Tuesday, 29 September 2015

శ్రీ రాఘవం!శ్రీ మాధవం!ఆశ్రిత జన మనోహరం!!

-----------------------------------------------------------------------------------------------------------------
గద్య కవిత
-----------------------------------------------------------------------------------------------------------------
ఒక్కొక్క జీవుని యందొక్కొక్క వేదన?

ముజ్జగాల కెల్ల
ముచ్చటైన కరిమేని సొంపువాడు,
సరిలేని రాజసాన ముజ్జగాల నేలెడువాడు!
ఆతదహో!జగదేకధనుర్ధరధీరమతి కరుణాసింధు
వార్తత్రాణపరాయణు డఖిలాండకోటిబ్రహ్మాండనాయకుడు,
మా చూడి కొడుత్త నాంచారు ప్రియవిభుడతడు!

యేమి వేణుగానమది!
నవ రంధ్రముల ఈ తనువా మోవిని తాకి
యెద ఝల్లుమని పులకించి ఇటు రవళించినదో?
లోకాల పాలించుగోపాల బాలుని  
పేదవులు తగిలిన ఆ వెదురు జన్మ మెంతటి ధన్యమో గద!
అంతటి భాగ్యమీఎ జడున కెన్నడు కల్గునో గద?

ఇట్టిది నా జీవుని వేదన!
-----------------------------------------------------------------------------------------------------------------
పద్య కవిత
-----------------------------------------------------------------------------------------------------------------
సీ||యేమి వేణువది?ఆ మోఅహనరవళి ఎ
       చటినుండి తీగలు సాగుతున్న

       దో గద!అంగిలి తాకని సవ్వడి
       నవరంధ్రముల ఈ తనువున యేల

       పుట్టెను?ఆ మోవియొకవేళ తగిలి యె
       డద ఝల్లుమనగ ఇటు రవళించె

       నో?లోకపాలకుదౌ గోపాలబాలుని
       పేదవులు తగిలిన వెదురు జన్మ

తే||మెంత ధన్యమో గద!మరి అంత భాగ్య
      మీ జడున కెప్డు కల్గునో?మాయదారి
      పిల్లగాడొక డూదిన పిల్లగోరు
      కాదు - జీవుల కడతేర్చు గానమోయి?!

సీ||అంతర్యామి!సుజన మంగళకరుడు!ము
       చ్చట గూర్చు కరిమేని సొంపువాడు!

       ఆతడహో,జగదేక దనుర్ధర
       ధీరమతి కరుణాసింధు వార్త

       త్రాణపరాయణు డఖిలాందకోటి
       బ్రహ్మాండనాయకుడు!అంతకుల వైరి!

       సరిలేని రాజసాన నఖిల లోకాల
       నేలెడు వాడు!తనే మనిషిగ

తే||వచ్చి పెద్దాయన నడిగి వేడ్క పెండ్లి
      యాడి మా చూడికొడుత నాంచారు కెంతొ
      నచ్చిన నిజవిభుడతడు!అతని నేన
      డిగెద నక్షయసౌఖ్యాల నెల్లరకును?!
-----------------------------------------------------------------------------------------------------------------

2 comments:

 1. ఏమి ధారాశుధ్ధి ! యినకుల తిలకుండు
  యెదనిండి యుప్పొంగి యిలకు దిగెను
  ఏమి మాధవ భక్తి ! హృదయాంత రంగుడై
  మురళీధరుడు మన మ్రోల నిలిచె
  “ గణ “ తంత్రమింకను కాస్తంత విశదమై
  యలవడి గన్పట్టవలెను గాని
  “ ఛాంధస ” భావనా బంధ మింకను కొంత
  వలచి మిన్నందగా వలయు గాని

  పరగ “ హరిబాబు ” గారి యీ పద్య కవిత
  రఘు కులేశుని , మాధవున్ లలిత లలిత
  కలిత పరిమళ భరిత సౌగంధి కాక్ష
  రాల హృదయంగమమ్ముగా గ్రాల జేసె .

  ReplyDelete
 2. చాలా కాలం నుంచి మనసులో గద్యబావం తొలుస్తూ వస్తున్నది.కొంత కాలం క్రితం పద్యంలో కూడా ఉంటే బాగుంటుందనిపించింది.అంతకాలం ఒక భావం పూర్తయ్యాక కూడా పోష్టులో వెయ్యకుండా ఉండిపోయాను - దాదాపు ఆరు నెలలు?!నచ్చుతుందో నచ్చదో అనే సందేహం,నేను అంతగా ఇష్టపడిన భావం గురించి తీరా విమర్శలేమయినా వస్తే పశ్చాత్తాప పడవలసి వస్తుందేమో అనిపించేది,సాహసం చేసి ఇప్పటికి వేశాను - మీ ప్రశంసతో గుండె గాభరా తగ్గింది!

  కృతజ్ఞుణ్ణి!!

  ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు