Friday, 22 May 2015

తెరాసా కేంద్రంలో భాజపాతో కలిస్తే తెలంగాణకు లాభమేమిటి?

          తెలంగాణా సాధన వల్ల విపరీతంగా లాభపడింది రాష్ట్ర మంత్రివర్గంలో ఒక ముఖ్యమంత్రి మరియూ అతి కీలకమైన మూడు శాఖల్ని దక్కించుకోవడం ద్వారా కేసీఆర్ కుటుంబమే కదా అంటే  అప్పుడే పుట్టిన బుజ్జి పాపాయి కూడా "ఉంగా ఉంగా" భాషలోనే అవునని పిడికిళ్ళు బిగించి మరీ చెప్తాడు కాబట్టి రేపు తెరాసా "మీరు పిలిస్తే చాలు వచ్చి దూకుతాం" అని అంటున్న వుత్తుత్తి కబుర్లకి భాజపా బొక్కబోర్లా పడిపోయి పిల్చినా అప్పుడు కూడా లాభం కేసీఆర్ కుటుంబానికే తప్ప ఇంకెవ్వరికైనా ఉంటుందా?అదీగాక అక్కడ వినపడుతున్న పేరు పొరపాటున కూడా బయటివాళ్ళ పేరు రావడం లేదు కాబట్టి కేసీఆర్ కీ తెలంగాణా కీ అభేదాన్ని పాటించే బానిసాధములు మాత్రం పులకించి పోతారు!ప్రజలందర్నీ తమలాగే మార్చెయ్యగలిగితే అప్పుడు మాత్రమే తెలంగాణా  మొత్తం సంతోషిస్తుంది.

          ఇంతకీ మోదీ గారు పాత వ్యవస్థని రద్దు చేసి నీతి ఆయోగ్ పేరుతో ముఖ్యమంత్రుల్నే భాగస్వాముల్ని చేసి "మీ ప్లానింగ్ మీరే చేసుకోండి,మీ నిధుల్ని మీరే తీసుకెళ్ళండి" అని కొత్తదనాన్ని చూపిస్తున్నప్పటికీ తెరాసా వారు భాజపా పిలవకపోయినా పిలిచినట్టు వూహించుకుని కలవరిస్తూ కేంద్ర మంత్రివర్గంలో చెరడానికి అట్లా వూగుతున్నారంటే దానర్ధం యేమిటి?సలహా ఇచ్చినప్పుడు కాలినా రాధాకృష్ణ చెప్పినట్టు కేంద్రాన్ని కాకా పట్టనిదే బతుకుబండి సాగదని రూఢిగా తెలిసిపోయిందా అప్పుడే!

          యాభయ్యేళ్ళుగా మమ్మల్ని దోచుకున్నారు అనే వాదనతో ఆంధ్రోళ్లని తిడుతూ అసెంబ్లీలో విభజన బిల్లుకి సానుకూలతని పోగొట్టుకుని ఆర్టికిల్ మూడుని  నమ్ముకుని ఆదాయం పెరగడంలో వాటా ఉందని ఒప్పుకుంటూనే ఇన్నాళ్ళూ మమ్మల్ని దోచుకున్నారు గాబట్టీ మా ప్రాంతంలోకి వస్తుంది గాబట్టి ఆదాయమంతా మాకే మీకు చిల్లిగవ్వ కూడా ఇవ్వం అని అంత మంకుపట్టు పట్టడం వల్ల అంతిమంగా విడిపోయాక చూస్తే మాత్రం విడిపోయిన మొదటి సంవత్సరానికి నిలవలో ఉండటం ఒక్కటే వూరటగా అనిపించినా కడలిని మించిన కష్టాలు రాష్ట్రం మొత్తాన్ని కరువుకోరల్లోకి నెట్టెయ్యడానికి చూస్తున్న పరిస్థితి దాపరించింది.

    విడిపోయిన కొద్ది కాలంలోనే చాలా పరిశ్రమలు హైదరాబాదు నగరం నుంచి అంటే తెలంగాణ నుంచి తరలిపోయాయని రూఢిగా తెలుస్తున్నది.ముఖ్యమంత్రుల కొడుకులు కూతుళ్ళ జాతరలు మాత్రం పెరిగినాయి.అమేరికాలోనే కాదు డిల్లీ మొదలు ప్రపంచంలో యెక్కడ చెప్పుకోదగిన స్థాయిలో తెలుగువాళ్ళు ఉన్నా అక్కడికల్లా ఈ జోడు మద్దెల మేళాల మోత తప్పదేమో!ఒకళ్లనొకళ్ళు తెలుగులోనే గదా తిట్టుకుంటున్నాం అనుకుంటే కుదరదు.సౌగతా రాయ్ అనే బెంగాలు పార్లమెంటు సభ్యుడు అప్పుడెప్పుడో తెరాసాకి ఇద్దరే ఇద్దరు సభ్యులు ఉండి అందులో ఒకరు కేసీఆర్ తన సీట్లోనే ఉండగా విజయశాంతి జై తెలంగాణా నినాదాలు చెయ్యడం నుంచి మొదలు పెట్టి పూస గుచ్చినట్టు చెప్పి అందరూ మనల్ని యెంత చక్కగా గమనిస్తున్నారో కళ్ళకి కట్టినట్టు చూపించాడు!ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని తమ రాష్ట్రంలో అడుగుపెట్ట్టనివ్వం అని ఒక తెరాసా మంత్రి అన్నదానికి ఉచితబోడిసలహా కూడా ఇచ్చినట్టు ఉన్నాడు కదా!ఇంగ్లీషు మీడియా అనువదించి ప్రచురిస్తే ప్రపంచమంతా చదువుతారని తెలుసుకోండి - యెకనామిక్ టైంసులో గనక అలాంటి వార్తలు పడితే దాన్ని యెక్కువగా చదివే వ్యాపారస్తులకి అలాంటి ధెరణులు ప్రమాద సూచనగా కనబడి జరిగే హాని అంతా ఇంతా కాదు!

          అటు నవ్యాంధ్ర చూస్తే లోటుతో విడిపోయినా ముఖ్యమంత్రి కంద్రప్రభుత్వంలో భాగస్వామిగా వుండి కేంద్రం నుంచి లభిస్తున్న సహకారం భరోసా ఇవ్వగా ప్రపంచదేశాలన్నీ తిరిగి యం.వో.యు లు కుదుర్చుకుని పెట్టుబడుల పరంగా ధీమాగా వుండి భవిష్యత్తు పట్ల నమ్మకాన్ని కలిగిస్తున్నాడు!ఇటు చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రాష్ట్రం దాటి రెండుసార్లు వెళ్ళి వచ్చినా పుల్లయ్య్య వేమవరం వెళ్ళోచ్చిన చందమే తప్ప నికరలాభం యేదీ రాలేదు?విభజన బిల్లులో ఉన్నవీ లేనివీ మాట్లాడుకుని ఉన్నవాట్ని న్యాయంగా పరిష్కరించుకోవడంలోనూ లేనివాట్ని కొత్తగా ప్రతిపాదనలు చేసుకుని పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోకపోతే నష్టం తెలంగాణకే యెక్కువ అని తెలంగాణా మేధావులు యెప్పటికి గుర్తిస్తారో!వాతావరణం వేడెక్కి మారుమూల గ్రామాల్లో చెరువులు యెండిపోవటానికి కూడా ఆంధ్రోళ్ళ నిర్లక్ష్యమే కారణం అంటుంటే అది నిజమో అబధ్ధమో తేల్చుకుందామని ప్రయత్నించకుండా విద్యాధికులు కూడా నమ్మేస్తున్నారు,ఇవ్వాళ పూడికలు తీస్తున్న సరస్సులు నిండటానికి నీరు యెక్కణ్ణించి తెస్తారు?ఆ పూడికలు తియ్యటం పూర్తయ్యి అవి నిండేవరకూ రైతులు తమ పొలాల్ని బీడుభూములుగా వుంచాల్సిందేనా?అదొక్కటే తెలంగాణ వ్యవసాయానికి పరిష్కారమైనట్టు సమైక్యంగ ఉన్నప్పటి రైతుల ఆత్మహత్యలకు అప్పటి సమైక్య ప్రభువులే కారణమన్న వారు ఇవ్వాళ్టి రోజున జరుగుతున్న ఆత్మహత్యలకి కనీసం స్పందించను గూడా స్పందించటం లేదనేది చూస్తున్నారా?రాగద్వేషాలు లేని నిండుమనస్సుతో నిక్కచ్చిగా అంచనా వేస్తే నవ్యాంధ్రప్రదేశ్ లోటుతో విడిపోయినా రాజకీయపరమైన నాయకత్వం గట్టి నమ్మ్మకాన్ని కలిగిస్తుండగా తెలంగాణా మిగులుతో విడిపోయినా రాజకీయ నాయకత్వం యెట్టి నికరమైన ఆశనీ కలిగించని విధంగా ఉంది!

