Sunday, 27 December 2015

నిజంగా ఇగ్లీషు ప్రపంచ భాషలందు మేలుబంతియా?ఇంగ్లీషు రాకపోతే ప్రపంచంలో ఇంకెక్కడా బతకలేమా!

     మా తాతగారు అరివీర భయంకర కమ్యునిష్టు!ఎంత గొప్ప కమ్యునిష్టంటే ఆయనెదురుగా కమ్యునిజాన్నీ మార్క్సునీ ఎంగెల్సునీ ఎంత తిట్టినా కిమ్మనే వాడు కాదు,కానీ నెహ్రూని గానీ ఇందిరా గాంధీని గానీ ఏ కొంచెం మాట తూలినా సరే ముసలి సింహంలా విరుచుకు పడేవాడు,బతికుండగా చాలాసార్లు అడిగాను "తాతయ్యా!నీమీద కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసి పెరుగన్నం లేంది ముద్ద దిగని నిన్ను కొండపల్లి గట్ల మీదకి పంపించిన మనిషిని నువ్వు మంచిది అంటున్నావు, మరి అంత మంచిదానికి కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఇవ్వాలన్నంత కోపం తెప్పించిన నువ్వు మంచివాడి వెట్లా అవుతావు?" అని - సూటిగా జవాబు చెప్పలేదు!ఎంత శాస్త్రీయంగా అలోచించే వాళ్ళకయినా కొంత వెర్రి సహజమేనని సరిపెట్టుకోవాలి,లేకపోతే నాకు మనశ్శాంతి కరువవుతుంది మరి:-)

     ఇవ్వాళ మాతృభాషలో విద్యాబోధనకి మోకాలొడ్డుతూ ఇంగ్లీషుని సమర్ధించేవారి వాదనలు కూడా అలాగే ఉన్నాయి.ఇంగ్లీషు ప్రపంచంలో కల్లా అత్యంత ప్రజాదరణ గల భాష అట!ఇవ్వాళ మనం చూస్తున్న అభివృధ్ధి అంతా సైన్సూ,సోషలూ,మ్యాథ్సూ,చెమిస్ట్రీ,ఫిజిక్సూ అన్నీ వాళ్ళు కనుక్కున్నవే గాబట్టి వాళ్ళ భాషలోనే చదవాలట!పోనీ సాంకేతిక పదజాలాన్ని మన భాషలోకి మార్చుకుందాం అంటే పుట్టించిన ప్రతి మాటకి పది వెక్కిరింపులు!"పెంటామిరస్" అనే మాటకి "పంచభాగయుత" అని అందామంటే మాకు పంచెలు గుర్తుకొస్తున్నాయి అంటారు అక్కడ ఉన్న పెంట బాగనే ఉందేమో మరి?ఇంకా వీరు చెప్పే అతి ముఖ్యమైన కారణం - ఇంగ్లీషు నేర్చుకోకపోతే గ్లోబల్ కనెక్టివిటీకి దూరమైపోతామట?!
     పైన ఉన్న మ్యాపుని చూశారుగా,అందులో దార్క్ బ్లూ కలరులో ఉన్నవి ప్రజల్లో ఎక్కువమంది మాట్లాడుతూ మాతృభాషగానూ రాజభాషగానూ ఇంగ్లీషు చలామణీ అవుతున్న దేశాలు,లైట్ బ్లూ కలరులో ఉన్నవి అనధికారికంగా ఇంగ్లీషు ప్రధానభాషగా ఉన్న దేశాలు - దాదాపు ఇవన్నీ ఒకప్పటి మహా ఘనత వచించిన రవి అస్తమించని బ్రిటిషు సామ్రాజ్యపు వలస దేశాలు!వారు వలసల పేరుతో ఆక్రమించుకుని బలవంతంగా రుద్దిన చోట్లలో తప్ప మరెక్కడా ఇంగ్లీషు కనబడటం లేదు,గమనించారా?
     పైన ఉన్న మ్యాపుని చూశారుగా,పింకు రంగులో తళత్తలాయమానంగా మెరుస్తున్నవి వారి విజృంభణలోకి వెళ్ళి వారి పాలనలో తమ మూలాల్ని కూడా మర్చిపోయేటంతగా కొన్ని తరాల పాటూ గడిపిన దేశాలు - వారి వలసలు.అదండీ ఇంగ్లీషు యొక్క విశ్వవ్యాప్తమైన వైభవం!మనవాళ్లకి దేశం దాటితే అమెరికా తప్ప ఇంకొక దేశం కనబడ్డం లేదు,కాకుంటే వారి ముత్తాత అయిన బ్రిటిషు వారి మూలాలు ఉన్న లండన్ నగరంలో తప్ప ఇంకెక్కడా చెల్లకుండా పోతామేమోనని ఏదో మొహమాటంతో కూడిన భయం ఒకటి ఉన్నట్టుంది మన దేశంలోని ఆంగ్లభాషాభిమానులకి - అలవాటయిపోయిన బానిసత్వం ఒక పట్టాన వదలదు పాపం!

