Tuesday, 26 May 2015

హిందూ ధర్మ ప్రహేళికలు-రామకధా విజృంభణం

     పాండిత్యం సజ్జనుడిలో పెరిగితే వినయంగా ఉంటాడు - మృదుభాషి అవుతాడు!అదే పాండిత్యం దుర్జనుడిలో పెరిగితే అహంకరిస్తాడు - వ్యర్ధప్రసంగాలు చేస్తాడు?నేను ముందరి భాగంలో ప్రస్తావించిన డా.స్వర్ణ వాచస్పతి లాంటివాళ్ళు రేండో కోవలోకి వస్తారని బల్లగుద్ది చెప్పగలను.లేకపోతే మహాకవి కందుకూరి రుద్రయ విరచిత "నిరంకుశోపాఖ్యాన" సుధాతరంగిణీ వ్యాఖ్యాత,భారతీయ మహాశిల్పాద్యనేక గ్రంధకర్త,త్రిశతాధిక దేవతా ప్రతిష్ఠా నిర్వాహకులు మరియు కనకాభిషిక్తులు అయిన "విమర్శకాచార్య","శిల్పకళాకోవిద" స్వర్ణ సుబ్రహ్మణ్య కవిగారి పుత్రుడై ఉండి ముప్పాళ రంగనాయకమ్మ విషవృక్షం ఆరో ముద్రణ కూడా పూర్తి చేసుకుని హిందూ ధార్మికతకి మూలమయిన రామాయణ తత్త్వాన్ని యెండగడుతుంటే సద్బుధ్ధి గలవాడెవడయినా స్వధర్మానికి అంతకన్నా యెక్కువ హానిచేసే "వాల్మీకి రామాయణ సౌరభాలు" అనే పుస్తకం రాస్తాడా?ఈ మహాద్భుతమైన గ్రంధరాజమునకు పీఠిక వ్రాసిన "విద్యా విశారధ","సాహిత్య సరస్వతి" బిరుదాంకితులైన డా.కన్నెగంటి రాజమల్లాచారి గారు ఆ గొప్ప గొప్ప బిరుదులన్నీ యెవరినుంచి యెప్పుడు యెందుకోసం అందుకున్నారో ఆయనకయినా తెలుసా?

     రంగనాయకమ్మ అయితేనేం స్వర్ణ వాచస్పతి 
అయితేనేం విమర్శించటం తప్పు కాదు,అక్కడ యేమి ఉందో విప్పి చెప్పటమూ తప్పు కాదు!కానీ సంస్కృతభాషలో ఒక పదానికి కేవలం ఉచ్చారణ వల్ల కూడా అర్ధం మారిపోయే సంక్లిష్టత ఉన్నప్పుడు వ్యాఖ్యానంలో మోళీ చేసి "నేనుగాక చూడండహో వాల్మీకిలో కూడా తప్పులు పట్టాను,నాదైన పాండిత్యాన్ని మెచ్చుకొనండహో" అనేటట్టు రెచ్చిపోవడం ఒక హిందువుగా యెంతవరకు సమంజసం?మొదట ఆయన హిందువా కాదా,ఈ సాంప్రదాయాన్ని ప్రేమిస్తున్నాడా ద్వేషిస్తున్నాడా?నాకయితే "ఆదికవి గనుక ఆదికావ్యం గనుక ఈ మహాకావ్యంలో రచనాపరంగా దొరలిన నెరుసులని మనం భావించవచ్చు" అనే కంటితుడుపు వ్యాఖ్య ఒకటి తప్ప మిగిలిన అన్ని వ్యాఖ్యలూ పరమ చెత్తగా ఉన్నాయి!చెత్త అని యెందుకంటున్నానంటే ఇతని వాదనల్లో కూడా స్వైరిణి మాదిరి వెకిలితనం కనబడుతున్నదే తప్ప గంభీరమైన నిష్పాక్షికమయిన వాదన ఒక్కటీ లేదు!

     అహల్య వృత్తాంతమే తీసుకుంటే బాలకాండలో ఉన్నదే మనం తీసుకోవాలి.దానికి సంబంధించినంతవరకూ నేను హిందూ ధర్మ ప్రహేళికలు - రామకధా విశ్లేషణంలో అహల్య ఐచ్చికంగా ఇంద్రుడితో సంగమించినా యెందుకు గౌతముడు కూడా క్షమించి ఆమెని కేవలం శిక్షతో సరిపుచ్చి సతీత్వానికి భంగం రానివ్వలేదో విపులంగా చెప్పాను!సతీత్వానికి  నిజమైన అర్ధం ప్రవర్తన నుంచే తీసుకోవాలి.దానికి సాక్ష్యం పాండవులు దేవతల వల్ల పుట్టినా మొదట కౌంతేయులు గానూ తర్వాత పాండవులు గానూ వ్యవహరించబడ్డారే తప్ప ఆయా దేవతలతో కలిపి యెవరూ వ్యవహరించలేదనేది గట్టి సాక్ష్యం!ఒకవేళ ప్రస్తావించినా అది నిందార్ధకంగా మాత్రం లేదు,అవునా?అక్కడ స్రీ మాత్రమే ప్రధానం, ఆవిడ క్షేత్రమే ప్రధానం,ఇక్కడ నేనొక కఠినమైన నిజాన్ని చెప్పదల్చుకున్నా - సంక్లిష్ఠమైన డి.యన్.యే టెస్టులకి పోకుండా,పోలికల్నీ అలవాట్లనీ లెక్కవేయ్యకుండా లోకవృత్తాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే - మీకయినా నాకయినా నీ తండ్రి ఫలానా అని తల్లి చెబితే చచ్చినట్టు వొప్పుకు తీరాల్సిందే,కాదా?అందుకే మనవాళ్ళు సంతానాన్ని నిర్ధారించేటప్పుదు క్షేత్రమయిన తల్లి గర్భానికే యెక్కువ ప్రాధాన్యత నిచ్చారు!ఆ క్షేత్రం పాండురాజుకు వంశాంకురాల్ని ఇవ్వడానికి మాత్రమే మరొకరితో గర్భం దాల్చింది కాబట్టి పుట్టిన తర్వాత వాళ్ళు అక్రమ సంతానమో మరొకటో యెంతమాత్రం కారు,ఇక్కడ అహల్యకి గూడా ఆ విధేయత వల్లనే సతీత్వం వచ్చింది!ఈ మౌలికయిన విషయం తెలిసే చెశాడో తెలియక చెశాడో అంబేద్కర్ గూడా రాముడు అక్రమ అంతానం అనే అర్ధం వచ్చేలా విమర్శించాడు,ఒకవేళ అక్రమ సంతానమే అనుకున్నా అంబేద్కర్ అక్రమ సంతానం గౌరవనీయంగా వుండకూడదని అంటున్నాడా?మరి తన మతానికి సంబంధించిన మూలపురుషుడు కలలోకి యేనుగు వచ్చాకనే ఆయన తల్లి గర్భం దాల్చి ఈయన్ని కన్నట్టు ఉందిగా బుధ్ధుడి జన్మ కూడా రాముడి లాంటిదే కదా!

     ఇక రాజ్యార్హత దగ్గిరే కాదు వాలి వధ దగ్గిర కూడా రాముడు మొదట్లో కొంత గందరగోళానికి గురయ్యి తర్వాత ఒక స్పష్టత వచ్చాక గట్టి నిర్ణయం తీసుకుని మిగతావాళ్ళని కూడా తనమాటకే కట్టుబడి ఉండేలాగ వొప్పించినట్టు వాల్మీకి సన్నివేశాల్ని కల్పించాడు!నేను ప్రారంభంలోనే చెప్పాను ఆ కధ యెందుకు సామాన్యుల్ని కూడా రాముడు కూడా తనవంటివాడే అని మమేకం అయ్యేలాగ చేసి ఆ తర్వాత కొన్ని విశేష లక్షణాల వైపుకు నడిపించే విధంగా తీర్చిదిద్దబడిందో చెప్పాను గదా!మొదట్లో కధానాయకుడు తనలాగే కనిపించాలి,పోనుపోనూ తనుకూడా అతని వలెనే ప్రవర్తించగలననే విధంగా కధానాయకుణ్ణి మెట్టుమెట్టుగా ఔన్నత్యం వైపుకు నడిపిస్తేనే చదువరి కూడా ఆ మెట్లు యెక్కగలడు అనేది ఆదికవికి తెలిసినంతగా వీళ్ళకి తెలియకపోవడం ఆదికవి తప్పు కాదు గదా?యెట్లాగూ ప్రస్తావన వచ్చింది గాబట్టి అసలు వాలివధ యెంత నాటకీయంగా జరిగిందో ఇక్కడ చెప్తాను.అసలు వాలితో సుగ్రీవుడి యుధ్ధకోలాటం రెండుసార్లు జరిగింది!మొదటిసారి రాముడు చెట్టుచాటున ఉండటం,ఇద్దరూ కలబడుతున్నప్పుడు రహస్యంగా కొట్టడం అంతా రాముడు సొంతంగా వేసుకున్న ప్లాను కాదు,బహుశా సుగ్రీవుడి హడావిడి ప్లాను కాబోలు!చావుదెబ్బలు తిని వెనక్కొచ్చి పడి సుగ్రీవుడు రాముణ్ణి నానాతిట్లూ తిడుతూ గగ్గోలు పేట్టడమూ వర్ణించాడు, రాముడు వివరించిన విషయమూ అక్కడే చెప్పాడు - అసలే కోతులు ఆపైన కవలలు - వాళ్ళలో యెవరు యెవరో తెలిసిచావక పొరపాటున సుగ్రీవుణ్ణి కొడతానేమోనని సందేహం వచ్చి రాముడు మొదటిసారి బాణం వెయ్యలేదు!దానికి విరుగుడుగా రెండోసారి రాముడు తేడా తెలియడం కోసం గజమాల ఐడియా ఇచ్చాడు,కొట్టడం గూడా చెట్టుచాటున ఉండి కొట్టలేదు - ధనుష్ఠంకారం చేసుకుంటూ వచ్చి ఆగి చూస్తున్న వాలి యెదుర్రొమ్మున బాణం నాటాడు!సరిగ్గా మనకర్ధం కాని సన్నివేశంలో నిలబడితే మీరూ నేనూ యేమి చేస్తామో రాముడూ అలాగే ప్రవర్తించాడు గదా, అదీ సంవిధాన మంటే!అదీగాక దుర్మార్గులు అవకాశం వచ్చినప్పటికీ ఇతర్లు విడమర్చి చెప్పినా ఉన్నతంగా ప్రవర్తించలేనట్టే రాముడు కూడా మొదటిసారి మరోరకంగా సంశయగ్రస్తుడవటంవల్లనైతేనేమి వాలిని చెట్టుచాటు నుంచి కొట్టడం అనే నీచకార్యం చెయ్యడానికి అవకాశం వచ్చినా అదృష్టం బాగుండి తప్పించుకున్నాడు!

     ఇక రాముడి రాజ్యకాంక్ష గురించి ఈయన శ్లోకాల వారీగా ఉటంకించి వాటికి తాత్పర్యాలు వివరించి చేసిన తింగరి వాదనలన్నీ యే భరతుడి కన్యాయం జరిగిందని ఈ పండితులు ఆక్రందిస్తున్నారో ఆ భరతుడే తను పట్టాభిషేకం చేసుకోకుండా దాన్ని నిర్వందంగా తిరస్కరించి రాముడ్నే తిరిగి రాజుని చెయ్యాలని ప్రయత్నించిన ఘట్టంలో కైక పశ్చాత్తాపం మరియూ భరతుడి వేడికోళ్ళనూ ఒక్కముక్క కూడా యెందుకు ప్రస్తావించలేదు!సరే,ముప్పాళ రంగనాయకమ్మ అంటే హిందూమతాన్ని వెక్కిరించటానికి మర్చిపోయి ఉండవచ్చు, లేదా తన పుస్తకానికి విషవృక్షం అని పేరుపెట్టి రామకధని వక్రీకరించి అయినా దానిపట్ల గౌరవం తగ్గించాలని రాసింది గాబట్టి మసిపూసి వుండవచ్చు,వాల్మీకి రామాయణంలోని సౌరభాలని వెదజల్లాల్సిన ఈయనెందుకు ఆ భాగాన్ని ప్రస్తావించకుండా వొదిలేశాడు?వాల్మీకి గొప్పకవి అంటూనే ఆ కవి ఆదర్శవంతుడైన కధానాయకుడిగా చిత్రీకరించిన పాత్రలో దోషాలు కానివాట్ని కూడా ఇవిగో నేను కనుక్కున్న గొప్పాతిగొప్ప దోషాలంటూ అంత భీకరంగా చెలరేగిపోవటానికి కారణమేమిటి?యే ప్రతిఘటనా లేకపోతే యెక్కడయినా పెద్దకొడుకే నిస్సందేహంగా తండ్రి రాజ్యానికి వారసుడౌతాడు,పైగా మంధర మొదట శ్రీరామపట్టాభిషేకం వార్త చెప్పగానే కైక ఆనందించిందనే విషయం వాల్మీకి రామాయణంలో లేనిదా?దానికి ముందరి సన్నివేశాల్నీ తర్వాతి సన్నివేశ్శాల్నీ పాండిత్యంతో సమర్ధించినా కైక కూడా రాముడి వ్యక్తిత్వాన్ని చూసి యేమాత్రమూ అభ్యంతర పెట్టలేదని అంత స్పష్టంగా ఉన్నదాన్ని కూడా తన పాండిత్యగర్వంతో మరిచిపోవడం యెంత దారుణం?తను హిందువై వుండి హిందూ ధర్మానికి మూలమైన రామాయణ కావ్యం గురించి తను వెదజల్లుతున్న సౌరభాలు ఇవేనా?

     రాముడు తనకు తనుగా నాకు పట్టాభిషేకం చెయ్యమని అడిగిన శ్లోకం ఒక్కటైనా చూపించగలిగాడా?కైక కూడా మొదట ఉదారంగా సమ్మతించినదంటే దానర్ధం యేమిటి?అప్పటికే రాజ్యంలోని సకల ప్రజానీకమూ ప్రభుత్వాధికార్లూ సైన్యాధిపతులూ ఆనందంగా రాముడి రాజ్యాభిషేకాన్ని ఆహ్వానిస్తున్న అలాంటి ప్రశాంత వాతావరణంలో అన్ని అర్హతలూ ఉన్న తనకు జరిగే పట్టాభిషేకాన్ని తిరస్కరించటం లోకజ్ఞానం లేని వీరిలాంటి దద్దమ్మలు మాత్రమే చేస్తారు!యెప్పుడయితే రాముడు కైకనుంచి వనవాసం విషయం విన్నాడో వెంటనే మారుమాట్లాడకుండా తనకు తనుగా రాజ్యపరిత్యాగానికీ వనవాసానికీ ఒప్పుకున్నాడని తప్ప మరోవిధంగా మాట్లాడిన శ్లోకాలు యేవీ ఈ కుపండితుడికి అక్కడెక్కడా కనిపించి ఉండవు,యెందుకంటే వాల్మీకి పూర్వాపరాలు ఆలోచించుకునే సన్నివేశ కల్పన చేశాడు గాబట్టి!దశరధుడు నన్ను ఖైదు చేసి నువ్వు రాజువి కమ్మని చెప్పినా ఒప్పుకోకుండా సంతోషంగా వనవాసానికి సిధ్ధమైన వాడిలో ఈయన రాజ్యాభిషేకం కోసం తండ్రితో చాటుగా మంతనాలు జరిపిన దుర్మార్గాన్ని జబర్దస్తుగా చూడగలిగాడు - కేవలం రామలక్ష్మణులు తండ్రిని సేవించుకోవడం ఈయనకి దుర్మార్గంగా కనబడింది - ముప్పాళ రంగనాయకమ్మ అయినా ఈ పాపకార్యం చేసిందో లేదో గానీ ఆదికవి మీద గౌరవమున్నదంటున్న వాచస్పతి గారు మాత్రం నిస్సంకోశంగా చేసేశారు!కైక వ్యతిరేకిస్తున్నదని అప్పటికి తెలియనే తెలియదు గదా దశరధుడికైనా!అంతకు ముందెన్నడూ రామలక్ష్మణులు తండ్రిని సేవించుకున్న సందర్భాలు లేవని ఈ పండితుడు చెప్పగలడా, బహుశా వాల్మీకి ఉన్నాయని రాయలేదు గాబట్టి ఈయనకి అది దురుద్దేశంగా అర్ధమై ఉంటుంది కాబోలు - వారెవా యేమి పాండిత్యమండీ మీది వాచస్పతి గారూ?!వాల్మీకి బలమైన సాక్ష్యంగా చూపించిన వాట్ని కావాలనే వొదిలేస్తారు,రాయని వాట్ని కూడా స్వకపోల కల్పనలతో రాసినట్టుగా భ్రమింప జేస్తారు - ఈయనకీ ఈయన తండ్రిగారికి లాగే యెవరయినా బిరుదులూ అవీ ఇచ్చి సత్కరించారా లేదా?రామకధని అట్లా రాయమని వాల్మీకికి చెవిలో చెప్పిన వాడు నారదుడు కాదేమో - కొంపదీసి ఈయన కాదు గదా?త్రిశతాధిక ఆలయాలు నిర్మించిన తండ్రిగారికి కనకాభిషేకం చేస్తే ఈయనకి కనీసం గజారోహణ అయినా చేయించి ఉండాల్సింది - అడ్డెడ్డెడ్డే!

     రాముడిలో తప్పులు పట్టటానికి ఈయనగారు యెంతకి దిగజారాడో తల్చుకుంటే ఇతనసలు మనిషా పశువా నోటికి తింటున్నది అన్నమా గడ్డా మరొకటా అన్నంత కంపరమేస్తుంది నాకు!భరతుడు తనని వెనక్కి పిలవటానికి వచ్చే సమయానికి రూరంగా సైన్యాల ధూళి కనిపించేటప్పటికి సీతతో మాంసం వొరుగులు తింటూ ఉండి తీరా భరతుడు వచ్చే సమయానికి అవన్నీ శుభ్రం చేసి కృష్ణాజినం పరుచుకుని కూర్చోవడం నటన అనిపించిందట ఈ మర్యాదస్తుడికి!భోజనం చేస్తుండగా ఇంటికి అతిధులు వస్తే యెంగిలి చేత్తోనే పిలిచి భోజనాల బల్ల మీదే కూలేసి కబుర్లు చెప్తాడు గావును ఈ ప్రబుధ్ధుడు,సిగ్గు లేకపోతే సరి?!భరతుడు ఒక్కడే వస్తున్నాడా పోన్లే వచ్చేది తమ్ముడే గదా యెట్లా ఉంటేనేం అనుకోవటానికి, ససైన్య సపరివార సమేతంగా వస్తున్నాడు!సందేహం లేదు,నేను మొదటి భాగంలో చెప్పిన రామాయణం చదవగూడని వాళ్ళ లిస్టులో ఉన్న ఒక త్రాష్ఠుడికి పొరపాటున సంస్కృతం చదవడం వచ్చింది - అది మన ప్రారబ్ధం!అయినా మాంసం తినడం గురించి ఈయనే కాదు చాలామంది చాలా క్రూరంగా ఆడిపోసుకుంటున్నారు యెందుకనో? బ్రాహ్మలు తింటే తప్పుగానీ రాజుగారబ్బాయి మాంసం తింటే తప్పేమిటి?తనే మాటిమాటికీ కందమూలాలు తింటానని చెప్పివున్నా అది అంత గట్టిగా పట్టించుకోవలసిన విషయం కాదే!కైకకి కావలసినదేమిటి?భరతుడి పట్టాభిషేకం మొదలయ్యేటప్పటికి రాముడు రాజ్యానికి దూరంగా ఉండటం,అదీ పేరుకి వనవాసం అని చెప్పి అయోధ్య చుట్టుపక్కల ఉన్న యే కారడవిలోనో కాపరముండి అయోధ్యనుంచి అన్నీ తెప్పించుకుంటూ గడపటం కాకుండా పూర్తిగా అయోధ్యకీ రాజభోగాలకీ దూరంగా వుండటం,అవునా కాదా?యెదటివాడికి ఇస్తానని వాగ్దానం చేసి ఇవ్వకపోవడమే అసత్యదోషం!సజ్జనుణ్ణి బాధ పెడితేనే హింస!దుర్జనుణ్ణి బాధ పెడితే శిక్ష!యెదటివాళ్ళను తరతమ భెదాలు లేకుండా చూడటం సమదృష్టి!నీతి విషయంలో పెద్దలు యే సూత్రాలు చెప్పినా యెదటివాళ్ళతో వ్యవహరించాల్సిన సందర్భంలో చెయ్యాల్సినట్టుగానే చెప్పారు తప్ప అలవాట్ల విషయంలోనూ తిండి తిప్పల విషయంలోనూ బొక్కలు వెదకటం కుసంస్కారులు మాత్రమే చేస్తారు!

     ఇంకా రాముడు కూడా మానవసహజమైన ఉద్రేకాలు ఉన్నవాడే అని చెప్పడానికి తల్లి కౌసల్యకి ఆనందం కలిగించలేకపోయాను గదా అని తల్లిని తల్చుకుని బాధపడటంలో కూడా ఈ పండితుడు భయంకరమైన దుర్మార్గాన్ని కనిపెట్టేశాడు?రాముడు తండ్రి దశరధుడితో యెంత కఠినంగా మాట్లాడాడు!కైకకి యెక్కువ ప్రాముఖ్యత నిచ్చి తన తల్లికి కష్టం కలిగించడాన్ని అక్కడే చెప్పి నేను లేను గదా అని ఇప్పుడు ఆమెకి అవమానం జరిగిందో ఖబడ్దార్ అని హెచ్చరించాడని అక్కడ ఉందా లేదా?తనేమన్నా నాకు పట్టుపరుపుల్లేక ఇబ్బందిగా ఉందని యేడ్చాడా?రాముడు వచ్చేశాక కౌసల్య పరిస్థితి అట్లాగే ఉంది కదా!రెండు రోజులు కుటుంబాన్ని వొదిలి కొత్తవూరు వెళ్తే ఇంటి దగ్గిర వాళ్ళు యెట్లా ఉన్నారో అని అనుకునే సన్నివేశం ఈ కఠీనపు మందకు యేనాడూ అనుభవంలోకి రానే లేదా?

     రెండోసారి పట్టాభిషిక్తుడై 11,000యేళ్ళు రాజ్యం చేసిన రాముడు 14 యేళ్ళు వనవాసం చెయ్యడం పెద్ద త్యాగమా అని వెక్కిరించే ఈ పండితుడి గురించి పీఠికాకర్త గారు "ఇంతటి మహత్తరమైన గ్రంధాన్ని రచించడానికి మిత్రులు వాచస్పతి గారు అష్టాదశ పురాణాలు,దేవీ భాగవతంలాంటి గ్రంధాలు,రామ రహస్యోపనిషత్తులాంటి అనేక ఉపనిషత్తులు,భారతం,టిబెట్ లోని రామకధ,రామ చరిత మానస్,అగస్త్య,భాస్కర,రంగనాధ రామాయణాలు,కంబళ,ఆధ్యాత్మ,అధ్భుత,ఆనంద రామాయణాలు.ఇంకా యెన్నెన్నో గ్రంధాలను క్షోదక్రమంగా పరిశీలించారు.ఆయన చేసిన విశేషమైన కృషి ఈ గ్రంధరూపంలో లభించింది.వాల్మీకి రామాయణంలోని సత్యమైన అంశాలను వెలికితీసి ఆంధ్ర పాఠకులకు మహోపకారం చేశారు" అని పొగడటం చూస్తుంటే పాటకి నేను ఆటకి మా అక్క అన్న సామెత గుర్తుకొస్తుంది!యెందుకంటే భారతీయుల కాలగణంలో 7 రకాల పధ్దతులు ఉన్నాయి,ఒక్కో సందర్భంలో ఒక్కో పధ్ధతిని ఉపయోగించి వర్ణించినా వాటిలో ఒక రకమైన యేకసూత్రత ఉంటుంది!జంటగా కలిసి వచ్చే ప్రతి కాల విశేషాన్నీ యుగం అనవచ్చు.ఒక రాత్రి ఒక పగలు కల్సిన అహోరాత్రము కూడా యుగమే అవుతుంది!"అహోరేవ సంవత్సర" కాలం లెక్క భారతంలో కూడా వస్తుంది.Bheema to Yudhishtira:-O Bharata, it is, also said by those versed in morality that one day and night is, O great prince, equal unto a full year. The Veda text also, exalted one, is often heard, signifying that a year is equivalent to a day when passed in the observance of certain difficult vows. O thou of unfading glory, if the Vedas are an authority with thee, regard thou the period of a day and something more as the equivalent of thirteen years.------Mahabharata-3-49 ఇంకోరకంగా కూడా దినమూ సమత్సరమూ అనే రెండింటినీ ఒక్కటిగానే వ్యవహరించవచ్చును.ఇవ్వాళ సుఖంగా నిద్రించినవాడు రేపటికి సజీవంగా ఉంటాడని ఖచ్చితంగా చెప్పలేము గదా!అలాంటప్పుడు ఒక సూర్యాస్తమయాన్ని చూసి నిద్రించి మరుసటి సూర్యోదయాన్ని చూడటాన్ని కూడా ఒక సంవత్సరం గతించి మరొక సవత్సరాన్ని చూడటంగా కూడా లెక్క్కించవచ్చు.ఈ లెక్క ప్రకారం 11,000 సంవత్సరాల పరిపాలన 31 సంవత్సరాలతో సరిపోలుతుంది,ఈ భారతీయ కాలగణనం అనే మామూలు విషయం కూడా తెలియకుండా బౌధ్ధ సాహిత్యం జైన సాహిత్యం లాంటివి యెన్ని చదివి యేమి ప్రయోజనం?జీవన కాలాన్ని మామూలు సంవత్సరాలలో చెప్పడమూ రాజ్యపాలనని అహోరేవ సంవత్సరాలలో చెప్పడమూ చాలా చోట్ల కనిపిస్తుంది గదా,ఈయన కెందుకు తెలియలేదో!

    *వాల్మీకి రామాయణాన్ని యేకపక్షంగా రచించాడు*రాముడు తాటకను వధించడం న్యాయం కాదు*వనాలలో కందమూలాలు భుజిస్తూ ఋషిలా సంచరిస్తానని ప్రతిజ్ఞ చేసిన రాముడు మృగాలను చంపి మాంసభక్షణ చేశాడు*రాముడు బ్రాహ్మణుల,ఋషుల మాటలు విని ధర్మాధర్మ విచక్షణ లేకుండా ప్రవర్తించాడు*శ్రీరాముడు సీతను భోగవస్తువుగ భావించాడు అని వాదించే పండితుడు తనకి వాల్మీకి పట్ల గౌరవం ఉందనటం కావ్యం పేరు సౌరభాలు అని పెట్టటం చదువరులను మోసం చెయ్యటం కాదా?వికృత పాండిత్యంతో తప్పులు పట్టే కావ్యానికి సౌరభాలు అని పెట్టటం తమరు వెధవలుంగారు అనటం లాంటిది కాదా!శూర్పణఖ ఒక్కసారి చూసీ చూడగానే కంటికి నచ్చాడన్న కారణం తప్ప పరిచయం గానీ కొద్ది కాలపు స్నేహం గానీ యేమీ లేకపోయినా సరే "నేను శూర్పణఖ యను రాక్షసిని,కామరూపిణిని,సర్వభయంకరనై ఈ వనమున ఒంటరిగా తిరుగుచుందును.నా అన్న రావణుడు రాక్షసులకు రాజు - విశ్రవసుని పుత్రుడు,బలవంతుడు - నీవతని పేరును వినియుండవచ్చును.రామా!నిన్ను చూచి నావారి నందరిని వదలి నిన్ను భర్తగా పొందవలయునని నీకడకు వచ్చితిని.నీవు నాకు చిరకాలము భర్తవు కమ్ము." అని యెంత అహంకారంగా రారమ్మని పిలిచినా అది అడిగిన తీరుకి కాలగూడని చోట కాలినా సరే కంట్రోల్ చేసుకోవాలే తప్ప అట్లా వెక్కిరించకూడదనీ తింగరి నీతులు చెప్తూ రాముడు దుర్మార్గుడనీ కేవలం మర్యాదగా అడగటం అన్న ఒకే ఒక్క కారణంతో శూర్పణఖ వంచనకి గురయిన పవిత్ర ప్రేమికురాలనీ అంటున్న వాళ్ళంతా మరునిముషమే లక్ష్మణుడి వెంట పడటం గురించి యేమి చెప్పి సమర్ధిస్తారు?శూర్పణఖని విరూపిని గావించిన రాముడి కన్నా సీతని గౌరవంగా చూసిన రావణుడు మంచివాడని నిరూపించడానికి ఇన్ని కష్టాలు పడి ఈయనగారు రామాయణం చదివి యేమి నేర్చుకోమంటున్నాడు?అటు వైపు నుంచి తన కోరిక తీరాల్సి ఉంది గాబట్టి రావణుడు సీతతో వ్యవహరించినంత మర్యాదగా వ్యవహరిస్తే చాలు యెత్తుకెళ్ళబడిన ఆడవాళ్ళు రావణుడి లాంటి మంచి వాడైన తనని అపహరించిన వ్యక్తితో స్వర్గసుఖాలు అనుభవించవచ్చు అని చెప్పడమే కదా!రావణుడు "కనిపించిన ఆడదాన్ని యెత్తుకొచ్చెయ్యడం రాక్షస ధర్మం కాబట్టి నేను చేసింది అధర్మం కాదు" అని తను చేసిన తప్పుడుపనిని సమర్ధించుకోవడానికి చెప్పిన పిడివాదన కూడా ఈ పండిత్యుల వారి దృష్టిలో ధర్మమే అయితే యెవడయినా సరే "నేను రావణ ధర్మాన్ని పాటిస్తున్నాను" అనేస్తే చాలు గదా ఇంకోడి పెళ్ళాన్ని కిడ్నాప్ చెయ్యడం కూడా ధర్మమే అయిపోతుంది ఇవ్వాళ గూడా,యేం అవదా?

     ఈ పండితుడు వాల్మీకి ధర్మాత్ములని చెప్పిన వాళ్ళని అధర్మపరులుగా నిరూపించాలని చేస్తున్న వాదనల్ని చదువుతుంటే అసలు ఇతను రామాయణం పూర్తిగా చదివాడా లేదా అనేది అర్ధం కావడం లేదు?సుగ్రీవుడు వాలి చచ్చినప్పుడు యేడుస్తూ అన్నవీ విభీషణుడు రావణుడు చచ్చాక అపరకర్మల నాడు అన్నవీ పట్టుకుని చూశారా చూశారా ఈ పాపాత్ములు యెంతటి ధర్మాత్ముల్ని వాళ్ళని పాదాక్రాంతం చేసుకోవాలని కుట్ర పన్నుతున్న ఆర్యరాజైన రాముడి లాంటి దుర్మార్గుడైన త్రువు పంచన జేరి చంపించి తమ స్వతంత్ర రాజ్యాల్ని ఇక్ష్వాకు రాజులకి సామంతరాజ్యాలుగా చేశారో చూడండి అని స్వయముగ బ్రాహ్మణులై సర్వధర్మసమభావనతో పరిపాలించి సనాతన ధర్మం దక్షిణాదిన కూడా వ్యాపింపజేసిన ఆంధ్ర శాతవాహనుల పరిపాలన మొత్తం భరతఖండపు పజల్ని యేకతా భావనతో కలిపివేసిన ఇన్ని సహస్రాబ్దాల తర్వాత ఇవ్వాళ ఆర్య-ద్రావిడ,ఉత్తర-దక్షిణ మొదలైన సంకుచిత భావాల్ని రామాయణ పాత్రలకి పులమడమనే నికృష్టానికి సైతం తెగబడి అన్నా నేను చెప్పేది వినమని బతిమిలాడుతున్నా వినకుండా తన్ని తగలేసి ఆ తమ్ముడి భార్యని పక్కలోకి లాగేసి తమ్ముణ్ణి తన్నమని జనాల్ని ఉసిగొలిపి ప్రపంచం నలుమూలల్నీ తిప్పించిన వాణ్ణీ కేవలం నువ్వు చేస్తున్నది తప్పు మరోసారి ఆలోచించు అని చెప్పినందుకే గుండెల మీద యెగిరి తన్నిన వాణ్ణీ పొగుడుతున్నాడు ఈ ధర్మతత్వకోవిదుడు!విభీషణుడు చిన్నవాడు గాబట్టి నెమ్మదిగా చెప్పినదాన్నే నిద్రలేచిన కుంభకర్ణుడు చావుతిట్లు తిడుతూ చెప్పిన సన్నివేశం ఇతడు చదవలేదా,చదివినా అర్ధం కాలేదా,తనకి అర్ధమయినా మిగతావాళ్ళకి సంస్కృతం యేమొచ్చి చస్తుంది లెమ్మన్న తెంపరితనంతో పట్టించుకోకుండా వొదిలేశాడా అంత ముఖ్యమయిన సన్నివేశాల్ని!ఇవ్వాళ మన బంధువుల్లోనే మనకి తీరని ద్రోహం చేసి పెళ్ళిళ్ళలో కలిసినా పలకరింపులు లేనివాళ్ళలో యెవడయినా చనిపోతే ఖర్మకాలి దినకర్మలకి వెళ్ళాల్సి వస్తే ముఖప్రీతి కోసం నాలుగు మంచిమాటలు మాట్లాడినంత మాత్రాన అవి మనం నిజాయితీగా చెప్పిన మాటలుగా లెక్కవెయ్యాలా?అలా లెక్కిస్తే అంత మంచివాడి మీద అలిగిన మనమే అధములమౌతాం గదా?

     వాల్మీకి నాటకీయత కోసం కధలో అంత ప్రాధాన్యత లేకపోయినా రచనా చమత్కృతి కోసం చెప్పిన విషయాల్ని కూడా ఆర్య-ద్రావిడ పైత్యకారి తనానికి చిహ్నంగా ఒకటికి పది కల్పనలు చేర్చి రాముడనే ఆర్యజాతికి చెందిన సామ్రాజ్యవాది ద్రవిడ రాజ్యాలని ఆక్రమించడం కోసం నాటకాలాడి తన పట్టాభిషేకాన్ని తనే తప్పించుకుని అవుల కొచ్చి యెప్పుడో చిన్నప్పుడు తన తాతల్ని చంపిన రావణుడి మీద పగ దీర్చుకోవాలనే ఉద్దేశంతో రావణుడి కిష్టం లేని పన్లు చేస్తూ బరితెగించి తిరుగుతున్న ఆర్య ఋషుల దగ్గిర ఆయుధాలు తీసుకుని విద్యలు నేర్చుకుని అవకాశం కోసం యెదురు చూస్తూ అమాయకురాలైన శూర్పణఖని విరూపని చేసి రావణుణ్ణి రెచ్చగొట్టి తనున్న చోటుకే కలుగులో యెలక మాదిరి రప్పించుకుని చంపాలని వ్యూహం పన్ని రివర్సు గేరులో ధర్మాత్ముదైన ద్రవిడ రాజ్యాధిపతి రావణుడు తన భార్యనే యెత్తుకెళ్ళి పోతే జాతి ద్రోహులైన సుగ్రీవ విభీషణాదుల్తో కపటవ్యూహాలు పన్ని తన రక్తదాహాన్ని తీర్చుకున్నట్టుగా యెన్నెన్ని పులుముడు సిధ్ధాంతాలు ప్రతిపాదించాడో ఈ చెత్తస్పతి?!

     ఇప్పటికీ సాంప్రదాయాన్ని ప్రేమించే వాళ్ళు బిడ్డ పుట్టిన దగ్గిర్నుంచీ అన్నప్రాశన,అక్షరాభ్యాసం,ఉపవీత ధారణం,వివాహం లాంటి ప్రతిదానికీ ముహూర్తాలు చూస్తారు గదా - సరిగ్గా అదే రకం సంవిధానంతో వాల్మీకి ఒక తమాషా చేశాడు!ప్రతి ముఖ్య సన్నివేశంలోనూ అది జరుగుతున్నప్పుడు గ్రహతారకల స్థితిగతుల్ని వర్ణించాడు.అయితే ఈ మధ్యకాలం వరకూ దాని ప్రాధాన్యత యేమిటో యెవరికీ స్పష్టంగా తెలియలేదు.మన పూర్వీకుల కాలగణనం అమోఘమైనది - కాలాన్ని తిధుల ద్వారా వర్ణించే వాళ్ళు అంటే ఆ సమయంలొ చంద్రుడు యే నక్షత్రంతో ఒక రేఖ మీదకి వచ్చి ఆ తారని కూడినట్టుగా కనిపిస్తాడో ఆ వివరాల్ని బట్టి దిన,వార,పక్ష,మాసాది విభజన చాలా నిక్కచ్చిగా చేశారు!మనం గనక ఒక గ్రహతారకల కూర్పుని చెప్తే కొన్ని వేల సంవత్సతాలకి మాత్రమే ఆ అమరిక మళ్ళీ వస్తుంది కాబట్టి ఆ తిధి యొక్క దిన,వార,పక్ష,మాసాది వివరణ లన్నిట్నీ ఖచ్చితంగా లెక్కించి చెప్పవచ్చును!కానీ మన పైత్యకారులు మనవాళ్ళు చెప్తే నమ్మరు గదా,వీళ్ళు నమ్మే ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఆధారంతోనే వాల్మీకి వర్ణించిన తిధులు యే సంవత్సరంలో యే నేలలో యే రోజున వస్తాయో పరిశీలించి చూస్తే అవి ఒక సగటు మనిషి జీవిత కాలం పరిధిలోనే వాటి మధ్య ఉన్న కాలావధులు కూడా సరిపోటంత నిక్కచ్చిగా ఉన్నాయి!

     "ప్లానెటోరియం" అనే ఈ ఆధునిక విజ్ఞాన శాస్త్రపు ఆవిష్కరణకి డా.పి.వి.వర్తక్ మహాశయులు ఆ తిధుల వివరాల్ని యెక్కించి విశ్లేషించగా ఆ వివరాలు ఇలా ఉన్నాయి:రాముడి జన్మ తిధి క్రీ.పూ 7323 డిసెంబర్ 4,వివాహ తిధి క్రీ.పూ 7307 ఏప్రిల్ 7,వనవాసారంభ తిధి క్రీ.పూ 7306 నవంబర్ 29,హనుమంతుని లంకాప్రవేశ తిధి క్రీ.పూ 7292 సెప్టెంబర్ 1,సీతా సందర్సన తిధి క్రీ.పూ 7292 సెప్టెంబర్ 2,సేతు నిర్మాణ కాలం క్రీ.పూ 7292 అక్టోబర్ 26-30,రామరావసమరప్రారంభ తిధి క్రీ.పూ 7292 నవంబర్ 3,కుంభకర్ణ హననం క్రీ.పూ 7292 నవంబర్ 7,రావ నిర్యాణ తిధి క్రీ.పూ 7292 నవంబర్ 15,సీతా లక్ష్మ సమేతుడై శ్రీరాముడు అయోధ్యా నగర ప్రవేశం చేసిన తిధి క్రీ.పూ 7292 డిసెంబర్ 6 అని ఆధారాలతో సహా తేల్చి చెప్పారు తన "వాస్తవ్ రామాయణ్" గ్రంధంలో!మరి ఈ పండితుడు చెప్పినట్టు అయోధ్యలోనే రావణుడి మీద పగ పెంచుకుని రావణుడ్ని జయించే ఉద్దేశం తోనే శూర్పఖని విరూపం చెయ్యడం అనే వాదన నిలబడాలంటే వనవాసం మొదట్లోనే యెకాయెకిన పంచవటి యెక్కడుందో వెతుక్కుని అక్కడికే వెళ్ళేవాడు గదా!నేను హిందూ ధర్మ ప్రహేళికలు-రామకధా విశ్లేషణంలో చెప్పినట్టు శూర్పణకని విరూపం చెయ్యడం అనేది పదమూడేళ్ళు అక్కడా ఇక్కడా ఆశ్రమాలు కట్టుకుని బతుకుతూ గడిపాక ఇంకొక్క సంవత్సరంలో వనవాసం ముగిసిపోతుందనగా జరిగింది,ముందుగానే కారణం కోసం వెతుకుతూ రావణుడి మీద పగతో రగిలిపోతున్న వాడయితే అంతకాలం యెందుకు పంచవటికి దూరంగా ఉన్నాడనే దానికి యేమి సబబయిన కారణం చూపించగలరు ఈ ఆర్య-ద్రావిడ కుట్ర సిధ్ధాంతులు?ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రాచీన భారత విజ్ఞానాన్ని యదార్ధం అని నిరూపించే రోజొకటి వస్తుందని వూహించి ఉండరు ఈదేశంలోయేముంది గాళ్ళు?

     విశ్వనాధ సత్యనారాయణ లాంటివాళ్ళు వ్యాసుడు యుధ్ధ కాండలో గ్రహస్థితి గురించి చెప్పిన విషయాలని బట్టి లెక్కించి చెప్తే ఈ పిచ్చోడు ఇట్లాగే చెప్తాడని అవహేళన చేశారు!ఇవ్వాళ కృష్ణుడు నివసించిన ద్వారక అవశేషాలు కార్బన్ డేటింగ్ వివరాలతో సహా బయటపడుతుంటే ఆ కాలమూ గ్రహతారకల స్థితుల్ని బట్టి లెక్కించిన కాలమూ సరిపోతుంటే మాట పెగలడం లేదు,బహుశా యెక్కడయినా బొక్కలు దొరుకుతాయేమో అని ఆత్రంగా యెదురు చూస్తున్నట్టున్నారు - వీటిల్లో బొక్కలు వెతికితే తాము భారతీయ విజ్ఞాన శాస్త్రం కన్నా ఘొప్పదని పొగుడుకుంటున్న తమ మానసాంతర్గతప్రభువులైన అమెరికా వారి సంస్కృతిని కించపరిచినట్టవుతుందేమో నన్న భయం వల్ల కూడా గట్టిగా విమర్శించడానికి సాహసించలేకపోతున్నారు కాబోలు, యేమి ఇరకాటం?పండితులు - తప్పు తప్పు, ఆమాట అనగానే ఈ కుపండితుడి లాంటివాళ్ళు గుర్తుకొస్తారేమో,క్నాదు క్నాదు - నిజమైన పాండిత్యం ఉన్నవాళ్ళు మహాభారతాన్ని ఇతిహాసం గానూ రామాయణాన్ని కావ్యంగానూ గుర్తించారు.యెందుకంటే రామాయణంలో ఉన్న "నదీనాం పుష్పోడు వహవాం","క్వచిద్ వేణీకృత జలాం" వంటి భాగాలలో నభూతో నభవిష్యతి అనిపించే విధంగా విస్తరించిన కవితా సౌరభం భారతంలో తక్కువ.భారతం చరిత్ర పాఠం చదివినట్టు ఉంటుంది - ఆసక్తి గలవాడు మాత్రమే ఓపిక చేసుకుని చదవగలడు,లేని పక్షంలో మంచి వ్యాఖ్యాత యెవరయినా చెప్పగా వినాలి!రామాయణం అట్లా కాకుండా కవిత్వం తేనెలూరుతున్నట్టు ఉంటుంది - ఉదాహరణకి నది ఒడ్డున పెరిగిన పూలచెట్టు నుంచి పూలు రాలిపడి ప్రవాహానికి కొట్టుకుపోతుంటే చూడగానే యేమీ అనిపించదు,కానీ వాల్మీకి కవిత "నదీసుందరి కొప్పులో పూలు ముడుచుకుని నడుచుకుంటూ వెళ్తున్నట్టు ఉంది" అనే భాగం చదివాక అదే దృశ్యం కొత్తగా కనిపిస్తుంది,అవునా!నాకు భారతం మొదట గ్రంధస్తం అయితే అందులోని అరణ్యకాండలో వచ్చే కధామూలాన్ని చూసి వాల్మీకి రామాయణం రాశాడని - యెవరో అట్లా వ్యాఖ్యానించినట్టు గుర్తు - అనిపిస్తున్నది.ఈ మధ్యనే కొందరు మిత్రులు కాదంటున్నారు.రచనాకాలం యేది ముందయినా కవితా విశేషాల్ని బట్టి చూస్తే మాత్రం రామాయణమే ఆదికావ్యం - నిస్సందేహంగా!తొలిసారి ఒక కొత్త ప్రక్రియని తీసుకుని ఆ మొదటి ప్రయత్నంలోనే అంత గొప్పగా ప్రకాశించడం ప్రపంచ సాహిత్యంలోనే అపూర్వం కదా?

     సూర్యవంశపు రాజులలో 67వ వాడైన రాముని గురించి తవ్వకాల ద్వారానూ మరే విధంగానూ సాక్ష్యాధారాలు లభించకపోయినా వాల్మీకి రామాయణంలోని కొన్ని అంశాలు రాముడు కల్పిత పాత్ర కాదనీ రక్తమాంసాలతో ఈ భూమి మీద నడయాడి కొన్ని ఘనకార్యాల్ని చేసి సాటివారిచే దైవాంశ సంభూతుడిగా కీర్తించబడిన విశేషమానవుడని భావించడం పూర్తిగా అసత్యం కాదని భావించేటందుకు దోహదం చేస్తున్నాయి!అసలు రామకధ మొదలవడమే వాల్మీకి నారదుడికి తను ఒక ఆదర్శమానవుణ్ణి నాయకుడ్ని చేసి కధ రాయాలనుకుంటున్నట్టు చెప్పి అటువంటివాడు ఇదివరకే యెవరయినా ఉన్నారా అని అడిగితే నారదుడు కొత్తగా కల్పించడం దేనికి అటువంటివాడు ఉన్నాడు అతని కధనే రాయవచ్చు కదా అనడంతో మొదలవుతుంది కదా!

     రామాయణంలో ప్రస్తావించబడిన ప్రతి నగరమూ జనపదమూ ఈరోజుకి గూడా అక్కడ రాముడు సంచరించాడని చెప్పేటందుకు కధలోని సన్నివేశంతో గల అనుబంధానికి ఒక ఆలయమో చిహ్నమో కలిగి వుండి కనబడుతున్నాయి.వాల్మీకి వాటి గురించి వర్ణించిన స్థల-కాల-దూర సంబంధాలు అన్నీ వాల్మీకి వర్ణించిన విధంగానే ఉన్నాయి.కధ అయోధ్యలో మొదలవుతుంది.రాముని తల్లి కౌసల్య ఇప్పటి చత్తిస్ ఘడ్ ప్రాంతంతో సరిపోలుతున్న కోసల రాజ్యం నుంచి వచ్చింది.సుమిత్ర వచ్చిన మగధ బీహారులో ఉంది.కైక వచ్చిన కేకయ రాజ్యం ఇప్పటి వజీరిస్థాన్ అవుతున్నది.సీత జన్మించిన మిధిల ఇప్పటి నేపాల్ రాష్ట్రంలో ఉంది.సీత భూమి నుంచి బయల్పడిన సీతామర్హి అనే ప్రాంతం స్మారకచిహ్నంగా కూడా ఉంది.వనవాస కాలంలో రాముడూ సీతా నడయాడిన చోటులన్నీ అడుగుజాడలుగా నేటికీ కనబడుతూనే ఉన్నాయి - ఈనాటికీ వాల్మీకి వర్ణించినంత నిర్దుష్టమైన స్థల-కాల-దూర విశేషాలన్నింటితో సజీవసాక్ష్యాలుగా నిలబడుతూనే ఉన్నాయి!ఇదిగో ఇక్కడ ఇలా:
ఇప్పటికి దొరికిన చారిత్రకాధారలతో వాల్మీకి క్రీ.పూ 4వ శతాబ్దికి చెందిన శుంగ వంశపు రాజైన పుష్యమిత్రుడి కాలం లోని వాడైతే ఈ స్థల-కాల-సంబంధాలన్నీ నిజం కావాలంటే రెండే రెండు విధాలైన కారణాలు ఉన్నాయి.మొదటి వూహగా ఆయా స్థలాల్లో ఆ వెనుకటి కాలంలో సంచరించిన ఆ విశేషమానవుణ్ణే వాల్మీకి రామాయణ కావ్యంలో నాయకుడిగా నిలబెట్టాడని ఒప్పుకోవాలి.రెండవదిగా  వాల్మీకి చాలా తెలివిగా తను దేశమంతా తిరిగి చూసిన స్థలాలని రాముడు తిరిగిన స్థలాలుగా చెప్పి ఒక కల్పిత కధని వాటి వాస్తవికత చాటున తన కధకి ప్రామాణికతని కల్పించుకోవటం అనే సిధ్ధాంతం!కానీ ఒక మనిషి కొందర్ని కొంతకాలం మాత్రమే మోసం చెయ్యగలడనేది వాల్మీకి పట్ల గూడా నిజమే కావాలి గదా.మనుషులు పూనుకుని చెయ్యాల్సిన యే వ్యవస్థీకృతమైన శ్రమా లేకుండా అట్లాంటి పనులు సాధ్యం కావు!ఆయా ప్రాంతాలు యెప్పటి నుంచీ రాముడితో అనుబంధాన్ని కలిగి ఉన్నాయి అనేది పరిశోధిస్తే యదార్ధం తెలుసుకోవచ్చు.ఈ రెంటిలో యేది నిజమైనా అది వాల్మీకి అత్యధ్భుతమైన ప్రతిభని నిరూపించినట్టే అవుతుంది!

     అసలు రామాయణం రాముడి కధ కాదు - సీత అనే రామ యొక్క కధ! రాముడిలో తప్పులు పట్టిన ఈ కుపండితులతో సహా అందరూ సీతలోనూ హనుమంతుడిలోనూ తప్పులు పట్టలేకపోవడానికి కారణ మేమిటి?రాముడు దేవుడు కాదు, దైవసంస్పర్శ కోసం తపించే మానవుడు - అతడు తప్పులు చెయ్యటం సహజం,ఆ తప్పుల్ని సరిదిద్దటం ఆచార్య లక్షణం,ఆ సాధకుడి పట్ల కరుణతో అతని వెంటే ఉండి అతన్ని ఆపదల నుంచి రక్షించడం దైవప్రకృతి - కాబట్టి ఆదికవి వాల్మీకి వాళ్ళిద్దరినీ లోపరహితులుగా చూపించి రాముడిలో కొన్ని మానవసహజ దౌర్బల్యాల్ని చూపించటం జరిగింది!సీత ఆఖరిలో రాముణ్ణి చేరకుండా భూప్రవేశం చెయ్యడం రాముని పట్ల తిరస్కారంగా వ్యాఖ్యానం చేసే మందబుద్ధులు వనవాసానికి సీతని రావద్దన్న సందర్భంలో నపుంసకత్వం గురించి కూడా ప్రస్తావించి తన మాట నెగ్గించుకునే సందర్భంలోనూ,రాక్షసుల పట్ల వైరము లేని హింస గురించి ధర్మసూక్ష్మం చెప్పేటప్పుడూ,శీలపరీక్షా సన్నివేశంలో పామరుడిలాగా మాట్లాడుతున్నావు అని ధిక్కరించి మాట్లాడినపుడూ రాముడి కన్నా అధికురాలిగానే కనబడిందనేది మర్చిపోతున్నారు!రాముడు నన్ను అడవులకి పంపించి నాకు అన్యాయం చేశాడని సీత వీళ్ళతో చెప్పుకుని యేడ్చిందా -  సీతకి లేని యేడుపు వీళ్ళ కెందుకో మరి కందకి లేని దురద లాగ?జనకరాజ నందన అయిన సీతకి వీరందరి కన్నా రాజధర్మం యెంత కష్టమో తెలుసు,పదిసార్లు అట్లా జరిగినా పదిసార్లూ రాముడు అట్లాగే తనని పరిత్యజిస్తానీ తెలుసు,అందులోని ధర్మసూక్షం కూడా తెలుసు - రాముడు చేసింది ధర్మమేనని సీతకీ తెలుసు గనకనే ఒక్క మాట కూడా మాట్లాడ లేదు - సీతాయాః చరితం మహత్!అవతార పరిసమాప్తికి కాలం సమీపించిందని సూచన ఇవ్వటానికి తను ముందుగా మాతృగృహం చేరింది.

     సీత భూగహ్వరం చేరిన తర్వాత కూడా యెందుకో రాముడింకా అయోధ్యని వీడి వైకుంఠాన్ని చేరే ఆలోచన చెయ్యకపోవడంతో దేవతలు యమధర్మరాజుని రాముడితో సంభాషించమని పంపించారు.హనుమంతుడు ఉండగా అతని కిష్టులైన వార్ని యముడు సమీపించలేడనో మరి రాముడికే హనుమంతుడు చూస్తుండగా దేహపరిత్యాగం చెయ్యడం కుదరదని అనిపించిందో తెలియదు గానీ హనుమంతుణ్ణ్ణి అక్కడినుంచి దూరంగా పంపించడానికి ఒక చిత్రమైన సన్నివేశం కల్పించబడింది!రాముడి చేతి ఉంగరం జారిపడి నేలమీద ఉన్న చిన్న కలుగులోకి మాయమవుతుంది.రాముడు అడగ్గా హనుమంతుడు కీటకంలా మారి దానిలోకి దూరి వెళ్ళగా అటువైపున తాను నాగలోకం చేరానని గ్రహిస్తాడు హనుమ!అక్కడ వాసుకి కనిపించి హనుమకి ఒక చోటు చూపించి ఇక్కడ వెదుక్కోమంటే వెళ్ళి చూసిన హనుమ ఆశ్చర్యపోతాడు, ఒకటి కాదు రెండు కాదు అంగుళీయకాల రాశియే కనబడటంతో!వాసుకిని అడిగితే "నాయనా,నువ్విప్పుడు ఈ ఉంగరం తీసుకుని పైకి వెళ్ళేసరికే నువ్వు సేవించిన రాముడు అక్క ఉండు!యే ఉంగరం ఇప్పుడు జారిపడిందో వెతికి తీసుకెళ్ళి ఇచ్చే ఆశ వొదులుకో, కాలాని కొక్కటిగా అవి అలా జారిపడుతూనే ఉంటాయి!" అని చెప్పాడు.అంటే రామ కధ యెప్పటికీ అంతమైపోదు,మళ్ళీ మళ్ళీ నడుస్తూనే ఉంటుంది అని సూచన!నేనంటున్నదీ అదే - ప్రతి మనిషీ మనీషి కావడానికి చేసే ఆధ్యాత్మిక ప్రయాణంలో రామకధ గర్భితమై నడుస్తూనే ఉంటుంది!


నైతికంగా ఉన్నతంగా జీవించాలని ఆశించే ప్రతి మానవుడూ రాముడే!
జై శీరాం!
_______________________________________________________________

13 comments:

  1. ఒకే ఊపులో రాసేరు, చాలా పెద్దదయిపోయింది, బాగుంది

    ReplyDelete
    Replies
    1. ఆఖరి భాగం,ఇంతటితో సమాప్తం!

      Delete

  2. రామాయణం లో రామునికి సీత ఏమవుతుందండీ ??

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఆ రమ్యంగా కుటీరాన వుండి సీత కోసం దుహ్ఖిస్తున్న ఆకుల ధన ఉదయ లక్ష్మి నడగండి చెబుతుంది:-)
      ____/\____

      Delete
  3. @jilebi
    మరో సంగతి,ఆవిణ్ణి అసలు పేరుతోనే సంబోధించండి,యెందుకంటే ఆవిడకి సొంత పేరు ఇష్టం లేదంత,ఆ పేరుతో పిలిచి ఆతపట్టించి మీ సాడిజం మీరు చూపించండి,మర్చిపోరుగా?!

    ReplyDelete
  4. sarigaa chepparu.
    oka china correction. Ravanudu ammaki oka samvatsram gaduvu ichchadu. amdulo padi nelalakaalam ayyaka hanuma sitammani chusaru. imka rendu nelale gaduvu ani sitamma cheppindi hanumayyato.

    14va samvatsaram ayyetappatiki raakapote dehatyagam chestanani bharatudu Sapadham chesadu. kaabatti sitapaharanam 13 years complete avvagane jarigi undali.

    meeru aarunelala vanavasam undaga sitapaharam jarigiundachchu ani rasaru. okasari check chesi maarchagalaru.

    ReplyDelete
    Replies
    1. @manohar
      లేదండీ,రావణుడు ఇచ్చిన గడువు సంవత్సరం కాదని నాకు బాగా గుర్తు!అది హనుమంతుడు చెట్టుకొమ్మల మీద ఉండి వింటున్నప్పుడు జరిగిన సంభాషణ.పైన ఇచ్చిన తిధుల లెక్క చూసినా అప్పట్నించీ రావన సంహారం రెండు మాసాల లోపే జరిగిందని తెలుస్తుంది.రివర్స్ లో వెళ్ళినా అగ్నిప్రవేశం అనంతరం పుష్పకం మీద వెళ్ళటం టైము లేకనే గదా!లక్ష్మణుడు సీతాన్వేషణ నిర్లక్ష్యం చేస్తున్నాడని సుగ్రెవుడి మీదకి వెళ్ళినప్పుడు సుగ్రీవుడు చెప్పింది వర్షాకాలం అవగానే వెదకటం మొదలు పెడతానన్నాడు.సుగ్రీవుడు వర్షాకాలం అయిపోయాక వానరులని ప్రపంచం నలుమూలలకీ పంపించేటప్పుడు కూడా నెలో రెండు నెలలో ఇచ్చి ఆ తరాత ఒక్కరోజు గడిచినా మీకు మరణశిక్ష ఖాయం అని "సుగ్రీఎవాజ్ఞ" వేస్తాడు గదా.ఇవన్నీ లెక్క వేస్తే గడువు సంవత్సరం అనేది కుదరదు,ఆలోచించండి?

      Delete
    2. సుందరకాండ 22వ సర్గ 8వ, 9వ శ్లోకాలు.
      द्वौ मासौ रक्षितव्यौ मे योऽवधिस्ते मया कृतः |
      ततः शयनमारोह मम त्वं वरवर्णिनि || ५-२२-८
      రెండు నెలలు (దవౌ మాసౌ) నీకు నా నుండి రక్షణ ఉంది. అప్పటికి నీవు నా పర్యంకానికి రావాలి.

      ऊर्ध्वं द्वाभ्यां तु मासाभ्यां भर्तारम् मामनिच्चतीम् |
      मम त्वां प्रातराशार्थमालभन्ते महानसे || ५-२२-९
      ఆ రెండు నెలల గడువులో (ద్వాభ్యాంతు మాసాభ్యాం) నీవు నన్ను వరించకపోతే నా వంటింట్లో నిన్ను వండి నాకు ప్రాతఃకాల భోజనంగా సమర్పిస్తారు.

      Delete
    3. పైన వర్తక్ గారు ఇచ్చిన తిధుల లెక్క గూడా సరిపోతున్నది.
      and
      మాయ మొదట దుర్మార్గుడితో వాడి అంతాన్ని వాడి నోటితోనే చెప్పిస్తుంది యెదరున్న సజ్జనులకి చేస్తాననేటట్టు?అప్పుడు హరి రంగంలోకి దిగి వాడు యేదయితే యెదటివాళ్ళకి చేస్తానని విర్రవీగాడో వాడికి దానినే విధిగా చేసి చూపిస్తాడు - హరిమాయ?!

      Delete
    4. సీత లంకలో ఉన్న మొత్తం కాలం పది నెలలు.

      Delete
  5. నైతికంగా ఉన్నతంగా జీవించాలని ఆశించే ప్రతి మానవుడూ రాముడే!

    ఈ ఒక్క మాట చాలదూ?!

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...