Thursday, 22 March 2018

ప్రపంచ ప్రసిద్ధి గల హిందూ ఆలయాలు - చిత్రకూటం

1.ఆలయం పేరు (Name of the temple)
సీతా సమేత శ్రీ రామచంద్ర స్వామి 

2.ఆలయ చరిత్ర (history of the temple)
చిత్రకూటం శ్రీరాముడు అక్కడ నివసించటానికి ముందే అత్రి,అనసూయ,దత్తాత్రేయ,శరభంగ వంటి ఎంతోమంది ఋషిసత్తములు ఆశ్రమాలను నిర్మించుకుని ఉన్న పవిత్రమైన ప్రదేశం.రామాయణ కధలోనే భరద్వాజ మహర్షి చిత్రకూటాన్ని ఎంతగానో ప్రశంసించి అక్కడ నివసించమని శ్రీరామునికి సూచించినాడు.కాళిదాస మహకవి తన మేఘదూత కావ్యంలో అప్పటికే రామా నామాంకితం అయిఉండటం వల్ల కాబోలు, రామగిరిగా పేర్కొన్నది ఈ చిత్రకూటమునే!

చిత్రకూటము ఆలయాల సమాహారం.ఈ ఆలయాలన్నీ చాలా ప్రాచీనకాలంలో నిర్మించబడినవి గనకఎవరు ఏ ఆలయాన్ని నిర్మించారో తెలుసుకోవడం కష్టం.

కామదగిరి లోని కామతనాధుడు
కామద గిరిపై వసించి  కామితము దీర్చే ఈ కామత నాధుడు మొతం చితర్జ్కూటానికే ప్రధాన దైవం.శ్రీరాముదు భార్యాసోదరసమేతుడై వనవాస కాలంలోని అధికబహాగాన్ని గడిపినది ఇక్కడే!ఈ గిరి పరదక్షిణ మార్గంలోనే అని ఆలయాలూ ఉంటాయి.

భరత మిలాప
ప్రదక్షిణ మార్గంలోని తొలి మజిలీ ఇది.ఇక్కడే రామకధలోని అత్యంత ఉద్విగ్నభరితమైన సహోదర సమాశ్రయణం జరిగింది.నిజంగా జరిగిన కధని విని రాయడమో,కేవలం వాల్మీకి మహకవి స్వకపోలకల్పితమో తెలియదు గానీ శ్రీరాముని వనవాసం అనే ఒక విచిత్రమైన సంవిధానం ప్రపంచంలోని మరే సాహిత్యరూపంలోనూ కల్పించబడని విశిష్టమైన సన్నివేశం.లౌకిక దృస్జ్టితో చూస్తే తెల్లవారితే ఒక సామ్రాజ్యానికి మూర్ధాభిషిక్తుడు కావలసిన సమయంలో అన్నీ వదులుకుని అడవల్లోకి పోవాలనడం ఎవరికయినా అశనిపాతమే!అయినా చిరునవ్వుతోనే అంగీకరించి, అపరిమితంగా దుఃఖిస్తున్న తల్లిని ఓదా ర్చి, తనని ఖైదు చేసి రాజువు కమ్మన్న తండ్రిని మందలించి విహారయాత్రకు వెళ్తున్నంత ఆనందంగా తరలి వెళ్ళడం సామాన్య మానవులు చెయ్యలేని దుష్కరకార్యం - అందుకే శ్రీరాముడు విగ్రహవాన్ ధర్ము డయ్యాడు!

అయోధ్యకాండలో మనకు మూడు రకాల తల్లులు కనిపిస్తారు.కౌసల్య: తన బిడ్డ సింహాసనం ఎక్కుతున్నాడని తెలిసినప్పుడు సంతోషంతో పొంగిపోయింది.ఆ బిడ్డయే అరణ్యానికి వెళ్తున్నాడని తెలి యగానే గోలుగోలున ఏడ్చింది.తమ బిడ్డల వృద్ధికి పొంగిపోయి క్షయానికి కుంగిపోయే తల్లులు లోకంలో అసంఖ్యాకంగా ఉన్నారు,ఉంటారు కూడా!సుమిత్ర: తన్ను మాలిన ధర్మంలా అన్నగారికి సేవలు చెయ్యడానికి తనకు తనుగా భోగాలని వదులుకుని వెళ్తున్న బిడ్డని 'రామం దశరధం విద్ధి,మాం విద్ధి జనకాత్మజం,అయోధ్యా మటవీం విద్ధి,గఛ్చ తాత యధా సుఖం' అని దీవించి పంపగలిగిన తల్లులు దేశానికి ఒక్కరున్నా చాలు,నిజంగా ఉంటారా!కైకేయి: తన బిడ్డ పెద్ద పదవిలో ఉండి భోగభాగ్యాలతో అలరారడం చాలదు,పొరుగింటి పిల్లలకు అడుక్కుతినే దశ రావాలని కోరుకునే తల్ల్లి ఏ దేశంలోనూ ఒక్కరు కూడా ఉండకూడదు.

తన వైభవం కోసమే చేసినా తప్పు చేసిన తల్లినే ఛీత్కరించి రాజ్యాన్ని తిరిగి అన్నగారికే అప్పజెప్పాలని వచ్చిన భరతు డు, భరతుడే రమ్మని పిలవడం వల్ల సాంకేతికంగా చిక్కులన్నీ తొలగినా కూడా మృదువుగా వారించి వనవాసాన్నే కొనసాగించిన రాముడు - వీరిద్దరిలో ఎవరు గొప్ప అని తేల్చడం ఎంతటి ధర్మతత్వకోవిదులకైనా అసాధ్యమే.అలాంటి అపూర్వసహోదరసమాగమానికి శిలలు కూడా కరిగాయి కాబోలు నన్నట్లు వారి పాదముద్రలు ఇక్కడ శాశ్వతమైనాయి.

లక్ష్మణ పర్వతం
వైకుంఠవాసులైన ఆదిదంపతు లిద్దరూ సామాన్య దంపతుల వలెనే పన్నెండేళ్ళు అయోధ్యానగరంలో సుఖభోగాలు అనుభవించిన తర్వాత పధ్నాలుగేళ్ళ వనవాసంలో కూడా అయోధ్యలో ఉన్నంత సంతోషంగా గడిపారంటే దానికి తమ్ముడు లక్ష్మణుడే కారణం!సీతారాముల శుశ్రూష అనంతరం లక్ష్మణ దాశరధి విశ్రమించిన స్థలం ఇది!

యుద్ధకాండలో రావణుడు శక్తిని ప్రయోగించింది లక్ష్మణుని మీదికి కాదు,వైరిపక్షంలో చేరి కనబడుతున్న సోదరుడైన విభీషణుని మీదికి.అది చూసిన లక్ష్మణుడు క్షణమాత్రంలో అన్నగారు విభీషణునికి లంకానగర సామ్రాజ్యాన్ని ధారపోస్తూ వాగ్దానం చెయ్యడం గుర్తుకు తెచ్చుకుని అన్నగారి మాటకి భంగం రాకూడదని తను అడ్డు వెళ్తాడు!అసదృశమైన శక్తి ఘాతానికి విస్మృతుదైన తమ్ముణ్ణి చూసిన రాముడు అపరిమితమైన దుఃఖంతో ;దేశే దేశే కళత్రాణి,దేశే దేశే చ బాంధవాః,తం తు దేవ న పశ్యామి యాత్ర బ్రాత సహోదరః' అని పరమ దయనీయంగా విలపిస్తాడు.ఈ ఒక్క కరుణరసార్ద్రమైన సన్నివేశం చాలు వాల్మీకి రామాయణం ఎందుకు అందరికీ ప్రీతిపాత్రమైందో తెలుసుకోవడానికి!

ఇక్కడ లక్ష్మణ పర్వతం మీద ఒక స్తంభం ఉంటుంది.రాత్రిపూట కూడా నిద్ర మానుకుని ఈ స్తంభానికి చేరగిల నిలబడి కామదగిగిరికి కాపలా కాస్తూ ఉండేవాడట!యాత్రికులు ఈ స్తంభాన్ని స్పృశించి ఆ త్యాగమూర్తిని స్పర్శించినంత ఆనందం పొందుతారు.

హనుమాన్ ధార
సీతాన్వేషణ సమయంలో హనుమంతుడు పడిన కష్టాలను తెలుసుకున్న శ్రీరామ్ముడు చలించి అతనికి విడిదిగా నిర్ణయించిన ప్రకృతి సౌందర్యం విలసిల్లే సుంధర ధామం ఇది.ఇక్కడ రావణక్రౌర్యంతో దహించబడిన పవనసుతుని దేహబాధను ఉపశమింపజేయడానికి తన శరాగ్రంతో జలధారను కూడా సృష్టించినాడు కరుణాపయోనిధి దాశరధి!వాగ్విదాంవరుడైన కపివరుని మకుటంపైనుండి జారిన ఈ జలధార మెల్లమెల్లగా కిందికి ప్రవహించి అక్కడ ఒక సరస్సును ఏర్పరచి బహు సుందర దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నది.

సీతా దేవి స్నానమాచరించిన స్థలంగా విఖ్యాతమైన జానకీ కుండ్,ఆమె శరీరానికి అరగదీసి పూసుకునేటందుకు వాడిన స్ఫటికశిల మొదలైనవి కూడా ముఖ్యమైనవే.ఈ ఆలయాలను అన్నింటినీ కలుపుతూ ఒక రేఖని గీస్సినట్లయితే పైన త్రిభుజాకారం కింద చతురస్రం కలిసి శ్రీరాముడు ఆకర్ణాంతం లాగి విడిచిన బాణంలా గోచరిస్తుంది!

3.ఆలయ విశిష్టత (importance of the deity)
బనారస్ హందూ యూనివర్సిటీ కల్చరల్ జ్యాగ్రఫీ శాఖలో ప్రొఫెసర్ అయిన శ్రీమాన్ రాణా.పి.బి.సింగ్ గారు అమెరికా లోని కొలరాడో యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన జాన్ మాల్విల్లె గారితో కలిసి భారతదేశంలోని ప్రాచీన కాలపు ఆలయాల నిర్మాణంలో భారతీయులు ఉపయోగించిన వైజానిక శాస్త్ర రహస్యాలను గురించి ఎన్నో పరిశోధనలు చేసి భారతీయ విజ్ఞాన శాస్త్రానికి ప్రపంచ స్థాయిలో ఎంతో గుర్తింపును తీసుకొచ్చారు. మన పూర్వులు నిర్మించిన ఆలయాలు ఏవీ గుడ్డిగా ఏదో ఒక స్థలాన్ని ఎన్నుకుని యెలా పడితే అలా కట్టేసిన రాతిగోడల భవనాలు కావు.కేవలం వృత్తాలు, చతురాలు, ఒకదానినొకటి ఖండించుకునే రేఖలు లాంటి మామూఉ ఆకారాలను తీసుకుని రేఖాగణిత సూత్రాలను ఉపయోగించి విశ్వశక్తిని కేంద్రీకరింపజేసి పట్టి ఉంచే విశ్వశక్తి గ్రాహకాలు(Cosmic Energy Reservoirs)గా నిర్మించారు.

ప్రతి ఆలయానికి క్షేత్రపరంగా అది భౌమ అయస్కాత శక్తి ప్రవాహాల మధ్యన ఏ అక్షాంశ రేఖాంశాల మధ్యన ఉన్నది అనేది అత్యంత ప్రధానమైన విషయం.అక్కడి భౌమ అయస్కాంత శక్తి ప్రభావాన్ని అంచనా వేసి దానిని క్షేత్రగణితశాస్త్రపు నిర్మాణాలతో వంపులు తిప్పడం ద్వారా ఆలయపు అవరణలో ఉన్న భక్తులకు విశ్వశక్తి యొక్క స్పర్శ అనుభవంలోకి వచ్చి ప్రశాంతత నిచ్చే విధంగా ఆలయనిర్మాణంలో ఉపయోగించుకుంటారు.గర్భగృహం,విమాన శిఖరం,ధ్వజస్తంభం,ముఖద్వారం పైన ఉందే గోపురం,మూలవిరాట్టు ఏ దిక్కుని చూడాలి,ముఖద్వారం ఏ దిక్కున ఉండాలి - ఇవన్నీ కూడా ఆలయ నిర్మాణానికి సంబంధించి ప్రముఖమైన విషయాలే!ఆ రకంగా చూస్తే చిత్రకూటం గురించిన విశ్లేషణలో ఒక విషయం గురించి చెప్పారు. ఇక్కడ క్షితిజం పైన సూర్యోదయం సూర్యాస్తమయం అనే రెండు అంశాల మధ్యన ఎక్కుపెట్టబడి ఉన్న ఒక బాణం వలె గోచరిస్తుందట ఈ చిత్రకూటంలోని ఆలయమాలిక!

ఆధునిక భౌతికశాస్త్రజ్ఞుల కన్నా చాలా ముందుగానే స్థల,కాల ద్వయానికి ఉన్న సాపేక్షతని మనవారు తెలుసుకోగలిగారనేదానికి ఎన్నో సాక్ష్యాలు ఉనాయి.ఆలయనిర్మాణలో వారు వాడిన విజ్ఞానానికి ఇప్పటి పేరు కల్చరల్ కాస్మాలజీ!కాశీ నగరాన్ని తమ రేఖాగణిత మరియు విశ్వవిజ్ఞాన శాస్త్ర సాంకేతికాంశాలతో ఒక వామనవిశ్వం(Bosai Universe)వలె నిర్మించారు!చిత్రకూటంలో కనబడుతున్న శ్రీరామశస్త్రం ఏకంగా కాలస్వరూపమే!

కాలానికి ఉండే అన్ని లక్షణాలూ శ్రీరామశస్త్రానికి ఉన్నాయి.దివారాత్రాలు రెండు కొసలు!శ్రీరామశస్త్రం కాలస్వరూపాన్ని కనుగొనలేని అసురుల మీదకి వెళ్ళీ అంతం చెయ్యటం  తప్ప సాధుపుంగవుల మీదకి ఏనాడూ వెళ్ళదు!ప్రయోగం జరిగాక విఫలం కాదు!శ్రీరామశస్త్రం తగిలి అంతమైపోయిన వారు కూడా ధన్యులే,శాశ్వతులే అవుతారనేది కూడా నిజం!బుద్ధిమంతులు అలాంటి భగవంతుని మీది పగ వల్ల వచ్చే నకారాత్మకమైన శాశ్వతత్వం కోరుకోకుండా రామనామాంకిత ధ్యానులై సగుణాత్మకమైన బ్రహ్మస్వరూపాన్ని అర్చిస్తూ శాశ్వతానందాన్ని పొందటం శ్రేయోదాయకం! అయోనిజయైన సీతతో కలిసి పాంచభౌతిక దేహంతో తిరుగాడిన స్థలకాలాతీతుడైన వాని కాలస్వరూపమైన ఆయుధ రూపమే చిత్రకూట ధామం!!

శ్రీరాఘవం దశరధాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి!

4.ఆలయ మార్గము (how to reach)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసి జిల్లాలో అలహాబాద్ నుండి సుమారు 125 కిమీ దూరంలో మందాకినీ నదీతీరంలో చిత్రకూటం ఉన్నది. మధ్యప్రదేశ్,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మధ్యనున్న పర్వతసీమలో ఉండటం వలన 1996లో ఏర్పాటు చేయబడిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చిత్రకూట్ జిల్లా మరియూ  మధ్యప్రదేశ్ రాష్త్రంలోని సత్నా జిల్లా రెంటికీ చొత్రకూటంతో సంబంధం ఉన్నది.

2 comments:

  1. Hari Babu Garu

    I appreciate for your Researched Article.

    Expect more from you in Future.

    ReplyDelete
    Replies
    1. Sure,Once I have involved ina callendar app and I Did some research about some of the temples to show as a submenu inside that app.

      Whenever I had time to edit I will publish one by one!

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...