          కేంద్రమంత్రివర్గంలో చేరడం అనేది పైకి చూడటానికి గొప్పగా కనబడినా లోనారసి చూస్తే అక్కడ ప్రధాన పార్టీ అయిన భాజపాకి పల్లకీ మొయ్యటం కన్నా గొప్పగా వుండదు.తన రాజకీయ జీవితం మొదలైన తొలిరోజుల్లో అనామకంగా ఉన్న మోదీని ప్రతి పత్రికా సమావేశంలోనూ ఒకసారయినా ప్రశంసించకుండా తన పత్రికాసమావేశాన్ని పూర్తి చెయ్యలేకుండా ఉన్నాడు నవ్యాంధ్ర ముఖ్యమంత్రి,తప్పనిసరిగా నన్ను పొగడమని మోదీ చెప్పాడా,లేదే?మోదీ ఇప్పుడున్న స్థానమూ తన అవసరమూ అట్లా ఉంది మరి!నేను రెండు ముష్టి చిప్పలు అన్నందుకు అప్పుడు మిత్రులొకరు అట్లా ఉండదేమో అన్నారు,కానీ ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలు నిలబడి ఉన్న వాస్తవ పరిస్థితి యేమిటో చూస్తున్నారు గదా!నిన్నటి నా అంచనాలన్నీ చాలామటుకు ఇవ్వాళ నిజమవుతున్నాయి,కానీ అవి నిజం కాకుండా ఉంటేనే బాగుండేది కదా అని బాధపడాల్సిన పరిస్థితిలో ఉన్నాను నేను!

          పరస్పర లాభాన్ని ఆశ్రయించే ఈనాటి వాతావరణంలో తెరాసాకి కేంద్రమంత్రివర్గంలో చోటు కల్పించడానికి తెరాసా వైపు నుంచి యేమీ చెయ్యనక్కర లేదా?చెయ్యాలి,తెలంగాణలో వ్యాపించడానికి భాజపాకి సహకరించాలి!తెలంగాణలో తొలి బోణీ భాగ్యనగరమే కావాలని భాజపా ప్రణాళికల్ని బట్టి వూహించవచ్చు.ఇక్కడయితే హిందూ ముస్లిం వాతావరణాన్ని బలంగా పైకి లేపే వీలు ఉండటం వల్ల తను కూడా సొంతంగా కృషి చేసి పునాదిని పటిష్ఠం చేసుకోవచ్వ్హు,నగరం వెలుపలి ప్రాంతాల్లో యెక్కడన్నా అయితే పై స్థాయిలోని నాయకులే కాదు తెరాసా కింది స్థాయిలోని శ్రేణులు కూడా భాజపాని బుజాల మీద మోస్తే గానీ పని జరగకపోవచ్చు!మొదటి సాక్ష్యంగా నిన్నటిదాకా నిజాముని పొగిడినంత గట్టిగా స్వామి రామానంద తీర్ధని పొగడాలి!పాతబస్తీ మిత్రుల సాయం ఆశ వొదులుకోవాలి,అంత క్రూరకార్యం చెయ్యగలరా?యేదో ఒక నికరమయిన హామీ లేకుండా వస్తామనంగానే అక్కున జేర్చుకోవడానికి భాజపా వాళ్ళు వెర్రి వెంగళప్పలు కారుగా!

పూర్ణకుంభాన్ని పగలగొట్టుకుని రెండు ముష్టిచిప్పల్ని సాధించుకున్న వెంగళప్పలు తెలుగువాళ్ళే!

10 comments:

 1. >పూర్ణకుంభాన్ని పగలగొట్టుకుని రెండు ముష్టిచిప్పల్ని సాధించుకున్న వెంగళప్పలు తెలుగువాళ్ళే!
  అవును కాబోలు.

  ReplyDelete
 2. మొదటి నుంచి హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే రేట్లు తక్కువ. రాష్ట్రం విడిపోయాక పరిస్థితి మరింత క్షీణించినట్లు ఉంది. ప్రముఖ బిల్డర్ దగ్గర ఇల్లుకొన్న వాడు చెప్పిందేమిటంటే, కొనుకొన్న వాడి ఇల్లు ధరపెరగటం సంగతి దేవుడేరుగు, బిల్డరే కోటి రూపాయల ఇంటిని 80లక్షలకు ధర తగ్గించి అమ్ముతున్నాడట. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇ.యం.ఐ. కట్టుకొంట్టూ జీవితాన్ని భారంగా లాక్కురావాలి. అద్దే కూడా పెద్దగా రావటంలేదట.

  ReplyDelete
 3. దీర్ఘకాల మిత్రపక్షం (పైగా తోటి హిందూత్వ పార్టీ) శివసేన పరిస్తితి ఏమయిందో చూసాం. టీడీపీని కూడా ప్రత్యెక ప్రతిపత్తి విషయంలో బురిడీలు కొట్టించారు. అకాలీలతో స్నేహం కూడా జాయింట్లతోనే నడుస్తుంది.

  భాజపాతో పొత్తు పెట్టుకోవడం వల్ల తెరాస వారికి ఒరిగేది ఏమీ లేదు.

  ReplyDelete
  Replies
  1. భాజపాతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఎన్నికలలో టి.ఆర్.యస్. కు ఒరిగకపోవచ్చు, కేంద్రంలో మంత్రిపదవి వస్తే దాని లాభంవేరు. వాటికి పోలికలేదు. ప్రతిపార్టి ఎన్నికలలో గెలిచి అధికారంలో భాగస్వామ్యం కావలనుకొంట్టుంది గాని, ప్రతిపక్షం లో ఖాళిగా గొళ్ళు గిల్లుకొంట్టు కూచోవాలనుకోదు. అవకాశం వస్తే మంత్రిపదవి తీసుకోకుండా మడికట్టుకు కూచుంటే ఎమైనా లాభం ఉందా?

   Delete
  2. మంత్రి పదవి వస్తే లాభమెంటొ అశోక్ గజపతి రాజు గారిని చూస్తె తెలుస్తుంది కదండీ. అగ్గిపెట్టెలు విమానంలో తీసుకెళ్లడం వదిలేస్తే ఆయన ఏమీ సాదించలేదు.

   కేంద్ర అనుమతులు రావాలంటే ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండాలన్న వాదన నరేంద్ర మోడీ గుజరాత్ పటాపంచలు చేసింది.

   కేంద్రం తెలంగాణా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే కొట్లాడడానికి ఎంపీలు చాలు. గత ప్రబుత్వంలో కూడా ఎంపీల తండ్లాట మంచి ఫలితాలే ఇచ్చింది. జైపాల్ రెడ్డి మంత్రి పదవి కంటే వీరి ఒత్తడే బాగా పని చేసింది.

   Delete
 4. వేరే ఎవరికైనా లాభామేందో నాకెరిక లేదు గానీ, తెలుగు బ్లాగర్లకు మాత్రం జైగొట్టిముక్కల వెయ్యి నోళ్ళతో బిజెపి ని పొగుడుతూ చేసే ప్రవచనాలు వినే అదృష్టయోగం పత్తుద్ది. అల్లా కవితక్క కు మినిస్ట్రీ రావటం ఆలస్యం ఇహ ఈడ భజన షురూ జేస్తడు జై అనుకుంటూ, అప్పటి దాకా మాత్రం ఈ ఖురాన్ భజన, MIM భజన మనకి తప్పది.

  ReplyDelete
 5. నిజమే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఘోరంగా దెబ్బతింది. బిల్డర్ అయిన ఒక ఫ్రెండ్ లాంకో హిల్ల్స్ దగ్గర కట్టిన అపార్ట్మెంట్ 2 సం ల నుండి అమ్ముడుపోక అడుగు 3 వేలకే అమ్మానని రాత్రి పార్టిలో ఏడుస్తూ చెప్పాడు. కాని మీడియా లో ప్రతి శనివారం ఉందిలే మంచికాలం ముందు ముందునా అని రాస్తూనే ఉన్నారు చెల్లింపు వార్తలు.

  ReplyDelete
 6. "ఇవ్వాళ పూడికలు తీస్తున్న సరస్సులు నిండటానికి నీరు యెక్కణ్ణించి తెస్తారు?ఆ పూడికలు తియ్యటం పూర్తయ్యి అవి నిండేవరకూ రైతులు తమ పొలాల్ని బీడుభూములుగా వుంచాల్సిందేనా?"

  హరిబాబు గారూ, తెలంగాణా అంశంపై మీ అభిప్రాయం తెలిసిందే. పైగా టపాలో అక్కడక్కడ దొర్లిన విషయాలకు టపా ముఖ్యాంశానికి సంబంధం లేదు. అంచేత వాటి గురించి స్పందించకపోయినా నేను ఈ రెండు ప్రశ్నలకు జవాబు ఇచ్చే ప్రయత్నం చేస్తాను.

  1. చెరువులు నిండడం అనేది మామూలు సైకిలులో భాగం. వర్షం నీళ్ళు వాగులు వంకల ద్వారా నదులలో చేరుతాయి, ఈ క్రమంలో చెరువులు నిండుతాయి. అలాగే కాలువలు & భూగర్భ వాగులు (acquifer) కూడా చెరువులకు నీళ్ళు అందచేస్తాయి. ఇవి కాక ట్యూబుల ద్వారా వాడుతున్న నీళ్ళని తగ్గిస్తే ఈ మిగులు కూడా చెరువులకు చేరుతాయి. ఇక నాలుగో సోర్స్ గొలుసు కట్ట (chain link tanks) విధానం ద్వారా వచ్చే నీరు.

  2. చెరువుల నీరు ప్రస్తుతం రైతులకు అందడం లేదు. అంటే చెరువుల పునరుద్దరణ వల్ల అదనపు నీరు & తద్వారా అదనపు సాగుభూమి వస్తాయి. పోయిన ఏడాదులలో సాగయే భూమి ఒక్క సెంటు కూడా తగ్గలేదు పైగా రేప్పొద్దున పెరుగుతాయి.

  ఇంకొక్క విషయం గమనించాలి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు "కేటాయించిన" నీళ్ళలో చెరువులు & తదితర చిన్నతరహా ప్రాజెక్టులే ఎక్కువ భాగం. ఉ. కృష్ణా నదిలో తెలంగాణకు "వచ్చిన" 264.7 టీఎంసీలో 142.9 (~ 55%) ఇలాంటివే. చెరువుల నిర్లక్ష్యం వల్ల ఈ నీరంతా కాగితం మీదే ఉండి అంతా కిందికి పోయేది. ఇప్పుడు ఇవన్నీ వాడుకలోకి వస్తాయి. In other words, the water that was rightfully ours but denied in the past will come into use apart of course new water that we can still obtain.

  ReplyDelete
  Replies
  1. @జై,
   చెరువులు పూడికలు తియ్యగానే భూగర్భ జలాలు తన్నుకు వచ్చి అవన్నీ నిండిపోతాయని గ్యారెంటీఎ ఇవ్వగలరా?

   రోళ్ళు పగిలే రోహిణిలో ముందరి కాలపు సేద్యానికి చాలేటంత నీరు చెరువుల్లో పదిలంగా ఉంటుందని హామీలు ఇవ్వగలరా?

   అవి నిండాలంటే ఆ ప్రాంతంలో యెంతటి యెండలకైనా చెరువులు ఇంకిపోనంతగా వర్షం కురవాలి,లేదా పైనుంచి పారే నదుల ద్వారా రావాలి - వేరే మార్గం యేదయినా ఉంటే చెప్పండి తెలుసుకుంటాం!

   మాకు పైన ఉన్నామని నీళ్ళు బందు చేస్తామన్నారు,మీకు పైన ఉన్నవాళ్ళు నీళ్ళు వదలకపోతే మీకు యెట్లా వస్తాయి?

   భూతాపం పెరగడం భూమి గుల్లబారడం ఈ రెండేళ్ళలోనే జరుగుతున్న విచిత్రం కాదు,ఇప్పుడు తెలిసేటంత స్పష్టం కావదంతో తెలుస్తున్నాది,అంతే!

   టపాలో ముఖ్యాంశమూ అముఖ్యాంశమూ అంటూ యేదీ లేదు - అన్ని అంశాలూ సమానమైనవే.

   Delete
  2. I will respond in English if you don't mind.

   Let us look at the hydrology cycle. Rain water is absorbed by the soil from where it can flow either through aquifers or raise the water tablet. Excess water (e.g. the rate rainfall is heavier than the absorption capacity) runs off in streams and ends up in rivers. Some part of the water will evaporate based on weather conditions.

   Therefore the charge is in the following order: ground water, runoff & evaporation. Evaporation is typically quite low (e.g. Sagar evaporations account for a mere 17 TMC out of total 281).

   Let us now turn to cropping patterns. Kharif represents a very large part of water use. This crop is *after* summer.

   Rabi is fed both by post monsoon flows and return flows (i.e. water released to use but not utilized). FYI return flows could be quite high (> 35%) in wet crops.

   I don't think anyone is saying we will use all the water that flows through our territory (aka Harmon doctrine). There are enough safeguards to ensure that a state's withdrawal does not exceed allocation. The only problem is that the erstwhile AP's allocation is yet to be divided between the two successor states. KWDT is on the job as we speak. GWDT on the other hand consists of a series of bi- & multi-lateral agreements. The two states need to divide the old water rights by agreement or tribunal adjudication.

   Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు