Tuesday 19 May 2015

లాలూ లాలూ?యేంటి పప్పా!గడ్డి తిన్నావా?లేదు పప్పా!అబధ్ధం చెప్తున్నావా?లేదు పప్పా!యేదీ నోరు తెరువ్?హ్హా హ్హా హ్హా:-)

          రక్తచందనం శేషాచలం కొండలు మొదలుకొని రాయలసీమ ప్రాంతంలోని కడప,చిత్తూరు,కర్నూలు జిల్లాలలోనూ ఆంధ్రప్రాంతంలోని నెల్లూరు జిల్లా లోనూ విస్తారంగా పెరుగుతుంది.చైనా మయన్మార్,జపాన్ మరియూ తూర్పు ఆసియా దేశాలలో దీనికి గిరాకీ యెక్కువ!ప్రాచీన కాలంలో యజ్ఞాలలో సమిధలుగా వాడేవాళ్ళు.బౌధ్ధులు ఇప్పటికీ ప్రార్ధనా సమయంలో సువాసన కోసం ప్రశాంతత కోసం చందనం వెలిగిస్తారు.టిప్పు సుల్తాన్ "చందనం వృక్షరాజం" అని పొగిడి ప్రభుత్వపరంగా దాన్ని ఆదాయవనరుగా ఉపయోగించుకున్నాడు.ఇదివరలో దీని ఉపయోగం జపానులోనూ చనాలోనూ గృహోపకరణాల కోసమే పరిమితమైనా ఇటీవల రంగుల తయారీలొనూ టూత్ పేష్టుల తయారీలోనూ కూడా వాడుతున్నారు.

          భారత ప్రభుత్వం 2013లో పట్టుకున్న రక్తచందనం దుంగల విలువ 5000 కోట్లు.ఆంధ్రా లోనే గోడౌన్లలో తరలించదం కోసం దాచి ఉంచిన 9000 టన్నుల్ని వశపరుచుకున్నారు.2001 నుంచి 2007 సంవత్సరాల మధ్యన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3000 టన్నుల్ని పట్టుకుని వశపర్చుకున్నది.ఆగస్టు 2014 నాటికి రక్తచందనం స్మగ్లింగు చేస్తూ చట్టానికి పట్టుబడిన వాళ్ళు చిత్తూరు జిల్లాలో 40మంది,తిరుపతిలో 36మంది,కడపలో 42మంది,నెల్లూరులో36మంది,మొత్తం తమిళనాడు రాష్ట్రంలో 18మంది,మొత్తం కర్నాటక రాష్ట్రంలో 24మంది!2014 జూన్ నుంచి జూలై లోపు చిత్తూరు జిల్లాలో 50,00,000 విలువ చేసే  25లాగ్సు, కడప జిల్లా సంబేపల్లి మండలంలో 1,25,00,000 విలువ చేసే 64 లాగ్సు, కడప జిల్లా కోడూరు మండలంలో 2,50,00,000 విలువ చేసే 156 లాగ్సు, కడప జిల్లా బద్వేల్ మండలంలో 2,50,00,000 విలువ చేసే 156 లాగ్సు పట్టుబడినాయి.

          మొదట్లో చాలా తక్కువ స్థాయిలోనే జరిగేది,కానీ వీరప్పన్ ఘనకార్యాలు ప్రపంచానికి విదితమయ్యాక మిగతావాళ్ళు అసహ్యంతో చీకొడీతే ఇక్కడి స్మగ్లర్లు గురుభావంతో పూజించి అతనినుంచి తమకు కావల్సిన ట్రిక్కుల్ని నేర్చుకున్నారు!చేస్తే శుధ్ధక్షవరమే చెయ్యాలన్నారు గదా పెద్దలు అని స్మగ్లింగుని మరింత సంఘటితంగా చెయ్యడం మొదలుపెట్టారు.అందరికీ తెలియకుండా జరుగుతుందనే తప్ప పరిశ్రమలకి ఉండాల్సిన అన్ని హంగుల్నీ చాలా దిట్టంగా యేర్పాటు చేసుకున్నారు.ఈ వ్యవస్థలో కింది అంతస్తులో కేవలం చెట్లని కొట్టి దుంగల్ని దళారీల కనువైన చోటికి మారుస్తూ ఖర్మచాలక పట్టుబడితే అనాధపిండాలుగా హతమారిపోయే యెర్రకూలీలు అని మీడియా చేత దుర్మార్గులుగా ముద్రవేయబడ్డ పనివాళ్ళు ఉన్నారు, అన్ని ప్రమాదాలకి గురయి అన్ని భీబత్సాలు చేసి స్పాట్ దగ్గిర కనబడి హతమారిపోవడానికి సిధ్ధపడినందుకు వాళ్లకి దక్కేది రోజుకు రు.500 నుంచి రు.750 వరకూ మాత్రమే!మరీ గట్టిగా పనికొస్తాడు అనుకున్నవాళ్ళకి 1000 నుంచి 3000 వరకూ ఇస్తారేమో!యెట్టి పరిస్థితుల్లోనూ అట్టడుగున ఉన్నవాళ్లకి యెక్కువ లాభం మాత్రం ఉండదనేది ఖాయం!వాళ్లలో చాలామందికి అసలు రక్తచందనం విలువ యెంతో తెలియదు,రిస్కు నంతా తమమీద తోసి పై స్థాయిలో వాళ్ళు సంపాదించేదానితో పోలిస్తే తమకు అన్యాయం జరుగుతున్నదని కూడా తెలియదు పాపం!?పైనుంచి సరుకుకోసం కబురు రాగానే యెంత కావాలో చెప్పి కూలీల్ని నరకాల్సిన దుంగల్ని మార్క్ చెయ్యడానికి పంపించి మళ్ళీ వాళ్ళు నరికి అప్పజెప్పిన స్పాట్ గురించి పై స్థాయి వాళ్లకి వివరాలు చెప్తూ కూర్చున్న చోటు ఉంచి కదలకుండా వారానికి రు.80,0000 లెక్కన సంపాదించే మధ్యదళారీలు రెండో వరసలో ఉన్నారు.వీళ్ళ పైన దారిలో ఉన్న చెక్ పోష్టుల్ని తడిపి రహదారుల్ని మెత్తబరుచుకుంటూ సరుకుని దేశం సరిహద్దులు దాటించే ఘనాపాఠీల ఆదాయం వాళ్ళు పోలీసుల్ని,రాజకీయ నాయకుల్ని తడపటానికి పెట్టిన ఖర్చు లన్నిట్నీ కలిపి మినహాయించినా మనమెవ్వరమూ యేనాడూ కనీసం వూహించను గూడా వూహించలేం,వూహించడానికి ప్రయత్నిస్తే మనం ప్రశాంతంగా ఉండలేం!అసలు పై స్థాయి స్మగ్లర్లు చైనా,జపాన్ లాంటి దేశాలలో అంగరంగవైభోగాల్తో కొలువుదీరి చక్రం తిప్పుతూ ఉంటారు - వాళ్ళు యెంత సంపాదిస్తున్నారో తెలుసుకోవడం మనబోటి సామాన్యులకే కాదు ఈ కేసుల్ని విచారించే అధికార్లకి గూడా అసాధ్యం - ఈ పోష్టు రాయడం కోసం నేను చదువుతున్న విషయాలకి నాకే తల తిరిగి మైండు బ్లాంకయి పోయింది!

          నిక్కచ్చిగా అంకెల ఆధారాల్ని సేకరించకుండా యెంత ఉజ్జాయింపుగా లెక్కేసినా గానీ ఇప్పటి 13 జిల్లాల నవ్యాంధ్ర రాష్ట్ర ప్రభుత్వపు తలసరి ఆదాయం కన్నా యెక్కువే వుండొచ్చు అక్కడ జరుగుతున్న వ్యవహారంలో అంతిమగా అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్లందరి దగ్గిరా పైకి తేలుతున్న ఆదాయాల్ని లెక్కవేస్తే!విడిపోయిన తర్వాత లోటుబడ్జెట్టు కష్టాలతోనూ యెటువైపు నుంచీ నికరమైన సహాయం రాని స్థితిలో ఉన్న ఇప్పటి ప్రభుత్వం తప్పనిసరి అయి వీళ్ళ మీద యుధ్ధం ప్రకటించింది గానీ గత యెన్నికల్లో ఆ పార్టీ నుంచి గెలిచిన వాళ్లలో కూడా యెర్రస్మగ్లర్ల సహాయ సహకారాల తోనే గెలిచినవాళ్ళు చాలామంది ఉన్నారు!

          మొత్తం వ్యహారమంతా అచ్చు సినిమాల్లో చూస్తున్నట్టు చాలా నాటకీయంగా ఉంటుంది.యెక్కడో ఒక చిన్న కాకా హోటల్లో కూర్చుని నిముషానికో సెల్ ఫొనుని మారుస్తూ యేదేదో మాట్లాడేస్తున్న మనిషి మీకు కనబడ్డాడనుకోండి అతను ఫోను పిచ్చోడు కాదు - కూలీల్నీ,కూతపిట్టల్నీ,నిఘా పోలీసుల్నీ,ఫారెస్టు రేంజర్లనీ కలుపుతున్న స్మగ్లింగు సామ్రాజ్యానికి సంబంధించిన సింధువులో ఒక బిందువు కావచ్చు!మాసిపోయిన బట్టల్తో రోడ్డుపక్కన బీడీ కాల్చుకుంటూ ఉండే వ్యక్తి కూడా - గట్టిగా పోలీసులు దబాయిస్తే "ఇక్కద తిరిగేవాళ్ళనతా స్మగ్లర్లేనా?" అని నిర్లక్ష్యంగా జవాబిచ్చినా మరు నిముషంలోనే పోలీసుల గురించి ఉప్పందించే కూతపిట్ట కావచ్చు!శేషాచలం అడవుల పరిసర ప్రాంతాలలోని పోలీసు స్టేషన్ల గోడల మీద ఆయా ప్రాంతాలకి చెందిన చాలామంది రాజకీయనాయకుల ముఖారవిందాలు జేబుదొంగల పక్కనే కనిపిస్తాయి,అయినా వాళ్ళకి సిగ్గు కానీ మరొకటి గానీ లేవు?

          మన దేశపు రాజకీయ వ్యవస్థ యెంత దారుణంగా ఫెయిలయిందో చూదండి!అవేం పాల డబ్బాలా సిల్కు రుమాళ్ళా అగ్గిపెట్టెలా కనబకుండా దాచేసి అమాయకులైన అధికార్లని మోసం చేసి దాటించుకుపోవడానికి?అంత పెద్ద సైజులో ఉన్న యెర్ర్రచందనం దుంగల్ని స్మగ్లర్లు ఇన్నేళ్ళుగా అంత నిర్భయంగా కొన్ని వందల వేల మైళ్ళు దేశపు సరిహద్దుల లోపల తిప్పుతున్నా, క్షేమంగా దేశపు సరిహద్దులు దాటిస్తున్నా,దానివల్ల ప్రజాప్రభుత్వాల ఖజానాలకి యెంత నష్టమో తెలిసి కూడా యేమాత్రమూ సంకోచించకుండా స్మగ్లర్ల నుంచి సహాయాలు పొందుతూ వాళ్ళకి సహాయాలు చెయ్యడం కోసమే అధికారంలోకి వస్తున్నది మనం వేస్తున్న వోట్లతోనే గదా?వాళ్లకి వత్తాసు పలికేవాళ్ళు అధికార పార్టీలోనూ ఉన్నారు కదా,ఈ ప్రభుత్వాన్ని నిజంగా నమ్మగలమా?


యధా రాజా తధా ప్రజా అన్నది అప్పటి మాట!
యధా ప్రజా తధా రాజా అన్నది ఇప్పటి మాట?

No comments:

Post a Comment

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

హిందూ ధర్మాన్ని పాషండ మతంలా మార్చేస్తున్న త్రిదండి చిన జియ్యర్ అనే మూర్ఖుణ్ణి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలి.

శ్రీరామనవమి పేరు ఎత్తగానే ప్రతివారి మనసు పులకించి పోతుంది . కానీ భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణం లోని నామ , గోత్ర , ప్రవరలు వింటుంటే మనసు ఎంతో...