Wednesday, 23 September 2015

పునర్జన్మ అనేది ఇంకెంతోకాలం అభూత కల్పన కాదు - అది కూడా ప్రకృతిలో వాస్తవమై కనబడుతున్న దృగ్విషయమే!

          మా అమ్మాయి బహుశా యల్.కే,జి లో ఉన్నప్పుదు కాబోలు,ఒకరోజు స్కూలు నుంచి రాగానే ఒక నోటుబుక్కు మీద గీతలు గీస్తూ "ఇది హార్టు,ఇది వెయిన్సూ,ఇవి ఆర్టెరీసూ" అని నాకు పాఠం చెప్పినట్టు చెప్పటం మొదలుపెట్టింది!నాకు నవ్వూ ఆశ్చర్యమూ రెండూ ఒక్కసారే పుట్టాయి,పుట్టవా మరి?గీస్తున్నవి పిచ్చిగీతలు,సరిగ్గా హార్ట్ బొమ్మ గీయడం కూడా రాని పిల్లకి హార్టు గురించి వెయిన్సు గురించి యెలా తెలుస్తుంది?అక్కడికీ అనుమానం వొచ్చి "మీ టీచరు చేప్పారా బుజ్జిగా!" అంటే "ఉహూ,నానే తెలుసుకున్నా?!" అనేసింది."నాకు నేనే తెలుసుకున్నా" అని కూడా స్పష్టంగా తెలుగులో మాట్లాడలేని చిన్నపిల్లకి హార్టూ వెయిన్సూ ఆర్టెరీసూ యెలా తెలుస్తాయి?నేను అప్పటికే పునర్జన్మల గురించి కొంచెం చదివి ఉన్నాను గాబట్టి ప్రశ్నలు పొడిగిద్దామని టెంప్టేషను గూడా వొచ్చింది,కానీ దానివల్ల వచ్చే సమస్యలు గూడా తెలుసు గాబట్టి డైవర్ట్ చేసేశాను.మళ్ళీ యెప్పుడూ ఆ ప్రస్తావన రాలేదు!అంత చిన్నపిల్లకి ఆ విషయాలు తెలియడానికి మరోరకమైన కారణం యేదీ కనిపించడం లేదు నాకిప్పటికీ.

          పునర్జన్మ అనే విషయాన్ని ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఇటీవలి వరకూ అంటరాని సబ్జెక్టుగా చూసి దూరం పెట్టేసింది!యెక్కువ శాతం విషయమంతా మతగ్రంధాలలోనే ఉంది.భారతీయ సనాతన ధర్మం తొలినుంచీ సకల జీవరాశులలోనూ వాటి తత్త్వానికి జీవాత్మ అనే పదాన్ని వాడుతున్నది.పైగా భగవద్గీతలో "ఆత్మ నాశనము లేనిది" అని చెప్పి "ప్రాబడిన వస్త్రాల విడిచి నరుడెట్లు క్రొత్తవి తా ధరించు నట్లె జీర్ణ దేహాల వీడి నూత్న దేహాల ధరించు దేహి" అని చెప్పడం వల్ల పునర్జన్మ అనే భావన హిందూ ధర్మంలో అంగీకరించబడిందని తెలుస్తుంది!అబ్రహామిక్ మతాలైన జుదాయిజం,క్రైస్తవం,ఇస్లాం మతాలు వాటి ప్రధాన బోధనల్లో పునర్జన్మని తిరస్కరించినా వాటిలోని కొన్ని శాఖలు మాత్రం పునర్జన్మ విషయాన్ని ప్రస్తావిస్తున్నాయి!

          "పుట్టినన్ చావు తధ్యమ్ము"అని తెలిసిన మనిషికి యెంత కాలం బతికినా ఇంకా తనివి తీరకపోవడం వల్లనో యేమో "మరుజన్మ ఉన్నదో లేదో!ఈ మమత లప్పుడే మవుతాయో?" అని బెంగ కూడా పుట్టి "చావన్ పుట్టుక తప్పదు" అని ధైర్యం చెప్పుకుని ఇప్పుడు చేసిన తప్పులు చేయకుండా అప్పుడు మరింత గొప్పగా బతుకుదాం లెమ్మని ఓదార్చుకోవడానికి ఈ అందమైన వూహ అతని బెంగ తీరుస్తుంది కాబోలు!హిందూ ధర్మంలో కర్మ-జన్మ-సంసారచక్రం అనే భావన అవైదిక శ్రమణ సాంప్రదాయం నుంచి వచ్చిందని Patrick Olivelle అనే ఇండాలజిస్ట్ సూత్రీకరించాడు.దక్షిణాపధంలోని ద్రవిడ సంస్కృతి నుంచి వైదిక సంస్కృతి ఈ పునర్జన్మ సిధ్ధాంతాన్ని స్వీకరించడం మరొక సంభావ్యత!మరికొందరి విశ్లేషణ ప్రకారం ఈ పునర్జన్మ సిధ్ధాంతం యొక్క అసలు ప్రతిపాదన బౌధ్ధమతంలోనిది!నిజమే కావచ్చు,ప్రాచీన కాలపు ధార్మికసాహిత్యంలో పునర్జన్మ ప్రస్తావనలు ప్రముఖంగా లేకపోవడానికీ బుధ్ధుని తర్వాతికాలం నుంచి మొదలైన పౌరాణికసాహిత్యం నుంచే ఈ పునర్జన్మ భావన విస్తృతంగా ఉండటానికీ అదే కారణం అయి ఉండాలి!

     క్రీ.పూ570 నుంచి క్రీ.పూ495 మధ్యన జీవించిన పైధాగరస్ అనే గ్రీకు మేధావి పునర్జన్మలని సమర్ధించాడు.క్రీ,పూ428 నుంచి క్రీ.పూ348 మధ్యన జీవించిన మరో గ్రీకు మేధావి ప్లాటో తన రచనల్లో పునర్జన్మలకి సంబంధించిన ఉదాహరణల్ని కూడా ఉల్లేఖించాడు.అయితే తదనతర కాలంలో క్రైస్తవం తన ప్రధాన సిధ్ధాంతమైన "మారుమనస్సు పొందిన నరుడు భగవంతునిచే ఆశీర్వదించబడి సరాసరి దేవుని రాజ్యంలోనికి ప్రవేశించగలడు" అన్న సూత్రీకరణతో పొసగనందున ఈ భావనని తదనంతర కాలంలో వ్యతిరేకించింది!కానీ వారిలో కొన్ని శాఖల వారు ఇప్పటికీ పునర్జన్మను ప్రస్తావిస్తున్నారు.అసలు శిలువ వేయబడి మరణించినాడని నిర్ధారించిన దైవపుత్రుదు జీసస్ రెండు రోజుల తర్వాత పునరుత్ధానం ద్వారా పైకి లేవడం కూడా ఒక రకంగా పునర్జన్మయే కదా!అర్వాచీన కాలంలో క్రీ.శ19వ శతాబ్దానికి చెందిన Schopenhauer లాంటి అమెరికన్ మేధావులు భారతీయ సంస్కృతి వల్ల్ల ప్రభావితులై ప్రతిపాదించగా Henry David Thoreau,Walt Whitman,Ralph Waldo Emerson లాంటివారు సమర్ధించగా క్రైస్తవ మతం కూడా Francis Bowen ద్వారా ప్రవేశపెట్టబడి Christian Metempsychosis పేరుతో నూతన కాలపు క్రైస్తవంలో పునర్జన్మ సిధ్ధాంతం ఆమోదించబడటం మొదలైంది!

          ఆధునిక శాస్తవేత్తలలో పునర్జన్మల గురించి శాస్త్రీయంగా పరిశోధించినది ఒకే ఒక వ్యక్తి - Dr. Ian Stevenson!అక్టోబర్ 31,1918లో పుట్టిన ఈ కెనడియన్ అమరికాలో సైకియాట్రిస్టుగా ప్రఖ్యాతుడై 2007 ఫిబ్రవరి 8న చనిపోయాడు.ఇతను యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా కి సంబంధించిన స్కూల్ ఆఫ్ మెడిసిన్ విభాగంలో యాభయ్యేళ్ళు పని చేసినా,1957 నుంచి 1967 వరకూ డిపార్ట్మెంట్ ఆఫ్ సైకియాట్రీకి శాఖాధిపతిగా పనిచేసినా అందరికీ తెలిసింది మాత్రం పునర్జన్మల గురించి చేసిన పరిశోధనల వల్లనే!పునర్జన్మ సిధ్ధాంతానికి సంబంధించిన ఆలోచనలు,జ్ఞాపకాలు,పుట్టుమచ్చలు,ఇంకా దేహానికి తగిలిన గాయాలు కూడా ఒక జన్మ నుంచి మరొక జన్మకి సంప్రాప్తిస్తాయనే సూత్రీకరణల్ని ఇతను ఆధారాలు చూపించి నిరూపించాడు.నలభయ్యేళ్ళకి పైన ప్రపంచమంతా కాలికి బలపం గట్టుకుని కలయదిరిగి యెక్కడెక్కడ పునర్జన్మకి సంబంధించిన విషయం వెలుగులోకి వచ్చినా వాటినన్నిట్నీ శాస్త్రీయమైన పధ్ధతిలో అవి నమ్మదగ్గవే అని నిర్ధారించుకుని గ్రంధస్థం చేశాడు.

          ఇతను సైన్సు అంటే యేమిటో తెలియని నిరక్షర కుక్షీ కాదు,శాస్త్రీయ పరిశోధనలు యెలా జరపాలో తెలియని మూర్ఖుడూ కాదు.ఇతను చేసినది కేవలం రికార్డు చెయ్యటం మాత్రమే,కానీ చాలా ఖచ్చితంగా చేశాడు - అదీ శాస్త్రీయమైన పధ్ధతిలో!ఇతని పరిశోధన ప్రధానంగా పారాసైకాలజీకి సంబంధించిన విషయాలతో మొదలైంది.చాలాకాలం క్రితం నుంచీ చాలామంది శాస్త్రజ్ఞులకి గందరగోళంగా అనిపించి అటుకేసి వెళ్ళకుండా ఉన్నవైపుకి ఇతను ధైర్యంగా వెళ్ళాడు.అప్పటికే కొందరు వ్యక్తులు హిప్నటిక్ ట్రాన్సులో ఉన్నప్పుడు హఠాత్తుగా గతజన్మ జ్ఞాపకాల్ని చెప్పడం జరుగుతున్నది,కానీ ఇతను వాటికి విశ్వసనీయత ఉండదు గనక భౌతికపరమైన ఆధారాల కోసం ప్రయత్నించాడు!అంటే హిప్నటిక్ ట్రాన్సులోకి తీసుకెళ్ళి గతజన్మ వివరాల్ని చెప్పించడం కాకుండా గతజన్మ గురించి చెప్తున్న వాళ్ళు పూర్తి స్పృహలో ఉండి చెప్తున్నవాటిని రికార్డ్ చెయ్యటం,వీళ్ళకి గానీ వీళ్ళ కుటుంబ సభ్యులకి గానీ ఆ గతజన్మ అని చెప్పబడుతున్న వ్యక్తుల గురించి తెలిసే అవకాశం ఉందేమో వెతకటం,ఇక్కడి వ్యక్తుల గురించి యేమీ చెప్పకుండా రెండో చోట వివరాల్ని సేకరించి రెంటినీ పోల్చటం - పూర్తి శాస్త్రీయమీన పధ్ధతిలోనే పని చేశాడు."Either he [Dr. Stevenson] is making a colossal mistake. Or he will be known as the Galileo of the 20th century." Journal of Nervous and Mental Disease అనే సైంటిఫిక్ జర్నలులో Dr Harold Lief వ్యాఖ్యానించాడు!

          పునర్జన్మ అనేది ఉన్నదని ఒప్పుకోవటం వల్ల మూఢనమ్మకాలు పెరుగుతాయని భావించి వీటి గురించి నిరాసక్తంగా ఉన్న హేతువాదులైన శాస్త్రజ్ఞులు గానీ క్రైస్తవ మత విశ్వాసాలకి విరుధ్ధమనుకున్న వారు గానీ ఇతని కృషిని తిరస్కరించలేక పోయారు.ఇతను వైజ్ఞానిక ప్రపంచాన్ని మోసం చేస్తున్నాడని వెక్కిరించడం గానీ ఇతను తిరోగమనవాది అని పేర్లు పెట్టడం గానీ యెవరికీ సాధ్యప లేదు!ఇతని మొదటి ఆసక్తి మామూలు వైద్యశాస్త్రమే!ఇతని భార్య లైబ్రరీలో లెక్క లేనన్ని పారాసైకాలజీ పుస్తకాలు ఉండేవి, కానీ ఇతను వాటిపట్ల ప్రభావితుడు కాలేదని తనే చెప్పుకున్నాడు.ఈ పారాసైకాలజీది పెద్ద మైరావణ చరిత్ర!మనిషిని జంతువుల నుంచి వేరు చేస్తున్నవి రెండు - ఒకటి నిటారుగా నిలబడటం,రెండు బొటనవేలు మిగతా వేళ్ళ నుంచి విడిపోయి వాటికి యెదురుగా రావటం!మొదటి దాని వల్ల ఒక చోటి నుంచి మరొక చోటుకి వేగంగా కదలటం సాధ్యపడితే రెంవ దాని వల్ల పనిముట్లని ఉపయోగించటం సాధ్యపడింది.అయితే మనిషికి నాగరికత యేర్పడటంలో జంతువులకి లేని మరొక ప్రత్యేకలక్షణం - కలలు కనటం అనేది యెక్కువగా తోడ్పడింది!

