Monday, 31 March 2014

కాంగ్రెసుని ద్వేషించటం నా జన్మ హక్కు?! (బాల గంగాధర తిలక్)

               ఈ మద్యనే వెండితెర మీద నుంచి జనం మీదకి హఠాతుగా దూకిన ఒక యువ నేత తన పార్టీని కూడా విలీనం చెయ్యమన్న వ్యంగ్యానికి కినిసి "అదేమయినా గంగా అన్నిట్నీ కలపడానికి?" అని ఈసడించాడు.గంగ లాగా కాకపోయినా ఈ దేశపు రాజకీయాల్ని సుదీర్ఘకాలం పాటు తన చుట్టూ తిప్పుకుని ప్రస్తుతం అవసాన దశలో ఉన్నట్టు కనిపిస్తున్న ఆ పార్టీ చరిత్ర చాలా చిత్రమైనది.అది పుట్టినప్పటి నుంచీ నేటివరకూ ఈ దేశంలోని ప్రతి రాజకీయ వేత్తా తన రాజకీయ జీవితంలో యేదో ఒక దశలో కాంగ్రెసు స్పర్శ(Congress Touch) తగిలిన వాడే!


               1885 డిసెంబర్ 28 న ఒక విదేశీయుడి చేత తమ ప్రభుత్వానికి దేశం లోని తమకు స్నేహశీలురయిన మేధావుల నండి తమకు కావలసిన సహకారమును, తమ ప్రభుత్వానికి సాధికారికతను తెచ్చుకొనుటకు |Allan Octavian Hume| అను బ్రిటిష్ అధికారి నేతృత్వమున |Indian national Congress| అను ఒక సంస్థ స్థాపించబడినది.ఇది ప్రధమ భారత స్వాతంత్ర్య సంగ్రామము తరవాత అధికారం |బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ| నుండి |బ్రిటిష్ సామ్రాజ్యం| కు దఖలు పర్చటం అను ప్రక్రియకు సహాయ పడటం కోసం చెయ్యబడిన యేర్పాటు. అప్పటి నుండి భారత దేశం  ఉత్తర దేశంలో "రాజ్" అనే ముద్దు పేరు తోనూ తెలుగు వాళ్ళు "కుంఫిణీ దొరల పాలన" అని డాబుసరి పేరుతోనూ పిల్చుకునే అధికారికమైన పరాధీన స్థితిలోకి వెళ్ళిపోయింది.


               తొలి దశలో కాంగ్రెసు పూర్తిగా బ్రిటిష్ ప్రభుత్వ సహాయ సహకారాల తోనే మనుగడ సాగించింది.దాని ప్రతిపాదన లోనే ప్రజలలో తమ పట్ల గల వ్యతిరేకత భౌతిక ప్రతిఘటన స్థాయికి వెళ్ళకుండా |సేఫ్టీ వాల్వ్|గా ఉపయోగ పడటం అనే ఉద్దేశం ఉంది.యేమైతేనేం, ప్రతిపాదన చేసిన తొలి రోజుల నుంచీ అక్కడా ఇక్కడా యెన్నో విమర్శలూ సందేహాలూ యెదురయినా అన్నింటినీ దాటుకుని 1885 డిసెంబర్ 28న బొంబాయి నగరంలో గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో ఉమేష్ చంద్ర బెనర్జీ అద్యక్షతన 72 మంది ప్రతినిధులతో భారత జాతీయ కాంగ్రెసుని అతను ప్రారంభించాడు. అప్పటి పరిస్థితిలో ఒక భారతీయుడు పార్టీ స్థాపించే ప్రతిపాదన చెయ్యడం, స్థాపించడం అనేది వూహించలేని కాల మది.కాబట్టి యేటికి యెదురీదలేని పరిస్థితిలో అప్పటి మేధావులు అలా సర్దుకుపోవటం సమంజసమే.

                అప్పట్లోనే సయ్యద్ అహ్మద్ ఖాన్ లాంటి ముస్లిం విద్యావేత్తలు కాంగ్రెసులో అందరూ హిదువులే ఉండటాన్ని చూసి కొంత అనుమాన దృష్టి తోనే చూశారు. హిందువుల్లో కూడా మతాధిపతులూ ఛాందసులూ కాంగ్రెసు విదేశీ సంస్కృతిని సమర్ధించే ప్రమాదం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసి దూరంగానే ఉండిపోయారు. అసలు సామాన్యులకి కాంగ్రెసు అనే ఒక సంస్థ ఉందనేది కూడా అది పుట్టిన చాలా కాలం వరకూ తెలియదు.అప్పటి కాంగ్రెసు కూడా సామాన్యుల సమస్యలయిన పేదరిక నిర్మూలన, ప్రజారోగ్య సమ్రక్షణ మరియు సామాజిక సంస్కరణలు లాంటి వాటికి దూరంగానే ఉంది.ఒక విహంగ దృష్టితో చూస్తే అప్పటి కాంగ్రెసు ధనవంతులయిన ఆంగ్ల ప్రభుత్వ మిత్రులయిన |యెలైటిస్ట్| మేధావుల గుంపు, అంతే.

               తొలి దశలోని ఈ స్తబ్దత తిలక్ ప్రవేశంతో ఒక కుదుపుకు గురయింది.పూర్తి స్వాతంత్ర్యం అప్పటి వారి భావనలో లేదు. వాదనలు కూడా కాంగ్రెసు ప్రతినిధులకి చట్టాల రూపకల్పనలో మరింత యెక్కువ అవకాశం ఉండాలనే పరిమిత స్థాయిలోనే జరిగేవి. "స్వరాజ్యం నా జన్మహక్కు" అని నినదించిన మొదటి వ్యక్తి తిలక్. కేవలం నినాదంలా కాకుండా దాని పూర్తి అర్ధంతోనే ప్రతిపాదించాడు.|హోం రూల్| గురించి మాట్లాడిన యువ |మహమ్మదాలీ జిన్నా| కూడా ఇదే దశలో రంగ ప్రవేశం చేశాడు.

               కానీ తిలక్ గారి హవా యెక్కువ కాలం కొనసాగలేదు. మితవాదులయిన గోపాల కృష్న గోఖలే, ఫిరోజ్ షా మెహ్తా వంటి వారు ఉద్యమాన్ని హింసాత్మకంగా మార్చడాన్ని నిరసించి 1906లో పార్టీ నుంచి తిలక్ ని బహిష్కరించారు. సరిగ్గా అదే కాలంలో తిలక్ ఉద్యమాల్లో హిందువులకి మాత్రమే పరిచయమయిన పదజాలాన్ని ప్రవేశ పెట్టటం వల్ల ముస్లిములు సంఘటిత మయ్యారు.తిలక్ అనుకుని చేసింది కాకపోయినా దాని ఫలితంగా 1906లోనే |ఇంగ్లీషు వాళ్ళు స్పాన్సర్ చెయ్యగా| ముస్లిం లీగ్ స్థాపించబడింది.

               సందట్లో సడేమియా అన్నట్టు మొదటి ప్రపంచ యుధ్ధం వొచ్చి పడింది.దీంతో విభేదాలని పక్కన పెట్టి తిలక్, గొఖలే మొదలయిన వాళ్ళంతా మళ్ళీ కలిసి పోయి 1916లో లక్నో వేదిక ను చేసుకుని కొత్త ప్రతిపాదన చేశారు. అదే జిన్నా మరియూ అనీ బీసెంట్లు ప్రతిపాదించిన స్వరాజ్ కు మారు రూపమయిన హోం రూల్. తన రాజకీయ జీవితపు తొలి దశలో అంతటి స్వదేశాభిమానంతో మొదలయిన జిన్నా చివరి కొచ్చేసరికి దేశ విభజనకి కారణ మయ్యాడు?!

               తిలక్ ని వ్యతిరేకించిన మితవాదులు ముస్లిం లీగ్ ప్రమాదాన్ని గుర్తించటం వల్లనో లేక అతివాదుల వల్ల పార్టీ మీద పడిన మచ్చను తొలగించుకోవడానికో ముస్లిముల వైపు అతిగా వంగడంతో అది నచ్చని వాళ్ళు బయటికి వెళ్ళి పోయి 1914లో హిందూ మహా సభను యేర్పాటు చేశారు. 1910లో వీరందరూ అలహాబాదులో కలిసి పెరుగుతున్న ముస్లిం లీగ్ ప్రాబల్యం నుంచి తమను తాము కాపాడుకోవటం కోసం ఒక సంస్థ ఉండాలని సూత్రీకరించి 1914లో అమృతసర్ హరిద్వార్ లు కేంద్రాలుగా హిందూ మహా సభ రూపం ధరించిది.బనారస్ హిందూ విశ్వ విద్యాలయ స్థాపకుడయిన మదన్ మోహన్ మాలవ్యా, లాలా లజపతి రాయ్ దీనిలో ప్రముఖ పాత్ర వహించారు.


               ఇప్పటికీ దేశ రాజకీయాల్లో తమ ప్రభావాన్ని  చూపిస్తున్న ఆ రెండు ప్రతీప శక్తులూ కాంగ్రెసు వల్లనే ప్రభవించడం కాకతాళీయమా చారిత్రక అనివార్యతా అనేది దేవుడున్నాడా లేడా అనే దానికన్నా సంక్లిష్టమయిన ప్రశ్న?!కాంగ్రెసు రాజకీయ చరిత్ర తొలి దశలోని గందరగోళం ఒక కొలిక్కి వచ్చేసరికి -  యువతీ యువకుల మద్జ్యన జత కోసం యేర్పడే పోటీల్లో సాధారణంగా కనిపించే ప్రణయ త్రికోణం లాంటి ఒక రాజకీయ ప్రళయ త్రికోణం ఈ దేశపు రాజకీయ రంగస్థలం మీద ఆవిర్భవించేసింది.               ఇదంతా నేను ఇక్కడ చెప్పినంత సరళంగా జరిగి పోలేదు.ఆంగ్ల ప్రభుత్వానికి సాయం చేసే సద్బుధ్ధి గల సాధు సజ్జనుల సంస్థలోకి దాన్ని కూల్చడానికి కంకణం గట్టుకున్న విద్రోహులు ప్రవేశించడం వల్ల యేర్పడిన ఆ గందరగోళాన్ని ఇప్పటి వాళ్ళకు అర్ధమయ్యేలా వివరించడం నా వల్ల కాకనే ఇంత క్లుప్తంగా ముగించేస్తున్నాను. కానీ ఒక వైపు ప్రభుభక్తీ మరోవైపు స్వేచ్చావాదం, ఒక వైపు తమలోని హిందూత్వపు ఆధిక్యతా భావాన్ని వొదులుకోలేకపోవడం అనే బలహీనత, మరోవైపు ముస్లిములని ఆకర్షించాల్సీన అవసరం అనే పరస్పర విరుధ్ధమయిన అంశాల్ని ఒకే సంస్థలో ఇమడ్చడానికి ప్రయత్నించారు.చచ్చీ చెడీ శాయంగల విన్నపములై అన్నట్లుగా పడుగు పేకలా యెవరూ నొచ్చుకోని విధంగా అందర్నీ కలిపేశారు. ఇప్పటికీ కాంగ్రెసు పార్టీలో వివిధ వర్గాలు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఒకరి మీద మరొకరు అధిపత్యం కోసం వ్యూహాలు పన్నుతూ కూడా కలిసే ఉండటం యెలా సాధ్యపడుతున్నదో మీకిప్పుడు అర్ధమయి ఉండాలి!

______________________________________________________
1    2    3    4    5    6

3 comments:

 1. How to access 3 ...4....5...6...
  if not completed please complete it.

  ReplyDelete
  Replies
  1. ఒక్కొక్క భాగంలో అప్పుడు కాంగ్రెసులో ప్రముఖపాత్ర వహించిన వ్యక్తి ని గురించి చెబుతూ కాంగ్రెసు చరిత్రని చెప్పాలనేది ప్లాన్.దాని ప్రకారం 3.జవహర్ లాల్ నెహ్రూ4.4. ఇందిరా గాంధి, 5. రాజీవ్ గాంధి, 6లో మొత్తం పోష్టును కేటాయించగలిగిన వాళ్ళు కాదు గాబట్టి - సోనియా, మన్ మోహన్, రాహుల్ త్రయం గురించి చెప్పి వొదెలెయ్యాలని అనుకుంటున్నా.కాకపోతే అక్కదే ఆపెయ్యాలా, యెలాగూ మనకి ఆరున్నొక్కటి అనే సాంప్రదాయం వుంది కదా, అక్కడ ప్రత్యేకంగా భరతవాక్యం చెబుదామా అనేది కొంచెం వూగిసలాటగా వుంది.అక్కడిదాకా వచ్చాక చూస్తా.

   పార్ట్ 3 కొంచెం కాంప్లికేటెడ్, ఆ మనిషి లాగే.కొంచె టైం పడుతుంది.

   Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు