1901లో భారతదేశపు జనాభాలో 80% పల్లెల్లోనే వుండేవాళ్ళు!2030కల్లా ఈ దేశపు పల్లెటూళ్ళలో వుండే జనాభా 40% మాత్రమే,అంటే ఇంకో పదిహేను సంవత్సరాలకి అప్పటి పల్లెల్లో సగానికి సగం పల్లెటూళ్ళు ఖాళీ అవబోతున్నాయి?కేవలం మనుషుల స్థానచలనం మాత్రమే కాదు అక్కడ జరుగుతున్నది - పల్లెటూళ్ల చుట్టూ పెనవేసుకుని వున్న ఆసేతుశీతనగం ఒక్కలాగే కనిపించే మొత్తం భారతజాతి యొక్క మౌలిక రాజకీయ సామాజిక ఆర్ధిక సాంస్కృతిక అంశాలన్నీ మటుమాయమై పోనున్నాయి!వేషభాషల్లో సాహిత్యంలో ఇప్పటికే ఆ శూన్యం కనబడుతూనే ఉన్నది ఇకముందు జరిగేది మళ్ళీ పునర్నిర్మించలేని ఒక వ్యవస్థ పూర్తిగా కనుమరుగు కావడమే.
పల్లెల్ని ఖాళీ చేసిన ఈ జనమంతా మిడతల దండు లాగా దగ్గిర్లో ఉన్న నగరాల మీద పడుతున్నారు!ఒక పధ్ధతీ పాడూ లేకుండా యేకపక్షంగా జరుగుతున్న ఆ వలసలు మొదట్లో నగరాల్ని ఉపాధి కేంద్రాలుగా తయారు చేసి అభివృధ్ద్గి సూచికలుగా మార్చినా పోనుపోనూ సమస్యల్ని సృష్టిస్తూ నేటికి నగరాల్ని మురికివాడల మయం చేశాయి!1930ల నాటి ఆర్ధికమాంద్యం మొదటిసారి పల్లెల్ని నగరాల వైపుకి నడిపించింది,చదువు->ఉద్యోగం->నెలజీతం->భద్రమైన ఉపాధి అనే ఒకే ఒకరకమైన ఉపాధిని ఇచ్చినా ఒకసారి ఉద్యోగం వస్తే చాలు ఇంక జీవితమంతా సుఖజీవనమే అన్న భరోసా ఇచ్చే మెకాలే తరహా విద్యా విధానమే 1950ల తర్వాత కూడా కొనసాగడం ఈ వలసలు నిరంతరాయంగా జరిగేటందుకు సాయపడింది!
స్వతంత్ర భారత ప్రప్రధమ ప్రధాని పనిగట్టుకుని అటు పూర్తిగా కమ్యునిజమూ కాని ఇటు పూర్తిగా క్యాపిటలిజమూ కాని సోషలిజాన్ని ఆర్ధిక విధానంగా ప్రకటించి లెక్క ప్రకారం నడపాల్సిన ఆర్ధిక విధానాల్ని మహలనోబిస్ యొక్క ప్రాబబిలిటీ పైత్యకారి తనంతో కలిపి 80% మంది వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్న దేశంలో వ్యవసాయాన్నీ సాంప్రదాయిక వృత్తుల్నీ మార్కెట్ పరంగా ముందుకు తీసుకెళ్ళడాన్ని నిర్లక్ష్యం చేసి భారీ పరిశ్రమలతోనూ జీమూతాల్లాంటి ప్రాజెక్టులతోనూ నింపేసి హడావిడి చెయ్యడంతో పరిస్థితి మూలిగే నక్క మీద తాటిపండు పడిన చందంగా తయారయింది!దానికి తోడు మిడతల దండులాగా వచ్చిపడుతున్న జనాభాకి మౌలిక వసతులు కల్పించటానికి సంబంధించిన పరిజ్ఞానం లేనివాళ్ళు అధికార్లుగా ఉండి ప్రజల నివాసేతర మౌలిక వసతులకి కావలసిన భూమిని కూడా జనావాసాల కోసం అనుమతులిచ్చేస్తూ సొంత సంపాదన కోసం కబ్జాలను నియంత్రించకుండా చోద్యం చూస్తూ కూర్చుని నగరాలు కిక్కిరిసి పోయేటట్టు చేశారు!
అయినా 2001 నాటికి భారతదేశపు పట్టణ జనాభా 28.5 శాతంగానే ఉండినదల్లా 2011 నాటికి 30 శాతానికి పెరిగింది - అది పీవీ సంకెళ్లు విదిల్చిన ఆర్ధిక సంస్కరణల వల్ల పెరిగిన బరువు!సరయిన ప్రణాళికతో పెరిగితే జనాభా పెరగుదల అధ్బుతమైన ఫలితాల నిస్తుంది,అభివృధ్ధి వేగవంత మౌతుంది.కానీ సిటీ ప్లానింగ్ అనే సైంటిఫిక్ సబ్జెక్ట్ ఒకటి ఉందని కూడా పట్టణాభివృధ్ధి శాఖ లోని ఉన్నతోద్యొగులకే తెలియని విధంగా పరిపాలన నడుస్తున్నది.ఒక ఆర్నెల్ల పాటు సివిల్స్ ప్రిలిం నుంచి మెయిన్ వరకూ బట్టీ పట్టి చదివి ప్యాసయి ఐ.యే.యస్ అయిపోతే చాలు అతడు సర్వశాస్త్రకోవిదుడవుతాడనే మూఢనమ్మకంతో ప్రతి శాఖలో మాదిరే ఇక్కడ కూడా సిటీ ప్లానింగ్ విషయాల్లో ప్రాధమిక పరిజ్ఞానం కూడా లేని ఐ.యే.యస్ గాళ్లని నియమించేస్తున్నారు కాబోలు?!
ఇవ్వాళ్టి నగర జీవనం పరిస్థితి యేంటంటే పట్టణాల్లో 44 శాతం జనాభా ఒక్క గదిలోనే కుటుంబమంతా ఉండాల్సిన దుస్థితిలో నివసిస్తున్నారు.అదే నగరాల్లో అయితే 64 శాతం ఒక్క గదిలోనే కుటుంబమంతా ఉండాల్సిన దుస్థితిలో నివసిస్తున్నారు.ఒక గదిలో 6 నుంచి 10 మంది సర్దుకుపోయి బతకాల్సిన దయనీయమైన పరిస్థితి దాపరించింది.5 నుందీ 20 లక్షల జనాభా కల్గిన పట్టణాలలో ఒక్కొక్కరికి దినసరి అవసరాల నిమిత్తం 204 లీటర్ల నీరు అవసరం.20 లక్షల పైబడిన జనాభా కల్గిన నగరాల్లో ఒక్కొక్కరికి 272 లీటర్లు దినవారీ అవసరం కాగా మొత్తమ్మీద పట్టణాల్లో నగరాల్లో కూడా అవసరమైన దాంట్లో 20 శాతం నుండి 40 శాతం వరకూ తక్కువగా అందుతున్నది.ఈ లెక్క కేవలం ఉదయం కాలకృత్యాలు తీర్చుకోవడానికి అవసరమైన నీటికి సంబంధించినవి,త్రాగునీటి లెక్కలు ఇంకా భయానకంగా వున్నాయి!పట్టణ వాసుల జీవితకాలంలో నాలుగో భాగం కుళాయిల నుంచి వచ్చే నీటికోసం యెదురు చూడటంలోనే సరిపోతున్నది!
ఒకనాటి నగరాలు నదీతీరాల్లో పెరగడం వల్ల నీటి యెద్దడి అనుభవంలోకి రాలేదు, కానీ ఆధునికత అంటే ప్రకృతినియమాల్ని పట్టించుకోకపోవటం మన సంస్కృతిలోని ఉత్తమ సాంప్రదాయాల్ని కూడా పాతరోత కింద ధిక్కరించటం అనే అహంకారం బలిసిన వాళ్ళు నగరాల్ని నీటి వనరులకి దూరంగా నిర్మించడం వల్ల ఈ దుస్థితి వచ్చిపడింది.బెంగుళూరుకి 100 కి.మీ దూరంలో ఉన్న కావేరీ నది నుంచి నీటిని తెస్తున్నారు,అదీ నగరం నదియొక్క నీటిమట్టం కన్నా 700 మీటర్ల యెత్తులో ఉండటం వల్ల నీటిని పంప్ చెయ్యడానికి అధిక మొత్తంలో విద్యుత్తు అవసరమవుతున్నది!భాగ్యనగర ప్రజల దాహార్తిని తీర్చడానికి 137 కి.మీ దూరంలో ఉన్న నాగార్జున సాగర్ నుంచి కృష్ణా జలాల్ని తరలిస్తున్నారు?
నగరాల విస్తరణ ఒక పధ్ధతీ పాడూ లేకుండా ప్రకృతివనరుల్ని మింగేస్తూ జరుగుతున్నది.దీనివల్ల వాతావరణ సమతౌల్యం దెబ్బ తింటున్నది.ఇంటికీ పని చేసే చోటుకీ దూరం పెరగడం వల్ల రవాణా కోసం పెట్రోలు వాహనాల మీద ఆధారపడటం కాలుష్యాన్ని పెంచుతున్నది.ప్రజల కదలికల్ని క్రమబధ్ధం చెయ్యాల్సిన ట్రాఫిక్ విభాగంలోనూ ప్లానింగ్ లేకపోవడంతో ప్రమాదాలూ ప్రాణనష్టాలూ చచ్చేవాళ్ళ కోసం యేడవటానికి కూడా తీరిక లేని బతుకూ ప్రజలకి అలవాటయిపోయింది!కనీసం చచ్చినవాళ్ళని పూడ్చటానికీ కాల్చడానికీ కూడా స్థలం లేనంతగా ఇరుకైపోయాయి ఇవాల్టి మహానగరాలు?నగర జనాభాలో ప్రతి 10 వేల మందికి 4 ఎకరాల ఖాళీ స్థలం అవసరం కాగా అరెకరం భూమి కూడా ఖాళీగా కనబడటం లేదు?!
నగరాన్ని కాంక్రీటు భవనాల్తో నింపి యెన్ని గంటలు నడిచినా కాలికి మట్టి తగలనంతగా సిమెంటు కట్టడాలే తప్ప పచ్చని చెట్టుని కనబడనివ్వకూడదనే పట్టుదలతో పరిశ్రమిస్తున్న రియల్ యెస్టేట్ మాత్రమే చెప్పుకోదగిన వ్యాపారం అయిపోవడంతో చెరువులూ తోటలూ పొలాలూ అన్నీ మాయమైపోతున్నాయి!కబ్జా చెయ్యడం రియల్ యెస్టేట్ వ్యాపారానికి అనుబంధ పరిశ్రమగా యెప్పుడో మారిపోయింది?రాష్ట్రం యేర్పడిన తొలినాళ్ళలో తెలంగాణా ముఖ్యమంత్రి ఆంధ్రోళ్ళ కబ్జా నుంచి భాగ్యనగరాన్ని విడిపించాలని హడావిడి చేసి అక్కడ యే గండభేరుండాల్ని చూసి దడుచుకున్నాడో గానీ ప్లేటు ఫిరాయించి తగుమాత్రం రుసుము ప్రభుత్వానికి చెల్లించితే చాలు కబ్జా చేసిన వాడిదే భూమి అనేశాడంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు!ఇవ్వాళ వందిమాగధుల చేత స్త్రోతపాఠాలు చదివించుకుంటున్న ముఖ్యమంత్రులూ ప్రధానమంత్రులూ కూడా ఒక నగరాన్ని సైతం ఇప్పడు ఆ నగరాని కున్న సమస్యల్ని పరిష్కరించి ఆ నగర ప్రజలకి కావలసిన మౌలికావసరాల్ని తీర్చడానికి కూడా పనికిరానంతటి అసమర్ధులు!కేంద్ర పట్టణాభివృధ్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు గారి విషయమే చూడండి - యెక్కడ ప్రసంగించినా "స్మార్ట్ సిటీ","స్మార్ట్ విలేజి" అనే రెండు మాటల్లో యేదో ఒకటి దొర్లకుండా ప్రసంగం ముగించడు.కానీ ఒకప్పుడు వాటి సారాంశం గురించి ఒక్క ముక్క కూడా చెప్పకుండా స్వతంత్ర భారత ప్రప్రధమ ప్రధాని కూడా "సోషలిజం","మిశ్రమ ఆర్ధిక వ్యవస్థ" అనే రెండు మాటలతో ఆడిన నాటకమే ఈ వాగుడుకాయ కూడా ఆడుతున్నాడని నాకు రూఢిగా తెలుసు!
నగరాల క్రమబధ్ధీకరణకి సరయిన ప్రణాళిక గానీ పట్టణాభివృధ్ధికి ఒక శాస్త్రీయమైన ప్రాతిపదిక గానీ లేకపోవటం వల్లనే ఈ వూతపదాలు అవసరమౌతున్నాయి.కోటి జనాభా కలిగిన నగరం అనిపించుకుంటున్నవి గర్వంగా ఫీలవడమూ మిగిలినవి కూడా ఆ పేరుకోసం వురకలెయ్యడమే కనబడుతున్నది గానీ ఆ కోటి జనాభా యెట్లా బతుకుతున్నారు అనే దాని గురించి మాత్రం మర్చిపోతున్నారు!అభివృధ్ధికి మనం పెట్టుకున్న సూచీ కూడా తలసరి ఆదాయమే తప్ప సగటు మనిషి సంతృప్తిని లెక్కించటం లేదు?నలబయి దాటిన ప్రతి నగరవాసినీ పురుషుడయితే గుండెపోటు గానీ రక్తపోటు గానీ స్త్రీ అయితే రొమ్ముల్లో గడ్దల దగ్గిర్నుంచీ గర్భాశయాలని తీసివెయ్యాల్సిన దుస్థితి వరకూ రోగాలు కుమ్మేస్తున్నాయి,అయినా ప్రజలు నగరజీవనాన్ని వదలకుండా యెందుకు వేళ్ళాడుతున్నారు?ఇవ్వాళ పెళ్ళి కావలసిన ఆడపిల్ల దృష్టిలో పల్లెలో నాలుగెకరాల భూమి వుండి వ్యవసాయంలో నేర్పరి అయిన కుర్రాడు కూడా మట్టి పిసుక్కునే అనాగరికుడి గానూ ఒక మహానగరంలో గుమాస్తా వుద్యోగంలో ఉన్నా నవనాగరికుడిగానూ కనబడుతున్నాడు - నిజం!
యే మహానగరమూ తన ఆహారాన్ని కూడా తను సాధించుకోవటం లేదు.పాలు డెయిరీ ఫారంలనుంచి వస్తున్నా ఆ పాలు ఇవ్వాల్సిన పశువులకి గడ్ది కూడా యెంత దూరంగా వున్నా పొరుగున వున్న పల్లెల నుంచే రావాలి,యెందుకని?ఇక కూరగాయలూ పళ్ళూ అయితే ప్రతిరోజూ పల్లెల నుంచి వాహనాల మీద రావాల్సిందే,యేమిటీ దుస్థితి?!యే ఉద్యమంలో భాగంగా నైనా ఒక వారం రోజులు నగర పొలిమేరల దగ్గిర రహదారుల్ని దిగ్బంధనం చేస్తే ఒక్క వారం రోజుల్లో ఆ అగర ప్రజలు ఆకలితో అలమటించిపోతారు!పైగా రోజుకి వేల టన్నుల చెత్తని సృష్టించే ఈ మహానగరాలు ఆ చెత్త మరీ యెక్కువైతే పారబొయ్యటానికి పనికొచ్చే చెత్తకుప్పలుగా దగ్గిర్లో వున్న పల్లెల్ని ఉపయోగించుకుంటున్నాయి,తా జెడ్డ కోతి వనమెల్లా చెరిచినట్టు!
వ్యక్తులుగా రాజకీయ నాయకులు మిగిలిన విషయాల్లో యెంత సమర్ధులైనా ఈ నగర జీవనాన్ని క్రమబధ్ధం చెయ్యటంలో యెందుకు అసమర్ధులు అవుతారో తెలుసా,ఇవ్వాళ మనం మహానగరాల్లో చూస్తున్న అవ్యవస్థ నెహ్రూవియన్ ఆర్ధిక విధానం మూలంగా ఉనికిలోకి వచ్చి సుమారు ఒక శతాబ్దం పాటు సుదీర్ఘమైన ప్రయాణానంతరపు మలుపు కాబట్టి - చిట్కావైద్యాల లాంటి తక్షణ పరిష్కారాలు ప్రయోజనమిచ్చే దశ దాటిపోయి చాలా కాలమైంది కాబట్టి!పెరగకూడని విధంగా పెరగడం వల్ల కొత్త రకమైన నిరుద్యోగం,భద్రత లేని ఉపాధి లాంటివి ప్రజల్లో అశాంతిని పెంచుతూ ఆ అశాంతి ప్లేటు ఇడ్లీ కోసం కత్తిపోట్లకు దారితీసే కలహాల నుంచి మూకుమ్మడి మానభంగాల వరకూ నేరాల్ని మరింతగా ప్రోత్సహిస్తున్నది!పట్టణీకరణ,మురికివాడలు,సౌకర్యాల లేమి,వనరుల లోపం ఒక కొత్త వోటుబ్యాంకును కూడా ఉనికిలోకి తీసుకొచ్చాయి.డిల్లీలో కేజ్రీవాల్ లాంటి నాయకులకి రాజకీయ ఉపాధిని కూడా ఇచ్చేటంతగా పెరిగిన మురికివాడల్ని ఇప్పుడు సత్సంకల్పంతోనైనా అభివృధ్ధి వైపుకి నడిపించటం కూడా కష్టమే!అతను ఉచితంగా ఇస్తానన్న విద్యుత్తూ నీరూ మురికివాడల పౌరుల్ని టార్గెట్ చేసుకున్నవే.బలవంతంగా కొద్దికాలమైనా తను ఇస్తానన్నవి ఇవ్వగలిగితే "లైఫ్బాయ్ యెక్కడ వుందో ఆరోగ్యం అక్కడ వుంది" అన్నట్టు మురికివాడలు గల మహానగరాలన్నిటికీ ఆ కేజ్రీవాల్ విస్తరిస్తాడు?!ఆ రెంటినీ ఇవ్వాలంటే దిట్టమైన ఫ్రేంవర్క్ చాలా అవసరం,ఆ ఫ్రేంవర్క్ అసలు పెట్టుబడి లేకుండా యేర్పడదు,అల్పాదాయ వర్గాలకి ఉచితంగా ఇవ్వడం కోసం రాబిన్ హుడ్ తరహాలో అధికాదాయ వర్గాల నుంచి నొల్లుకురావాలి,దానితో ప్రజల మధ్యన ఈర్ష్యాద్వేషాలు మరింత పెరుగుతాయి - అదో అనంతకాలం వరకూ కొనసాగే మరో రాజకీయ సర్పిలం!
పౌరులకి ఆరోగ్యకరమైన ఆవాసాన్ని కల్పించటం ప్రభుత్వం యొక్క మొదటి బాధ్యత అని తెలుసుకుని ప్రజలు దానికోసం వొత్తిడి చేసయినా సాధించుకోవాలి.పల్లెల్లో తగినత ఆదాయంతో ప్రశాంతంగా బతకగల్గిన వాళ్ళు నగరాల మీద వ్యామోహం తగ్గించుకుని పల్లెటూళ్లలోనే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సౌకర్యవంతంగా బతికేటందుకు ప్రయత్నించాలి.దీర్ఘకాలిక ప్రాతిపదిక మీద ప్రభుత్వాధినేతలు భారీ పరిశ్రమలూ వాల్ మార్ట్ తరహా ప్రయోగాలూ చెయ్యకుండా వ్యవసాయాన్నీ వ్యవసాయాధారితమైన పరిశ్రమల్నీ ప్రోత్సహిస్తూ సాంప్రదాయిక వృత్తులకి లాభసాటి మార్కెట్ సృష్తించగలిగితేనే పల్లెలూ నగరాలూ చెట్టాపట్టాలేసుకుని అభివృధ్ధి పధంలోకి అవిచ్చిన్నంగా నడిచే వీలు ఉంటుంది. బహుళ అంతస్థుల భవనాలతో నగరం మీద ఒక నల్లని దుప్పటి కప్పేసి అత్యధిక జనాభా గల నగరాలని ప్రదర్శించుకుని మురిసిపోవాలనే కండూతిని తగ్గించుకుని పల్లెల నుంచి నగరాలకి జరుగుతున్న యేకపక్షమైన వలసల్ని దృడసంకల్పంతో నిరోధించకపోతే ఇవాళ్టి మహానగరాలు రేపటికి విస్మృత నగరాలుగా మారిపోతాయి - తప్పదు!
_______________________________________________________________
(చిత్రాలు:గూగులమ్మ సౌజన్యం!)