Thursday, 11 December 2014

రావు గారూ,బాబు గారూ - మీరు కట్టబోయే ఆకాశ హర్మ్యాలలో యెవరు వుంటారండీ?!

                                            సీ||రావులు, బాబు లంతాను వార్వారి సొం
                                            త సుఖాల కోసమే తప్ప జనుల

                                            కోసమై పనిచేయబోరు, తెలుసుకొని
                                            మసులుకొనుడు!వందిమాగధులను

                                            వెంటబెట్టుకొనెడు వైభవములె తప్ప
                                           "యెవడురా వాడు నా ప్రజల మీద

                                            దౌష్ట్యము చేసేది?!" అంటు హుంకారము
                                            చేసెడి వారిప్డు లేరు,లేరు?

                                       తే||ఆకసమును తాకెడి భవనాలు గట్టి
                                             అపర రావణాగ్రజుల నుంచెదరు గాని
                                             బీదబిక్కిల నందులో చేర్చబోరు,
                                             నిజము- జాగరూకతయె బెస్టు నేడు మనకు?!
                                                                                                          (07/12/201)
_______________________________________________________________
    ఆకాశహర్మ్యాలు కట్టడానికి చాలా ఖర్చవుతుంది.ఆ ఖర్చుకు తగ్గ్గట్టుగా అందులో అద్దెకు వుండాలన్నా కొనుక్కుని వుండాలన్నా కోట్లకు పడగలెత్తిన ధనవంతులకే తప్ప సామాన్యులకు అందుబాటులో వుండవు. బయటికి కనిపించేటట్టు అంచున వున్నవాటికి తప్ప గాలీ వెల్తురూ అసలు రాదు. ఒక సినిమా పాటలో పట్టపగలు దీపాల పట్నవాసం అని వెక్కిరించినది ఇలాంటి పరిస్థితినే! మనకి అత్యవసరమయిన ఆక్సిజన్ భూమి కింది పొరల్లోనే దట్టంగా వుంటుంది,  పైకి వెళ్ళేకొద్దీ పల్చబడుతుంది.

     యేదయినా అగ్నిప్రమాదం సంభవిస్తే క్షేమంగా బయటపడటం చాలా కష్టం. అమెరికాలోనే దీనికి సరయిన పరిష్కారం కనుక్కోలేదు, జాగ్రత్తలు తీసుకోవడం తప్పించి జరగకూడనిది జరిగితే మాత్రం తాలిబన్లు కూల్చేసిన జంట భవంతుల మాదిరి అందరూ హతమారి పోవటమే తప్ప మరోవిధంగా బయటపడే మార్గమే వుండదు?! మరి విభజనానంతరం ఈ రెండు రాష్త్రాల ముఖ్యమంత్రులూ కేంద్రమూ స్మార్ట్ సిటీల పేరుతో చేసే హడావిడి దేనికి?ఖచ్చితంగా తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడానికే!ఇతరమయిన తమ పనుల్లో నెలకొన్న అయోమయాన్ని కనబడనివ్వకుండా వీటి గురించి వూరించి మభ్యపెట్టి పబ్బం గడుపుకోవటానికి గాక నిధులూ ఆదాయాల లెక్కలే తేలని పరిస్థితుల్లో వుండి యేమిటీ ధీమా కబుర్లు?

         ఇప్పటికే నగరజీవనం ఈ రియల్ మాఫియాకి కోట్లు కురిపించే ప్రక్రియతో అధ్వాన్నంగా తయారయింది! కొంచెం ఆగి ఆలోచిస్తే నగరాలలో ఇవ్వాళ జరుగుతున్న నేరాలన్నీ రెండు రకాలు.మన పక్కింటి వాణ్ణి హఠాత్తుగా ఒక నేరంలో అరెస్టు చేసేవరకు ఆవ్యక్తి అటువంటి వాడని పక్క ఫ్లాటు వాళ్లకే తెలియదు? నిర్భయ చట్టాల లాంటివి ఇన్ని వచ్చిన తర్వాత కూడా స్నేక్ గ్యాంగులు వీరవిహారం చెయ్యటం, బరితెగించి తాళ్లతో మంచాలకి కట్టేసి వ్యభిచారం చేయించటం లాంటివి చేసేటందుకు వాళ్ళకి వున్న ధైర్యం - మనమెవరమో యేం చేస్తున్నామో యెవరికీ తెలియదులే అన్న పరిస్థితి వల్ల కాదా!

        అందరూ తిరోగమన వాది అని పిలిచే విశ్వనాధ సత్యనారాయణ గారు "వేయి పడగలు" నవలలో వర్ణించింది సుబ్బన్నపేట అనే గ్రామం యొక్క పుట్టుక,పెరుగుదల,నాశనం! కొన్ని దశాబ్దాల తర్వాత స్పీల్ బర్గ్  "బ్యాక్ టు థ ఫ్యూచర్" అనే సినిమా ట్రయాలజీలో చూపించిన హిల్ వ్యాలీ అనే ప్రాంతం యొక్క మూడు దశలూ సుబ్బన్న పేట విషయంలో విశ్వనాధ చూపించినట్టుగానే వుంటాయి!?.ఈ ఇద్దరు కళాకారులూ చేస్తున్నది ఒకే హెచ్చరిక - తొందరగా దబ్బు సంపాదించే వీలు వుండటం వల్ల మనుషులు దానికోసం పడే మితిమీరిన ఆరాటం, అందులో విఫలమవడం నుంచి పుట్టే అశాంతి మనిషిని మనిషిగా మిగలనివ్వదని!మనకి తెలియకుండానే వూడలు దిగిన మర్రిచెట్లలా కాంతిని మింగేస్తూ వుండే ఈ భవంతుల పట్ల అసౌకర్యంగా అనిపిస్తూ వుంటుంది కదా? అయినా మరో దారి లేనట్టు సర్ధుకు పోతున్నాం,కానీ మరోదారి యేదయినా వుందా అని కనీసం ఆలోచించను గూడా ఆలోచించటం లేదు!

        సింగపూరులోనూ అమెరికాలోనూ కనిపించే భవంతుల్ని చూపించి వాళ్ళు ఇక్కడికి రావదానికి బాగుంటుందని కొందరూ వాళ్ళని మెప్పించడానికి పనికొస్తాయని కొందరూ అంటున్నారు గానీ కొన్ని దశాబ్దాల క్రితమే ఈ రకమయిన నిర్మాణాలతో వాళ్ళ కనుచూపుమేరని కప్పేసుకున్న వాళ్ళకి ఇప్పుడు వాళ్లనే ఇమిటేట్ చేస్తూ కట్టినవి కొత్తగా కనబడతాయా? మనకున్న ప్రకృతి సౌందర్యంతో అలరారే సహజ సౌందర్యాన్ని చూపిస్తే విస్మితు లవుతారు,వాళ్ళకు అక్కడ దొరకనిదీ ఇక్కద వున్నదీ అయిన పరిశుభ్రమయిన గాలిని పీల్చుకునే అవకాశమిస్తే కృతజ్ఞులవుతారు! కొయ్యబొమ్మలె మెచ్చు కళ్లకు కోమలుల సౌరెక్కునా అన్నట్టు గాలికి తలలూపుతూ జీవంతొణికిసలాడే పచ్చని పొలాల్ని ధ్వంసం చేసి నిర్జీవంగా పడివుండే నిశ్చల భవంతులు కట్టి యెవరిని మెప్పిస్తారు?

    అసలు ఇప్పుడు మనం వుంటున్న ఈ చిన్న చిన్న అపార్టుమెంట్ల లోనే రెండు ముఖ్యమైన లోపాలు వున్నాయి.కట్టేవాళ్ళు భవన నిర్మాణంలో రెండు మార్పులు చేస్తే అందులో వుండే జనం చాలా హాయిగా వూపిరి పీల్చుకోగలుగుతారు! ప్రతి ఫ్లోరుకీ ఒక కామన్ రీదింగు రూము లాంటి ఒక పెద్ద హాలు వుంటే ఇది అందరూ ఒకచోట చేరడానికి వుపయోగ పడుతుంది. దానివల్ల యేవరు యెలాంటి వాళ్ళో తెలుస్తుంది. ఇంకా ఇవ్వాళ నగరాల్లో వుండే పిల్లలలో మనం చూస్తున్న అవలక్షణాలకి వాళ్లకి పాజిటివ్ అప్ప్రైజల్ విలువ యేమిటో తెలియక పోవటం!వుదాహరణకి నేను చెప్పినట్టు ఒక కామన్ హాలు వుందనుకోండి, ఆదివారాల్లో సంగీతమో నాట్యమో వచ్చిన వాళ్ళు చిన్న ప్రదర్శన ఇస్తే అనదరూ వాళ్లని చప్పట్లు కొట్టి మెచ్చుకుంటుంటే మనమూ అలా చేసి పేరు తెచ్చుకోవాలని మిగతా వాళ్ళు కూడా తమలో వున్న ప్రతిభని చూపిస్తారు,అవునా కాదా?కానీ ఇవ్వాళ వాళ్లకి వినబడుతున్నవి కేవలం చదువుకి సంబంధించిన హెచ్చరికలే!ఇవ్వాళ్టి పిల్లలు అమ్మానాన్నలయినా సరే దైరెక్టుగా ఇచ్చే వుపన్యాసాల కన్నా నలుగురు పెద్దవాళ్ళు ఒకచోట కూర్చుని మాట్లాడుకునేటప్పుడు ఇండైరెక్టుగా తమ చెవిలో పడే చిన్న చిన్న మాటల ద్వారానే నేర్చుకుంటున్నారు,గమనించారా?

       మరొకటి ప్రతి ఫ్లోరుకీ ఒక చిన్న గార్డెన్ లాంటిది కావాలి. మొక్కలు పెరగాలంటే తప్పనిసరిగా టాపు వుండదు కాబట్టి గాబట్టి యెండ,గాలి ఇక్కడ పుష్కలంగా దొరుకుతుంది.ఇరవయి నాలుగు గంటలూ ఫ్యానుల కిందా ఏసీల్లోనూ వుందటం వల్ల వచ్చే చర్మరోగాలకి దూరంగా వుండవచ్చు! మరీ పెద్ద పెద్ద చెట్లు అక్కద పెంచలేమని నాకూ తెలుసు గానీ కుండీల్లో పెంచదగినవి అయినా మనిషి కన్నా యెత్తు యెదిగి నీడ నిచ్చేవి చాలా వున్నాయి గదా!చిన్న చిన్న భవనాల విషయంలో ఇవి గొంతెమ్మ కోరికల్లాగా అనిపించవచ్చు గానీ యెక్కువ ఫ్లాట్లు వుండి యెక్కువ అంతస్తుల్లో కట్తే వాటిల్లో మాత్రం ఇవి తప్పనిసరిగా వుండాలి!ఇప్పటివరకూ భవన నిర్మాతలు వీటిని చేర్చలేదంతే దాని అర్ధం వాళ్ళ్లకి ఆ ఆలోచన రాలేదని అయినా అనుంకోవాలి,వచ్చినా ఆ స్థలంలో వొదిలేసే ఫ్లాటుల వల్ల వచ్చే లాభం మీద దృష్టి అయినా అయి వుండాలి?కాబట్టి అందులో నివసించబోయే వాళ్ళు వీటిని గురించి గట్టిగా అడిగీతే తప్ప ఇవి జరగవు!

P.S:అది జరగటం అనేది పిచ్చి కుదిరితే గానీ పెళ్ళి కుదరదు, పెళ్ళి జరిగితే కానీ పిచ్చి కుదరదు అన్నట్టు అసలు అపార్టుమెంట్లలో వుండాలనుకునే వాళ్ళలో చాలా మంది తమ లోగుట్టును భద్రంగా దాచుకునే వొంటికాయ  సొంటికొమ్ము బాపతు గాళ్లే?!అయినా క్షెమంగా బతకాలనే ఆశతో నన్నా వీట్ని పట్టించుకుని కొంచెం జాగ్రత్తగా బతుకుతారని చిన్న ఆశ! 

5 comments:

  1. హరి బాబు గారు, చాల బాగా చెప్పారు! మా బంధువులు ఒకాయనకి ఇదే సలహా ఇచ్చాను నేను, అన్నన్ని లక్షలు పోసి ఆకాశం లో అపార్ట్ మెంట్ కొనడం కన్నా సొంత ఊరిలో మంచి ఇల్లు కొనుక్కోవచ్చు కదా లేకపోతె ఇంకొన్ని డబ్బులు పెట్టి పని చేసే ఊర్లోనే సొంత ఇల్లే కొనుక్కోవచ్చు కదాని. దానికి ఆయన ఇచ్చిన సమాధానం, మహా నగరాల్లో ఇళ్ళ స్థలాలన్నీ లిటిగేషన్ల మయం అపార్ట్ మెంట్ ఐతే బిల్డర్ పడతాడు ఆ పాట్లన్నీ సొంత ఇల్లయితే మనం పడలేము అని. ఇది కొంతవరకు నిజమే, మన వాళ్ళు తాతముత్తాతల నాటి పొలాలు సరిగ్గా రిజిస్టర్ చేయించకుండా ఒప్పంద పత్రాల మీదనే పని నడిపిస్తారు భవిష్యత్తులో ఇలాంటి సమస్యలుంటాయని ఊహించరు

    ReplyDelete
    Replies
    1. మీరన్నది నిజమే కానీ బిల్డర్లౌ కూడా పెద్దగా యేం కష్తపదరు.ఈ రిజిస్ట్రేషన్ తలనొప్పులు మనకి ముందునుంచీ వున్న భాయలే తప్పించి గట్టిగా శ్రధ్ధ పెడితే మన్మూ మోసపోకుండా వుందొచ్చు!బిల్దర్లు ఆ పేరు చెప్పి భయపెట్టే మన దగ్గిర యెక్కువ గుంజుతున్నారు,మనం శ్రధ్ధ చూపించకనే దెబ్బ తింటున్నాం.

      Delete
  2. 24 గంటలూ విద్యుత్ సౌకర్యం లేకుండా ఆకాశ హర్మ్యాలు కట్టటం అంటే నాకు సామెత గుర్తుకు రావటల్లేదు. షుమారుగా చెప్పాలంటే జేబులో పైసా లేకుండా 7 స్టార్ హోటల్లో భోజనం చేయ్యాలనుకోటం.

    ReplyDelete
  3. మహా నగరాలలో ఆకాశహర్మ్యాలు తప్పవు. అవి అవసరం ఉన్నంత వరకు కట్టుకోవాలి కాని గొప్ప కోసం, ప్రదర్శన కోసం కట్టుకోకూడదు.
    మీరన్నట్టు ఏదైనా ప్రమాదం జరిగితే రక్షించే సామర్థ్యం ఫైర్, పొలీస్ శాఖలకు ఉందా అని కూడ చూడాలి.

    ReplyDelete
  4. అవును,మీ మాట కరెక్టే!

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...