Sunday, 26 April 2015

హే రాజన్!నాకు బాదరాయణ ప్రగ్గడ గుర్తు కొచ్చెన్?

నేనొకప్పుడు బ్లాగుల్లోని ఒక చర్చావేదిక దగ్గిర అరిభీకరంగా వాదించి కూడా స్మశానంలో మేకు దిగ్గొట్టిన చందంగా నలభై దాటిన వాడెవడూ యెదటి వాడు యెంత హేతుబధ్ధంగా వాదించినా తను చిన్నప్పట్నించీ యేళ్ళ తరబడి యేర్పరచుకున్న అభిప్రాయాల నుంచి బయటికి రాడనే తత్వం బోధపడి మధ్య మధ్యలో శ్యామలీయం మాస్టారు ఇచ్చిన ఉచిత బోడి సలహాలు కూడా పనిచేసి నా బ్లాగులో పోష్టులకి మాత్రమే పరిమితమయిన ఇప్పుడు అక్కడక్కడా శ్యామలీయం మాస్టారు నా పధ్ధతిలో గిల్లికజాలకు దిగుతుంటే కొంచెం సరదాగానూ కొంచెం వింతగానూ అనిపిస్తున్నది?

భండారు వారి వార్తావ్యాఖ్య బ్లాగులో కొత్త తరం పెద్దా చిన్నా లేకుండా పెద్దవాళ్ళని "అరే ఒరే" అని పిలవడం గురించి ఓ పోష్టు వేశారు.పిలిచే వాళ్ళకీ పిలిపించుకునే వాళ్ళకీ చనువుంటే తప్పు లేదనీ కొన్న్ ప్రాంతాల్లో పెద్దవాళ్ళని కూడా యేకవచనంలో పిలవడం ఉందనే శ్రీకాంత్ చారి గారి వాదన కరెక్టే అయినా ఉదాహరణగా "హే రాజా" అని ఇచ్చేసరికి శ్యామలీయం మాస్టారు అసలు "హే రాజన్" అని ఉండాలంటూ మీరన్నది ఒక సంస్కృత పదానికీ తెలుగు పదానికీ సంకరం చేసిన మాట అదెట్లా కుదురుతుందనటంతో కొంచెం వాదన జరిగింది,నాకు మాత్రం ఈ "హే రాజన్" అనే మాటతో బాదరాయణ ప్రగ్గడ గుర్తుకొచ్చి ఇంకా యెవరికయినా గుర్తుకొచ్చాడా అని కామెంటు వేస్తే ఇంకొక మిత్రులు మరికొంచెం హుషారుగా కామెంటు వేశారు.దాంతో నాకు మరింత పిచ్చెక్కిపోయి యూట్యూబు గాలిస్తే కట్టింగులు లేని మొత్తం సినిమా పుణ్యాత్ములు యెవరో అప్లోడు చేసారు - దొరికింది!


ముందుగా ఈ సినిమాకి సంబంధించిన సరదా విశేషాలు కొన్ని చెప్పాలి!అన్ని సినిమాల్లోనూ భయపెట్టే రాజనాల ఇందులో సీయస్సార్ గారితో చేసిన అల్లరి యే కమెడియన్ జంటకీ తీసిపోదు.యంటీవోడు కృష్ణుడి వేషంలో కన్నా మిస్సమ్మలోకన్నా మిగతా అన్ని సినిమాల్లోకన్నా పిచ్చ స్మార్టుగా ఉంటాడు?!జగదేక వీరుడు అని పేరు పెట్టారు గదాని హీరోయిజం అదరగొట్టేటట్టు ఉండదు?తండ్రి దగ్గిర "పిలిచారా నాన్నగారూ" అని చేతులు కట్టుకు నిలబడి తన తింగరి కోరికల్ని తండ్రి ఛదామడా తిట్టేస్తుంటే కొంచెం బిక్కమొగమేసుకుని నెమ్మిదిగానే మాట్లాడే బుద్దూ లాగానూ ఆకాశం నుంచి బామ్మలా మారి దిగివచ్చిన ఆదిశక్తి కాళ్లదగ్గ్గిర భెషజాలేమీ లేకుండా కూర్చుని ఆవిడ యేం చెప్తే అది "నువ్వు యేల్తో జెప్తే నేను కాల్తో జేస్తా" నన్నట్టు ఉండే జంగ్లీ లాగానూ ఉంటుంది!రేలంగోడి రెండు చింతలూ సినిమాలో ఆడు కమెడియన్ గాబట్టి నవ్వొచ్చేలా వున్నా సీరియస్సుగా ఆలోచిస్తే యేకాలంలోనైనా మొగాడికి ఉండేవి గూడా ఆ రెండు చింతలే - తనకు తనుగా ఇష్టపడి చేసుకున్న అనుకూలవతి అయిన పెళ్ళాం మరియూ తన బతుకు చుక్కాని తన కంట్రొల్లోనే ఉండే కింగు లాంటి బతుకు తనకి దక్కేనా అని!

సినిమాలో దేవకన్యలు నలుగురూ దిక్పాలకుల కూతుళ్ళుగా చూపిస్తారు,మరయితే మనకి అష్టదిక్పాలకులు ఉన్నారుగా యెనిమిదిమంది దేవకన్యల్ని తగిలిస్తే పోయేదిగా హీరోకి(అధికస్య అధికం ధనం?) నలుగురితోనే యెందుకు సరిపెట్టేశారో అని కూడా ఒకసారి డౌటు వచ్చింది నాకు:-) అయితే మళ్ళీ నాకే సినిమాలో ఉన్న దేవకన్యల్ని దుస్తులు యెత్తుకొచ్చి వశం చేసుకోవడం అనే మెలిక చూడగానే చిన్నప్పుడు చందమామలోనో బొమ్మరిల్లులోనో బాలమిత్రలోనో చదివిన ఒక చైనా జానపద కధ గుర్తు కొచ్చేసరికి ఆ డౌటు తీరిపోయింది!అప్పట్లో చందమామ ఒక్కటే కాకుండా మిగతా రెండు కూడా పోటాపోటీ గానె ఉండేవి పిల్లల కోసం వచ్చే మాగజైన్లలో!అందులో ఒక పల్లెటూళ్ళో బలాదూరుగా తిరిగే హీరోకి ఒక చెరువు గట్టు దగ్గిర ఒక వింత దృశ్యం కనబడుతుంది,చూస్తుండగానే నాలుగు అందమైన పక్షులు యెక్కణ్ణించో యెగురుకుంటూ వచ్చి మనం చొక్కాలు విప్పినట్టు తొడుగుల్ని విప్పుకుని అందులోంచి అమ్మాయిల్లాగా బయటపడి ఇక్కడి కధలో లాగే జలకాలాటలు ఆడి మళ్ళీ ఆ తొడుగుల్ని తొడుక్కుని పక్షులుగా మారిపోవడం చూస్తాడు.దాంతో మర్మమంతా ఆ తొడుగుల్లో ఉందని అర్ధమై మరోసారి వచ్చినప్పుడు ఆ పక్షి తొడుగుల్ని కాజేస్తాడు.వాళ్ళు విధిలేక వాణ్ణి పెళ్ళి చేసుకుంటారు!తర్వాత కధ యెలా పూర్తయిందో నాకు గుర్తు లేదు గానీ అది పాతాళ భైరవికీ దీనికీ గూడా పనికొచ్చినట్టుంది!

అయితే అక్కడ హీరో పల్లెటూరివాడు గనక యెబ్బెట్టుగా లేదు గానీ బుధ్ధిమంతుడయిన ఒక రాజుగారబ్బాయి ఆడపిల్లల బట్టలు కొట్టుకొచ్చెయ్యడం లాంటి యెధవయిడియా వేస్తే జనం మెచ్చరు గాబట్టి మామ్మగారి పురమాయింపు అనే కొసరు కల్పన చేరింది.పింగళి గారి అనేకానేక కొసరు కల్పనలతో అతి చిన్న కధ కాస్తా మూడుగంటల సేపు చూసినా బోరుకొట్టనివ్వని గానాబజానాలతో హుషారు గొల్పే రంగేళీరవ్వలమొలకై కూర్చుంది!

అసలు సినిమాలెందుకు చూడాలి?సినిమాలు లేనికాలంలో జనాలు బతకలేదా?జన్మలో ఒక్క సినిమా గూడా చూడని వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు గదా!మనం మాత్రం చూడకపోతే యేం?మెస్సేజిలు ఇవ్వడానికయితే టెలిగ్రాం ఇస్తే సరిపోతుందిగా మూడుగంటలు కుర్చీలో కూలేసి సినిమా యెందుకు చూపించడం అన్న పెద్దాయన మాట కరెక్టేనా?ఇట్టాంటి సందేహాలన్నీ యమా సీరియస్సుగా యెవరికయినా వొస్తే ఆ మనిషి మహా ప్రమాదకారి అని గ్రహించండి,అతనితో ఆచితూచి ముందూ వెనకా చూసుకుని వ్యవహరించండి!అర్ధరాత్రి పూట ఆ మనిషిని కలవాల్సొస్తే ఓ నలుగుర్ని తోడు తీసుక్కుని వెళ్ళేటంత గట్టి జాగ్రత్తలు తీస్కుంటే ఇంకా మంచిది?

లేకపోతే యేంటండి!ఓ రెండు మూడు గంటలు అట్లా బయటికెళ్ళి మళ్ళీ ఇట్లా కొంపకి జేరే పనికి తెగబారెడు చర్చలు అవసరమా చెప్పండి?ఈ గందరగోళంతోనే కొందరు తిండిపోతులు మంచి సినిమా విందుభోజనంలా ఉండాలనీ,కొందరు ఉషారెక్కువైనోళ్ళు మంచి సినిమా గంతులేయించాలనీ,యెర్ర మేధావిత్వం యెక్కువైనోళ్ళు మంచి సినిమాలో సామాజిక స్పృహ ఖచ్చితంగా వుండితీరాలనీ వూదరగొడుతూ అసలే టిక్కెట్ల ధర దగ్గిర్నుంచీ ఇంటర్వెల్లో పాప్కార్న్ ఖర్చులన్నీ లెక్కేసుకుని ధియేటరు కెళ్ళడానికి ధైర్యం చాలని పిరికి మేళాల్ని మరింత హడలగొట్టి సినిమా పరిశ్రమని మట్టానికి మునిగేట్టు చేస్తున్నారు గానీ నా లెక్కలో మాత్రం సినిమా హాల్లో మనం చూసిన కంటెంటు అక్కడే మర్చిపోయేట్టు గాకుండా హాలు బయట కూడా అప్పుడప్పుడూ కనబడుతూ ఉండాలి - అది జోకయితే ఆ సినిమా గుర్తొచ్చి నవ్వొస్తుంది,అది బుర్రలో లైటు వెలిగే రకం సినిమా అయితే చూసినందుకు డబల్ ధమాకా అన్నమాట!

అయ్ బాబోయ్ మాంచి వూపులో బల్లేగా వాగేశాను గానీ నన్ను బద్నాం జెయ్యాలనుకునే వోళ్ళు ఈ రీజనింగు జాగర్తగా కూడబలుక్కుని సదివి మీనింగు బోదపర్చుకుంటే నా బతుకు బస్టాండే గందా బాబులూ?!యెందుకంటారా చక్రపాణి బాబాయి గారు మెస్సేజిలు వొద్దన్నాడు గనక అది లేదు బాగానే ఉంది ఓకే!మరి హాల్లో చూసింది బయట గూడా కనపడాలన్నది ఇరవయ్యొకటో సెంచరీలో గొట్టాం ప్యాంటులేసుకుని తిరిగే మనకి జరీ బుటేదారీ అంగరఖాలు తొడుక్కుని హీరో దేవకన్యల్ని పెళ్ళాడాలనుకునే సంగతులు యెక్కడ కనబదతాయోయ్ హరిబాబూ చెప్పవయ్యా చెప్పు అని నిలదీస్తే గుడ్లు తేలెయ్యాల్సిందే గందా?

మామ్మూలుగా అయితే అంతే గానండి నా లక్కు బాగుండి మా ఆంధ్రా యూనివర్శిటీలో ఒక సరదా సీను నడిచింది సారూ - ఈ సినిమా లేకపోతే ఆ సీను అట్టా నవ్వించేది గాదు మరి!జాయినయిన మొదట్లో హాస్టలు రూములు దొరక్క డిగ్రీలో నాకు క్లాస్ మేటయ్యి ఇక్కడ సీనియర్ అయిన ఫ్రెండు రూములో సెటిలయ్యాను నేను.మిగతా వాళ్ళంతా హాస్టలు మొత్తానికి ఒకటే అయిన కామను హాలులో నేలమీద దుప్పట్లతో కాలం గడిపేస్తున్నారు.నా రూమ్మేటు స్టూడెంటు యూనియన్ పాలిటిక్సులో మాంచి జమాజెట్టీలా వెలిగిపోతున్నాడు!అతన్ని చూడ్డానికి ఒకతను వచ్చేవాడు,అతని సబ్జెక్టు గుర్తులేదు గానీ అన్ని బ్రాంచీల్లోనూ అతనికి ఫ్యాన్సు వుండేవాళ్ళు.చూట్టానికి అస్సలు బాగుండకపోయినా అంతమంది ఫ్యాన్సు వుండటానికి కారణం యెంత డ్రై టాపిక్కునయినా జోకులా మార్చగలిగిన చాతుర్యం!ఒకసారి మా గ్రూపు సీనియర్లకీ జూనియర్లకీ క్రికెట్టు పోటీ జరుగుతుంటే తనూ వచ్చాడు.మా సీనియర్లని ఉషారు చెయ్యటానికి సీనియర్ అమ్మాయిలు బ్యాటింగు కెళ్తున్న ఒక సీనియర్ అబ్బాయిని,"నువ్వే మా అశాజ్యోతివి" అనంగానే "ఆశాజ్యోతి అంటే ఫర్వాలెదు గానీ జీవనజ్యోతి అని మాత్రం అనకండి బావుండదు" అని రిటార్టు ఇచ్చేసరికి మొగుడు జీవన జ్యోతి అవుతాడు గదానే అర్ధం వెలిగి అమ్మాయిల కందరికీ బుగ్గలెర్రబడిపోయి మళ్ళీ నోరిప్పితే ఒట్టు కాస్సేపటి దాకా:-)

అసలు జోకు ఇది కాదు అతని స్పాంటేనియిటీ యే రేంజిలో ఉంటుందో శాంపిలు చెప్పాను, అసలు జోకు కూడా మా సీనియర్ అమ్మాయిల మీదే పేలింది!యానివర్సరీ ఫంక్షనులో "ఇండియన్ బ్రైడ్స్" అనే టాపిక్ తీసుకుని మొదట ఒక్కొక్క అమ్మాయి ఇండియాలో ఒక్కో ప్రాంతపు పెళ్ళికూతురు అలంకరణలో వచ్చి ఆఖర్లో అందరూ వరసగా నిలబడ్డారు.వెంఠనే కుర్చీలోంచి అమాంతం లేచి నిలబడి అచ్చు యెంటీవోడి మాదిరిగానే చేతులు బార్లా జాపి "ఓ దివ్యరమణులారా!నేటికి కనికరించినారా?" అని రాగయుక్తంగా మైకు లేకపోయినా మా అసెంబ్లీ హాల్లో చివరి వరసక్కూడా వినపడేలా పెద్ద గొంతుతో యెత్తుకునేసరికి కింద వున్న మేము ఘొల్లున నవ్వడంతో పాటూ అక్కడ స్టేజిమీద సిగ్గుపడాల్సిన పెళ్ళికూతుళ్ళు గూడా పెట్రోమాక్సు లైట్ల లెవెల్లో నవ్వేశారు - అయ్యా అదండీ ఇవ్వాళ్టి రోజుల్లో జగదేకవీరుని కధ రెలెవెన్సీ!

జనం సినిమా కని వెళ్ళినోళ్ళు సినిమా చూసి సరిపెట్టుకోకుండా పాప్కార్న్ యెందుకు నముల్తారు?దానికి చాలా తింగరి లాజిక్కులు చెప్పుకోవొచ్చు గానండి నా లెక్క ప్రకారం యేదో పోటుగాడి మల్లే అంతదూరం పోయి డాబుగా డ్రస్సు జమాయించి పోయి సుఖమైన సీటులో కూర్చోంగానే పాతకాలం రాజుల మాదిరి మేజువాణీ డ్యాన్సులు చూస్తూ ఉన్నట్టు ఫీలయిపోయి నేను సకల కళా పల్లవుణ్ణి,ఒక్కసారి బుధ్ధిగా సినిమా చూడ్డమనే ఒక్క పనేం ఖర్మ యెన్నిపన్లయినా చెయ్యగలను అని బోల్డు కాంఫిడెన్సు బలిసిపోతాదనుకుంటాను!నేను సినిమా హాల్లో లేకపోయినా నా ముందున్న  కంపుస్కూటరు మహత్యం వల్ల నాకూ ఆ రోగం అబ్బి బుధ్ధిగా సినిమా చూడనివ్వకుండా మళ్ళీ "నలుగురు దేవకన్యలే యెందుకు?నలుగురు దేవకన్యలే యెందుకు?" అనే కొశ్చెను మైండులో రీసౌండ్ ఇస్తా వుంది?అది మరీ పెరిగి పెరిగి దీన్నిట్టాగే వొదిలేస్తే ఒక్కసారి రెండుపన్లు చెయ్యడం కాడు రెంటికీ కలిపి ఒక్కసారే గుక్కపట్టి యాడవాల్సి వొచ్చేలా ఉందని పాజు నొక్కి థింకటం మొదలు పెట్టా?

థింకగా థింకగా  తట్టిన రీజను బాగానే ఉందనిపించింది - అదేమిటంటే ప్రతి మగాడికీ తన భార్యలో నాలుగు లక్షణాలు ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది,అటాంటి నాలుగు లక్షణాల్లో ఒక్కొక్కదాన్నీ ఒక్కొక్క దేవకన్యలో ఇరికించారు ఆ నాగిరెడ్డీ చక్రపాణీ పింగళీ అనే అమేధావి త్రయం!నేనే విడివిడిగా అనలైజు చేస్తా పైన సినిమా చూస్తా ఉండారేమో గందా మిమ్మల్ని మీరే ఆలోచించుకోండని ఆట్టే కష్టపెట్టకుండా!మొదట ఇంద్రుడి కూతురు దేన్ని సూచిస్తుండి - పవర్ని!ఆడంగులు నలుగురు ఒకచోట జేరితే మొదట వాళ్ళ మధ్యన రగిలే కామను సబ్జెక్తు "మా ఆయన ఇట్లా","మా ఆయన అట్లా" అనే టాపిక్కు!అదే నలుగురు మగంగులు కలిస్తే వీలున్నంత వరకూ "మా ఆవిడ ఇట్లా","మా ఆవిడ అట్లా" అనే టాపిక్కుని అవాయిడ్ చెయ్యాలని విశ్వప్రయత్నం చేస్తారు?తప్పనిసరయి వచ్చిందంటే మాత్రం "అబ్బో మా అవిడ చాలా పవరు గల మనిషి,యే మాత్రం తేడా వచ్చినా అంతే,ఇరగదీస్తుంది(అందుకే నేను బుధ్ధిగా ఉంటా?)" అనే రేంజిలో ఉంటయ్ కబుర్లు,అవునా కాదా చెప్పండి?!

వరుణ దేవుడి కూతురు అంటే వర్ష ధారాపాతం - యే త్రిషా కృష్ణనో నిత్యా మీననో భోరున యేడుస్తుంటే మగాడి కేమనిపిస్తుంది?గాఠ్ఠిగా కావిలించుకుని ఓదార్చి బోల్డు హీరోయిజం చూపించెయ్యాలనిపిస్తుంది!ఓదార్చడానికీ కావిలించుకోవటానికీ సంబంధం యేంటంటారా - మగబుధ్ధండీ మగబుధ్ధి - ఒక చెయ్యి చాలుగా చెంపల మీద చారికల్ని తుడవటానికి మరో చెయ్యి ఖాళీగా ఉంటుందిగదా నచ్చిన చోట అట్లా అట్లా నిమురుతూ మనమూ కాస్త కిట్టించుకోవొచ్చు:-) కాబట్టి అప్పుడప్పుడూ అట్లా మనం ఓదార్చటానిక్ వీలుగా అందంగా యేడుస్తూ ఉండాలి!అవతల్నించి ఆవిడ పాటికావిడ మన్ని బుట్టలో వెయ్యడానికి ప్లాను ప్రకారం చేసినా పర్లేదు, మనకి గిట్టుబాటయితే చాలు!

నాగదేవుడి కూతురు - కాటేస్తే కాలకూట విషం తలదాకా యెక్కించగలిగి పగబడితే జీవితకాలం వేధించగలిగిన మెలికలు తిరిగే మెహబూబా!కొందరు ఆడవాళ్ళ ప్రేమ కూడా పగలాగే ఉంటుంది?కొందరు ఆడవాళ్ళ పగ కూడా ప్రేమలాగే ఉంటుంది!ప్రతిదీ తనకు నచ్చినట్లుగానే ఉండాలంటారు,అన్నీ అమర్చిపెట్టి ఈ అమరికలోనే ఉదిగి పొమ్మంటారు,అప్పుడే నువ్వు నాకు నచ్చుతావంటారు.హెయిర్ స్టైల్ నుంచి బూట్ల వరకూ వాళ్ళు సెలక్టు చేసిన వాటికే మనమూ వోటు వేయాలంటారు.కుదరదన్నామో బుసబుసల హుంకారాల నుంచీ కంచానికీ మంచానికీ దూరం చేసే వరకూ యెంత క్రూరమైన శిక్షల కైనా వెనుకాడరు!ఒక వైపు నుంచే చూస్తేనో పురుషాహంకారం జాస్తిగానో ఉంటే తప్ప అన్నీ అంత పధ్ధతిగా అమర్చిపెడుతుంటే హాయిగా అనుభవించడానికి గొడవెందుకు పెదతాడు బుధ్ధిమంతుడైన మగాడు?

ఇక అగ్నిదేవుడి కూతురంటే పొగల సెగల భుగభుగల భయద సౌందర్యం!ఇదేంట్రా బాబూ పోయి పోయి కోపిష్టి తనాన్ని కూడా కోరుకుంటామా,యెందుకు నాయనా మొహం వాచేలా చివాట్లు తినడానికా అని నన్ను ఈసడించుకోబోయే ముందు ఒక్కసారి సత్యం కాస్తా మేటాస్ అయ్యి వూచలు లెక్కబెడుతున్న ఒకనాటి ఉద్యానవనాన్ని గుర్తుకు తెచ్చుకోండి!ఆ రోజుల్లో ఆయన శ్రీమతి గనక ఈయన గారు చెయ్యబోయే తప్పుడు పని ముందే తెలుసుకుని "యేందిరా నాబట్టా ఈ పాడుపని?గాచ్చారం గాండు మారి నువ్వుగాని అర్ధాంతరంగా చిప్పకూడు తినేకాడి కెళ్తే నేను గాడిదల్ని కాయాల్నా?" అని నిగ్గదీసి ఉంటే యెట్టా ఉండేది - ఇప్పటికీ జిగ్గు భగేలు మంటా ఉండేవోడు పాపం!ఆడపెత్తనం బోడిపెత్తనం అని విసుక్కుంటారు గానీ దేవుళ్ళనే తీసుకోండి వైకుంఠవాసి భక్తులు యెంత గింజుకున్నా వెంటనే పరిగెత్తకుండా ఆవిడగారు పర్మిషన్ ఇవ్వందే వీసమెత్తు వరం కూడా ఇవ్వకుండా జాగర్తగా ఉండి యెంత క్షేమంగా ఉన్నాడు,ఇంకో ఆయన కైలాస వాసి పిలిచిందే తడవు పక్కనే ఉన్నా ఉమాదేవికి ఒక్క ముక్క చెప్పకుండా ఝామ్మని వరాలిచ్చేసి యెన్నిసార్లు ఇరుక్కుపోయాడో చూడండి!ఆ భస్మాసురుడి దగ్గిరా గజాసురుడి దగ్గిరా అన్ని అవస్థలు పడుతుంటే మళ్ళీ ఆవిడగారే తమ్ముడుగార్ని బతిమాలుకుంటే ఆయన గూడా వెయ్యగూడని వేషాలన్నీ వేసి రక్షించి తీసుకురావాల్సొచ్చింది?

హమ్మయ్య!రీజనింగు బాగానే కుదిరింది గానీ "Judge not others,Judge yourself" అన్నట్టు జనాలు కూడా వాళ్ళ మాట చెబితే గానీ ఓకేనా జోకేనా అనేది తెలియదు.జనం ముందు నిలబడి యేం చెప్పినా నేను పోటుగాణ్ణి నేను యేం చెబితే అది కిక్కురుమనకుండా ఫాలో అయిపోండి అంటే సాగదు గదా!మతిలేని మాటా శృతిలేని పాటా అన్నారు అప్పటి సినిమాలు ఇప్పటికీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేటంతగా బాగుండటానికి కారణం కేవలం వాళ్ళకున్న కామన్ సెన్సు మాత్రమే అంటే మీరు నమ్మగలరా? ఆ సినిమాలు తీసిన వాళ్ళు రెండు కొమ్ములూ నాలుగు భుజాలూ లాంటివేమీ లేకుండా చాలా మామూలు తెలివైనవాళ్ళు గాబట్టి ఆ సినిమాల్లో గూడా మనకా తెలివే కనిపించి ముచ్చటగా అనిపించేది,పక్కోడి గురించయినా మరి దేని గురించయినా సరిగ్గా ట్వీటడమే తెలియని కామగోపాల వర్మల నుంచి అట్లాంటి తెలివైన సినిమాల్ని యెట్లా ఆశించగలం?

ఈ సినిమాలో అచ్చం కచ్చేరీ చేసినట్టుగా కనిపించి వినిపించే శివశంకరీ...శివానందలహరి పాట ఎంత పెద్ద విజయమో సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ పాట వెనుక ఎందరు హేమాహేమీలు శ్రమపడ్డారు. పాట రచయత పింగళి నాగేంద్రరావు, స్వరకర్త పెండ్యాల, గాత్రం అందించిన ఘంటసాల, దర్శకుడు కె.వి.రెడ్డిల సమష్టి కృషి ఫలితమే శివశంకరీ పాట. ఇందరు ప్రతిభావంతులు ఈ పాటకు చిత్రిక పడితే నటరత్న నందమూరి తారకరామారావు వెండితెరపై తన నటనతో జీవంపోశాడు. దర్శకుడు కె.వి.రెడ్డి అప్పటికే సినిమాలో అన్ని పాటల రికార్డింగ్‌, చిత్రీకరణ‌ పూర్తి చేశాడు. కథకు కీలకమైన సన్నివేశానికి సంబధించిన పాట మాత్రమే మిగిలి ఉంది. కథానాయకుడు తన గానంతో గండశిలను కరిగించే సన్నివేశంలో వచ్చే పాట అది. సన్నివేశాన్ని సంగీత దర్శకుడు పెండ్యాలకు కె.వి.రెడ్డి వివరిస్తూ ‘మనం ఇప్పుడు చేయాల్సిన పాట సినిమాకు గుండెకాయ లాంటిది. సంగీతంలో తాన్‌సేన్‌, ఓంకారనాథ్‌ ఠాగూర్‌ వంటి ఎందరో ప్రయోగాలు చేశారు. అంతెందుకు. నారద, తుంబురుల మధ్య వివాదం వచ్చినప్పుడు హనుమంతుడు పాడితే శిలలు కరిగాయట. అంతటి ఎఫెక్ట్‌ మన పాటకు తీసుకురావాలి. "జగదల ప్రతాప్‌" సినిమా మన కథకు ప్రేరణ. ఒకసారి ఆ సినిమా చూసి రండి’ అన్నారు. పెండ్యాల చిన్నగా నవ్వి ‘ట్యూన్‌ మనం సొంతంగానే చేద్దాం’ అన్నారు. పింగళి వారు వెంటనే కలం పట్టి ‘శివశంకరీ శివానందలహరి’ అని రాసిచ్చారు. దానికి పెండ్యాల కూర్చిన దర్బార్‌ రాగం చివరకు ఓకే అయింది. మరుసటి రోజు పెండ్యాల పూర్తి పాట రాసిచ్చాడు. పెండ్యాల వారు పాడి వినిపించారు. పాట పూర్తయ్యే సరికి సరిగ్గా 13 నిమిషాలు పట్టింది. ఆరున్నర నిమిషాలకు పాట కుదించమని దర్శకుడు సూచించడంతో పెండ్యాల ఆ పాటను ఆరున్నర నిమిషాలకు కుదించి ఘంటసాల వెంకటేశ్వరరావుకు వినిపించాడు. ఆయన ఆనందానికి అవధులు లేవు. ఈ పాట నేను తప్పనిసరిగా పాడతాను. ఎన్ని రిహార్సల్స్‌ అయినా సరే అంటూ 15 రోజుల పాటు ఘంటసాల రిహార్సల్స్‌కు హాజరయ్యారు. అనంతరం పాట రికార్డింగ్‌ కూడా పూర్తయింది. ఇదంతా ఒక ఎత్తు అయితే పాటకు అనుగుణంగా ఎన్టీఆర్‌ చక్కటి హావభావాలు ప్రదర్శించవలసి ఉండడంతో ఆయన కూడా నాలుగు రోజుల పాటు రిహార్సల్స్‌ చేసాడు. పాట చిత్రీకరణ సెట్స్‌ మీదకు వచ్చింది. ఎన్టీఆర్‌ పాటకు అనుగుణంగా చక్కని పెదాల కదలికతో యూనిట్‌ మొత్తాన్ని మంత్రముగ్ధుల్ని చేశాడు. వెండితెరపై ఆ పాటకు, ఎన్టీఆర్‌ అభినయ కౌశలానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ చిత్రం 1961లో విడుదలైంది. ఈ పాట తెలుగు ప్రేక్షకులమీద చూపిన ప్రభావానికి ఒక ఉదాహరణ.డెబ్భయ్యవ దశకంలో రేపు (సి.నరసింహారావు) అనే పేరుతో ఒక మనోవైజ్ఞానిక పత్రిక వచ్చేది.అందులో ఒక పాఠకుడు శివశంకరీ పాట వింటుంటే కలిగే అనుభూతులు వివరించాడు.అతనికి నిజంగానే దేవకన్యలు ఉన్నట్టు,సినీమా,సంగీతంతో సహా జరుగుతున్నట్టు,తను ఎన్నికష్టాలు పడైనా వారిని కలవాలని అనుభూతి చెందేవాడట.అసలు విజయా బ్యానర్ తెర మీద అలా అలా కనపడుతూ ఉండగానే ఒక రకమైన మూడ్ వచ్చేస్తుంది!బ్యానర్ మొదట్లో చీకటిగా మొదలై క్రమంగా వెలుగు పరుచుకుంటూ క్రియాసిధ్ధి స్సత్వే భవతు అనేది పూర్తిగా కనపడినాక ఆర్చి లోపల రెపరెపలాడే హనుమద్ధ్వజం అలా కాసేపు కదిలి వెంటనే మాయమైపోతుంటేనే గొప్ప సినిమా చూడబోతున్నామన్న ఫీలింగు వచ్చేస్తుంది,అదో మ్యాజిక్!

మంచి సినిమాలు తియ్యడానికి కనీసపు కామన్ సెన్సు చాలని యెంతమందికి తెలుసు!

2 comments:

  1. చదివిన నీహారికలు నచ్చినా నచ్చకపోయినా ఇక్కడ ఓ కామెంటు వెయ్యకుండా వేరేచోట వేరేవిధంగా వెక్కిరించడ మెందుకో?

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు