Saturday, 5 April 2014

చిత్రమయిన గొప్పవాళ్ళు?!

రాం గోపాల్ వర్మ:

          ఇతని సినిమాల్లో చాలావరకూ చీకటి ప్రముఖ పాత్ర వహిస్తుంది! తన మెదడులోనూ అదే ఉందేమో?పాత్రలు మాట్లాడే భాష కూడా పొడిపొడిగా "కొట్టు, చంపు, స్పాట్ పెట్టెయ్, కూర్చో, నుంచో, అదిటివ్వు. ఇది తీసుకో" అన్నట్టుగా ఉంటాయే తప్ప మనసుకు హత్తుకు పోయే సంభాషణలూ ఉండవు.తను ఇచ్చే ఇంటర్వ్యూల్లో తను మాట్లాడే సంగతులూ అంతే.అసలు చేప్పే విషయమే చెత్త అనుకుంటే,చెప్పటం కూడా ఆ చెత్త విషయాల్ని ఇంతకన్నా చెత్తగా ఇంకెవ్వడూ చెప్పలేడు అనిపించేటట్టుగా ఉండటమే ఇతని ప్రత్యేకత!

          రాఘవేంద్ర రావు దగ్గిర్నుంచీ యే ప్రముఖ దర్శకుడికీ లేని వెసులుబాటు తనకి ఉంది. పది సినిమాలు ఫ్లాపయినా సరే తనతో సినిమాలు తియ్యడానికి సిధ్ధపదే నిర్మాతలు ఉండటం.జ్యోతి నుంచీ మొదలుకుని యెన్నో హిట్ సినిమాలు తీసి ఇప్పటికీ అదే హవాను చాటుతున్న రాఘవేంద్ర రావు సైతం ఒక సినిమా ఫ్లాపయితే తర్వాతి సినిమాకి యెంతో హడావుడి పడతారు, యెలాగయినా ఈ సినిమాని హిట్ చెయాలని కసి చూపిస్తారు. కానీ అలాంటి జాగ్రత్త లేవీ అవసరం లేని ఒకే ఒక అదృష్ట వంతుడయిన దర్శకుడు ఇతనే.

          దేవుడ్నీ అదృష్టాన్నీ తను నమ్మక పోయినా ఇవ్వాళ ఇతనికి దక్కిన ఈ అరుదయిన స్థానానికి మాత్రం అతనికున్న సాంకేతిక పరమయిన ప్రతిభా, సినిమా తియ్యడంలో అతను పాటించే జాగ్రత్తలూ లాంటివి కాకుండా అదృష్టమే కారణం కావడం విచిత్రం!


దాసరి నారాయణ రావు:

          పాలగుమ్మి పద్మరాజు శిష్యుడయి ఉన్నా తన సినిమాల్లో ఇది దాసరి భాష అని గుర్తు పట్టగలిగే యే  రకమయిన సాహితీ విలువలూ లేని సుత్తి డైలాగులు ఉంటాయి ఇతని సినిమాల్లో!సినిమాలు హిట్ చెయ్యడం వరకూ గట్టివాడే కానీ బయట వేదికల మీద నోరు విప్పితే మాత్రం తన సినిమాల్లోని డవిలాగుల స్థాయిలోనే మాట్లాడ్డం ఇతని ప్రత్యేకత.

          నిన్నటి దాకా కాంగ్రెసుని అంటకాగి కేంద్ర మంత్రి అయి బొగ్గు మసి అంటించుకుని వచ్చిన ఇతను ఇవ్వాళ మోహన్ బాబుని అక్కినేని రామా రావుల కన్నా గొప్ప వాడనటం, కాంగ్రెసు కన్నా కమ్యునిష్టులు మంచి వాళ్ళని చిన్నప్పటి జ్ఞాపకాల సాక్ష్యాలు తీసుకు రావటం, ఆంధ్ర ప్రదేశ్ విభజనలో ఒక బ్రోకర్ ఉన్నాడనటం లాంటివి చూస్తుంటే నవ్వాలో యేడవాలో అర్ధం కావడం లేదు?!ఇతని మాటలకి చక్కిలిగిలి పెట్టుకుంటే తప్ప మనసారా నవ్వలేం:-)

          తనకు తెలిసిన ఒక నిజాన్ని నిర్భయంగా చెప్పటానికి దమ్ము లేక సరయిన సమయం కోసం చూస్తున్నానంటూనే తన ధైర్యం గురించీ సాహసం గురించీ సొంత డబ్బా కొట్టుకుంటున్నాడు చూడండి? ముందెప్పుడో కూస్తానని క్లూ ఇస్తున్న ఆ నిజం బయట పెట్టే సమయం యెప్పుడు వస్తుందో? తనకు బ్రోకరేజీ అవసరమయినప్పుడు వెయిటేజి కోసం వాడుకుంటాడన్న మాట తెలిసిన నిజాన్ని చెప్పటానిక్కూడా వర్జాలూ వారశూలలూ చూసే ఈ అవకాశవాది.విభజన మొత్తం పూర్తయ్యాక ఇప్పు డందులో బ్రోకరేజి ఉందంటే అంత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణా వాళ్ళలో ముదుర్ల కెవరికయినా కాలగూడని చోట కాలితే తన్నను గూడా తంతారు!

          సినిమా ఫీల్డులో చాలా మంది ఇలాంటి బాపతే. సినిమా చూసేవాడికి యేం కావాలి. టికెట్టు కొనుక్కుని థియేటర్లో అడుగు పెట్టి బయటి కొచ్చాక తన డబ్బు గిట్టుబాటయిందనే సంతృప్తి. అది కూడా ఇవ్వలేని దద్దమ్మలు మేధావు ల్లాగా సమాజం గురించీ విప్లవాల గురించీ గంభీరంగా మాట్లాడ్డం దేనికి?

          అసలు విషయం నిన్నటిదాకా హైదరాబాదు ఆంధ్రా కింద ఉండటం వల్ల అవార్డులు తెచ్చుకునే స్థాయి లేకపోయినా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని అంటకాగి అవి కూడా సాధించేసి పోజులు కొట్టారు గదా, అది రేపు హైదరాబాదు తెలంగాణా లోకి వెళ్తే ఆ హావా ఉంటుందో లేదో అన్న బెంగ యెక్కువయిందీ.తెలంగాణా యేర్పాటులో బ్రోకర్ల గురించి మాట్లాదే దాసరికీ, సొంతంగా పార్టీ పెట్టిన జనసేనానికీ, మోడీని కలిసిన నాగార్జునకీ అందరికీ ఒకటే లక్ష్యం - తమ హవా తగ్గకుండా చూసుకోవాలనే లాభదృష్టి.


నారా చంద్రబాబు నాయుడు:


          అల్లుడు అనే అచ్చ తెలుగు మాటకి అల్లడం అనేది మూల పదం, అంటే రెండు కుటుంబాల్ని అల్లుతాడు అని దానికి అర్ధం. కానీ ఈ అల్లుడు మాత్రం మామ గార్ని గిల్లి పారేశాడు. కాబట్టి ఇతన్ని గిల్లుడు అనుకోవచ్చా? జర్నలిష్టులు కానీ మరెవరయినా సరే యే విషయం గురించయినా తన సొంత మాటని మాత్రం ఇతని నుంచి బయటకి లాగలేరు. వాళ్ళు చెప్పింది తప్పు, వీళ్ళు చెప్పింది తప్పు అనడం తప్ప తను యేదీ చెప్పి కమిటవ్వడు.

          ఇతని రాజకీయ పరమయిన యెదుగుదల కూడా అలాగే ఉంటుంది. తను యేదీ పూనుకుని చేసి జనాన్ని మెప్పించి యెదగడు.వేరే పార్టీ వాళ్ళలో గానీ సొంత పార్టీ వాళ్ళలో గానీ యెదటి వాళ్ళలో ఉన్న లోపాల్ని ఉపయోగించుకుని - తప్పులు పట్టి  నేను అంతకన్నా మెరుగు అని సమర్ధించుకోవడం వల్ల గానీ, లేదంటే ఆ వ్యక్తి లోని బలహీనతల్ని ఆధారం చేసుకుని వెన్నుపోటు పొడవటం గానీ చేసి పైకొస్తాడే తప్ప నిజమయిన నాయకత్వ లక్షణాలతో యెదగడు.

          సాధారణంగా యెవరయినా నాయకుడి గురించి "ఇతను ప్రభుత్వం లోకొస్తే మనకి మంచి బతుకు గ్యారెంటీ" అని ప్రజలు అనుకోవాలి. కానీ ప్రజలు అనకపోయినా తనకు తనే అనేసుకుంటాడు, "నేను ప్రభుత్వంలో ఉంటే చాలు ప్రజలు బాగుపడ్డట్టే" అని? ఒక్క మాటలో చెప్పాలంటే రాజులాగా ఉండాలనుకుంటాడు, కానీ స్వభావంలో రాజసం లేదు.ప్రజాస్వామ్యానికి కట్టుబడ్డట్టుగా ఉంటాడు కానీ ప్రజాస్వామ్య స్పూర్తి లేదు.


జయప్రకాశ్ నారాయణ్:


          పదహారేళ్ళు అత్యంత సమర్ధుడయిన ప్రభుత్వాధికారిగా పని చేసిన తర్వాత హఠాత్తుగా జ్ఞానోదయమయ్యింది - ఈ రాజకీయ వ్యవస్థలో ఉన్న లోపాలూ లొసుగులూ పీటముళ్ళూ తననూ తన లాంటి వాళ్ళనీ సరిగ్గా పని చెయ్యనివ్వటం లేదని.

          వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసి జనం మీద పడ్డాడు.మొదట్లో కేవలం ప్రజల్ని యెన్నికల గురించి, తమ బాధ్యతల గురించి విడమర్చి చెప్పి క్షేత్ర స్థాయిలో ప్రజలకి అవగాహన కల్పించడం లక్ష్యంగా పని చేశాడు. పరిస్థితి తగినంత ప్రోత్సాహ కరంగా కనిపించటంతో ఉద్యమాన్ని రాజకీయ పార్టీగా మార్చి ప్రభుత్వాధికారాన్ని ఆశిస్తున్నాడు.

          ఇతను యెంత తెలివయిన వాడంటే తన పార్టీ తరపున గెలిచి చట్టసభలో అడుగు పెట్టింది తనొక్కడే అయినా చాలా బిల్లుల్ని సభలో ప్రవేశ పెట్టి ఆమోదింపజేసుకోగలిగాడు. అధికారంలో ఉన్న వాళ్ళు కూడా వాటిని వ్యతిరేకించి చెడ్డ పేరు తెచ్చుకోవడం కన్నా ఆమోదించి అమలు చేస్తే తమకు మంచి పేరు రావడం ఖాయం అనిపించేటంత గట్టిగా వాట్ని రూపొందించటమే దానికి కారణం.

          యే విషయం గురించి అయినా మంచి అవగాహనతో మాట్లాడడం, యెంత ప్రతికూలమయిన పరిస్థితి లో నయినా సరే తన అభిప్రాయాల్ని మార్చుకోకుండా వాటికే కట్టుబడి ఉండి తను యే మార్పు నయితే ఆశిస్తున్నాడో దానికి కావలసిన సంస్కారం తనలో ఉందని నిరూపించుకుంటున్నాడు.

          కానీ ఈ వ్యవష్థని మార్చాలనుకున్న వాడికి ఈ వ్యవస్థ ఇప్పుడున్నట్టుగా ఉండటం వల్ల లాభ పడే వాళ్ళు సాయం చెయ్యరు.యెవరి సాయమూ లేకుండా ఒంటరిగా ఇతను లక్ష్యాన్ని సాధించలేడు.ప్రేమ నగర్ కధా నాయకుడు "తాగితే మరచి పోగలను, తాగ నివ్వదు.మరచి పోతే తాగ గలను, మరువనివ్వదు" అని దుఖ్ఖించినట్టు రాజకీయ వాతావరణం ఇప్పుడున్నట్టుగా ఉన్నంత కాలం ఇతను అధికారం లోకి రాలేడు.ఇతను అధికారం లోకి రానంత వరకు రాజకీయ వాతావరణం ఇలాగే ఉంటుంది.


మన్ మోహన్ సింగ్:

          యెక్కువగా మాట్లాడడు గనక మౌన మోహన్ సింగ్ అని కూడా అంటారు. ఒకే ఒక పత్రికా సమావేశంతో ఇతను మాట్లాడక పోవటమే తెలివయిన పని అని ఋజువైపోయింది. పెద్ద చదువే చదివాడు గానీ క్రియేటివిటీ గానీ సరదా తనం గానీ లేకుండా పుస్తకాల పురుగులా చదివి డిస్టింక్షన్లు కొట్టే చాలా మంది ముద్దబ్బాయిలలో ఇతనూ ఒకడయ్యుంటాడు.అందుకే ఇతని వ్యక్తిత్వంలో ఈసురో మని కనిపించే దిగులు తప్ప చురుకుదనం కనపడదు.

          యెంత పెద్ద పొజిషన్లో ఉన్నా స్థాన బలిమి కాని తన బలిమి కాదయా అని వినయంగా ఉండటం మంచి లక్షణమే కానీ అది మరీ దేశ ప్రధాని పదవి అయి ఉండి ప్రజలు ఆ మనిషి నుంచి ఆశిస్తున్నందుకయినా పదవికి తగ్గ వైభవం ఉండకపోవటం చిత్రమే కదా!

          కొందరితన్ని మంచివాడే గానీ మెతకతనంతో అన్యాయ మైపోయా డంటారు. నేనొప్పుకోను.కాంగ్రెసులో అమాయకులు ఉంటారంటే నేను నమ్మను.మొదటి సారి అధికారం లోకి రాగానే తొలి రెండు రోజుల్లోనే పోటాని యెత్తేశాడు చాలా మామూలుగా. భాజపా అప్పుడు యెందుకు వోడిపోయిందో తెలీదు గానీ పోటాని మాత్రం గట్టిగా అమలు చేసింది. కొందరు రానాలు ఇబ్బంది పడినా దేశం మాత్రం ప్రశాంతంగా ఉంది.దానర్ధం యేంటంటే తన పార్టీ విధానం యేమిటో తనేం చెయ్యాలో తెలిసే చేస్తున్నాడు అన్నీ.

          తను ఉన్న స్థానానికి విలువేమిటో తెలుసుకోకుండా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవాలనే కనీసపు తెలివి కూడా లేకుండా భవిష్యత్తు తరాల నుంచి నుంచి కేవలం జాలిని మాత్రమే కోరుకున్న మందభాగ్యుడు?!


నరేంద్ర మోడీ:

          ఒక మనిషి తన స్వంత ప్రతిభా విశేషాలతో కన్నా ప్రతికక్షుల తెలివితక్కువ తనం మూలంగా గొప్పవాడవటం యెలా ఉంటుందో ఇతని యెదుగుదలను చూస్తే అర్ధ మవుతుంది.చదువుకునే రోజుల్లో మార్కులు సాధించటంలో ఇతడు గొప్ప తెలివైన వాడు కాకపోయినా నాటకాలూ, వక్తృత్వ పోటీలూ లాంటి వాటిల్లో అమోఘమయిన తెలివిని చూపించాడు.ఇవ్వాళ ఇతని బహిరంగ సమావేశాల్లో వినపడే ఆశువుగా వెదజల్లే చతుర్లు ఆనాటి మూలాల నుంచే వచ్చాయి కాబోలు.

          తనకి పదమూడేళ్ళ వయస్సులోనె నిర్ణయించబడిన బాలికా వధువు యశోదను పద్దెనిమదేళ్ళ వయసులో పెళ్ళి చేసుకున్నాడు.కానీ అప్పటికే ఆరెస్సెస్ భావజాలం పట్ల ఆకర్షితు డవటం వల్ల ఆమేకు తన ఉద్దేశాన్ని చెప్పి ఆవిడ కూడా ఒప్పుకోవటంతో దూరంగానే ఉండిపోయారు - చట్టబధ్ధంగా విడాకులు తీసుకోకపోయినా.మోడీలో తప్పులు పట్టాలనుకౌనే తెలివి తక్కువ విమర్శకులు విమర్శించకూడని ఈ విషయాన్ని కూడా వాడుకోవాలనే తొందరపాటు కూడా మోడీకి అనుకూలంగానే మారింది.

          గోధ్రా సంఘటన గురించి కూడా ఇతన్ని విమర్శించకూడని పాయింటు మీద విమర్శించటమే తర్వాతి యెన్నికల్లో కూడా ఇతనే తిరిగి గెలిచి విమర్శకుల పాయింట్లని ప్రజలు పట్టించుకోలేదనే ధైర్యాన్ని ఇతనికీ ఇతని సపోర్టర్లకీ ఇచ్చింది. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి నరోడ-పాటియా మారణ కాండను గురించి "a spontaneous reaction to the Godhra train carnage resulting from the natural and justified anger of people and the state government and ruling party had nothing to do with it." అనే స్టేట్మెంట్ ఇవ్వడానికి యెంత సాహసం కావాలి?అంత క్రూరమయిన కామెంటు చేశాక కూడా తర్వాతి యెన్నికల్లో మళ్ళీ ప్రజలు అతన్నే యెన్నుకోవడానికి కారణ మేమిటి?

          విషయ మేమిటంటే మతకలహాలలో యెప్పుడూ ముస్లిములే బాధితులుగా ఉండటం లేదు.ముస్లిములు చెలరేగి పోయినప్పుడు హిందువులు కూడా బాధితు లవుతున్నారు. కానీ మోడీకి ప్రతికక్షులుగా నిలబడిన కుహనా సెక్యులర్ పండితులు ముస్లిముల మీద దాడులు జరిగినప్పుడు చూపించే నిరసనలో ఉండే తీవ్రత్వం ముస్లిముల వైపు నుంచి హిందువుల మీద జరిగినప్పుడు కేవలం నత్తి మాటల స్థాయికి దిగజారి పోతున్నది.

          రెంటినీ నిశితంగా పరిశీలిస్తే ఉదారవాదులయిన హిందువులు కూడా ఈ యేకపక్షపు ప్రతిస్పందనని గుర్తించగలిగేటంత స్పష్టంగా ఉంది వాళ్ళలోని డొల్లతనం. మోడీ బలం అదే!లౌకికవాదులు ఈ డొల్లతనాన్ని వదిలించుకుని ఇరుపక్షాల పట్లా నిష్పక్షపాతంగా వ్యవహరించటం వల్లనే మోడీ యెదుగుదలని అడ్డుకోవటం సాధ్య పడుతుంది.

          ప్రజల ఆదరాభిమానాల్ని అందుకుని యెక్కాల్సిన స్థానాలకి బ్రాండ్ అడ్వర్టైజింగ్, ఈవెంట్ మ్యానేజిమెంట్ లాంటి చీప్ ట్రిక్స్ తో యెక్కుతున్నాడు.ఒకనాటి రధయాత్రికుడికి ఇది తెలుసు.మోడీ గురించి అన్యాపదేశంగా అతడు చేస్తున్న కామెంట్లలో చాలా అర్ధం ఉంది -  అర్ధం చేసుకోగలిగిన వాళ్ళకి. హస్తినాపురం లోనే ఉండాల్సి రావటం వల్ల బహిరంగంగా చెప్పలేకపోయినా లాక్షా గృహ దహనం గురించి ధర్మజుడికి నర్మగర్భంగా సూచనలు మాత్రమే ఇవ్వగలిగిన విదురుడి స్థానంలో ఉన్నాడు అతను.మోడీ లో ఉన్న తప్పు యేమిటో, మోడీ ని యెలా గెలవాలో హింట్స్ ఇస్తున్నాడు అతను.సీనియరిటీ ప్రకారం తనకి రావల్సిన పదవి మోడీకి దక్కిందనే దురదతో అలా మాట్లాడుతున్నా డనుకునే ఈ కోడి మెదడు కుహనా సెక్యులరిష్టులకే అది అర్ధం కావడం లేదు.
-----------------------------------------------------------------------------------------------------------------
(photos  courtesy: Google Images)

11 comments:

 1. very truthful...

  గురివింద గింజల గురించి
  కరెక్ట్ గా చెప్పారు...

  వర్మ గారు చాలా బెట్టర్...
  సినిమాలెలా వున్నా కనీసం
  మాట నిజాయితీగా వుంటుంది...

  దాసరి గారు?
  అసూయ వెళ్ళగ్రక్కడం తప్ప
  హుందాతనమన్నదెక్కడ?
  మరి విభజన సమయంలో
  ఈయన ఏం చేస్తున్నట్లో?

  కాంగ్రెస్ లోనే ఉండి నీతి పలుకులు...

  ReplyDelete
  Replies
  1. This comment has been removed by the author.

   Delete
  2. వర్మ నిజాయితీగా మాట్లాడ్డం వరకూ కరెక్టే గానీ సరుకు విషయాని కొస్తే తేడాగానే ఉంటుంది. హిందూలో కొంతకాలం క్రితం సెలెబ్రిటీ లందరికీ ఒక కామన్ క్వెస్చెనెయిర్ ఇచ్చాడు. అంటే ఒకే రకం ప్రశ్నకి జవాబులు యెవరి దృక్కోణం ప్రకారం వాళ్ళు జవాబు చెప్తారు. పోల్చి చూస్తే ఆ వ్యక్తి ప్రత్యేకత యేంటో తెలుసుకునే లాగ ఉంటాయి ప్రశ్నలు.

   మీ ఫాంటసీ యేమిటనేదానికి మనవాడు యేం చెప్పాడో తెలుసా - రోజుకో ఆడదానితో శృంగారం చెయ్యాలనిట.మిగతా వాళ్ళతో పోలిస్తే యెంత దరిద్రమయిన జవాబది!

   Delete
  3. తేడా విషయం లో తేడా ఏం లేదు...

   సమర్ధించడం లేదు గానీ...
   అక్కడ కూడా విమర్శలకు జడవకుండా
   ఏప్రిల్ 1 విడుదల సినిమా లో రాజేంద్ర ప్రసాద్
   లాగా లోన ఏమి వుందో బయటకు కక్కేసాడు...

   అదే పై తెల్ల చొక్కా పెద్దాయన -
   ప్రసంగార్ధం వెళ్ళిన ప్రతిచోటా -
   పిలవబడిన కార్యాన్ని ప్రక్కన బెట్టి ...
   స్వోత్కర్ష, పరనింద తప్ప
   ప్రసంగం లో అసలు సంగతి ని
   దారి మళ్ళించి...
   అన్నీ తాను...
   అంతా తాను...
   అనుకుంటూ...
   మనచేత కూడా అన్పింప చేయాలనే
   ఏక సూత్ర, ఏక వ్యక్తి విరోధ
   పధక అమలు ప్రయత్నం...

   ఈయన చెప్పే బ్రోకర్ గురించి ఇక్కడ
   ఉత్కంటగా ఎదురు చూసే బుర్రలేని
   వాళ్లెవరున్నారు?
   ఆ బ్రోకర్ ఒకప్పుడు
   ఈయనకు అత్యంత ఆప్తుడు అన్నది
   జగమెరిగిన సత్యం...

   ఆ ప్రకటనకొక విడుదల తేదీ...
   మళ్ళీ దానికోసం మన ఎదురుచూపులు...
   ఈయన సినిమాల్లోని సరుకులాగే...

   'బ్రోకర్ - జోకర్'
   టైటిల్ వీళ్ళ సినిమాకు ఆప్ట్ టైటిల్...

   అయినా బ్రోకర్ ఫంక్షన్ కి ఈయనను...
   అందరుండగా - ఈయన్నే
   అతిధిగా పిలిచారంటేనే నాకు
   ఏదో...
   తేడా...

   జనరల్ గా సందర్భ్హానికి తగిన
   అర్హత గల వ్యక్తినే ప్రసంగీకులు గా
   పిలుస్తారేమోనని నాకో కుశంక...

   Delete
  4. వర్మ నిజాయితి ఎవడికి కావాలి? దాని వలన ప్రజలకేమి లాభం? ఆయన తీసిన సినేమాలవలన సమాజానికి ఎమైనా లాభం ఉందా? ఆయన కేవలం సమాజంలోని బలహీనతలపై సినేమాతీసుకొని పొట్టపొసుకొనే ఒక దర్శకుడు, నిజాయితి గా మాట్లాడినట్లుండేది పాపులారిటి కొరకు మాత్రమే! ఈ టెక్నిక్ సామాన్య ప్రజలకు బాగా అర్థమైంది. మొన్న ఆ మధ్య ఒక హోటల్ లో తింట్టుంటే కొంతమంది, మీడీయాలో వచ్చే వర్మ మాటలను విమ్ర్శిస్తూ తిట్టిన తిట్టు తిట్టాకుండా తిడుతూన్నారు. వాళ్ల కోపం ఎలా ఉందంటే అక్కడ ఉంటే నాలుగు పీకేటట్లున్నారు. ఆ తరువాత నాకర్థమైంది ఎమిటంటే ప్రజలు వర్మను స్టార్ డం ఉన్న ఒక దర్శకుడిగా చూడటం మానేసి చాలా కాలం అయ్యిందని, ఆయన అభిప్రాయాలను టివి చర్చలలో పసలేని విశ్లేషణలు చేసే మేధావుల కింద జమచేస్తున్నారని. ప్రతిదానికి ఎడ్డెమంటే తెడ్డేం అని మాట్లాడితే ప్రత్యేకంగా చూసే రోజులు పోయాయి.

   Delete
  5. Yes SriRam,
   నిజమేనండీ!అన్ని విషయాల్లోనూ ఇవ్వాళ జనం చాలా తెలివిగా రెస్పాండ్ అవుతున్నారు.మంచి పరిణామమే,లేకపోతే సెన్సేషన్ పేరుతో వల్గారిటీ ఎక్కువ చేస్తున్నారు - ఇప్పటికి సహనం నశించింది!

   Delete
  6. వర్మ నిజజీవితం లో తనతో పని చేసే వ్యక్తులను గౌరవించవచ్చు,వాళ్ళని మోసం చేయని నిజాయితి పరుడు అయిఉండవచ్చు.హైలి టలెంటెడ్ కావచ్చు. కాని వాటికి ఒక పరిమితి ఉంది.

   ఆయన తీసే సినేమాలు అన్ని రాజకీయం, రౌడీ ఇజం,మర్డర్ పై తీస్తూ సమాజం గురించి పెడ్సరంగా మాట్లాడితే ప్రజలు హర్షించరు.

   మంచో చేడో ఆయన ఎప్పుడైనా నమ్మిన ఫిలాసఫికి అనుగుణంగా ఒక రాజకీయ పార్టికి/ నాయకుడికి/మాఫియాకి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకొని పూర్తి స్థాయిలో వ్యతిరేకించి ప్రజలకి మద్దతుగా మాట్లాడా? అనేది నాకు చాలా ముఖ్యం. అప్పుడు మొదలౌతుంది అసలు సినేమా. ఊరికినే గాలి స్టేట్మెంట్ లు ఇస్తే పట్టించుకోవటానికి ఇప్పటి ప్రజలు శివ సినేమా కాలం నాటి వారు కాదు.

   Delete
  7. శ్రీరామ్ గారూ, హరిబాబు గారూ,
   నిజానికి వర్మ అనే కాదు మనకు సంబందించని ఎవరి నిజాయితీ లేక హిపోక్రసీ తోనూ మనకు ఏవిధమైన ప్రత్యక్ష లాభ నష్టాలూ ఉండవనుకోండీ (యేవో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మినహాయించి). వర్మ గారి ప్రకటనలలో, ఒకప్పుడు, కేవలం తనకు సంబందించి వెల్లడించిన వ్యక్తిగత విషయాల వరకూ, నిజాయితీ ఉండేదని నా అభిప్రాయం. ఆయన ప్రస్తుత ధోరణి కేవలం జిమ్మిక్కుల మయంగా, పోసుకోరుతనంగా కేవలం ప్రచార కాంక్షతో కూడుకున్న ఉంటున్నదనే విషయాన్ని ఎవరూ కాదనలేరు. ఆయన తీసే ప్రస్తుత సినిమాల డైరెక్షన్ గానీ చేసే ఓవర్ ఏక్షన్ గానీ ప్రజల మన్ననకెప్పుడో దూరమైందన్నది ఎవరూ కాదనలేని సత్యమే.

   Delete
  8. ఆయన టివి లలో ఇంటర్వ్యులు ఇవ్వటం తగ్గించాలి. ఎక్కువ వాగే కొద్ది బలహీనతలు బయటపడి లూజ్ అనుకొంటారు. ఇప్పటికే ఓవర్ యక్స్ పోజ్ అయిపోయాడు.

   Delete
 2. Haribabu now I am seeing your viswaroopam. Keep it up. I will follow you regularly.

  ReplyDelete
 3. * ప్రజల ఆదరాభిమానాల్ని అందుకుని యెక్కాల్సిన స్థానాలకి బ్రాండ్ అడ్వర్టైజింగ్, ఈవెంట్ మ్యానేజిమెంట్ లాంటి చీప్ ట్రిక్స్ తో యెక్కుతున్నాడు*

  మీవాదనని అంగీకరించను. అంతర్జాతీయంగా మనదేశానికి ఉన్న ఇమేజ్ ఎమిటి? ఎదో కొద్దో గొప్పో ఉంటే అది వివేకానందడు, పాశ్చ్యాత్య మేధావులు సోమర్ సేట్ మాం, పాల్ బ్రంటన్ మొదలైన వారు రమణ మహర్షి, ఇతర యోగుల మీద రాసిన పుస్తకాలు.

  ఇండియా ఎమైనా సౌది లా సంపన్నదేశామా? మిలటరి లో, ఎకనామిలో, సైన్స్ & టేక్నాలజి లో సుపర్ పవరా? విదేశాల వాళ్లు గౌరవించటానికి?

  మన గురించి విదేశాలలోని సామాన్య ప్రజలకు తెలిసింది జనాభా ఎక్కువగల మూడో ప్రపంచ దేశంగానే! ఇక మన కమ్యునిస్ట్ మేధావులు, "పాకిస్థాన్" తో కలసి దశబాదం పైగా చేసిన దుష్ప్రచారం వలన (గుజరాత్ గోల వల్ల )విదేశాలలో ఇండియాకి ఉన్న ఇమేజ్ కూడ దెబ్బతిన్నది. ఇటువంటి పరిస్థితిలో మన ప్రచారం మనం చేసుకోవలసిన అవసరం చాలా ఉంది. మోడీ ఇండియా బ్రాండ్ ఇమేజ్ పెంచటానికి కృషి చేశాడు. అదేమి ఆయన పర్సనల్ గైన్ కోసం కాదు.

  ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు