Tuesday, 16 December 2014

మతాంతరీకరణలు తప్పు అని తెలిసీ మనమూ అదే పని చెయ్యాలా?!

      ఒకప్పుడు కాంగ్రెసు అవినీతికరమయిన పాలనకు విసుగెత్తి భాజపాను మొదటిసారి గెలిపిస్తే ఇంక మనకెదురేమి అని రెచ్చిపోయి భారత్ వెలిగిపోతోంది అని డప్పు కొట్టుకుని కళ్ళు తెరిచి చూసేసరికి ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది?మళ్ళీ అధికారంలోకి రావడానికి పదేళ్ళ కాంగ్రెసు భ్రష్టాకారి పరిపాలన సాయపడింది!ఇప్పుడు మళ్ళీ అలాంటిది జరిగితే మళ్ళీ అధికారంలోకి రావదానికి ఇరవయ్యేళ్ళు పట్టొచ్చు,యాభయ్యేళ్ళు పట్టొచ్చు?!

      కొండనాలిక్కి మందేస్తే వున్న నాలిక వూడిన చందంగా మొత్తం హిందూధర్మమే అభాసుపాలయి అయ్యవార్ని చెయ్యబోతే కోతి అయినట్టు మళ్ళీ జనం ముందు నిలబడి వోట్లు అడగలేని పరిస్థితి కూడా రావొచ్చు?! గీతని రాష్ట్రీయ గ్రంధంగా చెయ్యకపోతే గీతకి యేమయినా లోటు వస్తుందా?సాక్షాత్తూ భగవాన్ శ్రీకృష్ణుడే "మధ్భక్తులకు దప్ప అశ్రధ్ధాపరులకు తెల్పకు మీవు" అన్నాడు!సంస్కృతం సరిగ్గా రాదంటూనే "స్వభావప్రభవైర్గుణై" అంటే పుట్టుకతో వచ్చే స్వభావం అని వాళ్ళకి వాళ్లే అర్ధం చెప్పేసుకుని వ్యాసుడు గీత లోని చాతుర్వర్ణాన్ని కొన్ని కులాల ఆధిక్యతని సమర్ధించడానికే రాశాడు అని ఘీంకరించేవాళ్ళు, అసలు చదవకుండానే విమర్శించేవాళ్ళు ఇప్పటికే లెక్కకి మిక్కిలిగా పోగయ్యారు - ఈ మందని ఇంకా పెంచటానికి గాక యెందుకయినా పనికొస్తుందా ఆ పని?

      సంస్కృతం  తెలిసి అందులోని సారాన్ని తెలుసుకుని విమర్శించిన సజ్జనులైన కమ్యునిష్టు మేధావులే వర్ణం వేరు కులం వేరు, వర్ణం అనేది ఒక రకమయిన శ్రమ విభజన లాంటిది కులం మాత్రమే పుట్టుకతో వస్తుంది అని చెప్పారనేది కూడా తెలియకుండా వర్ణాన్నీ కులాన్నీ కలిపేసి పీకి పాకం పెట్టే అజ్ఞానులకి గీతని పరిచయం చెయ్యడం అవసరమా?

      మతాంతరీకరణ అనేది తప్పు అని తెలిసి కూడా పునరాగమనం అని పేరు పెట్టి వాళ్ళు చేసిన తప్పునే మనమూ చెయ్యాలా? అలా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చిన వాళ్లు ఒకవేళ ఇప్పుడు  నేను బ్రాహ్మణ కులంలోకి వెళ్ళానుకుంటున్నాను అంటే వొప్పుకుని సాదరంగా బ్రాహ్మణ్ణి చేస్తారా?ఇక్కడ మతం లోపలే వున్న హరిజనులకి ఆలయప్రవేశం జరిపించి దగ్గిరకి తీసుకోలేని వాళ్ళు గతంలో మతం మారిన వాళ్లని తిరిగి మతంలోకి తీసుకొచ్చి యేమి వుధ్ధరిస్తారు?

     యే మతాని కయినా ఇతర మతస్తుల ముంచి ప్రమాదం రాదు, సొంత మతంలో వున్న వేరుపురుగులూ ఆషాఢభూతులే ప్రమాదం!నెహ్రూ లాంటి వాళ్లనీ నెహ్రూ భక్తుల్నీ గుర్తు పట్టిన వెంఠనే తన్ని తగిలెయ్యగలిగినంత జాగరూకత వుంటే చాలు హిందూ ధర్మం సగర్వంగా తలయెత్తుకుని నిలబడే వుంటుంది యెంతమంది అశనాసక్తులు వీడిపోయినా?!

      వాళ్ళు డబ్బాశ చూపించి మతం మారుస్తున్నారా?మతం మారకుండానే గొప్పగా బతికే వీలు కల్పించు! ఈ మతాన్ని నిజంగా ప్రేమించి నిష్టగా అనుసరించే వాడు యెంత డబ్బు ఇస్తే మతం మారతాడు?మాలవాళ్లలోనే క్రిష్టియానిటీ వైపుకి వెళ్ళకుండా వుండిపోయిన వాళ్ళూ, గుడి గోపురాల్లోకి రానివ్వట్లేదు గాబట్టి ఇంట్లోనే హిందూ దేవుళ్ళ పటాలు పెట్టుకుని వాటికి దణ్నం పెట్టుకుని సరిపెట్టుకునేవాళ్ళు ఇప్పటికీ వున్నారు,తెలుసా?

    ఒక మంచి హిందువు,ఒక మంచి ముస్లిము,ఒక మంచి కిరస్తానీ - వీళ్ళు ఒక చోట కలిస్తే కొట్టుకోరు, తిట్టుకోరు,పైగా ఒకరి మతనిష్టకి మరొకరు అవసరమయిన సాయం కూడా చేస్తారు!యెటొచ్చీ శ్రీ శ్రీ చెప్పినట్టు రిఫరీని మోసం చేసి గెలవడం - అంటే "రిఫరీ రిఫరీ!నువ్వూ నేనూ ఒక మతం, వాడు వేరే మతం కాబట్టి నాకు పాయింట్లు యెక్కువేసి నన్ను గెలిపించు" అనే యవ్వారాలు చెయ్యాలనుకుంటేనే మతం గొడవలు రేపే సాధన మవుతుంది!మతాన్ని తన వ్యాపారానికీ అధికార ప్రాప్తికీ వాడుకోవాలనుకునే వాళ్ళు మాత్రమే మతం గురించి అవసరమయిన దానికన్నా యెక్కువగా వాగుతారు?

      నిన్న గాక మొన్న ఒక ముస్లిము తిరుపతి వేంకటేశ్వర స్వామికి  బంగారు పూలు మొక్కుకుంటే అతని మరణాంతరం అతని కొడుకు వచ్చి సమర్పించాడని చదివాను!ఇలాంటివాళ్ళు కూడా బాధపడి దూరమవడానికి తప్ప యేందుకీ పునరాగమనాలు?సాక్షాత్తూ భగవాన్ శ్రీకృష్ణుడే చెప్పాడు,యేమని:

                                              శ్లో||ఇతర దేవతా భక్తులయ్యు శ్రధ్ధగ కొల్చినట్లయిన
                                                  వారు సైతం కౌంతేయ!నన్నె చేరుదు రప్రయత్నంగ?!


7 comments:

  1. నా దృష్టి లో మతం ఒక మత్తుమందు లాంటిది. మనిషి స్వభావం మారనంత కాలం ఏ మతమైతే ఏముంది? బడి పిల్లలు ఒక స్కూల్ నుంచీ ఇంకో స్కూల్ కి మారేటపుడు, యూనిఫారం మారుస్తారు. మతాంతరీకరణలకి కూడా అంత కంటే ఎక్కువ విలువ ఇవ్వనవసరం లేదు. ముస్లిములందరూ హిందూ మతం లోకి మారితే, ఆకు పచ్చ యూనిఫారంలు తగ్గి కాషాయ యూనిఫారం లు పెరుగుతాయి. ఆ యూనిఫారం ల లో ఉండే మనుషులు మాత్రం మౌలికం గా మారరు.
    అయితే ఈ మతాంతరీకరణ ల కి ప్రతిక్రియ గా ఇస్లామిక్ ఉగ్రవాదం పడగ విప్పే ప్రమాదం ఉంది. అది దేనికి దారి తీస్తుందో చెప్పలేం. ఇండియా పాకిస్తానీ హస్తముందమనవచ్చు. ఆ పై మో'డీ' గారు "ఢీ అంటే ఢీ", అనవచ్చు. ఇది చరిత్ర లో మొట్టమొదటి పూర్తి స్థాయి అణుయుధ్ధానికి దారి తీయ వచ్చు. తరువాత "చేతులు కాలాక ఆకులు పట్టుకొన్నా ప్రయోజనం లేదు..హిట్లర్ తరువాతి జర్మనీ లా.". ఒక్కటే తేడా అణుయుధ్ధం తరువాత పట్టుకోవటానికి ఆకులుండవు, పట్టుకొనేందుకు చేతులూ ఉండవు..

    ReplyDelete
    Replies
    1. అందరిలోనూ - ముఖ్యంగా నాలోనూ అదే భయం వుంది!శాంతిని కోరి ఇస్లాం ధర్మాన్ని ప్రతిపాదించిన ప్రవక్త వ్యతిరేకత రాగానే తను తగ్గి అక్కణ్ణించి శాంతంగా తప్పుకోవటం గురంచి "యే వెలుగుల కీ ప్రస్థానం?యే మలుపుల కీ ప్రయాణం!" అనే పోష్తులో చెప్పాను.కానీ ముస్లిం మతస్థులలలో ఇప్పటికీ ముల్లాలకే ప్రాధాన్యత వుంది.కాబట్టి వారు ముందుకొచ్చి సరిదిద్దనంతవరకూ ముస్లిము మతం ప్రమాదంలో పడింది,మా మతాన్న్ని రక్షించుకోవడానికే ఇదంతా చేస్తున్నాం అనేవాళ్ళు చేసే భీభత్సాలు ఆగవు!వారిలో కదలిక యెప్పుడు కలుగుతుందో మరి?

      Delete
  2. తల్లిదండ్రుల్ని బట్టి సంక్రమించేవి కులాలూ, మతాలూను. మన ఛాయిస్ ఏమీ లేదు. తమ పాత్ర ఏమీ లేని విషయాల గుఱించి ఉన్మాదం పెంచుకోవడమే అందఱూ చేస్తున్నారు. ఈ ధోరణి స్థానంలో మానవతాదృక్పథం రావాలి. ఒక మతంలోంచి మఱో మతంలోకి కాదు. మనిషే మఱో మనిషిగా మారాల్సి ఉంది. మానవత్వం లేని మనిషికి ఏ మతమైనా ఒకటే. అతనికి ఏ మతమూ ఉపకరించదు.

    ReplyDelete
  3. ఈ టపాను మీరు ఆవేశంలో రాశారు. మా మతం లో కి వస్తే స్వర్గంలో సీటు గేరంటీ అని,మతాంతీకరణ హిందువులు చేయటం లేదని వార్తలను చదివితే తెలుస్తుంది. భగవద్గీత లో శిక్షణ ఇప్పిస్తామని కూడా వారేమి చెప్పటంలేదు. వారికి ఇతర మతాలు ఏ ఆశచూపించి చేర్పించుకొన్నాయో, ఆ భౌతిక లాభాలనే వీరు ఇస్తామని చెప్తున్నారు. ఒకప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు తెలుగుదేశంలో ఉండి, అక్కడ పొసగకపోతే కాంగ్రెస్ పార్టిలో చేరేవారు. ఆ సంధర్భంలో తల్లి ఓడిలో చేరిన పిల్లవాడులా వారిని అభివర్ణించుకొనేవారు. ఇది అంతే! మీరు హిందూ ధర్మం అభాసుపాలౌతుందని ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ప్రపంచలోని ఇతరదేశాలు హిందువులను గురించి,వారి ధర్మంగా నడుస్తున్నరాలేదా అని ఆలోచించవు. భారతదేశంలో వారి వ్యాపారానికి ఉన్న అవకాశాలు ఎంత? అని మాత్రమే ఆలోచిస్తాయి.

    ReplyDelete
    Replies
    1. శ్రీ రాం గారూ,
      మీరు పొరబడుతున్నారు.నేను "యే వెలుగుల కీ ప్రస్థానం?యే మలుపుల కీ ప్రయాణం!" అనే పోష్టులో కూడా ఆఖర్లో రెండు మతాల వాళ్ళకీ కొన్ని విషయాలు చెప్పాను.అక్కడా ఇదే మాట చెప్పాను.ముస్లిములని బుజ్జగించటానికి డింపట్ నెహ్రూ పాటించమని చెప్పిన కుహనా లౌకికత్వాన్ని మతపెద్దల అధీనంలో వున్న ముస్లిము లెవరూ పాటించలేదనీ కాస్తో కూస్తో వుదారులైన హిందువులు పాటించడం వల్లనే పరువు దక్కిందనీ నాకు తెలుసు.ఆ హిందువులు పరువు దక్కించడం కూడా అంతకన్నా అత్యున్నతమైన "సర్వధర్మ సమభావన" లో ఇది కూడా కలిసి వుండటం వల్లనే కదా!

      ఇప్పటి దాకా వున్నతంగా వున్నవాళ్ళు ఇప్పుడెందుకు ఆ ఒక్క మెట్తయినా దిగడం?ఈ దేశంలో ముస్లిములు యెలా ఇంతగా పెరిగారు అంటే తేలికగా ఔరంగజేబుని చూపిస్తాం.కానీ క్రీస్టియానిటీ పెరగడానికి అస్పృశ్యతే కారణం,కాదా?వున్న లోపాల్ని తొలగించుకుని నిన్నటి కన్నా ఇవ్వాళ,ఇవ్వళ్టి కన్నా రేపు మరింత యెత్తుకు యెదగాలే తప్ప యే కారణం చెప్పి అయినా కిందకి దిగడం దేనికి?

      గీతని గురించి చెప్పాలంటే - అక్కడ సుష్మా స్వరాజ్ అన్నది ఒకటి బైటికొచ్చింది ఒకటి గాబట్టి నేను గట్టిగా వ్యతిరేకించను గానీ పునరాగమనాలు మాత్రం అనవసరమే.

      Delete
  4. మీరు రాసినదాని ప్రకారం క్రీస్టియానిటీ పెరగడానికి అస్పృశ్యతే కారణం అయితే వారు, మతం మారిన తరువాత అస్పృశ్యత ఇంకా ఎందుకు కొనసాగుతున్నట్లు? దళితులను చిన్న చూపు ఎందుకు చూస్తున్నట్లు? నేడు అగ్రవర్ణాల వారిని ఎందుకు మారుస్తున్నట్లు? కొంచెం ఆలోచించి చెప్పగలరా?
    అంటరాని కంపు భరించలేక అందులోకి వెళితే , అక్కడా అంతకంటె ఎక్కువ కంపు అంట !?
    http://ssmanavu.blogspot.in/2014/12/blog-post_15.html

    హిందువులు మతం లొని లోపాల్ని తొలగించుకుని మరింత ఎత్తుకు ఎదగాలని చెప్పే లిబరల్స్ అవతలి వారు రోజుమతం మార్పిడులు చేస్తున్నా ఎటువంటి నోరు మెదపరెందుకని?
    70 Hindus allegedly converted to Christianity in UP
    http://www.indiatvnews.com/news/india/70-hindus-allegedly-converted-to-christianity-in-up-45367.html

    ReplyDelete
    Replies
    1. శ్రీరాం గారూ,
      మీరు ఇచ్చిన లింకులు రెండూ చూశాను.కొంత ఇదివరకె తెలుసు.లయోలా కాలేజిలో చదివేటప్పుడు ఒక రెడ్డి క్రిస్టియన్ ఒక మరో క్రిస్తియన్ వుందేవాడు.రెడ్ది క్రిస్టియన్ ఒకసారి తనే చెప్పుకున్నాడు వాళ్ళ చర్చి ఫాదరు "You arae the back-bone of church" అని అన్నాదని,చూశారా?

      నేను మీ మాత కాదనదం లేదు.కానీ ఇప్పటి వరకూ వున్న తేదా - నేను పునరాగమనాల కన్నా ముందు వున్న లోపాలు సరి చహెసుకోవాని అంటున్నాను.సరే ప్రియారితీఎ ముందూ వెనకా అయినా ఈ రెందూ తప్పని సరిగా జర్గాల్సినవే.మనవు గారి బ్లాగును నేను మొదట్లో అపార్ధం చేసుకున్నాను.ఈ లింకులో వారు చెప్పింది చదివాక నిజమే గదా అనిపించింది!యేది యేమయినా ఇవ్వాళ వున్న మిగతా మతాలతో పోలిస్తే హిందూ ధర్మం సిగ్గు పదాల్సిన స్థితిలో మాత్రం లేదు.

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...