Monday, 6 April 2015

ఒక్క మాటకి వంద వక్రభాష్యాలు యెందుకు వస్తున్నాయో సరిగ్గా గమనించారా వనజ గారూ?

వనజ వనమాలి గారు దీపికా పడుకోనే "My choice" వీడియోలో వెలిబుచ్చిన కొన్ని అభిప్రాయాలని సమర్ధిస్తూ ఒక పోష్టు వేశారు.అక్కడ కామెంటు వెయ్యాలని చూడగా ఒక చిత్రమైన సమస్య యెదురయింది.
"బృందం సభ్యులకు మాత్రమే ఈ బ్లాగులో వ్యాఖ్యలు పరిమితించబడ్డాయి.

మీరు ప్రస్తుతం Hari Babu Suraneniకు లాగిన్ అయ్యారు. మీరు ఈ ఖాతాకు వ్యాఖ్యను చేర్చలేరు."అనే సమాచారంతో నా వ్యాఖ్య నిరాకరించబడింది.ఇదివరకు కొన్ని వ్యాఖలౌ అక్కద వేసి ఉన్నాను,ఈ కొత్త ఇబ్బంది యెందువల్ల అవచ్చిందో నాకు అర్ధం కావడం లేదు? సాంకేతికంగా ఆమె వ్యాఖ్యల విషయంలో యేమి ప్రాధాన్యత ఇచ్చారో తెకియదు గానీ ఆమెకి నా అభిప్రాయం తెలియజెయ్యడానికి మరెమార్గం లేక ఇట్లా పోష్టుగా వేస్తున్నాను!వనజ వనమాలి గారు గనక అమర్యాదగా అనిపిస్తే వెంఠనే పోష్టుని తొలగిస్తాను - అందులో యెలాంటి అనుమానం అక్కర లేదు.

నేను ఆమెని అడగాలనుకున్న ప్రశ్నలు ఇవి:

దీపిక వ్యాఖ్యల్ని ఖండించిన వారిలో మరో నటి సోనాక్షి అభిప్రాయం గురించి యేమి చెప్తారు మీరు?
ఒక బ్లాగరు అయితే సోనాక్షిని "హిపోక్రాట్" అనేసాడు,మీ అభిప్రాయం కూడా అదేనా?

ఇంతకీ పెళ్ళికి ముందు సెక్సు సంబంధాలు అనేవి అంత అవసరమా?ఆ అమ్మాయి వాటిని సమర్ధిస్తూ మాట్లాడ లేదా?ఇవ్వాళ పెళ్ళికి ముందు సెక్సు సంబంధాలు యేర్పరచుకున్నా యెవరూ మమ్మల్ని ప్రశ్నించకూడదు అనే మాటని సమర్ధిస్తే దీనికి కొనసాగంపుగా పెళ్ళయిన తర్వాత అక్రమ సంబంధాలు పెట్టుకోవడాన్ని కూడా సమర్ధించాల్సి వస్తుంది!యెందుకంటే పెళ్ళికి ముందు కోరికల్ని నిగ్రహించుకోలేక తాత్కాలికంగా కోరిక తీర్చుకున్న వాళ్ళు పెళ్ళయిన తర్వాత పవిత్రంగా ఉండాలనే నిష్ఠకి కట్టుబడి ఉండగలరా?

ఒక గుడ్డివాడు ఒక స్తంభాన్ని గుద్దుకున్నాడనుకోండి,ఆ స్తంభాన్ని తిడతామా అక్కడ యెందుకు ఉందని?ఇక్కడ చూస్తే "కామాలలో ధర్మావిరుధ్ధ కామాన్ని నేను" అని గీతలో ఉండగా కామసూత్రాలలో "ధర్మబధ్ధ శృంగారం","పార్దారికం","వేశ్యాధికరణం' లంటి విప్లవాత్మకమైన విషయాలతో నిండిన విజ్ఞానం ఉంటే దాని గురించి తెలుసుకుందామనే జిజ్ఞాస లేదు, పైగా శృంగారం గురించి నిజంగా తెలుసుకోవాలనుకుంటే యెంతో విజ్ఞానం వుండగా యే గంభీరమైన తాత్విక చింతనా లేకుండా కేవలం తమ విచ్చలవిడి తనానికి ఆమోదముద్ర కోసం అంగలార్చే వాళ్ళని మీలాంటి వాళ్ళు కూడా సమర్ధించితే ఇంక నైతికత అనే పదానికి అర్ధమేమిటి?ఆలోచించండి!

Friday, 3 April 2015

బీజాక్షర గర్భితమైన ఆంజనేయ దండకం - ప్రాచీన కవి ప్రణీతం


ఇది శ్రీ మదజ్జాడాదిభట్ల నారాయణ దాసు గారికి స్నేహితుడైన ముక్తేవి పాలంరాజు గారి రచన.మామూలుగా మా వూరు అప్పట్లో తేలప్రోలు సంస్థానంలో భాగంగా వుండేది.కానీ ఈ కవిగారూ వర్ణకవి నాగరాజు అనే సంగీత విద్వాంసుడూ విజయనగర సంస్థానానికి దఖలు పడ్డారు.ఇక్కణ్ణించే అక్కడికి వెళ్ళి వస్తూ వుండేవాళ్ళు. మా ముత్తాత గారికీ ఈ ముక్తేవి కవిగారికీ "అరే,ఒరే" అనుకునేటంతటి స్నేహం.చాలాకాలం పాటు పిల్లలు కలగక ఇబ్బంది పడుతుంటే ఈ బీజాక్షరాలు గర్భితం చేసిన దండకాన్ని వ్రాసి ఇచ్చి దీనితో నీ కోరిక నెరవేరుతుందని భరోసా ఇస్తే ఆ తర్వాత దీని పారాయణ ఫలితంగా నలుగురు పిల్లలు పుట్టారు.అందులో ఒక ఆడపిల్ల - మా అమ్మమ్మ!మరో కొడుకు నాన్న వైపు నుంచి తాతయ్య?
_____________________________________________________________
          శ్రీ మన్మహా అంజనీ గర్భసంభూత!సద్బ్రహ్మచారీ!కపీంద్రాది ముఖ్యా!లసద్ వజ్రతుల్య కపోలా మహారత్న సత్కుండలా కర్ణ!మౌంజీ ధరా!దీప్త యజ్ఞోపవీతాయ!కాలాగ్ని రుద్రాయ!శ్రీరామ పాదారవిందాయ!సుభ్రుంగాయ మానాంగ జంభాసురా!రంగనాధాయ!సిధ్ధాంత రంగప్రరంగేశ సంధాన!నీలాంగదా జాంబవంత సుషేణాం గవాక్ష నలానీల సంసేవ్యమానా!గిరీంద్రా నివాసాయ!
          మహోఛ్ఛాటనోఛ్ఛాటనో సాగరోల్లంఘనా!లంఖిణీ మర్దనా!రాము కార్యైక నిర్వాహకా!ఘోర లంకాపురీ దాహకా!దానవాధీశ్వర సౌధాంగణోద్భంగ!వహ్ని ప్రభా మండలోధ్ధండ!మార్తాండ!చండస్పురద్భాహుదండా!మహావీర హనుమంత!మా చిత్తమందుండుమీ! మమ్ము రక్షించుమీ! వాయువేగ మనోవేగ సన్నాహ సాధ్యా!సునాశీర ముఖ్యుల్ సురల్ నిన్ను వర్ణించి లెక్కింపగా శక్తులే!వానరేంద్రా సమీరాత్మ జాతాంజనేయా!నినున్ గొల్చెదన్ యేలుకొమ్మా నమస్తే నమో!
          అక్షయశ్శిక్షణా!లక్ష్మణ ప్రాణ సంరక్షణా!సర్వబృందారకాధార మందార!ఝాం ఝాంకార ఝుం ఝుం ఝుణత్కార!ఠాం ఠాంకార!పాహిమాం పాహిమాం పాహిమాం!పోషణం ణణ్ణణ్ణణ్ణాం హోంషిణీం హ్రీం హ్రీంకార!ఆహా ఆహహా ఆహహా హాసస్పురచ్చంద్రికా కుంద మందార!హాస్వాను బంధు స్వరోల్లాస!నిత్యగ్రహా బంధు!యంత్రగ్రహా బంధు!తంత్రగ్రహా బంధు!క్షుత్పిపాసాగ్రహా!భీమ పైశాచికా!శాకినీ ఢాకినీ యక్షిణీ కామినీ భైరవీ దేవి శక్తిగ్రహా!
          కర్షణోత్కర్షణో ఛ్ఛాటనోఛ్ఛాటనో ఛింది ఛిందీ కుఠారేణు బంధింప రా వేగరావే హనూమంత సంజీవరాయా పరాకా వడిన్ లెమ్ము లేలెమ్ము నీవిప్పుడున్ దీని పట్టి బంధించుమీ వాలమున్ జుట్టుమీ నేలపై గొట్టుమీ గుండెలున్ ప్రేవులున్ రక్తధారాజ్యముల్ గాగ హోమాగ్నిలో భూతకృత్యన్ దగన్ జేయుమీ!
          వహ్నికిన్ రావణున్ కుంభకర్ణాదులన్ గూల్చి తెభ్భంగి తభ్భంగి గూల్చుమీ నీకునా రాము నాజ్ఞే సుమీ యో హనుమంత నీతిమంత బుధ్ధిమంత సురద్వేషమంత హ్రాం ఖఖంఖం భభంభం భూభుగల్ పుట్టరారో ఛిందిఛిందీ మహిన్ మారులన్ దుర్గకున్ మారుమీ కాళికిన్ మారుమీ ఛండికిన్ మారుమీ కాకుళాధీశ ముక్తేవి శ్రీరామ దాసాయ తుభ్యం నమస్తే నమస్తే నమః
_____________________________________________________________
బీజాక్షర గర్భితం కావడం వల్ల ఉచ్చారణలో జాగ్రత్త వహించి పారాయణ నిష్ఠగా చేస్తే సంకల్పం తప్పక నెరవేరుతుంది!నాకు చాలాసార్లు కంగారు పడాల్సిన పరిస్థితుల్లో కొంత ధైర్యాన్ని ఇచ్చింది.నన్ను కోట్లకు పడగ లెత్తేటట్టు చెయ్యి,మెర్సెడెజ్ బెంజి కారుల్లో తిరిగేటట్టు చెయ్యి అని నేనెప్పుడూ కోరుకోలేదు గాబట్టి యెవరయినా కోరుకుంటే నెరవేరుతాయని గ్యారెంటీ ఇవ్వలేను!నేను మామూలుగా కోరుకునే కోరిక ,"నన్ను పుట్టించిన నీకు నా తెలివితేటలు కూడా తెలుసు,నన్ను యెక్కడుంచాలో అక్కడుంచు,అది నాకు చాలు,నా కష్టానికి తగ్గ ఫలితం చెయ్యి జారిపోకుండా నాకిస్తే చాలు,చెయ్యని పాపం నెత్తిన పడకుండా ఉంటే చాలు" అని!అనుకోకుండా ఆపద వస్తే అది తప్పించడానికి స్వామి ఉన్నాడన్న నమ్మకం వుంది?!


Where reason ends belief starts.Religion also has logic and scientific spirit!
Where belief confuses logic plunges.Science also has myth and religious spirit!

Thursday, 2 April 2015

అందరూ టవున్లలోనే బతకాలా?పల్లెటూళ్ళు అసలే మాత్రం పనికిరానివా!


          1901లో భారతదేశపు జనాభాలో 80% పల్లెల్లోనే వుండేవాళ్ళు!2030కల్లా ఈ దేశపు పల్లెటూళ్ళలో వుండే జనాభా 40% మాత్రమే,అంటే ఇంకో పదిహేను సంవత్సరాలకి అప్పటి పల్లెల్లో సగానికి సగం పల్లెటూళ్ళు ఖాళీ అవబోతున్నాయి?కేవలం మనుషుల స్థానచలనం మాత్రమే కాదు అక్కడ జరుగుతున్నది -  పల్లెటూళ్ల చుట్టూ పెనవేసుకుని వున్న ఆసేతుశీతనగం ఒక్కలాగే కనిపించే మొత్తం భారతజాతి యొక్క మౌలిక రాజకీయ సామాజిక ఆర్ధిక సాంస్కృతిక అంశాలన్నీ మటుమాయమై పోనున్నాయి!వేషభాషల్లో సాహిత్యంలో ఇప్పటికే ఆ శూన్యం కనబడుతూనే ఉన్నది ఇకముందు జరిగేది మళ్ళీ పునర్నిర్మించలేని ఒక వ్యవస్థ పూర్తిగా కనుమరుగు కావడమే.



         పల్లెల్ని ఖాళీ చేసిన ఈ జనమంతా మిడతల దండు లాగా దగ్గిర్లో ఉన్న నగరాల మీద పడుతున్నారు!ఒక పధ్ధతీ పాడూ లేకుండా యేకపక్షంగా జరుగుతున్న ఆ వలసలు మొదట్లో నగరాల్ని ఉపాధి కేంద్రాలుగా తయారు చేసి అభివృధ్ద్గి సూచికలుగా మార్చినా పోనుపోనూ సమస్యల్ని సృష్టిస్తూ నేటికి నగరాల్ని మురికివాడల మయం చేశాయి!1930ల నాటి ఆర్ధికమాంద్యం మొదటిసారి పల్లెల్ని నగరాల వైపుకి నడిపించింది,చదువు->ఉద్యోగం->నెలజీతం->భద్రమైన ఉపాధి అనే ఒకే ఒకరకమైన ఉపాధిని ఇచ్చినా ఒకసారి ఉద్యోగం వస్తే చాలు ఇంక జీవితమంతా సుఖజీవనమే అన్న భరోసా ఇచ్చే మెకాలే తరహా విద్యా విధానమే 1950ల తర్వాత కూడా కొనసాగడం ఈ వలసలు నిరంతరాయంగా జరిగేటందుకు సాయపడింది!




          స్వతంత్ర భారత ప్రప్రధమ ప్రధాని పనిగట్టుకుని అటు పూర్తిగా కమ్యునిజమూ కాని ఇటు పూర్తిగా క్యాపిటలిజమూ కాని సోషలిజాన్ని ఆర్ధిక విధానంగా ప్రకటించి లెక్క ప్రకారం నడపాల్సిన ఆర్ధిక విధానాల్ని మహలనోబిస్ యొక్క ప్రాబబిలిటీ పైత్యకారి తనంతో కలిపి 80% మంది వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్న దేశంలో వ్యవసాయాన్నీ సాంప్రదాయిక వృత్తుల్నీ మార్కెట్ పరంగా ముందుకు తీసుకెళ్ళడాన్ని నిర్లక్ష్యం చేసి భారీ పరిశ్రమలతోనూ జీమూతాల్లాంటి ప్రాజెక్టులతోనూ నింపేసి హడావిడి చెయ్యడంతో పరిస్థితి  మూలిగే నక్క మీద తాటిపండు పడిన చందంగా తయారయింది!దానికి తోడు మిడతల దండులాగా వచ్చిపడుతున్న జనాభాకి మౌలిక వసతులు కల్పించటానికి సంబంధించిన పరిజ్ఞానం లేనివాళ్ళు అధికార్లుగా ఉండి ప్రజల నివాసేతర మౌలిక వసతులకి కావలసిన భూమిని కూడా జనావాసాల కోసం అనుమతులిచ్చేస్తూ సొంత సంపాదన కోసం కబ్జాలను నియంత్రించకుండా చోద్యం చూస్తూ కూర్చుని నగరాలు కిక్కిరిసి పోయేటట్టు చేశారు!




          అయినా 2001 నాటికి భారతదేశపు పట్టణ జనాభా 28.5 శాతంగానే ఉండినదల్లా 2011 నాటికి 30 శాతానికి పెరిగింది - అది పీవీ సంకెళ్లు విదిల్చిన ఆర్ధిక సంస్కరణల వల్ల పెరిగిన బరువు!సరయిన ప్రణాళికతో పెరిగితే జనాభా పెరగుదల అధ్బుతమైన ఫలితాల నిస్తుంది,అభివృధ్ధి వేగవంత మౌతుంది.కానీ సిటీ ప్లానింగ్ అనే సైంటిఫిక్ సబ్జెక్ట్ ఒకటి ఉందని కూడా పట్టణాభివృధ్ధి శాఖ లోని ఉన్నతోద్యొగులకే తెలియని విధంగా పరిపాలన నడుస్తున్నది.ఒక ఆర్నెల్ల పాటు సివిల్స్ ప్రిలిం నుంచి మెయిన్ వరకూ బట్టీ పట్టి చదివి ప్యాసయి ఐ.యే.యస్ అయిపోతే చాలు అతడు సర్వశాస్త్రకోవిదుడవుతాడనే మూఢనమ్మకంతో ప్రతి శాఖలో మాదిరే ఇక్కడ కూడా సిటీ ప్లానింగ్ విషయాల్లో ప్రాధమిక పరిజ్ఞానం కూడా లేని ఐ.యే.యస్ గాళ్లని నియమించేస్తున్నారు కాబోలు?!




          ఇవ్వాళ్టి నగర జీవనం పరిస్థితి యేంటంటే పట్టణాల్లో 44 శాతం జనాభా ఒక్క గదిలోనే కుటుంబమంతా ఉండాల్సిన దుస్థితిలో నివసిస్తున్నారు.అదే నగరాల్లో అయితే 64 శాతం ఒక్క గదిలోనే కుటుంబమంతా ఉండాల్సిన దుస్థితిలో నివసిస్తున్నారు.ఒక గదిలో 6 నుంచి 10 మంది సర్దుకుపోయి బతకాల్సిన దయనీయమైన పరిస్థితి దాపరించింది.5 నుందీ 20 లక్షల జనాభా కల్గిన పట్టణాలలో ఒక్కొక్కరికి దినసరి అవసరాల నిమిత్తం 204 లీటర్ల నీరు అవసరం.20 లక్షల పైబడిన జనాభా కల్గిన నగరాల్లో ఒక్కొక్కరికి 272 లీటర్లు దినవారీ అవసరం కాగా మొత్తమ్మీద పట్టణాల్లో నగరాల్లో కూడా అవసరమైన దాంట్లో 20 శాతం నుండి 40 శాతం వరకూ తక్కువగా అందుతున్నది.ఈ లెక్క కేవలం ఉదయం కాలకృత్యాలు తీర్చుకోవడానికి అవసరమైన నీటికి సంబంధించినవి,త్రాగునీటి లెక్కలు ఇంకా భయానకంగా వున్నాయి!పట్టణ వాసుల  జీవితకాలంలో నాలుగో భాగం కుళాయిల నుంచి వచ్చే నీటికోసం యెదురు చూడటంలోనే సరిపోతున్నది!




          ఒకనాటి నగరాలు నదీతీరాల్లో పెరగడం వల్ల నీటి యెద్దడి అనుభవంలోకి రాలేదు, కానీ ఆధునికత అంటే ప్రకృతినియమాల్ని పట్టించుకోకపోవటం మన సంస్కృతిలోని ఉత్తమ సాంప్రదాయాల్ని కూడా పాతరోత కింద ధిక్కరించటం అనే అహంకారం బలిసిన వాళ్ళు నగరాల్ని నీటి వనరులకి దూరంగా నిర్మించడం వల్ల ఈ దుస్థితి వచ్చిపడింది.బెంగుళూరుకి 100 కి.మీ దూరంలో ఉన్న కావేరీ నది నుంచి నీటిని తెస్తున్నారు,అదీ నగరం నదియొక్క నీటిమట్టం కన్నా 700 మీటర్ల యెత్తులో ఉండటం వల్ల నీటిని పంప్ చెయ్యడానికి అధిక మొత్తంలో విద్యుత్తు అవసరమవుతున్నది!భాగ్యనగర ప్రజల దాహార్తిని తీర్చడానికి 137 కి.మీ దూరంలో ఉన్న నాగార్జున సాగర్ నుంచి కృష్ణా జలాల్ని తరలిస్తున్నారు?




          నగరాల విస్తరణ ఒక పధ్ధతీ పాడూ లేకుండా ప్రకృతివనరుల్ని మింగేస్తూ జరుగుతున్నది.దీనివల్ల వాతావరణ సమతౌల్యం దెబ్బ తింటున్నది.ఇంటికీ పని చేసే చోటుకీ దూరం పెరగడం వల్ల రవాణా కోసం పెట్రోలు వాహనాల మీద ఆధారపడటం కాలుష్యాన్ని పెంచుతున్నది.ప్రజల కదలికల్ని క్రమబధ్ధం చెయ్యాల్సిన ట్రాఫిక్ విభాగంలోనూ ప్లానింగ్ లేకపోవడంతో ప్రమాదాలూ ప్రాణనష్టాలూ చచ్చేవాళ్ళ కోసం యేడవటానికి కూడా తీరిక లేని బతుకూ ప్రజలకి అలవాటయిపోయింది!కనీసం చచ్చినవాళ్ళని పూడ్చటానికీ కాల్చడానికీ కూడా స్థలం లేనంతగా ఇరుకైపోయాయి ఇవాల్టి మహానగరాలు?నగర జనాభాలో ప్రతి 10 వేల మందికి 4 ఎకరాల ఖాళీ స్థలం అవసరం కాగా అరెకరం భూమి కూడా ఖాళీగా కనబడటం లేదు?!




          నగరాన్ని కాంక్రీటు భవనాల్తో నింపి యెన్ని గంటలు నడిచినా కాలికి మట్టి తగలనంతగా సిమెంటు కట్టడాలే తప్ప పచ్చని చెట్టుని కనబడనివ్వకూడదనే పట్టుదలతో పరిశ్రమిస్తున్న  రియల్ యెస్టేట్ మాత్రమే చెప్పుకోదగిన వ్యాపారం అయిపోవడంతో చెరువులూ తోటలూ పొలాలూ అన్నీ మాయమైపోతున్నాయి!కబ్జా చెయ్యడం రియల్ యెస్టేట్ వ్యాపారానికి అనుబంధ పరిశ్రమగా యెప్పుడో మారిపోయింది?రాష్ట్రం యేర్పడిన తొలినాళ్ళలో తెలంగాణా ముఖ్యమంత్రి ఆంధ్రోళ్ళ కబ్జా నుంచి భాగ్యనగరాన్ని విడిపించాలని హడావిడి చేసి అక్కడ యే గండభేరుండాల్ని చూసి దడుచుకున్నాడో గానీ ప్లేటు ఫిరాయించి తగుమాత్రం రుసుము ప్రభుత్వానికి చెల్లించితే చాలు కబ్జా చేసిన వాడిదే భూమి అనేశాడంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు!ఇవ్వాళ వందిమాగధుల చేత స్త్రోతపాఠాలు చదివించుకుంటున్న ముఖ్యమంత్రులూ ప్రధానమంత్రులూ కూడా ఒక నగరాన్ని సైతం ఇప్పడు ఆ నగరాని కున్న సమస్యల్ని పరిష్కరించి ఆ నగర ప్రజలకి కావలసిన మౌలికావసరాల్ని తీర్చడానికి కూడా పనికిరానంతటి అసమర్ధులు!కేంద్ర పట్టణాభివృధ్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు గారి విషయమే చూడండి - యెక్కడ ప్రసంగించినా "స్మార్ట్ సిటీ","స్మార్ట్ విలేజి" అనే రెండు మాటల్లో యేదో ఒకటి దొర్లకుండా ప్రసంగం ముగించడు.కానీ ఒకప్పుడు వాటి సారాంశం గురించి ఒక్క ముక్క కూడా చెప్పకుండా స్వతంత్ర భారత ప్రప్రధమ ప్రధాని కూడా "సోషలిజం","మిశ్రమ ఆర్ధిక వ్యవస్థ" అనే రెండు మాటలతో ఆడిన నాటకమే ఈ వాగుడుకాయ కూడా ఆడుతున్నాడని నాకు రూఢిగా తెలుసు!




          నగరాల క్రమబధ్ధీకరణకి సరయిన ప్రణాళిక గానీ పట్టణాభివృధ్ధికి ఒక శాస్త్రీయమైన ప్రాతిపదిక గానీ  లేకపోవటం వల్లనే ఈ వూతపదాలు అవసరమౌతున్నాయి.కోటి జనాభా కలిగిన నగరం అనిపించుకుంటున్నవి గర్వంగా ఫీలవడమూ మిగిలినవి కూడా ఆ పేరుకోసం వురకలెయ్యడమే కనబడుతున్నది గానీ ఆ కోటి జనాభా యెట్లా బతుకుతున్నారు అనే దాని గురించి మాత్రం మర్చిపోతున్నారు!అభివృధ్ధికి మనం పెట్టుకున్న సూచీ కూడా తలసరి ఆదాయమే తప్ప సగటు మనిషి సంతృప్తిని లెక్కించటం లేదు?నలబయి దాటిన ప్రతి నగరవాసినీ పురుషుడయితే గుండెపోటు గానీ రక్తపోటు గానీ స్త్రీ అయితే రొమ్ముల్లో గడ్దల దగ్గిర్నుంచీ గర్భాశయాలని తీసివెయ్యాల్సిన దుస్థితి వరకూ రోగాలు కుమ్మేస్తున్నాయి,అయినా ప్రజలు నగరజీవనాన్ని వదలకుండా యెందుకు వేళ్ళాడుతున్నారు?ఇవ్వాళ పెళ్ళి కావలసిన ఆడపిల్ల దృష్టిలో పల్లెలో నాలుగెకరాల భూమి వుండి వ్యవసాయంలో నేర్పరి అయిన కుర్రాడు కూడా మట్టి పిసుక్కునే అనాగరికుడి గానూ ఒక మహానగరంలో గుమాస్తా వుద్యోగంలో ఉన్నా నవనాగరికుడిగానూ కనబడుతున్నాడు - నిజం!




          యే మహానగరమూ తన ఆహారాన్ని కూడా తను సాధించుకోవటం లేదు.పాలు డెయిరీ ఫారంలనుంచి వస్తున్నా ఆ పాలు ఇవ్వాల్సిన పశువులకి గడ్ది కూడా యెంత దూరంగా వున్నా పొరుగున వున్న పల్లెల నుంచే రావాలి,యెందుకని?ఇక కూరగాయలూ పళ్ళూ అయితే ప్రతిరోజూ పల్లెల నుంచి వాహనాల మీద రావాల్సిందే,యేమిటీ దుస్థితి?!యే ఉద్యమంలో భాగంగా నైనా ఒక వారం రోజులు నగర పొలిమేరల దగ్గిర రహదారుల్ని దిగ్బంధనం చేస్తే ఒక్క వారం రోజుల్లో ఆ అగర ప్రజలు ఆకలితో అలమటించిపోతారు!పైగా రోజుకి వేల టన్నుల చెత్తని సృష్టించే ఈ మహానగరాలు ఆ చెత్త మరీ యెక్కువైతే పారబొయ్యటానికి పనికొచ్చే చెత్తకుప్పలుగా దగ్గిర్లో వున్న పల్లెల్ని ఉపయోగించుకుంటున్నాయి,తా జెడ్డ కోతి వనమెల్లా చెరిచినట్టు!




          వ్యక్తులుగా రాజకీయ నాయకులు మిగిలిన విషయాల్లో యెంత సమర్ధులైనా ఈ నగర జీవనాన్ని క్రమబధ్ధం చెయ్యటంలో యెందుకు అసమర్ధులు అవుతారో తెలుసా,ఇవ్వాళ మనం మహానగరాల్లో చూస్తున్న అవ్యవస్థ నెహ్రూవియన్ ఆర్ధిక విధానం మూలంగా ఉనికిలోకి వచ్చి సుమారు ఒక శతాబ్దం పాటు సుదీర్ఘమైన ప్రయాణానంతరపు మలుపు కాబట్టి - చిట్కావైద్యాల లాంటి తక్షణ పరిష్కారాలు ప్రయోజనమిచ్చే దశ దాటిపోయి చాలా కాలమైంది కాబట్టి!పెరగకూడని విధంగా పెరగడం వల్ల కొత్త రకమైన నిరుద్యోగం,భద్రత లేని ఉపాధి లాంటివి ప్రజల్లో అశాంతిని పెంచుతూ ఆ అశాంతి ప్లేటు ఇడ్లీ కోసం కత్తిపోట్లకు దారితీసే కలహాల నుంచి మూకుమ్మడి మానభంగాల వరకూ నేరాల్ని మరింతగా ప్రోత్సహిస్తున్నది!పట్టణీకరణ,మురికివాడలు,సౌకర్యాల లేమి,వనరుల లోపం ఒక కొత్త వోటుబ్యాంకును కూడా ఉనికిలోకి తీసుకొచ్చాయి.డిల్లీలో కేజ్రీవాల్ లాంటి నాయకులకి రాజకీయ ఉపాధిని కూడా ఇచ్చేటంతగా పెరిగిన మురికివాడల్ని ఇప్పుడు సత్సంకల్పంతోనైనా అభివృధ్ధి వైపుకి నడిపించటం కూడా కష్టమే!అతను ఉచితంగా ఇస్తానన్న విద్యుత్తూ నీరూ మురికివాడల పౌరుల్ని టార్గెట్ చేసుకున్నవే.బలవంతంగా కొద్దికాలమైనా తను ఇస్తానన్నవి ఇవ్వగలిగితే "లైఫ్బాయ్ యెక్కడ వుందో ఆరోగ్యం అక్కడ వుంది" అన్నట్టు మురికివాడలు గల మహానగరాలన్నిటికీ ఆ కేజ్రీవాల్ విస్తరిస్తాడు?!ఆ రెంటినీ ఇవ్వాలంటే దిట్టమైన ఫ్రేంవర్క్ చాలా అవసరం,ఆ ఫ్రేంవర్క్ అసలు పెట్టుబడి లేకుండా యేర్పడదు,అల్పాదాయ వర్గాలకి ఉచితంగా ఇవ్వడం కోసం రాబిన్ హుడ్ తరహాలో అధికాదాయ వర్గాల నుంచి నొల్లుకురావాలి,దానితో ప్రజల మధ్యన ఈర్ష్యాద్వేషాలు మరింత పెరుగుతాయి - అదో అనంతకాలం వరకూ కొనసాగే మరో రాజకీయ సర్పిలం!




          పౌరులకి ఆరోగ్యకరమైన ఆవాసాన్ని కల్పించటం ప్రభుత్వం యొక్క మొదటి బాధ్యత అని తెలుసుకుని ప్రజలు దానికోసం వొత్తిడి చేసయినా సాధించుకోవాలి.పల్లెల్లో తగినత ఆదాయంతో ప్రశాంతంగా బతకగల్గిన వాళ్ళు నగరాల మీద వ్యామోహం తగ్గించుకుని పల్లెటూళ్లలోనే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సౌకర్యవంతంగా బతికేటందుకు ప్రయత్నించాలి.దీర్ఘకాలిక ప్రాతిపదిక మీద ప్రభుత్వాధినేతలు భారీ పరిశ్రమలూ వాల్ మార్ట్ తరహా ప్రయోగాలూ చెయ్యకుండా వ్యవసాయాన్నీ వ్యవసాయాధారితమైన పరిశ్రమల్నీ ప్రోత్సహిస్తూ సాంప్రదాయిక వృత్తులకి లాభసాటి మార్కెట్ సృష్తించగలిగితేనే పల్లెలూ నగరాలూ చెట్టాపట్టాలేసుకుని అభివృధ్ధి పధంలోకి అవిచ్చిన్నంగా నడిచే వీలు ఉంటుంది. బహుళ అంతస్థుల భవనాలతో నగరం మీద ఒక నల్లని దుప్పటి కప్పేసి అత్యధిక జనాభా గల నగరాలని ప్రదర్శించుకుని మురిసిపోవాలనే కండూతిని తగ్గించుకుని పల్లెల నుంచి నగరాలకి జరుగుతున్న యేకపక్షమైన వలసల్ని దృడసంకల్పంతో నిరోధించకపోతే ఇవాళ్టి మహానగరాలు రేపటికి విస్మృత నగరాలుగా మారిపోతాయి - తప్పదు!
_______________________________________________________________
(చిత్రాలు:గూగులమ్మ సౌజన్యం!)

Tuesday, 31 March 2015

అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు కేంద్రప్రభుత్వంలో వున్నా ఏపీకి రావల్సినవి కూడా రావడం లేదు!

          కొండనాలిక్కి మందేస్తే ఉన్న నాలిక వూడినట్టు చంద్రబాబు తమకేమీ సాయం చెయ్యకపోయినా భాజపాకి మాత్రం ఇబ్బందులు కలిగించవద్దని సొంత మనుషుల్నే కట్టడి చేస్తుంటే ఆనక జనం దీన్ని నపుంసకత్వంగా అర్ధం చేసుకుని సహేంద్ర తక్షకాయ అన్న చందాన భాజపాతో పాటూ కాంగ్రెసు లాగా నువ్వూ ఆవల ఉండు నాయుడూ అంటే యేమి చేయవలె?అప్పుడే సూర్యారావు మాస్టారి గెలుపు ద్వారానూ మిశ్రమ ఫలితాన్ని చూపించటం లోనూ సంకేతాలు పంపించారు - తెదెపాకి ప్రజాభిమానం తగ్గిందని!అది ప్రజాగ్రహం గా ముదరక ముందే చురుకు తెచ్చుకోవాలి, తెచ్చుకుంటాడా కేంద్రంలో మోదీ అవసరం అనే పాతపాటతో తమ్ముళ్ళకి ఇంకా కళ్ళాలు బిగించి పూర్తిగా పుట్టి మునిగాకే కళ్ళు తెరుస్తాడా?

            ఒకసారి కేసీఆర్ ఉద్యమంలో ఆంధ్రోళ్లని తిట్టే పైత్యకారి వాదనని గట్టిగా యెదుర్కునే అర్హతలు అన్నీ ఉన్నా గోడమీదపిల్లివాటం రాజకీయంతో మొత్తం ఆంధ్రప్రజానీకం యొక్క నిజమైన ప్రతినిధిగా నిలబడి తెలుగుప్రజలలో తిరుగులేని ఆమోదాన్ని పొందే గొప్ప అవకాశాన్ని పోగొట్టుకున్నాడు,మళ్ళీ భాజపాతో మెతక రాజకీయమాడి మరోసారి ప్రజాభిమానానికి దూరమవుతాడా!

             మొన్నటి పార్లమేంటు సమావేశాల్లో (ఉగాదికి ముందు) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ప్రస్తావనకి వీరప్ప మొయిలీ వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు వ్యతిరేకిస్తారనుకున్న ఇతరులు యెవరూ అతనితో గొంతు కలపలేదు. పైగా బెంగాల్ సభ్యుడు సౌగతా రాయ్ అయితే ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మించడం గురించీ రాష్ట్రానికి సహాయం చెయ్యడం గురించీ కొంత అనుకూలంగానే మాట్లాడాడు!అయినా పిల్లిమెడలో గంట కట్టేదెవరు అన్న దోబూచులాటతో అధికార ప్రతిపక్ష పార్టీలు మీనమేషాలు లెక్క పెట్టటానికి కారణం యేమిటో ఆ పార్టీ అధిష్ఠానాలకే తెలియాలి!వ్యతిరేకించాలని అనుకున్నవాళ్లు యెవరయినా చొరవ తీసుకోదల్చుకుంటే వీరప్ప మొయిలీ ప్రకటనకి అనుకూలంగా మాట్లాడే అవకాశాన్ని వొదులుకుని వుండేవారు కాదు గదా!

        సాంకేతికంగా ప్రత్యేక హోదాకి ఇదివరలో నిర్వచించిన కొండ ప్రాంతాలు వుండటం లాంటివి లేకపోయినా విభజన కారణంగా ఆవిర్భవించిన యేడాదికే లోటు బడ్జెట్ వుండటం,మాతృరాష్ట్రం అయినా రాజధానిని పూర్తి ఆదాయంతో సహా కొత్తగా యేర్పడిన పిల్ల రాష్ట్రానికి వొదిలేసి రాజధాని లేకుండా ఆదాయాన్ని కోల్పోయి నిలవటం కూడా వాటితో పోల్చదగ్గ బలహీనతలే, ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వటం సబబే అని వెంకయ్య నాయుడు అంటుంటే అందరూ తలలూపుతున్నారు - అయినా అది దఖలు పర్చేటందుకు తొలి అడుగు మాత్రం పడటం లేదు,కారణ మేమిటి?అప్పటి ప్రధాని చేసిన వాగ్దానాన్ని ఇప్పటి ప్రభుత్వం మన్నించి తీరాలనే సభా సాంప్రదాయం కూడా అనుకూలంగానే వుంది కదా?అట్లా మన్నించకపోతే ఆ పదవికి ప్రత్యేకత యేముంటుంది?నిండుసభలో ఒక ప్రధాని చేసిన ప్రకటన కేవలం ఆ పార్టీ అధికారాన్ని కోల్పోయి మరో పార్టీ అధికారంలోకి రావడం మూలంగా అమలుకి నోచుకోకపోతే ఆ స్థానానికి రాజ్యాంగపరమయిన గౌరవం తగ్గినట్టే గదా!

        ప్రభుత్వంలో ఉన్న భాజపా తొలి అడుగు వేస్తే అధికారం పంచుకుంటున్న మిత్రపక్షానికి మేలు చేస్తున్న అపప్రధ మొయ్యాల్సి రావచ్చునన్న భయం ఉందొచ్చు,కానీ విభజనలో దేన్ని ఆశించి అంత మొండిగా తెలంగాణా ఇచ్చి దాన్ని పొందలేక చతికిలబడిన కాంగ్రెసు కనీసం పరువు నిలబెట్టుకోవడానికైనా ఇప్పుడు ఏపీకి ప్రత్యెక హోదా రప్పించాల్సిన అవసరం వుంది కదా! యేదో ఒకరోజున చర్చ+ఓటింగు తీర్మానం కాంగ్రెసు ప్రవేశ పెడితే ఆ రోజుతో ఐసాపైసా తేలిపోతుంది గదా యెందుకీ యెదురు చూపులు?ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ ప్రత్యేక హోదా కోసం పోరాడతామని అన్నిసార్లు వాగుతున్నా తిరపతి యెన్నికల నుంచి మొన్నటి యెం.యెల్.సీ యెన్నికల వరకూ ఒక్క చొట కూడా ఒంటికాలు మీద నిలబడే చోటు కూడా ఇవ్వడం లేదంటే "ముందు సాధించుకురా అప్పుడు చూస్తాం" అని చెప్తున్నారని అర్ధం చేసుకోకపోతే పూర్తిగా చచ్చాక మేలుకుంటారా యేంటి?

          తెదెపా నుంచి కేంద్రంలో మంత్రిగా ఉన్న ఆడంగి పేరుగల మగాడు ఒకడు కాసేపు హోదా రావడం కష్టమనీ యెక్కువ నిధులతో సరిపెట్టుకుందామని సన్నాయి నొక్కులు నొక్కుతూనూ ఆ నిధులు కూడా సరిపడినన్ని ఇవ్వకపోవడం తెలుస్తూనే ఉన్నా వచ్చేస్తున్నాయి అధిక నిధులు అనీ బహురూపుల వేషాలతో సొంత పార్టీ వాళ్ళనే మోసం చేస్తున్నాడు,అయినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇంకా కళ్లు తెరవడం లేదు,యెందుకనో?ప్రజలు మాత్రం గమనిస్తూ నిశ్శబ్దంగా వున్నారు, అవకాశం కోసం యెదురు చూస్తూ తుఫాను ముందరి ప్రశాంతతని చూపిస్తున్నారు  - ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రాజకీయ పార్టీల నాయకులూ కొంచెం చురుకు తెచ్చుకోవాలి?!

ప్రజలతో క్రూర పరిహాసాలు ఆడిన ప్రతివాడూ పరిహాసాస్పదుడయ్యాడనేది చరిత్ర చెప్తున్న సత్యం!

Sunday, 29 March 2015

నీ కళ్ళెదుట వేరేవాడు మీ అమ్మని రేప్ చేస్తుంటే ఈ సలహా మీ అమ్మకి ఇవ్వగలవా అనే ప్రశ్న యెందుకు తట్టలేదు?

          అవును,ఆ ఇంటర్వ్యూ చేసిన ఆడమనిషికి గానీ దాన్ని వీడియోగా తీస్తే లేని తప్పు బయటికి చూపిస్తే యేదో ఘోరం జరిగిపోతుందని అల్లరి చేసిన వాళ్లకి గానీ ఆ ప్రశ్న వాణ్ణి అడిగి చూడాలని యెందుకు అనిపించలేదు?ఆ గాడిద రేప్ చేస్తుంటే చెయించుకోవాలి గానీ తిరగబడటం దేనికి అని ప్రశ్నిస్తున్న సన్నివేశాన్ని చూస్తున్న మొదటి క్షణం లోనే నాకు కలిగిన సందేహ మిది!

      లడ్డుని బజారులో పెడితే కుక్కలు ముట్టుకోవా అని కూసిన లాయర్ని వెంనే "నీ భార్య కూడా లడ్డు అనుకో,తను పచారీ కొట్టుకు వెళ్తున్నప్పుడో తలనెప్పి మాత్ర తెచ్చుకోవడానికి వెళ్తున్నప్పుడో సరదాకి ఓ నాలుగు కుక్కల్ని పంపి నాకిస్తాం అప్పుడు కూడా ఇట్లాగే సమర్ధించ గలవా?" అని అడగాలని యెందుకు తోచలేదు అక్కడున్న జనాల్లో యే ఒక్కడికీ?

       రేపటి రోజున వాడు జైలులో తన సాహస కార్యాన్ని గురించి కవిత్వం చెప్పుకుంటే అవి పత్రికల్లో ప్రచురితమై హాట్ కేకులుగా అమ్ముడయినా ఆశ్చర్యం లేదు గదా!విదుదలయ్యాక యెన్నికల్లో పోటీ చేస్తే అఖండమైన గెలుపు కూడా వరించినా ఆశ్చర్యం లేదు గదా!మొగ్గలోనే తుంచగలిగిన దానికి నీరు పోసి పెంచి పోషించి అప్పుడు కత్తులూ గొడ్డళ్ళూ సానబెట్టి ప్రయోజన మేమిటి?పిల్లల్ని యెట్లా పెంచాలో తెలియని వాళ్ళు పిల్లల్ని కనడం దేనికి?!

      సూటిగా గుండెల్ని తాకే ఒక ప్రశ్న వెయ్యి శతఘ్నుల్ని పేల్చగలదు!సరిగ్గా ప్రశ్నించడమే తెలియని వాళ్ళు పరిష్కారాన్ని యెట్లా సాధించ గలరు?ఆ నరపశువుని కన్న తలిదండ్రులే వాడికి స్త్రీ పట్ల చిన్నచూపు కలగడానికి మొదటి కారణమని తెలిశాక గూడా తెల్లమొహం వేసుకుని చూసేవాళ్ళు యేనాటికి కళ్లు తెరుస్తారు?సంస్కారం నేర్పని విద్య ఈ దురవస్థకి మూలకారణం అని యెంతమందికి తట్టింది?!

ధర్మో రక్షతి రక్షితః

Saturday, 28 March 2015

మొదట అట్టను అంత భయంకరముగ చిత్రించ నేల?పిదప అట్టను చూసి భయపడకండని కన్నుగీటులేల!

       స్వైరిణి మళ్ళీ కన్ను గీటి కాలెత్తింది!ఈసారి మహాభారతం మీద పడింది?రంకు నేర్చిన ఆడది బొంకు నేర్వదా అని - అబధ్ధాలు చెప్పడంలో మాంఛి శ్రేష్టమైన మార్గాన్నే యెంచుకునింది?!మొదటిసారి వాల్మీకి చెప్పనివి - రాముడు శూర్పణఖని చొల్లు కార్చుకుంటూ చూశాడనీ,సీత రావణుణ్ణి చూసి గొప్పగా మురిసిపోయిందనీ - తను కల్పించి చెప్తే రామకధ యెక్కువ మందికి తెలిసి వుండటంతో అట్లాంటి వాటితో తిరగేసి తన గూబనే గుయ్యి మనిపించడం తప్ప రామాయణాని కేమీ హాని జరగలేదు!కానీ తిరిగే కాలూ తిట్టే నోరూ వూరుకోవుగా యెందుకో ఈసారి మహా భారతం చదివింది.అప్పట్లాగే తనకి అర్ధం కానివి కొన్ని తప్పులుగా కనపడినాయి.అర్జెంటుగా ఆమాంబాపతు గాళ్ళకి ఓ పదిమందికి ఫోను చేసిందిట!వాళ్ళు మహాభారతంలో అవి వున్నాయా, మాకేం తెలీదన్నారంట!వెంఠనే బుర్రకి పదును పెట్టేసింది - సంస్కృతం రాకపోతే యేం అనువాదాలు వున్నాయిగా రామాయణ విషవృక్షం కూడా అట్లాగే లాగించిందిగా "ఇదండీ మహా భారతం"అనే పుస్తకాన్ని వొదిలింది - దేశంలో వున్న స్వైరిణి పాదరేణువులంతా హర్ష పులకాంకితగాత్రులై పోయేటట్లుగా!

     యేదైనా ఒక వస్తువుని పదిమందికీ అమ్మాలంటే చూడగానే ముచ్చట గొలిపే ప్యాకింగు అవసరమని చిన్నపిల్లాడికి కూడా తెలుసు!తన జేబులో వున్న శెనిక్కాయని పక్క పిల్లోడికి అమ్మాలన్నా కూడా మట్టి తుడిచి సాపుచేసి అమ్మాలని చూస్తాడు,మరి ఈ తెలివి యేమిటో తన పైత్యకారి తనమంతా అట్ట చూడగానే తెలిసి పోవాలన్నట్టు వికారమైన బొమ్మతో వొదిలింది?తనే తెలిసీ అట్టని చూడగానే కోపమొచ్చేలా చేసి మళ్ళీ "అట్టను చూస్తే  కోపమొస్తుందేమో.  లోపలికి వెళ్ళండి. న్యాయం లేకుండా, చర్చ లేకుండా,  పరిశీలించకుండా కోప్పడితే  అది తప్పవుతుంది కదా?" అని దీర్ఘాలు తీస్తుంటే ఆ తెలివిని తెలివనే అనాలా?

        అబధ్ధాలు రెండు రకాలుగా చెప్పొచ్చు!రామాయణం విషయంలో అక్కడ లేని దాన్ని వున్నట్టు చెప్తే ఇక్కడ మహాభారతం విషయంలో తను వెక్కిరించటానికి పనికొచ్చేదాన్ని మాత్రమే వుటంకిస్తూ అక్కడే తన వాదనని వెక్కిరించే సత్యం వున్నా దాన్ని మాత్రం చెప్పకుండా వొదిలేసి చెలరేగిపోవటం చాలా గొప్ప తెలివి! గట్టిగా యెవరయినా నిగ్గదీస్తే నేను చెప్పిన పార్టు మట్టుకు అక్కడ వుందా లేదా అని యెదురుదాడి కూడా చెయ్యొచ్చు, అమ్మ స్వైరిణీ బల్లే లాజిక్కు లాగావుగా!

        అప్పుడెప్పుడో బాపుగారు అప్పుడే పోయారనే ఇది కూడా లేకుండా పాత విషయాన్నొకదాన్ని కెలికి అల్లరి చెసిన ఒక బ్లాగరు ఇప్పుడు ఆవిడకి పరమ భక్త శిఖామణి అయిపోయి అందులోని విశేష భాగాలు అంటూ తనకి తిరుగులేని వనిపించే కొన్ని చెత్త వాదనల్ని ఒక పోష్టుగా వేశాడు.ఆవిడ లాగే రండి,వాదించండి,గెలవండి అని పిలిచి తీరా వాదన గట్టిగా వుంటే ఆ కామెంట్లని ప్రచురించకుండా వొదిలేసి,కొన్నిటికి తాంబూలా లిచ్చెశాను తన్నుకు చావండన్నట్టుగా నేను చెప్పిందే ఫైనల్,ఇంక దీని గురించి వాదన అనవసరం అనీ అంటున్నాడు!మరి అంతోటి దానికి రండి,చూడండి,వాదించండి, గెలవండి అని పిలుపు లెందుకు?ఆ "స్వైరిణి పాద రేణువు" పోష్టులో ప్రచురించిన విషయాన్ని మార్చి 24 నాటి 7:28 గంటల తన కామెంటు వరకూ ఇక్కడ ప్రస్తావించదల్చుకున్నాను.అక్కడి లాగా ఇక్కడ నేను కామెంట్లని మోడరేట్ చెయ్యను.మిత్రులకి, మహాభారతాన్ని సమర్ధించదల్చుకున్న వారికి మాత్రం భాష విషయంలో హెచ్చరిక చేస్తున్నాను - మన భాష అసభ్యంగా వంటే సరుకు లేక ఇట్లా మాట్లాడుతున్నారని నింద రావచ్చు కాబట్టి జాగ్రత్తగా వుండండి!ఉషశ్రీ తెలుగు అనువాదం కొన్ని భాగాలు నా దగ్గిర వున్నాయి కాబట్టి విషయం వరకూ కంగారు పడాల్సిన పని లేదు! కాబట్టి స్వైరిణి పాద రేణువులు మాత్రం తమ బుధ్ధినీ సంస్కారాన్నీ మిళితం చేసిన వాదనల్ని నిరభ్యంతరంగా చెయ్యవచ్చు!

       మొదట స్వర్గారోహణ పర్వాన్ని గురించిన వాదనల్నే తీసుకుందాం.ఉషశ్రీ చెప్పిన దాని ప్రకారం వ్యాస భారతంలో శతాధిక పర్వాలు వున్నాయి. ప్రతి పర్వానికి పెట్టిన పేరు ఆ పర్వంలో చెప్పే కధని సూచించే విధంగా వుంటుంది.కాండలుగా,పర్వాలుగా,సర్గలుగా ప్రతి భాగానికీ పెట్టినట్టుగానే "మహా ప్రస్థానం","స్వర్గారోహణం" అని పెట్టి కధ చెప్పినా కూడా స్వైరిణికీ స్వైరిణిపాదరేణువుకీ వాళ్ళు యెక్కడి కెళ్తున్నారో అర్ధం కాలేదట!ఇంద్రుడు కనపడగానే ఆగిపోయాడేమిటీ అని అమాయకంగా ఆవిడ దీర్ఘాలు తీస్తూ అడుగుతే ఈ స్వైరిణిపాదరేణువు నేను విడమరిచి చెప్పాక కూడా కధలో స్వర్గాని కెళ్తున్నట్టు లేదుగా అని అడ్డం తిరిగి వాదిస్తున్నాడు,ఈపాటి తెలివికి అసలు వాదనకి తెగబడటం దేనికి?ఇట్లా వ్యాసభారతంలో వాళ్ళు బయలుదేరింది స్వర్గానికి చేరడానికే అని కాకుండా అస్పష్టంగా వుండేటట్టు యే అనువాదంలో వుందో చెప్తే మేమూ చదివి తరిస్తాం!తమ తమ పుణ్యవిశేషంతో యోగనిష్ఠకి సంబంధించిన ప్రయాణమైన మహాప్రస్థానంలో కూడా దేహబంధాలకి చోటిచ్చి వెనక్కి చూసుకుంటూ పడిపోయిన వాళ్లందర్నీ మోసుకుంటూ వెళ్ళాలని పిచ్చ్గివాళ్ళు మాత్రమే అనగలరు!మిగతావాళ్ళు పడిపోయినప్పుడు కూడా యెందుకు పడిపోతున్నారో చెప్పి ఆగకుండానే వెళ్ళాడనేది తెలిసి కూడా ద్రౌపది పడిపోవటాన్నే ప్రముఖంగా చెప్పడం ఆడవాళ్ళని రెచ్చగొట్టాలని కాదా?ఈ దేశపు ఆడవాళ్ళు మరీ అంత చెవుల్లో పువ్వులు పెట్టుకున్నారని అనుకుందా!రామాయణం,మహాభారతం కధల్లో యేముందో తెలియకపోయినా ఆడవాళ్ళు తమ తల్లుల ద్వారా తమ ప్రవర్తనని నిర్దేశించుకుంటున్నారు,అదొక పరస్పరాశ్రిత సంబంధానికి తమ క్షేమం కోసం కట్టుబడటం - అందులో సందేహాలు వచ్చినప్పుడు మాత్రమే సమాధానాల కోసం ఆ గ్రంధాల సారం పనికొస్తుంది!ఖచ్చితంగా పాటించి తీరాలని ఒత్తిడి కూడా చెయ్యటం లేదు,అట్లా సాగదని తెలిపేటందుకు బృహత్కధ లోని శృంగారం నిండిన చాటువులూ భారతంలోనే అక్కడక్కడా వున్నఉపకధలూ వుదాహరణలుగా నిలుస్తాయి!

        జూదం చాలా ధర్మబధ్ధంగా జరిగినట్టూ అందులో అక్రమం యేమీ లేనట్టూ కౌరవులు ఓడిపోయుంటే భానుమతినీ అట్లాగే ఈడ్చుకొచ్చేవాళ్ళు కదా అనీ,వాళ్ళూ అడవులకి వెళ్ళాల్సిందే కదా అని ఆవిడ లాజిక్కు లాగితే పిన్నిని పెళ్ళి చేసుకుని పక్కలోకి లాగాలని చూసే పైత్యకారి ఒకడు దుశ్శాసనుడికి రేప్ చేసుకోవటానికి పర్మిషన్ ఇచ్చిన ధర్మరాజుకి ద్రౌపది విడాకులు యెందుకివ్వలేదు అని అడుగుతున్నాడు?అంత నీచమయిన కామెంటుని కూడా తన సైడు వాడు వేశాడు గాబట్టి పబ్లిష్ చేసిన ఈ స్వైరిణిపాదరేణువుకి తనకి బెండు తీసే కామెంట్లలో మాత్రం అసభ్యత కనిపిస్తుంది కాబోలు?విరాట పర్వంలో ద్రౌపది భీముడితో అంటుంది "యెంతకాలం జూదమాడినా తరగని సంపద మనది,కొద్ది క్షణాల్లో మాయచేసి ఓడించారు.ఈ విరాట రాజు ఒకప్పుడు మనకి సామంతుడు. ఇప్పుడు మీ ఆన్నగారు దాసుడిగా తిరగటం, వీళ్లని సంతోష పెట్టటం కోసం నువ్వు యేనుగులతో సింహాలతో పోట్లాడటం, గాండీవి నారీజనం మధ్యన గంతులు వెయ్యడం చూస్తుంటే నాకు దుఃఖంగా వుంది" అని!తన భర్తల పట్ల అంత గౌరవం వుండి మాయోపాయంతో దుర్యోధనుడు తన భర్తల్ని ఓడించటం వల్లనే తనకి పరాభవం జరిగిందని తెలిసిన ద్రౌపది ఈ ఆడదానితో పెళ్లికి పనికిరాని గాడిదకి నచ్చేటట్టు విడాకుల ఆలోచన చేస్తుందా?ఇంత కాలం ఈ కామాంధుడి వదరుబోతు తనాన్ని చూశాక గూడా యెవడికీ వీణ్ణి నాలుగు తందామనే ఆలోచనే రావటం లేదా?ఇంకా హిందువులలో ధార్మికక్షాత్రం రగుల్కొనుట లేదా?ఒక్కసారి కూడా గెలవకుండా అన్నిసార్లూ ఓడిపోవటం చూశాకనైనా ధర్మరాజు కేవలం ఆసక్తి కొద్దీ నేర్చుకోవటమే తప్ప ప్రావీణ్యం కోసం యేనాడూ పాకులాడ లేదనీ దానికి భిన్నంగా శకుని అందులో ఆరితేరిన వానీ తెలియడం లేదా?అదే విరాట పర్వంలో ఉత్తర గోగ్రహణంలో అశ్వధ్ధామ "యుధ్ధంలో గెలవలేమని తెలిసే మీరు ద్యూతానికి దిగి పాండవశ్రీని హరించారు.అప్పుడు మా అవసరం మీకు లేకపోయింది,ఇప్పుడు కూడా శకునినే పిలవండి" అని అంటాడే - ఆ ముక్క యేమి చెప్తుంది?భీష్ముడు కూడా ద్యూతార్జితం రాజపురుషులకి గౌరవప్రదమయిన సంపాదన కాదు,న్యాయంగా వాళ్ళ భాగం వాళ్ళకిస్తే నువ్వు క్షేమంగా వుంటావు నీ మేలు కోరి చెప్తున్నా నంటాడు.ఇంత ప్రముఖమైన సన్నివేశం కూడా స్వైరిణి చదివిన అనువాదాల్లో లేదా?

       హస్తినాపురం,కౌరవులు,దృతరాష్ట్రుడు,దుర్యోధనుడు,భీష్మద్రోణాదులు - ఇవన్నీ ఒకదాని కొకటి సంబంధం లేకుండా గాల్లో తేల్తున్న విడివిడిభాగాలు గాబోలు స్వైరిణిపాదరేణువుకి హస్తినాపురం ఓడిపోతే దృతరాష్టుడు ఓడిపోవటమేమిటో అంతుబట్టటం లేదట!ఇండియాకీ పాకిస్తానుకీ జరిగిన యుధ్ధంలో భుట్టో తుపాకీ పట్టుకుని యుధ్ధం చేశాడా?వెయ్యేళ్లు యుధ్ధం చేస్తానన్న భుట్టో చేత నిర్యుధ్ధ సంధి సంతకం యెందుకు చేయించుకుంది ఇండియా?ఈ స్వైరిణిపాదరేణువు లాజిక్కు ప్రకారం భుట్టో ఇండియా మీద పెత్తనం చెయ్యాలి గాబోలు - యేమి పిచ్చి లాజిక్కు ఇది? అసలు దృతరాష్ట్రుడికి రాజ్యార్హత లేదు - అది ఖచ్చితం!యేదో పెద్దవాడు కుళ్ళి చస్తాడని ఇప్పటి రాష్త్రపతికి మల్లే వుత్సవ విగ్రహం లాగా కూర్చోబెట్టాడు పాండురాజు, రాజ్యార్హతకీ పిత్రార్జితానికీ తేడా తెలీదా ఈ దద్దమ్మలకి ప్రజాస్వామ్యంలో కూడా తాగుబోతుకీ తండ్రి ఆస్తిలో వాటా వస్తుందిగా అని పేలుతాడు?నిజమైన రాజ్యార్హత వుండి ఆ అర్హతని నిలబెట్టుకున్న పాండురాజు పెద్ద కొడుకుగా ధర్మరాజుని యువరాజుగా అందరూ అంగీకరించినట్టు అంత స్పష్టంగా చెప్పాక గూడా వెర్రిమొర్రి మాటలు మాట్లాడితే యెవడు యెవడి గూబ గుయ్యి మనిపించాలి?!యుధ్ధాలు చెయ్యటం,రాజ్యాన్ని విస్తరించటం,అధికారిక నిర్ణయాలు చెయ్యటం అన్నీ పాండురాజు పరంగానే జరిగేవి!పాండురాజు చనిపోయాక కుంతి పిల్లలతో వస్తున్నప్పుడు యువరాజ మర్యాదలతో గౌరవంగా చూస్తారు ధర్మరాజుని, స్వైరిణి చూసినవైనా అనువాదాలలో ఆ భాగం చూస్తే తెలుస్తుంది గదా!అయినా రాజ్యం దుర్యోధనుడిదే అయినట్టూ ధర్మరాజే తనది కాని దాన్ని ఆశించే దుర్మార్గుడనే వాదన వ్యాసుడికన్నా కవిత్రయంకన్నా స్వైరిణికే యెక్కువ తెలుసునని డప్పు కొట్టుకోవడానికి తప్ప యెందుకైనా పనికొస్తుందా?

       ఉత్తర గోగ్రహణం తర్వాత యెకాయెకి కృష్ణ రాయబారం జరగలేదు!మొదట ధర్మరాజు ధౌమ్యులవార్ని పంపిస్తాడు మర్యాదగా తమ భాగం తమకి ఇచ్చి తమ్ముడి కొడుకుల పట్ల తనకున్న ప్రేమని చూపించమని,దానికి ప్రతిగా దృతరాష్ట్రుడు సంజయుణ్ణి పంపించి యెట్లాగూ వనవాసం అలవాటయిందిగా అక్కడే వుండిపోరాదా అనే బూతుసందేశం పంపిస్తాడు,అయినా తమాయించుకుని ఆఖరుసారిగా కృష్ణుణ్ణి పంపిస్తాడు ధర్మరాజు!ఈ స్వైరిణికీ స్వైరిణిపాదరేణువుకీ ధర్మరాజు తన అర్ధరాజ్యం కోసమే యుధ్ధం చేశాడని యెట్లా అర్ధమయిందో తెలియదు గానీ పేర్లు చెప్పి మరీ తలా ఒక గ్రామం ఇచ్చినా చాలు నంటే సూది మొన మోపినంత భూమి కూడా ఇవ్వను పొమ్మన్నాకే గదా యుధ్ధం జరిగింది?అంత ధీమాగా హస్తినాపురాన్నే కొట్టాక కూడా అది వొదులుకుని పోవటం పిచ్చివాడు తప్ప యెవ్వడూ చెయ్యడు గదా!గెల్చిన వాడికి అది ధర్మవిజితమే కదా, ఇంకా దాన్ని తనని అడుక్కుతినమని అన్న ధృతరాష్ట్రుడి కిచ్చి తను యెక్కడికో పోవటమేమిటి అర్ధం లేకుండా?!యుధ్ధం పూర్తయ్యాక ధర్మరాజు  అసలు దృతరాష్ట్రుడి రాజ్యార్హతతో యేమాత్రం సంబంధం లేకుండానే హస్తినాపురానికి పూర్తి హక్కుదారుడు అని తెలిసి కూడా తను అర్ధరాజ్యం కోసమే యుధ్ధం చేశాడు గాబట్టి హస్తినాపురాన్ని దృతరాష్ట్రుడికి ఇస్తేనే ధర్మం అంటే ఇండియాకీ పాకిస్తానుకీ జరిగిన యుధ్ధంలో పాకిస్తాను సైన్యం మాత్రమే ఓడిపోయింది గానీ భుట్టో ఓడిపోలేదనీ ఆ నిర్యుధ్ధ సంధి పత్రం మీద బలవంతంగా సంతకం పెట్టించుకోవటం అన్యాయమనీ అన్నట్టే గదా?

          గీతలోని కర్మయోగానికీ భారతం చివరి ఫలశ్రుతికీ ముడిపెట్టి వెక్కిరించటం స్వైరిణికే చెల్లింది - బోడిగుండుకీ మోకాలికీ ముడిపెట్టటం లాంటిది!ఫలితం మీద ఆశ లేకుండా యే గాడిదా పని మొదలు పెట్టడు,భగవద్గీతలో చెప్పింది అంతా ఫలితం గురించిన యావతో కక్కుర్తితో వుండకు,ఫలితం నీ ఆశలకి విరుధ్ధంగా వచ్చినా కుంగిపోకు,ఒక పని నువ్వు తప్పనిసరిగా చెయ్యాల్సినదయితే ఆ పని నీకు లాభమైనా నష్టమైనా ఒక్కలాగే చెయ్యమని చెప్తుందే తప్ప ఫలితం లేని కర్మ గురించి చెప్పదు!అసలు ఫలితం లేని కర్మా వుండదు,ఫలితాన్ని ఆశించని మనిషీ వుండడు - అది వ్యాసుడికి స్వైరిణి కన్నా బాగా తెలుసు!అర్ధం కాకపోతే మూసుకుని కూర్చోవాలి గానీ సంబంధం లేనివాట్ని కలపకూడదు,వున్నవాట్ని వున్నట్టుగానే అర్ధం చేసుకోవాలి!మహా భారతం అనే గ్రంధాన్ని చదవాలని అనుకున్న వాడెవడయినా దాన్నుంచి యెంతో కొంత నేర్చుకుందామనే తెరుస్తాడు - అది కూడా తెలియదా ఈ స్వైరిణికి?మిల్స్ అండ్ బూన్ పుస్తకం తెరిచేవాడు కాలక్షేపాన్ని ఆశిస్తాడు,భారతాన్ని తెరిచేవాడు జ్ఞానాన్ని ఆశిస్తాడు - చెంబు కొద్దీ గంగ!

         అసలు ఇలాంటి సాహిత్యం అన్ని మతాల్లోనూ వున్నా ఈ కుహనా మేధావులు హిందూ మతం మీదనే పడి యేడుస్తా రెందుకో?అంబేద్కర్ గారు రాముడి పుట్టుక గురించి అక్రమ సంబంధం వల్ల పుట్టాడు అనే విధంగా వ్యాఖ్యానించినప్పుడు మరి యేనుగు కలలోకి వస్తే పుట్టిన పిల్లాడు అక్రమ సంతానం కాబోలు అని మనం అంటే యెట్లా ప్రతిస్పందిస్తారు?క్రైస్తవ మతంలో ఉండి హిందూ పురాణాల్ని అపహాస్యం చేసే ఐలయ్య గారూ ఆయన అభిమానులూ అబ్రహాము ద్వారా కాకుండా దేవదూత వల్ల పుట్టిన యేసు అక్రమ సంతానం అని ఒప్పుకోగలరా?వారి వారి మతాల్లో వున్న హేతువిరుధ్ధమైన విషయాలు వారికెంత ప్రీతిపాత్రమో హిందువులకీ అంతే కదా అని యెందుకు అనుకోరు,హిందువులు వాజెమ్మల వలె ఇట్లాంటివి నిగ్గదియ్యటం లేదు గనకనా!ఈ స్వైరిణీ స్వైరిణి అభిమానులూ తాము హేతువాదులమనీ ఈ కధలన్నీ హేతువిరుధ్ధంగా అన్యాయంగా వుండటం వల్లనే విమర్శిస్తున్నామని చెప్పుకుంటున్నారు గాబట్టి ఇంత అరిభీకరంగా అన్ని మతాల్నీ వెక్కిరించగలరా!

       తనకి అర్ధం కానివన్నీ తప్పులని విర్రవీగితే మరోసారి చావుతిట్లు తినాల్సి వస్తుంది స్వైరిణి,అయినా పాప్యులారిటీ కోసం యెంత చవకబారు పన్లు చెయ్యటానికైనా దిగజారేవాళ్లని యెన్ని తిట్టినా యేముంటుంది - వొదిలెయ్యటమే కాకికేమి తెలుసు సైకోఅనాలిసిస్ అని!ఈ స్వైరిణిపాదరేణువు మహాభక్తిగా విశేషభాగాలు అంటూ ప్రచురించిన వాటిని బట్టే నాకు ఈ తుక్కుపుస్తకం వల్ల మహాభారతానికి యెలాంటి ప్రమాదమూ రాదని అర్ధమై పోయింది,ఇంకెందుకు ఆందోళనతో కూడిన హైరానా?!


దీంతో ఆగకుండా మొత్తం పుస్తకాన్నే ప్రచ్రురిస్తే కానీ ఖర్చు లేకుండా చదివి నవ్వుకుంటా!

Wednesday, 11 March 2015

కాదంబరి లాగ ప్రేమలేఖ రాయగలిగే అమ్మాయి యెక్కడయినా ఉందా?

      ఇవ్వాళా రేపూ వయసులో ఉన్నవాళ్ళు కొంచెం రొమాంటిక్ మూడ్ కావాలంటే "మిల్స్ అంద్ బూన్" వాళ్ళ పుస్తకాల్లో యేదో ఒకటి రాక్ లోంచి బైటికి తీస్తారు!వీట్ని చాలా వ్యాపారాత్మకంగా రాస్తారు - ఎట్లాగంటే ఒకసారి చదివిన పుస్తకాన్ని యేడాది తర్వాత తీసినా చదివిన కధేగా అనిపించి బోరు కొట్టేటట్టు రాస్తారు!మొదటిసారి చదివినప్పుడు వుర్రూత లూగించాలి, రెండోసారి చదువుతుంటే వుసూరు మనిపించాలి - లేకపోతే వాళ్ళ కొత్త పుస్తకాలికి గిరాకీ ఉండదే?బిజినెస్సు ట్రిక్కు, మన చేతి చిలుమొదిలించాలని!

       కానీ యెన్ని సార్లు చదివినా బోరు కొట్టడం అటుంచి కొత్త అర్ధాలు తోస్తూ పులిసిన కొద్దీ కిక్కు పెంచే ఫ్రెంచి మద్యం లాంటి కధ మనవాడే ఒకడు రాశాడు, ప్రపంచమంతా ఒక శతాబ్దకాలం నుంచీ ఇంగ్లీషులోకి అనువాదం చేసుకుని చదువుతూ పోటీలు పడి మెచ్చుకుంటున్నారు!అదే సంస్కృత సాహిత్యంలో కల్లా అత్యధ్భుతమైన రెండు గద్య కావ్యాలని రాసిన బాణభట్టు యొక్క అపూర్వ కావ్యసృష్టి - కాదంబరి!పేరు కర్ధం నిజంగా మత్తుగానే ఉంటుంది, యెందుకంటే కదంబ వృక్ష సంబంధమయిన మధువు - ఇప్ప కల్లు!దీని ఎఫెక్టుకి మత్తెక్కి పోయి కాబోలు కన్నడ,మరాఠీ భాషా సాహిత్యాల్లో యెప్పట్నుంచో నవల,ప్రేమ కధ లాంటి వాటి కన్నిటికీ "కాదంబరి" అనేది పర్యాయ పదమైపోయింది - తస్స చెక్క!

      అతడి రచనలే అధ్భుతం అనుకుంటే అతడి జీవితం అతడి రచనల కన్నా గొప్పగా వుంటుంది!దాదాపుగా మహాకావ్యాలు రాసినా కేవలం కవిత్వం అల్లినా రచయితల జీవితం చాలా సాధారణంగా వుంటుంది.చిన్నప్పుడే కవిత్వంలో మంచి ప్రతిభ చూపించటం,మంచి గురువు దగ్గిర చందస్సు,అలంకారం అవీ నేర్చుకోవటం,అప్పటి పధ్ధతి ప్రకారం వయస్సు రాగానే పెళ్ళి చేసుకోవటం,తీరిగ్గా కూచుని తమ ప్రతిభకి సాన పెట్టుకుని గొప్ప కావ్యాల్ని రాసి సాటివాళ్ళని మెప్పించటం,అవి కాలాతీతమయిన కావ్యాలుగా ఇతర్లు పొగుడుతుంటే సంతోష పడటం - ఇంతే!కానీ బాణభట్టు జీవితం అలా కాదు,విషాదం,సంక్షోభం,ప్రతిభ,స్నేహం,విశృంఖలత్వం ,ప్రణయం లాంటి అనుభూతులతో ఇష్తమొచ్చినట్టు చెలరేగిపోయిన క్షీరసాగరమధనం - అందుకే అతని సాహిత్యంలో మనిషి జీవితానికి సంబంధించిన అన్ని అంశాలూ కలగల్సిపోయి కనబడుతూ "బాణోచ్చిష్టం జగత్సర్వం" అనే నానుడి పుట్టింది!

      తల్లి చిన్ననాడే స్వర్గస్థురాలైంది.వూహ తెలిసి అనుబంధం బలమయిన వయస్సులో తండ్రి కూడా మరణించాడు!తండ్రి దూరమవడం అతని జీవితంలో అత్యంత దుర్భరమైంది!ఆ బాధ గురించి హర్ష చరిత్రలో చెప్పిన  తనసొంత జీవితంలోనూ ఒకసారి చెప్పాడు, కాదంబరిలో వైశంపాయనుడు చిలుక జన్మలో తండ్రిని పోగొట్టుకున్న దుఃఖాన్ని పలికించేటప్పుదు మళ్ళీ తన దుఃఖాన్నే పలికించినంత యదార్ధంగా వర్ణిస్తాడు!అపారమయిన ప్రతిభ గల ఆ తండ్రిని పోగొట్టుకున్న కుర్రవాడు దేశదిమ్మరిగా కొంతకాలం తిరిగాడు - విషాదంలో కూరుకుపోకుండా నిత్యచైతన్యంతో కదిలి యెందరో మంచి స్నేహితుల్ని సంపాదించుకున్నాడు!.కలిసిన వ్యక్తులంతా అధ్భుతమయిన వ్యక్తిత్వాలతో అలరారిన వాళ్ళే - కవి వేణిభరతుడు,నర్తకి తాండవిక,కధకుడు జయసేనుడు,ఐంద్రజాలికుడు కరాళుడు,దొమ్మరాటల చకోరాక్షుడు,జైనసాధువు వీరదేవుడు!అంతటి సంచలనాత్మకమైన జీవితం గడిపి తిరిగి తన సొంతవూరుకే వచ్చాడు వయోభారంతో జ్ఞానభారంతో వంగి?ఇంతటి వైవిధ్యభరితమైన జీవితం గడిపిన కవి సాధారణమైన రచనలు యెట్లా చేస్తాడు?!

      ఇతను రాసిన హర్ష చరిత్ర వల్లా అందులోనే తన జీవితాన్ని కూడా వర్ణించుకోవడం వల్లా చాలా ఖచ్చితంగా ఇతను క్రీ.శ 7వ శతాబ్దం మొదటి భాగంలో జీవించాదని చెప్పవచ్చు."గుప్తుల కాలం స్వర్ణయుగం" అని మనం చిన్నప్పుడు చదువుకున్న అత్యంత ప్రఖ్యాతుడైన గుప్తవంశపు రాజు హర్షుడు తండ్రి పోయాక గడుపుతున్న సంచార జీవితం గురించి విని పిలిపించుకుని తన దగ్గిర ఉద్యోగ మిచ్చాడు. హర్షునితో విభేదాలు యేమీ లేకపోయినా కనిపించని ప్రమాదాల మయమైన ఆ రాజోద్యోగపు జీవితం యెక్కువ కాలం గడపలేక సొంతవూరు ప్రీతికూటం చేరుకుని అక్కడే హర్షచరిత్ర,కాదంబరి అనే రెండు గద్యకావ్యాల్ని రాశాడు!

      మన తెలుగులో వున్న మాండలిక భేదాల వంటివే అయిన పైశాచి,మాగధి లాంటి వాటిని సంస్కరించి అన్నింటిలో వున్న గొప్ప విషయాలని సరయిన పాళ్ళలో కలిపి క్రీ.పూ 4వ శతాబ్దంలో పాణిని అనే వ్యాకరణ వేత్త సంస్కృత భాషని నిర్మించాడు.ఆ సంస్కృత భాషలోనే బాణభట్టు కాదంబరిని కల్పించాడు.రెండూ ఒకదానికోసం ఒకటి పుట్టాయా అన్నట్టు జరిగింది కాదంబరి రచన!పాణిని యేం మాయ చేసాడో తెలియదు గానీ సంస్కృతం ఒక వైపు నుంచి చూస్తే గట్టిగా పట్టేసిన నియమాలతో చిక్కురొక్కురుగా వున్నట్టు కనిపిస్తుంది,మరో వైపు నుంచి చూస్తే పదాల్నీ అర్ధాల్నీ యెట్లా కావాలంటే అట్లా వంచగలిగిన తీగలు సాగే గుణమూ ఉంది.ఇంగ్లీషులోనూ కాంపౌండ్ నౌన్స్ అని ఒకటి కన్నా యెక్కువ పదాల్ని కలిపేసి పుట్టించిన పదాలు కొన్ని వున్నాయి - "bluebird","horseshoe","newsprint" లాంటివి. "newsprint"అనే పదాన్ని "news print" గానూ చదవ వచ్చు లేదంటే "new sprintగానూ చదవవచ్చు!కానీ సంస్కృతం మాత్రం ఇలాంటి కాంబినేషన్లని అత్యధ్భుతంగా పుట్టించగలదు.పైగా ఒకే మాటకి సమానార్ధకాలు కూడా వున్నాయి.ఈ శక్తి వల్లనే ద్వ్యర్ధి కావ్యాలూ త్ర్యర్ధి కావ్యాలూ పుట్టాయి!కాదంబరిలోనే చంద్రాపీడుడు చంద్రాయుధం అనే అశ్వాన్ని చూసినప్పుడు అది అతనికి "చక్రవర్తినరవాహనోచితం"గా కనిపించిందట!దీన్ని "చక్రవర్తియైన నరపాలకుడికి వాహనంగా వుందతగినది" అని గానీ "చక్రవర్తి యైన నరవాహనుడనే ఫలానావ్యక్తికి వాహనంగా వుండతగినది" అని గానీ పూర్తిగా ప్రతి పదాన్నీ మరింత విడదీసి "చక్ర-వర్తి-నర-వాహన-ఉచితం" అని గనక తీసుకుంటే "చక్రాన్ని ప్రదర్శించగలిగిన(సమర్ధతని చూపించగలిగిన) యే నరుని కైనా వాహనం కాదగినది" అని కూడా అర్ధం చెప్పుకోవచ్చు!

       మాట వరసకి "వాక్యం రసాత్మకం కావ్యం(రసం చిప్పిల్లే ఒక్క వాక్యం అయినా కావ్యమే!)" అని ఒప్పుకున్నా కావ్యం అనేసరికి అందరూ ఒప్పుకోవాల్సిన కనీస లక్షణాలు కొన్ని ఉండాలి కదా!ఆసక్తిని కలిగించే కధ ఖచ్చితంగ ఉండాలి. వర్ణనలో వైవిధ్యం గనక ఉంటే యే వస్తువునైనా యెంత సుదీర్ఘంగానైనా వర్ణించవచ్చు, అధ్భుతంగా ఆనిపించే సన్నివేశాల్ని కధనంతా ఆపేసి అయినా సరే మరింత విస్తారంగా వర్ణించవచ్చు,భాష మీద తనకున్న ఆధిక్యాన్ని చూపిస్తూ పదాలతో ఆడుకోవటం,పాఠకుడి మీద ప్రహేళికలు విసరటం,కొన్నింటికి తనే జవాబులు చెప్పి కొన్నింటిని నువ్వే కనుక్కోమని ఛాలెంజి చేసి వొదిలెయ్యటం - ప్రపంచ సాహిత్యంలో ప్రతిభ గల రచయితలు చేసిన అన్ని ప్రక్రియల్నీ "కాదంబరి" అనే ఈ ఒక్క కధలోనే ఇమిడ్చాడు బాణభట్టు, పాశ్చాత్యులు పొగిడారంటే పొగడరా మరి!ఇంగ్లీషులో "యూఫెమిజం" అనే మాట యెప్పుడయినా విన్నారా?అది క్రీ.శ 16లో జాన్ లిల్లీ అనే రచయిత చేసిన హాస్య రచన "Euphues" నుంచి పుట్టిన పదం.కానీ బాణుడు "కాదంబరి"ని అంతకు చాలాకాలం ముందే ఒక విశేషణంగా మార్చేశాడు!

    సంస్కృత సాహిత్యంలో గద్యకవులు చాలా చాలా తక్కువ - "స్వప్న వాసవదత్తం" రచయిత సుబంధు,"హర్షచరిత్ర" మరియు "కాదంబరి"ని రచించిన బాణుడు,"దశకుమార చరిత్ర" రచయిత దండి!ప్రతిభలో యెవ్వరూ తక్కువవాళ్ళు కాకపోయినా కాదంబరి వల్ల బాణభట్టు వీళ్లందరిలోనూ ప్రధముడిగా నిలిచాడు!

       కధ ఇట్లా వుంటుంది - లక్ష్మీదేవికి శ్వేతకేతువు అనే మునికీ నయనరతి వల్ల పుండరీకుడు అనే కొడుకు పుడతాడు.తండ్రి దగ్గిర పెరుగుతూ బ్రహ్మచర్యంలో విద్య నేర్వాల్సిన వయసులో మహాశ్వేత అనే అప్సర కాంతతో ప్రేమలో పతాడు!బలహీన మనస్కుడైన వీడు ప్రేయసిని ఇప్పటికిప్పుడు చూడాలని కబురు పెట్టి తను వొచ్చేవరకూ కూడా విరహానికి ఆగలేక వెన్నెల కురిపిస్తూ తన విరహాన్ని అంతగా పెంచిన చంద్రుణ్ణి "నాలాగే జన్మ నుంచి జన్మకి ప్రియురాలి విరహంతో మరణించుదువు గాక!" అని శపించి ప్రాణాలు విడుస్తాడు?చంద్రుడికి తిక్కరేగి "నాతోపాటూ నువ్వూ అట్లాగే అఘోరిస్తావు!" అని ప్రతిశాపమిచ్చి దానివల్ల తన లోకానికి సంబంధించిన మహాశ్వేత అనే అమ్మాయికి అన్యాయం జరుగుతుందని తెలిసి జన్మ నుంచి జన్మకి అనే మాటని బట్టి శాపాన్ని రెండు జన్మలకి పరిమితం చేసి ఆ జన్మలు పూర్తయ్యాక ప్రియసమాగమం జరిగే విధంగా శాపఫలితాన్ని మార్చి కధని ముందుకు తీసుకెళ్ళటం కోసం తను చంద్రాపీడుడనే రాజుగారబ్బాయిగా పుడతాడు.పుండరీకుడు వైశంపాయనుడనే పేరుతో మంత్రిగారబ్బాయిగా పుట్టి అతనికి స్నేహితుడిగా వుంటాడు.ఒకసారి అన్ని జానపద కధల్లోలాగే రాజుగారబ్బాయి దారితప్పి ఒక శివాలయంలో గంధర్వగానం విని కాదంబరిని కలుస్తాడు.ఇక్కడ కాదంబరి గురించి బాణుడు వర్ణించిన భాగం చదువుతుంటే మా బంగారమే గుర్తొచ్చింది, అంత చక్కని మనిషికి పొట్టిబుడంకాయని నేను దొరికాను - యేమిటో పాపం!తను తన స్నేహితురాలికి ప్రియవియోగ దుఃఖాన్ని తప్పించడానికి ఇక్కడి మూర్తికి సంగీతార్చన చేస్తున్నానని చెప్పటం,ఇతనూ మర్యాదస్తుడే నని ఆమె తెలుసుకోవటం, ఆమె వెంట వాళ్ల లోకం వెళ్ళి ఆమె తల్లిదండ్రుల్ని,మహాశ్వేతని చూడటం లాంటి కధ కొంత నడిచాక వాళ్ళిద్దరి మధ్యా ప్రేమ కూడా పుడుతుంది!ఈ లోపు వైశంపాయనుడు కూడా వీళ్ళని కలిసి మహాశ్వేతని చూసి ఈ జన్మలో కూడా ప్రేమిస్తాడు.ఫలితంగా శాపప్రభావం వల్ల ఈ మగవాళ్ళిద్దరూ అప్పుడు మరణించి చంద్రాపీడుడు శూద్రకునే పేరుతో జన్మించి రాజుగా రాజ్యమేలుతూ ఉంటాడు.వైశంపాయనుడిగా ఉన్న పుంరీకుదు మధ్యలో చంద్రాయుధం అనే గుర్రంగా  మారి తన స్నేహితుడికే వాహనంగా మారి తర్వాత ఆ జన్మ అంతమై చిలుకగా పుడతాడు.ఈ చిలుక తండ్రిని పోగొట్టుకుని రెక్కలు కూడా మొలవని నిస్సహాయ స్థితిలో ఉన్న దశలో జాబాలి అనే ఋషి సాకి స్వస్థత కూర్చి "నీ మితిమీరిన ప్రణయమూ వాచాలత్వమే నిన్నీ స్థితికి తీసుకొచ్చింది" అని తిడుతూ పాత కధనంతా విప్పి చెప్తాడు.అప్పుడు మళ్ళీ లక్ష్మీదేవి శబరకాంతగా రూపం మార్చుకుని ఈ చిలుకని ఒక పంజరంలో పెట్టి తీసుకెళ్ళి శూద్రక మహారాజు ముందు పెడుతుంది!జాబాలి చెప్పినప్పుడు కూడా విని గుర్తుంచుకోవడమే తప్ప తనకి సొంతంగా గుర్తు రాని వైశంపాయనుడనే చిలుకకి స్నేహితుణ్ణి చూగానే కధ మొత్తం తనకే గుర్తుకొస్తుంది!కధ అంతా విన్నాక శూద్రకుడికీ గుర్తుకొస్తుంది!పరిష్కారం అప్పటి జన్మల్ని వొదిలెయ్యటం!అట్లా చెయ్యగానే పుంరీకుడూ చంద్రాపీడుడూ తమ రూపాల్ని పొంది యెవరి ప్రేయసిని వారు పెళ్లి చేసుకోవదంతో కధ సుఖాంత మవుతుంది!

          నేను తెలుగులో ఈ కధని చదివింది పేరాల భరతశర్మ అనే ఆయన పీ.హెచ్.డీ కోసం రాసిన సిధ్ధాంత వ్యాసం లో నుంచి!తెలుగు సాహిత్యంలో చీపుళ్ల గురించీ పేడతట్టల గురంచే కాక ఇట్లాంటి మంచివాటి గురించి కూడా అప్పుడప్పుడూ పరిశోధనలు చేస్తూ వుంటారని అప్పుడే తెలిసింది నాకు!సిధ్ధాంత వ్యాసం అంటే బోల్డు విశ్లేషణలు చెయ్యాలి ఒక వాదం మొదలెట్టి దానికి యెన్నో నిరూపణలు చూపించాలి అనుకుంటే మాత్రం ఆ పేరుతో ఆయన పీకిందేమీ లేదు గానీ కధలో కొంచెం అదోమాదిరిగా వుండే పాత్రకి లక్ష్మీదేవినే యెందుకు తీసుకున్నాడు బాణుడు అనే పాయింటుని మాత్రం చక్కగా విశ్లేషించాడు!ద్రౌపదీమానసంరక్షణం సన్నివేశానికే ధర్మరాజు ద్రౌపదిని రేప్ చేసుకోవటానికి దుశ్శాసనుడికి పర్మిషన్ ఇచ్చేశాడు అని వాగే చిత్తకార్తె కుక్కలు వున్న ఈ కాలంలో ఆ విశ్లేషణ చాలా అవసరమే గానీ చాలాకాలం క్రితం చదవటంతో గుర్తు రావడం లేదు.నా సొంత విశ్లేషణ యేమిటంటే ఈ కధ మొత్తం చంద్రుడి చుట్టూ తిరుగుతుంది!కాదంబరి తల్లిదండ్రుల్ని ఒక జీవితకాలం పాటు ప్రేమగా గడిపిన వాళ్ళు  వార్ధక్యంలో యెట్లా వుంటారో చూపిస్తాడు!ఆ విధంగా ఈ జంటలలో "మిల్స్ అండ్ బూన్" కధల్లో చూపించినట్టు మూడు ముద్దులూ ఆరు సంభోగ దృశ్యాలూ కాకుండా ఆయా వ్యక్తుల మధ్య వుండే అనుబంధాలకి విలువ ఇస్తాడు గనక అక్క లోపించింది సోదర సోదరీ బంధం మాత్రమే గనక లక్ష్మీదేవిని కధలోకి తీసుకురావడం జరిగి ఉండొచ్చు!ఈయన ఓపిగ్గా చేసిందల్లా "కాదంబరీ లోచనానందా చంద్రా!" లాంటి భాషతో బాణబట్టు రాసింది రాసినట్టు తెలుగులోకి అనువదించటమే!

       అంత గొప్ప కధలో కధానాయకి అయిన కాదంబరి అనే అమ్మాయి చంద్రాపీడుడనే అబ్బాయికి తనకి అతనంటే ప్రేమ పుట్టిన తొలినాళ్లలో తన మనస్సులో కొత్తగా పొటమరిస్తున్న భావాల్ని చెప్పుకుంటూ ఒక వుత్తరం రాస్తుంది! అంతా చదివాక మీరొప్పుకుంటారో లేదో గానీ నా అభిప్రాయం మాత్రం ఒకటే - ప్రపంచంలో వున్న ప్రేమలేఖా సాహిత్యం అంతా వాస్తవ వ్యక్తులు రాసినవి,కానీ ఆ కండిషన్ తీసేసి దీన్ని కూడా వాటిలో చేరిస్తే మొదటి బహుమతి మాత్రం దీనికే ఇవ్వాలి న్యాయంగా!ఇంతవరకూ నా పోష్టుల్ని చాలా ఓపిగ్గా నిదానంగా చదివిన వాళ్ళు కూడా "ముందు టపా టైటిలుకి న్యాయం చెయ్యవయ్యా మహప్రభో! టెన్షన్ ఆగట్లేదు - ఆ ఉత్తరమేదో చూపించు?" అని తిట్టుకుంటున్నారని నాకు తెలుసు, ఇదిగో చదవండి."గొప్పదగు నీ ప్రేమను నేనెరుగుదును.మిగుల మృదువైన దిరిసెన పువ్వువలె మెత్తని స్వభావము గల స్త్రీజనమునకు ఇంతమాత్రము ప్రాగల్భ్యము ఎట్లు కలుగును? అందును బాల్యముననున్న కుమారికల కెట్లు కలుగును?ఏ యింతులు తామై భర్తలకు సందేశము నంపుదురో, భర్తల వద్దకు తెగించి వెళ్ళుదురో అట్టివారు సాహసకారిణు లగుదురు.అయినను సాహసించి పంపుచున్న నేను మిక్కిలి సిగ్గిలుచున్నాను.ఇంతకు యేమని వార్త నంపుట? నీవు నాకు అతి ప్రియుడవు అనినచో పునరుక్తి దోషము.నీకు నేను ప్రియురాలను అను మాట వివేకహీనము.నీయందు నాకు గొప్ప అనురాగము కలదు అనిన అవి వేశ్య పలుకులగును. నిన్ను విడచి బ్రతుకజాలను అనినచో అనుభవ విరుధ్ధమగు మాట యగును. మన్మధుడు నన్ను పరాభవించుచున్నాడు అనినచో అది నా దోషము బయటపెట్టుకొనిన తెలివితక్కువ యగును. అదికాదు,మన్మధుడు నీకు నన్ను ఇచ్చివేసినాడు అనినచో నీకు దగ్గిరవుటకు పన్నిన పన్నుగడ యగును. బలాత్కారముగ హరింపవలసినవాడవు అనినచో నది కులట యొక్క పొగరు అగును.అవశ్యము రావలెను అనినచో సౌభాగ్యము వలన గల్గు అహంకార మగును. నా యంత నేనే వచ్చుచున్నాను అనినచో స్త్రీ చాపల్య మగును.ఈ నీ దాసి నీ యందే దక్క ఇతరులందు అనురాగము లేనిది అనినచో మనసునందలి భక్తిని వెల్లడించుకొను తేలికతన మగును. నిరాకరింతువేమో యను సందేహముచే వార్త నంపలేదు అనినచో నిరాకరించుట యెఱుగని వానికి నిరాదరణ నేర్పినట్లగును. నన్ననుసరించి జీవించువారు నాకై దుఃఖింతురేమో యని యెంచనట్టి కఠినురాలను అనుట అత్యంత ప్రణయ ప్రకటన మగును. నా మరణముచే నీయందు నాకెంత ప్రేమ గలదో తెలిసికొనగలవు అందునా?మరణము నాపట్ల ఊహించరానిది.కావున ఏమని వార్త నంపుట?" ఈ చివరి వాక్యం కాదంబరికే కాదు బాణభట్టుకి కూడా వర్తిస్తుంది ఆ భాగం రాయగానే బాణభట్టు భౌతికంగా అస్తమించినా కాదంబరి కావ్యం వల్ల చిరంజీవిగా ఉన్నాడు గాబట్టి?


(కధ ఇంతటితో ఐపోలేదు,ఇంకా వుంది)

ఏడుపు గురించి కూడా యాడవాల్సింది చాలా ఉందండోయ్!

పాపం చెట్లకి ఏడుపు రాదు . వాటికి ఏడుపు రాకపోవటమే మంచిదైంది . చెట్లకి కాక మిగిలిన అన్ని జంతువుల ఏడుపులకే ఇంత విసుగొస్తుంటే వాటి...