Wednesday, 11 March 2015

కాదంబరి లాగ ప్రేమలేఖ రాయగలిగే అమ్మాయి యెక్కడయినా ఉందా?

      ఇవ్వాళా రేపూ వయసులో ఉన్నవాళ్ళు కొంచెం రొమాంటిక్ మూడ్ కావాలంటే "మిల్స్ అంద్ బూన్" వాళ్ళ పుస్తకాల్లో యేదో ఒకటి రాక్ లోంచి బైటికి తీస్తారు!వీట్ని చాలా వ్యాపారాత్మకంగా రాస్తారు - ఎట్లాగంటే ఒకసారి చదివిన పుస్తకాన్ని యేడాది తర్వాత తీసినా చదివిన కధేగా అనిపించి బోరు కొట్టేటట్టు రాస్తారు!మొదటిసారి చదివినప్పుడు వుర్రూత లూగించాలి, రెండోసారి చదువుతుంటే వుసూరు మనిపించాలి - లేకపోతే వాళ్ళ కొత్త పుస్తకాలికి గిరాకీ ఉండదే?బిజినెస్సు ట్రిక్కు, మన చేతి చిలుమొదిలించాలని!

       కానీ యెన్ని సార్లు చదివినా బోరు కొట్టడం అటుంచి కొత్త అర్ధాలు తోస్తూ పులిసిన కొద్దీ కిక్కు పెంచే ఫ్రెంచి మద్యం లాంటి కధ మనవాడే ఒకడు రాశాడు, ప్రపంచమంతా ఒక శతాబ్దకాలం నుంచీ ఇంగ్లీషులోకి అనువాదం చేసుకుని చదువుతూ పోటీలు పడి మెచ్చుకుంటున్నారు!అదే సంస్కృత సాహిత్యంలో కల్లా అత్యధ్భుతమైన రెండు గద్య కావ్యాలని రాసిన బాణభట్టు యొక్క అపూర్వ కావ్యసృష్టి - కాదంబరి!పేరు కర్ధం నిజంగా మత్తుగానే ఉంటుంది, యెందుకంటే కదంబ వృక్ష సంబంధమయిన మధువు - ఇప్ప కల్లు!దీని ఎఫెక్టుకి మత్తెక్కి పోయి కాబోలు కన్నడ,మరాఠీ భాషా సాహిత్యాల్లో యెప్పట్నుంచో నవల,ప్రేమ కధ లాంటి వాటి కన్నిటికీ "కాదంబరి" అనేది పర్యాయ పదమైపోయింది - తస్స చెక్క!

      అతడి రచనలే అధ్భుతం అనుకుంటే అతడి జీవితం అతడి రచనల కన్నా గొప్పగా వుంటుంది!దాదాపుగా మహాకావ్యాలు రాసినా కేవలం కవిత్వం అల్లినా రచయితల జీవితం చాలా సాధారణంగా వుంటుంది.చిన్నప్పుడే కవిత్వంలో మంచి ప్రతిభ చూపించటం,మంచి గురువు దగ్గిర చందస్సు,అలంకారం అవీ నేర్చుకోవటం,అప్పటి పధ్ధతి ప్రకారం వయస్సు రాగానే పెళ్ళి చేసుకోవటం,తీరిగ్గా కూచుని తమ ప్రతిభకి సాన పెట్టుకుని గొప్ప కావ్యాల్ని రాసి సాటివాళ్ళని మెప్పించటం,అవి కాలాతీతమయిన కావ్యాలుగా ఇతర్లు పొగుడుతుంటే సంతోష పడటం - ఇంతే!కానీ బాణభట్టు జీవితం అలా కాదు,విషాదం,సంక్షోభం,ప్రతిభ,స్నేహం,విశృంఖలత్వం ,ప్రణయం లాంటి అనుభూతులతో ఇష్తమొచ్చినట్టు చెలరేగిపోయిన క్షీరసాగరమధనం - అందుకే అతని సాహిత్యంలో మనిషి జీవితానికి సంబంధించిన అన్ని అంశాలూ కలగల్సిపోయి కనబడుతూ "బాణోచ్చిష్టం జగత్సర్వం" అనే నానుడి పుట్టింది!

