Friday, 26 December 2014

తెలంగాణా మేధావులకి నా వైపునుంచి శ్రీరామప్రసాద గీత!

             "కులరీత్యా,ప్రాంతరీత్యా,భాషరీత్యా వెనుకబడిన ప్రజలూ,లైంగికంగా అనగదొక్కబడిన స్రీలూ అప్పటికే అభివ్ర్ధ్ధి చెందిన వారితో యెలా పోటీ పదగలరు?" అన్న ప్రస్న సరైంది కాదు.వెనుకబడిన వాళ్ళు అభివృధ్ధి చెందిన వాళ్ళతో ఒకానొక సంబంధంలోకి వచ్చినప్పుడు మాత్రమే "వెనుకబడినవాళ్ళు"గా గుర్తించబడుతున్నారు.ఈ తారతమ్యం సాపేక్షమైనది.యెవరయినా గానీ "మేము మీకన్నా అభివృధ్ధి చెందినవాళ్ళం.మీరు మాకన్నా వెనుకబడిన వాళ్ళు" అని అంటున్నప్పుడు వెనుకబడిన వాళ్ళు ఆ అభివృధ్ధి చెందిన వాళ్ళతో సంబంధాన్ని తెంచేసుకున్నప్పుడు ఆ తేడాల వునికే అదృశ్యమౌతుంది.

         అభివృధ్ధి చెందిన వాళ్ళు వెనుకబడిన వాళ్ళ అభివృధ్ధి క్రమాన్ని గుర్తించటానికి నిరాకరించినప్పుడు,వాళ్ళ ఆత్మగౌరవాన్ని నలిపివేస్తున్నప్పుడు వెనుకబడిన వాళ్ళు అభివృధ్ధి చెందిన వాల్లతో తమ సంబంధం యొక్క పరిమితులను కుదించే ప్రయత్నం చెయ్యాలి.బ్రిటిష్ దేశమూ, ఇంగ్లీషు భాషా యెంత ఆధునిక స్థాయికి అభివృధ్ధి చెందినవైనప్పటికీ వారు మనల్ని పీడిస్తున్నప్పుడు వారి ఆధిక్యాన్ని నిరోధించే లక్ష్యంతో స్వాతంత్ర పోరాటాలు సాగాయి.అవన్నీ వాళ్ళు పాలకులు,మనం పాలితులు అనే సంబంధాన్ని రద్దు చెయ్యటానికి జరిగాయి.

          అంటే,అభివృధ్ధి చెందిన వాళ్ళ అతివృధ్ధిని నిరోధించే విధంగానే వెనుకబడిన వాళ్ళ అభివృధ్ధి జరగాలన్న మాట!అభివృధ్ధి చెందిన వారి స్థాయికి యెదగాలన్నా,వారి ఆధిక్యాన్ని నిరోధించాలన్నా వెనుకబడిన ప్రజలు ఇప్పటికే అభివృధ్ధి చెందినవారి కంటే వేగంగా కదలాల్సి వుంటుంది.ఈ పధ్ధతిలోనే అభివృధ్ధి పేరున జరిగే పరాయీకరణని కూడా వెనుకబడిన ప్రజలు క్రమేణా తొలగించుకోగలుగుతారు.కాబట్టి అభివృధ్ధి చెందినవారి కన్నా అదనపు చైతన్యం పొందీతే తప్ప వారిని మించిపోయి గెలిచే లక్ష్యం సిధ్ధించదు!

   మాక్కాస్త పేరు ప్రతిష్ఠలు సంపాయించి పెట్టండి బాబూ అని యెవరూ యెవర్నీ దేబిరించనక్కర్లేదు.పేరు ప్రతిష్ఠలు ఏయే మార్గాల్లో వస్తాయో తెల్సుకుని వాట్ని సాధించే కృషిని నమ్ముకుంటే వాటంతటవే వస్తాయి.మేము బలహీనవర్గానికి చెందిన వాళ్లం కాబట్టి మా తరపున మీరు పోరాడి ఫలితాన్ని మాకు దక్కించండని యెవ్వర్నీ ప్రాధేయ పడవద్దు.అట్లా చేసేవాళ్ళు రెండే విధాలు:మాఫియా గ్యాంగులు,నక్సలైటు వర్గాలు - యెవ్వర్ని మీరు సంరక్షకులుగా యెంచుకున్నా మీకు దక్కేది తాత్కాలిక రక్షణే!
                                                                                                                       -------B.S.రాములు & కలెకూరి ప్రసాద్
-----------------------------------------------------------------------------------------------------------------
          ఇది యెప్పుడో నాకు నచ్చి నా పర్సనల్ కలక్షన్ లోకి యెక్కించుకున్న ఒక విశ్లేషణ.ఇందులోని సారాంశ మేమిటంటే అబివృధ్ధి చెందటం,వెనకబడటం అనేవి సాపేక్షాలు.వెనకబడిన వాళ్ళు అనే మాటకే అసలు అర్ధం లేదు  యెవరి కన్నా వెనకబడిన వాళ్ళో చెప్పకపోతే!ఈ రకమయిన అవగాహన నాలో మొదటినుంచీ గట్టిగా వుండటం వల్లనే రాష్త్ర విభజన విషయంలో తెలంగాణా వాదుల్ని నేను అంత గట్టిగా సమర్ధించాను.

          ఆ విశ్లేషణలో రెండు కీఎలకమయిన అంశాలు వున్నాయి.ఒకటి,అభివృధ్ధి చెందిన వాళ్ళు వెనకబడిన వాళ్ళ ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తున్నప్పుడు ఆ సంబంధాన్ని తెంచేసుకోవటం,వెనుకబడిన వాళ్ళు అభివృధ్ధి చెందిన వాళ్ల కన్నా వేగంగా కదలటం. మొదటిది సాధించారు,కానీ రెండవది సాధించ గలరా?

          యెందుకంటే నాకు మొదటి నుంచీ తెలంగాణా వుద్యమవీరులు చేస్తున్న వాదనల్లో ఒక సందేహం ఇప్పటికీ మిగిలి పోయింది!అసలు ఒక ప్రాంతం లోని మేధావు లంతా యాభయ్యేళ్ళ పాటు తమ ప్రాంతం వాళ్ళు వెనకబడితే యెందుకు నిస్తేజంగా వుండి పోయారు?వుద్యోగాల కయితే చదువులూ డిగ్రీలూ కావాలి,కానీ వ్యాపార పారిశ్రామిక రంగాల్లో పైకి రావాలంటే కేవలం పెట్టుబడీ చొరవా మాత్రం చాలు గదా!ఆంధ్ర వలసవాదుల దోపిడీలూ,ఆంధ్రోళ్ళ దుర్మార్గపు కబ్జాలూ లాంటి పనికిమాలిన వాదనల్ని తీసేస్తే తెలంగాణాలో వ్యాపార పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడి పెట్టి యెదగ గలిగిన వాళ్లే లేరా?

          యెంకి పెళ్ళి సుబ్బి చావు కొచ్చిందన్నట్టు దేశానికి స్వాంత్ర్యం రావడమేమో గానీ  తెలంగాణాలో మాత్రం పెద్ద సైజు గందరగోళాన్ని రగిలించింది?!నిజాము ఈ దేశంలో కలవనని మంకు పట్టు పట్టటం, ఆ ప్రభుత్వాన్ని పోలీసు చర్య ద్వారా కలిపేసుకోవటం,పనిలో పనిగా ఆ వుద్యమానికి నాయకత్వం వహించిన కమ్యునిష్టుల్ని కూడా యేరి పారెయ్యటంతో మొత్తం తెలంగాణా అంతటా హఠాత్తుగా ఒక శూన్యం యేర్పడింది!ప్రజల్ని చైంతన్యవంతుల్ని చేసిన కమ్యునిష్టులు శవప్రాయులై నెహ్రూ భక్తులుగా మారిపోవటంతో నాయకత్వ లేమి యేర్పడింది!అప్పటి దాకా ప్రజల్ని పీడించి అపార ధనరాసుల్ని పోగు చేసిన వాళ్ళు దేశం వొదిలి పారిపోవటంతో ఆర్ధికపరమయిన యెదుగుదల వెనకబడింది!ఆ శూన్యాన్ని ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళు భర్తీ చేశారు.అది కావాలని ఆంధ్రోళ్ళు కుట్ర పూరితంగా చేసింది కాదు గానీ ఒక మోనోపలీ అనేది స్థిరపడి పోయింది!

          ఒకసారి మోనాపలీ యేర్పడితే దాన్ని వొదులుకోవటానికి యెవడూ ఇష్టపడడు!రేపు తెలంగాణా రాష్త్రం నుంచి యెదిగే వాళ్ళు కూడా దీనికి అతీతంగా వుండరు!యేమయితేనేం రాజకీయ పరమయిన విభజన జరిగింది!కానీ అసలు ప్రశ్న యేమిటంటే:ఆంధ్రావాళ్ళు వచ్చి బాగుపడిన చోట తామూ బాగుపడేటందుకు అవకాశాలు వున్నాయని తెలిసినప్పుడు, అక్కడికెళ్తే యెదుగుదల సాధ్యమని తెలిశాక ఆంధ్రా వాళ్ళు (యెక్కడో కోస్తా జిల్లా నుంచి) వెళ్ళగలిగినట్టు తెలంగాణా వాళ్ళు (చాలా దగ్గిరే ఉన్న పొరుగు జిల్లాల నుంచి) కూడా వెళ్ళగలిగితే సమస్యే వుండేది కాదు కదా?యెందుకు వెళ్లలేకపోయారు?

         యెక్కువ అభివృధ్ధి చెందటం తక్కువ అభివృధ్ధి చెందటం అనే సాపేక్షతని రద్దు చేసే విధంగా ఈ యాబయ్యేళ్లలో యెందుకు కదల లేకపోయారు?అలా కదల లేని మీలోని  అశక్తతని వొదిలించుకోకుండా  మామీద ద్వేషంగా పెంచుకుని ఇప్పటికీ చావు వార్తలకి తక్కువ కవరేజీ ఇచ్చారు అనే పుచ్చొంకాయ్ తెలివితేటల్తో నెగటివ్ పధ్ధతుల్లో కాకుండా పాజిటివ్ దారిలో వెళ్తే తెలంగాణాలో అభివృధ్ధి జరగకపోయేదా?

5 comments:

  1. తెలంగాణ విభజన వలన ఎవరు నిజం గా లాభ పడ్డారు, ఎవరు కేవలం భావోద్వేగాల లో కొట్టుకొని పోయి నష్టపడ్డారు అనే విషయమై ఇప్పుడిప్పుడే ట్రెండ్స్ వస్తున్నాయి.
    తెలంగాణ లో లాభపడ్డవాళ్ళు- రాజకీయ నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు, ఎస్టాబ్లిష్మెంట్ వైపు ఉన్న మేధావులు (పదవుల పై కన్నేసి వ్యూహాత్మకం గా ఉద్యమాన్ని సపోర్ట్ చేసిన వారు, వక్రవాణులూ, తేడభూషులూ).
    తెలంగాన లో నష్టపోయిన వారు- రైతులు, దిగువ తరగతి ప్రజానీకం, నిరుద్యోగులు, విద్యార్ధులు.

    పైన చెప్పిన లాభ నష్టాలవలన ఉద్యమం పైకి ఏ కారణాలవల జరిగిందని చెప్పబడినా, ఎవరి లాభం కోసం జరిగిందో ఓ అంచనాకి రావచ్చు.

    ఇక ఆంధ్ర విషయానికి వస్తే:
    లాభ పడిన వారు - ఆ రెండు జిల్లాల లో భూమి ఉన్నవారు.
    హైదరాబాదుకి వలస పోకుండా తమ ఊళ్ళను అంటి పెట్టుకొన్న ప్రజానీకం (వీరి లో నిమ్న వర్గాల వారు ఎక్కువ)
    నష్టపోయిన వారు - రాజకీయ నాయకులు,హైదరాబాదు చుట్టు పక్కల పెట్టుబడులు పెట్టిన ఎగువ తరగతి వారు.
    -ఆంధ్ర ఊరిలో ఉన్న అరెకరం అమ్ముకొని హైదరాబాదు లో ఇరుకు ఇళ్ళు కొనుక్కొన్న వారు.
    పైన చెపిన జాబితా నుంచీ తెలంగాణ ని ఎవరు ఎందుకు వ్యతిరేకించారో కూడా ఓ అంచనాకి రావచ్చు.

    ReplyDelete
    Replies
    1. అవును,పరిస్థితి మారుతున్నది!లక్ష నాగళ్లతో దున్నిస్తానన్న చోటికి తనే వెళ్ళి భూతలస్వర్గం అని పొగడిన సన్నివేశం కూడా కొందరికి కళ్ళు తెరిపించలేకపోయింది!

      Delete
  2. తిరుపతి ఊరును తీసుకొంటే అక్కడి దేశం నలుమూలల నుంచి తీర్థయాత్ర చేసేవారు వస్తూ,పోతూ, ఎంతో వ్యాపారం జరుగుతూంట్టుంది. అలాగే హైదరాబాద్ రాజధాని వలన 20 జిల్లాల నుంచి ప్రజలు రకపోకలు సాగిస్తూ తిరుపతి వలే వ్యాపారం జరుతూంట్టుంది. జనం మొబిలిటి వలన లెక్కలేనన్ని ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. అవి పేపర్ ప్రకటనలో వచ్చే,రాజకీయ నాయకులు చదువుకొన్న మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకోవటానికి చెప్పే సాఫ్ట్ వేర్ ఉద్యోగాల వంటి కావు. తెలంగాణాలో పంటలు పండకపోయినా, ఇతరాత్రా కారణాల వలన, మొబిలిటి ఎక్కువగా ఉండే హైదరాబాద్ కి వస్తే ఎదో ఒక పని చేసుకొని పొట్ట నింపుకోవటానికి ఇన్నాళ్ళు ఆస్కారం ఉండేది. ఇప్పుడు విభజన వలన హైదరాబాద్ ఆ అవకాశం కోల్పోయింది. ఒకవైపు రైతుల పరిస్థితి దిగజారుతూంది. సిటికి వచ్చి ఎదైనా పొట్టపోసుకొంద్దామంటే అక్కడ ఉద్యోగాలు లేవు. కారణం మునుపటివలే హైదరాబాద్ కు వచ్చే వారి సంఖ్య తగ్గిందని, చాలా చోట్ల ట్రఫిక్ జాములు తగ్గాయని, కొన్ని ఏరియాలలో ఇల్లు బాడుగకు మనుషులు దొరకటంలేదని తెలిసినవారు చెప్ప్తున్నారు. ఎప్పుడైతే ప్రజల రాకపోకలు తగ్గుతాయో కూలి పని వారికి,టి షాపులు,ఆటో, లాడ్జ్, చిన్న చిన్న పనులు చేసుకొనేవారికి పనులు దొరకవు. ఈ కోణం నుంచి చూస్తె విభజన వలన పేదవారు మరింత నష్టపోయారు. అలాగే మధ్యతరగతి వారు ఇళ్లు అమ్ముకొని వారి స్వస్థలాలకి పోదామనుకొన్న కొనుకొనే వారు ఎవ్వరు లేరు. ఆ విధంగా జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ లో సెటిల్ అయినవారు, విదేశాలలో ఉంట్టు హైదరాబాద్ లో ఇల్లుకొనుకొన్నవారు వారి ఆస్థి విలువ పెరగటం అటుంచి అసలు కూడా వచ్చే పరిస్థ్తితి లేదు. అందువలన వారు ఇళ్లు అమ్మే పరిస్థితి లేదు. మార్కేట్ లో మొమెంటం ఉండదు. ఎప్పటికి వస్తుందో తెలియదు. అసలికే అన్ని సిటిలతో పోలిస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రేట్లు తక్కువ. ఇల్లు కొనుకొన్నవారందరికి మిగిలింది బాంక్ లో అప్పులపై నెల నెల కట్టే ఇ.యం.ఐ.. ఈ విధంగా ఎగువ మధ్య తరగతి వారి జీవితం ఈ జన్మకు అలా ఫిక్స్ అయ్యింది. ఇక ఎవరి ఊరులో వారు ఉంట్టే మని రొటేషన్ కి పెద్ద ఆస్కారం ఉండదు. ఆంధ్రాలో ఉన్నవారికి ఒక స్వంత ఇల్లు ఉంటే జీవితం లాగించేయవచ్చు. సిటిలో పెద్ద బిల్డర్ దగ్గర ఎక్కువ సొమ్ముచెల్లించి అపార్ట్ మెంట్, నెత్తిన అనవసరం గా డబ్బులు ఖర్చు పెట్టే అవసరం తప్పింది. ఆ డబ్బులు బాంక్ లో వేసుకొని వడ్డి పెట్టుకొని తిన్నా , మధ్య తరగతి వారి జీవితం సుఖంగా సాగుతుంది. అయితే వ్యాపార అవకాశాలు ప్రజలు పెద్దగా సృష్ట్టించరు. ప్రభుత్వమే వ్యాపారాన్ని ప్రోత్సహించవలసిన అవసరం ఏర్పడేటట్లు ఉంది.

    ReplyDelete
    Replies
    1. అందుకేనేమో చంద్రబాబు జపాను సాయం కోసం పరితపిస్తున్నాడు!రాజధానికి అంత స్థలం యెందుకనేది మామూలు వాళ్ళలో కొందరికి అర్ధం కావడం లేదు - ముఖ్యమయిన నాలుగయిదు బిల్డింగుల కయితే అంత స్థలం అక్కర్లేదు,వ్యాపారపరంగా కూడా రాజధాని ఆదాయవనరుగా వుండాలనేది అందులోని తెలివి.అన్నీ సానుకూలంగా జరిగితే బాగుణ్ణు!

      Delete
    2. గమనించవలసిందేమిటంటే సమాజం లో మధ్యతరగతి వారు సంతృప్తి చెందితే వ్యాపారం అభివృద్ది ఎమి ఉండదు. ఇన్ని రోజులు కోస్తాజిల్లాల వారు చెన్నై, హైదరాబాద్ మొదలైన సిటిలకి చదువు,ఉద్యోగ,వ్యాపార ల కొరకు వెళ్ళి, అక్కడ స్థిరపడటానికి ఎంతో స్ట్రగుల్ అయ్యారు. అలా వారు వలస వెళ్లబట్టే కోస్తాలో డబ్బుల రోటేషన్ జరుగుతూ వచ్చింది. సౌత్ లో తెలుగువారు వలస వెళ్లినట్లు, ఇతర భాషల వారు వేరే ఊళ్లకి వెళ్ళి వ్యాపారాలు చేసినట్లు కనపడదు. తమిళులు జేబులో నుంచి పైసా తీయకుండా ఉద్యోగాలు చేయటానికి ఉత్సాహం చూపిస్తారు. ముఖ్యంగా చెన్నై లో నెల్లూరు, ఉభయ గోదవారి జిల్లాల నుంచి డబ్బులు సినేమా రంగంలో ఎంతో మంది పెట్టుబడిపెట్టి టి.నగర్,నుంగంబాకం, కోడంబాకం, వడపళని,మెహతానగర్ మొదలైన వాటిని అభివృద్ది చేశారు. ఇక ఆర్యవైశ్యులు చెన్నై షావుకారు పేట, మద్రాస్ హై కోర్ట్ చుట్టుపక్కల ఉండే పారిస్,మైలాపుర్ మొదలైన ప్రాంతాలలో వందల సంవత్సరాలు గా వ్యాపారం చేస్తూన్నారు. బెంగుళురు లో మెజెస్టిక్ చుట్టుపక్కల ఉండే నగల షాపులన్ని అనంతపూర్ రాయలసీమ నుంచి వచ్చిన వారుంటారు. ఎక్కడ చూసినా ఆంధ్రవారి డబ్బే. ఇక ఆంధ్రావారు స్వంతా ఊర్లలో తిష్టవేస్తే , మొదట్లో అన్ని రేట్లు పెరుగుతాయి తరువాత ద్రవ్య చలామణి లేక, మార్కేట్ స్టాగ్నెట్ అయ్యి వ్యాపారాభివృద్ది కుంటుపడుతుంది.

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...