Wednesday, 14 January 2015

బ్లాగ్మిత్రు లందరికీ సంక్రాంతి శుభాకాక్షలు!

           సంక్రాంతి అంటే చెరుగ్గడలు,భోగిపళ్ళు,గంగిరెద్దులు,గొబ్బెమ్మలు,కోడిపందాలు - అన్నిట్నినీ మించి హుషారు!!వీటిల్లో ఇవ్వాళ చాలామటుకు కనపడకుండా పోయినాయి.కానీ హుషారు మాత్రం అలాగే వుండటం మాత్రం బాగుంది.కోడిపందాల్ని కూడా నిషేదించేసి వుంటే ఆ కాస్త హుషారు కూడా వుండేది కాదు!

         యెక్కడ లేదు హింస!రోజూ తెగే కోళ్ళ సంగతేంటి?బాక్సింగు పోటీలు వుండొచ్చా,గుర్రప్పందాలు వుండొచ్చా,కోడిపందాలు వుండకూడదా?హఠాత్తుగా మనోళ్ళకి ఇప్పుడే భూతదయ గుర్తుకొచ్చిందేంటో?కోడిపందేలు లేని సంక్రాంతి కూడా ఒక సంక్రాంతేనా?కత్తిగట్టని కోడిపందెమూ ఒక కోడిపందెమేనా?మనం కావాలని ట్రయినింగిచ్చి చంపుతున్నామా, రేసుల్లో పరిగెత్తలేని గుర్రాల్ని యజమానులే చంపడం కన్నా ఘోరమైనదేదయినా ఇక్కడ జరుగుతుందా?ఈ కాలానికి ప్రకృతి సిధ్ధంగా వాటిలో వచ్చే మార్పు అది - దాన్ని యెటూ నిషేధించలేం గదా!మిగతా రోజుల్లో అప్పటిదాకా మనం యెదుర్కొన్న గెలుపోటములకి సంబంధించిన వూద్రేకాల్ని బయటికి రప్పించి అంతటితో వొదిలెయ్యటానికి పెట్టిన వినోదం,దాన్ని కూడా భూతద్దం లోంచి చూసి అనవసరమయిన హడావిడి దేనికి!



               చిన్నప్పుడు నేనూ ఆ కోడిపందేల హడావిడి మధ్య పెరిగినవాణ్ణే!నేనూ ఒక పుంజుని పెంచాను.మా పెదనాన్న గారికి బాగా సరదా వుండతంతో వాళ్ళింట్లొనే చాలా కోళ్లని తెప్పించి కట్టేసి వుంచారు యెవరి కిష్తమైన దాన్న్ని వాళ్ళు కొనుక్కోవడానికి వీఎలుగా.వూరకే చూద్దామని వెళ్ళినా అందర్లోకి చిన్నవాణ్ణి గదా అని మొదటి సెలక్షన్ నాకే ఇచ్చారు.అన్నిట్నీ ఒకసారి అలా చూసేసి ఒక పుంజు వైపు వేలు చూపించగానే ఫక్కున నవ్వేస్తూ "బలే సెలక్షనురా నీది,దానికో కన్ను లేదు" అనేశారు!నేను "అది నాకెలా తెలుస్తుంది,కన్ను లేనిదాన్ని ఇక్కడెందుకుంచారు మరి" అని నసిగేసి ఇంకోదాన్ని యెన్నుకోబఓయేసరికి మళ్ళీ వాళ్ళే గుడ్డిదే అయినా ఇది కూడా పందేలు గెల్చిందే లెమ్మని సర్దేశారు.అప్పట్నించీ ఇక దాన్ని మేపడం అనే సరదా పని మొదలయింది.కొంతమంది సీరియస్ పందెగాళ్ళు భీభత్సమయిన మేతల్ని కూడా వేస్తారు.యమగోల గుర్తుందిగా!మా నాన్నగారికి అసలు ఆ పందేలంటేనే ఇష్తముండకపోవటం అది గుడ్డిదని తెలియటం - అటువైపు నుంచి యెంకరేజిమెంటు లేదు.కానీ దాన్ని కట్టెయ్యటానికి తాదు మాత్రం సంపాదించా స్పెషలైనది.దాని రకం  "కెక్క్కిరాయి", కన్ను లేదు గాబట్టి మానోట్లో పడి "గుడ్డి కెక్కిరాయి" అయింది.మొత్తం జాతులైతే చాలా వున్నాయి - "పూలా","నెమిలి","డేగ","కాకిడేగ" అని!

               అసలు పందెం జరిగింది మా నాయనమ్మ గారి పేరు మీదున్న మా మామిడి తోటలొనే.నాలుగు చెట్ల మధ్యన చాలా ఖాళీ వుంటుంది కదా,అక్కడ మాంచి జబర్దస్తుగా దడి కట్టారు నాలుగు వైపులా దార్లు వొద్లి.అన్ని కోళ్ళనీ ఒకే వైపు నుంచి దించరు - కోళ్ళ జంటని బట్టి దిక్కుని మారుస్తారు.యెన్ని వొళ్ళ వాళ్ళు చేరినా ఆటోమాటిగ్గా రెండు పక్షాలుగా విడిపోతారు.మొదటి కోడిని యెవరు దించాలి,ఆ కోడికి దీటుగా లెక్క ప్రకారం యే జాతిని దించాలి అనే ప్రతి దానికీ లెక్కలుంటాయి.నాకు అన్నయ్య వరస అయ్యే పెద్దమనిషికి అన్ని వూళ్లలోనూ అందరూ మధ్యవర్తిగా వొప్పుకునేటంత నాలెడ్జి వుంది కుక్కుటశాస్త్రంలో!పెద్దమనుషులు కూర్చోవడానికి చాపలు యేర్పాటు చేశారు,మిగిలిన వాళ్ళు నించోవడమే!అసలు హుషారు పెరిగితే కూర్చోవడమే కష్తం గదా - అందుకే వాళ్ళూ చాపల కోసం పట్టించుకోలేదు.ఆ పై పందేల భాష నాకస్సలు అర్ధం కాలేదు - "కాకిడేగ అయిదెచ్చు,కాకి నెమిలి పదెచ్చు" అనే మాటలు వింతగా వుందటం వాల్ల గుర్తున్నాయి గానీ.మా పనికుర్రాడికీ సరదాగానే వుంది గాబట్టి మా పుంజుని వాడే తీసుకొచ్చాడు!మేమంతా వేరే వూళ్ల నుంచి కూడా వచ్చిన చుట్టపక్కాల జనంతో కలిసి బండిలో వెళ్తే తను సైకిలు మీద అతి జాగ్రత్తగా ఇంకో మనిషిని పట్టుకోమని వెనక కూర్చోబెట్టుకుని తీసుకొచ్చాడు.అతి జాగ్రత్తగా యెందుకంటే పుంజు బెదరకూదదు మూడ్ డిస్టర్బ్ అవ్వకూదదు మరి!

                  ఈ హడావిడి అంతా మధ్యాన్నం వరకూ బాగానే జరిగింది గానీ ఇప్పట్లాగే పర్మిషన్లు లేని యవ్వారం కావడంతో పోలీసులు వొచ్చిపడ్డారు!అప్పటిదాకా కోలాహలంగా వున్న వాతావరణం కాస్తా గందరగోళంగా మారింది.అంతమంది జనం చేరితే చిన్నా చితకా వ్యాపారాలు కూడా వుంటాయిగా - మొత్తం కకావికలై పోయారు.కుర్రాళ్ళం మేము ముళ్ళకంచెల్ని కూడా చెంగున దూకటం ఆశ్చర్యం లేదు గానీ పెద్దవాళ్ళు గూడా మాతోపాటుగా దూకేశారు ముళ్ళకంచెల్ని!ఇంతకీ వడ్లగింజలో బియ్యపు గింజలాగా పట్టుకున్న వాళ్లనీ పోలీసులు యేమీ చెయ్యలేదు.అక్కడ పట్టుబడిన వాళ్ళంతా పెద్ద పెద్ద గండభేరుండాలు గదా ఓ గంట వుంచి డబ్బు కట్టించుకుని వొదిలేశారు.ఈ సందట్లో ముందే ఫలానా కోడి గట్టిది అని తెలియడంతో మంచి కోళ్ళని చంకనెత్తుకు పోయే సీన్లు కూడా జరిగినయ్.మా పని కుర్రాడు యెలర్టుగా వుండి ముందు అటే పోయి దాన్ని చంకనేసుకునాకనే బయట పడ్డాడు గాబట్టి నా పుంజు దక్కింది,తను వెళ్తుండగానే యెవడో తాడు విప్పేస్తున్నాడంట!

                డబ్బు కట్టేటప్పుడే ఒప్పందం కుదుర్చుకున్నారు గాబోలు తర్వాత పోలీసుల భయం లేకుండా జరిగినాయి గానీ నాకు మాత్రం పర్మిషను ఇవ్వలేదు ఇంట్లో!మా పనికుర్రాడే తీసుకెళ్ళి వేశాడు.ఒక కన్ను లేకపోయినా మా "గుడ్డి కెక్కిరాయి" తనకన్నా భారీగా వున్న పుంజునే గెలుకొచ్చేసింది!అప్పట్నించీ చాలా పందేలు గెల్చింది,కొంతమంది వాళ్ళు ఆ నెలరఓజులూ వాళ్ళే పెంచి పందెంలో దించి పందగైపోయాక మళ్ళీ తిరిగి ఇచ్చేసే పధ్ధతి కూడా నడిచింది!దానిమీద కాసిన పందేలతో చాలా మందికి వుపయోగపడింది.కానీ మొదటి పందెం రోజున మాత్రం మా ఇంట్లోనే చనువుగా తిరిగే ఒకతను "దాని మీద పందెం కాయొద్దు,దానికో కన్ను లేదు,మా చిన్నబాబు సరదా పడుతున్నాదని దించాం" అని చెప్పి ఆపితే అది కాస్తా గెల్చాక యమతిట్లు తిట్టారంట.

                   నేను కొంచెం పెద్దయి వాటికి దూరంగా వుండిపోవటంతో వేరేవాళ్ళకి అమ్మేశారు కూడా.నాకూ దానికీ వున్న విచిత్రమయిన అనుబంధం యేమిటో తెలుసా - అది గెల్చిన పందేలు యేవీ నేను చూడలేదు,నేను చూసిన పందెంలో అది వోడిపోయింది!చాలా కాలం తర్వాత మళ్ళీ కొత్తగా ఒకసారి కోడిపందేలకి వెళ్తే అక్కడ మేయిన్ డేరాలో కాకుండా బయట వేసే పక్క పందేల్లో వొదిలారు.అనుకోకుండా వేళ్ళి నేనూ మా పనికుర్రాడూ ఇద్దరం గుర్తు పట్టాం.నేను చూడ్డం వల్లనే అది ఓడిందా,అది గెల్చుకొచ్చిన పుంజుల్లాగే ఇవ్వళ్టితో దీని బతుకూ ముగిసిపోతుంది గదా అని కొంచెం సేపు మనసు పీకింది గానీ అప్పటికే అది ముసలిదయింది గదా యెంతకాలం పోట్లాడగలుగుతుంది లెమ్మని సరిపెట్టుకున్నా!

         మాకోడి నాకు చాలా జీబితసత్యాల్ని చెప్పింది.మనుషుల్లో అయినా అంతే గదా,సినిమా ఫీల్డులో,రాజకీయాల్లో,క్రీడల్లో,వ్యాపారంలో - యెక్కడయినా గెల్చినంత వరకే నెత్తిన పెట్టుకుంటారు, ఓడిపోయిన వాణ్ణి వేష్టు క్యాందిడేటు కింద పక్కకి పెట్టేస్తారు!గెల్చామా ఓడామా అన్నది కాదు కొశ్చెను ఫీల్డులో నిలబడ్డామా లేదా అనేది పాయింటు!చేస్తున్నది కరెక్టా కాదా అన్నది తేల్చుకుని కరెక్టనిపిస్తే ఆ "పందెంకోడి" లాగే చావుకైనా తెగించి పోరాడు!


అదే సంక్రాంతి స్పూర్తి!!

3 comments:

  1. మీకు తెలుసో తెలీదో కోడి పందాలు చట్ట వ్యతిరేకం

    ReplyDelete
    Replies
    1. మనదేశంలో చట్టాన్ని గౌరవించే సంస్కతి ఇంకా రాలేదు. అదేనండీ విషాదం.

      Delete
    2. కొందరికి వినోదం!
      కొందరికి విభేదం?
      వెరసి ఒక విషాదం?!
      కిం కర్తవ్యం?

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...