Wednesday, 18 November 2015

ప్రపంచం మొత్తాన్ని ఉగ్రవాదం పడగ నీడలో బిక్కుబిక్కుమనేటట్టు చేసిన ఈ అధమాధముణ్ణి యేం చేస్తే పాపముంటుంది?

     43 యేళ్ళ వయస్సులో లేబర్ పార్టీ తరపున ప్రధానమంత్రి అయ్యి 1997 న్నుచి 2007 వరకు ప్రధానమంత్రిగా ఉన్న ఈ టోనీ బ్లెయిర్ తొలి ఆరేళ్ళ లోనే మొత్తం అయిదుసార్లు బ్రిటిషు సైన్యాన్ని యుధ్ధానికి నడిపించిన వాడు - గొప్ప శాంతికాముకుడట?మొదటిసారి 1998లో మళ్ళీ 2003లో ఇరాక్ మీద,1999లో కొసోవో యుధ్ధం,2000లో సియెర్రా లియోన్ యుధ్ధం,2001లో ఆఫ్ఘనిస్థాన్ యుధ్ధం - అన్ని యుధ్ధాలూ శాంతిని స్థాపించడానికేనట!
     సొలోవో యుధ్ధాన్ని వీడు నైతీకత ప్రాతిపదికన మొదలుపెట్టినా క్రూరమైన వైమానిక దాడులతో అది కాస్తా నేతిబీరకాయలోని నెయ్యిగా తేలిపోయింది.అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ అన్యమనస్కంగానే అంగీకరించినా వీడు మాత్రం మహోత్సాహంతో బ్రిటిషు సైన్యాన్ని పూర్తిగా మోహరించి వీరోచితంగా యుధ్ధం చేయించాడు.మిగిలిన యుధ్ధాల సంగతి యెలా ఉన్నా వీడు అత్యుత్సాహంతో ఇతర్లని కూడా రెచ్చగొట్టి జీవితలక్ష్యం వలె సాగించిన ఇరాక్ యుధ్ధం మాత్రం ఈ అధమాధముడి నీచత్వం సమర్ధించుకోవడానికి వీలు లేనంతటిదని కొద్దిరోజుల్లో బయటపడే చిల్కాట్ రిపోర్టు బట్టబయలు చేస్తుంది.ఒక పెద్ద బృందాన్ని తయారు చేసి కొన్ని సంవత్సరాల పాటు సద్దాం హుస్సేన్ ప్రపంచం మొత్తానికే ప్రమాదకారి అని నమ్మటానికి కావలసిన సమాచారం గుదిగుచ్చి దాన్ని అమెరికా అధ్యక్షుడు నమ్మేటట్టు వూదరగొట్టి అతని సాయంతో ప్రపంచంలో శాంతిని స్థాపించటానికి ఏర్పడిన ఐక్యరాజ్యసమితిని కూడా యుధ్ధానికి ఆమోదం తెలుపుతూ సంతకం చేసేవరకూ ప్రశాంతంగా ఉండనివ్వకుండా దాని సభ్యదేశాల్ని కూడా బలవంతంగా ఇరాక్ మీద యుధ్ధానికి నడిపించిన దుర్మార్గం వీడిది!

     ఒకనాడు నూతన భావాలకు తెరచాప లెత్తి శాస్త్రీయ దృక్పధంతో ఆలోచించిన మేధావుల కృషి ఫలితంగా తమ దేశంలో జరిగిన పారిశ్రామిక విప్లవంతో అక్కడివాళ్ళకి ఆ చిన్నదేశం ఇరుకైపోయి ప్రపంచమంతటా వ్యాపించి యెక్కడికెళితే అక్కడ స్థానిక సంస్కృతుల్ని చిన్నాభిన్నం చేసి తమ సంస్కృతిని రుద్దేస్తూ వాటిని వలసలుగా భావించి అక్కడి ప్రజల శ్రమని పిండుకుని తింటూ తమది రవి అస్తమించని సామ్రాజ్యమని గొప్పలు చెప్పుకుని కాలవశాన యెక్కడి జనం అక్కడ నుంచి చీకొట్టి తరిమితే వలసలన్నీ మాయమైపోయి తమ సామ్రాజ్యంలో రవి యెక్కడ ఉదయిస్తున్నాడో తెలియని స్థితికి చేరుకుని కూడా తమ అహంకారాన్ని మాత్రం వొదులుకోలేదు,యెందుకని?వారి వలసల్లో అతి ముఖ్యమైన దక్షిణాఫ్రికా,భారత్ అనే రెండు దేశాల్లోనూ మోహనదాసు ప్రచారం చేసిన "మీ పారతంత్ర్యానికి ఆంగ్లేయులు కారణం కాదు,మీలోని దోషాలే - కాబట్టి వారి మీద క్రూరంగా తిరగబడి తరిమెయ్యకుండా తెలివిగా రాసే మహజర్ల తోనూ గుండ్రబల్ల ముచ్చట్లతోనే పనులు జరిపించుకోవచ్చు,మీరు వాళ్ళతో ఆయుధాలు చేపట్టి పోరాడి ప్రాణాలు పోగొట్టుకోనఖ్ఖర్లేకుండానే మీకు కావలసినవి సాధించుకోగలుగుతారు,నన్ను నమ్మండి,నేను చెప్పింది చెప్పినట్టు యెందుకని అడక్కుండా చెయ్యండి,రెండేళ్ళలో మీకు స్వాతంత్రాన్ని సాధించిపెడతా!" అనే తింగరి సిధ్ధాంతం చెప్పి నమ్మిస్తే ఇతడు నిజంగానే చెప్పింది చెయ్యగలడని నమ్మి వీళ్ళని ఇంటికొచ్చిన చుట్టాలని చీరెసారెలతో సాగనంపినట్టు మర్యాదగా పంపించటం జాత్యహంకారంతో కళ్ళు పొరలు గమ్మిన వాళ్ళకి ఆయా దేశాల్లో తాము చేసిన దుర్మార్గాల పట్ల కనీసపు పశ్చాత్తాపం కూడా లేకుండా చేసిందా!

     ఒకనాడు భారతీయులూ ప్రపంచదేశాల మార్కెట్లలో వీరవిహారం చేశారు.వీరు పరదేశంలో అడుగుపెట్టేనాటికి స్వదేశంలో సంస్కృతిపరంగా అత్యున్నత శిఖరాల్ని అధిరోహించారు,అయినా సరే యెదుటివారి మర్యాదను కాపాడుతూ తమ మర్యాదని కాపాడుకుని గౌరవాభిమానాల్ని ఇచ్చిపుచ్చుకున్నారే తప్ప ఈ పెత్తందారుల వలె తాము వ్యాపించటం కోసం ఇతర్లని వలసప్రజలుగా చేసుకోవాలని అనుకోలేదు - మర్యాదాపురుషోత్తములు!ఒకే విధమయిన పరిస్థితుల్లోకి ప్రవేశించినా ఒకరు గొప్పగా ప్రవర్తించారు,ఒకరు చెత్తగా ప్రవర్తించారు - అయినా చెత్తగా ప్రవర్తించినవాళ్ళు పోటుగాళ్ళమని ఇప్పటికీ విర్రవీగుతున్నారు!తమ సరుకుల్లోని నాణ్యతను చూపించి మార్కెట్లని కొల్లగొట్టారే గానీ రాజుల్ని వశపర్చుకుని సుంకాల్లో ఇతర్ల కన్నా యెక్కువ శాతం రాయితీలు పొంది, రాజ్యాల్ని కబళించి ముడిసరుకుల్ని తక్కువధరకి కొట్టేసి,తమ సరుకుల్ని ప్రజల చేత బలవంతంగా కొనిపించే రకపు దిక్కుమాలిన వ్యాపారం చెయ్యలేదు.ఖండాంతరాలలో మనం మ్లేచ్చులూ యవనులూ అనుకునేవారిలో ఉన్న ఋషులకి కూడా నిండుమనస్సుతో నమస్కరిస్తున్నాను అన్న కృష్ణద్వైపాయనుని వినయంలో ఉంది విశ్వగురువులని ప్రపంచమంతా కీర్తిస్తున్నా ప్రతివారినుంచీ యెంతోకొంత నేర్చుకోదగినది ఉందని తెలుసుకుని ఒదిగి ఉండే  భారతీయత!అంతటి ఔన్నత్యమే ఉంటే ఇంతటి దుర్మార్గం ఎందుకు చేస్తారు?

     ఇరాక్ మనకి మిత్రదేశం,అయినా మన దేశమూ మిత్రుడి మీదకే యుధ్ధానికి వెళ్ళాల్సిన దౌర్భాగ్యం పట్టింది!వాస్తవానికి ఆంగ్లేయుల దుర్నీతి ప్రకారం వారి ప్రోద్బలంతో ద్విజాతి సిధ్ధాంతం ప్రవచించుకుని రెచ్చిపోయి జాతీయత లేని భారతీయ కమ్యునిష్టులు ప్రోత్సహించటంతో జ్ఞాతికలహంతో పక్కలో బల్లెంలా ఆవిర్భవించిన పాకిస్తాను తప్ప మిగిలిన అన్ని ముస్లిం దేశాలూ మనదేశంతో సఖ్యంగానే ఉంటున్నాయి.ముఖ్యంగా ఇరాన్,ఇరాక్ వాటిలో అవి యెంత శత్రుత్వం ఉండి చెదురుమదురు గిల్లికజ్జాలతో సతమతమవుతున్నా భారత్ మాటని మన్నించి గొడవల్ని తగ్గించుకున్న సందర్భాలూ ఉన్నాయి.ఆ రెండు దేశాల్లో ఏ దేమూ ముస్లిం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిన చరిత్ర కూడా లేదు,ఇంకా గట్టిగా చెప్పాలంటే దూరంగానే ఉన్నాయని కూడా చెప్పవచ్చు.ఇరాక్ అధినేత చేసిన తప్పల్లా తన దేశంలోని ఆయిల్ నిక్షేపాల మీద పూర్తి అధికారం తనకే ఉండాలని కోరుకుని,తన ప్రజల సౌభాగ్యం కోసం వెచ్చించడం కోసం ఈ సామ్రాజ్యవాదులకి తక్కువధరకి అమ్మకపోవడమే!వీడు వండి వార్చిన క్రిమియుధ్ధాల కట్టుకధలు కూడా అబధ్ధాలని యుధ్ధం ముగిసిన వెంటనే సమస్త ప్రపంచానికీ స్పష్టంగా తెలిసిపోయింది.ఇరాకీ ప్రజల్లో సద్దాం హుస్సేన్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్నదనేది పూర్తి వాస్తవం కాదనీ,అది అగ్రరాజ్యాల పెంపుడు మీడియా జిగిబిగితో అల్లి ప్రచారం చేసిన కట్టుకధనీ అప్పట్లోనే అందరికీ తెలుసు.సద్దాం హుస్సేనును దించిన యేడాది కాలంలోనే అరవై శాతం ప్రజలు ఆయనకు అనుకూలంగా ఉన్నారని బీబీసీ ఒక సర్వేలో తేల్చి చెప్పింది.వచ్చే యేడాది ఆరంభంలో వెలుగు చూస్తుందని అంటున్న చిల్కాట్ నివేదిక వెలుగు చూసినాక కూడా ఇప్పటి మాదిరి నిబ్బరంగా ఉండగలడా ఈ యుధ్ధోన్మాది?!

     తా జెడ్డ కోతి వనమెల్లా చెరిచినట్టు వలస రాజ్యాలు పోవటంతో వైభవం నశించి ఇతర యోరోపు దేశాలతో యూరో డాలర్ పేరు చేప్పి హడావిడి చేసినా ఫలితం లేక తన యేడుపు తను యేడవాల్సింది పోయి ఒకనాటి యెత్తుగడల్ని సొంతంగా పాటించే దిక్కులేక అమెరికా పక్కన జేరి సిగ్గులేని తాతగారు బుధ్ధిలేని మనవడికి రంకు నేర్పినట్టు అమెరికానీ చెడగొట్టాడు.ఇదివరకే గ్రెనెడా మొదలుకొని లాటిన్ అమెరికా దేశాల్లో ముఖం వాయగొట్టుకుని కూర్చున్న అమెరికాని బలవంతంగా యుధ్ధంలోకి దించి ఆఖరికి అమెరికా ఆర్ధిక పరిస్థితినీ దిగజార్చాడు ఈ జాత్యహంకారి!ఆ ఒకే ఒక యుధ్దంతో నిండుకుండలా ఉన్న అమెరికా పరిస్థితి అప్పులకుప్పగా దిగజారింది!ఒక దేశపు అధినేతని,అదీ ప్రజల్లో పలుకుబడి గలిగిన సార్వభౌముణ్ణి అనాధలాగ నిలబెట్టి తన తాబేదారు జడ్జితో ఉరిశిక్ష వేయించిన ఘాతుకం హిట్లర్ కూడా చెయ్యలేదు,వీడు మాత్రమే చెయ్యగలిగాడు - ముఖం చూస్తే జేమ్సుబాండు గుణం చూస్తే దొంగ గాడ్దె?!

     ఇప్పుడేమైంది?చాలా సహజంగా ఈ రెండు క్రైస్తవ దేశాలూ కూడబలుక్కుని ముస్లిం దేశాల మీద పెత్తనం చేస్తున్నాయని ముద్ర పడిపోయింది,ప్రతి చర్యకూ ప్రతిచర్య ఉంటుందన్నట్టు అంతే సహజంగా ముస్లిం ఉగ్రవాదం బిన్ లాడెన్ రూపంలో విజృంభించింది.అసలే యుధ్ధం ఖర్చు తడిసి మోపెడయినా కోర్టులో గెలిచినవాడిలా కుములుతున్నా ఇంట్లో ఈగలమోతని తట్టుకుంటూ అమెరికా మరింత ఖర్చు చేసి అష్టకష్టాలూ పడి ఆ ఒక్కణ్ణీ మట్టుబెట్టి వూపిరి పీల్చుకునేలోగానే అయిసిస్ పేరుతో పదింతల బలంతో మరొక భూతం పైకి లేచింది - కోతిపుండును కెలకటం దేనికి?అది బ్రహ్మరాక్షసి అయ్యిందని వగచటం దేనికి!అమెరికా సైతాను దెబ్బకి బుధ్ధొచ్చి తన కాలిన తోకని ఆర్పుకుంటూ అఘోరిస్తుంటే ఆ సైతాను ఇప్పుడు ఫ్రాన్సు బుర్ర్రలో దూరి అమెరికా ఖాళీ చేసిన చోట్లలో తన సైన్యాల్ని మోహరించి పెత్తనం చెయ్యాలని చూస్తున్నది - ప్రపంచం ప్రశాంతంగా ఉంటే చూడలేని దరిద్రులకి కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టు అధికారం అందితే వాళ్ళు ఇట్లాగే ప్రవర్తిస్తారు, మొదట తుదముట్టించాల్సింది వీళ్ళనే!

     భద్రతా మండలిలో మన దేశానికి వీటో పవర్ ఉండి ఉంటే ఇరాక్ యుధ్ధాన్ని ఆపగలిగేవాళ్ళమేమో!కానీ మనకి ఇస్తామన్నప్పుడు ఎడ్వినా ప్రియుడు నాకు దేనికి నా దోస్తు చైనాకి ఇవ్వండన్నాడు - అదేమి తెలివో మరి?ఇప్పుడు మనం వీటో పవర్ కోసం అడుగుతుంటే ఆ చైనాయే మోకాలు అడ్డం పెడుతున్నది సమాధిలోని డింపట్ ఇంకాస్త కుళ్ళి చచ్చేలా!కమ్యునిష్టులకి మనుషులు మనుషుల్లాగ కనపడరు కాబోలు వాళ్ళ ఎజెండాని అమలుచెయ్యటానికి పనికొచ్చే మనిముట్ల లాగ తప్ప, అర్హత ఉందా లేదా అని కూడా చూడకుండా ఎమినెంట్ ప్రొఫెసర్లుగా అన్ని విశ్వవిద్యాలయాల్లో కుప్పలు తెప్పలుగా నింపేసి తమ ఎజెండాని అమలుపరిచినంతకాలం అభివృధ్ధి కాముకుడు,శాంతికాముకుడు అని పొగిడేసిన వాళ్ళు తమకిష్టమైన చైనాతో యుధ్ధం రాగానే ఇవ్వాళ మిగతావాళ్లని అవార్డులు తిరిగిచ్చేయమని రుబాబు చేసి అందరితోనూ కొండమంగళ్ళు చేసే గుండుగొరుగుడు పనులు చేయించారు గానీ ఆరోజున నెహ్రూ కూర్చోబెట్టిన తమ తమ ఉద్యోగాలకి రాజీనామాలు ఇచ్చి బయటికి రాకుండా కూర్చుని నెహ్రూ చేసిన తప్పుల వల్లనే అంత మంచి చైనాతో యుధ్ధం వచ్చిందని నెహ్రూనే తిట్టటం మొదలుపెట్టారు,పాపం సొంత మంత్రివర్గంలోని వారు వ్యతిరేకించినా ఎట్లాగో తట్టుకోగలిగాడు గానీ  తను ఎంతో గొప్పగా ప్రవచించిన పంచశీలలో ఒక శీలని వూడబీకిన చైనా క్రూరమైన మిత్రద్రోహాన్నీ ప్లేటు ఫిరాయించిన కమ్యునిష్టుల నిర్దాక్షిణ్యమైన తిట్లనీ మాత్రం భరించలేకపోయాడు - మనోవ్యధతో మంచం పట్టి కుళ్ళి కునారిల్లి హతమారిపోయాడు!

     నెహ్రూ తన పంచశీలని బుధ్ధుడి బోధనల నుంచి తీసుకున్నానని పైకి చెప్పినా చాణక్యుడి షాడ్గుణ్యంలోని అతి ముఖ్యమైన మొదటి సూత్రాన్ని యెగరగొట్టేసి మిగిలిన వాటికి వాక్య సముచ్చయంలో రూపం మార్చి చాణక్యుడి పేరు చెప్తే తనకి హిందూత్వం అంటగడతారని భయపడి బుధ్ధుడి పేరుతో చలామణిలోకి తెచ్చాడు.నిజానికి బుధ్ధుడు యజ్ఞయాగాదుల్లో మితిమీరిన జంతుహింసని ఆపి వ్యవసాయాన్నీ వాణిజ్యాన్నీ ప్రోత్సహించమని కొన్ని ఉదారవాదపు నీతిసూత్రాలు చెప్పడం తప్ప సమాజ స్వరూపాన్ని పూర్తిగా మార్చే విప్లవాత్మకమైన ప్రతిపాదనలు ఏమీ చెయ్యలేదు.పైగా చెప్పిన విషయం కూడా అంటీముట్టనట్టు చెప్పి వొదిలెయ్యటమే తప్ప గట్టిగా ఇది చేసి తీరాలని యెవ్వర్నీ శాసించలేదు.ఒకసారి మగధ మహామంత్రి వజ్జి రాజ్యం మీద దాడి చేసి ఆక్రమించుకుందామని ముందుగా బుధ్ధుడి వైపునుంచి సానుకూలత తెచ్చుకుంటే విమర్శలు తప్పుతాయి గదా అని బుధ్ధుడితో ప్రస్తావించాడు.దానికి సూటిగా మగధ మహామంత్రికి "వద్దు" అని చెప్పకుండా పక్కనే ఉన్న ఆనందుడనే శిష్యుడితో సంభాషిస్తున్నట్టు "ఆనందా!వజ్జి రాజ్య ప్రజలు వృధ్ధుల పట్ల గౌరవంగానే ఉంటున్నారు కదా?వారు ఐకమత్యంగానే ఉంటున్నారు కదా?అత్యున్నత మానవతా ధర్మాల్ని వదలకుండా పాటిస్తూనే ఉన్నారు గదా?" అని అనేకమైన ప్రశ్నల్ని సంధించి ఆనందుడి నుంచి అన్నిటికీ "అవును" అని సమాధానం రావడంతో "ఆ విధంగా వారు ఉన్నంతకాలం వారు నశించకుందురు గాక!" అని ముక్తాయించి వొదిలేశాడు - గట్టిగా తన మనసులోని మాటని చెప్తేనే దిక్కు లేకుండా పోతుంటే ఇట్లా సూక్తులు చదివితే యెవడు వింటాడు?అమాయకంగా ఆలోచించే మనబోటివాళ్ళకి బుధ్ధుడు వజ్జిరాజ్య ప్రజల్ని ఆశీర్వదిస్తున్నట్టు అర్ధమవుతుంది,కానీ రాజకీయ జీవి అయిన మగధ మహామంత్రికి వారిలో ఐకమత్యాన్ని చెడగొడితే ఫర్వాలేదు కదా అని వీలు దొరికి వజ్జి రాజ్యంలోకి తన మనిషిని పంపించి అంతపనీ చేశాడు!కొందరు బిష్పక్షపాతంగా చరిత్రని వ్యాఖ్యానించిన పండితుల పరిశీలన ప్రకారమే అప్పటి కాలంలో బుధ్ధుడు రాజ్యాధినేతల్ని గానీ ప్రజల్లోని మేధావుల్ని గానీ ఎక్కువగా ప్రభావితం చేయలేకపోయాడు.అలాంటి బుధ్ధుడు భారతదేశానికి ప్రేమతన్నుల హైందవేతర ముఖచిత్రాన్ని ఇవ్వడం కోసం ఆధునిక కాలంలో కొందరికి కీలుబొమ్మలా ఉపయోగపడుతున్నాడు - అసలు సారం యెవరికీ అఖ్ఖర్లేదు, పనికిరాదు కూడా!ఇవ్వాళ్టి రూపం చూస్తే హీనయాన, మహాయాన, తాంత్రికయానపు మిశ్రమ పరిజ్ఞానంతో అనుసరించేవారిని యుధ్ధాలకీ హింసకీ గూడా పురికొల్పుతూ శ్రీలంకలో వలె జాత్యహంకారుల్ని కూడా వెనకేసుకొస్తూ జాలి గొల్పుతున్నది!అద్దం ఇటు జరిపితే ఒక ఫలితం అటు జరిపితే ఒక ఫలితం అంటూ హడావిడి చేసే ఫెంగ్షుయ్ వాస్తుని కూడా చేర్చుకుని నవ్వులాటగా తయారయింది:-)

     చాణక్యుడి షాడ్గుణ్యంలో మొదటి హెచ్చరిక నీ పొరుగు దేశాన్ని ముందుగానే మిత్రదేశంగా యెన్నడూ భావించకు అనేది!రాజుని విజిగీషువు అన్నాడు,అంటే ఇవ్వాళ ఒక గ్రామమే అతని అధీనంలో ఉన్నా శక్తి కొద్దీ పరిక్రమించి ఒకనాటికి మొత్తం భూమండలాన్ని జయించే హక్కు ఉన్నది అని అర్ధం!అయితే అది ధర్మవిజయమే కావాలి అని గట్టిగా నొక్కి చెప్పాడు.అలాంటి విజిగీషువుని మధ్యలో ఉంచి మిత్రుడికి శత్రువు తనకూ శత్రువే అనీ శత్రువుకి మిత్రుడు కూడా తనకు శత్రువే అనీ చిలవలు పలవలుగా అల్లుతూ గొప్ప ప్రణాళికతో కూడిన మండల సిధ్ధాంతాన్ని ప్రతిపాదించాడు.పొరుగు రాజుల్లో యెవరయినా పూర్తిగా బలహీనపడినా లేదంటే అతిగా బలవంతుడైనా ఈ మండలం లోని సమతౌల్యం దెబ్బతింటుంది గాబట్టి బలహీనంగా ఉన్నవాళ్ళని ప్రోత్సహించి బలం పెంచుతూ బలవంతుల్ని నిగ్రహిస్తూ నిత్యజాగరూకతతో తనని తను కాపాడుకుంటూ ఉండాలని చెప్పాడు.శత్రువు నుంచి ప్రమాదం వస్తే తప్ప తనకు తనుగా యుధ్ధానికి ఎన్నడూ ఉరకలు వేయరాదని హెచ్చరించాడు,విజిగీషువు కాబట్టి వ్యాపించటం సరైనదే అయినా ఇప్పటి తన ప్రజల్ని కష్టపెడుతూ గెలిచాక కొత్తగా తన పాలనలోకి చేరిన ప్రజల్ని సంతోషపెట్టలేని యుధ్ధం వినాశనానికి దారితీస్తుంది గనక అది ఆత్మహత్యాసదృశం అని చెప్పాడు.

ఈ వాస్తవికతని వొదిలి ఆ స్వాప్నికతని నెత్తికెత్తుకున్నవాడు పండితుడట - ఖర్మ, ఖర్మ!
-----------------------------------------------------------------------------------------------------------------ఈ ప్రసంగం శాలివాహన శకం 1937 కార్తీక మాసము 28వ తేదీ గురువారము నాడు ప్రచురించబడినది.

1 comment:

  1. అమాయక ముస్లింలు బలైపోతున్నారు. ఈ పోటుగాళ్ళందరూ కలిసి ముస్లిం దేశాలకు ప్రజాస్వామ్యం సిద్ధించేలా చేస్తారట. వాళ్ళమానాన వాళ్ళని వదలరు, చమురుకోసం. వాళ్ళలో అతివాదభావాలు కలవాళ్ళు వుగ్రవాదులుగా మారి అస్మదీయులను తసమదీయులను పేల్చిపాడేస్తున్నారు. ఈ వుగ్రవాదులకి ఆయుధాలు సమకూర్చేది కూడా ఈ గొప్పదేశాలే! కంపరమెత్తేలా వుంటాయి యీ రాజకీయాలు.

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు