Monday 21 July 2014

రెండు కళ్ళ సిధ్ధాంతికి కళ్ళు మసకలు గమ్మినట్టున్నాయి!

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నాకు 167 – జగన్
          అది నిజమే కావచ్చునని నాకు కూడా అనిపిస్తున్నది.రెండు కళ్ళ సిధ్ధాంతికి కళ్ళు మసకలు గమ్మినట్టున్నాయి, చుట్టూ చూడటం లేదు.వెంట్రుకవాసి మెజారిటీ తోనే తెలంగాణా ముఖ్యమంత్రి యెంత చురుగ్గా కదుల్తున్నాడో అఖంద ప్రజాబలం తో గెల్చిన ఆంధ్రా ముఖ్యమంత్రి యెంత నిదానంగా కదుల్తున్నాడో చూశారా?ఇంతవరకూ రాజధాని యెక్కడో తేల్చుకోలేదు.బెజవాడ – గుంటూరు అని లీకు చేసి స్థలాల రేట్లు పెంచడం తప్ప జరిగింది యేమయినా వుందా?లీకు చెయ్యకుండా గబుక్కున పని కానిచ్చేసి వుంటే రూపాయితో అయిపోయేది పది రూపాయలకు చేరింది.ఇంకా మీనమేషాలు యెందుకు లెక్కెడుతున్నట్టు?అక్కడున్న అసమదీయులైన వాళ్ళకి అక్కడి స్థలాల రేట్లు వంద దాకా డేకించి మేలు చెయ్యటానికి కాకపోతే!కాపరం చేసే కళ కాలు తొక్కేనాడే తెలుస్తుందని వూరికే అన్నారా?చంద్రబాబు చురుకు తెచ్చుకుని తనని తను ఆంధ్రా ముఖ్యమంత్రిగా చూసుకోకపోతే రాష్ట్రం జగన్ చేతుల్లోకి వెళ్ళడం ఖాయం.
                  అయినా భూములు కొనాలి, కట్టడాలు ప్లాన్లు వెయ్యాలి, నిధులు తెచ్చుకోవాలి – ఇంత పని వుంది గదా యెప్పటికి పూర్తి అయ్యేను?రాజధాని పూర్తి అయ్యేదాకా ప్రభుత్వం పని చెయ్యదా!.ఒకవేళ రాజధాని గురించి ఇప్పట్లో తేల్చదల్చుకోకపోతే సచివాలయంలో అధికారికంగానే ఆంధ్రాకి వాటా వుందిగా, ఆ మాత్రం ధీమా కూడా లేనప్పుడు నూతన రాష్ట్ర పునర్నిర్మాణం అతని వల్ల అవుతుందా?విభజన వల్ల ఆంధ్ర ప్రాంతం సమస్యలతో మొదలు కానుందని సర్వులకూ తెలిశాక కూడా ఇంకా శ్వేతపత్రాలతో కాలం గడిపేస్తున్నాడు,ఇప్పుడప్పుడే రంగం లోకి దిగే వుద్దేశం లేదా?
                పైగా 2019లో తెలంగాణాలో అధికారంలోకి మనమే రావాలి, మీకు సపోర్టు కోసం నేను ఇక్కదే వుంటాను అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు,2019 వరకూ హైదరాబాదును వొదిలి పెట్టదల్చుకోలేదా?ఇంతకాలం కేంద్రం నుంచి రాజధాని యేర్పాటు కోసం ఒక సంఘం తిరిగాక ఇప్పుడు కొత్తగా నిర్దేశకాలతో మరో సంఘం వేసాడు, అంటే కేంద్ర సంఘం యే నిర్దేశక సూత్రాలూ లేకుండానే తిరిగిందా?రెడ్డొచ్చె మొదలాడు అన్నట్టు ఈ కొత్త సంఘం యెన్నేళ్ళు సాగదీస్తుంది?ముహూర్తాలు చూసి ఆర్భాటంగా దేశంలోని ప్రముఖు లందరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన మంత్రివర్గం ఇంత దయనీయమయిన పరిస్థితిలో వుంటే ఈ పరిస్థితిని చక్కదిద్దాలంటే రాష్ట్రప్రజలంతా యే హోమం చెయ్యాలో?
                అయినా 2019లో తెలంగాణాలో పీఠం యెక్కాలంటే ముందు తను నాలుగేళ్ల లోపు ఆంధ్రాని ముందుకు తీసుకెళ్లాలి గదా?ఆంధ్రాలో ఫెయిల్ అయ్యి తెలంగాణాలో యే ముఖం పెట్టుకుని వోట్లు అడుగుతాడు?ఇక్కడో గంతూ అక్కడో గంతూ అని ఇప్పటికీ వూళ్ళు పట్టుకు తిరుగుతుంటే ప్రభుత్వం యెక్కణ్ణించి పని చేస్తుంది?ఇప్పటి వరకూ తీసుకున్న నాలుగు కీలకమయిన  నిర్ణయాలూ తప్పుల తడకలే. అంత అనుభవమూ యే గాలికి కొట్టుకు పోయిందో,ఇలా తడబడుతున్నాడు!
            రాజధాని విషయంలో తను చేసింది పూర్తిగా తెలివి తక్కువ పనే.కరెంటు పంపకాలకి సంబంధించి పీపీయేల విషయంలో తను యెందుకంత తొందర పడ్డాడు?ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకుంటే మరొకరి ప్రమేయంతో ఆ నిర్ణయం అమలు కాకుండా ఆగిపోయిందంటే ఖచ్చితంగా అది అతని అసమర్ధతే కదా!ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకున్నాక ఆదిలోనే దానికి హంసపాదు పడి కేంద్రంలోని ఒక సంఘానికి విచారణకు పంపించి దాన్ని నెగ్గించుకోవటం కోసం మళ్ళీ వాదనలూ సమర్ధనలూ తయారు చేసుకోవటం పరువు తక్కువ కాదా? తెలంగాణా ముఖ్యమంత్రి తమ విధ్యార్దులకి మాత్రమే ఫీజులు కట్టుకుంటాం అని అనగానే సరే, మా పిల్లలకి మేమే చెల్లించుకుంటాం అని ఒకసారి ధీమాగా జవాబు చెప్పి శభాష్ అని అనిపించుకున్నాక అదే ధీమాని కొనసాగించకుండా అది అన్యాయం, రాజ్యాంగ విరుధ్ధం అనే ఆక్రందనలు చేస్తూ జావగారి పోవటం యెందుకు?మన పిల్ల్లలకి మనమే ఫీజులు కట్టుకుందాము అని అనుకున్నప్పుడు ఇక తెలంగాణాలోనే చదవాలా, దేశం మొత్తం గొడ్డు పోయిందా?ఆంధ్ర ప్రజల అన్నపూర్ణ భాండాగారం ఖాళీ అయిందా?మంగలి మంత్రుల సలహాలు విని అమోఘంగా ఆలోచించి పరపరా వుత్తరం రాస్తే యేమి జవాబు వచ్చింది? నాలుగు వెక్కిరింతలూ ఆరు తిట్లూ కలిపి వడ్డించాడు తెలంగాణా ముఖ్యమంత్రి. ప్రపంచంలో యెక్కడి కెళ్ళినా మంచివాళ్ళనే పేరు తెచ్చుకున్న వాళ్లం గత అరవయ్యేళ్ళుగా వాళ్ళ నోట్లో పడి దొంగలు దోపిడీ దార్లు అనే మాటలు పడి కడుపు రగిలిపోయి తెదెపాకి ఇంత ఆధిక్యతని ఇస్తే రేపటి 2019లో తెలంగాణాలో అధికారం మీద చూపుతో మళ్ళీ అదే వెక్కిరింతకి తను గురి కావదం అంటే ఆంధ్ర ప్రజల స్వాభిమానానికి ద్రోహం చెయ్యడం కాదా?!
             ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి మొత్తం ఆంధ్ర ప్రజల పౌరుషానికి ప్రతీకగా వుండాలి తప్ప నత్తి మాటలూ కుంటి సాకుల్తో కాలం గడుపుతూ యెదటివాళ్ళ చేత మాటలు పడుతూ కాలహరణం చెయ్యకూడదు. ఒక రాజకీయ పార్టీగా తెలంగాణాలో కూడా అధికారాన్ని కోరుకోవడం మంచిదే, కానీ అక్కడ ప్రజలకి ధీమాగా చెప్పటాని కయినా ఆంధ్రా పునర్నిర్మాణంలో తన సత్తాను చాటి చెప్పాలి కదా?1956లో గుడారాల్ల్లో కాలం గడుపుతున్న మీరు పాడికుండ లాంటి మా తెలంగాణాని బలవంతంగా కలుపుకుని మామీద పడి బతికారు అని అంటున్న వాళ్ళ మాట అబధ్ధం అని రుజువు చెయ్యాలి. తెలంగాణా మీద ఆధార పడకుండానే తెలంగాణాని మించి బాగుపడగలిగిన సత్తా ఆంధ్రావాళ్ళకి వుందని తెలియజెప్పటమే ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా తన ప్రధమ కర్తవ్యం అని తెలుసుకుని తెలంగాణా వ్యవహారాలకి యెవరయినా నమ్మకస్తుడ్ని ఇన్ చార్జిగా వుంచి  తను ఆంధ్రప్రదేశ్ కి పూర్తికాలపు ముఖ్యమంత్రిగా వుండాలి.
         మరీ ముఖ్యంగా ఇవ్వాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పునర్నిర్మాణంతో పాటు నిర్వహించాల్సిన అదనపు బాధ్యత యేమిటంటే తెలంగాణా ప్రభుత్వం తో సామరస్యానికి అతిగా చేతులు చాపి మూతి కాల్చుకోకుండా ధీరోధ్ధతంగా  వుండాలి.ఖడ్గాన్ని ఖడ్గమే రద్దు చేస్తుంది.శంఖాలూ భేరీలూ డమరు ధ్వనులూ మోగాల్సిన కాలంలో వేణుగానాలూ వీణానాదాలూ పని చెయ్యవు.తమ నోటి నుంచి బయటి కొచ్చే మాటకి అర్ధం యేమిటో  కూడా తెలియని మూర్ఖులు వాళ్ళు.తను మాట్లాడే తెలుగు భాషామ తల్లినే యెవనికి తల్లిరా అని అన్న గాడిదకి తను ఆ కూత వుర్దూ లోనో ఇంగ్లీషులోనో కుయ్యడం లేదని తెలిస్తే ఆ ప్రేలాపన చెయ్యగలడా?మూర్ఖులకి మూర్ఖభాష అని ఒకటి ప్రత్యేకంగా వుంటుంది,వాళ్ళతో ఆ భాషలో మాట్లాడితేనే వాళ్ళకి బాగా అర్ధం అవుతుంది.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఇది యెంత తొందరగా తెలిస్తే అంత మంచిది.లేని పక్షంలో వుప యెన్నికలు జరిపించి అయినా సరే అధికార మార్పిడికి సిద్ద పడటమే ఆంధ్ర ప్రజలకి వుత్తమం.యెన్ని ఆరోపణలు వున్నా రుజువు అవుతాయో లేదో తెలియదు గనక పాప్యులారిటీ త్రాసు ఇప్పటికీ జగన్ వైపుకే యెక్కువగా వొరిగి వుంది, అది గమనించుకోవాలి బాబు! స్వాభిమానం ఆభిజాత్యం అనే రెండు రెక్కలు దాల్చిన వైనతేయుడిలా యెగరాల్సిన ఆంధ్రప్రదేశ్ ముఖుమంత్రి వూరపిచ్చుకలా కిచకిచ లాడటం మాని పాంచజన్యం పూరిస్తూ దిక్కుంజరంలా కదిలితే చూడాలని ఆంధ్రప్రజలు మనసారా కోరుకుంటున్నారు, శుభం!

