Showing posts with label సినిమాల సరదాలు. Show all posts
Showing posts with label సినిమాల సరదాలు. Show all posts

Saturday, 28 November 2015

మల్లీశ్వరి గొప్పదా?పాతాళ భైరవి గొప్పదా?

     మల్లీశ్వరి అనే సినిమా తియ్యకపోయి ఉంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి అనే కవి కొందరికి మాత్రమే తెలిసి ఉండేవాడు!"వూర్వశి","కృష్ణ పక్షం" లాంటివి చదువు రానివాళ్ళకి యెలా తెలుస్తాయి?అవి చదవగలిగిన వాళ్ళు కూడా మల్లీశ్వరి తియ్యకపోయి ఉంటే కాళిదాసు మేఘసందేశంతో పోల్చదగిన "ఓ మేఘమాలా" పాటని యెట్లా ఆస్వాదించేవాళ్ళు?!
     కధ చాలా చిన్నది.నాగరాజు,మల్లీశ్వరి వరసైన వాళ్ళు.నాగరాజు శిల్పవిద్య నేర్చుకుంటున్నాడు.ఒకసారి తిరునాళ్ళకి వెళ్ళి తిరిగి వస్తూ మధ్యదారిలో వర్షం మూలంగా ఒక గుడిలో ఆగుతారు.అప్పటికే అక్కడ ఇద్దరు పెద్దమనుషులు ఉంటారు.మల్లీశ్వరి చేసిన నాట్యం చూసి యేదైనా వరం కోరుకోమంటే నాగరాజు వీళ్ళేమిటి రాజులకి మల్లే పోజులు కొడుతున్నారు అనిపించి రాణీవాసం పల్లకీ పంపించండి అని ఆటపట్టింపుగా అంటాడు.మల్లీశ్వరి కూడా అదే వరసలో రెచ్చిపోతుంది.వర్షం తగ్గి ఇంటికెళ్ళే దారిలోనే నవ్వుకుని అక్కడితో వాళ్ళని వీళ్ళు మర్చిపోయినా వాళ్ళు మర్చిపోలేదు.పైగా అది నిజమైన కోరికే అనుకున్నారు - ఇంతకీ వాళ్ళు మారువేషంలో రాజ్యమంతటా తిరుగుతున్న శ్రీకృష్ణదేవరాయలూ ధూర్జటీ!ఇంటికెళ్ళిన తర్వాత కధ మలుపు తిరుగుతుంది.మల్లీశ్వరి తల్లికి నాగరాజు అంటే చిన్నచూపు ఉందని తెలియడంతో అత్త కళ్ళు భ్రమసేటంత ధనం సంపాదించుకు వస్తానని పంతం పట్టి వూరు వదిలి పోతాడు నాగరాజు!రాయలవారు పల్లకీ పంపించగా మల్లీశ్వరి రాణివాసం చేరుతుంది.వూరు వదలి వెళ్ళిన నాగరాజు అదృష్తవశాత్తూ తిమ్మరుసు అనుగ్రహానికి పాత్రుడై పనతం నెరవేర్చుకుని తిరిగి వస్తే ఈ కబురు తెలుస్తుంది.యెలాగైనా మల్లీశ్వరిని కలవాలని దొంగతనంగా వెళ్ళటం వల్ల అంతఃపురంలో పట్టుబడతాడు.మల్లీశ్వరి కోసం వచ్చాడని తెలిసి ఇద్దర్నీ ఖైదు చేస్తారు,కానీ సభలో విచారణ జరుగుతున్నప్పుడు రాయలవారు తాము మారువేషాల్లో ఉండటం వల్ల గుర్తుపట్టలేక తమాషాకి అన్నారని తెలుసుకుని వొదిలెయ్యటంతో కధ సుఖాంతమవుతుంది.కధకి ఒక ప్రముఖ పత్రికలో పడిన చిన్న కధ ఆధారమని చెప్తారు,కానీ కధ కన్నా సంభాషణల్లోని చమత్కారమూ,పాటల్లోని కవిత్వమూ ఒకదానితో మరొకటి పోటీ పడటం వల్లనే అజరామరమైన దృశ్యకావ్యంగా నిలిచింది."వెళ్ళు వెళ్ళు,కలకండ భక్తురాలు!" ,"ఇల్లల్లా కొడితే తట్టెడు మట్టయినా రాలదు,ఏం చూసి పిల్లనిస్తారూ?" లాంటి పదశయ్యా "నల్లని మబ్బులు గుంపులు గుంపులు,తెల్లని కొంగలు బారులు బారులు","పిలచినా బిగువటరా","భళిరా యెక్కడినుండి జారెనీ మెరుపుతీగ" లాంటి స్వరధునీ సాటిలేనివే!

     ఇక,పాతాళ భైరవి మాయలూ మంత్రాలతో నిండిన ఒక  కట్టుకధ!నమ్మడానికి వీల్లేని విషయాల్ని నమ్మేటట్టు చేసే చాతుర్యం తప్ప ఇందులో కధ కూడా చిన్నదే!కధలో గానీ ఇతర అంశాల్లో గానీ పోల్చడానికి వీల్లేని రెండు సినిమాల్లో ఏది గొప్పది అంటే తేల్చడం కష్టమే,కానీ నా వోటు మాత్రం పాతాళ భైరవికే!
     ఎందుకంటే ఒక పిల్లదీ కుర్రాడూ ప్రేమించుకుని,విడిపోయి,కల్స్కోవటం అదే లైనులో ఉన్నవాళ్ళకీ భావుకత యెక్కువగా ఉన్నవాళ్ళకీ తప్ప మిగిలిన వాళ్ళకి కనెక్ట్ అవదు.అదే తోటరాముడు చూదండి - జత్గాడితో కలిసి అల్లరి చేస్తాడు, చాదసతపు తల్లిని ఆటపట్టిస్తాడు,రాజుగారి బామ్మర్దిని కూడా ముందూ వెనకా చూదకుండా పంబ రేగ్గొడతాడు,నచ్చిన ఆడపిల్ల ఉజ్జయిని రాకుమారై అయినా సరే పెళ్ళాడి తీరతానంటాడు.సమాజం కోసం కప్పుకున్న పరదాలు తీసేస్తే ప్రతివాడికీ ఉండే సరదాలు  ఉన్నవాడు యెవడికి నచ్చడు?తోటరాముడు ఆది సాహసి,నేపాళ మాంత్రికుడు కలవకపోయినా ఉజ్జయిని రాకుమారిని పెళ్ళాడగలిగిన సాహసం వాడిలో ఉంది!అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోవాలని కలలు గనే ప్రతి ఒక్కరూ తోటరాముడిలో తమనే చూసుకుంటారు,చివరికి తోటరాముడికి జరిగినట్టే తను కోరుకున్నది తనకూ దక్కుతుందనే నమ్మకం కలుగుతుంది.ఒక కళారూపం వల్ల ప్రయోజనం ఉండాలంటే అది యెక్కువమందికి చేరువ కావడం ముఖ్యం - ఆ లక్షణం మల్లీశ్వరి కన్నా పాతాళ భైరవి లోనే ఎక్కువగా ఉంది.

     ఒకానొకప్పుడు నటుల్నీ విటుల్నీ ఒక్కటిగా చూసి పంక్తిబాహ్యుల్ని చేసేశారు.ఇప్పుడు సినిమాల్లో హీరో వేషాలు వేసే నటుల్ని దేవుళ్ళ లెక్కన చూసి వాళ్ళు తెరమీద యేం తింటే ఇంట్లో తమూ అదే తినాలనీ వాళ్ళు తెరమీద యే డ్రస్సు తొడిగితే తామూ అదే డ్రస్సు తొడగాలనీ డైలాగు రైటర్లు రాసిచ్చిన పంచ్ డైలాగులు తమ హీరోనే స్వయంగా చెప్తున్నాడనీ తాము కూడా ఆ మాదిరి ఫైట్లు చేసేసి అమ్మాయిలతో ఆ మాదిరి రొమాన్సు చెయ్యాలనుకునీ  పిచ్చెక్కిపోతున్నారు.కానీ ఆ నటులు హీరోల్లా కనపడటానికి హంగులు సమకూరుస్తున్న నిర్మాత,దర్శకుడు,కధాసంభాషణాదిగీతరచయితలు,నృత్యదర్శకులు,ఫొటోగ్రాఫర్లు లాంటి సాంకేతిక నిపుణులు మాత్రం ఇంకా నస్మరంతి గాళ్ళలాగే మిగిలిపోతున్నారు.దేవులపల్లి కృష్ణశాస్త్రిని మహాకవి అని నిస్సందేహంగా అనగలిగిన వాళ్ళు పింగళి నాగేంద్ర రావుని అనటానికి సందేహిస్తున్నారు, యెందుకు?కేవలం ఆయన సినిమాల ద్వారా పరిచయం కావడమే తప్ప మహాకవి అని పిలవడానికి కావలసిన అన్ని అర్హతలూ ఉన్నాయి!యెన్ని పదబంధాల్ని సృష్టించాడు?యెంత తాత్వికతని ఒలికించాడు?ఆజన్మ బ్రహ్మచారి అయి ఉండి ప్రేయసీ ప్రియుల మనసులో కదలాడే సుకుమారమైన భావాల్ని కూడా పట్టుకోవటానికి ఆత్మ యే స్థాయిలో కదలాలి?!
     నాగేంద్రరావు 1901 డిసెంబర్ 29 న శ్రీకాకుళం జిల్లా, బొబ్బిలి దగ్గర ఉన్న రాజాంలో జన్మించాడు. ఆయన తండ్రి గోపాల క్రిష్ణయ్య యార్లగడ్డ గ్రామానికి కరణంగా ఉంటూ నాగేంద్రరావు జననానికి పూర్వమే కరణీకాన్ని వదులుకుని విశాఖలో ఉన్న ఆయన తమ్ముళ్ల దగ్గరికి వచ్చేశారు. నాగేంద్రరావు పినతండ్రులలో ఒకరు డిప్యూటీ కలెక్టర్ మరొకరు ప్లీడర్. నాగేంద్రరావు అన్న శ్రీరాములు 1913 లోనే భారతదేశాన్ని వదిలి 1926 నుంచి ఆస్ట్రేలియాలో పంచదార ఎగుమతి వ్యాపారం చేస్తూ ఉండేవాడు. పింగళికి రెండేళ్ళ వయసులో ఆయన కుటుంబం బందరుకు వలస వెళ్లింది.నాగేంద్రరావు తల్లి మహాలక్ష్మమ్మది దివి తాలూకా. ఆయన చిన్నతనం నుంచీ కృష్ణా జిల్లాలోనే ఉంటూ ఆంధ్ర జాతీయ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. కోపల్లె హనుమంతరావు ప్రభృతులు స్థాపించిన ఈ కళాశాలలో తొలి విద్యార్థుల బృందంలో నాగేంద్రరావు ఒకడు. మంగినపూడి పురుషోత్తమ శర్మ అనే సుప్రసిద్ధ కవీ, మాధవపెద్ది వెంకట్రామయ్య అనే ప్రఖ్యాత స్టేజీ నటుడు ఆయనతో పాటు చదువుకున్న వాళ్ళే. ఆంధ్రకంతటికీ గర్వకారణంగా వెలసిన ఆంధ్ర జాతీయ కళాశాల యొక్క తొలి విద్యార్థులలో ఒకడైన కారణం చేత కోపల్లె హనుమంతరావు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావు మొదలైన వారి పరిచయం లభించింది.

     సాహిత్యసృజనలో యేమాత్రం ప్రతిభ లేకుండా,లోకవృత్తపరిశీలన చెయ్యకుండా చలనచిత్ర రంగానికి వచ్చి ఉంటే "ఆడువారి మాటలకూ అర్ధాలె వేరులే","రాగములో అనురాగములో చిందిన","లాహిరి లాహిరి లాహిరిలో ఈ జగమే వూగెనుగా","ఔరౌర గారెలల్ల,అయ్యారె బూరెలిల్ల" లాంటి అత్యధ్భుతమైన పదబంధాల్ని సృష్టించడం సాధ్యమయ్యేదేనా?కృష్ణాజిల్లా లోని ఆంధ్ర జాతీయ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు.కోపల్లె హనుమంతరావు ప్రభృతులు స్థాపించిన ఆంధ్రుల కందరికీ గర్వకారణంగా వెలసిన ఆంధ్ర జాతీఊ కళాశాల యొక్క తొలి విద్యార్ధులలో ఒకడైన కారణం చేత ఆనాటికి ప్రముఖులైన కోపల్లె హనుమంతరావు,భోగరాజు పట్టాభి సీతారామయ్య,మట్నూరి కృష్నారావు మొదలైన వారి పరిచయం లభించింది.1918లో చదువు పొర్తి చేసి ఖర్గపూరులోని రైల్వే వర్కుషాపులో అప్రెంటిస్ పని కొంత కాలం చేసి ఆరొగ్యపరమయిన ఇబ్బందుల వల్ల ఆఫీసుపనిలోకి మారాడు.ప్రసిధ్ధ వ్యాయామవేత్త హరిరామజోగారావుగారి ఉత్తేజభరితమైన జాతీయోద్యమ ప్రసంగాలకి ప్రభావితుడై 1920లో ఉద్యోగానికి రాజీనామా చేసి ఉత్తరదేస యాత్రకి శ్రీకారం చుట్టాడు.ఖర్గపూరులో ఉన్నప్పుడే దివ్యజ్~ఞానసమాజంలో సభ్యుడుగా నంపెదు అయ్యాడు.అలా యెక్కడికెళితే అకక్డ దివ్యజ్ఞానసమాజం వారి ఆశ్రమాల్లో బసచేస్తూ ఉతరదేశంలో చాలాభాగం పర్యటించి సబర్మతి చేరుకున్నాడు.స్వభావ్తః బ్రహ్మచారి,ప్రవృత్తి రీత్యా సన్యాసి అయినప్పటికీ సన్యాసం ఇవ్వకుండా పదిహేను రోజుల తర్వాత ఇతను ఆశ్రమవాసిగా కన్నా కాంగ్రెసు సంస్థలో చేరితే దేఅససేవ చేయగలుగుతాదని నిర్ణయించారు!

     దీనికి సానుకూల పడేటందుకు కాకా కలేల్కర్ గారు అప్పటి కృష్ణాజిల్లా కాంగ్రెసు అధ్యక్షులు ధన్వాడ హనుమంతరావు గారికి పరిచయపత్రం రాసి ఇవ్వడంతో నాగేద్రరావుకు కాంగ్రెసు ఆర్గనైజరు వుద్యోగం జీతభత్యాలతో సహా లభించింది.ఈ వుద్యోహ్గంలో ఉండగానే కొన్ని దేశబహ్క్తి గీతాల్ని "జన్మభూమి" పేరుతో పుస్తకంగా ప్రచురించాడు.దీనికి గాను అరెస్టయి కూడా జిల్లా కలెక్తరు కేవలం మందలిచి వదిలేశాడు.తర్వాత మళ్ళీ పట్టాభి సీతారామయ్య గారు ఆర్ధికస్థోమత ఉన్నవాళ్ళే కాంగ్రెసుకి ఎక్కువ సేవ చెయ్యగలరు కానీ బతుకుదెరువు కోసం కాంగ్రెసు మీద ఆధారపడిన వాళ్ళు పార్టీకి భారం అవుతారనే సూచన నచ్చడం వల్ల ఆ ఉద్యోగాన్ని వదిలేసి పత్రికారంగంలోకి ప్రవేశించాడు.సరిగ్గ్గా ఇదే సమయంలో బందరులో కౌతా శ్రీరామశాస్త్రి మోడ్రన్ రివ్యూ,ప్రవాసి వంటి పత్రికల స్థాయిలో తెలుగులో కూడా ఒక పత్రిక తేవాలని అనుకుంటుంటే పట్టాభి గారు నాగేంద్రరావుని సిఫార్సు చేశారు.1923లో శారద అనే పేరుతో మొదలైన ఈ పత్రిక 1924లో నిలిచిపోయేవరకొ శ్రీరామశాస్త్రికి సహాయంగా ఉంటూ తనవంతు సాయం తనూ చేశాడు.ఈ కాలం నాటి నాటక రచనలనూ సాహిత్యసృజననూ పింగళీయం అనే పేరుతో చేశాడు.

     నాగేంద్రరావుకు చిన్నతనం నుంచీ రచనలో ప్రవేశం ఉంది,ముఖ్యంగా నాతక రచన అనతనికి చాలా ఇష్తమైనది.దానితో శారదలో పనిచేసే రోజులోనే ద్విజేంద్రరాయ్ బెంగాళీ నాటకాలు "మేవాడ్ పతన్" పాషాణీ తర్జుమా చేస్తే కృష్ణా పత్రికలో ప్రచురించారు.తన సొంత రచనలైన నాటకాలు "జేబున్నీసా","వింధ్యరాణి" కృష్ణాపత్రికలో ధారావహికలు గానూ "నా రాజు" భారతిలోనూ పరచ్రించబడినాయి."జేబున్నీసా" నాటకాన్ని ప్రదర్శించకుండా ఆపటానికి మహమ్మదీయులు ఉద్యమాలు చేస్తుండేసరికి హిందూ-ముస్లిం ఘర్షణలకు దారితీస్తుందనే ఉద్దేశంతో 1923లో మద్రాసు ప్రభుత్వం ఈ నాటకాన్ని నిషేధించింది.అకారణంగా శారద నిలిచిపోగానే అప్పటికి నాతకరంగంలో లబ్ధప్రతిష్టుదైన డి.వి.సుబ్బారావు గారి ఇండియన్ డ్రమెటిక్ కంపెనీలో సెక్రెటరీ ఉద్యోగం దొరికింది!1946 వర్కూ అక్కడే వుండి నాతకరచన లోని మెళకువలనూ,ప్రేక్షకుల అభిరుచులలోని వైవిధ్యాల్ని పసిగట్టే నేర్పునూ - ముఖ్యంగా చెప్పాల్సిన భావాన్ని రూపం మార్చి అయినా సరే ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా పోతూనే యెట్లా యెక్కించాలి అనేది ఇక్కడే నేర్చుకున్నాడు,సినీ రచనలో ఇతని ప్రత్యేకత కూడా అదే కదా!అంతటి ప్రతిభాశాలి గనకనే నేపాళ మాంత్రికుడి చేత కళాకారు లందరికీ వర్తించే "జనం కోరింది మనం శాయడమా?మనం చేసింది జనం చూడడమా!" అనే సందేహాన్ని బయటపెట్టించాడు?!

     అక్కడ సందర్భానికి అది ఒక గారడీ వాడు తను చెయ్యాలనుకుంటున్న ట్రిక్కిలకి శిష్యుణ్ణీ కొంటెగా అడిగిన అతి మామూలు తింగరి ప్రశ్నలా అనిపిస్తుంది గానీ ఒకానొక ప్రముఖ సాహితీ విమర్శకుడు అది రచయిత,గాయకుడు,చిత్రకారుడు,నటుడు,శిల్పి అనే భెదం లేకుండా ప్రతి కళాకారుడి ముందూ తన జీవితకాలంలో యేదో ఒక మలుపులో ఎదురయ్యే ఒక గంభీరమైన ప్రశ్నగా తీర్మానించారు!తన మనస్సులో ఉన్న భావాల్ని చెప్పి జనాన్ని తను చెప్పిన విషయం కొత్తగా ఉన్నా సరే మెచ్చుకునే విధంగా ప్రేక్షకుల్ని వశంవర్తులని చేసుకోగలొగిన స్థాయి ఉన్నవాళ్ళు రెండో పధ్ధతి యెన్నుకుంటారు!జ్ఞాధికులైన తాత్వికులకి మాత్రమే అది సాధ్యపడుతుంది గాబట్టి ఆ శక్తి లేని ఇప్పటి సినిమా రచయితల మాదిరి జనంలో ఉన్న మాయరోగాల్ని కెలికుతూ నరాల్ని ఉద్రేకపరిచే తక్కువస్త్జాయిదైన మొదటి రకంతో సరిపెట్టుకుంటారు!

     పింగళి నాగేంద్రరావు కిటుకు తెలిసినవాడు గనక్ రెంటినీ సమానంగా నడుపుకు రాగలిగాడు,అందువల్లనే "నారాజు","వింధ్యరాణి" అధ్భుతమైన విజయాన్ని సాధించాయి.వింధ్యరాణి నాటకం యెంత పేరు ప్రఖ్యాతులు సాధించిందంటే  బందరు నివాసి అయిన డాక్టర్ వి.దుర్గా నాగేశ్వరరావు ఆ నాటకాన్ని డివి.సుబ్బారావునే నాయక్య్డిగా పెట్టి సినిమా తియ్యడానికి వైజయంతి ఫిలంస్ సంస్థని స్థాపించాడు!ఈ సంస్థ స్థాపించిన కొద్ది కాలానికే ఎన్.జగన్నాధ అనె అతను వచ్చి చేరాడు.అతను ఇంతకుమునుపే "తారుమారు" అనే ఆరురీళ్ళ సినిమాని తీసి ఉన్నాడు.మరో పదివేల అడుగుల సినిమా తీసి రెంటినీ కలిపి విడుదల చెయ్యటంలో తనకి సహాయం చేస్తే బాగుంటుందనీ, ఆ చిన్న సినిమా నిర్మాణంలోని అనుభవంతో వింధ్యరాణి అనే పెద్ద సినిమా తియ్య్యవచ్చుననీ దుర్గా నాగేశ్వరరావుని ఒప్పించాడు.జగన్నాధ్ రెండో సినిమాగా తియ్యాలనుకున్నది మోలియర్ రచనకి అనువాదమయిన "భలే పెళ్ళి",ఇదే సాంకేతికంగా నాగేంద్రరావుకి సినిమా అరచయితగా మొదటి అవకాశం అయింది.అయితే ఈ సినిమా నాగేంద్రరావుని సినిమాల్లో నిలబెట్టలేదు,రెందవ ప్రపంచయుధ్ధం కమ్ముకొచ్చి మద్రాసు అంతా ఖాళీ అయిపోయిన రోజుల్లో సినిమాలు ఆడటం అసంభవమైపోయి తియ్యటం మహాకష్టం అయిపోగా మళ్ళీ నాగేంద్రరావు బందరు వెళ్ళిపోయాడు.వైజయంతి ఫిలింస్ వారు పట్టు వదలకుండా జెమిని స్టూడియో వారి సహకారంతో ఈ చిత్రాన్ని నిర్మించాలని సంకల్పించింది.దీనికి సి.పుల్లయ్య గారు దర్శక్యులు.అలా 1946loe మళ్ళీ నాగేంద్రరావు తిరిగి మద్రాసు వచ్చి సి.పుల్లయా గారి పర్యవేక్షనలో వింధ్యరాణి స్క్రిప్టు తయారు చహెశాడు.ఆ తర్వాత ఇంక 1971లో విడుదలయిన రాజకోత రహయం వరకూ మటల్లో పాటల్లో తెలుగుబాషని చిందులు తొక్కించాడు,బోడి సిన్మా కవిత్వం అనుకునే రోజుల నుంచీ సినిమా పాటల్లోనూ మహాకవులకి తీసిపోని శబ్దాలంకారం, భావాలంకారం రెంటితోనూ ఆటాడేసుకుని తెలుగుభాషనీ తన పేరులో ఉన్న నాగేంద్రుడి నాగేంద్రుడి నడకలో ఎన్ని మెలికలు ఉంటాయో అన్ని మెలికలూ తిప్పి చూపించాడు!

     1949లో విడుదలైన గునసుందరి కధ షేక్స్పియర్ కింగ్ లియర్ కధలోని మూలసూత్రాన్ని తీసుకుని ఆయ పాత్ర్లకి తెలుగుదనాన్ని అద్ది  అసలు కధ కింగ్ లియర్ వేదనతో సమాప్తమై దుఃఖాంతం కాగా అతిమానుష శక్తుల ప్రమేయంతో సుఖాంతం అయ్యింది.ఇందులోని హీరో పాత్ర పేరు దైవాధీనం!పేరుకి తగ్గట్టుగానే కంటిచూపు కూడా లేని ముసలితనంలో రాజకుమార్తెనే పెళ్ళాడేస్తాడు.దుర్మార్గులైఅన్ ఇద్దరు అకటావు=ఇకటపు తోడల్లుళ్ళ పేర్లు హరమతి,కాలమతి - పింగళివారు తప్ప ఇంకెవరయినా ఆ అపేర్లని వూహించగలరా?

195లో విడుదలైన పాతాళ భైరవి అయితే ఎప్పుడు చూసినా గొప్పగా అనిపించే కాలం తెలియని నాటి కధ!మధిర సుబ్బన్న దీక్షితులు వ్రాసిన కాశీ మజిలీ కథలులోని ఒక కథ, అల్లాఉద్దీన్ అద్భుత దీప కథ, బాల నాగమ్మ మొదలైన ప్రజాదరణ పొందిన కథల ఆధారం గా ఈ సినిమాకి కథను అల్లుకున్నారు.అప్పట్లోనే 28 కేంద్రాల్లో సతదినోత్సవం జరుపుకున్న సినిమా ఇది.నందమూరి తారక రామారావు నవయవ్వనంలో ఉండి తోటరాముడు ఇట్లాగే ఉంటాదేమో అనిపించేటట్టు కుదిరాడు!దర్సకత్వం కె.వి.రెడ్డి< నేపధ్యగానంఘంటసాల - అందరూ అతిరధ మహారధులే!మొదట్లో ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావును హీరోగా, గోవిందరాజుల సుబ్బారావును కానీ, ముక్కామలను కానీ ప్రతినాయకుడిగా పెడదామనుకున్నారు. కానీ, వాహినీ ప్రాంగణంలో ఎన్టీయార్, ఏయన్నార్ల మధ్య టెన్నీస్ ఆట చూసిన దర్శకుడు కె.వి. రెడ్డి తమ చిత్ర కథలోని నాయకపాత్రకు ఎన్టీయారే తగినవాడని ఆయనను ఎంచుకోవడం జరిగింది - మనోడు యెంటీవోడు పటకాకత్తి లాంటోడు గందా,టెన్నిసు బ్యాటుని కూడా కత్తిలా ఝళిపించేసుంటాడు మరి:-) 

"ఎంత ఘాటుప్రేమయో!" అంటూ "ఘాటు ప్రేమ" అనే ఒక కొత్త పదబంధాన్ని సృష్టించారు పింగళి వారు!"ఇతిహాసం విన్నారా!ఆది సాహసులే ఉన్నారా?" పాతలో నాకు వీరులెవ్వరొ తెల్పుడీ అన్న దేశభక్తి గీతంలోని చాలెంజి కూడా వినాబడుతుంది!"కలవరమాయె మదిలో నా మదిలో" పాటలోని పదాలన్నీ యుక్తవయస్సులో ఉన్న యువతీ యువకులలో తొలిప్రేమ నాటి కలవరాన్ని సూచించే లలితమైన పదాలతో పొదిగారు, "ప్రేమకోసమై వలలో పడెనే పాపం అపసివాడు" అంటూ చిక్కని కన్నీటినీ,గోరువెచ్చని జాలినీ కురిపించారు!"వగలోయ్ వగలు తళుకు బెళుకు వగలు" అని ఇప్పటి ఐటెం సాంగులకి తీసిపోని విధంగా మత్తెక్కించినా "తాళలేనే నే తాళలేనే" అంటూ రేలంగికి తగ్గట్టుగా హాస్యాన్ని చిందించినా వారికి వారే సాటి అన్నంతగా వీర విహారం చేశారు పింగళి ఈ సినిమాకి సంబంధించినంత వరకూ!

1954లో విడుదలైన చంద్రహారం సినిమాకి పింగళి నాగేంద్రరావు రచయితగా పనిచేశాడు.అయితే విజయా వారు పాతాళ భైరవి తర్వాత ఆ స్థాయిలో నిలిచిపోవాలనుకుని ఈ సినిమా తీసినా, అందుకు తగట్టు మంచి ప్రచారం చేయించినా, ఆంధ్ర ప్రాంతంలోని అన్ని కేంద్రాల్లోనూ సినిమాను విడుదల చేసినా అలాగే ప్రివ్యూ షోలో సినిమాను చూసిన సినీ జనమంతా పాతాళ భైరవి మించిపోతుందని అందరూ అనుకున్నా వాస్తవంలో వారి అంచనాల్ని తల్లకిందులు చహెస్తూ చిత్రం ఘోర పరాజయం పాలైంది -కొన్ని సినిమా లంతే!


     ఇక 1957లో విడుదలైన మాయాబజార్ ప్రపంచ చలనచిత్ర  చరిత్రలోనే అద్భుతం అనే మాటకి పర్యాయపదంగా నిలిచిపోయిన చిత్రరారం!ఇదే కథ తో 1936 సంవత్సరం లో శశిరేఖా పరిణయం పేరు తో ఒక చిత్రం రూపొందించబడింది. దానికి మాయాబజార్ అని మరొక పేరు. అదే పేరుని ఈ చిత్రానికి కూడా పెట్టడం జరిగింది. ఇక కథ విషయానికి వస్తే, మహాభారతం లో జరగని ఒక కల్పిత గాథ, ఈ చిత్ర కథావస్తువు. దుర్యోధనుని కుమారుడైన లక్ష్మణ కుమారుని తో వివాహం నిశ్చయమైన శశిరేఖ ను, ఘటోత్కచుడు తన మాయజాలంతో అపహరించి, తన ఆశ్రమంలో అభిమన్యుని తో వివాహం జరిపించడం, తాను మాయా శశిరేఖ అవతారం దాల్చడం, కౌరవుల ను ముప్పుతిప్పలు పెట్టడం, కృష్ణుడు వీటన్నిటికి పరోక్షంగా సహకరించడం, ఇవి ఈ చిత్రంలోని ముఖ్య ఘట్టాలు. సంగీత, సాహిత్యాల విషయానికి వస్తే, ఈ చిత్రము ఒక మహాద్భుతమని చెప్పవచ్చు.అభిమన్యుడి పెళ్ళి చుట్టూ మూడు గంటల సేపు కథ నడిస్తే పాండవులెక్కడా కనిపించకపోయినా వాళ్ళేమయారనే అనుమానమెక్కడా ప్రేక్షకులకు రాలేదంటే అది దర్శకుడు పన్నిన మాయాజాలమే!

     లక్ష్మణ కుమారుని హాస్యగానిగా చూపడం మహాభారత కథలో అతని పాత్రకు అనుగుణంగా లేదు. కాని ఇది "మాయ" బజార్ కదా?.రేలంగి పైజమా(పేంటు వంటిది) ధరించటం వింతగానే అనిపిస్తుంది. అయితే పాత్ర ఔచిత్యాన్ని గురించి మహారచయిత పింగళి నాగేంద్రరావు సమంజసనీయంగానే సమర్థించుకున్నారు. అంత పెద్ద విలన్ అయిన రారాజు కొడుకు ఇంత చీప్ గా ఉండడం ఏమిటి? అన్న విమర్శలకి పింగళి చెప్పింది ఏమిటంటే... నిజమే!రారాజు కొడుకు ఇంత అసమర్థుడిగా వెర్రివెంగళాయిలా ఉండడం కొందరికి నచ్చకపోవచ్చు. అయితే లక్ష్మణకుమారుడు నిజంగా కూడా అంత సమర్థుడేం కాదు... యుద్ధంలోకి అడుగుపెట్టీ పెట్టగానే చనిపోయాడు. భారతంలోని ఈ పాయింట్ని ఆధారంగా చేసుకుని వినోదం కోసం కొంత కల్పన చేశాను . - ఇదీ పింగళి చెప్పినది.ఏదేమైనా రేలంగి కేరక్టర్... ముఖ్యంగా దర్పం, అమాయకత్వం, బింకం, వెర్రితనం... అన్నీ కలసిన అతని సైకాలజీ న భూతో న భవిష్యతి!పింగళి రేలంగి లక్ష్మణకుమారుడి కారెక్టర్ని ఇలా డీల్ చేయడాన్ని తిరుగులేని విధంగా యాక్సెప్ట్ చేశారు జనం. పవర్ ఫుల్ విలన్లకి వెర్రివెంగళప్ప లాంటి కొడుకులు ఉండే టైపు కామెడీకి శ్రీకారం చుట్టింది పింగళినాగేంద్రరావేనంటే అతిశయోక్తి కాదు. తరువాత మనం స్టార్ డైరెక్టర్లనుకున్నవారంతా ఇదే ఫాలో అయ్యారు.

     మాయాబజార్ సినిమా కోసం పింగళి నాగేంద్రరావు రచించిన మాటలు, పాటలు అజరామరంగా నిలుస్తాయి. ఈ చిత్రంలో రచయిత పింగళి నాగేంద్రరావు తస్మదీయులు, దుష్టచతుష్టయం , జియ్యా , రత్న గింబళీ, గిల్పం, శాఖంబరి దేవి ప్రసాదం, వంటి కొత్త పదాలను మనకు రుచి చూపిస్తాడు. రసపట్టులో తర్కం కూడదు, భలే మామా భలే, ఇదే మన తక్షణ కర్తవ్యం, ఎవరూ కనిపెట్టకుండా మాటలు ఎలా పుడతాయి, వేసుకో వీరతాడు వంటి సంభాషణలు మనల్ని గిలిగింతలు పెట్టిస్తాయి. మాటలు లేని చోటుల్లో  మార్కస్ బార్ట్లే ఛాయాగ్రహణం మరింత అద్భుతంగా పని చేస్తుంది. ఉదాహరణకు చిన్న పిల్ల గా ఆడుకుంటున్న శశిరేఖ ఉద్యానవనంలో ఒక కొలని గట్టున అలవోకగా కూర్చుంటుంది. కెమెరా ఆమె మొహమ్మీదనుంచి మెల్లగా పాన్ అయి కొలనులోని తామరమొగ్గను చూపిస్తుంది. గడచి పోతున్న కాలానికి గుర్తుగా కొలనులో అలలు రేగడమూ, ఆ మొగ్గ మెల్లగా విచ్చుకోవడమూ, ఆ తర్వాత కెమెరా మెల్లగా వెనక్కి తిరిగి శశిరేఖ మొహాన్ని చూపడమూ జరుగుతాయి. ఇప్పుడక్కడ నవయవ్వనవతి యైన శశిరేఖ అంటే సావిత్రి ఉంటుంది! చమత్కారమేమిటంటే ఈ పాటల పల్లవులు తర్వాతి కాలంలో సినిమా పేర్లుగా వాడుకోబడ్డాయి!

     1961లో విడుదలైన జగదేకవీరుని కధ అయితే యన్.టి.రామారవు ఒక వ్యక్తి కాదు,నిజంగానే జగదేకవీరుడు అని భ్రమపడేతంతగా ప్రేక్షకుల్లో అతనికి విపరీతమయిన అభిమానాన్ని సాధించిపెట్టింది!ఈ చిత్రంలో పింగళి గారు మాటల రూపంగా తమాషాలు చెయ్యకపోయినా,అప్పటి దాకా యెన్నో సినిమాల్లో క్రూరత్వంతో బహయపెట్టిన రాజనాలని ఇందులో హాస్యగాడిగా చూపించి మెప్పించారు,ఇతనికి తోడు బాదరాయణ ప్రగ్గడ అనే తమాషా పేరుతో "హే రాజన్!" అంటూ సియెస్సార్ తోడయ్యాడు - ఈ ఇద్దరితోనూ ఆడవేషాలు వెయ్యడంతో సహా ఎన్నో తమాషాలు చేయించారు!పాటల్లోనూ మంచి పనితనం చూపించి తనదైన మార్కుతో "ఓ సఖీ ఒహో చెలి ఒహో మదీయ మోహినీ!",,"వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా?", "జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హలా(?)వంటి అజరామరమైన పాటల్ని అందించారు - ముఖ్యంగా పూర్తి శాస్త్రీయంగా ఉండే "శివశంకరీ... శివానందలహరీ చంద్రకళాధరి ఈశ్వరీ" పాట ఒక్కటి చాలు!పాత్రల పేర్లతో చేసిన తమాషా ఏకాశ,రెండు చింతలు పాత్రలు - గిరిజ రేలంగి జంట మొదలైంది ఈ సినిమా తోనే కావచ్చు!

     1962లో పింగళివారు చిత్రానువాదం చేసిన గుందమ్మ కధ అయితే అప్పటికీ ఇప్పటికీ హాస్య చిత్రాలకి మాతృకగా చెప్పుకోదగిన గొప్ప సినిమా!హాస్యాన్ని సృష్టించడానికి పనికివచ్చే రెండు ప్రక్రియలు సందర్భోచితమైన హాస్యం,సంభాషణోచితమయిన హాస్యం రెంటికీ ఉదాహరణలుగా నిలిచే దృస్యాలు చిత్రమంతటా పరుచుకుని ఉంటాయి.జానపద బ్రహ్మగా పేరొందిన విఠలాచార్య కన్నడంలో మనె తుంబిద హెణ్ణు పేరిట కుటుంబ కథాచిత్రాన్ని తెరకెక్కించారు. చిత్ర నిర్మాణానికి విఠలాచార్య నిర్మాత, వాహినీ స్టూడియోస్ అధినేత బి.నాగిరెడ్డి సహకారం పొందారు. ఆ కృతజ్ఞతతో నాగిరెడ్డి అడగగానే సినిమా హక్కుల్ని విఠలాచార్య ఆయనకి ఇచ్చేశారు. మనె తుంబిద హెణ్ణు సినిమాలో గుండమ్మ అనే గయ్యాళికి, నోరుమెదపలేని భర్త ఉంటాడు. ఆమె తన సవతి కూతురుని ఓ పిచ్చివాడికి ఇచ్చి పెళ్ళిచేస్తుంది. ఆ విషయం తెలిసిన సవతి కూతురు మేనమామ గుండమ్మపై పగబడతాడు. అతను గుండమ్మ స్వంత కూతురికి నేరాలకు అలవాటుపడ్డ జైలుపక్షికి ఇచ్చి పెళ్ళిజరిగేలా పథకం ప్రకారం చేయిస్తాడు. ఇలా సాగుతుంది ఆ సినిమా. అయితే ఇందులో గుండమ్మ కుటుంబ వ్యవహారాలు నాటకీయంగా సాగుతూ, నాగిరెడ్డికి చాలా తమాషాగా అనిపించాయి. దాంతో విజయా ప్రొడక్షన్స్ చరిత్రలోనే తొలిసారి ఓ రీమేక్ చేసేందుకు సిద్ధపడ్డారు.

     సినిమా విడుదలకు ముందే విమర్శలు చెలరేగాయి. సినిమా రిలీజ్ కి ఇంకా పదిరోజుల సమయం ఉందనగానే, ఎల్వీ ప్రసాద్ ఇంట్లో జరిగిన పెళ్ళివేడుకల్లో గుండమ్మ కథ సినిమాను ప్రదర్శించారు. సినిమా చూసిన సినిమా వర్గాలు సినిమాలో కథే లేదని, సూర్యకాంతం గయ్యాళితనాన్ని సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదని విమర్శలు ప్రచారం చేశారు. హరనాథ్-విజయలక్ష్మి చేసిన పాత్రలు అనవసరమని, జమున పాత్ర చిత్రణ సరిగా లేదని మరికొందరు విమర్శించారు. చివరికి విజయా వారి నిర్మాణంలో మాయాబజార్ సహా పలు చిత్రాలు తీసిన దర్శకుడు కె.వి.రెడ్డి సినిమా బాగోలేదని అన్నారు.సినిమా విడుదల ముందు విమర్శలు రావడంతో విడుదల సమయంలో చిత్రవర్గాలు ఉత్కంఠతో ఎదురుచూశారు. గుండమ్మ కథ ప్రివ్యూ చూసినప్పుడు ఎన్టీఆర్ నిక్కర్లో తెరపై కనిపించగానే ప్రివ్యూ చూస్తున్న చిన్నపిల్లలంతా ఒక్కపెట్టున నవ్వారు. అది చూసిన చక్రపాణి ఆ అంచనాతోనే ప్రివ్యూ అవగానే "ఎవరెన్ని అనుకున్నా సినిమా సూపర్ హిట్" అని తేల్చేశారు. ఆయన అంచనాలు నిజం చేస్తూ సినిమా అప్రతిహత విజయాలను సాధించింది.గుండమ్మకథ సినిమా జూన్ 7, 1962న రాష్ట్రవ్యాప్తంగా విడుదలైంది.నేనూ ఆ సవత్సరంలో పుట్టానండోయ్,హందుకే నాకింత క్యామిడీ అబ్బింది కాబోలు:-)

     సినిమాలో నటించిన ఇద్దరు కథానాయకులు ఎన్టీఆర్, ఏఎన్నార్ అప్పటికే తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరోలు. సినిమా విడుదల సమయంలో టైటిల్స్ లో ఎవరి పేరు ముందువేయాలి, ఎవరి పేరు తర్వాత వేయాలి వంటి సందేహాలు వచ్చాయి. అయితే దీన్ని పరిష్కరించేందుకు అసలు తెరపై పేర్లే వేయకుండా ఫోటోలు చూపించాలని నిర్ణయించుకున్నారు. మొదట ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, సావిత్రి, జమున, ఎస్వీ రంగారావుల ఫోటోలు ఒకేసారి తెరపై వేసి, తర్వాత ఒకేసారి సూర్యకాంతం, ఛాయాదేవి, రమణారెడ్డి, హరనాథ్, ఎల్.విజయలక్ష్మిల ఫోటోలు వేశారు.అప్పట్నించే ఉందన్న మాట ఈ ఎవడు పెద్ద ఎవడు చిన్న అనే పిచ్చ?!

     1963లో పింగళి నాగేంద్రరావు చిత్రానువాదం నిర్వహించిన శ్రీకృష్ణార్జున యుధ్ధం గయోపాఖ్యానం కధకి కడు చక్కని చిత్రరూపం!ఈ చిత్రంలో ప్రఖ్యాత నటులు ఎన్.టి.ఆర్ కృష్ణుడిగా అధ్బుతమైన పాత్రను పోషించగా, ఏ.ఎన్.ఆర్ అర్జునిడిగా తన ప్రతిభను చూపారు. ఆనాటి ఇద్దరు ప్రముఖ కథా నాయకులు ఒకే తెర పై తమ పాత్రలని అధ్బుతంగా పండించి పలువురి ప్రశంశలు పొందారు. బి.సరోజా దేవి సుభద్ర పాత్రను, ఎస్.వరలక్ష్మి సత్యభామ పాత్రలను పోషించారు. కృష్ణార్జునుల యుద్ధానికి కారణమైన ముఖ్యమైన గయుడి పాత్రను ధూళిపాళ పోషించారు. మాయాబజార్ చిత్రంలో దుర్యోదనుడి పాత్రను పోషించిన ముక్కామల ఈ చిత్రంలో కూడా తిరిగి దుర్యోదనుని పాత్రలో నటించారు."అన్నీ మంచి సకునములే","మనసు పరిమళించెనే తనువు పరవశించెనే" వంటి భావగర్భితమైనవీ "అంచెలంచెలు లేని మోక్షము" వంటి సరదా పాటలూఒ ఉన్న్నాయి!సినిమాగా ఎప్పటికీ అజరామరమైనదే!

     1965లో విడుదలైన సి.ఐ.డి అనే సినిమాకి పింగళి నాగేంద్రరావు రచయితగా పని చహెశారు."నా సరి నీవని నీ గురి నేనని ఇపుడే తెలిసెనులేఅనే మధురగీతమూ ఉంది,ఇప్పటికీ అమ్మాయిలు తమవైపొకసారి చూస్తేనే సొల్లు కార్చుకునే కొందరు అబ్బాయిలకి తగిలేతట్టు వెక్కిరింతగా ఉండే "యువతులు చూసి చూడకముందే ఐసౌవుతావా అబ్బాయి" అంటూ సాగే సరదా పాట కూడా ఉంది. ఈ సినిమా లోని "ఎందుకయ్యా ఉంచినావు బందిఖానలో" అనే పాట ఒకరకంగా భక్త రామదాసు ఆవెదనకి ప్యారడీగా చెప్పుకోవచ్చు.సన్నివేశం కూడా సరదాగానె ఉంటుంది,అభినయం యన్.టి రామారావు - ఇంక చెప్పాలా!

     1971లో విడుదలైన రాజకోట రహస్యం గంగరాజు నిర్మాతగా విఠలాచార్య దర్శకత్వంలో నిర్మితమైన జానపదచిత్రం. పింగళి నాగేంద్రరావు చిత్రరచన చేశాడు.ఆ తర్వాత ఈ కవిపింగళం అస్తమించడంతో తెలుగు సినీఎ వినీలాకాశంలోని ఒక ఢృవతార రాలిపోయినట్టయింది.గుణసుందరి కథలో కె.వి.రెడ్డికి మరొక రచయిత హంమతి, కాలమతి వగైరా అరడజను హాస్యపాత్రలను యివ్వగలిగి ఉండడు పాతాళభైరవిలో సీను, అంజి, డింగరి పాత్రల విజయమూ, నేపాళమాంత్రికుడి పాత్ర యొక్క అపురూపకల్పన, నాగేంద్రరావు ప్రతిభకు తార్కాణాలు.చంద్రహారం చిత్రంలో ధూమకేతు, నిక్షేపరాయడు, "ఎంతచెబితే అంతేగాళ్ళు", బుజ్జాయి, చిన్ని మొదలైనపాత్రలు అంతవరకు సినిమాప్రేక్షకులు చూసిన ఏపాత్రకూ తీసిపోవు!


కొందరు బతికిన కాలం తిరిగిరానిది!పింగళిది కూడా అలాంటి జీవితమే!
-----------------------------------------------------------------------------------------------------------------ఈ నాడు శాలివాహన శకం 1937 మన్మధ నామ సంవత్సరం మార్గశిర మాసము 7వ తేదీ శనివారము
-----------------------------------------------------------------------------------------------------------------
ఒక విన్నపం:కొన్ని చోట్ల విషయవివరణ బాగుందటంతో మళ్ళీ నేను వేలుపెట్టడం దేనికిలెమ్మని వికీపీడియా లోని కొన్న్ భాగాల్ని యధాతధంగా ఉంచేశాను - కొన్ని చోట్ల మాత్రమే,ముఖ్యంగా పింగళి నాగేంద్రరావు గారి ప్రతిభని కాలానుక్రమణీకంగా ఉంచాలనుకున్నాను,అంతే!

Monday, 27 July 2015

శివ బాహుబలి అవంతికని రేప్ చేశాడా?చీ పాడు!అవంతిక కిదేం పోయేకాలం, కిమ్మనకుండా వూర్కుంది?


          ఇద్దరూ ఇద్దరే!అతనేమో పంతం పడితే శివుణ్ణే పెకలించి తల్లి కోసం ప్రతిదిన గంగాభిషేకం చేయించగలడు!చిన్నప్పట్నించీ అతని చూపంతా ఆకాశం వైపుకే - అక్కడ యేముంది?యెవరెవరు ఉంటారు?నన్నేదో బంధం అక్కణ్ణించి లాగుతున్నట్టుంది - యెందుకని?మరొకరెవరో చెట్టులెక్కగలవా ఓ బాహుబలి పుట్టలేక్కగలవా అని పందెం వెయ్యకుండానే నిర్ణయించేసుకున్నాడు - యెప్పటికయినా ఆక్కడికి చేరాలి!దానికి తోడు ఒక రోజు పైనించి జారిపడిందో చందమామ లాంటి ముఖారవిందాన్ని పోతపోసుకున్న ప్రతిబింబం.పైనించి జారిపడింది గాబట్టి పైకెళ్తే తను ఖచ్చితంగా దొరకొచ్చు?పెళ్ళీడుకొచ్చిన కుర్రాడికి అందమయిన పెళ్ళాం కూడా వస్తుందంటే ఇంక ఆగుతాడా?ఇదివరకు యెక్కలేని యెత్తుని కూడా అమాంతం యెక్కేశాడు కళ్ళ ముందు కావ్యనాయిక ఇంకొంచెమే,ఇంకొంచెమే,ఇక్కడే వున్నా,ఓ పదడుగులు - అంతే అని  రెచ్చగొడుతుంటే అలసటని కూడా హుషారుగా మార్చుకుంటూ!తీరా చూస్తే ఆ అమ్మాయి పెద్ద కష్టంలో ఉన్నట్టుంది!?వెంటాడుతున్న వాళ్ళని తప్పించుకోవడానికి ఆపసోపాలు పడుతూ పరిగెడుతుంటే తనిప్పుదు రక్షించాలి  గాబట్టి తనూ వాళ్ళ వెనకాల పరిగెత్తాడు.ఆఖరి సీనులో గానీ అర్ధం కాలేదు అంత సుకుమారంగా ఉన్న మొహాన్ని చూసి తను చొల్లు కార్చుకుంటూ వస్తే ఇక్కడ కనబడుతున్నది చెట్లమీద ఉన్న స్నేహితులు శస్త్రమందిస్తే కన్ను మూసి తెరిచేలోగా ఒక్కణ్ణి కూడా మిగల్చకుండా వాళ్ళ కుత్తుకలు నరికేసిన సివంగిని అని!
అదంతా చూసిన మనోడికి ఇక్కడ ముఖద్వారం మూసుకుపోయింది గాబట్టి పెరటిదారి మాత్రమే శ్రేయస్కరం అనిపించింది!దాంతో లేడికన్నుల చినదాన్ని పట్టడం కోసం లేడిని వేటాడే శార్దూలవ్యూహం పన్నాడు!యెంత లక్ష్యం కోసం సుఖసంతోషాలని త్యాగం చేసి బతుకుతున్నా మరీ క్రూరంగా ఇరవైనాలుగుగంటలూ అదే పిచ్చిలో ఉండలేరుగా యెవరూ?అలజడి రేపే భావాలు మనస్సును వేడెక్కిస్తే చల్లదనాన్నీ,యేకాంతాన్నీ,నిద్రనీ కోరుకోవటం మానవసహజం.ఆమె కూడా అదే కోరుకునింది.ఇట్లాంటప్పుదు యెలా ప్రవర్తించాలనే ఉపాయాలు ఆడవాళ్లకి భలే తెలుస్తాయి!పరధ్యాన్నంగా ఉన్నట్టూ స్నేహితురాలు మాట్లడడానికి ప్రయత్నించినా మౌనంగా ఉండిపోయి చేష్టల ద్వారానూ తనతో కలిసి రావడాని కిష్టం లేదనే సందేశం పంపించి, స్నేహితురాలు అర్ధం చేసుకుని దూరంగా వెళ్ళగానే యే  రకమైన సందేహాలూ లేకుండా అలా నిద్రలోకి జారుకుంది.వొళ్ళు తెలియని నిద్రలో చెయ్యి నీటిలోకి జారింది.పొంచివున్న మేటి కళాకారుడు తనపని తను చేశాడు.యెంత మొద్దునిద్రలో ఉన్నా కుంచె కదులుతున్న అనుభూతి కూడా రానివ్వకుండా యెట్లా గీశాడు?కళలోని మెళకువ కన్నా ప్రియురాలి మెలకువని కోరుకోని అనురాగంతో చేశాడా!

నిద్రలేచి చేతివైపు చూసుకున్న అవంతికకి అధ్భుతాశ్చర్యానందక్రోధావేఅశాలు ఒక్కసారిగా చుట్టుముట్టి కలవర పెట్టినాయి.యెవరు చేశారో తెలియదు!యెట్లా చెయ్యగలిగారో తెలియదు!యెలా స్పందించాలో తెలియదు!అక్కడె ఆలాగే ఉంటే ఇంకా చెడిపోతానేమోననే కంగారుతో అక్కణ్ణించి త్వరగా జారుకుంది.పాము కాటు వేస్తే విషం లాగేసినా గాయం వెంటనే మానదు గదా,ఇక్కడ కాటు వేసింది శ్రంగార సర్పం మరి!ఉద్యమ నాయకుడి దగ్గిర అవమానం మరింత పంతాన్ని పెంచింది - యెవరో ఆ పని చేసింది యెలాగైనా కనిపెట్టి పనిపట్టాలని.అవంతిక వ్యూహమూ బ్రహ్మాండంగానే ఉంది.ఆ పని చేసింది మగవాడేనని తెలిసిపోయింది!ఒక ఆడదానికి ఐ లవ్ యూ చెప్తున్నట్టు చేతి మీద బొమ్మ గీసి నేనెవరో కనుక్కో చూద్దాం అని దాగుడుమూతలు ఆడటం లాంటి చిలిపిపనులు మరో ఆడమనిషి చేస్తుందా?స్నేహితురాల్ని తనలా పడుకోమంది,ఒకసారి వచ్చినవాడు మళ్ళీ వస్తాడని అనుకోవటం వరకూ అంచనా నిజమే గానీ అలానే వస్తాడని అనుకోవడమే ఆమె చేసిన తప్పు!అప్పుడు నీటిలో చేపలా వస్తే ఇప్పుడు గాలిలో పక్షిలా వచ్చాడు.యెటునుంచి వచ్చినా చూసేందుకు వీలుగా చెట్టెక్కి నిలబడి ఆకర్ణాంతం నారి సారించి చూపుని భ్రూమధ్యంలో నిలిపి యేకాగ్రంగా చూస్తున్న అవంతిక వీరతాసౌందర్యాన్ని ముచ్చటగా చూస్తూ మరోసారి తనపని కానిచ్చేసుకున్నాడు!యెక్కడ నుంచి పట్టుకొచ్చాడో తెలియదు గానీ విషసర్పాన్ని లాఘవంగా ఆమె భుజం మీద వొదిలాడు.అది నారిని లాగిపట్టి ఉంచిన చేతి మీదుగా పాకి విల్లును పట్టిన చేతిని చుట్టుకుంటూ అమ్ము  చివరి వరకూ వెళ్ళీ ఆగింది!చెమట కూడా పట్టనివ్వకూడదన్నంత జాగ్రత్తతో శిలలా ఉండిపోయిన అవంతిక భుజం మీద శిల్పం చెక్కేసి యెలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు మధురశిల్పి శివన్న!.ఇదివరకంటే చేతిమీద గాబట్టి తనే చూసుకోగలిగింది,ఇప్పుదు ఇక రాడనుకుని చెట్టు దిగి స్నేహితురాల్ని కల్సినప్పుడు తను చెప్తే గానీ తెలిసి రాలేదు మళ్ళీ దాడి జరిగిందని,మరిగిపోయింది?!
ఇక దాగుడుమూతలు పూర్తయినాయి.ఇద్దరూ యెదురెదురుగా నిలబడి కలబడి తలపడి కదన కౌతుకంతో విజృంభించారు!ఒకరిలో అవమానం జరిగిపోయిందనే కసి!ఒకరిలో అభిమానం చూపించాలనే కసి!ఆమె కదలికల్లో పంతమూ ఉక్రోషమూ ఉంటే అతని కదలికల్లో నేర్పూ లాఘవమూ ఉన్నాయి.అందుకే అతనే గెలిచాడు!ఆడదాని వొంటిమీద ఉన్న దుస్తుల మీద చెయ్యేసే అధికారం భర్తకి మాత్రమే ఉంటుంది,అందుకే మొదట దుస్తులు మార్చి నేను నిన్నిట్లా చూడాలనుకుంటున్నానని చెప్పాడు!సరసుడైన భర్త తన భార్యకి చేసే అన్ని అలంకారాలూ ఒక్కటి కూడా వొదలకుండా చేసి నీటితెరలో తనని చూసి తనే మురిసిపోయేటట్టు చేశాడు! చెప్పండి, ఒక్క ముక్క నోటితో చెప్పకుండా అనితరసాధ్యంగా ఐ లవ్ యూ చెప్పిన శివ బాహుబలి కౌగిట్లో అవంతిక యెందుకు వాలదు?వాళ్ళలో వాళ్ళు మనమిక ఈ జన్మకి విడిపోము అని సంకల్పాలు చెప్పుకుంటే కళ్యాణం జరిగిపోయినట్టే గద!ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యనా జరిగేది దాంపత్యశృంగారమే గద!ఇంత చిన్న విషయం గూడా తెలియని అజ్ఞానం వల్లనో యేమో మరి అక్కడ బలాత్కారమేదో జరిగిందని యెవరో ఆడమనిషే అంటుంటే ఆమెలోని అజ్ఞానానికి నవ్వాలో యేడవాలో అర్ధం కాలేదు?కొందరు అవంతికని అంత వీరనారిగా చూపించి మరీ అంత తొందరగా శివుణ్ణి ఇష్టపడినట్టు చూపించటం ఆ పాత్రని కించపరిచినట్టుంది అని కూడా అంటున్నారు.అంటే వాళ్ళు ఇప్పటి దాకా చూసి అఘోరించిన  మూస సినిమా ఫార్ములా రొమాంటిక్ సీన్ల మత్తునుంచి ఇంకా బయటపలేదన్న మాట,ఒకవేళ రాజమౌళి గనక వాళ్ళ మధ్యన ప్రేమ నెమ్మది నెమ్మదిగా పెరిగిందని చూపించటానికి నాలుగైదు చెత్తసీన్లని ఇరికించి ఉంటే వాళ్లకి నచ్చి ఉండేదేమో గానీ మనలాంటివాళ్ళం అక్కణ్ణించే "చీ,యాక్,ధూ" అనుకుంటూ ధియేటరు నుంచి బయటపడే వాళ్ళం - రాజమౌళీ,ఆర్కా నెత్తిన చెంగేసుకు పోయేవాళ్ళు!

మన ఆడవాళ్ళు కొన్ని చీరల్ని ప్రత్యేకంగా దాస్తూ యేళ్ళ తరబడి అపురూపంగా యెందుకు దాచుకుంటారో తెలుసా!ఆ చీర కట్టినప్పుడు యేదైనా మధురానుభవం వాళ్ళకి యెదురైతే ఆ చీరని యెప్పుడు కట్టినా వాళ్ళు అప్పటి సన్నివేశంలో తమ అనుభూతుల్ని ఇప్పుడు కూడా అనుభవించగలుగుతారు!అవంతికకి "నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అనే సన్నివేశాన్నీ దానికి సంబంధించిన అనుభూతినీ ఆమె హృదయాంతరాళంలో అంత అపురూపంగా నిలబెట్టాడు శివ బాహుబలి!


A MAN WITH STYLE CAN WIN ANY RIGHT MINDED WOMAN!

Sunday, 12 July 2015

బాహుబలి సినిమా చూసేశానోచ్!రాజమౌళి ఇరగదీసేశాడహో!

వెండితెర అధ్భుతం!నింగినుంచి జారుతున్నదా అన్నంత యెత్తునుంచి జారుతున్న ఒక జలపాతం,శివుని జటాజూటం నుంచి ఉప్పొంగి దూకే దివిజ గంగ ఇంత తెల్లగా ఉంటుందేమో అనిపించే కళ్ళు చెదిరేటంత ధవళ సౌందర్యం అతి దగ్గరి నుంచి కనిపిస్తే చూడాలని తహతహ లాడే వాళ్లకీ కొయ్యబొమ్మలు మెచ్చు కళ్లకు కోమలుల సౌరెక్కునా అన్నట్టు ఇప్పటిదాకా తక్కువ రకం అందాలకి అలవాటు పడిపోయి ఇంతకన్నా గొప్ప అందం ఉండదని మైండులో ఫిక్సయిపోయిన దిక్కుమాలిన స్థితిలో ఉన్న సగటు తెలుగు సినిమా ప్రేక్షకుల్లో ఒక మహాధ్భుతమైన సౌందర్య పుష్పం ఒక్కసారిగా వెయ్యిరేకులతో విచ్చుకుంటే చూసి తట్టుకోగలిగిన వాళ్లకి బాహుబలి చూడటం ఒక అదృష్టం!నిజమే - సినిమాలో యెన్నో గొప్ప అంశాలు ఉన్నాయి, అందరూ అనుభవమున్న వాళ్ళే గనక నటీనటుల నటన అధ్భుతంగా ఉంది, అంత సుదీర్ఘమయిన సమయం తీసుకుని చెక్కారు గనక పాత్రల రూపురేఖలూ గొప్పగానే ఉన్నాయి< కధ రాజమౌళి చాలాసార్లు చెప్పినట్టు చందమామ కధే, పాతకాలం రాజులు సింహాసనం మీద యెవరు కూర్చోవాలనే పంతాల కోసం ఒకరినొకరు మోసం చేసుకోవడాలతో కూడిన పాత యెంటీవోడి కత్తి ఫైటింగుల సిన్మాల నాటి రొడ్డకొట్టుడు మామూలు కధ!కానీ వాటికన్నా ప్రత్యేకంగా ఉండి ఇవ్వాళ సినీమా చూసి వచ్చాక నన్ను వెంటాడుతున్నదీ మీరు చూసి బయటి కొచ్చాక మిమ్మల్ని వెంటాడబోయేదీ ఆ జలపాతపు సౌందర్యమే!

తను ఇప్పటికే చందమామ కధల నుంచే ఇన్స్పైర్ అయ్యానని చెప్పేశాడు గనక కధ గురించి చెప్పడానికి పెద్దగా యేమీ లేదు. సినిమా అంతా ఎంజాయ్ చేస్తూ చూసి  ఇంటికొచ్చాక తీరిగ్గా కూర్చున్నాక ఇంతకీ బాహుబలులు యెంతమందీ అని మా ఫ్రెండుకి డౌటొచ్చేసింది!ఇక్కడ కధ చెప్పినా మీకు చూసేటప్పుదు ఖచ్చితంగా డౌట్లొస్తాయి!యెందుకంటే మొదట అనుకున్న కధని పూర్తిగా తీస్తే యేకబిగిన చూడాలంటే ఐదారు గంటలు పడుతుందని చాలామటుకు సీన్లని నరికేసి అత్యవసరమైన వాట్ని కూడా ఒకే సినిమాగా చెప్పలేమని రెండు పార్టులుగా తీశారు గాబట్టి ఇప్పుడొచ్చిన డౌట్లన్నీ తీరాలంటే రెండో పార్టు వరకూ ఆగాల్సిందే!ఫాంటసీ కధ గాబట్టి రీజన్ అడిగే దమ్ము యెవడికీ లేదు.అడిగిన వాడు గొట్టం గోవిందరాజులే!దీనెమ్మా జీవితం మన చుట్టూ ఉన్న లైఫులో మాత్రం యేది రీజను ప్రకారం జరుగుతాంది!?కొందరు మొదటి సగం స్లో అనీ,రెండో సగంలో వార్ సీన్లు సాగదీశాడనీ,, మొదటి పార్టుని మరీ హఠాత్తుగా ఆపేశాడనీ వంకలు పెట్టారు గానీ నాకు మాత్రం అవి కూడా పెద్ద తప్పులని అనిపించలేదు.కామెడీ కోసం కుప్పిగంతులు వెయ్యకుండా,అక్కర్లేని తిగరి హీరోయిజానికి బిల్డప్పులిచ్చే పంచ్ దైలాగుల మోత లేకుండా,అవేవీ లేకపోతే సినిమా హిట్టవ్వదేమో అనే మూఢనమ్మకాన్ని బద్దలు గొడుతూ బోరు కొట్టించని మంచి సినిమా ఇది!

ఒకటి మాత్రం నిర్మొహమాటంగా చెప్తాను.ఈ సినిమాలో చూసిన యుధ్ధపు దృశ్యాల్లో కొన్నిట్ని నేను టీవీలో "300","హెలెన్ ఆఫ్ ట్రాయ్" లాంటి ఇంగ్లీషు సినిమాల్లో యెప్పుడో చూసేశాను.అవి కాపీ సీన్లని నాకు తెలుసు,అయినా సరే కధలో చక్కగా ఇమిడ్చి మంచి కాంబినేషన్ కలిపి తీశాడు గాబట్టి అంత చక్కగా కాపీ కొట్టగలిగినందుకైనా మెచ్చుకోవాల్సిందే!కాపీ కొడుతుండగా ఇన్విజిలేటరుకి దొరికిపోయి డిబారయిన వాడికీ పట్టుబడకుండా కాపీ కొట్టి ర్యాంకు తెచ్చుకోగలిగిన వాడికీ తేడా లేదూ?! 

సినిమాకి వెళ్ళేటప్పుడూ వచ్చేటప్పుదూ నేనూ మా ఫ్రెండూ చెప్పుకున్న కబుర్లతో సహా ఈ బాహుబలి సినిమా చూడటం నిజంగా ఒక మంచి అనుభవమే నాకు మాత్రం!వాడు మొదట సత్యంలో పనిచేసి మహీంద్రా వాళ్ళ కిందకి వెళ్ళాడు.ఇప్పుడు మహీంద్రా పరిస్థితి యేం బాగులేదట!నష్టాల్లో ఉండి వచ్చే నెల నుంచి జీతాల్లో కోత మొదలవబోతుందట.అదివరలో యెక్కడ విన్నా మహీంద్రా పేరు చెవుల్లో హోరెత్తిపోతూ వినబడేది బ్రాండ్ వేల్యూ తగ్గిందా?ఆ ఒక్క కంపెనీకే సమస్య వస్తే జరిగే నష్టం కన్నా ఆ ఫీల్దు మొత్తం ఎఫెక్టయితే చిన్నా చితకా కంపెనీలయితే బోర్డులు తెప్పెయ్యడమే గదా?అందులో పనిచేసేవాళ్ళ పరిస్థితి యేంటి?వెళ్ళేటప్పుదు ఇలాంటి కబుర్లయితే వొచ్చేటప్పుడు మావోడికి హుషారొచ్చేసి ఫ్రెండ్సుకి ఫోన్లు చేసి మౌత్ పబ్లిసిటీ మొదలెట్టేశాడు.గుంటూరోడయ్యుండీ  పుట్టి పెరిగిన మాతృనగరం గుంటూరునే భయంకరంగా అవమానించే లెవెల్లో "గుంటూరు డబ్బా ధియేటర్లలో మాత్రం చూడకురోయ్,బెజవాకో హైదరాబాదుకో వొచ్చి మాంచి సౌండెఫెక్ట్సుతో అదరగొట్టే పెద్ద హాల్లో చూడ"మని ఉబోసలు కూడ పారేస్తున్నాడు.అదేంట్రా మీ వూరినే అట్టా చిన్నబుచ్చుకుంటావు అంటే మా బుంటూరోళ్ళం అంతేరా తమ్ముడు తనోడయినా ధర్మం మాట్లాడే టైపు అని సెల్ఫుడబ్బా కొట్టేసుకుని మా గుంటూరు ముండ కెక్కువా ముత్తయిదువకి తక్కువా అనేస్తున్నాడు!ఒరేయి బాపనోడివి నువ్వు బూతులు మాట్టాడితే యెట్టారా అని పైకి అన్నా గానీ మైండులో మాత్రం సుప్రభాతాల్లో కూడా బూతులు రాసింది వాళ్ళే గదా అనుకున్నా లోపల్లోపల:-)ఇప్పటి దాకా మెయిన్ లైనుకి పక్కకుండిపోయి వెనకబడిపోయిందిరా, ఇప్పుడు డైరెక్టుగా రాజధానిలో కలిసింది గాబట్టి కొంచెం ముందుకెళ్తుందేమోలే అన్నాడు!ఆ సినిమాకి తెగే టిక్కెట్లలో ఓ పదిశాతమయినా నీమూలంగా తెగేట్టు ఉన్నాయి.యెస్సెమ్మెస్ సాక్ష్యాలు జాగ్రత్త్తగా ఉంచి రెవెన్యూలో వాటా అడుగు అని జోకేస్తే నిజమే అడుగుతానని ఐడియా ఇచ్చినందుకు నాకు షేక్ హ్యాడిస్తున్నాడు మా గుంటూరు శాస్తుర్లు!ఒరేయి సమైక్య రాష్ట్రాన్ని బోడి ఆంధ్రప్రదేశ్ అన్నాడురా ఒక గాడిద,ఆ బోడి తెలంగాణ కెందుకు మీవాణ్ణీ చెన్నై రమ్మను అంటే నిజమే,ఈసారి ఫోన్లో కలిసినప్పుదు చెప్పాలి అని వాడూ ఒప్పుకున్నాడు?!

సినిమా గురించి ఆపేసి ఈ జోకులన్నీ యేంత్టని దౌటు రావొచ్చు,మీరు కూడా ఒంటికాయ సొంతికొమ్ములాగా వెళ్ళాను,చూశాను,వొచ్చాను అని కాకుండా నలుగురితో కలిసి సరదాగా వెళ్ళిరండి - ఇంటి దగ్గిర్నుంచి బయల్దేరి మళ్ళీ ఇంతికొచ్చేవరకూ బోరు కొట్టకుండా ప్లాను చేసుకుని వెళ్ళండి అని చెప్పదల్చుకున్నా!

మనవాళ్ళు గోప్పగా అప్పుడప్పుడూ కొన్ని అధ్భుతాల గురించి చెప్తారే అల్లాగ - వానలో తదవని వాడూ బాహుబలి చూడని వాడూ,చూసి నచ్చలేదన్న వాడూ వేస్ట్ క్యాండిడేట్ కింద లెఖ్ఖ!మా ఐద్దరితో పాటు హాలు దగ్గిర మరో తెలుగు కుర్రాడు కలిశాడు - నిన్ననే చూసి మళ్ళీ మావాణ్ణి చాన్సుంటే నాకూ టిక్కెట్టు తీసుకోమన్నాడంట!పైకి యేమడుగుతాం గానీ సినిమా చూశాక ఇప్పుడు మాత్రం కుర్రాడు ఖచ్చితంగా తమన్నా కోసమే వచ్చుంటాడు!రెండు పాటల్లో రాఘవేంద్రుణ్ణి మరిపించేశాడు రాజమౌళి!?

Tuesday, 12 May 2015

సందేహం లేదు,ఈ తరం మహానటి నిత్యా మీనన్!

          నటనంటే యేమిటి?మనకు కలగని అనుభూతుల్ని కలిగినట్టు భ్రమింపజెయ్యడం!జీవితంలో యెవరూ యెప్పుడూ నటించరా?అప్పుడప్పుడూ మనమూ నటిస్తూనే ఉంటాం - మనకి నచ్చనివాళ్ళతో తప్పనిసరిగా మాట్లాడాల్సి వస్తే నవ్వుతూనే మాట్లాడతాం కదా!అయితే స్టేజి మీదనో తెర మీదనో నటించేవాళ్ళని అంతమంది యెందుకు అభిమానిస్తారు?జీవితంలో నటించడం మోసగించడం అని తెలుసు గనక అతిగా చెయ్యలేం,అవునా?అదే కళ్ళముందు ఒక వ్యక్తి మరో వ్యక్తికి సంబంధించిన అతి సున్నితమైన ఉద్వేగాల్ని సైతం అవి తనకే యెదురవుతున్నాయేమోనని భ్రమింపజేస్తుంటే కొద్దిసేపయినా నిజంగా ఆ అనుభూతులన్నీ ఆ వ్యక్తి సొంత అనుభూతులని నమ్మేసి ఆ మాయలోంచి బయటపడ్డాక ఆ ప్రతిభకి చప్పట్లు కొట్టాలనిపిస్తుంది! ఒకప్పుడు నాటకరంగంలో వేమూరి గగ్గయ్య అనే నటుడు హిరణ్యకశిపుడి వేషం వేసి వికటాట్టహాసాలు చేస్తుంటే చూసే ప్రేక్షకులకి భయం పుట్టేదట.

        నిన్నటి తరం తమిళనటుడు శివాజీ గణేశన్ పరాశక్తి అనే సినిమాతో మొదలెట్టి తను నటించే ప్రతి దృశ్యంలో యెంతమంది ఉన్నా అందులో యెవరు యెంత గొప్పగా నటించినా సరే వాళ్ళందర్నీ నస్మరంతిగాళ్లని చేసే విధంగా చెలరేగిపోయి అప్పటి నుంచీ ఇప్పటివరకూ చూసిన ప్రతివాళ్ళనీ ఒక్కలాగే స్పందింపజేస్తున్నాడు కదా!అతనిది అతినటన అంటారు గానీ అవే పాత్రల్ని అవే సంభాషణల్ని మితనటనతో మెప్పించగలిగిన మరో నటుడు యెవరయినా ఉన్నారా?అక్కడ నటనకి సంబంధించిన రెండో భాగం ఉందని తెలియాలి, ఆ ఉద్వేగాల్ని తను అనుభవిస్తున్నాని నమ్మించటమే గాదు చూసేవాళ్ళలోనూ కలిగించే లక్షణం అది!
          ఉరుమి సినిమా ఆర్టిస్టుల లిస్టులోనూ అలా మొదలైంది సినిమా గురించిన కబుర్లలోనూ నిత్యా మీనన్ మంచి నటి,చాలా బాగా చేసింది అంటుంటే ఓహో అనుకోవడమే తప్ప ఇప్పటివరకూ నిత్యామీనన్ సినిమా ఒక్కటి గూడా చూడలేదు,కానీ మొన్న "మా" చానెల్లో "మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు" చూశాక ఒక అద్భుతాన్ని చూసినట్టనిపించింది! ఆ సినిమాకి సంబంధించిన వార్తల్లో డబ్బింగ్ కూడా తనే చెప్పుకున్నట్టు గుర్తు,ముస్లిం అమ్మాయి పట్టి పట్టి మాట్లాడిన ఎఫెక్టుతో అధ్భుతంగా చేసింది!డైలాగులదేముంది శ్రమపడితే యెవరయినా బాగానే చెప్పొచ్చు గానీ బురఖాలోంచి గోల్డు మెదల్సు లాంటి రెండు కళ్ళు మాత్రమే కనిపిస్తున్న దృశ్యాల్లో గూడా బురఖా వెనకాల ఆ అమ్మాయి పెదాలు అల్లరిగా విచ్చుకుంటూ నవ్వుతున్నాయని తెలిసేట్టుగా కళ్ళతోనే చూపించడం అంటే అది యెంత గొప్ప నటనో కదా!అలా కళ్ళతో నటించగలిగే నటిని అభినేత్రి అంటారు - వుదాహరణకి సావిత్రి.
        వయస్సుతో సంబంధం లేకుండా ఆడామగా యెవరయినా సరే సినిమా అనేది తెరమీద కనబడే బొమ్మలని తెలిసినా యేడుపు సీన్లలో యెప్పుడో ఒకప్పుడు కనీసం ఒక కన్నీటి చుక్కయినా రాల్చే ఉంటారు!నాకింత వరకూ అలాంటి ఫీలింగ్ యెప్పుడూ రాలేదు గానీ "నాన్నకి దూరంగా ఉండి సుఖపడొచ్చు గానీ నాన్నని దూరం చేసుకుని సుఖపడలేను" అనే దృశ్యంలో మాత్రం చాలా బరువుగా ఫీలయ్యాను.నాకు నదిరా అనే అమ్మాయి అప్పుడు ఇరుక్కుపోయి ఉన్న దౌర్భాగ్యం కనబడింది - ఆ తండ్రి చావకుండా యే పక్కగదిలోనో ఉండి ఉంటే తనే మూర్ఖత్వాన్ని వొదిలించుకుని కధని సుఖాంతం చేసేవాడనిపించింది!ఏరొబిక్స్ లాంటి హిస్ట్రియానిక్స్ యేమీలేవు - 100%లవ్ లో నాగచితన్య క్లైమాక్సులో అట్లా అంతసేపు ఆపకుండా అరుస్తుంటే నాకు యెడుపు రాకపోగా క్యామెడీ సీను చూసినట్టనిపించింది - కూర్చున్న చోటు నుంచి కదలకుండా మామూలుగా మాట్లాడుతున్నట్టే యెంత సులువుగా చూసేవాళ్ళకి ఆ దుఃఖాన్ని చూపించింది!

