Tuesday, 4 March 2014

ఇక ఆంధ్ర ప్రదేశ్ పునర్నిర్మాణానికి ఒక నూతన రాజకీయ ఆర్ధిక వ్యవస్థ కావాలి - 2

                     మొదట్లో నేను నా భావాల్ని కామెంట్లుగా వేశానని చెప్పాను గదా. అప్పుడు తెలంగాణా వారు కొంత పట్టించుకున్నారు గానీ రాష్ట్రాన్ని విడగొట్టనక్కర్లేని ఈ మోడల్ని సమైక్యవాదులు మాత్రం అసలు పట్టించుకోలేదు. యేమయితేనేం ఈ రోజు తెలుగు వాళ్ళు రెండు రాష్ట్రాలలో ఉన్నారు. కానీ అంతా కొత్తగా మొదలెడుతున్న ఈ దశలోనే ఒక కొత్త రాజకీయ చట్రాన్ని కూడా యేర్పరచుకుంటే బాగుంటుందని నా అబిలాష. చిన్నపిల్లలు నడక దగ్గిర్నించి భాష వరకూ తొందరగా నేర్చుకోవటానికి కారణం కూడా కొత్తదాన్ని సాధిస్తున్నామనే హుషారు ఉండటమే కదా! అదే విధంగా ఈ కొత్త ఆరంభంలో ఇప్పటి వరకూ సమస్యగా తయారయిన పాత చట్రాన్ని కూలదోసి కొత్తగా మొదలెట్టటం మరింత శోభాయమానమయిన భవిష్యత్తుని తెస్తుంది కదా!. పైగా ఇది ఫలితమిస్తుందో లేదో తెలియని ప్రయోగం కూడా కాదు. అనుసరిస్తే తప్పకుండా ఫలితమిచ్చే గ్యారెంటీ ఉన్న పరిష్కారమే.

నేను మొదట్లో యెత్తి చూపిన పాయింట్లు ఇవి:

1. ఒక సమస్యకి పరిష్కారం అనుకున్నది కొత్త సమస్యల్ని సృష్టించేదిగా ఉంటే, కొంతకాలం తర్వాత మళ్ళీ సమస్య మొదటికొస్తుందేమో అనిపించేటట్లు ఉంటే అది నిజమైన పరిష్కారం అనిపించుకుంటుందా? ఇప్పుడు ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ప్రతిపాదన మొదలవ్వగానే గుర్ఖాలాండు గొడవ మొదలు పెట్టింది. మిగతా వాళ్ళు కూదా నేడో రేపో మొదలు పెదతారు.నిజంగా విభజన వల్లనే వెనుకబాటుతనం పోతుందా? ఇప్పటికి ఉత్తరాదిన విడిపొయిన రాష్ట్రాలలో అలాంటి గుణాత్మకమైన మార్పులు జరిగాయా?

2. మొత్తం సమస్యని మొదటి నుంచీ చివరి వరకూ రాగద్వేషాల కతీతంగా చూస్తే అటు తెలంగాణా వాదులూ ఇటు సమైక్య వాదులూ చేస్తున్న పొరపాటు ఒకటి కనిపిస్తున్నది. సమస్యకి మూలం యేమిటో ఇద్దరిలో యెవరూ పసిగట్ట లేదు. ఒక సమస్యని మూలాన్ని వెదక్కుండా పైకి కనబడే చిహ్నాల్ని మాత్రమే చూసి మూలం దగ్గిర ఒక్క దెబ్బతో పడిపొయే విషవృక్షాన్ని ఆకుల మీద యెన్ని దెబ్బలేసినా లాభమేముంది?

3. తెలంగాణా వాదులకి తప్పనిసరిగా జవాబు చెప్పాల్సిన ప్రశ్న ఒకటి వేస్తున్నా.ఇవ్వాళ మా వెనకబాటుతనానికి ఆంధ్రోళ్ళు కారణం, ఇన్నేళ్ళుగా మమ్మల్ని నిర్లక్ష్యం చేసారు గనక విడిపోవటమే సరైనదంటున్నారు. విడిపొయిన ఒక నాలుగేళ్ళ తర్వాత ఒక మూడు జిల్లాలు మాత్రమే ముందుకెళ్ళి మిగతావి ఇంకా వెనకబడి ఉంటే, వాళ్ళు ఇలాంటి వాదన తోనే మాకు వేరే రాష్త్రం కావాలని అడిగితే వెంటనే అప్పటి మీ అసెంబ్లీలో తీర్మానం చేసి ఇచ్చేస్తారా?

4. అలా సాగదీస్తూ పోతే యెక్కడాగుతుంది? విడిపోవడం ద్వారానే బాగుపడగలగటం నిజమైతే ప్రతి జిల్లా ఒక రాష్ట్రంగా విదిపోవాల్సి ఉంటుంది.నిజంగానే రాష్ట్రం విడిపోకుండానే మీకు కావలసిన స్వయం పరిపాలన అనేది సాగించుకోలేని విషయమేనా? ఇవ్వాళ పరిపాలనకి సంబంధించిన చట్రం యెలా ఉంది?కేంద్రంలో పార్లమెంటూ రాష్ట్రాలలో అసెంబ్లీలూ ఉద్దరిస్తున్న ఘనకార్యమేమిటి? కేవలం కాగితాల మీదకి శాసనాల్ని యెక్కించటం. వాళ్ళు నిజంగా పనులు చెయ్యటానికి జిల్లా స్థాయి యంత్రాంగం మీదే ఆధార పడుతున్నారు.యెందుకంటే జిల్లాలకి భౌగోళికమైన,రాజకీయపరమైన మరియు సాంస్కృతికమైన సరిహద్దులు ఖచ్చితంగా వివాద రహితంగా యేర్పాటయి ఉన్నాయి.పనులు చెయ్యటానికి కావలసిన యంత్రాంగమంతా అక్కడ బలంగా ఉంది.

5. ఆ జిల్లాలకి రాజకీయపరమైన స్వయం పరిపాలన ఇవ్వడం కొసమే జిల్లా ప్రజా పరిషత్తులనే వ్యవస్థని ప్రతిపాదించారు. వాటికి యెన్నికలు జరుగుతున్నాయి,కార్యాలయాల్ని సమకూర్చారు, చాలా హడావుడి చేసారు - అఖరికి ఇవ్వల్సిన శాసనాధికారం మాత్రం ఇవ్వకుందా చేటపెయ్యల్లాగా వాటిని నిలబెట్టినందువల్ల ఆ యెన్నికలకయ్యే ఖర్చంతా వృధా అయిపోతున్నది. అవి అసమర్ఢులకి రాజకీయ పునరావాస కేంద్రాలు గా మిగిలిపొయినాయి.

6. తెలంగాణా వాదులు ఆ పది జిల్లల కోసమూ, సమైక్య వాదులు ఆ హైదరాబాదు ఒక్కదాని కొసమూ గాకుండా జిల్లాలకి స్వయం ప్రతిపత్తి కోసం ఉమ్మడిగా పోరాడితే మొత్థం 23 జిల్లాల వాళ్ళూ బాగుపదతారు కదా! అధికార వికేంద్రీకరణ కోసమనే ఒక వ్యవస్థని ప్రతిపాదించి కూడా దాన్ని పూర్తిగా యెందుకు అమలు చెయ్యలేదో తెలుసా?అధికారం కేంద్రీకృతమవడం వల్ల లాభపడే వాళ్ళు ఆ అధికారాన్ని వికేంద్రీకరిస్తే తమ లాభం గూబల్లోకి వొస్తుందని తెలియదం వల్ల అలా వికేంద్రీకరణని తొక్కి పట్టి ఉంచారు.రెండు రాష్ట్రాలు గా విడిపోతే ఇలాంటి అధికార కేంద్రం దగ్గిర గుమిగూడి సొంతానికి దండుకునే వాళ్ళు మాత్రమే బాగుపడతారు.

7. అవినీతి మచ్చ లేని వాళ్ళూ మంత్రులు గా కొందరు మంచి పేరు తెచ్చుకున్న మంచి వాళ్ళూ తమ జీవితానుభవాల్ని గురించి చెబుతూ వాళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్లు గా ఉన్నప్పటి అనుభవాల్ని యెకరువు పెట్టగా నేను చదివాను.అనుభవాలు అంటే పని చేసిన అనుభవాలు కాదు - జిల్లా అంతా కలయ దిరిగి యెమి చెయ్యాలో తెలిసి కూదా పని చెయ్యటానికి అధికారాలు లేని దరిద్రాన్ని గుర్తు చేసుకోవటమే. మంత్రిగా ఉన్నప్పటి అధికారాలు అప్పుడే ఉంటే యెంతో కాలం కలిసొచ్చేదనే నిట్టూర్పులే.ఇవ్వాళ ఇంకొ దరిద్రం కూడా కనబడుతూ వినబడుతూ ఉంది. వెనకబడిన జిల్లాల వాళ్ళు రాష్త్ర ప్రభుత్వాల్ని మేము కాస్త బాగుపడాలి బాబూ మా జిల్లా నించి ఒకరిని మంత్రిని చెయ్యండని దేబిరించటం.అంటే ఒక జిల్లా బాగుపడాలంటే ఆ జిల్లా వాడు మంత్రివర్గంలో ఉండాలన్నమాట. అంటే మొత్తం ర్రాష్త్ర పరిధి లో అలోచించాల్సిన మంత్రి తన సొంత జిల్లాని గురించి మాత్రమే అలొచించటం అనేది అందరికీ న్యాయమే అనిపిస్తున్నదన్నమాట.

8. ఆ దరిద్రాలకీ ఈ శషభిషలకీ  మూలం ఒక్కటే ననేది నాకు అనిపిస్తున్నది. జటిలమైన సమస్యలకి కూడ లోతెరిగి చూడకుందా  దీర్ఘకాలిక పరిష్కారాలకి కాకుండా అప్పటికి నెత్తిన పడ్డ పెంటని వొదిలించుకుంటే చాలనే విధంగా అలోచించటమే.తెలంగాణా వాదుల కోరిక ప్రజలు సుఖపడే స్వయం పరిపాలన అయితే అది రాష్త్రంగా విడిఫొయినా జిల్లాలకి స్వయం ప్రతిపత్తి ఇవ్వడం వల్లనే జరుగుతుంది. జిల్లాలకు పూర్తి అధికారాలిచ్చి అన్ని జిల్లాలనీ స్వయం పోషకంగా చెయ్యడం విడిపోకుండానే చేసుకొవచ్చ్చు.కాదు మాకు వేరే అధికార కేంద్రం కావలసిందే తింటే తింటారు తిననియ్యుండ్రి మావాళ్ళేగా మేమేమీ అనం అంటే నేనేమీ చెప్పలేను. ఒకసారి నేనే ఆ జవాబును వారినుంచి పొంది ఉన్నాను:-)

                    నా మనసులో ఉన్న అసలైన భవిష్యత్తు చిత్రపటం యేమిటంటే "జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వమూ ప్రాంతీయ స్థాయిలో జిల్లా ప్రభుత్వాలూ" మాత్రమే ఉండి అవి డైరెక్టు కాంటాక్టులో ఉండాలని. అసలు రాష్ట్రాలే అంతర్ధానమై పొవాలని. జిల్లాలకి అరకొర అధికారాలిచ్చి రాష్ట్రాలనే అంతరువులు అలాగే ఉంటే అవి మళ్ళీ ఇప్ప్పటి దళారి పనులే చేస్తాయి.

                     అప్పటి వార్తాపత్రికల్లో చదివిన గుర్తు. అంతా సిధ్ధం చేసి ఆఖరి దశలో అధికారాల బదలాయింపు దగ్గిర వాయిదా వేసేసి ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉంచేశారు.దానిలో ఉన్న లోపాల్ని సవరించి మరింత ప్రయోజనకరంగా ఉండే రూపానికి తీసుకు రావటమే నా ఈ వ్యాస పరంపర ప్రధాన లక్ష్యం. ఈ మోడల్ని లోపరహితంగా తయారు చేసుకుని ఫాలో అవగలిగీతే యే ప్రాంతం వాళ్ళు వారి ప్రాంతాల లోని బౌగోళిక వనరుల మీద పూర్తి అధికారాన్ని కలిగి ఉంటారు గాబట్టి ప్రస్తుతం ఉన్న రాజకీయ చట్రం కన్నా అది ఖచ్చితంగా మెరుగ్గానే ఉంటుంది.
-----------------------------------------------------------------------------------------------------------------
1 2 3 4 5

5 comments:

  1. ...అసమర్దులకి రాజకీయ పునరావాస కేంద్రాలు గా మిగిలిపోయినాయి...

    అక్షర సత్యం... ఈ మాట ఎంతవరకు నిజమన్నది సాక్ష్యంగా మారడానికి మనకు ఎక్కువ సమయం ఎదురుచూడవలసిన అవసరం లేదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. చాలామంది అన్నట్లు కొంతమంది రాజకీయ నిరుద్యోగుల పాత్రే ఎక్కువ కనబడుతుంది, తెలంగాణా ఉద్యమంలో. ఇక్కడ నా ఉద్దేశ్యం ఉద్యమం పాత్రను తక్కువ చేయడం, చిన్న చూపు చూడడం కాదు. రాజకీయ నిరుద్యోగులంటే ఇక్కడ నా దృష్టిలో ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పటికిన్నీ పదవులు లేనివాళ్ళు. సమస్యంతా వీళ్ళు సృష్టించిందే. నిజానికీ ఈ ఉద్యమంలో వీర వీరావేశంతో చిందులు వేసిన వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ నియోజక వర్గాల్లో ప్రజా సమస్యలపై పోరాడినవాళ్ళు కాదో అవునో ఆ నియోజక వర్గ ప్రజల్ని ఆరా తీసినా, లేదా ఆ ప్రాంత వార్తా పత్రికల్ని తిరగేసినా బహిర్గతమౌతుంది. (ఇకపోతే కాంగ్రెస్ మంత్రులు ఆ కేటగిరి కాదుగా అని మీరనవచ్చు, వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నారుగా అనేది విషయం. మరి ముందు కాలంలో వాళ్ళు నిరుద్యోగంలో మారకూడదు గనుక. ముందు చూపు) నిజమే వాళ్ళంతా ఉద్యమంలో మొదట్నుంచీ ఉన్న వాళ్ళు కాదు, తప్పనిసరి పరిస్తుతుల్లో వచ్చి చేరినవాళ్ళు. తెలంగాణా ఆవిర్భావాన్ని చిదంబరం ప్రకటన తర్వాత పసిగట్టినవాళ్లు, లేక వారి హై కమాండ్ ద్వారా ప్లాంట్ చేయబడినవాళ్ళు. హై కమాండే తెలంగాణా ఉద్యమంలో డైరెక్ట్ గా పాలు పంచుకున్న తర్వాత వారికి వేరే ప్రత్యామ్నాలు మూసుకుని పోయాయ్ గనుక ప్లస్ వాళ్ళకు మార్గదర్శనం ఎప్పుడూ డైరెక్ట్ హై కమాండ్ నుంచే గనుక.

    ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు తెరాస సాలెగూడు నుంచి ఎలా బయటపడతారో తప్పక గమనించాల్సిన సందర్భం. తెరాస చంకెక్కి ఇక్కడా, కేంద్రంలో పదవులు పంచుకుందామని సంబురపడ్డ నాయకమ్మన్యులు, నాయకురాళ్ళు ఇప్పుడు దిక్కు తోచని స్తితిలో పడకతప్పని పరిస్థితి. స్వయంగా హై కమాండే పండు గాడి దెబ్బకు మైండ్ బ్లాంక్ అయి ఉన్న స్తితిలో ఇంకా వీళ్ళకేం మార్గదర్శనం చేస్తుందో తెలియని స్తితి. ఇంకా ఇంకా కాంగ్రెస్ నుంచి తెరాస కు వలసలు పెరిగినా ఆశ్చర్యం చూపనవసరం లేదు. ఈ విషయం లో kkr తప్పకుండా ముందు చూపు ప్రదర్శించినట్లే.


    ...మొత్తం ర్రాష్త్ర పరిధి లో అలోచించాల్సిన మంత్రి తన సొంత జిల్లాని గురించి మాత్రమే అలొచించటం అనేది అందరికీ న్యాయమే అనిపిస్తున్నదన్నమాట...

    మనకిష్టం లేనప్పటికీ ఇది తప్పులేని, తప్పనిసరి వాస్తవం అని గుర్తించాల్సిన, అంగీకరించాల్సిన విషయం. తప్పులేని అని ఎందుకు సూత్రీకరించవలసి వచ్చిందంటే, వాళ్ళ జిల్లా గాని ప్రాంతం గాని, కేంద్రం ఆదరణకు గానీ లేదా రాష్ట్రం ఆదరణకు నోచుకోనప్పుడు, ప్రస్తుతం అన్ని చోట్లా జరుగుతున్నదిదే, ఆ ప్రాంత ప్రతినిధిగా ఆ ప్రాంత ప్రయోజనం మాత్రమే పట్టించుకున్నా ఆ మాత్రానికది గొప్ప విషయమే.
    ఒక ప్రస్తుత ముఖ్యమంత్రి, ఒకప్పటి రైల్వే మంత్రి, మరొక మాజీ ముఖ్యమంతి ప్లస్ మరోకప్పటి రైల్వే మంత్రి, అప్పట్లో చాలా అధికంగా వాళ్ళ రాష్ట్రాలకు "మాత్రమే" కేటాయింపులు జరుపుకున్నా ప్రధానమంత్రి దగ్గర నుంచీ, వాళ్ళ దయతో అధికారం చెలాయిస్తున్న అధికార పార్టీ నోరు మూసుకుని అంధుల్లా ప్రవర్తించడం దేశం మొత్తం కిమ్మనకుండా ఉండటం అనే విషయం "తప్పులేని" సమర్ధన క్రిందకే వస్తుంది. తమిళనాడు వాళ్ళు మంత్రులుగా వుండి (వాళ్ళు ఏ పార్టీ వాల్లైనప్పటికీ) కేంద్రం నుంచి వాళ్ళ రాష్ట్రానికి ఏమేం సాధిస్తారో లెక్కలు తీస్తే తెలుస్తుంది. ప్రక్క రాష్ట్రాలకు కేటాయించబడిన ప్రాజెక్ట్ లు కూడా ఎలా దారి మళ్ళించి వాళ్ళ రాష్ట్రానికి చేరేట్లు చేస్తారో చూడాల్సిందే. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు.

    ఇక్కడ మన మన ఆవేదనల్ని వెలిబుచ్చాలంటే అది ఎప్పటకీ ముగింపబడని ప్రసంగమే అవుతుంది.
    మీరు సూచించిన పరిష్కార మార్గాలు అమలవ్వాలంటే ఇక్కడా అక్కడా ప్రజా ప్రయోజనమే ప్రాధమ్యం గా భావించే ప్రభుత్వాలేర్పడాలి. కనుచూపు మేరలో మీకలాంటి ఆశ నెరవేరే ఊహ మనసులో గానీ ఉంటే... మనకు అల్ ది బెస్ట్.


    ReplyDelete
  2. కేవలం ఒక కొత్త రాష్ట్రం ఏర్పడడం వల్ల అభివృద్ధి జరగదు. ఈ వాస్తవాన్ని ఎవరూ కాదన్నారని నేను అనుకోవడం లేదు.

    తెలంగాణా వాదం వెనుక ఉన్న ఆలోచనా సరళి ఏమిటో చూద్దాం. 1. మన వనరులు మనకు ఉపయోగపడలేదు 2. ఉమ్మడి రాష్ట్రం అనుసరించిన అభివృద్ధి నమూనా మన పరిస్తితులకు అనుగుణంగా కాక, వారి ప్రయోజనాలకు దోహదపడేలా ఉంది. 3. అభివృద్ధి ఫలాలలో మనకు సరయిన వాటా దొరకలేదు.

    పై విషయాలు నిజమా కాదా అనే అంశంపై ఎవరి అభిప్రాయాలు వారివి. అలాగే ఈ భావాన్ని ప్రజలలోకి తీసుకెళ్ళిన పద్దతుల జోలికి నేను (ఇప్పుడు) వెల్లదలుచుకొలెదు.

    ఈ మూడు విషయాలను ప్రస్తుతానికి (for the sake of argument) వాస్తవంగా భావిద్దాం. The logical conclusion is inescapable.

    ReplyDelete
    Replies
    1. నా వ్యాఖ్యలో ఈ భాగం గురించి ఇప్పుడు మనం బుర్ర బద్దలు కొట్టుకోనక్క్కర్లేదు. కేవలం అప్పటి ప్రస్తావనలే అవి.నేను కూడా వాట్ని నెగిటివ్ దృష్టితో వెయ్యలేదు.ఇప్పుడు తలకట్టు ఆంధ్ర ప్రదేశ్ కి అని పెట్టినా మొత్తం విషయాన్ని పూర్తిగా ప్రతిపాదనలుగా వచ్చాక అవి మన రెండు రాష్ట్రాలకీ అనువుగానే ఉంటాయి.

      Delete
    2. మీరు పాజిటివ్ దృక్పథంతో రాస్తున్నారని నాకు తెలుసు. All the best to your pen (keyboard).

      Delete
  3. వికేంద్రీకరణ మంచిదే. అయితే జిల్లా ప్రభుత్వాలు & స్వయం ప్రతిపత్తి లాంటి సలహాలు ఆచరణ యోగ్యమా అనే దాఖలాలు లేవు. ఈ సిద్దాంతాన్ని ప్రచారం చేస్తున్న మేధావులు ఎవరూ కూడా Implementation Plan విపులించలేదు. వారికి అంత bandwidth and/or vision లేదని, వినడానికి బాగుండే మాటల ద్వారా తమ పబ్బం గడుపుకుంటున్నారని నా అనుమానం.

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...