Tuesday, 25 August 2015

గుడుంబాను నిరోధించటానికి చీపు లిక్కరును ప్రోత్సహిస్తున్నారట!చీపు లిక్కరుని నిరోధించటానికి దేన్ని ప్రోత్సహిస్తారు?

తాటిచెట్టు యెందుకెక్కావురా అంటే దూడగడ్డి కోసం అన్నాట్ట!యేమో వాడి తెలివి వాడిది కావచ్చు - యెక్కడ మంచి గడ్డి ఉందో పరకాయించి చూడ్డానికి యెక్కాడేమో!మన గవర్నమెంటు వారు ఇంకా తెలివైనవారు కదా ప్రజల సంక్షేమం కోసం యెన్నో మంత్రిత్వ శాఖల్ని యేర్పాటు చేశారు.కుటుంబనియంత్రణ శాఖ ద్వారా పిల్లల్ని పుట్టకుండా చేస్తారు.శిశు సంక్షేమ శాఖ ద్వారా పుట్టిన పిల్లల్ని చావకుండా బతికి ఉంచుతారు.ఆర్ధికశాఖతో పన్నులు వేసి గోళ్ళూడగొట్టి వసూలు చేస్తారు.పోలీసు శాఖతో లాఠీలకి పని చెప్పి అల్లరిపిడుగుల్ని వీపు సాపు చేసి దారికి తీసుకొస్తారు.ఇవ్వన్నీ సరిగ్గా పని చేసినా చెయ్యకపోయినా కంగారు పడరు గానీ ఒక శాఖ సరిగ్గా పని చెయ్యకపోతే మాత్రం గంగవెర్రు లెత్తిపోతారు - ఆరోగ్యశాఖ అనుకునేరు,కాదు కాదు త్రాగుడు శాఖ?!

త్రాగుడు శాఖ గనక సరిగ్గా పని చెయ్యకపోతే ప్రభుత్వం తాగినోడికి మల్లే తూలిపోతుంది!యెందుకంటే ఉద్యోగస్తుల,మంత్రుల,శాసనసభ్యుల జీతాలన్నీ అందులొంచే యేర్పాటు చేశారు మరి?కొన్ని కోట్లమంది తాగి తాగి చస్తూ బతుకుతూ ఉంటే గానీ ఆ ఘనకార్యం నెరవేరదు,జనం చచ్చి ప్రభుత్వాన్ని బతికించాలి!అసలు రాజ్యం లక్షణమే అంత,రాజ్యానికి రెండు ముఖాలు ఉంటాయి - కరెన్సీ,లాఠీ!మొదటిది రాజ్యం సరిహద్దుల్లో యెక్కడయినా చెల్లుతుంది.సంపాదన,ఆస్తి,మిగులు,అప్పు,వడ్డీ,బ్యాంకింగు ఇవన్నీ జనానికి తిండినీ కాల్క్షేపాన్నీ ఇస్తాయి.ఒకడు మరీ పేట్రేగిపోయి అల్లరి చేస్తే అప్పుడు లాఠీ లేస్తుంది.అరెస్టులు,కేసులు బుక్ చెయ్యడాలు,లాయర్లు,కోర్టులు,తీర్పులు అదో గందరగోళం - అటుకేసి సుఖపడాలనుకున్నవారు యెవరూ ఒకంతట పోరు.మాటిమాటికీ లాఠీ ఉపయోగించాలంటే కష్టం కదా!లాఠీ వరకూ వెళ్ళకుండానే ప్రజల్ని బుధ్ధిగా ఉంచటానికి పనికొచ్చే రెండు చేతులు కూడా ఉన్నాయి రాజ్యానికి - మతం,మత్తు!

మొదటిది చాలా శక్తివంతమైనది,పైగా నిరపాయకరమైనదీ గౌరవనీయమైన పధ్ధతి!ప్రతి మతమూ తను నిర్వచించిన ప్రత్యేక లక్షణాల్తో కూడుకున్న సర్వశక్తివంతుడైన దేవుణ్ణి నమ్మమంటుంది,దేవుడికి నచ్చేవి అని చెప్పి కొన్ని సూత్రాలని పాటించమంటుంది.మంచిపనులు చేస్తే బతికున్నప్పుడు కష్టాలు పడ్డా చచ్చాక స్వర్గంలో సుఖపడవచ్చు నంటుంది,దేవుడికి నచ్చని పనులు చేస్తే చచ్చాక నరకంలో కష్టాలు పడాల్సి వస్తుందని బెదిరిస్తుంది.ఆ మార్మికత ప్రభావం వల్ల దేవుడికి నచ్చే పనులు చేస్తూ బతికుండగా కష్టాలు పడినా చచ్చాక సుఖపడొచ్చుననే ఆశతో కష్టాన్నే ఇష్తంగా చేసుకుని విధేయతని పాటిస్తారు కొందరు - వారు భక్తులు!ఆ విధేయతని మెల్లగా రాజు/ప్రభుత్వం వైపుకి మళ్ళించడం చాలా తేలిక!అందుకే రాజ్యం కనిపించీ కనిపించకుండా చాపకింద నీరులా పనిచేస్తూ ప్రజలకి యెక్కువ విధేయతని అలవాటు చేసే మతాన్ని కొంచెం ఎక్కువగా ప్రోత్సహిస్తుంది!విస్కీ సీసాకీ విబూదిపండుకీ ముడిపెడుతున్నానని అనుకోకండి - రెండూ కిక్కునిచ్చేవి గాబట్టి కొంచెం సోదరస్తుతి!

అలా విధేయతకి అలవాటు పడిన ప్రజలు అంటే రాజ్యానికి చాలా ఇష్టం,కానీ అందర్నీ అట్లా మార్చలేరు,కొందరు హేతువాదులు ఉంటారు,కొందరు ఠాట్ నాకు ఇక్కడే సుఖాలు కావాలి అనే తిరుబాటుదార్లు ఉంటారు - వారికోసం యేర్పాటు చేసిన సదుపాయమే మధుపానం!మధుపానం ఇప్పటిదా?దీని చరిత్ర క్షీరసాగరమధనంతో మొదలవుతుంది!అసలు కన్నా కొసరు ముద్దని అమృతమేమో అని దేవతలూ దానవులూ భ్రమపడిన సుర అమృతం కన్నా ముందే పుట్టింది గదా!అసలుది ఉందో లేదో తెలియని కల్పన అయితే కొసరుది యెక్కడ బడితే అక్కడ కనిపించే వాస్తం.గట్టిగా అంటే సనాతనులు పోట్లాటకి వస్తారు,వచ్చినా రానీండి గానీ యజ్ఞ యాగాదులలో ప్రవహించే సోమం ఇదేనని హేతువాదులు పరిశోధనలు చేసి తేల్చిచెప్పారు!ఆదిశేషుని అపరావతారం బలరామ దేవులు మధూపానాసక్తుడనేది జగద్విదితమే!

అన్ని మతాల్లోనూ మామూలు రోజుల్లో అవాంచనీయమని చెప్పి శ్రోత్రియులకి నిషేధించినా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వారు కూడా మద్యాన్ని పవిత్రీకరించి స్వీకరించడం జరుగుతూనే ఉంది?!యెందుకయ్యా ఇంత ఆకర్షణ అంటే కల్లు,మద్యం,గుడుంబా,భంగు,కొకైన్,టెనిన్,కెఫేన్,మార్ఫిన్ - అవన్నీ వైద్యశాస్త్ర పరంగా తగుమాత్రం పుచ్చుకుంటే దేహబాధల్నీ మనోరుగ్మతల్నీ ఉపశమింపజేసే మంచి లక్షణం ఉంది.మనిషి శారీరకంగా గానీ మానసికంగా గానీ ఒక మోతాదుని మించి కష్తపడితే శరీరంలో లాక్టిక్ యాసిడ్ యెక్కువగా  ఉత్పత్తి అయ్యి నెప్పుల్ని కలిగిస్తుంది.కొంచెం శ్రమ వల్ల పుట్టే నెప్పులకి నిద్ర సరిపోతుంది.అదికశ్రమకి గురయితే కేవలం నిద్ర చాలదు,అటువంటి సమయంలో తగుమాత్రంగా పుచ్చుకుంటే అందులో ఉండే ఆల్కహాల్ లాక్టిక్ యాసిడ్ వల్ల కలిగే నెప్పుల్ని తగ్గిస్తుంది!కానీ ఆ సమయంలో మనస్సులో కలిగే భ్రమలకి అతిగా దాసుడైతే అవసరం ఉన్నా లేకపోయినా తీసుకోవాలనిపిస్తే వ్యసనం అయి కూర్చుంటుంది - నెత్తిమీదకి కొత్త కష్టాల్ని తెస్తుంది?!

తాగుతున్న వాళ్ళు అందరూ చావరు!డబ్బున్న మారాజులకి యే కొంచెం శృతి మించి ఆరోగ్యం ప్రమాదంలో పడినా వెంఠనే ఫ్యామిలీ డాక్టరుని మెయింటెయిన్ చెయ్యడం అనే స్టాటస్ సింబల్ యెలాగూ ఉంటుంది గనక తగిన వైద్యం చేయించుకుని ఆయనగారు చెప్పిన సలహాలు పాటించి గుండ్రాయిలా బతికే వీలుంటుంది!యెటొచ్చీ పొద్దస్తమానం పని చేస్తే తప్ప పొట్టగడవని వాళ్ళకి ఈ విధమయిన అదనపు వెసులుబాట్లు ఉండవు గనక చస్తారు.తమ చుట్టూ ఉన్న దరిద్రాన్ని భరించలేక భ్రమల్లో కలిగే ఆనందం హాయిగా ఉంటుంది గనక పెళ్ళి కుదిరితే గానీ పిచ్చి కుదరదు పిచ్చి కుదిరితే గానీ పెళ్ళి కుదరదు అన్నట్టు తయారవుతారు,పాపం!ఆ గది మాత్రం తెరవవద్దని అందాల రాకుమారి యెంత చెప్పినా యేముందో చూడాలని దాన్ని పనిగట్టుకు తెరిచి రాకుమారికి దూరమై అలమటించే జానపద కధల్లోని కధానాయకుడిలా తాగిన మొదటిసారి దొరికి మత్తు దిగగానే మాయమైపోయిన ఆనందం కోసం మళ్ళీ మళ్ళీ వెతుక్కునే వాళ్ళు తాగకుండానే ఆనందంగా బతకొచ్చుననే అసలు రహస్యం తెలుసుకుంటే కల్తీదైనా ఫరవాలేదు యెక్కువ ఖరీదయినా ఫరవాలేదు అని అంగలార్చుకు చావరు!

ప్రభుత్వం వారు సంపూర్ణ మద్య నిషేధం పెట్టి నిక్కచ్చిగా అమలు చేయ్యవచ్చు గదా అంటే బూతు సినిమాలని నిషేధిస్తామనగానే ప్రజాస్వామ్యం గుర్తుకొచ్చి ఆవేశపడిపోయిన రామగోపాలవర్మ లాంటివారు పడనివ్వరు గదా!యేదో వ్యంగ్యానికి అన్నాను గానీ మాంసాహారాన్ని నిషేధించి శాకాహారాన్ని ప్రోత్సహించాలనే డిమాండు గతంలో వచ్చినప్పుడు పరమాచార్యులే వ్యతిరేకించారు ఆహారపు టలవాట్లలో బోధన ద్వారా ఇష్టాపూర్తిగా మార్చడమే తప్ప బలవంతంగా నిషేధాలు విధిస్తే ఫలితం వికటిస్తుందని!గట్టిగా నిషేధించాలని ప్రయత్నాలు జరిగినా నిజంగానే ఫలితం వికటించింది!స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకాశం పంతులు గారి హయాములో మద్యనిషేధాన్ని నిక్కచ్చిగా అమలు జరిపినందుకే ఆయన ప్రభుత్వం కూలిపోయింది?ప్రస్తుతానికి దేశంలో నికచ్చిగా గాంధీగారి జన్మస్థానమైనందున గుజరాతులో గట్టిగా అమలు చెయ్యాలనే ఉద్దేశంలో మర్యాదస్తులూ మొహమాటస్థులూ ఉన్నారు గానీ పేరుకి మాత్రమే నిషేధం నడుస్తున్నది - మిగతా చోట్ల కన్నా పైనించి కిందివరకూ అధికారులు యెవరి వాటాలు వారు పంపకాలు వేసుకుని తీసుకునే పధ్ధతిలో సమాంతర ఆర్ధికవ్యవస్థ అనిపించేటంతగా వ్యవస్థీకృతమైన నల్లబజారు విక్రయాలు నిజంగా అక్కడ మద్యనిషేధం అంత బలవంతంగా అమలు చెయ్యడం అవసరమా అనిపించేటట్టు ఉన్నాయి!

ప్రస్తుతం భారతదేశపు రాజ్యాంగం అమలయ్యే భూభాగంలో నిక్కచ్చిగా అమలవుతున్నది లక్షద్వీప్ లోని "Bangaram" దీవిలోనే - కానీ అక్కడ జనావాసాలు లేవు!అచట ఒక రిసార్టు కలదు,రిసార్టు నందు ఒక బార్ కలదు - అచట మాత్రమే సేవించవచ్చు.మిజోరమ్ము వారు 17 సంవత్సరాల సుదీర్ఘనిషేధం తర్వాత 1014లో జులై 10న యెత్తిపారేసి రమ్ముని తిరిగి రమ్మని మత్తునిమ్మని ఆహ్వానించినారు!పాపం క్రైస్తవ మతానుయాయులు తమ నిరసన వ్యక్తం చేస్తూ ప్రార్ధనలు చేసి సరిపెట్టుకున్నారు - అసలు మధ్యనిషేధాన్ని యెత్తివేసే బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి కూడా విశ్వాసియే!ప్రార్ధించిన వాళ్లలో ఆయన కూడా ఉన్నాడు పాపం?!"ప్రభువు గనక మద్యనిషేధాన్ని యెత్తివేస్తున్న ఈ బిల్లుని నిజంగా వ్యతిరేకించాలని సంకల్పించి ఉంటే బిల్లుని సభలో ప్రవేశపెట్టకుండా నన్ను నిరోధించమని ప్రభువుని యెంతగానో ప్రార్ధించాను" అని వాక్రుచ్చాడు,అంటే కరుణామయుడు కూడా మద్యనిషేధాన్ని సమర్ధించలేదు,మానవమాత్రులం మనం ఏమి చెయ్యగలం!?

గుడుంబా అమ్మకాల్ని నిరోధించడానికి చీప్ లిక్కరుని ప్రోత్సహించటం,చీప్ లిక్కరు అమ్మకాల్ని నిరోధించడానికి మరోదాన్ని ప్రోత్సహించటం కన్నా ప్రతిదానికీ శాస్త్రీయమైఅన పధ్ధతిలో మార్కెట్ సదుపాయాల్నీ వినియోగానికి ఆరోగ్యపరమైన నిబంధనల్ని రూపొందించి అన్నిటినుంచీ తగినంత ఆదాయం తెచ్చుకోవడం మంచిది!ప్రభుత్వపరంగా కొన్ని రక్షణల్నీ కొన్ని సదుపాయాల్నీ యేర్పాటు చెయ్యటం తప్ప మరేదీ పని చెయ్యదు.అధికారంలో ఉన్నవారి పట్ల ప్రజల విధయతకి మతం,మత్తు రెండూ చాలా అవసరం!తగుమాత్రంగా ప్రయోగించి లాభం పిండుకోవాలే తప్ప బాతుని చంపే విధంగా పోకూడదు.వారికి తెలుసునని నాకు తెలుసుననుకోండి,తెలియని వారికోసం కొంచేం అసందర్భ ప్రలాపం,బోరు కొట్టిందా!


మధువు తాగినవానికి తూలుడు యెక్కువ!మధువు తాగనివానికి యేడుపు యెక్కువ!

2 comments:

  1. తాగితే తూలగలను, తూలనివ్వరు; తూలకపోతే ఏడవగలను ఏడవనివ్వరు హ్హ్ హ్హ్ హ్హ్ హూఁ
    మనిషి గతి ఇంతే, రాజు/ప్రభుత్వం అంతే
    చాలా బావుందండీ! బోర్ కొట్టే ప్రశ్నేలేదు. _/\_

    ReplyDelete
  2. నిజంగా కెసిఆర్ ఆలోచనలు చాలా ఫన్ని గా ఉన్నాయి .
    తెలంగాణా ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాడు అని నమ్మిన ఆంధ్రుడి ని నేను , ఇప్పుడు చూస్తుంటే ఫన్ని గా ఉంది .
    కల్లు ని తాగమని చెప్పడం , చీప్ లిక్కర్ ని ప్రోత్సహించడం ... తెలంగాణా లోనే సెటిల్ అవ్వాలనిపిస్తుంది

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...