ప్రథమ స్కంధము
: ఉపోద్ఘాతము
1-1-శా.
శ్రీ కైవల్య
పదంబుఁ జేరుటకునై చింతించెదన్ - లోక ర
క్షైకారంభకు,
భక్త పాలన కళా సంరంభకున్, దానవో
ద్రేకస్తంభకుఁ,
గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ
కుంభకు, మహానందాంగనాడింభకున్.
టీకా:
శ్రీ
= శుభకర మైన; కైవల్య = ముక్తి; పదంబున్ = స్థితిని; చేరుట = పొందుట; కున్ = కోసము;
ఐ = ఐ; చింతించెదన్ = ప్రార్థించెదన్; లోక = లోకా లన్నిటిని; రక్ష = రక్షించుటనే; ఏక
= ముఖ్యమైన; ఆరంభ = సంకల్ప మున్న వాడు; కున్ = కి; భక్త = భక్తులను; పాలన = పాలించే;
కళా = కళ యందు; సంరంభ = వేగిరపాటు ఉన్న వాడు; కున్ = కిన్; దానవ = రాక్షసుల; ఉద్రేక
= ఉద్రేకమును; స్తంభ = మ్రాన్పడేలా చేసే వాడు; కున్ = కి; కేళి = ఆట లందు; లోల = వినోదా
లందు; విలసత్ = ప్రకాశించే; దృక్ = చూపుల; జాల = వల నుండి; సంభూత = పుట్టిన; నానా
= వివిధ; = బ్రహ్మాండముల {కంజాత భవాండకం (నీటిలో) జాత (పుట్టినదాని, (పద్మం) లోపుట్టిన
వాని (బ్రహ్మ) అండము, బ్రహ్మాండము}; కుంభ = రాశి తనలో కలిగిన వాడు; కున్ = కి; మహా
= గొప్ప; నంద = నందుని; అంగనా = భార్య యొక్క; డింభ = కొడుకు; కున్ = కున్.
భావము:
సర్వలోకాలను సంరక్షించుట అందు గట్టి సంకల్పం
కల వాడిని, భక్తజనులను కాపాడుటలో మిక్కిలి తొందర కల వాడిని, రాక్షసుల ఉద్రేకాలను అణచేవాడిని,
విలాసంగా చూసే చూపుతోటే నానా బ్రహ్మాండభాండాలు సృజించే వాడిని, మహాత్ము డైన నందుని
అంగన యొక్క కుమారుని (మహానందం దేహంగా గల ఆత్మీయుని) కైవల్య పదము (నీవుగానే తప్ప నాకంటూ
వేరే ఉనికి లేనంతగా నీలో ఐక్యం అయ్యే పదవిని) అపేక్షించి సదా స్మరిస్తూ ఉంటాను.
ఇది తెలుగు చేయబడిన భాగవత గ్రంథారంభ ప్రార్థనా
పద్యం. ఈ తెలుగసేతను బమ్మెర పోతనామాత్యుల వారు తన మోక్షానికే కాదు మనందరి మోక్షాన్ని
అపేక్షించి చేసారు. ఇది భాగవతానికే కాదు, తెలుగు సాహితీ విశ్వానికే మకుటాయమాన మైంది.
ఇష్టదేవతా స్తుతీ, వస్తు నిర్దేశమూ కల ఈ మనోజ్ఞవృత్తం మహాభాగవతంలోని ఇతివృత్తాని కంతా
అద్దం పడుతుంది. శార్దూలవిక్రీడిత వృత్తం ఎన్నుకోడంలో విషయ గాంభీర్యత సూచింపబడుతోంది.
స్తుతి, నిర్దేశాలను పలికించే పద విన్యాసం బహుళార్థ సాధకత, దీర్ఘకాల రమ్యత సాధిస్తున్న
సూచన కావచ్చు. (అ) శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్ (ఆ) లోకరక్షైకారంభకున్
(ఇ) భక్తపాలన కళా సంరంభకున్ (ఈ) దానవోద్రేక స్తంభకున్ (ఉ) కేళిలోల విలసద్దృగ్జాల సంభూత
నానా కంజాత భవాండ కుంభకున్ (ఊ) మహానందాంగనా డింభకున్ అనే అద్భుత ప్రయుక్తాలు ఈ పద్యంలో
ఆరు (6) ఉన్నాయి. భగవంతుని ప్రధాన గుణాలైన సర్వేశ్వరత్వ, ధర్మ సంస్థాపకత్వ, శిష్టరక్షణ
పరాయణత్వ, దుష్ట శిక్షణ చణత్వ, విశ్వకర్తృత్వ, ఆనందమయత్వాలు అనే ఆరింటికి ప్రతీకలు
యివి.
(అ)
శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్ అనటంలో మోక్షం కోసం ఉత్కంఠితుడైన పరీక్షిత్తు
వృత్తాంతంతో పాటు మొత్తం భాగవతమే ధ్వనిస్తున్నది. అలాగే ప్రథమ స్కంధంలోని నారదుడు,
భీష్ముడు, కుంతీదేవి మొదలైనవారి కథలూ, తృతీయ స్కంధంలోని దేవహూతి వృత్తాంతమూ, చతుర్థ
స్కంధంలోని ధ్రువ చరిత్రా స్ఫురిస్తూ భగవంతుని సర్వేశ్వరత్వాన్ని నిరూపిస్తున్నాయి.
ఎందుకంటే కైవల్యాన్ని అనుగ్రహించే అధికారం సర్వేశ్వరునికి మాత్రమే ఉంటుంది.
(ఆ)
లోకరక్షైకారంభకున్ అనటంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపు కంస కాలయవనాదులను (తృతీయ, సప్తమ,
దశమ స్కంధాలు) సంహరించి వారి అత్యాచారాల వల్ల అస్తవ్యస్తమైన లోకాన్ని ఉద్ధరించిన భగవంతుని
ధర్మ సంస్థాపకత్వం సంస్థాపించబడింది.
(ఇ)
భక్తపాలన కళా సంరభకున్ అనటంలో భక్తులను పాలించటం భగవంతుని కళ, ఎప్పుడెప్పుడు ఆర్తులను
ఆదుకుందామా అని అనుక్షణం తహతహలాడుతుంటాడు స్వామి అనే సూచన. అలాగే గజేంద్రుణ్ణి కాపాడటానికి
మహా విష్ణువు వైకుంఠం నుంచి పరుగెత్తుకు వచ్చిన వృత్తాంతం (అష్టమ స్కంధం) స్పురిస్తూ
భగవంతుని శిష్ట రక్షణ పరాయణత్వాన్ని చాటుతున్నది.
(ఈ)
దానవోద్రేకస్తంభకున్ అనటంతో అష్టమ స్కంధంలోని వామనావతారం వ్యంజకమైంది. తరువాతి మన్వంతరంలో
ఇంద్రుడు కావలసిన బలి, వరబలంతో ముందుగానే స్వర్గాన్ని ఆక్రమించి ఇంద్రపదం కాంక్షించాడు.
దుష్టశిక్షణచణు డైన స్వామి వామనుడై, ఆ దానవేంద్రుని ఉద్రేకానికి పగ్గాలు పట్టి స్తంభింపజేయటం
ధ్వనించింది.
(ఉ)
కేళిలోల... కుంభకున్ అనటం వల్ల భగవంతుని విశ్వకర్తృకత్వాన్ని వెల్లడించే సూర్యవంశ చంద్రవంశాల
చరిత్ర (నవమస్కంధం) స్ఫురిస్తోంది. స్వామి విలాసంగా త్రిప్పే కళ్ళల్లో నుంచే కదా బ్రహ్మాండాలు
ఉద్భవిస్తాయి. సృష్టి జరుగుతుంది. నిజానికి స్వామికళ్ళు సూర్యచంద్రులేగా. ఇంకా శ్రీహరే
ప్రధానకర్తని ద్వితీయ స్కంధం నిరూపిస్తోంది.
(ఊ)
మహానందాంగనా డింభకున్ అనటం కృష్ణలీలా సర్వస్వమైన దశమ స్కంధానికి, ఆ నందాంగనకు ఆనందానికి,
మహా ఆనందమే దేహంగా కల స్వరూపికి ప్రతీక.
ఇక్కడ నారాయణ తత్వం లక్ష్మీతత్వం వైపు
విలాసమైన దృష్టిని ప్రసరించటం వల్ల సృష్టి జరిగిందని చెప్తున్న విషయానికి శ్రీవిద్యా
సంబంధమైన తంత్రశాస్త్రం శివశక్త్యాత్మకమైన వివరణ ఇస్తున్నది.రెండింటిలోనూ జ్ఞానస్వరూపుడైన
సృష్టికర్త చలనానికి కారణమైన శక్తిని ప్రేరేపించడం వల్ల స్థలకాలద్రవ్యత్రిత్వం ఏర్పడుతుందనే
సత్యం వ్యక్తం అవుతున్నది.
"అహం" అనేది సృష్టికర్త ద్రష్టలకు తనను గురించి చెప్పుకున్న ఆత్మసంబోధన.భాషాపరమైన విశ్లేషణ చేసిన పాణిని అచ్చులలోని మొదటిదైన "అ",హల్లులలోని చివరిదైన "హ"తో కలిసి సృష్టికి ఆదిలోనూ అంతంలోనూ ఉండటాన్ని సూచిస్తుందనీ తర్వాత కలిసిన "అం" అనేది సృష్టియొక్క అంతం తర్వాత కూడా సృష్టికర్త ఉండగలగటాన్ని సూచిస్తుందనీ చెప్పాడు. అచ్చులలోని మొదటిదైన "అ" పరమేశ్వరుని ప్రకాశ తత్త్వానికి ప్రతీక.హల్లులలోని చివరిదైన "హ" పరమేశ్వరి యొక్క విమర్శాతత్వానికి ప్రతీక.ప్రత్యేకాక్షరమైన "అం" అనేది వ్యక్తమానమైన ప్రకృతికి ప్రతీక.అలా చూస్తే అనంతకోటి బ్రహ్మాండాల సమాహారమైన ఏకైక సృష్టి ప్రకాశ(Luminosity or consciousness) విమర్శ(the Object as the reflector) వ్యక్త(the Object that received reflection) అనే మూడు తత్వాల నుండి ఆవిర్భవించింది - సంక్షిప్తం చేసి చెప్తే ప్రకాశ స్వరూపుడైన శివుడు విమర్శరూపిణియైన శక్తియందు లీనమై శివుడి నుంచి తన మీదకి ప్రసరించిన ప్రకాశతత్వాన్ని శక్తి ప్రతిఫలింపజేసినప్పుడు వ్యక్తం ఆవిర్భవించింది.వ్యక్తంలోని వైదిక ఋషులకు తనను గురించి తను "అహం" అని ప్రకటించుకోవడం వల్ల వ్యక్తం కూడా శివతత్వమే అన్న నిర్ధారణ ఇస్తున్నట్టు మనం అర్ధం చేసుకోవాలి,అంతే!
ప్రకాశ స్వరూపుడైన శివుడు విమర్శరూపిణియైన
శక్తియందు లీనమై తనను గురించి తను "అహం" అని ప్రకటించుకోవడాన్ని మొదట తెలుసుకోగలిగినది
ద్రష్టలు.మొట్టమొదట వారి ధారణలో "అహం" అనేది ప్రతిధ్వని వలె వినబడినప్పుడు
దాని గురించి ఏమీ తెలియని స్థితిలో "కో2హం?(నేను ఎవరు?)" అనే ప్రశ్న పుట్టింది.ఆ
ప్రశ్ననే లక్ష్యం చేసుకుని తపస్సు చేశారు.అప్పుడు వారికి "సో2హం!(ఇక్కడి నేను!)"
అనే జవాబు తట్టింది.అయితే,ఇక్కడ ఉన్న - "సః" అనేది ఎవరో ఇతమిత్ధం తెలియడం
లేదు.అందుకని ఆ జవాబునే లక్ష్యం చేసుకుని మళ్ళీ తపస్సు చేశారు."సోహం" అనే
పదం యొక్క పునరుక్తి వల్ల వల్ల ఏర్పడిన "సోహంసోహం" అన్న పదబంధం యొక్క అర్ధపాఠం
నుంచి "సో" అన్న సర్వనామాన్ని తొలగించి చూసినప్పుడు "హంసోహం!"
అనే పరమసత్యం గోచరించింది.దాని అర్ధం "నేను హంసను!" అని,కదా!అది గోచరించింది
ఎవరికి?సృష్టికర్త యొక్క "అహం" అనే పదం మీద దృష్టి నిలిపి తనను గురించి తెలుసుకోవాలని
తపస్సు చేసిన వైదిక ఋషికి!
ప్రకృతిలోని సమస్త తత్వాలూ హంసలు.కాయం
నుంచి జీవం పోతే హంస లేచిపోయింది అనేది అందుకే, బ్రహ్మదేవుడి వాహనం హంస అనేది అందుకే,
సృష్టిని గురించీ ఈశ్వరుణ్ణి గురించీ పరమార్ధం తెలుసుకున్న ఆచార్యులను పరమహంసలు అనేది
కూడా అందుకే.
జై శ్రీ రాం!
No comments:
Post a Comment
సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు