ఇది శ్రీ మదజ్జాడాదిభట్ల నారాయణ దాసు గారికి స్నేహితుడైన ముక్తేవి పాలంరాజు గారి రచన.మామూలుగా మా వూరు అప్పట్లో తేలప్రోలు సంస్థానంలో భాగంగా వుండేది.కానీ ఈ కవిగారూ వర్ణకవి నాగరాజు అనే సంగీత విద్వాంసుడూ విజయనగర సంస్థానానికి దఖలు పడ్డారు.ఇక్కణ్ణించే అక్కడికి వెళ్ళి వస్తూ వుండేవాళ్ళు. మా ముత్తాత గారికీ ఈ ముక్తేవి కవిగారికీ "అరే,ఒరే" అనుకునేటంతటి స్నేహం.చాలాకాలం పాటు పిల్లలు కలగక ఇబ్బంది పడుతుంటే ఈ బీజాక్షరాలు గర్భితం చేసిన దండకాన్ని వ్రాసి ఇచ్చి దీనితో నీ కోరిక నెరవేరుతుందని భరోసా ఇస్తే ఆ తర్వాత దీని పారాయణ ఫలితంగా నలుగురు పిల్లలు పుట్టారు.అందులో ఒక ఆడపిల్ల - మా అమ్మమ్మ!మరో కొడుకు నాన్న వైపు నుంచి తాతయ్య?
_____________________________________________________________
శ్రీ మన్మహా అంజనీ గర్భసంభూత!సద్బ్రహ్నచారీ!కపీంద్రాది ముఖ్యా!లసద్ వజ్రతుల్య కపోలా మహారత్న సత్కుండలా కర్ణ!మౌంజీ ధరా!దీప్త యజ్ఞోపవీతాయ!కాలాగ్ని రుద్రాయ!శ్రీరామ పాదారవిందాయ!సుభ్రుంగాయ మానాంగ జంభాసురా!రంగనాధాయ!సిధ్ధాంత రంగప్రరంగేశ సంధాన!నీలాంగదా జాంబవంత సుషేణాం గవాక్ష నలానీల సంసేవ్యమానా!గిరీంద్రా నివాసాయ!
మహోఛ్ఛాటనోఛ్ఛాటనో సాగరోల్లంఘనా!లంఖిణీ మర్దనా!రాము కార్యైక నిర్వాహకా!ఘోర లంకాపురీ దాహకా!దానవాధీశ్వర సౌధాంగణోద్భంగ!వహ్ని ప్రభా మండలోధ్ధండ!మార్తాండ!చండస్పురద్భాహుదండా!మహావీర హనుమంత!మా చిత్తమందుండుమీ! మమ్ము రక్షించుమీ! వాయువేగ మనోవేగ సన్నాహ సాధ్యా!సునాశీర ముఖ్యుల్ సురల్ నిన్ను వర్ణించి లెక్కింపగా శక్తులే!వానరేంద్రా సమీరాత్మ జాతాంజనేయా!నినున్ గొల్చెదన్ యేలుకొమ్మా నమస్తే నమో!
అక్షయశ్శిక్షణా!లక్ష్మణ ప్రాణ సంరక్షణా!సర్వబృందారకాధార మందార!ఝాం ఝాంకార ఝుం ఝుం ఝుణత్కార!ఠాం ఠాంకార!పాహిమాం పాహిమాం పాహిమాం!పోషణం ణణ్ణణ్ణణ్ణాం హోంషిణీం హ్రీం హ్రీంకార!ఆహా ఆహహా ఆహహా హాసస్పురచ్చంద్రికా కుంద మందార!హాస్వాను బంధు స్వరోల్లాస!నిత్యగ్రహా బంధు!యంత్రగ్రహా బంధు!తంత్రగ్రహా బంధు!క్షుత్పిపాసాగ్రహా!భీమ పైశాచికా!శాకినీ ఢాకినీ యక్షిణీ కామినీ భైరవీ దేవి శక్తిగ్రహా!
కర్షణోత్కర్షణో ఛ్ఛాటనోఛ్ఛాటనో ఛింది ఛిందీ కుఠారేణు బంధింప రా వేగరావే హనూమంత సంజీవరాయా పరాకా వడిన్ లెమ్ము లేలెమ్ము నీవిప్పుడున్ దీని పట్టి బంధించుమీ వాలమున్ జుట్టుమీ నేలపై గొట్టుమీ గుండెలున్ ప్రేవులున్ రక్తధారాజ్యముల్ గాగ హోమాగ్నిలో భూతకృత్యన్ దగన్ జేయుమీ!
వహ్నికిన్ రావణున్ కుంభకర్ణాదులన్ గూల్చి తెభ్భంగి తభ్భంగి గూల్చుమీ నీకునా రాము నాజ్ఞే సుమీ యో హనుమంత నీతిమంత బుధ్ధిమంత సురద్వేషమంత హ్రాం ఖఖంఖం భభంభం భూభుగల్ పుట్టరారో ఛిందిఛిందీ మహిన్ మారులన్ దుర్గకున్ మారుమీ కాళికిన్ మారుమీ ఛండికిన్ మారుమీ కాకుళాధీశ ముక్తేవి శ్రీరామ దాసాయ తుభ్యం నమస్తే నమస్తే నమః
_____________________________________________________________
బీజాక్షర గర్భితం కావడం వల్ల ఉచ్చారణలో జాగ్రత్త వహించి పారాయణ నిష్ఠగా చేస్తే సంకల్పం తప్పక నెరవేరుతుంది!నాకు చాలాసార్లు కంగారు పడాల్సిన పరిస్థితుల్లో కొంత ధైర్యాన్ని ఇచ్చింది.నన్ను కోట్లకు పడగ లెత్తేటట్టు చెయ్యి,మెర్సెడెజ్ బెంజి కారుల్లో తిరిగేటట్టు చెయ్యి అని నేనెప్పుడూ కోరుకోలేదు గాబట్టి యెవరయినా కోరుకుంటే నెరవేరుతాయని గ్యారెంటీ ఇవ్వలేను!నేను మామూలుగా కోరుకునే కోరిక ,"నన్ను పుట్టించిన నీకు నా తెలివితేటలు కూడా తెలుసు,నన్ను యెక్కడుంచాలో అక్కడుంచు,అది నాకు చాలు,నా కష్టానికి తగ్గ ఫలితం చెయ్యి జారిపోకుండా నాకిస్తే చాలు,చెయ్యని పాపం నెత్తిన పడకుండా ఉంటే చాలు" అని!అనుకోకుండా ఆపద వస్తే అది తప్పించడానికి స్వామి ఉన్నాడన్న నమ్మకం వుంది?!
Where reason ends belief starts.Religion also has logic and scientific spirit!
Where belief confuses logic plunges.Science also has myth and religious spirit!
కొన్ని స్ఖాలిత్యాలున్నాయేమో!
ReplyDeleteఉదా: బంధింప రా వేగరావే హనుమంత సంజీవరాయా
ఇక్కడ హనూమంత > అని ఉండాలి.
సరి చేసాను,దీని గురించి మీకూ తెలుసునన్న మాట!
Deleteమీకిది యెట్లా తెలుసునో వివరిస్తారా మాస్టారూ!
బంధింప రా వేగరావే హనుమంత సంజీవరాయా అన్నప్పుడు గణవిభజన చూస్తే,
Delete(బంధింప) (రావేగ) (రావేహ) (నుమంత) (సంజీవ) (రాయాప)..... ఇత్యాది..
ఇది దండకం. అంటే త-గణాల తోరణం అన్నమాట. ఇందులో (నుమంత) అన్నది జ-గణం. (నూమంత) అంటేనే అది త-గణం. అందుచేత సరిగా హనూమంత అని ఉండవలసిందే మరి. ఐతే, గణవిభజన చేయనవసరం లేదు. అనుభవం మీదనే నడకలో ఇలంటివి దొరుకిపోతాయి సులువువుగానే. మాజిక్ ఏమీ లేదండి.
శ్యామలరావు గారు,
ReplyDelete"మీకిది యెట్లా తెలుసును" అని అడగటంలో హరిబాబు గారి ఉద్దేశ్యం గణవిభజన గురించి కాదనుకుంటాను. హరిబాబు గారి ముత్తాత గారి కోసం వారి స్నేహితులు ముక్తేవి కవి గారు ప్రత్యేకంగా రచించి ఇచ్చిన ఈ ఆంజనేయ దండకం గురించి మీకు యెట్లా తెలుసు అనేది హరిబాబు గారి సందేహం - అని నాకు తోస్తున్నది. నాకు అనిపించినది సరైనదా కాదా హరిబాబు గారే చెప్పాలి.
అవునవును,నేను అడిగింది ఈ దందకం గురించి యేమయినా తెలుసునా అనే,కాకపోతే "దీని గురించి" అని వొదిలేశాను గదా మాస్టారు దోషం గురించి అడిగాననుకున్నారు కాబోలు!
ReplyDelete