"Veni,Vidi,Vici" - అన్నట్టు మీడియా చేసిన అతి వూహాగానాలతో మోదీ ప్రత్యేకహోదా గురించి ప్రకటన చేస్తాడని నమ్మినవాళ్ళ ఆశల మీద ఇంత మట్టీ ఇన్ని నీళ్ళూ జల్లి పోయాడు ప్రధాని మోదీ!అలాంటి వాళ్ళకి మాత్రం అమరావతి శంకుస్థాపన కార్యక్రమం "ఆపరేషన్ సక్సెస్,బట్ పేషెట్ ఈజ్ డెడ్" అన్నట్టు కనిపించినా ఆ సన్నివేశం ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా చెయ్యడం అనే చంద్రబాబు లక్ష్యం మాత్రం నెరవేరింది!మొదటి నుంచీ భాజపా తరపున యెవరూ గట్టి హామీ ఇవ్వకపోయినా శుభకార్యానికి వచ్చేవాడు తీపి కబురు చెప్పడం అనే సంప్రదాయాన్ని పాటించకపోతాడా అనే అమాయకత్వం తప్ప ప్రత్యేకహోదా దక్కుంతుందనేటందుకు యే గట్టి ఆధారమూ లేదు, ఆధారం లేకుండా ఆశ పడితే భంగపాటు తప్పదు కదా!ఆంధ్రులకి ఆశపడి భంగపడటం వారసత్వం అయిపోయినట్టుంది!మన పెద్దలు తమిళుల నుంచి విడిపోయినప్పుడు ఒకే భాష మాట్లాడేవాళ్ళు గాబట్టి సరిగ్గా అప్పుదే నిజాము పరిపాలనకి వ్యతిరేకంగా పోరాడి విముక్తమయిన హైదరాబాదు రాష్ట్రాన్ని కూడా కలిపి ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వతోముఖమైన అభివృధ్ధిని సాధిస్తుందని యెన్నో కలలు కన్నారు - యేమైంది?దశాబ్దం పైన రెండేళ్ళ పాటు ప్రపంచమంతా వినేటట్టు బూతులు తిట్టుకుని విడిపోయారు!రాజకీయాలకి సెంటిమెంట్లు ఉండవు,చరిత్రకి పక్షపాతం ఉండదు,కాలానికి దాక్షిణ్యం ఉండదు - జీర్ణమంగే సుభాషితం!?
అభివృధ్ధి నంతా ఒకచోట పోగేశాడని చంద్రబాబుని ఒక్కణ్ణే తిట్టి లాభం లేదు,చాలా కాలం క్రితమే కొందరు దార్శనికులు విజయవాడని రెండవ రాజధానిని చెయ్యాలని ప్రతిపాదించినప్పుడు ఆ ప్రాంతం నుంచి హైదరాబాదు వెళ్ళి స్థిరపడిన వారే తమ ప్రాభవం తగ్గుతుందని పడనివ్వలేదు,ఇప్పుడేమయింది - కేసులు పెట్టి మెడ పట్టుకు గెంటీనంత పనిచేస్తే బిక్క చచ్చిపోయి వస్తున్నారు!మొత్తం రాష్ట్రానికి రాజధాని ముఖద్వారం కాబట్టి రాజధానిలో హడావిడి ఉండాల్సిందే,కానీ చేపల పెంపకం కేంద్రాలు కూడా అక్కదే ఉండాలా?ఇప్పుడు విభజన చట్టపు 9,10 షెడ్యూళ్ళలో చేర్చబడి తెలంగాణా ముఖ్యమంత్రి మా రాష్త్రంలో ఉన్నాయి గాబట్టి మావే అంటున్నవి వందల్లో ఉన్నాయి - తాము యెక్కడుంటే ఆన్నీ అక్కడే ఉండాలి,మందబలం కోసం తమ కులం వాళ్ళనే పైకి తీసుకు రావాలి అనుకుంటే మొదట్లో కధ బాగానే నడుస్తుంది, క్లైమాక్సు మాత్రమే ఇట్లా యెదురు తంతుంది!కనీసం తెలంగాణలో పొరుగు జిల్లాలకి కూడా పాకించలేదు అభివృధ్ధిని, యెందుకని?ఆంధ్రోళ్ళని అమ్మనాబూతులూ తిట్టినా శంకుస్థాపన కార్యక్రమలో చప్పట్లు కొట్టించుకున్న కేసీయారూ,ఇంటికెళ్ళి ఆహ్వానపత్రం అందించి కేటీయారుతో అంకుల్ అని పిలిపించుకున్న చంద్రబాబూ ఇద్దరూ ఇద్దరే!అక్కడ కాంగ్రెసు ఉంది గనకనే విభజన ఇంత యేకపక్షంగా జరిగిందని చెప్పడానికి వీలు లేదు,భాజపా చేసినా ఇట్లాగె జరిగి ఉండేది!ప్రజల్లో ఉన్న మనలాంటి తెల్లమొహాలకి అర్ధం కాకపోయినా,పైకి చంద్రబాబు సమన్యాయం అని గోల చేసినా విభజన ఉద్యమం వెనక ఉన్న ఉద్దేశంలోనే సమన్యాయం యెట్టి పరిస్థితిలోనూ కుదరని ఒక పీటముడి ఉంది.నిజంగానే సమన్యాయం పాటించి అన్నీ సమానంగా పంచితే ఇప్పుడు తెలంగాణ కున్న ధీమా తగ్గుతుంది,అప్పుడు వాళ్ళు యేమంటారో తెలుసా?ఇన్నేళ్ళుగా మీ మూలంగా వెనకబడి సొంతంగా నిలదొక్కుకోవటానికి విడిపోతుంటే ఇప్పుడూ ఖాళీచిప్ప ఇస్తున్నారు అని కొత్త పల్లవి లంకించుకునేవాళ్ళు!కాబట్టి యెప్పుడు యెవడు విదగొట్టినా విభజన భారం మొయ్యాల్సింది మాతృరాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని పై స్థాయిలో ఉన్నవాళ్ళలో ప్రతి ఒక్కడికీ ముందే తెలుసు,మనకి ఇప్పుదు తెలుస్తున్నది,అది మన అజ్ఞానం+అమాయకత్వం!
ఆంధ్రోళ్ళ తప్పేమిటంటే మూలాన్ని మర్చిపోయి తొందరగా పరాయి సంస్కృతిని కావిలించుకోవటం.ఒక తమిళుడు ప్రపంచంలో యే మూలకి వెళ్ళినా తన భాషని మర్చిపోడు,తన సంస్కృతిని కూడా తనతోనే మోసుకెళ్తాడు.కానీ తెలుగువాడు తెలుగుని తొందరగా మర్చిపోగలడు,తెలుగుదనాన్ని కూడా వొదులుకోగలడు!తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం తెలుగుని అధికార భాషగా మళ్ళీ రెండు ముక్కలయ్యేవరకూ చేసుకోలేకపోయింది - సిగ్గుచేటు!ఇంకొకటి, యెక్కడ ఉంటే అక్కడ తను అక్కడివాళ్ళకి సృష్టించి ఇచ్చిన సంపద వల్ల తనకు కృతజ్ఞతాపూర్వకమైన గౌరవాభిమానాలు వచ్చి పడతాయనే వెర్రి - అప్పుడు తమిల తంబీ ఇప్పుడు తెలంగాణ తమ్ముడూ రౌడీతనం దొంగతనం అంటగట్టి తరిమేశాక ఇప్పటికయినా బుధ్ధి వచ్చిందో లేదో రేపు రాయలసీమ వాళ్ళు చెప్పాలి!ఇలాంటి వెర్రులన్నీ ఒక స్థాయిలో మనల్ని చూసి మనం నవ్వుకోవడానికి పనికొస్తాయి కాబట్టి ప్రమాదకరం కాకపోవచ్చు గానీ వీటన్నిటికన్నా అత్యంత ప్రమాదకరమైన వెర్రి - నాయకుల్ని అతిగా నమ్మి మోసపోవడం మాత్రం తారాస్థాయిలోనే ఉంది!కొన్ని దశాబ్దాల పాటూ కేంద్రంలో ఉన్నవాళ్ళకి మనం ఆంధ్రాని అభివృధ్ధి చేసినా చెయ్యకపోయినా వాళ్ళు చచ్చినట్టు మనకే వోటు వేస్తారు అనే ధీమాని ఇచ్చాం!ఇప్పటికీ ఈ రెండు రాష్ట్రాల్లోని తెలుగువాళ్ళకి ఆ వెర్రి వదలటం లేదు - ఇప్పుడప్పుడే వొదిలే సూచనలు కూడా కనపడటం లేదు!ఇద్దరు ముఖ్యమంత్రులకీ సమస్యలతో కూడిన విభజనయే లాభసాటి!నాలుగేళ్ళ తర్వాత చెప్పినవి చెయ్యకపోతే మిమ్మల్ని ఓట్లడగను అంటున్న కేసీఆర్ అప్పుడు నాలిక మడతేసి "ఆంధ్రోళ్ళు మనిష్త ప్రకారం విడిపోనియ్యలే, కొర్రిలు పెట్టిర్రు, బద్నాం చేసిర్రు" అనడానికి సమస్యలతో కూడిన తెలంగాణ పనికొస్తుంది గానీ అన్నీ అమర్చిపెట్టి ఇస్తే కుదరదు గదా!బాబుకి విభజన సరిగా జరగలేదు అనే పాట దొరికింది గదా!
చంద్రబాబుకి 2019లో మళ్ళీ తెదెపాని అధికారంలోకి తీసుకురావడానికి పనికొచ్చేవి మూడు - రాజధాని నిర్మాణం,రాయలసీమ నుంచి విభజన రాగం రానివ్వకుండా పట్టి ఉంచటం,పోలవరం పూర్తి చేసి చూపించటం!వీటన్నింటిలో అద్వితీయ రాజధాని నిర్మాణాన్ని ప్రపంచ స్థాయిలో యెత్తుకోవడం లోనే చంద్రబాబు చాణక్యం బయటపడుతుంది!2018లోపు రంగురంగుల ముఖచిత్రాల్ని చూపించి కుదిరినంతవరకు పూర్తి చేసి మిగిలింది పూర్తి చెయ్యాలంటే మీరు మళ్ళీ మాకే అధికారం ఇవ్వాలి అని ప్రజల ముందు బేరం పెడతాడు!ప్రజల కది చౌకబేరం మాత్రం కాదు, చాలా ఖరీదయిన బేరం!యెందుకంటే పోలవరం పూర్తి చెయ్యలేకపోయినా,అప్పటికి పరిస్థితులు తిరగబడి రాజధాని యెగదీస్తే గోహత్యా దిగదీస్తే బ్రహ్మహత్యా అన్న చందంగా తయారయినా సరే ప్రజలు చచ్చినట్టు బాబుకే పట్టం కట్టాలి, యేమి తెలివి?అందుకే ప్రతిపక్ష నాయకుడు రాజధాని గురించి అంత గింజుకుంటున్న్నది,అంతగా దిగజారిపోయి అడ్డం పడుతున్నది - కానీ చంద్రబాబు చాణక్యం ముందు నిలవలేకపోతున్నాడు, పాపం!రాయలసీమ నాయకులు కొందరు వెళ్ళవద్దని విజ్ఞప్తులు చేసినా రాయలసీమ జనం కూడా పెద్ద సంఖ్యలోనే వచ్చారు.అసలు "మన మట్టి - మన నీరు" కార్యక్రమాన్ని హైదరాబాదు లాగ ఒక ప్రాంతానికి చెందినది అనుకోకుండా ఉండటానికీ,అద్భుతమైన రాజధానిని రేపెప్పుడయినా తిక్కరేగి విడిపోవాలనుకున్నవాళ్ళకి ఇంత గొప్ప రాజధానిని వొదులుకోవాలిసొస్తుంది గదా అనిపించటానికీ యేర్పాటు చేశాడు,ఔరా ఒక్క ప్లానుకి మూడు పిట్టలు?!
కార్యక్రమం మాత్రం నభూతోనభవిష్యతి అన్నట్టుగానే జరిగింది!అమరావతి అదిరింది!!దేశవిదేశాల నుంచి వచ్చిన అంతమంది ప్రముఖుల్ని సైనికకవాతు చేయించినంత క్రమశిక్షణగా నడిపించటం మరొకడెవడూ చెయ్యలేడు,ఇంతకాలం నిజంగా అంత అద్భుతమైన రాజధాని కట్టడం సాధ్యమా అని పీకులాడుతున్న వాళ్ళు గూడా చంద్రబాబు కట్టి చూపించగలడు అని నమ్ముతున్నారు!అక్కడ జరిగేది హిదూ పధ్ధతిలో జరిగే క్రతువు కాబట్టి మాట రాకుండా పవిత్రజలమృత్తికల్ని సేకరించడంలో అన్ని మతాల వారి సంప్రదాయాల్ని గౌరవించడం యెవ్వరూ వంక పెట్టకుండా చేసింది.కానీ తర్వాత దశలు యెలా కడతారు అనే ప్రశ్న వస్తే మాత్రం నమ్మడానికి ఠికానా లేదు.మంత్రివర్గంలో నలుగురు ఉండి కూడా తను కేంద్రం నుంచి ప్రత్యేకహోదా సాధించలేకపోయినందుకు జనమే ఇటుకల్తో పాటు డబ్బులూ సిమెంటు కూడా ఇవ్వాలి గాబోలు?ఇప్పటికే రాజధాని హైప్ వల్ల ఈ ప్రాంతంలో భూముల రేట్లు పెరిగిపోయినాయి,రేపు అధికారులు భాగ్యనగరం నుంచి తరలివస్తే ఉండటానికి అద్దె ఇళ్ళు కావాలంటే దిక్కులు చూడాల్సిన పరిస్థితి!రైతుల దగ్గిర నుంచి తీసుకున్న భూములకి నమ్మకమే తప్ప గ్యారెంటీ లేదు!ఖర్మకాలి జగన్ వస్తే ఈ రైతులంతా గొల్లు మనాల్సిందే,అతను భూములు తిరిగి ఇవ్వాలంటే రైతులు తిన్నది కక్కాలి!ప్లాను వేసింది సింగపూరు ప్రభుత్వం,ఇంఫ్రాస్ట్రక్చరు సమకూర్చేది జపాను - మనవాళ్ళు కేవలం కాంట్రాక్టర్లుగానూ కూలీలుగానూ ఉంటారు.కాంట్రాక్టులు తెదెపా వాళ్లకి దక్కుతాయి,మిగతా జనం మాత్రం ఇటుకలు కొని ఇవ్వాలి,తట్టలు మొయ్యాలి.రోడ్డు వేసిన కంట్రాక్తరుకి టోల్ గేట్లకి పర్మిట్ ఇచ్చినట్టు అంతా పూర్తయ్యాక సింగపూరు వాళ్ళకీ జపాను వాళ్ళకీ లోపాయకారీగా లాభం ముట్టజెప్పాలి?!అవును,ఇప్పటికే కొందరికి ఆ అనుమానాలు వచ్చేశాయి,వాటికి ఆధారాలూ ఉన్నాయి!ఎప్పటికప్పుడు సీనులోనే దైలాగులు తెలిసే కొత్త సినిమా తీసే పధ్ధతిలో యాక్టర్లకి తర్వాతి సీన్ల గురించి అన్నీ సందేహాలే!డైరెట్రు గారు చిద్విలాసంగా ఉన్నాడు గనక ప్రస్తుతానికి ఓకే,కానీ వారి మొహం యేమాత్రం కళ తప్పినా ఢాం ఢమేల్ తుస్స్!
ఒకప్పుడు మోహనదాసు మాటల్లో మతాన్నీ రాజకీయాన్నీ వేరు చెయ్యాలంటూ హడావిడి చేసి చేతల్లో మాత్రం వాటిని కలపగూడని పధ్ధతిలో కలిపాడు, యేమైంది?యే మహాత్ముడైతే హిందువుల్నీ ముస్లిముల్నీ అన్నదమ్ముల్లా కలిపి ఉంచాలని పాటుపడ్డాడని చెప్తున్నారో ఆ జాతిపీత చేసిన పనుల వల్లనే ఇద్దరూ రెండు జాతులుగా చీలిపోయారు.ఆశ్చర్యంగా ఉందా?నమ్మలేకపోతున్నారా!ఈ వైమానిక సిధ్ధాంతాలతో జరుగుతున్న ఉద్యమాలకి దూరంగా ఉన్న రవీంద్రనాధ్ ఠాగోర్ "ఘరే - బైరే" నవలలో చాలా వాస్తవికంగా గాంధీ మార్గం పేరుతో అప్పుడు జరుగుతున్నవాటిని వార్తాకధనంలా చెప్పి భవిష్యత్తుని కూడా సూచించాడు - సరిగ్గా తర్వాత అలాగే జరిగింది?!"ఇంటా-బయటా" అని తెలుగులో కూడా వచ్చిన ఈ కధ మనకి చెప్పే నిజం ఇది:అప్పట్లో ముస్లిములు దర్జీలుగా మంచి సంపాదనతో ఉండేవాళ్ళు!ఇంగ్లీషు ఆడవాళ్ళకి దగ్గిరయి ఫ్యాషన్లు నేర్చుకుని మన ఆడవాళ్ళకి పరిచయం చెయ్యటంతో ఆదాయం బాగానె ఉండేది.ఆదాయం ఉంటే సంఘంలో గౌరవమూ ఉంటుంది కదా!విదేశీవస్త్రబహిష్కరణ అనేసరికి వాళ్ళ జీవనోపాధికి తీరని నష్టం జరిగింది.దానికి తోదు హిందూ సంస్థల ఆలయ జీర్ణోధ్ధరణకి బలవంతంగా చందాలు వసూలు చెయ్యడమనె హడావిడితో వాళ్ళు హిందువుల పట్ల మరింత ద్వేషం పెంచుకుని కాంగ్రెసుకి దూరంగా జరిగి ద్విజాతి సిధ్ధాంతం వైపుకి దగ్గిరయ్యారు!ఆదాయాలు దెబ్బతినకుండా ఉంటే వాళ్ళూ అడగ్గానే ఇచ్చేవాళ్ళేమో,ఈ ఉద్యమాల మూలంగానే బతికి చెడ్డ స్థితిని బోర్డు పెట్టుకోలేక వాళ్ళు విసుక్కుంటే అది ముస్లిము గాబట్టి హిందూ ఆలయానికి ఇవ్వమంటే విసుక్కోవడం వీళ్ళకి తిక్క రేగిందేమో!ఒక గందరగోళపు సిధ్ధాంతం యెంత నిజాయితీగా పాటించినా అది వికటించి తీరుతుందనీ, ఫలితం కూడా గందరగోళమే అవుతుందనీ చెప్పడానికి గట్టి సాక్ష్యం గాంధీ ప్రతిపాదించిన ప్రతి అహింసాయుతమైన సత్యాగ్రహపు కార్యక్రమమూ హింసకు దారితీసి మధ్యలోనే ఆగిపోవటం!
బొమ్మ బాగుంది కాబట్టి వూరికే చూపెడితే తప్పు లేదు గానీ అతిగా బౌధ్ధమతాన్ని వ్యాపార ప్రయోజనాలకి ముడిపెడితే మట్టుకు మళ్ళీ మోహనదాసు నిర్వాకం గజ్జె కట్టి ఆడి రక్తచరిత్ర సినిమా చూపిస్తుంది.రేపు ఆ జపాను వాళ్ళకీ చైనా వాళ్ళకీ యేదైనా అడ్డంగా దోచిపెట్టినట్టు బయటపడితే వీళ్ళు కలిపిన మతం లింకు మూలంగా హిందువులూ బౌధ్ధులూ తన్నుకుంటారు!ఇప్పుడున్న హిందూ ముస్లిం కొట్లాటలకి తోడు ఇదొకటి కలుస్తుంది.రాజకీయం దెబ్బ ప్రజలకి యెప్పుడో గానీ తగలదు. యే మతం వాళ్ళయినా యెక్కువ మంది ఒక్కచోట చేరినప్పుదు ఇంకో మతం వాళ్ళు అటుకేసి వచ్చినప్పుడు అనుకోనిది జరగడమో మరొకటో యెప్పుడో తప్ప జరగవు గాబట్టి మతం-రాజకీయం జంట మరీ విపరీతమైన స్థాయిలో భయపెట్టడం లేదు,కానీ వ్యాపారం అలాకాదే!దానితో ప్రజలకి ప్రతిరోజూ అవసరం ఉంటుంది,అక్కడ ఈ రెండూ అతిగా కలిస్తే ఏమాత్రం తేడా వచ్చినా - ఇంతే సంగతులు, చిత్తగించవలెను.
శ్రీ మద్రమారమణ గోవిందో హారి!
భలే వారే ఆంధ్రులు కూడా ప్రపంచంలో ఎక్కడి కెళ్లినా ఆవకాయను, పప్పులపొడి ని తీసుకేళ్లుతారు. ఇప్పుడు తెలుగునాట వీటిని తయారు చేసి అమ్మటం పెద్ద వ్యాపారం :)
ReplyDeleteబాబు గారు డేంజరస్ గేం ఆడు తున్నారు. ఆయన ఇంతటి తో ఈ ప్రచార కార్యక్రమాలను ఆపాలి. ప్రతి కార్య క్రమాన్ని బాహుబలి సినేమాకి ప్రచారం చేసినట్లు చేయటం తగ్గించాలి. సినేమా, వ్యాపారాల మార్కెటింగ్ వేరు రాజకీయాల విషయం వేరు. వికటిస్తే ప్రజలు పర్టిని తిప్పి కొడతారు. బిజెపి కేంద్రంలో ఇండియా షైనింగ్ నినాదం ప్రజలు తిప్పికొట్టిన సంగతి తెలిసిన విషయమే. ఈ జిమ్మికులు చేసే బదులు గుడ్ గవర్నెన్స్ మీద ఫోకస్ చేస్తే బాగుంట్టుంది.
ReplyDeleteSuperb..persuasive..critical analysis!
ReplyDeleteహరిబాబు గారూ, బౌద్ధ మత చిహ్నాల వెనుక కారణం జపాన్/చైనా వారిని సంతోషం పెట్టడం కాదనుకుంటా. బౌద్ధ వారసత్వ పర్యాటక రంగాన్ని (Buddhist cultural tourism) పెంపొందు చేసుకోవడం దీని ముఖ్య ఉద్దేశ్యం అని అనిపిస్తుంది. ఎన్టీఆర్ హయాములో టాంకుబండులో బుద్ధ విగ్రహం కూడా ఇదే ప్రయత్నంలో భాగం.
ReplyDeleteనూతన రాజధానిలో పర్యాటక రంగానికి పెద్ద పీట వేయాలని తద్వారా visibility పెరుగుతుందని పెద్దలు (not just politicians but also town planning advisers) భావిస్తున్నారని నాకు కొంత అంతర్గత సమాచారం దొరికింది. దీంట్లో భాగమే ఒకవైపు waterfront ambiance మరోవైపు cultural heritage focus.
కాదు లెండి,కొన్ని సార్లు మాటల ద్వారా కూడా ప్రస్తావనలు వచ్చాయి.వారి ముందు బౌధ్ధాన్ని పొగదతన్,ఈ కారనంగా మంచి సంబంధాలు యేర్పడతాయని ఆశించటం కూడా జరిగింది.
ReplyDeleteఅది అతి కాగూదదనే నా ఉద్దేశం.