Saturday, 1 March 2014

ఇక ఆంధ్ర ప్రదేశ్ పునర్నిర్మాణానికి ఒక నూతన రాజకీయ ఆర్ధిక వ్యవస్థ కావాలి - 1

                    నేను ఇదివరలో - అంటే బ్లాగుల్లో మొదటిసారిగా కామెంట్లు వెయ్యటం మొదలు పెట్టిన ఆ రోజుల్లో తెలంగాణా ఉద్యమం గురించి - రాష్త్ర విభజన కన్నా అధికార వికేంద్రీకరణ వల్లనే మరింత మేలు జరుగుతుందని -  ప్రతిపాదించాను.కానీ అప్పటికే ఉద్యమం చివరి దశకి వచ్చేసినందువల్ల సరయిన ప్రతిస్పందన రాలేదు. నేను కూడా మరీ అంత గట్టిగా దాని గురించి గట్టిగా ప్రయత్నించలేదు.

                   ఇప్పుడు చారిత్రకంగా ఆంధ్ర ప్రదేశ్ ఒక సంధి కాలం లో ఉన్నట్టు లెక్క.తెలంగాణా ప్రాంతం రాజధానితో కలిసి విడిపోగా మిగిలిన మాతృ రాష్ట్రం వ్యవహారం కోసం సీమాంధ్ర అని అంటున్నా అధికారికంగా ఈ రాష్ట్రం అధికారికంగా తన పాత పేరుతోనే ఉంది.పేరులో సీమను కలపనంత మాత్రాన సీమవాసులను చిన్నబుచ్చినట్టు కాదుగా!తెలంగాణా వారు యేవైతే విడిపోవటానికి కారణాలుగా చెప్పారో(వెనుకబాటు తనం, సాంస్కృతికమయిన అవహేళన, రాజకీయ ప్రాధాన్యత లేకపోవటం) అన్నింటిలోనూ తెలంగాణా వారికన్నా బలమయిన ప్రాతిపదిక ఉన్నా విభజనను వ్యతిరేకించటం లోనూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే ప్రయత్నం విఫలమైనా అందులో ముందున్నది సీమ వాసులే.


                    ఉద్యమ కాలంలో ద్వేష భాషని ప్రచారంలోకి తెచ్చిన కొందరు పైత్యకారి వ్యక్తులు మద్రాసు నుంచి తన్నించుకుని వచ్చారని హీనంగా మాట్లాడి, అంతతో ఆగకుండా విభజన పూర్తయి యెవరి బాగును వారు కాంక్షించుకుంటూ హుందాగా ఉండాల్సిన ఈ సమయంలో కూడా - నిన్న తమిళుల చేత మద్రాసు నుంచి తన్నించుకున్నారు, ఇవ్వాళ  మాతో హైదరాబాదు నుంచి గెంటించుకుంటున్నారు, రేపు రాయల సీమ వాళ్ళు మిమ్మల్ని తన్నటానికి సిధ్ధంగా ఉన్నారు - అనే వెక్కిరింతల్ని వొదుల్తున్నారు. ఆ మాటల్ని నిజం చేసేటట్టుగానే ఉన్నాయి ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్ నాయకుల విపరీత చేష్టలు.


                    ఇన్నేళ్ళుగా అందరిదీ అనుకున్న బలమయిన రాజధాని దూరమయింది.మొదట కావలసింది ఒక బలమయిన రాజధాని. ఇక్కడ బలమయిన అంటే ఇవ్వాళ హైదరాబాదు లాగా అని కాదు. అప్పటి వాళ్ళు దాన్ని అంతగా పెంచటం వల్లనే ఇవ్వాళ ఈ విపత్కర పరిస్థ్తి యెదురయింది. ఒక్క నగరానికి మాత్రమే అంతగా వాపు లాంటి బలుపుని పెంచకుండా రాష్ట్రంలోని అన్ని నగరాల్నీ సమానంగా పెంచి ఉంటే యెంత బాగుండేది?


                    ఇప్పుడు మళ్ళీ కొత్త రాజధానిని యే ప్రముఖ నగరంలో ఉంచాలనే దాని మీద రాజకీయ నాయకుల నుంచి ప్రచార మాధ్యమాల వరకూ కొత్త హంగామాకు తెర తీశారు.రాజధానికి యేం కావాలి? మొత్తం అన్ని పరిశ్రమలూ అక్కదే కేంద్రీకరించాలా, అన్ని రకాల చెత్త పనులూ అక్కడే చెయ్యాలా?రాజధాని అనేది షోకేసులో బొమ్మా గొప్పగా అలంకరించి అందరికీ చూపించి మెప్పు పొందటానికి?అధికారిక వ్యవహారాల్ని నడిపించే యంత్రాంగం ఉంటే చాలును గద!


                    యెప్పటికయినా మనకు కావలసింది హైదరాబాదు లాంటి తెల్ల యేనుగు కాదు.వీలయినంత తక్కువ హంగులతో కేవలం ప్రభుత్వం నడవటానికి అవసరమయిన వ్యవస్థలు సర్దుకోగలిగీతే చాలు. యెంత త్వరగా రాజధాని సమకూడీతే అంత త్వరగా మనవాళ్ళని మన దగ్గిరకి రప్పించుకోవచ్చు. సాంకేతికంగా మన వాళ్ళు యెంత కాలం హైదరాబాదులో కొనసాగీతే అంత కాలం వారికి పన్నులు కడుతూ ఆ రాష్ట్రానికి అంత కాలం మేలు చేయ్యటమే తప్ప మనకి మేలు జరగదు.వీలయినంత తొందరగా మన వాళ్ళని మన రాష్ట్రంలోకి రప్పించుకోవాలి.మామూలుగా అయితే ఇది - అంటే యే రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రంలోనే యెదగాలనటం తప్పే, కానీ విభజన అనంతరం మనం రెవెన్యూ లోటులో ఉంటాం. అందువల్ల మొదట మనం మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవటం ముఖ్యం. తర్వాత ఇప్పట్లాగే యెక్కడికయినా పరుగులు పెట్టొచ్చు.


            ఆఖరికి చేపల పెంపకం కేంద్రాలనీ, సునామీ అధ్యయన కేంద్రాన్నీ కూడా హైదరాబాదు లోనే యేర్పాటు చేసి, విశాఖ లోని వాతావరణ కేంద్రాన్ని కూడా హైదరాబాదుకే తరలించాలని చూడటం లాంటి పిచ్చి పనులనే మళ్ళీ కొత్త రాజధానిలో కూడా చెయ్యాలా? ఇప్పుడు మొత్తం 13 జిల్లాలలోని అన్ని ప్రముఖ నగరాల్నీ బలంగా చెయ్యాల్సి ఉండగా మళ్ళీ బలమయిన రాజధాని అనే పేరుతో అదే దుర్నాటకాన్ని యెందుకు నడిపిస్తున్నారు?ప్రచార సాధనాల్ని పోషించటానికి కాకపోతే?


                 యెటు తిరిగీ ఇప్పుడు జరిగిన దాన్నుంచి గుణపాఠం నేర్చుకుని ఉంటే, పరిశ్రమల్నీ వ్యాపారాల్నీ కేవలం రాజధాని లోనే ఉంచకుండా మిగిలిన అన్ని నగరాలకీ వికేంద్రీకరించాలన్న సద్బుద్ది ఇంకా యేర్పడనందువల్లనే ఇలా ఒకో నగరం పేరుతో ఒకో వర్గం వారు లాబీయింగులకి తయారవ్వడం జరుగుతున్నది. దీనిని వెంటనే ఆపి వీలున్నంత తొందరగా రాష్ట్రానికి అన్ని కనీస హంగులతో దృఢమయిన రాజఢానిని యేర్పరుచుకోవాలి.ప్రస్తుతమున్న రెవెన్యూ లోటుని అధిగమించి వీలున్నంత తొందరగా మిగులు రాష్ట్రంగా తయారవ్వాలి.


          ఆకాశంబు నందుండి, శంభుని శిరంబందుండి, శీతాద్రి సుశ్లోకంబయిన హిమాద్రి నుండి -  పవనాంధో లోకమున్ జేరె గంగా కూలంకష:పెక్కు భంగులు వివేక బ్రష్ట సంపాతముల్ అనే పద్యానికి ఉదాహరణగా అనంత కాలాల వరకూ నిలబడాలనుకుంటున్నారా యేంటి  ఆంధ్రా వాళ్ళు?!
-----------------------------------------------------------------------------------------------------------------
1 2 3 4 5

11 comments:

  1. 13 ZILLAALANU ABHIVRUDDI CHESUKUNDAAM
    www.menavachaitanyam.blogspot.com

    ReplyDelete
  2. ఎందుకు మాష్టారూ మరొక 50 సంవత్సరాల ఉద్యమాలకు పునాది వెయ్యటం! ఎలాగో నాలుగేళ్ళు పోయినాక మొదలయ్యే గోలే కదా! పనిలో పని మిగిలిన ఈ మిగిలిన ఆంధ్ర ప్రదేశ్ ను రాయలసీమ, కళింగ ఆంధ్ర, కోస్తా ఆంధ్రాగా మూడు రాష్ట్రాలు చేసేస్తే ఇక మళ్ళీ మళ్ళీ ఈ వేర్పాటు వాదాలు రావు. ఇక వస్తే గిస్తే జిలాల వారిగా వేర్పాటు వాదాలు రావాలి! ఇప్పుడు తెలుగు మట్లాడుతున్న రాష్ట్రాలు రెండుగా చేశారు. కాని, నాలుగుగా చేసి ఉండాల్సింది. చేస్తూ, తెలంగాణాకు పూర్వపు నిజాం రాజ్యంలోని భాగాలు అన్నీ, ప్రస్తుతం మహారాష్ట్రలో, కర్నాటకలో ఉన్న ప్రాంతాలను కలిపి తెలంగాణా ఏర్పాటు చేసి ఉండాల్సింది. అటు చత్తీస్‌ఘడ్, ఒరిస్సా, ఇటు కర్నాటకా తమిళనాడుల్లో తెలుగు మాట్లాడే ప్రాంతాలను కళింగ ఆంధ్రలోనూ, రాయలసీమలోనూ కలిపి ఈ కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చెస్తేనే భవిష్యత్తు తగాదాలు లేకుండా ఉంటుంది. లేదంటే మళ్ళీ సిగపట్లు తప్పవు, దానికి నాంది ఈ పాత/కొత్త రాష్ట్రానికి రాజధాని ఎక్కడ పెట్టాలి అన్న తగాదా. అవును తగాదానే! అది చర్చగా సాగటం కల్ల. హైదరాబాదు అనుభవంతో, రాజధాని ఎక్కడ పెట్టినా సరే మిగిలిన ప్రాంత ప్రజలు తమకు అన్యాయం జరిగిందనే భావిస్తారు. అందులో అనుమానం లేదు.

    ReplyDelete
    Replies
    1. శివరామ ప్రసాద్ గారూ,
      స్పందించినందుకు ధన్యవాదాలు.ఇది మొదటి భాగం మాత్రమే. నేను కేవలం రాజధాని తోనే సరి పెట్టటం లేదు. ఇప్పుడు మనం తెలంగాణా ఉద్యమం నుంచి నేర్చుకోవలసింది ఒకటి ఉంది. నేను తెలంగాణా ఉద్యమాన్ని సమర్ధించింది యెందుకో తెలుసా ప్రతి జాతికీ తమదయిన సంస్కృతిని ప్రత్యేకంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.అది నాకూ ఇష్టమే. ఒకప్పుడు జిల్లాలకి స్వయం ప్రతిపత్తి అని హడావుడి చేసి సగంలో ఆపేశారు. అది పూర్తిగా జరిగి ఉంటే చాలా బాగుండేది. ఇవ్వాళ తెలంగాణా ప్రాంతంలో మాత్రమే మా ప్రాంతపు రెవెన్యూని మా బాగుకే ఉపయోగించాలి అనే పట్టుదల ఉండటం వల్ల అది లేని మిగతా ప్రాంతం వాళ్ళకి అది మూర్ఖంగా కనబడింది. మొన్నటి దాకా నేనూ అలాంటి భావాల్లోనే ఉన్నా, క్రమంగా మారాను. ప్రాస్తావికంగా అన్నీ వస్తాయి. కొత్త భాగాలు కొనసాగించటం కొంత సమయం తీసుకోవచ్చు, కొన్ని సాంకేతికమయిన విషయాల్ని పోగేసుకోవాలి మరి

      Delete
    2. నేను కూడా రాజధాని విషయం ఎత్తటంలో ఉద్దేశ్యం ఏమంటె, ఈ దెబ్బకి ఈ "సమైక్యం" ఏమిటో తేలిపోతుంది. మొత్తం సమైక్యంగా ఉండాలి అంటె రాజధాని ఎక్కడ అన్న ప్రశ్నే రాకూడదు, పట్టుదలలు ఉండకూడదు. కాని హూంకరింపులు అప్పుడే మొదలయ్యాయి. మనకు ఉన్నది నోటిమాట సమైక్యాలేకాని, మనసులు కలిసిన సమైక్యాలు కావు. ఒకడంటే మరొకడికి వెక్కిరింపు, ఎకసెక్కాలు, ఏడుపులు, అసూయలు. తెలుగు వాళ్ళకి ఒక రాష్ట్రం కాదు, నాలుగు రాష్ట్రాలే ప్రస్తుతానికి సరిపోతాయి. పోను పోను కావలిసినన్ని ముక్కలు చేసుకోవచ్చు, "చేతిలో" పనే కదా, చెవిలో "పువ్వు" పెట్టించుకోవటానికి మనం ఎప్పుడూ ఎవర్ రెడీనే!

      Delete
  3. మన అభిప్రాయాలు ఒకలాగే ఉన్నవి.ఆం.ప్ర.కి పరిపాలనాసంబంధితం గా మాత్రమే రాజధాని ఉంటే చాలును.మిగతా అనేక సంస్థలను వికేంద్రీకరించి తగిన పట్టణాలలో నిర్మించాలి.రాజధాని నిర్మాణానికి స్థలనిర్దేశం రాయలసీమవారి సహకారం,అనుమతి ఉన్నచోటే జరగాలి.ఇదివరలో చేసిన తప్పులు మళ్ళీ చెయ్యకూడదు.

    ReplyDelete
    Replies
    1. కమనీయం గారికి,
      ధన్యవాదాలు.రాజధాని స్థల నిర్దేశం కూడా - ఇక్కడి వాళ్ళకు ఇస్తే తన్నుకుంటారని తెలిసో యేమో - అధికారుల నివేదికని బట్టి అక్కడే నిర్ణయిస్తారని అంటున్నారు. దొనకొండ గురించిన ప్రస్తావన కూడా చూశాను. నా మొత్తం విషయంలో ఇది చాలా చిన్న సంగతి.మరిన్ని విషయాలతో మరోసారి ముందుకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ప్రోత్సహించాలి.

      Delete
  4. హరిబాబు గారూ, ముందుగా రెండు విషయాలు ప్రస్తావిద్దాం.

    1. రాజధాని వేరే, ముఖ్యనగరం వేరే. హైదరాబాదు లాంటి ముఖ్యనగరం అయస్కాంతంలా అన్నిటినీ ఆకర్షిస్తుంది. అలాంటి 400 pound gorilla సీమాంధ్ర లో లేకపోవడం ఒకరకంగా వారికి ఈరోజున అదృష్టం.

    2. అన్ని ప్రాంతాలకూ ఒకే అభివృద్ధి వ్యవస్థ సరిపోదు. ప్రతీ ప్రాంతానికీ (లేదా ఉపప్రాంతానికీ) కొన్ని కొన్ని బలాలు & బలహీనతలు ఉంటాయి. ఏ మాడల్ అయినా బలాన్ని పునాదిగా చేసుకుంటూ & బలహీనతల ప్రభావాన్ని అధిగమించాలి. అలాగే తనకున్న పరిధిలోనే ప్రణాలికలు ఉండాలి.

    ఉ. మధ్యకోస్తా (లేదా డెల్టా) ప్రాంతాన్ని తీసుకుందాం. ఆర్ధిక వనరులు, ధనబలం, గట్టి వ్యవసాయ క్షేత్రం, రవాణ సదుపాయం, విద్యాధికులు & వ్యాపార దక్షత ఈ ప్రాంత బలాలు. ఆర్ధిక/సామాజిక అసమానతలు, రాజకీయ వాతావరణంలో కీచులాటలు ఇక్కడి బలహీనతలు. ఇక్కడి నేల భారీ పరిశ్రమలకు సరిపోదు. అలాగే పచ్చని మాగాణాల్లో పరిశ్రమలు పెట్టడం వల్ల కొత్తగా పెద్ద లాభమేమీ లేదు.

    ఈ పరిస్తితుల దృష్ట్యా, ఈ ప్రాంతానికి సరియైన మోడల్ లక్షణాలు ఏమిటి? దక్షిణాదికి knowledge capital కాగల అన్ని లక్షణాలు, విద్యారంగంలో పురోగమనం, రవాణా కూడలి & సీమాంధ్రకు ఆర్ధిక రాజధాని. ఇక పరిశ్రమల జోలికొస్తే వ్యవసాయ ఆధారిత చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఈ ప్రాంతం అనువుగా ఉంటుంది. ఇందుకు భూసంస్కరణలు (ముఖ్యంగా కౌలుదారులకు పట్టాలు) అవసరం. ప్రస్తుతం వ్యవసాయం గిట్టుబాటు కాకపోయినా వేరే అవకాశాలు లేక అదే వృత్తిలో ఉంటున్న వారికి ఇలా చేస్తే వెసులుబాటు.

    This is just an example to explain the concept of "appropriate development model".

    ReplyDelete
    Replies
    1. జై గారికి,
      మీ పాయింట్లన్నీ కరక్టే. యే ఒక్క ప్రాంతమూ మరో ప్రాంతాన్ని పోలి ఉండని ప్రత్యేకత ఉంది ఇక్కడ. భూ మధ్య రేఖ ఈ ప్రాంతాన్ని బాగా ప్రభావితం చేస్తున్నది. మీరన్నట్టు అన్ని ప్రాంతాలకీ ఒకే మోడల్ సరిపోదు.నాకు ఆర్ధిక శాస్త్రంలో అంతగా పరిజ్ఞానం లేదు కాబట్టి యెక్కువగా రాజకీయ పరమయిన వ్యవస్థకి సంబంధించిన మోడల్ గురించే ఆలోచిస్తున్నాను. కొన్ని విషయాలు చూడండి యెంత మూర్ఖంగా ఉన్నాయో? జిల్లాలకు ఇతోదికమయిన అధికారాలు కల్పించాలని మొదలెట్టి యెన్నికవుతూ వచ్చిన జిల్లా ప్రజా పరిషత్తు లన్నింట్లోనూ ఉన్నవాళ్లని అధికారాలేమీ ఇవ్వకుండా మేపటం తప్ప జరుగుతున్నదేమిటి? ప్రజాస్వామ్యంలో తెల్ల యేనుగుల్నీ చేటపెయ్యల్నీ పోషించటం అంటే ఆ మేరకు మనమంతా పన్నులు కట్టగా అక్కడికి చేరుకున్న ప్రజా ధనమంతా దుర్వినియోగం అవటమే కదా?అవినీతితో బాటూ ఇలాంటి దుబారాల వాల్ల కూడా చాలా నష్టం జరుగుతున్నది. యేమంటారు?

      Delete
    2. మీ పాయింట్లు కరెక్టే. అయితే దీని కారణాలు ఏమిటి? కేవలం రాజకీయాలపై ఆధారపడడం వల్ల ఈ దుస్తితి వచ్చిందని నా అభిప్రాయం.

      సమస్యలకు కారణం రాజకీయం అని మనమిద్దరమూ ఒప్పుకుంటున్నాము. అయినప్పుడు రాజకీయాలలో నుండి పరిష్కారం వస్తుందా? Why will the sector that created problems in the first place solve them?

      మనకున్న సమస్యలకు మూలాలు ఆర్ధిక, సామాజిక & నైసర్గిక రంగాలకు చెందినవి. పరిష్కారాలు కూడా ఇవే శాస్త్రాలనుండి రావాలి. ఉ. మత్స్యసంపద అధికంగా ఉన్న ఉత్తరాంధ్రలో కోల్డు స్టోరేజి సదుపాయం వస్తే జాలర్లకు తోడుపడుతుంది.

      Delete
    3. జై గారూ,
      నాకు ఆర్ధిక శాస్త్ర పరిజ్ఞానం చాలా తక్కువ. కాకపోతే విహంగ దృష్టితో కొన్ని సూచనలు మాత్రం చెయ్యగలను.కానీ రాజకీయ పరమయిన నిర్మాణమే సరిగ్గా లేదు. దాని మీదనే వర్క్ చేస్తాను. ఇవ్వాళ్టి చట్రం యెంత చెత్తగా ఉందంటే ఒక నీతి పరుడు యెంత గట్టిగా ప్రజలకి మేలు చెయ్యాలని బయలు దేరినా అతనికి బంధనాలు చాలా ఉన్నాయి. యెంతగా చించుకుని ప్రయత్నించినా కనబడే ఫలితం చాలా తక్కువగా ఉండి నిరాశని కలిగిస్తున్నది. అదే ఒక అవినీతి పరుడు నీటిలో చేపలా దూసుకెళ్ళి పోతున్నాడు.ఇవ్వాళ ప్రభుత్వాలు లిక్కర్ లాబీ, రియల్టర్ లాబీ ల గుప్పిట్లో ఉన్నాయి. ఆఖరికి ఇసక కూడా కొన్ని కోట్ల లెక్కన పలుకుతూ దానికీ ఒక అనుబంధ మాఫియా, లాబీలు ఉన్నాయి. యే లాబీలూ లేనిది ప్రజలు అనబడే మనకె.

      ఒకటి చూడండి. రాజ్యసభ, శాసన మందలి యెందుకు ఉన్నాయి. ఇక్కడ చెల్లని అస్మదీయులని దొడ్డి దారిన ప్రభుత్వంలోకి తెచ్చుకోవటానికి తప్ప వాటికి నిజమయిన ఉపయోగమే లేదు. ఇట్లాగ ఒక దానికి మరొక దాన్ని అడ్డుగా పెట్టి అవి నిజంగా అవసరమే నేమో అని తెలివయిన వాళ్లని కూడా భ్రమింప జేస్తున్నారు.సూటిగా ప్రజలకి బాధ్యత వహించే లోక్ సభ ఒకటి చాలదా శాసనాలు చెయ్యటానికి?

      రాజకీయాల కతీతంగా ఉండే కవుల్నీ కళాకారుల్నీ అధికారంలోకి తీసుకు రావటానికని చెప్పినా సాంకేతికంగా అది కరక్ట్ కాదు.యెందుకంటే పాత తరంలోని రాజకీయ వేత్తల్లో చాలా మంది కవులు, సాహితీ వేత్తలు ఉన్నారు కదా!ప్రజల అనుమతి లేని వాళ్ళు ప్రజాస్వామ్యంలో దొడ్డిదారిన చెల్లుబాటు కాగూడదు.ఇలాంటి ఒక గట్టి సంకల్పాన్ని కూడా నీరుగార్చే లోపాలని గురించి ప్రస్తావించాలని అనుకుంటున్నాను.

      మొదట్లో ఒక పది పాయింట్లతో జిల్లా ప్రజా పరిషత్తులకి అధికార వికేంద్రీకరణ గురించి చెప్పిన విషయం ప్రముఖంగా ఉంటుంది.

      Delete
    4. As you have published the next post, I am stopping this discussion here. I am responding to your new post separately.

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...