Tuesday, 11 November 2014

కమలమే సకలం కావాలి అంటున్న మోదీ దూకుడును ఆపడ మెట్లా?ఇప్పటికీ వెనకపడిన కులాల వాళ్ళు ఇక ముందుకు రావడ మెట్లా!

               "చుండూరు నరమేధం" - యేమాత్రం సంస్కారం వున్నా సరే కులాలు,మతాలు,ప్రాంతాల కతీతంగా అందర్నీ కదిలించింది!ప్రతివారూ చనిపోయిన వారి పట్ల సానుభూతి చూపించారు.దోషులకి శిక్ష పడాలని మనస్పూర్తిగానే కోరుకున్నారు.అది మనుషుల మనసుల్లో వుండాల్సిన ఆదర్శవంతమయిన ఆలోచనలు ఇంకా వున్నాయనే దానికి సాక్ష్యం.కానీ వాస్తవంలో అలా జరగలేదు.ఆదర్శాలు అన్నం పెట్టవు."సూపు లేటి సేత్తాయి?సాపుగా సచ్చూరుకుంటాయి!" - అన్నాడో కవి?! దోషులు శిక్ష నుంచి జారిపోయారు! బెనిఫిట్ ఆఫ్ డవుట్ అనే మెలిక చాలా నిర్దాక్షిణ్యంగా అడ్డు పడటం వల్ల పట్టపగలు వెంటాడి మరీ హతమార్చిన వాళ్ళుగా అందరూ చూసి గుర్తు పట్టగలిగిన వాళ్ళని కోర్టులూ చట్టాలూ మాత్రం గుర్తు పట్టలేక పోయాయి?

               అసలు చుండూరులో జరిగిందేమిటి?మొదట యుధ్ధోన్మాదంతో చెలరేగిపోయి యెవరు యెంత చెప్పినా యుధ్ధం ఆపకుండా మొండిగా వున్న జపాన్ అమెరికా ఆఖరి అస్త్రంగా వేసిన లిటిల్ బాయ్ దెబ్బకి తునాతునకలై అంతా అయిపోయాక  సానుభూతిని పొందినట్టు చుండూరు నరమేధం చరిత్ర కూడా ఇప్పటి హతులు ఒకప్పుడు కామాతురులుగా ఇప్పటి నేరస్తులు ఒకప్పుడు మర్యాదస్తులుగా వుండి - కాలం ఒకే ఒక క్రూరమయిన సంఘటనతో వాళ్ళ స్థానాల్ని గుర్తు పట్టలేనంతగా మార్చి చూపిస్తున్న క్లైమాక్సు లేని సినిమా! సినిమా అనేది యెంత శక్తివంతమయిన సాధనమైనా దాన్ని వాడకూడని విధంగా వాడితే సమాజానికి యెంత చెడు చెయ్యగలదనే దానికి చుండూరు నరమేధానికి బీజాలు సినిమా హాల్లోనే పడినాయనేది నిలువెత్తు సాక్ష్యం! బియ్యే లిట్టు డిగ్రీని చూపించుకుంటూ సినిమాల్లో ఆ ప్రబంధాల ప్రభావంతో స్త్రీసౌందర్యాన్ని ఆపాదమస్తకం(ఆ బెత్తెడు జాగాని మాత్రం యెందుకో వొదిలేసారు?) కనుల పండువుగా చూపిస్తూ తెల్లని చర్మం,నున్నని చెంపలు,సన్నని నడుం వంటివే సౌందర్యానికి గుర్తు అని కృత్రిమ సౌందర్య సాధనాల విక్రయాలను పెంచగలిగిన కళాఖండాల్ని వండి వార్చిన రసికేంద్రుదూ అతని అంతేవాసులూ ఈ కేసులో అసలు ప్రస్తావనకే రాకపోయినా వాళ్ళూ ముద్దాయిలేనని యెంతమందికి అర్ధమయింది!

        ప్రభుత్వ పధకాల వల్ల కొంతా మారిన వుత్పత్తి సాధనాల వెసులుబాటు వల్ల్ల కొంతా హఠాత్తుగా ఆర్జనపరులయిన కుర్రాళ్ళకి మాకూ అలాంటి పెళ్ళాలు కావాలని అనిపించడం చాలా సహజంగా జరుగుతుంది. కానీ చుట్టూ చూస్తే తమ లాగే యెండకి యెండి వానకి తడిసి కూలిపనులకి తిరుగుతూ కావురేసుకు పోయిన తమ కుటుంబాల్లోని నల్లపిల్లల కన్నా అదే సినిమా హాల్లో  ఆ సినిమా కవులే వర్ణించినట్టు జాం పళ్ళ లాగానూ యాపిలు పళ్ళ లాగానూ కనబడే పెద్ద కులాల ఆడపిల్లలు వాటంగా కనబడ్డారు?మనసుకు నచ్చిన వాడికోసం పంజరాన్ని దాటుకుని బంధనాలు తెంచుకుని మేడలు దిగివచ్చి నిరుపేదని వలచే కావ్యనాయికలే వాళ్ళల్లో కనబడ్డారు గానీ "అన్నయ్యా, ఆ మాలొడు నాకు లవ్ లెటర్ రాశాడు, ఓ పట్టు పట్టరా" అనే అహం ఆ పెద్దకులాల ఆడపిల్లల్లోనూ వుంటుందని తెలుసుకోలేకపోయారు -  కనబడే అందాల్ని మాత్రమే చూసి మతి భ్రమించి వుజ్జయిని రాకుమారిని అలవోకగా పట్టేద్దామనుకున్న పాపం పసివాళ్ళు!

           ఈ మొత్తం భారతదేశపు సమాచార సాధనాల్లో హడావుడి చేసేవాళ్ళలో గానీ, సమాజాన్న్ని ప్రభావితం చెయ్యగల రాజకీయ రంగంలో చెలామణీలో వున్న నాయకమ్మణ్యులలో గానీ,జరిగిన నేరానికి దోషుల్ని శిక్షించే అధికారమున్న న్యాయస్థానాల్లో తమకు డబ్బులొచ్చే కేసుల్లో తిమ్మిని బమ్మినీ బమ్మిని తిమ్మినీ చెయ్యగలిగిన లాయరుమ్మణ్యులలో గానీ సమస్య మూలాన్ని తెలుసుకుని నిక్ష్పక్షపాతమయిన తీర్పుని తెచ్చి మళ్ళీ అలాంటివి జరక్కుండా చేసే సమర్ధవంతమయిన పరిష్కారాన్ని చూపగలిగిన మేధావి ఒక్కడు కూడా లేడు?! కమ్యునిష్టుల్ని చూస్తే బ్రాహ్మణాధిపత్యం, అగ్రవర్ణ దురహంకారం, వర్గపోరాటం లాంటి - బాధితులకి అర్ధం కానివీ పీడకుల దగ్గిర పనిచెయ్యనివీ అయిన - చెత్తమాటల్తో రెచ్చిపోతుంటారు? అక్కడ జరిగింది మాలవాళ్ళ మీద కమ్మవాళ్ళు దాడి చెయ్యటం, మధ్యలో బ్రాహ్మణు లేమి చేశారు? ఒకవేళ మా కులం యెక్కువా మీకులం తక్కువా అనే సూత్రాలు చెప్పింది బ్రాహ్మణులే అనుకుందాం, ఆ  బ్రాహ్మణులు చెప్పినది మాలలూ మాదిగలూ కూడా వొప్పుకోవడం వల్లనే గదా ఇంతగా తమ మీద దొపిడీ జరుగుతున్నా ఒక్కటిగా కలిసి పోరాడకుండా మాల మహా నాడు, మాదిగ దండోరా అని వేరు కుంపట్లతో వాళ్ళలో వాళ్ళు పోట్లాడుకుంటున్నది?

        చుండూరు నరమేధానికి బలయిన వాళ్ళకోసం పోరాడుతున్న వుద్యమకారులకి వారి సొంతవర్గాల్లోనే యెంతమంది గట్టిగా నిలబడి మద్దతు ప్రకటించారు?యెవరి స్వార్ధాల కోసం వారు యెవరి లెక్కలు వారు వేసుకుంటూ తమ కులానికి మరింత రాజకీయ ప్రాతినిధ్యం పెంచుకోవడానికి పోరాడుతున్నాం అని చెప్తూ కులసంఘాలు పెట్టి వాటి చాటున సొంత వ్యవహారాల్ని చక్కబెట్టుకోవటం వాళ్ళు కూడా చేస్తున్నప్పుడు  యెదటివాళ్ళకి మాత్రమే కులపిచ్చిని అంటగడితే అది పోట్లాటకీ కాట్లాటలకీ పనికొస్తుందే తప్ప అసలు రొంపి నుంచి బయట పడెయ్యదు గదా!

           ఒకచోట అన్యాయం జరిగినప్పుడు దానికోసం జరిగే పోరాటాల్నీ పై స్థాయిలో జరిగే పైరవీ రాజకీయాల్నీ పక్కన బెట్టి సమాజంలో వున్న స్థితిని చూస్తే మాల కులస్థులు మాదిగ కులస్థుల్ని చిన్నచూపు చూడ్డం చాలా మామూలుగా జరిగిపోతూనే వుంది!నేనొక సాక్ష్యం చూపిస్తాను. మా ఫాదర్ రాజకీయాల్ల్లో తిరిగిన మనిషి. మావూరి మాలపల్లిలో ఆయన యేం చెప్తే అది వేదవాక్కు. అంత గురి వున్నచోట సొంత సంగతులు కూడా చెప్పుకుంటారు కదా! ఒకసారి ఒకతను అలాంటి సలహా కోసం వచ్చాడు.సమస్య ఇదే:వాళ్ళబ్బాయి మాదిగ కులస్థురాలయిన అమ్మాయిని ప్రేమించాడు, ఇతనికి అది ఇష్టం లేదు -  ఈ కులం ప్రాతిపదిక మీదనే, మా ఫాదర్ని ఆ కుర్రాడికి నచ్చజెప్పమని అడిగాడు. ఆయన కూడా అడగ్గానే ఒప్పుకున్నా మా మదరుకి కొన్ని చాదస్తాలు వుండటం వల్ల ప్రేమికుల్ని విడదియ్యటం అనే పాయింటు మీద పోట్లాడటంతో వెనక్కి తగ్గారు. అసలు విషయం ఇంత స్పష్టంగా కనబడుతుంటే కమ్యునిష్టులు ఇంకా బ్రాహ్మణాధిపత్యం అనే సొల్లు కబుర్లు చెప్తున్నారే తప్ప ఆ కులాల వాళ్ళు ఈ వెనుకబాటుతనాన్ని తొలగించుకోవడానికి మార్గాలు యేమిటనేది మాత్రం చెప్పటం లేదు!

         బోడిగుండుకీ మోకాలికీ ముడిపెదుతున్నానని అనుకోకుండా నిశితంగా పరిశీలించి చూస్తే చుండూరు నరమేధం నుంచి గోధ్రా రైలు ఘటన అనంతరం జరిగిన ముస్లిముల వూచకోతల వరకూ జరిగే సామూహిక విధ్వంసాల మధ్యన కొన్ని పోలికలు వున్నాయి. అంతిమంగా యెక్కువ భీభత్సానికి గురై ఆక్రందించే వారి మీద పుట్టే జాలిలో మొదట రెచ్చగొట్టిన వాళ్ళ దుడుకుతనం మరుపు కొచ్చేస్తుంది.జపాను విషయం లోనూ అంతే.అసలు ఆ యుధ్ధానికి కారణం జపానే అని ఒక వాదన.యుధ్ధం మొదలయ్యాక సరే యెంతో మంది యెన్నో విధాల రాజీ ప్రయత్నాలు చేసినా వెనక్కి తగ్గలేదు!ఆఖరికి కొన్ని సంవత్సరాల తర్వాత అప్పటి విషయాలకి జపాను చక్రవర్తి క్షమాపణ చెప్పాల్సిన అవసర మేమిటి? మనుషులు తమ రాగద్వేషాల కనుగుణంగా యేదో ఒక పక్షం మంచిదని తీర్మానించేసి తమకు నచ్చిన పక్షాన్ని సమర్ధించ వచ్చుగాక, కాలానికీ చరిత్రకీ సెంటిమెంటు లేదు!

            ఈరోజు అంత దుర్మార్గంగా చెలరేగిపోతున్న ఈ మూడు పెద్ద కులాలూ చరిత్ర కందని కాలం నుంచీ ఇలాగే లేవు.వేదపఠనం జరిగేటప్పుడు దూరం నుంచి విన్నా వాళ్ళ చెవుల్లో సీసం కరిగించి పొయ్యమనే విధంగా అప్పటి బ్రాహ్మణుల చేత అవమానించబడిన శూద్ర వర్ణం లోనివే ఈ కులాలు కూడా!ఇక్కడ ఆంధ్ర ప్రాంతం లోనే కాదు దేశమంతటా గుజ్జర్లు, చౌధురీలు,పన్నియర్లు అనే సహస్రాధికమయిన కులాలు వున్నాయి.తమాషా యేమిటంటే కమ్యునిష్టులూ ఆ భావజాలం మాత్రమే ప్రపంచంలోని అన్ని సమస్యలకీ పరిష్కారం చూపించగలుగుతుందని నమ్మేవాళ్ళూ కులపరమయిన ఆధిక్యతా భావం కేవలం బ్రాహ్మణుల్లోనే వుందని యెందుకు తీర్మానించశారో తెలియదు గానీ ప్రతి కులానికీ ఆ కులానికి చెందిన ప్రాచీనత పట్లా గొప్పదనం పట్లా అభిమానం వున్నది!ఈ మధ్యనే నేను ఇక్కడ బ్లాగుల్లోనే జాంబ పురాణం గురించి చదివాను.వింతేమిటంటే అందులో మనకి రామాయణంలో రాముడికి సహాయంగా వచ్చిన భల్లూక వీరుడిగా మాత్రమే తెలిసిన జాంబవంతుడు ప్రధాన దైవం!అంతకన్నా విశేషం ఇప్పుడు మనం తక్కువ కులాలు అని చెప్పుకునే చాకలి, మంగలి మాదిగ కులాల వాళ్ళంతా ఆ జాంబవంతుడితో చాలా గొప్పగా అనుసంధానించబడ్డారు గానీ ఈ మూడు పెద్ద కులాలకీ అందులో గుర్తింపు లేదు?అటు బ్రాహ్మణులు వీళ్ళని వేదం వింటే చెవుల్లో సీసం కరిగించి పొయ్యమన్నారు?ఇటు జాంబవ పురాణం లో చోటు లేదు?మరి యెప్పుడు మొదలై యెప్పటికి వీళ్ళు ఇంతగా పెరిగారు?