   ప్రాచీన మానవుడు జాగ్రదవస్థలో దర్శించినవాటి కంటె స్వప్నావస్థలో దర్శించిన వాటినే ఎక్కువగా విశ్వసించాడు.బాబిలోనియన్లకు,ఈజిప్షియన్లకు స్వప్నమూలం బాహ్యంగా ఎక్కడో ఉంటే - ఏ దేవుడో,దెయ్యమో అయితే - చైనీయులకు అది మానవుని అంతరంగంలో ఉన్నది.భారతీయ సంప్రదాయంలో గూడ చైనాలో వలె స్వప్నాన్ని ఆత్మానుభవంగ ఎంచినట్లు కనిపించినా,స్వప్నమూలాన్ని గురించి కొన్ని విశిష్టమైన ప్రాక్కల్పనలు చేశారు.వీరి భావనలు అక్కడక్కడా ఆధునిక మనొవిజ్ఞానశాస్త్ర భావనలకు చేరువగా ఉన్నాయి.ఇతరులకు సుషుప్తావస్థ,జాగ్రదవస్థ అనే రెండు దశలు మాత్రమే వుంటే స్వప్నస్థితిని మన భారతీయులు ఈ రెండింటి కంటె భిన్నంగా భావించారు."సర్వ జీవులు ప్రాణాన్ని ధరిస్తాయి.అలా ప్రాణధారణం చేయని వాటిని నిర్జీవాలు అంటారు.మరి ప్రాణధారణం చేయని స్వప్నం నిర్జీవమా?కాదు,ఇట్లు జీవనమరణధర్మాలు లేని స్వప్నమొక అనిర్వచనీయమైన అనుభూతి" అని అధర్వ సూక్తం అంటున్నది.స్వప్నమూలాన్ని పరిసీలించిన అధర్వన వేదం దానిని "దేవతా గర్భ","అమృత గర్భ","దేవ గర్భ","దేవపత్నీ గర్భ"గ పరిగణించింది.మనిషికి పదునాలుగు ఇంద్రియాలు(5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు 4 అంతరింద్రియాలు) ఉన్నాయి.ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిష్ఠాన దేవత ఉంటుంది.మనస్సును అధిష్ఠించిన దేవతాప్రభావం చేత కలగడం వలన "దేవతా గర్భ" అయింది.జాగ్రద్దశలో కలిగే అనుభవాల తాలూకు వాసనలు,జన్మజన్మాంతరానుభవాల వాసనలు,సృష్ట్యాది నుంచి సంక్రమించిన వాసనలు ప్రతి వ్యక్తి మనస్సులో లీనమై ఉంటాయి.ఈ వాసనలు అనాది కాబట్టి అది "అమృత గర్భ" అయింది.ఈ "అమృత గర్భ" భావనా కారల్ గుస్టాఫ్ యూంగ్ ప్రతిపాదించిన "ఉమ్మడి అచేతనం" భావనా రెండూ ఒకటేనా అనిపిస్తున్నవి.అనేక పురాణతిహాసాలను మధించి అర్ధం చేసుకున్న యూంగ్ అధర్వణ వేదంలోని ఈ మంత్రాన్ని చూడడం సంభవించిందేమోనని ఒక అనుమానం -అతడు ప్రపంచ పురాణాలన్నింటిని అధ్యయనం చేశాడంటారు!చరకుడు శారీరకదోషాలు కలలకు ఎలా దారితీస్తాయో,ఎంతటి గాఢనిద్రలో కలలు కలిగేది,స్వప్నాలు ఎన్ని రకాలో వివరించాడు."మనస్సును వహించు స్రోతస్సు మిక్కిలి ప్రబలములైన వాత పిత్త కఫ దోషములలో నొక దానిచే పూర్తిగ నిండినప్పుదు క్రూరమైన కాలమున మిక్కిలి క్రూరములగు చెడ్డ కలలు వచ్చును.పురుషుడు గాఢము గాక సూక్ష్మముగ  నిద్ర గూర్చినప్పుడు ఇంద్రియములకు ప్రేరకమైన మనస్సు చేత ఫలవంతములును,ఫలప్రదములు కానివియు నగు పలుదెరంగులైన స్వప్నముల గాంచును."సూక్ష్మనిద్రలో మనిషి కలలు కంటాడని చరకుడు చెప్పడం ఈనాటి REM సిధ్ధాంతానికి దగ్గిరగా ఉంది.ఈరకంగా స్వప్నకాలంలోనూ వాస్తవంలోనూ మనిషి జీవితానుభవాలతో వాటికి ఉన్న సంబంధాన్ని చర్చించిన వారంతా స్వప్నాల్ని సాధారణ స్వప్నాలు,అసాధారణ స్వప్నాలుగా వర్గీకరించారు.ఒక మనిషి దైనందిన జీవితపు వాస్తవానుభవాలు ప్రాతిపదికగా వచ్చే స్వప్నాల్ని మనొధర్మవిజ్ఞానశాస్త్రం లోని భాగమైన స్వప్నశాస్త్రం అధ్బుతంగా వివరించగలుగుతున్నది,అయితే విక్టోరియా ఓడ నాలుగు నెలల తరవాత మునిగిపోతుందనో, జిమ్మీ కార్టర్ మరో రెండు రోజుల్లో హత్య చేయబడతాడనో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నాకో మీకో కల వచ్చిందనుకోండి - వాటితో మనసా వాచా కర్మణా యెలాంటి అనుబంధం లేకపోయినా, అటువంటి సంఘటనలు కలలో కనిపించిన రీతిలో పొల్లు పోకుండా తరవాత జరిగాయనుకోండి - వీటిని శాస్త్రీయంగా ఖండించటానికి గానీ సమర్ధించటానికి గానీ ఇప్పటి శాస్త్రపరిధి చాలదు, అలాగని వీటిని పూర్తిగా కొట్టిపారెయ్యడం కూడా శాస్త్రీయం కాదు.కాబట్టి ఇటువంటి వాటిని పరిశోధించేటందుకు అధిభౌతిక మనోవిజ్ఞానశాస్త్రం(Para-Psychology) అనే ఒక కొత్త శాఖని యేర్పాటు చేశారు.