     ఇంగ్లీషు వాళ్ళు వలసలు ఏర్పాటు చెయ్యటం మొదట 1580లో సర్ వాల్టర్ ర్యాలీఘ్ అనే పెద్దమనిషికి దక్షిణ అమేరికాలో కాలనీ ఏర్పాటు చెయ్యడాబికి పర్మిషన్ ఇవ్వడంతో మొదలైంది.సరే, పర్మిషన్ తీసుకుని వెళ్ళాడు,తొలి వలసని ఏర్పాటు చేశాడు,వర్జీనియా అని పేరు పెట్టాడు - పెళ్ళికాని రాణి పేరు మీద!మొదటి రెండు సార్లు లోకల్స్ గట్టిగా నిలబడటంతో ఫెయిలయ్యి ఆఖరికి 1857లో మొదటి డిపెండెంట్ కాలనీ జాన్ వైట్ గవర్నరు గిరీతో మొదలైంది.అయితే, 1591లో కొత్త సప్లైల కోసం బ్రిటన్ వెళ్ళి తిరిగొచ్చేసరికి కాలనీ మొత్తం గల్లంతై "Croatan" అనే పేరు ఉన్న ఒక చెక్కముక్క(Sign Board) మాత్రం మిగిలింది - ఖాజీ సాయెబు గారు పోయి తురకల్లో గల్సాడన్నట్టు కూలీలుగా ఉన్న సెటిలర్లు పోయి హ్యాపీగా నేటివ్ తెగల్లో కల్సిపోయారు:-)

     చచ్చీ చెడీ శాయంగల విన్నపములై అన్నట్టు మళ్ళీ మళ్ళీ సెటిలర్లని పంపగా పంపగా 1619 నాటికి వర్జీనియా పూర్తి స్థాయిలో ఇండిపెందెంట్ కాలనీగా ఏర్పడింది.అట్లా తొలిదశలో 13 కాలనీలు ఏర్పడ్డాయి.ఇవ్వాళ్టికీ ఆ పేర్లు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ప్రముఖంగా వినబడుతున్నవే - 1).మసాచుసెట్స్ 2).న్యూ హాంప్ షైర్ 3).రోడ్ ఐలాండ్ 4).న్యూ యార్క్ 5).కన్నెక్టికట్ 6).న్యూ జెర్సీ 7).పెన్సిల్వేనియా 8).డిలావర్ 9).మేరీలాండ్ 10).వర్జీనియా 11).నార్త్ కరోలినా 12).సౌత్ కరోలినా 13).జార్జియా.

     అలా మొదలైన వీళ్ళ విజృంభణ కెనడా,ఇండియా,ఆస్ట్రేలియా,ఈజిప్టు,పశ్చిమ,దక్షిణ,తూర్పు ఆఫ్రికా దేశాలతోపాటు ఇరాక్ వంటి అనేక ఖండాల్లో అనేక దేశాల్లో వాలుగాలిలో తెరచాప నావలా సాగిపోయి దారి కడ్డు వస్తే మహా పర్వతాల్ని కూడా పెకలించుకుని లాక్కుపోగలిగిన గోదావరి వరదలాగ చెలరేగింది.ఈ వలసల స్థాపనకి సుమారు 200 సంవత్సరాలు పడితే ఎక్కడికక్కడ చీకొట్టించుకుని మళ్ళీ సముద్రంలో కాకిరెట్ట లాంటి తొలినాటి స్థితికి చేరుకోవటానికి ఎంత గట్టిగా లెక్కేసినా 50 ఏళ్ళు దాటి ఉండదు - దీనివల్ల ఏమి సాధించారో వాళ్ళకే తెలియాలి!నిన్నటికి నిన్న టోనీ బ్లెయిర్ ఇరాక్ మీద దాడికి అబధ్ధాలని పేర్చీ మరీ వ్యూహాలు పన్నడం చూస్తే గతంలో తాము చేసింది తప్పని అనుకోనట్లు కనిపిస్తుంది - సిగ్గులేని జాతి!అయితే, ఒకనాటి బ్రిటిషు జాతిలోని మహోన్నతుల్ని తలుచుకుంటే ఈ పాడుపని అంత మొండిగా చేసి ఉండకపోతే,ఆ మాననీయుల ఆదర్శాల ప్రకారం నడుచుకుని ఉంటే ప్రపంచం మొత్తం సగౌరవంగా తల వంచి నమస్కరించాల్సిన స్థితి వీరికి దక్కి ఉండేది -  వివేక భ్రష్ట సంపాతం ఒకసారి మొదలైతే మధ్యలో ఆగనివ్వదు కాబోలు!

     ఇంగ్లీష్ వాళ్ళ వైపు నుంచి వస్తున్న ఆగని దాడికి కొంతా తెగల్లోనూ ఇంగ్లీషు వాళ్ళ మూలంగా అమరుతున్న కొత్త సౌకర్యాల పట్ల పెరపెర వల్ల కొంతా పట్టు సడిలి 1620ల నాటికి మొత్తం 13 కాలనీల్లోనూ మొదట న్యాయమైన జీతభత్యాలిచ్చే అవసరం లేని అర్ధ బానిసల వ్యవస్థ వూపందుకుని తెల్లజాతి అమెరికన్ వ్యాపారస్థులు యూరోపియన్ పొగాకు మార్కెట్లని కొల్లగొట్టి ధనవంతులయ్యారు.అలా మొదలై మొత్తానికి 1700 నాటికి బానిసల వ్యవస్థ పూర్తిగా స్థిరపడిపోయింది.అంటే, ఇంక కనీసపు మానవసహజమైన హక్కులు కూడా లేని సామూహిక దోపిడీ చట్టబధ్ధం అయిపోయింది.అమెరికా స్వాతంత్ర్య పోరాటం అని వారు చెప్పుకునేది అమెరికాలోని తెల్లజాతివారు తమ మూలస్థానమైన బ్రిటిష్ రాణి అధికారం నుంచి పూర్తిగా తెగదెంపులు చేసుకోవడమే తప్ప మరొకటి కాదు.ఈ 21వ శతాబ్దంలో కూడా అక్కడి భూమికి నిజమైన హక్కుదారులైన ఒకనాటి స్థానికులకి స్వావలంబనకి అవకాశం లేదు- కనీసపు హక్కులు కూడా లేవు!

     వలస నుంచి 1940లో విడిపోయిన ఉత్తర అమెరికా ఖండంలోని కెనడా కూడా తెల్లజాతివారు తమకోసం తాము ప్రకటించుకున్న అర్ధ స్వాతంత్ర్యమే తప్ప అక్కడా నేటివ్ కమ్యూనిటీ పరిస్థితి దయనీయంగానే ఉంది.1947లో విముక్తమైన భారత్ కూడా సాంస్కృతికంగా తన పరాధీనతని పోగొట్టుకుని తనదైన స్వయంప్రభతో ప్రకాశించే అవకాశం ఉన్నప్పటికీ అధిక సంఖ్యాకుల్లో బలంగా పాతుకుపోయిన సాంస్కృతికపరమైన బానిసత్వం వల్ల ఆ దిశలో ముందుకు అడుగు వెయ్యటం లేదు.బ్రిటిషర్లకి సముద్రవాణిజ్యం కోసం సూయజ్ కెనాల్ యొక్క అవసరం ఉండటం వల్ల ఈజిప్టు మీద తన పెత్తనాన్ని వదులుకోవడం ఇష్టం లేక ఎక్కువ కాలమే నిలబెట్టుకున్నా 1956లో సూయజ్ కెనాల్ మీద అధిపత్యాన్ని వొదులుకుని ఈజిప్టు నుంచి కూడా వెనక్కి వెళ్ళక తప్పలేదు.ఒకరిని చూసి మరొకరు ఆవేశం తెచ్చుకున్నట్టు ఆఫ్రికా దేశాలూ,ఇరాక్ వంటివన్నీ 1950 దరిదాపుల్లోనే వలస పాలన నుంచి విముక్తం అయ్యాయి.ఇప్పటికీ చిన్నా చితకా దేశాలు కొన్ని వారి వలసలు గానే ఉన్నాయంటే వారి భల్లూకపు పట్టు ఎంత గట్టిదో అర్ధం చేసుకోవచ్చు!

     ఇంగ్లీషువాళ్ళు భారతదేశంలో అంతగా విస్తరించటానికి కారణం అప్పటి రాజుల్లో ఉన్న అనైక్యతా సమాజంలో ఉన్న చీలికలూ అనే చారిత్రక నిష్పక్షపాతం వాళ్ళూ మనలోనే తప్పులు ఉన్నాయి గాబట్టి ఇంగ్లీషువాళ్ళ మీద కోపం తెచ్చుకోకుండా అహింసాయుతంగా పోరాడితే చాలునన్న మోహనదాసు భక్తులూ ఇతరదేశాల్లో వాళ్ళు చేసింది ఏమిటో తెలుసుకోవాలి.ఏడుతరాలు నవలలో కుంటా కింటే అనే ఒక వ్యక్తి స్వేచ్చ కోసం మాటిమాటికీ తప్పించుకు పారిపోతున్నాడని గొడ్డలితో అతని కాలిని నరికే సన్నివేశం చదువుతుంటేనే "అబ్బ?" అని ఒళ్ళు జలదరించినంత పనయ్యింది నాకు!ఆస్ట్రేలియాలో వీళ్ళు అడుగుపెట్టకముందు స్థానికులైన అబోరిజిన్స్ మీద వీళ్ళు చేసిన దుర్మార్గం మనిషైన వాడు ఎవడూ వూహించనిది!అబోరిజిన్సని పిలిచే స్థానిక సంప్రదాయ జీవనం గడిపే తెగల్లోని ఆడవాళ్ళని రేప్ చేసి తమ ద్వారా వాళ్లకి పుట్టిన పిల్లల్ని తల్లుల నుంచి దూరం చేసి తమ ఇళ్ళల్లో పనివాళ్ళుగా పెట్టుకుని ఎబోరిజిన్స్ చిన్నపైల్లల మీద అత్యాచారాలు చేస్తారనీ అనాగరికులనీ నూరిపోస్తూ పెంచారు.అంటే, ఒక జాతికి సంబంధించిన కొన్ని తరాల్ని ఆ జాతి మీదకే ఉసి గొలపడం అన్నమాట - అదంతా స్టోలెన్ జెనరేషన్స్ పేరుతో ప్రపంచంలోని పాపులందర్నీ పరిశుధ్ధ పరచటం కోసం తాను శిలువను మోసిన కరుణామయుని కీర్తించే చర్చి కూడా ఏ మాత్రమూ కరుణలేని విధంగా ప్రవర్తించిన చారిత్రక వాస్తవం!ఇలాంటివాళ్ళతో మోహనదాసూ అతని భక్తులూ పళ్ళికిలిస్తూ వాళ్ళ తిండి తిని వాళ్లతో ఫొటోలు దిగి గుండ్రబల్ల ముచ్చట్లు ఎలా చేశారో నాకిప్పటికీ అర్ధం కాదు!ఇంగ్లీషు వాడైన షెరిడన్ మహాశయుడు తన తిట్లు తగిలేది తన జాతికే అనేది కూడా పట్టించుకోకుండా భారతదేశంలో జరుగుతున్న దాని గురించి తెలిసి తీవ్రమైన కోపం తెచ్చుకుని "భగవంతుడి పేరున నా అణువణువులోనూ నిండిన అసహ్యంతో ఈ ప్రభుత్వాన్ని శపిస్తున్నాను" అనేశాడు,  అంతటి ధిక్కారం మనకేది?

     అయితే, రాగద్వేషాల కతీతంగా అంచనా వేస్తే బ్రిటిషు వలస పాలన నుంచి బయటపడిన తర్వాత ఇరాక్,ఈజిప్ట్,జమైకా,కెన్యా,నైజీరియా వంటి దేశాల పరిస్థితి స్వయంపాలన వల్ల అప్పటికన్నా మెరుగుపడలేదు సరిగదా మరింత అనాగరికత వైపుకి పయనించాయి.భారత్ పరిస్థితి కూడా ఆనాటివారు ఆశించినంత గొప్పగా ఈనాటికీ లేదు, ఎందుకు?ఈ వాదనతో మరోసారి ప్రపంచాన్ని కబళించడానికో ఏమో కొందరు యూరోపియన్ మేధావులు ఈ సూత్రీక్రణలతో కొత్తగా విశ్లేషణలు కూడా మొదలుపెట్టారు. అంటే, ఆయా దేశాల్లో గతంలో తాము చేసిన ఘనకార్యాలు తప్పు కాదని అనుకుంటున్న వాళ్ళు - ఇరాక్ మీద యుధ్ధానికి అబధ్ధాలను కూడా చెప్పిన టోనీ బ్లెయిర్ ఒక్కడే కాకుండా - చాలామందే ఉన్నారన్నమాట!నిజంగానే ఇంగ్లీషువాళ్ళు చెప్పినట్టు ఈ దేశాలు స్వయంపాలనకి అర్హత లేకపోయినా తమలో లేని గొప్పని ఉందనుకుని ఆవేశపడి స్వతంత్రం ప్రకటించుకుని తప్పు చేశాయా?కానే కాదు,అసలు కారణం వేరే ఉంది!వీటి గత చరిత్రలో ఒక మెలిక ఉంది, ఇంగ్లెషు వాళ్ళు వలసలు స్థాపించక ముందు నుంచీ ఆయా దేశాల్లో అనేక జాతులు కలిసి మెలిసి బతికాయి,అనేక రకాల ప్రభుత్వాలు కొన్ని వేల సంవత్సరాల ముందు నుంచీ అక్కడి ప్రజల్ని ప్రభావితుల్ని చేశాయి.ప్రతి కొత్త సంస్కృతీ తొలిదశలో పాత సంస్కృతితో సంఘర్షించినా పోనుపోనూ వాటిమధ్య సయోధ్య యేర్పడి ఎంత పరస్పర విరుధ్ధమైన సంస్కృతులైనా ఏమాత్రం విడదీయటానికి వీల్లేనంతగా కలిసిపోయి ఒకే సంస్కృతిగా రూపు దిద్దుకున్నాయి.కానీ ఇంగ్లీషు వాళ్ళ ప్రభావం అలాంటిది కాదు,ఇది వారి సంస్కృతిలో కలవకపోగా ఆయా సంస్కృతులని నాశనం చెయ్యడానికి ప్రయత్నించింది!వీరి మీద తిరగబడే సమయంలో తమ సొంత ఆస్తిత్వం కోసం ఇంగ్లీషువాళ్ళు రావడానికి ముందరి కాలంలోని మూలాల్ని వెదుక్కునే ప్రయత్నంలో కలిసిపోయిన కాలంలో కనిపించని వైరుధ్యాలు ఇప్పుడు ప్రముఖమై కనబడుతున్నాయి.మన దేశంలో ప్రస్తుతం మనం చూస్తున్న గందరగోళం - స్వాతంత్రపోరాట కాలంలో సమైక్యంగా పోరాడిన భిన్న వర్గాలు దేశం స్వాతంత్ర్యాన్ని పొందిన తర్వాత ఒకరితో ఒకరు కలహించుకోవడానికి మూలకారణం ఇదే!

     ఇంగ్లీషు భాష పట్ల మనకున్న వ్యామోహాన్ని వొదులుకుని మాతృభాషల్లో విద్యాబోధనకి ప్రాధాన్యత ఇవ్వనంతవరకూ మనల్ని పట్టిన పరాధీనతా పోదు,సాంస్కృతిక బానిసత్వమూ  వదలదు,మన దేశం ప్రపంచంలో తలయెత్తుకుని నిలబడటమూ జరగదు.ఒక జాతి సంస్కృతి యొక్క గొప్పదనానికీ ఆ జాతి మాట్లాడే భాషలోని సాహిత్యానికీ దగ్గరి సంబంధం ఉంటుంది.ఒక తరం నుంచి ఒక తరానికి సంస్కృతి ప్రవహించేది మాతృభాష ద్వారానే - అందుకే ఇంగ్లీషువాళ్ళు తమ తెలివి నంతా ఉపయోగించి మొదట దాని మీదనే దాడి చేశారు - వలసల్ని స్థిరపర్చుకోవడానికి వాళ్ళు ఫాలో అయిన మోడస్ ఆపరేండి లోని మొదటి మెట్టు మాట్లాడే భాషని మార్చటం, ఇంగ్లీషు భాషని స్థానికుల చేత బలవంతంగా మాట్లాడించటం. భారతదేశంలోనూ సరిగ్గా ఇదే జరిగింది,కాకపోతే ఇక్కడ క్రూరంగా వెళ్తే మొదటికే మోసం వస్తుందని తెలుసు గనక కొంచెం సుకుమారమైన పధ్ధతిలో వెళ్ళారు,అంతే!మందు కొట్టేవాళ్ళకి కిక్కు యెక్కడం రెండు రకాలుగా ఉంటుందని తెఉసు.ఆబగా కక్కుర్ర్తిగా లాగిస్తే ఎంత ఫాస్టుగా టాపు లేపేటంత రేంజిలో ఎక్కుతుందో అంత ఫాస్టుగా దిగిపోతుంది - దాన్ని తట్టుకోలేనప్పుడే వాంతులూఒ హ్యాంగోవర్లూ వస్తాయి!ఆరారగా కబుర్లు చెప్పుకుంటూ పుచ్చుకుంటే కిక్కు ఎక్కడం ఎక్కుతున్నప్పుడు తెలియకపోయినా ఎక్కాక మాత్రం ఒక పట్టాన దిగదు!ఇంగ్లీషువాళ్లని తరిమికొట్టేసి వందేళ్ళు పూర్తి కావొస్తున్నా ఇంకా "all the historical information which has been collected from all the books written in the Sanskrit language is less valuable than what may be found in the most paltry abridgements used at preparatory schools in England." అంటూ మన సంస్కృతి పట్ల ఇంత దుర్మార్గమైన వెక్కిరింతతో ఉన్న అజ్ఞాన సింధువు లార్డు మెకాలే గారు ప్రవేశపెట్టిన సాంస్కృతిక పరాధీనతని పెంచే విద్యావిధానాన్ని మార్చుకోకుండా జాతి స్వాభిమానాన్ని పెంచే మాతృభాషలో చదువుకోకుండా మనకు మనమే అడ్డు పడుతున్నామంటే ఇంగ్లీషువాళ్ళు మనకి ఎక్కించిన పరాధీనత కిక్కు ఎంత బలంగా ఎక్కిందో చూడండి!
Thomas Babington Macaulay
     తొలిదశలో ఎక్కడో ఒక ప్రాంతంలో పుట్టిన జర్మను భాషలోని మాండలిక రూపం అతి తక్కువ కాలంలోనే ఇంతింతై వటుడింతయై పెరిగి ఉప్పెనవలె ప్రపంచ మంతటా వ్యాపించింది - అది నేటి ఇంగ్లీషు భాష!ఆ వ్యాపించటం ఎలా జరిగింది?ఇప్పటికీ తమ దేశంలో జాతీయభాషగా మాత్రమే పరిమితమైన జర్మను భాష కన్నా దాన్ని ప్రపంచవ్యాప్తం చేసినది - దూరతీరాలకు వ్యాపించి,వ్యాపించిన ప్రతి చోటా బలవంతంగా రుద్దగలిగిన స్థాయిలో చెలరేగిపోయిన రాజకీయాధికారం!అదే మాదిరి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని ఒక మాండలికమైన హిందీ అప్పటి ప్రభువులు తమ కార్యకలాపాల్లో వాడటం వల్ల క్రమేణా పెరిగి నేటికి దేశంలో ఎక్కువమంది మాట్లాడే భాషగా అవతరించింది.ఇవ్వాళ్టికీ తమిళులు ఒక్కరే ఈ స్వదేశపు భాషని జాతీయభాషగా గుర్తించడానికి నిరాకరించి ఇంకా పరదేశపు భాష ఇంగ్లీషునే ఎక్కువగా ఆదరించడానికి కారణ మేమిటి?తమిళనాడు లోని సామాన్య ప్రజలు వ్యతిరేకిస్తున్నారా?వారు హిందీ సినిమాలు అస్సలు చూడరా!కాదు,అక్కడ కూడా ద్రవిడ నామధేయాన్ని పార్టీ పేరులో ఉంచుకున్న వారి రాజకీయమే కారణం!

     ఒక జాతి ఏ విధంగా నైనా శక్తివంతమైతే,తన సొంత గడ్డ ఆ శక్తికి ఇరుకైపోతే,తప్పనిసరిగా వ్యాపించే దశలో ఉంటే ఆ జాతికి సంబంధించిన అన్ని రూపాల్లోనూ అది ప్రతిఫలిస్తుంది -- భాష,కళ,ఆర్ధికం,హార్ధికం!వ్యాపించే సమర్ధత ఉన్నది గనక వ్యాపించియే తీరుతాడు - "రెక్కలుండటమే వస్తే ముడుచుక్కూచుంటాడా ఎవడైనా(గులాబి అత్తరు)!" అయితే కొత్త చోటుకి వెళ్ళినవారు మన ప్రాచీనుల వలె మర్యాదస్తులు అయితే ఉభయతారకమైన పంపకాలు జరుగుతాయి!కానీ ఆంగ్లేయులు మాత్రం వారు వ్యాపించిన ప్రతిచోటా ఆధిక్యాన్నే ప్రదర్శించి ఇతరుల సంస్కృతుల్ని ధ్వంసం చేసి ఆ స్థానంలో తమ వాటిని ప్రవేశపెట్టారు!వారి ధ్వంసరచన ఎంత క్రూరమైనదంటే వారి వలసలు స్వతంత్రమైనాక కొన్ని దేశాల వారికి తమదైన సంస్కృతికి మళ్ళటానికి పాత గుర్తులు పూర్తిగా మాసిపోయేటంత!

     మరాఠా అస్తిత్వానికి ముచ్చటపడి శివసేనను అభిమానిస్తున్న మహారాష్త్ర ప్రజల్ని గానీ తమ ప్రాంతపు ఆస్తిత్వం కోసం పట్టుబట్టి సాధించుకున్న తెలంగాణ ప్రజల్ని గానీ కర్ణాటక తదితర రాష్ట్రాలలో చెలరేగుతున్న ప్రత్యేక ఉద్యమాల్ని గానీ దేశభక్తి లేనివాళ్ళు మూర్ఖంగా చేస్తున్న వేర్పాటువాదపు విధ్వంసకర ప్రయత్నాలుగా ముద్ర వెయ్యకుండా వాటిలోని అస్తిత్వవాదపు మూలాల్ని చూస్తే భవిష్యత్తు కార్యాచారణకి అవసరమైన దారి కనబడుతుంది.పుట్టీ పుట్టగానే మనిషికి మొదట వచ్చేది అస్తిత్వమే, దేశభక్తి అనేది వ్యక్తి పెరిగి పెద్దయి సమాజం లోకి వెళ్ళాక వస్తుంది.ప్రతి వ్యక్తికీ ఒక మాతృభాష ఉంటుంది.తల్లిదండ్రులు,బంధుమిత్రులు వాళ్లల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ తనతో మాట్లాడుతూ తనకి పరిచయం చేసే భాష శిశుప్రాయం నుంచే అలవాటైపోతుంది.కానీ బళ్ళో వెయ్యంగానే నువ్వు వృధ్ధిలోకి రావాలంటే మన భాషలో కాదు,ఇవన్నీ మళ్ళీ కొత్తగా ఇంగ్లీషులో నేర్చుకోవాలి అంటే ఆ పిల్లవాడు ఖచ్చితంగా గందరగోళానికి గురవుతాడు.అప్పటికి తన మాతృభాష మీదనే పూర్తి అధికారం రాని స్థితిలో భావానికీ రూపానికీ ఇంకా లంకె కుదరకుండా ఉన్నప్పుడు ఈ అస్పష్టమైన పాండిత్యాన్ని అమాంతం కొత్త భాషలోకి తర్జుమా చేసుకోవడం అయిదారేళ్ళ కుర్రవాడికి/కుర్రదానికి సాధ్యపడుతుందా అనేది ఆంగ్ల భాషాభిమానులు ఆలోచించడం లేదు!సహజంగా ఇవ్వాళ మనం స్కూళ్ళకి పంపిస్తున్న వయసులో పిల్లలందరూ కొత్తవి నేర్చుకోవడం పట్ల ఆసక్తిగానే ఉంటారు,అయినా కొందరు మొద్దావతారాలుగా ఎందుకు తయారవుతున్నారు?అప్పటివరకూ మాతృభాషలో కేరింతలు కొట్టిన పిల్లలు ఈ గందరగోళానికి అలవాటు పడకపోవటమే ఎంతో హుషారుగా మొదలుపెట్టిన చదువుల్ని అర్ధాంతరంగా ఆపెయ్యటానికి అసలు కారణం!మాతృభాషలో విద్యాబోధన నిక్కచ్చిగా జరగడానికి మొదటి ఆఖరి అడ్డంకి పాఠ్యపుస్తకాల్ని ప్రాంతీయ భాషల్లోకి తర్జుమా చెయ్యగలిగిన ద్విభాషాకోవిదులైన పండితులు లేకపోవటమే తప్ప ఈ దేశపు పిల్లలు చదువుకోవడానికి ఉత్సాహంగానే ఉన్నారు.

     ఇవ్వాళ ప్రపంచంలో ఎక్కువమంది మాట్లాడుతున్న భాష ఇంగ్లీషు కానేకాదు,ఒక లెక్క ప్రకారం అది నాలుగో స్థానంలో ఉంది!Ethnologue: Languages of the World, 15th ed. (2005) & Wikipedia.org వారి లెక్కల ప్రకారం చైనీస్ మాండరిన్ భాషను మాతృభాషగా గలవారు 873 మిలియన్లు ఉండగా 2వ భాషగా నేర్చుకుని మాట్లాదగలుగుతున్నవాళ్ళు 178 మిలియన్లు ఉన్నారు - మొత్తం మీద 1.051 బిలియన్ల మంది మాట్లాడుతూ ప్రధమ స్థానంలో ఉంది!హిందీ భాషను మాతృభాషగా గలవారు 370 మిలియన్లు ఉండగా 2వ భాషగా నేర్చుకుని మాట్లాదగలుగుతున్నవాళ్ళు 120 మిలియన్లు ఉన్నారు - మొత్తం మీద 490 మిలియన్ల మంది మాట్లాడుతూ ద్వితీయ స్థానంలో ఉంది!స్పానిష్ భాషను మాతృభాషగా గలవారు 350 మిలియన్లు ఉండగా 2వ భాషగా నేర్చుకుని మాట్లాదగలుగుతున్నవాళ్ళు 70 మిలియన్లు ఉన్నారు - మొత్తం మీద 420 మిలియన్ల మంది మాట్లాడుతూ తృతీయ స్థానంలో ఉంది!ఇంగ్లీషు భాషను మాతృభాషగా గలవారు 340 మిలియన్లు ఉండగా మొత్తం మీద 510 మిలియన్ల మంది మాట్లాడుతూ చతుర్ధ స్థానంలో ఉంది!స్థానం మాతృభాషని బట్టి ఇచ్చారనేది గుర్తుంచుకుంటే 510 మిలియన్లు ఉన్నా నాలుగో స్థానంలోకి ఎందుకు వెళ్ళిందో తెలుస్తుంది.మళ్ళీ 2013లో తీసిన లెక్కల ప్రకారం ప్రపంచంలో మాతృభాషగా ఉండి ఎక్కువ మంది మాట్లాడుతున్న 10 భాషలు ఇవి:1). మాండరిన్(1197 మిలియన్లు) 2).స్పానిష్(406 మిలియన్లు) 3).ఇంగ్లీష్(335 మిలియన్లు) 4).హిందీ-ఉర్దు(260 మిలియన్లు) 5).అరబిక్(223 మిలియన్లు) 6).పోర్చుగీస్(202 మిలియన్లు) 7).బెంగాలి(193 మిలియన్లు) 8).రష్యన్(162 మిలియన్లు) 9).జపనీస్(122 మిలియన్లు) 10).జవనీస్(84 మిలియన్లు) - దీన్ని బట్టి మీకేం అర్ధ మవుతుంది? ప్రపంచంలో ఇంగ్లీషు భాష ఒక్కటే కాదు,మనం నేర్చుకుని మాట్లాడగలిగితే ఉపాధి/వ్యాపారం/జీవితం కోసం ఎక్కడికయినా వెళ్ళోచ్చు అని కదా!

     అంకెలు పూర్తిగా ఖచ్చితం కాకపోవచ్చు,ఎందుకంటే చైనీస్ భాషల్లో మాండరిన్ అనేది ఒక మాండలికం కావచ్చు,మళ్ళీ మాండరిన్ లోనే ప్రాంతాన్ని బట్టి శాఖలూ ఉండవచ్చు - మనకి తెలుగులో ఉన్న జిల్లాల వారీ మాండలికం లాగ!కానీ స్థూలంగా నిష్పత్తులలో మాత్రం చాలా కొద్ది తేడాయే ఉంటున్నది.లెక్కల కోసం ఎంచుకున్న పధ్ధతి పూర్తి శాస్త్రీయంగానే ఉన్నది కాబట్టి ఈ గణాంకాలు అందరూ ఒప్పుకుంటున్నవే.ప్రస్తుతం దేశాల వారీగా చూస్తే ఇంగ్లీషు 101 దేశాల్లో ప్రాచుర్యంలో ఉంది,అరబిక్ 59 దేశాల్లో ప్రాచుర్యంలో ఉంది,ఫ్రెంచ్ 51 దేశాల్లో ప్రాచుర్యంలో ఉంది,స్పానిష్ 31 దేశాల్లో ప్రాచుర్యంలో ఉంది,రష్యన్ పోర్చుగీస్ 11 దేశాల్లో ప్రాచుర్యంలో ఉన్నాయి.ప్రస్తుతం సమాచార సేకరణకి సంబంధించి అంతర్జాలం మీద ఆధారపడుతున్నాము గాబట్టి వాటి వివరాలు చూసినా ఇంగ్లీషు ఒక్కటె ఇంటర్నెట్ మొత్తాన్ని ఆక్రమించెయ్యలేదని తెలుస్తుంది.ఇంటర్నెట్ వినియోగంలో నిష్పత్తి ఇలా ఉంది: 1).ఇంగ్లీషు(27.3%) 2).చైనీస్(22.6%) 3).స్పానిష్(7.8%) 4).జపనీస్(5.3%) 5).పోర్చుగీస్(4.3%) 6).జర్మన్(4.0%) 7).అరబిక్(3.3%) 8).ఫ్రెంచ్(5.2%) 9).రష్యన్(2.5%) 10).కొరియన్(2.1%) - అందరూ ఆంగ్ల భాషా వ్యామోహంలో లేరు!

     జ్ఞానం ఏ రూపంలో ఉన్నా అది భాష ద్వారానే ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.ఆ జ్ఞానం సాంకేతిక పరిజ్ఞానం అయితే ఉపాధికీ ఆర్జనకీ తోడ్పడుతుంది,కళాసృజనకి సంబంధించినదైతే ఆనందం పరమావధి అవుతుంది.అన్ని భాషల లోనూ ఉండే సారూప్యాలు - అక్షరం,పదం,వాక్యం,నిర్మాణం/వ్యాకరణం!భాషా శాస్త్రజ్ఞు లందరూ ముక్తకంఠంతో ఒప్పుకుంటున్న మొదటి విషయం అనేక భాషలు నేర్వాలనుకున్నవారు మొదట ఒక భాషలో మంచి పట్టును సాధించాలి.ఆ తర్వాత తులనాత్మకంగా, అంటే మొదటి భాషలోని ఈ పదానికి రెందవ భాషలో ఏ పదం సరిపోతుంది,మొదటి భాషలో మనం చక్కగా  వ్యక్తీకరించగలుగుతున్న ఒక భావాన్ని మరొక భాషలో యెలా చెప్పగలం అనే విధంగా నేర్చుకోవడం తప్ప ప్రతి భాషనీ విడివిడిగా నేర్చుకోవడం అనేది శుధ్ధ తెలివితక్కువ పని.పుస్తకంలో ఎంత విషయం అచ్చయి ఉన్నా గురువు విశ్లేషించి చెప్పకుండా ఏదీ బోధపడదు - ముఖే ముఖే సరస్వతి!

     ఇవ్వాళ దేశంలో విద్యాబోధన జరగాల్సిన దానికి రివర్సు గేరులో జరుగుతున్నది.ఇంత గట్టిగా ఇంగ్లీషును చిన్నతనం నుంచీ రుద్దినా ఉత్తీర్ణత శాతం చూస్తే ఫలితం ఏమంత గొప్పగా లేదు,ప్రావీణ్యతని లెక్కించినా గిరీశం మార్కు బొట్లేరింగ్లీషు తప్ప అయిదు నిమిషాలు తప్పుల్లేని ఇంగ్లీషు మాట్లాడగలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు - ఈ ఆంగ్లభాషాప్రచారకుల్లొనే తప్పుల్లేని ఇంగ్లీషు మాట్లాడగలిగిన వాళ్ళు ఎక్కువమంది ఉండకపోవచ్చు, మరి ఎందుకొచ్చిన వ్యామోహం?మొదట మన మాతృభాషని మనం క్షుణ్ణంగా నేర్చుకుని పిదప పరభాషలో ప్రావీణ్యత సంపాదించి ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా ఒద్దికగా వాళ్లలో కలిసిపోయి బతుకుతూ మన భాషని వాళ్లకి కూడా నేర్పుతూ ఉంటే ఒకనాటికి మన భాష కూడా ఎక్కువ మంది మాట్లాడే ఎన్నదగిన భాషల్లో ఒకటవుతుంది.ఇంగ్లీషువాళ్ళలా కాకుండా అట్లా మర్యాదాపురుషోత్తముల వలె వ్యాపించితే ఎవరు కాదంటారు!

పరభాషా వ్యామోహమనే చెట్టుకి పరాధీనత తల్లివేరు - వేరుని మాడ్చకుండా చెట్టుని కూల్చలేం!


13 comments:

  1. భావ దాస్యం చావలేదండీ!

    ReplyDelete
  2. పరభాషా వ్యామోహమనే చెట్టుకి పరాధీనత తల్లివేరు - వేరుని మాడ్చకుండా చెట్టుని కూల్చలేం!

    ప్రొక్లైనర్ తో డైరెక్ట్ గా వేర్లతో సహా చెట్టునే కూల్చేయవచ్చు, మనదగ్గర కూసే గాడిదలే కానీ పని చేసే గాడిదలు లేరు కాబట్టి ప్రొక్లైనర్లు కొనాలన్నా రాజకీయ గాడిదలే కొనగలరు.

    ReplyDelete
  3. >అయిదు నిమిషాలు తప్పుల్లేని ఇంగ్లీషు మాట్లాడగలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు
    ఒకనిముషానికి కుదించండి, సరిపోతుంది. ఈ మధ్య అందరూ clarityగా చెప్పటం అన్న పదప్రయోగం చేస్తున్నారు గమనించారా? బాగా (ఇంగ్లీష్)చదువుకున్నవారు పెద్దపెద్ద positionsలో ఉన్నవాళ్ళూ 'I can able' అనటం‌ తెగవినిపిస్తోంది.

    ReplyDelete

  4. మీతో పూర్తిగా ఏకీభవించలేకపోతున్నాను.బ్రిటిష్ పాలనా కాలంలో హైస్కూల్ లో చదువుకొన్న మాకు హైస్కూల్ లో బోధనా మాధ్యమం తెలుగు లోనే ఉండేది.కాలేజినుంచిమాత్రం ఇంగ్లిష్ లో ఉండేది.మరి ఇప్పుడు మనమే 1వ క్లాస్నుంచి ఇంగ్లిష్ లోబోధించడానికి ఎవరు బాధ్యులు?మనమే కదా!1.ఇంగ్లిష్ ఒకటే కాకపోయినా అది ప్రపంచంలో ఎక్కువమంది మాట్లాడే భాషలో ఒకటి.(మిగిలినవి;ఫ్రెంచ్,రష్యన్ స్పానిష్,చైనీస్,పోర్చుగీస్,.హిందుస్తాని,బెంగాలీలను కూడా ఇందులో చేర్చవచ్చును.) మనను పాలించడం వలన ,సైన్సు మొదలైన సబ్జెక్ట్ లలో అపారమైన ఆధునిక విజ్ఞానం గల గ్రంథాలు ఆ భాషలో ఉండడంవలన మనకు ఇంగ్లిష్ భాష నేర్చుకోడం తప్పనిసరి.లేకపోతే వెనుకబడిపోతాము.2.అందువలన,మన తెలుగుభాషని ఒకlanguage subjectగా విధిగా 1వ క్లాసుక్లాసునుంచి అన్ని ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలల్లో బోధించాలి.3.మాటైములో లాగ హైస్కూలు లో నైనా మాధ్యమం తెలుగులో ఉండాలి.4.సైన్సు మొ;;పుస్తకాలన్నీ తెలుగులోకి అనువదించడానికి ప్రభుత్వం నిధులను సమకూర్చాలి. అనవసరంగా ఇంగ్లీషువారిని నిందించడం ఎందుకు?

    ReplyDelete
  5. "మీకూ మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు !"

    ReplyDelete
  6. This comment has been removed by the author.

    ReplyDelete
  7. WISH YOU HAPPY NEW YEAR TO ALL:-)
    I AM SUFFERING FROM FEVER:-(

    ఓం మణిపద్మోహం!

    ReplyDelete
    Replies
    1. ఎప్పుడో మీ చిన్నప్పుడు ఇంగ్లీషులో తక్కువ మార్కులొచ్చాయని ఇప్పుడు జ్వరం తెచ్చుకుంటే ఎలా మాస్టారూ!
      just kidding!!

      Delete

    2. ఓహో ! ఇదన్న మాట కారణం హరి "కాలమ్" అగ్రిగేటర్ లో కనిపించడం లేదే అనుకున్నా !

      జబ్బు మీద పడ్డారన్న మాట :)

      త్వరగా వదలించు కుని రండి !

      All the best for 2016!

      cheers
      zilebi

      Delete
    3. హరిబాబు గారూ మీకు మీ కుటుంబీకులకు నూతన వర్ష శుభాకాంక్షలు. మీరు త్వరగా కోలుకోవాలని అతిత్వరలో తిరిగి అదే డైనిజంతో బ్లాగ్లోకంలో కనిపించాలని నా కోరిక.

      Delete
  8. Wish you happy new year, get well soon.

    ReplyDelete
  9. Wish you speedy recovery. Wish you a happy, healthy and peaceful New Year.

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...