Tuesday 2 September 2014

ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని చీలికలు పేలికలు చేసి చిందర వందర చెయ్యాల్సిన దౌర్భాగ్యం దేనికి?

        ఒక రాష్ట్ర్రానికి గానీ దేశానికి గానీ రాజధాని ఒక ఇంటికి తల వాకిలి లాంటిది. అలాంటి దాని విషయంలో యెందుకింత బీద అరుపులు అరుస్తున్నారు? రాజధానిని వికేంద్రీకరించట మేమిటి నా బొంద? రాజధాని అంటే ఏమిటి? సెక్రటేరియట్, అసెంబ్లీ,హై కోర్టు ఇంకా రాష్ట్ర పరిధిలో వుందాల్సిన శాఖల ముఖ్య కార్యాలయాలు. వీట్ని తలో చోటా తగలేస్తే పరిపాలన యెలా వుంటుందో తెలుసా? ఇప్పటికీ డాక్యుమెంటేషన్ అంతా పేపర్ వర్క్ తోనే జరుగుతుంది కదా! ఒక ఫైలు ఒక శాఖ నుంచి మరో శాఖకి వెళ్ళాలంటే పొరుగూరు వెళ్ళాలా?

     ఇదివరలో జరిగింది ఒక వైపు నుంచే చూస్తే తప్పు జరిగినట్టుగానే అనిపిస్తుంది.ఇవ్వాళ గయ్యాళిగా మాట్లాడుతున్న తెలంగాణా కుమేధావుల మాటలు నమ్మితే నిజంగానే మనం సిగ్గుతో తల దించుకోవాలనే అనిపిస్తుంది!కానీ యేమంటున్నారు వాళ్ళు, మా వుద్యోగాల్ని దోచుకున్నారు - కావాలంటే గిర్గ్లానీ రిపోర్టు చూడ మన్నారు.చూశాను, ఒక పోష్టు గూడా వేశాను, యేముంది అందులో? అన్యాయం జరగడం అంటూ వుంటే అన్ని ప్రాంతాల వారికీ జరిగిందని ఖచ్చితంగా చెప్పాడు.మిగతా యే ప్రాంతాల వారికీ అన్యాయం జరక్కుండానో, లేదా మిగతా అన్ని ప్రాంతాల వారికీ విపరీతంగా లాభం చెకూరి వీళ్ళు ఒక్కరికే అన్యాయం జరిగితే కదా ఆ మాట అనాల్సింది?ఒక పత్రికా విలేఖరి మరీ సూటిగా యెవరు నష్ట పోయారు?యెవరు లాభ పడ్డారు అని అడిగితే "అభివృధ్ధి చెందిన ప్రాంతాలకి వెళ్ళగలిగిన వాళ్ళు బాగు పడ్డారు, వెళ్ళ లేని వాళ్ళు నష్ట పోయారు" - అని అంతకన్నా సూటిగా జవాబు చెప్పాడు. దాని భావ మేమిటో యే తిరుమలేశుణ్ణీ అడగనక్కర్లేదు కదా?చిన్న పిల్లవాడి నడిగినా చెప్తాడు, ఇంకా "అదేంటి?అయితే యెక్కడో వున్న కృష్ణా జిల్లాల వాళ్ళు అంత దూరంలో వున్న హైదరాబాదుకి వెళ్ళి బాగు పడగలిగినప్పుడు, పక్కనే వున్న వాళ్ళు కూడా వెళ్ళి బాగుపడితే బాగుండేది కదా? వెళ్ళగలిగితే బాగు పడతామని తెలిసినప్పుడు వెళ్ళి బాగు పడకుండా యాభయ్యేళ్ళు యేమి చెస్తున్నట్టు?" అని కూడా అడుగుతాడు!నా లాంటి తింగరోడు పక్కనే వుంటే , "బహుశా యాభయ్యేళ్ళయినా వందేళ్ళయినా ఆ ఆంధ్రోళ్ళని అక్కణ్ణించి తరిమి కొట్టాకే వెళ్ళి బాగు పడదాంలే అనుకుంటూ, యే మహానుభావుడు వచ్చి ఆ ఆంధ్రోళ్లని తరిమికొడతాడా అని జపతపాలు చేస్తూ కూర్చున్నారేమోలే" అని ఓ వంకర కూత కూస్తాడు!!

     విడిపోయిన ఇంత కాలం తర్వాత కూడా యెప్పుడో యేభయ్యేళ్ళ క్రితం నాటి కర్నూలు గుడారాల్ని యెత్తి చూపించి వెక్కిరించే వాళ్ళని అమాయకులని నమ్మడం వల్లా, వాళ్ళ తింగరి వాదనల్ని మొగ్గలోనే తుంచెయ్యని మన వెనకటి తరం నాయకుల అలసత్వం వల్లా ఇదంతా జరిగింది! అంతకు మించి అక్కడ అందరూ అనుకున్న భీభత్సాలు యేమీ జరగలేదు. పోనీ జరిగాయనే అనుకుందాం, ఇప్పటి పరిస్థితి యేమిటి? కలిసుండటం వల్లనే  మా కన్యాయం జరిగిందని విడిపోతే యే న్యాయం వెయ్యి కాంతులతో వికసిస్తుందని వాళ్ళు అంటున్నారో ఇవ్వాళ్టి తెలంగాణా ఆ నమ్మకాన్ని కలిగించే విధంగా వుందా?యెన్నికల్లో గెలిచి మంత్రివర్గంలో వున్నవాళ్ళలో గానీ అక్కడ పై స్థాయిలో చక్రం తిప్పుతున్న వాళ్ళలో గానీ ఆ నమ్మకాన్ని కలిగించే కొత్త ముఖాలు మీ కెక్కడయినా కనబడినాయా?కేసీఆర్ కుటుంబమూ, రెడ్లూ మరియూ వెలమలూ హవా హవాయీ అన్నట్టుగా వున్నారు! కోడి పోయి కత్తి వచ్చె డం డం డం అన్నట్టు ఆంధ్రా రెడ్లు పోయి తెలంగాణా రెడ్లు వచ్చె డం డం డం అనేట్టుగా వున్న ఈ కొత్త సీసాలో పాత సారా తంతు కోసమేనా అంతగా అంగ లార్చింది?

      సరే జరిగిందేదో జరిగింది, పరిదికి మించి గతాన్ని తవ్వుకోవడం వల్ల ప్రయోజన మేముంది?కానీ కొన్ని దారుణ మయిన మాటలు ఇప్పటికీ బాధ పెడుతున్నాయి!మనం తమిళుల నుంచి విడి పోతా మన్నప్పుడు మొదట్లో వ్యతిరేకించినా తర్వాత వాళ్ళు కూడా వొప్పుకుని కోరం సరిపోక పోతే వాళ్ళు కూడా మన వైపు వోటు వేసి సాయం చేస్తే తమిళులతో తన్నించుకుని వచ్చారు అని కూశారు!మద్రాసు నుంచి వెళ్ళ మనటం కూడా మంచిగానే అడిగారు, యెప్పటి కయినా వెళ్ళాల్సిందే గదా, వుంటే ఇంకా అనుబంధం పెంచుకున్నట్టు వుంటుందని, వుండటం వల్ల మొహమాటాలు పెరుగుతాయి, లేని పోని సమస్యలు వస్తాయి అని ప్రస్తావిస్తే మనం కూడా నిజమే లెమ్మని వచ్చెశాం. అయినా ఇప్పుడు ఈనాటి రోజున నీ ముందు లగడపాటీ మరొకడూ వుండి వుండవచ్చు - కానీ ఆనాటి సన్నివేశాన్ని తన్నించుకుని రావడం అంటే అప్పుడు అక్కడ వున్న ప్రకాశం పంతులూ పొట్టి శ్రీరాములూ వున్నారు కదా ఆ మాట వాళ్ళకేగా తగిలేది?!

         మనం తప్పు చెయ్యలేదు, సగర్వంగా తల యెత్తుకునే తిరుగుదాం. ఆంధ్రావాళ్ళు యెక్కడున్నా ముందు వరస లోనే వుంటారు. యెక్కడయినా సరే గొప్పగా వుండాలని అనుకుంటాం. వుంటాం. తెలంగాణా వాళ్ళు మాటిమాటికీ గుజరాతీల్ని కడుపులో బెట్టుకున్నాం, మార్వాడీల్ని కడుపులో బెట్టుకున్నాం, వాళ్లని కడుపులో బెట్తుకున్నాం వీళ్లని కడుపులో బెట్టుకున్నాం మీతోనే తంటా అని అంటున్నారే, ఆ మతలబు యేంటో తెలుసా? ఆ గుజరాతీలకి తెలంగాణా సొంత ఇల్లు కాదు, వాళ్ళ మూలాలు గుజరాత్ లో వున్నాయనేది వాళ్ళకీ వీళ్ళకీ గూడా తెలుసు, పుట్టుక నుంచీ పెళ్ళిళ్ళూ అన్నీ వాళ్ళళ్ళో వాళ్ళే చేసుకుంటారు, పండగ లొస్తే గుజరాతు లో వున్న చుట్టాల ఇంటికే వెళ్తారు, మన ప్రాంతంలో వున్న గుజరాతీల్లాగే - మనకి తెలియదా? మనం కూడా అలాగే తెలంగాణాలో పరాయి వాళ్ళుగా వుంటూ వాళ్ళకి వొదిగి వుంటే మనం మంచివాళ్ళం అయి వుండే వాళ్లమేమో? అది మనకి సరిపడనిది కదా! యెక్కడున్నా షరతులూ వొత్తిళ్ళూ మనకి గిట్టవు, స్వేచ్చగా ఒక యెకరం భూమిని కూడా కొనుక్కోకుండా స్వంతం అనే భావన లేని చోట బతకడాన్నే బానిస బతుకంటారు, వాళ్ళు పెద్ద మనుషుల వొప్పందం పేరుతో మనల్ని కూడా అలాగే వుంచాలనుకున్నారు! నేను చెప్తున్నానుగా, మనకి ఇక్కడ రాజధాని యేర్పడిన మరుక్షణం నుంచీ మెడ మీద తలకాయ వున్న ఆంధ్రా వాడెవ్వడూ తెలంగాణాలో వుండడు - వీళ్ళింకా కర్నూలు గుడారాల గురించి వంకర కూతలు కూస్తూ వుంటే, అది ఖాయం! వుండాలనుకున్నా మనం వుండనివ్వకూడదు, యెందుకంటే మన వాళ్ళు వాళ్ల ప్రభుత్వానికి పన్నులు కట్టటం ద్వారా మన ఆదాయాన్ని వాళ్లకి సమర్పిస్తున్నట్టు లెఖ్ఖ! మన వాళ్ళ విగ్రహాలనే టాంక్ బండ్ మీద భరించ లేని చోట మన మెందుకు వుండాలి? వున్నందు వల్ల వాళ్ళు మనకి మెచ్చి మేకతోలు కప్పబోతారా?

         కాబట్టి ఇప్పుదు మనం యెవరి సొల్లు కబుర్లకీ విలువ ఇవ్వనక్కర్లేదు, హైదరాబాదును తలదన్నే బలమయిన రాజధానిని కట్టుకోవాలి! రాజధాని మొత్తం తిరిగి చూస్తే చాలు రాష్ట్రమంతా తిరిగి చూసిన అనుభూతి కలగాలి!! సారవంతమయిన వ్యవసాయ భూములు వున్నాయి.పొడుగాటి సముద్ర తీరం వుంది, యెన్నో రేవు పట్నాలు వున్నాయి - మనం నంగిరి పింగిరిగా బతకాల్సిన పని లేదు!!

      మొత్తం 13 జిల్లాల లోని ప్రజ లందరికీ అభివృధ్ధి లో తప్పకుండా వాటా వుంటుంది.వుండక పోతే పోట్లాడి అయినా సాధించుకోవాలి. కానీ రాజధాని విషయంలో మాత్రం మా ప్రాంతంలో వుండాలంటే మా ప్రాంతంలో వుండాలనె మూర్ఖత్వాలకి పోకండి. అది చాలా తప్పు, రాజధాని అనేది యే వొక్క ప్రాంతం వారికో స్టాటస్ సింబల్ కాదు. మొత్తం రాష్ట్ర ప్రజ లందరికీ హక్కు వుంటుంది, వుండి తీరాలి - అలోచించండి! చెన్నయ్ నుంచి తన్నించుకుని వచ్చారు, మా హైదరాబాదుని లాక్కున్నారు అనే మాటలు పడ్డాం, దానికి జవాబు చెప్పాల్సిన సమయంలో మనం గందరగోళానికి గురి కావటం వల్ల నవ్వుల పాలవుతాం.

        దేని గురించి సందేహ పడాలి మనం?ఈ సుదీర్ఘమయిన విభజన అనే రాజ్యాంగ పరమయిన ప్రక్రియని మొదలు పెట్టిన  గత కేంద్ర ప్రభుత్వం మనకి వాగ్దానం చేసింది రాజధాని నిర్మాణం కోసం సహాయం చేస్తామని. ప్రభుత్వ మర్యాద ప్రకారం గత ప్రభుత్వం చేసిన వాగ్దనాన్ని ఇప్పటి ప్రభుత్వం కూడా పాటించి తీరాలి. ఒక వేళ యే తొండి రాజకీయాల వల్ల నయినా కేంద్ర సాయం అందకపోయినా మన సొంత బాధ్యతగా మనం రాజధానిని కూడా కట్టుకోలేని దుస్థితిలో వున్నామా?ఒకటి గుర్తుంచుకోండి ఇప్పటికీ దేశాల మధ్యన ఖండాల మధ్యన సరుకు రావాణా సముద్రం ద్వారానే జరుగుతున్నది. ఇన్నాళ్ళుగా మనం పాడుబడేసిన సముద్ర తీరాన్ని వుపయోగించుకుందాం. వాళ్ళు సింగపూరు వెళ్ళి పాఠాలు నేర్చుకునే టైములో మనం ఆ సింగపూరునే ఇక్కడ చూపిద్దాం. అది అసంభవ మేమీ కాదు, వీళ్ళంతా చూసి మురిసి ముక్క లవుతున్న అక్కడి లాండ్ స్కేప్ గొప్ప యేమిటి?ఆ సిమెంటు కట్టడాలూ, తారు రోడ్లూ ఇక్కడా కట్టగలం, అయినా వుభయ గోదావరి జిల్లాలలో కనిపించే సహజమయిన ప్రకృతి సౌందర్యంతో తొణికిస లాడే లాండ్ స్కేప్ తో పోల్చి చూడండి, అంతకన్నా గొప్ప దృశ్యాలనే చూపించగలం మనం!

       నాకు వ్యక్తిగతంగా చంద్రబాబు మీద యే విధమయిన అభిమానమూ లేదు.రామారావును పడగొట్టటం అనేది కిరాతకమయిన పనే, దానికి సంబంధించిన కోపం కూడా వుంది.అప్పట్లో నేను రామారావు హాజరయిన ఒక అవధాన కార్యక్రమాన్ని చూశాను.అందరూ అతన్ని గుర్తు పట్టే డ్రామా డయలాగులూ ఆంగికాభినయమూ యేదీ లేకుండా, "యేమో, యేమవుతామో,భవిష్యత్తు యెట్లా వుందబోతుందో, మన తర్వాత తరం వాళ్ళు ఈ సంస్కృతిని యెట్లా కాపాడుకుంటారో అని ఆందోళనగా వుంది" అని చాలా ఫీలవుతూ మాట్లాడాడు. ఆ మాట తీరు చూస్తేనే అంతకు ముందున్న డ్రమెటిజం పోయి ప్రాక్టికల్గా మారాడని అనిపించింది. అలాంటి టైములో పడగొట్టటం దారుణ మనిపించింది. తరవాత్తరవాత కాలం గడిచే కొద్దీ  సర్దుకున్నాను, కాంగ్రెసోళ్ళ పదేళ్ల నిర్వాకం చూశాక వీళ్ళ కన్నా చాలా మెరుగు కదా అనిపించి ఇంకొంచెం తగ్గింది. కానీ ఇప్పుడు ఈ యుగసంధిలో అతని నాయకత్వం మనకి తప్పని సరి.చంద్రబాబుకి ఈ రాష్ట్రానికి తను యేది చేసి చూపించాలన్నా ఇదే ఆఖరి అవకాశం. తనకీ తెలుసు ననుకుంటాను.విజన్7 ఇంకా సూపర్ సెవెన్ అనీ తను చెప్తున్న వాటిల్ల్లో మంచి ప్రాక్టికాలిటీ వుంది. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ అనేది కూడా మంచి ఆలొచనే. ఇవన్నీ మంచి ఫలితాల నిస్తే రేపటి రోజున యెలా బతకాలి అనేదానికి దేశానికే కాదు ప్రపంచానికే కొత్తదారులు చూపించగలం - తెలంగాణా వాళ్ళతో సహా! ఇలాంటి సమయంలో మనలో మనం చిన్న చిన్న విషయాలకి గొదవలు పడకుండా కలిసికట్టుగా కదలాలి.

      సచివాలయం, శాసన  సభ అనేవి కేవలం సిమెంటూ ఇటుకలూ కలిపి కట్టిన కట్టడాల లాగా వుండకుండా మన చరిత్రనీ సంస్కృతినీ ప్రతిబింబించే అంశాల్ని నిర్మాణంలో వుపయోగించుకోవాలి. వాస్తులో ఈశాన్యం నుయ్యి ఆగ్నేయం పొయ్యి అని మూఢనమ్మకాల్లా అనిపించేవి కాకుండా కొన్ని మంచి విషయాలు వున్నాయి. వుదాహరణకి కిటికీలూ తలుపులూ సరిసంఖ్యలో యెదురెదురుగా వుండాలనేది. అది గాలి ధారాళంగా ఇటు వైపు నుంచి అటు వైపుకి  ప్రవహించదానికి వుపయోగ పడుతుంది.యెంత వేసవి లో నైనా గాలి కదులుతూ వుంటే హాయిగానే వుంటుంది, గమనించారా? తుఫాన్లు వచ్చినప్పుడు కూడా తలుపు లన్నిట్నీ తెరిచి వుంచితే నీటి వేగం మొత్తం ఇంటిని కూల్చెయ్యకుండా ఇటు వైపు నుంచీ అటు వైపుకి సాఫీగా వెళ్ళిపోతుంది. ఇలాంటి వాట్ని ఇప్పుడు కూడా వుపయోగించుకోవచ్చు. గోల్కొండ కోటలో ఇట్లాగే గాలిని వొంపులు తిప్పి సహజమయిన యేసీ గదిని ఒకదాన్ని యేర్పాటు చేసారని చదివాను. ఇళ్ళలో కూడా ఇలాంటి టెక్నిక్స్ ఫాలో అయితే కరెంటుని అతిగా వాడటం తగ్గుతుంది.

      ఇక్కడ చెన్నయ్ లో వళ్ళువార్ కొట్టంలో నేను ఒక మంచి విషయాన్ని చూశాను.వీళ్ళ చరిత్ర లోనూ సాహిత్యం లోనూ వున్న మంచి మంచి దృశ్యాల్ని గోడల మీద బొమ్మలుగా నిలబెట్టారు.సచివాలయ శాసన సభా భవనాల్లో కూడా కారిడార్లలో ఇలాంటివి వుంచాలి. బయట రోడ్దు మీద వెధవ పన్లు చేసే వాడయినా యేదయినా గుడిలో అడుగు పెట్టగానే యెంత బుధ్ధిమంతుడయి పోతాడో చూడండి! ఇక్కడ కూడా చుట్టూ వుండే వాతావరణం పవిత్రంగా వున్నప్పుడు దాని ఫలితం తప్పకుండా కనబడుతుంది!!
                                               సీ|| మేలు జరుగుగాక మేదినిపై గల
                                                       సకల జనులకు - స్వస్తి భవతు!

                                                       రక్షించబడు గాక రమణులు,వృధ్ధులున్,
                                                       శిశువు లనాధలున్ - స్వస్తి భవతు!

                                                       కలియుగాక సఫలకర్ములై దేశదే
                                                       శాల పౌరజనులు - స్వస్తి భవతు!

                                                        నశియించి పోవలె నీచులున్, దుర్మతుల్
                                                        శాంతమార్గముననె - స్వస్తి భవతు!

                                               తే|| చెలుల కిష్టులౌ మగలార స్వస్తి భవతు!
                                                       చదువు చెప్పు గురువులార స్వస్తి భవతు!
                                                       సమత పెంచు నాయకులార స్వస్తి భవతు!
                                                       సేద్య మొనరించు సైరికా స్వస్తి భవతు!!

(04/06/1996)



కంగారు పడకండి, అనుమాన మక్కర్లేదు - మనకి అంతా మంచే జరుగుతుంది!
--------------------------------------------------------------------------------------------------------

6 comments:

  1. రాజధాని అంటే హైదరాబాదులా ఉండాలి అనే అభిప్రాయం మార్చుకుంటే సగం సమస్యలు తీరిపోతాయి.
    అసెంబ్లీ, సెక్రటేరియట్, రాజ్ భవన్, హైకోర్టు లాంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాలూ ఒకేచోట ఉండేలా, పరిపాలనకి అవసరమైనంత రాజధాని కట్టుకుంటే చాలు. వీలైతే ఒక సమావేశం కర్నూలులో జరిగేలా అక్కడ రెండో అసెంబ్లీ భవనం నిర్మించుకుంటే సరిపోతుంది. మిగతా సంస్థలు మాత్రం ఒకేచోట ఉండకుండా వికేంద్రీకరిస్తే బాగుంటుంది.

    ReplyDelete
    Replies
    1. భారీగా కట్టమని నా వుద్దేశం కాదు, కొత్తగా వుండాలి అని మాత్రమే.

      Delete
  2. రాజధాని రాష్ట్రం మధ్యలోనే ఉంటే రోడ్ కం రైల్ కనెక్టివిటీ బాగుంటుంది అని, వాటర్ ఫెసిలిటీ బాగా ఉంటుందని, ఇతర ప్రాంతాల వారిని సహృదయంతో కలుపుకోగలిగే మనస్తత్వం ఉన్న ప్రాంతం అని అందరికీ తెలుసు. కానీ ఎందుకు అందరూ మా ప్రాంతం లో అంటే మా ప్రాంతం అని అడుగుతున్నారంటే ( రాజకీయ నాయకుల్ని వదిలేయండి)కేవలం రాజధాని వస్తే ఆ ప్రాంతం రూపురేఖలు, తీరుతెన్నులు మారిపోతాయి అని భూముల ధరలు పెరుగుతాయని, ఆ ప్రాంతం పిల్లలకు ఉద్యోగాలు వస్తాయనే వుద్దేశం తో కొంత పట్టుదలలకు పోతున్నారు. నా ఉద్దేశం లో రాజధాని ని విజయవాడ లో పెట్టినా కర్నూల్ సోదరులకు మాత్రం న్యాయం చెయ్యాలి. అంటే రాజధానిని గతం లోను మరియు ఇప్పుడు కూడా కోల్పోయినందుకు మానవత్వం తో ఆలోచిస్తే వారికి మనందరికన్నా అబివృద్ది అవకాశాలను కొంచెం ఎక్కువ శాతం అందించాలి. అది వారి హక్కు కూడా అని నేను భావిస్తున్నాను.

    ReplyDelete
    Replies
    1. మీ అభిప్రాయం లో న్యాయం వుంది.ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు కూడా అభివృధ్ధ్ని వికేంద్రీకరిస్తామనే చెబుతున్నారు.చూద్దాం, ఇంకా నాలుగేళ్ళు టైముంది కదా!

      Delete
  3. చాలా చక్కగా చెప్పారు. శివరామకృష్ణ కమిటీ మాటతీరు చూస్తే అసలు ఆంధ్రావాళ్ళకో రాజధాని ఉండడమే ఇష్టం లేని కుళ్లుమోతు వ్యవహారంలా, పుల్లలు పెట్టే రకంలా అనిపించింది.

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

శ్రమ దోపిడీ గురించి ముప్పాళ రంగనాయకమ్మ గారి లోతైన పరిశీలన బెత్తెడు లోతు కూడా లేదేంటీ!

ఎలక్టొరల్   బాండ్స్   గురించి   మార్చి  31 న  " సుప్రీం   కోర్టు   తీర్పు   సంస్కరణేనా ?" అని   లోక్   సత్తా   జయప్రకాశ్   ఒక   వ్...