     1857లో ఉద్యోగంలో జాయినయినా ఇతను పునర్జన్మల పట్ల ఆసక్తి చూపించి 1960లో మొదటి వ్యాసం ప్రచురించబడేవరకూ జరిగిన కధలోని మలుపులు చాలా చిత్రమైనవి!మొదట్లో మామూలు ఫిజీషియన్ హోదాలో జాయినయిన ఇతను కొందరు పేషెంట్లు సైకోసొమాటిక్ డిసీజెస్ లక్షణాల్ని ప్రదర్శించటం గమనించాడు!పోష్టు చాలా సీరియస్ కాబట్టి మీకు గిట్టుబాటు అయ్యేందుకు ఒక జోకు చెప్తాను - నేను వేసిన సొంత జోకు!డిగ్రీ బెజవాడ లయోలా కాలెజిలో చదివాను,రెండవ సంవత్సరం హాస్టల్లో ఉన్నాను.అక్కణ్ణించి యే మంచి సినిమా చూడాలన్నా మొదట సిటీబస్సెక్కి బీసెంటు రోడ్డు రెండో లైన్లో ఒక చెట్టు దగ్గిర దిగాలి.అక్కణ్ణుంచి యెటు వెళ్ళాలన్నా అక్కడ దుర్గాభవన్ హోటలూ దానికానుకుని అందులోంచే పొడుచుకొచ్చినట్టున్న ఒక పుస్తకాల షాపూ ఖచ్చితంగా తగుల్తాయి.ఒకసారి నేనూ మా ఫ్రెండూ కలిసి బయల్దేరి సినిమా కింకా చాలా టైము ఉండటంతో అక్కడున్న మాగజైన్ల కవర్లని పరిశీలిస్తుంతే ఒక తమాషా దృశ్యం కనబడింది.అప్పుడే సన్నీ డియోల్ కొత్తగా ఫీల్డులోకి వచ్చినట్టున్నాడు,వాడి ఫొటోలో మాకిద్దరికీ హేమామాలిని పోలికలు కనపడినాయి,మా ఫ్రెండు కూడా నాలెడ్జిలో నాలాంటి చిచ్చరపిడుగే!"అరే,ఇదేంట్రా హరీ!మొదటి భార్య కొడుకులో రెండో భార్య పోలికలు కనబడుతున్నాయీ?" అని పైకే వాగితే నేను చాలా సీరియస్ మొహంతో "ఆవిడ దగ్గిర కూడా ఈవిణ్ణే గుర్తు చేసుకుంటూ గడిపాడేమో,సైకోసొమాటిక్ ఎఫెక్టు పనిచేసుంటుంది!" అని నేను విశ్లేషించా.కాసేపయ్యాక వెనకనించి కుసకుసా నవ్వుతూన్న చప్పుడు విని వెనక్కి తిరిగి చూస్తే షాపు ఓనరు సైలెంటుగా నవ్వేస్తూ కనిపించాడు - అప్పటికి గానీ మాక్కూడా మా ప్రశ్న-జవాబు లోని క్యామేడీ బుర్రలో వెలగలేదు!గురువుగారు నవ్వుతున్నాడు గదాని అక్కడే ఉంటే "ఇంత చిన్న వయస్సులో అంత బూతు జోకేస్తార్ర్రా?!" అని తిట్లకి లంకించుకుంటాడేమోనని అక్కణ్ణించి జారుకున్నాం కిచకిచా నవ్వుకుంటూ:-)అప్పట్నించీ యిప్పటివరకూ యెప్పుడు సైకోసొమాటిక్ ఎఫెక్ట్ అనే గంభీరమైన మాట గుర్తొచ్చినా పిచ్చపిచ్చగా నవ్వొస్తూనే ఉంటుంది.ఆ జోకు మూలంగా మీకూ నాకూ క్యామెడీగా అనిపించినా ఆ జబ్బుల్ని ట్రీట్ చేసే డాక్టర్లకి మాత్రం పెద్ద ట్రాజెడీ యేంటంటే - పేషెంటు "డాక్టరు గారండో,నాకు ఫలానా జబ్బు లఖణాలు ఉన్నాయని మీరిచ్చిన మాత్తర్లు పని జేయటం లేదు మొర్రో!" అని మొరపెట్టుకుంటున్నా ఆ రోగలక్షణాలకి సంబంధిచిన కారణం దేహంలో కంబడకపోవటం?శరీరానికయినా మనస్సుకైనా వైద్యం చెయ్యాలనుకున్న డాక్టరుకి కారణం తెలియాలి గదా,రోగానికి కారణమైన క్రిమి కనపడాలి కదా - అదే కనపడి చావదు!మనో వైజ్ఞానిక శాస్త్రంలో రోగనిర్ధారణలో సంసర్గం(Hypnosis) చాలా ముఖ్యపాత్ర వహిస్తుంది.ఈ హిప్నటిక్ ట్రాన్సులోకి వెళ్ళిన వాళ్ళు వింతగా ప్రవర్తించేవాళ్ళు ఒక్కోసారి - డాక్టరు చూస్తున్న అసలు పేషెంటు పిఠాపురంలో ఉండే సుబ్బారావు అయితే తను కడపలో పుట్టిన రాజశేఖర రెడ్డిని అని చెప్తే డాక్టరుకి భయం వెయ్యదూ?ఈ స్టీవెన్సన్ గారు కూడా అలాంటి పాట్లు పడి తట్టుకుని ఆఖరికి పునర్జన్మ సిధ్ధాంతం ద్వారా తప్ప మరో విధంగా వీటిని అర్ధం చేసుకోవడం కష్టమని గ్రహించాడు.


     మొదటి వ్యాసం ప్రచురించబడటానికి కొన్ని దశాబ్దాల ముందునుంచే చిన్నపిల్లల జ్ఞాపకాల గురించి గట్టిగా పరిశోధిస్తున్నప్పుడు "imaged memories","behavioral memories"ల మధ్య తేడాని గమనించాడు1960లో ప్రచురితమైన పునర్జన్మలను గురించిన ఇతని మొదటి వ్యాసం "The Evidence for Survival from Claimed Memories of Former Incarnationsఅదృష్టవశాత్తూ Xerox machine కనుక్కున్న Chester Carlson దృష్టిని ఆకర్షించింది.ఇతని ప్రోత్సాహమే లేకుంటే ఈ పరిశోధనలు ఇంతగా వెలుగు చూసేవి కావు - యెందుకంటే అందులో విపరీతమైన తిరుగుడూ,అంతులేని మానసిక శ్రమా,లాభంలేని ఖర్చూ ఇమిడి ఉన్నాయి.1966 నుంచీ 1977 వరకూ రమారమి సంవత్సరానికి 55,000 మైళ్ళు తిరగటం,ఒక్కోసారి ఒకేరోజున 25 మందిని ఇంతర్వ్యూ చెయ్యటం లాంటి కష్టాల కోర్చి ప్రపంచం నలుమూలల నుంచీ ఇతను సేకరించి రికార్డు చేసిన కేసులు 3,000!మొత్తం అన్ని పరిశోధనలూ వర్జీనియా యూనివర్సిటీ ద్వారా ప్రచురించబడినవి కాబట్టి అధీకృతమైన పత్రాలు అనడంలో యెలాంటి సందేహమూ అఖ్ఖర్లేదు!అయినా సరే ఇతని పరిశోధనల్ని వక్రీకరించి విమర్శించటం,బైబిలుకి విరుధ్ధంగా ఉన్న కారణాన మతవిశ్వాసులూ,ఆత్మ ఉనికిని నిరూపించే విధంగా ఉండటం వల్ల మూఢనమ్మకాల్ని పెంచుతుందనే అపోహతో కొందరు శాస్త్రవేత్తల గుంపూ,సంచలనం సృష్టించడమే తప్ప సామాజిక బాధ్యత లేని మూర్ఖమీడియా అధిపతులూ ఇతనికి "Perverted genius/Popularity seeker" ముద్ర వేసి విసిగించినారే తప్ప అతని సిన్సియారిటీని గుర్తించలేదు.

     ఇతని పరిశోధనల్లోని కొన్ని సామాన్య విషయాల్ని చూస్తే అదొక అభూతకల్పన కాదనీ పరిశోధించి తేల్చుకోవలసిన దృగ్విషయమనీ తెలుస్తుంది.అన్ని జ్ఞాపకాలూ 3 నుంచి 5 సంవత్సరాల వయసు గల పిల్లలలోనే బయటపడుతున్నాయి.అంత చిన్న వయసులో తమకి గానీ తమ కుకుటుంబానికి గానీ సంబంధం లేని మరొక వ్యక్తికి సంబంధించిన విషయాలు అంత ఖచ్చితంగా యెలా తెలుస్తాయి?ఒక బాలుడు/బాలిక చెప్తున్న పూర్వజన్మగా భావించే వ్యక్తులు అందరూ మరణించే సమయంలో తాము చనిపోతున్నామని తెలిసి అప్పుడు తామున్న స్థితి వల్ల చావును బలంగా వ్యతిరేకించడం కనిపిస్తుంది,అంటే ఆ జీవి ఇంకా కొంతకాలం ఈ భూమి మీద ఉండాలన్న గట్టి సంకల్పం వల్లనే ఆ జీవి జ్ఞాపకాలు తిరిగి పుట్టినవారిలో వ్యక్తమౌతున్నాయి తప్పిస్తే గతజన్మలో జీవిత కాలావధిని పూర్తిగా గడిపి మరణించినవారికి సంబంధించిన వారి పునర్జన్మకి సంబంధించిన కేసులు దాదాపు శూన్యం.పైగా ఈ జ్ఞాపకాలు పెరిగి పెద్దయ్యే కొద్దీ వాళ్ళు మర్చిపోతున్నారు,ఒక్క స్వర్ణలత మిశ్రా అనే భారతదేశపు మహిళ విషయంలో మాత్రం జ్ఞాపకాలు ఆజీవ పర్యంతం ఉండటం చూస్తాము గానీ దానికి ఆమె స్త్రీ అయి ఉండటం మూలాన గతజన్మలోని కుటుంబానికి ఆమె పట్ల ఉన్న ఆప్యాయత వల్ల మరిచిపోవడానికి వీలు లేకపోయింది.మిగిలిన వాళ్ళు 5 యేళ్ళు దాటిన తర్వాత నుంచీ ఈ జన్మకి సంబంధించిన మామూలు జీవితమే గడుపుతున్నారు, అంటే క్రమంగా ఈ జన్మకి సంబంధించిన ప్రాపంచిక జ్ఞానం బలమయ్యే కొద్దీ వారంతట వారే ఇప్పటి వాస్తవానికి అనుగుణంగా సర్దుకుపోతున్నారని అర్ధం కావటం లేదా!మరి వీటివల్ల జరగబోయే అనర్ధాలు యేమిటి?వీటిని ఆమోదిస్తున్న వారికన్నా రుజువులనూ సాక్ష్యాధారాలనూ చూసి కూడా అసలు జరగడమే అబధ్ధమని వ్యతిరేకిస్తున్న వారిలోనే నాకు మూర్ఖత్వం యెక్కువగా ఉన్నదనిపిస్తున్నది.శబ్దం అనేది ఒక దృగ్విషయం,దాని చుట్టూ కొన్ని భతికశాస్త్ర నియమాలు కూడా యేర్పడి ఉన్నాయి.ఆ నియమాలు శబ్దం అనేది ఒక దృగ్విష్యం అని గుర్తించి దాన్ని గురించి పరిశోధించిన తర్వాతనే కదా నియమాలు యేర్పడినాయి - మరి పునర్జన్మ అనే దృగ్విషయాన్ని వీరెందుకు గుర్తించడానికి నిరాకరిస్తున్నారు?

     అబ్రహామిక్ ప్రభావంలో ఉన్న పాశ్చాత్య ప్రపంచం పునర్జన్మలని భయాందోళనలతో కలిపి చూడటం వల్ల ఇప్పుడప్పుడే వారు ఈ దృగ్విషయాన్ని గురించి మరింత పరిశోధనలు చెయ్యటం లేదు గాబట్టి భారతీయ విజ్ఞానులు వీటిమీద పరిశోధనలు స్టీవెన్సన్ మహాసయుడు వదలివేసిన కృషిని కొనసాగిస్తే యెంతోకాలం నుంచీ అపరిష్కృతంగా ఉన్న ఒక విషయాన్ని గురించి తొలిసారి సాధికారికంగా విశ్లేషించిన కీర్తి దక్కుతుంది. ఉత్తర భారత  దేశం లోని ఒక నగరాన్ని ఆధారం చేసుకుని జరిపిన ఒక సర్వే లో ప్రతి 500 మందికి ఒకరు గతజన్మ జ్ఞాపకాల్ని చెబుతున్నట్టు తెలిసింది.అయితే వీటిపట్ల ఉన్న సందేహాల వల్ల కుటుంబం స్థాయిని దాటి బయటికి రానివి చాలా ఉండి ఉండొచ్చు!

     అబ్రహామిక్ మతాలని అనుసరించే సమాజాలలో సైన్సుకీ మతానికీ యెప్పుడూ పడి చావదు!ఉదాహరణకి అబార్షన్లని చర్చి వ్యతిరేకిస్తున్నది గనక ప్రపంచ దేశాలన్నింటి మీదా కర్ర పెత్తనం చేసే అమెరికా అధ్యక్షుడు కూడా సాహసించి చట్టం చెయ్యలేని పరిస్థితి!కానీ యెక్కడ బడితే అక్కడ యెప్పుడు బడితే అప్పుడు పెట్టేసుకునే లిలాక్ ముద్దుల ద్వారా వేడెక్కిపోవటం,దానితో అసలు వ్యవహారానికి తొందర పుట్టటం,యేకాంతం దొరకగానే తీట తీర్చుకోవటం అనే కక్కుర్తి పనుల్లో ముణిగిపోయి గర్భనియంత్రణకి సంబంధించిన జాగత్తల్ని తీసుకోకపోవటం వల్ల 13 యేళ్ళకే తన గర్భానికి కారణమెవరో,తనకి పుట్టబోయే బిడ్డకి తండ్రి యెవరో తెలియని గర్భాల్ని మోస్తున్నవాళ్ళు తయారవుతున్నారు.అసలు తల్లికే ఇంకా బాల్యం వీడిపోని సుకుమారపు శరీరంలో ఇంకో శిశువుని మోస్తూ,పాపభీతి,భయమూ,ఆందోళనల్తో ఆ పిల్ల చచ్చినా సరే ఫరవాలేదట, ఆ వ్యక్తురాలైన పిల్ల మీద లేని జాలి పరమ దయాళువులైన క్రీస్తుజనులకి/పోపుగారికి వూహ కూడా తెలియని పిండం మీద ఉండటం యేమి వింత?!ఈ వైరుధ్యాలు హిందువులకి లేవు, భారతీయ జీవన విధానం అనుభవానికి ప్రాధాన్యత నిచ్చింది, ఒక విషయం నీకు అనుభవంలోకి వస్తున్నదా - అయితే అది సత్యమే!యే విషయాన్నయినా అమోధించటం/తిరస్కరించటం ఉపయోగితని బట్టి నిర్ణయించటం సనాతన ధర్మంలోని విశిష్టత!అందువల్లనే ప్రపంచంలోని అతి పురాతనమైనదీ అతి నవీనమైనదీ కూడా అవుతున్నది - ఈ స్వయం చాలిత ధార్మిక యంత్రం! 

     Science also has religious spirit, when you go on searching for a reason,some where you may find your reason fails and settles into  belief!Religion also has scientific spirit, When you go on trying to believe,some where you may find your belief ask question and seeks for reason?

అన్ని ఇజాలూ కమ్యునిజములో కలిస్తే ఆ కమ్యునిజము కూడా హిందూఇజములో కలుస్తుంది!

6 comments:

  1. ఈ ఉదంతాన్ని బహుశా ఎవరూ నమ్మరు. మావాడు ఇంకా ఎల్.కె.జి.లో కూడా జాయిన్ అవ్వని రోజుల్లో జరిగిన సంగతి. నేనొక సారి ఓ ముస్లిమ్ డ్రైవర్ ని పెట్టుకున్నాను. అతనికి గడ్డమూ, టోపీ ఉన్నాయి. మావాణ్ణి నాతో పాటు కారు ఎక్కమంటే ఆ డ్రైవర్ ని చూసి "ముస్లిమ్ డ్రైవరా? నేనెక్కను" అని భీష్మించాడు కాసేపు. ఎలాగో బుజ్జగించి ఎక్కించుకున్నాను. మా ఇంట్లో ఈ కులాల మతాల ప్రస్తావన ఎప్పుడూ రాదు. కానీ వాడికి అంత చిన్నవయసులో ఆ చాదస్తమేంటి? ఎలా వచ్చింది? నాకెప్పుడూ అర్థం కాలేదు. మరో సందర్భంలో మా డ్రైవరు మ్యూజిక్ సిస్టమ్ లో ప్రేమపాటలు పెడుతున్నాడని కోపించి మావాడు అవి ఆపేయించాడు.

    ReplyDelete
    Replies
    1. బహుశా మీవాడు గతజన్మలో శంకరాభరణం శంకరశాస్త్రి+బిలహరి గణపతి శాస్త్రి ల హైబ్రిడ్ వ్యక్తి అయి ఉంటాడు:-)

      Delete
  2. Please read Edger cayce and see below video in youtube

    How and Why Reincarnation Works by John Van Auken

    ReplyDelete
  3. యు.జి. కృష్ణ మూర్తి ని ప్రపంచ వ్యాప్తం గా చాలా మంది అభిమానిస్తారు. ఆయనగొప్ప యోగి. ఆయనను అభిమానించే ప్రముఖులలో డేవిడ్ బాన్ క్వాంటం ఫిజిసిస్ట్ (అల్బర్ట్ ఐన్ స్టీన్ దగ్గర అసిస్తేంట్ ప్రొఫేసర్ గా పని చేశాడు ) మొదలు కొని హిందీ సినినటులు స్మిత పాటిల్, గైడ్ సినే దర్శకుడు విజయానంద్ , మహేష్ భట్ ఎంతో మంది ఉన్నారు. ఆయన చలం గారికి దూరపు బంధువు అవుతాడు. వీలున్నప్పుడు ఈ క్రింది లింక్ లను చూడండి.
    Suggest you explore the following included pdf file which contains UG's Life sketch from "U.G. Krishnamurti Reader" and three chapters from "The Other Side Of Belief" plus exceprts of U.G.Teachings:

    http://www.ugkrishnamurti.org/ug/mukund-rao/index.html

    http://www.well.com/user/jct/reddi.htm
    http://www.well.com/user/jct/sesha.html

    ReplyDelete
  4. అన్ని ఇజాలూ కమ్యునిజములో కలిస్తే ఆ కమ్యునిజము కూడా హిందూఇజములో కలుస్తుంది!

    125కోట్ల జనాభాలో ఎవరు ఎక్కువగా ఉంటే వారికనుకూలంగా కొంపలు కూలిస్తే కమ్యూనిజం హిందూయిజమైపోదా ?

    ReplyDelete
    Replies
    1. కొంపల్ని కూల్చడమే కమ్యునిజమయితే భేషుగ్గా కూల్చిపారెయ్యొచ్చు!Not the slightest objection(?) అనగా నాకు యెంతమాత్రమూ అభ్యంతరము లేదు!

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...