Wednesday, 10 June 2015

టాటా, వీడుకోలు, గుడ్ బై, ఇంక సెలవు - ఈ బ్లాగు నగరికే ఇక రాను రాను రాను?

          నేను యెన్నికల ఫలితాల తర్వాత నా మొదటి పోష్తులోనే నా అభిప్రాయం చెప్పాను తెలంగాన ని కేసీఆర్ కీ వదిలేసి బాబు ఆంధ్రాకి పరిమితమై పోతే బాగుంటుందని!ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి హైదరాబాదులో యేం పని?మొన్నటి పోష్టులో కూడా బాబుకి ఈ శాస్తి జరగాల్సిందే నన్నాను. అతను చేసిన మొదటి తప్పు కేసీఆర్ ని తక్కువ అంచనా వెయ్యటం!ఇంకా తన పార్టీ సభ్యుడై మంత్రిపదవిని అనుభవించే కేసీఆర్ తప్ప అతనికి ఇవ్వాళ్టి కేసీఆర్ కనబడలేదు - ఇప్పుడు మాడదిరిపోయే దెబ్బ తగిలాక బొబ్బలు పెట్ట్టి యేమీ లాభం లేదు. దొంగలు పడ్డ ఆర్నెల్లకి మొరిగిన కుక్కలా ఇప్పుడు ఆంధ్రోళ్లని తిట్టారు,ఆంధ్రోళ్ళ ఇళ్ళని కూలుస్తున్నారు అని యేడ్చి ప్రయోజనం యేమిటి?జాతి స్వాభిమానం గురించి ఆలోచించే యన్.టి.ఆర్ స్వభావం అతనికుంటే కేసీఆర్ అట్లా వాగుతున్నప్పుడే జవాబు చెప్పి ఉండేవాడు?ఇప్పుడిక చెయ్యగలిగింది లేదు తెలంగాణని కేసీఆర్ కొదిలేసి తను ఆంధ్రాకి పోవటమే!

          కేసీఆర్ అధ్వర్యంలో నడిచిన తెలంగాణ ఉద్యమం అంతా స్థానబలిమికి సంబంధించిన వదరుబోతు తనంతో నడిచింది.ఆనాటి త్యాగధనులు నడిపించిన అమరవీరుల తెలంగాణ ఉద్యమంతో ఈ స్వార్ధపరుడు నడిపిన పైత్యకారి ఉద్యమాన్ని పోల్చడం చిట్టెలుకనీ చిరుతనీ ఒకే గాట కట్టెయ్యటం లాంటిది!

          రెండే రెండు బలమయిన ఉదాహరణలు చెప్తాను ఇప్పటి వాదనలలోని అనౌచిత్యానికి!.చాలాకాలం క్రితమే గుండెఘోష దగ్గిర జరిగిన వాదన ఇది.ఆ వాదన జరుగుతున్నప్పుడు నేను ఫాలో అవడమే తప్ప వాదనలో కల్పించుకోకపోయినా చాలా ఆశ్చర్యమనిపించింది ఆ వాదన జరిగిన పధ్ధతికి?కాళోజీ కరుణశ్రీ - ఇద్దరూ ఒకేరకంగా తెలుగువాళ్ల పరభాషా వ్యామోహాన్ని విమర్శిస్తూ కొన్ని అభిప్రాయాలు చెప్తే ముందుగానే కాళోజీని "ఇన్సైడర్" అనీ కరుణశ్రీని "ఔట్సైడర్"అనీ గీతలు గీసి కాళోజీ కావాలనే అన్నా సరే అతన్ని క్షమిస్తాం కానీ కరుణశ్రీని మాత్రం మేము యెన్ని సమర్ధనలు చెప్పినా క్షమించం అని తీర్మానించేశారు,అందులోని ఔచిత్యం యేమిటి?ఇంతకీ ఆ కాలంలో వాళ్ళిద్దరిలో యెవరూ కూడా ప్రాంతానికి సంబంధించి ప్రత్యేకంగా ఆలోచించి చెప్పలేదు,అవునా?కాళోజీ కూడా మాటలు తెలంగాణా ప్రాంతానికి చెందిన వాళ్లకి మాత్రమే చెప్పలేదు,అన్ని ప్రాంతాలలోని అందర్నీ అన్నాడు,మరి మేమిప్పటికీ కాళోజీని ఔట్సైడర్ అని అనుకోలేకుండా ఉన్నాము!మరి కరుణశ్రీ యెందుకు తెలంగాణా వాళ్ళకి ఔట్సైడర్ అయ్యాడు?

          తెలంగాణకి అన్యాయం యెక్కడ జరిగింది?నిజాము మీ తాతల్ని యెండగట్టే పెంచాడో యెలా పెరిగిందో కూడా అనవసరం,ఇన్నేళ్ళ తర్వాత మీరే ధనిక రాష్ట్రంగా ఉంగలిగారంటే దాని అర్ధం యేమిటి?ఇక్కడి సంపదని ఇంకొక చోటికి తరలిస్తే అది దోపిడీ - ఇంగ్లీషువాడు చేసినా అమెరికా వాడు చేసినా!తొలిరోజుల్లో అక్కడి మా ఆస్తుల్ని కుదవబెట్టుకొచ్చి మీ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేసి మీ ప్రాంతపు భూముల ధరలు పెరిగేలా చేసి లాభాలని కూడా మళ్ళీ అక్కడే పెట్టుబడులు పెట్టి అఘోరించి ఇప్పటికీ మీ ముఖ్యమంత్రి మీరు మా రాష్ట్రం విడిచి పోవద్దు మీ సేవలు మాకు కావాలి అని అంటున్న దానిని దోపిడీ అని అనటానికి నోరెట్లా వస్తున్నది మీకు?!ఒకే ఒక నగరాన్ని మొత్తం రాష్ట్రపు ఆదాయంలోనే సుమారు మూడోవంతుకి పెంచినా దాన్ని మొత్తం ఆదాయంలో కలిపేసి మూడు ప్రాంతాలకీ పంచినా అభ్యంతరం చెప్పనివాళ్ళు ఉన్నతులా?అందరూ కలిసి పెంచిన దాఖలాలు ఉన్నాయి గాబట్టి కనీసం దామాషా ప్రకారం పంచుకుందాం అనే న్యాయమైన మాట కూడా మాట్లాడకుండా ఆ నగరం మా ప్రాంతంలో ఉంది కాబట్టి అంతా మాకే కావాలని  తెంపరించిన వాళ్ళు ఉన్నతులా?బ్లాగుల్లో తిరిగే కొందరు ఉద్యోగాల్లో మాకన్యాయం జరిగిందని ఫలానా రిపోర్టులో ఉందని వూదరగొడితే పోయి క్షుణ్ణంగా చదివితే ఆయన కుండ పగలేసి చెప్పినంత గట్టిగా అన్ని ప్రాంతాల వారికీ జరిగింది అన్నాడు!అప్పటి జోనల్ సిస్టంలో లొసుగులు ఉండటం వల్ల అన్ని ప్రాంతాల వారికీ అన్యాయం జరిగింది అంటే ఆ నియామకాలలో మిగతావాళ్ళ వల్ల మీకు జరిగిన అన్యాయాన్ని మాత్రమే యెత్తి చూపిస్తున్నారు బాగానే ఉంది,మరి ఇతర్లకి మీవల్ల జరిగిన అన్యాయాలకి యెవరు బాధ్యత తీసుకోవాలి?

          ఇవ్వాళ ఆంధ్రలో కేసేఅర్ ఒక్క సీటు కూడా గెలవలేడు - అది అతని స్వయంకృతం, రాష్ట్రం చీలిపోయాక నేను ఆంధ్రా వస్తాననడం కాకుండా ఉద్యమకాలంలోనే ఆంధ్రప్రాంతపు ప్రజల ముందు నిలబడి ఇదీ మాకు జరుగుతున్న అన్యాయం మీవాళ్ళు మాకన్యాయం చేస్తున్నారని చెప్పి అక్కడి ప్రజల్ని కూడా ఒప్పించగలిగి ఉండేవాడు,కాదా?మాటిమాటికీ వాళ్ళని కడుపులో దాచుకున్నాం వీళ్ళని కడుపులో దాచుకున్నాం అంటారు మీరు నిజాముతో కష్టాలు పడుతున్నప్పుడు ప్రాణాలకి తెగించి బోర్డర్లు దాటించి కాపాడటం గురించి మాట్లాడరేమిటి?అంతగా సహాయం చేసినా మమ్మల్ని నమ్మకుండా యెన్ని గీతలు గీశారు,ఆ గీతల్ని చెరిపింది మీవాళ్ళేనని తెలిసి కూడా మమ్మల్నే తిట్టారు - పంచమహాపాతకాల్లో తప్పు చెయ్యని వాణ్ణి తిట్టడం ఒకటి అని తెలుసా మీకు?సరే యెంతకాలం పాతవి తవ్వుతాం, ఇవ్వాళ్టి పరిస్థితి యేంటి? తెదెపాకి తెలంగాణలో కూడా వోట్లు ఉన్నాయి, వాళ్ళకి బలమున్న చోట పోటీ చేసి గెలిస్తే ఆకర్ష తంత్రం ఉపయోగించి లాక్కోవడం నీతిమంతుడు చేసే పని అని మీరనుకుంటున్నారా?తన ముడ్డి నలుపెరగని గురివిందలాగ యెదటివాళ్ల నలుపుని గురించి మాట్లాడితే అతని నలుపు తెలుపై పోతుందా?మీ ఉద్యమ వీరావేశానికి విశాల తెలంగాణా ప్రజానీకం హృదయపూర్వకమైన మద్దతు ఇవ్వకపోవడానికి తన దేబెతనం కారణమని అనుకోకుండా పోటుగాడికి లాగ యెదటివాళ్లని బెల్లించి లాగేసుకుని కాలరెగరెయ్యడం గొప్పా?

          విడిపోయిన మిగతా రాష్టాలకు మల్లే అందర్నీ తమకి జరిగిన న్యాయానికి అనుకూలంగా ఒప్పించి శాసనసభలో బిల్లు పాసవ్వడానికి అస్సలు పనికిరాని ఆంధ్రోళ్ళని తిట్టడం అనే చెత్తపనితో మొదలై ఇంత భీబత్సంగా విడిపోయి కేసీఆర్ సాధించిందేమిటి?రాష్ట్రంలోని అసెంబ్లీలో గానీ కేంద్రంలోని పార్లమెంటులో గానీ ఆంధ్రావాళ్ళ మాట ఒక్కటి కూడా చెల్లనివ్వకుండా తను ఇట్లాగే తెచ్చుకోవాలని వ్యూహం పన్ని తన ఇష్టానుసారం తెచ్చుకున్న ఇప్పుడు చంద్రబాబుతో చేసే కుక్కజట్టీల్ని కాస్సేపు పక్కన పెడితే బంగారు తెలంగాణ కోసమయినా నిజాయితీగా పని చేస్తున్నాడని మీ గుండెల మీద చెయ్యేసుకుని చెప్పగలరా?వీళ్ళని తెచ్చిపెట్టారని తను యెవరిమీద విసుక్కుంటున్నాడు?ఇట్లాగే తెచ్చుకోవాలన్న తన యెదవప్లాను వల్ల వచ్చిపడిన దరిద్రానికి యెవణ్ణో తిట్టటం దేనికి పనికొస్తుంది!రేవంత్ గొడవ బయటికి రాని ముందురోజు వరకూ పార్టీలో ఉద్యమం కోసం పని చేసిన వాళ్ళని వొదిలేసి ఉద్యమానికి వెన్నుపోటు పొడిచినవాళ్ళకి పదవులిస్తుంటే మీరు కనీసం అతనికి తెలిసేటంత గట్టిగా విమర్శించను కూడా విమర్శించలేకపోవటానికి కారణ మేమిటి?ఆంధ్రోళ్ళ కబ్జాల నుంచి హైదరాబాదుని విడిపిస్తానని వీరంగాలు వేసిన మీ ముఖ్యమంత్రి యెంత భూమిని కబ్జాదారుల నించి విడిపించాడు - ముందు ముందు చేస్తాడనే సొల్లు కబుర్లు కాదు ఇప్పటికి చేసిన లెక్కలు చెప్పండి!లక్ష నాగళ్లతో దున్నిస్తానన్నాడని యెగెరెగిరిపడి అతని ముంగిటికే వెళ్ళి పొగుడుతుంటే రాజగురువు పాదాలు నాకుతున్నాడని మీలోమీరే గొణుక్కుంటున్నప్పుడు కొంచెమయినా సిగ్గనిపించలేదా మీకు?ఇప్పటికీ ఆంధ్రా పెట్టుబడిదారుల్నే అంతగా నెత్తి కెక్కించుకుంటున్నా మీకెవరికీ చీమ కుట్టినట్టయినా అనిపించడం లేదుమీలో ప్రాంతీయాభిమానం ఇంకా తగినంతగా రాజుకోలేదా?మా ఆంధ్రా బ్లాగరు కాదు మీ వీర తెలంగాణ బ్లాగరు కూడా మన కాంట్రాక్టర్లని కూడా ప్రోత్సహించండి అని వ్యాఖ్యానించేలా ఉన్నది గదా అక్కడ నడుస్తున్న యవ్వారం!యేమైంది ప్రాంతం వాడు చేస్తే ప్రాంతంలోనే పాతరేస్తామన్న కాళోజీ స్పూర్తి?ఉద్యమవీరులకి పదవులిస్తే అనుభవం లేకపోయినా నేర్చుకుని తాము కష్టించి తెచ్చుకున్న తెలంగాణకి అన్యాయం చెయకుండా అవినీతికి దూరంగా ఉంటారు,అదే ఉద్యమద్రోహులకి ఇస్తే వాళ్ళకెటూ తెలంగాణ పట్ల సెంటిమెంటు లేదు గనక అవినీతి యెప్పటికీ పోదు - చిన్న సూత్రం మీకు తెలియదా!మీ ముఖ్యమంత్రికి తెలియదా - ఉద్దేశపూర్వకంగానే మీ రాష్ట్ర ముఖ్యమంత్రి అవినీతిపరుల్ని అక్కున జేర్చుకుంటున్నాడని తెలిసినా బంగారు తెలంగాణ కోసమే అదంతా చేస్తున్నాడని నమ్మేటంతగా మీ మెదళ్ళు పాచిపోయాయా?

          కేసీఆర్ యెప్పుడు సంచలనం రేకెత్తించినా దాని వెనక కధేమిటో అతను ఇదివరకు చేసిన సంచలనాత్మకమైన పనుల్ని గుర్తుకు తెచ్చుకుని పరిశీలిస్తే అర్ధమవుతుంది - పార్టీలో తనపైన విమర్శలు వస్తాయనుకున్న సందర్భంలో యేదో ఒక మాటతోనో చేతతోనో విమర్శలు వచ్చేలాగ చూసుకుని ఇప్పుడు మనం మన నాయకుణ్ణి వెన్నంటి ఉండి గట్టిగా సమర్ధించాలే తప్ప విమర్శించకూడదు అనే విధంగా కంగారుపెట్టి విధేయతని రప్పించుకోవటం కోసమే ఆ పన్లు చేశాడనేది దానివల్ల కేసేఅర పొందిన ప్రయోజనమూ అదెనని తెలుసుకుంటే తేలిగ్గా అర్ధమవుతుంది!హిట్లరు కూడా గోబెల్సు సాయంతో ఇల్లాంటి ట్రిక్కులే ప్లే చేసేవాడు. ఆ సంచలనం ద్వారా అతను టార్గెట్ చేస్తున్నది విపక్షాల్ని కాదు,తిరుగుబాటు చెయ్యాలనుకుంటున్న స్వప్క్షీయులనే!సరిగా ఆ సన్నివేశానికి ముందు స్వంతపార్టీలోనే అసంతృప్తి ఉండటం,సన్నివేశం తర్వాత జరిగే నాటకీయతలో అది అణిగిపోవటం అంత స్పష్టంగా కనబడుతున్నా మీరు తెలుసుకోలేకపోతున్నారంటే దానర్ధం యేమిటి?మాయ,మాయ,అంతా మాయ!! పోయి బాబా సినిమా పదిసార్లు చూడండి జ్ఞానోదయం కావచ్చు?

          చదరంగంలో మాస్టర్ అయినవాడెవ్వడూ కేవలం తన పావుల్ని మటుకూ కదుపుతూ కూర్చోడు!కొన్ని చిన్న పావుల్ని కావాలనే తెలివితక్కువగా బలి ఇచ్చే బైట్ యెత్తుగడలతో యెదటి ఆటగాడిని తనకి అనుకూలంగా పావులు కదపగలిగేలాగ చేస్తాడు,అలా చెయ్యగలిగిన వాడే గెలుస్తాడు?మొదట తెదెపాని బలహీన పర్చటానికి ఆపరేషన్ ఆకర్ష యెత్తు వేశాడు,ఆ వొత్తిడితో ఉన్నవాళ్ళు అవకాశం దొరికితే మనమూ వాళ్ళని ఇబ్బంది పెదదామని తప్పకుండా ఆలోచిస్తారు.ఒకవేళ వాళ్ళు అలా ఆలోచించకపోయినా పనిగట్టుకుని ఆలోచన రప్పించటానికి తనకి అనుకూలంగా స్టీఫెన్సన్ అనే పెంపుడు కాంచనమృగాన్ని వొదిలాడు!లోపాయకారీగా ఇతనే హింట్లు పంపించాడనీ,కావాలనే రేవంత్ వస్తేనే మాట్ట్లాడతానని అన్నానీ తెలుస్తున్నది గదా?మాకు ఈ యెన్నికల్లో గెలుపు వల్ల లాభమేమీ లేదు,అయినా ప్రేస్టేజి ఇష్యూ వచ్చింది అని రేవంత్ మాటలద్వారానే తెలుస్తుంది గదా, తెదెపా వాళ్లని ఉనికిలోనే లేకుండా చెయ్యాలన్నంత పట్టుదల యెందుకు కేసీఆర్ మరియూ అతని అభిమానులకి?

          తెదెపా బస్సుయాత్రల్ని పదేపదే ప్రస్తావించటం దేన్ని సూచిస్తున్నదో మీకు తెలియదా?కర్నాటకలో కాంగ్రెసు చెయ్యదా?గుజరాతులో భాజపా చెయ్యదా?మరో పార్టీ తనకి బలమున్నచోట యెదగాలని ప్రయత్నించడాన్ని సహించలేని ఉలికిపాటు కాదా అది?ఒక వ్యక్తి తన ప్రాభవం కోసం ఇంతకు దిగజారాలా?ఇప్పుడు మొదలెట్టిన పన్లు పూర్తి కావాలంటే నాలుగేళ్ళు పట్టొచ్చు,కాదనడం లేదు,ప్రజలకి అది వివరించి తనకి తక్కువగా ఉన్న బలాన్ని ప్రజలకి మంచి చేసి మంచిపేరు తెచ్చుకుంటే యెవరు కాదంటారు?తెదెపా బలం పెరిగితేనే తెలంగాణకి ద్రోహం జరుగుతుందా?అసలు ఉద్యమానికి ద్రోహం చేస్తున్నది తను కాదా?ఉద్యమానికి నిస్వార్ధంగా పని చేసిన వాళ్ళని గాలికొదిలేసి ఉద్యమద్రోహులకి మంత్రిపదవులిస్తున్న తన యేబ్రాసితనానికి కూడా బాబే కారణమా?నిన్నటిదాకా ఆంధ్రోళ్ళని తరిమికొడ్తానని గంతులేసి ఇవ్వాళ్టికి కూడా ఆంధ్రోళ్లని నెత్తికెక్కించుకోవటానికి కూడా బాబు చేస్తున్న కిరికిరియే కారణమా?మొన్నటి వాహనాల రీరిజిస్ట్రేషను, నిన్నటి 1956 స్థానికత, ఇప్పటి ఉస్మానియా భూముల్ని తీసుకోవాలని చూడటం వరకూ తను తీసుకున్న నిర్ణయాలకి కూడా బాబు కారణమవుతాడా?విన్నవాళ్ళు నవ్వుతారనే ఇంగితజ్ఞానం కూడా లేకుండా అతనలా మాట్లాడటాని కాధారం మీ అజ్ఞానం మీద అతని కున్న నమ్మకమే!?ఒక పార్టీ రాజకీయంగా యెదిగినంతమాత్రాన తెలంగాణా భ్రష్టుపట్టిపోతుందంటే మీరు తెచ్చుకున్నది తుమ్మితే వూడే ముక్కునా?

          చంద్రబాబు అభిమానుల నుంచి జవాబులు ఆశించేవాళ్ళు ముందు వీటికి జవాబులు చెప్పండి?ఇవ్వాళ మీకు నచ్చనివాణ్ణొకణ్ణి ప్లానేసి ఇరికించితే హీరోయిజం లాగ పొంగిపోయి కులకటం కాదు ఉద్యమనేతగా యెదిగి ఇక్కడి వరకూ వచ్చి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఉద్యమద్రోహుల్ని చంకనేసుకుని తిరగడం అనే దుర్మార్గం నుంచి మీరు మీ ముఖ్యమంత్రిని నిలవరించగలరా?హరిబాబు మీకు వేస్తున్న ఆఖరి చాలెంజిని టేకప్ చేసి సాధించగలిగే మొగాడెవడయినా ఉన్నాడా మీలో - బస్తీమే సవాల్!?

          యే ముహూర్తాన కచరా బుర్రలో ఆంధ్రోళ్లని తిడుతూ తెలంగాణాని తెచ్చుకోవాలనే ఆలొచన దూరిందో గానీ ఒకనాడు మహనీయులని ట్యాంక్ బండ్ మీద నిలబెట్టటానికి తనుకూడా పూనుకున్నాడో అదే నోటితో వాళ్లని పనికిమాలినోళ్లని అనేటంతగా దిగజారిపోయాడు!ఒక ప్రాంతం మీద ఒక కులం మీద ఒక మనిషి మీద అంత ద్వేషం ఉన్నవాళ్ళంతా చరిత్రలో రాక్షసపట్టుతో కొంతకాలం వెలిగినా అంతానికి వచ్చేసరికి అనాధపిండమై బంకరులో శవంగా తేలడం జరిగింది !మంచి సాహిత్యం చదివి నందమూరి తారక రామారావు నభిమానించి ఉన్నతాదర్శాలతో రాజకీయ జీవితం మొదలుపెట్టిన కల్వకుర్తి చంద్రశేఖర రావు పోయిన ప్రాభవాన్ని తిరిగి తెచ్చుకోవడం కోసం మొదట రెండు ప్రాంతాల మధ్యన కారణం లేని ద్వేషాన్ని పెంచి మాటిస్తే తల తెగి పడినా తప్పనని ఘీంకరిస్తూనే అడ్డగోలుగా అబధ్ధాలు ఆడటం నుంచి ప్రతికూలతని సహించలేని అహంభావాన్ని రాచరికపు స్థాయిలో సాగించుకుంటూ నచ్చని వాళ్ళని అణిచెయ్యటానికి నక్కజిత్తులు వేస్తూ బజారు భాష మాట్లాడే స్థాయికి దిగజారిపోయి కూడా పశ్చాత్తాపం లేకుండా యెట్లా ఉండగలుగుతున్నాడో!


          వైదిక కాలం నుంచి ఇప్పటివరకూ భరతఖండమంతటా మర్యాదస్తులుగా బతికి ఆంధ్రశాతవాహనుల మూలంగా కులమతప్రాంతాల కతీతంగా యెదిగిన ఆంధ్రులకి ఒక వ్యక్తి రాజకీయ ప్రాభవానికి ఒక ప్రాంతం వాళ్ళ వికృత మేధస్సులకీ బలయి ప్రపంచపు నడివీధిలో రాష్ట్ర ముఖ్యమంత్రుల నోటివెంట వీధి గూండాల స్థాయి బజారు భాష వినాల్సిన  దౌర్భాగ్యం పట్టింది నేటికి!నిన్నటి తరంలో మహాకవి అయిన ఒక వ్యక్తి హైదరాబాదు లోని ఒక కాలేజిలో సీటు తచ్చుకోవటానికి ముల్కి నిబంధనల్ని అతిక్రమించలేని కారణాన్ని చెప్తుంటే ఒక మూర్ఖుడు ఈయన తప్పించుకున్నాడన్న పధ్ధతిలో కామెంటు చేస్తున్నాడు, యెంత కసి ముల్కి నిబంధనల పేరుతో జరిగిన విషయాల మీద?ఆ కసి ఇవ్వాళ అంతకన్నా యెక్కువ అవినీతిని ప్రోత్సహిస్తున్న అధికారంలో ఉన్నవాళ్ళ మీద పుట్టటం లేదేమిటో?ఆనాడు ఆ విద్యార్ధి డబ్బులో పుట్టి పెరిగిన ఆంధ్ర మదోన్మత్తుడా?ఇవ్వాళ తను ఉన్న మధ్యతరగతి బతుకులో కొంచెం మంచి కాలేజిలో చదివితే ఇంకొంచెం పైకొస్తాననే ఆశతో కాలేజి యాజమాన్యమే అతని మార్కుల్ని చూసి ముచ్చట పడి సలహా ఇవ్వగా జాయినైన వాళ్ళని కూడా ద్వేషించడం యెంత కిరాతకమయిన మనస్తత్వమో కదా?ఇలాంటి వాళ్ళు అతనికి బాకాలు వూదుతున్నంతకాలం అసలు నిజం యెవరికీ కనిపించదు - ముఖ్యంగా కచరాకి!యాభయ్ అరవయ్యేళ్ళు ఇతర ప్రాంతీయుల దోపిడీ వల్లనే వెనకబడి పోయామనీ లేకుంటే  అంబరాన్ని అంటేవాళ్ళమనీ ప్రగల్భాలు పలికే గురివిందలు నేడు సంవత్సరం దాటినా తాము యేరికోరి యెన్నుకున్న ముఖ్యమంత్రియే ఆ దోపిడీదారులనే చంకనేసుకుని తిరుగుతుంటే చీరి చింతకి కట్టకుండా సొల్లుకబుర్లతో కాలక్షేపం చేస్తున్నారెందుకు?అతను అఖండ తెలంగాణ ప్రజాహితానికి కాకుండా తన చుట్టూ గుమిగూడి ఉన్న అదే ఆంధ్ర అవినీతిపరుల పొట్టల్ని పెంచడానికే నిస్సిగ్గుగా అధికారాన్ని ఉపయోగించుకుంటున్నాడని తెలిసినా అతని బాడుఖావు భాషకి మైమరచిపోయి చప్పట్లు కొడుతున్నవాళ్ళని "చెంచాలు" అనిగాక మరేమని పిలవాలో ఆత్మవిమర్శ చేసుకుని చెప్తారా కొంచెం!

          కేసీఆర్ అనే వ్యక్తిని నియంత్రించకుండా అట్లాగ వొదిలేస్తే ఈ రెండు రాష్ట్రాల్లో యేదో ఒకటి సర్వనాశనమైపోయి రెండవ వాళ్ళు వికటాట్టహాసాలు చేసేవరకూ అతని వికృత రాజకీయం ఆగదు!ఆంధ్రప్రదేశ్ నాశనమైతే తెలంగాణ వాళ్ళు అదృష్టవంతులు,తెలంగాణ నాశనమైతే ఆంధ్రావాళ్ళు అదృష్టవంతులు, అంతే!మొన్నటి రోజున "తెలంగాణ వెనుకబాటు తనానికి ఆంధ్రోళ్ళ దోపిడీయే కారణం" అనే పేరుతో అతనొక భూతాన్ని ఆవాహన చేశాడు,నిన్నటి వరకూ దాన్ని ఆతను నడిపాడు,ఇవ్వాళ అదే అతన్ని నడుపుతున్నది - దాన్ని వొదిలించుకుందామంటే దానిద్వారానే వచ్చిన వైభవం పోతుందేమోననే భయం, పైన తను సొంతంగా చేసిన పన్లు ఫెయిలయినా దాన్ని ఉపయోగించి తిట్లు తప్పించుకోవాలనే దురాశ!పగ యడగించుకొనుట గురించి చెప్తూ మహాభారతంలో ద్వేషం నిండిన మనస్సు గల మనిషి స్థితిని పామున్న ఇంటిలో కాపురముండటంతో పోల్చాడు కవి, ఆ ద్వేషం మనసునుంచి పోనంతవరకూ ఆ మనిషి సుఖంగా ఉండలేడు - యెందుకంటే సుఖపడాలంటే భయరహితంగా ఆలోచించాలి?!

P.S:కళ్ళు కొంచెమే తెరిచి అలవోకగా తేరిపార చూసినా దివిసూర్యసహస్రప్రభాభాసమానమైన దివ్యతేజస్సుతో అలరారుతూ న్యాయపధాన్ని చూపించే ధర్మబధ్ధమైన సత్యసౌందర్యాన్ని ఇప్పటివరకూ అంధాంధతమసాల నడుమన గడిపిన దివాంధాలు హఠాత్తుగా యెదురైతే కళ్ళు బైర్లుగమ్మి చూడలేకపోవటం సహజమే కదా?!

(ఇప్పటివరకూ యెంత తీవ్రమయిన చర్చలలో కూడా హాస్యాన్ని వదలని నేను ఇప్పుడు ఈ క్షణంలో దుర్భర విషాదంలో ఉన్నాను.ఇవే మాటల్ని ఒక వేదిక మీద నిలబడి మాట్లాడాల్సి వస్తే దుఃఖంతో గొంతు పూడుకుపోయి సగంలోనే ఆపి రాసుకొచ్చిన కాగితాల్ని చింపి పోగులు పెట్టి వెళ్ళిపోయేటంత నిరాశ - కాబట్టి కొంతకాలం పాటు బ్లాగులలో కనపడను)


సమర్ధించి ఉషారు నిచ్చిన స్నేహితులారా,విమర్శించి చిరాకు పెట్టిన నీహారికలారా - ఇంక సెలవు!

Tuesday, 9 June 2015

చేపకళ్ళ చినదానికి చేగోడీలు చెయ్యడం రాకపోతే నేమి?

చేపకళ్ళ చినదానికి చేగోడీలు చెయ్యడం రాకపోతే నేమి?
సృష్టికి పూర్వపు చీకట్లను నింపుకున్న ఆ కన్నుల్లోకి చూస్తూ ఉంటే
ఆది కూర్మపు అడుగుజాడలు కూడా కనపడుతాయి గదా!
వెధవ చేగోడీలు షాపుల్లోనూ దొరుకుతాయి?

గగన జఘన సొగసు లలనకి జంతికలు చెయ్యడం వస్తే యెంత రాకుంటే యెంత?
ఉందో లేదో తెలియని ఆ నెన్నడుము వెతికి పట్టుకుంటే నా సామిరంగ -
బ్రహ్మ కడిగిన పాదము కూడా కనబడవచ్చునేమో!
ఒరేయ్ హరిగా నీకెందుకురా ఈ పనిలేని రాతలు?
కొన్నాళ్ళు గమ్మునుండరాదు ఆనందం వెతుక్కుంటూ!

Saturday, 6 June 2015

నేడు విశ్వనగరం అమరావతికి భూమిపూజ జరిగింది!రేపు విశ్వమే ఆంధ్రులకి తలవంచి నమస్కరిస్తుంది!

     నేటివరకు మలమల మాడ్చిన ప్రచండభానుడు శాంతించాడు,చిరుజల్లులతో విశ్వనగర బూమిపూజ వేదికని చల్లబరచాడు!భారతదేశపు ఉత్తర దక్షిణ సంస్కృతుల మధ్యన సంధి చేసి దేశమంతట్నీ కలిపిన ఒకనాటి ఆంధ్ర శాతవాహనుల రాజధాని ధాన్యకటక అమరావతి మళ్ళీ రూపు దిద్దుకుంటున్న తన రెండవ జన్మలో దేశపు యెల్లలు దాటి ప్రపంచాబ్జపు కలువరేకై విచ్చుకొనబోతున్నది!

     ఒక కుదుపులా జరిగిన రాష్త్రవిభజన ఆంధ్ర ప్రాంత వాసులకి చాలా గాయాల్ని చేసింది - ఒకనాడు రారమ్మని ముక్తకంఠంతో పిలిచారనేటందుకు సాక్ష్యాలు ఉన్నా కుట్రతో వచ్చి పడ్డారని ఆది నుంచీ అనుమానంతోనే చూస్తూ గడిపి,అప్పటినుంచీ ఇప్పటివరకూ తమ కష్టంతో తెలివితో సంపద పెంచి దాన్నంతా కలిపేసి మూడు ప్రాంతాలవారికీ పంచుతున్నా సహించి వూరుకుని అరవయ్యేళ్ళ పాటు రిప్ వాన్ వింకిల్ మాదిరి నిదరపోయి ఇప్పుడు లేచి ఆవులించి దాచిన స్థలం తమది కాబట్టి సంపద పెంచిన వారికే దొంగలని ముద్రవేసి తరిమికొట్టగలిగిన గయ్యాళిమందకి మేలుచేసినదానికి ఫలితంగా తలవంచుకుని ఇవతలికి వచ్చినందుకు కలిగిన బాధకి తొలిసారి కొంత సాంత్వన లభించింది!

     ఒక గాయం మానుపట్టాలంటే ఒక గేయం పేగుల్లో పుట్టాల్సిందే - జోర్ సెయ్!బారు సెయ్! కోటిపల్ల్లి రేవు కెయ్,కోనంగి రేవు కెయ్!!మనకెం తక్కువ - చరిత్ర లేదా?సంస్కృతి లేదా?కాళోజీ కరుణశ్రీ ఇద్దరూ ఒకే మాట మాట్లాడినా ముందే ప్రాంతానికి గీత గీసుకుని కాళోజీ "ఇన్సైడర్"గా అన్నాడు గాబట్టి పడతాం,కరుణశ్రీ "ఔట్సైర్" గాబట్టి దుర్మార్గు డంటాం అనేవాళ్ళు విడిపోవడం వల్ల మనం బాధపడట మేమిటి అర్ధం లేకుండా?మన తీరప్రాంతం మనకి వరం కాబోతున్నది, వ్యూహాత్మకంగా చూస్తే ఒక్కసారిగా ప్రపంచం మొత్తం మన ముంగిట్లోకి వచ్చినట్టుగా అనిపిస్తున్నది!ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇప్పటికే ఖాయం చేసుకున్న యం.వో.యు లన్నీ ఖరారయ్యి ఆయా పరిశ్రమలూ వ్యాపారాలూ పాదుకొని విస్తరిస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి జూలు విదిల్చి లేచి నిలబడిన మృగరాజే!

     మద్రాసుని మనమే పెంచాం,అయినా తమిళులు మాది పొమ్మన్నారు?మొదట కష్టపెట్టుకున్నాం,అయినా వాళ్ళకే వొదిలేసి వచ్చామే తప్ప దేబిరించ లేదు,బెదిరించ లేదు!మొదటిసారి భాష తెలియని పరాయి వాడు గదా అనుకుంటే రెండవసారి భాష తెలిసిన సొంతవాడే కనీసం మర్యాదగా విడిపోవటానికి కూడా ఒప్పుకోలేదు?అప్పుడు మనల్ని పొమ్మన్న వాళ్ళకన్నా మనమే గొప్పగా వున్నాం నిన్నటి వరకూ,ఇప్పుడు మనని పొమ్మన్నవాళ్ళ కన్నా గొప్పగా వుండబోతున్నాం రేపటి రోజున!

     ఈ గడ్ద మీద పుట్టినవాళ్ళలో సహనం యెక్కువ,ఈ గాలిని పీల్చినవాళ్ళలో స్వాభిమానం యెక్కువ,ఈ నీటిని తాగినవాళ్లలో వినయం యెక్కువ - వీటన్నింటి వల్ల:

రేపు విశ్వమే ఆంధ్రులకి తలవంచి నమస్కరిస్తుంది!

Thursday, 4 June 2015

ఇక్కడ కూర్చుని యెక్కడ వున్న యెవరితోనైనా చదరంగం ఆడుకోవచ్చు - వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ!

చదరంగం ఆట గురించి ఇవ్వాళ కొత్తగా నేను చెప్పటానికి యేముంది?కాకపోతే నేను కొత్తగా ఒక ఒక చదరంగపు బల్లని తయారు చేశాను - దాని గురించి చెప్తాను!నా చదువంతా చాలా నిర్లక్ష్యంగా బధ్ధకంతో గడిపేశాను.తెలివి అమోఘమే - యే మాత్రమూ ప్రిపరేషను లేకుండా అప్పటికప్పుడు లేచి నిలబడి సెమినార్ చెప్తే,అంటే ఎక్స్టెంపోర్ అన్నమాట, లెక్చరరుగారు  ముచ్చట పడి చప్పట్లు కొట్టించేశారు!కానీ ఆ తెలివి మంచిమార్కులు తెచ్చుకోవడం,వాటితో ఒక ఉద్యోగం తెచ్చుకోవడం అనే విధంగా పనిచెయ్యకపోవడంతో సుదీర్ఘకాలం పాటు కాలిబంతి బతుకు బతికి ఆఖరికి ఇప్పుడిట్లా ఉన్నాను!

నేను మంచి ప్రోగ్రామర్ని మరియూ చెత్త డిజైనర్ని!నిజానికి కంప్యూటరు ప్రపంచంలో యేదయినా  క్రియేటివిటీకి సంబంధించిన  పని చెయ్యాలంటే ఈ రెండూ 50%/50% అవసరమేనని తెలిసినా యే ఒక్కడిలోనూ అవి అట్లా ఉండటం లేదు.కొందరు డిజైనర్లుగా కొందరు ప్రోగ్రామర్లుగా చీలిపోతున్నారు.నేను ఫ్లాష్ నేర్చుకునేటప్పటికి అది అడోబ్ వాళ్ళకి దఖలు పడలేదు.ఒక సంవత్సరం పాటు నడిచే సర్టిఫికెట్ కోర్సులో భాగంగా ఫ్లాష్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజి దగ్గిర కొచ్చేసరికి  ఇదే నాకు తగిన సబ్జెక్ట్ అనిపించి అందులో ఎక్స్పర్ట్ అయ్యాను.యెప్పట్లాగే నా మనస్తత్వంలోని ఒకే ఒక్క బలహీనత - ఒకేదాని మీద మనసు పారేసుకుని అది తప్ప ఇంకేదీ ముఖ్యం కాదనుకోవటం - వల్ల అట్లా చేశాను గానీ ఆ కోర్సులో మాయా అనే 3డి అప్లికేషను కూడా వుంది గాబట్టి పూర్తి చేసి ఉంటే బాగుండేదని ఇప్పుడేడుస్తున్నాను!

ప్రోగ్రామరు ఒక ప్రాజెక్టు విషయంలో ఒక పార్టు ఒక గంటలో పూర్తి చేశాడనుకోండి అతను చివరి పావు గంటలోనే కోడ్ రాయటం మొదలు పెడతాడు - మొదటి ముప్పావు గంటా ఆలోచన సాగుతుంది!చూసేవాళ్ళకి ఈ పావుగం పనికి ఇతను గంట తీసుకున్నాడా అనిపిస్తుంది, అదే డిజైనరు తప్పు చేసినా ఒప్పు చేసినా యేదో ఒకటి కెలుకుతూ ఉంటాడు గాబట్టి ప్రతి నిముషమూ కష్టపడ్తున్నాడు అనిపిస్తుంది - ఆరకంగా మా ప్రోగ్రామర్లకి చాలా అన్యాయం జరుగుతున్నది!

ప్రోగ్రామింగ్ నాలెడ్జిలో నా గురించి నేను యేదయినా చెప్పుకుంటే గొప్పలు చెప్పుకున్నట్టు ఉంటుంది.నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు అప్పటి యం.డి నాకు టెంప్లేట్ డెవలప్మెంట్ పని అప్పజెప్పారు.దాని స్కోప్ యేంటంటే మా కంపెనీ ఈ-యెడ్ ప్రాజెక్టుల నన్నిట్నీ ఒకే చో చూపించటం,అదీ మా కంపెనీ లోని మిగతా ప్రోగ్రామర్లకి పని తగ్గిస్తూ!ఉదాహరణకి ఒకచోట ఒక ప్రశ్న ఇచ్చి దానికి జవాబుల్లో యేదో ఒకటి యెన్నుకోవటం అనే కోడ్ ఉన్న ఫ్లాష్ ఫైల్ ఉంటే దాన్ని ఒక పేరెంట్ ఫైల్ నుంచి మనకి కావలసిన వివరాలు ప్రశ్న,జవాబులు,కరెక్ట్ జవాబు లాంటివి ఆర్గ్యుమెంట్లుగా పంపిస్తూ ఓపెన్ చేసేలాగ మారిస్తే ఆ ఫైల్ మీద ప్రతిసారి వర్క్ చెయ్యనక్కరలేదుగా!ఆ విధంగా ఒక ఫైలు యెట్లా పనిచెయ్యాలో రూల్సుతో సహా మనం తయారు చేసే మాస్టర్ ప్రోగ్రాముని టెంప్లేట్ అంటారు.నేను ఆ పని పూర్తి చేశాక యెందుకయినా మంచిదని వేరే బ్రాంచిలో టెంప్లేట్ కన్స్ట్రక్షన్లో అనుభవం ఉన్నవాళ్ళని పిలిచి నేను చేసిన దాంట్లో యేదయినా కొరత ఉంటే చూసి చెప్పమన్నారు - వాళ్ళు చూసి నా దగ్గిర కొచ్చి అన్న ఒకే ఒక్క మాట "అమేజింగ్!" అని.నేను ప్రాజెక్ట్ తీసుకునేటప్పుడు టెంప్లేట్ కన్స్స్ట్రక్షన్ అంటే యేమిటో తెలియదు ప్రాజెక్ట్ ఇట్లా ఉండాలి అనే స్పెసిఫికేషన్స్ తప్ప - అయినా మొదటిసారి తీసుకున్న కొత్త అసైన్మెంటులోనే అందులో అనుభవం ఉన్నవాళ్ళకి మించి చెయ్యగలిగాను!

అయినా సరే,అసలు ఫీల్డు లోకి ఆలశ్యంగా రావటం, నన్ను నేను చక్కగా ప్రొజెక్ట్ చేస్కుంటూ చురుగ్గా కదిలి పేరూ డబ్బూ వచ్చే చోటికి చేరుకోలేకపోవటం లాంటివాటితో గొర్రెలా తోకాడిస్తూనే ఉండిపోయాను తప్ప సింహంలా గర్జించే అవకాశం రాలేదు.అయితే 2001 నుంచీ ఒక ప్రాజెక్ట్ నా మనసులో రింగులు తిరుగుతూ - ఇది గనక సక్సెస్ అయితే నాకు నా ప్రతిభకి తగిన గుర్తింపు వస్తుందనే ఆశని రగిలిస్తూ ఉండేది!అది చదరంగం చుట్టూ తిరుగుతుంది.మొదట "HTML,JS,ASP" ఉపయోగించి వెబ్ సైటుగా తయారు చేసి  2003లో హోస్ట్ చేశాను, కానీ ఫెయిలయింది!యెందుకు ఫెయిలయిందంటే మొదటిసారి కావటంతో జావాస్క్రిప్ట్ కోడింగ్ బాగా యెక్కువగా సాగింది, ఒక ఫ్రెండ్ వాడి చూసి సైట్ హ్యాంగ్ అవుతుంది అన్నాడు!అట్లా 2003లో చదరంగం అనే ఆటతో జనాన్ని కలపాలనుకున్న నేను ఫెయిలయ్యాను,కొద్దికాలంలోనే గాడిదల్నీ అమ్మాయిల్నీ చూపించి వెర్రెక్కించిన మార్క్ జుకెర్బర్గ్ రంగప్రవేశం చేసి ముఖపుస్తకంతో జనం ఒకరితో ఒకరు భావాల్ని పంచుకోవటం అనే నేను చెయ్యలేకపోయిన దాన్ని తను చేసి చూపించాడు - యేం చేస్తాం మన గాచ్చారం అట్టా గాండుమారింది మరి!

యెప్పుడయితే ఫ్లాష్ నేర్చుకున్నానో,అందులోనూ "OOPS" ఆధారితంగా ఉండి జావా లాంగ్వేజిని బోలిన "AS3" నాకు చాలా ఈజీగా పట్టుబడటంతో మళ్ళీ పాత కోరిక సెలవేసింది!ఇప్పుడు కోడ్ బాగా తగ్గింది,ఫ్లాష్ గదా అని క్రేజీ యానిమేషన్లకి పోకుండా మినిమం కంటెంట్ ఉండేలాగ చూసుకున్నా.ఈసారి సర్వర్ లాంగ్వేజి PHPకి మారింది.డాటా హాండ్లింగ్ విషయంలో XML పరిజ్ఞానం కూడా ఉపయోగపడింది.కానీ పూర్తి కావడానికి సమయం మాత్రం సంవత్సరాలు తీసుకుంది!!యెందుకంటే ఉద్యోగం అయ్యాక అందరూ పడుకున్నాక మొదలు పెట్టి మళ్ళీ నేను పొద్దున్నే ఆఫీసుకి పోవాలి గాబట్టి యెక్కువసేపు చెయ్యకుండా రోజుకి కొంచెమే చేస్తూ వచ్చి మొత్తానికి మళ్ళీ పని చేసే స్థితికి తీసుకొచ్చాను.అంతా పూర్తయ్యాక పనితీరు బాగానే ఉన్నా నేను చెత్త డిజైనర్ని కావడంతో సైటు మాత్రం చాలా ఘోరంగా కనబడుతున్నది!దానితో ఇప్పటి వరకూ సాగి ఇప్పటికి ఒక మంచి డిజైనరు దొరికి ఒక మంచి లేయౌట్ కుదరటంతో ధైర్యంగా మీముందుకి తీసుకు రాగలిగాను.

ఇప్పుడిక మిగిలిన వాటికన్నా ఇందులో ప్రత్యేకంగా నేను యేమి చేశానో చెప్పి నా సైటుని యెట్లా ఊయోగించుకోవాలో చెప్తాను.సైటులో హెల్ప్ మెను ఉంది గానీ మీరిప్పుడు ఇక్కడ వున్నారు గాబట్టి వివరంగా చెప్తాను.ఇక్కడ నేను చదరంగానికి సంబంధించిన మిగతా విషయాలను యేమీ చూపించటం లేదు.చదరంగం ఆడటానికి ఉత్సాహం ఉండి ఆటలో కొంతమేరకు ప్రవెశం ఉన్నవాళ్ళకి మాత్రమే ఈ సైటు పనికొస్తుంది.ఇప్పుడు అంతర్జాలంలో ఉన్న చదరంగానికి సంబంధించిన సైట్లలో ఆప్షన్లు తక్కువగా ఉన్నాయి - మీరు ఒక ఆటగాడిగా పేరు ఇచ్చి అవతలి వైపు మరో ఆటగాడు ఉన్నా లేక అనామక ఆల్గోరిదం పనిచేస్తూ ఉన్నా అది కొంతసేపు మాత్రమే ఉంటుంది.అప్పటికి సేవ్ చేసి మళ్ళీ కొంతకాలం అయ్యాక వచ్చి కంటిన్యూ చేసే పరిస్థితి లేదు!ఆటలో కూడా అతి ముఖ్యమైన డ్రా ఆప్షన్ నేనెక్కడా చూడలేదు!చెక్మేట్ చెప్పటం ఆటగాడు తన నిర్ణయాత్మకంగా వెయ్యాల్సిన యెత్తు - టోర్నమెంట్సులో గూడా యెత్తుకు ముందు చెక్మేట్ డిక్లేర్ చెయ్యకపోతే కంట్రోలర్ ఒప్పుకోడు,అవునా?అట్లాగే ఎన్-పాసంట్,ప్రమోషన్,క్యాజిలింగ్ లాంటి అతి ముఖ్యమైన యెత్తుల్ని వేసే వీలు నాకు దాదాపు కనబలేదు.మొదటిసారి "HTML" లో చేస్తున్నప్పటికీ ఇప్పటికీ మార్పు లేదు,అందుకే నేను నమ్మకంగా ఉన్నాను యెవరయినా సరే ఒకసారి లోపలికి వెళ్ళి ఒక ఆ పూర్తి చెయ్యగలిగితే తప్పకుండా ఒక అధ్భుతాన్ని చూస్తున్నట్టు ఫీలవుతారు - అని!
దశలవారీగా మొదటి నుంచి చివరి వరకూ ఒక్కొక చోట మీరు యేమి చెయ్యాలో చెప్తే అంతా పూర్తయ్యేసరికి మీకు సైటులో ఉన్నదేమిటో తెలుస్తుంది,కదా!సైటుకి వెళ్ళగానే మొదట,"PLAY NOW" నొక్కండి!అది మీకు నేను తయారు చేసిన ఫ్లాష్ ఆబ్జెక్టుని చూపిస్తుంది.ఇప్పుడు మీరు కొత్తగా వచ్చారు గాబట్టి మొదట "New to site?click me to rigister" నొక్కితే రిజిస్టరు అవటానికి ఒక ఫాం కనబడుతుంది.
ఇక్కడ నేను మీ దగ్గిర్నుంచి యెక్కువ వివరాలు తీసుకోవటం లేదు.పేరు లోని రెండు భాగాలు,ఈమెయిల్ ఐడి,లాగిన్ నేం,పాస్ వర్డ్ - అంతే!పాస్ వర్డ్ మీరు వూహించుకోవటానికి బధ్ధకం వేస్తే "generate password" నొక్కితే చిన్న ప్యానెల్ ఓపెన్ అవుతుంది అక్కడే!దానిలో కనబడే  ప్యార్న్ మీరు తేలిగ్గా గుర్తుంచుకునేటంతగా మీకు నచ్చేవరకూ "NEXT WORD" నొక్కవచ్చు.అలా నచ్చగానే "GO" నొక్కితే ఆ ప్యానెల్ పోయి పాస్ వర్డ్ సెట్ అవుతుంది.ఈ ప్యానెల్ నుంచి దాన్ని సెలెక్ట్ చేసుకుని కాపీ చేసుకోవచ్చును.ఒక నోట్ ప్యాడ్ ఫైలులోకి పేస్ట్ గూడా చేసుకోవచ్చు.యెలా చేసినా ఒక నాలుగైదు సార్లు మనసులో చదువుకుంటే చాలు మర్చిపోకుండా వుండగలుగుతారు! ఆ ప్యార్న్ పుట్టించటంలో ర్యాండం లాజిక్ వాడాను గాబట్టి మిలియన్ల ట్రిలియన్ల సార్లు వాడినా డూప్లికేట్ కాంబినేషన్ రాదు!ఇప్పుడెవరూ ప్రత్యేకంగా లాగిన్ ఐడి అడగటం లేదు,ఈమెయిల్ ఐడి యెట్లాగూ ఉంటుంది గదా అని ఫేస్ బుక్ లాగ!ముందు ముందు నేనూ మారుస్తాను.పాస్ వర్డ్ కూడా రెండుసార్లు మీరు టైప్ చెయ్యటం లేదా ప్యానెల్ ఓపెన్ చెయ్యడం బదులుగా ఒకేసారి ర్యాండం ప్యాటర్న్ ట్రిక్కునే వాడితే పోతుందనిపిస్తున్నది - ప్రజల ప్రోత్సాహాన్ని బట్టి ఇలాంటివన్నీ మరుసటి వెర్షన్లో చేస్తాను!ఒకసారి రిజిస్టర్ అయ్యారంటే ఇక తిన్నగా లాగిన్ అవమే గదా!
పాస్ వర్డ్ మర్చిపోతే నేను మిగతా సైట్ల మాదిరి దశల వారీ కార్యక్రమం యేమీ ఇవ్వట్లేదు.ఇవ్వాళ మెయిల్ సర్వర్లు బాగానే పని చేస్తున్నాయి గాబట్టి "Forgot Password?get help here" నొక్కగానే ఒక డయలాగ్ విండోఓపెన్ అయ్యి మీరు అక్కడ మీ మెయిల్ ఐడి ఇచ్చి "submit" నొక్కగానే నేను తయారు చేసిన ర్యాండం పాస్వర్డ్ జనరేటర్ టెక్నిక్ ఫాలో అయ్యి మీ మెయిల్ అకవుంటుకి మెయిల్ వచ్చేలాగ చేస్తున్నాను. పురజనుల కోరిక పాత పధ్ధతినే కోరుకుంటే తర్వాత అప్డేట్ చేసేటప్పుడు చేస్తాను - నిజాయితీగా చెప్పాలంటే దీన్ని ఉపయోగించుకుని తరచుగా పాస్వర్డ్ మార్చుకోవటం కూడా సమర్ధవంతమైన యాంటీ హ్యాకింగ్ సొల్యూషనే!ఈ మధ్యనే కొన్ని సైట్లలో ప్రతి సారీ లాగిన్ అయ్యేతప్పుడు కొత్త పాస్వర్డ్ వాళ్ళే జనరేట్ చేసి మీ మెయిల్ ఐడికి మెయిల్ చెయ్యటమో మీ ఫోనుకి మెసేజి ఇవ్వటమో చేసి దానితోనే చెక్ చేస్తున్నారు!ఇక్కడ మీ అంతట మీరే ఆ పని చెయ్యవచ్చు.లాగిన్ అయినందుకు గుర్తుగా చిన్న యానిమేస్గన్ నడుస్తుంది - లాగిన్ బాక్స్ పోయి మెయిన్ మెను బటన్సు కనబడతాయి!మూడో బటన్ "Public" గురించి ఇప్పుడప్పుడే పట్టించుకోకండి దాని సంగతి తర్వాత చెప్తాను.రెండో బటన్ "Account" నొక్కితే మీ ముఖ్యమైన వివరాలలో మార్చుకోదగినవి మార్చుకోవడం సాధ్యపడుతుంది.ఇక మొదటి  బటన్ "Games" నొక్కితే ఈ సైటుకల్లా అతి ముఖ్యమయిన భాగం మీ ముందు వుంటుంది!
ఇక్క ఇదివరకు మీరు ఆడిన ఆలు పైన లిస్టులో కనబడతాయి ముఖ్యమైన వివరాలతో!కొత్త ఆ ఆడటానికి అడుగున వున్న "New Game" నొక్కాలి.అది నొక్కగానే ఆట వివరాల్ని నమోదు చెయ్యటానికి అవసరమైన ఫాం తెరుచుకుంటుంది!
మిగతా సైట్లలో మీపేరు మాత్రం తీసుకుని సెకన్లలో మిమ్మల్ని బోర్డు ముందుకు తీసుకెళ్తుంటే నేను ఇన్ని వివరాలు యెందుకు సేకరిస్తున్నాను అని మీకు అనుమానం రావచ్చు - కానీ ఆడిన ప్రతి ఆనీ లిష్టులో చూసినప్పుడు గుర్తు పట్టాలంటే దానికి ఒక పేరు ఉంటే తేలిక కదా!ప్రస్తుతం నేను మీకు స్టాండర్డ్ గేం మాత్రమే చూపిస్తున్నాను,తర్వాత పజిల్ గేం కూడా ఆడే వీలు కల్పిస్తాను.అంటే ఒక ప్రముఖమైన ఆట నుంచి మధ్యలో మొదలు పెట్టి "యిన్ని యెత్తులలో ఇంత సమయంలో ఈ రంగు పావుల్ని గెలిపించగలవా?" అనే చాలెంజి కోసం బోర్డుని సెట్ చెయ్యాలంటే ఈ వివరాలు అవసరమే కదా!ప్రస్తుతానికి అవి వర్క్ చెయ్యకపోయినా ఉండటం వల్ల నష్టం లేదుగా!ఇప్పటికయితే ఆకి ఒక పేరుని రాయండి,మీరు తెల్ల పావులతో ఆడాలనుకుంటున్నారా నల్లపావులతో డాలనుకుంటున్నారా అనేది సెలెక్ట్ చేసుకోండి, "Practice" లేదా "Expert" అనే రెండు రకాలలో యేదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి,"Show Chess Board" న్ నొక్కండి - అంతే!నల్ల్లపావులతో ఆడాలనుకుంటే ఆను క్రియేట్ చేసినది మీరే అయినా తెల్లపావులతో ఆడుతున్న అవతలి వ్యక్తికే మొదటి యెత్తు అవకాశం వస్తుంది తెలుసుగా?కొత్తగా వచ్చారు గాబట్టి మొద "Practice" రకం సెలెక్ట్ చేసుకోండి -  రెండు రకాల పావుల్నీ మీరే కదిలించగలరు గనక సమస్య ఉండదు!
ఇక్కడ మీ ఆటకి రంగస్థలం సిధ్ధమైంది!ఈ మధ్యనే ఫ్లాష్ వాళ్ళు 3డి పరిజ్ఞానాన్ని పరిచయం చేశారు వాళ్ళ అప్లికేషన్ డెవలప్మెంటులో,నేను దాన్ని ఉపయోగించుకున్నాను - చూడటానికి ఫ్లాట్ బోర్డు కన్నా పెర్స్పెక్టివ్ బోర్డు అయితే మీకు రియలిస్టిక్ వాతావరణం కనబడుతుంది.ఆటకి సంబంధించిన అన్ని ముఖ్యమైన కంట్రోల్సు సెంటర్లో ఒకదాని కొకటి అతుక్కుని ఉంటాయి.అన్నిటి గురించి ఒక వరసలో చెప్తాను.

మొదటిది "Show Moves List" మీరు ఇప్పటివరకూ ఆడిన ఆటలోని అన్ని యెత్తులూ ప్రస్తుతం ఫాలో అవుతున్న గేం నొటేషన్ ప్రకారం కనబడతాయి.ఇది టాగుల్ బటన్ - అంటే తెలుసుగా మూసుకుని ఉన్నప్పుడు నొక్కితే తెరుచుకుంటుంది,తెరుచుకుని ఉన్నప్పుడు నొక్కితే మూసుకుంటుంది.ఇందులో గూడా ఒక ప్రత్యేకమైన సౌకర్యాన్ని ఇచ్చాను.మీరు ఒక నలభై యెత్తులు వేశాక పదిహేనో యెత్తులో నలుపు యెత్తుని మరో రకంగా వేస్తే అది మరో రకమైన దిశలో ఆటని నడిపిస్తుందేమో కదా అనిపిస్తే అలా ఆటలో వెనక్కి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది.దీనికోసం కొత్తగా ఆటని వర్ణించేటప్పుడు ఇప్పుడు "ALL MOVES" అని చూపిస్తున్న "You want backstep link for" అనే డ్రాప్ డవున్ లిస్టులో "RECENT MOVE ONLY" అనే మరొక ఆప్షన్ కూడా సెలక్ట్ చేసుకోవచ్చు.అసలు ఈ వెనక్కి వెళ్ళటం అక్కర్లేదనుకుంటే మూడో ఆప్షన్ ఉంది.

రెండవది "Show Positions" మీరు ఇప్పటివరకూ ఆడిన ఆటలోని అన్ని యెత్తుల తర్వాత బోర్డు అమరిక యెలా ఉందో చూపిస్తుంది.ఇక్కడ మాత్రం మామూలుగా కంట్రోలరు యెట్లా బోర్డుని వర్ణిస్తాడో అట్లా తెల్లపావుల వైపు నుంచి బోర్డు మీద పావులు అమరి ఉంటాయి.దీనితో చెయ్యదగిన పనంటూ యేమీ లేదు గానీ నేను మిగతా వాళ్ళ కన్నా భిన్నంగా చదరంగం ఆటలోని అన్ని ప్రత్యేకమైన యెత్తుల్నీ నిజజంగా బోర్డు మీద పావులు పరుచుకుని యెదురెదురుగా కూర్చుని ఆడేటప్పుదు యెలా వేస్తారో అదే మాదిరిగా ఇక్కడ ఇవ్వగలగటానికి మొదట నేను ఒక ప్రత్యేకమైన జోడు ఫంక్షన్లు వాడాను.మిగతా ప్రోగ్రామర్లు అందరూ బోర్డు మీద పావుని కదపటానికి మామూలుగా గేం నొటేషన్ వాడితే నేను బోర్డ్ పొజిషన్ వాడాను.అంటే ఇటువైపు బల్లమీద ఒక యెత్తు తర్వాత బోర్డు పొజిషన్ యెలా ఉంటుందో ఆ అమరికని ఇక్కడి నుంచి సర్వర్ మెమరీలో సేవ్ చెయ్యటం,అటువైపు సర్వర్ నుంచి వచ్చిన ఈ బోర్డు పొజిషన్ ఆధారంగా బల్లమీద పావుల్ని అమర్చడం చేశాను.దానివల్లనే తెల్ల పావులతో ఆడుతున్న ఆటగాడికి తెల్లపావులు కింద వున్న స్థితి, నల్ల పావులతో ఆడుతున్న ఆటగాడికి. నల్లపావులు కింద వున్న స్థితి - రెండూ సహజంగా అమరుతున్నాయి.ఇప్పుడంటే ఫ్లాష్ వాడుతున్నాను గాబట్టి బోర్డును రొటేట్ చేస్తున్నాను గానీ మొదట HTML లో ఇట్లా తిప్పడం కుదరక పోయినా తెల్ల ఆటగాడికి తెల్లపావులు కిందవైపుకీ నల్ల ఆటగాడికి నల్లపావులు కిందవైపుకీ వచ్చేలాగ చెయ్యగలిగాను!

మామూలుగా అయితే ఈ తెల్ల ఆటగాడు తనవైపు నుంచి చూసే అమరికని నల్ల ఆటగాడికి రివర్సులో చూపించడం చాలా కష్టం!దాని కోసం ఆలోచిస్తూ బోర్డు పొజిషన్ మరియూ బల్లమీద పావుల్ని అమర్చడానికి పెట్టిన నియమాలనీ మధిస్తుంటే ఒక అద్భుతమైన క్లూ దొరికింది!నేను ఈ పొజిషన్ కోడుని యెట్లా సర్వరు లోకి పంపిస్తున్నానంటే పైనుంచి కిందకి యెడమనుంచి కుడికి ఖాళీలు ఉన్నచోట "*" పెట్టి వీటిని "_" తో కలిపి ఒక దారంలాగ పంపిస్తున్నాను.అసలు యే పావునీ కదపక ముందు ఒకసారి బోర్డు అమరికని చూడండి - తెల్ల ఆటగాడికి కుడివైపున కిందివరసలో తెల్లగడి వచ్చేలాగ ఆటగాళ్ళు చదరంగం బల్లని అమర్చుకోవాలి,కదా?యెనుగులూ,గుర్రాలూ అన్నీ జంటలుగా ఉన్నాయి గాబట్టి చివరి నుంచి మధ్యకి అటూఇటూ ఒకే వరసలో ఉండేటట్టు చేశారు,సరేనా!ఇక మిగిలిన రాణినీ రాజునీ మామూలు లెక్క ప్రకారం తెల్లరాజుని తెల్లగడిలో నల్లరాజుని నల్లగడిలో ఉంచకుండా చిన్న మార్పు చేశారు,తెల్లరాణిని తెల్లగడిలో నల్లరాణిని నల్లగడిలో వచ్చేటట్టు మార్చారు.నాకదే కలిసొచ్చింది!నేను గనక ఆ బోర్డు పొజిషన్ కోడ్ దారాన్ని స్ప్లిట్ చేసి ఒక అర్రే లోకి పంపి రివర్స్ చేసి మళ్ళీ దాన్ని మామూలు పధ్ధతిలో కలిపేస్తే చాలు మొదటి దారంలో నాలుగో పొజిషన్లో ఉన్న నల్ల రాణి తిరగేసిన దారంలో అయిదో పొజిషన్లోకి చక్కగా అమిరిపోతున్నది, యేమి అద్భుతం?!అట్లా కాకపోయుంటే ప్రతి పొజిషను కోసం ఒక రివర్సు పొజిషను లెక్కవేసుకుంటూ ఉండాల్సి వచ్చేది,ఈనాడు నాకు ప్రాణానికి సుఖంగా ఉండటానికే ఆనాడు వాళ్ళట్లా చేశారేమో అనిపించింది -  నిజం!

ఇక ఆటకి సంబంధించిన కంట్రోల్సు ఇద్దరికీ సమానమే కాబట్టి కిందవైపున వున్న వరసలో వాట్ని గురించి చెప్తాను.డ్రా అనే ఒక యెత్తు కోసం మూడు బటన్లు పెట్టాను,యెందుకో తెలుసా?మీరు డ్రా చెయ్యాలనుకోగానే సరిపోదు,అవతలి ఆటగాడికి ప్రొపోస్ చెయ్యాలి,అతను ఒప్పుకున్నాకనే డ్రా పూర్తి అవుతుంది.అందుకని మొదట "REQUEST DRAW" పెట్టాను.అయితే ఇక్కడ దీన్ని క్లిక్ చెయ్యగానే దానిమీద ఉన్న చెక్ బాక్స్ "ON" స్టేట్ లోకి వెళ్తుంది.వెంటనే డ్రా అయిపోదు.యెదటి ఆటగాడికి తెలియాలి అంటే సర్వర్ అప్డేట్ కావాలి,కాబట్టి మీరు ఒక యెత్తు వెయ్యాలి - అది "డ్రా యెత్తు" అవుతుందన్నమాట! అవతలివైపున మీ యెత్తుతో పాటు మీరు డ్రా యెత్తు వేశారన్నందుకు గుర్తుగా మీ రంగు "REQUEST DRAW" చెక్ బాక్సు "ON" స్టేట్ లో  కనబడ్డం వల్ల అతనికి తెలుస్తుంది.అప్పుడు అతను తీసుకునే రెండు రకాల నిర్ణయాలకీ రెండు బటన్లు "REJECT DRAW","ACCEPT DRAW" పెట్టాను.నిజంగా ఆడేటప్పుడు యెదటి ఆతగాడు తన యెత్తు వేశాక మనం జస్ట్ డ్రా అడగటం అతను ఒప్పుకోకపోతేనే మనం పావుని కదల్చాల్సి వచ్చినా ఇక్కడ మాత్రం డ్రా యెత్తు తప్పనిసరి!

కింది వరసలో కనిపించే వాటిల్లో యెడమ పక్కన ఉన్నది తేలిగ్గానే అర్ధమవుతుంది - "RESIGN" మీరు రిజైన్ చెయ్యదల్చుకున్నప్పుడు దీన్ని నొక్కాలి.దీనికి మీరు ప్రత్యేకంగా యెత్తు వెయ్యనక్కర లేదు,కానీ గభాల్న కనబడే డయలాగ్ బాక్సులో పొరపాటున నొక్కకపోతే "CONFIRM",ఒకవేళ అనుకోకుండా నొక్కి వుంటే "CANCEL" నొక్కితే చాలు ఓ పనైపోతుంది!కిందివరసలో కుడివైపున ఉన్నది "ATTACK" ఇది మీరు యెదటివాళ్ళకి "షా" చెప్పడానికి ఉపయోగించుకోవాలి.వూర్కే "REJECT" తో సిమెట్రీ కోసం "ATTACK" అని పెట్టాను,అంతే!దీన్ని క్లిక్ చెశాక తప్పనిసరిగా యెత్తు వెయ్యాలి - మరి చెక్ చెప్పేసి కూర్చుంటే ఆట ముందు కెళ్ళదు గదా?ఇందులో ఇంకో తిరకాసు ఉంది, మీరు వెయ్యబోయేది అన్నివిధాలా చెక్ చెప్పటానికి తగిన యెత్తు అయినప్పటికీ మిగిలిన చోట్ల లాగా ఆటోమాటిక్ చెక్ నోటిఫికేషన్ ఇవ్వలేదు నేను.మీరు దీన్ని నొక్కి చెక్ బాక్స్ ఆన్ స్టేట్ లో ఉంటేనే అటువైపు ఆటగాడికి మీరు చెక్ చెప్పినట్టు తెలుస్తుంది - జాగ్రత్త మరి!

అన్నీ ఒక వరసలో చెప్తానని మాటిచ్చి వీటికన్నా పైన ఉన్న అంత అందమైన అధరాల్ని వర్ణించకుండా వొదిలేశాడు సుమీ అని తెగ ఇదయిపోమాకండి.ఈ 3డి అమరికలో ఉన్న ఒక ఇబ్బందిని తొలగించడానికి దాని ఉపయోగం యెంతయినా వుంది - మీరు చక్కగా నొక్కి పులకించవచ్చు!బోర్డు 3డిలో వంగడం వల్ల ఒక పావుకి వెనకాల ఉన్న పావుని కదిలించాలంటే యేమి చేయాలి?ఆ పెదిమల్ని యేదో ఒక చివర్న కొంచెం నొక్కాలి - అప్పుడు ఆ పెదిమలూ వాటికి వ్యతిరేక దిశలో బోర్డూ ఐమూలకి తిరుగుతాయి - ఇప్పుడు మీరు యే పావునైనా చాలా తేలిగ్గా కదపవచ్చు.కొంచెమే తిరుగుతుంది గాబట్టి పావుని యే గడిలోకి కదల్చాలన్నది స్పష్టంగానే తెలుస్తుంది, యేర్పాటు బావుందా!

ఇంక అన్నిటికన్నా కిందవరసలో ఆకుపచ్చగా బ్లింక్ అవుతున్నది మీరు యెత్తువెయ్యడానికి తొందర చేస్తుంది,దానిపైన చూపించే టైము అవతలి పావును కదిపాక మీరు యెంత టైము తీసుకుంటున్నారనేది చెప్తుంది,అంటే టైమర్లతో సహా ఒక టోర్నమెంటు బోర్డునే ఇక్కడ మీకు చూపిస్తున్నాను,యెట్లా వుంది?

ఒకసారి ప్రాక్టీస్ గేం పూర్తి అయ్యేసరికి బోర్డు బాగా అలవాటు అయి వుంటుంది గాబట్టి ఇక ఎక్స్పర్ట్ గేం గురించి చెప్తాను.ఈ ఆట ఆడాలంటే అటువైపు యెవరో ఒకరు ఉండాల్సిందే!నేను కావాలనే మిగతా సైట్లలో ఇచ్చినట్టు అనామకపు ప్రోగ్రామింగ్ లాజిక్ మీద ఆడే యేర్పాటు చెయ్యడం లేదు,నా ముఖ్యమైన ఉద్దేశం చదరంగం ఆటతో జనాన్ని కలపడం కాబట్టి అటుకేసి ఆలోచించలేదు.ప్రాక్టీస్ ఆటలో కూడా మొదట్లో ఆన్లైనులో కొన్నిచోట్ల ప్రముఖ ఆటగాళ్ళు ఆడిన ఆటల లిస్టులు కనబడుతున్నాయి - అక్కడ మాదిరిగా ఆల్ని లోడ్ చేసుకుని "<" బటనూ ">" బటనూ నొక్కుతూ గడిపే ప్రివ్యూ తరహా విధానం ఇద్దామా అని టెంప్ట్ అయ్యి కూడా మానుకున్నాను.మీరు ఒకపని చెయ్యవచ్చు,ఆ ఆటల్లో బాగా నచ్చినవి ఇక్కడ ఒక్కొక్క యెత్తూ వేసి అడుకుని రెఫరెన్సుగా వుంచుకోవచ్చు!ఇపుడిక మనం ఒక ఎక్స్పర్ట్ గేం ఆడటానికి ఇతర్లతో యెట్లా కనెక్ట్ అవ్వాలో వివరంగా చెప్తాను.మొదత గేం డెఫినిషన్ విండోలో ఎక్ష్పెర్ట్ రేడియో బటన్ నొక్కి వుంటే తర్వాత తెరుచుకునే విండో ఇట్లా ఉంటుంది:
ఇక్కడ మీరు రెండురకాలుగా కనెక్త్ అవవచ్చు,"INSTANT" అంటే అప్పటికప్పుడు జరిగిపోయేది!దీనికి అవతలి వ్యక్తి "User Space" లో ఉండి తను ఎక్స్పర్ట్ గేం ఆడుతూ ఉండకుండా ఫ్రీగా ఉండాలి!ప్రస్తుతం అలా ఖాళీగా ఉన్న ఈ  సైటు మెంబర్ల లిస్టు కనబడుతుంది.ఆ మెంబరు వివరాల్లో చివర ఉన్న రేడియో బటన్ నొక్కి ఆ మెంబర్ని సెలెక్ట్ చేసుకుని కింద ఉన్న "SEND" బటన్ నొక్కగానే మీవైపున ఒక వెయిట్ విండో తెరుచుకుంటుంది.
మీరు ప్రస్తుతం చెయ్యడానికేమీ లేదు అవతలి వ్యక్తి యేదో ఒక నిర్ణయం తీసుకునే వరకు - కాబట్టి యే బటనూ ఉండదు ఇక్కడ!ఇక్కడ మీరు గుర్తుంచుకోఅవలసిన విషయం ఒకటి ఉంది.ఈ రెండురకాల కనెక్షన్లు మీరు లాగిన్ అయి వున్నారా యేదయినా ఎక్స్పర్ట్ గేము ఆడుతున్నారా అని  నోటిఫై అవడాన్ని బట్టి పని జరుగుతుంది కనక లాగిన్ అయిన ప్రతిసారీ లాగౌట్ అవ్వాలి.ఒకవేళ హఠాత్తుగా కంప్యూటరు క్రాష్ అయినా మళ్ళీ ప్రాబ్లెం సరవగానే లాగిన్ అయి లాగౌట్ అయ్యేటంత నిష్ఠగా ఉండాలి ఆ విషయంలో.అలాగే ఆటని కూడా "LEAVE GAME" బటన్ ద్వారానే మూసెయ్యాలి!లేదంటే మీ పేరు ఇతర్ల గేం స్క్రీనుల్లో కనపడుతూనే ఉంటుంది.
మీవైపున వెయిట్ విండో తెరుచుకున్న సమయంలోనే అవతలి వైపున ఒక ఆప్షన్ డయలాగ్ విండో తెరుచుకుంటుంది,వేరేవాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటే మీవైపున కూడా ఇదే రకమైన విండో తెరుచుకుంటుంది.ఇందులో ఆకి సంబంధించిన ముఖ్యమయిన వివరాలతో పాటు రెండు బన్సు వుంటాయి -  "ACCEPT" మరియూ "REJECT", మీరు నిర్ణయించుకోవలసిన రెండు ఆప్షన్లు అవి!అవతలి వ్యక్తి తిరస్కరిస్తే మీరు మరొక రేడియో బటన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది! అవతలి వ్యక్తి ఆమోదిస్తే మీవైపున వెయిట్ విండో పోయి కంటిన్యూ విండో వస్తుంది.అక్కడ ఉన్న "CONTINUE" బన్ నొక్కితే మీరు ఆకి సొంతదారుగా రంగస్థలం లోకి వెళ్తారు.మీకు రిక్వెస్ట్ వచ్చి మీరు ఆమోదించినా ఒక కంటిన్యూ విండో వస్తుంది.ఆ బన్ నొక్కగానే ఆహ్వానితులుగా ఆటకి సంబంధించిన రంగస్థలం లోకి ప్రవేశిస్తారు.
ఇక రెండో రకం "PENDING" కనెక్షన్ యెన్నుకోవాలంటే చివరి వరసలో ఉన్న రేడియో బన్ నొక్కి "SEND" బన్ నొక్కాలి. అప్పుడు పైన చూపించిన మరో లిష్టు వస్తుంది.ఇది కూడా మొదటి లిస్టులాగే ఉంటుంది - కాకపోతే వీళ్ళలో యెవర్ని సెలెక్ట్ చేసుకుని "SEND" నొక్కినా అవతలి వ్యక్తి మెయిల్ అకవుంటుకి ఒక కస్టమైజ్డ్ మెస్సేజి వెళ్తుంది,అంతే!ఇక్కడ ఇంక పని యేమీ ఉండదు. అతను తన మెయిల్ చూసుకుంటేనే తనంతట తను మీ ఆహ్వానానికి జవాబు చెప్పగలడు.ఈ రకం కనెక్షను యెవరు దొరికితే వాళ్లతో కాకుండా ఇప్పటికిప్పుడు కనెక్ట్ అయ్యే స్థితిలో లేకపోయినా సరే ఫలానా వ్యక్తి తోనే ఆడాలి అనుకున్నప్పుడు పనికొస్తుంది. అయితే నేను అలా వొదిలెయ్యకుండా మీకు మరో వెసులుబాటు కూడా ఇచ్చాను - మీరు మీ అకవుంటులోకి ప్రవేశించగానే మీకు గనక యెవరయినా పెండింగ్ రిక్వెస్ట్ పంపించి ఉంటే ఆ వివరం మీకు చిన్న బ్లింక్ మెస్సేజి వస్తుంది.ఆ మెస్సేజిని చూగానే "Public" బటన్ నొక్కితే "Requests","Sessions" అనే రెండు బన్లు వస్తాయి.మొదటిది నొక్కితే మీరు యాక్సెప్ట్ చెయ్యాల్సిన గేములన్నీ కనబడతాయి.
ఈ లిస్టు కూడా మామూలుగా ఈ సైటులో అన్నింటిలాగే ఉంటుంది.కాకపోతే వరసలో తక్కువ వివరాలే వస్తాయి కాబట్టి అన్ని వివరాలూ చూడాలంటే పేరుని క్లిక్ చేస్తే కనబతాయి.వరసలో చివరి బటన్ నొక్కితే ఇక్కడ కూడా ఆమోదించటానికీ తిరస్కరించటానికీ ఉపయోగపడే విండో తెరుచుకుంటుంది.ఆమోదించినా తిరస్కరించినా ఇక ఆ వరసలో ఉన్న గేము మీద నిర్ణయం తీసేసుకున్నారు గాబట్టి ఆ గేము వరస లిస్టులో నుంచి పోతుంది.
ఇంక పబ్లిక్ బటన్ నొక్కగానే వచ్చే బటన్లలో రెండోదైన "Sessions" బన్ నొక్కితే మీరు సొంతదారుగా గానీ ఆహ్వానితులుగా గానీ కనెక్ట్ అయిన ఆలు అన్నీ కనబదతాయి.ఇక్కడ యే ఆకి సంబంధించి అయినా సరే అవతలి వ్యక్తికి ఆ గేము ఆడటానికి ఒక సమయం యెన్నుకుని మెయిల్ పంపించవచ్చు.అట్లా ఇద్దరూ ఒకే సమయానికి లాగిన అయ్యి ఆ ఆటని కంటిన్యూ చెయ్యవచ్చు!ఎక్స్పర్ట్ గేముకి మరో అదనపు ఆకర్షణ చాట్ కంట్రోలు!మొదట్లో ఎక్స్పర్ట్ గేములో వెనక్కి వెళ్ళే చాన్సు తీసుకుంటే దాన్ని యెలా హ్యాండిల్ చెయ్యాలో తెలియక అవతలి వ్యక్తికి తెలియపరచే ఉద్దేశంతో పెట్టాను,కానీ తర్వాత అక్క కూడా చాయిస్ విండోలతో చేస్తే తప్ప పని జరగదని తెలిసి దాన్ని కూడా కనెక్షను మాదిరిగానే నడిపించినా ఉన్నదాన్ని తీసెయ్యడ మెందుకని దీన్ని తీసెయ్యలేదు!బోర్డు అంతా టోర్నమెంటు లెవెల్లో ఇచ్చినా నిజం టోర్నమెంటు కాదుగా - ఆట మధ్యలో మీరు చాటింగ్ కూడా చేసుకోవచ్చు - నా అసలు లక్ష్యం కూడా మనుషుల్ని చదరంగం ద్వారా కలపడమే కదా!
హమ్మయ్య నాసుత్తి అయిపోయింది?మీరిక అక్కడికెళ్ళి ఇరగదీసెయ్యండి!

Wednesday, 3 June 2015

బాబుకి ఈ శాస్తి జరగాల్సిందే!లేకపోతే చందుని తక్కువ అంచనా వేస్తాడా?

     ఆనాడు మదరాసు వాళ్ళు యెప్పుడయితే పొమ్మన్నారో ఆంధ్రకేసరి మొదట్లో మదరాసు లేని ఆంధ్రాకి తను అస్సలు వొప్పుకోకపోయినా తప్పనిసరై వదలాల్సి వస్తే నిముషాల్లో ఆంధ్రాకే వచ్చేసి పరిపాలన తొలిరోజు నుంచే స్వరాష్ట్రం నడిబొడ్డున నిలబడి కొనసాగించాడు - తెరచాటు రాజకీయాల మీద చూపు లేని మానధనుడు గనక!మరి చంద్రబాబునాయుడు సంవత్సరం గడుస్తున్నా ఇంకా భాగ్యనగరంలోనే ఉండి యేం పీకుదామనుకున్నాడు?పరిపాలన పొరుగు రాష్త్రం నుంచి చెయ్యాల్సిన ఖర్మ దేనికి?

     రెండు కళ్ళ సిధ్ధాంతమూ తెలుగువాళ్ళని కలపాలనే మహత్తర ఆశయాలూ అన్నీ చచ్చు మాటలు.?ఇవ్వాళ అలాంటి మహోన్నతాశయాలు అతనితో సహా యే రాజకీయ నాయకుడికీ లేవు గాక లేవు, వున్నాయని యెవరయినా నిరూపిస్తే నా చెవి కదపాయిస్తా!బాబు చాలాసార్లు పైకే చెప్పినట్టు కేసీఆర్ వేస్ట్ క్యాండిడేట్ అని తెలంగాణా ప్రజలకి చెప్పి 2019లో తెలంగాణాలో కూడా గెలిచి కాలరెగరెయ్యాలని సరదా పడుతున్నాడు.పోనీ ఆ సరదా తీర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు గొప్పగా ఉన్నాయా అంటే అదీ లేదు!ఇంతవరకూ ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాల మధ్య సాంకేతికంగా ఒకరి మీద మరొకరు ఆధిక్యత సాగించే యెత్తుగడల్లో తెలంగాణ ప్రభుత్వం దూకుడుగా వెళ్ళి పైచేయి అనిపించుకోవడమూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నత్తి మాటలు మాట్లాడటమో అర్ధాంతరంగా వెనక్కి తగ్గడమో యెందుకు చేసింది?అప్పటికే కేసీఆర్ వ్యూహాత్మకంగా బాబు తెలంగాణాని బద్నాం చెయ్యాలనే ఇక్కడ ఉన్నాడు,తెలంగాణాని విఫల ప్రయోగం చెయ్యాలని కుట్రలు పన్నుతున్నాడు అని స్టేటుమెంట్లు ఇచ్చేసి తెలివిగా ఇరికించేశాడు గాబట్టి గట్టిగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పట్టుబడితే తప్పకుండా కేసీఆర్ దాన్ని అదుగో నేను ముందే చెప్పాను గదా బాబు తెలంగాణకి నష్టం చేస్తున్నాడు చూడండి అనేటట్టు మెలితిప్పి తనకి పనికొచ్చేటట్టు ఉపయోగించుకుంటాడు గనక వెనక్కి తగ్గడం కాదా?నువ్వు సమర్ధుడివని 13 జిల్లాల ప్రజలు నీకు అధికారం అప్పగిస్తే పొరుగు రాష్ట్రం వైపు చూపు పెట్టి సొంత రాష్ట్రానికి బొక్కపడెయ్యటం యేమి తెలివి?

     సొంతప్రజలకి బొక్క పడినా పకపోయినా రాజకీయాల్లో యెదటివాడి మీద గెలుపు సాధించాలంటే యెఫెన్సివ్ స్ట్రాజీయే పని చేస్తుంది తప్ప కేసీఆర్ తనని అన్ని మాటలంటున్నా మా పార్టీ నుంచి వెళ్ళినవాళ్ళే మమ్మల్ని తిడుతున్నారు,మా దగ్గిర పనిచేసి నేర్చుకున్న వాడేగా అనే పుచ్చొంకాయ డిఫెన్సివ్ స్ట్రాటజీ యెట్లా పని కొస్తుంది!ఇప్పుడు జగన్ తరపున పాతకాపులైన రెడ్లూ కేసీఆర్ కొత్తగా పైకి తీసుకొస్తున్న వర్గాలూ గట్ట్టిగా కలిసిపోతే ఇక శాశ్వతంగా తెలంగాణలో దుకాణం యెత్తెయ్యాల్సిందే - ఇప్పుడున్న క్యాడరు బలం యెన్నికల్లో నాలుగు వరస ఓటముల తర్వాత ఉండదు.

     రేవంత్ రెడ్డి గొవని కేసీఏఅర్ అంత తేలిగ్గా వదలడు.బాబు పేరు బైటికొచ్చింది గనక తప్పకుండా బాబుని కూడా లాగుతాడు, అదీ నదురూ బెదురూ లేని రాజకీయమంటే!అలాంటి కేసీఆర్ ఇలాంటి జగన్ కలిస్తే ఇంక బాబుకి యెలాంటి రిజల్ట్ వస్తుందో తేలిగ్గానే వూహించుకోవచ్చు!తెలంగాణలో కేసీఆర్ ఉన్నంతవరకూ యెఫెన్సివ్ స్ట్రాటజీ పనిచెయ్యదు,డిఫెన్సివ్ స్ట్రాటజీ ఇట్లాంటి ఫలితాన్నే ఇస్తుంది!ఇద్దరు కూబి నాయుళ్ళకీ తెలివి ఉంటే జగన్ మీద కేసులు యెత్తి వేసి వాణ్ణి కేసీఆర్ మీదకి వొదిల్తే అప్పుడు కేసీఆర్ రాజకీయంగా కొంత ఇబ్బంది పదవచ్చు.అందుకే తను ముందుచూపుతో అతన్ని తనవైపుకి లాగేసుకుంటున్నాడు - వాళ్ళిద్దరి మైత్రీ బలపడితే తెలంగాణలో కేసీఆర్ ఇక దుర్నిరీక్ష్యమైన తేజస్సుతో చెలరేగిపోతాడు - తెలంగాణ ఇక పూర్తి రాజరికంలోకి వెళ్ళిపోతుంది కాబోలు?ముఠాలు కట్టి తనవాళ్ళకే అన్నీ దఖలు పర్చుకున్న అప్పటి బ్రహ్మానంద రెడ్డి నుంచి తెలంగాన ఉద్యమం పతాక స్థాయికి వచ్చి కేంద్రం ఓకవైపున విభజన మొదలు పెట్టాక కూడా ఒక్క నయాపైఅస ఇవ్వను ఫో అన్న కిరణ్ కుమార్ రెడ్డి వరకూ ఇప్పటి దాకా బహిరంగంగా కొవ్వు చూపించిన ఈ రెడ్లూ తమ తాతల నాటి దివాణాల ప్రభావం నుంచి బయటపడని ఈ వెలమలూ వాళ్లలోని ఫ్యూడల్ భావజాలం ప్రభావంతో తెలంగాణని మధ్యయుగాల్లోకి తీసుకెళ్ళీ నిలబెట్టే ప్రమాదం ఉంది!తెలంగాణా యెక్కడి కెళ్ళినా అక్కడి మేధావులు చూసుకుంటారు గానీ బాబుని తొందరగా గెంటేస్తే ఆంధ్రాకి పూర్తికాలం స్వరాష్త్రం నుంచే పని చేసే ముఖ్యమంత్రి వస్తాడు!

     యే విధంగా చూసినా బాబు ఇక తట్టాబుట్టా సర్దుకుని ఆంధ్రాకి పోవాల్సిందే - యెఫెన్సివ్ స్ట్రాటజీలో వెళ్తే కేసీఅర్ తనకి అనుకూఒలంగా ఉపయోగించుకోవడం డిఫెన్సివ్ స్ట్రాటజీలో వెళ్తే ఇప్పటిలా దొరికిపోవడం తప్ప యే ప్రయోజనమూ ఉండదని తెలుసుకుని తెలంగాణని కేసీఆర్ మానానికి వొదిలేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తి స్థాయి ముఖ్యమంత్రిగా సెటిలయిపోవడం మంచిది?!

P.S::కేసీఆర్ ఆంధ్రావాళ్లకి పనికొచ్చే ఇట్లాంటి మంచిపన్లు చేస్తుంటే నేను మనసారా అభినందిస్తాను,ఇందులో యెలాంటి వెతకారమూ లేదు - నమ్మండి!

ఏడుపు గురించి కూడా యాడవాల్సింది చాలా ఉందండోయ్!

పాపం చెట్లకి ఏడుపు రాదు . వాటికి ఏడుపు రాకపోవటమే మంచిదైంది . చెట్లకి కాక మిగిలిన అన్ని జంతువుల ఏడుపులకే ఇంత విసుగొస్తుంటే వాటి...