Friday, 11 March 2016

అవే దృశ్యాలు,అవే భావాలు,అవే మాటలు ,అవే స్మృతులు - అయినా ఎంత నిత్య నూతనం!

     మా అమ్మాయి పుట్టినప్పుడు నన్నసలు హాస్పిటల్ దరిదాపులకే పోనివ్వలేదు మా బంగారం కేకలు విని తట్టుకోలేనని, పాపాయినీ వెంటనే చూడనివ్వలేదు!తెల్లవారుఝామున, పక్కన ఎవరన్నా మాట్లాడుకుంటుంటే నీటిలో మునిగి వింటున్నట్టు అనిపించేటంత మాగన్ను నిద్రలో ఉన్నప్పుడు మా మామయ్య "ఇదుగోనయ్యా!నీ కూతురు, చూసుకో - కలవరిస్తున్నావుగా" అని కొంచెం విసురుగానే నా పక్కలో పడుకోబెడితే,ఆ విసురుకి గాబోలు కదిలి కాలు కొంచెం ఝాడించింది!ఇప్పటికీ ఆ సన్నివేశం గుర్తొస్తే పక్కటెముకల దగ్గిర అప్పటి మెత్తని కాలితాపు స్పర్శ తెలుస్తూనే ఉంటుంది - ఏమిటీ మహామాయ?తనని మొదటిసారి చూడగానే అధాట్న కాలంలో వెనక్కి వెళ్ళిపోయి నా చిన్నప్పటి నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది!చిన్నప్పుడు నన్ను ఇట్లా చూసిన మానాన్నకీ ఇట్లానే అనిపించి ఉండాలి!

     ఇంకా వెనక్కి వెళ్తే మా నాన్న పుట్టినప్పుడు వాళ్ళ నాన్న కూడా ఇట్లాగే అనుకుని ఉండాలి.ఇంకా వెనక్కి వెళ్తే...?మళ్ళీ మా అమ్మాయి మొదటిసారి మాటలు నేర్చినప్పుడూ అదే అనుభూతి!మామూలుగా అందరూ మొదట అమ్మా నాన్నల్ని "అమ్మా!" అనీ "నాన్నా!" అనీ పిలుస్తారు, కానీ మా బుజ్జిగాడు మమ్మల్ని అందరూ పిలిచే పిలుపుల్ని విని పట్టేసి నన్నేమో "హబాబూ!" అనీ మాధవినేమో "మాధీ" అనీ మొదలుపెట్టి తర్వాత "హరిబాబూ!","మాధవీ!" అని మా పేర్లతోనే పిల్చేది!తర్వాతెప్పుడో బాగా పెద్దయ్యాక తనే "అమ్మా","నాన్నా" అనడం నేర్చుకుంది గానీ మాకు మాత్రం మొదటి పిలుపులే నచ్చాయి - వీళ్ళు తేడా మనుషులు అన్నట్టు పనిగట్టుకుని అట్లాగే పిలవమని ఒత్తిడి పెట్టలేదు గానీ ఇంకొంతకాలం అట్లానే పిలిస్తే బాగుండును కదా అని చాలాకాలం పాటు బెంగగా అంపించేది!

     ఈ మాటలు నేర్చుకున్నప్పటి ఒక సుదీర్ఘకాలం పాటు మా ఇద్దరి మధ్యనా జరిగిన హాస్యకదంబం ఎప్పటికీ నవ్వొస్తూనే ఉంటుంది.అన్ని మాటలూ తొందరగానే నేర్చుకున్నది గానీ "డాబా","డబ్బా" అనే రెండు మాటల విషయంలో మాత్రం చాలా టైము తీసుకుంది.ఎవరైనా తప్పులు చేస్తుంటే సరిద్దటం విషయంలో నా చాదస్తం మీకు తెలుసుగా!నా పట్టుదల కొద్దీ ఎంత మెల్లగా స్పష్టంగా కూనిరాగం తీస్తూ తలని పైనించి కిందకి ఇట్లాగే చెప్పు అన్నట్టు ఆడిస్తూ "డబ్బా!" అనమని చూపిస్తే, అది కూడా అచ్చు నేను ఎంత దీర్ఘం తీశానో అంతే దీర్ఘంతో తలని కూడా నాలాగే ఆడిస్తూ అంతే స్పష్తంగా "బడ్డా!" అని మాత్రమే అనేది:-)

     తను తొలిసారి కింద పదకుండా వూగుతూ వూగుతూ వొచ్చి మీద వాలిపోయి నడిచింది నాలుగడుగులే అయినా గొప్ప ఘనకార్యం చేసినట్టు నవ్వుతుంటే అప్పుడు కూడా తను కాదు నడక నేర్చుకున్నది నేను అన్న గర్వం!ఐశ్వర్యాలు కోరుకుని,వైభవాల కోసం ఆరాటపడి,అసహనాలతో రగిలిపోయి చూడటం లేదు గానీ మనలోనే ఉంది సుఖజీవనసారం!మనపక్కనుంచే మనల్ని రాసుకుంటూనే ఒక భోగయాత్ర నిరంతరం నడుస్తూనే ఉన్నది - ఐతే, చూడాలనుకుంటేనే కనబడే మార్మికత ఉంది అందులో!ఎవరు ఏ దృక్కోణంతో చూస్తే ఆ విధంగా కనబడే మార్మిక లోకం ఇది!నాకో కూతురు పుట్టటం, ఆ పాపాయి నడక నేర్చుకోవటం, అప్పుడు నా మనస్సులో పుట్టే ఆలోచనలూ అనుభూతులూ ఆనందాలూ నాకు మాత్రమే జరిగినవి అనుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో నాకు జరిగినవి నాకు మాత్రమే ప్రత్యేకంగా జరగడం లేదనీ, మానవసమూహం అనుబంధాలతో పెనవేసుకోవటం మొదలుపెట్టినప్పటి నుంచీ ప్రతి మనిషికీ జరుగుతున్నవేననీ తెలిసినప్పుడు అంత విచిత్రంగా అనిపిస్తుంది!జననం,బాల్యం,యవ్వనం,కౌమారం,వార్ధక్యం,మరణం - పునరపిగా నిరంతరం జరిగే ఈ దృశ్యాదృశ్య జీవన సంరంభం ఎప్పుడు ఆగుతుంది?అసలు ఆగుతుందా, ఎప్పటికీ ఆగదా!

     మనుషుల్ని కులాలుగా,మతాలుగా,జాతులుగా,ముఖ్యమంత్రులుగా,రిక్షావాళ్ళుగా విడగొట్టకుండా  హఠాత్తుగా వీళ్ళిప్పుడు ఏమి చేస్తూ ఉండి ఉంటారు అని ఆలోచిస్తే మనుషులు అతి మామూలుగా చేసే పనులు ఏమిటి?తొలిసారి తల్లి గర్భం నుంచి బొడ్డుతాడు తెగి జారిపడగానే ఉలిక్కిపడి గుక్కపట్టి ఏడవటం,తల్లి దగ్గిరకి తీసుకోగానే మళ్ళీ సంబాళించుకోవటం,తనకి పాలిస్తున్న తల్లిని గుర్తుపట్టటం,తల్లి మాటల్ని వింటూ మాటలు నేర్చుకోవటం, అమ్మ చంకన ఎక్కటమే కొండకొమ్ముల నెక్కినంత గొప్పగా అనిపించటం,అమ్మ ఎవరివైపు చూసి నవ్వితే వాళ్ళు మంచివాళ్ళనీ ఎవరివైపు కోపంగా చూస్తే వాళ్ళు చెడ్డవాళ్లనీ నేర్చుకోవటం,కొత్తగా నడక నేర్చుకున్న హుషారులో గడపల్ని చూస్కోకుండా పరిగెడుతుంటే "పడిపోతావు!" అనే వెనకనుంచి వినబడే ఆందోళనకి "ఈ మాత్రానికే?" అనుకోవటం,కొత్తసైకిలు కోసం నాన్నని అడగటం,కుదరదంటే "మా నాన్న పీనాసి" అనేసుకుని కొనిచ్చేవరకు అన్నం తిననని మారాం చెయ్యటం,కొనిస్తే అన్నీ మర్చిపోయి "మా నాన్న మంచోడు!" అనేసుకుని నవ్వుకోవటం,పరీక్షల్లో తప్పినప్పుడు తిడుతుంటే తల వేళ్ళాడేసుకుని నిలబడ్డం,డిస్టింక్షన్ కొడితే కాలరెగరెయ్యటం,ఫ్రెండ్సుతో క్లాసులూ టెస్టులూ ఎగ్గొట్టి మ్యాట్నీలకి చెక్కెయ్యటం,మనకి నచ్చిన హీరో హీరొయిన్ల గురించి వాళ్లు నచ్చని ఫ్రెండ్సుతో తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఆవేశపడిపోవటం,ఇంట్లోవాళ్ళు ఇక పెళ్ళి చేసెయ్యాలన్నప్పుడు మొదట బోల్డు కంగారు పడిపోయి పిదప తెగ సిగ్గుపడిపోయి ఆఖరికి ఉషారుగా రెడీ అయిపోవటం,పెళ్ళంటే తర్వాత వచ్చే పాలడబ్బాల ఖర్చులూ స్కూలుఫీజుల బరువులూ తెలియకపోవటంచేత పాలగ్లాసూ మల్లెపూలూ మాత్రమే గుర్తొచ్చి రోజుల తరబడి వాటి గురించి వీరలెవెల్ల్లో వూహించేసుకుని తీరా మొదటిరాత్రి తెల్లవారిన తర్వాత "ఓసింతేనా?దీని కోసమా ఇంత హడావిడి!ఈపాటిదానికి ఇవన్నీ అవసరమా?!" అని నవ్వుకోవడం,పెళ్ళి చేసి పంపించేటప్పుడు ఆడపిల్ల తలిదండ్రులు ఎంత ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయినా తెల్లారేసరికి "హమ్మయ్య, ఒక గండం గడిచింది.ఇంక అక్కడెట్లా ఉంటుందో!" అనుకుని పెళ్ళిలో జరిగిన తప్పులూ ఒప్పులూ కోపాలూ తాపాలూ విరగబాట్లూ సర్దుబాట్లూ చెప్పుకుంటూ నవ్వుకోవటం,పెళ్ళయ్యేవరకు పుట్టింట్లో మహారాణిలా పెరిగిన కొత్త పెళ్ళికూతురు రెండో రోజుకల్లా పుట్టింటికే ఎవరో చుట్టాలింటికి వచ్చినట్టు నాల్రోజులుండి వెళ్ళిపోవటం,కొత్త జంటలో ఒకరికొకరు ఇంకా కొత్తముఖాల్లాగే అనిపిస్తూ అందర్లో తిరిగేటప్పుడు జరిగే చిరు తగిలింతలు కూడా పెను పులకింతలై నునుసిగ్గుల మెరుపుల చిరునవ్వుల్ని పుట్టించటం,కాస్త పాతబడిపోగానే అవే కదలికలు "నలుగుర్లో ఉన్నామనే ఇంగితం కూడా లేకుండా ఇంకా ఏమిటీ మోటు సరసం?" అని విసుగు తెప్పించటం,పిల్లలు పుట్టుకురాగానే పాలడబ్బాల ఖర్చులూ స్కూలుఫీజుల బరువులూ మోస్తూ రోజూ పొద్దున్నే లంచ్ బాక్సులు సర్దేసుకుని సగం తిని సగం వదిలేసి ఉరుకులు పరుగులతో సిటీబస్సు అందుకుని చెమట్లు గక్కుతూ పోయి ఆఫీసులో పడి మళ్ళీ చెమట్లు గక్కుకుంటూ రాత్రి కొంపకి జేరి తిన్నామా పడుకున్నామా లేచామా అని ఒకటే హడావిడి పడుతూ తిట్టుకుంటూ విట్టుకుంటూ నెట్టుకుంటూ గానుగెద్దు జీవితం గడుపుతూ జుట్టులో తెల్లవెంట్రుకలు కనపడ్డాక "అప్పుడేనా?ఓర్నాయినో!ఏమీ ఎంజాయ్ చెయ్యనే లేదు, ఇప్పుడెట్లా?!" అని బెంగేట్టుకోవటం,తనకి తల నెరిసిందంటే అర్జెంటుగా పిల్లలకి పెళ్ళిల్ళు  చెయ్యాల్సిన వయసొచ్చిందని గుర్తొచ్చి హడిలిపోవటం,అసలెంత నిలవెంత కొసరెంత ఇంట్లో ఎంత బ్యాంకులో ఎంత సంబంధా లెప్పుడు వెతకాలి ఏ సంబంధం ఖాయం చేసుకోవాలి నిశ్చితార్ధాని కెంత పెళ్ళిపనులు ఎప్పుడు మొదలెట్టాలి చుట్టాలెవరెవర్ని ఎట్లా ఎట్లా పిలవాలి ఆ ముహూర్తానికి ఏ పెళ్ళిమండపం దొరుకుతుంది అని ఎక్కాల పుస్తకంలో ఉన్న ఎక్కాలన్నీ కవరయ్యేలా లెక్కలు వేసుకుని చచ్చీచెడి శాయంగల విన్నపములై అన్నట్టు ఆ పని కాస్తా ముగించి "ఇంక నాపనయిపోయిందిరోయ్, దేవుడోయ్!" అని గావుకేక పెట్టి వాలుకుర్చీలో కూలబట్టం,పిల్లలు ప్రయోజకులై వాళ్ళ ఘనకార్యాలు చెప్తుంటే పొంగిపోతున్నప్పటి ఆనందంలో గభాల్న "నాన్న కూడా ఉంటే ఎంత బావుండేది!" అనిపించినప్పుడు చెమ్మగిల్లిన తడికన్నులతో నవ్వటం,మనవలూ మనవరాళ్లతో పోటీపడి పరిగెత్తలేనప్పుడు ఇంక మనకి చివరిబండి సిద్ధమయ్యిందని తెలిసిపోవటం,ఎప్పుడొస్తుందో తెలియని మలుపుకోసం ఎదురు చూట్టం - లీనమై బతికితే దేవుడు కూడా ఈర్ష్యపడేటంత సప్తవర్ణ సంశోభితమైన స్వరరాగ గంగాప్రవాహమే కదా మానవజీవితం!

     అక్కడా ఇక్కడా నిన్నా మొన్నా ఇదే జగన్నాటకం పదే పదే జరుగుతూనే ఉన్నా చిన్న చిన్న ఎదురుదెబ్బలు కూడా ఇంతకుముదు ఇంకెవరికీ తగలనట్టు హడావిడి చేస్తూ ఇప్పుడే తమకొకరికే ఇట్లా జరిగినట్టు అతిగా వూహించేసుకుని పెద్దలు చెప్పిన అనుభవసారమంతా మర్చిపోయి ఇప్పటివరకు చెప్పినదంతా పరగడుపైన వాళ్ళు తమ బతుకు పుస్తకాల్ని మధ్యలో మూసేస్తున్నారు - ఎంత పిచ్చ్గివాళ్ళు?చావుని పొగిడేవాళ్ళు,చావుకి నడిచేవాళ్ళు,చావుని కెలికేవాళ్ళు మంచివాళ్ళు కానేకాదు - చచ్చిపోవటానికి తప్ప ఇంకెందుకూ పనికిరాని వాళ్ళు!వాళ్ళ మాటల్లో ఒక్క మాట కూడా నిజం కాదు - అస్సలు నమ్మొద్దు, అటువైపు పోవద్దు!దేవుడు కూడా ముచ్చట పడి ఇక్కడ పుట్టి బతికి చూపించిన ఇంత గొప్ప బతుకును సగంలో ముగించి ఏం సాధిస్తావు?ఇవ్వాళ్టి పార్ధుడికి ఈనాటి గీతాచార్యుడు యుద్ధం గురించి చెప్పడం లేదు,ఒక భోగయాత్రని గురించి చెప్తున్నాడు - చెవులు రిక్కించుకుని విను!

     ఈ విశ్వం మొత్తానికి నువ్వే కేంద్రబిందువు - అనుకో, పర్లేదు!నువ్వే నేననీ నేనే నువ్వనీ కూడా అనుకో, నేనేమీ అనుకోను!ప్రపంచమొక నిరంతర భోగయాత్ర!అవును, నీచుట్టూ నేనొక భోగయాత్రని కల్పించాను - చూడు!నడిచి,నడిపించు!భోగయాత్ర అంటే,గడప దాటి బైటికెళ్తే ఛస్తానని ఇంటిపట్టున కూర్చుని రేపటి కోసం దాచుకుని తింటూ ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కదలకుండా పీఠమేసుకుని కూర్చోవటం కాదు, రేపటి గురించి ఆలోచించకుండా ఉన్నదంతా మూటగట్టుకుని గుడారం సామగ్రిని ఒంటెలమీద కెక్కించి ఇల్లు వదిలి నీలాంటి భోగయాత్రికుల్ని కలుపుకుని కోలాహలంగా వూళ్ళు పట్టుకు తిరగటం - సరికొత్త దేశదిమ్మరి తనం!

     నీ సాటివాడు బీడీ కాలుస్తున్నాడు,నీకూ కాల్చాలనిపించింది,జేబులు తడుముకున్నావు, లేదు!ఏం మొహమాట పడకుండా "అన్నా!నేనూ ఓ దమ్ము లాగనా?" అని సూటిగా అడిగెయ్యి.అతను కూడా "దాందేముంది తమ్ముడూ!పూర్తి బీడీయే తీసుకో!" అని కొత్తదే ఇస్తాడు.నీ సాటివాడు "అన్నా, దాహమేస్తుంది!ఓ గుక్క తాగుతానేం!" అని నీ నడుము కున్న సొరకాయ బుర్రని చనువుగా తీసుకుంటాడు.నువ్వు కూడా "ఒక్క గుక్కేం ఖర్మ,మొత్తం తాగేసినా పర్లెదు - వచ్చే చెలమ దగ్గిర నింపుదాంలే!" అంటావు.భోగయాత్రలో ఉన్న కిటుకే అది.అమ్మదం,కొనదం,లాభం,నష్టం,ఖరీదు - ఇవేవీ ఉండవు, అంతా పంచుకొనుడే!"కలిసి నడుద్దాం.కలిసి మాట్లాడుకుందాం.కలిసి మెలిసి ఒకరి మనస్సు లొకరం తెలుసుకుందాం.మన పూర్వులు దేవీభాగాన్ని యెలా పంచుకునేవారో అలాంటి జ్ఞానాన్ని ఉపాసింధుదాం!"నీ దగ్గిర లేనిది ఎదటివాడి దగ్గిర ఉంటే అడిగి తీసుకోవచ్చు - అయితే,అతను సంతోషంగా ఇస్తేఅనే తీసుకోవాలి.జులుం చేసి గుంజుకోవొద్దు.నీ వైపు నుచి తీసుకున్న ప్రతి రూపాయికీ పది రూపాయలు చేసి ఇవ్వు - అదీ భోగయాత్రికుడి లక్షణం!

     కొందరుంటారు, తీసుకోవడానికి చూపించే తొందర ఇవ్వడానికి చూపించరు.ఒక వూరిలో ఒక బావి ఉంది.పొరుగూరి వాడొకడు అందులోకి జారిపడ్డాడు.పెద్ద లోతు కూడా లేదు.వాడు గట్టిగా ఎగిరితే వీళ్ళు చెయ్యి పట్టుకుని లాగెయ్యొచ్చు.కానీ,చెవుడేమోఅనుకుని అరిచి చెప్పినా మూగేమో అనుకుని సైగలు చేసి చెప్పినా వెర్రి చూపులు చూస్తాదే తప్ప ఎగరడే?!వాలకం చూస్తే పిచ్చోడిలా లేడు,వాడి ఖర్మకి వాణ్ణి వొదిలేద్దామా అంటే వీళ్ళంతా పాపం మంచి ముండా వాళ్ళు!ఆఖరికి ఒకడొచ్చి లటక్కన లాగేశాడు?!వీళ్ళందరికీ దిమ్మదిరిగి మైండు బ్లాంకయ్యింది.అనుమానమొచ్చి "బాబూ, నీ పేరు పండుగాడు కదూ!" అనడిగారు, వాడు కాదనేశాడు?మరీ కంగారెత్తిపోయి ఈసారి మొహమాటం లేకుండా అసలు దౌటే అడిగేశారు,"మేమందరం అంతసేపు తంటాలు పడ్డా లాగలేక పోయాం,మరి నువ్వు చేసిన ట్రిక్కు యేంటీ?" అని.దానికి వాడు మొహమంతా నవ్వు చేసుకుని "మీరేమన్నారు?నీ చెయ్యిటివ్వు లాగేస్తాం అని,కదా!నేనేమన్నాను?నా చెయ్యి పట్టుకో లాగేస్తాను అని,కదా!ఆడు మా వూరోదే.ఎప్పుడూ తీసుకోవటమే తప్ప ఇవ్వటం ఆడి జన్మకి చెయ్యడు" అన్నాడు.అటువంటి వాళ్ళు ఈ భోగయాత్రకి పనికిరారు!

     భోగ యాత్రిక లక్షణాలు వంటబట్టాలంటే నువ్వు తప్పకుండా చెట్లని చూసి నేర్చుకోవాల్సిందే!చెట్టు చేమలన్నీ ఎప్పట్నుంచో భోగయాత్రలోనే నడుస్తున్నాయి. నిరాడంబరంగా జీవిస్తూనే వైభవోజ్వలంగా ప్రకాశించదల్చుకుంటే అందుకో చక్కని రాజమార్గం ఉంది, చెప్పనా?చూడు...పచ్చగా ఎదిగే చెట్టుని చూడు!ఆ చెట్టులాగే సారవంతమైన నేలవంటి కఠినసత్యప్పు పునాదుల మీద నీతినియమాలతో నిండిన నీ ప్రవర్తన అనే ధృఢమైన కాండాన్ని నిలబెట్టి ఉంచు.అందుకోసం మొదట నీ జిజ్ఞాసల వేర్లని మహనీయుల బోధనల్లోకి వీలైనంత పొడుగ్గా సాగించి ఉంచు.అప్పుడిక విజృంభించి నలుదిక్కులకీ శాఖల్ని విస్తరించు.ఆ శాఖలు నీ హృదయంలో పొంగిపొర్లుతున్న సౌజన్యాన్ని ప్రతి కణుపులోనూ నిండుగా నింపుకున్న స్నేహామృత హస్తవారధులే కదూ!ఆత్మీయంగా కనబడే రూపం,మోహనంగా వెలిగే చిరునవ్వూ,సదా స్వాగతించే హస్తచాలనంతో నిలబడి నీకు దగ్గిరగా వచ్చిన ప్రతి మనిషినీ ప్రియభాసహణతో అలరించు.ప్రతి నిముషమూ నీకు పరిచయమౌతున్న అసంఖ్యాక జనసందోహం నుంచి సాధ్యమైనంత  తక్కువ సమయంలో వీలయినంత ఎక్కువమందిని నీకోసం ప్రాణమిచ్చే స్నేహితులుగా పెంచుకుంటూ ఎదుగు.ఐతే,నీ స్నేహానికి తగనివాళ్ళైన కొందరు చీడపురుగుల్ని మాత్రం అసలు దగ్గిరకే రానివ్వకు.అప్పుడు మొహమాట పడి మితిమీరిన చనువిస్తే తర్వాత నీకే ప్రమాదం!ఇతర్లని వెక్కిరించి ఆనందించే వాళ్ళనీ,తమ అవసరం కోసం మమకారం నటించే వాళ్ళనీ - వాళ్ళ బుద్ధి తెలిసిన మరుక్షణమే వాళ్ళతో నీకున్న అనుబంధాన్ని కత్తిరించేసి వాళ్ళని అంతటితో విస్మరించి పారెయ్యి.చిరుమొలకలుగా ఉన్నప్పట్నించీ తెగుళ్ళనీ,చీడపీడల్ని ఎప్పుడు హింసించటం మొదలుపెడితే అప్పుడు తడబడకుండా అడ్డుకోగలిగినవే నేడిలా మహావృక్షాలై నిలబడ్డాయని తెలుసుకో!అనునిత్యం జీవం తొణికిసలాడుతూ, స్నేహమధురవసంతాల చిగుళ్ళు తొడుగుతూ ఆప్తులందరికీ సతతతహరితంగా కనబడు.ప్రియమిత్రులకి నిరాఘాటంగా ఆతిధ్యపు నీడనిచ్చి, అవసరమై వచ్చి సహాయ మడిగితే బెట్టు చెయ్యకుండా చెయ్యాల్సిన త్యాగసముదాయాల్ని పండిన ఫలాలుగా అందించి నిగర్వంగా ఉండటాన్ని నేర్చుకో!

     భోగయాత్రలో కదలాలంటే కలివిడితనం ఉండాలె!పూనుకుని మాట కలుపాలె.మాటకి మాట కలుపాలె.కష్టం సుఖం కలబోసుకోవాలె.పగలల్లా కష్టపడాలె,రాత్రికోసం ఎదురుచూడాలె.రాత్రికి మంచి చోటు చూసుకుని డెరాలు బిగించి మజిలీ వేస్తారు చూడు, అప్పుడు మొదలవుతుంది కోలాహలం!రాత్రయింది గదాని కడుపునిండా పట్టించి ముసుగుతన్ని పడుకోవద్దు!నువ్వు వండిన వంటకం నువ్వు మాత్రమే తినకు - అదే అసలైన దరిద్రం!అక్కడ కోలాహలాగ్ని దగ్గిర తక్కిన భోగయాత్రికులు సందడి చేస్తుంటే నువ్విక్కడ ఒంటికాయ సొంటికొమ్ములా కూర్చుంటే కుదరదు!ఎదటివాడు తనని ముట్టుకుంటే తను మైలపడతాననే ఆలోచన మనస్సులోకి వచ్చిన వాడెవడయినా అస్పృశ్యుడే అవుతాడు!తనని ముట్టుకున్న ప్రతివాడికీ తననుంచి పవిత్రతని ప్రవహింపజెయ్యగలిగినవాడు మాత్రమే నిజమైన బ్రాహ్మణుడు కాగలడు!వెళ్ళు వెళ్ళు, అక్కడ ఆహితాగ్నిలా వెలుగుతున్న కోలాహలాగ్ని దగ్గిర కెళ్ళు!ఈ మోసం,ద్వేషం,ఎక్కువ,తక్కువ,స్వార్ధం - అన్నింటినీ బైటికి తీసి కోలాహలాగ్నిలో తగలెయ్!ప్రతివాడినీ హృదయానికి హత్తుకో!కలం ఝళిపించి కొత్త పాట రాసెయ్!గొంతు పెకలించి కొత్త రాగం పాడెయ్!గజ్జె కదిలించి కొత్త చిందు వేసెయ్!చేతి కొద్దీ దరువెయ్!కాలి కొద్దీ ఎగిరెయ్!అలిసిపోయినా వెనకబడిపోకు, పక్కనే పానశాలలో సాకీ ఉంది!మధుపాత్ర నింపు, ఖాళీ చెయ్!అలుపు తీర్చుకుని మళ్ళీ వొచ్చిపడు!ఆడుతున్నవాళ్లకి చప్పట్లు కొట్టి వాళ్లని మరింత హుషారు చెయ్!పాడుతున్నవాళ్ళకి పక్కతాళం వేసి నువ్వు మరింత రెచ్చిపో!ఇప్పుడున్న గుడారం నచ్చకపోతే వెంటనే పక్కదాంట్లోకి వెళ్ళు!ఈ భోగయాత్రలో ఎవడికీ ఏ డేరానీ హక్కుభుక్తం రాసివ్వలేదు నేను!గొడవలొస్తే వెనక్కి తగ్గొద్దు!నువ్వు నాలుగు తిట్లు తిట్టు!నువ్వు నాలుగు తిట్లు తిను! ఏదయినా చెయ్యి గానీ, నువ్వు మాత్రం ఏడవొద్దు - ఎవర్నీ ఏడిపించొద్దు!

     ఏడుపే అసలైన చావు!అసలు చావనేది లేనే లేదు.నువ్వు చావనుకుంటున్నది చావు కాదు.నిన్నటి మీ తలిదండ్రులు ఇప్పటి మీ భార్యాభర్తలుగా బతికి ఉన్నారు.ఇప్పటి మీ భార్యాభర్తలు రేపటి మీ కొడుకూ కోడళ్ళలో కూతుతూ అల్లుళ్ళలో బతికి ఉంటారు - కొత్తవాళ్ళకి చోటుకోసం పాతవాళ్ళని ఖాళీ చేయించే సత్రమిది, అంతే!ఈ గొలుసుకట్టును తెగనివ్వకు.నడుస్తున్న భోగయాత్రని ఆగనివ్వకు.ఏడుస్తూ బతికినా నవ్వుతూ బతికినా ఒకసారి చచ్చిపోయాక మళ్ళీ తిరిగి రావడం కుదరదన్నది సత్యం.యేది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!యేది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!

సత్యం శివం సుందరం!!!

19 comments:

 1. kadilinchedi kavithvamantaaru.
  mee rachana anduku sarigga saritoogutundi.
  haardika abhinandanalu.
  anjaneyulu

  ReplyDelete
  Replies
  1. >>kadilinchedi kavithvamantaaru.

   Yes Sir!I tried to capture poetry in prose.
   thanks

   Delete
 2. అన్నా. మీకు ఆధునిక వచనకవితా పితామహుడు అని బిరుదు ఇవ్వాలి. ఇంత పెద్ద ఆర్టికిల్స్ విసుగు లెకుండా రాయటం మీకె సాధ్యం.

  ReplyDelete
 3. Super andi hari babu garu, first 3 paragraph chala super ga unnayi. Nice one.

  ReplyDelete
 4. హరిబాబు మరో కోణము
  సరిజోడు వచన కవితయు చవులూ రించెన్
  గరిమగ బ్లాగున నిటులన్
  సరళపు రీతిన సుమతిని చక్కగ గూర్చెన్

  ReplyDelete
 5. హరిబాబు గారు,
  బాగా వ్రాశారు. జీవితపు
  గమనం ఎలా ఉండాలో,
  ఎలా పండించుకోవాలో,
  తెలియజేస్తూ,
  నిత్య నూతనంగా ...

  ReplyDelete
 6. Immensely enjoyed reading yr thought provoking essay on life's kaleidoscope !

  ReplyDelete
 7. ,పెళ్ళంటే తర్వాత వచ్చే పాలడబ్బాల ఖర్చులూ స్కూలుఫీజుల బరువులూ తెలియకపోవటంచేత పాలగ్లాసూ మల్లెపూలూ మాత్రమే గుర్తొచ్చి రోజుల తరబడి వాటి గురించి వీరలెవెల్ల్లో వూహించేసుకుని తీరా మొదటిరాత్రి తెల్లవారిన తర్వాత "ఓసింతేనా?దీని కోసమా ఇంత హడావిడి!ఈపాటిదానికి ఇవన్నీ అవసరమా?!"

  అదేమిటి హరిబాబు, ఇలా తేల్చేశావు. మీరు పక్కరోజు నిద్రలేచి
  'సిరిమల్లె సొగసూ, జాబిల్లి వెలుగూ నీలోనే చూసానులే…’ అనే పాటపాడి ఉంటే ఎంత సొంతోషించి ఉంటారు. పోని ఆపాట గుర్తుకు రాకపోతే ‘మల్లెకన్న తెల్లన, మా సీత సొగసు…తేనె కన్నా తీయనా, మా సీత మనసు...’ అని మీరంటే,
  'తేనె కన్న తీయన మా బావ మనసు..పెరుగంత కమ్మన మా బావ మనసు..' అనుండేవారుగా!

  అప్పుడు మీమనసు సంతోషం తో నిండిపోయి ఉండేదిగా!

  వాస్తవం మాట్లాడితే ఎమి వస్తుంది, ఇతరులతో తగువు తప్ప :)
  ReplyDelete
  Replies
  1. anon
   వాస్తవం మాట్లాడితే ఎమి వస్తుంది, ఇతరులతో తగువు తప్ప :)
   haribabu
   నిజమే,అందుకే నా నెత్త్తిమీదకి ఇన్ని తగువులు వస్తున్నాయి కాబోలు:-(
   మీరు నాకళ్ళు తెరిపంచారు,ఇకముందు నిజాలు చెప్పనే చెప్పకూడదు:-)

   Delete
  2. హరిబాబుగారు.
   ఉబోస అనుకున్నా చెప్పాలనుకున్నా!
   కొంతమంది మాటాడకపోయినా పరిచయం చేసుకుమాటాడాలి.
   కొంత మందితో కొంత దూరమే మాటాడాలి. ఆ తరవాత వాదం పెరుగుతుంటే అది వితండం అవుతుంటే వదిలేయాలి.
   కొంతమంది కలిపించుకుమాటాడినా దూరంగా పారిపోవాలి :) ఇటువంటి జనాభా బ్లాగుల్లో పెరిగిపోతున్నారు.

   ఇదెందుకు చెప్పేనో మీకు తెలుసు. నేనిలా చెప్పడం తప్పనుకుంటే మన్నించి మరిచిపొండి.

   Delete
  3. హరిబా బుగారు ! ఒజ్జల
   పరిచయముగ కొంతుబోస పల్కుల వినుమా
   సరి,కొందరిని వదలవలె
   మరి కొందరి తోడ మాట మరిమరి గొనుమా :)

   చీర్స్
   జిలేబి

   Delete
  4. సారంగలో రింగారింగా గురంచేనా?
   పిలిచి మరీ అవమానించితే ఎట్లా తట్టుకునేది, చెప్పండి?
   అక్కడికీ మర్యాదగా రెండుసార్లు చెప్పి చూశాను - చెవిన వేసుకోలేదు.
   అంతా అయిపోయింది లెండి,నేను పూనుకుని ఎప్పుడూ గొడవలకి దిగను,
   దిగితే మాత్రం బాలెన్సు చెయ్యకుండా వెనక్కి రాలేను - అది నా సహజస్వభావం!

   Delete
 8. మళ్ళి మొదలైన ప్రజ బ్లాగు!

  కొంత కాలంగా బ్లాగులోకం ప్రశాంతంగా గడపటానికి కారణం ప్రజ బ్లాగు మూలపడటం. గత రెండు రోజులుగా ప్రజ బ్లాగు యాక్టివ్ గా ప్రశ్నలు సంధించటం మొదలుపెట్టింది. ఇక్కడ జరిగే చర్చలలో మొద్దు వెధవకి ఎంత చదువు చెప్పిన నోబుల్ సైంటిస్ట్ గా మారలేడో. ఎన్ని విషయాలు చెప్పిన ప్రజ బ్లాగు కొండలరావు మారేది ఉండదు అని చర్చలను చదివేవారికి తెలుసు. అందుకే సరదాగా బ్లాగులోకంలో రోజా ఆంటినా? అమ్మాయా? అని ప్రజా బ్లాగు చర్చలను ఆటపట్టిస్తూంటారు.

  అయ్యా కొండలరావు, నీవు లేకపోతే బ్లాగులు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. నువ్వు ప్రజ బ్లాగును మూసి వేస్తే ప్రజలు సంతోషిస్తారు. వేళ్లవయ్యా బాబు, బ్లాగు మూసుకొని వెళ్ళు...

  ReplyDelete
 9. ఎక్కడో... ఏ సుదూర ఎడారిలో... ఎవ్వరో తెలియని ఆత్మీయుల మధ్య.... ఎన్నో జన్మల క్రితం గడిపిన ఉల్లాసమయిన క్షణాలు గుర్తుకొస్తున్నాయి. దృశ్యాదృశ్యంగా... అగమ్య గోచరమయిన ఈ పయనంలో, నా వాళ్ళెవరు, పరాయి వాళ్ళెవరు... నేను అనేదే లేని వేళలో.. అందరికీ చెందుతాను. ఏనాడో అనుభవించిన ఆనందాల్ని, విషాదాల్ని మరిచిపోయి, మరల కొత్తగా, ఇప్పుడే చూస్తున్నట్టుగా, అనుభవిస్తున్నాను..

  ReplyDelete
  Replies
  1. మిత్రులు జగదీష్ గారికి,
   మీ పలవరింత లాంటి పలకరింత నాకెంతో నచ్చింది.ఈ కవితాత్మక గద్యం నచ్చి మెచ్చిన మిత్రులకి కూడా నెనర్లు__/\__

   కొన్ని కొన్ని భావాలు వాటికవే అవి వ్యక్తం కావడానికి వ్యక్తుల్నీ,కలాన్నీ,భాషనీ ఎంచుకుంటాయేమో ననిపిస్తుంది!

   చిన్నప్పుదు విన్న "పడుచుదనం రైలుబండి..." మొదటిసారి విన్నప్పటి నుంచి ఈ భావం కదులుతూనే ఉంది.కానీ అది పూర్తి రూపం దాల్చటానికి ఎంత సమయం తీసుకుందో చూడండి!

   ఇందులో నాకు కూడా అద్భుతంగా కనిపించే లక్షణం యేమిటంటే,మామూలుగా ఎంత చిన్న రచన అయినా ప్రచురించబోయే ముందు ఇందులో తప్పులేమయినా ఉన్నాయా ఇంకా ఏమయినా చేర్చాలా అని ఒకటికి పదిసార్లు చదివి చూస్తాను.అలాంటప్పుడు ఇది నేను రాసింది అని మర్చిపోయి వేరవాళ్ళు రాసింది అనుకుని చదువుతాను,కొన్ని అనసవరం అనిపించినవి తీసెయ్యడం,విషయం స్పష్టంగా లేదన్నప్పుడు కొతవి చేర్చ్తడం చేస్తాను - కానీ,ఇందులో ఇప్పుదున్న రూపానికి వచ్చాక ఇంక ఒక్క అక్షరం కూడా మర్చాలనిపించ లేదు!

   రాసింది నేనని మర్చిపోయి చదువుతుంటే నేను కూడా మీలాగే ఫీలయ్యాను.
   సమానధర్ముల హృదయశిరఃకంపం!

   Delete
 10. sir,
  మీరు ఏ విషయం అయిన చాల బాగా వ్రాస్తారండి. మీ మీధస్సు కు జోహార్లు.
  మీ ఆర్టికల్స్ అని ఎలాగైనా ఒక కాపీ ప్రింట్ చేసి పెట్టుకోవాలి.
  నమస్తే.
  ఆర్కాట్ venkataramana
  రమణ.ఆర్కాట్@జిమెయిల్.com

  ReplyDelete
  Replies
  1. Thanks,
   I am trying to put some of my selected works on kinige.I will let you know when full version is ready!
   yours
   hari.S.babu

   Delete
 11. https://kastephale.wordpress.com/2016/04/01
  శర్మ కాలక్షేపంకబుర్లు-నూటపదార్లు.

  ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు