Tuesday 23 September 2014

చార్లీ చాప్లిన్ ట్రాంప్ - రాజ్ కపూర్ ఆవారా

          సాహిత్యంలో ఒక కవి గానీ రచయిత గానీ శ్రధ్ధగా ఒక పాత్ర స్వభావాన్ని స్పష్టంగా రూపు దిద్దితే ఆ పాత్ర ఆ రచన కన్నా ఇంకా చెప్పాలంటే ఆ రచయిత కన్నా ప్రముఖంగా చదువర్లకు అభిమాన పాత్ర మవుతుంది. గిరీశం, పార్వతీశం, గణపతి లాంటి పాత్రలు మన తెలుగు సాహిత్యంలో చాలా వున్నాయి. ఇప్పటి కుర్రాళ్లయినా సరే ఆ రచనల్ని చదివితే వాళ్ళు కూడా ఆ పాత్రల్ని నిజ జీవిత వ్యక్తులు గానే భ్రమ పడతారు. సాహిత్యంలో లాగే సినిమాల్లో కూడా ఇలాంటి పాత్రలు కొన్ని వున్నాయి. కానీ ప్రపంచ సినిమా చరిత్ర లోనే అలాంటి పాత్ర లన్నింటిలో విశేషంగా చెప్పదగిన ఒకే ఒక పాత్ర చార్లీ చాప్లిన్ సృష్టించిన ట్రాంప్.


  
         అతడు సృష్టించిన ముహూర్త బలమో యేమిటొ గానీ చూసే వాళ్లలో వున్న పిల్లల్నీ పెద్దల్నీ ఒక్కలాగే అలరిస్తూ సాటి కళాకారుల్ని కూడా దానికి నకళ్లని సృష్టించేటంతగా ప్రభావితం చేసింది! దీన్ని ప్రతీకాత్మక పాత్ర(prototype) అనవచ్చు. యెందుకంటే అన్ని సినిమాల్లోనూ ఒకే గెటప్తో కనబడినా చుట్టూ వున్న వాతావరణంలోనూ మిగిలిన పాత్రల్లోనూ మొత్తం కధలోనూ పూర్తి విభిన్నత వుంటుంది. అంటే ఇలాంటి మనిషి యెక్కడ వున్నా ఒకటేలే అనే వ్యాఖ్యాన ధోరణి అంతర్భూతంగా వుంటుంది. ఆ పాత్రకి నిర్ధిష్తమయిన చట్రం యేదీ లేకపోవడం వల్లనే కాబోలు చూసే వ్యక్తి  ఆ సన్నివేశంలో నేను వున్నా అలాగే ప్రవర్తిస్తానేమో అనే విధంగా స్పందించి తనకి ప్రీతిపాత్రం చేసుకోవడం సాధ్యపడింది?!



         వేషభాషలు ఒక్కలాగే వున్నా కధని బట్టి ప్రవర్తన మారుతుంది.ఒక సినిమాలో పారిశ్రామికాధిపతులు ప్రొడక్టివిటీ పెంచటానికి చేసే - లంచ్ టైముని తగ్గించటానికి తిండి తినిపించే యంత్రాన్ని వాడటం లాంటి - పిచ్చి పన్లకి బలవుతూ యంత్రాల్లో యంత్రం లాగా తిరుగుతూ పనిభారం యెక్కువయ్యి నట్టులాగా కనబడితే ఆదవాళ్ళ స్కర్టు బటన్ మీద కూడా రెంచీని వాడేటంతగా పిచ్చెక్కి పోయి పిచ్చాసుపత్రికి వెళ్ళే కార్మికుడి లాగా కనబడితే, మరొక సినిమాలో ముందు ఒక చిన్న పిల్లవాడితో అద్దాలు పగల గొట్టించి తర్వాత తీరిగ్గా తను వెళ్ళి అద్దాలు బాగు చేసే బతక నేర్చిన వాడిగా కనబడతాడు. ఒక దద్దమ్మని రకరకాల సన్నివేశాల్లో - వాడి పరిష్కార శక్తికి అతీతమయిన సమస్యల్లో ఇరికించి - నిలబెట్టి వాడు తన అతితెలివి/తెలివిలేమి తో వాటి నుంచి బయటపడే పధ్ధతుల నుంచి హాస్యాన్ని పుట్టించి ప్రపంచంలో వున్న దద్దమ్మల కందరికీ ఒక గౌరవనీయమయిన బ్రాండ్ గా ట్రాంప్ ని తీర్చిదిద్దాడు చాప్లిన్!

             అంత ప్రభావాన్ని చూపిస్తున్న ఈ ట్రాంప్ ని చూసి ఇలాంటి పాత్రల్ని సృష్టించాలని సాటి కళాకారులు కూడా వువ్విళ్ళూరడంతో ఆ పాత్రకి నకళ్ళుగా చాలా పాత్రలు వచ్చాయి.కానీ వాటిలో చాలామటుకు ఇమిటేషన్లుగా మిగిలి పోగా భారతీయ నటదర్శకుడైన రాజ్ కపూర్ సృష్టించిన ఆవారా పాత్ర ఒక్కటే ప్రత్యేకంగా వుండి గెలుపు గుర్రంలా నిలబడింది. దానికి కారణం కేవలం అనుకరించి సరిపెట్టుకోకుండా తన అవసరం యేమిటో తెలుసుకుని మార్పులు చేసి ఒరిజినాలిటీ చూపించటం! చాప్లిన్ పూర్తిగా హాస్యానికి పెద్దపీట వేసి స్లాప్ స్టిక్ కామిడీ కి మాత్రమే పరిమితం చేస్తే ప్రేమ, విషాదం లాంటి మిగతా ఫీలింగ్స్ కూడా చూపించి కొంత గంభీరంగా తయారు చేసాడు రాజ్ కపూర్ తన ఆవారాని. ఇక్కడా హాస్యం తప్పనిసరిగా వుంటుంది గానీ మీసాన్ని నార్మల్ గా వుంచటంతో  చిలిపితనం డోసు పెరిగి రొమాంటిక్ లుక్ కూడా వచ్చింది.


              అక్కడి లాగా ఇక్కడ కూడా ఒక్కో సినిమాలో ఒక్కో నేపధ్యం వున్నా పాత్ర తీరు తెన్నులు ఒక్కలాగే వున్నా పాత్ర మూడ్ మారుతుంది, అదీ ఇక్కడ ట్రాంప్ కన్నా ఆవారా లో వున్న తేడా! ఆవారా సినిమా  కధలోని పాత్రలో విషాదం వుంటుంది. పుట్టుకతో జడ్జి గారబ్బాయి, జడ్జి గారు తనని అన్యాయంగా శిక్షించాడనే కసితో యెత్తుకెళ్ళి జేబు దొంగగా ట్రయినింగు ఇస్తాడు జడ్జి ద్వారా జైలు కెళ్ళిన వాళ్లలో ఒకడు. చివర్న బోనులో నిలబడి న్యాయమూర్తి అయివుండి కూడా భార్యనీ కొడుకునీ నిర్లక్ష్యం తోనూ కఠినత్వం తోనూ అన్యాయం చెయ్యడాన్ని ప్రశ్నిస్తూ తను ఇచ్చిన స్పీచ్ నిజంగా అధ్భుతం! ఆ తర్వాత చాలా సినిమాల్లో చాలామంది హీరోలు కోర్టుహాలు స్పీచులు దంచేసినా ఆ స్థాయికి తూగలేక పోయాయి. చాప్లిన్ "గ్రేట్ దిక్టేటర్" లో "ఫైకి చూడు హన్నా" స్పీచితో సరితూగగలిగేటంత గొప్ప స్పీచ్ అది! అందులో తను వేసిన ప్రశ్న- "చిన్నప్పుడు మమ్మల్ని నిర్లక్ష్యం చేసి మేము నేరస్తులుగా తయారయ్యేలా మాకు అన్యాయం చేసి మళ్ళీ మమ్మల్ని బోనులో నిలబెట్టి శిక్షలు వేసి మీ తప్పులకి మమ్మల్ని బలి చేసి మీరు మాత్రం పెద్దమనుషులుగా చెలామణీ అవుతున్నారే, ఇది అన్యాయం కాదా?" అనే ప్రశ్న అక్కడి తండ్రికి కాదు మొత్తం సమాజానికి అని అర్ధమయితే రాజ్ కపూర్ పరిశీలనాశక్తి యెంత గొప్పదో తెలుస్తుంది.


              అదే శ్రీ 420 లో కోట్లకి పడగ లెత్తిన వాళ్ళు కూడా కాసిన్ని రూపాయి నోట్ల కోసం పిచ్చిగా పరుగులు పెట్టే దృశ్యాన్ని చూపించి నేను మామూలు 420 నయితే మీరు శ్రీ420లు అని దులిపేసే రెబెల్ లాగా కనిపిస్తాడు! ఆ క్లైమాక్సుని కొన్నేళ్ళ తర్వాత ఇట్స్ ఏ మ్యాడ్ మ్యాడ్ వరల్డ్ అనే సినిమాలో ఒక హాలీవుడ్ దైరెక్టర్ కాపీ కొట్టాడు?!ఒకసారి మన దేశం నుంచి రష్యా వెళ్ళిన వాళ్ళు కొందరు జాతీయ గీతం పాడమంటే "అవారా హూం" పాట పాడారు?రష్యా వాళ్ళు దాన్ని మన ప్రభుత్వానికి వూదారు! అది పెద్ద సంచలనం రేపింది అప్పట్లో?! రష్యా వాళ్లకి ఆ క్లూ తెలియడానికి కారణం వాళ్లంతా రాజ్ కపూర్ ఫాన్స్ అవ్వటమే! కొత్తగా శ్రామికవర్గనియంతృత్వం అనే ఆదర్సాన్ని నిక్కచ్చిగా పాటిస్తున్న వాళ్లకి రాజ్ కపూర్ సినిమాల్లో వుండే -  గానాబజానాల్తో హుషారుగా వుంటూనే సామాన్యుణ్ణి హీరోగా నిలబెట్టి అంతర్లీనంగా ఒక మెసేజిని ఇరికించడంలో వున్న - సామాజికస్పృహ తెగ నచ్చేయటం సహజమే కదా!

        బ్రహ్మ సృష్టికి దీటుగా మగవాడికి తన నెచ్చెలి యెలా వుంటే బాగుంటుందో తెలిసి సృజించగలిగిన సౌందర్యబ్రహ్మ రాజ్ కపూర్ కుంచె నుంచి జాలువారిన అత్యద్భుత సౌందర్యం - నర్గీస్! మిగతా వాళ్ళంతా అయితే అతివృష్టి లేకపోతె అనావృష్టి అన్నట్టు అసలు స్త్రీ సౌందర్యాన్ని పట్టించుకోకుండా దూరంగా వుండటమో లేదా అతిగా అందాల్ని ప్రదర్సనకు పెట్టేసి స్త్రీని ఆపిల్ పళ్ళూ జాంపళ్ళూ మంచాలూ కంచాలూ అని ఆహారపదార్ధం కింద మార్చెయ్యటమో చేశారు!

          శృంగారాన్ని సున్నితమయిన హాస్యంతో కలిపి లలితంగా చూపించటం రాజ్ కపూర్ కి తెలిసినంతగా మరొకరికి తెలియదు.పేద్ద గొప్పగా హీరోయినుకి ట్రీట్ గా టీ ఇప్పించబోయి ఆ అమ్మాయి దగ్గీరే ఒక పావలా అప్పు చెయ్యటం యెంత నైసుగా వుంటుందో - వేరే చెప్పాలా!  శ్రీ420లో వచ్చే ప్యార్ హువా ఇక్రార్ హువా పాట అయితే ఒక మార్మికసౌందర్యభరితమయిన అద్భుతమే, ఆనాటి అతి మామూలు వీధి చౌరంగీలేన్ అజరామరమైపోయింది ఈ పాటతో!

                 ఈ పాట మొదట్లో నర్గీస్ నచ్చిన వాడే అయినా తొలిసారి దగ్గిరగా వస్తుంటే సిగ్గరి అయిన ఒక మామూలు ఆదపిల్ల అనుభవించే తడబాటు నుంచీ గగుర్పాటు వరకూ యెంత సహజంగా చూపించిందో చూశారా?! అప్పటి కాలమే అంత కాబోలు! పరిస్థితి ఇప్పుడెలా వుందో తెలుసా? ఒక శనివారం నాకు హాఫ్ డే అవటంతో తనకి మూడింటికే స్కూల్ అయిపోతుందని తెలిసి ఈ బస్సుల్లో ఆటోల్లో యేమి తంటాలు పడుతుందిలే అని నేనే వాళ్ళ స్కూలు వరకూ వెళ్ళి బైక్ మీద తీసుకొస్తున్నా. అమ్మాయి లంతా మొహాలకి పల్లూ అడ్డం వేసుకోవటం చూసి, "యెండ కనుకుంటాను అమ్మాయి లంతా వుగ్రవాదుల్లా తయారయ్యారు" అని సర్దాగా కామెంట్ చేస్తే మా బంగారం, "లేదు లేదు, ఆ ముసుగుల కధ వేరే వుంది? తెలిసిన వాళ్ళు గుర్తు పట్టకుండా!" అనే సరికి మైండులో బాంబులు పేలినంత పనైంది?! అప్పటిదాకా ఒక్కముక్క తమిళం రాని నాకు తన్నుకుంటూ వొచ్చేసి, "అడాపావియా, యెన్నడా ఇదు కలికాలమా ఇరుక్క?!" అని వడివేలు మాదిరి గొణుక్కున్నా? అయ్యా, ఇవ్వాళ కొంచెం పెద్దదయిన ప్రతి టవున్లోనూ ఒక లవర్స్ పార్కు వుంటుంది! పోలీసులూ గట్రా యెట్సెట్రా వాళ్ళని డిస్టర్బ్ చెయ్యకుండా వుండేందుకు కొందరు పెద్దల అజమాయిషీలో దాని చుట్టూ పెద్దయెత్తున వ్యాపారం కూడా జరుగుతూ వుంటుంది!! చుండూరు కుర్రాళ్లని అంతగా రెచ్చగొట్టి అంతటి భయానకమయిన చావుకి కారకులయిన సినిమా రంగపు మాంసఖండాల విక్రేతలు వీళ్ళకి ముడిసరుకులు సప్లై చేస్తూ వుంటారు!!! ఆలోచించండి, అర్ధం చేసుకోండి, శలభాలు తమంతట తామే మాడిపోవటానికి సిధ్ధపడి వురక లేస్తుంటే కాల్చెయ్యటం సహజస్వభావమయిన అగ్నిజ్వాలలకి మొహమాటం యెందుకుంటుంది?



            నర్గీస్ దూరమయ్యాక ఇతని సినిమాల్లో విషాదం డోసు పెరిగింది.కధలు కూడా మరింత గంభీరమయినాయి. సాధారణంగా ఆ స్థాయి కళాకారుల్లో వుండే పసితనం తనే సృష్టించిన ఒక మహాద్భుత సౌందర్యాన్ని చూడగానే చకితుడై అది తనకే కావాలని కోరుకునేలా ప్రేరేపిస్తుంది! మోనాలిసాని సృష్టించిన డావిన్సీ దాన్ని యెవ్వరికీ ఇవ్వకుండా చచ్చేదాకా తన చెయ్యి దాటి పోనివ్వకుండా తన వెంట తిప్పుకున్నాడు! రాజ్ కపూర్ కి సెలెబ్రిటీగా వున్న స్టాటస్ కావాలంటే భార్యకి విడాకులు ఇచ్చి కోరుకున్న చిన్నదాన్ని దక్కించుకోవడానికి సహాయ పడి వుండేది. కాని అప్పటికే భార్య కృష్ణతో తనకున్న అనుబంధాన్ని తెంచుకోలేక వెనక్కి తగ్గాడు. అలా వెనక్కి తగ్గడం వల్లనే మనముందు అతను మరింత గౌరపప్రదంగా నిలబడ్డాడు! యెంతగా సర్ది చెప్పుకున్నా ఒకరి మీద మనకి ఇష్టం వుంటే వీలున్నంత వరకూ దగ్గరితనాన్ని ఆశిస్తాం కదా, ఆ బాధ వుండనే వుంటుంది! మేరా నాం జోకర్ ఇందుకు బలమయిన సాక్ష్యం! పేరుకి అది ఒక సర్కస్ బఫూను కధే గానీ అందులో చూపించిన దంతా తనలోని విషాదమే ననుకుంటున్నాను! చిన్నప్పటి టీచర్ నుంచీ ప్రేక్షకుల్లోని తన కిష్టమయిన వ్యక్తులంతా ఒక్కొక్కరూ ఒక్కొక్క కారణంతో దూర మవుతున్నా అ దుఃఖాన్నంతా భరించి జనాన్ని నవ్వించే పాత్రలో తన దుఃఖాన్నే కురిపించాడేమో?! అయినా సరే జీనా యహా మర్నా యహా అంటూ ఆశావాదాన్నే చూపించాడు! మళ్ళీ కూడదీసుకున్నాడు,మళ్ళీ మనోజ్ఞమయిన కలల్ని పేనటం మొదలెట్టాడు! ఈసారి కొత్తరకం కలలు! ఆవారాని పోలిన జోకర్ పాత్రతో ఆ వేషమూ దానితోపాటే ఆ లలితమయిన హాస్యమూ మాయమై పోయింది, అయితేనేం మరింత చిక్కని కధల్ని మరింత గొప్పగా వడ్డించాడు!

             సంగం లో దోస్త్ దోస్త్ నా రహా పాటని చూస్తున్నా వింటున్నా గుండె చిక్కబట్టేస్తుంది! తను యెంతగానో ఇష్టపడిన అమ్మాయి లావుగా వున్నాడనో నీకంత సీను లేదనో చిన్న చిన్న కారణాలతో తనని కాదని మరో స్నేహితుణ్ణే కోరుకుంటే తనలోని దుఃఖాన్ని తనలోనే దాచుకుని ఇద్దరూ స్నేహితులే కాబట్టి పైకి యేమీ అనకుండా వాళ్లకి బాగా ఆలోచిస్తే మాత్రమే తెలిసేలాగా తన బాధని వ్యక్తీకరించిన తీరు నాకు చాలా చాలా బాగా నచ్చింది! ఆడవాళ్ళ గొడవల్లో నేను ఇరుక్కోను గాబట్టి ఈ రకంగా కాదు గానీ  మరో రకంగా ఒక చిన్నప్పటి స్నేహితుడు నన్ను చాలా భయంకరంగా బాధ పెట్టాడు! ఈ పాట వింటున్నప్పుడు నా కోసమే రాశాడా అని ఒక సెంటిమెంటు కూడా నాకీ పాటతో యేర్పడి పోయింది! మనకో బాధ వుండి అది అలాగే మురిగి పోతూ వుంటే యెంతటి వాడికయినా చచ్చిపోవాలనేటంతగా నరకాన్ని చూపిస్తుంది. అదే నాలాంటి బాధనే మరొక మనిషి కూడా అనుభవిస్తున్నాడు అని తెలిస్తే, అది కూడా తను హీరోతో ఐడెంటిఫై అయిన ఒక సినిమాలో భాగమై కొన్ని కోట్లమంది చూసి తనలాగే ఫీలవుతున్నారని తెలిస్తే ఆ మనిషికి అప్పుడు చాలా రిలీఫ్ గా అనిపిస్తుంది, కదా?! నిజమయిన కళ అనేది అన్నం కలిపి ప్లేటులో పెట్టి ముద్దలు మింగించడం లాంటి పన్లు చెయ్యనక్కర్లేదు గానీ మనసు మూలల్లో పని చేసి అతన్ని కదిలించి ఆ మనిషికి జీవితం మీద ఆశని పుట్టిస్తే చాలునని వొప్పుకుంటే రాజ్ కపూర్ నూటికి తొంభై శాతం మార్కులు తెచ్చుకోగలిగిన నిజమయిన కళాకారుడు!

            ఆవారా సినిమాలో ఒక అద్భుతమయిన డ్రీం సీక్వెన్స్ వుంటుంది. హీరో జేబుదొంగ, హీరోయిన్  ఒక లాయరు, పైగా జడ్జి గారి మేనకోడలు! తన గురించి తెలియకుండా మ్యానేజ్ చేసి లైనేసినా యెప్పటికయినా నిజం తెలిస్తే - అనే భయాన్ని చూపిస్తూ అప్పటికీ ఇప్పటికీ మరెవ్వరూ అంతకన్నా గొప్పగా తియ్యలేరనిపించేటంత చాలా గొప్పగా తీశాడు. చాలాకాలం తర్వాత తమ్ముడు శశి కపూర్ "మళ్ళీ నువ్వయినా అంత గొప్ప డ్రీం సీక్వెన్స్ మరొకటి తియ్యలేవేమో" అంటే "ఆ శైలేంద్రా ఆ శంకర్ జైకిషన్లూ ఇప్పుడు వుంటే దాని బాబులాంటిది తియ్యగలను" అన్నాడట! యెంతయినా సింహం సింహమే, సింహంతో చాలెంజిలు చెయ్యగూడదు సుమా అనిపించింది!

             తన సినిమా లన్నింటిలోనూ వాస్తవానికి దగ్గిరగానే వుంటూ సమాజానికి పనికొచ్చే అంశాల్నే తీసుకుని ఆలోచనాత్మకమయిన సినిమాలే తీసినా ఆటపాటల తోనూ సౌందర్యం తోనూ అలంకరించటం వల్ల లైట్ గా తీసుకుని - సత్యజిత్ రే కూడా మనవాళ్ళ విమర్శల స్థాయి తక్కువ, నేనసలు పట్టించుకోను అని విసుక్కున్న - మన సినిమా విమర్సకులు వుత్త కమర్షియల్ డైరెక్టర్ గానే పొరబడ్డారు! జిస్ దేస్ మె గంగా బెహతీ హై లో బందిపోట్ల మధ్యన ఒక అమాయకుడు ఇరుక్కుని తన అమాయకత్వం తోనే వాళ్లని మార్చినట్టు చూపించాడు.సత్యం శివం సుందరంలో అందం అంటే చెంపల నున్నదనాన్నే చూడగూడదు - హృదయం,అనుబంధం లాంటివి కూడా ముఖ్యమే అనీ పరమసత్యాన్నీ చూపించాడు! అయినా మనవాళ్లకి ఇతను ఫార్ములా దర్శకుడి లాగానే కనిపించాడు?


               నాకు బాగా నచ్చిన రాం తేరి గంగా మైలీ లో అయితే ఒకటి కాదు చాలా అద్భుతాలు చేశాడు! మన తెలుగు సాహిత్యంలో రాఘవ పాండవీయం లాంటి ద్వర్ధి కావ్యాల్లో వుండే పైకి ఒక అర్ధం లోపల మరొక అర్ధం కనిపించే తమాషాని తెరమీద ఆవిష్కరించాడు! సినిమాల్లో ఈరకం టెక్నిక్ మరొకరు యెవ్వరూ ఇంత గొప్పగా వాడలేదు! నరేన్ అనే ఒక కుర్రాడు గంగోత్రి దగ్గిర గంగ అనే ఒక అమాయిని వరించి అక్కడే పెళ్ళి కూడా చేసుకుంటాడు,కానీ ఒక అర్జెంట్ పని వుండి మళ్ళీ వచ్చి తీసుకెళ్తానని చెప్పి వెళ్తాడు, కానీ వెంటనే రాడు? ఈ లోపు ఆ అమ్మాయి గర్భవతి అయ్యి తల్లి కూడా అవుతుంది. తప్పనిసరై ఇక తనే అతన్న్ని వెతుక్కుంటూ అతనున్న నగరానికి వెళ్తుంది?!శకుంతల కధ గుర్తు కొస్తుంది కదూ! ఈ మధ్యనే వచ్చిన విద్యాబాలన్ సినిమా కధ గూడా ఇలాగే వుందిగా, మూస కధే అనుకుంటున్నారా? అక్కణ్ణించే అసలు అద్భుతం మొదలవుతుంది! ఆ అమ్మాయి యెక్కడెక్కడ యెలాంటి సన్నివేశంలో నిలబడిందో యెవరేవరు ఆ అమ్మాయిని యే దృష్టితో చూశారు అనేదే సినిమాలోని విషయం! ఆ అమ్మాయి ఒక అమ్మాయి అని మర్చిపోతే ఈ పురుషాధిక్య సమాజం స్త్రీని యెక్కడెక్కడ యెలా నిలబేట్టి యేమి చేసిందో ప్రతీకాత్మకంగా చూపిస్తాడు! ఒకరి చెరలో వున్నా బ్రోతల్ హవుస్లో వున్నా ఆ అమ్మాయి ఒక్కలాగే వుంది, కానీ చూసే చూపుని బట్టి ఆ అమ్మాయి విలువ మారిపోయింది అనేది చూస్తున్న మనల్ని కూడా వెక్కిరిస్తున్నంత నిక్కచ్చిగా కధ నడిపిస్తాడు.

           హీరొయిన్ పాత్ర పేరు గంగ! హీరో పాత్ర పేరు నరేన్! సినిమా పేరులో వున్న రాం మనమనుకుంటున్న రాముడు కాదు? పేరులో వున్న అర్ధం రామకృష్ణ పరమహంస కొటేషన్ - "యెంతమంది పాపాల్ని కడిగినా గంగకి మలినం అంటదు" అనే దాన్ని తీసుకుని, చూశావా రామకృష్ణా, నీ గంగ కూడా మలిన మయింది అనే వేదన నిండిన వ్యంగ్యం?! వేదవ్యాసుడూ వాత్స్యాయనుడూ కూడా తప్పు పట్టలేని స్త్రీత్వంలోని పవిత్రతని ఆకాశంబు నందుండి శంభుని శిరంబందుడి శీతాద్రి సుశ్లోకంబయిన హిమాద్రి నుండి పవనాంధోలోకము వరకూ దిగజార్చి యెట్లా అపవిత్రతని అంటగట్టామో చూడగలిగిన వాడికి కళ్ళు చెదిరేటంత వైభవోపేతంగా చూపించాడు!


           ఈ సినిమాకి సంబంధించి అప్పట్లో మందాకిని తడిబట్టల సౌందర్యం ఒక పెద్ద సెన్సేషన్! సినిమా పత్రికల్లో సెంటరు స్ప్రెడ్డుగా అప్పటి కుర్రాళ్ళ మతులు పోగొట్టేసింది!! ఇంత దాకా అంత కళాత్మకంగా అన్నిట్నీ విడదీసి యెడం చేసి చూపించి ఇప్పుడు నేను మంచి బాలుణ్ణి అని పోజులు కొట్టినా మీరు నమ్మరు కాబట్టి నిజమే చెప్తున్నా - నేను ఆ సినిమా చూడ్దానికి వురక లేసిందీ ఆ సీను కోసమే :-)) తీరా సినిమా చూస్తుంటే సీను ఇలా వచ్చి అలా వెళ్ళిపోయి వుసూరు మనిపించింది? స్టిల్ ఫొటోలో వున్నంత కుదురుగా మూవీలో వుండదే! రాజ్ కపూర్ ఒక్క ఫ్రీజ్ షాటన్నా తగిలించి వుండగూడదా ఓ అయిదు నిముషాల సేపు?! ఇంకెవరన్నా తింగరి డైరెక్టర్ అయ్యుంటే అయిదు నిముషాలేం ఖర్మ, ఓ అరగంట నిలబెట్టేసే వాడు సీను నక్కడే! కానీ రాజ్ కపూర్ మంచివాడు గనక దానివలన సమాజంలో పుట్టే సంక్షోభాన్ని వూహించి, జనాభా పెరుగుదల వువ్వెత్తున యెగసి పడకుండా ఆపటం తన కర్తవ్యమని భావించి నిగ్రహంతో వ్యవహరించాడు! లేకపోయుంటే ఆయొక్క 1985 జులై నెల లోనే మన దేశ జనాభా పదింతలు పెరిగి వుండేది?!

           ఆంత ఇదిగా ఆ సీను కోసమే వెళ్ళినా బుధ్ధిమంతుడయిన తెలివైన కుర్రాణ్ణి గనక సినిమాలో రాజ్ కపూర్ చూపించిన మొదటి దృశ్యం లోనే లైటు వెలిగింది ఇది ఈ దేశపు సోషియో పొలిటికల్ కల్చర్ మీద సార్కాస్టిక్ రన్నింగ్ కామెంటరీ అని! ఒక మహానుభావుడు గంగని శుధ్ధి చెయ్యటం కోసం వుద్యమస్పూర్తితో అరిభీకరంగా వుపన్యాసం దంచుతూ వుంటాడు. అది వింటుంటే అసలు శుధ్ధి చెయ్యాల్సినంతగా మురికిని పట్టించటం దేనికి, ఇప్పుడు శుధ్ది చేసే పనుల్లో యెంత కొట్టేస్తాడు వీడు, యెన్ని రోజులకి మళ్ళీ ఈ శుధ్ధి కార్యక్రమం మొదలవుతుంది అనే ప్రశ్నలు యెన్నో వస్తాయి. ఆ టోపీని బట్టే యే పార్టీ వాడో ఈజీగా గుర్తు పట్టెయ్యొచ్చు?! అక్కణ్ణించి మొదలు పెట్టి సినిమాలో వచ్చే ప్రతి పాత్రా రాజ్ కపూర్ అనే ఒక సినిమా డైరెక్టర్ కల్పించిన పాత్రలా వుండకుండా సమాజంలో నుంచే తెర మీదకి నడిచి వచ్చి నేను ఇంతటి దగుల్బాజీ వెధవని చూడండి అని చూపించుకుంటున్నట్టు కదుల్తూ వుంటే ఇది కదా మంచి సినిమా అంటే అని గుర్తుపట్టి లీనమైపోయి చూశాను!

             సినిమా సుఖాంతమైపోయింది గాబట్టి అందరం హుషారుగానే బయటి కొచ్చేశాం! అలా నడుస్తూ వుంటే మా వాళ్ళిద్దరు సినిమాలో ఒక సీను గురించి తెగ పోట్టాడేసుకుంటున్నారు.సినిమాలో ఒక సీన్లో మందాకిని బిడ్డకి పాలిచ్చే సీను వుంది. రాజ్ కపూర్ దాన్ని జూం చేసి చూపించాడు. మా వాళ్లలో ఒకడికి ఆ సీను తెగ నచ్చేసి వూగి పోతుంటే రెండోవాడు తల్లి బిడ్దకి పాలిచ్చే దృశ్యాన్ని అట్లా చూడగూడదని వాణ్ణి క్రిటిసైజ్ చేస్తున్నాడు. రాజ్ కపూర్ చూపిస్తే చూడ్డంలో తప్పేంటి అని మొదటి వాడి కవుంటరు! కొంచెం దూరంగా నడుస్తుండటంతో మొదట్లో వీళ్ళ గోల అర్ధం కాలేదు, కొంచెం దగ్గిర కొచ్చాక సిట్యుయేషన్ అర్ధమయ్యి మొదటి ఫ్రెండుకి నేనొక ఫినిష్షింగ్ టచ్ ఇచ్చా, "రాజ్ కపూర్ పిచ్చోడై తియ్యలేదురా ఆ సీను అట్లా! నీలాంటి వాళ్ళతో పోట్లాడే రామారావుల్ని పెంచటానికే ఆ సీను అట్లా తీశాడు" అని?! దాంతో మావాడు సైలెంట్ అయిపోయాడు. వాడూ మంచి వాడే, కుర్రతనంలో వుండే తింగరి తనం అట్లా వుంటుంది?!

        ఇట్లాంటి వాణ్ణి పట్టుకుని తెలుగు సిన్మారంగం లోని ఒక మాంసఖండాల విక్రేతతో సమానం చేశారు మన తెలుగు వాళ్ళు! ఆ అధముడికి ఆంధ్రా రాజ్ కపూర్ అని బిరుదు నిచ్చారు? వాడు నిజంగా అధముడే!ఒక పెద్దమనిషి ఇంటికి వెళ్ళి ఆ ఇంటి యజమాని ముందే అతని తల్లి ఫొటోని చూసి ఇంత నల్లగా అసహ్యంగా వుందేమిటని కూశాడట! ఆ పెద్దమనిషి చెప్పు తీసేలోగా పారిపోయాడట! నాలుగు దబ్బు లొచ్చే సినిమాలు తీస్తున్నాడనే ఒక్క కారణం తప్ప యే గొప్పా లేని ఇట్లాంటి వాళ్ళకి యెంత మెహర్బానీలు చేస్తున్నారు?

           రాజ్ కపూర్ మంచి ఫిలాసఫీ వున్నవాడు! నాకు నచ్చిన వాడని డప్పాలు కొట్టటం కాదు, అతనొక మంచి మాట చెప్పాడు - నేను నా పర్సనల్ కలెక్షన్లో దాన్ని ఫ్రేం కట్టి మరీ అతికించుకున్నా! "ఆఫ్టరాల్, మనిషికి యేం కావాలి?  కడుపు నిండా తిండి,సుఖనిద్రా - ముఖ్యంగా ఇవ్వాళ కన్నా రేపు మరింత బాగుంటుందనే నమ్మకం!ఆ ఆశ చాలు ఆ మనిషిని యెన్ని కష్టాలయినా భరించి బతికి వుండేలా చేస్తుంది." - అన్నాడు. చాలా మామూలు నిజం, కానీ అది అతని అనుభవ సారం! ఆ ఆశ లేకపోబట్టే గదా అన్ని మంచి సినిమాల్లో నటించి అంతమంది అభిమానుల్ని సంపాదించుకుని గూడా వుదయ్ కిరణ్ లాంటి వాళ్ళు అమాయకంగా చచ్చిపోతున్నారు!

ఆశావాది యైన రాజ్ కపూర్ నిత్యబాలకుడు!

            సత్యజిత్ రే లాంటివాళ్ళు మేధావులకు మాత్రమే అర్ధమయ్యే సినిమాల్ని తీసి పండితుల్ని రంజింప జేస్తే,మన్ మోహన్ దేశాయ్ లాంటివాళ్ళు వినోదాన్ని మాత్రమే తీసుకుని పామరుల్ని రంజింప జేస్తే - ఆ రెంటినీ సమపాళ్లలో కోరుకునే నాలాంటి తింగరి వెధవల్ని కూడా సంతృప్తి పర్చగలిగిన సమర్ధుడు రాక్ కపూర్!
______________________________________________________
(ఫొటోలు గూగుల్ సౌజన్యం)

4 comments:

  1. హరిబాబు గారు,

    రాజ్ కపూర్ భారత దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకదాని తెల్సు గాని, మీరు వ్రాసిన వ్యాసం చూసిన తరువాత ఆయనంటే గౌరవం మరింత పెరిగింది.

    ReplyDelete
    Replies
    1. అవునండి!మన భారతీయ విమర్సకులు అతనికి చాలా అన్యాయం చేసారు అందరిలాంటి ఫార్ములా సినిమాల డైరెక్టర్ మాత్రమే అనుకుని.

      Delete
  2. రాజ్‌కపూర్ గురించి చాలా విషయాలు బాగా వ్రాసారు.
    రాం తేరి గంగా మైలీ పేరులో రాం అన్న మాటకి అర్థం దేవుడు అనే అనుకున్నాను ఇప్పటివరకు, ఎందుకంటే నార్త్‌లో దేవుడా అనడానికి రామ్‌జీ అనే అంటారు.
    ఆ దర్శకుడుని ఆంధ్రా రాజ్‌కపూర్ అని అంటారని నేను వినలేదు.

    ReplyDelete
    Replies
    1. మొదట్లో అందరూ పొరబడ్దారు,రాజ్ కపూర్ స్వయంగా ఇచ్చిన వివరణే అది!

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

హిందూ ధర్మాన్ని పాషండ మతంలా మార్చేస్తున్న త్రిదండి చిన జియ్యర్ అనే మూర్ఖుణ్ణి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలి.

శ్రీరామనవమి పేరు ఎత్తగానే ప్రతివారి మనసు పులకించి పోతుంది . కానీ భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణం లోని నామ , గోత్ర , ప్రవరలు వింటుంటే మనసు ఎంతో...