Tuesday, 20 January 2015

యెవరు నేను?యెవరు మీరు!అధికారం ముందా,అభివృధ్ధి ముందా?ఈ హరిబాబు యేమి చెప్తాడు?!

"నువ్వు భారతీయుడవైతేనే నువ్వు బ్రిటిష్ వారి (నీ పైన ఉన్నవారిపైన నీ హక్కులకు) పైన పొరాడెదవు అందుకే అస్తిత్వం అవసరం
ఇది మీకు అర్ధం కాదు ఎందుకంటే మీరు సమస్య కు పరిష్కారం చూపలేరు ,చూపించిన పరిష్కారం తప్పు అని ఎలా చెప్పగలరు..?

బ్రితిష్ వాడి లాగే హిందు ముస్లిం మధ్య అంతరాలను ఉపయొగించి దివిజన్ చెసినట్టే మాల మాదిగ అనే దివిజన్ ను మీరు బలపరుస్తున్నారు..ఒక్క విషయం గుర్తుంచుకోండి అన్నేళ్ళు పై వర్ణాలు ఉన్నారు వాళ్ళు కింది వర్ణాలకు ఏం చేశారు..?దోచుకొవడం తప్ప?

కాని పూర్తిగా సమస్యను సాధించే పరిష్కారం లేనప్పుడు సమస్యను కొంతైనా పరిష్కరించేది మెలు ..?కాని అది కూడ వద్దు అనే మీబొటి వాళ్ళు ..?సమస్యకు పరిష్కారం చూపెట్టరు,ఉన్న పరిష్కారాన్ని ఉపయోగించి మీరు మీబోటి వాళ్ళు పరిస్థితులను వాడుకుంటారు.

కులవ్యవస్థను నేను అట్టి పెట్టుకొకుండా ఎలా ఉండాలి అన్నది మీరు చెప్పడం లేదు. 
అది వదిలేసి మళ్ళీ పిట్ట కథలు చెప్తున్నారు.
ఊరికే ఉపన్యాసాలు ఆదర్శాలు చెప్పకూడదు. 
ఇంత రాసినా నాకు తెల్సు మీకు అర్ధం కాదు అని.
ఎందుకంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో దెన్ని అంగీకరిస్తున్నారో దెన్ని అంగీకరించడం లేదో మీరు కంఫ్యూజన్ గా ఉన్నారు. 
కామెంట్ కి రెప్లై ఇచ్చే ముందు కామెంట్ ను పూర్థిగా చదవండి .

నేను చెప్పేది నా కింది కులం వాళ్ళు నా కింద ఉండాలని కాదు దీనిని మీరు ఇలా రాసే మెధవులు. 
కాబట్టి నేను నా పైన మరియు నా కింద యే కులం ఉండకూడదు. 
దీనికి యేదైన పరిష్కారం చూపెట్టగలరు. 
లేక పొతే ఇప్పుడు జరుగుతున్నది కచ్చితంగా వర్కౌట్ ఔతుంది.

చూశారుగా ప్రతి ఒక్కరు తమ అస్తిత్వానికి పోరాటం చెస్తున్నారు..
అంతకు ముందు పైన ఉండే వాళ్ళే తమ అస్తిత్వానికై పోరాడేవాళ్ళు.
ఇప్పుడు కింది అట్టడుగు వాళ్ళు తమ అస్తిత్వానికి పోరాడుతారు.

కనీసం ఇప్పుడు కింది వారు పోరాదే హక్కు తమకూ ఉందని తెలుసుకుంటున్నారు ..
అప్పుడు లేదు ..మీరు ముందు కులవ్యవస్థ ను గూర్చి పూర్తి గా అధ్యయనం చెసి రాయండి, లేదు నాకు అంతా తెలుసు అని రాస్తే మీ ఇష్టం -  ఆల్ దె బెస్ట్"
----------------who am i16 January 2015 at 08:07        ఇది నా గత పోష్టు "ఇదండీ కమ్యునిజం చరిత్ర" పోష్టులోని విషయం గురించి దళితవాదపు సమర్ధకులలో ఒకరి సుదీర్ఘమయిన విమర్శ నాపైన!మరొకరు కూడా దాదాపు ఇలాంటి ఆరోపణలే చేశారు,ఆరోపణలు అనకూడదేమో?పోష్టులోని విషయం అర్ధాంతరంగా ముగియడం వల్ల కూడా ఈ రకమయిన  రెస్పాన్స్ వచ్చి వుండవచ్చు.విషయం చాలా విస్తృతమైనది,పైగా యే కొంచెం మాట పొల్లయినా విపరీతార్ధాలు వస్తాయి!అవగాహన స్పష్తంగానే వున్నా దాన్ని యెలా చెప్పాలా ఈ పోష్టుని యెలా ముగించాలా అని ఆలోచిస్తూ చాలా రోజులు గడిపాను.ఆఖరికి మొత్తం అంతా ఇక్కడే చెప్పడం కుదిరేది కాదని అంతవరకూ పబ్లిష్ చేశాను. అడిగిన ప్రశ్నలన్నిటికీ లెక్క ప్రకారం కిందనుంచి పైకి జవాబులు చెప్తూ వెళ్తే వరస బాగుంటుంది,యెందుకంటే నాకసలు కులవ్యవస్థ గురించి సరైన అవగాహనే లేకుండా నోటికొచ్చిన పిట్టకధలు చెప్తున్నానని అంటున్నారు గదా - ముందు దాంతోనే మొదలు పెడతాను.


        ఇప్పటివరకూ మన దేశం యొక్క గతం గురించి మనకి సాధికారికంగా తెలిసిన నాగరికత సింధు లోయ నాగరికత. ప్రపంచంలోని అతి ప్రాచీనమైన మూడు నాగరికతలలో ఇది ఒకటి! హరప్పా నగరానికి సంబంధించిన తవ్వకాల్లోనే యెక్కువ విశేషాలు తెలియడం వల్లా మిగిలిన చోట్ల బయటపడిన విషయాలు కూడా దాదాపు ఇలాగే వుండటం వల్లా హరప్పా నాగరికత అని కూడా పిలుస్తున్నారు.తన వుచ్చదశలో 5 మిలియన్ల జన సమూహం ఈ సంస్కృతిలో జీవించారు!ఈ జనసమూహం అంతకు ముందు వేట ప్రధానంగా జీవికగా వున్న ఒక తల్లి నుంచి పుట్టిన కుదురు గణం అని పిలవబడే సమూహంగా కదుల్తూ వుండే సంచార జీవనం నుంచి కొత్తగా నేర్చిన వ్యవసాయం మూలంగా స్థిరజీవనాన్ని యేర్పరచుకుంటున్న తొలి దశ!ఇప్పటి మన దేశపు సంస్కృతిలో కూడా ఈ సంస్కృతి చాయలు పరుచుకుని వున్నాయి కాబట్టి దీన్ని గురించి కొంచెం వివరంగా చెప్తాను.

        వేట జీవన విధానంగా వున్న కాలంలోనే ఇక్కడ ఇవ్వాళ కమ్యునిష్టులు చెప్తున్న "అదనపు వులువని సమాజపరం చెయ్యడం" అనే ఆదర్శానికి సమానమైన "దేవీ భాగం" అనే  సాంప్రదాయాన్ని పాటించారని ఈ సంగచ్చధ్వం సంవదధ్వం అనే ఋగ్వేద మంత్రం ద్వారా తెలుస్తుంది!దేవీభాగం అంటే - పసిపిల్లలకూ, దంతాలు లేని వృద్ధులకూ మెత్తని మాంసం మొదట ఇవ్వాలి.తర్వాత దౌహృదులకి - రెందు హృదయాలు ఉండే గర్భవతులకి రెట్టింపు మాంసం ఇవ్వాలి.అలా వారందరికీ పంచగా మిగిలిన మాంసాన్ని యువతీ యువకులకీ, జవసత్వాలు గలిగి సంపద పెంచే ఇతరులకీ పెట్టాలి.ఆ మంత్రంలోనే "పూర్వులు యెలా చేసేవారో" అనడం ద్వారా అప్పటికే దానికి దూరమయ్యారని కూడా తెలుస్తుంది!ఆదర్శం గొప్పదే గనక కొంత శ్రధ్ధ చూపించి కృషి చేస్తే ఇప్పటికీ మరో రూపంలో దాన్ని సాధించి నిలబెట్టుకోవచ్చు!

        ఒక దేశపు చరిత్ర ఆ దేశప్రజల సమిష్టి బాల్యస్మృతుల్ని తట్టిలేపే తేనెతుట్టె!నాకు మా తాతగారి ఇంట్లో గడిచిన బాల్యం చాలా అపురూపంగా వుంటుంది.అయితే ఆ ఇల్లు ఇప్పుడు లేదు.జ్ఞాపకాలు మాత్రం ఇప్పటికీ ప్రతి అంగుళాన్నీ గుర్తుకు తెస్తాయి.కానీ జ్ఞాపకాల కోసమని ఇప్పుడు సౌకర్యం కోసం కట్టిన భవంతిని కూల్చేసి మళ్ళీ ఆ పూరింటిని కట్టడం అనే పిచ్చిపని నేను చెయ్యను?దేశపు చరిత్ర కూడా అంతే!అప్పుడు మనం చేసిన తప్పుడు పనులు కూడా ఇప్పుడు మనకి తియ్యగా వున్నట్టే అప్పటి వాళ్ళు చేసిన తప్పొప్పుల్నీ చూడాలి - వాళ్ళు చేసిన తప్పుల్ని మనం చెయ్యకూడదనే వివేకాన్ని పెంచుకోవడమూ వాళ్ళు చేసిన గొప్పపనుల్ని తలుచుకుని వుత్తేజితులు కావడమే చరిత్ర పఠనానికి లక్ష్యంగా వుండాలి తప్ప ఒకవైపు నుంచే చూసి ఆయనెవరో చెప్పినట్టు యేనుగుని చేతికందినంతమేర తడిమి అదే సమస్తం అని వర్ణించే గుడ్డివాళ్ళ మాదిరి భాష్యాలు చెప్పే యేకపక్షపు సిధ్ధాంతుల్ని అమాయకంగా నమ్మితే మనకి కనబడేవి అర్ధసత్యాలే!

        సరిగ్గా హరప్పా కాలం నాటి వాతావరణమే కలిగిన మాయా నాగరికత లాంటివి అక్కడి ప్రాంతాల నైసర్గిక స్వరూపం వల్ల ఇతర జాతుల దాడిలో చాలా త్వరగా రూపాన్ని మార్చుకున్నాయి,కానీ హిమాలయ శ్రేణులు మిగతా ప్రపంచం నించి ఈ భూభాగాన్ని వేరు చెయ్యడం వల్ల బ్రిటిషర్లు శిధిలం చేసే వరకూ కొనసాగిన "స్వయం పూర్ణ గ్రామ వ్యవస్థ" హరప్పా సంస్కృతి మూలాల్ని పదిలంగా పట్టి వుంచగలిగింది!కొందరు ఈ శీతనగాన్ని దాటి వచ్చి తాము దోచుకుని తమ దేశాలకి తరలించుకుపోయినా బాబరు లాంటి వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చేసరికే అక్కడి నిరంతర యుధ్ధాలకి విసుగెత్తి వుండటంతో ఇక్కడే తమ సామ్రాజ్యాల్ని స్థాపించుకున్నారు!మొగలు వంశ స్థాపకుడైన బాబరే కాదు షేర్షా సూరి లాంటి వాళ్ళు కూడా అదే పని చేసినా వారి లక్ష్యం రాజ్యస్థాపన కాబట్టి ప్రజల సంస్కృతిని కదిలించక పోవడం వల్లనే పై స్థాయిలో రాజు యెవరయినా ప్రజలకి యే విధమయిన తేడా తెలియ లేదు.

        కొత్తగా కట్టిన ఆధునిక నగరాల్ని కాకుండా ప్రాచీన నగరాల్నీ చరిత్ర పూర్వకాలం నుంచీ వున్న పల్లెల్నీ చూస్తే వారి జీవనకేంద్రంలో ఒక దేవాలయం వుండటమూమళ్ళీ  ఆ కోవెలకి తప్పనిసరిగా ఒక పుష్కరిణీ లేదా స్నానఘట్టం వుండటమూ గమనించవచ్చు.అది సింధులోయ నాగరికతకి రూపు మారిన కొనసాగింపు!మూలాలు తెలియకుండానే వేల సంవత్సరాలుగా కొనసాగుతున్నా ఆ మూలాల గురించి వాస్తవంగా తెలిసింది క్రీ.శ 1842లో చార్లెస్ మాస్సన్ ద్వారానే.తర్వాత 1856లో జనరల్ కన్నింగ్ హాం కరాచీ లాహోరులను కలుపుతూ ఈస్ట్ ఇండియా రైల్వే కంపెనీ తరపున జరిగే పనిలో భాగంగా దీన్ని గురించి ప్రముఖంగా పట్టించుకుని ప్రపంచానికి తెలియజేశాడు!రాజ్యం అనేది ప్రాధమిక స్థాయిలో వున్న అప్పటి నగరంలో రెండు ప్రధానమైనవి - ఒకటి ధాన్యపు రాశి,రెండు బహిరంగ స్నానఘట్టం.స్నానఘట్టం కేవలం స్నానానికి వుద్దేశించింది అనుకుంటే పొరపాటు!ప్రతి ఇంటిలోనూ స్నానాల గదీ మురుగునీటి సౌకర్యమూ వుండగా మళ్ళీ దీన్ని యెందుకు యేర్పాటు చేశారో తెలుసా?ఇవ్వాళ్టికీ దైవ ప్రార్ధనకి ముందు దేహాన్ని స్నానం ద్వారా శుభ్రపరచడం అనేది జరుగుతున్నదే గదా - ఆ అవసరం కోసమే ఈ బహిరంగ స్నానఘట్టం!దానికి నిదర్శనం అక్కడ వున్న దుస్తులు మార్చుకోవడానికి వున్న గదులు!ఇప్పటి ఆధునిక కాలంలోని స్విమ్మింగ్ పూల్స్ మాదిరి విలాసానికీ ప్రత్యేక తిధుల్లో మతాచారాల కవసరమయిన శౌచానికీ వుపయోగించేవారని మనం భావించవచ్చు!అందువల్లనే కాబోలు తర్వాతి దశ ఆయిన రాజరిక వ్యవస్థలో స్నానఘట్టాలు దేవాలయం - రాజప్రాసాదం అనే రెండు చోట్లనే కనిపిస్తున్నాయి?

        తర్వాత యేర్పడిన రాజ్యాలు కూడా ఓకే నగరాన్ని ఆధారం చేసుకుని వుందటం వల్ల అదే సామాజిక నిర్మాణం కొన్ని మార్పులతో కొనసాగింది.ధాన్యాగారం ధనాగార మయింది.స్నానఘట్టం పూర్తి హంగులతో దేవాలయం అయ్యింది!మరోసారి వెనక్కి వెళ్ళి నగర క్రమబధ్ధీకరణ గురించి తెలుసుకుంటే కళ్ళు చేదిరే దృశ్యం కనబడుతుంది.నగర నిర్మాణంలో ఆ కాలపు భారతీయులు వుపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం మధ్యప్రాచ్యంలోని సమకాలీన నాగరికతల కన్నా సరిపోల్చలేనంత గొప్పగా వుంది!అది మన వారసత్వం,అది మన ప్రాచీనుల మహత్వం!దాదాపు నాగరికులంతా అయితే చేతివృత్తులతో కళాఖండాల్ని సృష్టించగలిగిన వారూ లేదంటే వారు సృజించిన వాట్ని సుదూరతీరాలకు కూడా తీసుకెళ్ళి అక్కడి విపణివీధుల్లో అమ్మగలిగి సంపదని సృష్టించే రహస్యం తెలిసిన వ్యాపారస్తులూ ఐవున్నారు.దానికి సాక్ష్యం వారు నగరనిర్మాణంలో వాడిన కొన్ని వస్తువులు ఆ దరిదాపుల్లో యెక్కడా దొరకనివి కావటం.