      తల్లి చిన్ననాడే స్వర్గస్థురాలైంది.వూహ తెలిసి అనుబంధం బలమయిన వయస్సులో తండ్రి కూడా మరణించాడు!తండ్రి దూరమవడం అతని జీవితంలో అత్యంత దుర్భరమైంది!ఆ బాధ గురించి హర్ష చరిత్రలో చెప్పిన  తనసొంత జీవితంలోనూ ఒకసారి చెప్పాడు, కాదంబరిలో వైశంపాయనుడు చిలుక జన్మలో తండ్రిని పోగొట్టుకున్న దుఃఖాన్ని పలికించేటప్పుదు మళ్ళీ తన దుఃఖాన్నే పలికించినంత యదార్ధంగా వర్ణిస్తాడు!అపారమయిన ప్రతిభ గల ఆ తండ్రిని పోగొట్టుకున్న కుర్రవాడు దేశదిమ్మరిగా కొంతకాలం తిరిగాడు - విషాదంలో కూరుకుపోకుండా నిత్యచైతన్యంతో కదిలి యెందరో మంచి స్నేహితుల్ని సంపాదించుకున్నాడు!.కలిసిన వ్యక్తులంతా అధ్భుతమయిన వ్యక్తిత్వాలతో అలరారిన వాళ్ళే - కవి వేణిభరతుడు,నర్తకి తాండవిక,కధకుడు జయసేనుడు,ఐంద్రజాలికుడు కరాళుడు,దొమ్మరాటల చకోరాక్షుడు,జైనసాధువు వీరదేవుడు!అంతటి సంచలనాత్మకమైన జీవితం గడిపి తిరిగి తన సొంతవూరుకే వచ్చాడు వయోభారంతో జ్ఞానభారంతో వంగి?ఇంతటి వైవిధ్యభరితమైన జీవితం గడిపిన కవి సాధారణమైన రచనలు యెట్లా చేస్తాడు?!

      ఇతను రాసిన హర్ష చరిత్ర వల్లా అందులోనే తన జీవితాన్ని కూడా వర్ణించుకోవడం వల్లా చాలా ఖచ్చితంగా ఇతను క్రీ.శ 7వ శతాబ్దం మొదటి భాగంలో జీవించాదని చెప్పవచ్చు."గుప్తుల కాలం స్వర్ణయుగం" అని మనం చిన్నప్పుడు చదువుకున్న అత్యంత ప్రఖ్యాతుడైన గుప్తవంశపు రాజు హర్షుడు తండ్రి పోయాక గడుపుతున్న సంచార జీవితం గురించి విని పిలిపించుకుని తన దగ్గిర ఉద్యోగ మిచ్చాడు. హర్షునితో విభేదాలు యేమీ లేకపోయినా కనిపించని ప్రమాదాల మయమైన ఆ రాజోద్యోగపు జీవితం యెక్కువ కాలం గడపలేక సొంతవూరు ప్రీతికూటం చేరుకుని అక్కడే హర్షచరిత్ర,కాదంబరి అనే రెండు గద్యకావ్యాల్ని రాశాడు!

      మన తెలుగులో వున్న మాండలిక భేదాల వంటివే అయిన పైశాచి,మాగధి లాంటి వాటిని సంస్కరించి అన్నింటిలో వున్న గొప్ప విషయాలని సరయిన పాళ్ళలో కలిపి క్రీ.పూ 4వ శతాబ్దంలో పాణిని అనే వ్యాకరణ వేత్త సంస్కృత భాషని నిర్మించాడు.ఆ సంస్కృత భాషలోనే బాణభట్టు కాదంబరిని కల్పించాడు.రెండూ ఒకదానికోసం ఒకటి పుట్టాయా అన్నట్టు జరిగింది కాదంబరి రచన!పాణిని యేం మాయ చేసాడో తెలియదు గానీ సంస్కృతం ఒక వైపు నుంచి చూస్తే గట్టిగా పట్టేసిన నియమాలతో చిక్కురొక్కురుగా వున్నట్టు కనిపిస్తుంది,మరో వైపు నుంచి చూస్తే పదాల్నీ అర్ధాల్నీ యెట్లా కావాలంటే అట్లా వంచగలిగిన తీగలు సాగే గుణమూ ఉంది.ఇంగ్లీషులోనూ కాంపౌండ్ నౌన్స్ అని ఒకటి కన్నా యెక్కువ పదాల్ని కలిపేసి పుట్టించిన పదాలు కొన్ని వున్నాయి - "bluebird","horseshoe","newsprint" లాంటివి. "newsprint"అనే పదాన్ని "news print" గానూ చదవ వచ్చు లేదంటే "new sprintగానూ చదవవచ్చు!కానీ సంస్కృతం మాత్రం ఇలాంటి కాంబినేషన్లని అత్యధ్భుతంగా పుట్టించగలదు.పైగా ఒకే మాటకి సమానార్ధకాలు కూడా వున్నాయి.ఈ శక్తి వల్లనే ద్వ్యర్ధి కావ్యాలూ త్ర్యర్ధి కావ్యాలూ పుట్టాయి!కాదంబరిలోనే చంద్రాపీడుడు చంద్రాయుధం అనే అశ్వాన్ని చూసినప్పుడు అది అతనికి "చక్రవర్తినరవాహనోచితం"గా కనిపించిందట!దీన్ని "చక్రవర్తియైన నరపాలకుడికి వాహనంగా వుందతగినది" అని గానీ "చక్రవర్తి యైన నరవాహనుడనే ఫలానావ్యక్తికి వాహనంగా వుండతగినది" అని గానీ పూర్తిగా ప్రతి పదాన్నీ మరింత విడదీసి "చక్ర-వర్తి-నర-వాహన-ఉచితం" అని గనక తీసుకుంటే "చక్రాన్ని ప్రదర్శించగలిగిన(సమర్ధతని చూపించగలిగిన) యే నరుని కైనా వాహనం కాదగినది" అని కూడా అర్ధం చెప్పుకోవచ్చు!

       మాట వరసకి "వాక్యం రసాత్మకం కావ్యం(రసం చిప్పిల్లే ఒక్క వాక్యం అయినా కావ్యమే!)" అని ఒప్పుకున్నా కావ్యం అనేసరికి అందరూ ఒప్పుకోవాల్సిన కనీస లక్షణాలు కొన్ని ఉండాలి కదా!ఆసక్తిని కలిగించే కధ ఖచ్చితంగ ఉండాలి. వర్ణనలో వైవిధ్యం గనక ఉంటే యే వస్తువునైనా యెంత సుదీర్ఘంగానైనా వర్ణించవచ్చు, అధ్భుతంగా ఆనిపించే సన్నివేశాల్ని కధనంతా ఆపేసి అయినా సరే మరింత విస్తారంగా వర్ణించవచ్చు,భాష మీద తనకున్న ఆధిక్యాన్ని చూపిస్తూ పదాలతో ఆడుకోవటం,పాఠకుడి మీద ప్రహేళికలు విసరటం,కొన్నింటికి తనే జవాబులు చెప్పి కొన్నింటిని నువ్వే కనుక్కోమని ఛాలెంజి చేసి వొదిలెయ్యటం - ప్రపంచ సాహిత్యంలో ప్రతిభ గల రచయితలు చేసిన అన్ని ప్రక్రియల్నీ "కాదంబరి" అనే ఈ ఒక్క కధలోనే ఇమిడ్చాడు బాణభట్టు, పాశ్చాత్యులు పొగిడారంటే పొగడరా మరి!ఇంగ్లీషులో "యూఫెమిజం" అనే మాట యెప్పుడయినా విన్నారా?అది క్రీ.శ 16లో జాన్ లిల్లీ అనే రచయిత చేసిన హాస్య రచన "Euphues" నుంచి పుట్టిన పదం.కానీ బాణుడు "కాదంబరి"ని అంతకు చాలాకాలం ముందే ఒక విశేషణంగా మార్చేశాడు!

    సంస్కృత సాహిత్యంలో గద్యకవులు చాలా చాలా తక్కువ - "స్వప్న వాసవదత్తం" రచయిత సుబంధు,"హర్షచరిత్ర" మరియు "కాదంబరి"ని రచించిన బాణుడు,"దశకుమార చరిత్ర" రచయిత దండి!ప్రతిభలో యెవ్వరూ తక్కువవాళ్ళు కాకపోయినా కాదంబరి వల్ల బాణభట్టు వీళ్లందరిలోనూ ప్రధముడిగా నిలిచాడు!

       కధ ఇట్లా వుంటుంది - లక్ష్మీదేవికి శ్వేతకేతువు అనే మునికీ నయనరతి వల్ల పుండరీకుడు అనే కొడుకు పుడతాడు.తండ్రి దగ్గిర పెరుగుతూ బ్రహ్మచర్యంలో విద్య నేర్వాల్సిన వయసులో మహాశ్వేత అనే అప్సర కాంతతో ప్రేమలో పతాడు!బలహీన మనస్కుడైన వీడు ప్రేయసిని ఇప్పటికిప్పుడు చూడాలని కబురు పెట్టి తను వొచ్చేవరకూ కూడా విరహానికి ఆగలేక వెన్నెల కురిపిస్తూ తన విరహాన్ని అంతగా పెంచిన చంద్రుణ్ణి "నాలాగే జన్మ నుంచి జన్మకి ప్రియురాలి విరహంతో మరణించుదువు గాక!" అని శపించి ప్రాణాలు విడుస్తాడు?చంద్రుడికి తిక్కరేగి "నాతోపాటూ నువ్వూ అట్లాగే అఘోరిస్తావు!" అని ప్రతిశాపమిచ్చి దానివల్ల తన లోకానికి సంబంధించిన మహాశ్వేత అనే అమ్మాయికి అన్యాయం జరుగుతుందని తెలిసి జన్మ నుంచి జన్మకి అనే మాటని బట్టి శాపాన్ని రెండు జన్మలకి పరిమితం చేసి ఆ జన్మలు పూర్తయ్యాక ప్రియసమాగమం జరిగే విధంగా శాపఫలితాన్ని మార్చి కధని ముందుకు తీసుకెళ్ళటం కోసం తను చంద్రాపీడుడనే రాజుగారబ్బాయిగా పుడతాడు.పుండరీకుడు వైశంపాయనుడనే పేరుతో మంత్రిగారబ్బాయిగా పుట్టి అతనికి స్నేహితుడిగా వుంటాడు.ఒకసారి అన్ని జానపద కధల్లోలాగే రాజుగారబ్బాయి దారితప్పి ఒక శివాలయంలో గంధర్వగానం విని కాదంబరిని కలుస్తాడు.ఇక్కడ కాదంబరి గురించి బాణుడు వర్ణించిన భాగం చదువుతుంటే మా బంగారమే గుర్తొచ్చింది, అంత చక్కని మనిషికి పొట్టిబుడంకాయని నేను దొరికాను - యేమిటో పాపం!తను తన స్నేహితురాలికి ప్రియవియోగ దుఃఖాన్ని తప్పించడానికి ఇక్కడి మూర్తికి సంగీతార్చన చేస్తున్నానని చెప్పటం,ఇతనూ మర్యాదస్తుడే నని ఆమె తెలుసుకోవటం, ఆమె వెంట వాళ్ల లోకం వెళ్ళి ఆమె తల్లిదండ్రుల్ని,మహాశ్వేతని చూడటం లాంటి కధ కొంత నడిచాక వాళ్ళిద్దరి మధ్యా ప్రేమ కూడా పుడుతుంది!ఈ లోపు వైశంపాయనుడు కూడా వీళ్ళని కలిసి మహాశ్వేతని చూసి ఈ జన్మలో కూడా ప్రేమిస్తాడు.ఫలితంగా శాపప్రభావం వల్ల ఈ మగవాళ్ళిద్దరూ అప్పుడు మరణించి చంద్రాపీడుడు శూద్రకునే పేరుతో జన్మించి రాజుగా రాజ్యమేలుతూ ఉంటాడు.వైశంపాయనుడిగా ఉన్న పుంరీకుదు మధ్యలో చంద్రాయుధం అనే గుర్రంగా  మారి తన స్నేహితుడికే వాహనంగా మారి తర్వాత ఆ జన్మ అంతమై చిలుకగా పుడతాడు.ఈ చిలుక తండ్రిని పోగొట్టుకుని రెక్కలు కూడా మొలవని నిస్సహాయ స్థితిలో ఉన్న దశలో జాబాలి అనే ఋషి సాకి స్వస్థత కూర్చి "నీ మితిమీరిన ప్రణయమూ వాచాలత్వమే నిన్నీ స్థితికి తీసుకొచ్చింది" అని తిడుతూ పాత కధనంతా విప్పి చెప్తాడు.అప్పుడు మళ్ళీ లక్ష్మీదేవి శబరకాంతగా రూపం మార్చుకుని ఈ చిలుకని ఒక పంజరంలో పెట్టి తీసుకెళ్ళి శూద్రక మహారాజు ముందు పెడుతుంది!జాబాలి చెప్పినప్పుడు కూడా విని గుర్తుంచుకోవడమే తప్ప తనకి సొంతంగా గుర్తు రాని వైశంపాయనుడనే చిలుకకి స్నేహితుణ్ణి చూగానే కధ మొత్తం తనకే గుర్తుకొస్తుంది!కధ అంతా విన్నాక శూద్రకుడికీ గుర్తుకొస్తుంది!పరిష్కారం అప్పటి జన్మల్ని వొదిలెయ్యటం!అట్లా చెయ్యగానే పుంరీకుడూ చంద్రాపీడుడూ తమ రూపాల్ని పొంది యెవరి ప్రేయసిని వారు పెళ్లి చేసుకోవదంతో కధ సుఖాంత మవుతుంది!

          నేను తెలుగులో ఈ కధని చదివింది పేరాల భరతశర్మ అనే ఆయన పీ.హెచ్.డీ కోసం రాసిన సిధ్ధాంత వ్యాసం లో నుంచి!తెలుగు సాహిత్యంలో చీపుళ్ల గురించీ పేడతట్టల గురంచే కాక ఇట్లాంటి మంచివాటి గురించి కూడా అప్పుడప్పుడూ పరిశోధనలు చేస్తూ వుంటారని అప్పుడే తెలిసింది నాకు!సిధ్ధాంత వ్యాసం అంటే బోల్డు విశ్లేషణలు చెయ్యాలి ఒక వాదం మొదలెట్టి దానికి యెన్నో నిరూపణలు చూపించాలి అనుకుంటే మాత్రం ఆ పేరుతో ఆయన పీకిందేమీ లేదు గానీ కధలో కొంచెం అదోమాదిరిగా వుండే పాత్రకి లక్ష్మీదేవినే యెందుకు తీసుకున్నాడు బాణుడు అనే పాయింటుని మాత్రం చక్కగా విశ్లేషించాడు!ద్రౌపదీమానసంరక్షణం సన్నివేశానికే ధర్మరాజు ద్రౌపదిని రేప్ చేసుకోవటానికి దుశ్శాసనుడికి పర్మిషన్ ఇచ్చేశాడు అని వాగే చిత్తకార్తె కుక్కలు వున్న ఈ కాలంలో ఆ విశ్లేషణ చాలా అవసరమే గానీ చాలాకాలం క్రితం చదవటంతో గుర్తు రావడం లేదు.నా సొంత విశ్లేషణ యేమిటంటే ఈ కధ మొత్తం చంద్రుడి చుట్టూ తిరుగుతుంది!కాదంబరి తల్లిదండ్రుల్ని ఒక జీవితకాలం పాటు ప్రేమగా గడిపిన వాళ్ళు  వార్ధక్యంలో యెట్లా వుంటారో చూపిస్తాడు!ఆ విధంగా ఈ జంటలలో "మిల్స్ అండ్ బూన్" కధల్లో చూపించినట్టు మూడు ముద్దులూ ఆరు సంభోగ దృశ్యాలూ కాకుండా ఆయా వ్యక్తుల మధ్య వుండే అనుబంధాలకి విలువ ఇస్తాడు గనక అక్క లోపించింది సోదర సోదరీ బంధం మాత్రమే గనక లక్ష్మీదేవిని కధలోకి తీసుకురావడం జరిగి ఉండొచ్చు!ఈయన ఓపిగ్గా చేసిందల్లా "కాదంబరీ లోచనానందా చంద్రా!" లాంటి భాషతో బాణబట్టు రాసింది రాసినట్టు తెలుగులోకి అనువదించటమే!

       అంత గొప్ప కధలో కధానాయకి అయిన కాదంబరి అనే అమ్మాయి చంద్రాపీడుడనే అబ్బాయికి తనకి అతనంటే ప్రేమ పుట్టిన తొలినాళ్లలో తన మనస్సులో కొత్తగా పొటమరిస్తున్న భావాల్ని చెప్పుకుంటూ ఒక వుత్తరం రాస్తుంది! అంతా చదివాక మీరొప్పుకుంటారో లేదో గానీ నా అభిప్రాయం మాత్రం ఒకటే - ప్రపంచంలో వున్న ప్రేమలేఖా సాహిత్యం అంతా వాస్తవ వ్యక్తులు రాసినవి,కానీ ఆ కండిషన్ తీసేసి దీన్ని కూడా వాటిలో చేరిస్తే మొదటి బహుమతి మాత్రం దీనికే ఇవ్వాలి న్యాయంగా!ఇంతవరకూ నా పోష్టుల్ని చాలా ఓపిగ్గా నిదానంగా చదివిన వాళ్ళు కూడా "ముందు టపా టైటిలుకి న్యాయం చెయ్యవయ్యా మహప్రభో! టెన్షన్ ఆగట్లేదు - ఆ ఉత్తరమేదో చూపించు?" అని తిట్టుకుంటున్నారని నాకు తెలుసు, ఇదిగో చదవండి."గొప్పదగు నీ ప్రేమను నేనెరుగుదును.మిగుల మృదువైన దిరిసెన పువ్వువలె మెత్తని స్వభావము గల స్త్రీజనమునకు ఇంతమాత్రము ప్రాగల్భ్యము ఎట్లు కలుగును? అందును బాల్యముననున్న కుమారికల కెట్లు కలుగును?ఏ యింతులు తామై భర్తలకు సందేశము నంపుదురో, భర్తల వద్దకు తెగించి వెళ్ళుదురో అట్టివారు సాహసకారిణు లగుదురు.అయినను సాహసించి పంపుచున్న నేను మిక్కిలి సిగ్గిలుచున్నాను.ఇంతకు యేమని వార్త నంపుట? నీవు నాకు అతి ప్రియుడవు అనినచో పునరుక్తి దోషము.నీకు నేను ప్రియురాలను అను మాట వివేకహీనము.నీయందు నాకు గొప్ప అనురాగము కలదు అనిన అవి వేశ్య పలుకులగును. నిన్ను విడచి బ్రతుకజాలను అనినచో అనుభవ విరుధ్ధమగు మాట యగును. మన్మధుడు నన్ను పరాభవించుచున్నాడు అనినచో అది నా దోషము బయటపెట్టుకొనిన తెలివితక్కువ యగును. అదికాదు,మన్మధుడు నీకు నన్ను ఇచ్చివేసినాడు అనినచో నీకు దగ్గిరవుటకు పన్నిన పన్నుగడ యగును. బలాత్కారముగ హరింపవలసినవాడవు అనినచో నది కులట యొక్క పొగరు అగును.అవశ్యము రావలెను అనినచో సౌభాగ్యము వలన గల్గు అహంకార మగును. నా యంత నేనే వచ్చుచున్నాను అనినచో స్త్రీ చాపల్య మగును.ఈ నీ దాసి నీ యందే దక్క ఇతరులందు అనురాగము లేనిది అనినచో మనసునందలి భక్తిని వెల్లడించుకొను తేలికతన మగును. నిరాకరింతువేమో యను సందేహముచే వార్త నంపలేదు అనినచో నిరాకరించుట యెఱుగని వానికి నిరాదరణ నేర్పినట్లగును. నన్ననుసరించి జీవించువారు నాకై దుఃఖింతురేమో యని యెంచనట్టి కఠినురాలను అనుట అత్యంత ప్రణయ ప్రకటన మగును. నా మరణముచే నీయందు నాకెంత ప్రేమ గలదో తెలిసికొనగలవు అందునా?మరణము నాపట్ల ఊహించరానిది.కావున ఏమని వార్త నంపుట?" ఈ చివరి వాక్యం కాదంబరికే కాదు బాణభట్టుకి కూడా వర్తిస్తుంది ఆ భాగం రాయగానే బాణభట్టు భౌతికంగా అస్తమించినా కాదంబరి కావ్యం వల్ల చిరంజీవిగా ఉన్నాడు గాబట్టి?


(కధ ఇంతటితో ఐపోలేదు,ఇంకా వుంది)

2 comments:

  1. బాబోయ్ ! నిన్ను ఎంత గట్టిగా ప్రేమించానో చెప్పటానికి ఇన్ని లోసుగుబాట్లు ఉన్నాయా ? చివరి పేరా అంతా అవే.

    ReplyDelete
    Replies
    1. సారూ,ఇవ్వాళ పద్మార్పిత బ్లాగులో కవితల్నీ అక్కడ కురుస్తున్న వహవ్వా కామెంత్లనీ చూదండి!ఆ కవితల్ని చూసిన మొదటిసారే అవి కాదంబరి ప్రేమలేఖ లోని టెక్నిక్ అని గుర్తుపట్తాను!మీరూ పోల్చి చూదండి?!

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...