయంగా వెళ్ళమని తొందర పెట్టింది.ఒక్కరోజులో రాజరికం కాస్తా వనవాసానికి దారి తీసినట్టు అనుకోనిది యేదయినా జరిగిందేమోననే ఆలోచన విచక్షణని కోల్పోయేలా చేసి వుండొచ్చు వెళ్ళనని మొండికేస్తున్న లక్ష్మణుణ్ణి అనకూడని మాట అనేసింది "మీ అన్నగారు పోతే నన్ను పెళ్ళాడదామని చూస్తున్నావు" అని?!వెళ్ళేందుకు ఒప్పించటానికే అన్నా లక్ష్మణుణ్ణి అస్సలు అనకూడని మాట గదా అది?తనంటే భార్య గాబట్టి తోడుగా వచ్చింది,లక్ష్మణుడికేం ఖర్మ వీళ్ళతో వచ్చి వీళ్ళకి పనివాడిగా వుండటానికి!రావణుడు తనని యెత్తుకెళ్తూ జటాయువుతో యుధ్ధం చేసే హడావిడిలో వున్నప్పుడు తను విసిరిన నగల మూటని ఆంజనేయ భగవాన్లు దాచి వుంచి రామలక్ష్మణులకి చూపిస్తే రాముడు దుఃఖంతో కళ్ళు మసకలు గమ్ముతున్నాయి నువ్వు చూడమన్నప్పుదు బయటి కెళ్ళేటప్పుడు నమస్కరించి వెళ్ళేవాణ్ణి గాబట్టి కాలి అందెల్ని తప్ప మిగిలినవాట్ని నేనూ గుర్తు పట్టలేనంటాడు!అట్లాంటి లక్ష్మణుణ్ణి అంతమాట యెట్లా అనగలిగింది!ఒకదాని మీద వ్యామోహం యెక్కువగా వుండి అది దూరమవుతుందేమోనన్న భయం గనక కలిగితే మనిషి యెంత చిత్రంగానైనా ప్రవర్తిస్తాడు!సరిగ్గా ఈ పాఠాన్నే తనకప్పటికి తెలిసొచ్చిందన్నట్టు అశోకవనంలో మెడకురి బిగించుకోబోయిన సన్నివేశంలో సీత నోటి నుంచే చెప్పిస్తాడు వాల్మీకి.

          అలా లక్ష్మణుడు కూడా దూరం వెళ్ళాక సాధువు వేషంలో వచ్చి భిక్షమడిగి దగ్గిరగా వచ్చాక మొదలు పెట్టాడు దాడి!యెంత పెనగులాడినా యేమి లాభం?దణ్ణాలు పెట్టినా జాలిపడ్డం లేదే ఇవ్వాళ్టి రేపిష్టులు!వీళ్ళు చేసేవన్నీ వాడూ చేశాడు, చెట్టుని కావిలించుకుంటే జుట్టుపట్టి లాగి నెప్పి భరించలేక చేతుల పట్టు వొదిలేసి ఆ వూపుకి కిందపడేలా చెయ్యడం నుంచి నడుం మీదా పిరుదుల మీదా పిడికిళ్ళతో వుడుం పట్టు పట్టి యెత్తి రధంలో కూలవెయ్యడం వరకూ కామం కళ్ళకి పొరలు గమ్మిన మదాంధుడు అసహాయురాలైన స్త్రీమీద యెంత భయంకరంగా దాడి చెయ్యగలడో అంత భయంకరంగా జరిగిన భీభత్స కాండతో రెచ్చిపోయిన రావణుడు, స్త్రీత్వం పట్ల గౌరవం వున్నవాడెవడయినా అసహ్యించుకోదగిన రావణుడు - శీఘ్రస్ఖలనాలతో తడిసిపోవటానికి తప్ప మరెందుకూ పనికిరాని చెత్త సాహిత్యాన్ని సృష్టించిన గుడిపాటి వెంకట చలం అనే గొప్ప రచయితకి సీతని అపురూపంగా ప్రేమించిన ఆదర్శ ప్రేమికుడిలా కనపడ్డాడు, అమ్మతోడు -  నిజం?!

          గుర్రాల స్థానంలో గాడిదలు వున్న రధం మీద వొచ్చి తనకున్న అతీంద్రియశక్తులతో రధంతో సహా గాలిలో ప్రయాణిస్తూ మధ్యలో అడ్డుకోబోయిన జటాయువుని రెక్కలు నరికి తప్పించుకుని తిన్నగా తన లంకా నగర రాజ్యానికే తీసుకుపోయి తనకున్న అతి గొప్ప భవనాలన్నిట్నీ తిప్పి చూపించినా వాటిల్లో చచ్చినా వుండనని చెప్పటంతో తనకే విసుగు పుట్టి అశోకవనంలో వుంచాడు.స్త్రీ తనంతట తను వరించి వస్తేనే మజా వుంటుందని తెలుసు గనక నన్ను వరించి సుఖపెట్టమని ఒత్తిడి చెయ్యటమే తప్ప యెట్లాగయినా అనుభవించి పారేద్దామని అనుకోకపోవడం వల్ల ఇవ్వాళ్టి కక్కుర్తివెధవల కన్నా వున్నతుడే!ఇక్కడ రామలక్ష్మణులు సీత కోసం గాలిస్తూ ఉంటే మొదటి అదృష్టం శబరి రూపంలో కనపడింది!శబరి కర్రపోటేసుకుని వొణుక్కుంటూ వొచ్చి యెంగిలి పళ్ళు తినిపించిన పండుమసలి కాదు దివ్యతేజస్సుతో వెలిగిపోతూ పద్మాసనస్థయై రామలక్ష్మణులకి సుగ్రీవుడి గురించి చెప్పి అతని దగ్గిర మంత్రిగా వున్న హనుమంతుడనే కార్యసాధకుడున్నాడు అతనివల్ల మీకార్యం తప్పక నెరవేరుతుందని ధైర్యం చెప్పి చూస్తుంగానే యోగాగ్నిలో దగ్ధమైపోగలిగిన మహాయోగిని!అక్కణ్ణుంచి మళ్ళీ సుగ్రీవుడి కోసం ఋష్యమూక పర్వతం వైపుకి బయల్దేరినప్పుడు మొట్టమొదటిసారిగా అంతరార్ధం ప్రకారం ఆచార్య స్థానంలో కనబడే శ్రీ మదాంజనేయ గురువరేణ్యుడు "మా భయ!మా సంవిక్త!" అంటూ కధలోకి ప్రవేశిస్తాడు.

          అలా ప్రవేశించిన సుగ్రీవసచివుడు వారిద్దరికీ సఖ్యత నేర్పరచి రాముడు వాలిని చంపి సుగ్రీవుణ్ణి రాజుని చేస్తే సుగ్రీవుడు రామకార్యాన్ని నెరవేర్చే విధంగా వుభయతారకమైన వ్యూహం సిధ్ధం చేశాడు!ఇక్కడ మళ్ళీ నగల మూట కనబడటం మరో గొప్ప క్లూ!ఆ నగల మూట వల్లనే ఆమె సీతయేనని తెలిసింది గనక అందరికీ పని తేలికైంది,లేకపోతే ఇంత కధా నడిచాక ఆ స్త్రీ సీత కాదు రావణుడు అలవాటుగా యెత్తుకొచ్చే ఆడవాళ్ళలో మరొకరు అని తెలిస్తే?మళ్ళీ సీతకోసం వెతుకులాట మొదటి కొచ్చినట్టే గదా!ఇవ్వాళ్టి వాలి ఫ్యాన్స్ అసోసియేషను వాళ్ళు మా హీరో వాలిని చెట్టుచాటు నుంచి చంపిన విలన్ మీ రాముడు అని ప్రతి శ్రీరామనవమికీ నల్లబ్యాడ్జీల వూరేగింపు చేస్తారు గానీ వాస్తవంగా ధనుష్ఠంకారం చేసుకుంటూ బయటి కొచ్చి యుధ్ధం ఆపేసి చూస్తున్న వాణ్ణి యెదుర్రొమ్ము మీదకి అమ్ము వేసి చంపాడు!కొందరు వాలిగాడికి యెదటివాళ్ళ బలాన్ని లాక్కునే శక్తి వుందనే కల్పన ఒకటి ప్రచారంలోకి తెచ్చారు గానీ అలాంటి పిచ్చి వూహలు వాల్మీకి మహాశయుడికి రాలేదు.ఈ మట్ట్టిబుర్రలకి తట్టని డౌట్లు గూడా అడిగాడు.మీరు కోతిమాంసం తినరు గదా నన్నెందుకు చంపావు అని యెటకారాలు గూడా వాగాడు."నువ్వే నాతో యుధ్ధం చేసి చంపొచ్చు గదా అంటున్నావు నువ్వూ నేనూ సమ వుజ్జీలం కాదు,తమ్ముడేమి చెప్తున్నాడో వినకుండా నీకు నువ్వే వూహించుకున్న కారణాలతో అమాయకుణ్ణి వేధించటమూ వావి వరుసలు మర్చిపోయి తమ్ముడి భార్యని వరించినందుకు నిన్ను శిక్షించడమే నా లక్ష్యం తప్ప నీతో యుధ్ధం చేసి నిన్ను గెలవాల్సిన అవసరం నాకు లేదు.నన్ను కలిస్తే రావణుడితో మాట్లాడి నా భార్యని అప్పగించేవాణ్ణిగా అంటున్నావు నీలాంటి వాడి నుంచి నేను సహాయం తీసుకోను - అది నా ధర్మానికి విరుధ్ధం.ఇది మా వానర రాజ్యానికీ అన్నదమ్ములకీ సంబంధించిన సొంత విషయం కదా నీకేం హక్కుంది కలగజేసుకోవటానికి అంటున్నావు,అట్లా కుదరదు.నా చేత కోదండ ముంది,యేది ధర్మమో యేది అధర్మమో తెలుసు. ధర్మం తెలిసిన శక్తిమంతుడికి అధర్మపరుల్ని నిగ్రహించడానికీ ధర్మాన్ని స్థాపించడానికీ స్థలకాలాలు వుండవు!" అని అన్ని ధర్మసూక్ష్మాలూ వివరించి చెబితే నోర్మూసుకుని కన్నుమూశాడు!?ఒక్క వాలి తప్ప రామ బాణం తగిలిన వాళ్ళంతా మంచినీళ్ళక్కుండా చచ్చారు,బహుశా ఈ వాలి ఫ్యాన్సు అసోసియేషను వాళ్ళకి జవాబులు చెప్పించటం కోసమే వాల్మీకి వాలికి ఆ ప్రత్యేకతని కట్టబెట్టాడేమో?!

        వాలివధ అనంతరం సుగ్రీవ పట్టాభిషేకం తర్వాత వర్షర్తువు ముగిశాక మళ్ళీ అందరూ కలిశారు.జటాయువు చెప్పిన దాని ప్రకారం లంక వైపుకే వెళ్ళినా రావణుడు ప్రపంచంలో అన్ని రాజ్యాల్నీ ఓడించిన వాడు గాబట్టి యెక్కడైనా దాచవచ్చు సీతని.అందుకని ముఖ్యులైన జాంబవంతుడూ హనుమంతుడూ అంగదుడూ లాంటి వాళ్లని లంకానగరం వైపుకి పంపించి మిగతావాళ్ళని కూడా అన్నిదిక్కులకీ పంపించాడు సుగ్రీవుడు. లంక వైపు వెళ్ళిన వాళ్ళలో వున్న హనుమంతుడు శతయోజన విస్తీర్ణమైన సాగరాన్ని లంఘించి దాటి లంకని చేరాడు.అశోకవనంలో సీతని చూశాడు.ఆమెకి చెప్పాల్సిన విధంగా ధైర్యం చెప్పి ఆనవాలు కూడా తీసుకున్నాడు.పుల్లయ్య వేమవరం వెళ్ళనూ వెళ్ళాడు రానూ వచ్చాడు గానీ యెందుకెళ్ళావురా అంటే మాత్రం రాత్రి మీరు రేప్పొద్దున్న పుల్లయ్యని వేమవరం వెళ్ళిరమ్మనాలి అనుకోవడం విన్నాను గాబట్టి వెళ్ళాను వచ్చాను అన్నట్టు హనుమంతుడు కూడా చూసిరమ్మన్నారు గాబట్టి చూసొచ్చాను అంతకి మించి నన్నడక్కండి అంటే దద్దమ్మకి దద్దమ్మ మేధావిలా కనబడినట్టు ముప్పాళ రంగనాయకమ్మకి తెలివిగా కనబడి వుండేదేమో గానీ హనుమంతుడికి మాత్రం వెంటనే ఇక్కణ్ణుంచి దాటుకుని వెళ్ళవడం కన్నా ఇక్కడ తను చెయ్యాల్సింది ఇంకొంచెం వుందనిపించింది - అది యెంత తెలివైన పనో నేను చెప్తాను వినండి! వీళ్ళు తనకేదో హాని చేస్తారనే భయం లేదు, రావణుణ్ణి కలవాలి, వాడి బలమేంటో తెల్సుకోవాలి, కలిసి మాట్లాడాలి, నయానో భయానో మనవైపు నుంచి మనం కూడా ఒక మాట చెప్పి చూడాలి గదా, మనం చెప్పే మాట గట్టిగా చెప్పగలిగితే వాడు మాటల్తోనే లొంగివస్తే ఇక్కడికిక్కడే నూరుశాతం పని పూర్తయిపోయినట్టు గదా, పుల్లయ్య లాగా వెళ్ళాను చూశాను వచ్చాను అని చెప్తే అప్పుడైనా మళ్ళీ యెవడో ఒకడు ఇంతదూరం మళ్ళీ దూతగా రావాల్సిందే గదా - ఇవ్వన్నీ ఆలోచించిన లంకా భయంకరుడు అశోకవనాన్ని ధ్వంసం చేసి తనకి తనే పట్టుబడి మొత్తానికి రావణుడి ముందు కెళ్ళాడు!ఈ అశోకవనాన్ని ధ్వంసం చెయ్యడం తర్వాత లంక మొత్తం తగలబడినా సీత క్షేమంగా వుండటానికి పనికొచ్చింది?!


(గూగులమ్మ కానుక)

         చాలా వాదన జరిగింది ఇద్దరి మధ్యా."ప్రస్తుతం నీ అధీనంలో నీకు లొంగివున్న ఆడవాళ్ళంతా నువ్వు యుధ్ధాల్లో గెలుచుకొచ్చిన వాళ్ళూ నీ వైభవాన్ని చూసి మోహపడి వరించిన వాళ్ళూ, ఇప్పుడు నువ్వు చేసింది మాత్రం పాపమే!" అని పావని అంటే "నేను శివుడి ఆత్మలింగాన్ని సాధించిన శివభక్తుణ్ణి, యెన్నో పుణ్యకార్యాలు చేశాను ఒక్క సీతాపహరణం అనే పాపం నన్నేమి చేస్తుంది?" అన్నాడు రావణుడు.చాలా గొప్ప సమర్ధన ఇది!ఇప్పుడు మనం కూడా ఇలా మాట్లాడే వాళ్లనీ పైకి అనకపోయినా మనసులో ఇలాంటి ఆలోచన తోనే పది పాపాలు చేసి యేదో ఒక గుడికి యేవరో ఒక దేవుడికి ఒక కైంకర్యం చేయించో ఒక కానుక ఇచ్చో దేవుణ్ణ్ణి కూడా తమ పాపాలకి పార్ట్నర్ని చేసేశాం గనక మనం బేఫికరుగా వుండొచ్చుననుకునే వాళ్లని చూస్తూనే వున్నాము గదా!అదీ వాల్మీకి రామాయణం యొక్క సార్వకాలిక లక్షణం,అందువల్లనే ఇంతకాలం నిలబడింది, ఇకముందు కూడా నిలబడుతుంది!ఆ పొగరుకి విరుగుడుగా "నిజమే, నువ్వు పుణ్యాలు చెశావు.దాని ఫలితం మీద నీకు నమ్మక ముంది.కానీ పాపానికి కూడా ఫలితం వుంటుంది గదా!దాన్ని కూడా అనుభవించాల్సిందే గదా?సీతని వదలకపోతే నీ పుణ్యానికి సరిపడా వైభవం పూర్తయిపోతుంది.రెండోది దాని పని మొదలు పెడుతుంది - ఆలోచించుకో" అని వాడు పట్టించుకోవడాని కిష్టపడని అసలు పాయింటు చెప్పాడు.దుర్మార్గుడికి వాడిని కార్నర్ చేస్తున్నట్టు కనిపించే నీతుల్ని చెప్తే ఇంకా రెచ్చిపోతాడు!మంచి చెప్పిన వాడు తన కోరికని తీర్చుకోవడాని కడ్డమొచ్చే దుర్మార్గుడిలా కనబడతాడు?మొదట వీణ్ణి సంహరించెయ్యమన్నాడు, విభీషణుడు ఆపి దూతని చంపగూడదు యేదో ఒకటి చెయ్యల్సిందే ననుకుంటే అవమానించి పంపించెయ్యవచ్చు అని ధర్మసూక్ష్మం వివరిస్తే తోక కాల్చి వదల మన్నాడు.ఈ బుధ్ధిమంతుడు దాంతో లంకనంతా కాల్చి సముద్రంలో ముంచి చల్లార్చుకుని మరోసారి సీతని చూసి వీడ్కోలు చెప్పి వచ్చేశాడు. హనుమంతుడి ద్వారా విషయమంతా తెలుసుకుని ఇక యుధ్ధమే శరణ్యమని సైన్యసమేతంగా మళ్ళీ లంకనగరం చేరారు అందరూ. కాల్చడానికి లంక మొత్తం తిరిగాడు గాబట్టి రావణుడి బలాబలాలు కూడా తెలుకోగలిగి వుండటంతో సైన్యసంచాలనానికీ వ్యూహనిర్మాణానికీ పూర్తిగా ఆంజనేయుడి మీదనే ఆధార పడ్డాడు రాముడు. అయోధ్యలో జరిగిన కధకి "అయోధ్య కాండ" అనీ దండకారణ్యంలో జరిగిన  కధకి "అరణ్య కాండ" అనీ కిష్కింధలో జరిగిన కధకి "కిష్కింధ కాండ" అనీపేరు పెట్టిన వాల్మీకి వాలి వధ అనంతరం జరిగిన ఈ మొత్తం కధ వున్న భాగానికి "సుందర కాండ" అని పేరు పెట్టాడు,యెందుకని?.వరస ప్రకారం "లంకా కాండ" అని పెట్టాలి, అవునా!అన్నిటికీ మూస పధ్ధతిలో పోవడానికి వాల్మీకి అట్టాంటిట్టాంటి రొడ్డకొట్టుడు రచయిత కాదు,"పుంసాం మోహన రూపాయ" అని చెబ్బబడే మగవాళ్లలోకల్లా అందగాడూ "సీతే జగత్సుందరీ" అని చెబ్బబడే ఆవాళ్లలోకల్లా అందగత్తె తమ స్వభావంలో వున్న ప్రత్యేకతల్ని చూపిస్తారు!వీళ్ళిద్దరికీ సుందర నామధేయుడైన హనుమంతుడు ఒకరి క్షేమాన్ని మరొకరికి చెప్పి ఆనందం కలిగిస్తాడు,ఆ విశేషాన్ని సూచించడానికే అట్లా చేశాడు.చదివే వాళ్ళకి కూడా దీన్ని మీరు ఇంకొంచెం శ్రధ్ధగా చదవాలి అనే హెచ్చరిక వుంది అందులో?!

          సకల దేవతా గణాలూ ఆకాశాన చేరి ఇప్పటికయినా రావణపీ వొదుల్తుందనే ఆశతో ధైర్యంగా రాముడికి సహాయాలు కూడా అందించగా, అరిషడ్వర్గాలని జయించిన దేవర్షి సంఘాలలో కూడా యెవరు గెలుస్తారో ననే వుత్సుకతా లోపల్లోపల రాముడే గెలవాలనే మోహం పుట్టగా వారు జపతపాల సంగతి కూడా మర్చిపోయి వుద్విగ్నంగా చూస్తూ వుండగానే కేవలం పక్షం రోజుల్లో అంతవరకూ యెవ్వరికీ జయింపశక్యంగాని రావణుడు రాముడు వేసిన బాణాల రూపంలో వచ్చిపడిన తన పాపాల ధాటికి హతమారి పోయి కాలీకాలనికాష్ఠంగా మిగిలిపోయా డిప్పటికీ కాల్తూనే వున్నాడు?!

          రావణ సంహారం జరిగిపోయింది!విభీషణుడు రాజయ్యాడు!తన పట్టాభిషేకం జరిగేటప్పుదు రాముడు వుంటే బాగుంటుందని విణీషణుడు అడిగితే పురప్రవేశం నాకు నిషిధ్ధం నా బదులుగా లక్ష్మణుడు వస్తాడని సున్నితంగా తిరస్కరించి నియమ పాలనకే కట్టుబడ్డ సత్యవిక్రముడు రాముడు!అయోధ్యకి చేరుకోవడానికి సమయం తక్కువగా వుంది గనక విభీషణుడు పుష్పక విమానంతో సిధ్ధమయ్యాడు.ఇక రావలసినది సీత!అంతటి అపురూపమైన స్త్రీని అప్పటిదాకా చూడని వాళ్లంతా ఆమెని చూడాలని మీదకి తోసుకొస్తుంటే వెనక్కి తోస్తున్న వాళ్ళని యెవరూ వూహంచని విధంగా అలా చెయ్యవద్దని గద్దించాడు రాముడు?అతని వాలకం కూడా వింతగా వుంది!అంతకాలం దూరంగా వున్న భార్య దగ్గిర కొస్తున్నదనే సంతోషం లేదు,మొహం గంటు పెట్టుకుని వున్నాడెందుకో?పలికిన మాటలూ వినపడిన గొంతూ మాటల్లోని భావమూ అన్నీ పరుషంగా వున్నాయి - అందరూ చేష్టలుడిగి చూస్తున్నారు!దగ్గిరకొచ్చి నిలబడిన సీతతో అతడు మాట్లాడినవి చాలా తక్కువ మాటలు. - "అపహరించబడిన భార్యని తిరిగి సాధించుకోలేని అసమర్ధుడు రాముడు అనే చెడ్దపేరుని భరించలేకనే కేవలం వంశప్రతిష్ఠ కోసమే రావణుడితో యుధ్ధం చేసి అతని చెరనుంచి నిన్ను విడిపించాను కానీ నీమీద మోహంతో కాదు.నిన్ను నేను స్వీకరించను.ఇక్కడ జాంబవంతు డున్నాడు,సుగ్రీవు డున్నాడు,లక్ష్మణు డున్నాడు.వీరిలో యెవరినైనా నువ్వు చేపట్టవచ్చు" అని ముఖం పక్కకి తిప్పుకుని మాట్లాడకుండా వుండిపోయాడు!రామాయణంలో అత్యంత వివాదాస్పదమయిన సన్నివేశం ఇదే.రాముడి మాల్లో వున్న కాఠిన్యం తప్పులు పట్తేవాళ్లకి చాలా హుషారు ఇచ్చింది.రాముడే పరీక్ష పెట్టి అందులో నెగ్గితేనే నిన్ను స్వీకరిస్తానని అన్నట్టుగా ఈ సన్నివేశానికి కూడా "అగ్ని పరీక్ష" అని పేరు తగిలించి రాముడు మొత్తం స్త్రీజాతినే అవమానించిన పురుషాదిక్య సమాజానికి ప్రతినిధిగా ముద్రవెయ్యడానికి పనికొచ్చిన సన్నివేశ మిది!అప్పటి వరకూ అన్ని విశేషణాలతో తను ఆదర్శవంతుడని పొగిడిన రాముడి చేత అంతగానూ పొగిడి లోకంలో ఆదర్శవనితగా నిలబెట్టాలని చూసిన సీతని అవమానించాలనే దుర్బుధ్ధిని వాల్మీకి రాముడి కెందుకు అంటగడతాదనే సందేహం కూడా రాలేదు వాళ్ళకి?!అప్పుడెప్పుడో సీత లక్ష్మణుణ్ణి అన్న మాటలకి ఇప్పుడు సీతకి కౌంటర్ ఇచ్చాడు రాముడు!

          లిస్టులో లక్ష్మణుడి పేరు కూడా వుండటంతో ఆ కౌంటర్ సీతకి వెంటనే అర్ధమయింది!దాంతోపాటు మరొక విషయం కూడా అర్ధమయింది?. సరిగ్గా ఇరవై నానుగు వేల శ్లోకాలలో వెయ్యి శ్లోకాల కొకచోట మొదటి అక్షరంగా గాయత్రి మంత్రంలోని అక్షరాల్ని నింపి లెక్కప్రకారం కధ చెప్పిన వాల్మెకి రాముడికీ లెక్క ప్రకారం మాట్లాడే అలవాటు పెట్టాడు.ఒకటే మాట!తను అంత ఖచ్చితంగా తెగేసి చెప్పాక బతిమిలాడినా ప్రయోజనం లేదని తెలిసి తన ఆభిజాత్యం నిలుపుకోవడానికి ఆత్మాహుతి చేసుకోవాలని నిర్ణయించుకుంది! అగ్గిలో దూకి మొగ్గలాగా వచ్చిన తర్వాత కూడా రాముడు మాత్రం కరగలేదు,ఆఖరికి దివ్యదేహంతో వున్న దశరధుడు కోడలి మీద వాత్సల్యంతో ఇంటికోడలికి అన్యాయం జరగడం వంశాన్ని కాల్చేస్తుందని యెంతగానో నచ్చజెప్పాక మాట తిప్పుకున్నాడు.నిజానికి ఈ సన్నివేశం ఇక్కడ వుండకపోయినా కధకి పెద్ద లోపం వుండదు అప్పటికే రాముడి మూలంగా ధర్మతత్వ నిరూపణ చేసి చూపించిన అంశాలు చాలా యెక్కువగానే వున్నాయి.కానీ ఈ సన్నివేశంలో నిక్షేపించిన అంతరార్ధం గురించి తెలుసుకుంటే గానీ దీని ప్రాముఖ్యత తెలియదు!రాముడనే ఒక యోగసాధకుడు మొదట తన ఓంకార సాధనతో సీత అనే భగవత్స్వరూపంతో సంస్పర్శన సుఖాన్ని పొందినా ప్రకృతిలోని మార్మిక సౌందర్యానికి విస్మితుడైన సందర్భంలో మాయ ప్రభావంతో పంచేంద్రియాలు పంచవికారాలు విజ్రంభించగా దానికి దూరమై ఆంజనేయుడనే ఒక ఆచార్యుడి సాయంతో తిరిగి సాధించి దైవాన్ని తన మనసులో సుస్థిరంగా ప్రతిష్ఠించుకోవటం అనే అంతర్గత యోగప్రయాణమే రామకధ?!రెండవసారి సాధించినప్పుడు ఆ అధికారాన్ని నిరూపించుకోవడమనే చిత్రమైన సన్నివేశానికి బాహ్యరూపమే సీత అగ్నిప్రవేశ ఘట్టం!అన్నమయ్య బాలుణ్ణి చేసి జోలపాడినా రామదాసు యెవడబ్బ సొమ్మని కులుకుతు తిరిగేవు అన్నా వారు ప్రదర్శిస్తున్నది అలాంటి అధికారమే!భక్తుడు భగవంతుడి మీద ధాష్టీకం చెయ్యడం భగవంతుడు అతని ముందు తలవంచడం అనే యోగశాస్త్ర రహస్యాన్ని అక్కడ రాముడూ సీతా మనకి చూపించారు!

          ఇక్కడి సంగతులేమీ తెలియవు గనక అక్కడ భరతుడు ముహూర్త కాలం కూడా ఆగడని గుర్తొచ్చి విషయం చెప్పి అతడి అగ్నిప్రవేశాన్ని ఆపడానికి ముందు ఆంజనేయుణ్ణి పంపి వీళ్ళు ప్రశాంతంగా పుష్పకవిమానప్రయాణ సుఖాన్ని అనుభవిస్తూ అయోధ్య చేరుకున్నారు!పధ్నాలుగేళ్ళ తరవాత యే అడ్డంకులూ లేకుండా శ్రీరామపట్టాభిషేకం జరగడంతో రామకధని సంపూర్ణం చేశాడు వాల్మీకి! "ఉత్తరే రామచరిత్రే భవభూతిర్విశిష్యతి" అన్న మాటతో వున్న ఉత్తర రామచరిత్ర తప్ప వాల్మీకి పేరుతో యెక్కడా కనబడటం లేదు.శ్రీరామ చూర్ణిక కూడా "పట్టాభిషేక మహోత్సవానందం గోవిందం" అనే పదంతోనే ముగుస్తుంది గాబట్టి ఈ శుభప్రదమైన ముగింపుతో వున్న కధయే సంపూర్ణమైన రామాయణం!


స్వస్తి!
_______________________________________________________________
సీ||  యేమయా రామయా యేదయా నీదయా!
         మాకు నీవేకదా మేటి వేల్పు?

         ఎన్నియో బాధలూ ఎంతయో వేదనా
         మోసిమోసీ మరీ మోయలేని

         వారమై నేడిలా వేడుతున్నామయా!
         కావవే దేవరా కాచి రక్ష

         నివ్వు మా తండ్రిగా! నీటిలో ముంచినా
         నావలా తేల్చినా నీవెనంటు

తే||  చేరినాముగా, స్వామి?మా చేయి పట్టి
        మాకు నీవెతోడై సదా మమ్ము బాధ 
        చూడనీక నీ బిడ్డలా చూసుకోవ
        యా - త్రిలోక పాలా, దయాపాశహస్త?!
(12/02/2015:పైనున్న పద్యంలో యేకత్వాన్ని బహుత్వంగా మార్చాను.తప్పు చెయ్యనివ్వక పోవడానికి బదులుగా బాధ చూడనివ్వవద్దని మార్చాను, భావం ధర్మాధర్మవిచక్షణ నుంచి సంపూర్ణశరణాగతికి తిరిగింది!)
_______________________________________________________________

15 comments:

  1. ఏమని రాయాలి, అద్భుతంగా రాశారు అన్న ఒక్క మాట తప్ప.

    ReplyDelete
  2. సైన్యంతో వచ్చిపడినా ఒకే ఒక్క కోదండంతో రాముడు పాస్పోర్టు లడక్కుండా వొచ్చినవాళ్ళందరికీ ఎంట్రీ........
    Hahaha :) Super.

    ReplyDelete
  3. కెవ్వుకేక... బాగా రాసారు.

    ReplyDelete

  4. తెలుగు బ్లాగు లోకపు 'హరి'కథా బ్లాగావతార్' అన్న బిరుదు శ్రీ హరిబాబు సూర నేని వారి కి ఇస్తున్నా నండోయ్ !

    ఆ టపా ని మీ మాటల్లో పలికించి ఎం పీ త్రీ గా కలపండి ! సూపెర్ డూపర్ !

    >>> కొన్ని దశాబ్దాల తర్వాత మరో కమ్యునిష్టు మేధావి రామాయణం గురించి చాగంటి వారూ మల్లాది వారూ కూడా చెప్పని విషయాల్ని చెబుతూ ప్రశంసించినప్పుడు ....

    ఈ ఆలోచనా పరంపర అసంపూర్తి గా వదిలేసేరు ఏమి చెప్పారో చెప్ప కుండా ??

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఆ కమ్యునిష్టు మధావి పేరు యెంత తన్నుకున్నా గుర్తు రావడం లేఉ?అది కూడా సగంలోనే ఆగిపోయింది గదా!నేను కత్తిరించి దాచిన భాగాలు ఆంధ్రాలో వుండి పోయినాయి,యేం చేద్దాం?!

      Delete
  5. to the best of my limited knowledge...
    ha
    1. valmiki ramayana was written much before vyasa bharata. your saying is different. can you show something sustainable proof?

    2. ahalya case, she romanced with indra knowingly, and willfully. it is not mere surrender to the might.

    3. sita's innocent enthusiasm in forest doesnot mean she didn't know the qualities of a princess while in ayodhya.

    rest, is wonderful,as usual, in your inimitable style.

    P.S.: Ushasri Ramayanam is in print, available with TTD and Mahalakshmi Publishers.

    ReplyDelete
    Replies
    1. @phani sir,
      1.very long back I raed that statement in andhrajyothi itself by a different author.As youa re authentic about the time stamp.I will remove taht one line,no problem.
      2.yes,for that will full romance she was condemned,and by the obedience she was not a bitch.we need to go deep into the story of her birth to fully explain her misery!
      3.innocent enthusiasm and simplicity in behaviour are among the basic traits by which vaalmiki moulded sita.to make haer as normala as every woman.
      I have bought vushasRee raamaayana,but It was in my home village,Anyway my memory power is so strong me thinks.even after yerars I could depict rightly with pardonable things?!

      Delete
    2. good artical

      Delete
    3. అహల్య దగ్గరే ఆగిపోయా! ముందుకు సాగలేదు. వీలుకుదిరితే ఒక టపా నా బ్లాగులో రాస్తా.

      Delete
  6. Pl see post
    https://kastephale.wordpress.com/2015/04/17/

    ReplyDelete
    Replies
    1. చాలా సంతోషం మాష్టారూ,రామాయణంలో యేమి ఉన్నదో విస్తారంగా చెప్పారు.దానికనుగుణంగా పోష్టును మార్చడానికి ప్రయత్నిస్తాను.అహల్య కధకి వెర్షన్లు ఉన్నాటున్నాయి.అయినా ఇక్కడ ప్రస్తావిచింది రామాయణం కధని కాబట్టి రామాయణంలో వాల్మీకి ఆ వృత్తాంతాన్ని రాసిన పధ్ధతే ముఖ్యం.కానీఎ నా పోష్టులో ఉన్న ఫ్లో చెడకుండా మార్చడం కొంచెం కష్టమె,అయినా ప్రయత్నిస్తాను.

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...