        ఈ జనసమూహాలు అంతకుముందు వేట ప్రధానమైన జీవికగా వుండి ఒక తల్లి సంతానం అంతా ఆమె పేరుతోనే పిలవబడే ఒక గణంగా కలిసి ఒకచోట ఆహారం పలచబడగానె మరొకచోటికి కదులుతూ సంచారజీవనం సాగిస్తూ వుండేవి!తర్వాతి కాలంలో జన్యురోగాలకి కారణమవుతున్నాయని తెలిసిన నిషిధ్ధ శ్రంగారం కూడా అప్పుడు సహజంగా అనిపించేది!ఒక తల్లి నుంచి పుట్టిన సంతానం, ఆ సంతానంలోని ఆడవాళ్ళ నుంచి పుట్టిన సంతానం అంతా ఒకటే కుదురు అయ్యేది!ఇవ్వాల్టి మాదిరి ఒక స్త్రీ ఒక పురుషుడు ఆజీవపర్యంతం కలిస్ బతికే వివాహం అనేది గణసాంప్రదాయాన్ని ధిక్కరించటం కింద పరిగణించే వావివరుసలు లేని  కాలమది!ఇవ్వాల్టి మేనరికాల లాగే ఒకే గణానికి చెందిన స్రీ పురుషులు కొన్ని తరాల పాటు కలవడం వల్ల వచ్చి పడుతున్న కారణం తెలియని రోగాలకి భయపడి ఒకే గణానికి చెందిన స్త్రీ పురుషుల కలయికని నిషేధించి గణ సమూహాల మధ్య ఆదాన ప్రదానాలతో కూడిన బాంధవ్యాల్ని పెంచుకున్నారు.పుట్టుక తోనే వచ్చే ఆ  రోగాలకి కారణం స్త్రీ గర్భం అనే అపోహ వల్లనో యేమో తమ ఆడవాళ్ళని వేరే గణానికి పంపుతూ వరే గణానికి చెందిన స్త్రీలని తాము తెచ్చుకుంటూ కుండమార్పిడి పధ్ధతిని పాటించారు.అసలు కారణమేమిటో తెలియక చేసినా అసలు సమస్య పరిష్కారమవడంతో పాటు సొంత గణంలో పట్టుని కోల్పోయి కొత్త గణంలో పట్టును సాధించలేక ఆదపెత్తనం అంతమైపోయి మగపెత్తనం మొదలయింది!మొదటి దశలో ఇలా గణాల మధ్యన ఆడవాళ్ళ మార్పిడి జరిగినా శృంగారం మాత్రం సామూహికమే సాంప్రదాయంగా వుండేది.ఇవ్వాళ మనం పెళ్ళిలో అరుంధతి నక్షత్రాన్ని చూపించడానికి కారణం మొట్టమొదటి సారిగా ఆ ఆలోచన చేసి దానికి కట్టుబడి వశిష్టుణ్ణి కూడా ఒప్పించడమే!కులాల్ని వేరు చేసేది వివాహమే కాబట్టి ఇవ్వాళ్టి కులవారసత్వాలకి సంబంధించిన వివాహ సాంప్రదాయాలు యెట్లా యేర్పడినాయో తెలియడం కోసమే ఇంత విస్తారంగా చెప్పాను.ఇప్పటికీ అనుకోకుండానే యెవరినైనా మామగారింటిని "మీ అత్తవారిల్లు" అని ప్రస్తావించడంలోనూ ఆడపిల్ల తలిదండ్రుల్ని "మీ అమ్మాయిని యే వూరిచ్చారు?" అని అడగటంలోనూ ఏనాడో కాలగర్భంలో కలిసిపోయిన మాతృస్వామ్యపు  ఆనవాళ్ళూ సామూహిక వివాహపు అలవాట్లూ వున్నాయనేది తెలిస్తే కొన్ని వేల సంవత్సరాల క్రితం విషయాల పట్ల కూడా మనం యెంత ఆప్యాయంగా వున్నామో అర్ధమవుతుంది!

        హరప్పన్ ఇంజనీర్లు వాడిన దంతం మీద గాట్లతో యేర్పరచిన స్కేలు మీది అతి చిన్న ప్రమాణం ఇప్పటి 1.7 మిల్లీమీటరుకి సరితూగుతుంది!ఇళ్ళ నిర్మానంలో సైజుల వారీ తేడాలు వున్నా అన్ని ఇళ్ళూ ఒకేరకంగా వుండటం వల్ల అప్పటివాళ్ళు సమానత్వాన్ని పాటించేవారని తెలియజేస్తున్నాయి.నగరం నలుమూలలకీ వీధులూ ఇళ్ళూ ఒక గ్రిడ్ మాదిరి విస్తరించి వున్నాయి.మొత్తం నగరం రెండు భాగాలుగా వుంది.ధాన్యాగారానికి దగ్గిరగా వున్న ప్రాంతం యెగువనగరం గానూ దూరంగా వున్న జనావాసాలతో కూడినది దిగువ నగరం గానూ వుండేవి.ఇంకొక విశేషం యుధ్ధానికి సంబంధించిన జాడలూ అమరవీరుల స్మారకస్థూపాలూ లేకపోవటం - ఆదినుంచీ మనం శాంతికాముకులమే నన్నమాట?!

        సరిగ్గా ఇవే మౌలికాంశాలు తర్వాతి కాలంలోని నగర రాజ్యాలలోనూ స్వయంపూర్ణ గ్రామాలలోనూ మరింత స్పష్టమై కనబడతాయి.ఇవ్వాళ్టి రాకీయ నాయకులంతా స్మార్ట్ సిటీలూ స్మార్ట్ విలేజిలూ అని పేర్లు మాత్రమే లీకు చేసి హడావిడి చేస్తున్నారే గానీ వాటి స్వరూపం యెలా వుంటుందో మాత్రం ఒక్కముక్క కూడా చెప్పటం లేదు!కానీ స్వయంపూర్ణ గ్రామ వ్యవస్థ అంటే తనకి కావలసిన వాటి నన్నిట్నీ దానికదే సమకూర్చుకోగలిగిన సామాజిక భౌగోళిక ఆర్ధిక నిర్మితి!సింధులోయ నాటి వృత్తులన్నీ కులవృత్తులుగా స్థిరపడిపోయి "కులవృత్తికి సాటిలేదు గువ్వలచెన్నా!" అని పాడేసుకుంటున్నారు! ఒకే వృత్తికి సంబంధించిన వారంతా ఒకే వీధిలో సర్దుకుని "కోమట్ల బజారు", "కంసాళ్ళ వీధి","చాకలి పేట"లుగా స్థిరపడిపోయినాయి.కులవృత్తిని తమలోనే పదిలంగా వుంచుకోవటానికి స్వకులంలోని వివాహాలకే మొగ్గు చూపించే వారు?!వ్యవసాయం పశుపోషణ అంతా రైతులది కాగా దానికి అనుబంధమైన ఈ వృత్తిపని వారందరినీ పోషించే బాధ్యత రైతులది!పంట రాగానే అందరికీ దామాషా పధ్ధతిలో వాటాలు వేసి ధాన్యం పంచేసే వాళ్ళు!అది ఇవ్వననడానికి వీల్లేని హక్కుగా వచ్చిపడే ఆదాయం కావడంతో ధీమాగా సామేతల్నీ ఆమెతల్నీ పుట్టిస్తూ ఒక కులం మీద మరో కులం వాళ్ళు జోకు లేసుకుంటూ గడిపేవాళ్ళు!కరువొచ్చినా వరదొచ్చినా ప్లేగులాంటి మహమ్మారి విరుచుకుపడినా వూళ్ళకి వూళ్ళు ఖాళీ అయ్యేవి గాబట్టి ప్రాణం విలువ తెలిసి బాంధవ్యాలకు ప్రాధాన్యత నిచ్చి అమాయకంగా బతీకేశారు "ఫరంగీలు" అనీ "కుంఫిణి దొరలు" అని తొలిరోజుల్లో అబ్బురంగా చూసి మురిసిన ఇంగ్లీషువాళ్ళు వచ్చేవరకూ?!అంతటా వ్యవసాయమే ప్రధానం కావటం వల్ల మొత్తం భరత ఖందమంతా ఒకే రకమయిన సంస్కృతిలో ఒదిగిపోయింది!యేనుగుల వీరాస్వామయ్య గారి "కాశీయాత్ర చరిత్ర" ప్రకారం అన్నం అమ్మడం తప్పుగా భావించేవాళ్ళు!రూపాయికి బస్తా బియ్యం అనే లెక్కల్ని మన పెద్దలు చెప్పగా విన్నాము కదా,డబ్బుతో అవసరం లేని జీవితం వాళ్ళ చుట్టూ పరుచుకుని వండటం వల్ల దేన్నీ కొనాల్సిన అవసరం లేకుండా పంచుకుంటూ బతకటం వల్లనే అది సాధ్యపడింది!ఆ మనస్తత్వం నుంచి బయట పడ్డాకనే ప్రతిదాన్నీ కొనాల్సిన అవసరం యేర్పడి వస్తువులకి ధరలు పెరిగాయి!

        ఈ మొత్తం సంస్కృతినంతా నిజాయితీగా రికార్డ్ చేసిన కన్నింగ్ హాం లాంటి వాళ్ళకి మనం దురుద్దేశాలు అంటగట్టలేము గానీ రొమిల్లా థాపర్ మొదలుకుని కమ్యునిష్టు సిధ్ధాంతులంతా ప్రమాదవశాత్తూ హిందువైన నెహ్రూ గారి సంపూర్ణ సహాయ సహకారాలతో అత్యుత్సాహంగా పని చేసి అన్ని శతాబ్దాల పాటు ఈ వ్యవస్థ ప్రశాంతంగా నడవటానికి "బ్రాహ్మణాధిక్యత" మాత్రమే కారణం అని తేల్చడం వెనక 50% అజ్ఞానం 50% దుర్మార్గం వుంది.అజ్ఞానం యెందుకంటే భూమి మీద అధిపత్యమంతా రైతులకే వుండటం వల్ల ఆ వ్యవస్థ బద్దలయిన ఇప్పటి కాలంలో కిందికులాల వారితో పాటు వాళ్ళు కూడా దెబ్బతినడం యేకొంచెం నిష్పాక్షిక దృష్టితో చూసినా కళ్లముందు కనపడే వాస్తవం!పెట్టుబడిదారీ వ్యవస్థని బద్దలు కొట్టడానికి అది బలహీనంగా వున్నచోట కొట్టమన్న మార్క్సు గారి బొధన ప్రకారం మతపరమయిన కర్మకాణ్దలు చేస్తూ సంభావనలతో సరిపెట్టుకుని అన్ని కులాల మధ్యనా లింక్ క్లాస్ గా వున్న బ్రాహ్మల్ని బద్నాం చెయ్యడం ద్వారా అన్ని కులాల్నీ ఒకేసారి విడగొట్టవచ్చనేది వాళ్ళ దుర్మార్గం?!పెతీదానికీ ఫ్రేం వర్కు వుండాలనే వాళ్ళకి వాళ్ళు చెప్పేదానికన్నా గట్టి ఫ్రేం వర్క్ వున్న హిందూ ధర్మాన్ని బద్దలు కొట్టడానికి వాళ్ళకి కనబడిన బలహీనత అది. వాళ్ళ పేర సొంత ఆస్తి సెంటు కూడా లేకుండా కేవలం దానాల మీదా సంభావనల మీదా ఆధారపడి బతికిన వాళ్ళూ ఆ వ్యవస్థ బద్దలవగానే అందరితో పాటూ వీధినపడ్డవాళ్ళూ  దుర్మార్గులా?బ్రాహ్మల్ని వెక్కిరించటానికి గురజాడకి కన్యాశుల్కంలో భాషా బలిపీఠంలో రంగనాయకమ్మకి తిండీ దొరికాయి,యింత నీచపు విమర్శలు చేసిన వాళ్ళు వున్నతులా! 

        ఇంగ్లీషు వాళ్ళ ప్రమేయంతో ఆ వ్యవస్థ బద్దలయ్యే క్షణం వరకూ దాన్ని పట్టి వుంచటానికి బ్రాహ్మణులతో పాటూ అన్ని కులాల వాళ్ళూ తమ వంతు సాయం చేసి తీసుకోవలసిన ఆదాయాన్ని తీసుకుని అది బద్దలయ్యాక ఇప్పుడు పడుతున్న కష్టాలకి అప్పటి వాళ్ళని తిట్టి యేమి ప్రయోజనం?తండ్రి హయాంలో కట్టిన పూరిపాకని కూల్చిన కొడుకు భవంతిని కడితే ప్రయోజకత్వం అంటాం,దేన్నీ కట్టకుండా వొదిలేస్తే అప్రయోజకు డంటాం!అదే దేశం విషయంలో అయితే ఇంగ్లీషువాళ్ళు కూల్చిన వ్యవస్థ స్థానంలో అంతకన్నా గొప్పదాన్ని నిర్మించి వుంటే అభివృధ్ధి జరీగేది,దాని స్థానంలో మరింత చెత్త నింపడం వల్లనే ఈ అధోగతి!ఈ మధ్యనే వరూధిని బ్లాగరు  ఇంగ్లీషు వాళ్ళు రాకపోయి వుంటే దేశమంతా ముస్లిము మతం వ్యాపించి వుండేది,వీళ్ళు రావడం వల్ల అది జరగలేదు అనే భావంతో ఒక పోష్టు వేశారు.కానీ అది సరి కాదు.మాలిక్ ఇబ్రహీం మల్కింభరాముడు అని కీర్తించబడే విధంగా పరిపాలించాడు!హిందూ ధర్మం యే పునాది మీద గట్టిగా నిలబడిందో ఆ స్వయంపూర్ణ గ్రామ వ్యవస్థని వాళ్ళు కదిలించలేదు.ఇంగ్లీషు వాళ్ళు కూడా  ఆ అపని చెయ్యకుండా వుంటే ఇప్పటికీ ముస్లిము ప్రభువుల మాదిరే వాళ్ళూ మనకు ఆదర్శ పభువులుగానే వుండి వుండేవాళ్ళేమో?!


        వాళ్ళు రాకుండా వుండి వుంటే నిలవనీరులాగా మార్పు లేకుండా వుండటం అనే అవలక్షణాన్ని ప్రపంచం నలుమూలలకీ వ్యాపార పరిధిని విస్తరించిన మన వణిక్ప్రముఖుల ద్వారా యెక్కడేం జరుగుతుందో తెలుసుకుని రావలసిన మార్పుని శాంతియుతంగానే సాధించుకునే వాళ్ళమేమో?!

        నా ఇంటిపేరుకో చరిత్ర వుంది.తమ దేశం మీదకి దండెత్తి వస్తున్న అపారమయిన శత్రుసైన్యాన్ని కేవలం నలుగురు వీరయువకులు వేనకనుంచి తమ సైన్యం వస్తున్న దాఖలా వినిపించేవరకూ అంటే కొన్ని గంటల సేపు నిలబెట్టి వెనకనించి బేరీనాదం విన్న తర్వాతనే కూలారు!అప్పటి వరకూ "బతకాలి,పోరాడాలి,శత్రువుని ముందుకు రానివ్వకూడదు" అనే సంకల్పం మాత్రమే వాళ్ళని నిలబెట్టింది.అప్పటి వాళ్ళ శౌర్యంతో పోలిస్తే "ఒక్కొక్కణ్ణి కాదు షేర్  ఖాన్ వందమందిని ఒకేసారి పంపించు" అనే ఇవ్వాల్టి సినిమా డైలాగు జోకులాగా వుంటుంది!ఆ నలుగురి పెర్లకి "నేని" కలిపి పెట్టిన పేర్లు నాలుగే వున్నాయి వెలమల్లో!నా పేరులో వున్న సూరన్నని తల్చుకుని వుత్తేజం పొందే నేను కురుమ గొల్లలు కొమరం భీం శౌర్యాన్ని తలుచుకోవడాన్ని యెందుకు వ్యతిరేకిస్తాను?మీలో వున్న గందరగోళం యేమిటో మీకు చూపించటానికే అన్నిసార్లు రెట్టించాను.అన్ని సార్లు రెట్టించినా మీరు మీ కులవారసత్వానికి అంత గట్టిగా అంటిపెట్టుకోవాలనుకునది బ్రాహ్మణులు బోధించడం వల్ల కాదు - మీ తాత ముత్తతల గొప్పదనం పట్ల మీకున్న మమకారానికీ బ్రాహ్మణులకీ యే సంబంధమూ లేదు,అవునా కాదా?గుండెల మీద చెయ్యేసుకుని చెప్పండి! అప్రస్తుత వీరవరేణ్యులూ ప్రాతస్మరణీయులూ కొన్ని కులాలకే పరిమితం కాలేదు,అన్ని కులాల్లోనూ పుట్టారు.ప్రాచీనతనీ సాంస్కృతిక నేపధ్యాన్నీ,మొత్తం సామాజిక జీవనంలో వాటికున్న ప్రాధాన్యతనీ లెక్కిస్తే అన్ని కులాలూ గొప్పవే!ఇప్పుడు మీరు పొరబడుతున్న యెక్కువ తక్కువలు సంస్కృతికి సంబంధించినవి కావు ఆర్ధికానికి సంబంధించినవి."కులములోన ఒక్క గుణవంతు డుండెనేని కులము వెలుగు" ననీ "కలిమి లేనివాని కులము దిగు" ననీ చెప్పిన వేమన్న యెప్పటివాడు?

        మిమ్మల్ని గట్టిగా కులాన్ని వొదులుకోమని రెట్టించినందుకో యేమో "పరిస్థితిని తమకనుకూలంగా వాడుకునే వాళ్లు,ఆదర్శాలు దంచేవాళ్ళు" అనే గుంపులో నన్నూ కలిపేశారు!మావాళ్ళు సముద్రంలో కాకిరెట్టల్లాగా అక్కడొకడూ ఇక్కడొకడూ వున్నారు.వున్న కొద్దిమంది కూడా కులం పేరుతో ముఠా రాజకీయాలు నడపకుండా కొంచెం సంసార పక్షంగానే వండిపోయారు,నేను మిమ్మల్నీ మీ పరిస్థితుల్నీ సొంతానికి వుపయోగించుకుని  బాగుపడటం కుదిరేనా పెట్టేనా?ముసుగులో గుద్దులాట లెందుకు,మీరు వర్కౌట్ అవుతుంది అంటున్న ప్లాను - ముందు దళితవాద అనుకూల ప్రభుత్వాన్ని సాధించుకుని ఆ ప్రభుత్వం సాయంతో అగ్రకుల పెత్తందార్లని కట్టడి చేస్తేనే కింది కులాలు పైకి రాగలుగుతాయని,అంతేనా?అదే మీ ప్లాను అయితే మావోఇష్టుల వల్లనే తప్ప మరోవిధంగా జరగదు!యెందుకంటే ఇలాంటి వ్యవహారం యేది నిక్కచ్చిగా జరగాలన్నా దానికి తగ్గట్టు మంచి ఫ్రెం వర్క్ వుండాలి,కదా?ఇప్పుడున్న ప్రభుత్వం నడిచే తీరు యెట్లా వుంది?ప్రజల నుంచి పన్నుల రూపంలో వచ్చిన ఆదాయాన్నే వుద్యోగుల జీతాలకీ,అభివ్ర్ధ్ధి ప్రణాళికలకీ,సంక్షేమ పధకాలకీ ఖర్చు చేస్తుంది.అందులో యెక్కువ వాటా ఇచ్చే వ్యాపారస్తులు యే కులం వాళ్లయినా యే ప్రాంతం వాళ్లయినా యే మతం వాళ్లయినా వాళ్ళకి యెటువంటి ఇబ్బందిని కలిగించడాని కయినా సాహసించదు!దానికి గొప్ప సాక్ష్యం తెలంగాణా చక్రవర్తి - రాజాధిరాజ రాజపరమేశ్వర మూరురాయ గంద గందరగంద - శ్రీశ్రీశ్రీ చంద్రశేకర వర్మ మహారాజులుం గారు చూపిస్తారు?! వారొకప్పుడు రామోజీ ఫిలిం సిటీని లచ్చ నాగళ్ళతో దున్నిస్తానని గర్జించేసరికి అక్కడున్న చదువుకున్న దద్దమ్మలు కొందరు పులకించిపోయారు. ఇప్పుడు ఆయన ఆ తావుకే వెళ్ళి ప్రశంసల వర్షం కురిపించేసరికి కక్కలేకా మింగలేకా సతమతమయ్యారు.ఆఖరికి కొంటె జర్నలిష్టు ఒకడు అడిగీతే తన్నినంత పని చేశాడు నేనెప్పుడన్నానని!అన్నవాడు మాటలో దొరుకుతాడు గానీ కరణం రాతలో దొరకడన్నంత తెలివైన మనిషి గాబట్టి "అదియును నీ పతిప్రాణంబు దక్క" అన్నంత నిక్కచ్చిగా "అది కబ్జా అయితేనే" అని మెలిక పెట్టి అని వుంటాడేమో గానీ నిజంగా దున్నితే చూద్దామని అనుకున్న వాణ్ణి యేవిధంగా అంచనా కట్టాలి?!విభజన ద్వారా వెనకటి రాష్ట్రం నుంచి యెంత రెవెన్యూ వస్తుంది,అది యెన్నేళ్ళ బద్జెట్టుకి సరిపోతుంది,ఫిలిం సిటీని దున్నించాక రెవెన్యూలో పడే బొక్కని యెట్లా యెక్కణ్ణించి తెచ్చుకోవాలి అనే ప్రశ్నలు వచ్చి వుండవు ఆ మదురదృశ్యం మనసులో పైశాచికానందాన్ని నింపుతున్నప్పుడు?!కేసీఆర్ మొహమాటం లేని నిక్కచ్చి మనిషి గాబట్టి ఫెదీమని తేల్చేశాడు గానీ లేకపోతే యెంతకాలం ఆ ఫాంటసీలో వుండిపోయేవాళ్ళో!దళిత అనుకూల ప్రభుత్వం కూడా అలాంటి ఫాంటసీయే అనిపిస్తుంది నాకు?!

        ఆ ఫాంటసీ మీకు రావడానికి నేను వూహిస్తున్న కారణం కమ్యునిజంలో వున్న వర్గ దోపిడీ అనే ముక్క మాత్రమె నచ్చడమూ,పూర్తిగా సాయుధపోరాటాన్ని కూడా ఒప్పేసుకుందామా అంటే రక్తపాతం పట్ల విముఖత్వం వుండటం వల్ల కావచ్చు!కానీ అదనపు విలువ నుంచి సొంత ఆస్తి రద్దు ,దాని నుంచి సాయుధ పోరాటం,దానితో వర్గరహిత సమాజం అనేవి ఒకదానితో ఒకటి లింకప్ అయి వున్నాయి గాబట్టి ఒక సహాన్ని మాత్రమే అక్కణ్ణించి తీసుకుని మిగతా సహాన్ని కులసమీకరణల పైరవీలతోనూ కలిపేస్తే కాళిదాసు కవిత్వం కొంత నా సొంత పైత్యం కొంత అన్నట్టు తయారవుతుందే తప్ప అందులో ఒరిజినాలిటీ లేదు!అసలు ఇవ్వాల్టి పరిస్థితికి ముఖ్యమయిన కారణాలు రెందు:ఇంగ్లీషు వాళ్ల ద్వారా బద్దలైన ఒక ఫ్రేం వర్కుకి సరైన ప్రత్యామ్నాయాన్ని తయారు చెయ్యటంలో ప్రభుత్వాలు ఫెయిలవ్వటం,కులవృత్తులు పోయి అన్ని కులాల వాళ్ళూ ఒకే పనికి పోటీ పడటం?!

        మీరు అనుకుంటున్నట్టుగా ఇప్పుదు అధికారంలో వున్న సొంతకులంవాళ్ళ అండతోనే వ్యాపారం విస్తరిస్తుందనేది నిజమేనా?స్మిత్తుగారు ఆర్ధికశాస్త్రం వ్యాపారం అనేదాన్ని యెట్లా నియంత్రించాలి అని  గవర్నమేంటులో వున్నవాళ్ళకి సలహా లివ్వడానికి రాశాడు!మార్క్సుగారు డబ్బు ఇటువైపునుంచి అటువైపుకి వెళ్ళడాన్ని మాత్రమే చూపించి భయపెట్టాడు గానీ వ్యాపారి వైపు నుంచి కస్టమరుకి వచ్చే సౌకర్యం గురించి అసలు ప్రస్తావించాడా?ఇవ్వాళ మార్కెట్లో వున్న ప్రతి వస్తువు వెనకా కొనుగోలు దారుకు ఒక సౌకర్యం తప్పకుండా వుంది - టూత్ పేష్టు,సబ్బు,ఫ్యాను,ప్రెషర్ కుక్కర్,మైరోవేవ్ ఓవెన్ - ఈ లిష్టు అనంతం!గ్రాహం బెల్ సరాసరి టెలిఫోను కనిపెట్టేద్దాం డబ్బుతో పొంగి పొర్లుదాం అనుకుని బయల్దేరలేదు,బధిరులకి సహాయంగా వుండాలనే సేవా దృక్పధంతో సొంత చిలుమే వొదిలించుకుంటున్న దశలో కాబోయే మామగారు వ్యాపారి బుర్రతో ఆలోచించి తను అన్నీ సమకూర్చి విషయం మార్కెట్టుని కుదిపేదిగా వుందని తెలియగానే పేటెంటుకి పరిగెత్తించి హడావిడి చేస్తే తన ఆవిష్కరనతో తను ప్రయోఅనం పొందగలిగాడు.తనొక్కడేనా,యే వ్యాపారి అయినా మనకి కొంత సౌకర్యం అందించి మనని సంతృప్తి పరచినాకనే దానికి ప్రతిగా తను లాభం తీసుకుంటున్నాడు గదా!దాన్ని పట్టించుకోకపోతేనే ఇప్పుడు వ్యాపారం చేసి పైకెళ్ళిన వాళ్లంతా దుర్మార్గులనీ వాళ్లని అణిచెయ్యదం తప్పు కాదనీ అనిపిస్తుంది?!

        శ్రామికులు రంగంలోకి దిగే ముందుగానే పెట్టుబడితో వ్యాపారి బయల్దేరతాడు.పెట్టుబడి సమకూర్చుకునే ముందుగానే అతను ఇవ్వాళ ప్రజలకి యే సౌకర్యం తక్కువగా వుందో చూసి దాన్ని తను మాత్రమే ఇవ్వగలడని నమ్మకం కలిగించుకుంటాడు!తను మార్కెట్లో యెక్కడ ప్రవెశించినా అక్కడ వున్న పోటీని తట్టుకుని తనకి చోటు దక్కించుకోవాలంటే తప్పనిసరిగా మిగతా వాళ్లకన్నా తను ప్రత్యెకమయిన సౌకర్యాన్నే కొనుగోలు దారుకి ఇవ్వాలి!వీటిల్లో యేవయినా ఒక కులం వాళ్ళు మాత్రమే చెయ్యగలిగిన పనులు వున్నాయా?ఒక పెద్ద కంపెనీలో రిస్కు లేకుండా బతుకుతున్న నలుగురు వుద్యోగులు "యెంతకాలం చేస్తాం ఇట్లా,వీళ్ళు చేస్తున్నది మనం చెయ్యలేమా" అని వుద్యోగాలకి రాజీనామా ఇచ్చి రేకుల షెడ్డులో మొదలు పెట్టి వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్తించారే వాళ్ళ దగ్గిర మొదట్లో వున్న పెట్టుబడి యెంత?

సీ||     తిండి తినుట, తిని పండుకొనుట, బోరు 
          కొడితె సైన్మలు షికార్ల కేగు

          ట - ఇవి కావు పనులంటే; బతుకు గడిచేందు
          కవసరమయిన పైకమును దెచ్చు

          పనులె పనులు ధరపైన మనుషులకు.
          తగు లాభ ఇచ్చెడి పనులు తప్ప

          ని సరిగ చేయాలి - హుషారైన 
          పనిని లాభకరంగ మల్చగలిగి


తే||    తే బహు శభాషు! ఒక్కడివే మరెవరి
       తోడు లేక ఏ పని చేయబోకు - నలుగు
       రి కుపయోగ పడ్తు నలుగురి నుపయుక్త
       పరుచుకుంటు బతకడమే మనిషికి విధి!

        తోపుడుబండి మీద బజ్జీలమ్ముకునే వాణ్ణి బీటు కానిస్టేబులు కూడా భయపెట్టగలడు,కానీ ఖండాంతరాలకు విస్తరించిన వ్యాపార సామ్రాజ్యాధిపతి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా లెక్క చెయ్యడు!మీకూ మీ కులానికీ ఆ దమ్ము కావాలంటే వ్యాపార పారిశ్రామిక రంగాల్లో ప్రవేశించి సత్తా చూపిస్తే మీరు ముందుకెళ్ళటానికి పదేళ్ళు చాలు!దళిత అనుకూల ప్రభుత్వం వచ్చాక గూడా అది చెయ్యకుండా మీ కులం పైకి లేవడం జరగదని స్టాంపు పేపరు మీద రాసివ్వడానికయినా నేను సిధ్ధం,జరుగుతుందని రాసివ్వడానికి మీరు సిధ్ధమా?!మీరు కూడా ఆ తెలంగాణా మేధావుల దోరణిలో వుంటే నా మాటలు ఖచ్చితంగా పిట్టకధల లాగానే అనిపిస్తాయి!


చెప్పండి,ఇవికూడా పిట్టకధలేనా?!

7 comments:

 1. ప్రమాదవశాత్తూ హిందువైన నెహ్రూ గారి is it?

  ReplyDelete
 2. చక్కగా రాసారు. సింపుల్ గా చెప్పాలంటే "కేక"!

  ReplyDelete
 3. చూడండి H BS గారూ !
  పురాతన నాగరికత లో పనుల బట్టి కులాలు ఏర్పడ్డాయిఆడేవారు కాదనలేదు
  మలి నాగరికత లో ఎం జరిగిందనేది మీ పోస్ట్ లో లేదు..!కుల వ్యవస్థ బలమవడానికి కారణం అదే
  ఇక్కడ కులాలు రుద్దబడ్డాయి...
  బుద్దుడు ఎందుకు బౌద్ధ మతాన్ని స్థాపించాడు..?
  అశోకుడు కుల రహిత పాలనను ఎందుకు అందించాడు ?
  మౌర్యానంతరం మళ్ళి కుల వ్యవస్థ ఎందుకు బలమైనది?
  శూద్ర వర్ణం అనగా దోక్కబడలేదా?
  దీనికి ఎవరు కారణం ?కులవ్యవస్త కాదా?
  పేరు చెప్పుకోవటానికే అసహ్యం అనిపించే పనులు చెయ్యాలాని ఎవరికైనా అనిపిస్తదా?
  ఉదా:చాకలి వాళ్ళు ఆనందం తో బట్టలు ఉతుకుతారా?
  పురాణాలు కూడా చేప్తా యంటారు..గుణం వల్లే కులం ,కాని జననం వల్ల కాదు అని
  అవి ఎంత వరకు నిజమో నాకు తెలియదు ...ఒకవేల అవి నిజమైతే అది ఎందుకు జరగదు
  దళితులు బాగు పడే మార్గం పారిశ్రామిక వర్గం ...గా మారడం గొప్ప జోక్ ఇన్ 2015
  ఎందుకంటే రాజకీయాలు పారిశ్రామిక వేత్తల కనుసన్నల్లో జర్గుతున్న విషయం చెప్పి తో
  నేను ఏకీభవించను?

  ఎందుకంటే ఇప్పుడున్నట్టు ప్రభావం చూపగల పారిశ్రామికవేత్తగా మారె అవకాశం ఉందే అనుకుందాం
  రామోజీ రావు గారిలా ఎంతమంది రావు లు ఉన్నారో ..మన రాష్త్రం లో ఒక్కడే
  మరి ఒక దళితుడు ప్రభావశీలుడుగా మారాలంటే అతనికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి ?
  మీకో విషయమ్ తెలుసో లేదో వీడు మన కులం వాడు వీడికి మనం సహాయం చెయ్యాలి ,అని పారిశ్రామిక వేత్తలుగా మార్చుతారు
  ఒక గ్రూప్ ఆఫీసర్ కు పోస్టింగ్ మనోడే వీడికి ఇద్దాం లాంటివి ఉన్నపుడు ఎక్కడో కింద ఉన్న శుద్రుడికి అవకాశం ఎక్కడ?
  రాజ్యాధికారం తప్పా ఏ అధికారం కూడా దళితులకు రాదు...ఇది ఒక BS
  చివరగా నేను దళిత వాదిని కాదు ..మానవత్వ వాదిని
  మీకు కొందరు మనుషులు కులవ్యవస్తలో అమానుషత్వానికి బలైన విషయాలు కనపడలేదు
  మన కళ్ళముందు చరిత్ర్ కనపడుతుంది ఇప్పటి వరకు మనకు తెలిసిన జాతీయ నాయకులు ఏ వర్ణం లేదా కులం ,శూద్రులు ఎక్కడ?మరి విద్య ఎవరికీ అందింది అనేది కనపడుతుంది
  టీచర్స్ డే ..?
  మొట్ట మొదటి నుంచి ఇప్పటి వరకు pm?రాష్ట్రపతి?మంత్రులు?

  ఇది తెలపడం లేదా ?ఎం జరిగిందో
  ఇవి వదిలేసి చెప్పడం Bird Stories కావా?BS గారూ
  నిజంగా మీరు BirdStories చెప్పరు అనుకున్నాను..నిజంగా మీరు టైం తీసుకొని నిజాయితి గా చెప్తారు అనుకున్నాను,కాని పరిష్కారం చెప్పక పోగా అర్ధ సత్యాలు చెప్పారు
  అవి సత్యాలు గానే కనపడతాయి ,,కానిసత్యాలు కావు
  నేను సింపుల్ గా all the best అని రాద్దామనుకున్నాను ..
  కాని మీలో ఒక మంచిగుణం కనిపించింది ..మీరు కొంత ఆలోచించారు
  పారిశ్రామిక రంగాన్ని ఎంచుకొమ్మని ..కాని వారికి సరి అయిన విద్య ఇంకను అందడం లేదు
  కడుపునిండిన వాడు పక్కోడి గురించి ఆలోచిస్తాడు
  కడుపు కాలే వాడు వాడి గురించే ఆలోచిస్తాడు
  నిరంతర జీవన పోరాటం లో ఉండే వాళ్ళు శూద్రులు
  వాళ్ళు ఒక పారిశ్రామిక వేత్త గా అది కూడా రాజకీయనాయకులను ప్రభావితం చేసేంతగా ఎదిగితే
  సమ సమాజం రావచ్చు కాని ఆ పరిస్థితి లేదు
  కెసిఆర్ దళిత పారిశ్రామిక వేత్తలు అనే కాన్సెప్ట్ తెచ్చాడు ..కాని దానికి సరిపడే వాళ్ళు అంటే ఆర్ధికంగా నిలదొక్కుకునే వాళ్ళు నాకు తెలిసి చాలా తక్కువ ..ఉంటె నిజంగా మీరు అన్నట్టు 10yrs లో బాగు పడుతుంది అనుకుంటాను
  అందుకే ఇంత comment రాసాను
  దయతో మీరు అశోకుడు బౌద్ధం గురించి కూడా కొంత తెలుపగలరు
  అసలు ఇలా వర్ణాలు పెత్తనం చెలాయించే వ్యవస్థ వచ్చిందో తెలుపగలరు

  ReplyDelete
  Replies
  1. బ్రాహ్మణులు మామీద కులాన్ని బలవంతంగా రుద్దారు అని మీరే అంటున్నారు!
   అలా రుద్దిన దాన్నే వొదులుకోకుండా నా కులవారసత్వాన్ని వొదులుకోకుండానే ముందుకెళ్లే మార్గం చెప్పమని మీరే అడిగారు?
   అవ్వా బువ్వా రెండూ కావాలి అన్నట్టుగా మీ సమస్యకి వున్న వొకే వొక మార్గం అది అని చెప్తే పాత చరిత్రని యెందుకు చెప్పలేదు అని నిలదీస్తున్నారు?.

   మొదటి పోష్టులోనే మొత్తం యెందుకు ఇరికించలేదో చెప్పాను గదా,ఆ విషయాల్నీ తెలుసుకున్నాను గానీ మరీ వెనకటి కాలపు విషయాల్ని ఇప్పటితో పోల్చలేము గదా అని వొదిలేసాను - మీరు అడిగిన మధ్య యుగపు చరిత్ర అంతా హైందవం బౌధ్ధం ఒకవేపున హిందువుల్లోనే శైవులూ వైష్ణవులూ అందరూ కలిసి జనాన్ని యెడాపెడా వాయించేస్తూ ఒక గందరగోళాన్ని సృష్టించిన కాలం!ఆ గందరగోళానికి తట్టుకోలెక మళ్ళీ వేంకటి స్థితే మేలనిపించీ వుందవచ్చు,చాలా సంక్లిష్టతలు వున్నాయి.నాకు పూర్తిగా స్పష్టత రాలేదు.

   బుధ్ధుడు,అశోకుడూ అంత గట్టిగా ప్రయత్నించినా పని జరగక,అశోకుడు అధికారంలోనే వుండి ప్రయత్నించినా నాశనం కాకుండా ఆ దశలన్నిట్నీ దాటి మళ్ళీ స్తిరపడిన నిన్నటి స్థితినే నేను ప్రమాణంగా తీసుకున్నాను.ఇవ్వాళ్తి సమస్యకి పరిష్కారం వెదకాలనుకున్నప్పుడు దగ్గరగా వున్న నిన్నటి స్థితిలో యెక్కడ వున్నారో దానికన్నా కొంచెం యెదగగలిగే పరిష్కారం దొరుకుతుంది!

   మార్కెట్ యెకానమీ లో స్థిరపడిన ఈ కాలం భూస్వామ్య మనస్తత్వం నుంచి చాలామటుకు బయటికి వచ్చేసింది.ఆర్ధికపరామయిన అణిచివేత వున్నదని నేనూ వొప్పుకుంటున్నాను,అలాగే ప్రతి కులష్తుడూ తన కులం పట్లా ఆప్యాయతని కలిగి వున్నాడని మీరూ వొప్పుకుంటున్నారు గదా?ప్రతి కులానికీ ఒక వృత్తితో సంబంధం వుందటం మీకు తెలుసు,తప్పనిసరిగా స్వకులంలోనే పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్లనే అలా ఒక కులానికె వృట్తికీ సంబంధం యేర్పడిందన్నది నిజం కాదా?

   యేది యేమయినా దళితవాద అనుకూల ప్రభుత్వం అనేది ఒక ఫాంటసీయే,అవునా కాదా?మోనాపలీ వుంటుంది,వ్యాపారంలో యెప్పుడు యెవరు యెక్కడ యెంటర్ అయినా మోనాపలీ వుంటుంది.తెలివితక్కువగా వ్యాపారం చేసి నష్టపోయేవాణ్ణి వాడి బంధువే ఆదుకోలేడు?బంధువులే వ్యాపారంలో పోటీ పడితే వాళ్ళ మధ్యనే సహకారం వుండదు గదా!

   వుద్యమాలు ఆపెయ్యమనడం లేదు ఇవి పూర్తిగా వ్యర్ధం అనీ అనదం లేదు కానీ కష్టమైనా సరే ఇవ్వాళా రేపూ మార్కెట్ లో వాటా సాధించకుండా యే కులానికీ కనీసపు రాజకీయ బలం కూడా రాదు.తాత్కాలికంగా ఒక వేవ్ లాగా వచ్చినా అది శాశ్వతంగా నిలవదు.అదే నేను చెప్పాలనుకున్నది.అందులో నేను ఫెయిలైనట్టున్నాను?అన్నిటికన్నా దళిత అనుకూల ప్రభుత్వం గురించిన ఫాంటసీయే పెద్ద జోక్ యెప్పటికయినా?!

   బ్రాహ్మణులు మా నెత్తి మీద బలవంతంగా రుద్దారనే మాటా మీదే,మా కులవారసత్వాల్ని వొదులుకోకుండానే సమస్యకి పరిష్కారం చూపించమని అడిగిందీ మీరే,చూపించిన ప్రాక్టికల్ పరిష్కారానికి తప్పులు పడుతున్నదీ మీరే!మీ సమస్యకి మీదగ్గిర వున్న పరిష్కారమేమో ఫాంతసీలా అనిపించినా అది వర్కౌట్ అవుతుందనే ధీమాలో వున్నారు,మే గాడ్ బ్లెస్ యూ!?

   Delete
  2. కులతత్వం అనేది విష వృక్షం ,అందుకే అమెరికా లో నల్ల తెల్ల వాళ్ళ మధ్యలో విప్లవం వచ్చింది,కాని ఇక్కడ విప్లవాలు రావు ,ఎందుకంటే కులతత్వం లో ఉన్న వాళ్ళు కట్టి పడేసిన ఏనుగు లాంటి వాళ్ళు,వాళ్ళు బయటకి రావాలి అనుకోక కాదు ,ఇదే మన సంప్రదాయం అనే విషపు మూడాచారంలో మావటి వాడి ఏనుగు వలే తయారు అయ్యారు
   ప్రతి కులష్తుడూ తన కులం పట్లా ఆప్యాయతని కలిగి వున్నాడని మీరూ వొప్పుకుంటున్నారు గదా?అన్నారు మీరు కాని అది ఆప్యాయత కాదు అది విష చట్రం లో ఒక పద్ధతి ప్రకారం ఇరుక్కో బడిన వాస్తవం కాదా?
   పూర్వం మా తాత గారికి జోగినులు ఉండేవారట..వాళ్ళు జోగిని వృత్తి అంకిత భావం తో చేసేవారు అంటే వారు ఎలా ఇలా మూర్కంగా తయారు అయి ఉంటారో ఉహించుకోవదానికే భయం వేస్తుంది,కనీసం మనము మనుషులమే ,మనకు హక్కులుంటాయి ,అనే విషయం కూడా తెలుసుకోకుండా చేసిన వ్యవస్థ కు ఎవరు కారణం ?
   ఇక్కడ కులతత్వం రెండు రకాలు ఉంటుంది మన కింద కులాలు వదులుకోవలానుకుంటారు కాని మనకు పైన కులాలు ,కులాలు ఉండాలనుకుంటారు,పై వారితో సమానత్వం కానీ కింది వారితో కాదు అనే భావన సమాజం లో ఎప్పటి నుండో ఉంది
   ఈ భావన పెంపొందించింది ఎవరు ఏనుగు కు మావటి వాడు వలే ఇక్కడ మన పురాణాలను వ్యాక్యనించే వాళ్ళు కాదా?
   మోడీ BC కార్డు UP లో ఉపయోగపడింది నిజం కాదా?
   BC అనేది తన అభివృద్ధి కోసం వాడబడింది,అలాగా వాడుకోక పోతే తను ఆ పోసిషన్ కి రాగలడా?
   ఇక్కడ కులరహితుడుగా మారడం పై నుండి కిందికి జరిగితే నే సమ సమాజం సాధ్యం
   కాని కింది నుండి జరిగితే అసలు ఉనికే లేకుండా పోదా?
   మార్కెట్ లో వాటా అవసరం కాని అది ఎలా వస్తుంది...?
   అన్ని అవకాశాలు ఉన్నవాడితో ,అవకాశాలు లేని వాడు ఎలా పోటీ పడగలడు
   http://naperusrinivas.blogspot.in/2015/01/blog-post_7.html

   ఇవి అన్ని సాధ్యం కావాలంటే ముందు వారికి సరియగు విద్య ...
   తద్వారా వారి ఆత్మగౌరవాణ్ని తెలియజేయ్యాలి
   తన హక్కుల సాదిమ్పచేయ్యాలి
   ఇది సరిగా జరిగినపుడు మాత్రమే అందరికి సామాజిక న్యాయం జరుగుతుంది
   ఇందులో మొదటి అడుగు రాజ్యాధికారం
   తద్వారా ఇతర పారిశ్రామికాదికారం ..రాజ్యాధికారం పారిశ్రామికాదికారం కవలలు గా తయారు అయ్యాయని మీరు చెప్పిన పోస్ట్ వల్ల నాకు తెలిసింది, ధన్య వాదములు
   మీ నుండి ఇలాంటి constructive పోస్ట్ లను ఆహ్వానిస్తున్నాను..

   Delete
  3. నిజమె,మధ్యయుగాలలో కులచట్రం ఒక పధ్ధతి ప్రకారం బలం పెంచుకోవతం జరిగిందనేది వాస్తవమే!పూర్తి స్పష్తత వచ్చాక ఆఖరి పోష్టులో మొత్తం కులవ్యవస్థ గురించి మీకు కూడా నచ్చే విధంగా నాకు తోచిన పరిషారాన్ని సూచిస్తాను.పరిష్కారం తప్పనిసరి,సమస్య వుంది కాబట్టి దాన్ని గురించి ఆలోచించాల్సిందే.ఒక సంధికాలంలో వున్నాం,ఇప్పుడు కూడా వాయిదా వేస్తే ఇక యెప్పటికీ పరిష్కారం లభించనంత దూరం పెరుగుతుంది కులాల మధ్యన!

   నేను మిమ్మల్ని అధిక్షపించటానికి చెప్పలేదు,యెప్పటికయినా జరగాల్సిన పని అది అని చెప్పాను.పదేళ్ళు అన్నది ఒక సంఖ్య మాత్రమే!పదేళ్ళు గానివ్వండి,ఇరవయ్యేళ్ళు గానివ్వండి,అర్ధ శతాబ్దమే పట్టినా అది జరిగితే మాత్రం తప్పకుండా మార్పు వస్తుంది!వాదానకి దిగినప్పుడు బిన్నాభిప్రాయాలు సహజం,మన వాదన బలంగా వినిపించాలనే వుత్సాహంలో మాటలు కోటలు దాటుతున్నట్టుగానూ అనిపించవచ్చు.

   ఇప్పుడు ఈ పోష్టు కోసం సిధు నాగరికతని గురించి చదివాను కదా!యెంత వెతికి చూసినా యుధ్ధ పరికరాలు మాత్రం కనబడ్తం లేదు,తెలుసా!అంటే యుధ్ధాలతో పని లేకుండా వ్యవసాయం, చేతివృత్తులు,వ్యాపారం ఈ మూడూ లాభసాటిగా వున్న ప్రశాంత జీవనం అన్నమాట!

   అట్లాగే దేవీభాగం కూడా మేము కష్తపడి తెచ్చాం మాకెక్కువ కావాలి అనకుండా మిగతా వాళ్లందరికీ శ్రేష్ఠమైనవి ఇచ్చి మిగిలిందే తీసుకుని సరిపెట్తుకోవడం గొప్ప ఆదర్శమే కదా!అది యెప్పుడు పోయింది,యెట్లా పోయింది అనేది కూడా తెసుకోవాలి.

   ఏదేమయినా ఆదఋసాలుగా వై మంచివైనప్పుడు,కొంతకాలం పాటు వాస్తవంగా వునికిలో వున్నప్పుడు మళ్ళీ మనం సాధించగలం,సాధించాలి!నేను చెప్పిన పరిష్కారానికి మీరు చెప్పిన ప్రతికూలతలు వున్నాయని నాకూ తెలుసు.

   నా మాట వొకటే, ఇవ్వాళ వాయిదా వేసి చెప్పకుండా వొదిలేసిన చిన్న అభిప్రాయభేదం రేపటికి శత్రుత్వాన్ని పెంచే వెటకారంగా మారుతుంది.అసమానతలు పోవడం అనేదానికి ఒక గట్టి ప్రయత్నం జరగాలనే నావంతుగా నేను మాట్లాడుతున్నాను.

   నామాట నేను చెప్పి మీమాట మీరు చెపతే యేదో ఒక మాటలో బల్బు వెలుతుంది.అసలెవరూ మాట్లాదకపోతే అంతా చీకటే!

   Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు