Sunday, 9 March 2014

ఇక ఆంధ్ర ప్రదేశ్ పునర్నిర్మాణానికి ఒక నూతన రాజకీయ ఆర్ధిక వ్యవస్థ కావాలి - 4

లక్ష్యం:ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో కంద్రీకృతంగా ఉన్న రాజకీయ వ్యవస్థని వికేంద్రీకరించి జిల్లా స్థాయికి కుదించి పూర్తి అధికారాలతో ప్రాంతీయ వ్యవస్థలకి అప్పగించటం.


సూచన: ఇదివరలో జిల్లాలకి స్వయం ప్రతిపత్తి కోసం జిల్లా ప్రజా పరిషత్తుల్ని యేర్పాటు చేసి చాలా కాలం నుంచి యెన్నికలు జరుపుతూ ప్రజా ప్రతిధులు యెన్నికయి తమ అధికారిక స్థానాలలో హోదాని అనుభవిస్తున్నా వారికి అధికారాల్ని మాత్రం కట్టబెట్టలేదు. అప్పుడు ప్రతిష్టంభన రావటానికి కారణం బహుశా అప్పటికే కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ప్రభుత్వాలకి అధికారాలు పూర్తిగా నిర్వచించబడి ఉండటం వల్ల ఈ మూడో అంతరువుకి యే స్థాయిలో అధికారాల్ని బదలాయించాలి అనేది కావచ్చు. మూడో అంతరువులోని ప్రభుత్వానికి యే అధికారాన్ని యెంత మేరకు బదలాయిస్తే అంత మేరకు పై స్థాయిలో ఉన్న వ్యవస్థలకి ఆ అధికారాల్లో కోత పడాల్సి ఉంటుంది మరి. కానీ నేనిప్పుడు ఒక స్థాయిలో కాదు మొత్తం రాష్ట్ర స్థాయిలోని అన్ని అధికారాల్నీ ప్రాంతీయ ప్రభుత్వాలకి అప్పగించేసి రాష్ట్ర స్థాయిలోని అంతరువుని మాయం చేసెయ్య మంటున్నాను. అంటే ఇప్పుడు ఒక చోటనే ఉన్న ప్రభుత్వం స్థానంలో 13 పూర్తి అధికారాలతో ఉండే చిన్న చిన్న ప్రభుత్వాల్ని యేర్పాటు చెయ్యమనేది నా ఉద్దేశం.

పధ్ధతి:


1. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో డాక్యుమెంటేషన్ కి ఉపయోగ పడుతున్న సెక్రటేరియట్ లో కలగాపులగంగా ఉన్న జిల్లాలకి సంబంధించిన అన్ని శాఖలు మరియు విధినిర్వహణలకి సంబంధించిన భిన్నమయిన విషయాలన్నింటినీ జిల్లాల వారీగా వేరు చేసి జిల్లా కేంద్రాలకి పంపటం.
2. క్రింది స్థాయిలోని ప్రాంతీయ ప్రభుత్వాలకి తమ అధికారాల్ని కట్టబెట్టటానికి తనను తను రధ్ధు చేసుకునే తీర్మానాన్ని శాసన సభ చెయ్యటం.


ఖర్చు:


1. దస్త్రాల్ని వేరు చేసి సర్ది పంపించటానికి కొంత ఖర్చు అవుతుంది గానీ అది నామమాత్రమే. 
2. ఇప్పటికే జిల్లా ప్రజా పరిషత్తులు యేర్పడి ఉన్నాయి కాబట్టి కొత్తగా ఆ యంత్రాగాన్ని యేర్పాటు చెయ్యటానికి ఖర్చు ఉండదు.
3. ప్రాంతీయ స్థాయిలో సభా నిర్వహణకి ఇప్పుడున్న భవనాలూ యేర్పాట్లూ చాలక పోవచ్చు.ప్రస్తుతం యేవో చిన్న చిన్న ఆఫీసుల్లాంటివి ఉండి ఉంటాయి.కానీ పూర్తి స్థాయి శాసన సభా సమావేశాల మాదిరి వ్యవహారాలకి తగిన యేర్పాట్లు అవసరమవుతాయి.


లాభాలు:


1. ఇప్పుడు 290 మందికి పైన ఉన్న శాసన సభ్యులు బిల్లుల పైన చర్చించటానికి రాష్ట్రం నలుమూలల నుంచి వారిని ఒకచొటికి రప్పించటానికి చాలా ఖర్చవుతున్నది.
2. ఈ ఇబ్బంది వల్లనే సంవత్సరానికి కొన్ని రోజులు మాత్రమే సభ సమావేశ మవుతున్నది.
3. ఆ కొద్ది రోజుల్లో చర్చించటం కుదరని వాట్ని ఆర్డినెన్సులుగా తెస్తున్నారు.
4. ప్రతీ ఆర్డినెన్సూ అది ముగిసి పోయే కాలంలోపు సభలో అనుమతి రాకపోతే ఆ బిల్లు మురిగిపోతుంది.



ప్రాంతీయ ప్రభుత్వాల్లో ఈ బలహీనతలు అసలు ఉండవు.


1. సభ్యులు సమావేశానికి చేరుకోవటానికి పట్టే కాలమూ దూరమూ గణనీయంగా తగ్గుతుంది గనక సమావేశాలకి అయ్యే ఖర్చు కూడా తగ్గుతుంది.
2. సమావేశాలు కూడా ఇన్ని రోజులకే అని పరిమితం చెయ్యాల్సిన ఇబ్బంది ఉండదు.యెప్పుడు అవసరమయితే అప్పుడు ఒక రోజు ముందు తెలియపర్చినా సభ్యులు సకాలంలో సభకి హాజరు కాగలరు.
3. సమయాభావం సమస్య లేకపోవటం వలన ప్రతి బిల్లూ సమగ్రమయిన చర్చ ద్వారా పూర్తి సౌష్టవంతో రూపు దిద్దుకుంటుంది.
4. యే ఒక్క బిల్లూ మురిగిపోయే ప్రసక్తి ఉండదు.


                    అన్ని అధికారాల్నీ పూర్తిగా బదలాయించమంటున్నాను గనక యే ఒక్క ప్రత్యేకమయిన అధికారం గురించీ విడివిడిగా చెప్పటం లేదు గానీ రెవెన్యూ అధికారాల్ని ప్రత్యేకంగా ప్రస్తావించాలి.రెవెన్యూ అధికారాల్లో వ్యవస్థీకృతంగా యేమీ చెయ్యనక్కర్లేదు. యెందుకంటే ప్రతి జిల్లాకీ ఆర్ధిక ప్రణాళికా సంఘాలు(District Planning Commission) యేర్పడి ఉన్నాయి. మొత్తం ఆర్ధిక పరమయిన అన్ని వ్యవహారాలూ జిల్లా ఆధారంగానే జరుగుతున్నాయి.కానీ రెవెన్యూ ఫ్లో అనే దాంట్లో చాలా కిరికిరి జరుగుతున్నది.

                    ఇప్పుడు రెవెన్యూ ఫ్లో అనేది యెలా జరుగుతున్నది? ఆర్ధిక పరమయిన అన్ని విషయాలకీ జిల్లాయే ప్రధానంగా ఉంది కాబట్టి జిల్లా నుంచి వచ్చే రెవెన్యూ అంచనా లన్నీ అందరికీ తెలిసినవే. ఒక జిల్లా నుంచి వచ్చే రెవెన్యూ ఇప్పుడెలా కదుల్తున్నది. ఆ రెవెన్యూ మొదట రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయబడుతున్నది.మొత్తం అన్ని జిల్లాల నుంచీ పోగు పడిన రెవెన్యూ లో కొంత పక్కకి తీసి కేంద్రానికి పంపిస్తున్నారు. కేంద్రం మొత్తం అన్ని రాష్ట్రాల నుంచీ వొచ్చిన రెవెన్యూని కొంత పక్కకి తీసి ఆ మిగిలిన దాన్ని కింది వైపుకి రాష్ట్రాలకి పంపిస్తున్నది. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకి పంపిణీ చేస్తున్నది. అంటే ఒక జిల్లా నుంచి వెళ్ళిన ఆదాయం మళ్ళీ ఆ జిల్లాకి చేరటానికి మూడంచెలు పైకి మూడంచెలు కిందికి మొత్తం ఆరు అంచెలు దాటుకుని రావాల్సి వస్తుంది.

                    రాష్ట్ర ప్రభుత్వం రద్దు అయి జాతీయ ప్రభుత్వమూ ప్రాంతీయ ప్రభుత్వమూ అనే రెండు అంచెలే ఉంటే మధ్యలో పక్కకి తీసి పెట్టే వేష్టేజి తగ్గుతుంది.కానీ నేను కొత్తగా ప్రతిపాదిస్తున్నది ఒకటుంది.ప్రతి జిల్లాకీ తన రెవెన్యూ మీద తనకి పూర్తి అధికారం ఉండాలి.రాష్ట్రం అనే మధ్య అంతరువు రద్దు అయిపోయినా మొత్తం రెవెన్యూ అంతా ముందు కేంద్రానికి పంపించి మళ్ళీ అది తిరిగి వచ్చే వరకూ యెదురు చూడటం కన్నా తన ఆదాయంతో బాటూ తన అవసరాలూ స్పష్టంగా తెలుసు గనక వాటికి అవసరమయినంత ఇక్కడే ఉంచేసుకుని అదనంగా ఉన్న రెవెన్యూని మాత్రమే పైకి పంపించగలిగే విధంగా ఉండాలి.

                    ఇది చాలా అవసరం. యెందుకంటే ఇప్పుడు దాదాపుగా అన్ని ప్రాజెక్టులకీ సకాలంలో పూర్తి కాకపోవడం అనే ఇబ్బంది ఈ రెవెన్యూ ఫ్లో నెమ్మదిగా కదలటం వల్లనె యెదురవుతున్నది. కొన్ని ప్రాజెక్టులకి అంచనా వ్యయానికీ నిర్మాణ వ్యయానికీ గుండె గుభేలు మనిపించేటంత తేడా రావటం, మొదలు పెట్టేటప్పుడు ఇంత కాలంలో పూర్తవుతుందనుకున్న అంచనాని దాటి సుదీర్ఘ కాలం డేకటం ఈ రెవెన్యూ ఫ్లో లో ఉన్న మందకొడి తనం వల్లనే కదా!అన్ని పనులూ జిల్లా యంత్రాంగం ద్వారానే జరుగుతున్నాయి- చెయ్యడానికి చిత్తశుధ్ధి ఉన్నవాళ్ళు  యెంత వేగంగా అయినా చెయ్యగలరు, కానీ పని మొదలు పెట్టటాని కవసరమయిన నిధులూ, పని పూర్తయ్యాక చెల్లించాల్సిన బిల్లుల చెల్లింపులకీ అవసరమయిన రెవెన్యూ మాత్రం ఇంత సుదీర్ఘమయిన ప్రయాణం చేస్తుంటే పనులు సత్వరంగా యెలా జరుగుతాయి?

పార్లమెంటు సభ్యుల సమన్వయ సంఘం:రాష్ట్రం స్థాయిలో ప్రభుత్వాన్ని పూర్తిగా రద్దు చేస్తే రాష్ట్ర స్థాయిలో వీటి నన్నిట్నీ కలిపి ఉంచటానికి ఒక వ్యవస్థ ఉండాలి కదా?. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ఒక్కటే ఈ మోడల్లో తనని తను రద్దు చేసుకుంటున్నప్పుడు ఈ జిల్లాల సమాహారం మిగతా రాష్ట్రాలతో యెలా వ్యవహరించాలి? ఇప్పుడున్న అంతర్రాష్ట్ర జల ఒప్పందాల లాంటి వాటిని యెవరు చూడాలి?

                    దానికి నేను పార్లమెంటు సభ్యుల్ని ఉపయోగించుకోవచ్చునని సూచిస్తున్నాను.ప్రతి జిల్లాకీ మినిమం ఇద్దరు చొప్పున పార్లమేంటు సభ్యులు ఉండాలి. ఈ పార్లమేంటు సభ్యులు రాష్ట్ర స్థాయిలో తమ జిల్లాలకి ప్రాతినిధ్యం వహించేలాగా ఒక సమన్వయ సంఘంలాగా యేర్పడి మొత్తం అన్ని జిల్లాల సమాహారమయిన రాష్ట్ర పరిధి లోని అంశాలకు బాధ్యత వహించాలి.జిల్లాకి సంబంధించి క్షేత్ర స్థాయిలో జరిగే వ్యవహారాలకి సంబంధించిన శాసనాధికారం తో కూడిన పరిపాలన ఒక చోటా ఈ జిల్లాని బాహ్య ప్రపంచంతో అనుసంధానించే బాధ్యతా యుతమయిన వ్యవస్థ ఒక చోటా ఉంటుంది. యేదీ కేంద్రీకృతం కాదు.

                    ఇప్పుడు ఒక పార్లమెంటు స్థానానికి యెన్నికయిన వ్యక్తికి తన పార్లమెంటరీ నియోజక వర్గంతో మాత్రమే అనుబంధం ఉంటుండగా ఈ కొత్త అమరికలో ప్రతీ పార్లమెంటు సభ్యుడికీ మొత్తం రాష్ట్ర మంతటితో అనుబంధం యేర్పడుతుంది. అధికస్య అధికం ఫలం!రాష్ట్రం నుంచి కేంద్రానికి పంపించే రెవెన్యూని ఈ పార్లమెంటు సభ్యుల ద్వారా నడిపించితే మరొక ముఖ్యమయిన పని కూడా జరిపించుకోవచ్చు. ఇప్పుడు కేంద్రం ఈ రెవెన్యూ నంతా పైకి తీసుకోవటం దేని కోసం? కొన్ని చోట్ల యెక్కువ ఆదాయం ఉంటే దాన్ని  ఒక చోటికి కలిపి తరుగు లో ఉన్న ప్రాంతాలకి సహాయంగా అందించటం కోసమే కదా! అయితే సమన్వయ సంఘంలో ఉన్న పార్లమెంటు సభ్యులకి యెలాగూ తమ జిల్లాలకి సంబంధించి పైకి పంపే రెవెన్యూ మీద అధికారం ఉంచితే ఇక్కడే అది చెయ్యొచ్చు. రెవెన్యూ పరంగా తరుగు లో ఉన్న జిల్లా సభ్యుడు యెక్కువ రెవెన్యూని కేంద్రాని పంపగల జిల్లా వారిని ఈ స్థాయిలో అడగవచ్చు, ఇక్కడే ఆ యేర్పాటు చేశాక మిగిలిన రెవెన్యూనే కేంద్రానికి పంపవచ్చు. మరొక రెండు దశల కాలహరణం తప్పుతుంది. వ్యక్తుల మధ్యన స్నేహ సంబంధాలు యెలా అయితే వాళ్ళ మధ్యన జరీగె చొరవతో కూడిన అదాన ప్రదానాలతో వికసిస్తాయో ప్రాంతాల మధ్యన కూడా ఇలాంటి అదాన ప్రదానాలు ఉంటేనే జాతుల మధ్యన ఐక్యత కూడా బలపడుతుంది.ముందు కేంద్రానికి పంపించి అక్కడి నుంచి ఇది జరగటంలో యాంత్రికత ఉంటే ఈ విధంగా చెయ్యడంలో మానవీయత ఉంటుంది.


           సహజంగా ప్రజా జీవితంలో యెదగాలనుకునే నాయకుల్లో వ్యక్తిగతమయిన ప్రవర్తనని బట్టీ వారి పని తీరుని బట్టీ రెండు రకాలుగా ఉండటాన్ని పరిశీలించాను - క్షేత్రస్థాయిలో సామాన్యులతో కూడా కలివిడిగా ఉంటూ పనులు సకాలంలో పూర్తవడానికీ ఆ పనుల్లో క్వాలిటీ ఉండటానికీ కారణ మయ్యేవాళ్ళు కొందరు కాగా హుందాగా ఉంటూ సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండి సమస్యల్ని పరిష్కరించటం, గొడవల్ని సర్దుబాటు చేసి ఇరుసులో కందెనలా ఉపయోగపడే వాళ్ళు మరి కొందరు. అవినీతి పరుల్ని నేను పట్టించుకోవటం లేదు.ముందు ముందు కూడా ప్రస్తావనకే తీసుకు రాను. యెందుకంటే ఇప్పటి ఈ వ్యవస్థలోనే అవినీతిని కట్టడి చెయ్యటం గురించి బాగా ఆలోచించి యే నియమ నిబంధనల్ని యేర్పాటు చేశారో ఆచరణ లోకి వచ్చేసరికి అవే అవినీతి పరులకి మరింత సులువయిన దార్లుగా మారాయి. వేతన శర్మలు!

               ఒక నిజాయితీ పరుడయిన వ్యక్తి ఇప్పటికన్నా చురుకుగా పని చేసి ప్రజలకి మరింత ప్రయోజనం కలిగించే అర్ధవంతమయిన రాజకీయ చట్రాన్ని రూపొందిస్తే చాలు.ఆ రోజున అక్కడ అవినీతి జరుగుతుందేమో ఇక్కడ అవినీతి జరుగుతుందేమో అని హడావుడి పడుతున్నప్పుడు నాలాంటి వాడెవడయినా ఉంటే ఒకటే అడిగే వాడు, "అక్కడికి అవినీతి పరుల్ని యెవరయినా పంపిస్తే గదా వాడు అక్కడి కెళ్ళి అవినీతి చేశేది, అక్కడికి అవినీతి పరుణ్ణి పంపించకుండా ఉంటే సరిపోతుంది గదా" అని. ఆ వేతన శర్మల్ని వొదిలేస్తే నేను ప్రతిపాదించే వ్యవస్థలో మొదటి రకం వాళ్ళు జిల్లా ప్రజా పరిషత్తుల్లో కుదురుకోవచ్చు. రెండో రకం వాళ్ళు సమన్వయ సంఘంలో ఉంటే జిల్లాని మిగతా జిల్లాలతో అనుసంధానించటంలోనూ అన్ని జిల్లాల్నీ ఒక రాష్ట్రంగా పట్టి ఉంచటంలోనూ వారిలోని ఉదార గుణం మంచి ఫలితాల నిస్తుంది. తమ జిల్లాని కేంద్రంతో అనుసంధానించటం, మిగులు రెవెన్యూకి సంబంధించిన ఆదాన ప్రదానాలకి సంబంధించిన బాధ్యతలూ కీలక మయినవే.



                కేంద్రీకృతంగా ఉండే ఒక ప్రభుత్వానికి బదులు 13 ప్రభుత్వాల్ని యేర్పరుస్తున్నప్పుడు రాజధాని గురించి బుర్రలు బద్దలు కొట్తుకునే అవసరం లేదు. సమన్వయ సంఘం కార్య కలాపాలకి శాశ్వత నివాసంగా ఉపయోగ పడుతుంది, అంతే.

సూచన:పార్లమెంటు సభ్యులు ఒకోసారి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహించాలని అనుకుంటే సమన్వయ సంఘంలో కూడా అతడు కొనసాగడం కష్టం. అందుకే జిల్లాకి మినిమం ఇద్దరు పార్లమెంటు సబ్యులు ఉండాలన్నది. కొంచెం పెద్ద జిల్లా అయితే అంతకన్నా యెక్కువమంది కూడా ఉండొచ్చు.కానీ యెంత చిన్న జిల్లా కయినా మినిమం ఇద్దరు ఉండాలి. జిల్లాకి సంబంధించిన పార్లమెంటు సభ్యుల్లో యెవరో ఒకరిని కానీ అందర్నీ కానీ ప్రాంతీయ ప్రభుత్వ సమావేశాలకు అధికారికంగా హాజరయ్యే విధంగా గౌరవ సభ్యత్వం ఇస్తే ఈ రెండు వ్యవస్థలూ ఒకదాని కొకటి చక్కగా అతుక్కుని ఉంటాయి.

ఫలశ్రుతి: స్థూలంగా ఇవీ నా ప్రతిపాదనలు. దీని వల్ల వచ్చే గుణాత్మకమయిన మార్పు అవినీతిని బాగా తగ్గించవచ్చు. అధికారంలో ఉండి పనులు శీఘ్రంగా జరిపించాల్సిన బాధ్యతా యుతమయిన వ్యక్తులు పర్యవేక్షించాల్సిన పరిధి తగ్గుతుంది. రాష్ట్రం మొత్తం మీద ఉన్న అసంఖ్యాకమయిన వాటిని పర్యవేక్షించటం కన్నా ఒక జిల్లా స్థాయి లోని కొన్ని పనుల్ని మాత్రమే పర్యవేక్షించటం చాలా తేలిక. ఒక నిజాయితీ పరుడయిన వ్యక్తి అధికారంలో ఉంటే ఈ వెసులుబాటుతో గట్టి నిఘా ద్వారా అవినీతిని ఖచ్చితంగా తగ్గించగలడు.ప్రభుత్వం మీద ప్రజలకీ మంచి పట్టు ఉంటుంది. ప్రతి రోజూ తమకు దగ్గరగా తిరిగే వాళ్ళని ప్రజలు కూడా దగ్గర్నించి గమనించటం ద్వారా నాయకుల్ని ప్రజలు కూడా కట్టడిచెయ్యగలరు.

                    అనవసరమయిన వ్యవస్థల్ని మాత్రం పూర్తిగా మాయం చేసెయ్యాలి.వజ్రం యెందుకంత దృడంగా ఉంటుంది? ఫిజిక్స్ లో పదార్ధాల స్థిరత్వానికి సంబంధించి ఒక తమాషా అయిన విశేషం ఉంది. అణువులు వాటిలో అవి కలిసి ఉండటానికి తక్కువ శక్తితో బంధించుకోగలిగి ఉంటే వాటికి స్థిరత్వం యెక్కువ ఉంటుంది. వాటితో అవి కనెక్ట్ అవటానికి తక్కువ శక్తి అవసరమయితే వాట్ని బద్దలు కొట్టటానికి బయటి నుంచి మనం యెక్కువ శక్తిని ఉపయోగించాల్సి వస్తుంది. ప్రభుత్వానికి కూడా అదే సూత్రం వర్తిస్తుంది. ఇప్పుడున్న మిత్ యేమిటంటే యంత్రాంగం యెక్కువ ఉంటే యెక్కువ ప్రయోజనం కలుగుతుందని. 

                    సమర్ధవంతంగా పనిచేస్తే ఇప్పుడున్న యంత్రాంగంలో అయిదో వంతుకు తగ్గినా ఇప్పటి కన్నా పనులు తొందరగానే జరుగుతాయి.చాణక్యుడు రాజధర్మంగా చెప్పింది ఒకే ఒక్కటి - ప్రజల్ని ధర్మబధ్ధంగా జీవించటానికి ఉత్సాహవంతుల్ని చెయ్యటం. దానికి చెయ్యాల్సిన పన్లు కూడా రెండే - ప్రజలకి న్యాయమయిన మార్గంలో సంపాదించుకోవటానికి దారి చూపించటం,అన్యాయ వర్తుల్ని శిక్షించటం. పీవీ నరసింహా రావు గారు అధికారికంగా లైసెన్స్ రాజ్ ని యెత్తేసినా అనధికారికంగా లాబీల ద్వారా అందరూ అన్నిటికీ పోటీ పడలేని రహస్య మార్గాల్లో జరుగుతూనే ఉంది మరో రకమయిన పర్మిట్ల వ్యవహారం. ఒకడేమో నెలకి వెయ్యి రూపాయలిస్తానంటాడు, ఇంకొకడేమో మీరు కూర్చున్న చోటు నుంచి కదలక్కర్లేదు, నేనే మీ ఇంటికొస్తాను ముద్దలు కలిపి నోట్లో పెడతానంటాడు.న్యాయంగా సంపాదించుకునే దారి చూపించి దొంగవెధవల్ని కంట్రోల్ చేస్తే వాడి కష్టం మీద వాడే బతుకుతాడు కదా?! 

                    ఇప్పటి రాజకీయ యంత్రాంగం పిరమిడ్ లాగా పైన ఉన్న కొద్ది మంది కేంద్రీకృత మయిన అధికారంతో కింది అంతరువుల్ని క్రూరంగా శాసించుతున్నారు.దానికి బదులుగా ఈ నూతన విధానం క్షేత్ర స్థాయిలో బలంగా ఉండి పైకి విస్తరిస్తూ -  యెదిగే చెట్టు లాగా ఉంటుంది.నేను ఇప్పటికిప్పుడు త్వరగా చెయ్యాల్సిన నాలుగింటిని గురించి చెప్పాను కదా, వాటిలో విద్యని మార్కెట్ కి అనుసంధానించటం తప్పించి మిగతా రెండింటికీ ఈ  నూతన వ్యవస్థ పునాదిగా ఉంటుంది. ఆ వివరాలు మరుసటి టపాలో.


ఒక మంచి వార్త:నేను ఇక్కడి వరకూ పోష్టుని రాత్రి పూర్తి చేశాను. కానీ ఇది నిజంగా మార్పుని తేగలదా అని సందేహంగా అనిపించింది. అయినా స్థూలంగా మన మాట మనం చెబితే చర్చ ద్వారా మరింత మెరుగు పర్చుకోవచ్చు కదా అని నాకు నేనే సర్ది చెప్పుకున్నా. అయితే ఈ రోజు ఆంధ్రజ్యోతిలో ఒక వార్త చూశాను. రాష్ట్ర పునర్నిర్మాణానికి నిజంగా ఉపయోగ పడాల్సిన వ్యాపార పారిశ్రామిక వర్గాల వారు కూడా ఇలాంటి ప్రతిపాదనలే చేశారు.

వారు చెప్పింది సంక్షిప్తంగా ఇది:ప్రతి రెండు జిల్లాల్నీ ఒక క్లస్టర్ గా అభివృధ్ధి చేయడం వల్ల త్వరిత గతిన మేలయిన అభివ్ర్ధ్ధి సాధించగలుతాం. వ్యవసాయం అభివృధ్ధి చెందితే వ్యవసాయాధారితమయిన పరిశ్రమలు యేర్పడి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. భూ వినియోగాన్ని హేతుబధ్ధం చేయాలే తప్ప పరిశ్రమల ముసుగులో రియల్టర్ల దందాను అనుమతించకూడదు.


               ఒక వారం క్రితమనుకుంటాను తెలంగాణాకు సంబంధించిన మేధావులు కూడా ఒక పత్రికా సమావేశంలో సరిగ్గా ఈ క్లస్టర్ల ప్రస్తావననే తెచ్చారు. ఆ రకంగా చూస్తే నేను చేసిన ప్రతిపాదన అంతకంటే మెరుగ్గానే ఉన్నట్టుగా ఉంది. ఇప్పటి పధ్ధతిలో యేర్పడే క్లస్టర్ల కన్నా ప్రతి జిల్లాకీ తమను తామే అభివృధ్ధి చేసుకునే పూర్తి అధికారం ఇవ్వ మంటున్నాను నేను.

                    అక్కడ తమ అభిప్రాయాలు చెప్పిన వారంతా లాబీయింగుల ద్వారా పైకొచ్చిన వారు కాకుండా చక్కని రాజమార్గంలో సంపద పెంచే ఋజు ప్రవర్తన గల వ్యక్తులు కావడంతో వారు కూడా ఇలాంటి చట్రాన్నే కొరుకోవడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.
-----------------------------------------------------------------------------------------------------------------
1 2 3 4 5

23 comments:

  1. రెండు ప్రశ్నలు: 1. ప్రస్తుతం రాష్ట్రసూచీలో (state list) ఉన్న అన్ని అంశాలను జిల్లాలకు బదిలీ చేస్తారా? 2. జిల్లాల మధ్య సమన్వయము ఎలా చేస్తారు?

    ReplyDelete
    Replies
    1. 1.ప్రస్తుతం రాష్ట్రసూచీలో (state list) ఉన్న అన్ని అంశాలను జిల్లాలకు బదిలీ చేస్తారా?

      చేస్తేనే మంచిది. ఒక అధికార కేంద్రానికి ఇంకో అధికార కేంద్రాన్ని - నిఘా అని గానీ కంట్రోల్ చెయాలని గానీ - చిక్కురొక్కురుగా ఉంచటం కన్నా అదే మంచి దనిపిస్తున్నది నాకు

      2. జిల్లాల మధ్య సమన్వయము ఎలా చేస్తారు?

      దానికి నేను పార్లమెంటు సభ్యుల్ని ఉపయోగించుకోవచ్చునని సూచిస్తున్నాను.ప్రతి జిల్లాకీ మినిమం ఇద్దరు చొప్పున పార్లమేంటు సభ్యులు ఉండాలి. ఈ పార్లమేంటు సభ్యులు రాష్ట్ర స్థాయిలో తమ జిల్లాలకి ప్రాతినిధ్యం వహించేలాగా ఒక సమన్వయ సంఘంలాగా యేర్పడి మొత్తం అన్ని జిల్లాల సమాహారమయిన రాష్ట్ర పరిధి లోని అంశాలకు బాధ్యత వహించాలి.జిల్లాకి సంబంధించి క్షేత్ర స్థాయిలో జరిగే వ్యవహారాలకి సంబంధించిన శాసనాధికారం తో కూడిన పరిపాలన ఒక చోటా ఈ జిల్లాని బాహ్య ప్రపంచంతో అనుసంధానించే బాధ్యతా యుతమయిన వ్యవస్థ ఒక చోటా ఉంటుంది. యేదీ కేంద్రీకృతం కాదు.

      Delete
    2. కొన్ని విషయాలు (ఉ. పన్ను రేటు, పాఠ్య పుస్తకాలు వగైరా) అన్ని జిల్లాలకూ ఒకటే ఉండాలి కదా? ఇది మీరు చెప్పిన పద్దతిలో ఎలా కుదురుతుంది?

      పార్లమెంటు సభ్యులు ఇలాంటి విషయాలు అన్నిటినీ తెల్చగలరా?

      Delete
    3. కొన్ని విషయాలు (ఉ. పన్ను రేటు, పాఠ్య పుస్తకాలు వగైరా) అన్ని జిల్లాలకూ ఒకటే ఉండాలి కదా? ఇది మీరు చెప్పిన పద్దతిలో ఎలా కుదురుతుంది?
      --
      అయితే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తిగా రద్దు చేయటం సాధ్య పదక పోవచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇలాంటి వాటికే పరిమితం చెయ్యాలి. మళ్ళీ మూడంచెల వ్యవహారంవుతుంది. అప్పుడు కూడా ఇలాంటి సమస్యలే వచ్చి ఉంటాయి.యేమయినా జిల్లాలకి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలనే ఆలోచన అప్పట్లోనే వచ్చింది. ఇప్పుడు కూడా క్లస్టర్ల ఆలోచన వస్తున్నది. కాబట్టి వీటిని పరిష్కరించేలాగ మోడల్ని మార్చాలి.

      Delete
    4. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని ముఖ్యమయిన నిర్ణయాల్లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్నీ సమావేశ పర్చి వాళ్లతో చర్చించి ఒక నిర్ణయాని కొస్తుంది కదా,అలాగే పార్లమెంట్ సభ్యులకి బదులు ఈ జిల్లా పరిషత్ చైర్మన్లే శాశ్వత ప్రాతిపదికన సంఘంగా యేర్పడ వచ్చు కదా!

      Delete
    5. This comment has been removed by the author.

      Delete
    6. జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్(రేపటి నాడు ప్రాంతీయ ప్రభుత్వాధినేత?!) గా పదవిని స్వీకరించగానే ఈ 13 మందీ ఒక రాష్ట్ర స్థాయి సమన్వయ సంఘం లో సభ్యులు ఔతారు. ఇది మీరు చెప్పిన కామన్ అజెండా కు బాధ్యత వహిస్తుంది.కామన్ అజెండాలో మార్పులు యెప్పుడో ఒకసారి అవసర మవుతాయి.ఆ అవసరం వొచ్చినప్పుడు సమావేశమయితే సరిపోతుంది. ఒక శాశ్వత అధ్యక్షుడు కూడా ఉండాల్సిన పని లేదు.ఒకోసారి ఒకరు, అంటే అప్పుడు సమావేశానికి ప్రతిపాదించబడిన విషయానికి యెవరు చొరవగా ముందుకొస్తే ఆ వ్యక్తి అప్పటి సమావేశానికి అద్యక్షత వహిస్తాడు.

      ఇదే సంఘం మిగులు రెవెన్యూ వ్యవహారాల్ని కూడా చూడవచ్చు అవన్నె యెలాగూ -request/accept/remittance/clearence - లాంటి office staff చేసే documentation work ద్వారా జరిగే వ్యవహారాలే కదా. ఈ ఇంటెగ్రేషన్ కౌన్సిల్ రాష్ట్ర రాజధానిలో ఉంటుంది.

      కామన్ అజెండా మీటింగులూ, రెవెన్యూ పంపకాలకి సంబంధించిన పేపర్ వర్కూ తప్ప అక్కడ పైరవీ కారుల్కీ లాబీయిష్టులకీ గిట్టుబాటయ్యే వ్యవహారాలేమీ ఉండవు.క్షేత్ర స్థాయిలో జరిగే వ్యవహారాలన్నీ ప్రజలకి దగ్గిరగానే జరుగుతాయి కదా!

      ఇదెలా ఉంది?

      Delete
    7. Let policy formulation & standards setting is with the state (with inputs from ZP & MP). Implementation can be with the third tier.

      Delete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
  3. పార్లమెంటు సభ్యులు లోక్ సభ సమావేశాలు జరగనప్పుడు ఖాళీగానే ఉంటున్నారుగా.దానికి బదులు పూర్తి కాలం రాష్ట్రం మొత్తానికి సంబంధించిన ఈ సమన్వయ సంఘం కార్య కలాపాలు ఉంటాయి.

    ReplyDelete
  4. జై గారూ, నాకు సాంకేతిక విషయాల్లో పరిజ్ఞానం తక్క్కువ. రెవెన్యూ ఫ్లోకి సంబంధినవి కరక్టేనా? యెందుకంటే పత్రికల్లో చదివిన వార్తల ఆధారంగానే కూర్చాను. అప్పటి స్థానిక సంస్థలకి స్వయం ప్రతిపత్తి గురించి గూగుల్లో చూసినా సెర్చ్ కీవర్డ్ ఫయిలయింది.పనికొచ్చే సమాచారం దొరకలేదు.

    ReplyDelete
    Replies
    1. ఆదాయం (నిజానికి receipts) భౌగోళికంగానే ఉంటుంది. ఎ పన్ను అయినా, ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ కట్టాలి. ఎ అప్పు అయినా అంతే. ఖర్చులు (నిజానికి outflows) కూడా చాలావరకు అలానే ఉంటాయి.

      రెండు లేదా ఎక్కువ ప్రాంతాలకు సంబందించిన విషయాల పంపిణీకి సరి అయిన appropriation method ఎంచుకోవడం కష్టమేమీ కాదు. ఉ. పదో తరగతి బోర్డు ఖర్చులను ఆయా ప్రాంతాలలో పరీక్ష రాసిన విద్యార్థుల నిష్పత్తిలో పంచవచ్చు.

      అయితే దీంట్లో రెండు లొసగులు ఉన్నాయి.

      1. ప్రస్తుతం ఉన్న భౌగోళిక పరిధులకు, మీరు కోరుకున్న జిల్లాలకు అక్కడ అక్కడ వ్యత్యాసం ఉండవచ్చు. ఉ. ఒక బస్ డిపో/ఎక్సైజ్ రేంజి పరిధి ఒకే జిల్లాకు పరిమితం కాకపోవచ్చు. వీటిని పంచడం చాలా కష్టతరం అయ్యే అవకాశాలు మెండు.

      2. మన గణాంకాలు తప్పుల తడకలతో నిండి ఉన్నాయి. లెక్కలలో correlation కానీ consistency కానీ ఉన్నట్టు దాఖలాలు లేవు. ఆదాయ వ్యయాలు తప్ప ఇతర ఎ గణాంకాన్ని గుడ్డిగా నమ్మలేము. ఉ. సాగునీటి గురించి మూడు శాఖల లెక్కలలో పొత్తూ పొందికా లేదు. అలాగే కాలువ వ్యవసాయం విస్తీర్ణానికి నీటి చార్జీల వసూళ్లతో కానీ, భూమి శిస్తు అంచనాలతో కానీ సరిపోదు.

      Delete
  5. చక్కటి విశ్లేషణ..కాని ఆచరణలో పెట్టే విజ్ఞులైన నాయకుల లోపం..

    ReplyDelete
    Replies
    1. ఒక సమగ్రమయిన ఆకారానికి ఈ ప్రతిపాదనలు వస్తే నేను చొరవ గా యే నాయకుడినైనా కదిలించే ఉద్దేశం ఉంది.

      Delete
    2. మీరు ఒక్కరే కాక మీలా ఆలోచించే వారితో కలిసి ఒక think tank ఏర్పాటు చేయండి. అలా చేస్తే మీ ప్రతిపాదనకు visibility పెరుగుతుంది.

      Delete
  6. నాయకులను నమ్ముకుంటే లాభం ఉంటుందాండీ? వారికే గనక చిత్తశుద్ధి ఉంటె ఇలాంటి (లేదా ఇంతకంటే మెరుగు) ఐడియాలు వారే తెచ్చేవారు.

    విప్లవాత్మకయిన మార్పులు జరగాలంటే పరిస్తితులు అందుకు అనుగుణంగా ఉండాలి. అప్పుడే ప్రజలలో బలమయిన మార్పులను స్వాగతించే (కనీసం అంగీకరించే) మనస్తత్వం వస్తుంది.