         కాకతి రుద్రదేవ మహారాజు పేరుతో సుమారు క్రీ.పూ 1250 నుంచి 1290ల వరకు తెలుగు ప్రజల్ని పరిపాలించిన ఆంధ్ర మహాసామ్రాజ్ఞి కాకతి రుద్రమ దేవి సైనిక విధానంలో ఒక విప్లవాత్మకమయిన విధానాన్ని పాటించింది - బ్రాహ్మణేతరుల్ని సైన్యంలోకి తీసుకోవటం!కన్యాశుల్కంలో "మీ వైదికపాళ్ళు జంఝాలు వొడుక్కుంచూ వుంచారో?" అనీ "మీ నియోగ్యపాళ్ళు నీచు గూడా తింఛూ వుంచారో!" అనీ వెక్కిరింతలు వున్నట్టున్నాయి కదా!ఆమె ప్రోత్సాహంతో వెలమ వాడయిన బసవ దండనాధుడి మూలంగా వెలమలూ, గోన గన్నారెడ్డి వల్ల రెడ్లూ, కాపయ నాయకుడి వల్ల కమ్మవాళ్ళూ యెదిగి పెద్ద కులాలుగా మారారు.సిపాయిగా చేరి కనీసం దళపతి వరకూ చేరినా అప్పటి కాలానికి ఆర్జన చాలా యెక్కువే!యుధ్ధాలు జరిగితే వోడిపోయిన కోటలో రాజుగారు ఖజానాని పట్టుకుంటే మిగతా వాళ్ళు వూరిమీద పడి అందినంత దోచుకోవడమే!యెక్కడ పరిమితికి మించిన ధనం పోగుపడినా అక్కడ యెంతోకొంత నెత్తురంటిన డబ్బు వుంటుంది?! అయితే పరిమితికి మించిన ఆస్తులు కోమట్లకీ వుండేవిగా ఇవ్వాళ వాళ్ళు వెనకబడిపోయి వీళ్ళు యెలా పైకి వచ్చారు అనుకుంటున్నారా?కోమట్లు యెంత వున్నా బంగారం మీద పెట్టి రొటేషన్లో తిప్పడంతో సరిపెట్టుకుంటే వీళ్ళు మాత్రం సంపాదనంతా భూమి మీద పెట్టుబడి పెట్టి భూస్వాము లయ్యారు! ఆ ఆదాయంతో పరిశ్రమలు పెట్టి పారిశ్రామికాధిపతు లయ్యారు! పరిమితికి మించిన ఆస్తి వుంటే దగ్గిరగా వుండేవాళ్ళు నమ్మకస్తులు కావాలి! బంధుత్వాలు గానీ సెంటిమెంటు గానీ వున్నవాళ్ళ కన్నా నమ్మకస్తులు యెవరు వుంటారు? అందుకే అందరూ తప్పనిసరిగా తమ వ్యాపార వ్యవహారా లన్నింటిలోనూ తమ కులం వాళ్లనే ప్రోత్సహించేది! ఆ విధంగా కులస్థుల్లో పాప్యులర్ అయితే రాజ్యాధికారం దగ్గిర కొస్తుంది!గట్టిగా చెప్పాలంటే రాజ్యాధికారం లేకపోయినా ప్రభుత్వం వాళ్ళకి యే పని కావాలంటే ఆ పని చేస్తుంది.

                ఇప్పటికే ఇలా యెదిగిన వాళ్ళకీ ఇప్పుడు యెదగాలనుకుంటున్న వాళ్ళకీ ఈ నమ్మకమూ ఆప్యాయతా తప్పనిసరిగా అవసరం కాబట్టి కమ్యునిష్టులూ, మానవ వాదులూ, మరింకే శవ వాదు లయినా ఈ అమరికని భగ్నం చెయ్యలేరు?! అతిగా తీసుకుంటే మనం అమృతం అనుకునే పాలు గూడా విషమవుతాయంటున్నారు అన్నిరకాల వైద్యవిధానాల్లోనూ, అలాంటిదే కులాభిమానం కూడా! రాణా ప్రతాప సింహుణ్ణీ చత్రపతి శివాజీనీ పొగడ్డానికి యెవరూ కులాభిమానం చూపించకపోవచ్చు గానీ బొబ్బిలి పులి తాండ్ర పాపారాయుడు లాంటి వాళ్లని పొగిడేటప్పుడు అతను మా కులం వాడే అని మిగతా వాళ్లకన్నా కొంచెం యెక్కువ హుషారు పడ్డంలో తప్పు లేదు గానీ మా కులం వాడు గనకనే అంతటి వాడయ్యాడు అని విర్రవీగటం మాత్రం శానా తప్పు! మా కులం గొప్పది అని అనుకోవటమూ మిగతా కులాల్లో వున్న గొప్పని కూడా మెచ్చుకోవటమూ అయితే OK, BUT మా కులమే గొప్పది మిగతావన్నీ చెత్తవి అనుకుంటే మాత్రం NOT OK?!

              తమ కులం లోని గొప్పవాళ్ల ముచ్చట్లన్నీ కాలక్షేపానికి కూర్చున్నప్పుడు చెప్పుకుని మురుసుకోవడానికే తప్ప కార్యరంగంలో ఇతర్లతో పోటీ పడేటప్పుడు యెందుకూ పనికిరావు. ఇద్దరు సమాన బలం గలవాళ్ళు యెదురెదురుగా నిలబడి తలపడితే వాళ్లలో యెవరు గెలుస్తారనేది కులాన్ని బట్టి గానీ మతాన్ని బట్టి గానీ ప్రాంతాన్ని బట్టి గానీ నిర్ధారించలేము కదా!కానీ ఇవ్వాళ ప్రజాప్రతినిధుల్ని యెన్నుకునే పని మాత్రం అలా జరగడం లేదు.యే నియోజక వర్గంలో యెవరిని నిలబెట్టాలన్నా ఆ నియోజకవర్గంలో వున్న ఈ భూస్వాములూ పారిశ్రామికవేత్తల ప్రాభవానికి ఇబ్బంది కలిగించని మర్యాదస్తుల్నే యెంచుకుంటున్నారు తప్పితే ఆ నియోజకవర్గంలోని అందరి ప్రయోజనాల్నీ పరిరక్షించే ప్రమాదకరమయిన వ్యక్తుల్ని మాత్రం నిలబెట్టటం లేదు! ఈ విషవలయంలో తిరుగాడుతున్నంత కాలం మిగతా కులాల వాళ్ళు రాజ్యాధికారం రాకపోతే పోయింది,ఈ చుండూరు నరమేధం లాంటి క్రూరమయిన దాడుల్నించి తప్పించుకునే మార్గం యెప్పటికీ దొరకదు! రాజ్యాధికారాన్ని పొందటానికి ఈ అమరిక వల్ల లాభం పొందే ఇప్పటి పెత్తందార్లు దీన్ని ఒక పట్టాన వదలరు, మరి ఇప్పుడున్న చిన్న కులాలు యెదిగేదెట్లా?

         ఇప్పుడు మోదీ గారు అంటున్న కమలమే సకలం కావాలి అనే ఆశ నిజమయితే యేం జరుగుతుంది?ఇప్పటికే హిందువుల్లో ఆర్ధికంగా, సామాజికంగా పైకొచ్చి వున్న అగ్రకులాల వాళ్ళు రాజకీయంగా కూడా యెదుగుతారు!అది కూడా గ్రామస్థాయిలోనూ విస్తరించాలనుకున్న మోదీ గారి ప్రనాళిక పూర్తయితే ఇప్పుదు అన్ని విధాలుగా అట్టడుగున వున్న కులాల వాళ్ళు యెప్పటికీ పైకి రాలేరు?!నాకు మోదీ గారి అభిప్రాయం తప్పనే దురుద్దేశం లేదు.చాణక్యుదు రాజు విజిగీషువు, శక్తి వుంటే మొత్తం భూమి నంతా ఆక్రమించ వచ్చు నన్నాడు! భాజపా అనే నాకు నచ్చిన అతి తక్కువ రాజకీయ పార్టీల్లో ఒకటి వ్యాపిస్తానంటే నాకు అభ్యంతర మేమిటి?కానీ ఇప్పటికిప్పుడు భాజపాలో చేరి రాజకీయంగా యెదగగలిగే అవకాశం సమాజంలో ఇప్పటికే ముందుకు వెళ్ళిన వారికే అది మేలు చేస్తుంది తప్ప అట్టడుగున వున్నవారికి మరోరకంగా వాళ్ళు ఇక యెప్పతికీ ముందుకు రానివ్వకుండా దారులు మూసేస్తుంది!మోదీ ప్రధానమంత్రి కాగానే అతని కులంలో వున్న వారంతా ఒకాసారిగా పైకొచ్చేసినట్టేఅ నుకుంటే మనం అంబేద్కరు రాసిన రాజ్యాంగాన్ని పాటిస్తున్నాం గనక ఆ కులస్తులంతా పైకి వచ్చేసి వుండాలి ఈపాటికే.

        ఆర్ధికంగా నేను యెక్కడో చెన్నయ్ లో కాందిశీకుడిలా బతికే ఒక చిరుద్యోగిని.కానీ సామాజికంగా నేను అగ్రకులం వాడిని.ఆ హోదా నాకు పుట్తుకతోనే వచ్చింది.నేను ముఖ్యంగా ప్రస్తావించాలనుకుంటున్న పాయింటు ఇదే.వ్యక్తులు ఆర్ధికంగా బాగుపడటం వల్ల ఒక కులానికి మొత్తంగా యే విధమయిన హోదా పెరగదు!ఇప్పుదు నిమ్న కులాలుగా వున్న వాటికి ఆ హోదా పెరగాలంటే యేమి జరగాలి అనేది నేను చెప్పాలనుకున్నది!కమ్యునిష్టు తరహా వర్గ రహిత సమాజం అనే ఆదర్శానికి మన దేశప్రజలు మానసికంగా సిధ్ధమయ్యే పరిస్థితి లేదు. ఇక్కడున్న సంక్లిష్టతని అర్ధం చేసుకునే సహనం కమ్యునిష్టులకి లేదు. మన దేశంలో యే మార్పు జరిగినా పైకి కుదుపులాగా కనబదకుండా కొంచెం కొంచెంగా మారుతూ అసలైన సంస్క్తృతి ఒక ప్రవాహం లాగా సాగిపోయే లక్షణం కలది!దాన్ని బద్దలు కొట్టాలనే ముప్పాళ రంగనాయకమ్మ అభిమానుల అత్యుత్సాహం మంచిది కాదు!ఇప్పుడు అగ్రకులాలు కూడా ఒకప్పుడు నిమ్న కులాలే కాబట్టి వాళ్ళు యేమి చేసి అగ్రకులాలుగా యెదిగారో వీళ్ళు కూడా అలా చేస్తే సరిపోతుంది కదా!

         కాళోజీ రెండున్నర కులాలు అని అనేటంత సీను మిగతా కులాలకి యెందుకు లేకుండా పోయింది?యెందుకంటే ఈ కులాలు ఆంధ్రప్రదేశ్ లోని భూమిలో అధిక శాతాన్ని ఆక్రమించుకుని వున్నాయి గాబట్టి! డబ్బు రొటేషన్ తిరగడం కోమట్లలో యెక్కువగా వున్నా ఆ కులం భూమికి దూరంగా వుండటమే రాజకీయంగా సామాజికంగా ఈ కులాల కన్నా బలహీనంగా వుండటానికి కారణం! యే విధంగా నయినా వీలయినంత యెక్కువ భూమి మీద అధిపత్యమే కులానికి హోదా పెంచుతుంది! ఇక్కడొక విశేషం గమనించాలి ఈ కులం అధీనంలో వున్న భూమి కులస్థు లందర్లోనూ సమానంగా వాతాలు పంచబడి లేదు, కేవలం ఆ కులంలోని 10% మంది అధీనంలో ఈ భూమి వున్నా ఆ కులం హోదా పెరిగింది! యెందుకలా జరిగిందంటే తన అధీనంలోని ఆస్తిని కాపాడుకోవటానికి నమ్మకస్తుల కోసం బంధువుల మీదా తెలిసిన వాళ్ల మీదా ఆధార పదటం క్షేమం గనక తమకి దగ్గిరగా తమ కులస్థులే వుండేలాగ చూసుకుంటారు! అందుకే కులపిచ్చి అంతగా లేనివాళ్ళూ దుర్మార్గాలు చెయ్యని వాళ్ళూ కూడా ఇతర్లకి సహాయం చేసేటప్పుడు తమ కులం వారికే మొదటి అవకాశం ఇవ్వడం జరుగుతుంది! సామాజికంగా జరిగే యే మార్పు అయినా కుదుపులు లేకుందా జరగాలంటే తప్పనిసరిగా - తాత్కాలికమయిన పరిష్కారం,దీర్ఘకాలికమయిన పరిష్కారం రెండూ అవసరమే! రిజర్వేషన్లు అనేవి తాత్కాలికంగా వ్యక్తులు ఆర్ధికంగా యెదగటానికి పనికొస్తాయి - నేను వీట్ని పూర్తిగా వ్యతిరేకించటం లేదు. కానీ వీటి ద్వారా ప్రోత్సాహం తెచ్చుకున్న వారిలో కొందరయినా వ్యాపార పారిశ్రామీక రంగాల్లోకి ప్రవేశించి భూమి మీద అధిపత్యం సాధించనంత కాలం ఆ కులం యొక్క సామాజిక హోదా పెరగదు!

            దళితులే కాదు ముస్లిములది కూదా ఇదే పరిస్థితి - రాజ్యాంగం ప్రకారం అందరికీ సమాన ప్రాతినిధ్యం వుండాల్సిన అవసరం వున్నా వాళ్ళు వాస్తవంలో రెండవ తరగతి పౌరుల్లాగే వున్నారు?ఖైదీ తన జైలర్ని తన జైలు గదిలో మరి కొంచెం సౌకర్యవంతమయిన యేర్పాట్లని  కోరుకున్నట్టు శాతాల్లో దక్కే అడుగు బొడుగు తిండి లాంటి రిజర్వేషన్ల కోసం మాత్రం దిట్టంగా పోట్లాడుతున్నారు గానీ తమకి నిజమయిన అభ్యున్నతిని ఇచ్చే దారులు వెతకడం లేదు!ఈ రిజర్వేషన్ల ద్వారా వచ్చే పదీ పరకా వుద్యోగాల ద్వారా వెయ్యేళ్ళు గడిచినా ఆయా వర్గాలు ముందుకి రావడం అనేది కల్ల!ఉద్యోగం లో భద్రత ఉంటుంది, కానీ ఒక ఉన్నతోద్యోగి కూడా తన ముప్పయ్యేళ్ళ సర్వీసులో పొంద లేని ఆదాయం ఒక మధ్యస్థ అంతరువు లోని వ్యాపారి కేవలం అయిదు పది సంవత్సరాల లోనే పొంద గలడు.  వ్యక్తులకు ఉద్యోగాలు భద్రతా నిచ్చినా వర్గాల వారీగా చూస్తే వ్యాపార పారిశ్రామిక రంగాల వల్లే లాభం ఉంటుంది.

           ఉద్యోగాల కయితే డిగ్రీలు కావాలి. పరీక్షలు రాయాలి. నానా రకాల తంటాలూ పడాలి. కానీ వ్యాపారం చెయ్యాలన్నా పరిశ్రమ పెట్టాలన్నా ఇవేమీ అక్ఖర్లేదు. కానీ ఏది తను బాగా అమ్మగలడో తన గురించి తనకు బాగా తెలియాలి. కొత్త వస్తువును తయారు చేసి దానికి కొత్తగా మార్కెట్ ని పుట్టించుకొవడమా, అప్పటికే ఉన్న వస్తువుని మరింత బాగా మెరుగు పరచి అమ్మడమా - ఏది తనకు చేతనయితే అది చెయ్యడానికి సిద్ధంగా ఉండాలి. మొదటి విడత లాభాలు వచ్చేవరకు అవసరమయ్యే  సంస్థాగతమయిన పెట్టుబడిని తనే సమకోర్చుకోవాలి. ఒకసారి లాభాలు రావడం మొదలయితే తరవాత వ్యాపారాన్ని విస్తరించడానికి మూలధనాన్ని కదిలించకుండా లాభాల నుంచే పెట్టుబడినీ పొందాలి. ఇవన్నీ చెయ్యగలిగిన వాడే వ్యాపార పారిశ్రామిక రంగాల్లో వృద్దిలొకి వస్తాడు.

