Wednesday, 1 July 2015

శ్రీరమ సీతయై శ్రీనిధితో పలికిన పలుకుల మెరిసినది తెలుగు వారి జీవనదము - గోదావరీ మాత!

సీ||శ్రీరమ సీతయై శ్రీనిధితో పలి
    కిన పలుకుల మెరిసినది తెలుగు

    వారి జీవనదము - గోదావరీ మాత!
    దక్షిణ గంగ!వేదములను విని

    వేదములను పలికే చిలుకల కొలి
    కి! పొడుపు మలపైకి ఇనుడు రాక

    మున్నె దేవతలు తా మునిగి తరించు మ
    హిమలు గల రసధుని!వగపేల

తే||ఆంధ్రులార,గోదావరి పారునంత
     వరకు మనకిక తిరుగు లేదండి!పట్టి
     గుండెలో నిల్పి దేవిలా కొల్చి హార
     తులను ఇవ్వరే - తల్లికి తగిన రీతి?!
(30/06/2015)



పవిత్రతలోనూ ప్రాముఖ్యతలోనూ పరీవాహక ప్రాంతంలోనూ గంగానది తర్వాత రెందవ స్థానం గోదవరి నదికి దక్కుతుంది భరతఖందపు జీవనదు లన్నింటిలోనూ!అటువైపున అరేబియన్ సముద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ కనుమల్లో మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో కొలువై ఉన్న త్రయంబకేశ్వరుని పదసన్నిధిలో పుట్టిన ఈనది సుమారు 1,465 కిలోమీటర్ల దూరం ప్రవహించినంత మేరా భూమిని సారవంతం చేస్తూ చత్తీస్ గఢ్,మహారాష్ట్ర,తెలంగాణ,ఆంధ్రప్రదేశ్,మధ్యప్రదేశ్,ఒడిషా రాష్ట్రవాసుల్ని ఆప్యాయంగా పలకరిస్తూ తెలుగువారికి అపరిమితానందాన్ని కలిగిస్తూ  అటువైపున పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం దగ్గిర తూర్పు కనుమల్ని చేరుకుని బంగాళాఖాతంలో కలుస్తూ అత్యంత సారవంతమైన భూముల్ని మరింతగా తన జీవజలంతో అభిషేకిస్తున్నది!

నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తిలో ఈనది తెలుగువాళ్ళని పలకరించటం మొదలవుతుంది.ఆదిలాబాద్ జిల్లాలోని బాసర అనే ప్రపంచంలోనే అపురూపమైన సరస్వతీ నిలయం ఈ నదికి అనుబంధమైనదే!ఈ నదీతీరంలోని నగరాలలో రాజమహేంద్రవరానిది వేయి స్తంభాలతో రామప్ప గుదిలోని యక్షిణీ శిల్పాలతో కోటిలింగాలతో కొలువుదీరిన శోభాయమాన్మైఅన ఘనత!ఈ నగరాన్ని దాటాక గౌతమీ గోదావరి, వశిష్ఠ గోదావరి అనే రెండు శాఖలుగా చీలుతుంది.గౌతమి మళ్ళీ గౌతమి,నీలరేవు అనే రెండు పాయలుగా చీలుతుంది.అటు వశిష్ఠ కూడా వశిష్ఠ, వైనతేయ అనే రెందు పాయలుగా చీలుతుంది.ఈ నాల్గు పాయలతో సోదరి కృష్ణతో కలిసి ఆ నడిమధ్యన సిరులు పొంగిపొరలే వరిధాన్యపు గంపని యెత్తుకుని ఆంధ్రమాత నిలబడింది పచ్చనాకు సాక్షిగా!

ఈ నది పుట్టుకకి సంబంధించిన కధలో రామకధ లోని అహల్యా గౌతముల కధ వినిపిస్తుంది.కానీ ఈ కధలో రామకధ ప్రస్తావన యేమీ ఉండదు.ఈ గౌతమ ఋషి తన భార్య అహల్యతో కలిసి భ్రహ్మగిరి పైన కాపుర ముండేవాడు.ఒకనాడు తన ధాన్యపురాశిని దొంగిలించి తింటున్న గోవుని అదిలించటానికి దర్భను వాడగా గోవు చనిపోతుంది!అప్పుడు ఆ గోహత్యా పాతకాన్ని శమింపజేసుకోవడానికి శివుణ్ణి ప్రార్ధించగా శివుడు మెచ్చి త్ర్యంబకేశ్వరుడుగా అవతరించి గంగను వదిలాడు.ఆ జలధారయే గౌతముని పేర గౌతమి అనీ పాపపరిహారానికి సాయపడింది గనుక గోదావరి అనీ పిలువబడుతున్నది!

భారతీయులు యే నదినైనా పుణ్యక్షెత్రాలతో కొలువుదీర్చి పుష్కరస్నానాలతో తమనీ తమ సమస్త లౌకిక పారలౌకికమైన విషయాలన్నింటిలోనూ ఆ నదితో మమేకం అవుతూ ఉంటారు కదా!నాసిక్ సింహాష్ట కంభమేళా ప్రసిధ్ధం!త్ర్యంబకేశ్వరం 12 జ్యోతిర్లింగాలతో కొలువుదీరిన శివక్షేత్రం!నాందేడ్ శిఖ్కుల పుణ్యక్షేత్రం!పైఠాన్ యేకనాధ నిలయం!ధర్మపురిది అప్పటివరకూ ఉత్తర దిక్కుగా ప్రవహించే దిశని మార్చుకుని దక్షిణ వాహినియై నృసింహస్వామి కొలువుదీరిన అంగరంగ వైభోగం!వ్యాసుడు ప్రతిష్ఠించినాడని భావించే వ్యాసర బాసరగా మారిన సరస్వతీ నిలయం!దక్షిణ గంగాతీరంలో దక్షిణ అయోధ్యగా ప్రకాశించే భద్రాచలం!ఆంధ్రప్రాంతంలోని మరో త్రివేణీసంగమంలో ముక్తేశ్వరుడు కొలువుదీరిన కాళేశ్వరం!తెలుగుకి కావ్యగౌరవం కల్పించిన ఆదికవి నన్నయ్య తిరుగాడిన రాజమహేంద్రి పుష్కర శోభ అనన్యసామాన్యం!

గౌతముని పాపాలను పోగొడుతూ పుట్టిన గోదావరి సర్వులకూ కల్మషహారిణి అగుగాక!

No comments:

Post a Comment

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...