Tuesday, 27 January 2015

యెవరీ కాళిదాసు?యేమిటితని గొప్ప!

          తెలుగుని ఇటాలియన్ ఆఫ్ త ఈస్ట్ అంటారట!ప్రాచీనమైన దాన్ని నవీనమైన దానితో పోలిస్తే వాడు ఫలానా వారి మనవడు అని చెప్పడానికి బదులు ఆయన ఫలానా కుర్రాడి తాతగారు అని చెప్పడం కాదా?వాళ్ళు కొత్తగా తెలుసుకుని ఈ భాషేదో ఇటాలియన్ భాషలా వుంది కదా అని అనుకోవడం వరకూ ఓకే?!కానీ మనవాళ్ళు కూడా వొప్పేసుకుని సర్దుకు పోయారే అదే కొంచెం ఇబ్బందిగా వుంది.

          తెలుగు భాష లాంటిదే కాళిదాసు పరిస్థితీ,షేక్స్పేయర్ ఆఫ్ ది ఈస్ట్ అట!కానీ రచనా కాలాన్ని బట్టీ వస్తు విశేషాన్ని బట్టీ చూస్తే నక్కనీ నాకాన్నీ పోల్చినట్టు వుంటుంది పోలిక?షేక్స్పెయర్ నాటకాలు అన్నీ ఒకే మూసలో వుంటాయి - విక్టోరియా కాలం నాటి వాతావరణం లోనే నడుస్తాయి కింగ్ లియర్ అయినా హాంలెట్ అయినా రోమియో జూలియట్ అయినా.కానీ కాళిదాసు తన కధల్లోని వర్ణనలు అతనెక్కడి వాడో తేల్చలేనంత వాస్తవికంగా వున్నాయి.కుమార సంభవంలో హిమాలయాల్ని వర్ణించిన తీరు చూసి అక్కడి వాడేమో ననీ,మేఘదూత కావ్యంలో చేసిన వుజ్జయిని వర్ణనల్ని చూసి ఇతను ఖచ్చితంగా వుజ్జయిని వాడే ననీ,రఘువంశంలో కళింగ ప్రభువైన హేమాంగదుది రాజ్య వైభవాన్ని కీర్తించిన తీరు చూసి కళింగ ప్రాంతాని చెందిన వాడనీ దిగ్దంతులైన విమర్సక శిఖామణులే గందరగోళంలో పడిపోయారంటే ఆ వైవిధ్యం యెంతటి గొప్పదో గదా!

          ఇతని సాహిత్యమే తప్ప ఇతని గురించి వస్తవాలు యెవరికీ తెలియవు.లక్ష్మీ ధర్ కాలియా అనే పండితుదు మాత్రం యెన్నో వ్యయప్రాయాసల కోర్చి ఆధారాలతో అతను కాశ్మీరుకు చెందిన వాడనీ బహుశా రాజాశ్రయం కోసం అటు తిరిగీ ఇతు తిరిగీ వుజ్జయిని నగరం దగ్గిర ఆగి వుండొచ్చునని అభిప్రాయ పడ్డాడు! అప్పటి వాళ్ళకి ఒక రకమైన నిర్లక్ష్యం వుండేది తమ గురించి చెప్పుకోవదం పట్ల - నా కావ్యంలో సత్తా వుంటే అది నిలబడుతుంది,నేను చదువర్లకి యేమి చెప్పాలనుకున్నానో అది చెప్పగలిగితే చాలు గదా నేనెవరినో చెప్పుకోవాల్సిన అవసర మేమిటి అనే వుద్దేశం వల్ల కాబోలు ?చిన్న బొమ్మ గీసినా అందులో యేదో ఒక మూల "ఆర్టిస్ట్:ఫలానా" అని ఇరికించుకునే సరదా వున్నవాళ్ళకి దాని వెనక వున్న ధీమా అర్ధం కాదు!

              ఇతని కాలాన్ని మాత్రం మొదట క్రీ.శ 1వ శతాబ్దంగా భావించారు గానీ ఇప్పుడు మాత్రం అందరూ క్రీ.శ 5వ శతాబ్దం వాడని నమ్ముతున్నారు.చాలా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా భావిస్తున్నారు.కవిత్వంలో తీసుకున్న వస్తువులూ వర్ణించిన పోలికలూ కూడా సామాన్యుల జీవితాల లోని అంశాలకి సంబంధించినవే అయి వుంటాయి.ఇతని నాటకాలు అన్నింటిలోకి "అభిజ్ఞాన శాకుంతలం" చాలా గొప్పది.దీని గొప్పదనాన్ని వర్ణించటానికి ఒక రమ్యమయిన శ్లోకం వుంది!అప్పటి విమర్సకులు ఇప్పటి లాగా రచన నంతా పీకి పాకం పెట్టి పేజీల కొద్దీ వ్యాఖ్యానాలు చేసేవాళ్ళు గాదు,సింపుల్గా వున్నా మొత్తం కావ్యంలో వున్న గొప్పదనాన్ని విప్పిచెప్పిన తీరు అర్ధమయితే "మజ్జారే,యేమి చెప్పినాడురా!" అనిపిస్తుంది.
"కావ్యేషు నాటకం రమ్యం 
నాటకేషు శకుంతలా 
తత్రాపి చతుర్థాంకం 
తత్రశ్లోక చతుష్టయోః" అని ఒకే ఒక్క శ్లోకం?! 
మొత్తం శాకుంతలం చదివి ప్రతి శ్లోకాన్నీ అర్ధం చేసుకున్నా గూడా ఈ పాయింటు పట్టిన వాడిని మాత్రం "అధ్భుతః" అనుకోకుండా వుండలేము?

దుష్యంతుణ్ణి మరోసారి చూడటం కోసం ఆగి వెనక్కి తిరిగిన శకుంతల:రాజా రవి వర్మ!

       చతుర్ధాంకం శకుంతల గర్భవతి అని తెలిసి కణ్వుడు ఆమెని ఇక యెంతోకాలం పుట్టింట్లో వుంచడం మంచిది కాదని దుష్యంతుడి దగ్గిరకి పంపించే సన్నివేశంతో మొదలవుతుంది.ఆ నాలుగు శ్లోకాల లోనూ వరసగా సకుంతల గునగణాల్ని వర్ణిస్తూ ఆమె పెంచిన మొక్కల్నీ జింకల్నీ కూడా వీడుకోళ్ళు అడగటం,కేవలం పెంచిన కూతురైన శకుంతలని విడవలేక పోతున్న కణ్వుడు తన దుఃఖాన్ని సంసారుల దుఃఖంతో పోల్చుకోవడం,కణ్వుడు దుష్యంతుడికి విన్నపం చేసుకోవడం,కణ్వుడు శకుంతలకి హితవు చెప్పదం అధ్బుతమైన సంవిధానం!

శ్లో||పాతుం న ప్రధమం యవస్యతిజలా యుష్మాస్వపీ తేషుయా
నాదత్తే ప్రియమండనాపి భవతాం స్నేహే నయా పల్లవం
అజ్యేవః కుసుమ ప్రసూతి సమయే యస్యాభవత్యుత్సవః
సేయం యాతి శకుంతలా పతిగృహం సర్వైరనుజ్ఞాయతాం!
భావం:మొక్కలకి నీళ్ళు పోయకుండా తను మంచినీళ్ళు కూడా తాగేది కాదు శకుంతల.చిగురుటాకులను అలంకరించుకోవతం యెంత ఇష్టమయినా సరే తుంచేది కాదు శకుంతల.తను పెంచిన మొక్కకి పువ్వులు పూస్తే పిలల్ పుట్టినంత సంబరపడి వుత్సవం చేసేది శకుంతల.అలాంటి శకుంతల ఇవ్వాళ అత్తారింటికి వెళ్తోంది అనుజ్ఞ ఇవ్వండి!

శ్లో||యాస్యత్యజ్య శకుంతలేతి హృదయం సంస్పృష్ట ముత్కంఠయా
కంఠస్తంభిత భాస్పవృత్తి కలుషశ్చింతా జదం దర్శనం
వైక్లవ్యం మమతావధీ దృస మిదం స్నేహాదరణ్యౌ కసః
పీడ్యంతే గృహిణః కధమ్నుతనయా విశ్లేష దుఃఖైర్నవై!

భావం:శకుంతల అత్తవారింటి వెళుతుందంటే కంఠం పట్టేసి మాట రావటం లేదు.కంటిలో నీరు చేస్రి చూపు కనిపించతం లేదు.చుట్టూ వున్నదంతా జడంగా కనిపిస్తున్నది.యే బంధాలూ లేని నాకే ఇంత బాధగా వుంటే గ్ర్హస్థులు ఇంకెంత బాధ పదతారో గదా?

శ్లో||అస్మాన్ సాధు విచింత్య సమ్యమధనాన్ ఉచ్చై కులంచాత్మనః
త్వైయస్యా కధమప్యబాంధవ కృతాం స్నేహ ప్రవృత్యించతాం
సామాన్య ప్రతిపత్తి పూర్వక మిదం దారేషు దృస్యాత్వయా
భాగ్యా యత్త మతః పరం నఖలుత ద్వాత్యం వహూబంధుభిః

భావం:మహారాజా!మునివృత్తిలో వున్న మాకు తపస్సే ధనం- అదే ఇస్తున్నా.నీ తాహతుకు తగ్గట్టు మేము ఇవ్వలేము - సిరిసంపదలు ఇవ్వలేదని మా అమ్మాయిని సాధించకు.మీది పెద్దలు కుదిర్చిన పెళ్ళీ కాదు,మీకై మీరు ఇష్టపడి చేసుకున్న గాంధర్వ వివాహం.కనుక మా అమ్మాయి నచ్చలేదని అనకు.నీకు చాలా మంది భార్యలున్నా అందరితో పాటే సమానంగా చూడు.అందరికన్నా యెక్కువగానే చూసుకుంటాను అంటే అది శకుంతల అదృష్తం, కానీ నేను మాత్రం అలా చెప్పకూడదు!

శ్లో||శుశ్రూషస్వ గురూన్ ప్రీయసఖీ వృత్తిం సపత్నీజనే
భర్తుర్విప్ర కృతాపి రోషణతయా మాస్మం ప్రతి పంగమః
భూయిష్తం భవ దక్షిణా పరిజనే భాగ్యేష్వనుత్సేకినీ
యాంత్యేవం గృహిణీ పదం యువతయో వామాః కులస్యాధయః

భావం:శకుంతలా!పెద్దలకి సేవ చెయ్యి.సవతులతో స్నేహంగా వుండు.భర్త కోపించినా వెనువెంటనే రోషం తెచ్చుకోకు.సేవకుల యందు దయ గలిగి వుండు.బోగభాగ్యాలు వున్నాయి గదా అనే వుద్వేగంతో గర్వాన్ని దరిచేరనివ్వకు.ఇలా వున్నప్పుడే యువతులు గ్ర్హిణీత్వంలో శోభిల్లుతారు!

      తన నవరస భరితం బ్లాగులో ఇదివరకే రసజ్ఞ గారు కాళిదాసు కవిత్వాన్ని చాలా చక్కగా విశ్లేషించారు.సంస్కృతం నేర్చుకుని ఆ కావ్యాలని అర్ధం చేసుకుని విడమర్చి చెప్పిన రసజ్ఞ్ గారికి నా అభినందనలు!నేనూ తప్పకుండా నేర్చుకోవాలన్న హుషారు నిచ్చాయి ఆ పోష్టులు.

     ఆ సన్నివేశంలో,"నేను సన్యాసిని,అన్ని బంధాలూ వొదిలించుకున్నవాణ్ణి..నువ్వా నాకు పుట్టలేదు, కేవలం పెంచాను.అంత మాత్రానికే ఈరోజు నువ్వు వెళ్తుంటే నాకే ఇంత దుఃఖంగా వుందే,యుక్తవయస్సు వచ్చేవరకూ పెంచిన సంసారులకి ఇంకెంత దుఃఖంగా వుంటుందో గదా!" అంటాడు.అదీ అక్కడి విషయం!ప్రతీ తరంలోనూ ప్రతి కుటుంబంలోనూ అతి మామూలుగా జరిగిపోయే ఒక సున్నితమైన సన్నివేశానికి అంతే సరళంగా శాశ్వతత్వం కల్పించాడు!?సంసారుల దుఃఖాన్ని సన్యాసి చేత పలికించాడు!అనువాదం చదివిన గోధే లాంటి మాహాకవి మంత్రముగ్ధుడయ్యాడంటే అవడా మరి?భారతీయ సాహిత్యంలో మొట్టమొదటిగా యూరొపీయ భాషలోకి అనువదించబడిన సంస్కృత గ్రంధాల్లో "అభిజ్ఞాన శాకుంతలం" ఒకటి!

        కాళిదాసు సాహిత్యాన్ని పరిశీలించి పరిష్కరించి అనువదించిన విదేశీ పండితు డొకరు,"సంస్కృత సాహిత్యం మొత్తం లుప్తమై పోయి కేవలం కాళిదాసు కవిత్వం మాత్రం మిగిలినా చాలు భారతీయులు ప్రపంచ సాహిత్య వేదిక మీద నిలబడి ఇదీ మా సాహిత్యం అని చెప్పుకుంటే అప్పటికీ ప్రధమ స్థానమే దక్కుతుంది భారతీయులకి" అని అన్నాడు!

        మరో నాటకం "మాళవికాగ్నిమిత్రం" కధ ఇవ్వాళ్టికీ మొత్తం ప్రపంచ సినిమా రంగమంతటా ఫార్ములా ఐపోయిన "పతి పత్ని ఔర్ ఓ" కధలా వుంటుంది!కానీ అప్పుడు భారతీయ సాహిత్యంలో మిగతా వాళ్ళు ఇంకా రామాయణ మహాభారత కధల నుంచి విడిపోకపోవడాన్ని బట్టి చూస్తే మాత్రం ఆ కాలానికి కొత్తరకమైనదే?అగ్నిమిత్రుడనే రాజు ఒక చిత్రపటాన్ని మాత్రం చూసి మాళవికని "ప్రేమిస్తాడు!" తీరా ఆ అమ్మాయి దాసి అని తెలిసి మొదటి భార్యకి ఒక దాసీ సవతిగా రావడం ఇష్టం లేక మాళవికని తన అంతఃపురంలోనే బందీని చేస్తుంది.చివరాఖరికి ఆ అమ్మాయి కారణాంతరాల వల్ల దాసిగా వున్నా మరో రాజ్యానికి చెందిన  రాక్జకుమార్తె అని తెలియడంతో సుఖాంత మవుతుంది.మరో నాటకం "విక్రమోర్వశీయం" అయితే మిల్స్ అండ్ బూన్ వాళ్ళ మూస అయిన "బాయ్ మీట్స్ గర్ల్" కధ లాంటిది - కాకపోతే మనుష్య లోకానికి సంబంధించిన విక్రముడికి దేవలోకానికి సంబంధించిన వూర్వశికి లింకు కలిపాడు.ఇప్పటికీ ప్రపంచ సాహిత్యంలో పుట్టిన ప్రేమకధ లన్నింటిలో గొప్పగా నిలబడగలిగిన శక్తి వున్న కావ్యం.

        పైన ఒక మాటని అక్కర్లేకపోయినా కొటేషను మార్కుల్లో పెట్టాను,యెందుకంటే ఆ మాటతో చక్కిలిగింతలు పెట్టే ఒక చిన్నప్పటి జోకు గుర్తొచ్చింది.గోదాదేవి కధ తెలుసుగా,ఒక తెలుగు మాష్టారు ఆ కధ చెప్పి పిల్లల్ని ప్రశ్లలడుగుతున్నాడు!మళ్ళీ ఆ కధని పిల్లలతో చెప్పించాలని చూస్తే అప్పటికే మన పిల్లలకి సినిమాల వల్ల పెరిగిన లోకజ్ఞానంతో భక్తి,ఆరాధన లాంటి లాంటి గంభీరమయిన మాటలు నోరు తిరక్క ఒక కుర్రాడు "రంగనాధుడూ గోదాదేవీ పేవించుకున్నారు?!" అనే మాటని వాడేసరికి గురువుగారికి "యెందుకీ వెధవలకి ఈ కధ యెక్కించాలనుకున్నానుస్మీ?!" అనేటంత విరక్తి కలిగింది?యెంత విరక్తి పుట్టినా తనకున్న పవరు ప్రకారం కుర్రాడి వీపు విమానం మోత మోగించడం మాత్రం మర్చిపోలేదులెండి!రంగనాధుదూ గోదాదేవీ పేవించుకోవడం అనే దృశ్యం తన కళ్లముందు నుంచి మాయమయ్యేదాకా కుర్రాడి వీపు మీద తబలా వాయించేశాడు "పేవించుకున్నారు అంటావా, అంటావా, అంటావా?" అని!

  ఇతని "మేఘసందేశం","ఋతుసంహారం" అనే కావ్యాలు రెండూ మరింత ప్రత్యెకమైనవి - విషయాన్ని బట్టి చూస్తే అతి విలక్షణమైనవి.మనకి మామూలుగా యెవరయినా యేదయినా గొప్ప కావ్యం రాసినా గొప్ప సినిమా తీసినా అలాంటిదే మనమూ తీసి మనమూ అంతటివాళ్ళం అనిపించుకోవాలనే దురద వుంటుంది.ఒక వసుచరిత్ర కావ్యం మోత మోగించగానే పది పిల్ల వసుచరిత్రలు వచ్చేశాయి!ఒక సినిమాలో యేదో ఒక అంశం వల్ల హిట్టయితే అదే వరసలో పది సినిమాలు వస్తున్నాయి.కానీ ఆ రెండు కావ్యాలలో వున్న విషయాన్ని మాత్రం కాపీ కొట్టడానికి యెవరూ సాహసించలేక పోయారు!ఒకటి అందమైన విరహప్రేమతో ముడిపెట్టిన మొదటి ట్రావేలాగ్ లిటరేచర్!రెండోది కధ యేమీ లేకుండా మన చుట్టూ మనకి యెలియకుండానే మారిపోతున్న ఋతువుల్లో మనకి కనిపించే అతి మామూలు దృశ్యాల్ని కొత్తగా వర్ణించి అందంగా చెప్పడం!

        మొదట్లో వాల్మీకి రామాయణంలో కవిత్వాన్ని శేషేంద్ర గారి ద్వారా కొన్ని విని నాకు ఒక అనుమానం వచ్చింది - ఇంత గొప్పగా వుపమాలంకారాన్ని వాడిన వాల్మీకిని వొదిలేసి "వుపమా కాళిదాసస్య" అని యెందుకన్నారా అని?ఋతుసంహారం లోని కొన్ని పద్యాలు చదివాక తెలిసింది ఆ మాట అతనికే తగినదని!పత్రికల్లో ఋతుసంహారానికి అనువాదమైన పద్యాలు చదివాను.యెండాకాలంలో జంతువులు నీడకి చేరి నాలికలు చాపి రొప్పుతూ వుండటాన్ని కూడా మర్చిపోలేని విధంగా వర్ణిస్తాడు.కాళిదాసు ఋతుసంహారం పూర్తిగా చదివి అర్ధం చేసుకోగలిగితే ఆ తర్వాత రుతువులన్నీ మనకి మరింత అందంగా కనబదతాయని నా నమ్మకం.మేఘసందేశం తెలుగు అనువాదం చదివాను.నేను చెన్నపట్నంలో వున్నాను అది మాతృనగరంలో వుంది!ఈసారి వెళ్ళినప్పుదు వెతికి దొరికితే తప్పకుండా ఇక్కడ వుంచుతాను?రామగిరి నుంచి అలకాపురి వరకూ దారిని వర్ణించడం యెంత గొప్పగా చేశాడంటే ఇవ్వాళ్టి గూగుల్ మ్యాపుని పట్టుకున్నా దారి తప్పిపోవచ్చునేమో గానీ ఆ వివరాలు పట్టుకుని వెళ్తే యెంత మొద్దావతారమైనా తేలిగ్గా గమ్యాన్ని చేరుకోవచ్చుననేటంత వివరంగా చెప్తాడు!అలకాపురి అనేది కల్పిత ప్రదేశమే అయినా అదొక వాస్తవం అని భ్రమించేటంత విపులంగా వర్ణించాడు ఆ నగరాన్ని - తన ప్రియురాలు యెక్కడ వుందో ఖచ్చితంగా మనం మన బంధువుల చిరునామా చెప్పినంత స్పష్టంగా రూపు కట్టించాడు!

        ఇంతటి ప్రతిభాశాలి గనకనే ఇతన్ని పొగడటానికి కూడా విమర్శకులు అందమైన కవిత్వాన్నే వాడారు!ఒకసారి సాక్షాత్త్తూ సరస్వతీ దేవిని యెదురుగా వుంచి సాహిత్యాన్ని తూచాలనుకున్నారు పండితులు కొందరు?!ఒక వైపు దండి,భవభూతి లాంటి వాళ్ళ కావ్యాలు వుంచారు,మరొక వైపు ఒక్క కాళిదాసు కవిత్వమే వుంచారు.త్రాసు మెల్ల మెల్లగా వేరే వైపుకి దిగి కాళిదాసు కవిత్వం తేలిపోతుంటే మధ్యవర్తిగా వుండాల్సిన వాణి తన కచ్చపీ నాదపు మాధుర్యంలో వేలి కొసని ముంచి కాళిదాసు కవిత్వం మీద ఒక బొట్టుని రాల్చిందట - దాంతో త్రాసు కాళిదాసు కవిత్వం వైపుకే మొగ్గింది!అంటే కాళిదాసు కవిత్వం ఇతరుల కవిత్వం ముందు తేలిపోవడం సరస్వతీ దేవి కూడా భరించలేకపోయిందని విమర్సకుడి భావం అన్నమాట!

        కాళిదాసు అనగానే మొదట్లో కూర్చున్న కొమ్మని నరుకుతూ కనబడి అత్యంత నాటకీయంగా ఒక రాకుమారిని పెళ్ళాడి ఆవిడ ప్రోద్బలంతో నాలిక మీద కాళిక బీజాక్షరాలు రాయగానే సాహితీ విశారదుడైన కధే అన్ని భాషల్లోనూ సినిమాలు గా కూడా వొచ్చింది!కానీ అది కేవలం కల్పన!యేదో అప్పుడప్పుడూ కొంచెం చందోబద్ధమైన ఒక పదో పదిహేనో సీసపద్యాలు రాయడానికే నాకింత కష్టంగా వుంటే అంత చక్కని భాష యే గురువు దగ్గిరా యేమీ నేర్వకుండానే హఠాత్తుగా వొచ్చేస్తుందా యెవరికయినా?ఐన్ స్టీన్ అనే మహా మేధావి వుడకబెట్టటానికి గుడ్డుకి బదులుగా తన రిస్ట్ వాచీని మరిగే నీళ్ళలో వొదిలాడంటే అంత తెలివి తక్కువ పని మనం చెయ్యము గనక అతనిలా సాపేక్ష సిధ్ధాంతం లాంటివి మనం సృజించలేమని తెలిసినా సరదాగా నవ్వుకుంటాం కదా!బహుశా అలాంటి ఆప్యాయత ఇలాంటి కధలలో వుండటం వల్లనే కాబోలు మిగతా విషయాల్లో హేతువుకి ప్రాధాన్యత నిచ్చే వారు కూడా తాము అభిమానించే వారిని గురించిన అందమైన కల్పనల్ని స్వాగతిస్తారు?

     కాళిదాస కవి కూడా అందరి వలెనే విద్యాభ్యాసం ద్వారానే తన ప్రతిభని మెరుగు పర్చుకుని వుండవచ్చు.అతనికీ ఇతర కవులైన దండి,భవభూతి లాంటి వాళ్లతో ప్రజ్ఞావైరం కూడా వుండి వుండవచ్చు.ఈ ముగ్గురితో ముడిపడిన మరొక కధలో ఆ కధా రచయిత అన్యాపదేశంగా చెప్పదలచింది అదేనేమో?


        ఒకసారి తనని మిగతా కవులు సరయిన రీతిలో గుర్తించడం లేదని కాళిదాసుకే ఆగ్రహం పుట్టి అందరికీ తను వుపాసించే కాళికా దేవితోనే చెప్పిస్తానని పిల్చాడు.అందరూ వచ్చాక దేవిని ప్రార్ధించి ప్రశ్న అడిగాడు.మూలవిరాట్టు నుంచి "కవిర్దండిః కవిర్దండిః భవభూతిస్తు పండితః" అని వినపడింది. ఆ తర్వాత అంతా నిశ్శబ్దం.అసలు అడిగిందే తను అయితే తన గురించి చెప్పలేదని చిరాకు పుట్టి "కోహం రండే?" అని గద్దించగానే "త్వమేవాహం త్వమేవాహం న సంశయః" అని వినబడేసరికి ఎవరికి తోచిన అర్ధం వాళ్ళు తీసుకుని దేవికి నమస్కరించారు!మిగతా వాళ్లకి నువ్వు నా అంతటివాడివి అని కాళిదాసుని పొగిడినట్టూ కాళిదాసుకి నువ్వూ నాలాగే రండవే అని అన్నట్టూ అర్ధమయింది?!



నెదర్లాండ్ లోని ఒక భవనం పైన సంస్కృత శ్లోకం?!

        యెప్పటికయినా కాళిదాసు కవిత్వాన్ని సొంతంగా చదివి అర్ధం చేసుకోవడానికయినా సంస్కృతం నేర్చుకోవాలి, కుదురుతుందో లేదో?!విదేశీయులు యెప్పుడో చదివారు,మనం ఇప్పుడైనా చదవకపోతే యెట్లా!?మన పెద్దవాళ్ళు "ఆనందో బ్రహ్మా,బ్రహ్మేతి వ్యజానాత్" అన్నారు!ఆనందమే బ్రహ్మ అయి ఆ బ్రహ్మ నుంచే సమస్తం జన్మించిందని.కాళిదాసు ఋతుసంహారం ఒక్కటి చదివి మన చుట్టూ మారుతున్న ఋతువుల్ని కొత్తగా చూస్తూ ఆనందంగా గడిపి ఆ ఆనందంలోనే అంతమై పోవడం కన్నా మనిషి కోరుకోదగిన దేమిటి?

(కొన్ని చోట్ల వస్తుగుణ సహాయం చేసిన మిత్రులకి _/\_)

26 comments:

  1. నాటకేషు శాకుంతలం రమ్యం,తత్ర చతుర్ధాంకం అతి రమ్యం,తత్ర చతుర్ధ శ్లోకం అత్యంత రమ్యం"

    ఆ శ్లోకమేమిటో చెప్ప కుండానే కథ లాగించేరు మొత్తం మీద !

    స శ ష !
    (సశేషం!)
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. గూగుల్ని యెంత గాలించినా దొరకలెదు నాకు మరి?
      మిత్రులకి లభిస్తే సంతోషంగా అక్కడ అమరుస్తాను!

      Delete
    2. ఆ శ్లోకం ఇదిగో నండీ -

      కావ్యేషు నాటకం రమ్యం
      నాటకేషు శకుంతలా
      తత్రాపి చతుర్థాంకం
      తత్రశ్లోక చతుష్టయోః

      భావం: కావ్యాల కన్నా నాటకాలు రమ్యమైనవి. నాటకాలన్నింటిలోనూ అభిజ్ఞానశాకుంతలం గొప్పది. ఆ నాటకంలో నాలుగో అంకం మరీ గొప్పది. ఆ శాకుంతల నాటకంలోని చతుర్థాంకపు మొత్తం పాఠంలో ఆ నాలుగు శ్లోకాలు అత్యంత గొప్పదనం కలవి.

      తాత్పర్యం: కావ్యాలు మన మనస్సుకు హత్తుకొనేలా లోకవృత్తాంతాలనూ వాటి మంచి చెడ్డలనూ బోధిస్తాయి. ఎంత చక్కగా బోధిస్తాయంటే, ఒక మనోహరి ఎంతో ప్రియంగా మాట్లాడుతూ మంచి మాటలు తలకెక్కించినంత సుతారంగా బోధిస్తాయి. కాని వాటికన్నా నాటకాలు శ్రేష్ఠమైనవి. ఒక కావ్యం గొప్పదనం తెలియాలంటే దాన్ని బాగా అధ్యయనం చేయాలి, అది మనస్సు కెక్కాలి అప్పుడుకదా రసానుభూతి కలిగేది?. కాని ఒక చక్కని నాటకాన్ని తిలకించగానే అది మంచి రసానుభూతి కలిగిస్తుంది. అందుకే కావ్యం కన్నా నాటకం గొప్పది. లోకంలో ఎన్నో నాటకాలున్నాయి, కాని వాటిలో అతిప్రశస్తమైనది కాళిదాసు గారి శాకుంతలమే. అందులోనూ దాని నాలుగవ అంకంలో రసావిష్కరణ అద్భుతంగా ఉంటుంది. ఆ నాలుగో అంకంలో కూడా నాలుగు శ్లోకాలని ప్రత్యేకించి ప్రస్తావించాలి - కణ్వుడు శకుంతలను అత్తవారింటికి పంపుతూ ఆమెను విడువలేక విడువలేక పలికిన ఆ నాలుగు శ్లోకాలు రసోత్కర్షను కలిగిస్తాయి. అది కదా రసావిష్కరణం అంటే!

      అదండీ ఆ ప్రసిధ్ధ శ్లోకమూ దాని భావమూ.

      Delete
  2. http://navarasabharitham.blogspot.co.uk/2012/06/blog-post_12.html

    contains those four slokas

    ReplyDelete
  3. మీ నుండి ఇలాంటి మంచి రచనలు మరిన్ని ఆశిస్తున్నాం.

    ReplyDelete
  4. మీరు టపాలో ప్రస్తావించిన మరొకశ్లోకం త్వమేవాహం గురించినది ఇలా ఉంది.

    కవిర్దండిః కవిర్దండిః భవభూతిస్తు పండితః
    కోహం రండే త్వమేవాహం త్వమేవాహం న సంశయః

    దీనినే సంభాషణా రూపంలో చూపితే ఇలా ఉంటుంది

    సరస్వతి:
    కవిర్దండిః కవిర్దండిః
    భవభూతిస్తు పండితః
    కాళిదాసు:
    కోహం రండే?
    సరస్వతి:
    త్వమేవాహం త్వమేవాహం
    న సంశయః

    ఇది ఒక చమత్కార పద్యం. ఎవరో అల్లినది. అంతే.

    ReplyDelete
  5. శ్యామలీయం వారు ,
    >>అదండీ ఆ ప్రసిధ్ధ శ్లోకమూ దాని భావమూ.!

    మరీ ఉత్సుకత కలిగిస్తున్నారు ! మీరు కూడా ఆ శ్లోకాలేవో రాయకుండా వాటి భావార్థం మాత్రం వ్రాసి ఊరు కోవడమేనా !

    ఇంతకీ ఆ శ్లోకాలేవిటి అన్న విషయం ఇంకా బయట పడ్డట్టు లేదు ! (బీటింగ్ అరౌండ్ ది బుష్! అని దీనినే అందు రేమో మరి ! )

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబీగారూ.
      ఆశ్లోకాలను రసజ్ఞగారి బ్లాగుటపా http://navarasabharitham.blogspot.co.uk/2012/06/blog-post_12.html లో చదవచ్చునండీ. ఈ‌ టపా లింకును bvsnmurth ఇవ్వనే ఇచ్చారు. అక్కడ శ్లోకాలభావాలను చదివి ఆనందించండి.

      Delete

    2. బాగు బాగు,

      ఈ లింకు కలపడం తో ఈ టపా కి 'భావస్థిరాణి జననాంతర సౌహృదాని' అబ్బింది !

      జిలేబి

      Delete
  6. >>
    నెదర్లాండ్ లోని ఒక భవనం పైన సంస్కృత శ్లోకం?!!

    హరి బాబు గారు,

    నిజమే నంటా రా ! (ఫోటో షాపు మహాత్మ్యం కాదని అనుకుంటా !)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. నిజమైనదే,దాని గురించిన విశ్లేషన కూడా వుందక్కడ!ఇక్కడికి సంబంధం లేదు గదా అని లింకు గుర్తుంచుకోలేదు.

      Delete
  7. కళాత్మక స్వేఛ్ఛ ఆ కాలం లోనే ఎక్కువ గా ఉన్నట్లుంది. కాళిదాసు రండ అన్నాడని చెప్పుకొన్న విధం గానే ఎం ఎఫ్ హుసేన్ న్యూడ్ లను వేయటాన్ని ఎందుకు తీసుకోలేకపోతున్నాం? అతను వేరే మతం వాడవటం వలనా? లేక మన లో అసహనం(మన లోని అభద్రత వలన) పెరిగిపోయిందా?

    ReplyDelete
    Replies
    1. బొందలపాటివారూ,
      నేను నా వ్యాఖ్యలో చెప్పాను కదా, "ఇది ఒక చమత్కార పద్యం. ఎవరో అల్లినది. అంతే." కాళిదాసమహాకవి ఉచితానుచితాలు గణించకుండా అమ్మవారినే కోహం రండే అని నిలదీసాడని భావించలేమండీ. ఇలాంటి చాటువులే తెనాలి రామకృష్ణకవికీ అంటించారు కాని అవన్నీ అసంగతాలు.

      Delete
    2. మాస్టారూ,
      ఈ పద్యం పుట్టించినదవ్వవచ్చు..కానీ చాలా కవిత్వం, కాళిదాసు చెప్పిందే కాక ఇంకా చాలా మంది చెప్పినది.., దేవతల శరీర భాగాలను వర్ణించేది ఉంది..ఇప్పుడే నెట్ లో చూశాను. మనకి విక్టోరియన్ మొరాలిటీ అలవాటై అవి ఇప్పుడు తప్పుగా కనపడుతున్నాయి.
      కాళిదాసు చెప్పినదే, ఓ పడతి కుచాలు రెండూ ఆమె రవికతో ఎలా పోట్లాడుతున్నాయో మా తెలుగు మాస్టారు చిన్నపుడు చెప్పారు...మరచిపోయాను..చివరి లో "కోయం" అని వస్తుంది... మీకు తెలిస్తే చెప్పండి.

      Delete
    3. This comment has been removed by the author.

      Delete
    4. "బూతాడక దొరకు నవ్వు పుట్టదు మహిలో సుమతీ" అన్న చౌడప్ప నిజంగా బూతులు రాయలేదండీ!లోభిని గాడిదా అని తిడీతే "వీడా నా కొడుకటంచున్ అది యేడ్చ్గున్" లాంటివి చెప్పాదే తప్ప.అక్కడ అప్పుడు బూతు అంతే మామూలుగా అప్పటికి కవులు వాడకూడని పదాలౌ అని అర్ధం.కవి చౌడప్ప నీతులు చెప్పడానికి కొంచెం అనకూడని మాట ఒకటి వేసి నవ్వు పుట్టిస్తూనే అందులో నీతిని కలిపితే నవ్వు ఆగిపోయాక నీతి పని చేస్తుందనే వుద్దేసంతో అలా అన్నాడు.పైన చెప్పిన శ్లోకాన్ని కూడా చెప్పిన కవి చేసింది క్కూడా అదే అని నా అభిప్రాయం.నాకేందుకో యెవరో ఒకరు యేదో ఒక విధంగా దీన్ని అపార్ధం చేసుకుంటారేమో పరిహరించుదామా అనుకుని కూడా పోన్లే మరీ అంత ఘోరమైన మాట కాదులే అనుక్ని వుంచాను,తీరా మీరు దాన్ని పట్టనే పట్టారు?

      యం.యెఫ్ హుస్సేన్ మాధురీ దీక్షిత్ న్యూడ్ ఫిగరు గీసుమంటే యెవ్వరూ కాదనే వాళ్ళు కారు?భారతమాతని నగ్నంగా గీశాదు,పక్కనే తన తల్లికి మాత్రం నిండుగా బట్టలు తొడిగాడు!

      Delete
    5. "బూతాడక దొరకు నవ్వు పుట్టదు మహిలో సుమతీ" అని చౌడప్ప అనలేదండీ. ఆయన వెటకారపు పద్యం ఇది

      కం. బూతనిన నవ్వుచుందురు
      బూతాడక దొరకు నవ్వు పుట్టదు ధరలో
      బూతులు నీతులు లోక
      ఖ్యాతులురా కుందవరపు కవి చౌడప్పా

      Delete
  8. కళాత్మక స్వేఛ్ఛ ఆ కాలం లోనే ఎక్కువ గా ఉన్నట్లుంది. కాళిదాసు రండ అన్నాడని చెప్పుకొన్న విధం గానే ఎం ఎఫ్ హుసేన్ న్యూడ్ లను వేయటాన్ని ఎందుకు తీసుకోలేకపోతున్నాం? అతను వేరే మతం వాడవటం వలనా? లేక మన లో అసహనం(మన లోని అభద్రత వలన) పెరిగిపోయిందా?

    ReplyDelete
    Replies
    1. బొందలపాటి గారు,

      సమతం వాడు చేసినా ఇప్పుడు సహించే పరిస్థితి లేదు. వందలాది సంవత్సరాల ముందే సెక్స్ పండిత సభల్లోనూ, బహిరంగ వేదికల మీదా చర్చించ బడిన దేశం మనది. కామసూత్ర రాసుకున్న దేశం మనది. సెక్స్ ను పవిత్రంగా భావించి గుళ్ళమీద అత్యంత నైపుణ్యంతో బూతు బొమ్మలను చెక్కుకున్నాం. మన ప్రబంధాలూ, కావ్యాలూ, గోపికా కృష్ణుల క్రీడల వర్ణనలు కూడా అందుకు సాక్ష్యంగా నిలిచాయి.

      అబ్రహామిక్ మతాలు మాత్రమే సెక్స్ ను ద్వేషిస్తాయి, పాపంలా చూస్తాయి. ఆ మతాలు మన దేశంలో ప్రవేశించిన తర్వాత హిందువులు, సెక్స్ పట్ల తాము సానుకూల ధోరణి కలిగి వుండడాన్ని గర్వించే బదులు అందుకు వ్యతిరేకంగా ఆత్మ న్యూనతకు లోనైనట్టు కనిపిస్తుంది. అలా వచ్చిన ఆత్మ న్యూననతతో పరాయి వారికంటే మరింత ఎక్కువ ద్వేషించ డానికి అలవాటుపడ్డారు.

      కాని వచ్చిన చిక్కల్లా, ఆయా మతాల వారు ద్వేషించడాన్ని వారి మతగ్రంధాలు నిర్దేషిస్తున్నాయి. కాని మనకేమో వారసత్వంగా వచ్చిన గ్రంధాలు ఒకలాగ, మన ప్రవర్తన మరొకలాగా వున్నాయనిపిస్తుంది.

      Delete
    2. శ్రీకాంత్ చారి గారూ మీరు చెప్పినది సబబుగా కనిపిస్తోంది. ఆలోచించవలసిన విషయాలున్నాయి. బేలూరులోనో హళేబీడులోనో లేదా దక్షిణాదిని మరొకచోటో సరిగా గుర్తులేదు కాని ఒక దేవాలయస్థంభం పైన నగ్నపార్వతి అని ఒక శిల్పం ఉన్నది!

      Delete
  9. హరిబాబు గారు టపా చాలా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు,కొన్ని మేఘసందేశం తెలుగు వచనం లాంటివి కొని చదివి వున్నా.అది దగ్గిర వుంతే వాట్ని కూడా కలిపగలిగే వాణ్ణి!

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...