Saturday, 12 December 2015

ఇద్దరిదీ నీలివర్ణమే, అంతవరకే పోలిక!బుధ్దుల్లో,ముఖ్యంగా చేతల్లో ఎన్ని తేడాలు?అయినా ఐద్దరూ ఒకటే నట - ఏమిటో ఈ గందరగోళం?!

     ఒకాయన దర్జాగా రాజుగారి ఇంట్లో రాణీగారి కడుపున పుట్టి మనిషిలా బతికి చూపించాడు!ఒకాయన గర్భవాసం జోలికే పోకుండా అధాటున వాళ్ళ ముందు కొచ్చేసి కనబడ్డమే 12 యేళ్ళ పిల్లాడిగా కనబడి "నేను మీకు కొడుకునౌతున్నానోచ్" అని చెప్పి తిన్నగా శిశువై ఒళ్ళోకి దూరాడు!

     ఒకాయన బుధ్ధిమంతుడల్లే క్లాసులో ఉన్నాడా అనిపించేటట్టు ఉన్నా చదవాల్సినవన్నీ చదివేసిన సైలెంటు బాబు!ఒకాయన సాటి పిల్లలకి లీడరైపోయి అల్లరి చేస్తూ వెన్న దొంగతనాలు చేస్తూ వాళ్ళతో చల్దులారగిస్తూ ఈ పిల్లాడు దేముడేంటీ అని బ్రహ్మ దేవుడికి కూడా అనుమానమొచ్చేలా పెరిగిన వైలెంటు బాంబు!

     ఒకాయన ఏకపత్నీవ్రతమనే కఠినాతికఠినమైన నైతికనియమాన్ని తనకి తనుగా చేపట్టి తనయంతట తనుగా వలచి వచ్చిన ఎలనాగను కూడా కాదని తోసిపుచ్చి పుంసాం మోహనరూపాయ అని పొగిడించుకోగలిగిన శీలవంతుడు!ఒకాయన చిన్ననాడే వ్రజభామినులకి మగపోడుముల ముచ్చటైన తాకిడిని కూడా రుచిచూపించి ఏ వనిత కా వనితకు తానొక్కడినే అయినట్టు ఆమెకే సొంతమయినట్టు చెలరేగిపోయిన అష్టమహిషుల మనోహరుడు!

     ఒకాయన సరిగ్గా రేపు పట్టాభిషేకం అనగా ఇవ్వాళ వనవాసానికి వెళ్ళమన్నా కొంచెం కూడా బాధపదకుండా తండ్రి నన్ను ఖైదు చేసి రాజువికా అని హింటు ఇచ్చినా నాకఖ్ఖర్లేదని అదవులకి వెళ్ళగలిగిన త్యాగశీలియైన జగదేకధనుర్ధరుడు!ఒకాయన అప్పటిదాకా తను ఆడి,పాడి,అల్లరి చేసిన వ్రజభూమి తనది కాదు అని తెలిసినప్పుడు కూడా ఇతర్లని ఓదార్చాడే తప్ప తను కన్నీరు పెట్టకుండా ఉండగలిగిన స్థితప్రజ్ఞుడైన గీతాచార్యుడు!

     ఒకాయన వీళ్ళు క్షమించరాని తప్పు చేశారు అనుకున్నవాళ్ళని తను స్వయంగా పూనుకుని కోదండధారియై వధించి ధృఢవిక్రము డనిపించుకున్నాడు!ఒకాయన తన శత్రువుల్ని కూడా వాళ్లతో వీళ్ళతో చంపించి తన చేతికి మట్టంటకుండా చూసుకుని యోగీశ్వరు డనిపించుకున్నాడు!

     ఒకాయన చిన్న తప్పు చేసిందని తను ఎంతగానో ప్రేమించి తనని తప్ప ఇంకెవ్వర్నీ పెళ్ళి చేసుకోనని వ్రతం కూడా పట్టినవాడు, ఆ ఒకే ఒక్క భార్యని పదిమందిలో అవమానించేశాడు - నిన్నసలు భార్యగానే స్వీకరించను పొమ్మనేశాడు!ఒకాయన పెళ్ళాం కాలితో తన్నినా సహించి "అయ్యయ్యో కఠినమైన నా తలకి తగిలి సుకుమారమైఅన్ నీ కాలుకి గాయం అయ్యిందేమో!" అని గారాబం కూడా చేసి ఆమె కోరుకున్న పువ్వు కోసం చెట్టునే కొట్టుకొచ్చేశాడు!

     ఒకాయన భార్య మీద బెంగతో పొర్లిగింతలు పెట్టి యేడ్చి తమ్ముడు ఓదారిస్తే తేరుకుని మానవప్రయత్నంతోనే తన కార్యం సానుకూలం చేసుకుని ఆదర్శవంతమైన ప్రవర్తనతో జీవితం గడిపి విగ్రహమాన ధర్ముడైనాడు!ఒకాయన చిన్నప్పట్నుంచే ఇతరుల సంకల్పాల్ని నియంత్రించడం అనే ఒక్కటి తప్పించి అన్నిరకాల అతిమానుష శక్తుల్ని చూపించి తనకు తనే దేవుడినని ప్రకటించుకుని విశ్వరూప ప్రదర్శన కూడా చేసి లీలా మానుష విగ్రహధారియైనాడు!

అయినా ఇద్దరూ హిందువులకి సమానంగానే పూజనీయు లయ్యారు - రామ రామ కృష్ణ కృష్ణ!"ఏ యుగాని కైనా ఏ జగాని కైనా రాముడే దేవుడు" అని కొందరు కీర్తించారు."బృందావన మది అందరిదీ గోవిందుడు అందరివాడే" అని కొందరు కీర్తించారు.ఎవర్ని ఫాలో అవాలి?ఎవర్ని సారీ అనాలి?ప్రశాంతంగా "కృష్ణా రామా" అనుకోనివ్వకుండా ఈ హరిబాబొకడు ఇన్ని మడతపేచీలు పెట్టాడు, ఇదేం ఖర్మరా దేవుడా?

తెలియని వాళ్ళకి ఎప్పటికీ తెలియని గందరగోళం?తెలిసిన వాళ్ళకి తెలిసినకొద్దీ పెరిగే భక్తిచైతన్యం!

6 comments:

  1. ఈరేడు లోకాల నేకపత్నీవ్రత
    మొక్క రామునికిగా కొండులేదు
    ఒక్కటే మాటగ నొక్కటే శరముగ
    నొక్కరాముండుగా కొండులేరు
    ధర్మంబు దప్పని ధరణీశు డిలలోన
    నొక్కరాముండుగా కొండులేరు
    రక్షించు విభులలో రాణకెక్కిన యతం
    డొక్కరాముండుగా కొండులేరు

    నామ జప మాత్ర తరియించు నామమెలయ
    నొక్కరాముండు తప్ప వేరొండు లేరు
    పల్లె పల్లెన గుడులలో భజనలంద
    నొక్కరాముండు తప్ప వేరొండు లేరు .

    శిరముపై కమనీయ శిఖి పింఛముల వాడు
    చెవుల కుండల దీప్తి చెలువు వాడు
    నుదుటిపై కస్తూరి మృదు తిలకముల వాడు
    ఉరమున కౌస్తుభం బొలయు వాడు
    నాసాగ్రమున గుల్కు నవ మౌక్తికము వాడు
    కరమున వేణువు మెరయు వాడు
    చర్చిత మైపూత హరి చందనము వాడు
    గళమున ముత్యాల కాంతి వాడు

    తరుణ గోపికా పరి వేష్ఠితముల వాడు
    నంద గోపాల బాలు డానంద హేల
    లీల బృందావనము రాస కేళి దేల
    వచ్చు చున్నాడు కన్నుల భాగ్య మనగ .


    ReplyDelete
  2. మీ కవిత్వం వల్ల నా పోష్టుకి మరింత సొబగు అబ్బింది!

    కృతజ్ఞతలు__/\__

    ReplyDelete
  3. Well written sir. Expecting more

    ReplyDelete
  4. Well written sir. Expecting more

    ReplyDelete
  5. ద్వాపర యుగంలో ఎలా ఉండాలో రాముడు త్రేతాయుగంలో చూపెట్టాడు. కలి యుగంలో ఎలా ఉండాలో కృష్ణుడు ద్వాపర యుగంలో చూపెట్టాడు. మనం జగద్గురు శ్రీ కృష్ణ పరమాత్మా చూపిన దారిలో పయనిస్తే కలి యుగంలో గెలుపు మనదే.

    ఎప్పటికెయ్యది ప్రస్తుత
    మప్పటికి కా మాట్లాడి యన్యుల మనముల్
    నొప్పించక తానొవ్వక
    తప్పించుక తిరుగు వాడే ధన్యుడు సుమతి

    ఇది నేను ఎక్కడో చదివాను. నిజమనిపించి పాటిస్తున్నాను

    ReplyDelete
    Replies
    1. ఔను నిజం,మీరన్నది నిజం!
      జగద్గురువే మనకు ఆదర్శం,
      జగదేక ధనుర్ధరుడే మార్గదర్శి!

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...