          ఇవ్వాళ తెలుగు సినిమా పరిశ్రమ తక్కువ పెట్టుబడితో తీసే మంచి సినిమాలు యెక్కువగా హిట్టవుతూ ఉంటే హీరోల చంకల్లో మట్టి దులుపటానికి పనికొస్తూ వాళ్ళకి మార్కెట్టును పెంచే పంచ్ దయలాగుల మోత సినిమాలు యెవడూ చూడడు కాబట్టి "హ్హహ్హహ్హ అసలు హీరోని నా డెన్నుకే రానివ్వను గదా నన్ను ఇంకెట్లా చంపుతాడు నువ్వు నన్నిక తప్పించుకోలేవులే హీరోయిన్నూ" అని యెదవ ప్లాన్లేసి హీరోకి అడ్డంగా దొరికి చచ్చే సదరు సినేమా విలన్ల మాదిరిగానే ఆడించటానికి ధియేటర్లు దొరక్కుండా చేసే ముఠా ఒకటి పని చేస్తుందని తెలిసింది! అది అందరికీ తెలిసి పేర్లతో సహా అడ్డంగా దొరికిపోయాక ఇప్పుడు గుమ్మడికాయల దొంగలేమో భుజాలు తడుముకుంటున్నారు.ఆలీసెంగా సీన్లోకడుగుపెట్టిన సినేమా పోలీసుల్లాగే మిగతావాళ్ళు కొందరు "ఇంకానా ఇకపై సాగదు ఆ దురంతం" అని డయలాగులు దంచుతున్నారు. ఆ వూపు యెన్నాళ్ళుంటుందో తెలియదు గానీ మరి ఈ సినిమా దుర్మార్గుల నుంచి యెలా తప్పించుకుందో తప్పించుకుని మొత్తానికి క్రియేటివ్ కమర్షియల్స్ వారికి ఓ మంచి హిట్టు కొట్టింది!
        ఈ పాలిటిక్స్ పక్కన పెడితే అన్ని అవాంతరాల్ని దాటుకుని రిలీజయ్యి హిట్టయిన చిన్న మంచి సినిమాలన్నిట్లో ఒక విశేషం ఉంది - ఒక సెంట్రల్ పాయింటుని రియాలిటీకి దగ్గిరగా ఎలెవేట్ చెయ్యడం!ఈ సినిమాలో హీరోయిన్ కూతురికి వచ్చిన డౌట్ "నరాల రాపిడి కోసం మాత్రమే చూసుకోకుండా మనసుతో ప్రేమించుకుని ఒక జీవితకాలం పాటు విడిగా ఉన్నా ఒకరికొకరు పూర్తిగా అంకితమవడం సాధ్యమా?" అనేది ఈ తరాన్ని గూడా కదిలించిందనే దానికి గట్టి సాక్ష్యం ఈ సినిమా సక్సెస్.యెక్కడో చదివాను తను కావాలనే ఎక్స్పోజింగుకి దూరంగా ఉంటున్నట్టు - దాన్ని గట్టిగా నిలబెట్టుకుంటే ఖచ్చితంగా సావిత్రి తర్వాత మరో అభినేత్రి అవుతుంది  నిత్యా మీనన్!
చిన్న నిత్య
_______________________________________________________________
(చిత్రాలు:గూగుల్)

Sunday, 26 April 2015

హే రాజన్!నాకు బాదరాయణ ప్రగ్గడ గుర్తు కొచ్చెన్?

నేనొకప్పుడు బ్లాగుల్లోని ఒక చర్చావేదిక దగ్గిర అరిభీకరంగా వాదించి కూడా స్మశానంలో మేకు దిగ్గొట్టిన చందంగా నలభై దాటిన వాడెవడూ యెదటి వాడు యెంత హేతుబధ్ధంగా వాదించినా తను చిన్నప్పట్నించీ యేళ్ళ తరబడి యేర్పరచుకున్న అభిప్రాయాల నుంచి బయటికి రాడనే తత్వం బోధపడి మధ్య మధ్యలో శ్యామలీయం మాస్టారు ఇచ్చిన ఉచిత బోడి సలహాలు కూడా పనిచేసి నా బ్లాగులో పోష్టులకి మాత్రమే పరిమితమయిన ఇప్పుడు అక్కడక్కడా శ్యామలీయం మాస్టారు నా పధ్ధతిలో గిల్లికజాలకు దిగుతుంటే కొంచెం సరదాగానూ కొంచెం వింతగానూ అనిపిస్తున్నది?

భండారు వారి వార్తావ్యాఖ్య బ్లాగులో కొత్త తరం పెద్దా చిన్నా లేకుండా పెద్దవాళ్ళని "అరే ఒరే" అని పిలవడం గురించి ఓ పోష్టు వేశారు.పిలిచే వాళ్ళకీ పిలిపించుకునే వాళ్ళకీ చనువుంటే తప్పు లేదనీ కొన్న్ ప్రాంతాల్లో పెద్దవాళ్ళని కూడా యేకవచనంలో పిలవడం ఉందనే శ్రీకాంత్ చారి గారి వాదన కరెక్టే అయినా ఉదాహరణగా "హే రాజా" అని ఇచ్చేసరికి శ్యామలీయం మాస్టారు అసలు "హే రాజన్" అని ఉండాలంటూ మీరన్నది ఒక సంస్కృత పదానికీ తెలుగు పదానికీ సంకరం చేసిన మాట అదెట్లా కుదురుతుందనటంతో కొంచెం వాదన జరిగింది,నాకు మాత్రం ఈ "హే రాజన్" అనే మాటతో బాదరాయణ ప్రగ్గడ గుర్తుకొచ్చి ఇంకా యెవరికయినా గుర్తుకొచ్చాడా అని కామెంటు వేస్తే ఇంకొక మిత్రులు మరికొంచెం హుషారుగా కామెంటు వేశారు.దాంతో నాకు మరింత పిచ్చెక్కిపోయి యూట్యూబు గాలిస్తే కట్టింగులు లేని మొత్తం సినిమా పుణ్యాత్ములు యెవరో అప్లోడు చేసారు - దొరికింది!


ముందుగా ఈ సినిమాకి సంబంధించిన సరదా విశేషాలు కొన్ని చెప్పాలి!అన్ని సినిమాల్లోనూ భయపెట్టే రాజనాల ఇందులో సీయస్సార్ గారితో చేసిన అల్లరి యే కమెడియన్ జంటకీ తీసిపోదు.యంటీవోడు కృష్ణుడి వేషంలో కన్నా మిస్సమ్మలోకన్నా మిగతా అన్ని సినిమాల్లోకన్నా పిచ్చ స్మార్టుగా ఉంటాడు?!జగదేక వీరుడు అని పేరు పెట్టారు గదాని హీరోయిజం అదరగొట్టేటట్టు ఉండదు?తండ్రి దగ్గిర "పిలిచారా నాన్నగారూ" అని చేతులు కట్టుకు నిలబడి తన తింగరి కోరికల్ని తండ్రి ఛదామడా తిట్టేస్తుంటే కొంచెం బిక్కమొగమేసుకుని నెమ్మిదిగానే మాట్లాడే బుద్దూ లాగానూ ఆకాశం నుంచి బామ్మలా మారి దిగివచ్చిన ఆదిశక్తి కాళ్లదగ్గ్గిర భెషజాలేమీ లేకుండా కూర్చుని ఆవిడ యేం చెప్తే అది "నువ్వు యేల్తో జెప్తే నేను కాల్తో జేస్తా" నన్నట్టు ఉండే జంగ్లీ లాగానూ ఉంటుంది!రేలంగోడి రెండు చింతలూ సినిమాలో ఆడు కమెడియన్ గాబట్టి నవ్వొచ్చేలా వున్నా సీరియస్సుగా ఆలోచిస్తే యేకాలంలోనైనా మొగాడికి ఉండేవి గూడా ఆ రెండు చింతలే - తనకు తనుగా ఇష్టపడి చేసుకున్న అనుకూలవతి అయిన పెళ్ళాం మరియూ తన బతుకు చుక్కాని తన కంట్రొల్లోనే ఉండే కింగు లాంటి బతుకు తనకి దక్కేనా అని!

సినిమాలో దేవకన్యలు నలుగురూ దిక్పాలకుల కూతుళ్ళుగా చూపిస్తారు,మరయితే మనకి అష్టదిక్పాలకులు ఉన్నారుగా యెనిమిదిమంది దేవకన్యల్ని తగిలిస్తే పోయేదిగా హీరోకి(అధికస్య అధికం ధనం?) నలుగురితోనే యెందుకు సరిపెట్టేశారో అని కూడా ఒకసారి డౌటు వచ్చింది నాకు:-) అయితే మళ్ళీ నాకే సినిమాలో ఉన్న దేవకన్యల్ని దుస్తులు యెత్తుకొచ్చి వశం చేసుకోవడం అనే మెలిక చూడగానే చిన్నప్పుడు చందమామలోనో బొమ్మరిల్లులోనో బాలమిత్రలోనో చదివిన ఒక చైనా జానపద కధ గుర్తు కొచ్చేసరికి ఆ డౌటు తీరిపోయింది!అప్పట్లో చందమామ ఒక్కటే కాకుండా మిగతా రెండు కూడా పోటాపోటీ గానె ఉండేవి పిల్లల కోసం వచ్చే మాగజైన్లలో!అందులో ఒక పల్లెటూళ్ళో బలాదూరుగా తిరిగే హీరోకి ఒక చెరువు గట్టు దగ్గిర ఒక వింత దృశ్యం కనబడుతుంది,చూస్తుండగానే నాలుగు అందమైన పక్షులు యెక్కణ్ణించో యెగురుకుంటూ వచ్చి మనం చొక్కాలు విప్పినట్టు తొడుగుల్ని విప్పుకుని అందులోంచి అమ్మాయిల్లాగా బయటపడి ఇక్కడి కధలో లాగే జలకాలాటలు ఆడి మళ్ళీ ఆ తొడుగుల్ని తొడుక్కుని పక్షులుగా మారిపోవడం చూస్తాడు.దాంతో మర్మమంతా ఆ తొడుగుల్లో ఉందని అర్ధమై మరోసారి వచ్చినప్పుడు ఆ పక్షి తొడుగుల్ని కాజేస్తాడు.వాళ్ళు విధిలేక వాణ్ణి పెళ్ళి చేసుకుంటారు!తర్వాత కధ యెలా పూర్తయిందో నాకు గుర్తు లేదు గానీ అది పాతాళ భైరవికీ దీనికీ గూడా పనికొచ్చినట్టుంది!

అయితే అక్కడ హీరో పల్లెటూరివాడు గనక యెబ్బెట్టుగా లేదు గానీ బుధ్ధిమంతుడయిన ఒక రాజుగారబ్బాయి ఆడపిల్లల బట్టలు కొట్టుకొచ్చెయ్యడం లాంటి యెధవయిడియా వేస్తే జనం మెచ్చరు గాబట్టి మామ్మగారి పురమాయింపు అనే కొసరు కల్పన చేరింది.పింగళి గారి అనేకానేక కొసరు కల్పనలతో అతి చిన్న కధ కాస్తా మూడుగంటల సేపు చూసినా బోరుకొట్టనివ్వని గానాబజానాలతో హుషారు గొల్పే రంగేళీరవ్వలమొలకై కూర్చుంది!

అసలు సినిమాలెందుకు చూడాలి?సినిమాలు లేనికాలంలో జనాలు బతకలేదా?జన్మలో ఒక్క సినిమా గూడా చూడని వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు గదా!మనం మాత్రం చూడకపోతే యేం?మెస్సేజిలు ఇవ్వడానికయితే టెలిగ్రాం ఇస్తే సరిపోతుందిగా మూడుగంటలు కుర్చీలో కూలేసి సినిమా యెందుకు చూపించడం అన్న పెద్దాయన మాట కరెక్టేనా?ఇట్టాంటి సందేహాలన్నీ యమా సీరియస్సుగా యెవరికయినా వొస్తే ఆ మనిషి మహా ప్రమాదకారి అని గ్రహించండి,అతనితో ఆచితూచి ముందూ వెనకా చూసుకుని వ్యవహరించండి!అర్ధరాత్రి పూట ఆ మనిషిని కలవాల్సొస్తే ఓ నలుగుర్ని తోడు తీసుక్కుని వెళ్ళేటంత గట్టి జాగ్రత్తలు తీస్కుంటే ఇంకా మంచిది?

లేకపోతే యేంటండి!ఓ రెండు మూడు గంటలు అట్లా బయటికెళ్ళి మళ్ళీ ఇట్లా కొంపకి జేరే పనికి తెగబారెడు చర్చలు అవసరమా చెప్పండి?ఈ గందరగోళంతోనే కొందరు తిండిపోతులు మంచి సినిమా విందుభోజనంలా ఉండాలనీ,కొందరు ఉషారెక్కువైనోళ్ళు మంచి సినిమా గంతులేయించాలనీ,యెర్ర మేధావిత్వం యెక్కువైనోళ్ళు మంచి సినిమాలో సామాజిక స్పృహ ఖచ్చితంగా వుండితీరాలనీ వూదరగొడుతూ అసలే టిక్కెట్ల ధర దగ్గిర్నుంచీ ఇంటర్వెల్లో పాప్కార్న్ ఖర్చులన్నీ లెక్కేసుకుని ధియేటరు కెళ్ళడానికి ధైర్యం చాలని పిరికి మేళాల్ని మరింత హడలగొట్టి సినిమా పరిశ్రమని మట్టానికి మునిగేట్టు చేస్తున్నారు గానీ నా లెక్కలో మాత్రం సినిమా హాల్లో మనం చూసిన కంటెంటు అక్కడే మర్చిపోయేట్టు గాకుండా హాలు బయట కూడా అప్పుడప్పుడూ కనబడుతూ ఉండాలి - అది జోకయితే ఆ సినిమా గుర్తొచ్చి నవ్వొస్తుంది,అది బుర్రలో లైటు వెలిగే రకం సినిమా అయితే చూసినందుకు డబల్ ధమాకా అన్నమాట!

అయ్ బాబోయ్ మాంచి వూపులో బల్లేగా వాగేశాను గానీ నన్ను బద్నాం జెయ్యాలనుకునే వోళ్ళు ఈ రీజనింగు జాగర్తగా కూడబలుక్కుని సదివి మీనింగు బోదపర్చుకుంటే నా బతుకు బస్టాండే గందా బాబులూ?!యెందుకంటారా చక్రపాణి బాబాయి గారు మెస్సేజిలు వొద్దన్నాడు గనక అది లేదు బాగానే ఉంది ఓకే!మరి హాల్లో చూసింది బయట గూడా కనపడాలన్నది ఇరవయ్యొకటో సెంచరీలో గొట్టాం ప్యాంటులేసుకుని తిరిగే మనకి జరీ బుటేదారీ అంగరఖాలు తొడుక్కుని హీరో దేవకన్యల్ని పెళ్ళాడాలనుకునే సంగతులు యెక్కడ కనబదతాయోయ్ హరిబాబూ చెప్పవయ్యా చెప్పు అని నిలదీస్తే గుడ్లు తేలెయ్యాల్సిందే గందా?

మామ్మూలుగా అయితే అంతే గానండి నా లక్కు బాగుండి మా ఆంధ్రా యూనివర్శిటీలో ఒక సరదా సీను నడిచింది సారూ - ఈ సినిమా లేకపోతే ఆ సీను అట్టా నవ్వించేది గాదు మరి!జాయినయిన మొదట్లో హాస్టలు రూములు దొరక్క డిగ్రీలో నాకు క్లాస్ మేటయ్యి ఇక్కడ సీనియర్ అయిన ఫ్రెండు రూములో సెటిలయ్యాను నేను.మిగతా వాళ్ళంతా హాస్టలు మొత్తానికి ఒకటే అయిన కామను హాలులో నేలమీద దుప్పట్లతో కాలం గడిపేస్తున్నారు.నా రూమ్మేటు స్టూడెంటు యూనియన్ పాలిటిక్సులో మాంచి జమాజెట్టీలా వెలిగిపోతున్నాడు!అతన్ని చూడ్డానికి ఒకతను వచ్చేవాడు,అతని సబ్జెక్టు గుర్తులేదు గానీ అన్ని బ్రాంచీల్లోనూ అతనికి ఫ్యాన్సు వుండేవాళ్ళు.చూట్టానికి అస్సలు బాగుండకపోయినా అంతమంది ఫ్యాన్సు వుండటానికి కారణం యెంత డ్రై టాపిక్కునయినా జోకులా మార్చగలిగిన చాతుర్యం!ఒకసారి మా గ్రూపు సీనియర్లకీ జూనియర్లకీ క్రికెట్టు పోటీ జరుగుతుంటే తనూ వచ్చాడు.మా సీనియర్లని ఉషారు చెయ్యటానికి సీనియర్ అమ్మాయిలు బ్యాటింగు కెళ్తున్న ఒక సీనియర్ అబ్బాయిని,"నువ్వే మా అశాజ్యోతివి" అనంగానే "ఆశాజ్యోతి అంటే ఫర్వాలెదు గానీ జీవనజ్యోతి అని మాత్రం అనకండి బావుండదు" అని రిటార్టు ఇచ్చేసరికి మొగుడు జీవన జ్యోతి అవుతాడు గదానే అర్ధం వెలిగి అమ్మాయిల కందరికీ బుగ్గలెర్రబడిపోయి మళ్ళీ నోరిప్పితే ఒట్టు కాస్సేపటి దాకా:-)

అసలు జోకు ఇది కాదు అతని స్పాంటేనియిటీ యే రేంజిలో ఉంటుందో శాంపిలు చెప్పాను, అసలు జోకు కూడా మా సీనియర్ అమ్మాయిల మీదే పేలింది!యానివర్సరీ ఫంక్షనులో "ఇండియన్ బ్రైడ్స్" అనే టాపిక్ తీసుకుని మొదట ఒక్కొక్క అమ్మాయి ఇండియాలో ఒక్కో ప్రాంతపు పెళ్ళికూతురు అలంకరణలో వచ్చి ఆఖర్లో అందరూ వరసగా నిలబడ్డారు.వెంఠనే కుర్చీలోంచి అమాంతం లేచి నిలబడి అచ్చు యెంటీవోడి మాదిరిగానే చేతులు బార్లా జాపి "ఓ దివ్యరమణులారా!నేటికి కనికరించినారా?" అని రాగయుక్తంగా మైకు లేకపోయినా మా అసెంబ్లీ హాల్లో చివరి వరసక్కూడా వినపడేలా పెద్ద గొంతుతో యెత్తుకునేసరికి కింద వున్న మేము ఘొల్లున నవ్వడంతో పాటూ అక్కడ స్టేజిమీద సిగ్గుపడాల్సిన పెళ్ళికూతుళ్ళు గూడా పెట్రోమాక్సు లైట్ల లెవెల్లో నవ్వేశారు - అయ్యా అదండీ ఇవ్వాళ్టి రోజుల్లో జగదేకవీరుని కధ రెలెవెన్సీ!

జనం సినిమా కని వెళ్ళినోళ్ళు సినిమా చూసి సరిపెట్టుకోకుండా పాప్కార్న్ యెందుకు నముల్తారు?దానికి చాలా తింగరి లాజిక్కులు చెప్పుకోవొచ్చు గానండి నా లెక్క ప్రకారం యేదో పోటుగాడి మల్లే అంతదూరం పోయి డాబుగా డ్రస్సు జమాయించి పోయి సుఖమైన సీటులో కూర్చోంగానే పాతకాలం రాజుల మాదిరి మేజువాణీ డ్యాన్సులు చూస్తూ ఉన్నట్టు ఫీలయిపోయి నేను సకల కళా పల్లవుణ్ణి,ఒక్కసారి బుధ్ధిగా సినిమా చూడ్డమనే ఒక్క పనేం ఖర్మ యెన్నిపన్లయినా చెయ్యగలను అని బోల్డు కాంఫిడెన్సు బలిసిపోతాదనుకుంటాను!నేను సినిమా హాల్లో లేకపోయినా నా ముందున్న  కంపుస్కూటరు మహత్యం వల్ల నాకూ ఆ రోగం అబ్బి బుధ్ధిగా సినిమా చూడనివ్వకుండా మళ్ళీ "నలుగురు దేవకన్యలే యెందుకు?నలుగురు దేవకన్యలే యెందుకు?" అనే కొశ్చెను మైండులో రీసౌండ్ ఇస్తా వుంది?అది మరీ పెరిగి పెరిగి దీన్నిట్టాగే వొదిలేస్తే ఒక్కసారి రెండుపన్లు చెయ్యడం కాడు రెంటికీ కలిపి ఒక్కసారే గుక్కపట్టి యాడవాల్సి వొచ్చేలా ఉందని పాజు నొక్కి థింకటం మొదలు పెట్టా?

థింకగా థింకగా  తట్టిన రీజను బాగానే ఉందనిపించింది - అదేమిటంటే ప్రతి మగాడికీ తన భార్యలో నాలుగు లక్షణాలు ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది,అటాంటి నాలుగు లక్షణాల్లో ఒక్కొక్కదాన్నీ ఒక్కొక్క దేవకన్యలో ఇరికించారు ఆ నాగిరెడ్డీ చక్రపాణీ పింగళీ అనే అమేధావి త్రయం!నేనే విడివిడిగా అనలైజు చేస్తా పైన సినిమా చూస్తా ఉండారేమో గందా మిమ్మల్ని మీరే ఆలోచించుకోండని ఆట్టే కష్టపెట్టకుండా!మొదట ఇంద్రుడి కూతురు దేన్ని సూచిస్తుండి - పవర్ని!ఆడంగులు నలుగురు ఒకచోట జేరితే మొదట వాళ్ళ మధ్యన రగిలే కామను సబ్జెక్తు "మా ఆయన ఇట్లా","మా ఆయన అట్లా" అనే టాపిక్కు!అదే నలుగురు మగంగులు కలిస్తే వీలున్నంత వరకూ "మా ఆవిడ ఇట్లా","మా ఆవిడ అట్లా" అనే టాపిక్కుని అవాయిడ్ చెయ్యాలని విశ్వప్రయత్నం చేస్తారు?తప్పనిసరయి వచ్చిందంటే మాత్రం "అబ్బో మా అవిడ చాలా పవరు గల మనిషి,యే మాత్రం తేడా వచ్చినా అంతే,ఇరగదీస్తుంది(అందుకే నేను బుధ్ధిగా ఉంటా?)" అనే రేంజిలో ఉంటయ్ కబుర్లు,అవునా కాదా చెప్పండి?!

వరుణ దేవుడి కూతురు అంటే వర్ష ధారాపాతం - యే త్రిషా కృష్ణనో నిత్యా మీననో భోరున యేడుస్తుంటే మగాడి కేమనిపిస్తుంది?గాఠ్ఠిగా కావిలించుకుని ఓదార్చి బోల్డు హీరోయిజం చూపించెయ్యాలనిపిస్తుంది!ఓదార్చడానికీ కావిలించుకోవటానికీ సంబంధం యేంటంటారా - మగబుధ్ధండీ మగబుధ్ధి - ఒక చెయ్యి చాలుగా చెంపల మీద చారికల్ని తుడవటానికి మరో చెయ్యి ఖాళీగా ఉంటుందిగదా నచ్చిన చోట అట్లా అట్లా నిమురుతూ మనమూ కాస్త కిట్టించుకోవొచ్చు:-) కాబట్టి అప్పుడప్పుడూ అట్లా మనం ఓదార్చటానిక్ వీలుగా అందంగా యేడుస్తూ ఉండాలి!అవతల్నించి ఆవిడ పాటికావిడ మన్ని బుట్టలో వెయ్యడానికి ప్లాను ప్రకారం చేసినా పర్లేదు, మనకి గిట్టుబాటయితే చాలు!

నాగదేవుడి కూతురు - కాటేస్తే కాలకూట విషం తలదాకా యెక్కించగలిగి పగబడితే జీవితకాలం వేధించగలిగిన మెలికలు తిరిగే మెహబూబా!కొందరు ఆడవాళ్ళ ప్రేమ కూడా పగలాగే ఉంటుంది?కొందరు ఆడవాళ్ళ పగ కూడా ప్రేమలాగే ఉంటుంది!ప్రతిదీ తనకు నచ్చినట్లుగానే ఉండాలంటారు,అన్నీ అమర్చిపెట్టి ఈ అమరికలోనే ఉదిగి పొమ్మంటారు,అప్పుడే నువ్వు నాకు నచ్చుతావంటారు.హెయిర్ స్టైల్ నుంచి బూట్ల వరకూ వాళ్ళు సెలక్టు చేసిన వాటికే మనమూ వోటు వేయాలంటారు.కుదరదన్నామో బుసబుసల హుంకారాల నుంచీ కంచానికీ మంచానికీ దూరం చేసే వరకూ యెంత క్రూరమైన శిక్షల కైనా వెనుకాడరు!ఒక వైపు నుంచే చూస్తేనో పురుషాహంకారం జాస్తిగానో ఉంటే తప్ప అన్నీ అంత పధ్ధతిగా అమర్చిపెడుతుంటే హాయిగా అనుభవించడానికి గొడవెందుకు పెదతాడు బుధ్ధిమంతుడైన మగాడు?

ఇక అగ్నిదేవుడి కూతురంటే పొగల సెగల భుగభుగల భయద సౌందర్యం!ఇదేంట్రా బాబూ పోయి పోయి కోపిష్టి తనాన్ని కూడా కోరుకుంటామా,యెందుకు నాయనా మొహం వాచేలా చివాట్లు తినడానికా అని నన్ను ఈసడించుకోబోయే ముందు ఒక్కసారి సత్యం కాస్తా మేటాస్ అయ్యి వూచలు లెక్కబెడుతున్న ఒకనాటి ఉద్యానవనాన్ని గుర్తుకు తెచ్చుకోండి!ఆ రోజుల్లో ఆయన శ్రీమతి గనక ఈయన గారు చెయ్యబోయే తప్పుడు పని ముందే తెలుసుకుని "యేందిరా నాబట్టా ఈ పాడుపని?గాచ్చారం గాండు మారి నువ్వుగాని అర్ధాంతరంగా చిప్పకూడు తినేకాడి కెళ్తే నేను గాడిదల్ని కాయాల్నా?" అని నిగ్గదీసి ఉంటే యెట్టా ఉండేది - ఇప్పటికీ జిగ్గు భగేలు మంటా ఉండేవోడు పాపం!ఆడపెత్తనం బోడిపెత్తనం అని విసుక్కుంటారు గానీ దేవుళ్ళనే తీసుకోండి వైకుంఠవాసి భక్తులు యెంత గింజుకున్నా వెంటనే పరిగెత్తకుండా ఆవిడగారు పర్మిషన్ ఇవ్వందే వీసమెత్తు వరం కూడా ఇవ్వకుండా జాగర్తగా ఉండి యెంత క్షేమంగా ఉన్నాడు,ఇంకో ఆయన కైలాస వాసి పిలిచిందే తడవు పక్కనే ఉన్నా ఉమాదేవికి ఒక్క ముక్క చెప్పకుండా ఝామ్మని వరాలిచ్చేసి యెన్నిసార్లు ఇరుక్కుపోయాడో చూడండి!ఆ భస్మాసురుడి దగ్గిరా గజాసురుడి దగ్గిరా అన్ని అవస్థలు పడుతుంటే మళ్ళీ ఆవిడగారే తమ్ముడుగార్ని బతిమాలుకుంటే ఆయన గూడా వెయ్యగూడని వేషాలన్నీ వేసి రక్షించి తీసుకురావాల్సొచ్చింది?

హమ్మయ్య!రీజనింగు బాగానే కుదిరింది గానీ "Judge not others,Judge yourself" అన్నట్టు జనాలు కూడా వాళ్ళ మాట చెబితే గానీ ఓకేనా జోకేనా అనేది తెలియదు.జనం ముందు నిలబడి యేం చెప్పినా నేను పోటుగాణ్ణి నేను యేం చెబితే అది కిక్కురుమనకుండా ఫాలో అయిపోండి అంటే సాగదు గదా!మతిలేని మాటా శృతిలేని పాటా అన్నారు అప్పటి సినిమాలు ఇప్పటికీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేటంతగా బాగుండటానికి కారణం కేవలం వాళ్ళకున్న కామన్ సెన్సు మాత్రమే అంటే మీరు నమ్మగలరా? ఆ సినిమాలు తీసిన వాళ్ళు రెండు కొమ్ములూ నాలుగు భుజాలూ లాంటివేమీ లేకుండా చాలా మామూలు తెలివైనవాళ్ళు గాబట్టి ఆ సినిమాల్లో గూడా మనకా తెలివే కనిపించి ముచ్చటగా అనిపించేది,పక్కోడి గురించయినా మరి దేని గురించయినా సరిగ్గా ట్వీటడమే తెలియని కామగోపాల వర్మల నుంచి అట్లాంటి తెలివైన సినిమాల్ని యెట్లా ఆశించగలం?

ఈ సినిమాలో అచ్చం కచ్చేరీ చేసినట్టుగా కనిపించి వినిపించే శివశంకరీ...శివానందలహరి పాట ఎంత పెద్ద విజయమో సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ పాట వెనుక ఎందరు హేమాహేమీలు శ్రమపడ్డారు. పాట రచయత పింగళి నాగేంద్రరావు, స్వరకర్త పెండ్యాల, గాత్రం అందించిన ఘంటసాల, దర్శకుడు కె.వి.రెడ్డిల సమష్టి కృషి ఫలితమే శివశంకరీ పాట. ఇందరు ప్రతిభావంతులు ఈ పాటకు చిత్రిక పడితే నటరత్న నందమూరి తారకరామారావు వెండితెరపై తన నటనతో జీవంపోశాడు. దర్శకుడు కె.వి.రెడ్డి అప్పటికే సినిమాలో అన్ని పాటల రికార్డింగ్‌, చిత్రీకరణ‌ పూర్తి చేశాడు. కథకు కీలకమైన సన్నివేశానికి సంబధించిన పాట మాత్రమే మిగిలి ఉంది. కథానాయకుడు తన గానంతో గండశిలను కరిగించే సన్నివేశంలో వచ్చే పాట అది. సన్నివేశాన్ని సంగీత దర్శకుడు పెండ్యాలకు కె.వి.రెడ్డి వివరిస్తూ ‘మనం ఇప్పుడు చేయాల్సిన పాట సినిమాకు గుండెకాయ లాంటిది. సంగీతంలో తాన్‌సేన్‌, ఓంకారనాథ్‌ ఠాగూర్‌ వంటి ఎందరో ప్రయోగాలు చేశారు. అంతెందుకు. నారద, తుంబురుల మధ్య వివాదం వచ్చినప్పుడు హనుమంతుడు పాడితే శిలలు కరిగాయట. అంతటి ఎఫెక్ట్‌ మన పాటకు తీసుకురావాలి. "జగదల ప్రతాప్‌" సినిమా మన కథకు ప్రేరణ. ఒకసారి ఆ సినిమా చూసి రండి’ అన్నారు. పెండ్యాల చిన్నగా నవ్వి ‘ట్యూన్‌ మనం సొంతంగానే చేద్దాం’ అన్నారు. పింగళి వారు వెంటనే కలం పట్టి ‘శివశంకరీ శివానందలహరి’ అని రాసిచ్చారు. దానికి పెండ్యాల కూర్చిన దర్బార్‌ రాగం చివరకు ఓకే అయింది. మరుసటి రోజు పెండ్యాల పూర్తి పాట రాసిచ్చాడు. పెండ్యాల వారు పాడి వినిపించారు. పాట పూర్తయ్యే సరికి సరిగ్గా 13 నిమిషాలు పట్టింది. ఆరున్నర నిమిషాలకు పాట కుదించమని దర్శకుడు సూచించడంతో పెండ్యాల ఆ పాటను ఆరున్నర నిమిషాలకు కుదించి ఘంటసాల వెంకటేశ్వరరావుకు వినిపించాడు. ఆయన ఆనందానికి అవధులు లేవు. ఈ పాట నేను తప్పనిసరిగా పాడతాను. ఎన్ని రిహార్సల్స్‌ అయినా సరే అంటూ 15 రోజుల పాటు ఘంటసాల రిహార్సల్స్‌కు హాజరయ్యారు. అనంతరం పాట రికార్డింగ్‌ కూడా పూర్తయింది. ఇదంతా ఒక ఎత్తు అయితే పాటకు అనుగుణంగా ఎన్టీఆర్‌ చక్కటి హావభావాలు ప్రదర్శించవలసి ఉండడంతో ఆయన కూడా నాలుగు రోజుల పాటు రిహార్సల్స్‌ చేసాడు. పాట చిత్రీకరణ సెట్స్‌ మీదకు వచ్చింది. ఎన్టీఆర్‌ పాటకు అనుగుణంగా చక్కని పెదాల కదలికతో యూనిట్‌ మొత్తాన్ని మంత్రముగ్ధుల్ని చేశాడు. వెండితెరపై ఆ పాటకు, ఎన్టీఆర్‌ అభినయ కౌశలానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ చిత్రం 1961లో విడుదలైంది. ఈ పాట తెలుగు ప్రేక్షకులమీద చూపిన ప్రభావానికి ఒక ఉదాహరణ.డెబ్భయ్యవ దశకంలో రేపు (సి.నరసింహారావు) అనే పేరుతో ఒక మనోవైజ్ఞానిక పత్రిక వచ్చేది.అందులో ఒక పాఠకుడు శివశంకరీ పాట వింటుంటే కలిగే అనుభూతులు వివరించాడు.అతనికి నిజంగానే దేవకన్యలు ఉన్నట్టు,సినీమా,సంగీతంతో సహా జరుగుతున్నట్టు,తను ఎన్నికష్టాలు పడైనా వారిని కలవాలని అనుభూతి చెందేవాడట.



అసలు విజయా బ్యానర్ తెర మీద అలా అలా కనపడుతూ ఉండగానే ఒక రకమైన మూడ్ వచ్చేస్తుంది!బ్యానర్ మొదట్లో చీకటిగా మొదలై క్రమంగా వెలుగు పరుచుకుంటూ క్రియాసిధ్ధి స్సత్వే భవతు అనేది పూర్తిగా కనపడినాక ఆర్చి లోపల రెపరెపలాడే హనుమద్ధ్వజం అలా కాసేపు కదిలి వెంటనే మాయమైపోతుంటేనే గొప్ప సినిమా చూడబోతున్నామన్న ఫీలింగు వచ్చేస్తుంది,అదో మ్యాజిక్!

మంచి సినిమాలు తియ్యడానికి కనీసపు కామన్ సెన్సు చాలని యెంతమందికి తెలుసు!

Tuesday, 30 September 2014

శభాష్ దీపికా!నువ్వు నాకు నచ్చావ్!!

            యే భాష అయినా కానివ్వండి, సినిమా వాళ్ళు సభ్యతాసభ్యతల్ని మర్చిపోయి చాలా కాలమయింది!కమల్ హాసన్,ప్రకాష్ పడుకొనె లాంటి వాళ్ళ సంతానం సినిమాల్లోకి వచ్చినా మంచి పాత్రలు చేసి గౌరవప్రదంగా నడుచుకుని తంద్రుల గౌరవాన్ని మరింత పెంచటం లాంటి సుత్తి విషయాల్ని పట్టించుకోకుండా తాము కూడా తమ అందాల్ని ఆరబోస్తూ మార్కెట్ పరంగా లాభసాటి సరుకుగా మారిపోతున్నారు.సరుకుగా యెప్పుడయితే మారారో వాళ్ళ వ్యక్తిత్వాన్ని గురించి యెవడూ ఆలోచించడనే విషయాన్ని మాత్రం మర్చిపోతున్నారు.ఆ మతిమరుపు వల్లనే దీపికా పడుకొనె కి ఆ ఇబ్బందికరమయిన పరిస్థితి దాపరించింది!


          అడుసు తొక్కనేల?కాలు కడుగనేల?దీపిక పడుకొనె కి అంత కోపం యెందు కొచ్చింది?తను చేసింది తప్పు కాదనే అనుకుంటున్నదా?నా దృష్టిలో ఖచ్చితంగా తప్ప్పే!యెందుకంటే ఆ ఫొటో తీసిన సందర్భం ఆవిడ నటించిన సినిమాలోని దృశ్యం కాదు, సినిమాల్లో మేము రోజూ చేసేది అదే కదా అని సమర్ధించుకోవటానికి!ఒక పబ్లిక్ ఫంక్షన్ లో తను అలా కనపడింది అంటే అప్పుడు తన ఇష్టాపూర్తిగా వేసుకున్న డ్రెస్సే కదా అది!ఒక సరుకుగా మారిన తను ఆ ఫంక్షన్ కి వచ్చే సినిమా వాళ్ళ దృష్టిలో పడాలనే కదా అలా వెళ్ళింది?జరగాల్సిన హాని జరిగిపోయాక పరువు పూర్తిగా పోయాక యెంత కోపగించుకున్నా ముళ్ళకంప మీద పడిన బట్తని గుంజినట్టే!ఆ స్థలానికి ఆ కాలానికి దొరికిపోయిన ఆ దీపిక మీద నాకు జాలి తప్ప ఆ దీపికని విమర్శించాలని కూడా లేదు నాకు!రేపు అదే పరిస్థితిలో కాల్ హాసన్ గారమ్మాయి కూడా నిలబడొచ్చు,అలా ఇంకెన్నడూ జరగదని చెప్పలేం?!యేది యేమయినా ఆ ఫొటో/వీడియో పబ్లిష్ చేసిన జర్నలిష్టు ఒక చిన్న కుదుపునైనా తీసుకు రాగలిగాడు, సత్యమేవ జయతే అమీర్ సాబ్ కూడా కేవలం నిర్మాతల్ని తప్పు పట్టి ప్రయోజనం లేదు లెండి, మాలాంటివాళ్లం కూడా అంతో ఇంతో కారణమే అని వొప్పుకునేలాగ చేశాడు!

           నేను శభాష్ అని మెచ్చుకుంటున్న దీపిక మరో సెలెబ్రిటీ, దీపిక పల్లికల్ - స్క్వాష్ ఆటలో మేటి!డిసెంబర్ 2012 నాటికే WSA rankingsలో టాప్ 10లోకి యెగబాకగలిగింది!2006లో ప్రొఫెషనల్ కరీర్ మొదలు పెట్టి యెన్నో యెత్తు పల్లాల్ని చూసి ఆఖరికి 2011 సెప్టెంబర్ లో ఇర్విన్ లో మొదటి WISPA టైటిల్ గెలుచుకోవడంతో అందరికీ తెలియడం మొదలయింది!


          చూశారుగా యెంత అందంగా వుందో!బాలీవుడ్ మహారాజాల కళ్ళు పడకుండా వుంటాయా?ఈ అందాల్ని తెరమీద ఆరబోస్తే యెన్ని కోట్ల లెక్కన గిట్టుబాటవుతుందో గదా అని తెగ ఆశపడ్డారు, పాపం!కానీ ఈ అమ్మాయికి ఆరకమయిన దురద లేకపోవడంతో కుదరదని చెప్పేసింది.వూరికే చెప్పి వొదిలెయ్యటం కాదు, తను ఒక వర్ధమాన క్రికెట్ ఆతగాణ్ణి ఇష్తపడుతున్నది - అతని అభిప్రాయం కూడా దానికి వ్యతిరేకంగానే వుండటంతో తను యెప్పటికీ తెరమీద కనబడే చాన్స్ లేదని ముఖం మీద తలుపేసేసింది. ఈ అమ్మాయి గురించే నేను చెప్పింది:

శభాష్ దీపికా!నువ్వు నాకు నచ్చావ్!!

Tuesday, 23 September 2014

చార్లీ చాప్లిన్ ట్రాంప్ - రాజ్ కపూర్ ఆవారా

          సాహిత్యంలో ఒక కవి గానీ రచయిత గానీ శ్రధ్ధగా ఒక పాత్ర స్వభావాన్ని స్పష్టంగా రూపు దిద్దితే ఆ పాత్ర ఆ రచన కన్నా ఇంకా చెప్పాలంటే ఆ రచయిత కన్నా ప్రముఖంగా చదువర్లకు అభిమాన పాత్ర మవుతుంది. గిరీశం, పార్వతీశం, గణపతి లాంటి పాత్రలు మన తెలుగు సాహిత్యంలో చాలా వున్నాయి. ఇప్పటి కుర్రాళ్లయినా సరే ఆ రచనల్ని చదివితే వాళ్ళు కూడా ఆ పాత్రల్ని నిజ జీవిత వ్యక్తులు గానే భ్రమ పడతారు. సాహిత్యంలో లాగే సినిమాల్లో కూడా ఇలాంటి పాత్రలు కొన్ని వున్నాయి. కానీ ప్రపంచ సినిమా చరిత్ర లోనే అలాంటి పాత్ర లన్నింటిలో విశేషంగా చెప్పదగిన ఒకే ఒక పాత్ర చార్లీ చాప్లిన్ సృష్టించిన ట్రాంప్.


  
         అతడు సృష్టించిన ముహూర్త బలమో యేమిటొ గానీ చూసే వాళ్లలో వున్న పిల్లల్నీ పెద్దల్నీ ఒక్కలాగే అలరిస్తూ సాటి కళాకారుల్ని కూడా దానికి నకళ్లని సృష్టించేటంతగా ప్రభావితం చేసింది! దీన్ని ప్రతీకాత్మక పాత్ర(prototype) అనవచ్చు. యెందుకంటే అన్ని సినిమాల్లోనూ ఒకే గెటప్తో కనబడినా చుట్టూ వున్న వాతావరణంలోనూ మిగిలిన పాత్రల్లోనూ మొత్తం కధలోనూ పూర్తి విభిన్నత వుంటుంది. అంటే ఇలాంటి మనిషి యెక్కడ వున్నా ఒకటేలే అనే వ్యాఖ్యాన ధోరణి అంతర్భూతంగా వుంటుంది. ఆ పాత్రకి నిర్ధిష్తమయిన చట్రం యేదీ లేకపోవడం వల్లనే కాబోలు చూసే వ్యక్తి  ఆ సన్నివేశంలో నేను వున్నా అలాగే ప్రవర్తిస్తానేమో అనే విధంగా స్పందించి తనకి ప్రీతిపాత్రం చేసుకోవడం సాధ్యపడింది?!



         వేషభాషలు ఒక్కలాగే వున్నా కధని బట్టి ప్రవర్తన మారుతుంది.ఒక సినిమాలో పారిశ్రామికాధిపతులు ప్రొడక్టివిటీ పెంచటానికి చేసే - లంచ్ టైముని తగ్గించటానికి తిండి తినిపించే యంత్రాన్ని వాడటం లాంటి - పిచ్చి పన్లకి బలవుతూ యంత్రాల్లో యంత్రం లాగా తిరుగుతూ పనిభారం యెక్కువయ్యి నట్టులాగా కనబడితే ఆదవాళ్ళ స్కర్టు బటన్ మీద కూడా రెంచీని వాడేటంతగా పిచ్చెక్కి పోయి పిచ్చాసుపత్రికి వెళ్ళే కార్మికుడి లాగా కనబడితే, మరొక సినిమాలో ముందు ఒక చిన్న పిల్లవాడితో అద్దాలు పగల గొట్టించి తర్వాత తీరిగ్గా తను వెళ్ళి అద్దాలు బాగు చేసే బతక నేర్చిన వాడిగా కనబడతాడు. ఒక దద్దమ్మని రకరకాల సన్నివేశాల్లో - వాడి పరిష్కార శక్తికి అతీతమయిన సమస్యల్లో ఇరికించి - నిలబెట్టి వాడు తన అతితెలివి/తెలివిలేమి తో వాటి నుంచి బయటపడే పధ్ధతుల నుంచి హాస్యాన్ని పుట్టించి ప్రపంచంలో వున్న దద్దమ్మల కందరికీ ఒక గౌరవనీయమయిన బ్రాండ్ గా ట్రాంప్ ని తీర్చిదిద్దాడు చాప్లిన్!

             అంత ప్రభావాన్ని చూపిస్తున్న ఈ ట్రాంప్ ని చూసి ఇలాంటి పాత్రల్ని సృష్టించాలని సాటి కళాకారులు కూడా వువ్విళ్ళూరడంతో ఆ పాత్రకి నకళ్ళుగా చాలా పాత్రలు వచ్చాయి.కానీ వాటిలో చాలామటుకు ఇమిటేషన్లుగా మిగిలి పోగా భారతీయ నటదర్శకుడైన రాజ్ కపూర్ సృష్టించిన ఆవారా పాత్ర ఒక్కటే ప్రత్యేకంగా వుండి గెలుపు గుర్రంలా నిలబడింది. దానికి కారణం కేవలం అనుకరించి సరిపెట్టుకోకుండా తన అవసరం యేమిటో తెలుసుకుని మార్పులు చేసి ఒరిజినాలిటీ చూపించటం! చాప్లిన్ పూర్తిగా హాస్యానికి పెద్దపీట వేసి స్లాప్ స్టిక్ కామిడీ కి మాత్రమే పరిమితం చేస్తే ప్రేమ, విషాదం లాంటి మిగతా ఫీలింగ్స్ కూడా చూపించి కొంత గంభీరంగా తయారు చేసాడు రాజ్ కపూర్ తన ఆవారాని. ఇక్కడా హాస్యం తప్పనిసరిగా వుంటుంది గానీ మీసాన్ని నార్మల్ గా వుంచటంతో  చిలిపితనం డోసు పెరిగి రొమాంటిక్ లుక్ కూడా వచ్చింది.


              అక్కడి లాగా ఇక్కడ కూడా ఒక్కో సినిమాలో ఒక్కో నేపధ్యం వున్నా పాత్ర తీరు తెన్నులు ఒక్కలాగే వున్నా పాత్ర మూడ్ మారుతుంది, అదీ ఇక్కడ ట్రాంప్ కన్నా ఆవారా లో వున్న తేడా! ఆవారా సినిమా  కధలోని పాత్రలో విషాదం వుంటుంది. పుట్టుకతో జడ్జి గారబ్బాయి, జడ్జి గారు తనని అన్యాయంగా శిక్షించాడనే కసితో యెత్తుకెళ్ళి జేబు దొంగగా ట్రయినింగు ఇస్తాడు జడ్జి ద్వారా జైలు కెళ్ళిన వాళ్లలో ఒకడు. చివర్న బోనులో నిలబడి న్యాయమూర్తి అయివుండి కూడా భార్యనీ కొడుకునీ నిర్లక్ష్యం తోనూ కఠినత్వం తోనూ అన్యాయం చెయ్యడాన్ని ప్రశ్నిస్తూ తను ఇచ్చిన స్పీచ్ నిజంగా అధ్భుతం! ఆ తర్వాత చాలా సినిమాల్లో చాలామంది హీరోలు కోర్టుహాలు స్పీచులు దంచేసినా ఆ స్థాయికి తూగలేక పోయాయి. చాప్లిన్ "గ్రేట్ దిక్టేటర్" లో "ఫైకి చూడు హన్నా" స్పీచితో సరితూగగలిగేటంత గొప్ప స్పీచ్ అది! అందులో తను వేసిన ప్రశ్న- "చిన్నప్పుడు మమ్మల్ని నిర్లక్ష్యం చేసి మేము నేరస్తులుగా తయారయ్యేలా మాకు అన్యాయం చేసి మళ్ళీ మమ్మల్ని బోనులో నిలబెట్టి శిక్షలు వేసి మీ తప్పులకి మమ్మల్ని బలి చేసి మీరు మాత్రం పెద్దమనుషులుగా చెలామణీ అవుతున్నారే, ఇది అన్యాయం కాదా?" అనే ప్రశ్న అక్కడి తండ్రికి కాదు మొత్తం సమాజానికి అని అర్ధమయితే రాజ్ కపూర్ పరిశీలనాశక్తి యెంత గొప్పదో తెలుస్తుంది.


              అదే శ్రీ 420 లో కోట్లకి పడగ లెత్తిన వాళ్ళు కూడా కాసిన్ని రూపాయి నోట్ల కోసం పిచ్చిగా పరుగులు పెట్టే దృశ్యాన్ని చూపించి నేను మామూలు 420 నయితే మీరు శ్రీ420లు అని దులిపేసే రెబెల్ లాగా కనిపిస్తాడు! ఆ క్లైమాక్సుని కొన్నేళ్ళ తర్వాత ఇట్స్ ఏ మ్యాడ్ మ్యాడ్ వరల్డ్ అనే సినిమాలో ఒక హాలీవుడ్ దైరెక్టర్ కాపీ కొట్టాడు?!ఒకసారి మన దేశం నుంచి రష్యా వెళ్ళిన వాళ్ళు కొందరు జాతీయ గీతం పాడమంటే "అవారా హూం" పాట పాడారు?రష్యా వాళ్ళు దాన్ని మన ప్రభుత్వానికి వూదారు! అది పెద్ద సంచలనం రేపింది అప్పట్లో?! రష్యా వాళ్లకి ఆ క్లూ తెలియడానికి కారణం వాళ్లంతా రాజ్ కపూర్ ఫాన్స్ అవ్వటమే! కొత్తగా శ్రామికవర్గనియంతృత్వం అనే ఆదర్సాన్ని నిక్కచ్చిగా పాటిస్తున్న వాళ్లకి రాజ్ కపూర్ సినిమాల్లో వుండే -  గానాబజానాల్తో హుషారుగా వుంటూనే సామాన్యుణ్ణి హీరోగా నిలబెట్టి అంతర్లీనంగా ఒక మెసేజిని ఇరికించడంలో వున్న - సామాజికస్పృహ తెగ నచ్చేయటం సహజమే కదా!

        బ్రహ్మ సృష్టికి దీటుగా మగవాడికి తన నెచ్చెలి యెలా వుంటే బాగుంటుందో తెలిసి సృజించగలిగిన సౌందర్యబ్రహ్మ రాజ్ కపూర్ కుంచె నుంచి జాలువారిన అత్యద్భుత సౌందర్యం - నర్గీస్! మిగతా వాళ్ళంతా అయితే అతివృష్టి లేకపోతె అనావృష్టి అన్నట్టు అసలు స్త్రీ సౌందర్యాన్ని పట్టించుకోకుండా దూరంగా వుండటమో లేదా అతిగా అందాల్ని ప్రదర్సనకు పెట్టేసి స్త్రీని ఆపిల్ పళ్ళూ జాంపళ్ళూ మంచాలూ కంచాలూ అని ఆహారపదార్ధం కింద మార్చెయ్యటమో చేశారు!

          శృంగారాన్ని సున్నితమయిన హాస్యంతో కలిపి లలితంగా చూపించటం రాజ్ కపూర్ కి తెలిసినంతగా మరొకరికి తెలియదు.పేద్ద గొప్పగా హీరోయినుకి ట్రీట్ గా టీ ఇప్పించబోయి ఆ అమ్మాయి దగ్గీరే ఒక పావలా అప్పు చెయ్యటం యెంత నైసుగా వుంటుందో - వేరే చెప్పాలా!  శ్రీ420లో వచ్చే ప్యార్ హువా ఇక్రార్ హువా పాట అయితే ఒక మార్మికసౌందర్యభరితమయిన అద్భుతమే, ఆనాటి అతి మామూలు వీధి చౌరంగీలేన్ అజరామరమైపోయింది ఈ పాటతో!

                 ఈ పాట మొదట్లో నర్గీస్ నచ్చిన వాడే అయినా తొలిసారి దగ్గిరగా వస్తుంటే సిగ్గరి అయిన ఒక మామూలు ఆదపిల్ల అనుభవించే తడబాటు నుంచీ గగుర్పాటు వరకూ యెంత సహజంగా చూపించిందో చూశారా?! అప్పటి కాలమే అంత కాబోలు! పరిస్థితి ఇప్పుడెలా వుందో తెలుసా? ఒక శనివారం నాకు హాఫ్ డే అవటంతో తనకి మూడింటికే స్కూల్ అయిపోతుందని తెలిసి ఈ బస్సుల్లో ఆటోల్లో యేమి తంటాలు పడుతుందిలే అని నేనే వాళ్ళ స్కూలు వరకూ వెళ్ళి బైక్ మీద తీసుకొస్తున్నా. అమ్మాయి లంతా మొహాలకి పల్లూ అడ్డం వేసుకోవటం చూసి, "యెండ కనుకుంటాను అమ్మాయి లంతా వుగ్రవాదుల్లా తయారయ్యారు" అని సర్దాగా కామెంట్ చేస్తే మా బంగారం, "లేదు లేదు, ఆ ముసుగుల కధ వేరే వుంది? తెలిసిన వాళ్ళు గుర్తు పట్టకుండా!" అనే సరికి మైండులో బాంబులు పేలినంత పనైంది?! అప్పటిదాకా ఒక్కముక్క తమిళం రాని నాకు తన్నుకుంటూ వొచ్చేసి, "అడాపావియా, యెన్నడా ఇదు కలికాలమా ఇరుక్క?!" అని వడివేలు మాదిరి గొణుక్కున్నా? అయ్యా, ఇవ్వాళ కొంచెం పెద్దదయిన ప్రతి టవున్లోనూ ఒక లవర్స్ పార్కు వుంటుంది! పోలీసులూ గట్రా యెట్సెట్రా వాళ్ళని డిస్టర్బ్ చెయ్యకుండా వుండేందుకు కొందరు పెద్దల అజమాయిషీలో దాని చుట్టూ పెద్దయెత్తున వ్యాపారం కూడా జరుగుతూ వుంటుంది!! చుండూరు కుర్రాళ్లని అంతగా రెచ్చగొట్టి అంతటి భయానకమయిన చావుకి కారకులయిన సినిమా రంగపు మాంసఖండాల విక్రేతలు వీళ్ళకి ముడిసరుకులు సప్లై చేస్తూ వుంటారు!!! ఆలోచించండి, అర్ధం చేసుకోండి, శలభాలు తమంతట తామే మాడిపోవటానికి సిధ్ధపడి వురక లేస్తుంటే కాల్చెయ్యటం సహజస్వభావమయిన అగ్నిజ్వాలలకి మొహమాటం యెందుకుంటుంది?



            నర్గీస్ దూరమయ్యాక ఇతని సినిమాల్లో విషాదం డోసు పెరిగింది.కధలు కూడా మరింత గంభీరమయినాయి. సాధారణంగా ఆ స్థాయి కళాకారుల్లో వుండే పసితనం తనే సృష్టించిన ఒక మహాద్భుత సౌందర్యాన్ని చూడగానే చకితుడై అది తనకే కావాలని కోరుకునేలా ప్రేరేపిస్తుంది! మోనాలిసాని సృష్టించిన డావిన్సీ దాన్ని యెవ్వరికీ ఇవ్వకుండా చచ్చేదాకా తన చెయ్యి దాటి పోనివ్వకుండా తన వెంట తిప్పుకున్నాడు! రాజ్ కపూర్ కి సెలెబ్రిటీగా వున్న స్టాటస్ కావాలంటే భార్యకి విడాకులు ఇచ్చి కోరుకున్న చిన్నదాన్ని దక్కించుకోవడానికి సహాయ పడి వుండేది. కాని అప్పటికే భార్య కృష్ణతో తనకున్న అనుబంధాన్ని తెంచుకోలేక వెనక్కి తగ్గాడు. అలా వెనక్కి తగ్గడం వల్లనే మనముందు అతను మరింత గౌరపప్రదంగా నిలబడ్డాడు! యెంతగా సర్ది చెప్పుకున్నా ఒకరి మీద మనకి ఇష్టం వుంటే వీలున్నంత వరకూ దగ్గరితనాన్ని ఆశిస్తాం కదా, ఆ బాధ వుండనే వుంటుంది! మేరా నాం జోకర్ ఇందుకు బలమయిన సాక్ష్యం! పేరుకి అది ఒక సర్కస్ బఫూను కధే గానీ అందులో చూపించిన దంతా తనలోని విషాదమే ననుకుంటున్నాను! చిన్నప్పటి టీచర్ నుంచీ ప్రేక్షకుల్లోని తన కిష్టమయిన వ్యక్తులంతా ఒక్కొక్కరూ ఒక్కొక్క కారణంతో దూర మవుతున్నా అ దుఃఖాన్నంతా భరించి జనాన్ని నవ్వించే పాత్రలో తన దుఃఖాన్నే కురిపించాడేమో?! అయినా సరే జీనా యహా మర్నా యహా అంటూ ఆశావాదాన్నే చూపించాడు! మళ్ళీ కూడదీసుకున్నాడు,మళ్ళీ మనోజ్ఞమయిన కలల్ని పేనటం మొదలెట్టాడు! ఈసారి కొత్తరకం కలలు! ఆవారాని పోలిన జోకర్ పాత్రతో ఆ వేషమూ దానితోపాటే ఆ లలితమయిన హాస్యమూ మాయమై పోయింది, అయితేనేం మరింత చిక్కని కధల్ని మరింత గొప్పగా వడ్డించాడు!

             సంగం లో దోస్త్ దోస్త్ నా రహా పాటని చూస్తున్నా వింటున్నా గుండె చిక్కబట్టేస్తుంది! తను యెంతగానో ఇష్టపడిన అమ్మాయి లావుగా వున్నాడనో నీకంత సీను లేదనో చిన్న చిన్న కారణాలతో తనని కాదని మరో స్నేహితుణ్ణే కోరుకుంటే తనలోని దుఃఖాన్ని తనలోనే దాచుకుని ఇద్దరూ స్నేహితులే కాబట్టి పైకి యేమీ అనకుండా వాళ్లకి బాగా ఆలోచిస్తే మాత్రమే తెలిసేలాగా తన బాధని వ్యక్తీకరించిన తీరు నాకు చాలా చాలా బాగా నచ్చింది! ఆడవాళ్ళ గొడవల్లో నేను ఇరుక్కోను గాబట్టి ఈ రకంగా కాదు గానీ  మరో రకంగా ఒక చిన్నప్పటి స్నేహితుడు నన్ను చాలా భయంకరంగా బాధ పెట్టాడు! ఈ పాట వింటున్నప్పుడు నా కోసమే రాశాడా అని ఒక సెంటిమెంటు కూడా నాకీ పాటతో యేర్పడి పోయింది! మనకో బాధ వుండి అది అలాగే మురిగి పోతూ వుంటే యెంతటి వాడికయినా చచ్చిపోవాలనేటంతగా నరకాన్ని చూపిస్తుంది. అదే నాలాంటి బాధనే మరొక మనిషి కూడా అనుభవిస్తున్నాడు అని తెలిస్తే, అది కూడా తను హీరోతో ఐడెంటిఫై అయిన ఒక సినిమాలో భాగమై కొన్ని కోట్లమంది చూసి తనలాగే ఫీలవుతున్నారని తెలిస్తే ఆ మనిషికి అప్పుడు చాలా రిలీఫ్ గా అనిపిస్తుంది, కదా?! నిజమయిన కళ అనేది అన్నం కలిపి ప్లేటులో పెట్టి ముద్దలు మింగించడం లాంటి పన్లు చెయ్యనక్కర్లేదు గానీ మనసు మూలల్లో పని చేసి అతన్ని కదిలించి ఆ మనిషికి జీవితం మీద ఆశని పుట్టిస్తే చాలునని వొప్పుకుంటే రాజ్ కపూర్ నూటికి తొంభై శాతం మార్కులు తెచ్చుకోగలిగిన నిజమయిన కళాకారుడు!

            ఆవారా సినిమాలో ఒక అద్భుతమయిన డ్రీం సీక్వెన్స్ వుంటుంది. హీరో జేబుదొంగ, హీరోయిన్  ఒక లాయరు, పైగా జడ్జి గారి మేనకోడలు! తన గురించి తెలియకుండా మ్యానేజ్ చేసి లైనేసినా యెప్పటికయినా నిజం తెలిస్తే - అనే భయాన్ని చూపిస్తూ అప్పటికీ ఇప్పటికీ మరెవ్వరూ అంతకన్నా గొప్పగా తియ్యలేరనిపించేటంత చాలా గొప్పగా తీశాడు. చాలాకాలం తర్వాత తమ్ముడు శశి కపూర్ "మళ్ళీ నువ్వయినా అంత గొప్ప డ్రీం సీక్వెన్స్ మరొకటి తియ్యలేవేమో" అంటే "ఆ శైలేంద్రా ఆ శంకర్ జైకిషన్లూ ఇప్పుడు వుంటే దాని బాబులాంటిది తియ్యగలను" అన్నాడట! యెంతయినా సింహం సింహమే, సింహంతో చాలెంజిలు చెయ్యగూడదు సుమా అనిపించింది!

             తన సినిమా లన్నింటిలోనూ వాస్తవానికి దగ్గిరగానే వుంటూ సమాజానికి పనికొచ్చే అంశాల్నే తీసుకుని ఆలోచనాత్మకమయిన సినిమాలే తీసినా ఆటపాటల తోనూ సౌందర్యం తోనూ అలంకరించటం వల్ల లైట్ గా తీసుకుని - సత్యజిత్ రే కూడా మనవాళ్ళ విమర్శల స్థాయి తక్కువ, నేనసలు పట్టించుకోను అని విసుక్కున్న - మన సినిమా విమర్సకులు వుత్త కమర్షియల్ డైరెక్టర్ గానే పొరబడ్డారు! జిస్ దేస్ మె గంగా బెహతీ హై లో బందిపోట్ల మధ్యన ఒక అమాయకుడు ఇరుక్కుని తన అమాయకత్వం తోనే వాళ్లని మార్చినట్టు చూపించాడు.సత్యం శివం సుందరంలో అందం అంటే చెంపల నున్నదనాన్నే చూడగూడదు - హృదయం,అనుబంధం లాంటివి కూడా ముఖ్యమే అనీ పరమసత్యాన్నీ చూపించాడు! అయినా మనవాళ్లకి ఇతను ఫార్ములా దర్శకుడి లాగానే కనిపించాడు?


               నాకు బాగా నచ్చిన రాం తేరి గంగా మైలీ లో అయితే ఒకటి కాదు చాలా అద్భుతాలు చేశాడు! మన తెలుగు సాహిత్యంలో రాఘవ పాండవీయం లాంటి ద్వర్ధి కావ్యాల్లో వుండే పైకి ఒక అర్ధం లోపల మరొక అర్ధం కనిపించే తమాషాని తెరమీద ఆవిష్కరించాడు! సినిమాల్లో ఈరకం టెక్నిక్ మరొకరు యెవ్వరూ ఇంత గొప్పగా వాడలేదు! నరేన్ అనే ఒక కుర్రాడు గంగోత్రి దగ్గిర గంగ అనే ఒక అమాయిని వరించి అక్కడే పెళ్ళి కూడా చేసుకుంటాడు,కానీ ఒక అర్జెంట్ పని వుండి మళ్ళీ వచ్చి తీసుకెళ్తానని చెప్పి వెళ్తాడు, కానీ వెంటనే రాడు? ఈ లోపు ఆ అమ్మాయి గర్భవతి అయ్యి తల్లి కూడా అవుతుంది. తప్పనిసరై ఇక తనే అతన్న్ని వెతుక్కుంటూ అతనున్న నగరానికి వెళ్తుంది?!శకుంతల కధ గుర్తు కొస్తుంది కదూ! ఈ మధ్యనే వచ్చిన విద్యాబాలన్ సినిమా కధ గూడా ఇలాగే వుందిగా, మూస కధే అనుకుంటున్నారా? అక్కణ్ణించే అసలు అద్భుతం మొదలవుతుంది! ఆ అమ్మాయి యెక్కడెక్కడ యెలాంటి సన్నివేశంలో నిలబడిందో యెవరేవరు ఆ అమ్మాయిని యే దృష్టితో చూశారు అనేదే సినిమాలోని విషయం! ఆ అమ్మాయి ఒక అమ్మాయి అని మర్చిపోతే ఈ పురుషాధిక్య సమాజం స్త్రీని యెక్కడెక్కడ యెలా నిలబేట్టి యేమి చేసిందో ప్రతీకాత్మకంగా చూపిస్తాడు! ఒకరి చెరలో వున్నా బ్రోతల్ హవుస్లో వున్నా ఆ అమ్మాయి ఒక్కలాగే వుంది, కానీ చూసే చూపుని బట్టి ఆ అమ్మాయి విలువ మారిపోయింది అనేది చూస్తున్న మనల్ని కూడా వెక్కిరిస్తున్నంత నిక్కచ్చిగా కధ నడిపిస్తాడు.

           హీరొయిన్ పాత్ర పేరు గంగ! హీరో పాత్ర పేరు నరేన్! సినిమా పేరులో వున్న రాం మనమనుకుంటున్న రాముడు కాదు? పేరులో వున్న అర్ధం రామకృష్ణ పరమహంస కొటేషన్ - "యెంతమంది పాపాల్ని కడిగినా గంగకి మలినం అంటదు" అనే దాన్ని తీసుకుని, చూశావా రామకృష్ణా, నీ గంగ కూడా మలిన మయింది అనే వేదన నిండిన వ్యంగ్యం?! వేదవ్యాసుడూ వాత్స్యాయనుడూ కూడా తప్పు పట్టలేని స్త్రీత్వంలోని పవిత్రతని ఆకాశంబు నందుండి శంభుని శిరంబందుడి శీతాద్రి సుశ్లోకంబయిన హిమాద్రి నుండి పవనాంధోలోకము వరకూ దిగజార్చి యెట్లా అపవిత్రతని అంటగట్టామో చూడగలిగిన వాడికి కళ్ళు చెదిరేటంత వైభవోపేతంగా చూపించాడు!


           ఈ సినిమాకి సంబంధించి అప్పట్లో మందాకిని తడిబట్టల సౌందర్యం ఒక పెద్ద సెన్సేషన్! సినిమా పత్రికల్లో సెంటరు స్ప్రెడ్డుగా అప్పటి కుర్రాళ్ళ మతులు పోగొట్టేసింది!! ఇంత దాకా అంత కళాత్మకంగా అన్నిట్నీ విడదీసి యెడం చేసి చూపించి ఇప్పుడు నేను మంచి బాలుణ్ణి అని పోజులు కొట్టినా మీరు నమ్మరు కాబట్టి నిజమే చెప్తున్నా - నేను ఆ సినిమా చూడ్దానికి వురక లేసిందీ ఆ సీను కోసమే :-)) తీరా సినిమా చూస్తుంటే సీను ఇలా వచ్చి అలా వెళ్ళిపోయి వుసూరు మనిపించింది? స్టిల్ ఫొటోలో వున్నంత కుదురుగా మూవీలో వుండదే! రాజ్ కపూర్ ఒక్క ఫ్రీజ్ షాటన్నా తగిలించి వుండగూడదా ఓ అయిదు నిముషాల సేపు?! ఇంకెవరన్నా తింగరి డైరెక్టర్ అయ్యుంటే అయిదు నిముషాలేం ఖర్మ, ఓ అరగంట నిలబెట్టేసే వాడు సీను నక్కడే! కానీ రాజ్ కపూర్ మంచివాడు గనక దానివలన సమాజంలో పుట్టే సంక్షోభాన్ని వూహించి, జనాభా పెరుగుదల వువ్వెత్తున యెగసి పడకుండా ఆపటం తన కర్తవ్యమని భావించి నిగ్రహంతో వ్యవహరించాడు! లేకపోయుంటే ఆయొక్క 1985 జులై నెల లోనే మన దేశ జనాభా పదింతలు పెరిగి వుండేది?!

           ఆంత ఇదిగా ఆ సీను కోసమే వెళ్ళినా బుధ్ధిమంతుడయిన తెలివైన కుర్రాణ్ణి గనక సినిమాలో రాజ్ కపూర్ చూపించిన మొదటి దృశ్యం లోనే లైటు వెలిగింది ఇది ఈ దేశపు సోషియో పొలిటికల్ కల్చర్ మీద సార్కాస్టిక్ రన్నింగ్ కామెంటరీ అని! ఒక మహానుభావుడు గంగని శుధ్ధి చెయ్యటం కోసం వుద్యమస్పూర్తితో అరిభీకరంగా వుపన్యాసం దంచుతూ వుంటాడు. అది వింటుంటే అసలు శుధ్ధి చెయ్యాల్సినంతగా మురికిని పట్టించటం దేనికి, ఇప్పుడు శుధ్ది చేసే పనుల్లో యెంత కొట్టేస్తాడు వీడు, యెన్ని రోజులకి మళ్ళీ ఈ శుధ్ధి కార్యక్రమం మొదలవుతుంది అనే ప్రశ్నలు యెన్నో వస్తాయి. ఆ టోపీని బట్టే యే పార్టీ వాడో ఈజీగా గుర్తు పట్టెయ్యొచ్చు?! అక్కణ్ణించి మొదలు పెట్టి సినిమాలో వచ్చే ప్రతి పాత్రా రాజ్ కపూర్ అనే ఒక సినిమా డైరెక్టర్ కల్పించిన పాత్రలా వుండకుండా సమాజంలో నుంచే తెర మీదకి నడిచి వచ్చి నేను ఇంతటి దగుల్బాజీ వెధవని చూడండి అని చూపించుకుంటున్నట్టు కదుల్తూ వుంటే ఇది కదా మంచి సినిమా అంటే అని గుర్తుపట్టి లీనమైపోయి చూశాను!

             సినిమా సుఖాంతమైపోయింది గాబట్టి అందరం హుషారుగానే బయటి కొచ్చేశాం! అలా నడుస్తూ వుంటే మా వాళ్ళిద్దరు సినిమాలో ఒక సీను గురించి తెగ పోట్టాడేసుకుంటున్నారు.సినిమాలో ఒక సీన్లో మందాకిని బిడ్డకి పాలిచ్చే సీను వుంది. రాజ్ కపూర్ దాన్ని జూం చేసి చూపించాడు. మా వాళ్లలో ఒకడికి ఆ సీను తెగ నచ్చేసి వూగి పోతుంటే రెండోవాడు తల్లి బిడ్దకి పాలిచ్చే దృశ్యాన్ని అట్లా చూడగూడదని వాణ్ణి క్రిటిసైజ్ చేస్తున్నాడు. రాజ్ కపూర్ చూపిస్తే చూడ్డంలో తప్పేంటి అని మొదటి వాడి కవుంటరు! కొంచెం దూరంగా నడుస్తుండటంతో మొదట్లో వీళ్ళ గోల అర్ధం కాలేదు, కొంచెం దగ్గిర కొచ్చాక సిట్యుయేషన్ అర్ధమయ్యి మొదటి ఫ్రెండుకి నేనొక ఫినిష్షింగ్ టచ్ ఇచ్చా, "రాజ్ కపూర్ పిచ్చోడై తియ్యలేదురా ఆ సీను అట్లా! నీలాంటి వాళ్ళతో పోట్లాడే రామారావుల్ని పెంచటానికే ఆ సీను అట్లా తీశాడు" అని?! దాంతో మావాడు సైలెంట్ అయిపోయాడు. వాడూ మంచి వాడే, కుర్రతనంలో వుండే తింగరి తనం అట్లా వుంటుంది?!

        ఇట్లాంటి వాణ్ణి పట్టుకుని తెలుగు సిన్మారంగం లోని ఒక మాంసఖండాల విక్రేతతో సమానం చేశారు మన తెలుగు వాళ్ళు! ఆ అధముడికి ఆంధ్రా రాజ్ కపూర్ అని బిరుదు నిచ్చారు? వాడు నిజంగా అధముడే!ఒక పెద్దమనిషి ఇంటికి వెళ్ళి ఆ ఇంటి యజమాని ముందే అతని తల్లి ఫొటోని చూసి ఇంత నల్లగా అసహ్యంగా వుందేమిటని కూశాడట! ఆ పెద్దమనిషి చెప్పు తీసేలోగా పారిపోయాడట! నాలుగు దబ్బు లొచ్చే సినిమాలు తీస్తున్నాడనే ఒక్క కారణం తప్ప యే గొప్పా లేని ఇట్లాంటి వాళ్ళకి యెంత మెహర్బానీలు చేస్తున్నారు?

           రాజ్ కపూర్ మంచి ఫిలాసఫీ వున్నవాడు! నాకు నచ్చిన వాడని డప్పాలు కొట్టటం కాదు, అతనొక మంచి మాట చెప్పాడు - నేను నా పర్సనల్ కలెక్షన్లో దాన్ని ఫ్రేం కట్టి మరీ అతికించుకున్నా! "ఆఫ్టరాల్, మనిషికి యేం కావాలి?  కడుపు నిండా తిండి,సుఖనిద్రా - ముఖ్యంగా ఇవ్వాళ కన్నా రేపు మరింత బాగుంటుందనే నమ్మకం!ఆ ఆశ చాలు ఆ మనిషిని యెన్ని కష్టాలయినా భరించి బతికి వుండేలా చేస్తుంది." - అన్నాడు. చాలా మామూలు నిజం, కానీ అది అతని అనుభవ సారం! ఆ ఆశ లేకపోబట్టే గదా అన్ని మంచి సినిమాల్లో నటించి అంతమంది అభిమానుల్ని సంపాదించుకుని గూడా వుదయ్ కిరణ్ లాంటి వాళ్ళు అమాయకంగా చచ్చిపోతున్నారు!

ఆశావాది యైన రాజ్ కపూర్ నిత్యబాలకుడు!

            సత్యజిత్ రే లాంటివాళ్ళు మేధావులకు మాత్రమే అర్ధమయ్యే సినిమాల్ని తీసి పండితుల్ని రంజింప జేస్తే,మన్ మోహన్ దేశాయ్ లాంటివాళ్ళు వినోదాన్ని మాత్రమే తీసుకుని పామరుల్ని రంజింప జేస్తే - ఆ రెంటినీ సమపాళ్లలో కోరుకునే నాలాంటి తింగరి వెధవల్ని కూడా సంతృప్తి పర్చగలిగిన సమర్ధుడు రాక్ కపూర్!
______________________________________________________
(ఫొటోలు గూగుల్ సౌజన్యం)

ఏడుపు గురించి కూడా యాడవాల్సింది చాలా ఉందండోయ్!

పాపం చెట్లకి ఏడుపు రాదు . వాటికి ఏడుపు రాకపోవటమే మంచిదైంది . చెట్లకి కాక మిగిలిన అన్ని జంతువుల ఏడుపులకే ఇంత విసుగొస్తుంటే వాటి...