13 comments:

  1. తెలంగాణా ముఖ్యమంత్రి తమ విధ్యార్దులకి మాత్రమే ఫీజులు కట్టుకుంటాం అని అనగానే సరే, మా పిల్లలకి మేమే చెల్లించుకుంటాం అని ఒకసారి ధీమాగా జవాబు చెప్పి శభాష్ అని అనిపించుకున్నాక అదే ధీమాని కొనసాగించకుండా అది అన్యాయం, రాజ్యాంగ విరుధ్ధం అనే ఆక్రందనలు చేస్తూ జావగారి పోవటం యెందుకు?
    --------------------------------------------------------
    హరిబాబు గారు ,

    మిగిలిన విషయాలలో ఏమో కానీ ఈ విషయం లో కొద్దిగా గందరగోళం ఉన్నట్లుంది పోస్ట్లో . ఆంధ్రప్రదేశ్ పిల్లలకి కట్టం అని ఎక్కడా చెప్పలేదు కదా ?

    ప్రస్తుతం జరుతున్న వివాదం తెలంగాణా పిల్లలలో ఎవరైతే ఆ 1956 నిబంధనలు కాటగిరీ లో లేరో వాళ్ళకి - తెలంగాణా గవర్నమెంట్ కి మధ్యన . ఆ తెలంగాణ ప్రభుత్వమే ఫీ reimbursement తీసేసింది కాబట్టి ఒకవేళ ఆంధ్రప్రదేశ్ పిల్లలు అక్కడ చదివినా కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తెలంగాణా colleges ఆ ఫి కట్టాల్సిన పని లేదు. ఆ కాలేజీ యజమాన్యాలని , తెలంగాణా ప్రజలని - తెలంగాణా గవర్నమెంట్ తో తెల్చుకోనివ్వండి వ్యవహారం మనమెందుకు మధ్యలో తల పెట్టటం ?

    ఈ 1956 కి ముందు అంటూ ఏవో నిభందనలు kind of racism లాగా ఉన్నాయి కాబట్టి, దానికి వ్యతిరేకం గా పోరాటం చేసేవాళ్ళు ఉంటె మన మద్దతు తెలియజేస్తాం లేదంటే వాళ్ళు కొట్టుకుంటే చూద్దాం . మనమెందుకు బిపి తెచ్చుకోవటం, let the students fight with telangana government . మిగిలిన అన్ని పార్టీలు మద్దతు తెలిపేట్లు ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్ కి న్యాయం జరుతుందేమో చూద్దాం .

    ReplyDelete
    Replies
    1. తెలంగాణా పచ్చ తమ్ముళ్ళు సొంతంగా రెచ్చిపోతే ఫరవాలేదు గానీ ఏపీ మంత్రులూ ప్రకటనలు గుప్పిస్తున్నారు గదా,అది బాగా లేదు.ఆ గొడవని తెలంగాణా అంతర్గత సమస్యగానే చూడాలి తప్ప ఏపీ ప్రభుత్వం దూరంగా వుందాలి అని నా వుద్దేశం. దాని వల్లనే ఫీజుల భారాన్ని తల్చుకుని మాట మార్చారు దేబిరిస్తున్నారు అనే మాట వస్తుంది గదా?అందుకేగా అన్ని కోట్లతో రాజధాని కట్టుకునేవాళ్ళు ఆమాత్రం ఫీజులు కట్టుకోలేరా అనే వెటకారం వచ్చింది అటు వైపు నుంచి!

      Delete
    2. Yes I agree with you ! ఆంధ్రప్రదేశ్ మంత్రులకి నిజంగానే సరిగా ఆన్సర్ చేయలేదు .

      మీ పిల్లలకి ఫీజు కట్టుకోవటం చేతకాక అచ్చు చెత్త కుండీ దగ్గర ఆనాధ పిల్లల్ని పెంచలేని తల్లిదండ్రులు వదిలేసినట్లు వేరే వాళ్ళ మీద వదిలేస్తున్నారు అని సమాధానం చెబితే తిక్క కుదిరేది !

      Delete
  2. కేజ్రీవాల్ గవర్నమెంట్ కూడా డిల్లీలో ఇలాంటే ప్రయత్నమే చేయబోయింది (తన పార్టీ కి ఓట్లు వేసిన వాళ్ళకి మాత్రమే 50% సబ్సిడీ ఆన్ పవర్ బిల్ల్స్ ) , ఎనీవే ఆ తరవాత ఆ గవర్నమెంట్ రద్దు అయ్యింది .

    ReplyDelete
  3. There nothing wrong as AP CM also want to become in power in Telangana. It is very easy to criticise others but there are a lot practical problems due to allocation of AP budget and already the formers bank loan issue is there so he can not take any hasty decission. Regarding capital until the central govt. committee report comes/submits he can't take any decission (As per Parlament Bill AP govt. has wait upto 3rd week of Aug 14) although the final decission/suggestion is that of Mr. Chandra Babu (He already indirectly indicates the capital is in between Guntur - Viajayawada - Eluru) and govt. can pass any bill to obsorve the lands/property (For example in 70's the govt. aquired lands in Rajahmundry for Rail cum Road Bridge and the owners were given less compensation). Regarding Fees we have to let us wait and see.

    ReplyDelete
  4. "వెంట్రుకవాసి మెజారిటీ తోనే తెలంగాణా ముఖ్యమంత్రి యెంత చురుగ్గా కదుల్తున్నాడో అఖంద ప్రజాబలం తో గెల్చిన ఆంధ్రా ముఖ్యమంత్రి యెంత నిదానంగా కదుల్తున్నాడో చూశారా?"

    తెరాసకు కాంగ్రెస్ కంటే 18 లక్షలు ఎక్కువ వోట్లు వచ్చాయి. తెదేపా వైకాప మధ్య తేడా ఒకటిన్నర లక్షల వోట్లు మాత్రమె. భాజపాను కలిపినా తేడా 8 లక్షలు దాటదు.

    బాబు తూచితూచి అడుగులు వేయడాన్ని ఈ కోణంలో చూస్తె మంచిది. మరో ముఖ్యమయిన అంశం: కేంద్రంలో భాజపాకు సంపూర్ణ బహుమతి ఉంది. మునుపుటిలా (దేవే గౌడ/గుజ్రాల్/వాజపేయీ) చక్రం తిప్పడం వీజీ కాదు. దానికి తోడు నరేంద్ర మోడీ ఒక పట్టాన లొంగే మనిషి కారు.

    తన అంచనాకు భిన్నంగా జరిగిపోయిన అంశాలకు విరుగుడు వేసి మళ్ళీ తన పట్టులో తెచ్చుకొనే నైపుణ్యత చంద్రబాబు ఆయనకు ఉంది. కాకపొతే సమయం తక్కువ కాబట్టి కొంచెం తొందర పడాలి & ప్రయారిటీ బట్టి వెళ్ళాలి.

    ReplyDelete
    Replies
    1. "వెంట్రుక వాసి" అనేదాన్ని "తక్కువ" అని మార్చుకుంటే సరిపోతుంది.కొంచెం క్లెయర్ గా చెప్పాలంటే యెన్నికలకి ముందు అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మంచిదనుకునో యేమో భయం భయంగా వేసిన అంచనాల కన్నా మెజార్టీ యెక్కువే వొచినా హుషారు లేకుండా బాబు ఉంటే వస్తాయని ధీమాగా చెప్పిన వాటికన్నా తక్కువ సీట్లే వచ్చినా సొంతంగా ప్రభుత్వం యేర్పాటు చెయ్యగలుగాడు గనక కేసీఆర్ చురుగ్గా కదుల్తుండటం గురించి పోల్చాలని నా అభిప్రాయం.

      Delete
  5. ఏతా వాతా తెలుస్తున్నదేమిటంటే ...
    ప్రజలలో వచ్చిన మార్పు నాయకులలో రాలేదనిన్నును ...
    ఇంకా స్పష్టంగా తెలియవస్తున్నదేమిటంటే ...
    మన నాయకులు ఎప్పటికీ మారరనిన్నును ...
    సన్మానాలు చేయించుకుంటూ ...
    సంబరాల్లో మునుగుతూ ...
    రాబోయే 30 సం//లు కూడా ...
    మన రాజ్యమేనంటూ ...
    కలలు కంటూ ఉంటారనిన్నును ...
    కూర్చుని .. టూ ...
    ...టారన్న మాట ...
    ట ...

    ReplyDelete
  6. హరిబాబు గారూ,
    అంతా బాగుంది కానీ మన సీఎం ని మనమే రెండు కళ్ళ సిద్ధాంతి అని కించపరచడం నచ్చలేదు.మంచిని వెలికి తీయాలంటే సద్విమర్శ ఉండాలి కానీ ఇది బాలేదు. ఇక మిగిలిన విషయాలతో నేను ఏకీభవిస్తున్నా. అలాగే ఇంకొన్ని

    1. మొట్ట మొదట హైదరాబాద్ కార్యాలయాల్లో సోకుల కోసం కోట్లకి కోట్లు ఖర్చు పెట్టడం ఆపాలి. సెక్రటేరియట్ లో కార్యాలయాల కోసం 23 కోట్లు ఖర్చు పెట్టారని చదివాను. అదే ఖర్చుతో కనీసం ఒక్క డిపార్టుమెంటు హెడ్ ఆఫీసు అయినా ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కడో ఓ చోట కట్టొచ్చు.
    2. MLA శిక్షణ ఇప్పుడు హైదరాబాద్ లో ఇస్తున్నారు. ఆ అవసరం ఎమొచ్చిందో నాకు అర్థం కావట్లేదు. కనీసం దానికి తగ్గ ఏర్పాట్లు కూడా ఆంధ్రప్రదేశ్ లో చేసుకోలేరా? ఆ ఖర్చు పెట్టేదేదో అక్కడ ఖర్చు పెట్టలేరా?
    3. అన్నీ బోళా శంకరుడిలాగా ముందే వాగేయ్యటం లేదా లీకులు ఇవ్వటం (రాజధాని విషయం లో కానీ, పిపిఎ ల విషయం లో కానీ, కేంద్ర ప్రభుత్వం పెట్టె సంస్థల విషయం లో కానీ ), తరువాత నాలుక కరుచుకోవటం సీఎంకి, మంత్రులకి పరిపాటి అయ్యింది. దాని వల్ల వారి విశ్వసనీయతకే నష్టం. అలా కాకుండా ఏదైనా పూర్తీ స్పష్టత వచ్చాక మాట్లాడితేనే బాగుంటుంది.
    4. నిత్యం మీడియా లో కనిపించాలనే దుగ్దని కొంచెం అదుపు చేసుకుని గాలి వార్తలపై ఆధారపడకుండా నిర్దిష్ట అంశాలపై పని చేస్తే అందరి ప్రశంశలు పొందుతారు.
    5. ఇక మొదట్లో సమాన అభివృద్ది అని ఊదరగొట్టిన చంద్రబాబు, మంత్రులు ఇప్పుడు మొత్తం వైజాగ్, గుంటూరు, విజయవాడ రీజియన్ లోనే అభివృద్ది అంతా కుప్పపోయడం చూస్తుంటే ఏమనాలో అర్థం కావట్లేదు. అభివృద్ది చెందిన గుంటూరు, విజయవాడ ప్రాంతాన్ని రాజధాని చేద్దాము అనుకున్నా, దానిని మొదటే చెప్పి ధరలు పెరిగేలా చేసి, ప్రభుత్వానికి, సామాన్య ప్రజలకి అందుబాటులో లేకుండా చేయడం ఏమి తెలివిడి తనమో అర్థం కావట్లేదు. వీటికి నారాయణ లాంటి విద్యావేత్త కూడా వంత పాడటం ఏమిటో.
    6. ఇక్కడ ఏ పనీ మొదలు పెట్టకుండా ఊరికే ఢిల్లీ వెళ్ళడం ఆపాలి. మొదట రాజధానిని డిసైడ్ చేసి, ఒక్కొక్క హెడ్ ఆఫీసుని అక్కడికి తరలిస్తూ, మిగిలిన పరిశ్రమలని (ఉదాహరణకి చిత్ర పరిశ్రమని వైజాగ్, ఫార్మాని ఇంకో చోటికి) తరలించడానికి ఒక్కో ఇంచార్జ్ మంత్రిని పెట్టి మూడు నుండి ఆరు నెలల్లో పూర్తీ చేస్తూ పోతే అన్ని రంగాలూ పరుగులు తీస్తాయి. ముఖ్యంగా ఏమి చేసినా ముందే దాని గురించి డప్పు కొట్టుకోవడం ఆపాలి. అంతా అయ్యాక ప్రజలకి ఎలాగూ తెలుస్తుంది.
    7. అన్నిటి కంటే ముఖ్యంగా మొదట్లో 3 రోజులు అక్కడ మూడు రోజులు ఇక్కడ లాంటి డైలోగులు చెప్పి ఇప్పుడు పూర్తీ సమయం హైదరాబాద్ కె పరిమితం అవుతున్నారు. ఎవరూ అడక్కపోయినా ముందే చెప్పడం ఎందుకు, అనిపించుకోవడం ఎందుకు? ఇప్పుడున్న నిందలు చాలవనా? ఇది ఎలా ఉన్నా, మొదట ముఖ్య మంత్రి కార్యాలయం ఇక్కడి నుండి షిఫ్ట్ అవ్వాలి. అలాగే సొంత శాసన సభని ఎంత తొందరగా నిర్మించుకుంటే అంత మంచిది.

    ReplyDelete
    Replies
    1. మసకలు గమ్మటం అనేది మదం వల్ల అని అనుకుంటే నెగిటివ్ గానే అనిపిస్తుంది గానీ మీరు కూడా చెప్పిన బోళా తనం వల్ల అనే అర్ధం లోనే వాడాను.నాకన్నా మీరు మరిన్ని వాస్తవికమయిన వివరాలు కలిపారు.ఇలాంటివి ఖచ్చితంగా తగ్గించి తొందరగా ఆంధ్రాకు వచ్చెయ్యాలి.

      Delete
    2. శ్రీ గారూ, మీ సూచనలు బాగున్నాయి. నా తరఫున మరికొన్ని సలహాలు:

      1. మీరు ఆరో పాయింట్లో చెప్పినట్టు చేయడానికి ఒక కాలబద్దమయిన ప్రణాళిక రూపొందించాలి. బయటికి వారికి చెప్పకపోయినా సంబంధ అధికారులకు తెలిస్తే దానికి అనుగుణంగా పని చేయడానికి దోహదం చేస్తుంది. ఉ. మీరు మొదటి పాయింట్లో చెప్పిన డిపార్ట్మెంటు కార్యాలయం ముందు ఏది కట్టాలో తెలుస్తుంది.

      2. చంద్రబాబుకు ఆయన high level ఆలోచనలను అర్ధం చేసుకొని తదనుగుణంగా సలహాలు ఇచ్చే స్థాయి సలహాదారుల కొరత ఉన్నట్టు అనిపిస్తుంది. అంచేత ఆయన కేవలం అధికారుల మీదే ఆధార పడాల్సి వస్తుంది. కెసిఆర్ చేసినట్టు వివిధ ముఖ్య రంగాల నిపుణులను సలహాదారులగా పెట్టుకుంటే ప్రణాలికలు ఇంకా మెరుగు పడతాయి. కనీసం అధికారుల అంచనాను cross check చేయొచ్చు. ఇలాంటి experts కేవలం సేవా బుద్ధితో అత్యల్ప గౌరవ వేతనంతో పని చేస్తారు కాబట్టి ఖర్చు కూడా పెద్దగా ఉండదు.

      Delete
  7. Sir, can you check my comment was not posted, thanks

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...