Tuesday 30 September 2014

శభాష్ దీపికా!నువ్వు నాకు నచ్చావ్!!

            యే భాష అయినా కానివ్వండి, సినిమా వాళ్ళు సభ్యతాసభ్యతల్ని మర్చిపోయి చాలా కాలమయింది!కమల్ హాసన్,ప్రకాష్ పడుకొనె లాంటి వాళ్ళ సంతానం సినిమాల్లోకి వచ్చినా మంచి పాత్రలు చేసి గౌరవప్రదంగా నడుచుకుని తంద్రుల గౌరవాన్ని మరింత పెంచటం లాంటి సుత్తి విషయాల్ని పట్టించుకోకుండా తాము కూడా తమ అందాల్ని ఆరబోస్తూ మార్కెట్ పరంగా లాభసాటి సరుకుగా మారిపోతున్నారు.సరుకుగా యెప్పుడయితే మారారో వాళ్ళ వ్యక్తిత్వాన్ని గురించి యెవడూ ఆలోచించడనే విషయాన్ని మాత్రం మర్చిపోతున్నారు.ఆ మతిమరుపు వల్లనే దీపికా పడుకొనె కి ఆ ఇబ్బందికరమయిన పరిస్థితి దాపరించింది!


          అడుసు తొక్కనేల?కాలు కడుగనేల?దీపిక పడుకొనె కి అంత కోపం యెందు కొచ్చింది?తను చేసింది తప్పు కాదనే అనుకుంటున్నదా?నా దృష్టిలో ఖచ్చితంగా తప్ప్పే!యెందుకంటే ఆ ఫొటో తీసిన సందర్భం ఆవిడ నటించిన సినిమాలోని దృశ్యం కాదు, సినిమాల్లో మేము రోజూ చేసేది అదే కదా అని సమర్ధించుకోవటానికి!ఒక పబ్లిక్ ఫంక్షన్ లో తను అలా కనపడింది అంటే అప్పుడు తన ఇష్టాపూర్తిగా వేసుకున్న డ్రెస్సే కదా అది!ఒక సరుకుగా మారిన తను ఆ ఫంక్షన్ కి వచ్చే సినిమా వాళ్ళ దృష్టిలో పడాలనే కదా అలా వెళ్ళింది?జరగాల్సిన హాని జరిగిపోయాక పరువు పూర్తిగా పోయాక యెంత కోపగించుకున్నా ముళ్ళకంప మీద పడిన బట్తని గుంజినట్టే!ఆ స్థలానికి ఆ కాలానికి దొరికిపోయిన ఆ దీపిక మీద నాకు జాలి తప్ప ఆ దీపికని విమర్శించాలని కూడా లేదు నాకు!రేపు అదే పరిస్థితిలో కాల్ హాసన్ గారమ్మాయి కూడా నిలబడొచ్చు,అలా ఇంకెన్నడూ జరగదని చెప్పలేం?!యేది యేమయినా ఆ ఫొటో/వీడియో పబ్లిష్ చేసిన జర్నలిష్టు ఒక చిన్న కుదుపునైనా తీసుకు రాగలిగాడు, సత్యమేవ జయతే అమీర్ సాబ్ కూడా కేవలం నిర్మాతల్ని తప్పు పట్టి ప్రయోజనం లేదు లెండి, మాలాంటివాళ్లం కూడా అంతో ఇంతో కారణమే అని వొప్పుకునేలాగ చేశాడు!

           నేను శభాష్ అని మెచ్చుకుంటున్న దీపిక మరో సెలెబ్రిటీ, దీపిక పల్లికల్ - స్క్వాష్ ఆటలో మేటి!డిసెంబర్ 2012 నాటికే WSA rankingsలో టాప్ 10లోకి యెగబాకగలిగింది!2006లో ప్రొఫెషనల్ కరీర్ మొదలు పెట్టి యెన్నో యెత్తు పల్లాల్ని చూసి ఆఖరికి 2011 సెప్టెంబర్ లో ఇర్విన్ లో మొదటి WISPA టైటిల్ గెలుచుకోవడంతో అందరికీ తెలియడం మొదలయింది!


          చూశారుగా యెంత అందంగా వుందో!బాలీవుడ్ మహారాజాల కళ్ళు పడకుండా వుంటాయా?ఈ అందాల్ని తెరమీద ఆరబోస్తే యెన్ని కోట్ల లెక్కన గిట్టుబాటవుతుందో గదా అని తెగ ఆశపడ్డారు, పాపం!కానీ ఈ అమ్మాయికి ఆరకమయిన దురద లేకపోవడంతో కుదరదని చెప్పేసింది.వూరికే చెప్పి వొదిలెయ్యటం కాదు, తను ఒక వర్ధమాన క్రికెట్ ఆతగాణ్ణి ఇష్తపడుతున్నది - అతని అభిప్రాయం కూడా దానికి వ్యతిరేకంగానే వుండటంతో తను యెప్పటికీ తెరమీద కనబడే చాన్స్ లేదని ముఖం మీద తలుపేసేసింది. ఈ అమ్మాయి గురించే నేను చెప్పింది:

శభాష్ దీపికా!నువ్వు నాకు నచ్చావ్!!

Tuesday 23 September 2014

చార్లీ చాప్లిన్ ట్రాంప్ - రాజ్ కపూర్ ఆవారా

          సాహిత్యంలో ఒక కవి గానీ రచయిత గానీ శ్రధ్ధగా ఒక పాత్ర స్వభావాన్ని స్పష్టంగా రూపు దిద్దితే ఆ పాత్ర ఆ రచన కన్నా ఇంకా చెప్పాలంటే ఆ రచయిత కన్నా ప్రముఖంగా చదువర్లకు అభిమాన పాత్ర మవుతుంది. గిరీశం, పార్వతీశం, గణపతి లాంటి పాత్రలు మన తెలుగు సాహిత్యంలో చాలా వున్నాయి. ఇప్పటి కుర్రాళ్లయినా సరే ఆ రచనల్ని చదివితే వాళ్ళు కూడా ఆ పాత్రల్ని నిజ జీవిత వ్యక్తులు గానే భ్రమ పడతారు. సాహిత్యంలో లాగే సినిమాల్లో కూడా ఇలాంటి పాత్రలు కొన్ని వున్నాయి. కానీ ప్రపంచ సినిమా చరిత్ర లోనే అలాంటి పాత్ర లన్నింటిలో విశేషంగా చెప్పదగిన ఒకే ఒక పాత్ర చార్లీ చాప్లిన్ సృష్టించిన ట్రాంప్.


  
         అతడు సృష్టించిన ముహూర్త బలమో యేమిటొ గానీ చూసే వాళ్లలో వున్న పిల్లల్నీ పెద్దల్నీ ఒక్కలాగే అలరిస్తూ సాటి కళాకారుల్ని కూడా దానికి నకళ్లని సృష్టించేటంతగా ప్రభావితం చేసింది! దీన్ని ప్రతీకాత్మక పాత్ర(prototype) అనవచ్చు. యెందుకంటే అన్ని సినిమాల్లోనూ ఒకే గెటప్తో కనబడినా చుట్టూ వున్న వాతావరణంలోనూ మిగిలిన పాత్రల్లోనూ మొత్తం కధలోనూ పూర్తి విభిన్నత వుంటుంది. అంటే ఇలాంటి మనిషి యెక్కడ వున్నా ఒకటేలే అనే వ్యాఖ్యాన ధోరణి అంతర్భూతంగా వుంటుంది. ఆ పాత్రకి నిర్ధిష్తమయిన చట్రం యేదీ లేకపోవడం వల్లనే కాబోలు చూసే వ్యక్తి  ఆ సన్నివేశంలో నేను వున్నా అలాగే ప్రవర్తిస్తానేమో అనే విధంగా స్పందించి తనకి ప్రీతిపాత్రం చేసుకోవడం సాధ్యపడింది?!



         వేషభాషలు ఒక్కలాగే వున్నా కధని బట్టి ప్రవర్తన మారుతుంది.ఒక సినిమాలో పారిశ్రామికాధిపతులు ప్రొడక్టివిటీ పెంచటానికి చేసే - లంచ్ టైముని తగ్గించటానికి తిండి తినిపించే యంత్రాన్ని వాడటం లాంటి - పిచ్చి పన్లకి బలవుతూ యంత్రాల్లో యంత్రం లాగా తిరుగుతూ పనిభారం యెక్కువయ్యి నట్టులాగా కనబడితే ఆదవాళ్ళ స్కర్టు బటన్ మీద కూడా రెంచీని వాడేటంతగా పిచ్చెక్కి పోయి పిచ్చాసుపత్రికి వెళ్ళే కార్మికుడి లాగా కనబడితే, మరొక సినిమాలో ముందు ఒక చిన్న పిల్లవాడితో అద్దాలు పగల గొట్టించి తర్వాత తీరిగ్గా తను వెళ్ళి అద్దాలు బాగు చేసే బతక నేర్చిన వాడిగా కనబడతాడు. ఒక దద్దమ్మని రకరకాల సన్నివేశాల్లో - వాడి పరిష్కార శక్తికి అతీతమయిన సమస్యల్లో ఇరికించి - నిలబెట్టి వాడు తన అతితెలివి/తెలివిలేమి తో వాటి నుంచి బయటపడే పధ్ధతుల నుంచి హాస్యాన్ని పుట్టించి ప్రపంచంలో వున్న దద్దమ్మల కందరికీ ఒక గౌరవనీయమయిన బ్రాండ్ గా ట్రాంప్ ని తీర్చిదిద్దాడు చాప్లిన్!

             అంత ప్రభావాన్ని చూపిస్తున్న ఈ ట్రాంప్ ని చూసి ఇలాంటి పాత్రల్ని సృష్టించాలని సాటి కళాకారులు కూడా వువ్విళ్ళూరడంతో ఆ పాత్రకి నకళ్ళుగా చాలా పాత్రలు వచ్చాయి.కానీ వాటిలో చాలామటుకు ఇమిటేషన్లుగా మిగిలి పోగా భారతీయ నటదర్శకుడైన రాజ్ కపూర్ సృష్టించిన ఆవారా పాత్ర ఒక్కటే ప్రత్యేకంగా వుండి గెలుపు గుర్రంలా నిలబడింది. దానికి కారణం కేవలం అనుకరించి సరిపెట్టుకోకుండా తన అవసరం యేమిటో తెలుసుకుని మార్పులు చేసి ఒరిజినాలిటీ చూపించటం! చాప్లిన్ పూర్తిగా హాస్యానికి పెద్దపీట వేసి స్లాప్ స్టిక్ కామిడీ కి మాత్రమే పరిమితం చేస్తే ప్రేమ, విషాదం లాంటి మిగతా ఫీలింగ్స్ కూడా చూపించి కొంత గంభీరంగా తయారు చేసాడు రాజ్ కపూర్ తన ఆవారాని. ఇక్కడా హాస్యం తప్పనిసరిగా వుంటుంది గానీ మీసాన్ని నార్మల్ గా వుంచటంతో  చిలిపితనం డోసు పెరిగి రొమాంటిక్ లుక్ కూడా వచ్చింది.


              అక్కడి లాగా ఇక్కడ కూడా ఒక్కో సినిమాలో ఒక్కో నేపధ్యం వున్నా పాత్ర తీరు తెన్నులు ఒక్కలాగే వున్నా పాత్ర మూడ్ మారుతుంది, అదీ ఇక్కడ ట్రాంప్ కన్నా ఆవారా లో వున్న తేడా! ఆవారా సినిమా  కధలోని పాత్రలో విషాదం వుంటుంది. పుట్టుకతో జడ్జి గారబ్బాయి, జడ్జి గారు తనని అన్యాయంగా శిక్షించాడనే కసితో యెత్తుకెళ్ళి జేబు దొంగగా ట్రయినింగు ఇస్తాడు జడ్జి ద్వారా జైలు కెళ్ళిన వాళ్లలో ఒకడు. చివర్న బోనులో నిలబడి న్యాయమూర్తి అయివుండి కూడా భార్యనీ కొడుకునీ నిర్లక్ష్యం తోనూ కఠినత్వం తోనూ అన్యాయం చెయ్యడాన్ని ప్రశ్నిస్తూ తను ఇచ్చిన స్పీచ్ నిజంగా అధ్భుతం! ఆ తర్వాత చాలా సినిమాల్లో చాలామంది హీరోలు కోర్టుహాలు స్పీచులు దంచేసినా ఆ స్థాయికి తూగలేక పోయాయి. చాప్లిన్ "గ్రేట్ దిక్టేటర్" లో "ఫైకి చూడు హన్నా" స్పీచితో సరితూగగలిగేటంత గొప్ప స్పీచ్ అది! అందులో తను వేసిన ప్రశ్న- "చిన్నప్పుడు మమ్మల్ని నిర్లక్ష్యం చేసి మేము నేరస్తులుగా తయారయ్యేలా మాకు అన్యాయం చేసి మళ్ళీ మమ్మల్ని బోనులో నిలబెట్టి శిక్షలు వేసి మీ తప్పులకి మమ్మల్ని బలి చేసి మీరు మాత్రం పెద్దమనుషులుగా చెలామణీ అవుతున్నారే, ఇది అన్యాయం కాదా?" అనే ప్రశ్న అక్కడి తండ్రికి కాదు మొత్తం సమాజానికి అని అర్ధమయితే రాజ్ కపూర్ పరిశీలనాశక్తి యెంత గొప్పదో తెలుస్తుంది.


              అదే శ్రీ 420 లో కోట్లకి పడగ లెత్తిన వాళ్ళు కూడా కాసిన్ని రూపాయి నోట్ల కోసం పిచ్చిగా పరుగులు పెట్టే దృశ్యాన్ని చూపించి నేను మామూలు 420 నయితే మీరు శ్రీ420లు అని దులిపేసే రెబెల్ లాగా కనిపిస్తాడు! ఆ క్లైమాక్సుని కొన్నేళ్ళ తర్వాత ఇట్స్ ఏ మ్యాడ్ మ్యాడ్ వరల్డ్ అనే సినిమాలో ఒక హాలీవుడ్ దైరెక్టర్ కాపీ కొట్టాడు?!ఒకసారి మన దేశం నుంచి రష్యా వెళ్ళిన వాళ్ళు కొందరు జాతీయ గీతం పాడమంటే "అవారా హూం" పాట పాడారు?రష్యా వాళ్ళు దాన్ని మన ప్రభుత్వానికి వూదారు! అది పెద్ద సంచలనం రేపింది అప్పట్లో?! రష్యా వాళ్లకి ఆ క్లూ తెలియడానికి కారణం వాళ్లంతా రాజ్ కపూర్ ఫాన్స్ అవ్వటమే! కొత్తగా శ్రామికవర్గనియంతృత్వం అనే ఆదర్సాన్ని నిక్కచ్చిగా పాటిస్తున్న వాళ్లకి రాజ్ కపూర్ సినిమాల్లో వుండే -  గానాబజానాల్తో హుషారుగా వుంటూనే సామాన్యుణ్ణి హీరోగా నిలబెట్టి అంతర్లీనంగా ఒక మెసేజిని ఇరికించడంలో వున్న - సామాజికస్పృహ తెగ నచ్చేయటం సహజమే కదా!

        బ్రహ్మ సృష్టికి దీటుగా మగవాడికి తన నెచ్చెలి యెలా వుంటే బాగుంటుందో తెలిసి సృజించగలిగిన సౌందర్యబ్రహ్మ రాజ్ కపూర్ కుంచె నుంచి జాలువారిన అత్యద్భుత సౌందర్యం - నర్గీస్! మిగతా వాళ్ళంతా అయితే అతివృష్టి లేకపోతె అనావృష్టి అన్నట్టు అసలు స్త్రీ సౌందర్యాన్ని పట్టించుకోకుండా దూరంగా వుండటమో లేదా అతిగా అందాల్ని ప్రదర్సనకు పెట్టేసి స్త్రీని ఆపిల్ పళ్ళూ జాంపళ్ళూ మంచాలూ కంచాలూ అని ఆహారపదార్ధం కింద మార్చెయ్యటమో చేశారు!

          శృంగారాన్ని సున్నితమయిన హాస్యంతో కలిపి లలితంగా చూపించటం రాజ్ కపూర్ కి తెలిసినంతగా మరొకరికి తెలియదు.పేద్ద గొప్పగా హీరోయినుకి ట్రీట్ గా టీ ఇప్పించబోయి ఆ అమ్మాయి దగ్గీరే ఒక పావలా అప్పు చెయ్యటం యెంత నైసుగా వుంటుందో - వేరే చెప్పాలా!  శ్రీ420లో వచ్చే ప్యార్ హువా ఇక్రార్ హువా పాట అయితే ఒక మార్మికసౌందర్యభరితమయిన అద్భుతమే, ఆనాటి అతి మామూలు వీధి చౌరంగీలేన్ అజరామరమైపోయింది ఈ పాటతో!

                 ఈ పాట మొదట్లో నర్గీస్ నచ్చిన వాడే అయినా తొలిసారి దగ్గిరగా వస్తుంటే సిగ్గరి అయిన ఒక మామూలు ఆదపిల్ల అనుభవించే తడబాటు నుంచీ గగుర్పాటు వరకూ యెంత సహజంగా చూపించిందో చూశారా?! అప్పటి కాలమే అంత కాబోలు! పరిస్థితి ఇప్పుడెలా వుందో తెలుసా? ఒక శనివారం నాకు హాఫ్ డే అవటంతో తనకి మూడింటికే స్కూల్ అయిపోతుందని తెలిసి ఈ బస్సుల్లో ఆటోల్లో యేమి తంటాలు పడుతుందిలే అని నేనే వాళ్ళ స్కూలు వరకూ వెళ్ళి బైక్ మీద తీసుకొస్తున్నా. అమ్మాయి లంతా మొహాలకి పల్లూ అడ్డం వేసుకోవటం చూసి, "యెండ కనుకుంటాను అమ్మాయి లంతా వుగ్రవాదుల్లా తయారయ్యారు" అని సర్దాగా కామెంట్ చేస్తే మా బంగారం, "లేదు లేదు, ఆ ముసుగుల కధ వేరే వుంది? తెలిసిన వాళ్ళు గుర్తు పట్టకుండా!" అనే సరికి మైండులో బాంబులు పేలినంత పనైంది?! అప్పటిదాకా ఒక్కముక్క తమిళం రాని నాకు తన్నుకుంటూ వొచ్చేసి, "అడాపావియా, యెన్నడా ఇదు కలికాలమా ఇరుక్క?!" అని వడివేలు మాదిరి గొణుక్కున్నా? అయ్యా, ఇవ్వాళ కొంచెం పెద్దదయిన ప్రతి టవున్లోనూ ఒక లవర్స్ పార్కు వుంటుంది! పోలీసులూ గట్రా యెట్సెట్రా వాళ్ళని డిస్టర్బ్ చెయ్యకుండా వుండేందుకు కొందరు పెద్దల అజమాయిషీలో దాని చుట్టూ పెద్దయెత్తున వ్యాపారం కూడా జరుగుతూ వుంటుంది!! చుండూరు కుర్రాళ్లని అంతగా రెచ్చగొట్టి అంతటి భయానకమయిన చావుకి కారకులయిన సినిమా రంగపు మాంసఖండాల విక్రేతలు వీళ్ళకి ముడిసరుకులు సప్లై చేస్తూ వుంటారు!!! ఆలోచించండి, అర్ధం చేసుకోండి, శలభాలు తమంతట తామే మాడిపోవటానికి సిధ్ధపడి వురక లేస్తుంటే కాల్చెయ్యటం సహజస్వభావమయిన అగ్నిజ్వాలలకి మొహమాటం యెందుకుంటుంది?



            నర్గీస్ దూరమయ్యాక ఇతని సినిమాల్లో విషాదం డోసు పెరిగింది.కధలు కూడా మరింత గంభీరమయినాయి. సాధారణంగా ఆ స్థాయి కళాకారుల్లో వుండే పసితనం తనే సృష్టించిన ఒక మహాద్భుత సౌందర్యాన్ని చూడగానే చకితుడై అది తనకే కావాలని కోరుకునేలా ప్రేరేపిస్తుంది! మోనాలిసాని సృష్టించిన డావిన్సీ దాన్ని యెవ్వరికీ ఇవ్వకుండా చచ్చేదాకా తన చెయ్యి దాటి పోనివ్వకుండా తన వెంట తిప్పుకున్నాడు! రాజ్ కపూర్ కి సెలెబ్రిటీగా వున్న స్టాటస్ కావాలంటే భార్యకి విడాకులు ఇచ్చి కోరుకున్న చిన్నదాన్ని దక్కించుకోవడానికి సహాయ పడి వుండేది. కాని అప్పటికే భార్య కృష్ణతో తనకున్న అనుబంధాన్ని తెంచుకోలేక వెనక్కి తగ్గాడు. అలా వెనక్కి తగ్గడం వల్లనే మనముందు అతను మరింత గౌరపప్రదంగా నిలబడ్డాడు! యెంతగా సర్ది చెప్పుకున్నా ఒకరి మీద మనకి ఇష్టం వుంటే వీలున్నంత వరకూ దగ్గరితనాన్ని ఆశిస్తాం కదా, ఆ బాధ వుండనే వుంటుంది! మేరా నాం జోకర్ ఇందుకు బలమయిన సాక్ష్యం! పేరుకి అది ఒక సర్కస్ బఫూను కధే గానీ అందులో చూపించిన దంతా తనలోని విషాదమే ననుకుంటున్నాను! చిన్నప్పటి టీచర్ నుంచీ ప్రేక్షకుల్లోని తన కిష్టమయిన వ్యక్తులంతా ఒక్కొక్కరూ ఒక్కొక్క కారణంతో దూర మవుతున్నా అ దుఃఖాన్నంతా భరించి జనాన్ని నవ్వించే పాత్రలో తన దుఃఖాన్నే కురిపించాడేమో?! అయినా సరే జీనా యహా మర్నా యహా అంటూ ఆశావాదాన్నే చూపించాడు! మళ్ళీ కూడదీసుకున్నాడు,మళ్ళీ మనోజ్ఞమయిన కలల్ని పేనటం మొదలెట్టాడు! ఈసారి కొత్తరకం కలలు! ఆవారాని పోలిన జోకర్ పాత్రతో ఆ వేషమూ దానితోపాటే ఆ లలితమయిన హాస్యమూ మాయమై పోయింది, అయితేనేం మరింత చిక్కని కధల్ని మరింత గొప్పగా వడ్డించాడు!

             సంగం లో దోస్త్ దోస్త్ నా రహా పాటని చూస్తున్నా వింటున్నా గుండె చిక్కబట్టేస్తుంది! తను యెంతగానో ఇష్టపడిన అమ్మాయి లావుగా వున్నాడనో నీకంత సీను లేదనో చిన్న చిన్న కారణాలతో తనని కాదని మరో స్నేహితుణ్ణే కోరుకుంటే తనలోని దుఃఖాన్ని తనలోనే దాచుకుని ఇద్దరూ స్నేహితులే కాబట్టి పైకి యేమీ అనకుండా వాళ్లకి బాగా ఆలోచిస్తే మాత్రమే తెలిసేలాగా తన బాధని వ్యక్తీకరించిన తీరు నాకు చాలా చాలా బాగా నచ్చింది! ఆడవాళ్ళ గొడవల్లో నేను ఇరుక్కోను గాబట్టి ఈ రకంగా కాదు గానీ  మరో రకంగా ఒక చిన్నప్పటి స్నేహితుడు నన్ను చాలా భయంకరంగా బాధ పెట్టాడు! ఈ పాట వింటున్నప్పుడు నా కోసమే రాశాడా అని ఒక సెంటిమెంటు కూడా నాకీ పాటతో యేర్పడి పోయింది! మనకో బాధ వుండి అది అలాగే మురిగి పోతూ వుంటే యెంతటి వాడికయినా చచ్చిపోవాలనేటంతగా నరకాన్ని చూపిస్తుంది. అదే నాలాంటి బాధనే మరొక మనిషి కూడా అనుభవిస్తున్నాడు అని తెలిస్తే, అది కూడా తను హీరోతో ఐడెంటిఫై అయిన ఒక సినిమాలో భాగమై కొన్ని కోట్లమంది చూసి తనలాగే ఫీలవుతున్నారని తెలిస్తే ఆ మనిషికి అప్పుడు చాలా రిలీఫ్ గా అనిపిస్తుంది, కదా?! నిజమయిన కళ అనేది అన్నం కలిపి ప్లేటులో పెట్టి ముద్దలు మింగించడం లాంటి పన్లు చెయ్యనక్కర్లేదు గానీ మనసు మూలల్లో పని చేసి అతన్ని కదిలించి ఆ మనిషికి జీవితం మీద ఆశని పుట్టిస్తే చాలునని వొప్పుకుంటే రాజ్ కపూర్ నూటికి తొంభై శాతం మార్కులు తెచ్చుకోగలిగిన నిజమయిన కళాకారుడు!

            ఆవారా సినిమాలో ఒక అద్భుతమయిన డ్రీం సీక్వెన్స్ వుంటుంది. హీరో జేబుదొంగ, హీరోయిన్  ఒక లాయరు, పైగా జడ్జి గారి మేనకోడలు! తన గురించి తెలియకుండా మ్యానేజ్ చేసి లైనేసినా యెప్పటికయినా నిజం తెలిస్తే - అనే భయాన్ని చూపిస్తూ అప్పటికీ ఇప్పటికీ మరెవ్వరూ అంతకన్నా గొప్పగా తియ్యలేరనిపించేటంత చాలా గొప్పగా తీశాడు. చాలాకాలం తర్వాత తమ్ముడు శశి కపూర్ "మళ్ళీ నువ్వయినా అంత గొప్ప డ్రీం సీక్వెన్స్ మరొకటి తియ్యలేవేమో" అంటే "ఆ శైలేంద్రా ఆ శంకర్ జైకిషన్లూ ఇప్పుడు వుంటే దాని బాబులాంటిది తియ్యగలను" అన్నాడట! యెంతయినా సింహం సింహమే, సింహంతో చాలెంజిలు చెయ్యగూడదు సుమా అనిపించింది!

             తన సినిమా లన్నింటిలోనూ వాస్తవానికి దగ్గిరగానే వుంటూ సమాజానికి పనికొచ్చే అంశాల్నే తీసుకుని ఆలోచనాత్మకమయిన సినిమాలే తీసినా ఆటపాటల తోనూ సౌందర్యం తోనూ అలంకరించటం వల్ల లైట్ గా తీసుకుని - సత్యజిత్ రే కూడా మనవాళ్ళ విమర్శల స్థాయి తక్కువ, నేనసలు పట్టించుకోను అని విసుక్కున్న - మన సినిమా విమర్సకులు వుత్త కమర్షియల్ డైరెక్టర్ గానే పొరబడ్డారు! జిస్ దేస్ మె గంగా బెహతీ హై లో బందిపోట్ల మధ్యన ఒక అమాయకుడు ఇరుక్కుని తన అమాయకత్వం తోనే వాళ్లని మార్చినట్టు చూపించాడు.సత్యం శివం సుందరంలో అందం అంటే చెంపల నున్నదనాన్నే చూడగూడదు - హృదయం,అనుబంధం లాంటివి కూడా ముఖ్యమే అనీ పరమసత్యాన్నీ చూపించాడు! అయినా మనవాళ్లకి ఇతను ఫార్ములా దర్శకుడి లాగానే కనిపించాడు?


               నాకు బాగా నచ్చిన రాం తేరి గంగా మైలీ లో అయితే ఒకటి కాదు చాలా అద్భుతాలు చేశాడు! మన తెలుగు సాహిత్యంలో రాఘవ పాండవీయం లాంటి ద్వర్ధి కావ్యాల్లో వుండే పైకి ఒక అర్ధం లోపల మరొక అర్ధం కనిపించే తమాషాని తెరమీద ఆవిష్కరించాడు! సినిమాల్లో ఈరకం టెక్నిక్ మరొకరు యెవ్వరూ ఇంత గొప్పగా వాడలేదు! నరేన్ అనే ఒక కుర్రాడు గంగోత్రి దగ్గిర గంగ అనే ఒక అమాయిని వరించి అక్కడే పెళ్ళి కూడా చేసుకుంటాడు,కానీ ఒక అర్జెంట్ పని వుండి మళ్ళీ వచ్చి తీసుకెళ్తానని చెప్పి వెళ్తాడు, కానీ వెంటనే రాడు? ఈ లోపు ఆ అమ్మాయి గర్భవతి అయ్యి తల్లి కూడా అవుతుంది. తప్పనిసరై ఇక తనే అతన్న్ని వెతుక్కుంటూ అతనున్న నగరానికి వెళ్తుంది?!శకుంతల కధ గుర్తు కొస్తుంది కదూ! ఈ మధ్యనే వచ్చిన విద్యాబాలన్ సినిమా కధ గూడా ఇలాగే వుందిగా, మూస కధే అనుకుంటున్నారా? అక్కణ్ణించే అసలు అద్భుతం మొదలవుతుంది! ఆ అమ్మాయి యెక్కడెక్కడ యెలాంటి సన్నివేశంలో నిలబడిందో యెవరేవరు ఆ అమ్మాయిని యే దృష్టితో చూశారు అనేదే సినిమాలోని విషయం! ఆ అమ్మాయి ఒక అమ్మాయి అని మర్చిపోతే ఈ పురుషాధిక్య సమాజం స్త్రీని యెక్కడెక్కడ యెలా నిలబేట్టి యేమి చేసిందో ప్రతీకాత్మకంగా చూపిస్తాడు! ఒకరి చెరలో వున్నా బ్రోతల్ హవుస్లో వున్నా ఆ అమ్మాయి ఒక్కలాగే వుంది, కానీ చూసే చూపుని బట్టి ఆ అమ్మాయి విలువ మారిపోయింది అనేది చూస్తున్న మనల్ని కూడా వెక్కిరిస్తున్నంత నిక్కచ్చిగా కధ నడిపిస్తాడు.

           హీరొయిన్ పాత్ర పేరు గంగ! హీరో పాత్ర పేరు నరేన్! సినిమా పేరులో వున్న రాం మనమనుకుంటున్న రాముడు కాదు? పేరులో వున్న అర్ధం రామకృష్ణ పరమహంస కొటేషన్ - "యెంతమంది పాపాల్ని కడిగినా గంగకి మలినం అంటదు" అనే దాన్ని తీసుకుని, చూశావా రామకృష్ణా, నీ గంగ కూడా మలిన మయింది అనే వేదన నిండిన వ్యంగ్యం?! వేదవ్యాసుడూ వాత్స్యాయనుడూ కూడా తప్పు పట్టలేని స్త్రీత్వంలోని పవిత్రతని ఆకాశంబు నందుండి శంభుని శిరంబందుడి శీతాద్రి సుశ్లోకంబయిన హిమాద్రి నుండి పవనాంధోలోకము వరకూ దిగజార్చి యెట్లా అపవిత్రతని అంటగట్టామో చూడగలిగిన వాడికి కళ్ళు చెదిరేటంత వైభవోపేతంగా చూపించాడు!


           ఈ సినిమాకి సంబంధించి అప్పట్లో మందాకిని తడిబట్టల సౌందర్యం ఒక పెద్ద సెన్సేషన్! సినిమా పత్రికల్లో సెంటరు స్ప్రెడ్డుగా అప్పటి కుర్రాళ్ళ మతులు పోగొట్టేసింది!! ఇంత దాకా అంత కళాత్మకంగా అన్నిట్నీ విడదీసి యెడం చేసి చూపించి ఇప్పుడు నేను మంచి బాలుణ్ణి అని పోజులు కొట్టినా మీరు నమ్మరు కాబట్టి నిజమే చెప్తున్నా - నేను ఆ సినిమా చూడ్దానికి వురక లేసిందీ ఆ సీను కోసమే :-)) తీరా సినిమా చూస్తుంటే సీను ఇలా వచ్చి అలా వెళ్ళిపోయి వుసూరు మనిపించింది? స్టిల్ ఫొటోలో వున్నంత కుదురుగా మూవీలో వుండదే! రాజ్ కపూర్ ఒక్క ఫ్రీజ్ షాటన్నా తగిలించి వుండగూడదా ఓ అయిదు నిముషాల సేపు?! ఇంకెవరన్నా తింగరి డైరెక్టర్ అయ్యుంటే అయిదు నిముషాలేం ఖర్మ, ఓ అరగంట నిలబెట్టేసే వాడు సీను నక్కడే! కానీ రాజ్ కపూర్ మంచివాడు గనక దానివలన సమాజంలో పుట్టే సంక్షోభాన్ని వూహించి, జనాభా పెరుగుదల వువ్వెత్తున యెగసి పడకుండా ఆపటం తన కర్తవ్యమని భావించి నిగ్రహంతో వ్యవహరించాడు! లేకపోయుంటే ఆయొక్క 1985 జులై నెల లోనే మన దేశ జనాభా పదింతలు పెరిగి వుండేది?!

           ఆంత ఇదిగా ఆ సీను కోసమే వెళ్ళినా బుధ్ధిమంతుడయిన తెలివైన కుర్రాణ్ణి గనక సినిమాలో రాజ్ కపూర్ చూపించిన మొదటి దృశ్యం లోనే లైటు వెలిగింది ఇది ఈ దేశపు సోషియో పొలిటికల్ కల్చర్ మీద సార్కాస్టిక్ రన్నింగ్ కామెంటరీ అని! ఒక మహానుభావుడు గంగని శుధ్ధి చెయ్యటం కోసం వుద్యమస్పూర్తితో అరిభీకరంగా వుపన్యాసం దంచుతూ వుంటాడు. అది వింటుంటే అసలు శుధ్ధి చెయ్యాల్సినంతగా మురికిని పట్టించటం దేనికి, ఇప్పుడు శుధ్ది చేసే పనుల్లో యెంత కొట్టేస్తాడు వీడు, యెన్ని రోజులకి మళ్ళీ ఈ శుధ్ధి కార్యక్రమం మొదలవుతుంది అనే ప్రశ్నలు యెన్నో వస్తాయి. ఆ టోపీని బట్టే యే పార్టీ వాడో ఈజీగా గుర్తు పట్టెయ్యొచ్చు?! అక్కణ్ణించి మొదలు పెట్టి సినిమాలో వచ్చే ప్రతి పాత్రా రాజ్ కపూర్ అనే ఒక సినిమా డైరెక్టర్ కల్పించిన పాత్రలా వుండకుండా సమాజంలో నుంచే తెర మీదకి నడిచి వచ్చి నేను ఇంతటి దగుల్బాజీ వెధవని చూడండి అని చూపించుకుంటున్నట్టు కదుల్తూ వుంటే ఇది కదా మంచి సినిమా అంటే అని గుర్తుపట్టి లీనమైపోయి చూశాను!

             సినిమా సుఖాంతమైపోయింది గాబట్టి అందరం హుషారుగానే బయటి కొచ్చేశాం! అలా నడుస్తూ వుంటే మా వాళ్ళిద్దరు సినిమాలో ఒక సీను గురించి తెగ పోట్టాడేసుకుంటున్నారు.సినిమాలో ఒక సీన్లో మందాకిని బిడ్డకి పాలిచ్చే సీను వుంది. రాజ్ కపూర్ దాన్ని జూం చేసి చూపించాడు. మా వాళ్లలో ఒకడికి ఆ సీను తెగ నచ్చేసి వూగి పోతుంటే రెండోవాడు తల్లి బిడ్దకి పాలిచ్చే దృశ్యాన్ని అట్లా చూడగూడదని వాణ్ణి క్రిటిసైజ్ చేస్తున్నాడు. రాజ్ కపూర్ చూపిస్తే చూడ్డంలో తప్పేంటి అని మొదటి వాడి కవుంటరు! కొంచెం దూరంగా నడుస్తుండటంతో మొదట్లో వీళ్ళ గోల అర్ధం కాలేదు, కొంచెం దగ్గిర కొచ్చాక సిట్యుయేషన్ అర్ధమయ్యి మొదటి ఫ్రెండుకి నేనొక ఫినిష్షింగ్ టచ్ ఇచ్చా, "రాజ్ కపూర్ పిచ్చోడై తియ్యలేదురా ఆ సీను అట్లా! నీలాంటి వాళ్ళతో పోట్లాడే రామారావుల్ని పెంచటానికే ఆ సీను అట్లా తీశాడు" అని?! దాంతో మావాడు సైలెంట్ అయిపోయాడు. వాడూ మంచి వాడే, కుర్రతనంలో వుండే తింగరి తనం అట్లా వుంటుంది?!

        ఇట్లాంటి వాణ్ణి పట్టుకుని తెలుగు సిన్మారంగం లోని ఒక మాంసఖండాల విక్రేతతో సమానం చేశారు మన తెలుగు వాళ్ళు! ఆ అధముడికి ఆంధ్రా రాజ్ కపూర్ అని బిరుదు నిచ్చారు? వాడు నిజంగా అధముడే!ఒక పెద్దమనిషి ఇంటికి వెళ్ళి ఆ ఇంటి యజమాని ముందే అతని తల్లి ఫొటోని చూసి ఇంత నల్లగా అసహ్యంగా వుందేమిటని కూశాడట! ఆ పెద్దమనిషి చెప్పు తీసేలోగా పారిపోయాడట! నాలుగు దబ్బు లొచ్చే సినిమాలు తీస్తున్నాడనే ఒక్క కారణం తప్ప యే గొప్పా లేని ఇట్లాంటి వాళ్ళకి యెంత మెహర్బానీలు చేస్తున్నారు?

           రాజ్ కపూర్ మంచి ఫిలాసఫీ వున్నవాడు! నాకు నచ్చిన వాడని డప్పాలు కొట్టటం కాదు, అతనొక మంచి మాట చెప్పాడు - నేను నా పర్సనల్ కలెక్షన్లో దాన్ని ఫ్రేం కట్టి మరీ అతికించుకున్నా! "ఆఫ్టరాల్, మనిషికి యేం కావాలి?  కడుపు నిండా తిండి,సుఖనిద్రా - ముఖ్యంగా ఇవ్వాళ కన్నా రేపు మరింత బాగుంటుందనే నమ్మకం!ఆ ఆశ చాలు ఆ మనిషిని యెన్ని కష్టాలయినా భరించి బతికి వుండేలా చేస్తుంది." - అన్నాడు. చాలా మామూలు నిజం, కానీ అది అతని అనుభవ సారం! ఆ ఆశ లేకపోబట్టే గదా అన్ని మంచి సినిమాల్లో నటించి అంతమంది అభిమానుల్ని సంపాదించుకుని గూడా వుదయ్ కిరణ్ లాంటి వాళ్ళు అమాయకంగా చచ్చిపోతున్నారు!

ఆశావాది యైన రాజ్ కపూర్ నిత్యబాలకుడు!

            సత్యజిత్ రే లాంటివాళ్ళు మేధావులకు మాత్రమే అర్ధమయ్యే సినిమాల్ని తీసి పండితుల్ని రంజింప జేస్తే,మన్ మోహన్ దేశాయ్ లాంటివాళ్ళు వినోదాన్ని మాత్రమే తీసుకుని పామరుల్ని రంజింప జేస్తే - ఆ రెంటినీ సమపాళ్లలో కోరుకునే నాలాంటి తింగరి వెధవల్ని కూడా సంతృప్తి పర్చగలిగిన సమర్ధుడు రాక్ కపూర్!
______________________________________________________
(ఫొటోలు గూగుల్ సౌజన్యం)

Monday 22 September 2014

యే ప్రాంతం చరిత్ర చూసినా యేమున్నది గర్వకారణం?!

               అధికారం వచ్చి ఒకలాగా పోయి ఒకలాగా కొందరు మనుషుల్ని చెడగొడుతుందేమో!ఇదివరకు అవునన్న దాన్ని కాదనడమూ కాదన్నదాన్ని అవుననడమూ అవసరమై పోతుంది కాబోలు?

                  ఈరోజు వీళ్ళ రాజకీయ అవసరాలు తెలియకనో యేమో ఆనాడు వుద్యమంలో పాల్గొన్న యే ఒక్క వ్యక్తీ ఒక్క మంచిమాట నిజాము గురించి చెప్పకపోవటం చేత ఇప్పటి మేధావులు కొందరు పడుతున్న ఇబ్బందిని చూస్తుంటే జాలిగా వుంది!రావి నారాయణ రెడ్ది గారిలాంటి వాళ్లవి వ్యక్తిగత అభిప్రాయాలట! అందుకని వీళ్ళు ఇప్పుడు లండన్ వరకూ వెళ్ళి ఆర్కైవ్స్ నన్నీ తవ్వి తీసి అధారాలతో సహా నిజాము మంచివాడని నిరూపించడానికి పరిశోధనలు చేస్తారట!!

                అప్పుడు తాము చూసి విసుగు పుట్టి పోరాటం చేసిన విషయాలన్నిటినీ  నిజాయితీగా గ్రంధస్తం చేసిన జ్ఞాపకాలు చెప్పని కొత్త సంగతుల్ని పనిగట్టుకుని వెతకట మంటే తమ ముందు తరాల పెద్దల నిజాయితీని శంకిస్తున్నట్టు కాదా? అసలే సంక్లిష్తమయిన తెలంగాణా చరిత్రని మరింత సంక్లిష్టం చెయ్యడం అవసరమా? అన్ని కాలాల్నీ వెతికినా గర్వంగా స్మరించుకోవడానికి మొత్తం తెలంగాణా చరిత్రలో ధర్మప్రభువులే కరువైనారా?

               ఇటు చూస్తే తెలంగాణా సమాజం మొత్తం కోటి ఆశలతో కొత్త ప్రభుత్వం తమ జీవన స్థాయిని మెరుగు పరుస్తుందనే ఆశతో కేవలం ఒక సర్వే కోసం దేశం నలుమూలల నుంచీ పరుగులు తీస్తూ వచ్చి ప్రభుత్వానికి తమ వైపు నుంచి ప్రతిస్పందనని అద్భుతంగా చూపిస్తే దాన్ని వుపయోగించుకుని ప్రజలకి నిజమైన సౌభాగ్యాల్ని సమకూర్చడానికి కాకుండా ఇలాంటి దొమ్మీ తగాదాల్తో కాలాన్ని వ్యర్ధం చేస్తున్నారే?!

                నేను మొదట్లోనే చెప్పాను - తెలంగాణాకి ముందరున్న సమస్యలకి తోడు వుద్యమ నేత కలిపిన కొత్త సమస్యలు చాలా వున్నాయని!ఇప్పుడు అవి చాలవన్నట్టు ఆ సమస్యల్ని పరిష్కరించాల్సిన తనకి తనే కొత్త సమస్యల్ని సృష్టించుకుంటున్నాడు? బంగారు తెలంగాణా పునర్నిర్మాణం సంగతి దేవుడెరుగు అసలు ప్రశాంతతే కరువైపోయి తను తెచ్చింది కంగారు తెలంగాణా అనిపించే విధంగా నక్సలైట్లు తమ తొలి అడుగు వేశారు! టీవీ చానళ్ళ లాగా యేమ్మెస్వోలతో నొక్కేస్తే నోళ్ళు బందు చేసుకునే కుందేళ్ళు కాదు వీళ్ళు, యెంత బలంతో నొక్కితే అంతకు పదింతల బలంతో లేస్తారు!

           వుద్యమ కాలంలో రెచ్చిపోయి నోటికేదొస్తే అది మాట్లాడేశాడు, ఇప్పుడు తను మాట్లాడిన మాటల్నే ప్రశ్నలుగా సంధిస్తున్నారు! వాటికేమి జవాబు చెప్తాడు? అవి తన మాటలే గాబట్టి అవునన్నా కాదన్నా తంటాయే!నేనలా అన్లేదని తిప్పెయ్యటానికి ఇదివరకట్లా కుదరదే, అన్నవాడు తను మర్చిపోయినా విన్నవాళ్ళు అక్షరం పొల్లుపోకుండా అప్పజెప్తున్నారు.

           యెదటి వాళ్లని నో ఆప్షన్స్ అని గద్దించిన దొరగారికి ఇప్పుడు రెండే రెండు ఆప్షన్లు వున్నాయి.నాదీ మావోఇష్టుల పంధాయే అని డాంబికాలు పోయినందుకు కిక్కురు మనకుండా వాళ్లకి నచ్చేలా పరిపాలించటం. వాళ్ళు కూడా దాంతో సరిపెట్టుకునే రకాలు కాదు గాబట్టి అది జరిగే పని కాదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీదా చట్టబధ్ధ పరిపాలన మీద వాళ్ళకి సుతరామూ నమ్మకం లేదు, సాయుధ పోరాటంతో అధికారాన్ని చేజిక్కించుకోవటమే మా లక్ష్యమని కుండబద్దలు కొట్టి చెప్తున్నారు.యెన్నికల్లో పోటీ చేస్తున్న రాఘవులూ నారాయణల్నే వాళ్ళు రివిజనిష్టులని వెటకారం చేస్తున్నారు. వాళ్ల కనుకూలంగా పరిపాలించడం అంటే అధికారం వాళ్ల కప్పగించేసి తను వాగినట్టే పౌరహక్కుల సంఘానికి నాయకుడిగా సర్దుకుపోవటం అన్నమాట! ఇక రెండోది యే మాత్రమూ సిగ్గు పదకుండా నక్సలైట్లని క్రూరంగా అణిచి వెయ్యటం?!మారిన ఇప్పటి పరిస్తితుల్లో అదీ అంత వీజీ కాదు!యేకఖండంగా  వున్నప్పుదు మూడు ప్రాంతాల్నుంచీ పోలీసు బలగాల్ని సమీకరించినా సాధ్యపడనిది ఇప్పుడున్న తక్కువ బలగంతో యెలా సాధ్య పడుతుంది?

            చిలక్కి చెప్పినట్టు చెప్పారు,విన్నాడా?మీరు మమ్మల్ని అగుమానిస్తున్నారు, తెలంగాణాలో పుట్టే ప్రతి పిల్లగాడూ తుపాకీ భుజానేసుకుని పుడ్తాడా అని గొప్పలు పోయాడు.మిగతా మేధావులు కూడా అప్పటి హైదరాబాదు ప్రభుత్వమూ ఆంధ్రా ప్రభుత్వమూ యెందుకు కలిసాయో తెలీని అమాయకులా  మమ్మల్ని బలవంతంగా కలిపారు అని ఇవ్వాళ అంటున్నారు?నక్సలైట్లు మరియూ కమ్యునిష్తుల ప్రాబల్యాన్ని తగ్గించడానికే - పైకి అలాంటి కారణాలు చెప్పడం సభ్యతగా వుండదు కాబట్టి -  భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనే నినాదాన్ని వుపయోగించుకుని వాళ్ళ తంటాలు వాళ్ళు పడ్డారు!ఇవ్వాళ ముందుకు వెళ్ళాల్సిన చరిత్రని యాభయ్యేళ్ళు వెనక్కి నడిపించి రాష్ట్రాన్ని మళ్ళీ నక్సలైట్ల సాయుధ పోరాట సిధ్ధాంత ప్రయోగశాలగా మార్చటం జరిగింది!నక్సలైట్లని అణిచెయ్యటం గానీ వొదిలెయ్యటం గానీ యేదీ కూడా తెలంగాణాని ప్రశాంతంగా వుంచదు.ఒక్క తెలంగాణాతో ఆగదు.దండకారణ్యం మూడు రాష్ట్రాలకు మధ్యన విస్తరించి వుంది.ఇక్కడ కొడితే అక్కడికీ అక్కడ కొడితే ఇక్కడికీ కదులుతూ వస్తున్నారు.ఇప్పుడు నాలుగు రాష్ట్రాలు ప్రమాదంలో పడినాయి. వీళ్లలో ఒక మావోఇష్టు సభ్యుడు గుంటూరు దగ్గిర పట్టుబడ్డాడు. అసలు మొదట్లో బలహీన పడిపోయి ఆయనగారు కన్నీటి పర్యంతం అయిన దుస్థితిని కూడా చూసి మళ్ళీ పైకి లేచిందంటే వాళ్ళ వ్యూహాత్మక చేరిక వల్లనే కదా! వుద్యమ కాలంలో వాళ్ళంతా హోరెత్తించిన పాటలూ,  ఆంధ్ర అనే మాట పక్కన చేర్చిన "దోపిడీదారులు","అధిపత్యవర్గాలు","వలసవాదులు","పెట్టుబడిదారులు" అనే పదజాలమంతా యెవరిది? అంత వ్యూహాత్మకంగా వుద్యమాన్ని నడిపించిన వాళ్ళు తమ లక్ష్యం నెరవేరిన తర్వాత వెనుకంజ వేస్తారనుకోవటం మూర్ఖత్వం?!

          మొన్నటి రోజున వుద్యమానికి యెంతో బలమిచ్చి నిన్నటి రోజున చెప్పులు విసిరి తిరస్కారం చూపించిన వుస్మానియా కుర్రాళ్ళు కూడా రంగం లోకి దిగారు!ఈ దేశపు రాజకీయ వుద్యమాల చరిత్రలో కుర్రాళ్లని ఆపగలిగిన ప్రభుత్వం యేదయినా వుందా?అణిచివేతలో వీళ్ళు అమరులైతే ఆ 1200మందికీ అదనంగా చేరుస్తారా, కొత్త ఖాతా యేదయినా తెరుస్తారా?

       ఇంతకు మించి యేమయినా మాట్లాడితే నువ్వు పొరుగు రాష్త్రం వాడివి మా సంగతి మీ కెందుకోయ్ అంటారేమో, కానీ ఇవ్వాళ ఇది కేవలం తేలంగాణా వాళ్ళ సమస్య మాత్రమే కాదు దేశాన్నంతట్నీ కుదిపేస్తుంది! బాబు 2019లో తెలంగాణాలో గెలవడం గురించిన భ్రమల్ని వొదిలించుకుని రాజధాని పనులు ముమ్మరం చేసి వీలయినంత తొందరగా పరిపాలన మొత్తాన్నీ ఆంధ్రా నుంచి సాగించే విధంగా అక్కణ్ణించి బయటపడకపోతే ఆ కుమ్ములాటల్లో తనూ దారి తప్పిపోయి మన రాష్ట్రం అన్యాయమైపోతుందని నా బెంగ!

అంతం కాదిది ఆరంభం

Thursday 11 September 2014

ప్రపంచంలోని రామభక్త హనుమాన్లందరికీ ఇదే నా ఆహ్వానం!

              ఒక సిధ్ధాంతం సారంలో యెంత గొప్పదయినా కావచ్చు,ఆచరించే వాళ్ళు తెడ్డుశ్రీ లయితే యెలా అఘోరిస్తుందో తెలుసుకోవాలంటే ముతప్పాళ కురంగీన్యాకమ్మ నీ ఆవిడ భక్తుల్నీ చూఒసి తెలుసుకోవచ్చు!నువ్వు కమ్యునిష్టువా కమ్యునిష్టేతరుడివా అనే ప్రశ్నతో సంబంధం లెకుండా ప్రతివాడూ పాటించాల్సిన మానవ సహజమైన మర్యాదలు కొన్ని వుంటాయనేది కూడా లేకుండా నిన్న గాక మొన్న చనిపోయిన బాపు అనే చిత్రకారుణ్ణి వీళ్ళు బజారు కీడుస్తున్న పధ్ధతి చూస్తూ వుంటే వీళ్ళు కమ్యునిజాన్ని తీసుకు రావాలనుకుంటున్నది మనుషుల్లోనా పశువుల్లోనా అనే అనుమానం వస్తున్నది?

              ఇంతకీ వీళ్ళ ఆరోపణ యేమిటంటే ఆ మహా రచయిత్రి ఒక గొప్ప కావ్యం రాస్తే దానికి బొమ్మలు వెయ్యనని తిరస్కరించటం? వెయ్యనంటే వెయ్యనని చెప్పొచ్చుగా అది చెక్కో/డీడీయో గానీ దాని వెనకాల రామ రామ అని రాసి తిప్పి పంపటం దేనికీ అని వీళ్ళ గోల, విన్నవాళ్ళు నవ్వుతారని కూడా లేదు వీళ్ళకి. చెక్కు గానీ డీడీ గానీ ఒకసారి ఒక వ్యక్తికి పంపించాక అది యేమయినా పంపించిన వాడికి అనవసరం. తీసుకున్న వాడు దాన్ని క్యాష్ చేసుకుంటే నీ యెక్క్కవుంటు లోంచి దబ్బు పోతుంది. న్లేదంటే చించేసినా దాచుకున్నా అది చెల్లని ట్రాన్సాక్షన్ గా కొంత కాలమయ్యాక మురిగి పోయి నీ డబ్బు నీ దగ్గీరే వుంటుంది. దాని కంత యేడుపెందుకు?

            వెనక్కాల రాసిన రెండు + రెండు నాలుగక్షరాలకే ఇన్నేళ్ళ తర్వాత గూడా యేడిచేటంతగా మనోభావాలు గాయపడితే మరి ఆ పుస్తకంలో వున్న విషయానికి మా మనోభావాలు యెంత గాయపడాలి? మనుషు లందరికీ యేది చెయ్యాలి యేది చెయ్యగూడదు అనే లెక్కకి, "యెదటి వాడు యేమి చేస్తే నీకు  కష్తం కలుగుతుందో అది నువ్వు యెదటి వాడికి చెయ్యక పోవటం" అనే మర్యాదని వాళ్ళు పాటించరా? సరే, ఒప్పుకుందాం! కేవలం ఆవిడ శైలిలోనే జవాబు చెప్పటం తప్ప అభ్యంతరకరమయిన పదాలేమీ నేను వాడలేదని తెలుస్తుంది.అందులో కొన్ని టైపోస్ ని సవరించి ఇక్కడా ఇస్తున్నాను, చూడండి.

===============
రంగనాయకమ్మ రామాయణాన్ని విమర్సించిన తీరు యెంత అసహ్యంగా వుందో ఒక వుదాహరణ చెప్తాను;
రాముదు శూర్పణఖని చూడగానే లొట్టలేసుకుంటూ చూశాడట!ఆహా!! సీతకన్నా ముందు ఈవిడ(?) కనబడితే ఈమెనే పెళ్ళాడి వుండేవాణ్ణి, ఇప్పుడు చేసుకుంటే జనం నా యేకపత్నీవ్రతాన్ని అనుమానిస్తారేమో అని కంగారు పడ్డాడట!

తనలాంటి మరో రచయిత రాసిన పుస్తకాన్ని విమర్శించేది ఇలాగేనా? ఆ రచయిత ఒక పాత్రని ఒక పధ్ధతిలో సృష్టిస్తే ఆ పాత్రని అవహేళన చేస్తూ కాదు కాదు, ఆ కధ అలా జరగలేదు, ఇలా జరిగింది అని పులుముడు తెలివి చూపిస్తే యెలా వుంటుందో తెలుసా?

నేను జానకి విముక్తి నవల్లొని పాత్రల గురించి, "ఆ జానకి నాకు తెలుసండీ!వాళ్ళు మా ఇంటికి మూడిళ్ళ పక్కనే వుండే వాళ్ళు!! తనకి కనిపించిన మగాడి కల్లా కన్ను కొట్టే అలవాటుండేది, అందుకే వాళ్లత్తా మొగుడూ అలా తిట్టినా కొట్టినా పడి వుంటుంది!" అని అంటే యెలా వుంటుందో అలా వుంటుంది.

కొన్ని లక్షల మంది ఆ కావ్యాన్ని గౌరవిస్తున్నారు అనేది కూడా గట్టి పాయింటు కాదు, విమర్శించిన పధ్ధతి చెత్తగా వుందనేది మాత్రం తిరుగు లేని సత్యం!

ఇక పోతే బాపు గానీ రమణ గానీ వాళ్ళ ప్రవృత్తి లోనే హాస్యం వుంది, వాళ్ళ సహజ ప్రవృత్తి తో ఒక కొంటె పని చేసారు. ఒక సీరియస్ పుస్తకాన్ని చెత్తగా విమర్శించడంతో పోలిస్తే ఆ కొంటెతనం అభ్యంతరకరమైనది కానే కాదు.
===============

             ఈవిడ విషవృక్షం రాయక ముందు స్వీట్ హోం, బలి పీఠం, ఇంకా ఇలాంటి యద్దనపూడి టైపు ఫామిలీ నవల్లు రాసుకుంటూ వుండేది కాస్తా మేధావుల్లోకి యెక్కేసింది - రాముణ్ని తిట్టి గొప్పదయింది?! సాహితీ విమర్శలు ఆర్.యస్.సుదర్సనం గారూ చేసారు, ఈవిడా చేసింది - రెంటికీ హస్తి మశకాంతరం, కాదా!! రామాయణం నిజంగా జరిగిన కధ అయితే అప్పటి కాలంలో వున్న వాస్తవమయిన విషయాల్ని చూపించి వాల్మీకి చెప్పిన అబధ్ధాల్ని నిరూపించాలి.కానీ ఒక కవి రాసిన పాత్రల్ని మరో రకంగా చిత్రీకరించటం యెంత తప్పో తెలియజెప్పాలనే ఒక స్త్రీ పాత్రకి కన్ను కొట్టటం ఆపాదించటం జరిగింది. ఒకవేళ నేను చేసిందానికి చివుక్కు మనే సుకుమారులు ఆవిడ చేసిన దుర్మార్గానికి ఇంకా బాధ పడాలి మరి?!

            నిన్నటి రోజున ఈవిడ రాసిన పుస్తకాలు ఇవ్వాళ యెంతమంది చదువుతున్నారో తెలియదు, కానీ యావత్ స్వాస్థ్యంతి గిరయః అని చెప్పుకున్న వాల్మీకి కన్నా తను గొప్పదని ఆవిడా ఆవిడ అభిమానులూ యెలా అనుకుంటున్నారు!నక్కెక్కడ నాక మెక్కడ? 

        కాబట్టి ఇప్పుటి కయినా శివద్వేషులే నా ఆహారం అనే వీరభద్ర పెరుమాళ్ లాగా రామ భక్తు లంతా వీర హనుమాన్ల మాదిరి ఈ తింగరి మాటలు మళ్ళీ మళ్ళీ  రాకుండా ఒకేసారి గట్టి ప్రతీకారం చెయ్యాలి! ఆవిడింకా బతికి వుండగానే తేల్చుకుంటే ఓ పనై పోతుంది! బెజవాడ లోనో హైదరాబాదు లోనో యెక్కడ వుంటే అక్కడి కెళ్ళి ఇదే ప్రశ్నని తన ముఖం మీదనే అడగాలి, యేమి చెబుతుందో చూద్దాం?

జై శ్రీ రాం!     జై శ్రీ రాం!!     జై శ్రీ రాం!!!


Saturday 6 September 2014

కాంగ్రెసుని ద్వేషించటం నా జన్మ హక్కు?! (మోహన్ దాస్ కరంచంద్ గాంధీ)

                  సోనియా గాంధీ అనే పేరుతో వ్యవహరించబడుతున్న ఆంటోనియో మైనో అనే రాజమాతని కానీ, కాలం కలిసొచ్చి యూపీయే-3 కల నిజమయితే ప్రధాన మంత్రి అయ్యే రాహుల్ గాంధీ గా పిలవబడుతూన్న యువరాజు రావుల్ విన్సీ ని కానీ, మరే కాంగ్రెసు వాది నయినా సరే మోహన్ దాస్ కరం చంద్ గాంధీ అనే వ్యక్తి గురించి ఒక ఐదు నిముషాల పాటు వినేవాళ్లకి బోరు కొట్టకుండా ప్రసంగించమని చాలెంజి విసిరితే ఫలితం యెలా ఉంటుంది? "మోహన్ దాసా, ఆడెవడు?" అని గద్దించి అడిగినా ఆశ్చర్య పోనక్కర్లేదు!

                100+ వయసు గల కాంగ్రెసు పార్టీ లోపలి పరిస్థితి అలా ఉంటే ఈ దేశ ప్రజల మనస్థత్వం యెలా ఉందో తెలుసా? కాంగ్రెసు యెన్ని కుంభకోణాలలో కూరుకుపోయినా, యెంత దరిద్రంగా పరిపాలించినా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనని యెంత చెయ్యగూడని విధంగా చేసినా యెన్నికల్లో కాంగ్రెసుకి ఆంధ్రా లోనే కాకుండా మొత్తం దేశమంతటా అన్ని వోట్లు యెలా పడినయ్యో, ఇకముందు కూడా యెందుకు పడుతూనే ఉంటాయో తెలుసా? ఈ దేశ ప్రజలు కాంగ్రెసుని మహాత్ముడు అని భావిస్తూ ఉన్న మోహన్ దాస్ కరంచంద్ గాంధీతో అనుసంధానించుకుని అతని మీద ఉన్న అభిమానాన్నే ఆ పార్టీ మీదకి ప్రసరింపజేస్తున్నారు! ఒక సారి కాంగ్రెసుకు వోటు వెయ్యడానికి నిశ్చయించుకుంటే ఆ వ్యక్తి యెదటివాళ్ళు ఆ పార్టీ మీద యెన్ని ఆరోపణలు చేసినా అవి నిజమే అని తేలినా కాంగ్రెసుకే వోటు వేస్తాడు. అతనికి తన కళ్ల ముందున్న అవినీతి పరులూ, అసమర్ధులూ కనపడరు, కేవలం మహాత్మా గాంధీకి సంబంధించిన పార్టీకి మాత్రమే తను వోటు వేస్తున్నా ననుకుంటాడు. అలాంటి సాంప్రదాయికమయిన వోటర్లు ఉన్నంత కాలం కాంగ్రెసు ఈ దేశపు రాజకీయ చిత్రపటం మీద తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటుంది.

             1885లో స్థాపించబడినప్పటికీ కాంగ్రెసు అనే ఒక సంస్థ ఉన్నదనీ అది అప్పుడున్న ఆంగ్లేయుల పరిపాలనని అంతమొందించి దేశ స్వాతంత్ర్య సముపార్జన కోసం ప్రయత్నిస్తున్నదనీ సామాన్యులతో సహా అందరికీ కాంగ్రెసులోకి ఇతని ప్రవేశం జరిగిన 1920 నించే తెలిసింది. సరిగ్గా ఇతని రంగ ప్రవేశం జరిగే నాటికి నేను మొదటి భాగంలో చెప్పినట్టు ఒక రాజకీయ ప్రళయ త్రికోణం యేర్పడి ఉంది కదా!ఇతనికి ఆనాటి కాలమూ చరిత్రా నిర్దేశించిన కర్తవ్యం ఆ త్రికోణానికి మధ్యన ఉండి యే మూలనీ అతిగా సాగనీయకుండా కలిపి ఉంచటం.

             కొల్లాయి గట్టటం లాంటివాటితో ఈరోజు నిరాదంబరంగా వుండటానికి గుర్తుగా వున్నాడు గానీ భారత రాజకీయ రంగంలోకి ఇతని ప్రవేశం మాత్రం ఒక యుధ్ధాన్ని గెలిచి రాజధానికి చేరుకునే రాజాధిరాజుకు తన రాజ్యంలోని ప్రజలు ఇచ్చే ఆహ్వానం తో పోల్చదగినంత వైభవోపేతంగా జరిగింది. దానికి కారణం ఇక్కడ మనల్ని ఆక్రమించుకున్న ఇంగ్లీషు వాళ్ళే యేలుతున్న దక్షిణాఫ్రికాలో ఒక సరికొత్త రకపు తిరుగుబాటుకు తెరతీసి సంచలనాన్ని రేకెత్తించటం.

                ఇతను 1869లో అక్టోబర్ 2న పోర్బందర్ జిల్లా లోని సుదామపురి అనే నగరంలో పొర్బందర్ సంస్థానంలో దివానుగా పనిచేస్తున్న కరం చంద్ గాంధి కి నాలుగో భార్య అయిన పుత్లీబాయ్ ద్వారా పుట్టాడు. మోహన్ దాస్ తన తండ్రి యొక్క సంతాన మందర్లోనూ చిన్నవాడు. ఇద్దరు అన్నలూ ఒక అక్క. ఇతనికి 13 యేళ్ళ వయసులో 14 యేళ్ళ కస్తుర్బాయ్ మఖంజి తో అప్పటి సాంప్రదాయాల కనుగుణంగా వివాహం జరిగింది.
       మాధ్యమిక విద్యాబ్యాసం పోర్బందర్ లోనూ ఉన్నత విద్య(హై స్కూలు చదువు) రాజ్కోట్ లోనూ జరిగింది.చదువులో చాలా చాలా చాలా మామూలు స్థాయి విద్యార్ధి. క్లాస్రూం లోనూ ప్లేగ్రవుండు లోనూ మనోడు నస్మరంతి గాడే! సంవత్సరాంతపు రిపోర్టు ఇలా వుండేది, "ఇంగ్లీషులో గుడ్డు, లెక్కల్లో ఫెయిరు, జాగర్ఫీలో వీకు, కాండక్టు అదుర్సు మరియూ చేతి రాత దరిద్రం" - అయ్యా అదీ సంగతి. పాపం ఇవే లోపాలు మన పిల్లల్లో వుంటే యెంత యాగీ చేస్తున్నాం - పనికి రాకుండా పోతావురా బడుధ్ధాయా అని?!

       బావనగర్  లోని సమల్దాస్ కాలెజి నుంచి మెట్రిక్యులేషన్ యెలాగోలా గట్టెక్కించాడు! బారిస్టర్ గిరీ వెలగబెడితే తండ్రి పోష్టయినా దక్కుతుందేమో నని 1888లో లండన్ కి ప్రయాణం కట్టాడు.1891లో అది పూర్తి చేసి ఇండియాకి వొచ్చి పడ్డాడు. బొంబాయిలో లా ప్రాక్టీసు మొదలెట్టి సాక్షుల్ని క్రాసెక్జామిన్ చెయ్యడంలో మానసికంగా సమర్ధుడు కాకపోవటం చేత ఆ వృత్తికి పనికి రాక రాజ్కోట్ కి తిరిగొచ్చి లిటిగెంటులకి పిటిషన్లు రాసి పెట్టటానికి మాత్రం పరిమితమై పోయాడు. ఒక బ్రిటిష్ ఆఫీసర్ తో యేదో సంథింగ్ సంథింగ్ ఇనక్కు ఉనక్కు అయ్యేసరికి అదీ బలవంతంగా ఆపెయ్యాల్సి వచ్చింది. ఏ మలుపూ లేకుండా అతని జీవితం ఇలాగే గడిచి పోతే ప్రపంచంలోని అసంఖ్యాక మయిన చెట్టు కింద ప్లీదర్లలో ఒకడిగా అనామకంగా మిగిలి పోయే వాడు?

           1893లో దక్షిణాఫ్రికా నటాల్ ప్రాంతంలోని అబ్దుల్లా & కో నుంచి ఒక సంవత్సరానికి ఆకర్షణీయమయిన £105.00 నెల జీతపు కాంట్రాక్టును ఒప్పుకుని తన 24వ యేట దక్షిణాఫ్రికాలో అడుగు పెట్టాడు. ఇక్కద గడిపిన 21 యేళ్ళూ ఇతని రాజకీయ పరమయిన భావజాలానికీ, నాయకత్వ లక్షణాలకీ పునాదిని యేర్పరచాయి. స్వదేశంలో దారుణంగా ఫెయిలయిన వాడు ఇక్కడ అద్బుతంగా చెలరేగి పోయాడు. దానికి కారణం క్రాసెగ్జామినేషన్లో తన వీక్నేసు తనకి తెలుసు గనక కోర్టులో అడుగు పెట్టే పని లేని ఒక ట్రిక్కు ప్లే చేశాడు, తన అదృష్టం బాగుండి అది గారెల బుట్టలో పడేసింది - సొమ్ముల పంట పండించింది! అదేమిటంటే కోర్టు బయట రాజీలు చెయ్యటం! ప్రపంచంలో ఇతనికి తప్ప మరెవరికీ లాభసాటిగా వుండనంత వింతయినదీ ట్రిక్కు? డబ్బులు చేతి నిండా వుండటం వల్ల రైళ్ళలో యెప్పుడూ మొదటి తరగతి టికెట్టునే తీసుకోవటం, తెల్లవాళ్ళు మాత్రమే విడిది చెయ్యగలిగిన ఖరీదయిన హోటళ్లలో మకాం చెయ్యటమూ, మొండితనం వుండటం వల్ల ఆ ప్రయాణాల్లో యెంతగా అవమానాలకి గురయినా వాటిని కొనసాగించటం మిగతా భారతీయుల్లో ఇతని పట్ల ఒక రకమయిన హీరో ఇమేజిని తెచ్చి పెట్టాయేమో? రైల్లోంచి తోసేస్తే దులుపుకుని పోవటం, ఒక హోటల్ నుంచి గెంటేస్తే మరో హోటల్ కి వెళ్ళడం తప్ప ప్రతిఘటించి పోరాటా లేమీ చెయ్యలేదు, యెందుకనో?

         అప్పుడు అక్కడి శ్వేత జాతి దుర్మార్గపు విధానాల్ని అర్ధం చేసుకునేందుకు వీలుగా కొంచెం అప్పటి దక్షిణాఫ్రికా పౌర సమాజ వాతావరణాన్ని తెలుసుకోవాలి. అసలు దక్షిణాఫ్రికా ప్రజలు పల్లెల్లో వుండేవాళ్ళు, రైతులుగా, బైతులుగా, వేటగాళ్ళుగా - అదీ దేశ మంతటా చెల్లా చెదురుగా వుండే వాళ్ళు. తెల్లవాళ్ళకి వాళ్ళతో సమస్యలు లేవు. కానీ భారతీయులు అలా కాదు, వ్యాపారాల్లో ఆరి తేరి పోయి వుండటం, లేదంటే బాగా చదువుకుని గాంధీ లాగా మంచి ఆదాయాల కోసం రావడం వల్ల తెల్ల వాళ్లకి వీళ్ళు గట్టి పోటీగా తయారయ్యారు. వీళ్లని నిరోధించటం కోసమే సరిగ్గా 1890ల నాటికే నల్ల చట్టాలు చెయ్యటం మొదలు పెట్టారు.

        1893 నుంచి 1914 వరకూ పిటిషన్లు రాయడంలో తన ప్రావీణ్యతని వుపయోగించుకుని కోర్టులకీ గవర్నమెంటు లోని వాళ్ళకీ పిటిషన్లు తగిలిస్తూ మధ్య మధ్యలో ఇండియాకీ ఇంగ్లాండుకీ తిరిగి మద్దతు కూడగట్టుకుంటూ ఆ ఇరవయ్యేళ్లలో విపరీతమయిన ప్రచారాన్ని తెచ్చుకున్నాడు. ఇతని యెదుగుదలకి దక్షిణాఫ్రికా మీడియా కొన్నిసార్లు మెచ్చుకుంటూ, కొన్నిసార్లు వెక్కిరిస్తూ తన వంతు పాత్ర తను పోషించింది. ఒక రకంగా మొత్తం సమాజాన్ని దీర్ఘకాలికమయిన శాంతియుతమయిన సర్వతోముఖమయిన అభివృధ్ధి పధంలోకి నడిపించగలిగిన జ్ఞాన సంపదా, దూరదృష్టీ యేమీ లేకుండా - ఒక గందరగోళపు భావజాలంతో తాత్కాలికమయిన వుద్రేకాల్ని సృష్టించి MRTP రేటింగుల మీద యావే తప్ప ప్రజల పట్ల నిబధ్ధత లేని మీడియా తన వంతు పాత్ర తనూ పోషించగా మహామహులుగా కీర్తించబడుతున్న ఇవ్వాళ్టి విభజన వాద వుద్యమ నేతల లాంటి వాడే అయినా, సహజంగా మనుషుల్లో వుండే(మేధావుల్లో కూడా) - నిశితంగా పరిశోధించడానికి వీలు పడనివ్వని - బౌధ్ధిక అలసత్వం వల్ల మరో విధంగా రూపం మార్చుకుని ప్రపంచ రాజకీయ చిత్రపటం మీద మహాత్ముడిగా మనగలుగుతున్నాడు.

        1899లో బోయరు యుధ్ధంలో 1100 మంది భరతీయుల్ని తెల్లవాళ్ళ తరపున యుధ్ధంలో సాయం చెయ్యతానికి వొప్పించి తను నాయకత్వం వహించి  Indian Ambulance Corps పేరుతో తెల్లవాళ్ళ ప్రభుత్వానికి సహాయ పడ్డాడు - వీళ్ళపట్ల దుర్మార్గంగా వున్నాప్పటికీ? "పాలకులు అన్నిసార్లూ న్యాయముగా ప్రవర్తించ లేకపోయిననూ పాలితులు రాజ్యానికి అనుసంధానించబడి వున్నంత కాలమూ పాలకులకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించరాదు" ట! మొదటిసారి నేను ఈ అభిప్రాయం చదవగానే "ఆండాళ్ళూ నీకేమయినా అర్ధ మయిందా" గుర్తొచ్చి చక్కిలిగింతలు పెట్టినంత నవ్వొచ్చింది! కానీ "ఏ రాజ్యమైనా తిరుగు బాటు చేసిన ప్రజలను తీవ్రంగా అణచి వేస్తుంది. అందులో మారణకాండ, మాన ప్రాణ హాని సర్వ సాధారణం. మేం వాటిని డాక్యుమేంట్ చేసుకున్నాం. మీరు గుర్తించడానికే నిరాకరిస్తున్నారు... అంతే తేడా" అని అంటున్న ఈ కాలపు మేధావి అభిప్రాయాన్ని చూసినప్పుదు మాత్రం భయంగా అనిపించింది?! మోహన్ దాస్ కరం చంద్ గాంధీ అనే ఈ వ్యక్తిని అర్జెంటుగా  భారత రాజకీయ రంగం నుంచి అడృశ్యం చెయ్యక పోతే చాలా ప్రమాద మనిపించింది!

            అందరూ శాంతియుత ప్రతిఘటన, సహాయ నిరాకరణ, సత్యాగ్రహం అనే ఇతని సిధ్ధాంతాలకి భగవద్గీత నుంచి స్పూర్తి తీసుకున్నాడని పదే పదే చెప్పగా విని మొత్తం 700 పై చిలుకు వున్న శ్లోకాల్ని ఇటు నుంచి అటూ అటు నుంచి ఇటూ గిలకొట్టి చదివినా ఒక చెంప మీద కొడితే మరో చెంపని చూపించటం, కూడూ నీళ్ళూ మానుకుని కూర్చోవటం లాంటి తింగరి చేష్టలకి వుత్సాహ పరిచే సాక్ష్యాలు నా కెక్కడా కనబడ లేదు. అసలు భగవద్గీత సూటిగా "అర్జునా! ఈ దుర్యోధనాధములు యెప్పుడయితే కనీసపు పశ్చాత్తాపం కూడా లేకుండా పాపాలు చేశారో అప్పుడే చచ్చి పోయినట్టు లెక్క! పాప పుణ్యాలు విచారించకుండా చంపి పారెయ్యి. యేదొచ్చినా నేను చూసుకుంటాను గదా,  నాకు వొదిలెయ్యి" అని చెప్పేటట్లుగా వుంటే అందులో ఈ సుత్తి యెలా కనబడింతో అతనికి?

          అసలు తనకా ఆలోచన యెట్టా వొచ్చిందో తన ఆత్మఖద My experiments with truth లో తనే వివరంగా చెప్పాడు. ఈ పుస్తకం పేరే నాకు పెద్ద బోకులా వినిపిస్తుంది! సత్యం అంటే అన్ని ప్రయోగాలూ చేసాక ఆ ప్రయోగ ఫలితాల్ని విశ్లేషించగా తెలిసి చచ్చే విషయం కదా! ఒక విషయం రూఢిగా తెలిసాక గూడా దాని మీద మళ్ళీ ప్రయోగాలు చెయ్యట మేమిటి నా బొంద? తిక్కశ్రీ తిక్క రత్న లాంటి బిరుదుల్ని ఆశించే తిక్క వెధవ తప్ప మామూలు వాడెవడయినా చేస్తాడా?

          భార్యని కక్కూసు గది కడగ మన్నాడట! దానికి ఆ అగ్ర కులానికి చందిన ఆడమనిషి ఈ పాకీ పని నేను చేస్తానా అని కించ పడి, అయినా చెప్పింది సాంప్రదాయం ప్రకారం తనకన్నా అధికుడయిన పతి దేవుడు కాబట్టి లాగి తన్నకుండా మౌనంగా వుండి పోయిందట! ఆ తిరస్కారం తనలో మార్పుని తీసుకు రాగా దానినే తన సత్యాగ్రాహ మనే బ్రహ్మాస్త్రానికి మూల మంత్రంగా చేసుకున్నాడట! ప్రపంచ మంతటా అన్ని కుటుంబాల్లోనూ అతి మామూలుగా జరిగే మొగుడూ పెళ్ళాలకి సంబంధించిన రంకు బాగోతాన్ని ఒక జాతినీ వర్గాన్నీ ప్రజల్నీ అతి క్రూరంగా అణిచేసే వాళ్ల మీద పోరాడటానికి ఆయుధంలా మలుచుకున్నాని చెప్తుంటే ఇన్నేళ్ళుగా వింటున్న వాళ్లలో యెవరికీ అసహ్యం కాదు గదా కనీసం చిరాకు గూడా వెయ్యలేదేమిటా అని చాలా ఆశ్చర్యంగా వుంటుంది నాకు! 

     అన్ని సంవత్సరాలు అంత హడావిడి చేసినా ఒక్క నల్ల చట్టమూ రద్దు కాలేదు? యేదో ఒక సంచలనాత్మకమయిన పని చెయ్యటం, అరెస్టవటం, తెల్లవాళ్లతో రాజీ ప్రతిపాదనతో బయటికి రావటం, రాజీ పడినందుకు సాటివాళ్లతో తిట్టించుకోవటం, ఆ తెల్లవాళ్ళు రాజీ ప్రతిపాదనల్ని రద్దు చెయ్యగానే మళ్ళీ హడావిడి మొదలు పెట్టటం తప్ప నికరమయిన విజయాన్ని దేన్నీ నమోదు చేసుకోలేక పోయాడు. అయినా సరే, "భారత దేశం పిలుస్తోంది, రా! కదలి రా!" అని భారతదేశం లోని అభిమానులు పదే పదే పిలవడం తోనూ, తనకి కూడా, "ఇక్కడయితే నేను కేవలం 150,000 మందికి మాత్రమే నాయకత్వం వహించ గలను, అక్కడ మరింత విశాల మయిన రంగస్థలమే నాకోసం యెదురు చూస్తున్నది" అని అనిపించటంతో -  మొదలు పెట్టిన పనిని సగంలోనే వొదిలేసి వెళ్తున్నాడని సాటివాళ్ళు విసుక్కునే విధంగా హఠాత్తుగా 1914లో భారత దేశానికి వొచ్చి పడ్డాడు. బోయరు యుధ్ధంలో తమతో అంత బాగా అంట కాగిన సమయంలో మెడళ్ళు ఇచ్చి సత్కరించిన తెల్లవాళ్లే పురెక్కించి ఇక్కడ ఇంప్లాంట్ చేసి వుండవచ్చు నని కొందరు అనుమానిస్తున్నారు గానీ నేను ఆ కోణం మీద అతిగా పోదల్చుకోలేదు.

            1915 జనవరి 9న శాశ్వతంగా దక్షిణాఫ్రికా జీవితంతో తెగదెంపులు చేసుకుని భారత భూభాగం మీద కాలు పెట్టాడు. 1915 నుంచీ 1920 వరకూ పని మొదలు పెట్తకుండా యేమి చేశాడో తెలుసా? నేను ఈ దేశాన్ని గురించి తెలుసుకోవాలని దేశ మంతటా తిరిగాడు. దేశ మంతటా గోచి పాత రాయుళ్ళే కనబడ్డంతో వాళ్లలో ఒకడిగా కలిసి పోవాలంటే తనూ వాళ్ల లాగా వుండాలని తను కూడా పైన చూస్తున్న తన  ట్రేడ్ మార్క్ అయిన గోచిపాత లోకి మారాడు! ఇంకా నయం, రైళ్ల లోనూ బస్సుల్లోనూ మాత్రమే తిరిగి దాంతో సరి పెట్టేశాడు గానీ అడవుల్లో కూడా వుంది నా దేశం అని నగ్నంగా తిరిగే ఆదిమ జాతు లున్న అరణ్యాలను కూడా శోధించితే యెట్లా తయారయి వుండే వాడో!

           ఆ కాలం గురించి మనకి రెండు భ్రమ లున్నాయి, దేశ మంతా బ్రిటిషు వాళ్ళ పూర్తి అధికారం లోకి వెళ్లిందనీ, వాళ్ళు మన నెత్తి మీద తుపాకీ పెట్టి పరిపాలించారని! రెండూ అబధ్ధాలే! సామాన్య ప్రజలకి అసలు ఇంగ్లీషు వాళ్ళు కనబడిందే చాలా తక్కువ. అందరికీ చిన్నప్పటి హిస్టరీ పాఠాల్లో పరిచయమయిన సైన్య సహకార మైత్రి లాంటి వొప్పందాలతో పై స్థాయిలో వుండే అప్పటి రాజుల్నీ జమీందార్లనీ బానిసల్ని చేసుకుని వాళ్ళ ద్వారా తమకు కావల్సిన వాట్ని సాధించుకున్నారు! అప్పుడప్పుడూ తెల్లని రంగుతో కనిపించే కుంఫినీ దొరల్ని కళ్ళింతలు జేసుకుని చూడ్డం, కారు లాంటి వాట్ని చూసి ఇది ఆ తెల్ల వాళ్ళు తెచ్చిందని తెలిసినప్పుడు "ఔరా తెల్లోడి బిస" అని అనుకోవటం తప్ప సామాన్య జనానికి తమ కష్టాలకి కారణం ఇంగ్లీషు వాళ్లని అస్సలు తెలియదు.

         ఈ పై స్థాయిలో వుండి ఇంగ్లీషు వాళ్ళకి స్నేహ పాత్రులుగా వుంటూ యెవరయితే ఇంగ్లీషు వాళ్ళు రాక ముందు నుంచీ సామాన్యుల్ని పీల్చి పిప్పి చేస్తూ వున్నారో వాళ్ళు కాంగ్రెసునీ స్వాతంత్రోద్యమాన్నీ 1945 వరకూ వ్యతిరేకిస్తూనే గడిపి చివరి దశలో జస్టిస్ పార్టీ లాంటి హడావిడిని కూడా చేసి ఆఖరి రోజుల్లో ఇంక స్వాతంత్ర్యం రావడం ఖాయమని తెలియగానే కాంగ్రెసు లోకి దూకేసి అప్పటి దాకా లెక్క లేనన్ని త్యాగాలు చేసిన పింగళి వెంకయ్య, గరిమెళ్ళ సత్యనారాయణ లాంటి వాళ్లని వెనక్కి నెట్టేసి ప్రజల ఆమోదంతో ప్రభుత్వాధినేతలుగా అవతరించారు! గాంధీ ఈ జగన్నాటక మంతా ఇలాగే జరిగేందుకు సూత్రధారిగా నిలబడి యెక్కడా ప్రాచీన భారత దేశపు సామాజిక చిహ్నాలయిన  కులాలూ మతాలూ వాటికున్న రాజకీయ ప్రాధాన్యతలూ యే మాత్రమూ కదల బారకుండా అన్యాయా లన్నింటినీ తెల్లోడి ఖాతాలో వేసేసి అప్పటి దాకా ఇంగ్లీషు వాళ్లతో కలిసి జనాన్ని చెండుకు తిన్న పాత కాలం రాజుల్నీ జమీందార్లనీ ఆదర్శవంతులయిన కొత్త రకం ప్రభువులుగా అవతరింప జేశాడు!

       ఇతనికి ఆపాదించిన "ఒక్క నెత్తురు బొట్టు కూడా చిందించకుండా సాధించిన ఘనకార్యం" చాటున ఇతను సాధించిన నిజమయిన ఘనకార్యం యేమిటో అర్ధం చేసుకుంటే ఇతను మాట్లాడిన శాంతి, సత్యము, అహింస, ధర్మకర్తృత్వం అనేవి పరమ జుగుప్సాకరమయిన బూతుమాటల కన్నా వెగటు పుట్టిస్తాయి.

        నేను మొదటిసారి ఈ ఒక్క నెత్తురు బొట్టుకూడా చిందించకుండా అనే మాటను వినేటప్పటికే లాఠీ దెబ్బలకి లాలా సాబ్ అమరుడు కాగా దానికి ప్రతీకారంగా భగత్ సింగ్ బృందం సాందర్స్ ని చంపాలని అనుకోవడం, అందులో ఫెయిల్ అయినా అదే స్పూర్తితో హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ ని స్థాపించి వాళ్ళు చేసిన అజరామరమైన పోరాట గాధ నంతా చదివి వుండటంతో ఆశ్చర్య మనిపించింది? అదేంటి? యెంతో మంది త్యాగధనుల రక్తం యేరులై ప్రవహించినా ఒక్క నెత్తురు బొట్టు కూడా చిందించకుండా సాధించాడు అంటారేమిటి - అని! గాంధీని అలా పొగిడేవాళ్ల లోనూ అసలు గాంధీ మనస్సులోనూ వున్న నిజమైన లక్ష్యం ఇంగ్లీషు వాళ్ల శరీరం నుంచి గానీ వాళ్లతో నాలుగింట మూడు వంతులుగా కలిసి అధికారంలో వున్న రాజవంశీయుల శరీరం నుంచి గానీ  ఒక్క నెత్తురు బొట్టును కూదా చిందనివ్వకుండా -  అనేది అర్ధమవటానికి నాకు చాలా కాలం పట్టింది!

         గాంధీ ఈ దేశంలో అడుగు పెట్టే నాటికి భారత దేశపు  రాజకీయ సామాజిక ఆర్ధిక చిత్రపట మంతా పరమ భీభత్సమయిన గందరగోళంలో వుంది. సామాజికంగా చదువుకున్న వాళ్ళంతా లండన్ వెళ్ళి లాయర్లుగా తిరిగొచ్చి ఇక్కడీ జమిందార్లకీ ఇంగ్లీషు వాళ్ళకీ సాయపడుతూ ప్రాక్టీసు పెంచుకుంటూ గడుపుతున్నారు. ఆ ఇంగ్లీషు వాళ్ళ ఆదర్శాలతోనే ప్రభావితమయి వారి ఆధిక్యత పట్ల తీవ్రమయిన వ్యతిరేకత లేని ఇప్పటి మాదిరి మామూలు కెరీరిష్టు జర్నలిష్టులే పత్రికా రంగంలో మేధావులుగా చలామణీ అవుతూ హల్చల్ చేస్తున్నారు. రాజకీయంగా నేను మొదటి భాగంలో చెప్పిన ప్రళయ త్రికోణం మరింత స్పష్టమైన రూపం ధరించింది. ఆర్ధికంగా మధ్య యుగాల నాటి నిలవనీరు లాంటి వ్యవసాయాధారితమయిన పాత అమరిక మీద ఇంగ్లీషు వాళ్ల పారిశ్రామిక విప్లవపు కొత్త అమరిక కూడా కలిసి ప్రజల్ని మరింత భయానక స్థితి లోకి నెట్టేసింది.ఈ కొత్త రకం ఆర్ధిక చట్రం యొక్క ఫలితమే ప్రపంచంలోనే అత్యంత దయనీయమయిన కరువుల్లో వొకటయిన బెంగాల్ కరువు.

      దేశ మంతటా తిరిగి ఈ వాతావరణాన్నంతా చూసిన గాంధీ దక్షిణాఫ్రికా మోడల్ ఇక్కడ పని చెయ్యదని తెలుసుకున్నాడు! జ్ఞానవృధ్ధుడయిన యువకిశోరం భగత్ సింగ్ లాగా అట్టడుగున వున్న సామాన్య ప్రజలకు మేలు కలిగించే సామ్యవాద స్పూర్తితో ప్రజల్ని చైతన్య వంతుల్ని చేసి తమ భావిని తామే తీర్చిదిద్దుకునే లాగా ప్రజల్ని నడిపించటం ఈ జ్ఞానఢింభకు డైన చీకుగద్ద లక్ష్యం కానే కాదు! అలాంటి లక్ష్యం పట్ల ఇతనికి ద్వేషం కూడా వుంది. అప్పటికే ప్రపంచం లోని అనేక దేశాల్లో పెల్లుబుకుతున్న ప్రజాస్వామిక సంస్కృతిని యెప్పటికయినా ఇక్కడా రాక తప్పదు గాబట్టి ఇక్కడికీ తీసుకురావదం, ఆ చట్రంలో అప్పుడున్న రాజవంశీయుల్ని వాళ్ళ ప్రాభవాలు యేమాత్రమూ తగ్గనివ్వని పధ్ధతిలో అమర్చటం అనేది ఇతను సాధించిన ఘనకార్యం. కుంజరయూధాన్ని దోమ కుత్తుకలో దూర్చటం అనే అనితర సాధ్యమయిన పనిని అంత ప్రతిభావంతంగా చెయ్యడం నిజంగా అద్భుతమే!

       దక్షిణాఫ్రికాలో యేనాడూ సామాన్య ప్రజల్ని భాగస్వాములుగా చేసే కార్యక్రమాల్ని రూపొందించని వాడు ఇక్కడ పూర్తిగా సామాన్య ప్రజల్ని ఆకర్షించటం మీదనే దృష్టి పెట్టాడు. అప్పటి దాకా రాజు మంచివాడయితే సంతోషంగా వుంటూ రాజు దుర్మార్గుడయితే తిరుగుబాటు చేసి మరొక రాజును తెచ్చుకుంటూ తమ కష్టాలకు కారణం దేముడి  దయ లేకపోవటమే నని సరిపెట్టుకోవటమే తప్ప - ఇప్పటికీ చాలామంది విద్యాధికులకి కూడా అర్ధం కానంత జటిలమయిన విషయాలు అవడం చేత - కరువులు ప్రభువుల దుర్మార్గమయిన ఆర్ధిక విన్యాసాల వల్లనే వస్తాయనీ వాటిని మార్చుకోకుండా ప్రభువుల్ని మారిస్తే ప్రయోజనం వుండదని తెలుసుకోలేని అమాయకుల ముందు మొదటిసారిగా ప్రజలకి మీ కష్టాలకి దేవుడు కారణం కాదు ఇక్కడివాళ్ళే అని చెప్పాలి, అలాగని ప్రజలు వాళ్లకి అలవాటయిన పధ్ధతిలో తిరుగుబాటు చెయ్యకుండా నిగ్రహించాలి. ప్రజలు హింసకి దిగితే తను ప్రభుత్వంలో అమర్చుదామనుకున్న వాళ్లకే ప్రమాదం మరి! అందుకనే చాలా మామూలు సంఘటన అయిన చౌరీ చౌరా ఘటనకి అంత అతిగా రియాక్ట్ అయి పక్కనున్న శుంఠలకి అది అర్ధం కాక వొద్దని మొత్తుకుంటున్నా వుద్యమం ఇంకొద్ది రోజులు గట్టిగా చేస్తే అప్పుడే స్వతంత్రం వొచ్చి వుండేదనిపించేటంత వూపులో వున్నప్పటికీ మొత్తం కార్యక్రమాన్నే ఆపేశాడు!

        1920లో కాంగ్రెసు పార్టీ పగ్గాలు చేపట్టినా అతి సుదీర్ఘ కాలాన్ని కింది స్థాయిలో ప్రజలకి అస్పృశ్యత గురించీ మద్యపాన నిషెధం గురించి చెప్పటానికీ పై స్థాయిలో సంధాన కర్త లాగా స్వరాజ్ పార్టీకీ కాంగ్రెసు పార్టీకీ రాజీ చెయ్యటం అనే గర్భాదాన ప్పంతులు పనికీ ఉపయోగించుకున్నాడు. 1930లో వుప్పు సత్యాగ్రహం మొదలు పెట్తేవరకూ అతడు చేసిందంతా ప్రజల్ని తను యేం చెప్తే అది నమ్మే విధంగా ప్రజల్ని సిధ్ధం చెయ్యటమే.

         వెనకటి కాలం లోని పిట్ట కధలో కొండని మోస్తానన్న వీరుడి లాగా మీరంతా నేను చెప్పినట్టు వింటే ఒక్క సంవత్సరంలో స్వతంత్రాన్ని తీసుకొస్తా నన్నాడు! మరి చూస్తావేం మొయ్యి అంటే యెవరయినా యెత్తి నా భుజాల మీద పెడితే మోస్తా నన్నాను గానీ నేనే యెత్తుతా ననలేదుగా మీరు యెత్తి నా భుజాల మీద పెడితే మొయ్యదానికి నేను యెప్పుడూ సిధ్ధమే నన్న ఆ పిట్టకధలోని హీరో లాగే మీరు నేను చెప్పినట్టు వినలేదుగా అని తేల్చి పారేశాడు?ఆ పిట్టకధ యెప్పట్నుంచో అందరికీ తెలిసిందే అయినా ఇంతమంది మేధావులూ పోలిక పట్టలేక ఈ కమెడియన్ ని అంత సీరియస్ గా నమ్మేశారంటే తెలివి తక్కువ మాటల్ని కూడా గంభీరంగా మోత మోగించడంలో ఇతని ప్రజ్ఞ నిరుపమానం!

             1918లో ఇంగ్లండు మొదటి ప్రపంచ యుధ్ధంలోకి దిగింది. బోయరు యుధ్ధంలో Indian Ambulance Corps తో సరిపెట్టిన ఇతడు ఈసారి బ్రిటిషు వాళ్ల తరపున భారతీయుల్ని యుధ్ధం చేయించడానికి సమరోత్సాహంతో కదిలాడు. "In a June 1918 leaflet entitled "Appeal for Enlistment", Gandhi wrote "To bring about such a state of things we should have the ability to defend ourselves, that is, the ability to bear arms and to use them...If we want to learn the use of arms with the greatest possible despatch, it is our duty to enlist ourselves in the army." He did, however, stipulate in a letter to the Viceroy's private secretary that he "personally will not kill or injure anybody, friend or foe." ఇప్పటిదాకా అంతా అచ్చ తెలుగులో రాసి ఇది మాత్రమే పక్కా ఇంగ్ల్లీషులో యెలా వున్నది అలాగే యెందుకు దించేశానో తెలుసా? యెలా అనువదించాలో అర్ధం కాలేదు, యెన్నో సంక్లిష్టమయిన విషయాల్ని అర్ధం చేసుకోగలిగిన నా మేధస్సు కూడా ఈ గందరగోళపు భావజాలం లోని అస్పష్టత ముందు దారుణంగా ఓడిపోయింది!

      ఇతని కిదేం పిచ్చ! తన కన్యాయం చేసారని వాళ్ళ మీద భీభత్సంగా పోరాడుతుంటాడు, అయినా వాళ్ల సొంత కారణాల తో వాళ్ళు వేరే వాళ్లతో యుధ్ధానికి వెళ్తే నేను కూడా సాయం చేస్తానని వురక లెత్తుతాడు? వ్యక్ర్తిగతంగా స్నేహితుణ్ణి గానీ శత్రువును గానీ చంపడటం ఇష్టం లేదట! యుధ్ధాల్లో యెంతమందిని చంపినా అభ్యంతరం లేదట! ఇంగ్లీషు వాళ్ళ శత్రువుల్ని చంపటానికి భారతీయులు సైనికులుగా వెళ్ళాలట! భారతీయులు ఇంగ్లీషు వాళ్లని మాత్రం చంపగూడదట! ఇదేమి అహింసా వాదం?

         బోయరు యుధ్ధంలో అపారమయిన ఇంగ్లీషు వాళ్ళ సైన్యాన్న్ని చూసి వీళ్ళ మీదకి ఆయుధాల్తో వెళ్తే మనల్ని చంపేస్తారు అనే చావుభయాన్నీ శత్రువుకి మనల్ని చంపెయ్యాలనేటంత కోపం రాకుండా చూసుకుంటే బతికుండి బలుసాకయినా తిని బతకొచ్చనే బతక నేర్చిన తెలివినీ కలిపేసి తయారు చేసిన తిక్క ఐడియాని కేవలం నైతికంగా వున్నతులు మాత్రమే పాటించగలిగిన బలమయిన ఆయుధం అని కోతలు కొయ్యటం Neighbors Envy Owners Prideని మించిన గొప్ప అడ్వర్టైజింగ్ టెక్నిక్!

       గాంధీలో కొన్ని లోపాలు వున్నప్పటికీ మొఠ్ఠ మొదటి సారిగా సామాన్య ప్రజలను రాజకీయంగా చైతన్యవంతులను చేసిఒక్క తాటి మీద నడిపించాడనిన్నీ, భిన్న సంసృతులతో కలగాపులగంగా వున్న ప్రజల్నందర్నీ బిన్నత్వంలో యేకత్వం పరిఢవిల్లే లాగ తీర్చి దిద్దాడనిన్నీ, అందువల్లనే స్వతంత్రం రాగానే మళ్ళీ ముక్కలు ముక్క లయ్యే ప్రమాదం తప్పిపోయి ఒక్కటిగా నిలబడిందనిన్నీ సుభాషితాలు చెప్తారు - మరీ తాము సమర్ధించలేని తప్పుల్ని యెదటి వాళ్ళు యెత్తి చూపిస్తూ ఇరుకున పెడుతున్నప్పుదు మధ్యేమార్గంగా రాజీ కొస్తూ! ఆ మహానుభావుడే లేకుంటే  దేశం అల్లకల్లోలమైపోయేదని భయపెట్టేస్తారు. కాని శ్రీవారు కొత్తగా జాతీయ సమగ్రతను సాధించినది తొలుత అనేక సంస్థానములుగా వుండి స్వాతంత్ర్యము తర్వాత తమ ప్రాభవము లేవియునూ చెదరని రీతిన ఒకే లౌకిక ప్రజాస్వామ్య ప్రభుత్వము రూపములో నూత్న వేషములు ధరించి అవతరించిన సాంప్రదాయిక భారత మనుజేశ్వరాధములకు మాత్రమే! శ్రీవారి దృష్టిలో సామాన్య ప్రజలు తను చెప్పిన కార్యక్రమములు తు.చ తప్పక పాటించుటకు - చరఖా వడకుటకు, విదేశీవస్త్రాలను తగలబెట్టుటకు,ఇంగ్లీషు వారి తరపున యుధ్ధములలో పాల్గొని చచ్చుటకు మాత్రమే వుండిరి!

         మనది వ్యవసాయ ప్రధానమయిన దేశం. ప్రతి వ్యక్తికీ భూమితో అనుబంధం యెక్కువ. భూమితో అనుబంధం వున్న మనిషి యెక్కడున్నా ఒక్కలాగే వుంటాడు. అందరి కష్టాలూ కన్నీళ్ళూ ఒక్కలాగే వుంటాయి. మన ధార్మిక జీవనంలో వున్న తీర్ధయాత్రలూ, పుష్కరాలూ మనుషులు కలుస్తూ వుండేలా చేస్తూనే వున్నాయి. కొన్ని శతాబ్దాలకు ముందు నుంచే ఈ దేశ ప్రజలు వేషభాషలూ ఆచార వ్యవహారాలూ వేరయినా ఆసేతు శీతనగం ఒకే రకమయిన సంస్కారంలోనే వుండి ఐకమత్యంగానే వున్నారు. ఇంతకు ముందే వున్నదాన్ని ఇతను కొత్తగా పరిచయం చేశాడని అనటం గురువుకి శిష్యుడు పాఠాలు నేర్పినట్టు వుంటుంది!

        అసలు గాంధీ చెప్పింది సామాన్య ప్రజలకు అర్ధమే కాలేదు! ఈయన గారి పొంతన లేని అసమన్వయ సుత్తిని జనాలకి అర్ధ మయ్యెటట్టు చెప్పలేక పల్లెటూళ్ళలో తిరిగే కాంగ్రెసు కార్యకర్తలు "భారతీయులంతా కలిసి ఒక్కసారిగా వుమ్మేస్తే ఆ ప్రవాహంలో ఇంగ్లీషు వాళ్ళంతా లండన్ దాకా కొట్టుకు పోతారు" అనే జోకుల్తో అలరిస్తూ వుండేవాళ్ళు! అహింసాయుత పోరాతం లాంటి గంభీరమయిన విషయా లన్నీ చదువుకున్న వాళ్లే పత్రికల్లో చూసి తెలుసుకునే వాళ్ళు. ఇతను చెప్పిన గంభీరమయిన విషయాలు సైతం కాంగ్రెసు కార్యకర్తలకే యెక్కలేదు,  ఇంక సామాన్య ప్రజలకి అర్ధమయి యెలా అనుసరిస్తారు? అతను చెప్పిందంతా బుర్రలోకి యెక్కి అతని మీద నమ్మకమే వుంటే సుభాష్ చంద్ర బోసు పట్టాభి మీద అంత మెజార్టీతో యెలా గెలుస్తాడు? పైగా అక్కడ గాంధీ మొహం మీద పేలింది కింది నుంచి పైదాకా అంతరువులు అంతరువులుగా ప్రతినిధుల్ని యెన్నుకుంటూ వొచ్చిన అంతర్గత ప్రజాస్వామ్యమనే ఢాంబు! ఆ దెబ్బకి "నా బఠానీ వోడింది, నేనూ వోడినట్టే" అని చెప్పి కూడు మానేసి ముసుగు దన్ని పడుకున్నాడు. ముసలాడు చస్తాడని జాలిపడి కొందరూ, నిజంగానే బోసు గెలుపు నచ్చక కొందరూ మొత్తానికి బోసు గారిని గాంధీ గారి సహాయ నిరాకరణ మనే ఆయుధంతోనే బలవంతంగా రిజైను చేసి వెళ్ళిపోయేలా చేశారు. సాటి దేశభక్తుడి మీద ప్రయోగించినంత తీవ్రంగా ఇంగ్లీషు వాళ్ల మీద ప్రయోగించి వుంటే మనకి స్వతంత్రం ఇంకా చాలా ముందే వొచ్చి వుండేది! సరే, బోసుగారు రిజైన్ చెయ్యగానే తన బఠానీ గెలిచేసినట్టు మమ చెప్పేసుకుని తను కూడా ముసుగు తీసేసి మళ్ళీ రంగం లోకి దిగాడు.

          ఈ నిరాహార దీక్ష అనేది ఇవ్వాళ ప్రతివాడూ తనకి జరిగిన అన్యయానికి నిరసన తెల్పడానికి వాడుకుంటూ అది గాంధీ ప్రజలకు ఇచ్చిన బ్రహ్మాస్త్రమని అనుకుంటున్నాడు గానీ అతను మాత్రం చరఖా వడక మనటం, విదేశీ  వస్త్రాలని తగల బెట్ట మనటం, వుప్పు తయారు చెయ్య మనటం తప్ప ప్రజలకి నిరాహార దీక్ష గురించి పొరపాటున కూడా వుప్పుదేశించ లేదు!? దాన్ని ఇట్లా పార్టీలో తన మాట చెల్లుబడి కానప్పుడు బ్లాక్ మెయిలింగుకి మాత్రమే వాడుకునే వాడు!! సమిష్టి కార్యాచరణ జరుగుతున్న చోట యెదటి వాళ్లని బలమయిన వాదనతో గెలిచి వొప్పించి తన మాటకి కట్టుబడి నడుచుకునే లాగ చెయ్యటం, యెవరయినా తనకన్నా బలమయిన వాదన చేసి మెప్పిస్తే తను కూడా అతన్నే అనుసరించటం ప్రజాస్వామ్య స్పూర్తి గల నాయకుడి లక్షణం. దానికి విరుధ్ధంగా తన పాయింటు బలమయినది కాకపోయినా ఇతర కారణాలతో వొత్తిడి పెట్టి అందరూ తననే అనుసరించేలా చెయ్యటం అనేది నియంతృత్వం అయితే అది హిట్లర్ ఆక్టివ్ గా చేశాడు, గాంధీ పాసివ్ గా చేశాడు, అయినా మనం హిట్లర్నే నియంత అంటున్నాం గానీ గాంధీని అనలేక పోతున్నాం, యెందుకని?

         గాంధీ దక్షిణాఫ్రికాలో వుండగా బోయెరు యుధ్ధంలో పాల్గొన్నప్పుడూ ఇండియాలో మొదటి ప్రపంచ యుధ్ధంలో పాల్గొన్నప్పుదూ వాళ్లని యుధ్ధానంతరం కొన్ని సౌకర్యాలు అడిగాడు.యుధ్ధం ముగిశాక వాళ్ళు మాట తప్పేసి వాటికి తూచ్చి చెప్పినప్పుదు కనీసపు ప్రతిఘటన కూడా చెయ్యలేదు, యెందుకు? అసలు అడిగినవి కాదనడం కాదు - ఇచ్చిన మాట తప్పినందు కయినా నిలదీయాలి గదా! మనిషి శారీరకారోగ్యానికి సంబంధించిన రక్తలేమి వ్యాధి లాగా మానసికారోగ్యానికి సంబంధించిన క్షాత్రలేమి వ్యాధి పీడితు డితను! దానికి అంటువ్యాధి లక్షణాలు కూడా వున్నాయేమో ఇతరుల్లో మానసికంగా రోగ నిరోధక శక్తి తక్కువగా వుండి బౌధ్ధిక అలసత్వం యెక్కువగా వున్న వాళ్లందరికీ అంటించి పారేశాడు! ముఖ్యంగా ప్రజల్లో అంతకు ముందు వున్న క్షాత్రాన్ని చంపేసి దేబె మొహాల్లాగా తయారు చేశాడు. ఒకప్పుడు తమకు కష్టాలు కలిగించినందుకు నిరంకుశంగా వున్న రాజుల పైనే తిరుగుబాటు చేసి రాజ్యాల్నే తల్లకిందులు చేసిన వాళ్ళు ఇవ్వాళ తమ చుట్టూ ఇన్ని అన్యాయాలు జరుగుతున్నా స్తబ్దుగా వుండటం, లేదంటే గుడారాలు పాతుకుని దండలు మెడలో వేసుకుని యేడుపు మొహాలతో మూలుగుతూ కాలం గడపటం చేస్తున్నారు కానీ,  వీటివల్ల వీళ్ళంతా సాధిస్తున్న దేమిటి?

       రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఇతనెప్పుడూ గడగడ లాడించనే లేదు! వీళ్ళు గొడవలు చెయ్యటం,  వాళ్ళు అణిచి వెయ్యటం, మరీ గొడవ యెక్కువయితే గుండ్రబల్ల ముచ్చట్లకి లండన్ పిలవటం, వీళ్ళేం మాత్లాడే వాళ్ళో వాళ్లేం మాట్లాడే వాళ్ళో గానీ ఆఖరికి వీళ్ళ డిమాండ్లని వొప్పుకోకుండానే వెనక్కి పంపించెయ్యటం లాంటి హడావిడే జరిగింది తప్ప ఇక్కణ్నించి వెళ్ళిపోవాలనే వూపు మాత్రం వాళ్లలో కలిగించలేకపోయారు. ఇంకా నేను  చదివిన విషయం ప్రకారం, "గాంధీ మాట రాజకీయ రంగంలో చెల్లుబడి అవుతున్నంత కాలం మనం భారత్ నుంచి వైదొలగడానికి తొందర పడటం అనవసరం" అనే అభిప్రాయంలో వుండే వాళ్ళు?ఇంగ్లీషు వాళ్లని నిజంగా భయపెట్టి తరిమేసిన ఒక నాటకీయమయిన అద్భుతం 1946లో జరిగింది.అది జరిగిన సంవత్సరం లోగా మనకి స్వతంత్రం ఇచ్చేసి ఆ గడువు దాటాక ఒక్క రోజు కూడా ఇక్కద వుండకూడదని ఆ రోజుకన్నా ముందే పిట్ట పురుగు కూడా లేకుండా ఖాళీ చేసి వెళ్ళిపోయారంటే దాని పవరేమిటో అర్ధం చేసుకోవచ్చు!

         అదే నావికుల తిరుగుబాటు! ఫిబ్రవరి 18న నిప్పురవ్వ ఆహారం, మరియు సాధారణ మయిన అసౌకర్యాలకు సంబంధించిన సమ్మెగా రాజుకున్నా ప్రచండ వేగంతో విరుచుకు పడి అరణ్యాన్నంతా చుట్టెయ్యగలిగిన దావానలం లాగా మొత్తం దేశాన్నంతటినీ కదిలించింది!  ప్రారబ్దం యేమిటంటే మన వాళ్ళకి దీని ప్రాముఖ్యత తెలియక పటేల్ లాంటి వాళ్ళు యెప్పుడో విప్పేసిన నల్లకోట్లు మళ్ళీ తొడిగి వాళ్ళ కేసుని వాదించారు అనే చిన్న వివరం తప్ప యెక్కువగా చెప్పలేదు. కానీ ఇంగ్లీషు వాళ్ల వైపు నుంచి చూస్తే గానీ దాని ప్రాధాన్యత తెలియదు. వలస రాజ్యాల్ని తమ పట్తులో వుంచుకోవటానికీ, తిరుగుబాట్లనై అణిచివెయ్యటానికి సైన్యాన్ని కదిలించటానికీ అతి ముఖ్యమైనది నౌకా దళం! అక్కడ తిరుగుబాటు జరగట మంటే ఆయువుపట్టు మీద దెబ్బ తగలటమే!

          కమ్యునిష్టులు అతిగా వుత్సాహ పరచటం వల్ల దీనికి ప్రాధాన్యత ఇస్తే వాళ్లని పెంచినట్టు అవుతుందనే కారణం కావచ్చు గానీ కాంగ్రెసు మొదట చూపించినంత వుత్సాహం చూపించ లేదు. మార్చ్ 3 స్టేట్మెంట్ ప్రకార మయితే  గాంధీ దాన్ని తీవ్రంగా విమర్శించేశాడు కూడాను!? వాళ్ళకి గనక సరయిన నాయకత్వం దొరికి వుంటే ఈ దేశం అఖండం గానే స్వాతంత్ర్యాన్ని సిధ్ధింప జేసుకుని వుండేదేమో ననిపిస్తుంది, యెందుకంటే ఆశ్చర్యకరంగా ముస్లిములు కూడా నావికా పోరాటానికి పూర్తి సంఘీభావాన్ని వ్యక్తం చేసారు!

          నాదో చిన్న అనుమానం! అంత పిరికిగా  వ్యతిరేకత వచ్చిన రెండేళ్లలోనే అదిరి పడి పారిపోయిన వాళ్ళు, అదీ ఈ దేశజనభాలో 5% మించని వాళ్ళూ అన్నేళ్ళ పాటు అంత మొండిగా అన్ని దుర్మార్గాలు యెట్లా చెయ్యగలిగారు?పైస్థాయిలో వున్న మనుజేశ్వరాధములు అరాచకం పేరుతో హడావుడి చేసి పోలీసుల్నీ సైన్యాన్నీ ఇంగ్లీషువాళ్ళ పేరు మీద పంపిస్తే ఈ బానిసాధముడి నట్టువాంగం మేజువాణీ గాళ్ళు ఆ పోలీసుల్ని ఇంగ్లీషు వాళ్ళ దౌష్ట్యానికి చిహ్నంగా చూపించి డబుల్ గేము యేదయినా అడారా?వాళ్ళూ వీళ్ళూ యేం చేసినా మరో నరమానవుడికి తెలియకుండా చేశా మనుకున్నారు గానీ పాపపుణ్యాలు విచారించే ఆ భగవంతుడు యెవరి కేది వెయ్యాలో అది వేసేశాడు! ఒకనాడు తమది రవి అస్తమించని సామ్రాజ్యం అని మిడిసి పడిన వాళ్ళు ఇవ్వాళ యెక్కడ వుదయిస్తున్నాడో తెలియని అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నారు! ఒకనాడు ఈ దేశాన్ని పరిపాలించే అర్హత తమకే వుందని విర్రవీగిన వాళ్ళు ఇవ్వాళ  ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేక పోయి - కన్నీరు మున్నెరుగా విలపిస్తూ యెక్కే గడపా దిగే గడపా అన్నట్టు అందరినీ దేబిరిస్తూ - నాలాంటి వాళ్లకు మహదానందాన్ని కలిగిస్తున్నారు! పాపపుణ్యాలు తమ ఫలితాల్ని తప్పక చూపిస్తాయి -  అది యెరిగిన వాళ్ళు వినయంగా వుండి ప్రజామోదాన్ని పొందుతారు,యెరగని వాళ్ళు ఇవ్వాళ కాంగ్రెసుకు పట్టిన అధికారాంత మందు జూడవలె గదా అయ్యల సౌభాగ్యము లనే దుస్థితిని అనుభవిస్తారు!

        ఇతరేతర కారణాలతో సిద్ధించినా ఫలితాన్ని మాత్రం గాంధీ నేతృత్వం లోని కాంగ్రెసు పార్టీకి దఖలు పరుస్తూ 1947 ఆగస్ట్ 15న భారత్ దేశానికి స్వాతంత్ర్యం సిధ్ధించదంతో భారత రాజకీయ చరిత్రలో మోహన్ దాస్ కరం చంద్ గాంధీ యొక్క చారిత్రక ప్రాధాన్యత ముగిసి పోయింది. మరో నాటకీయమయిన సన్నివేశంలో గాడ్సే అనే పుణ్యాత్ముడు గాంధీని భౌతికంగా గూడా ఈ ప్రపంచం నుంచి పంపించి వేశాడు! ఒక పాత్ర ముగియగానే మరొక పాత్ర రావాల్సిన నాటక రంగ సాంప్రదాయం ప్రకారం భారత రాజకీయ రంగాన్ని శాసించేందుకు మరొక సామ్రాట్టు ఆవిర్భవించాడు! అతని కంటె ఘనుడు అతని శిష్యుడు అన్నట్టు గురువు గారి కిష్టమయిన పన్లేవీ చేయక పోయినా గురువుగారు చెప్పని వాట్ని కూడా గురువు పేరుతోనే ఝణాయించుకోగలిగిన ఆషాఢభూతి వంటి జవర్ లాల్ నెహ్రూ స్వతంత్ర భారత ప్రప్రధమ ప్రధానిగా రంగ ప్రవేశం చేశాడు!

          గాంధీ చేసిన అసలు మాజిక్ ప్రజలకి తాము సరికొత్త ప్రజాస్వామ్యబధ్ధమయిన రాజకీయ వ్యవస్థలో వున్నట్టు భ్రమింప జేస్తూనే పాతకాలపు రాజస్వామ్యాన్నే పార్టీ అద్యక్షుల కుటుంబస్వామ్యం రూపంలో కనిపిస్తూనే వున్నా  అది సహజమే నన్నట్టుగా ఆలోచించేలాగా ప్రజల మైండ్సెట్ ని మార్చటం! చరిత్ర కందని కాలం నుంచీ ఈ దేశంలోని మనుజేస్వరాధములు యెన్ని శతాబ్దాల పాటు ప్రయత్నించినా చెయ్యలేని దానిని కేవలం పాతికేళ్ళలో చేసి చూపించాడు! అందుకేనేమో ఇతన్ని దైవాంశ సభూతుడి గానూ అవతార పురుషుడి గానూ వాళ్ళు కీర్తిస్తున్నది!

      మోహన్ దాస్ కరం చంద్ గాంధీ అనబడే ఈ వ్యక్తి యొక్క గందరగోళపు భావజాలం నుంచి పూర్తిగా బయట పడిన క్షణం ఉంచే సత్యధర్మన్యాయ ప్రతిష్ఠితమైన వ్యాస పరాశరాది షిర్డీ సాయినాధ పర్యంతం వున్న మన గురు పరంపర నిండు మనస్సుతో హర్షించే నిజమయిన ప్రస్ఠాన యాత్రలో  భారత దేశం తొలి అడుగు వేస్తుంది!


ఒకడేమిటో వాడి చావు చెబుతుందంటారు, ఈ అహింసావాది బుల్లెట్ తో చచ్చాడు!?
______________________________________________________
1    2    3    4    5    6

Tuesday 2 September 2014

ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని చీలికలు పేలికలు చేసి చిందర వందర చెయ్యాల్సిన దౌర్భాగ్యం దేనికి?

        ఒక రాష్ట్ర్రానికి గానీ దేశానికి గానీ రాజధాని ఒక ఇంటికి తల వాకిలి లాంటిది. అలాంటి దాని విషయంలో యెందుకింత బీద అరుపులు అరుస్తున్నారు? రాజధానిని వికేంద్రీకరించట మేమిటి నా బొంద? రాజధాని అంటే ఏమిటి? సెక్రటేరియట్, అసెంబ్లీ,హై కోర్టు ఇంకా రాష్ట్ర పరిధిలో వుందాల్సిన శాఖల ముఖ్య కార్యాలయాలు. వీట్ని తలో చోటా తగలేస్తే పరిపాలన యెలా వుంటుందో తెలుసా? ఇప్పటికీ డాక్యుమెంటేషన్ అంతా పేపర్ వర్క్ తోనే జరుగుతుంది కదా! ఒక ఫైలు ఒక శాఖ నుంచి మరో శాఖకి వెళ్ళాలంటే పొరుగూరు వెళ్ళాలా?

     ఇదివరలో జరిగింది ఒక వైపు నుంచే చూస్తే తప్పు జరిగినట్టుగానే అనిపిస్తుంది.ఇవ్వాళ గయ్యాళిగా మాట్లాడుతున్న తెలంగాణా కుమేధావుల మాటలు నమ్మితే నిజంగానే మనం సిగ్గుతో తల దించుకోవాలనే అనిపిస్తుంది!కానీ యేమంటున్నారు వాళ్ళు, మా వుద్యోగాల్ని దోచుకున్నారు - కావాలంటే గిర్గ్లానీ రిపోర్టు చూడ మన్నారు.చూశాను, ఒక పోష్టు గూడా వేశాను, యేముంది అందులో? అన్యాయం జరగడం అంటూ వుంటే అన్ని ప్రాంతాల వారికీ జరిగిందని ఖచ్చితంగా చెప్పాడు.మిగతా యే ప్రాంతాల వారికీ అన్యాయం జరక్కుండానో, లేదా మిగతా అన్ని ప్రాంతాల వారికీ విపరీతంగా లాభం చెకూరి వీళ్ళు ఒక్కరికే అన్యాయం జరిగితే కదా ఆ మాట అనాల్సింది?ఒక పత్రికా విలేఖరి మరీ సూటిగా యెవరు నష్ట పోయారు?యెవరు లాభ పడ్డారు అని అడిగితే "అభివృధ్ధి చెందిన ప్రాంతాలకి వెళ్ళగలిగిన వాళ్ళు బాగు పడ్డారు, వెళ్ళ లేని వాళ్ళు నష్ట పోయారు" - అని అంతకన్నా సూటిగా జవాబు చెప్పాడు. దాని భావ మేమిటో యే తిరుమలేశుణ్ణీ అడగనక్కర్లేదు కదా?చిన్న పిల్లవాడి నడిగినా చెప్తాడు, ఇంకా "అదేంటి?అయితే యెక్కడో వున్న కృష్ణా జిల్లాల వాళ్ళు అంత దూరంలో వున్న హైదరాబాదుకి వెళ్ళి బాగు పడగలిగినప్పుడు, పక్కనే వున్న వాళ్ళు కూడా వెళ్ళి బాగుపడితే బాగుండేది కదా? వెళ్ళగలిగితే బాగు పడతామని తెలిసినప్పుడు వెళ్ళి బాగు పడకుండా యాభయ్యేళ్ళు యేమి చెస్తున్నట్టు?" అని కూడా అడుగుతాడు!నా లాంటి తింగరోడు పక్కనే వుంటే , "బహుశా యాభయ్యేళ్ళయినా వందేళ్ళయినా ఆ ఆంధ్రోళ్ళని అక్కణ్ణించి తరిమి కొట్టాకే వెళ్ళి బాగు పడదాంలే అనుకుంటూ, యే మహానుభావుడు వచ్చి ఆ ఆంధ్రోళ్లని తరిమికొడతాడా అని జపతపాలు చేస్తూ కూర్చున్నారేమోలే" అని ఓ వంకర కూత కూస్తాడు!!

     విడిపోయిన ఇంత కాలం తర్వాత కూడా యెప్పుడో యేభయ్యేళ్ళ క్రితం నాటి కర్నూలు గుడారాల్ని యెత్తి చూపించి వెక్కిరించే వాళ్ళని అమాయకులని నమ్మడం వల్లా, వాళ్ళ తింగరి వాదనల్ని మొగ్గలోనే తుంచెయ్యని మన వెనకటి తరం నాయకుల అలసత్వం వల్లా ఇదంతా జరిగింది! అంతకు మించి అక్కడ అందరూ అనుకున్న భీభత్సాలు యేమీ జరగలేదు. పోనీ జరిగాయనే అనుకుందాం, ఇప్పటి పరిస్థితి యేమిటి? కలిసుండటం వల్లనే  మా కన్యాయం జరిగిందని విడిపోతే యే న్యాయం వెయ్యి కాంతులతో వికసిస్తుందని వాళ్ళు అంటున్నారో ఇవ్వాళ్టి తెలంగాణా ఆ నమ్మకాన్ని కలిగించే విధంగా వుందా?యెన్నికల్లో గెలిచి మంత్రివర్గంలో వున్నవాళ్ళలో గానీ అక్కడ పై స్థాయిలో చక్రం తిప్పుతున్న వాళ్ళలో గానీ ఆ నమ్మకాన్ని కలిగించే కొత్త ముఖాలు మీ కెక్కడయినా కనబడినాయా?కేసీఆర్ కుటుంబమూ, రెడ్లూ మరియూ వెలమలూ హవా హవాయీ అన్నట్టుగా వున్నారు! కోడి పోయి కత్తి వచ్చె డం డం డం అన్నట్టు ఆంధ్రా రెడ్లు పోయి తెలంగాణా రెడ్లు వచ్చె డం డం డం అనేట్టుగా వున్న ఈ కొత్త సీసాలో పాత సారా తంతు కోసమేనా అంతగా అంగ లార్చింది?

      సరే జరిగిందేదో జరిగింది, పరిదికి మించి గతాన్ని తవ్వుకోవడం వల్ల ప్రయోజన మేముంది?కానీ కొన్ని దారుణ మయిన మాటలు ఇప్పటికీ బాధ పెడుతున్నాయి!మనం తమిళుల నుంచి విడి పోతా మన్నప్పుడు మొదట్లో వ్యతిరేకించినా తర్వాత వాళ్ళు కూడా వొప్పుకుని కోరం సరిపోక పోతే వాళ్ళు కూడా మన వైపు వోటు వేసి సాయం చేస్తే తమిళులతో తన్నించుకుని వచ్చారు అని కూశారు!మద్రాసు నుంచి వెళ్ళ మనటం కూడా మంచిగానే అడిగారు, యెప్పటి కయినా వెళ్ళాల్సిందే గదా, వుంటే ఇంకా అనుబంధం పెంచుకున్నట్టు వుంటుందని, వుండటం వల్ల మొహమాటాలు పెరుగుతాయి, లేని పోని సమస్యలు వస్తాయి అని ప్రస్తావిస్తే మనం కూడా నిజమే లెమ్మని వచ్చెశాం. అయినా ఇప్పుడు ఈనాటి రోజున నీ ముందు లగడపాటీ మరొకడూ వుండి వుండవచ్చు - కానీ ఆనాటి సన్నివేశాన్ని తన్నించుకుని రావడం అంటే అప్పుడు అక్కడ వున్న ప్రకాశం పంతులూ పొట్టి శ్రీరాములూ వున్నారు కదా ఆ మాట వాళ్ళకేగా తగిలేది?!

         మనం తప్పు చెయ్యలేదు, సగర్వంగా తల యెత్తుకునే తిరుగుదాం. ఆంధ్రావాళ్ళు యెక్కడున్నా ముందు వరస లోనే వుంటారు. యెక్కడయినా సరే గొప్పగా వుండాలని అనుకుంటాం. వుంటాం. తెలంగాణా వాళ్ళు మాటిమాటికీ గుజరాతీల్ని కడుపులో బెట్టుకున్నాం, మార్వాడీల్ని కడుపులో బెట్టుకున్నాం, వాళ్లని కడుపులో బెట్తుకున్నాం వీళ్లని కడుపులో బెట్టుకున్నాం మీతోనే తంటా అని అంటున్నారే, ఆ మతలబు యేంటో తెలుసా? ఆ గుజరాతీలకి తెలంగాణా సొంత ఇల్లు కాదు, వాళ్ళ మూలాలు గుజరాత్ లో వున్నాయనేది వాళ్ళకీ వీళ్ళకీ గూడా తెలుసు, పుట్టుక నుంచీ పెళ్ళిళ్ళూ అన్నీ వాళ్ళళ్ళో వాళ్ళే చేసుకుంటారు, పండగ లొస్తే గుజరాతు లో వున్న చుట్టాల ఇంటికే వెళ్తారు, మన ప్రాంతంలో వున్న గుజరాతీల్లాగే - మనకి తెలియదా? మనం కూడా అలాగే తెలంగాణాలో పరాయి వాళ్ళుగా వుంటూ వాళ్ళకి వొదిగి వుంటే మనం మంచివాళ్ళం అయి వుండే వాళ్లమేమో? అది మనకి సరిపడనిది కదా! యెక్కడున్నా షరతులూ వొత్తిళ్ళూ మనకి గిట్టవు, స్వేచ్చగా ఒక యెకరం భూమిని కూడా కొనుక్కోకుండా స్వంతం అనే భావన లేని చోట బతకడాన్నే బానిస బతుకంటారు, వాళ్ళు పెద్ద మనుషుల వొప్పందం పేరుతో మనల్ని కూడా అలాగే వుంచాలనుకున్నారు! నేను చెప్తున్నానుగా, మనకి ఇక్కడ రాజధాని యేర్పడిన మరుక్షణం నుంచీ మెడ మీద తలకాయ వున్న ఆంధ్రా వాడెవ్వడూ తెలంగాణాలో వుండడు - వీళ్ళింకా కర్నూలు గుడారాల గురించి వంకర కూతలు కూస్తూ వుంటే, అది ఖాయం! వుండాలనుకున్నా మనం వుండనివ్వకూడదు, యెందుకంటే మన వాళ్ళు వాళ్ల ప్రభుత్వానికి పన్నులు కట్టటం ద్వారా మన ఆదాయాన్ని వాళ్లకి సమర్పిస్తున్నట్టు లెఖ్ఖ! మన వాళ్ళ విగ్రహాలనే టాంక్ బండ్ మీద భరించ లేని చోట మన మెందుకు వుండాలి? వున్నందు వల్ల వాళ్ళు మనకి మెచ్చి మేకతోలు కప్పబోతారా?

         కాబట్టి ఇప్పుదు మనం యెవరి సొల్లు కబుర్లకీ విలువ ఇవ్వనక్కర్లేదు, హైదరాబాదును తలదన్నే బలమయిన రాజధానిని కట్టుకోవాలి! రాజధాని మొత్తం తిరిగి చూస్తే చాలు రాష్ట్రమంతా తిరిగి చూసిన అనుభూతి కలగాలి!! సారవంతమయిన వ్యవసాయ భూములు వున్నాయి.పొడుగాటి సముద్ర తీరం వుంది, యెన్నో రేవు పట్నాలు వున్నాయి - మనం నంగిరి పింగిరిగా బతకాల్సిన పని లేదు!!

      మొత్తం 13 జిల్లాల లోని ప్రజ లందరికీ అభివృధ్ధి లో తప్పకుండా వాటా వుంటుంది.వుండక పోతే పోట్లాడి అయినా సాధించుకోవాలి. కానీ రాజధాని విషయంలో మాత్రం మా ప్రాంతంలో వుండాలంటే మా ప్రాంతంలో వుండాలనె మూర్ఖత్వాలకి పోకండి. అది చాలా తప్పు, రాజధాని అనేది యే వొక్క ప్రాంతం వారికో స్టాటస్ సింబల్ కాదు. మొత్తం రాష్ట్ర ప్రజ లందరికీ హక్కు వుంటుంది, వుండి తీరాలి - అలోచించండి! చెన్నయ్ నుంచి తన్నించుకుని వచ్చారు, మా హైదరాబాదుని లాక్కున్నారు అనే మాటలు పడ్డాం, దానికి జవాబు చెప్పాల్సిన సమయంలో మనం గందరగోళానికి గురి కావటం వల్ల నవ్వుల పాలవుతాం.

        దేని గురించి సందేహ పడాలి మనం?ఈ సుదీర్ఘమయిన విభజన అనే రాజ్యాంగ పరమయిన ప్రక్రియని మొదలు పెట్టిన  గత కేంద్ర ప్రభుత్వం మనకి వాగ్దానం చేసింది రాజధాని నిర్మాణం కోసం సహాయం చేస్తామని. ప్రభుత్వ మర్యాద ప్రకారం గత ప్రభుత్వం చేసిన వాగ్దనాన్ని ఇప్పటి ప్రభుత్వం కూడా పాటించి తీరాలి. ఒక వేళ యే తొండి రాజకీయాల వల్ల నయినా కేంద్ర సాయం అందకపోయినా మన సొంత బాధ్యతగా మనం రాజధానిని కూడా కట్టుకోలేని దుస్థితిలో వున్నామా?ఒకటి గుర్తుంచుకోండి ఇప్పటికీ దేశాల మధ్యన ఖండాల మధ్యన సరుకు రావాణా సముద్రం ద్వారానే జరుగుతున్నది. ఇన్నాళ్ళుగా మనం పాడుబడేసిన సముద్ర తీరాన్ని వుపయోగించుకుందాం. వాళ్ళు సింగపూరు వెళ్ళి పాఠాలు నేర్చుకునే టైములో మనం ఆ సింగపూరునే ఇక్కడ చూపిద్దాం. అది అసంభవ మేమీ కాదు, వీళ్ళంతా చూసి మురిసి ముక్క లవుతున్న అక్కడి లాండ్ స్కేప్ గొప్ప యేమిటి?ఆ సిమెంటు కట్టడాలూ, తారు రోడ్లూ ఇక్కడా కట్టగలం, అయినా వుభయ గోదావరి జిల్లాలలో కనిపించే సహజమయిన ప్రకృతి సౌందర్యంతో తొణికిస లాడే లాండ్ స్కేప్ తో పోల్చి చూడండి, అంతకన్నా గొప్ప దృశ్యాలనే చూపించగలం మనం!

       నాకు వ్యక్తిగతంగా చంద్రబాబు మీద యే విధమయిన అభిమానమూ లేదు.రామారావును పడగొట్టటం అనేది కిరాతకమయిన పనే, దానికి సంబంధించిన కోపం కూడా వుంది.అప్పట్లో నేను రామారావు హాజరయిన ఒక అవధాన కార్యక్రమాన్ని చూశాను.అందరూ అతన్ని గుర్తు పట్టే డ్రామా డయలాగులూ ఆంగికాభినయమూ యేదీ లేకుండా, "యేమో, యేమవుతామో,భవిష్యత్తు యెట్లా వుందబోతుందో, మన తర్వాత తరం వాళ్ళు ఈ సంస్కృతిని యెట్లా కాపాడుకుంటారో అని ఆందోళనగా వుంది" అని చాలా ఫీలవుతూ మాట్లాడాడు. ఆ మాట తీరు చూస్తేనే అంతకు ముందున్న డ్రమెటిజం పోయి ప్రాక్టికల్గా మారాడని అనిపించింది. అలాంటి టైములో పడగొట్టటం దారుణ మనిపించింది. తరవాత్తరవాత కాలం గడిచే కొద్దీ  సర్దుకున్నాను, కాంగ్రెసోళ్ళ పదేళ్ల నిర్వాకం చూశాక వీళ్ళ కన్నా చాలా మెరుగు కదా అనిపించి ఇంకొంచెం తగ్గింది. కానీ ఇప్పుడు ఈ యుగసంధిలో అతని నాయకత్వం మనకి తప్పని సరి.చంద్రబాబుకి ఈ రాష్ట్రానికి తను యేది చేసి చూపించాలన్నా ఇదే ఆఖరి అవకాశం. తనకీ తెలుసు ననుకుంటాను.విజన్7 ఇంకా సూపర్ సెవెన్ అనీ తను చెప్తున్న వాటిల్ల్లో మంచి ప్రాక్టికాలిటీ వుంది. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ అనేది కూడా మంచి ఆలొచనే. ఇవన్నీ మంచి ఫలితాల నిస్తే రేపటి రోజున యెలా బతకాలి అనేదానికి దేశానికే కాదు ప్రపంచానికే కొత్తదారులు చూపించగలం - తెలంగాణా వాళ్ళతో సహా! ఇలాంటి సమయంలో మనలో మనం చిన్న చిన్న విషయాలకి గొదవలు పడకుండా కలిసికట్టుగా కదలాలి.

      సచివాలయం, శాసన  సభ అనేవి కేవలం సిమెంటూ ఇటుకలూ కలిపి కట్టిన కట్టడాల లాగా వుండకుండా మన చరిత్రనీ సంస్కృతినీ ప్రతిబింబించే అంశాల్ని నిర్మాణంలో వుపయోగించుకోవాలి. వాస్తులో ఈశాన్యం నుయ్యి ఆగ్నేయం పొయ్యి అని మూఢనమ్మకాల్లా అనిపించేవి కాకుండా కొన్ని మంచి విషయాలు వున్నాయి. వుదాహరణకి కిటికీలూ తలుపులూ సరిసంఖ్యలో యెదురెదురుగా వుండాలనేది. అది గాలి ధారాళంగా ఇటు వైపు నుంచి అటు వైపుకి  ప్రవహించదానికి వుపయోగ పడుతుంది.యెంత వేసవి లో నైనా గాలి కదులుతూ వుంటే హాయిగానే వుంటుంది, గమనించారా? తుఫాన్లు వచ్చినప్పుడు కూడా తలుపు లన్నిట్నీ తెరిచి వుంచితే నీటి వేగం మొత్తం ఇంటిని కూల్చెయ్యకుండా ఇటు వైపు నుంచీ అటు వైపుకి సాఫీగా వెళ్ళిపోతుంది. ఇలాంటి వాట్ని ఇప్పుడు కూడా వుపయోగించుకోవచ్చు. గోల్కొండ కోటలో ఇట్లాగే గాలిని వొంపులు తిప్పి సహజమయిన యేసీ గదిని ఒకదాన్ని యేర్పాటు చేసారని చదివాను. ఇళ్ళలో కూడా ఇలాంటి టెక్నిక్స్ ఫాలో అయితే కరెంటుని అతిగా వాడటం తగ్గుతుంది.

      ఇక్కడ చెన్నయ్ లో వళ్ళువార్ కొట్టంలో నేను ఒక మంచి విషయాన్ని చూశాను.వీళ్ళ చరిత్ర లోనూ సాహిత్యం లోనూ వున్న మంచి మంచి దృశ్యాల్ని గోడల మీద బొమ్మలుగా నిలబెట్టారు.సచివాలయ శాసన సభా భవనాల్లో కూడా కారిడార్లలో ఇలాంటివి వుంచాలి. బయట రోడ్దు మీద వెధవ పన్లు చేసే వాడయినా యేదయినా గుడిలో అడుగు పెట్టగానే యెంత బుధ్ధిమంతుడయి పోతాడో చూడండి! ఇక్కడ కూడా చుట్టూ వుండే వాతావరణం పవిత్రంగా వున్నప్పుడు దాని ఫలితం తప్పకుండా కనబడుతుంది!!
                                               సీ|| మేలు జరుగుగాక మేదినిపై గల
                                                       సకల జనులకు - స్వస్తి భవతు!

                                                       రక్షించబడు గాక రమణులు,వృధ్ధులున్,
                                                       శిశువు లనాధలున్ - స్వస్తి భవతు!

                                                       కలియుగాక సఫలకర్ములై దేశదే
                                                       శాల పౌరజనులు - స్వస్తి భవతు!

                                                        నశియించి పోవలె నీచులున్, దుర్మతుల్
                                                        శాంతమార్గముననె - స్వస్తి భవతు!

                                               తే|| చెలుల కిష్టులౌ మగలార స్వస్తి భవతు!
                                                       చదువు చెప్పు గురువులార స్వస్తి భవతు!
                                                       సమత పెంచు నాయకులార స్వస్తి భవతు!
                                                       సేద్య మొనరించు సైరికా స్వస్తి భవతు!!

(04/06/1996)



కంగారు పడకండి, అనుమాన మక్కర్లేదు - మనకి అంతా మంచే జరుగుతుంది!
--------------------------------------------------------------------------------------------------------

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...