    ReplyDelete
  7. హరిబాబు గారు,
    రెండంచెల వ్యవస్ద మీద మీ విశ్లేషణ చాలా బాగుంది.
    మీరు చెప్పిన రెండంచెల వ్యవస్ద సిద్దాంతం బాగానే ఉంటుంది. అయితే పం.రాజ్ లో మూడంచెల వ్యవస్ద ఏర్పాటు చేసినపుడే రెండంచెల వ్యవస్ద యొక్క సాధ్యసాధ్యాల గురించి కూడా అలోచించారు అప్పటి మేధావులు. ఆయితే మూడంచెల వ్యవస్దనే అమలులో ఎందుకు తెచ్చారన్నది కూడా మనం గమనించాలి..
    ఖచ్చితమైన అచరణలో పెట్టగలిగినపుడు మీరు చెప్పిన రెండంచెల వ్యవస్దని మించినది లేదు. కానీ మీరు చెప్పిన విధంగా జిల్లా ప్రజా పరిషత్ వ్యవస్ద పరిపాలనను చేయగలదా లేదా అన్నది మనం అంచనా వేయగలగాలి.
    నేను జిల్లాప్రజాపరిషత్ లో పన్నెండు సం.రాలుగా పనిచేసిన అనుభవం మీద నా జిల్లాలోని అనుభవాలను ఇక్కడ అభిప్రాయాలుగా చెబుతున్నాను. అనవసరమే కానీ దాని కన్నా ముందు నా గురించి చెప్పాలి. నా ఉద్యోగ జీవితంలో ఇప్పటి వరకు ఒక్క రూపాయి అవినీతి/లంచంగా పుచ్చుకోలేదు/పుచ్చుకోను కూడా.. ఎందుకంటే వ్యవస్దలోని లోపాలు గురించి నేను మాట్లాడేటప్పుడు, ఆ అర్హత నాకుందా లేదా అన్నది కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అందుకే ముందుగా నా గురించి చెప్పుకోవలసి వచ్చింది.
    దాని వలన నేను ఆనందంగా బ్రతుకుతున్నాను. నేను ఖర్చు చేసే ప్రతి రూపాయి నా కష్టార్దితమే అన్న సంతృప్తి నాకు అన్ని వేళలా ఉంటుంది...
    ఇప్పుడున్న రాజకీయ నాయకుల ప్రమాణాల ప్రకారం జిల్లాప్రజాపరిషత్ ను పరిపాలనా వ్యవస్దగా చేయడం సక్సెస్ కాదు. ఎందుకంటే
    1. జి.ప.ప్రాదేశిక సభ్యులు, చైర్మన్ తదితరులు ఆ స్దాయి ప్రమాణాలు గలవారు ఎన్నికవడం జరగడం లేదు. నేను ఇప్పటి వరకు రెండు జి.ప. బోర్డులను దగ్గర నుండి పరిశీలించాను. అందులో సగానికి పైగా ఎన్నికయ్యే సభ్యులు సాధారణ పరిజ్ణానం కల్గినవారే ఉంటున్నారు. అలాంటి వారి చేతిలో ఎంతో ముఖ్యమైన చట్టాలు రూపొందించగలగడం లేదా పరిపాలన సంబంధిత వ్యవహరములు చర్చించగలగడం అన్న విషయాలను ఊహించలేము.
    2. ఈ రోజుల్లో చాలా మంది చదవు ఒంటబట్టని వాళ్ళు, నిరుద్యోగులుగా మారిపోయిన వాళ్ళు రాజకీయాల్లోకి వస్తున్నారు. అలాంటి వారితోనే చాలా మటుకు MPTC/ZPTC/MPP స్దానాలు Fill అవుతున్నాయి.
    3. వీరిలో చాలా మంది సాధారణంగా మధ్యతరగతి లేదా ఆ క్రింది స్దాయి వారే ఉంటారు. వీరికి వేరే జీవనోపాధి ఉండదు. దానితో వారి సంపాదనకు వారి పదవిని ఉపయెగించుకుంటున్నారు.
    4. జి.ప్ర.ప.నకు అవసరమయ్యే సి.ఇ.ఒ./ఉప ము.కా.ని.అధికారి/లెక్కల అధికారి వంటి అధికారులు పై అధికారుల వద్ద పైరవీలు పొంది సుమారు ఇరవై లక్షలను ముడుపులుగా చెల్లించి జిల్లాలకు వస్తున్నారు. అలాంటి వారు అంతకి అంత సంపాదించకుండా ఉండగలరా? వారి ధనదాహం మూలంగా మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో.
    5. జి.ప్ర.ప.బోర్డులకు ఎటువంటి అధికారములు, నిధులు ఇవ్వకుండానే జరుగుతున్న అవినీతి చూస్తే రెండంచెల వ్యవస్దకి ఎవరూ మద్దతు పలకబోరనే అనుకుంటున్నాను.
    6. గతములో ఉన్న జి.ప్ర.ప. బోర్డు పరిపాలనలో సుమారు ఇరవై కోట్లకు పైగా అక్రమ లావాదేవిలు జరిగినట్లుగా విజిలెన్స్ అండ్ ఎన్ పోర్స్ మెంటు విభాగము వారు గుర్తించారు. ఒక చిన్న నీటి కుంట లాంటి ఇప్పటి జి.ప్ర.ప.లేనే ఇంతటి అవినీతి రాజ్యమేలుతుంటే సముద్రం లాంటి అర్దిక వ్యవస్ద ని జి.ప్ర.ప.బోర్డులకు అప్పగిస్తే పరిస్దితి ఎలా ఉంటుందో ఊహించగలమా?
    7. ఇంకా ముఖ్యమైన విషయం, ప్రస్తుత జి.ప్ర.ప.లల్లో సమర్దవంతమైన అధికారులు తయారుకావడం లేదు. పని సమర్దత సీనియర్ అధికారుల నుండి జూనియర్ అధికారులకు బదలాయింపు జరగడం లేదు. దానితో నైపుణ్యత కొరవడుతుంది.
    అందుకని నా ఉద్దేశం ప్రకారం ఆ వ్యవస్ద అచరణ సాధ్యం కాదని చెప్పగలను...
    అచరణ సాధ్యం కావాలంటే దానికి పలు రకాల చట్ట రక్షణలు కల్పించాలి. బోర్డులోకి కేవలం విద్యావంతులు మాత్రమే వచ్చేలా చర్యలు తీసుకోవాలి. అవినీతి అధికారులు, నేతలు రాకుండా చూసుకోవాలి. మనకి కాగితాల మీద, బ్లాగుల్లోని ఆదర్శాలు గురించి మంచి పరిపాలనా వ్యవస్దల గురించి మాట్లాడుకోవడానికి చాలా బాగుంటుంది.. ఆయితే అవి ఎంత మాత్రం అచరణ సాధ్యమయ్యే పరిస్దితులు ప్రజలు/నేతలు/అధికారుల్లో కాని విసమెత్తు కూడా లేవని చెప్పగలను.

    ReplyDelete
  8. your experiences are real. so, I need to study all these things as case study.But one thing is sure, why that system left behind like that is It was used by them as providing shelter to the imbeciles without real powers.

    అర్హత లేనివారికి రాజకీయ పునరావాస కేంద్రాలుగా చేయటం అనేది వాటికి నిజమయిన అధికారాలు లేకపోవటం వల్లనే అని నా ఉద్దేశం

    >>అచరణ సాధ్యం కావాలంటే దానికి పలు రకాల చట్ట రక్షణలు కల్పించాలి.

    నేను వూహిస్తున్నదీ ఇదే.దాన్ని అన్ని రక్షణలతోనే మనం ప్రజోపయోగకరమయిన వ్యవస్థగా రూపొందించగలం.యెందుకు నేను ఇంతగా దాన్ని సమర్ధిస్తున్నా ననేది అయిదవ భాగంలో రాస్తున్నాను.మీరు చెప్పిన లోపాల్ని సరి చేసి సరయిన విధంగా ఆచరన లోకి తీసుకొస్తే అది భవిష్యతులో మరో రెండు విష్యాల్లో యెలా ఉపయోగ పడగలదనేది అందులో వివరిస్తున్నాను.

    మీ అనుభవాలను వివరిస్తూ ఒక మంచి అభిప్రాయాని వ్యక్తీకరించినందుకు ధాంక్స్
    .

    ReplyDelete
    Replies
    1. హరిబాబు గారూ, ఇక్కడ రెండు పరస్పరభిన్న కోణాలు ఉన్నట్టుగా అనిపిస్తుంది. ప్రజాస్వామ్య స్పూర్తి ప్రకారం పదవులకు ఎన్నిక అవడానికి అర్హతలు పెట్టలేము. అదే సమయంలో పరిజ్ఞానం లేని వారు గెలుస్తే పాలనావ్యవస్త కుంటూ పడుతుందనే రాజీవ్ గారి వ్యాఖ్యను కొట్టిపడేయలేము.

      నిజమయిన అధికారాలు లేనందుకే ఇలా జరిగిందని మీరు అన్న మాటను పూర్తిగా ఒప్పుకోలేక పోతున్నాను. నిజానికి అధికారం పెరిగితే ఇంకెంత అవినీతి జరుగుతుందో అన్న రాజీవ్ గారి భయం కొంతమేరకు నిజమే. అంతేకాక గ్రామీణ వాతావరణంలో విషయ పరిజ్ఞానం తెలిసిన నిష్ణాతులు దొరకడం కష్టం.

      ఈ చిక్కుముడి విప్పడం కష్టమే కానీ అసంభవం కాదని నా అభిప్రాయం. ఇంతకముందు పేర్కొన్నట్టు, ప్రణాలికలను రూపొందించాలంటే కావాల్సిన పరిజ్ఞానం వాటిని అమలు పరచడానికి అవసరం లేదు. కొంత దక్షత, నిజాయితీ & కలుపుగోలుతనం ఉంటె చాలు. ప్రాధమిక విద్యను పటిష్టం చేసి, వృత్తివిద్యలకు ప్రాముఖ్యత పెంచితే కావాల్సిన తర్ఫీదు దొరుకుతుంది.

      Division of work:

      Tier 2: policy framework only
      Tier 3: implementation only

      Delete
    2. జై గారు,
      అవునండీ... నా ఉద్దేశం ప్రకారం మన వ్యవస్దలన్నీ బాగానే తయారుచేసారు. ఆయితే వాటిని చిత్తశుద్దితో అమలు చేసే యంత్రంగమే మనకు లేదు.
      చిత్తశుద్ది అనేది ఒకరికే కాదు ప్రజలకు/అధికారులకు/నేతలకు ఉండాలి. అప్పుడే ఏ వ్యవస్ద ఆయినా విజయవంతం ఆవుతుంది...
      చిత్తశుద్ది లేనప్పుడు ఎంత గొప్ప వ్యవస్దని ఏర్పాటు చేసుకొన్నా దానిని అమలు అద్వాన్వంగా ఉంటుంది...
      అంటే నా ఉద్దేశం ఇప్పుడున్న వ్యవస్దని సక్రమంగా అమలుపరిస్తే చాలు.. మంచి ఫలితాలు రాబట్టవచ్చు అని......

      ఒక ఉదాహరణ
      మా ఏరియాలో ఒక ప్రముఖ విద్యాసంస్దల అధినేత కుమారుడు విద్యావంతుల కోటా నుండి ఎమ్.ఎల్.సి.కి పోటి చేసారు.. ఆయిన గెలవడం కోసం వాచీలు, సెల్ ఫోన్స్ వగైరాలను పంచిపెట్టారు. విద్యావంతుల కోటా కాబట్టి ఇక్కడ ఓటర్లుగా గాడ్యుయేట్స్ యే ఉంటారు కదా.... మరి వారందరికి అలా పుచ్చుకోవడం తప్పు అని తెలీదా? కానీ పుచ్చుకున్నారు.. ఎందుకు... తీసుకుంటే తప్పేమిటి అన్న ధోరణి....
      ఇప్పుడు చెప్పండి.. మన విద్యావంతులే ఇలాంటి ధోరణిలో ఉన్నప్పుడు మిగతా వ్యవస్దలు సక్రమంగా ఎలా పనిచేయగలమని అనుకుంటాము....

      కాబట్టి ప్రజలు/అధికారులు/నేతలులో మార్పు తీసుకురాకుండా ఎన్ని మంచి ప్రాజెక్టులను తీసుకోవచ్చినా ఫలితం ఉండదు....

      Delete
    3. నేను మీతో ఏకీభవించలేను. ఒక వ్యవస్థ సక్రమంగా నడవాలంటే అందరికీ చిత్తశుద్ధి ఉండాలని షరతులు పెట్టడం సమంజసం కాదు. క్షేత్రస్తాయి వాస్తవాలను విస్మరించి ఆకాశంలో కట్టిన సౌధాలు నిలవవు, నిలవలేవు.

      ఒక వ్యవస్థ సరిగ్గా నడవడానికి కావాల్సిన విషయాలు ఆ వ్యవస్తలోనే అంతర్లీనమై ఉండాలి. The system must have built-in incentives (mostly positive) for ensuring its success.

      Delete
    4. యే వ్యవస్థా దానంతటది పుట్టుకు రాదు కదా!ఒక వ్యక్తి కానీ కొందరు వ్యక్తులు కానీ ఆలోచించి ప్రతిపాదిస్తేనే వస్తుంది. ఆ వ్యక్తులు అంచి వళ్లయీతె వారు ప్రతిపాదించి తయారు చేసిన వ్యవస్థ లో మంచి సాంప్రదాయాల్ని అంతర్లీనంగా ఉంచగలుగుతారు.యెంత మంచి సాంప్రదాయాల్ని అంతర్లీనంగ ఉంచినా విశాల ప్రజా ప్రయోజనాలకి గండి కొట్తేసి స్వార్ధానికి వాడుకునే వాళ్ళు అందులోంచే వస్తున్నారు. ఇదే అసలయిన సమస్య.కాబట్టి సర్వోత్తమమయిన దాన్ని యెప్పటికీ తయారు చెయ్యలేమా?

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...