Saturday, 6 June 2015

నేడు విశ్వనగరం అమరావతికి భూమిపూజ జరిగింది!రేపు విశ్వమే ఆంధ్రులకి తలవంచి నమస్కరిస్తుంది!

     నేటివరకు మలమల మాడ్చిన ప్రచండభానుడు శాంతించాడు,చిరుజల్లులతో విశ్వనగర బూమిపూజ వేదికని చల్లబరచాడు!భారతదేశపు ఉత్తర దక్షిణ సంస్కృతుల మధ్యన సంధి చేసి దేశమంతట్నీ కలిపిన ఒకనాటి ఆంధ్ర శాతవాహనుల రాజధాని ధాన్యకటక అమరావతి మళ్ళీ రూపు దిద్దుకుంటున్న తన రెండవ జన్మలో దేశపు యెల్లలు దాటి ప్రపంచాబ్జపు కలువరేకై విచ్చుకొనబోతున్నది!

     ఒక కుదుపులా జరిగిన రాష్త్రవిభజన ఆంధ్ర ప్రాంత వాసులకి చాలా గాయాల్ని చేసింది - ఒకనాడు రారమ్మని ముక్తకంఠంతో పిలిచారనేటందుకు సాక్ష్యాలు ఉన్నా కుట్రతో వచ్చి పడ్డారని ఆది నుంచీ అనుమానంతోనే చూస్తూ గడిపి,అప్పటినుంచీ ఇప్పటివరకూ తమ కష్టంతో తెలివితో సంపద పెంచి దాన్నంతా కలిపేసి మూడు ప్రాంతాలవారికీ పంచుతున్నా సహించి వూరుకుని అరవయ్యేళ్ళ పాటు రిప్ వాన్ వింకిల్ మాదిరి నిదరపోయి ఇప్పుడు లేచి ఆవులించి దాచిన స్థలం తమది కాబట్టి సంపద పెంచిన వారికే దొంగలని ముద్రవేసి తరిమికొట్టగలిగిన గయ్యాళిమందకి మేలుచేసినదానికి ఫలితంగా తలవంచుకుని ఇవతలికి వచ్చినందుకు కలిగిన బాధకి తొలిసారి కొంత సాంత్వన లభించింది!

     ఒక గాయం మానుపట్టాలంటే ఒక గేయం పేగుల్లో పుట్టాల్సిందే - జోర్ సెయ్!బారు సెయ్! కోటిపల్ల్లి రేవు కెయ్,కోనంగి రేవు కెయ్!!మనకెం తక్కువ - చరిత్ర లేదా?సంస్కృతి లేదా?కాళోజీ కరుణశ్రీ ఇద్దరూ ఒకే మాట మాట్లాడినా ముందే ప్రాంతానికి గీత గీసుకుని కాళోజీ "ఇన్సైడర్"గా అన్నాడు గాబట్టి పడతాం,కరుణశ్రీ "ఔట్సైర్" గాబట్టి దుర్మార్గు డంటాం అనేవాళ్ళు విడిపోవడం వల్ల మనం బాధపడట మేమిటి అర్ధం లేకుండా?మన తీరప్రాంతం మనకి వరం కాబోతున్నది, వ్యూహాత్మకంగా చూస్తే ఒక్కసారిగా ప్రపంచం మొత్తం మన ముంగిట్లోకి వచ్చినట్టుగా అనిపిస్తున్నది!ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇప్పటికే ఖాయం చేసుకున్న యం.వో.యు లన్నీ ఖరారయ్యి ఆయా పరిశ్రమలూ వ్యాపారాలూ పాదుకొని విస్తరిస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి జూలు విదిల్చి లేచి నిలబడిన మృగరాజే!

     మద్రాసుని మనమే పెంచాం,అయినా తమిళులు మాది పొమ్మన్నారు?మొదట కష్టపెట్టుకున్నాం,అయినా వాళ్ళకే వొదిలేసి వచ్చామే తప్ప దేబిరించ లేదు,బెదిరించ లేదు!మొదటిసారి భాష తెలియని పరాయి వాడు గదా అనుకుంటే రెండవసారి భాష తెలిసిన సొంతవాడే కనీసం మర్యాదగా విడిపోవటానికి కూడా ఒప్పుకోలేదు?అప్పుడు మనల్ని పొమ్మన్న వాళ్ళకన్నా మనమే గొప్పగా వున్నాం నిన్నటి వరకూ,ఇప్పుడు మనని పొమ్మన్నవాళ్ళ కన్నా గొప్పగా వుండబోతున్నాం రేపటి రోజున!

     ఈ గడ్ద మీద పుట్టినవాళ్ళలో సహనం యెక్కువ,ఈ గాలిని పీల్చినవాళ్ళలో స్వాభిమానం యెక్కువ,ఈ నీటిని తాగినవాళ్లలో వినయం యెక్కువ - వీటన్నింటి వల్ల:

రేపు విశ్వమే ఆంధ్రులకి తలవంచి నమస్కరిస్తుంది!

5 comments:

  1. మీ ఆశావహదృక్పథం బాగుంది. మోసపోవటానికి సిధ్ధంగా ఉండే వాళ్ళున్నప్పుడు మోసగించే వాళ్ళూ ఉంటారు. ఒకసారి మోసపోయినా స్వహితం తెలుసుకోలేని వాడిని మరొకసారి మరొకరు మోసగించారంటే అది ఎవరితప్పు? అదికూడా అలోచించాలి.

    ప్రపంచం మొత్తం మన ముంగిట్లోకి వచ్చినట్లు అనిపిస్తోందా?అనిపించటం వేరు కనిపించటం వేరు.

    ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు తెలుగువాళ్ళందరూ ఒక్కటే ఐపోయిన్బట్లు అనిపించిందాలేదా? మరి చివరికి కనిపించిందేమిటి? మోసం. ఆమోసం మీదంటే మీదని నిందలూ ప్రతినిందలూను. అంతేకదా?

    మొన్న వెంకయ్యగారు ఆంధ్రుల తరపున రజ్యసభలో అర్థంచినప్పుడు ఏమనిపించింది? నిన్న మోదీగారు దిల్లీణి మించిన రాజధాని కట్టిస్తాం అన్నప్పుడు ఏమనిపించింది? మరి నేడు ఆంధ్రప్రజానీకాని ఏం కనిపిస్తోంది.

    అనిపించిందల్లా కనిపించదని తెలుసుకోవాలి.

    అమాయకత్వం అనబడే మెతకతనాన్ని ముందుగా వదలుకోవాలి ఆంధ్రప్రజలు. లేకుంటే ఏదో ఒక వంకను అందరూ పబ్బం గడుపుకొని నీలాపనిందలు వేస్తారు. అంతెందుకు, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం ఆ రాష్ట్రప్రజల స్వంత శ్రమదమాలమీదే జరగక తప్పదు. పైసా విదపని కేంద్రం అభివృధ్ధిపథంలోకి వచ్చిన పిదప ఆంధ్రాను అభివృధ్ధి చేసినది కేంద్రం మాత్రమే అంటుంది. కాదు మహాప్రభో అంతా మా రెక్కలకష్టం అంటే మళ్ళా నిందలకు దిగుతుంది - పడే అలవాటు ఎలాగూ ఆంధ్రజనులకు ఉంది కదా! అది కూడా మర్చిపోకూడదు. మనం సహనవంతులమని బోర్డు కట్టుకు కూర్చుని మరోసారి ములగొద్దని మాత్రం హెచ్చరిక. మీ వినయాన్ని అవినయపరులు సొమ్ము చేసుకోవటం మీకే పదేపదే చేటు తెస్తున్నదని హెచరిక.

    అన్నివిధాలా ధృఢంగా లేని నాడు మనిషైనా జాతైనా ఈ దిక్కుమాలిన ప్ర్పంచంలో నెగ్గుకు రావటం కల్ల. ముందు ఆంధ్రులు సాధించవలసిన అభివృధ్ధి అనేది ఈ విషయంలో అన్నది ఆఖరు మరియు అతిముఖ్యమైన హెచ్చరిక!

    ReplyDelete
  2. //ఈ గడ్ద మీద పుట్టినవాళ్ళలో సహనం యెక్కువ,ఈ గాలిని పీల్చినవాళ్ళలో స్వాభిమానం యెక్కువ//
    Oxymoron.

    ReplyDelete
  3. మీ ఆశావహ ధృక్పథానికి అభినందనలు హరిబాబు గారు.

    ReplyDelete
  4. ఆంద్ర ఉద్యోగులే హైదరాబాద్ ను అంగుళం కదిలి వెళ్ళేది లేదంటున్నారు. చంద్రబాబు హైదాబాద్ లో కూర్చొని అంజనం బిళ్ళ సాయంతో ఆంధ్రాలో పాలన సాగిస్తున్నాడు. ఇక్కడినుండి తరలి పోదామని ఆలోచించిన ఆంధ్ర పారిశ్రామిక వేత్తలు ఆంద్ర రాజధాని పరిసరాల్లోని పచ్చదొరల చేతుల్లో ఉన్న భూమి ధరలు హైదరాబాద్ ను తలదన్న సరికి కళ్ళు బైర్లు కమ్మి కదలకుండా కూర్చున్నారు కలలు కనడం మాని వాస్తవ ధృక్పదంతో ఆలోచించండి.

    ReplyDelete
  5. @san
    నా అంచనా ప్రకారం ఇప్పుడు హైదరాబాదులో ఉన్న వాళ్ళని ముఖ్యంగా ఆంధ్రాకి జంపయిపోదామని చూస్తున్న వ్యాపారస్తుల్నీ పారిశ్రామికవేత్తల్నీ చంద్రబాబు కూడా పట్టించుకుని వెంటతీసుకోకపోవచ్చు.యెందుకంటే అదిగో నే చెప్పానా లేదా బాబు ఆంధ్రా కోసం తెలంగాణని ఖాళీ చేస్తున్నాడు అనే కేసీఆర్ ఉందనే ఉన్నాడుగా!కేసీఆర్ అన్నా అనకపోయినా రెండు రాష్ట్రాల మీద చూపున్న వాడు ఆపని చెయ్యడు,కదా?

    రైతుల బ్మూముల రేట్లు పెరిగితే యేం?రాజధాని కోసం రైతుల నుంచి సేకరించిన భూమి ఉందిగా.చట్ట ప్రకారం సేకరిస్తే వ్యాపారస్తులకు కేటాయింపుల్లో భూమి యజమానిగా రైతులతోనే వ్యవహారం నదపాల్సి వచ్చేదేమో,అప్పుడు కొందరు రైతుల్నన్నా ప్రతిపక్షాలు ఉపయోచించుకుని ఇబ్బంది పెట్టేవి!రైతులే భూమిని ఐచ్చికంగా ఇచ్చారు గాబ్ట్టి పర్భుత్వం యెవరికయినా ఇవ్వవచ్చు.హైదరావ్బాదులో ఉన్నవాళ్లంతా ఒక ప్రాంతం వాళ్ళు కావదంతో సమతూకం దెబ్బతిన్నది గాబట్టి గొడవ వచ్చింది,ఈసారి రాజధానికో సెటిల్ అయ్యేవాళ్లని జాగ్రత్తగా ఫిల్తర్ చెయ్యకపోతే ఈసారి నాలుగు ముక్కలవుతుంది - కళినాంధ్ర,ఉత్తరాంధ్ర,రాయలసీమ మరియూ మధ్యాంధ్ర అంటూ!ఈసారి బాబు కూడా యేం చెప్పినా 13 జిల్లాల్నీ కలిపి మాట్లాడుతున్నాడు గాబట్టి మారినట్టే కనిపిస్తుంది.

    ఇక్కద చేసి చూపిస్తేనే 2019నాటికి తెలంగాణలో గట్టిగా క్లెయిం చెయ్యగలడు కాట్టి చేసి తీరాల్సిన అవసరం బాబుకి ఉంది - ప్రాక్టికల్ అనచనాయే నాది,చూద్దాం?!

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...