        కాబట్టి వాళ్ళలో ఇప్పటికే వ్యాపార పారిశ్రామిక రంగాల్లోకి అడుగు పెట్టటానికి తగినంత ఆదాయం వున్నవాళ్ళ్ళు అటువైపుకి వెళ్ళాలి!దానికి మొదటి అడుగు వీలయినంత యెక్కువ భూమిని హస్తగతం చేసుకోవాలి?!ప్రతి వ్యాపారికీ పారిశ్రామిక వేత్తకి మొదలు పెట్టటానికి తక్కువ భూమే అవసరమయినా విస్తరించుకునే దశలో భూమి చాలా ముఖ్యమయిన వనరు. దాదాపు దేశమంతటా కులాల పరిస్థితి ఇలాగే వుంది కాబట్టి ఇది అందరూ పాటించగలిగిన చక్కని రాజమార్గమే!అందులోనూ విభజన జరిగాక ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స్మార్ట్ సిటీల రూపంలోనూ పరిశ్రమల్ని వ్కేంద్రీకరించటం రూపంలోనూ భూమి అమ్మకాలూ కొనుగోళ్ళూ ఇదివరకటిలాగా బిగుసుకు పోయి వుండవు, రాబోయే రెండు మూడేళ్ళలో భూముల అమ్మకాలూ కొనుగోళ్ళూ యెంతో లిబరల్ అవుతాయి.పైగా ఈ సమయం దాటిపోతే మళ్ళీ ఇలాంటి అవకాశం ఇప్పుడప్పుడే రాకపోవచ్చు.భూమికీ సంపదకీ అధికారానికీ వున్న ఈ సంబంధం తెలిసినందువల్లనే శాంతిపర్వంలో భీష్ముడి పరంగా వేదవ్యాసుడూ అర్ధశాస్త్ర రచయిత చాణక్యుడూ భూమి గురించి అంత విస్తారంగా చెప్పారు!

భూమి మీద అధిపత్యమే రాజకీయాధికారానికి దగ్గరి దారి!

Tuesday, 4 November 2014

మార్క్సిజం తెలియకపోతే పుట్టిన వాళ్ళం పుట్టినట్టే వుంటామా?

     మార్క్సు గారు చెప్పిన వ్యక్తిగత ఆస్తి రద్దు నాకు వేదాంతులు చెప్పే అహం వొదులుకోమనటం లాగా వినపడుతుంది, అదేమిటో!వేదాంతం చెప్పే గురువులు "సాధన చేయుమురా నరుడా,సాధ్యము కానిది లేదురా" అని యెంత వూదరగొట్టినా నరమానవుడి కెవడికీ అహాన్ని వొదులుకోవటం సాధ్యపడ లేదు.మార్క్సుగారు చెప్పిన వ్యక్తిగత ఆస్తి రద్దు కూడా అంతే.మార్క్సుగారు చెప్పిన చాలా అంశాలు మతాచార్యులు చెప్పే మాటల్లాగే ఆకుకీ పోకకీ అందకుండా వుంటాయి.ఈ వ్యక్తిగత ఆస్తి రద్దునే తీసుకోండి - ఆయన ఫ్రెండు యెంగెల్సు గారు పెద్ద జమీందారు కొడుకు.

      మార్క్సుగారు ఆ "దొసో కొపిత్యేలో" రాసి జనంలోకి వొదిలిన తర్వాతయినా యెంగెల్సు గారు తన ఆస్తిని వొదులుకున్నాడా? పుస్తకం రాస్తుండగానే వొదులుకుని వుంటే మాత్రం మార్క్సుగారి పుస్తకం బయటికి రాకపోయుండేది!మార్క్సుగారు తన భార్యకే గాక తన పనిమనిషికి పుట్టిన పిల్లలకి గూడా బాధ్యుడై వాళ్ల నందర్నీ పోషించడానికి మేజోళ్ళూ బూట్లూ అమ్ముకుంటున్నప్పుడు మిత్రుడిగా అప్పులు తీర్చి ఆదుకోకపోయుంటే అప్పులు యెక్కువై అప్పుల వాళ్ళ చేత జైలుకు తరమబడి అక్కడే మగ్గుతూ వుందే వాడు కదా!ఇంతకీ తెలుగులో ఇంత నిజాయితీగా చెప్తున్న ఈ రచయిత్రి పేరున ఆస్తులు యేమీ లేవు గదా?వుంటే సిధ్ధాత ద్రోహం కాదా!

      మావూళ్ళో ఒక మహానుభావుడు వున్నాడు. పేరు గూడా చెప్తాను.పొన్నం వీర రాఘవయ్య చౌదరి.ఈయన విశిష్టత యేమిటంటే అంత కుగ్రామమలో పుట్టి కమ్యునిష్టు కావడమూ, అనామకంగా వుండిపోకుండా కంకి గుర్తు పార్టీలో రాష్ట్ర స్థాయి నాయకుడిగా యెదగటం. చాలా మంది వున్నారు గదా ఇలాంటి గొట్టాలు అనుకోవచ్చు మీరు, కానీ కమ్యునిష్టుగా వుంటూనే కమ్యునిష్టు అయిన వాడు మాట్లాడగూడని బూతు మాట మాట్లాడినా కమ్యునిష్టుగానే చెలామణీ అవుతూ వుందటం?ఒక పనిమీద మేము వాళ్ళింటికి వెళ్ళి తనతో మాట్లాడే అవకాశం కోసం యెదురు చూస్తున్నాం. ఈలోపు వాళ్లబ్బాయి అతనితో మాట్లాడుతుండగా వాళ్ళిద్దరి సంభాషణా మా చెవిన పడింది,మామూలు మనిషిని గనక కళ్ళు తిరిగినంత పనయింది?!అదే గొప్పవాళ్లయితే మీడియా ముందు దిగ్భ్రాంతి పడేవాళ్లేమో?

      తమ పొలాల్లో పనులు జరుగుతున్నాయి, పనులూ, కూలీలూ వాటికి స్మబంధించిన విషయం."అంతెందుకు కూలీ, దండగ?" - అని ముదలకిస్తున్నాడీ రైతుకూలీ సంక్షేమానికి కట్టుబడ్డ పార్టీకి సంబంధించిన పెద్దమనిషి!"కూలీలు రారు నాన్నా, మిగతా వాళ్ళు అంతే ఇస్తున్నారు" అని కొడుకు అంటే "యెందుకు రారు గట్టిగా మాట్లాడాలి" అని ఆ కమ్యునిష్టు పితృదేవుడు కమ్యునిష్టు కాని కొడుకుని గద్దిస్తున్నాడు.అంతగా కమ్యునిజంతో మమేకమయిన మనిషి మిగతా వాళ్ల కన్నా తన పొలంలో కూలీల్ని అయిదు రూపాయలు తక్కువకి పని చేయించుకోవాలనుకుంటున్నాడే ఆ మనిషి పుట్టినట్టా?పుట్టనట్టా?పుట్టగానే చచ్చిపొయినట్టా?

      ఇంకో వెయ్యేళ్ళ తర్వాత అయినా - ఇంకా గట్టిగా చెప్పాలంటే వాళ్లనుకున్నట్టు విప్లవం భూమి అంతటా పరుచుకున్నాక కూడా యే ఇద్దరు వ్యక్తుల మధ్య నయినా అమ్మకం, కొనుగోలు లాంటి ట్రాన్సాక్షన్ జరిగితే యెవడో ఒకడు నష్టపొవటం ఖాయం!అమ్మేవాడు అవసరపడి అమ్ముతున్నాడని తెలిస్తే కొనేవాడు తక్కువకి కిట్టించుకోవాలని చూస్తాడు.కొనేవాడికి ఈ వనరు చాలా అవసరం అని తెలుసుకుంటే అమ్మేవాడు చెట్టెక్కి కూర్చుంటాడు.దీనికోసం మార్క్సిజమే చదవాలా?ఒక వూరి కరణం మరో వూరి కాపు అనే సామెత ఈనాటిదా?!

      మరీ ముఖ్యంగా హిందూ ధర్మానికి సంబంధించిన చాలా విషయాలు మార్క్సిజంలో చెప్పే విషయాల కన్నా గొప్పగా వుంటాయి.వుదాహరణకి దేవీ భాగం విషయాన్నే తీసుకుంటే మార్క్సు చెప్పిన అదనపు విలువని సమాజ పరం చేసి సంపదని అందరూ సమానంగా పంచుకోవడం మనవాళ్ళు పాతకాలం లోనే సాధించారని అర్ధ మవుతుంది!

Sunday, 26 October 2014

ఆడోళ్ళు యేలికేస్తే మగోళ్ళు కాలికేస్తా వుంటే సంసారాలు సరిగ్గా సాగే దెట్టాగబ్బా!

         ఈ భూ పెపంచకంలో యెంత తెలివయిన ఆడదాని కయినా యెక్కడో అక్కడ వేపకాయంతయినా వెర్రి వుంటాది!కావలిస్తే ఆ సుధా మూర్తినో కిరణ్ బేడీనో చూడాండి?సోనియా లాంటి వాళ్ళకయితే వేపకాయంత యేం ఖర్మ తాటికాయంతే వుంటుందని మీరు కూడా వొప్పుకుంటారు!వెర్రి గాకపోతే దేశమంతా అప్పిటికే పదేళ్ళ అవినీతి గబ్బు వాసన ముక్కులు బద్దలు గొడతా వుంటే కేసీఆరు థెలంగాణాలో  ముఫ్ఫయ్ సీట్లు గ్యారెంటీ అనంగానే ఆ వూపుతోనే యూపీయే-3 అని గంతులేస్తూ పెళ్ళికాని ప్రసాదుని రాజేశ్వరి కిచ్చి ముడెట్టెయ్యొచ్చునని ఇంత దరిద్రంగా తెలుగోళ్ళని విడగొట్టుద్ది?!అలాగని మీరు లైనేసే అమ్మాయిలో ఈ వెర్రి కనబడగానే వొదలగొట్టాలనే దురదతో దాన్ని గురించి ఆ అమ్మాయికి క్లాసులు గానీ పీకేరు సుమా!బాలక్రిష్ణ అదేదో సినిమాలో "పగ,పగ,పగ" అని రెచ్చిపోయినట్టు అప్పిటిదాకా సుకుమారంగా కనబడిన ఆ ముద్దుగుమ్మ అమ్మోరిలాగా శివాలెత్తి పోయి మిమ్మల్ని ఇరగదీసెయ్యటం ఖాయం! మరి యేమి చెయ్యాలయ్యా అంటే రివర్సు గేరులో,"ప్రియా, ఈ భూమండలం మీద ఈ అద్భుతమయిన లక్షణం మాత్రమే వుంది" అనే కలరు పులిమి వుబ్బెయ్యాలి!అప్పుడు ఆ అమ్మాయి బొచ్చుకుక్కపిల్ల లాగా మచ్చికై "నువ్వు యాడికెళ్తే ఆడికొస్త రాజా" అనే లెక్కలో కొస్తుంది. 

               ఈ భూ పెపంచకంలో యెంత వెర్రిబాగుల మగాడి కయినా యెందులోనో ఒకందులో అమోఘమయిన ప్రజ్ఞ వుంటాది!అనంగనంగా ఒక వూళ్ళో మునసబుగారి గేదె తప్పిపోయినాది.ఆ కాలంలో ఒక రాజ్యానికి రాజు యెట్టాగో వూరికి మునసబు అట్టా.ఇనకేముంది వూళ్ళో వున్న తెలివైనోళ్ళంతా వెతికి వెతికి ఇక దొరకదని తీర్మానించుకున్న క్షణంలో ఆ వూళ్ళో వున్న వెర్రి వెంగళప్ప గేదెతో సహా ప్రత్యక్ష మయ్యాడు?అందరికీ ఇంత తెలివైన వాళ్ళం మనం చెయ్యలేనిది ఈ వెంగళప్ప అంత వీజీగా చేసెయ్యటమాని తల కొట్టేసినంత పనై అసలు రహస్యం యేమిటని వాణ్ణే అడిగారు.చిద్విలాసంగా చెప్పాడు - "నేనే గేదెనైతే యెలా ఆలోచిస్తానో యెటువైపు నా కాళ్ళు లాగుతాయో అనే పధ్ధతి ఫాలో అయ్యా!" అని?!అది కూడా ప్రజ్ఞే మరి, మునసబు గారి గేదెని వెతికి పట్టుకు రావడం మాటలా!యేదో ఒక ప్రజ్ఞ ప్రతి మగాడి లోనూ వున్నప్పుడు అందరు మగాళ్ళూ సక్సెసవ్వాలి గదా,మరి యెందుకు ఫెయిలవుతున్నారు అని మీరడగొచ్చు. అయితే ఆ ప్రజ్ఞ యెక్కడ పనికొస్తుందో అక్కడ గాని వాణ్ణి వుంచామా అల్లాటప్పాగా కనబడినోడు కూడా అగ్గిరాముడై పోతాడు, తన ప్రజ్ఞ పనికిరాని చోట నిలబెడితే అగ్గిరాముడు కూడా బుగ్గై పోతాడు,అదీ రగస్యం! వాడెక్కడ పనికొస్తాడో కనిపెట్టి ఆ రూటులోకి నడిపించగలిగిన ఆడది కడకొంగున కాదు, లంగాబొందున ముడేసుకున్నా కిక్కురుమనకుండా పడి వుంటాడు మగాడు. మొదటి సారిగా జనాలకి సినిమా చూపించాలని తపన పడిన దాదా సాహేబు గారికి తాళిబొట్టు కూడా తెగనమ్మి సప్పోర్టుగా నిలబడింది చూశారా ఉత్తమ ఇల్లాలు, ఆవిడ సాయమే లేకపోయుంటే ఆయన యాడుండేవోడు?

       ఈ ఆడోళ్ళనీ మగాళ్ళనీ పెళ్ళి పేరుతో ముడెయ్యటానికీ అది సజావుగా సాగటానికీ మన పెద్దోళ్ళు యెటకారంలాగా వుండే మాటొకటి చెప్పారు!ఇద్దరూ తెలివైనోళ్ళయినా ఇద్దరూ దద్దమ్మ లయినా ఆ సంసారం యేడిసినట్టుగా వుంటాదంట? ఒకళ్ళు మాత్రమే తెలివైనోళ్ళు అయితేనే అదిరిపోద్దంట? మన సంగతీ చుట్టూ జరుగుతున్న యెవ్వారాలూ చూస్తా వుంటే నిజమేననిపిస్తాంది గానీ దాన్ని అన్ని కేసుల్లోనూ ఫాలో అయ్యే వీలే లేదు గందా!మా అమ్మాయి తెలివైంది, మీ అబ్బాయి పిచ్చోడేనా అని అడగలేం, మా అబ్బాయి జీనియస్సు మీ అమ్మాయి పిచ్చి సంగతేంటి అని ఆరాలూ తియ్యలేం! అక్షరసత్యాలు చెప్పే హరిబాబు క్కూడా అలివిగాని లెక్క గాబట్టి ఆట్టే బుర్ర పాడు జేసుకోమాకండి ఈ కాంబినేషను యెట్టా కలపాలా అని!

            ఆడది మగాడి కేది ఇవ్వాల మగాడు ఆడదాని కేది ఇవ్వాల అనేది తెలుసుకుంటే ఈ లెక్క మరోలాగ తెగుద్ది!ఆడది, మగాడికి, ఇవ్వటం -  అనంగానే అదే! అదే! అని యెగరమాకండి, గాలి తీసేస్తా! మగాడు చూట్టానికి యేపుగా వుంటాడు, సాగినంత కాలం నా అంతవోడు లేడు అని రెచ్చిపోతాడు గానీ కుంచెం గాలి మారి దారి కనబడని మలుపు చేరాడా బిక్కచచ్చి పోతాడు! వుద్యోగం వూడే పరిస్తితి వొచ్చిందని తెలిసిన మగాడు రేపటి నుంచి బతుకు గడిచేదెట్లా అనే గొడవ కన్నా ఈ విషయం ఇంట్లో చెప్పడ మెట్లా అనే కొడవలి గుర్తుకే యెక్కువ భయపడతాడు, అవునా? ఆ సమయంలో ఆడది మగాడికి కొంచెం ఓదార్పు ఇవ్వాలి, ధైర్యం చెప్పాలి, నీకు తోడుగా నేనుంటానని భరోసా ఇవ్వాలి, ఇంతటితో అయిపోలేదు రేపటి రోజున మనం మరింత గొప్పగా వుంటామేమో అనే ఆశని కల్పించాలి! లేని పక్షంలో ఫెయిలయినప్పుడల్లా ఒక్కో ఆడది జారుకుంటుంటే రోజుకో ఆడదానికి లైనెయ్యాలి, జరిగే పనేనా? ఈ దిక్కుమాలిన హిండియాలో యెవరో కామగోపాల వర్మ లాంటి పెట్టి పుట్ట్టిన అదృష్టమంతులకి తప్ప అందరికీ దొరకదు ఆ భాగ్యం!మరి మగాడు ఆడదానికి యేమివ్వాలి?నాకు తెలుసు, వెంఠనే? ఇంకేముంటాయి షాపింగు ఖర్చులు తప్ప! అని అనుభవసారంతో విసుక్కుంటారని. కానీ సాటి ఆడవాళ్ళకి మా ఆయన ఫలానా అని గర్వంగా చెప్పుకోగలగడాన్ని ఇష్టపడతారు ఆడాళ్ళు, ఒక గౌరవప్రదమయిన సామాజిక స్థాయి చాలు వాళ్ళకి మగాళ్ళు యెన్ని వెధవ్వేషాలు వేసినా క్షమించెయ్యడానికి?దాంతోపాటు రంభ, వూర్వశి, మేనక లాంటి వాళ్ళు పిల్చినా నన్ను వొదిలి వెళ్ళడు అనే నమ్మకం కలిగిస్తే ఇంట్లోనే స్వర్గం చూపిస్తారు మన ఆడోళ్ళు!

        దంపతుల సుఖసుడి బాగుండి యెవరో ఒకరే తెలివైనోళ్ళు వుండేలా కుదిరితే అవ్వల్ రైటే గానీ అది కుదరనప్పుడు గూడా ఇద్దరూ ఒకే గాడిలో వున్నా పెర్సంటేజిలు తేడా వుంటాయి గదా - మరట్లాంటప్పుడు యెవళ్ళు యెక్కువ తెలివిగా వుంటే బాగుంటాది అనే లాజిక్కు మీలో యెవురికయినా తోచిందా?ఆ డవుటు గాని బుర్రలోకి వొచ్చి జవ్వాబు తెల్సిపోయిందా మీరు అగ్గిలో దూకినా నెప్పి తెలీకండా దాటుకు రాగలిగిన ఘనాపాఠీ లన్నట్టు! నా వోటు మాత్రం ఆడోళ్ళకే - ఆడది యెక్కువ తెలివిగా వుండి మగాడు పెళ్ళాం చెబితే వినాలి అని బుధ్ధిగా వున్న సంసారాలే పదికాలాలు చెక్కు చెదరకుండా మనగలుగుతున్నాయి - చుట్టూ చూడండి జాగ్రత్తగా?!అమ్మ హరిబాబూ మీ ఇంట్లో ఆడోళ్ళతో గొడవలు రాకుండా యేం పొలిటికల్ తీర్పు చెప్పావులే అని యెకసెక్కాలు ఆడతారా?కుదరదు, కారణాలు చాలా గంభీరమైనవి, జాగ్రత్తగా వినండి!

          పిల్లల్ని కనడం వాళ్ళని పెంచడం అనే బాధ్యత వుండటం వల్ల ఆడాళ్ళలో పిల్లలకోడి మనస్తత్వం బలంగా వుంటుంది. కుటుంబానికి కష్టం వొచ్చినప్పుడు నేనూ, నా భర్తా, నా పిల్లలూ క్షేమంగా వుండాలంటే యేంచెయ్యాలి అనే దృష్టి తప్ప అనవసరపు త్యాగాల తోనూ అక్కర్లేని ఆదర్శాల తోనూ బుర్రల్ని ఖరాబు చేసుకోరు!పైగా ఋతుచక్రం ఆ సమయంలో వాళ్ళని చీకాకు పెట్టినా జీవధర్మానుసారం కల్మషాలన్నీ అప్పుడు బయటికి వెళ్ళిపోవడం వల్ల మామూలు సమయాల్లో మనసు మీద అనవసరపు వొత్తిడులు వుండవు!అద్బుతమయిన ఫలితాల్ని ఇచ్చే నిర్ణయాలు తీసుకోవటానికి కావలసిన ఒకే ఒక దినుసు ప్రశాంతమయిన మనసు!కాబట్టి సంస్కారవంతుడై సుఖంగా బతకాలనుకున్న మగాడు తన ఆడదానిలో ఈ లక్షణం వుంటే దాన్ని వుపయోగించుకుని బాగుపడాలి తప్ప నేను మగాణ్ణి,మోనార్కుని, నామీద ఆధారపడి బతుకుతున్న ఈ ఆడదానితో ఆలోచన యేంటి అని అనుకోగూడదు.అలా అనుకున్న వాళ్ళు ఐతే అప్పుల పాలై తిప్పలు పడటమో లేదంటే జైలు పాలై చిప్పకూడు తినటమో చేస్తున్నారు,తెలుసుకోండి!ఆడాళ్ళు కూడా యేదో ఆయన తెచ్చి పోస్తే వుడకేస్తాను అంతకి మించి తను యేం చేస్తాడో నాకెందుకు అనుకోకుండా భర్త వేసే ప్రతి అడుగునీ గమనించాలి,తప్పటడుగు వేస్తాడేమో అని అనుమానమొస్తే ముందుగానే హెచ్చరించి కుటుంబాని కొచ్చే ప్రమాదాన్ని నిలవరించగలగాలి.

         అసలింతకీ ఒకే చూరు కింద ఒక జీవితకాలం తాము గడపాలని తెలిసి గూడా ఈ ఆడాళ్ళూ మగాళ్ళూ యెందుకు సర్దుకుపోలేక పోతున్నారు?ఈ పీటముడి విప్పగలిగితే సంసారోపనిషత్తు ఆమూలాగ్రం అర్ధమయినట్టే!మగాడికి భర్తశ్రీ అనీ ఆడదానికి భార్యశ్రీ అనీ బిరుదులు కూడా ఇచ్చెయ్యొచ్చు!పక్క పక్కనే తిరుగుతున్నా కలిసే పెరుగుతున్నా ఆడప్రపంచం,మగప్రపంచం అనే రెండు ప్రపంచాలు ఖచ్చితంగా వున్నాయండి!ఆడాళ్ళు నలుగురు ఒకచోట కూడీతే చీరలూ,నగలూ, భర్తల హోదాలూ - వీటి గురించి మట్లాడుకుంటారు.మగాళ్ళు నలుగురు ఒకచోట కూడితే సినిమాలూ, రాజకీయాలూ మాట్లాడుకుంటారు.చూశారా, మాట్లాడుకునే టాపిక్కుల్లోనే ఆడ టాపిక్కులూ మగ టాపిక్కులూ అనే విధంగా వేరుపడిపోయాయి?!ఈ విధంగా బిల్హణీయంలో కనబడే తెర ప్రతిచోటా కనబదకుండా అమిరిపోయింది!ఈ తెరని చింపెయ్యాలి!స్త్రీలు భర్త నుంచి యేమి అశిస్తారో దాన్ని యెలా కొరత లేకుండా తీర్చాలో మగాళ్ళకి తెలియాలి.పురుషులు భార్య నుంచి యేమి ఆశిస్తారో వాటిని యెలా తీర్చి సంతృప్తి పర్చాలో ఆడాళ్ళకి తెలియాలి.అవి తెలియని వాళ్ళు పెళ్ళికీ దాంపత్య జీవనానికీ అర్హులు కాదని తీర్మానించి వాటికి దూరంగా వుంచాలి. నా మాట వినగానే  క్రూరంగా అనిపించినా ఇవ్వాళ మన చుట్టూ జరుగుతున్న భీభత్సాలతో పోలిస్తే అది సరయిన పరిష్కారమే ననిపిస్తుంది!

            మరీ అంత కఠొరమయిన తీర్పు ఇస్తే యెలా అని సణిగే సుకుమారులకి ఒక ముక్తాయింపు ఇస్తా!అసలు పెళ్ళి చేసుకుని ఇల్లు చూసుకుని మీరెల్లరు హాయిగ కాలం గడపాలన్న వాళ్ళే పెంపకాల్లో ఒక తింగరిపని చేశారు, ఇప్పటికీ మనం కూడా అలవాటుగా చెస్తూనే వున్నాం?!మగవాడు పుడితే వాడికేం మగమహారాజు యెలా అయినా బతికేస్తాడు అనే దరిద్రపు మాటల్తో రేపటి రోజున వాడు ఒక కుటుంబ పెద్దగా వుండాలి అనేది తెలిసి కూడా బాధ్యతలు నేర్పకుండా సంస్కారం గలవాడిగా తీర్చిదిద్దకుండా గాలి కొదిలేస్తున్నారు! ఆడపిల్ల పుడితే యెప్పటికయినా పెళ్లయి కొత్తచోటికి వెళ్ళాల్సినదే గాబట్టి యెక్కడయినా బతకగలిగే ధైర్యమూ కొత్తవాళ్లతో చొరవగా కలిసిపోయి అందిస్తే అల్లుకుపోగల తెలివినీ నేర్పకుండా అంతులేని విధినిషేదాల్తో భయస్తురాళ్ళుగా తయారు చేసి అమాయకంగా హతమారి పోయేటట్టు పెంచుతున్నారు! దాని ఫలితంగానే మగతనం అంటే ఆడదానితో సామరస్యంగా వ్యవహరించి తన సమర్ధతతో ఆమెను సంతోషపెట్టటంగా కాకుండా పశువులాగా భయపెట్టి లొంగదీసుకుని తన కోరిక తీర్చుకోవటం అని భ్రమించి ఈవ్ టీజింగుల దగ్గిర్నించి రేపుల వరకూ గల అకృత్యాల నన్నిట్నీ అంత ధీమాగా చేస్తున్నారు మగవాళ్ళు. పెంపకాల్లో వున్న ఈ రివర్సు గేరుని వెనక్కి తిప్పి మగాళ్ళని రేపు ఒక కుటుంబ పెద్దగా భార్యనీ, పిల్లల్నీ మ్యానేజి చెయ్యగలిగే బుధ్ధిమంతులు గానూ, ఆడాళ్ళని కొత్తగా వెళ్ళిన ఇంట్లో ధీమాగా బతకగలిగే ధైర్యస్థులుగానూ పెంచటం మొదలు పెడితే పెళ్ళిళ్ళు స్వర్గంలో  నిర్ణయించబడినట్టు కళకళ్ళాడుతూ వుంటాయి, దాంపత్యాలు జోడుగుర్రాల రధాల్లాగా పరుగులు పెడతాయి!

ఇప్పుడొక చిక్కుప్రశ్న:హిందూ వివాహవిధిలో సరిగ్గా దైవజ్ఞులు నిర్ణయించిన ముహూర్తంలో జరిగే కార్యక్రమం యేమిటి?

Wednesday, 22 October 2014

ఉత్తరాంధ్ర కోలుకోలేని దెబ్బతో మూల్గుతున్నది!దీపాలు వెలిగించి సరిపెడదామా?

              మొన్నటి హుద్ హుద్ యెంతటి భీబత్సం చేసింది?ఇదివరకు ఈ తుఫానులకి ఆడవాళ్ళ పేర్లు పెట్టేవాళ్ళు!అప్పటి తుఫాన్లు కూడా అలా అమాయకంగా కొంచెం భయపెట్టి సరిపెట్టేసేవి!పేరు లాగే దీని తీరు కూడా చాలా భీబత్సంగా వుంది.మేము కొన్నేళ్ళ పాటు విసాఖలో గడిపాం!యెంత అందమయిన నగరం?మిగతా అన్ని నగరాల్లోనూ జనానికి వినోదం అంటే సినిమాయే.కానీ విశాఖలో సరదాగా గడపాలంటే యెన్ని చోట్లు?అప్పుడు మేము తిరిగి అంత హ్యాపీగా గడిపిన చోట్లన్నీ ఇప్పుడు ఇట్లా కనబడుతుంటే మనం చూస్తున్నది నిజమేనా?మీడియా యేదయినా ప్రాక్టికల్ జోకు వేస్తున్నదా అనిపిస్తున్నది నాకు!


         కోలుకోవడానికీ మళ్ళీ మామూలు రూపం సంతరించుకోవడానికీ సమయం తీసుకున్నా మనుషుల్లో తిరిగి పుంజుకోగలమనె ధైర్యం కనబడుతున్నది,అది చాలా గొప్ప విషయం!నాయకత్వం యెంత చురుగ్గా కదిలినా ప్రాణనష్టాన్ని బాగా తగ్గించటం పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానం వల్లనే సాధ్యపడింది!కానీ ప్రకృతిని శాసించాలనో మరి సొంత భొగాల కోసమో ప్రకృతిని నాశనం చేస్తూ మనిషి చేస్తున్న దుడుకు పనులకు ప్రకృతి చేసే హెచ్చరికగా కూడా ఇట్లా మళ్ళీ మళ్ళీ విరుచుకు పడుతున్న ప్రకృతి భీబత్సాలని చూసి అర్ధం చేసుకోవాలి,కానీ యెందరికి అర్ధమవుతున్నది!ప్రభుత్వాధికారుల మీద యెదురు దాడులు కూడా చేస్తూ వందల వేల యెకరాల అడవుల్ని కలప దుంగలుగా మార్చేవాళ్ళు - ఒక్కసారి ఇవ్వాళ యే డబ్బు కోసం వాళ్ళీ పని చేస్తున్నారో ఆ డబ్బు ఒక పాతికేళ్ళ తర్వాత జరగబోయే భీబత్సంలో వాళ్ళకి వుపయోగపడదని తెలిస్తే ఆ పని అంత మూర్ఖంగా చెయ్యగలరా? ఇవ్వాళ వీళ్ళు చేస్తున్న దుర్మార్గమే రేపు వాళ్ళనీ వాళ్ళ పిల్లల్నీ ఈ భూమి మీద ప్రశాంతంగా బతకనివ్వదని వాళ్ళ కర్ధమయ్యేలా యెవరు చెప్తారు?


     ప్రకృతిని తెలుసుకోవడానికి పనికొచ్చే జ్ఞానం ప్రకృతిని యెలా శాసించ గలదు?ఇప్పటి వరకూ మనిషి తెలుసుకున్న భూమి పుట్టుక మొదలు అనే పాయింటు నుంచి పోలిక కోసం ఆ కాలమంతా ఒక రోజుతో పోలిస్తే మనిషి ఆఖరి గంటలోనే వచ్చాడు!ఈ కొంచెం సమయంలో మనకు తెలిసింది చాలా తక్కువ.ఈ మిడిమిడి జ్ఞానంతో మనం ప్రకృతిని శాసించడం అసాధ్యం!కాబట్టి బుధ్ధిగా మనం అర్ధం చేసుకున్నంత వరకూ యెలా బ్రతికితే ఈ ప్రకృతిలో క్షేమకరంగా వొదిగిపోగలం అనేది మాత్రం తెలుసుకుని అలా - అంటే ప్రకృతిసిధ్ధంగా బ్రతకటం వొక్కటే మనకు శ్రీరామరక్ష?!


          విభజన కష్టాలు మొదట భయపెట్టినా ఇప్పటి ముఖ్యమంత్రి పాతముఖమే గాబట్టి ఇప్పుడు అతని పనితీరునీ చూశాక ఇప్పుడిప్పుడే కొంచెం నమ్మకంగా వున్నంతలోనే ఈ హుద్ హుద్ విరుచుకు పడింది, యేం చేస్తాం? కాలాధీనం జగత్సర్వం!దీపం జ్యొతి పరబ్రహ్మ!!దీపం వెలించడం అనేది మన చుట్టూ పరుచుకుని వున్న చీకట్లని తొలగించుకోవటానికి మనం వేసే మొదటి అడుగు!అధికారం తనదేనని తెలిసిన మరుక్షణం నుంచీ మొదట రాష్ట్రానికి కావలసింది నిరంతరాయమైన విద్యుత్తు అనే ప్రాధమ్యాన్ని గుర్తించి వర్షాలకి ఆగిపోయే పవర్ ప్లాంట్ల మీద ఆధారపడకుండా దొరికిన ప్రతి చోటు నుంచీ కొని జాగ్రత్త పడటం వల్ల తుఫానుకి బెదరకుండా విద్యుత్తుని అతివేగంగా పునరుధ్ధరించ గలిగేలా చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఒక కృతజ్ఞతా దీపాన్ని వెలిగిద్దాం!


          తెలంగాణాలో త్వరలోనే మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయట!సభలో టపాసులు బాగానే పేలేటట్టు వున్నాయి!మామూలు టపాసుల్తో సరిపెడుతారో,కచరా బ్రాండు బాంబులు కూడా వేస్తారో? యేమయినా శ్రీవారు అఘటనాఘటన సమర్ధులు!గట్టిగా మాట్లాడితే అన్ని పాపాల్నీ ఆంధ్రోళ్ళ మీదకి తోసెయ్యొచ్చుననే ధీమాలో వున్నారు!యాభయ్యేళ్ళుగా ఒక పార్టీలో ముఠాలు కట్టి గూడుపుఠాణీలు చేస్తూ ముఖాలు మారినా విధాలు ఒకటే అన్నట్టుగా తెలంగాణా ఒక్కదాన్నే కాకుండా ఒకప్పటి పెద్ద రాష్ట్రాన్నే పీల్చి పిప్పి చేసి ఆ పార్టీని కాకులు కూడా ముట్టని అనాధపిండాన్ని చేసిన గొప్ప కులమూ, ఇప్పటిదాకా సముద్రంలో కాకిరెట్టలాగా అక్కడొకడూ ఇక్కడొకడుగా కనిపిస్తూ ఆ కులంతోనూ ఈ కులంతోనూ జోడు కట్టలేక పోవటం వల్ల కొంచెం అమాయకంగా కనబడే మరో పెద్ద కులమూ జోడు కూడి తమ బతుకుల్తో తోడి రాగం ఆడుకోవటానికి వాళ్ళకి నచ్చని మరో కులాన్ని ప్రాంతానికి బూచిగా చూపించే ఇవ్వాళ్టి రాజకీయ నాటకం యొక్క అసలు రూపం తెలుసుకోలేని అమాయక తెలంగాణా ప్రజలకి అసలు రహస్యం వీలయినంత త్వరగా తెలియాలని ఒక ఆశాదీపాన్ని వెలిగిద్దాం!


         దీపం వెలిగించటం అంటే ఆలోచన పుట్టించటంతో సమానం అయితే నా పోష్టులతో నేను నిత్యమూ ఆ పని చేస్తున్నట్టే గదా?సహ బ్లాగర్లు ఒక్కొక్కరూ ఒక్కొక్క స్టయిలుతో అతిధుల్ని అలరిస్తున్నారు, వరూధిని-అయ్యరు గారు తమ చిన్న చిన్న పోష్తుల్తో అల్పాక్షరముల అనల్పార్ధములు స్పురింప జేస్తూ వున్నారు!నవ్వీతే నవ్వండి మాస్టారు నవ్వుల్ని చక్కగా పండిస్తారు, ఈ మధ్యనే లక్ష వత్తుల నోము మొదలు పెట్టారు! కష్టేఫలి మాస్టారు మధ్య తరగతి జీవితానుభవాల్ని మందహాసాలతో చదివేలా రాస్తారు!శ్యామలీయం మాస్టారు చందస్సు తెలిసి పాండిత్యం కూడా తోడవటంతో అన్ని రకాల విషయాలతో కలిపి వడ్డిస్తారు!వీరందరి మధ్యనా వీరందరి కన్నా భిన్నంగా వుండాలంటే మాటలా?!నావైపు నుంచి చూస్తే అందరూ ఆల్రెడీ చెప్పేసినదాన్నే మళ్ళీ చెప్పడం కాకుండా మిగతా వారికి తోచని కొత్త పాయింటు యేదయినా వుంటే అది ఇక్కడ విప్పి చెప్తున్నా! అందుకు నాకు నేనో శభాషు దీపం వేసుకుంటూ చదివి మంచి కామెంట్లతో ఆదరిస్తున్న మీకూ ఒక ఖుర్నీసు దీపం వెలిగిస్తున్నా?!


        నిన్న మన తండ్రులు యేమి చేశారో దాని ఫలితం ఇవ్వాళ అనుభవిస్తున్నాం!ఇవ్వాళ యేమి చేస్తున్నామో దాని ఫలితం రేపు మన పిల్లలు అనుభవిస్తారు!కుటుంబాల నుంచీ దేశాల వరకూ ఇదే చరిత్ర మనకి నేర్పే పాఠం?! మొత్తం సంవత్సరానికి వున్న 365 వ్రోజుల్లో మనకి వున్న పెద్ద పండగలు 10 మాత్రమే.ఆ పది రోజుల్ని కూడా మనదయిన పధ్దతిలో తీరిగ్గా గడపలేని కాలంలో వున్నాం మనం!యెప్పటి కయినా మన భవిషత్తు తరాల కయినా జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించగలిగే సులువు తెలియాలని కోరుకుంటూ ఒక జ్ఞానదీపాన్ని వెలిగిద్దాం!



        దీపావళి మనకున్న పండగలన్నింట్లోనూ చాలా సరదా అయిన పండగ! టపాసుల మోతలు యెలాగూ వుంటాయి గానీ, ఆ తర్వాత పల్లెటూళ్ళలో ఈ పందగ రోజున ఆఖరు ఘట్టం దివిటీలు తిప్పటం అని యెవరికయినా తెలుసా?ఈ దివిటీలు తిప్పే సమయంలో తమకి నచ్చని వాళ్ళనీ, తమని బాగా యేడిపించిన వాళ్ళనీ బూతులతో సహా నోటికొచ్చిన తిట్లన్నీ తిట్టుకోవచ్చు!బహుశా బలం లేక పెద్దవాళ్ళ దుర్మార్గానికి గురై తమలో వున్న అక్కసుని బయటికి కక్కేసేటందుకు మనవాళ్ళు యేర్పాటు చేసిన ఛానలైజేషన్ టెక్నిక్ అనుకుంటా!వీధుల్లో పరుగులెత్తే అంతమందిలో యెవడు తిట్టాడో తెలియకపోయినా ఆ తిట్లు విన్నవాడు కొంచెమయినా సిగ్గు పడకపోతాడా?ఒకవేళ అది రహస్యంగా జరిగిందయితే పదిమందికీ తెలెసి మిగతా జనం కూడా నిలదీసే వీలుంటుంది గదా!వుపయెగించుకుంటే కక్షల్నీ కార్పణ్యాల్నీ వొత్తిడుల్నీ తగ్గించుకోవడానికి సైకో అనలిష్టులకి కూఒడా తట్టని సొల్యూషన్,కదా?!


      నిన్నటి తరం కవి కుమారు లిద్దరు జంటకవులుగా వెలుగుదా మనుకున్నారు!ఒక కుర్రాడి పేరు దీపాల పిచ్చయ్య శాస్త్రి!మరొక కుర్రాడి పేరు గుర్రం జాషువా!ఒకరు బ్రాహ్మణుడు,మరొకరు దళితుడు - అయినా వారి స్నేహదీపం మాత్రం అద్భుతంగా వెలిగింది!కవితా రంగంలో కూడా జోడుదీపాలుగా వెలగాలనుకున్నారు,కానీ పేర్లు కుదరనివ్వ లేదు?ఇంటి పేర్లతో కలుద్దామా అంటే గుర్రం దీపాల, దీపాల గుర్రం - యెటు చూసినా పిచ్చయ్యకి దెబ్బై పోతున్నది?పోనీ అసలు పేర్లతో కలుద్దామా అంటే పిచ్చయ్య జాషువా, జాషువా పిచ్చయ్య - జాషువాకి దెబ్బై పోతున్నది?దాంతో విసుగెత్తి పోయి జంటకవులుగా కాకుండా విడివిడిగానే తమ కావ్యదీపాల్ని వెలిగించారు!!

పిరికితనం నుంచి శాడిజం వరకూ అన్ని మానసిక జాడ్యాలకూ హాస్యమే పరమౌషధం!

Wednesday, 15 October 2014

ఒక పాత జోకును ఒక కొత్త ఫోటోతో రిమిక్స్ చేస్తే - గాంధీఇజం!

               అనగననగా ఒక వూళ్ళో ఒక రాజకీయ నాయకులుం గారు మహోత్సాహంతో తన రాజకీయ జీవితంలోని తొలి వుపన్యాసంలోనే నభూతోనభవిష్యతి అన్నంత గొప్పగా ఇరగదీద్దామని ప్రాంతీయ , జాతీయ , అంతర్జాతీయ విషయాలన్నిటి పైనా అవగాహన కల్పించుకుని ఒకానొక శుభముహూర్తంలో రాజు వెడలె రవి తేజము లలరగ అన్నట్టు బయలు దేరారు. ఇంకా రాజకీయ జీవితంలో అగ్రభాగానికి చేరుకోలేదు గాబట్టి దేవుడి కొద్దీ పత్రి అని తనకి తగ్గట్టుగా అన్ని హంగులూ కూర్చుకుని మైకు ముందుకు రాగానే ప్రాణం వుసూరు మనిపించింది. అంగబలం లేకపోవటంతో  ప్రేక్షకుడు వొకే వొక్కడు దొరికాడు మరి!
               మన సినిమా హీరోలు ప్రేక్షకులే నా దేవుళ్ళు అన్నట్టుగా ఆ యేక ప్రేక్షక వక్త కూడా తన దేవుణ్ణే అడిగాడు యెంతో గొప్పగా ప్రిపేరయి వచ్చాను, తీరా చూస్తే నువ్వొక్కడివే వున్నావు - యేం చెయ్యమంటావు అని. ఆ అమాయకుడు "అయ్యా,నేను గొడ్ల సావిట్లోకి గొడ్లకి మేతెయ్యాలని యెళ్ళా ననుకోండి ఒక్కటున్నా పది వున్నా పని పూర్తి చేసుకునే వస్తా గందా" అని లాజిక్కు లాగాడు! సూచన అర్ధమయి పోయింది, మేధావి గదా? ఇక తన సిలబసు తను ఫాలో అయిపోయాడు.

               అంతా అయిపోయాక ఫీడు బాకు అడిగాడు, ప్రతి మనిషీ తన కష్టానికి ప్రతిఫలం కోరుకంటాడు గదా పాపం! వక్త గారి విజృంభణకి గట్టిపిండం కాబట్టి తట్టుకుని నిలబడ్డాడో, మరి శోష వచ్చినా తన మాట చెప్పాలి గాబట్టి తేరుకున్నాడో గానీ చెప్పాడు, "అయ్యా,నేను గొడ్ల సావిట్లోకి గొడ్లకి మేతెయ్యాలని యెళ్ళా ననుకోండి పది గొడ్లకి యేసే మేత వొక్క గొడ్డుకి యెయ్యను,అట్టా యెయ్యగూడదని నాకు తెలుసు గానీ మీకు తెలవనట్టుంది " - అని?

P.S:సరిగ్గా మోహన దాసు కరమ చందు గాంధీ చేసింది గూడా ఇదే!పెళ్ళాం మొగుడి మీద అలిగి తిండి మానేసి మొగుడికి జాలి పుట్టించి సాధించుకునే వ్యక్తిగత స్థాయిలో జరిగే తింగరి తనాన్ని మొత్తం ఒక జాతిని మరొక జాతి పీడిస్తున్నప్పుడు ఆ దురన్యాయాల్ని సామాజికంగా ప్రతిఘటించే సీరియస్ వ్యవహారంలోకి లాక్కొచ్చాడు?
______________________________________________________
(ఫొటో గూగుల్ సౌజన్యం)

Thursday, 9 October 2014

యే వెలుగులకీ ప్రస్థానం?యే మలుపులకీ ప్రయాణం!

        "నా మూలాలు నీకు లేకుండా చేస్తా" - పంచ్ అదిరింది!ఇలాంటి పంచ్ సినిమాలో పడీతే కాసుల వర్షమే!!కానీ ఈ మాట నిజజీవితంలో ఒక భర్త అన్నాడు.ఫలితంగా రక్తం వర్షమై కురిసింది? "అతను కిరాతకుడు, పెళ్లయిన రెండో రోజు నుంచే కొడుతూ వుండేవాడు, అత్తమామలు కూడా నన్నే సర్దుకు పొమ్మనేవాళ్ళు" - ఇవ్వాళ గర్భశోకానికి గురయిన ఆ భార్య ప్రతివాదన! పెళ్లయి ఇద్దరు పిల్లల్ని కని వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక ఇప్పుడు విడిపోయే సమయంలో వాళ్ళ మధ్య యెంతటి అగాధం? వసుధైక కుటుంబ భావనతో దేశాల్నీ జాతుల్నీ కలపడం మాట దేవుడెరుగు ఒక ఇంట్లో ఇంతకాలం తనువులు కలిసినా మనసులు కలవని దిక్కుమాలిన స్థితిలో వున్నారివాళ్టి మనుషులు. రేపటి రోజున చంపుకోవడానికీ పగలు తీర్చుకోవడానికీ  పెళ్ళిళ్ళు చేసుకుంటారేమో - యే వెలుగులకీ ప్రస్థానం?యే మలుపులకీ ప్రయాణం!

        మన పెంపకాలు అలా వున్నాయి మరి!మగవాడు పుడితే వాడికేం మగమహారాజు యెలా అయినా బతికేస్తాడు అనే దరిద్రపు మాటల్తో రేపటి రోజున వాడు ఒక కుటుంబ పెద్దగా వుండాలి అనేది తెలిసి కూడా బాధ్యతలు నేర్పకుండా సంస్కారం గలవాడిగా తీర్చిదిద్దకుండా గాలి కొదిలేస్తున్నారు! ఆడపిల్ల పుడితే యెప్పటికయినా పెళ్లయి కొత్తచోటికి వెళ్ళాల్సినదే గాబట్టి యెక్కడయినా బతకగలిగే ధైర్యమూ కొత్తవాళ్లతో చొరవగా కలిసిపోయి అందిస్తే అల్లుకుపోగల తెలివినీ నేర్పకుండా అంతులేని విధినిషేదాల్తో భయస్తురాళ్ళుగా తయారు చేసి అమాయకంగా హతమారి పోయేటట్టు పెంచుతున్నారు! దాని ఫలితంగానే మగతనం అంటే ఆడదానితో సామరస్యంగా వ్యవహరించి తన సమర్ధతతో ఆమెను సంతోషపెట్టటంగా కాకుండా పశువులాగా భయపెట్టి లొంగదీసుకుని తన కోరిక తీర్చుకోవటం అని భ్రమించి ఈవ్ టీజింగుల దగ్గిర్నించి రేపుల వరకూ గల అకృత్యాల నన్నిట్నీ అంత ధీమాగా చేస్తున్నారు మగవాళ్ళు. మన పిల్లల్ని యెలా పెంచాలి అనేది కూడా తెలియని అజ్ఞానంలో వున్నారివ్వాళ్టి తలిదండ్రులు. రేపటికాలంలో పిల్లలకి జైళ్ళే స్కూళ్ళవుతాయేమో - యే వెలుగులకీ ప్రస్థానం? యే మలుపులకీ ప్రయాణం!

       పెంపకాలతో పాటు మనిషిని తీర్చిదిద్దే మన చదువులూ అట్లాగే అఘోరించాయి!పరదేశీయుడు తనకి పనికొచ్చే బంత్రోతుల్నీ భావదాసుల్నీ తయారు చేసుకునేటందుకు రూపొందించుకున్న విద్యావిధానాన్నే వాళ్ల నుంచి స్వతంత్రాన్ని తెచ్చుకున్నాక గూడా మన దేశపు సంస్కృతిని ప్రతిబింబించే విధంగా మార్చలేకపోయారు!అన్ని పాఠ్యాంశాల్లోకీ పిల్లల్ని భయపెట్టేదిగా లెక్కల్ని చెబుతారు. కానీ వేదగణితాన్ని అనుసరిస్తే పిల్లలు భయాన్ని పోగొట్టుకోవడమే గాకుండా హుషారుగా నేర్చుకోగలుగుతారు! దాదాపుగా మిగతా అన్ని పాఠ్యాంశాల్లోనూ యెక్కడో అక్కడ లెక్కలు వస్తాయి, అలాంటిది అందులో వెనకబడ్దం వల్ల మొత్తం చదువులే పిల్లలకి బోరు కొట్టించేవిగా తయారయినా కనీసం యెందుకు పిల్లలు బోరు ఫీలవుతున్నారు అనే ప్రశ్న కూడా వేసుకోకుండా బలవంతంగా ఈ రొడ్డకొట్టుడు బట్టీలకే అలవాటు చేసి తీపి జ్ఞాపకాలతో జీవితకాలం గుర్తుండిపోవాల్సిన అందమయిన బాల్యాన్ని భయంకరమయిన శిక్షగా మార్చేస్తున్నారు. మన విద్యావ్యవస్థ యెంత కిరాతకంగా వుందో తెలుసుకోవడానికి బండ్లకొద్దీ రిపోర్టులు చదవక్కర్లేదు - కిలోల్లెక్కన బరువున్న స్కూలుబ్యాగుల్ని మోసుకుంటూ వెళ్లే ప్రైమరీ స్కూలు పిల్లల్నీ స్టెయిలుగా ఒక నోట్ బుక్కూ ఒక నాలుగయిదు టెక్స్టు బొక్కులతో చేతులూపుకుంటూ వెళ్ళే కాలేజీ కుర్రాళ్లనీ మార్చి మార్చి చూస్తే చాలు - యే వెలుగులకీ ప్రస్థానం? యే మలుపులకీ ప్రయాణం!

       "రెండు పవిత్రాత్మలు కలిసి ఒక పరమాత్మ స్వరూపాన్ని పుడమి పైన ప్రభవింప జేయడం" అనేది మనుషుల మధ్య జరిగే వివాహక్రతువులోని వుద్దేశం! పుట్టినప్పుడు మెడకూడా నిలబెట్టలేనంత సున్నితంగా వుండే శిశువుకు నడక, పలుకు, నడత నేర్పి సమాజానికి మంచి కానుకగా నిలబేట్టాల్సిన ఒక జీవితకాలపు యజ్ఞభావనతో కూడిన ఉన్నతలక్ష్యం లాభనష్టాల బేరీజులతో కూడిన క్రయవిక్రయాల ఒప్పందం స్థాయికి దిగజారిపోయింది. స్త్రీతో చేసే సహజశృంగారానికి బెదిరి ఒక మగాడు మరొక మగాడి శరీరాన్ని నాక్కుంటూ చేసే వికృతత్వాన్ని కూడా పెళ్లి గా గుర్తించేసేటంత అజ్ఞానంలో వున్నారివ్వాళ్టి న్యాయమూర్తులు. రేపటి రోజున అన్నాచెల్లెళ్ళ మధ్య జరిగే ఇన్సెస్ట్ కూడా పెళ్ళిగా ఆమోదించబడుతుందేమో - యే వెలుగులకీ ప్రస్థానం? యే మలుపులకీ ప్రయాణం!

    ప్రస్తుతం మన భూమి వున్న సూర్యమండలం పాలపుంత అనే ఇడ్లీ ఆకారంలో వున్న నక్షత్ర సమూహానికి సంబంధించినది. ఈ ఇడ్లీలో వుడికీ వుడకని ఒక మినప్పప్పు బద్ద అంత వుంటుంది మన సూర్యమండలం.వీటిల్లో సూర్యుడి నుంచి మూడో గ్రహమయిన భూమి మీద వున్న మనం సూర్యుడి నుంచి నాలుగో గ్రహం మార్స్ కి జస్ట్ ఇప్పుడే చేరుకున్నాం. ప్లుటో అనే తొమ్మిదో గ్రహానికే యెప్పటికి చేరుతామో ఇప్పుడే చెప్పలేం. వీటన్నిట్నీ శోధంచి యేమి చేస్తారు? ఇక్కడ తామరతంపరగా పెరిగిన జనాభాలో కొందర్ని అక్కడికి తరిమెయ్యడానికా,ఇక్కడ పేరుకు పోయిన చెత్తనంతా యెత్తి అక్కడ గుమ్మరించడానికా - యెందుకు గ్రహాంతరాల్లో జనావాసాల కోసం వీరంతా అలమటిస్తున్నారు? ఒకనాడు హరప్పా కాలం లోనే మురుగునీటి పారుదల సౌకర్యాలతో బహిరంగ స్నానఘట్టాలతో నగరజీవనాన్ని క్రమబధ్ధీకరించుకుంటే ప్రశాంతంగా బతకడాని కయినా తక్కువమంది సంతానంతో సరిపెట్టుకుని వున్నదాన్ని సమంగా పంచుకోవటాన్ని నేర్చుకోవాలి, ఆరోగ్యంగా వుండేటందుకయినా తమ చుట్టూ వున్న పరిసరాల్ని పరిశుభ్రంగా వుంచుకోవాలి అనే చిన్న విషయాన్ని కూడా తెలుసుకోలేని దుస్థితిలో వున్నారివ్వాళ్టి నవనాగరికులు. రేపటి రోజున మనుషులందరూ తరతమ భేదాల్లేకుండా  చెత్తలో పుట్టి, చెత్తలో పెరిగి చెత్తలో ఐక్యమయ్యే చెత్తాద్వైత స్థితికి చేరుకుంటారేమో - యే వెలుగులకీ ప్రస్థానం? యే మలుపులకీ ప్రయాణం!

     ఒక కొడుకు తమ పెళ్ళి ఫొటోలు చూపించినంత గొప్పగా "నాన్నా,ఇవిగో నీ కోడల్ని చంపి పాతిపెట్టిన ఫోటోలు" అని గొప్పగా చూపిస్తే కబీరు పురస్కార గ్రహీత అయిన ఆ పవిత్రాత్మ స్వరూపుడయిన తండ్రి యెలా స్పందించాడో ప్రత్యక్షంగా మనం చూడలేదు గాబట్టి ఖచ్చితంగా తెలుసుకోలేము గానీ అది తప్పు అని చెప్పిన దాఖలాలు లేవు! వురిశిక్షకి గురై చావబోతూ ఆఖరి కోరికగా తల్లిని ఫెళ్ళుమని చెంప పగలగొట్టి, "తోటకూర నాడే చెప్పివుంటే నాకీ గతి పట్టేది కాదు గదే" అన్న కధలోని పాత్రధారి నిజంగా మనిషే అయి వుండి  ఈ తండ్రి పెంపకపు తీరునీ ఆ కొడుకు చేసిన వరస భీబత్సాల్ని చూసి వుంటే తను తల్లిని అలా కొట్టినందుకు సిగ్గు పడి వుండే వాడేమో - యే వెలుగులకీ ప్రస్థానం? యే మలుపులకీ ప్రయాణం!

      మంత్రివర్గాలు యేర్పడిన తర్వాత నెలలు గడిచినా ప్రభుత్వపరంగా నిక్కచ్చిగా ఒక్క పనినీ మొదలు పెట్టకుండా సర్వేలూ,శ్వేతపత్రాలూ,కబుర్లూ,తిరుగుళ్ళూ,పండగలూ,తిట్టుకోవడాలూ లాంటి బేవార్సు పనుల్తో సరిపుచ్చుతుంటే ఆ ప్రభుత్వ నిర్వహణకి అన్ని నెలల ఖర్చూ వృధా యే గదా! యెంత ఖర్చు పెట్టారు అని లెక్క వేసుకోవాలంటేనే గుండె గుభేలు మంటున్నది. హామీలూ, వాగ్దానాలూ చూస్తే ప్రపంచంలో వున్న సంపదనంతా తరలించుకు రాగలమన్నట్టు పిట్టల దొర కబుర్లు చెప్తున్నారు ఇద్దరూ. తెలంగాణా ముఖ్యమంత్రిని చూస్తే కొత్తగా వొచ్చిపడ్డ హోదాతో కేళీ విలాసంగా వున్నాడు! బంగారు తెలంగాణా తెస్తానని కంగారు తెలంగాణా తెచ్చినా రాష్ట్రం విడిపోతే చాలు అనే జనం అధికంగా వుండటం వల్ల రాష్త్ర సాధకుడిగా అపరిమితమయిన కీర్తి ప్రతిష్టలు యెలాగూ వచ్చేశాయి గాబట్టి ముఖ్యమంత్రిగా తన దివాళాకోరుతనంతో ఫెయిలయినా ఆంధ్రోళ్ళు పడనియ్యలేదని తప్పుకునే వీలుందనే లెక్కలేని తనంతో మిడిసి పడుతున్నాడు. పత్రికల్లో వ్యతిరేక వ్యాఖ్యలు తన కొక్కడికే వచ్చాయా?నిన్నటి తరం దిగ్దంతులు దేశోద్దారక కాశీనాధుని నాగేశ్వర రావు పంతులు గారూ నార్ల వెంకటేశ్వర రావు గారూ అప్పుడు ప్రభుత్వంలో వున్న వాళ్లు తనకన్నా మహోన్నతు లయినప్పటికీ వదలకుండా యేకి పారెయ్య లేదా?ఇమ్రోజు ఎడిటర్ షోయబుల్లా ఖాన్ పట్టపగలు నడిబజార్లో హత్యకు గురయ్యాడంటే అతని రాతలు యెంత ఘాటుగా వుండి వుండాలి?నిన్నటి తరం ప్రజాస్వామిక మహారాజ్ఞి ఇందిరా నెహ్రూ(ఖాన్)గాంధీనెహ్రూ ను అనుసరిస్తున్నాడేమో!వాళ్ళ రాష్ట్రం వాడే అని మురుసుకుంటున్న పోతన యెప్పుడో చెప్పాడుగా "కారే రాజులు?రాజ్యముల్ గలుగవే?గర్వోన్నతిం బొందరే?వారేరీ?సిరి మూటగట్టుకు పోవంజాలిరే?" అని! "అధికారాంత మందు జూడవలె గదా అయ్యల సౌభాగ్యము" లని మరో కవివాక్యం కూడా తనలాంటివాళ్లని గురించేనని యెప్పటికయినా తెలుసుకుంటాడా ఆ పెద్దమనిషి? తను మాట్లాడిన తప్పుడు కూతల్ని కూడా వొప్పుల కుప్పలుగా తొండివాదనల్తో సమర్ధించుకొచ్చే పంఖాలూ శీతలీకరణ యంత్రాల్లో ఇంధనం నిండుకోనంతవరకూ అతనికి తన ప్రవర్తనని మార్చుకోవలసిన అవసరం లేదేమో! తమ ముఖ్యమంత్రి తమ విపరీతపు సమర్ధనల వల్లనే అహంకారిగా మారి పరిపాలనని అస్తవ్యస్తంగా చేసి తమ కష్టాలకు కారణ మయ్యాడని భవిష్యత్తులో గానీ ఈనాటి వీరభక్తులకు తెలియదు! ఇటు చూస్తే రైతు సాధికారిక సంస్థను యేర్పాటు చేసేశాను మీకేం భయం లేదంటూనే అప్పు చేసయినా మీ బాకీలు తీరుస్తానంటాడు ఆంధ్రా ముఖ్యమంత్రి, తను సొంతంగా చేసి తీరుస్తాడా? మనతోనే చేయిస్తాడే! కానీ ఆ అప్పెలా తీరుస్తాడో మాత్రం చెప్పడు? ఒకనాడు తనే అధికారం నుంచి క్రూరంగా లాగి పారేసి చావు వరకూ తీసుకెళ్ళిన పెద్దమనిషి ఇవ్వాళ ప్రతి చిన్న పధకానికీ రామనామాన్ని తగిలిస్తున్నాడు!దేవుడి వేషాలు వేసినంత మాత్రాన రామారావు దేవుడూ కాదు, ప్రతిచోటా అతని పేరును తగిలించనూ అక్ఖర్లేదు!అతిపనులు వికటిస్తే వొచ్చే అనర్ధం కూడా అతిగానే వుండి వీపు విమానం మోత మోగిస్తుంది ఒకోసారి! ప్రపంచంలోనే అపూర్వమయిన రాజధాని కడతానంటాడు, అయితే విరాళాలూ మీరే ఇవ్వాలి శ్రమదానమూ మీరే చెయ్యాలంటాడు - యే వెలుగులకీ ప్రస్థానం? యే మలుపులకీ ప్రయాణం!

      విడిపోక ముందు అన్ని రాష్ట్రాల్లోకీ ధీమాగా వున్న రాష్త్రం కాంగ్రెసు నిర్దాక్షిణ్యంగా లెక్కాడొక్కా యేమీ లేకుండా విడగొట్టటం వల్ల రెండు రాష్ట్రాలకీ కష్తమే అని ఇద్దరు ముఖ్యమంత్రులకీ తెలుసు, అయినా మేకపోతు గాంభీర్యంతో చెలాయంచు కొస్తున్నారు.కేంద్రం కూడా సాయం చేసే పరిస్థితి లేదు. మోదీ గారు ప్లానింగ్ కమిషన్ రద్దు చేసి ముఖ్యమంత్రుల పానెల్ వెయ్యడంతో ఆ మూగమొద్దు పెతాన మంత్రి కేవలం వుత్తుత్తి మాటలే చెప్పాడు గాబట్టి నికరంగా రావాలంటే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులూ జాలి చూపిస్తే తప్ప ఈ రెండు రాష్ట్రాలూ కేంద్రం నుంచి నిధులు కూడా తెచ్చుకోలేవు.ఈ రెండు రాష్ట్రాల నిజమయిన ఆర్ధిక స్థితి తెలియాలంటే అధికారుల విభజన పూర్తయి(?) యెక్కడి వాళ్ళు అక్కడ కుదురుకున్నాక ఆదాయ వనరులు యేమి వున్నాయి,వీటిని ఆదాయంగా మార్చడానికి యెంత ఖర్చవుతుంది,తప్పనిసరి ఖర్చులు యేమిటి,వాటిల్లో పొదుపు యెంత చెయ్యగలం అనే లెక్కలు వాళ్ళు తేల్చుకోవడానికే కొంత సమయం(?) పడుతుంది. అదంతా పూర్తయ్యాకే ప్రభుత్వం నిజంగా పని చెయ్యడానికి సిధ్ధంగా వున్నట్తు లెక్క! మామూలు పన్లకే విభజన కష్టాల్ని యేకరువు పెడుతున్నారు గానీ కరువు ప్రస్తావన వొస్తే మాత్రం అదేం చేస్తుందని దవిలాగులు దంచేస్తున్నారు!కరువంటే చాక్లెట్ ఇస్తే తీసుకుని సంతోషంగా తప్పుకుపోయే చిన్నపిల్ల అనుకుంటున్నారా?కరువు యొక్క మొదటి దెబ్బ మనుషుల మనస్సుల మీద పడుతుంది! ఆ కంగారులో యెంతటి ధైర్యస్తుడయినా బేజారు కావల్సిందే. రావడం అంటూ జరిగితే తన ఆవృత్తం పూర్తయ్యాకే వొదులుతుంది.కరువు లెందు కొస్తాయో ఎకనామిక్స్ లో కొత్తగా వచ్చిన డ్రాట్ ఎకానమీ చెబుతుంది. అంతకు ముందరి అస్తవ్యస్తపు ఆర్ధికవిధానాల ఫలితంగానే కరువు వొస్తుంది! ఒకనాటి బెంగాలు కరువు మొత్తం కర్జన్ అనే వొక్క వ్యక్తి దుర్మార్గమయిన ఆర్ధిక విధానాల వల్ల వొచ్చిపడింది. అట్లాగే నిన్నటి ప్రభుత్వం పాటించిన అస్తవ్యస్తపు ఆర్ధిక విధానాల కారణంగా ఒక చైన్ రియాక్షన్లో భాగంగా వచ్చే కరువు కూడా దానంతటది పోదు - యే వెలుగులకీ ప్రస్థానం? యే మలుపులకీ ప్రయాణం!

       మొబైలు టవర్ల నుంచి వచ్చే హానికారక వుద్గారాలు అమాయకమయిన పిచ్చుకల పాలిటి శాపాలుగా మారినా ఆ హాని మనకి కాదుగా అని నిష్పూచీగా వున్న మనుషి ఈ భూమి మీద నుండి అంతరించిపోయే ప్రమాదం తనకీ యెదురవబోతున్నదని తెలుసుకోలేని అజ్ఞానంలో వున్నాడు!మగవాళ్ల వీర్యకణాల్లో సంతానాన్ని పుట్టించే సత్వం రానురానూ తగ్గిపోతున్నదని పరిశోధనలు తెలియజేస్తున్నాయి.ఆ తగ్గుదల "0" స్థాయికి పడిపోతే చావులే తప్ప పుట్టుకలు లేక ఒక యాభైయేళ్ళలో మానవజాతి సమస్తం తుడిచిపెట్టుకు పోవటం ఖాయం!ఈ పరిస్థితికి పారిశ్రామిక వ్యర్ధాలూ కరగని గంధక ధూళీ మట్టిలోకీ, నీటిలోకీ, గాలిలోకీ ఇంకిపోవడం వల్ల జీవ రసాయనిక సమతౌల్యం దెబ్బతినడం ఒక కారణం కాగా అందరి కష్టాన్నీ ఒక్కచోట చేర్చి అందరూ కలిసి పంచుకోవడం అనే ఆర్ధికసూత్రంలో వుండే ప్రశాంతతని కాకుండా అందరి దగ్గిరా వున్నది తనకే కావాలని కోరుకుంటూ అందరూ ఒక్కదానికే పోటీపడే జీవనవిధానం వల్ల మనస్సు మీద పడే వొత్తిడులు మరో కారణం. ఒకనాడు డైనోసార్లు మనిషిలాగే ఈ భూమినంతా ఆవాసం చేసుకుని చెలరేగిపోయి హఠాత్తుగా అదృశ్యమయి పోయాయి. కారణాలు ఇతమిధ్ధమని ఇప్పటికీ నిర్ధారించలేకపోతున్నారు, కానీ మనిషి మాత్రం తెలివి తేటలు యెక్కువై నశించిపోయాడనే సాక్ష్యాన్ని వొదిలే వెళ్తాడు? అప్పుడు అణుధూళిలో కూడా క్షేమంగా బతకగల్గిన బొద్దింకలూ చీమలూ మనిషి గురించి "ఈ పెనుమంటి దిబ్బపై వసియించి రొకనాడు మానవుల్!పాపము శేముషీ విభవ పారగులై అందరు మడిసి చచ్చిరి!!" అని జాలిగా కరుణ గీతికలు పాడుకుంటాయి కాబోలు - యే వెలుగులకీ ప్రస్థానం? యే మలుపులకీ ప్రయాణం!

      ప్రపంచంలోని అతి ప్రాచీనమయిన సాంప్రదాయం అని వివేకానందుడు గొప్పగా చెప్పుకోగా ప్రపంచ ఆధ్యాత్మిక రంగంలో యెంతో ప్రభావశీలిగా వున్న హిందూధర్మం ఇవ్వాళ తమ దుర్మార్గం వల్లనే మతాంతరీకరణలు జరిగాయని తెలిసి కూడా లవ్ జెహాదుల మీద అల్లరి చేస్తూ రివర్స్ మతాంతరీకరణలకి తెగబడుతూ పాప్యులారిటీ పెంచుకోవడం కోసం నిన్న మొన్న పుట్టిన ఆ మతాలనే ఇమిటేట్ చేస్తూ పట్టుపంచె కట్టుకుని హుందాగా వుండాల్సిన తాతగారు మనవడితో పోటీ పడుతూ లెవ్వీ జీన్సులు తొడిగి అమ్మాయిలకి లైనులు వేస్తూ వుంటే యెలా వుంటుందో అలా తయారయింది! పంచమవేదంగా జయేతిహాసాన్ని అందించిన వేదవ్యాసుడు అవతారికలో "ఖండాంతరాలలో వున్న యవనుల్లో కూడా ఋషులు వుండే వుంటారు, వారందరికీ కూడా నమస్కరిస్తున్నాను" అన్నాడు.ఆ వినయశీలత్వాన్నీ ఆచరణలోని స్వచ్చతతో గౌరవాభిమానాల్ని అందుకోవడాన్నీ వొదిలేసి మనం విశ్వగురువుల మని అహంకరిస్తూ ఆర్భాటాలు చేస్తున్నారివాళ్టి ఆషాఢభూతులు.రేపటి రోజున ఇతర మతస్తుల్ని బుజ్జగించడానికి ఓంకారాన్ని హల్లెల్లూయాతో ఢీకొట్టించి కొత్తరకం బీజాక్షరాల్ని కూడా సృష్టిస్తారేమో - యే వెలుగులకీ ప్రస్థానం? యే మలుపులకీ ప్రయాణం!

    తన చుట్టూ అప్పుడున్న హింసకీ అశాంతికీ విసుగెత్తి శాంతిని పెంచాలని "ఇస్లాం" ధర్మాన్ని ప్రతిపాదించాడు ప్రవక్త! శ్రమకీ దానానికీ ప్రాముఖ్యతని ఇచ్చే ఒక కొత్త సాంప్రదాయాన్ని సృష్టించి అతి తక్కువ కాలంలోనే యెంతోమందిని ప్రభావితం చెయ్యగలిగింది ఇస్లాం ధర్మం. ఇవ్వాళ్టి ప్రపంచంలో వున్న అన్ని మతాల్లోకీ అతి తక్కువ కాలంలోనే ఇంత ప్రభావశీలంగా యెదిగిన విశిష్టత ఇస్లాం ధర్మానికి మాత్రమే వుంది! ఒక చోట వ్యతిరేకత రాగానే పరమ శాంతంగా అక్కడి నుంచి తప్పుకుని వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ తన బోధనని కొనసాగించే వాడు!చూడటానికి ఇది తన్నడాని కొస్తే పారిపోయినట్టు సిల్లీగా కనబడినా ప్రవక్త వేసిన అమోఘమయిన యెత్తుగడ?తను చెప్పిన దాన్ని కొందరు నిష్టగా పాటించటం వల్ల మరికొందరు వ్యతిరేకిస్తున్నారంటే దానర్ధం యేమిటి?పాటించే వాళ్ళ ఆచరణ  వ్యతిరేకుల్ని నష్టపెట్టేటంత బలంగా వుందని కదా!ఇంకా అక్కడే వుండి అక్కడి వ్యతిరేకుల్తో కుక్కజట్టీల్లో ఇరుక్కోవడం వల్ల  కధ అక్కడే ముగిసిపోవడం జరిగి వుండేది కాదా! అలా ప్రవక్త తొలినాళ్లలో వ్యతిరేకతని కూడా వివేకంతో యెదుర్కోవటం వల్లనే ఆ అద్భుతం సాధ్యపడింది. ప్రపంచంలోని ప్రతి ముస్లిమూ ఇవ్వాళ పవిత్రంగా పూజించేది కర్బలా మైదానంలో నేల కొరిగిన త్యాగమూర్తుల రక్తంతో తడిసిన భూమినే!ఒకనాడు కాఫిర్ల మీద జెహాద్ చెయ్యటమంటే వ్యతిరేకించే వారిని ప్రేమతో గెలిచి తమ రక్తం చిందించి అయినా సరే శాంతమార్గంలోనే గెలవాలనే అర్ధం వుండేది?శాంతి కోసం ప్రభవించిన ధర్మాన్ని అనుసరిస్తూ కూడా అశాంతితో రగిలి పోతున్నారు. ప్రవక్త బోదనల్ని నిష్ఠగా పాటించటం కన్నా తుపాకులతో యేదటివాళ్లని భయపెట్టటం  ద్వారానే ఎక్కువ రక్షణ వుంటుందని భ్రమ పడుతున్నారు. ఈరోజు వీరు పరిధిని దాటి చేస్తున్న పొరపాట్ల వల్ల యెదురయ్యే వ్యతిరేకత ఇస్లాం ధర్మానికి అతి తక్కువ కాలం లో అదృశ్యమయిపోయిన మతంగా మరో రకమయిన కీర్తిని తెచ్చిపెడుతుందేమో - యే వెలుగులకీ ప్రస్థానం? యే మలుపులకీ ప్రయాణం!.


ప్రళయమే రానీ ప్రణయమే పోనీ
                                                           హృదయమే కాలి బూడిదై పింజలైపోనీ
                                                           కన్నుగానని తత్వం తెలిసి బతికితే
                                                           మనిషిగా కలకాలం మిగులుతావుగా హరీ!
                                                           ఇంత దెలిసి యుండి అంత బాధ పడతావేం బాబూ!!

Monday, 6 October 2014

నిన్నటి తరం గొప్పవాళ్ళ విగ్రహాల పైన నీకు ఆగ్రహ మేలరా? వాళ్ళ వుసురు తగిలి - కుర్చీ పోయిన మరుక్షణం నువ్వు పనికిమాలిన వాడివి కాకురా!

సీ||          కాకిరి బీకిరి కూతల్తొ కాకిలా
                 కావు కావు మని తిక్కోని మల్లె

                  నోటికేదొస్తె అదే సుభాషిత మల్లె
                  కూసినా - పెయ్యనాకుడుల మంద

                  నీకన్న గొప్పోడు లేనట్టు మోస్తేను
                  ఇంతోడి వైనావు! యెందు కట్ల

                  వెన్కటి తరాల వేగుచుక్కలను ప
                  నికిమాలినోళ్లని నోటి నిండ

తే||            పేడ నింపుక వాగేవు?పాప కర్మ
                   లింక ఆపరా, ఈ సుద్దులన్ని వోట్లు
                   రాల్చకుండ యెదురుతంతె -  రాజ్యమంత
                   పోయి నెన్క నీ బతుకెంత పోటుగాడ?!
(05/10/2014)
______________________________________________________
             టాంక్ బండ్ మీద ఇప్ప్పుడు విగ్రహాలుగా వున్నవాళ్లలో యెవరయినా తెలంగాణా ప్రజలకు అపకారం చెయ్యటం గానీ తెలంగాణా సంస్కృతిని అవమానించటం గానీ చేశారా?తమ పరిధిలో తాము - కవులయితే కవిత్వం చెప్పదం ద్వారా, దాత లయితే దానాలు చెయ్యదం ద్వారా, సంస్కర్త లయితే దురాచారాల్ని పరదోలి ప్రజల్ని సంస్కార వంతుల్ని చెయ్యడం ద్వారా - ప్రజలకు సంతోషాన్ని కలిగించిన వారే తప్ప అన్యు లెవరయినా వున్నారా?అయినా సరే వాళ్లని వారి గొప్పదనంతో యేమాత్రమూ సరితూగలేని ఇవ్వళ్టి ఒక రాజకీఎయ నాయకుడు పనికిమాలిన వాళ్ళు అంటుంటే అది గొప్పమాటలా చెల్లిపోతున్నదేంటి! ఒకనాడు సాండర్స్ అనే ఒక పోలీసు తమకు అత్యంత గౌరవనీయుదయిన నిన్నటి తరం నేతను అవమానిస్తే సింహకిశోరాలై లేచిన భగత్ సింగుని గౌరవిస్తున్నాం, మరి ఇప్పుడిక్కడ నిన్నటి తరంలో నిస్వార్ధంగా ప్రాంతాల కతీతంగా యేవో కొన్ని మంచి పనులు చేసిన వారిని కూడా మా ప్రాంతం వాళ్ళు కాకపోతే వాళ్లు పనికిమాలిన వాళ్ళే, వాళ్ళ పీఠాల్నించి వాళ్ళని తొలగించి తీరుతాం అంటూ వుంటే యెవరికీ చీమ కుట్టినట్టయినా అనిపించడం లేదేమిటి? యెవరు యే స్థానంలో వుండి యెలాంటి మాటలతో ఆ ప్రల్లదనాన్ని సమర్ధించుకుంటున్నారో చూస్తే తన పర భెదం తెలియకుండా పరోపకారం తో బతికిన వారి ఔన్నత్యం కూడా యెన్నికల్ల్లో వోట్లను విదిల్చే 200/- లేక 300/- రూపాయల కట్టల స్థితికి దిగజారి పోయింది కదా అని బెంగగా అనిపిస్తున్నది!

        "ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతందాకా తరిమి కొడతాం, ప్రాంతం వాదేవాడే చేస్తే ప్రాంతంలోనే పాతిపెడతాం' అన్నాట్ట వాళ్ళ ప్రజాకవి యెప్పుడో, ఇప్పటికీ అది పట్టుకు వూరేగేవాళ్ళు ప్రాంతం దాటి పోతే తమకీ అదే గతి పడుతుందనా ఇన్నాళ్ళూ ప్రాంతం పొలిమేరలు దాటనిది? నేను క్రిష్ణా జిల్లా నుంచి కొందరు వచ్చి బాగుపగలిగీతే పక్కనే వుండి కూడా హైదరాబాదుకు వచ్చి బాగుపడటానికి యెందుకు వెనకాడారు అని అడిగితే ఇప్పటి వరకూ జవాబు లేదు, యెందుకనో?! వొకప్పుడు అప్పటి ప్రభుత్వం ఇళ్ళ క్రమబద్దీకరణ చేస్తుంటే ఆగమాగం చేసి ఆపేయించి ఇప్పటి ప్రభుత్వం చేస్తున్నప్పుడు చూస్తూ కూర్చున్న వూసరవెల్లిని తరిమికొట్టలేకపోయారేం? అక్కున జేర్చుకుని మంత్రిగా కూడా ఆదరిస్తున్నారుగా?

        అసలు ఆనాడు ఆ విగ్రహాల లిష్టు తయారు చేసిన పెద్దమనిషి సినారె నోరువిప్పి మాట్లాడడేమిటి?ఇదివరకు మానవవాదం ఇన్నయ్య ఒక పాతసంగతిని గుర్తు చేశాడీ పెద్దమనిషి గురించి - కులపతి పదవి కోసం నెల తప్పిన విషయం! ఈయన కూడా వాహినీ వారి పెద్దమనుషుల్లో ఒకడే?! అందుకే ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో కూడా యేదో ఆశించి తను ప్రతిపాదించిన లిష్టు చుట్టూ అంత గొడవ జరుగుతున్నా -అవి పనికిమాలినవి కావు అని ఒక్క మాట కూడా మాట్లాడకుండా మవునంగా వున్నాడా? ఇప్పుడు పనికిమాలినోళ్ళు అని వదరుతున్న కేసీఆర్ కూడా ఆ విగ్రహాల యెంపిక కమిటీలో సభ్యుడే నట! కొంత మంది సభ్యులు దాన్ని యెత్తి చూపితే వొక మేధావి యెప్పుడో NTR మీద జరిగిన తిరుగుబాటు గురించి యెత్తి NTR మీదనే చెప్పులు విసరడం గురించి మాట్లాడి విషయాన్ని పక్కదారి పట్టించేశాడు! కేసీఆర్ కూడా ఆ కమిటీలో సభ్యుదే అనేదాన్ని జీర్ణించుకోలేకనే దాన్ని వ్యతిరేకించలేకనే NTRనీ, వెన్నుపోటునీ NTR మీద చెప్పులు విసరడాన్నీ ప్రస్తావించి పక్కదారి పట్టాడు అనే విషయం తెలుస్తూనే వుందిగా!


         ఇంత రాజకీయం నేర్చిన ఈ పెద్దమనిషి రేపు ఖర్మ కాలి కేసీఆర్ కుర్చీ ఖాళీ అయితే వెంటనే తన రాజకీయ మనుగడ కోసం అవసరమయితే కేసీఆర్ ని కూడా పనికిమాలినోడు అని అనకుండా వుంటాడని గ్యారెంటీ ఇవ్వగలరా తెవాదులు! యెప్పటిదాకానో యెందుకు, ఇప్పుడేం వూడబొడుస్తున్నాడు తెలంగాణా ముఖ్యమంత్రిగా? ఇంతవరకూ వొక్క పని కూడా మొదలు పెట్టలేదని తనే వొప్పుకున్నాడుగా! కుర్రాళ్లకి ఇంబర్స్ చెయ్యాల్సిన ఖాతా మొత్తం రుణమాఫీకి ఫిరాయించేసాడో యేమో, దాన్ని కవరప్ చేసుకోవడానికి 1956 స్థానికత అని ఫాస్టు గా వెళ్ళబోతే కోర్టు ఈ దేశంలోనే వున్నావా అని చివాట్లు పెట్తి మరీ స్లో చేసింది? బోడి లార్సన్ అండ్ టర్బో మీ హయాంలో పని చెయ్యటం మావల్ల కాదు,ప్రాజెక్టు నుంచి తప్పుకోడాని కయినా సిధ్ధమే అంటే లోపల్లోపల బతిమిలాడుకుంటున్నారో యేమో గానీ బయటికి మాత్రం వులుకూ పలుకూ లేకుండా వారం రోజులు గడిపి పత్రికల్లో ఆ వుత్తరం సంగతి లీకయ్యాక మొగుదు కొట్టినందుకు కాదు గానీ తోడికోడలు నవ్వినందుకు యేడుస్తున్నానన్నట్టు లీకు గురించి గోల చేసారే తప్ప అసలు వుత్తరంలోని సారాంశం అబధ్ధ మని అనలేక పోయారు! అతనెంతటి సమర్ధుడో తెలుసుకోవడానికి మూడు నాలుగేళ్ళు ఆగి అన్నమంతా పిసికి చూడాలా, ఈ వొక్క వుదాహరణా చాలదా? ఇంతకీ కధ యేమయింది అంటే ప్రాజెక్టును కాకెత్తు కెళ్ళింది, కంచికి చేరకుండానే ముగింపు వాయిదా పడింది! విషయాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుని గెజెట్ వేసేసి తను లాగేసుకుంది!తెలంగాణా ప్రభుత్వం కూడా కేంద్రం అడిగిందే తదవు గెజెట్ కోసం తను కూడా సహకరించేసి చేతులు దులిపేసుకుంది? పంచకూళ్ళ కషాయాన్ని పంచవేణీసంగమం అని మురుసుకునే తొట్టిగాంగు సభ్యులు మరి ధర్మ ప్రభువు నిజాము గారి దివ్యభవనాల గురించి ఆశ లొదిలేసుకోవాల్సిందేనా?! పోనీ ఇప్పటి వరకూ యేమి చేశాడో గుర్తు చేసుకుందామా అంటే- పోలవరం గురించి కొంతకాలం యేడ్వటం,  కరెంటు కష్టాల గురించి కొంతకాలం యేడ్వటం, కుర్రాళ్ళ ఫీజుల విషయంలో కోర్టుతో చివాట్లు తినడం, యేమి చేద్దామన్నా అధికార్ల విభజన పూర్తయి చావలేదని విసుక్కోవటం ఇవే గుర్తు కొస్తున్నయి మరి!


         మధ్యే మధ్యే అక్షతాన్ సమర్పయామి అన్నట్టు ఈ విగ్రహాల మీద పడి యేడ్వటం దేనికయ్యా అంటే తన అసమర్ధత బయట పడకుండానూ, పడినది పో ట్యూబులైట్ల వంటి అనుచరగణం దాన్ని గుర్తుపట్టి తిరుగుబాటు చెయ్యకుండా కొంతకాలం అన్న చించేస్తున్నాడురోయ్! అన్న నవ్వితే మాసు, అన్న యేడిస్తే మాసు, అన్న కోర్టులతో మొట్టికాయ లేయించుకున్నా మాసే అని పొంగిపోయే వీరభక్తులకి పూనకాలు రప్పించే వినోద కార్యక్రమం! నిజంగా పూనుకుని విగ్రహాల మీదకి పలుగులూ పారల్తో వెళ్ళారే అనుకుందాం, యేమవుతుంది, అహ యేమవుతుందీ అంట! ప్రాంతీయతని చూసుకుని మురిసిపోవదం తెలంగాణ్యులకి మాత్రమే సొంతమా? మనమేం తక్కువ తిన్నామా? వెంఠనే స్వాభిమానం గల ఆంధ్రా పారిశ్రామిక వేత్తలూ వ్యాపార ప్రముఖులూ విగ్రహాలతో పాటే స్వర్ణాంధ్రకు తరలి వస్తారు! మన ప్రాంతానికి చెందిన గొప్పవాళ్లని పారల్తో పలుగుల్తో పెళ్లగించి పొలిమేరలు దాటిస్తుంటే వాళ్లకి సంపదలు కూర్చబెడుతూ అక్కడే వుండటం అంటే యేమిటో విదమరిచి చెప్పాలా? తన ప్రాంతం పట్లా తన సంస్కృతి పట్లా గర్వం వున్నవాడెవడయినా ఆ పని చేస్తాడా? కొంచెం బిస్కట్టు విదిల్చేసరికి నేనూ హైదరాబాదీనే అన్న శ్రీమాన్ బెండప్పడు గారి లాంటివాళ్ళు వుంటారేమో, వుండనివ్వండి! అందాకా వొస్తే ఆయన్నీ నువ్వూ పలుగూ పారా పట్టుకుని వెళ్తావా అని అడిగి తేల్చుకుందాం! చిల్లర మల్లర పనులతో అల్లరి చెయ్యటం వాళ్లకి మాత్రమే తెలిసిన బ్రహ్మవిద్యా? ప్రపంచం పొలిమేరల దాకా వినబడేటట్టు మనం అరిచి గోల చెయ్యలేమా?


      అయినా గానీ ఇదివరకటి వాళ్ళు నిర్లక్ష్యం చేశారు,వోకే! తెలంగాణా ప్రముఖుల విగ్రహాలు కావాలనే పెట్టలేదు, రైటే!! నీ మంచితనం నువ్వు చూపించుకుంటూ వాళ్ళు మర్చిపోయిన విగ్రహాల్ని కొత్తగా పెట్టుకుంటే సరిపోతుంది గదా, వున్నవి కూల్చాల్సిన పనేంటి అనే డవుటొచ్చిందా మీకు? ఆయనే వుంటే మంగలెందుకని అక్కడ అంత తిన్నగా ఆలోచించేవాళ్ళు లేకనే గదా సామీ ఈ కుక్కజట్టీల తంతులన్నీ పెనుయుధ్ధాల్లాగ జరుగుతున్నాయి! వొక పెద్దమనిషి యెంతో ఆశగా "2012 సంవత్సరం లో రాజమండ్రి గొదావరి గట్టుపై శ్రీ.పీ.వీ.నరశిం హా రావు గారి విగ్రహాన్ని పెట్టారు ఆయన పేరు మీద పార్క్ కూడా వుంది." అని నచ్చజెప్పబోతే ఒక వదరుబోతు "పి.వి. ముల్కీ నిబంధనలు అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి అనే కారణంతో జై ఆంధ్ర ఉద్యమం నడిపి ఆయన్ని పదవి నుంచి దించేసారు. ఇప్పుడు ఆయనకి విగ్రహం పెడితే ఆయన మీద గౌరవం ఉన్నట్టా?" అని వంకలు పెదతాడు! లేకపోతే పెట్టలేదంతారు?పెట్టాం అని సాక్ష్యం చూపిస్తే యెప్పటిదో యెత్తి అప్పుడు అవమానించారుగా ఇప్పుదు విగ్రహం పెడితే గౌరవించినట్టా అని మెలిక వేస్తారు, ఇవేమి తంటాలు వొచ్చి పడ్డాయండి? యెందు కొచ్చిన తిప్పలు, అవును ఆంధ్రోళ్లకి తెలంగాణోళ్ళ గొప్పదనం అర్ధం కాలే! గొప్పదనాన్ని నిర్ణయించే స్కేలుబద్దలు తెలంగాణోళ్ల కాణ్ణె వుండె!!సరి పాయే,యెందుకీ తొండి మెలికలు పెట్టే గయ్యాళి మందతో వాదన?! ఆ తర్వాత యెంతోకాలానికి NTR మన తెలుగువాడు ప్రధాన మంత్రి అవుతున్నాడు, మనం పోటీ పెట్టగూడదు అని దానికి కట్టుబడి వున్నది వాడికి యెక్కలేదు గానీ వుద్యమం చెయ్యడమే గుర్తుండి పోయింది వాడి మట్టిబుర్రకి! ముందుకు పదవయ్యా ముకుందయ్యా అని మొత్తుకుంటున్నా యాభయ్యేళ్ల నాటి సంగతుల్నే కెలుక్కుంటూ యెనకటయ్యగా వుంటానంటే వుండండి - మాకే మంచిది!


p.S:మమ్మల్నీ మా ప్రాంతాన్నీ అవమానించే కొందరు ధూర్తుల్ని విమర్సించగానే నాకు తెలంగాణా ద్వేషాన్ని అంతగట్టే ప్రబుధ్ధులకి కొన్ని సాక్ష్యాలు:మొదటి నుంచీ విడిపోవడం న్యాయమే అని తప్ప బలవంతంగా కలిపి వుంచాలని నేను కామెంట్లు వేసే దశ నుంచీ పోష్టులు వేసే ఈనాటివరకూ వొక్క అక్షరం కూడా రాయలేదు.యెన్నికల సమయంలో కూడా ఆంధ్రాలో తెదెపా తెలంగాణాలో తెరాసా అధికారంలోకి వస్తే రెండు ప్రాంతాలకీ మంచిది అన్నాను.సరే వుద్యమ కాలంలో ఆ వేడిలో మీరు అన్నారు, మేము పడ్డాం, ఇప్పుదిక అన్నీ మర్చిపోయి 105 గురిలా వుందాం అని కూడా చెప్పాను.తెలంగాణా ముఖ్యమంత్రి నిర్ణయం అప్పుడు కూడా యెవరో అనామకుడు రావటం కన్నా మొదటి నుంచీ నాయకత్వం నడుపుతున్న కేసీఆర్ ముఖ్యమంత్రి కావదమే మంచిదని అన్నాను. సకలజనుల సర్వేని మనస్పూర్తిగా మెచ్చుకుని సరదా సరదాగా వొక పోష్టు గూడా వేసాను.తను వివేకంతో మసులుకుంటూ తెలంగాణా ప్రజలకి మంచి చేసే విధంగా తన శక్తియుక్తుల్ని వుపయోగిస్తే మీతోపాటూ నేనూ సంతోషిస్తాను.మీ ప్రాంతంలో మీరుండి స్థానబలం చూసుకుని విర్రవీగి మీ ప్రాంతంలోని ప్రాంతేతరుల మనోభావాల్ని గాయపరిస్తే మీరు ప్రాంతం దాటి వెళ్ళినప్పుడు మీకూ అదే శాస్తి జరుగుతుంది అని చెప్పడమే నా వుద్దేశం.అర్ధమయితే సంతోషం, కాకపోతే నమస్కారం!ముందు కురికి భవిష్యత్తుతో పోటీ పడాల్సిన కాలంలో మాటిమాటికీ వెనక్కి చూసి వులిక్కిపడుతూ వుంటే ప్రయోజనం యేమిటి?


ఏడుపు గురించి కూడా యాడవాల్సింది చాలా ఉందండోయ్!

పాపం చెట్లకి ఏడుపు రాదు . వాటికి ఏడుపు రాకపోవటమే మంచిదైంది . చెట్లకి కాక మిగిలిన అన్ని జంతువుల ఏడుపులకే ఇంత విసుగొస్తుంటే వాటి...