Showing posts with label యమా సీరియస్సరదాల తాలింపు. Show all posts
Showing posts with label యమా సీరియస్సరదాల తాలింపు. Show all posts

Sunday, 13 December 2015

రూపాయిపెరుగువడ తయారీ విధానం గురించి తెలుసుకుందాం!దేశానికి ఫారిన్ ఎక్స్చంజి నిల్వల్ని విపరీతంగా పెంచేద్దాం?

        ఇది అతి రహస్యమైన లక్ష్మీపురాణము లోని ప్రసాద పరిషేచన మను ప్రధమాధ్యాయములో చెప్పబడీన అత్యంత ఫలప్రదాయకమైన పిండివంటకం.కావున ధనార్ధులు భక్తిశ్రధ్ధలతో పచనం గావించి భుజించిన యెడల సకల సంపదలూ వాటంతటవే దరి చేరగలవు!

1).మొదట రూపాయిని స్వార్ధము,పీడన,ధూర్తత్వము,దోపిడి,మోసము వంటి మలినాలు లేకుండా గట్టి సంకల్పంతో శుభ్రపరచి దేశభక్తి ద్రావణమున నిలవ ఉంచి దాన్ని చూస్తేనే రాముడూ జీసస్సూ ప్రవక్తా కనబడేటంత కాలం నానబెట్టాలి.

2).తర్వాత అధికఫలితం కొరకు విదేశీ మారక ద్రవ్యం అనే లవణాన్ని కొంచెం చేర్చి అంతర్జాతీయ వాణిజ్య విధాన సంప్రదాయం అనే రుబ్బురోలుతో బాగా రుబ్బి మెత్తగా చెయ్యాలి.

3).ఇపుడు జాతీయ ఆర్ధిక విధానం అనే నూనెని అంతర్గత కలహాలు అనే దోషగుణాలు పోయి ఉత్సాహపూరిత వాతవరణం అనే పొగలు కక్కే వరకు మరిగించి అందులో ఇంతకు ముందు తయారు చేసి పెట్టుకున్న మెత్తగా రుబ్బిన రూపాయిని వెయ్యాలి.

4).వేగుతున్న రూపాయి ఒక మోస్తరుగా గట్టిపడి మరీ మాడువాసన రాకముందరే లాఘవంగా బయటికి తీసి పోటాపోటె పెట్టుబడులు అనే ఉల్లిపాయలూ విస్తరణ వ్యూహాలు అనే పచ్చి మిరపకాయలూ అంతర్జాతెయ ద్రవ్యనిధి నుంచి పొందే సహాయాల వంటి మసాలా దినుసులూ కలిసిన ఎగుమతులు దిగుమతుల వ్యాపారం అనే పెరుగులో ముంచి ఉంచాలి.

ఇప్పటికే వంటకం యొక్క ఘుమఘుమలు మీ ముకుపుటాలని చేరి ఉంటాయి,ఇక వడ్డించడమే మిగిలి ఉంది!

        లక్ష్మీపురాణము లోని ప్రసాద పరిషేచన మను ఈ అధ్యాయమునకు ధనవిద్యా ధనగుహ్య యోగము అను నామాంతరము గూద కలదు,కాన దీనిని తాము వండి ఇతర్లకు తినిపించు వారికీ దీని విధి విధానమును ప్రచారము చేయు వారికీ ధనప్రాప్తి తధ్యము.వారు షేర్లు కొన్న కంపెనీలు మార్కెట్టును అప్రతిహతంగా దున్నేయగలవు,వారి ఇంట క్రెడిట్ కార్డుల వర్షము కురియగలదు! 

ఇతి శుభం!

Wednesday, 25 November 2015

నేనూ ఈ మధ్యన చిత్రకారుణ్ణి అయిపోయానండోయ్!మీరు కాస్త వోపిక చేసుకుని ఎలా ఉందో చెప్తారాండి?

     నేను నిజంగా మంచి చిత్రకారుణ్ణే అయి ఉంటే ప్రోగ్రామింగ్ సైడుకి చచ్చినా వచ్చి ఉండేవాణ్ణి కాదు!ప్రోగ్రామింగు వర్కు చాలా చెత్తగా ఉంటుంది - ఎట్లా ఇరుక్కుపోయానోమొదట విజువల్ బేసిక్ నేర్చుకున్నా,యెక్కడో తెలుసా!హైదరాబాదు అమీర్ పేట గ్యాంగులో నేను కూడా ఉన్నా.అన్నీ హడాబిడిగా నేర్చేసుకుని నేల రోజుల్లోగా ప్రపంచం మొత్తంలో ఎక్కడయినా సరే దున్నేద్దామని ట్రయనింగు కోసం డబ్బులు పోగొట్టుకున్న పిచ్చిపుల్లయల్లో నేనూ ఒకడిని. - సింగపూరులో మొదటి ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు నేను పని చేస్తున్నానని చెప్పిన కంపెనీ పేరు విని ఒక పాతికేళ్ళ అమ్మాయి నన్ను పట్టుకుని నవ్వుమొహంతో యెగాదిగా చూసిన చూపుకి అర్ధం నెలరోజుల తర్వాత వుత్తచేతుల్తో వెనక్కి తిరిగొస్తున్నప్పుడు గానీ తెలియలేదు!ఆ తర్వాత  అదృష్టవశాత్తూ అనాలో ప్రమాదవశాత్తూ అనాలో తెలియనంత అగమ్యగోచరమైన స్థితిలో చెన్నైలో ASP ప్రోగ్రామరుగా చేరా, ఒక సంవత్సరం తర్వాత మా కంపెనీకి టెక్నికల్ కన్సల్టేంటుగా ఉండి నన్ను ఇంటర్వ్యూ చేసి ఆ ఉద్యోగం రావడానికి కారణమైన పెద్దమనిషి తన సొంత కంపెనీ లోకి తీసుకున్నారు.అక్కడ అయిదేళ్ళపాటు నిరాఘాటంగా పనిచేసి ఆ డాటాబేస్ వర్కులో ఉండే క్రడ్ ఆపరేషన్లు తప్ప మరేమీ లేని వర్కుకి విసుగెత్తి ఫ్లాష్ నేర్చుకున్నాను.

     యెకాయెకిన ఫ్లాష్ నేర్చుకుందామని వెళ్ళలేదు - అది ఇల్లస్ట్రేటరు నుంచి మాయా3డి వరకూ ఒక పూర్తి ప్యాకేజీ,కానీ మాయా వరకూ వెళ్ళడానికి సొమ్ములు చాలక అప్పటికి పూర్తి చేసినవాటిల్లో ఫ్లాష్ నాకు నచ్చి కోర్సు ఆపేసి ఫ్లాష్ డెవలపర్ అయిపోయాను.నేర్చుకునేటప్పుడు ఇల్లస్ట్రేటర్,ఫొటోషాప్ ఇంటరెస్టుతోనే నేర్చుకున్నా గానీ చాలాకాలం టచ్ లేకపోవడంతో ఇప్పుదసలు అయోమయంగా ఉంటుంది.యేమయినా డిజైనర్ల పని హాయి,తలతో ఆలోచించి సాల్వ్ చెయ్యాల్సిన ప్రాబ్లెంస్ ఉండవు!కాంప్లికేటెడ్ ఇమగెస్ షట్టర్ స్టాక్ నుంచి అరువు తెచ్చుకోవటం,వాటికి సొంత సెట్టింగులతో బిల్డప్పు ఇవ్వటం,కంటికింపుగా ఉండే రంగుల గురించి తెలుసుకోవడం,చతురస్రాలూ త్రికోణాలూ వృత్తాలూ గీసి వాటిల్లో గ్రడియంట్ కలర్ నింపటం,వబ్ లేఅవుట్లూ కొల్లాతర్ల్సూ తయారు చెయ్యడం - ఏదో ఒకటి అటూ ఇటూ జరుపుతుంటారు గాబట్టి పని చేస్తున్నటు తెలుస్తుంది!లోగోలు చేసే కళ గానీ అబ్బితే సొంతంగానే యెదగొచ్చు - కొన్ని లోగోలకి మనం వూహించనంత క్రేజు ఉంటుంది!ఫ్రీలాన్సరుగా చేసేవాళ్లకి ప్రత్యక్షంగా అది తెలుస్తుంది గాబట్టి క్రేజుని బట్టి డిమాండ్ చెయ్యొచ్చు.నా సంగతే తీసుకుంటే నా వర్కుకి సంబంధించిన ఆలోచనలు మైండులో జరుగుతాయి కాబట్టి డిజైనింగు పూర్తయి వర్కు నా దగ్గిర కొచ్చేవరకూ ఖాళీగా కూర్చున్నట్టు కనిపిస్తాను?అయినా అపుడప్పుడూ కాగితాలు ఖరాబు చేస్తుంటాను,వాటిల్లో చాలాకాలం క్రితం చాలా ముతగ్గా వేసినా నాకు నచ్చిన బొమ్మ ఇది!
పేపరు చూస్తే కలర్ పపర్,అదీ కార్డ్ బొర్డు!మా బంగారం స్కూలు పన్ల కోసం తెచ్చి దానిమీద నాతో అరవ చాకిరీ చేయించుకుని అంతా అయిపోయాక నా మొహాన పారేసింది నువ్వు వాడుకోమని పర్మిషన్ ఇచ్చేసి.అంతకు ముందు నుంచే ఈ బొమ్మ వూహలో కదుల్తుంటే వెయ్యగలనా అని డవుటు పడుతూ అప్పటి వరకూ నానుస్తున్నాను గదా అది దొరికేసరికి దానిమీదే నా ప్రతాపం చూపించాను.పెన్సిలు వీలయిననత సన్నగానే చెక్కినా పోను పోనూ అరిగిపోవటం,మళ్ళీ చెక్కడం,విసుగొచ్చి ఆ బండముక్కుతోనే పని కానిచ్చేశాను.ఇంకో డ్రాబ్యాక్ పేపరు రఫ్ కదా చెరిపితే గుంటల్లో ఉన్నది చెరగక పోవటం - అయితే అంతా అయ్యాక చూస్తే అది నాకు గ్రడియంట్ మాదిరి కనబడ్డంతో అదీ ఒకరకంగా కలిసొచ్చినట్టే అనిపించింది.మూతి సరిగ్గా రాలదని అనిపించింది,ఏం చేద్దాం?ఇక్కడ చెరిప్తే పేపరు ఖరాబు అయ్యి ఉన్న ఈ కాస్త అందం కూడా పోతుంది!కొంచెం ఆలోచించాక అయిడియా వచ్చింది,ఆ సైజులో ఉన్న వేర కార్డ్ బొర్డ్ ముక్క మీద మూతి వరకూ గీసి అతికించాను.భుకాల పరిస్థితీ అంతే!ఇప్పుడు మీరు చూస్తున్నది స్కానింగు తీసిన ఇమేజి కదా,,స్కానింగు కోసం తీసుకెళ్ళటానికి కవరు లోపల కొంచెం ఫోల్డ్ చేసేసరికి ఆ ఫోల్డింగ్ మరక ఇందులోకి కూడా వచ్చేసింది.నా అలోచన మెల్లగా ఫొటోషాప్ ఉంది కదా నా కన్=ంప్యూతరులో,దాన్ని మల్ళీ గుర్తు తెచ్చుకుని అందులో ఎడిట్ చేద్దామని.తీరా నేను స్కాన్ చేసి ఎడిటింగ్ పని మొదలు పెడదామనుకున్నస్కాన్  టైములోనే మా చిన్న బంగారం పరిక్షల పేరుతో కంప్యూటర్ని హైజాక్ చేసేసింది!

     మళ్ళీ ఇంత సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు మొదలుపెట్టాను,కారణం ఉంది!ఈ మధ్యనే ప్రింటరు అమిరింది.దాంతో ప్రింటు తీసి చూసుకుందామనే దురద పుట్టి మెల్లగా పని మొదలు పెట్టాను.అయితే ఈలోపు కంప్యూటరు కేదో ప్రాబ్లం వచ్చి ఓయస్ అప్డేట్ చేసినపుడు ఫొటోషాప్,ఫ్లాష్,డ్రీం వీవర్ లాంటివన్నీ యెగిరిపోయాయి.ఈ మధ్యనే నా చెస్ బోర్దు సైటు పని కోసం ఫ్లాష్ ఒక్కటే ఫ్రండ్ దగ్గిర్నుంచి తెచ్చి లోడ్ చేసుకున్నాను.అందులో కూడా పెన్ టూల్ లాంటి కొన్ని గ్రాఫిక్ ఎడిటింగ్ టూల్స్ ఉంటాయి గదా!పెన్ టూల్ వాడి నా పెన్సిల్ లైన్ల మీదనే కొత్తగా లైన్లు గీదామని నా అయిడియా,కానీ నా కౌశలం సరిపోక నాకే యేళు పట్టేటటు ఉందనిపించింది!ఇక చేసేది లేక ఎరేజర్ టూల్ వాడి సెంటర్లో ఉన్న బొమ్మని మట్టుకు లేపి ఇంకో లేయర్ మీదకి తెచ్చాను.బోసిగా వొదిలయ్యడం కన్నా బోర్డరు తగిలిస్తే బాగుంటుందనిపించింది.దాంతో ఈ షేపుకి వచ్చింది!. 
     ఆ ముతక బొమ్మ కన్నా ఈ చిత్రరాజం కొంచెం బాగుండటంతో ప్రముఖ చిత్రకారుడిలా ఆలొచించటం మొదలు పెట్టాను.ప్రముఖ చిత్రకారులు వెర్షన్లు ప్రయత్నిస్తారు గదా అని వూహించి మధ్యలో బ్యాక్ కలరు మార్చాను.ఫ్లాష్ లోపల ఒక ఇమేజిని షేపుగా బ్రేక్ చెయ్యొచ్చు.ఆ ంతక మోదల్ని అలా బ్రేక్ చేసి ఈ ఎడిటింగ్ అంతా చేశాను.ఫైనల్ వెర్షను పెద్దది చేసి చూస్తే చుట్టూ ఖాళీ చాలా ఉంది.అది కూడా కత్తిరించేశాను.ఆ మార్పులతో ఈ మోడల్ తయారయ్యింది!
     ఇక్కడ పెట్టటానికి ధైర్యం ఎలా వచ్చిందనుకుంటున్నారు?నా పాటికి నేను నాగురించి ఓవరుగా వూహించేసుకుని బ్లాగులో పెట్టి మీతో చివాట్లు తింటానా!ప్రింటరు ఉందిగా,ప్రింటు తీసి చూపిస్తే బంగారం బానే ఉందని సర్టిఫికెట్ ఇచ్చింది,అయినా మీరు కూడా ఓ మాట చెప్తే ఇంకొంచెం హంగులు చేసి క్యాలెండరుగా రిలీజ్ చేద్దామనే ఆలోచన ఉంది!హంగులు అంటూ పెద్దగా యేమీ చెయ్యన్ను,నాకేందుకో కళ విషయంలో భారీగా పోవడం నచ్చదు,నేను చూసి మెచ్చుకోవాలన్నా సింపులుగా ఉండాలి!రంగులు వేస్తాను,అంతే!బ్యాక్ డ్రాప్ రంగులు మార్చి చూస్తాను,గ్రడియంట్ రప్పించగలనో లేదో చూడాలి!ఈ ఆంజనేయ భగవాన్లుని హరిమర్కటం అంటారు గదా - దేహానికి లైట్ గ్రీన్ కలరు వేస్తాను,అన్ని దేవాలయ్యాల్లోనూ చూస్తున్నాను గాబట్టి మూతికి ఎరుపు రంగు ఫిక్స్ చేసేశాను,పంచెకీ తలపాగాకీ కాషాయం రంగు వేస్తాను,చాలు గదా!

నాకేమో పైది నచ్చింది,మా బంగారానికేమో ఈ బ్లూ కలర్ ఉన్నది నచ్చింది,మరి మీ వోటు ఎవరికి?

Saturday, 21 November 2015

తమిళమామికి తెలుగువాళ్ళు లోకువైపోయా రేంటి?తమిళనాట తెలుగువాళ్ళ ప్రాభవం ఇక నాస్తి యేనా!

     తమిళనాడులో ఇప్పటికీ తెలుగువాళ్ళు నాలుగోవంతు ఉన్నారు.చెన్నై మహాపట్నమే చెన్నప్ప అనే తెలుగువాడి పేరు మీద వచ్చింది.400సంవత్సరాల పైచిలుకు చరిత్ర గల ఈ నగరంలో తొలినాళ్ళ నుంచీ తెలుగువారు తమిళులతో కలిసి ఎదిగారు.రాష్ట్రాలుగా విడిపోక ముందు నుంచీ మొత్తం దక్షిణ భారత భాషలకి సంబంధించిన చలనచిత్ర మహామహులంతా ఇక్కడే తమ తమ భాషలతో పాటూ తమిళంలో కూడా మాట్లాడ్య్తూ బతికారు.అన్ని రాష్ట్రాలూ విడిపోయిన తర్వాత కూడా చాలా కాలం వరకూ వీరంతా మద్రాసుని వదలకుండా ఉన్నారంటే ఆ నగరపు వాతావరణం తోనూ తమిళ సంస్కృతి తోనూ ఆత్మీయతలు ఎంతగా పెనవేసుకున్నారో అర్ధం చేసుకోవచ్చు!

     2006లో తమిళనాడు ప్రభుత్వం తమిళ విద్యాబోధన చట్టం చేసింది.దాని ప్రకారం మైనారిటీ వర్గాలకి సంబంధించిన విద్యాసంస్థలతో సహా అన్ని విద్యాసంస్థలలో నర్సరీ,ప్రైమరీ,మిడిల్,హయ్యర్ మరియూ హయ్యర్ సెకందరీ స్థాయిలలో తమిళ భాషను తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన భాషగా నిర్ధారించారు - సీబీయస్సీ మినహా!మాధ్యమం విషయంలో కూడా తమిళేతర భాషల పట్ల చాలా నిర్దయగా ఉన్నది చట్టం.ఇంగ్లీషునీ తమిళాన్నీ తప్ప మిగిలిన వాటిని ఆప్షనల్ గ్రూపుకి బదలాయించారు.పైగా ఈ సబ్జెక్టుల మార్కులు పరీక్షా ఫలితాల్లో కలపరు.అంటే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తమిళనాడులో తమిళాన్ని తప్ప ఇంకే భాషనీ ప్రోత్సహించడం మాట అటుంచి బతకనివ్వకూడదని నిర్ణయించుకున్నట్టు అర్ధమవుతున్నది.దీనితో తమిళేతర వర్గాలలో యెక్కువశాతం ఉన్న తెలుగువాళ్ళకి ఇబ్బంది ఎదురవుతున్నది.ఇందులో ఉన్న దుర్మార్గం ఏమిటంటే తమిళనాడు ప్రభుత్వం నిరాదరిస్తున్నది ఇతర భారతీయ భాషల్ని మాత్రమే,అసలు మన దేశానికే సంబంధించని విదేశీ భాష అయిన ఇంగ్లీషు పట్ల మాత్రం అభిమానపూర్వకంగా వ్యవహరిస్తున్నది!

     ఇప్పటికే చాలమంది సీబీయస్సీకి మారిపోయారు,తెలుగు మీడియం స్కూళ్ళు మూసివేతకి దగ్గిరయ్యాయి.బీ ఎ రోమన్ ఇన్ రోం అన్నారు పెద్దలు.తమిళనాడు ప్రభుత్వం అంత గట్టిగా తమ భాషని ప్రోత్సహించుకోవాలనుకున్నప్పుడు విమర్శించీ ఉద్యమాలు చేసీ సాధించగలిగింది ఏమీ లేదు.తమిళ ప్రజలకి తమ సంస్కృతి పట్ల అభిమానం ఎక్కువ.దేవాలయాల్లో సైతం దేవభాష అయిన సంస్కృత శ్లోకాలు ఉపయోగించటం కన్నా తమిళ మంత్రాలు ఉపయోగించితే గానీ సంతృప్తి పడనంతగా వారు తమిళ భాషని ఇష్టపడతారు.తమిళనాడులో శాశ్వతంగా ఉండాలంటే అనధికారికంగా అయినా సరే ప్రతివారూ తమిళులుగా మారిపోక తప్పదు.వయ్యాపూరం గోపాలకృష్ణ వైగో అని ఎందుకు పేరు మార్చుకున్నాడు?భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికన ఏర్పడినా తెలుగుని అధికార భాషగా చేసుకోవటానికి పట్టుదల లేని తెలుగువాళ్ళలా అందరూ ఉండాలని కోరుకోవటం వెర్రితనం!ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జాబు రాశాడట,అయితే యేమిటట?ఇప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ కలిసి విజ్ఞాపన చెయ్యాలి గానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మొత్తం తెలుగు వాళ్ళందరికీ ఏవిధంగా బాధ్యత వహిస్తాడు?ఇక తమిళనాడులోని తెలుగువాళ్ళు ఇప్పటికే తమని తాము తమిళీకరించుకున్న మిగతా వాళ్ళ మాదిరిగానే తమ ప్రత్యేక అస్తిత్వాన్ని వొదులుకోక తప్పదు.

     తమిళులది నిజంగా చాలా వింతైన మనస్తత్వం - మొత్తం భారతీయుల కందరికీ ఇంగ్లీషు అనే విదేశీ భాషకి బదులు హిందీ అనే భారతీయ భాషని లింక్ లాంగ్వేజిగా పేడదామని ప్రతిపాదించినప్పుడు మిగతా భారతీయు లందరికన్నా గట్టిగా వ్యతిరేకించి తమిళ ప్రాంతీయాభిమానం పొడుచుకొచ్చి అల్లరల్లరి చేసి ఒక భారతీయ భాషనే తిరస్కరించి వీళ్ళ ధాటికి ప్రభుత్వమే వెనక్కి తగ్గి ఆ ప్రతిపాదనని ఉపసంహరించుకునేలా చెయ్యగలిగిన వాళ్ళు ఇవ్వాళ మిగతా భారతీయ భాషల్ని కూడా తిరస్కరించేసినప్పటికీ ఇంగ్లీషు అనే విదేశీ భాషని మాత్రం అంతగా ముద్దు చేయడం చూస్తుంటే అయితే తమిళ భాష లేకుంటే ఇంగ్లీషు భాష నేర్చుకోవాలి తప్ప సాటి భారతీయ భాషల్ని నేర్చుకోకూడదనే మనస్తత్వాన్ని యెలా అర్ధం చేసుకోవాలో తెలియటం లేదు నాకు!భారతీయ భాషలు అన్నిట్లోనూ తమ భాషే గొప్పది అనే అహంకారం,ఆంగ్లేయుల పట్ల మమకారాన్ని చూపించే ఇంగ్లీషు పట్ల భావదాస్యం రెంటినీ ఫిఫ్టీ ఫిఫ్టీ చేసేశారు.దీనికి పూర్తి భిన్నమైన మనస్తత్వంలో ఉన్న తెలుగువాళ్లకి వీళ్ళెప్పటికీ అర్ధం కారు - ఆలు అర్ధమే కానప్పుడు వాళ్ళని మార్చడం సాధ్యమా? 

     దక్షిణాపధాన్ని అంతా ఆక్రమించిన శాతవాహనుల సామ్రాజ్యంలో ఈ చిన్న ముక్క మాత్రం ఖాళీగా ఉండిపోయింది.ఎందుకో?వొదిలేశారా, లొంగి రాలేదా!పాండ్య,చేర,చోళ వంశాలకి చెందిన రాజూల గురించే తమిళ సాహిత్యం ఎక్కువగా వర్ణించింది.తొలి నుంచీ మిగతా భాషల వారికన్నా అధికంగా ఒకచోట సంగం పేరుతో గుమిగూడి పట్టుదలతో తమ భాషనీ సంస్కృతినీ వృధ్ధి చేసుకోవటంలో ఐకమత్యాన్ని ప్రదర్శించడం విశేషం!అయితే, స్వాతంత్ర్యానంతరం పుట్టిన బ్రాహ్మణ వ్యతిరేక తమిళ స్వాభిమాన ఉద్యమాల వల్ల ఏర్పడిన ద్రవిడ మున్నేట్ర కజగం వారి రాజకీయం ముదిరే వరకూ వీరు కూడా భారత జాతీయతకి వ్యతిరేకంగా వ్యవహరించలేదు.ద్రవిడ ఉద్యమాలకి బీజాలు బ్రిటిషు వారితో పూర్తిగా మమేకం అయిపోయి, దేశానికి స్వతంత్రం రాకూడనీ బ్రిటిషువాళ్ళ ప్రభుత్వమే కొనసాగాలని వాదించి స్వాతంత్రపోరాటానికి సకల విధాలుగా ఎదురొడ్డి లిలిచిన జస్టిస్ పార్టీలో ఉన్నాయి.ఇందులో ఉన్నవాళ్ళంతా ఇంగ్లీషువాళ్ళ వల్ల పైకొచ్చిన చెట్టియార్లూ భూస్వాములూ కదా - యూనియన్ జాక్ నులివెచ్చని నీడలో పెరిగినవారు రాజభక్తిని ప్రదర్శించకుండా యెట్లా ఉంటారు?ఇంగ్లీషు వాళ్ళు ఈ దేశంలో ప్రభువులుగా పాతుకుపోయనాటికి అప్పటి భారతీయ సమాజంలో విద్యకి అధిపతులుగా ఉన్న బ్రాహ్మణులు సహజంగానే ఇంగ్లీషు విద్య ముందుగా నేర్చుకుని ప్రభుత్వోద్యొగాలు తెచ్చుకుని దూసుకుపోతుంటే అసంతృప్తితో రగిలిపోతున్న బ్రాహ్మణేతరులకి బ్రాహ్మణాధిక్యత గురించి చెప్పి తమవైపుకి లాక్కున్నారు.కళ్ళముందు కనబడుతున్న దృశ్యం అలాగే ఉంది గాబట్టి మూలకారణాల్ని శోధించకుండా బ్రాహ్మణేతరులూ నమ్మేశారు.తన శక్తిమేర జస్టిస్ పార్టీ చెయ్య్యగలిగినది బ్రాహ్మణేతరుల్ని స్వాతంత్ర్య పోరాటం వైపుకి నడవనివ్వకపోవటం.అయితే గాందీ సూటిగా సామాన్యులని ఉద్యమంలోకి లాగే కార్యక్రమాల్ని ప్రవేశపెట్టడంతో జస్టిస్ పార్టీ పునాదులు బలహీన పడినాయి.1935 నాటి రాజ్యాంగం ప్రకారం జరిగిన ఎన్నికల్లో జస్టిస్ పార్టీకి సంబంధించిన దిగ్దంతులు కూడా మట్టి కరిచారు.అసలైన వింత యేంటంటే హిందీని కంపల్సరీ చేసింది 1937లో తమిళనాడు ముఖ్యమంత్రి అయిన చక్రవర్తి రాజగోపాలాచారి,ఆయన తమిళుడే కదా!నిజానికి హిందీ నేర్చుకుంటే తమిళాన్ని అవమానించడం అని యెక్కడయినా బతకాలనుకున్న ఏ తమిళుదూ అనుకోడు,అది ఆప్పటికే బ్రాహ్మణాధిక్యతకి వ్యతిరేకంగా తమిళ స్వాభిమానం పేరుతో రాజకీయ పునాదిని నిర్మించుకోవాలనుకున్న జస్టిస్ పార్టీ మరియూ పెరియార్ ద్వయం తమ యొక్క వ్యతిరేకతని మొత్తం తమిళులకి అంటగట్టేసి చేసిన రభస.ముఖ్యమంత్రి యెంత గట్టివాదయినా అలాంటి సున్నితమైఅన విషయంలో వెనుకడుగు వెయ్యక తప్పదు,ఆయన వెనుకడుగును వీళ్ళు తమ గెలుపుగా చూపించి తమ బలాన్ని మరింత పెంచుకోగలిగారు.ఎన్నో పురాణాలు చదివిన పండితుడూ,కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పగలిగిన రాజనీతిజ్ఞుడూ అయిన రాజాజీ కొంచెం గట్టిగా ప్రయత్నించి ఉంటే సమస్య చల్లారిపోయి ఉండేదేమో!కానీ కాంగ్రెసువాడు కదా - ప్రజల్లో చెడ్డపేరు తెచ్చుకోవడానికి ఏ రాజకీయవాదీ.ముఖ్యంగా కాంగ్రెసువాడు ధైర్యం చెయ్యడు!రెండవ ప్రపంచయుధ్ధం జరుగుతున్నప్పుదు జస్టిస్ పార్టీ బాహాటంగానే అమితోత్సాహంతో ఇంగ్లీషువాళ్ళకి తమ మద్దతును తెలిపారు.అన్నాదురై అయితే జస్టిస్ పార్టీకి మైకులాంటి విడుదలై దినపత్రికలో ఇంగ్లీషువాళ్ళకి పూర్తిగా బాకారాయుదే అయిపోయాడు.వీరికి విదేశీయులైన బ్రిటిష్ సామ్రాజ్యవాదుల కన్నా స్వదేశీయులైన బ్రాహ్మణులు మరింత ప్రమాదకారులుగా కనపడ్డారు,ఒకసారి ఆ దృక్కోణంలోకి మనము వెళ్ళినా వీరంతా స్వాతత్ర్యోద్యమాన్ని వ్యతిరేకించటానికి చేసిన ప్రయత్నాల్నీ ఇంగ్లీషువారితో అంటకాగడాన్నీ న్యాయమేనని చక్కగా సమర్ధించవచ్చు!కానీ చరిత్రలో నిజంగా జరిగినదే అయినా తర్వాతిరోజుల్లో ఎక్కడా ప్రముఖంగా ప్రస్తావించబడకపోవటంతో తమిళేతరులకి అంతగా తెలియని ఒక విషయం - సరిగ్గా ఉత్తర భారతంలో ముస్లిం లీగ్ పాకిస్తానును ప్రతిపాదించిన సమయంలోనే దక్షిణ భారతంలో వీరు ప్రత్యేక ద్రవిడస్థాన్ ప్రతిపాదించారు,మద్రాసు ప్రెసిడెన్సీని మిగిలిన భారతదేశం నుంచి విడగొట్టి యూనియన్ జాక్ చల్ల్లని నీడలో యెక్కడో లండన్ లో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం అధికారంలోనే కొనసాగించాలని ప్రతిపాదించారు, వీళ్ళకన్నా ముస్లిములే నయం కదూ తమకంటూ సార్వభౌమాధికారం గలిగిన స్వతంత్ర దేశాన్ని కోరుకున్నారు!కాంగ్రెసువాళ్ళు అప్పట్లో ఇలాంటి సిధ్ధాంతాలు ప్రమాదకరం అని చూచాయగా తెలిసినప్పటికీ దేశమంతటా అతివేగంగా పెరుగుతున్న కమ్యునిష్టు భావజాలపు ప్రభావానికి భయపడి ప్రజలు వాళ్ళ వైపుకి వెళ్ళకుండా ఉండటానికి ఇలాంటి వర్గాల్ని ముందుచూపు లేకుండా ప్రోత్సహించటంతో అగ్నికి వాయువు తోడయినట్టు చెలరేగిపోయారు.1952 ఎన్నికల్లో డియంకే పోటీ చెయ్యకుండా ఏ అభ్యర్ధి ద్రవిడస్థాన్ కోసం నిజాయితీగా కృషి చేస్తారో ఆ అభ్యర్ధికి తాము సహాయం చేస్తామని ప్రకటించింది - బహుశా వోట్లు వేసి ప్రచారం చేసి గెలిపించడమే ఆ సహాయం కాబోలు!!ఆఖరికి ద్రవిదస్థాన్ కోసం ఐక్యరాజ్యసమితిని కూడా కదిలించాలని ప్రయత్నించింది.1957 ఎన్నికల్లో పాత నిర్ణయాని మార్చుకుని సొంతంగ అభ్యర్ధుల్ని నిలబెట్టి 14 స్థానాల్ని గెలుచుకుంది.1962 నాటికి బాహాటంగా ద్రవిదస్థాన్ ప్రస్తావన తీసుకురాకపోఇనా అంతర్లీనంగా ఇప్పటికీ తగినంత మెజారిటీ వస్తే ద్రవిడస్థాన్ వాదనని ముందుకు తీసుకొచ్చి స్వతంత్రదేశంగా ఆవిర్భవించాలనే ఆశ వారిలో పూర్తిగా పోయిందని చెప్పలేం.ఇవ్వాళ భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అయితే మాత్రం ఏమంత ప్రత్యేకత యేముంటుంది గనక, పైన ప్రధానమంతి ఉన్నాడు గద, జనం తమ వాదనల్ని నమ్మి ఆదరిస్తే ఇవ్వాళ్టి ఉద్యమనేత రేపటి రోజూన ఒక స్వతంత్ర దేశానికి ప్రధానమంత్రియే కావచ్చు - అబ్బ!

     ఇంతటి ఘనకీర్తి గలిగిన ద్రవిడ ఉద్యమ నేతల తమిళ స్వాభిమాన బలప్రదర్శనా కౌతుకం ముందు తెలుగువాళ్ళ ఆవేదన అరణ్యరోదన కాక తప్పదు.2006లోనే ప్రణాళికలు వేసుకుని ఇంత పటుదలగా ముందుకు వెళ్తున్నవాళ్ళు అంత తేలిగ్గా వెనక్కి తగ్గరు.మీరు తెల్లవారు ఝామున తమిలనాడు మొత్తంలో యెక్కడయినా వీధుల్లో కొంచెం దూరం తిరిగితే ఒక చిత్రమైన దృశ్యం కనబడుతుంది.ఇంటిలోపల యెటూ పూజ గది ఉంటుంది,గాబట్టి అక్కడ యెంతసేపు చేస్తారో గానీ అది అయిపోయాక వీధిలోకొచ్చి ఇంటి ప్రహరీ గోడలో అమర్చుకున్న చిన్న చిన్న ప్రతిమల ముందు కూడా హారతులూ గంటలూ మంత్రాలూ కలిసి వీధి మొత్తాన్నీ మారుమోగిస్తూ ఉంటారు.ఇంత భక్తిగా ఉండేవాళ్ళు దేవుణ్ణి బూతులు తిట్టటం ఒక్కటి తక్కువగా ద్వేషించిన పెరియారును యెట్లా ఆదరించారో తల్చుకుంటే అయోమయంగా ఉంటుంది.తమిళ సమాజమంతా బ్రాహ్మణులూ బ్రాహ్మణేతరులూ స్పష్తంగా విడిపోయి ఉన్నారని నాకు తెలుసు గానీ తమిళులలో ఉన్న స్వజనదోషసహిష్ణుత గురించి ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది నాకు!ఆ మధ్యనెప్పుడో కొందరు యం.జీ.ఆర్ మీద తమకున్న అభిమానాన్ని చూపించుకోవటానికి రోడ్డు మీద విస్తళ్ళలో కాకుండా నేలమీద అన్నమూ కూరలూ వడ్డించుకుని సుబ్బరంగా తినేశారు!అన్నం పరబ్రహ్మస్వరూపం అనే సుత్తి సుదాణం కబుర్లు దేనికి గానీ సరిగ్గా వీళ్ళు ఆ పని చేస్తున్న చోట ఇదివరలో మనుషుల నుంచీ జంతువూల వరకూ మలమూత్రవిసర్జన కార్యక్రమాలు జరిగి ఉండొచ్చుననే ఆలోచన కొంచెం కూడా లేకుండా ఇతర్లకి వినడానికే అసహ్యంగా అనిపించే పనులు యెట్లా చెయ్యగలుగుతున్నారు?ఈ మధ్యన జరిగిన తాళితెంపుడు కార్యక్రమం కూడా అలాంటిదే కదా!తమ బుధ్ధికి ఏం తోస్తే అది నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అనుకుంటూ చెయ్యగలగడమూ,చేసింది సాటి తమిళులు గనక మనవాడు ఏం చేసినా విమర్శించకూడదు అనే పైకి కనబడని ఒక కట్టుబాటూ ఈ భూప్రపంచం మొత్తమ్మీద తమిళులలో మాత్రమే కనిపించే ప్రత్యేక లక్షణాలు.కాబట్టి ఈ భూమి మీద తమిళ సంస్కృతియే గొప్పదని అనుకునే స్వానురాగపు అతి ధోరణి నుంచీ సాటి భారతీయ భాషల్ని తిరస్కరించేస్తూ ఇంగ్లీషును ఆదరించే వలస ప్రభువుల పట్ల మమకారపు ధోరణి నుంచీ వారు యేనాటికీ కొంచెం కూడా పక్కకి జరగరు.

     తమిళనాడులోని తెలుగువారు రెండు రకాలు - తమిళ తెలుగులు,ఆంధ్ర తెలుగులు.మొదటి రకం వైగో లాంటివారు- తమ తెలుగు మూలాల్ని మర్చిపోయి పూర్తిగా తమిళుల వలె మారిపోయిన వాళ్ళు,వీరు పొరపాటున కూడా ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకించరు,వ్యతిరేకించటం లేదు కూడా!రెండో రకం తమిళనాడులో ఉంటున్నా మూలాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్త్రంలో వెతుక్కుంటున్న వాళ్ళు - తెలంగాణ వాళ్ళు ఎవరయినా ఉన్నా వాళ్ళూ ఈ ఆందోళనల్లో కలవకపోవచ్చు.2006 నుంచీ చేస్తున్న విధానపరమైన ఆలోచనలకి తోడు ఇటీవల యెర్రచందనం అక్రమ నరికివేతని ఆపుతున్న సమయంలో తమిళ కూలీల మీద దాడి జరిగిన తర్వాత ఆ ఎర్రచందనం స్మగ్లర్లలో కొందరు తమిళులూ ఉన్నారు గదా,ఆ పలుకుబడి గలిగిన తమిళ స్మగ్లర్ల వల్ల తమిళనాట ఆంధ్రావాళ్ళంటే వ్యతిరేకత వచ్చింది,ప్రభుత్వపెద్దల లోనూ అది ఆంధ్రప్రదేశ్ తన రాష్ట్రపు వనరుల్ని దోపిడీకి గురి కాకుండా చూసుకోవడానికి చేసిన పని అయినా ముందుగా ఒక మాట తమ చెవిలో వేస్తే దిద్దుబాటు చర్యలు తీసుకోవటానికి పనికొచ్చేది గదా అని తమకి కలిగిన ఇబ్బంది నుంచి తప్పుకుని ప్రతిపక్షాల కన్నా తామే ఎక్కువ లాభం పొందాలన్న రాజకీయం ప్రవేశించింది.కాబట్టి ఇకముందు తెలుగువాళ్ళ పరిస్థితి తమిళనాడులో ఇంకా దుర్భరం అవ్వడమే తప్ప అంత ఆందోళన చేసి రాష్ట్రం విడిపోయినా తెల్లవారి నుంచీ ఏమీ జరగనట్టు కలిసిమెలిసి బతికినగతకాలపు అనుబంధాలు ఇక కలలోని మాటే అవ్వచ్చు!

                             ఈ దేశంలో ఏదీ శాశ్వతం కాదు పరాధీనతా ఇంగ్లీషు భాషా తప్ప?!
-----------------------------------------------------------------------------------------------------------------ఈ నాడు శాలివాహన శకం 1937 మన్మధ నామ సంవత్సరం కార్తీక మాసము 30వ తేదీ శనివారము

Thursday, 12 November 2015

తెలుగు బ్లాగుల్లో నీరసానికి కారణాలు ఏమిటట?ఆడబ్లాగర్లని నిషేధించడం మంచిదని నా ఉబోస!

     ఈ మధ్యన ఒక మంచి యాగ్రిగేటర్ మూతబడింది!మిగిలిన యాగ్రీగేటర్ నిర్వాహకులు కూడా పెదవి విరిచేస్తున్నారు?విషయం బ్లాగుల్లో సందడి తగ్గిందని,కామెంట్లు వరదల్లా పొంగుకురావడం లేదని,పోష్టులకి హిట్లు ఉధృతంగా తగలట్లేదని - బోల్డు కంపెయింట్లు!?నేను బ్లాగుల్లోకి వచ్చిన కొత్తల్లో ఆంధ్రా ఆకాశరామన్న నిత్యకల్యాణం పచ్చతోరణం అన్నట్టుండేది.ఒక్కో వాదన చదువుతుంటే వీళ్ళు గనక యెదురెదురుగా తారసపడితే ఒకళ్ళనొకళ్ళు చంపేసుకుంటారేమో అన్నట్టుండేది వాతవరణం!అపట్లో సొంత బ్లాగు యెలా ఓపెన్ చెయ్యాలో తెలీదు గనక పొడుగాటి కామెంట్లతో నేనూ దూకాను.రాష్ట్రం విడిపోవటంతో ఆయన నిరాశ పడిపోయి ఇక సెలవనేశాడు!మోద్ట్లో తెలుగులో యెట్టా రాయాలో గూడా తెలీదు,మెల్లమెల్లగా కామెంట్లు తెలుగులో యెట్టా రాయాలో తెల్సుకుని చాలాకాలం పాటు కామెంరుగానే గడిపా,హఠాత్తుగా వనజ వనమాలి బ్లాగులో ఆమె కూడా వేరేవాళ్ళు క్లూ ఇస్తే బ్లాగు ఓపెన్ చేఇనట్టు తెలిసి అడిగితే దేవరహస్యం కాస్తా మీ ఐడియే దాన్ని పట్టుకుని మందుకెళ్ళమన్నారు.ఈ బ్లాగులు మామూలుగా గూగుల్లో డైరెక్టుగా రావు.వీటికి యాగ్రిగేర్లు ఉండాలి.బ్లాగుల్ని తిరగటానికి జల్లెడ దగ్గిర మకాం వేసేవాణ్ణి.అందులో అయితే ఒక రచయిత కనెక్ట్ అవడం అంటూ జరిగితే మొత్తం అన్ని పోస్టులూ పర్మనేంటుగా కనబడతాయి.రీడబిలిటీ బాగుంటుంది.కానీ నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా నా బ్లాగు మాత్రం అక్క కనెక్ట్ అవ్వలేదు,బహుశా అప్పటికే కిక్కిరిసిపోయి ఉండొచ్చు?యాగ్రిగేటర్లని మెయింటెయిన్ చెయ్యడం కేవలం ఆసక్తి కొద్దీ చేసే శ్రమ తప్ప ఆదాయం ఉండదు.ఆదాయం లేకపోయినా ఉత్సాహం రావాలంటే బ్లాగుల్లో పోష్టులు త్వరత్వరగా పడుతూ ఉండాలి,లెక్కకోసం హిట్లు కనబడాలి,పోష్టులు బాగున్నాయని తెలియడానికి కామెంట్లు యెక్కువ పడాలి!

     ప్రస్తుతం బ్లాగుల్లో నిరాశకి రాష్త్ర విభజన ఒక ముఖ్యకారణం అని నా అనుమానం!ఏది రాసినా ప్రాంతీయం అయిపోతుందేమో అనే భయం బ్లాగర్లని ధైర్యంగా టాపిక్కుల్ని యెన్నుకోవడానికి ఉషారు నివ్వట్లేదని నా అనుమానం!ఈ మధ్యన ఆంధ్రజ్యోతిలో ఒకాయన విశ్వనాధ సత్యనారాయణ గారి గురించి ఒక ఆర్టికిల్ రాశారు.ఆయన విశ్వనాధ వారి ప్రతిభ గురించి చెప్పిన విషయం బాగానే ఉంది గానీ మాటిమాటికీ ఆయన స్మారక మందిరం హైదరాబాదులో ఉంది ఓ తెలంగాణ బాబులూ ఆయన్ని కేవలం ఆంధ్రావాడని ముద్ర వెయ్యకండి బాబూ ప్లీజ్ అని బతిమిలాడుకునే ధోరణిలో ఉంది - బహుశా తెలంగాణ ముఖ్యమంత్రీ ఆయన అనుంగు అభిమానులూ ట్యాంకుబండు మీద ప్రాతస్మరణీయుల్ని పెకలించి ఆంధ్రాకి తరలించాలన్న నాటి హ్యాంగోవరు ప్రభావం అనుకుంటా!నిన్ననో మొన్ననో ఒక మహిళారత్నం వ్యాస రచయితకే నీతులు చెప్తూ విసుర్లు విసరనే విసిరారు.నాకు మాత్రం ఆ ఇద్దరి మీదా జాలి వేసింది!అయితే విశ్వనాధకి ఈ ప్రాంతీయ భేదాలు ఉండవు.ఆయన మాందలికాల జోలికి పోకుండా రచనలో సరళగ్రాంధికం వాడాడు!వాళ్ళ పేర్లతో శకాలు ఉన్నయ్యంట పోష్టులో నేను వాడిన తెలుగు అర్ధం అయితే విశ్వనాధ సాహిత్యం కూడా తేలిగ్గా చదవొచ్చు!విషయం కూడా ప్రాంతీయం కాకుండా మొత్తం భారతీయం, అదీ చరిత్ర గురించి స్పెషలైజ్ చేశాడు గాబట్టి కంటెంటుని బట్టి లెక్కేస్తే కేవలం తెలుగువాళ్ళే కాదు ,భారతీయుడైన ప్రతివాడూ గర్వంగా చెప్పుకోదగినవాడు!ముఖ్యంగా హాస్యాన్ని ఇష్టపడేవాళ్ళకి విశ్వనాధ సైలెంటుగా వేసే జోకులు గొప్పగా కితకితలు పెదతాయి:-) అలాంటి హాస్యం రచనల్లో తగ్గడం కూడా బ్లాగులు పాప్యులర్ కాకపోవడానికి ఒక కారణం అని నా అభిప్రాయం. 

     ఇంకొక ముఖ్యాతి ముఖ్యమైన కారణం మగబ్లాగర్లంతా ముసలాళ్లయిపోయారు.ఆడబ్లాగర్లు వాళ్ళ పోష్టులన్నిట్నీ ఆడాళ్ళ కష్టాలతో నింపేస్తున్నారు.పెళ్ళీడు కొచ్చిన అమ్మాయో అబ్బాయో సరదాగా తెలుగు బ్లాగుల్లో కొస్తే "వ్యాసుడు బ్రాహ్మణుడా?అబ్రాహ్మణుడా?" అని పోట్లాడుకుంటుంటే దడుచుకుని పారిపోరా?పైగా దున్నడం దున్నించుకోవడం అని డైరెక్టు కామప్రకోపాల భాష వాళ్ళమీద వొదిలితే వాటికి అలవాటు పడి చెడిపోనన్నా చెడిపోవాలి,లేదా అసహ్యం పుట్టి యే ఫేసుబుక్కు వైపుకో పారిపోవాలి.అందుకే నేను ట్రాక్ మార్చేస్తున్నా.పొలిటికల్ సెటైర్లకీ, తింగరి చర్చలకీ పులిస్టాప్ పెట్టేసి రొమాన్సూ,క్యామెడీలకి రంగం సిధ్ధం చేశా.యాభయ్యేళ్ళు,అరవయ్యేళ్ళు అంగలార్చి కొత్తగా రాష్ట్రం సాధించుకున్నాం అని డాబుసరి కబుర్లు చెప్పుకుంటూ తన రాష్ట్రం గురించి మాత్రం నా మసీదు,నా గుడి, నా నగరం అని ముడ్డీ నోటా పులకించి పోతూ పొరుగు రాష్ట్రం యేర్పడి రెండేళ్ళు కూడా గడవక ముందే ముక్కలు చెక్కలవ్వాలని కోరుకుంటూ అక్కడ పుట్టే వేర్పాటు ఉద్యమాలకి ఆల్ ది బెస్ట్ చెప్పే కిరాతకులు ఉండగా యెన్ని నీతులు చెప్పినా యేమి ప్రయోజనం?ఆంధ్రాకి హక్కుగా చెయ్యాల్సిన పని గట్టిగా చెయ్యటానికి కూడా చెయ్యాల్సిన వాళ్ళకి చేతులు రాక బీహారులో భాజపా ఓడిపోవాలని కోరుకోవాల్సిన పరిస్థితిలో రాజకీయం ఉంటే యేమి అనాలిసిస్సులు రాసినా యేమి ఉపయోగం?ఆ ద్వేషమూ ఈ నిర్లక్ష్యమూ ఇప్పుడప్పుడే పోయేవి కావు - బిడ్డ చచ్చినా పురిటికంపు వెంటనే పోదన్నట్టు ఆంధ్రావాళ్ళు ఈ రెంటినీ కొంతకాలం భరించాల్సిందే, బహుశా అనంతకాలం వరకూ?!మొదట వాత్స్యాయన కామసూత్రాలు పరిచయం చేస్తా.తర్వాత అర్ధశాస్త్రం పరిచయం చేస్తా.బోరు కొట్టకుండా నా మార్కు క్యామెడీ లాంగ్వేజి ఉండనే ఉంది.కురాళ్లకి భవిష్యత్తుని యెట్లా తీర్చి దిద్దుకోవాలి అనేది చెప్పకుండా సోది టాపిక్కులన్నీ యెత్తుకుంటే యెవడు చదువుతాడు?ఈ విషయంలో కష్టేఫలి మాస్టార్ని ఒక్కర్ని మినహాయించెయ్యాలి,బాతాఖానీ లక్ష్మీఫణి మాస్టార్ని కూడా!

     ఒక్క నేను తప్ప దాదాపు ప్రతి మగబ్లాగరూ నీహారికతో యేదో ఒక సందర్భంలో చివాట్లు తిన్నవాళ్ళే!అది కూడా నీరసానికి ఒక కారణం అయ్యుండొచ్చు,మగబ్లాగర్లంతా ఇంత బతుకూ బతికి ఈ అమ్మాయితో తిట్లు తినడమా అన్న ఫీలింగుతో బితుకూబితుకూ మంటున్నారని నా అనుమానం!ఈ నీహారికా ఆంటీలో చాలా మ్యిస్టేరీ ఉంది సుమండీ!నేను విడాకులు అడిగినా మా అయన ఇవ్వట్లేదు అంటుంది చూశారూ,అది అసలైన ఆడ తెలివి,జాణతనం!నిజంగా విడాకులే కావాలంటే ఆయన్ని బతిమిలాడుకోవడం దేనికండీ,లాయరు దగ్గిరకెళ్ళి డైరెక్టుగా నోటీసు పంపించాలి గానీ?!పెద్ద ఘొప్ప - మా అయన చూడండి నేను విడాకులడిగినా ఇవ్వకుండా నన్ను ఎంత గారాబంగా చూసుకుంటున్నాడో అని రివర్సు ఫిట్టింగులు వేస్తున్నాది - అది అర్ధం చేసుకోకుండా ఈవిడ శూర్పణఖ అభిమాని కాబోలు అబ్బో,అమ్మో,ఓహోహో అనేసుకుని అపార్ధం చేసుకుంటే కళ్ళు పోతాయి - నిజం,ఒట్టు,అమ్మతోడు!యేమైనా నీహారిక దెబ్బ తగలకుండా చూసుకోవడం విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తల వల్లనే మగబ్లాగర్ల పోష్టులు తగ్గాయనేది నా పరిశోధనాత్మకమైన వివరణ!అయితే,ఆడబ్లాగుల్ని నిషేధించాలనే నా ఉబోసని అందరూ ఒప్పుకోకపోవచ్చు,బొత్తిగా సెక్సప్పీలు ఉండదేమోనని ఫీలయ్యే పుంగవాలు కూడా ఉండే ఉంటారు మగబ్లాగర్లలో, పైకి చెప్పరు గానీ కుర్రతనంలో ప్రతి మగబ్లాగరూ గ్రంధసాంగుడే - అబ్బో!ఇక ఆడబ్లాగర్లలో యెవ్వరిని ఆపినా నీహారికని మాత్రం అస్సలు ఆపలేం:-)

     పోస్టు పట్ల కుతూహలం పుట్టాలంటే టైటిలు లోనే కిక్కు ఉండాలి!కధామంజరి మాస్టారు ఈ మధ్యన ఈ విషయంలో ఆరితేరి పోయారు,అట్లాగన్న మాట!టైటిలుకీ కంటెంటుకీ రిలేషన్ లేకపోయినా పర్లేదు.విజిటరు టైటిలు చూడగానే "హర్రె!ఇదేమిటి?" అని కంగారు పడయినా సరే బ్లాగుకి వచ్చిపడేట్టు ఉంటే చాలు!అయితే వచ్చిన విజిటరు నీరసంగానో,కోపంగానో యెంత ఫాస్టుగా వచ్చాడో అంత ఫాస్టుగా పారిపోకుండా ఎంటర్టెయిన్ చెయ్యగలగాలి.ఎంటర్టెయిన్మెంటు గిట్టుబాటయితే ఫర్వాలేదని సరిపెట్టేసుకుని టైటిలుకీ పోష్టుకీ సంబంధం లేకపోయినా విజిటరు క్షమించేస్తాడు గానీ బోరు కొడితే మాత్రం అస్సలు క్షమించడు,టైటిలూ టాపిక్కూ యెంత అన్యోన్యంగా ఉన్నా విసుక్కుంటాడు!పోష్టులో మనం వాడే భాష కూడా ముఖ్యమే,నా మట్టుకు నేను చాలా ప్రయోగాలు చేశాను.తెలంగాణ మాండలికం నుంచీ సరళ గ్రాంధికం వరకూ యేమాత్రం రసాభాస కాకుండా రాయగలిగాను!ఇదంతా జరగాలంటే పోష్టు గురించి సమయం యెక్కువ కేటాయించాలి.నాది ఇన్వాల్వ్మెంటు కీలకమే అయినా ఆఖర్లో వచ్చే అరణ్యమెంటు గాబట్టి తీరిక యెక్కువ,మిగతా బ్లాగర్లకి ఉద్యోగ బాధ్యతల వల్ల అంత తీరిక ఉండట్లేదు గాబోలు!

     విజిటర్లు గూడా కొంచెం ఓపిక చేసుకుని నచ్చిన బ్లాగు పోష్టుల్ని మెచ్చుకుంటూ,నచ్చని వాటిని ఎందుకు నచ్చలేదో చెప్తూ ఉంటే బ్లాగర్లకి కూడా ఆ రెస్పాన్స్ మరింత హుషారు ఇస్తుంది,కదా!నచ్చితే యెలాగూ భేషులూ శభాషులే ఉంటాయనుకోండి,నచ్చనప్పుడు ఇచ్చే సూచనలు మాత్రం కొంచెం సరళంగా లోపం ఏమిటో చెప్పి తప్పుకుంటే బాగుంటుంది,ఎంతయినా బ్లాగరు హోస్టూ కామెంటరు గెస్టూ కదా,మనం ఒకరింటికి వెళ్ళి వాళ్ళనే తిట్టి రాము కదా!కామెంటర్లకి రెస్పాన్స్ ఇవ్వడంలో శ్యామలీయం బెస్టు!పబ్లిష్ చేసిన ప్రతి కామెంటుకీ కృతజ్ఞతలు చెప్తూ అయినా తప్పనిసరిగా రెస్పాండ్ అవుతూ ఉంటారు.ఇంకా కొందరు ఉన్నారు,కానీ ఇక్కడే ప్రముఖంగా చూశాను.నాకేమో మొదట్లో పనుల వొత్తిడి యెక్కువైనప్పుడు హడావిడిగా వొచ్చి నేను కూడా విజిటరులాగా ఒక లుక్కేసి పోవడం జరిగేది,ఇప్పటికీ బధ్ధకం ఒకటి ఉండటం వల్ల కర్టెసీ రిప్లై కామెంట్లు ఇవ్వడంలో శ్యామలీయం అంత నిష్ఠగా ఉండలేకపోతున్నాను.అయితే, నా బ్లాగులో అన్ని పోష్టుల్లోనూ నాకు నచ్చిన కామెంటు ఒకటి ఈ మధ్యనే పడింది!"వాళ్ళ పేర్లతో శకాలు ఉన్నయ్యంట,వాళ్ళు మాత్రం ఈ భూమ్మీద లేరంట!య్యో,యేందయా నీ చరిత్రా నువ్వూనూ?" పోస్టులో ఒక ఆజ్ఞాత వేసిన జోకు, అది ఇది:రెండు కళ్ల సిద్దాంతం తెలంగాణ వాళ్లు తిప్పి కొట్టి బాబు ను ఎగతాళి చేయని రోజు లేదు. తెలుగు సినీ పరిశ్రమ ఎమిటి, ఆంధ్రా వాళ్లు అందరు ముందూ వెనుకో తెలంగాణాను వదులుతారు. ఖాళి గా ఉన్న హైదరాబాద్ రోడ్లలో జై, శ్రీకాంత చారి, విశ్వరూప్, గుండు గారు, ప్రభాకర్ మందార, బుద్దా మురళి, కంచా ఐలయ్య తో కలసి క్రికేట్ ఆడుకొని, పోటొలను గుండు బ్లాగు లో అప్ లోడ్ చేసి కింద తెలంగాణ భాష లో పద్యాలు రాసే రోజు చాలా దగ్గరలో ఉంది. - ఎప్పుడు గుర్తొచ్చినా మొహాన దహాలు పూయించే సరదా కామెంటు:-)ఇట్లాంటి సరదా మనుషులు ఒక పదిమంది ఉంటే చాలు ఆంధ్రోళ్ళూ తెలంగాణోళ్ళూ పదిమంది కేసీఆరులూ వందమంది గొట్టిముక్కలలూ యేడ్చి కుళ్ళుతున్నా పట్టించుకోకుండా ఘొల్లుఘొల్లున నవ్వేసుకుంటూ కలిసిపోతారని నా నమ్మకం?!నిజంగా అలా జరిగే అవకాశం లేదు,హాస్యోత్ప్రేక్ష అది:-)కాకపోతే సీరియస్ విశ్లేషణలో నేను కూడా ఆంధ్రా వాళ్ళు ఎప్పటికయినా తెలంగాణలో వెనక్కి వెళ్ళకతప్పదనీ,ఆ తర్వాత తెలంగాణ వాళ్ళు ఆ చోటుని భర్తీ చెయ్యడానికి కొంచెం టైము పడుతుందనీ రాసి ఉన్నాను.నా అంచనా అయితే పదేళ్ళు,వాళ్ళ చురుకుదనాన్ని బట్టి ఇరవయ్యేళ్ళు పట్టినా పట్టొచ్చు,ఇంకా అధికారంలో ఉన్నవాళ్లని ఉదారంగా అన్ని మంచిపన్లూ వాళ్ళనే చెయ్యనిస్తే వచ్చేసారికి మనం పవరులోకి రావడం యెట్లా అనే రంధితో ఉన్నవాళ్ళు గట్టిగా కృషి చేస్తూ ఉంటే మరో యాభయ్యేళ్ళు పట్టినా పట్టొచ్చు,ఏమంటారు?నీహారికని ఆంటీ అనడం వల్ల కామెంటరు కుర్రాడే అనిపిస్తుంది,ఇలాంటివాళ్ళ కోసమైనా మోడరేషన్ యెత్తెయ్యాలనిపిస్తుంది.కొందరు వాళ్లకున్న ఆబ్లిగేషన్స్ వల్ల ఐడీతో ఇలాంటి కామెంట్లు వెయ్యరు,అది అందరికీ తెలుసు.యెలాగూ ట్రాక్ మారుస్తున్నాను గాబట్టి మళ్ళీ చెత్త కామెంట్లు రాకపోవచ్చు,చూడాలి!

     యాగ్రిగేటర్ల వారు కూడా మరీ ఇటీవలి రెండు పోష్టులతో సరిపెట్టెయ్యకుండా ఒక నాలుగైదు పోష్టులకైనా ఆ సంఖ్యని పెచితే బాగుంటుంది.యెందుకంటే కొందరు విజిటర్లు సబ్జెక్టుని బట్టీ టైటిలుని బట్టీ కొంచెం పాతవైనా సరే చూడాలని ఆశించటం సహజం!వెంటవెంటనే పోష్టులు రాసేస్తే,వెంటవెంటనే రెండు మూడు మాత్రమే ఉండి పాతవి మాయమైపోతూ ఉంటే పోష్టు యెంత మంచిదైనా యెక్కువమంది చూడలేరు గదా!బహుశా దానివల్ల యాగ్రిగేటర్ సిస్టం యొక్క మెమొరీ మీద బరువు పడుతుందేమో,అయినా పరిశీలించి చూస్తే మంచిది!విజిటర్ల వైపు నుంచి చూస్తే అదొక ఇబ్బంది అనిపిస్తున్నది నాకు!అన్ని యాగ్రిగేటర్ల లోనూ కామెంట్ల సెక్షను లేదు.నేను ఈ మధ్యన కంచె సినిమా గురించి ఒకరు వేసిన కామెంటుని బట్టే చూశాను,అట్లా బ్లాగుల్ని వెదికేవాళ్ళూ ఉంటారు విజిటర్లలో.


ఆడవాళ్ళు తిట్లకి లంకించుకుంటే యెంతటి మగాడికయినా గుండెలు జార్తాయి - ఇంక ఆపేస్తాను!
-----------------------------------------------------------------------------------------------------------------

ఈ ప్రసంగం శాలివాహన శకం 1937 కార్తీక మాసము 22వ తేదీ శుక్రవారము నాడు ప్రచురించబడినది.

Tuesday, 21 July 2015

కధామంజరి మేష్షారు కూడా బ్లాగు మూసేస్తానని బెదిరిస్తున్నారు!ఇది బ్లాగులోకం మీద విరుచుకు పడిన భేతాళిక మహత్యం కాదు గదా?

          అప్పుడెప్పుడో వ్యూహాత్మకంగా బ్లాగు మూసేస్తున్నాను అనంగానే తధ్ధాస్తు దేవతలు పనిలేక గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుని కూర్చుని విసుగుపుట్టే టయానికి అనుకున్నానో యేమో రెచ్చిపోయి దీవించేసి ఉంటారు, ఇప్పుడిప్పుడు మెల్లమెల్లగా నిజంగానే విరక్తి పుడుతున్నది కొద్దిరోజులుగా!యెటు చూసినా ముసలి యెంటీవోడు కుర్ర ఫ్రీదేవితో రొమాన్సు చేస్తున్నంత దరిద్రంగా కనిపిస్తున్నాది దృశ్యమాన ప్రపంచమంతా,నా మనసు కేమైంది?(తొక్కయింది,తోలయింది - నీకసలు మనసంటూ ఉండి యేడ్చిందా?)

          నాకొక్కడికే అనుకుందామా అంటే కధామంజరి మేష్షారు ఒకసారి "బ్లాగైనా మూసెయ్యాలి,బ్లాగు పేరైనా మార్చెయ్యాలి" అని హడావిడి చేసి .అబ్బే న్యూమరాలజీ మీద ఉత్తుత్తి సెటైరు మాత్రమే అనేసినా మళ్ళీ ఇపుడు కొత్తగా "లాభం లేదు,బ్లాగు మూసెయ్యాల్సిందే" అని మరింత గాఠిగా అనేస్తున్నారు,నాకు నిజంగానే అనుమానం వొచ్చేసిందీసారి ప్రమాదం ముంచుకొస్తున్నదని!

          మొగుడు లేని శూర్పణఖ మగాడి కావిలింతల కోసం అంగలారుస్తూ దండకారణ్యంలో స్వైరవిహారం చేస్తూ సీత మొగుడికి ప్రపోజల్స్ పెట్టి యే కాడికి తెచ్చుకుందో చూసి కూడా యేమీ నేర్చుకోని తెడ్డుశ్రీ లాగ మొగుడు నెట్ కనెక్షను బందు జేసినా ఆగకుండా ఈ మధ్యన భయంకరమైన వికట అట్టహాసా(భ.వి.అ.హా)లు చేసుకుంటూ బ్లాగుల్లో తిరుగుతున్న భేతాళిక దెబ్బ ఈయనకి గూడా తగిలిందా యేంటి?ఇదివరకెప్పుడూ లేనిది శ్యామలీయం మేష్షారు కూడా తన కామెంట్లని తనే తొలగించుకుంటున్నారు,హేవిటో?దాని గాలి సోకినా దాని బుధ్ధులే వస్తాయేమో - సీనియరు బ్లాగర్లే ఇట్టా అయిపోతే జూనియరు బ్లాగర్ని నా పరిస్థితేంటి?

          ఇలాంటి ఆలోచనలు మెదడును తొలుస్తుండగా రంజానూ ఆదివారం కలిసొచ్చేసరికి పిచ్చినిదర పోయా.అసలే రంజాను,మనం ఉపోషం ఉండకపోయినా గాలిలో ఎఫెక్టు ఉంటుందేమో,ఆపైన ఈ హిందూ వ్యతిరేక రాక్షసి భేతాళిక గురించిన ఆలోచనలు తోడవటంతో - ఒక భయంకరమైన కల వొచ్చేసింది.నా బ్లాగులో కంటెంటు యెత్తుకుపోయిందని భేతాళిక మీద యాగ్రీగేటరు/ప్రధానికి కేసు పెట్టానంట!"యెవరిని దండించాలి?" కధలో రాజుకి ఆఖరికి పిచ్చెక్కినంత పనై "అసలు వీడు ఈ కధంతా విప్పి చెప్పకపోతే యెవరో ఒకరికి శిక్ష వేసి ప్రశాంతంగా ఉందును గదా,పనిలేని మంగలి లాగ వొచ్చి నా మనశ్శాంతిని పోగొట్టాడు" అనిపించి జరిగిన కధంతా చెప్పిన బ్రాహ్మడికే శిక్ష వేసినట్టు ఈ భెతాళికని దాని మొగుడే ఆపలేకపోయాడు నేనెలా ఆపగలుతాననుకున్నాడు అని నామీద పిచ్చి లెగిసి నన్నే జైల్లో పెట్టాడంట!దాంతో "నను బ్రోవమనీ చెప్పవే బ్లాగమ్మ తల్ల్లీ!" అనీ "యెవడబ్బ పోష్టులని కులుకుతు కామెంటేవు బ్లాగుచంద్రా" అనీ నాకు గుర్తుకొచ్చిన భక్తిపాటలుగా అనిపించే తింగరి పాటలు పాడుకుంటూ దొంగేడుపు యేడుస్తున్నానంట!

          ఇంతలో భ్రామరీయం,బండల్రావు ఇహిహి తీవ్రవాదుల గెటప్పుల్లో జైలు గోడల్ని బద్దలు కొట్టుకుని వచ్చి వాళ్ళ భ.వి.అ.హా లతో కాపలావాళ్లని మూర్చపోయేటట్టు చేసి ధైర్యస్థుణ్ణి గనక వాళ్ళ భ.వి.అ.హా లకి సొఘమే కళ్ళు తేలేసిన నా చెరో చెయ్యీ చెరొకడూ పట్టుకుని లాక్కొచ్చి ఇక్కడ కూలేసి మాయమైపోయారం!అప్పటినుంచి ఇట్టా పడివున్నానంట!కటిక చీకటి!కన్ను పొడుచుకున్నా యేమీ కనబడేట్టు లేదు కన్నుపోవడం తప్ప,అందుకే పొడుచుకోకుండా తీవ్రంగా ఆలోచిస్తూ ఇలా పోష్టుని వ్యాకోచింపజేస్తున్ననన్నమాట!

          భ్రామరీయం అంటే తనని నేనెప్పుడూ విమర్శించలేదు గాబట్టి ఇంకా దీర్ఘంగా పరిశీలిస్తే కొన్నిచోట్ల తనని సమర్ధిస్తూ కామెంట్లేశాను గాబట్టి నన్ను తప్పించి ఉండొచ్చు,బండల్రావు యెట్లా వచ్చాడు నాకోసం ఇంత సాహసం చెయ్యటానికి?జప్రని పాప్యులర్ చేసుకోవటానికి తంటాలు పడుతూ పెట్టుబడిదారీ విధానాన్ని చితక్కొట్టెయ్యాలంటూనే కమ్యునిష్టు సిధ్ధాంతం కూడా లోపాల్ని తొలగించుకుంటేనే(అసలు లక్ష్యమైన వర్గరహిత సమాజం వర్ణనలోని లోపాలకే దిక్కులేదు,ఇంక మిగతా లోపాలు సవరించుకోవటం అనేది జరుగుతుందా!) అది సర్వజనామోదయోగ్యం(ఆంధ్రోళ్ళని తిట్టడానికి దోపిడీ అన్న వొక్క ముక్కని అరువు తెచ్చుకుని లాగి పీకి పిండి పిసికి రాష్త్రాన్ని తెచ్చుకున్న తెలంగాణోళ్ళే వాళ్ళకి దెబ్బవుతుందనుకున్నప్పుడు వాళ్ల రాష్ట్రంలో అధికారంలోకి వద్దామనుకుంటున్న నక్సలైట్లని వొప్పుకోవట్లేదు,ఇంగ అందరూ వొప్పుకోవాలంట హిహిహి) అవుతుందనే భ్రమల్లో ఉండి పైకి తటస్థంగా కనబడే ఆ మ్యూకనిజం పక్షపాతి సీనులోకి యెట్టా వచ్చాడు,ఇందులో యేదో మోసం ఉంది!

          "అడాపావియా అక్కడి చర్చల్లో యెక్కువగా వేలు పెట్టి కామెంట్లు పెంచేది నువ్వే గదుడా?" అని వయస్సార్ భక్తుడైన ఒక అరవతెలుగుబ్లాగరు వేసిన కర్ణకఠోరమైన కేక వినపడి భయంతో వొళ్ళు జలదరించి పోయింది?!ఆహా, పెట్టుబడి విధానంలోని లాభాపేక్ష యెంత మంచివాళ్ళనయినా దిగజారుస్తుంది గదా!అయితే, వాళ్ళిద్దరూ అనేకానేకమైన రహస్య కారణాల వల్ల ఇంకా గాఠిగా చెప్పాలంటే హిప్నటైజ్ చేసి మతం మారుస్తున్న లాంటి దుర్మార్గమైన వశీకరణకి బలయిపోయి ఆ భెతాళిక మగవాళ్ళ సైకాలజీ తెలుసుకుని గురిచూసి ప్రయోగించిన మనోవైజ్ఞానిక మాంత్రికశక్తుల అధీనంలోకి వెళ్ళిపోవదం చేత నాలాంటి రాజకీయ ఖైదీల్ని మునుగుడుపుల అల్లుళ్ళలాగ చూసుకునే బ్లాగు/ప్రభుత్వ కారాగారం నుంచి విడిపించి కూసింతయినా జాలీ దయా లేకుండా గంప గయ్యాళి భేతాళిక యెదాన పడేశారన్నమాట, ఎంత ఘోరం?!

          పెనం మీదనుంచి పొయ్యిలో పడ్డట్టున్నాను! నా బ్లాగులో  నేను కమ్మని పోష్టుల్ని రాసుకుని అఘోరించకుండా ప్రతీ బ్లాగులోనికీ యేల దూరవలె?దూరితిని పో బాగు బాగు మీ బ్లాగు అని మెచ్చుకుని భజంత్రీ కామెంట్లతో సంతోష పెట్టక పోటుగాడి వలె రెచ్చిపోయి ప్రతి అడ్డగాడిదతోనూ యేల వాదించవలె?వాదించితిని పో సాటి మగవాళ్లతో సరిపెట్టుకొనక ఈ భేతాళిక నేల కెలకవలె?ఆడుదానితో పోట్లాటకు యెంత కొమ్ములు తిరిగిన వీరాధివీరులయినా దడుచుకొని చత్తురే నేనేల మూర్ఖముగా కొమ్ము విదిలించవలె?నిస్సీ,ఇంత దనుకా ఇంతమందిని ఒఖ్ఖడనై నోరుమూయించిన నేను ఒఖ్ఖ్క ఆడుదానికి భయపడి బ్లాగు మూసుకొని పోవుటయా?చరిత్ర తెలియదు,పురాణాలు చదవదు,కనీసం తను వూడబొడుస్తున్నానన్న సమస్య గురించి నాలుగే నాలుగు ప్రశ్నలు వేస్తే జవాబు చెప్పలేదు - ఆ పిపీలికానికే అంత పొగరుంటే గండభెరుండాన్ని నాకెంత ఉండాలి!

          ఈ విధంగా ఆవేశం యమహా రేంజిలో యెక్కువైపోయి ఆలోచిస్తుంటే నాలో నేను ప్రేలాపిస్తుంటే ఈ చోటు వేడెక్కినట్టనిపించి కాస్త ఆగాను!నా ఆనుమానాన్ని నిజం చేస్తూ "అయ్యా మీరు అంతలా వేడెక్కడం ఆపేస్తే మీరు ఇక్కణ్ణించి బయట పడేందుకు క్లూ ఇస్తా,దగ్గిరకి రాలేకపోతున్నా అరగంట నించీ - ఇప్పుడు కొంచెం నయం!" అని ఒక సన్నని ఆర్తనాదం వినబడింది.ఇంకా వేడెక్కటం నాకూ ప్రమాదమే గనక తగ్గి ఆరా తీస్తే యాగీ భ్రాజిష్ణ అట!గుర్తొచ్చింది - అమాసకీ పున్నమికీ వస్తాడు,పోష్తుకి సంబంధం లేని కామెంట్లేస్తాడు!చెప్పి వేస్తాడు గనక నేనూ గొడవ పడలేదు - ఆ పాయింట్ల గురించి కూడా యేదో ఓ రోజు పోష్టు వెయ్యకపోతానా అనే ఆశ కాబోలు, కొన్ని వేశా.ఆ కృతజ్ఞతతో వచ్చినట్టున్నాడు!

          "మీరు బాహుబలి సినిమా గురించి యేదయినా విశ్లేషణాత్మకంగా చెప్తారని యెదురు చూశాను,వూరికే బావుంది చూడమని చెప్పి వొదిలేశారు - ఇప్పుడు ఆపని చేస్తే మీకు యేదో ఒక రూపంలో సాయం అందవచ్చు" అని అర్ధం పర్ధం లేని క్లూ ఇచ్చి అడిగినా జవాబు చెప్పకుండా సైలెంటయిపోయాడు!బాహుబలి విశ్లేషణకీ నేను ఇక్కణ్ణుంచి బయటపడటానికీ లింకు యేముంది?యేమో బాబరుకీ రాముడికీ లింకు ఉన్నప్పుడు బాహుబలి విశ్లేషణకీ నేను తప్పించుకోవటానికీ సంబంధం యెందుకు ఉండకూడదు?బీ ఏ రోమన్ ఇన్ రోం అన్నట్టు మనం ఉన్నది కూడా భెతాళిక రాజ్యంలోనే గదా!తిన్ననైన లాజిక్కుల కన్నా తింగరి లాజిక్కుల వల్లనే పని జరగొచ్చు.ఇక్కడ కూర్చుని బ్లాగు రాయడం కుదరదు గాబట్టి కంచుకంఠం కొంగర జగ్గయ్యని ఆవాహన చేసుకుని ఓపెనెయిర్ ధెయేరులో ఉన్నట్టు వూహించుకుని ప్రస్సంగం దంచెయ్యడమే!

          అరెమికాలో కూడా పుష్కరాల తొక్కిసలాటను తలపించేటంతగా బాహుబలిలో యేముంది?మగాళ్ళందరికీ నాకులాగే అతి తెల్లని నున్నని చర్మం గల తమన్నా బాహుమూలాలు నచ్చాయా?అది మగాళ్ళకి?ఆండువారు కూడా వెర్రెత్తిపోతున్నారే,బహుశా వాళ్ళమీద ప్రభాస్ మరియూ రాణాల కండలు తిరిగిన దేహాల ప్రభావం పనిచేసి ఉండొచ్చునా!అరెమికాలో అన్నేళ్ళు ఉండి గూడా యే దేశమేగినా యెందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నట్టు అచ్చు హిండియాలో మాదిరి వెనక సీట్ల కోసం అగ్గగ్గ లాడిపోయారంట - పిచ్చి మగాళ్ళు?మా ఫ్రెండు గూడా ఇట్లాగే మరీ ముందైపోయేసరికి చూడ్డం ఇబ్బందిగా ఉంది ఈసారి కాస్త వెనక కూర్చుని చూడాలి అంటుంటే "మంచి సినిమా యెక్కడ కూర్చుని చూసినా బాగానే ఉంటుంది, చెత్త సినిమా యెక్కడ కూర్చుని చూసినా చెత్తగానే ఉంటుంది,నీకు సినిమా చూట్టం తెలీదనుకుంటా!నాకు మాత్రం ఇక్కదే బాగుంది, తమన్నా కళ్ళనిండుగా కనబడతంది?!" అని నేనంటే నన్ను కామాతురుణ్ణి చూసినట్టు చూసి "అన్నా, కాస్త వయస్సు గుర్తు తెచ్చుకో!నీకు మనవరాలు వయసులో వుంది" అంటున్నాడు - ఇంత సౌందర్యదృష్టి లేని అరసికుడు సినిమాలు చూట్టమెందుకండీ?సినిమా హీరోయిన్లు మహాజనానికి మరదలు పిల్లల్రా అని మల్లాది వారిని గుర్తు చేసి జ్ఞాననేత్రాన్ని వికసింపజేశాను!

          యే మాట కామాటే చెప్పుకోవాలి, ఆ సుకుమారికి శృంగారం నప్పినంతగా అంగారం నప్పలేదనిపించింది నా కుశాగ్రబుధ్ధికి!సినిమా నిండా రాజులూ, రాజ్యాలూ, కుట్రలూ, యుద్ధాలూ నిండి ఉన్న ఈ సినిమాని కాస్తంత  వాస్తవికతకి దూరమయితే చాలు ఢాం తుస్స్ సినిమాలో సామాజికస్పృహ లేదు, ఇదంతా బూర్జువా కళాకారుల పెట్టుబడిదారీ ఫ్యూడల్ సామ్రాజ్యాల సంకీర్తన అనే మ్యూకనిష్టు ప్రభావిత విమర్సకులు కూడా వెర్రెత్తిపోయి యెందుకు పొగుదుతున్నారో గదా!బహుశా ఇవ్వాళ్టీ ప్రజాస్వామ్యంలో కూడా అగ్రభాగాన కనబడుతున్న ప్రతి గొట్టాం గాడికీ అతని భజన బృందం చేస్తున్న వ్యక్తిపూజలూ, ఆర్యక మహారాజు మృచ్చకటికంలో వర్ణించిన శకారుని వంటి రాజశ్యాలకుల అనధికారిక నిర్వాకాలు నిరాఘాటంగా చెల్లిపోతుండటాలూ,అందరూ కోరుకుంటున్నారన్న ప్రదర్శనలతో అనువంశిక పాలన కొనసాగుతుండటాలూ చూసి చూసి విసుగెత్తి ఈ నాటకాలకి బదులు ఆనాటి రాజరికంలో నిజాయితీ అయినా ఉండేది గదా అని ఒక రకమైన ఆకర్షణ కలిగిందా?

          ఇవ్వాళ్టి మోడల్ వల్ల ప్రాంతీయ అసమానతలు పెరిగి చిన్న రాష్ట్రాలతో పరిపాలన సులభం అనే వాదనతో కైవారం తగ్గుతూ విడిపోతున్న రాష్ట్రాల లోని ప్రజలు క్రమేణా ఒకనాడు తమ ప్రాంతాలను పరిపాలించిన రాజవంశాలతో మమేకమవుతున్నారు!ఈ మలుపులు మరో నాలుగు తిరిగితే కాలగమనంలో మళ్ళీ ఆనాటి రాజ్యాలు ఉనికిలోకి వస్తాయేమో?ఇక్కడి దాకా యమా సీరియస్సుగా సాగిన నా పరిశోధన హఠాత్తుగా తింగరిగా మారిపోయింది - గాలి మహత్యం!ఈ లెక్కన గేటు వూయెలయ్య "దేవుడు ప్రజాస్వామిక వాదియా కాదా?" అనే సుత్తి వ్యాసాలు రాసుకుంటూ కూర్చోకుండా మగధీర టైపులో కవచకుండల శిరస్త్రాణాలు ధరించి అగ్రకుల శాత్రవ జనభయంకరుడై ఐలహులి వంశస్థాపానాచార్యుడైతేనే దళితులు రాజ్యాధికారంలోకి వస్తారేమో?!

           ఇంకా ఇరగదీసి ఉందును గానీ ఒక ఏడుపుముఖం కళ్ళముందు కనబడ్డం,ఖెవ్వ్ మనే కేక వినబడ్డం ఒకేసారి జరిగేసరికి యేకాగ్రత బద్దలై ప్రస్సంగం ఆపేశాను.ఈ మొహం యెవరిదయ్యా అంటే ఆయనే చెప్పాడు కళ్ళనీళ్ళ పర్యంత మవుతూ ,"అయ్యా హరిబాబు గారూ, ఒకప్పుడు మిమ్మల్ని దళితుల సమస్యలకి మీకు తోచిన  పరిష్కారం చెప్పమని అడిగినందుకు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాను. నేనూ మనిషినే, నేను కూడా సినిమాలు సరదాగా చూస్తాను సార్!ఆ గేటు వూయెలయ్యని మగధీర గెటప్పులో వూహించడానికే దడుచుకుని చస్తున్నా!మీరిట్టాంటి పరిష్కారాలు మాత్రం చెప్పకండి - అంతకన్నా శాశ్వతంగా దళితులుగా బతకడమే మేలు.మీ అగ్రకుల దురహంకారాన్ని పోనిచ్చుకున్నారు గాదు" అని చడామడా తిట్టేసి కోపమూ అసహ్యమూ తగ్గడంతోనో యేమో పాలిపోయిన మొహం మామూలుగా అవడం వల్ల మళ్ళీ కనబడకుండా వినబడకుండా ఐపోయాడు! శాడిస్టుని గదా,నేనూ నా మనసులో ఒక రెండు భ.వి.అ.హా లు చేసుకున్నా!

          తీరా తను వెళ్ళీపోయాక నా మామూలు బెంగ నాకు మళ్ళీ మొదలైంది.బాహుబలి విశ్లేషణతో దళిత మేధావి తిట్లు తప్ప బయటపడే మార్గం దొరకలేదే అని వగచి వగచి కృశించి కృశించి నశించి పోయేలాగున్నాను!భ్రాజిష్ణ క్లూ గూడా గాలికి పోయిన పేలపిండిలా అయిపోయింది!అసలు భెతాళికకి పిచ్చి అనేది నా పొరపాటు అవగాహన కావచ్చు?తను నాకు తారసపడిన మొదటి సన్నివేశం లోనే నాకు తన ప్రవర్తన రెండు విధాలుగా అనిపించింది!అయితే కేవలం గుర్తింపు కోసం చేసే సంచలనంలో సంతోషం వెదుక్కునే గందరగోళపు ప్రవర్తన అయి ఉండాలి,లేదంటే అధికారం కోసం యెంతకయినా తెగించే రాజకీయం నేర్చిన మనిషయినా అయి ఉండాలి అని - అలాంటప్పుడు మొదటిది కాక రెండోది తన అసలు రూపం అయితే మాత్రం తను మహా భయంకరమైన మరో భిందిరయే అవుతుంది!తనూ తన ఫ్రెండ్సూ కలిసి పెద్ద రామద్వేషుల మంద పోగయి ఉందక్కడ!

          కాలమహిమ!అసలు రాముణ్ణి అంత నీచంగా విమర్సిస్తున్న మనిషి మీద సైబర్ కేసు పెట్టి జైల్లో తొయ్యాల్సింది,దానికి అందరూ కలిసి రావాలి గదా అనిపించి నాకు తోచినట్టు నేను నాలుగు తిట్లు తిట్టేసరికి ఈ అంతూ పొంతూ లేని చీకట్లో పడి అఘోరిస్తున్నాను.మొత్తం జనాల సంస్కృతే మారిపోయినట్టుంది!?ఈ మధ్యకాలంలో అడ్డూ అదుపూ లేకుండా బతకడమే ఆధునికత అనుకోవటం,మాలో అనైతికత ఉంది అని ధీమాగా చెప్పుకుని విప్పుకు తిరగటమే నాగరికతగా భావించి - "లెస్బియనిజం", "హోమోసెక్సువాలిటీ", "ఇన్సెస్ట్" లాంటి దేనినైనా సరే చట్టబధ్ధం చేసుకుని మరీ చెయ్యాలనుకోవడం ఒక ఘనకార్యంలా భావించే గాలి మంద ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది!ఎడ్వినా ప్రియుడి అభిమానులు స్వేచ్చ ముసుగులో నీతులు చెప్తే మీ ఆలోచనలు మామీద రుద్దకండి మా ఇష్టం వచ్చినట్టు బతికే స్వేచ్చ మాకుంది అని ఘీంకరించటం గొప్ప ప్రజాస్వామ్య సాంప్రదాయంగా చెలామణీ చేసేశారు - చరిత్రనీ,సంస్కృతినీ,సామాజికతనీ అబధ్ధాలతో నింపేసిన విషవ్యూహపు ఫలితమే ఇవ్వాళ్టి దుస్థితి!ఇవ్వాళ మన బలహీనతల్ని వొదులుకోలేక అనైతికతకి గౌరవనీయతని ఆపాదించటం కోసం యెంత నీచాని కయినా పాల్పడితే నష్టపోయేదెవరు,మన రేపటి తరం కాదా?

          ఒక ప్రౌఢ ప్రపోస్ చెసినంత మాత్రాన శూర్పణఖకి ముక్కూ చెవులూ కొయ్యాలా అని అడుగుతుంటే ఆవు చేలో మస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు పెళ్ళీడు కొచ్చిన నవోఢల్లో ఒకరు ఇంకొకరికి ఇద్దరబ్బాయిల పేర్లు చెప్పి వీళ్ళిద్దరిలో యెవరో ఒకర్ని నువ్వు లవ్ చేసితీరాలని రెచ్చిపోతున్నది!బాబరుకీ రాముడికీ సంబంధం ఉన్నప్పుడు ఈ రెంటికీ సంబంధం లేదా?ఉన్నదని ఒప్పుకుంటే ఆ అమ్మాయి చేసింది తప్పా ఒప్పా?తప్పయితే వాళ్లకి మంచి చెప్పగలిగే స్థానంలో ఉన్నట్టా తప్పు కాదంటే ఇంకా రెచ్చిపొమ్మని చీర్ లీడర్ పనులు చేస్తున్నట్టా ఈ భేతాళిక?మరి పిల్లలు తను "అందరూ రాముడికి ఫ్యాన్ లయితే నేను రావణుడికి ఫ్యాన్" అని చెప్పుకుంటుందే ఆ శూర్పణఖనీ రావణుణ్ణీ అనుసరిస్తే అందులో తన బాధ్యత ఉన్నట్టా లేనట్టా!

          ఇప్పటి వరకూ సాహితీ వ్యాసంగం లెమ్మని అనిపించిన శంక్రాభారణం బ్లాగులోని పూరణ కిచ్చే సమస్యలు కూడా ఇప్పుడు బూతులుగా అనిపిస్తున్నాయి,మొత్తం శ్రంగారాన్నే నిషేదిస్తే గానీ ఇలాంటివాళ్ళు పుట్టుకురాకుండా ఉంటారు గదా అనిపిస్తున్నది.నేను యెవరి నుంచయితే జవాబులు ఆశించానో అక్కడి నుంచి జవాబులు రావు?జవాబు దొరికితే గానీ ప్రశాంతంగా ఉండనివ్వని జవాబులు రాని ప్రశ్నల సుడిగుండంలో ఇరుక్కుపోయి నాకు ఒక్కసారిగా నీరసం ముంచుకొచ్చేసింది!"నీరసము వలన మనకొరుగు ప్రయోజన మేమి?పోయిన మనశ్శాంతి తిరిగి దక్కునా?ఈ చెర నీకు వీడునా?బ్లాగులోకము నందు శాంతి స్థాపించబడునా?నీ వూహ సరి కాదు!వారు పేరుకే నవీనులు గాని వారి ఆలోచన లన్నియు ప్రాచీనములే!ఆటవికమూ అకటావికత్వమూ దప్ప మరేమియునూ లేదు.నా గుంటనక్క యెత్తులతో వారిని మరింత గందరగోళ పరచి వారిలో వారికి విభేదములు కల్పించి గెలుపును నీ పాదపెఠము పైన పదవేసెదను.కొంచెపు వంచన పనులకు అయిన వాణ్ణీ అమ్మ తమ్ముణ్ణీ నేనున్నానుగా!" అని మా ధూళ్ళిపాళ్ళ మామయ్య పాచికలు టకటక లాడించుకుంటూ వచ్చాడు.

          నాకు తిక్కరేగిపోయింది - యెదవ ప్లానులేసి వాట్ని ఫాలో అయినోడికే గుండు కొట్టించి జారుకునే ఇట్టాంటి ముదనష్టపోళ్ళని దగ్గిరికి రానిస్తే మనమే  మట్టానికి ముణిగిపోతాం!ఇంక తగులుకుని "మామా గాంధార దేశపు  గుంటనక్క సార్వభౌమా,యే కాలమున నుంటివి?నీ బోడి యెముకల పాచికలు పనిచేయుట కిది నాటి కాలము కాదు!నేటి కాలపు మనుషులు లాభదృష్టితో గానీ లేక నష్టభీతితో గానీ - ఈ రెంటిలో యేదో ఒకదానితో మాత్రమే కలిసెదరు!ఇంత దనుకా గాంగ్రీన్ పార్టీ మరియూ మ్యూకనిష్టుల ఆర్భాట ముడ్డోలముగ నుండి లాభదృష్టితో కలిసినారు, కానీ ఇప్పుడిప్పుడు పరిస్థితులు తిరగబడి వారి పునాదులు కదిలి నష్టభీతిలో నున్నారు.లాభదృష్టి కన్ననూ నష్టభీతి బలమైనది గనుక ఇంకనూ బలముగా అంటుకుపోయెదరు తప్ప నీ నక్కజిత్తులకు విడిపోరు - ఇటువంటి చచ్చు పుచ్చు ప్లానులు మాకవసరము లేదు.అయిననూ నేనిప్పుడా గుడ్డిరాజు కొడుకును గాను,యుధిష్ఠిరుడను!అనగా ధర్మదృష్టి గలిగి యుధ్ధమున స్థిరముగ నిలుచువాడు!నీ వంటివాని యవసరము మా పొరుగు రాష్ట్రమైన లతెంగాణమున చాల యున్నది, అచటికి పొమ్ము!" అని ఝాడించేసరికి మొహం గంటు పెట్టుకుని,"అటులనే పోయెదను" అని గొణుక్కుంటూ పోయేవాడు పోతూ "నీవన్నట్టు వారిని నష్టభీతి కలిపినచో వారింకనూ వృధ్ధి నొందెదరు గద,కానీ లాభదృష్టి, నష్టభీతి యేదియునూ లేని మీ సింధుజాతి మాత్రము ఐకమత్యము కుదరక నశించిపోవుట తధ్యము." అని నాకూ బుర్ర తిరిగిపోయే రిటార్టిచ్చి వెళ్ళాడు?!

          ఔర ఔర - యెంత మాటనేశాడు ఠపీమని!వీడి మాట నిజమై చావదు గదా!లేదులే, పిల్లి శాపాలకి ఉట్లు తెగుతయ్యా యేంటి?వీడి లాంటివాళ్ళు యెంతమంది ఈర్ష్యాళువులై సహస్రాబ్దాల తరబడి కుట్రలు పన్నినా పురాణ యువతి లాంటి సనాతన సంస్కృతి అవిచ్చిన్నంగానే కొనసాగింది గదా!ఇప్పటికీ ననవఓన్మేషమైన యౌవ్వనప్రౌఢిమతో తొణికిసలాడుతూనే ఉంది గదా!తప్పుల్ని ఒప్పుకోగలిగిన ఆత్మ విమర్శ,అన్ని మతాలూ సమానమే అని ఒప్పుకుంటున్న అన్యమత సహిష్ణుత,పైనుంచి రుద్దడంలా కాకుండా వ్యక్తుల ఐచ్చిక విధేయతకే ప్రాముఖ్యత ఇచ్చిన ప్రజాస్యామ్యయుతమైన మతం ఒక్క హిందూ ధర్మమే!హిందూ దేవుళ్ళు ప్రజస్వామ్యవాదులు కారని వక్రభాష్యాలు చెప్పే గేటు వూయెలయ్య యెక్కడ ఇస్లాము ధర్మాన్ని గురించి "క్రైస్తవ మతాం నుంచి పుట్టిన పిలక"గా తప్ప మరోరకంగా వర్ణించడు, ఇవ్వాళ ఆ ధర్మం ప్రపంచవ్యాప్తంగా సొంత సాంప్రదాయాన్ని యేర్పరచుకుని ఒక పూర్తి స్థాయి మతంగా యెదిగిందని గుర్తించడు - అయినా తను ప్రజాస్వామ్యవాదినని చెప్పుకుంటే చెల్లిపోతున్నది!యే హిందువైనా,యే బ్రాహ్మణుదైనా,యే పీఠాధిపతి అయినా ఇస్లాము గురించి అలా అవమానిస్తూ మాట్లాడగా ఎవరైనా విన్నారా?లేదు!అయినా హిందువులు మతమౌఢ్యం గల దురహంకారులే!

          మన మతమే గొప్పది,మిగిలినవన్నీ అనాగరికమైనవి,ఈ ప్రపంచం మొత్తాన్ని మన దేవుడి పాదాల చెంత పడుకోబెట్టడం మన మతాన్ని పాటించే ప్రతి ఒక్కరి కర్తవ్యం అని ప్రభోదిస్తున్నా, ఇతర మతాల లోనివార్ని నయాన గానీ భయాన గానీ తమ మతంలోకి లాక్కోవడానికి యెన్ని దుర్మార్గాలు చేస్తున్నా,ఆధ్యాత్మిక సామ్రాజ్యవాదంలో వేర్లు తన్ని పెరుగుతూ విషవృక్షంలా విస్తరిస్తున్నా,అడుగు పెట్టిన ప్రతి చోటా అక్కడి ప్రాంతీయ సంస్కృతుల్ని ధ్వంసం చేసినా వారు సకల జన వంద్యులేనని తీర్మానించుతున్నారు!నిరాడంబరంగా జీవిస్తూ, ఇంద్రియ నిగ్రహాన్ని ప్రబోధిస్తూ,గౌరవమునే కోరుకుంటూ సంసార బంధనాల్ని త్యజించి ఆశ్రమ వాసులుగా ఉండి తమ కార్యకలాపాల ద్వారా సామాజిక సేవ చేస్తున్నా సరే ఆశ్రమ జీవనం వల్ల తమ చుట్టూ ఉన్న బయటి ప్రపంచంలో యేమి జరుగుతుందో తెలియని అమాయకత్వం వల్ల యే మాత్రం తమకి తప్పులు పట్టటానికి పనికొచ్చే యెంత చిన్న మాట మాట్లాడినా అరిభీకరంగా విరుచుకు పడుతున్నారు!

          దీని వెనక ఉన్నది ప్రజలకు సమాచారాన్ని చేరవేసే బాధ్యతాయుతమైన ప్రవర్తన కాదు, హిందూ మతప్రచారకుల్ని స్వేచ్చగా ప్రచారం చేసుకోనిస్తే తాము యెదగడం కష్టమన్న తెలివితో వారిని తమ మతానికి సంబంధించిన ప్రచారం చేసుకోనివ్వకూడదన్న దుర్మార్గపు వ్యూహం!మీడియా ముందు అలా అడ్డంగా దొరికిపోయేలా మాట్లాడితే విమర్సించరా అని అనేవారు ఇతర మతాల వారూ అలాగే మాట్లాడినా అవి యెందుకు చడీ చప్పుదూ లేకుండా అణగారిపోతున్నాయో, ఆ మీడియాల కెమెరాలన్నీ హిందూ మతప్రాచారకుల చుట్టూరానే యెందుకు మొహరించబడుతున్నాయో తెలుసుకుంటే అసలు విషయం బోధపడుతుంది!పని గట్టుకుని బొక్కలు వెదకదల్చుకుంటే ఈ ప్రపంచంలో యెవరూ పవిత్రంగా నిలవరు!అయితే అలా ఇతర మతాల్లో బొక్కలు వెదకటాన్ని ఒక వ్యూహప్రకారం కోట్లలో మిలియన్లలో డబ్బు వెచ్చించి చేసే సమాచారసామ్రాజ్యవాదుల దుర్మార్గపు వ్యూహానికి బలవుతున్న వాటిలో మొదటిది హిందూ ధర్మం, రెండవది ఇస్లాం ధర్మం!మొత్తం భారతదేశంలోని మీడియా అంతా హిందూమతం మీదనే తమ దృష్టిని కేంద్రీకరించడం అమాయకంగా జరగడం లేదు,ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు అనాలోచితంగా యేదీ చెయ్యరు.వాళ్ళు మనకి చూపించే ప్రతి దృశ్యమూ కూయించే ప్రతి శబ్దమూ వారి వ్యంగ్యరచనా వైభవంతో మన సంస్కృతి గురించి మనమే అవమానకరంగా మాట్లాడేలా మనల్ని తయారు చెయ్యటం కోసం గురిచూసి వొదుల్తున్న శస్త్రమే!

          ఇస్లామిక్ తీవ్రవాదానికి మూలం వారు తమ మీద జరుగుతున్న దాడిని గ్రహించి దానికి లొంగకుండా ఉండటానికీ తమ మత స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవటానికీ తమకి తోచిన దారిలో చేస్తున్న ప్రయత్నమే!వారికి వారి శత్రువెవరో స్పష్టంగా తెలుసు.తమ పైన జరుగుతున్న దాడికి ప్రతీకారం చేస్తున్నామని అనుకుంటున్నారు గనకనే వారిలో పశ్చాత్తాపం లేదు.హిందువులకే ఇంకా ఇవేవీ తెలియడం లేదు - కూపస్థ మండూకాలు!ఉమ్మడి శత్రువొకడు పక్కవాడి మీద దాడి చేసి వాడు కుయ్యో మంటుంటే అదే దెబ్బ మనకీ తగిలినప్పుదు మనం కూడా అలాగే కుయ్యో మనాలి గాబోలు ననుకునే దేభ్యం మొహాలు!ఈ భూమి మీద నుంచి ముస్లిములను ఖాళీ చేసే వ్యవహారం చక్కబెట్టిన తర్వాత హిందువులని ఖాళీ చేసే వ్యవహారం మొదలవుతుంది,

          ఆయుధాల సహాయం తీసుకుని చేసే యుధ్ధాల తోనో, రాజకీయపరమైన కుట్రల ద్వారా ప్రభుత్వాల్ని మార్చడం తోనో చేసే దాడి కన్నా మౌలిక సంస్కృతి మీద చేసే కనిపించని దాడి సుకుమారంగా ఉన్నా అది మరింత ప్రమాదకరమైనది!తెలుపు చర్మం పవిత్రమైనదీ కాదు,నలుపు చర్మం అపవిత్రమైనదీ కాదు,హిందువులకి నలుపు నారాయణ స్వరూపం!అయినా సరే తెలుపుకే ఘనకీర్తిని ఆపాదిస్తూ సౌందర్య సాధనాల ద్వారా ఉద్వేగాన్ని రగిలించడం వెనకా తాము నిర్ధారించిన కొలతలతో ఉన్న నాజూకైన దేహమే కోరుకోదగినదిగా స్త్రీలను పురుషుల ముందు ప్రదర్శనకి నిలబెట్టి సౌందర్యకీర్తికిరీటాలు తొడిగి సన్మానించడం వెనకా తమ సౌందర్యదృష్టినే అందరికీ ఆమోదయోగ్యంగా చేసి ప్రపంచం లోని స్త్రీల నందర్నీ తమ కంటికి నచ్చే విధంగా మూసపోసే ఒక మహా భయంకరమైన సాంస్కృతికసామ్రాజ్యవాదపు వ్యూహమున్నది - పారా హుషార్!సాంస్కృతికంగా యెంత మహోన్నతమైన దశలో ఉన్న జాతి అయినా ఒకసారి తన మౌలిక సంస్కృతికి దూరమైతే తిరిగి దానిని సాధించుకోవడం అసాధ్యమనేది చరిత్ర చెబుతున్న సత్యం!

          ఇంటి లోని వారు గానీ బైటి వారు గానీ హిందూ ధర్మం మీద దాడి చేయడానికి దొరికిన ఒకే ఒక  బ్రహ్మాస్త్రం - కులవ్యవస్థ!కులవ్యవస్థ యేదో ఒక రూపంలో యేదో ఒక స్థాయిలో ప్రపంచంలోని అన్ని చోట్లా ఉన్నప్పటికీ భారత దేశంలోని కులవ్యవస్థకి రెండు ముఖాలున్నాయి - నిచ్చెన మెట్ల వంటి సామాజిక విభజన,కొందరిని స్పృశించడానికే తిరస్కరించి వూరవతలికి తరిమేసిన అస్పృశ్యత!మొదటిదానిలో ఉన్న ఒక చిక్కుముడిని అర్ధం చేసుకుంటే అది అంత ప్రమాదకారి కాదని తెలుస్తుంది.అతి ప్రాచీన కాలం నుంచీ ఇప్పటి వరకూ అన్ని దేశాల లోనూ అన్ని ప్రాంతాల లోనూ అన్ని సమాజాల లోనూ అన్ని జాతుల లోనూ ఒకే విధమయిన సూత్రాలను పాటించే నిర్మితిని కలిగి ఉండి మన చుట్టూ కనబడుతున్న సామాజిక,రాజకీయ,సాంస్కృతిక,ఆధ్యాత్మిక రంగాలన్నిటినీ ప్రభావితం చేస్తున్న ఆర్ధిక నిర్మాణం పెట్టుబడిదారీ విధానం.మరీ తలబంటిగా మునగకుండా పైపైన విశ్లేషిస్తే పెట్టుబడి,శ్రమ,మార్కెట్,వెల,పోటీ అనే అయిదు విషయాలు ఇమిడి ఉంటాయి.పెట్టుబడి దారుదు పెట్టుబడితో వస్తాడు,కొందరు శ్రామికుల్ని  నెలజీతాలకి తీసుకుంటాడు,తయారు చేసిన వస్తువుకు మార్కెట్ దాని డిమాందునీ సప్లైనీ అంచనా వేసి వెల నిర్ణయిస్తుంది,యెవరు యెంత లాభాన్ని కిట్టించుకోవాలనే దానిలో పోటీ ఉంటుంది.ఈ పోటీలో రెండు విభిన్న కులాల వాళ్ళు పోటీ పడుతున్నప్పుడు అక్కడ గెలుపును  నిర్ణయించే రెఫరీ ఆ రెండు కులాల్లో యే కులానికైనా చెందినప్పుడు న్యాయంగా గెలవలేని పరిస్థితిలో రెఫరీని తార్చి గెలవడం కోసం కులం కార్డు ముందుకొస్తుంది!పోటీలో ఈ రకమైన పరిస్థితి వస్తే గేటు వూయెలయ్య గానీ శంకర శాస్త్రి గానీ చంద్రశేఖర రావు గానీ చంద్రబాబు గానీ రఘువీరా రెడ్డి గానీ అందరూ ఒక్కలాగే ప్రవర్తిస్తారు!లాభం కోసం యెంత నీచానికైనా దిగజారడం యే ఒక్క కులానికో పరిమితమైనదా?యెదిగే కుర్రాడికి ప్యాంటు సైజు మార్చినట్టు జనాభాకి తగ్గట్టు ఆర్ధిక కార్యకలాపాల విస్తృతి పెరుగుతుంటే యెంత చెట్టు కంత గాలి అన్న విధంగా ప్రతి ఒక్కరికీ తమ శ్రమకి తగ్గ ఫలితం లభించి ఆర్ధికంగా భద్రత వస్తుంది.ఆత్మగౌరవం ఉన్నచోట ఆత్మన్యూనత ఉండదు గనక అస్పృశ్యత కూడా అంతమవుతుంది!

          కళ్ళముందు కార్యక్షేత్రం కనబడగానే అప్పటి వరకూ నాచుట్టూ పరుచుకున్న అంధాంధ తమసాల నుంచి కళ్ళు చెదిరే కాంతిచ్చటలతో విలసిల్లే సువర్లోకంలోకి ప్రవేశించినట్లయింది!అంతలోనే మృధుమధురమైన స్వరంతో యెవరో నాకోసమే ఆలపిస్తున్నట్టు "అయ్యారే అమరావతి పౌరుడా,సయ్యారే సమరావతి శూరుడా,ఈర్ష్యారే జుగుప్సామతుల చెండాడగ లేవరా" అనే నా భావి కార్యాచరణ జీవితానికి ఆహ్వానగీతం లాంటి కావ్యగానం నన్ను మరింత ఆనంద పరవశుణ్ణి చేసింది.సాధురే సాధు సాధు హసాదు బల్ పసందు ఈ కల సామాన్యమైనది కాదు!అదృష్టం ఈడ్చి తన్నే ఒక క్షణంలో వచ్చే కల - మన లక్ష్యాన్ని కళ్ల ముందు బొమ్మ కట్టించి మనల్ని చరితార్ధుల్ని చేసే ఆ కల ఇదే ఇదే?!

          ఇంతకీ కార్యక్షేత్రం కళ్ళ ముందు కనబడినా యెంతకీ తగ్గని ముసురులా సంజెవేళ ముసిరిన చీకట్లలా ఈ కల మాత్రం ఇంకా చెదరిపోదేం!హరిబాబుగా ఈ లోకంలోకి రావడమే ఒక కల,ఆ కలలో ఇదింకో చిన్న కల.కలలోనే ఒక మెలకువగా మెలకువలోనే ఒక కలగా యెంత కాలమిట్లా?వెనకటికి లావోతజూ అనే వేదాంతికీ ఒకనాడు ఒక చిత్రమైన కల వచ్చిందట.తను ఒక సీతాకోకచిలకగా మారినట్టు.రావణుడు పూనాడో యేమో వాలిన పువ్వునల్లా రేప్ చేస్తూ పోతున్నాదట.పువ్వుల్ని, రేప్ చేసినా తేనెనే స్రవిస్తాయి!కొన్ని పువ్వుల్ని రేప్ చేశాక యెంతైనా వేదాంతి గదా భళ్ళున పశ్చాత్తాపం బద్దలై కలలోంచి ఇలలోకి జారిపడ్డాడట.అప్పుడొక చిత్రమైన సందేహం వచ్చిందట "నేనిప్పుడు - సీతాకోకక చిలుకనని కలగంటున్న లావోతజూనా?లావోతజూనని కలగంటున్న సీతాకోకచిలుకనా!" అని.

          హరిబాబుగా నా బతుకూ అలాంటి చిత్రమైన కల కావచ్చు.ఇక్కడ మూసినకన్ను యే గంధర్వలోకంలోనో తెరుస్తానా!.పక్కనే ఉన్న మనోహరితో,"చూశావా మనోహరీ,ఈ విశ్వాంతరాళంలో యెక్కడో సుదూరంగా ఉన్న భూమి అనేదానిపైన మనమిద్దరం మనుషులుగా పుట్టామట.అక్కడ సుఖపడాలంటే డబ్బు అనేది చాలా అవసరమట.మిగతా వాళ్ళకి దొరికినది హరిబాబు కెందుకు దొరకలేదో తెలియదు గానీ ఆ డబ్బు లేకపోవటంతో ప్రేమ అన్నిట్నీ మరపించినా దరిద్రం ప్రేమని చంపేసి నువ్వూ నేనూ కూడా ఒకళ్ళ నొకళ్ళం తిట్టుకున్నామంట." అని నేను చెప్తుంటే తను "అవునా మనోహరా, నేను నిన్ను తిట్టటమా?అయితే అది రాకూడని కలే!అయినా, మనం అనిమిషులం కదా!అనిమిషులకు కూడా కలలు వస్తాయా?మరి మీకెందుకొచ్చిందో?" అని నవ్వుతూ అంటుంటే ఒకరీ ముఖం ఒకరు చూసుకుని నవ్వుకుంటూ ఉంటామా?లావోతజూ గారిలాగే ఇప్పుడు నాకూ ఒక ధర్మసందేహం పట్ట్టి పీడిస్తున్నది.


నేనిప్పుడు - గంధర్వుణ్ణని కలగంటున్న హరిబాబునా? హరిబాబబునని కలగంటున్న గంధర్వుణ్ణా!

Tuesday, 19 May 2015

లాలూ లాలూ?యేంటి పప్పా!గడ్డి తిన్నావా?లేదు పప్పా!అబధ్ధం చెప్తున్నావా?లేదు పప్పా!యేదీ నోరు తెరువ్?హ్హా హ్హా హ్హా:-)

          రక్తచందనం శేషాచలం కొండలు మొదలుకొని రాయలసీమ ప్రాంతంలోని కడప,చిత్తూరు,కర్నూలు జిల్లాలలోనూ ఆంధ్రప్రాంతంలోని నెల్లూరు జిల్లా లోనూ విస్తారంగా పెరుగుతుంది.చైనా మయన్మార్,జపాన్ మరియూ తూర్పు ఆసియా దేశాలలో దీనికి గిరాకీ యెక్కువ!ప్రాచీన కాలంలో యజ్ఞాలలో సమిధలుగా వాడేవాళ్ళు.బౌధ్ధులు ఇప్పటికీ ప్రార్ధనా సమయంలో సువాసన కోసం ప్రశాంతత కోసం చందనం వెలిగిస్తారు.టిప్పు సుల్తాన్ "చందనం వృక్షరాజం" అని పొగిడి ప్రభుత్వపరంగా దాన్ని ఆదాయవనరుగా ఉపయోగించుకున్నాడు.ఇదివరలో దీని ఉపయోగం జపానులోనూ చనాలోనూ గృహోపకరణాల కోసమే పరిమితమైనా ఇటీవల రంగుల తయారీలొనూ టూత్ పేష్టుల తయారీలోనూ కూడా వాడుతున్నారు.

          భారత ప్రభుత్వం 2013లో పట్టుకున్న రక్తచందనం దుంగల విలువ 5000 కోట్లు.ఆంధ్రా లోనే గోడౌన్లలో తరలించదం కోసం దాచి ఉంచిన 9000 టన్నుల్ని వశపరుచుకున్నారు.2001 నుంచి 2007 సంవత్సరాల మధ్యన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3000 టన్నుల్ని పట్టుకుని వశపర్చుకున్నది.ఆగస్టు 2014 నాటికి రక్తచందనం స్మగ్లింగు చేస్తూ చట్టానికి పట్టుబడిన వాళ్ళు చిత్తూరు జిల్లాలో 40మంది,తిరుపతిలో 36మంది,కడపలో 42మంది,నెల్లూరులో36మంది,మొత్తం తమిళనాడు రాష్ట్రంలో 18మంది,మొత్తం కర్నాటక రాష్ట్రంలో 24మంది!2014 జూన్ నుంచి జూలై లోపు చిత్తూరు జిల్లాలో 50,00,000 విలువ చేసే  25లాగ్సు, కడప జిల్లా సంబేపల్లి మండలంలో 1,25,00,000 విలువ చేసే 64 లాగ్సు, కడప జిల్లా కోడూరు మండలంలో 2,50,00,000 విలువ చేసే 156 లాగ్సు, కడప జిల్లా బద్వేల్ మండలంలో 2,50,00,000 విలువ చేసే 156 లాగ్సు పట్టుబడినాయి.

          మొదట్లో చాలా తక్కువ స్థాయిలోనే జరిగేది,కానీ వీరప్పన్ ఘనకార్యాలు ప్రపంచానికి విదితమయ్యాక మిగతావాళ్ళు అసహ్యంతో చీకొడీతే ఇక్కడి స్మగ్లర్లు గురుభావంతో పూజించి అతనినుంచి తమకు కావల్సిన ట్రిక్కుల్ని నేర్చుకున్నారు!చేస్తే శుధ్ధక్షవరమే చెయ్యాలన్నారు గదా పెద్దలు అని స్మగ్లింగుని మరింత సంఘటితంగా చెయ్యడం మొదలుపెట్టారు.అందరికీ తెలియకుండా జరుగుతుందనే తప్ప పరిశ్రమలకి ఉండాల్సిన అన్ని హంగుల్నీ చాలా దిట్టంగా యేర్పాటు చేసుకున్నారు.ఈ వ్యవస్థలో కింది అంతస్తులో కేవలం చెట్లని కొట్టి దుంగల్ని దళారీల కనువైన చోటికి మారుస్తూ ఖర్మచాలక పట్టుబడితే అనాధపిండాలుగా హతమారిపోయే యెర్రకూలీలు అని మీడియా చేత దుర్మార్గులుగా ముద్రవేయబడ్డ పనివాళ్ళు ఉన్నారు, అన్ని ప్రమాదాలకి గురయి అన్ని భీబత్సాలు చేసి స్పాట్ దగ్గిర కనబడి హతమారిపోవడానికి సిధ్ధపడినందుకు వాళ్లకి దక్కేది రోజుకు రు.500 నుంచి రు.750 వరకూ మాత్రమే!మరీ గట్టిగా పనికొస్తాడు అనుకున్నవాళ్ళకి 1000 నుంచి 3000 వరకూ ఇస్తారేమో!యెట్టి పరిస్థితుల్లోనూ అట్టడుగున ఉన్నవాళ్లకి యెక్కువ లాభం మాత్రం ఉండదనేది ఖాయం!వాళ్లలో చాలామందికి అసలు రక్తచందనం విలువ యెంతో తెలియదు,రిస్కు నంతా తమమీద తోసి పై స్థాయిలో వాళ్ళు సంపాదించేదానితో పోలిస్తే తమకు అన్యాయం జరుగుతున్నదని కూడా తెలియదు పాపం!?పైనుంచి సరుకుకోసం కబురు రాగానే యెంత కావాలో చెప్పి కూలీల్ని నరకాల్సిన దుంగల్ని మార్క్ చెయ్యడానికి పంపించి మళ్ళీ వాళ్ళు నరికి అప్పజెప్పిన స్పాట్ గురించి పై స్థాయి వాళ్లకి వివరాలు చెప్తూ కూర్చున్న చోటు ఉంచి కదలకుండా వారానికి రు.80,0000 లెక్కన సంపాదించే మధ్యదళారీలు రెండో వరసలో ఉన్నారు.వీళ్ళ పైన దారిలో ఉన్న చెక్ పోష్టుల్ని తడిపి రహదారుల్ని మెత్తబరుచుకుంటూ సరుకుని దేశం సరిహద్దులు దాటించే ఘనాపాఠీల ఆదాయం వాళ్ళు పోలీసుల్ని,రాజకీయ నాయకుల్ని తడపటానికి పెట్టిన ఖర్చు లన్నిట్నీ కలిపి మినహాయించినా మనమెవ్వరమూ యేనాడూ కనీసం వూహించను గూడా వూహించలేం,వూహించడానికి ప్రయత్నిస్తే మనం ప్రశాంతంగా ఉండలేం!అసలు పై స్థాయి స్మగ్లర్లు చైనా,జపాన్ లాంటి దేశాలలో అంగరంగవైభోగాల్తో కొలువుదీరి చక్రం తిప్పుతూ ఉంటారు - వాళ్ళు యెంత సంపాదిస్తున్నారో తెలుసుకోవడం మనబోటి సామాన్యులకే కాదు ఈ కేసుల్ని విచారించే అధికార్లకి గూడా అసాధ్యం - ఈ పోష్టు రాయడం కోసం నేను చదువుతున్న విషయాలకి నాకే తల తిరిగి మైండు బ్లాంకయి పోయింది!

          నిక్కచ్చిగా అంకెల ఆధారాల్ని సేకరించకుండా యెంత ఉజ్జాయింపుగా లెక్కేసినా గానీ ఇప్పటి 13 జిల్లాల నవ్యాంధ్ర రాష్ట్ర ప్రభుత్వపు తలసరి ఆదాయం కన్నా యెక్కువే వుండొచ్చు అక్కడ జరుగుతున్న వ్యవహారంలో అంతిమగా అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్లందరి దగ్గిరా పైకి తేలుతున్న ఆదాయాల్ని లెక్కవేస్తే!విడిపోయిన తర్వాత లోటుబడ్జెట్టు కష్టాలతోనూ యెటువైపు నుంచీ నికరమైన సహాయం రాని స్థితిలో ఉన్న ఇప్పటి ప్రభుత్వం తప్పనిసరి అయి వీళ్ళ మీద యుధ్ధం ప్రకటించింది గానీ గత యెన్నికల్లో ఆ పార్టీ నుంచి గెలిచిన వాళ్లలో కూడా యెర్రస్మగ్లర్ల సహాయ సహకారాల తోనే గెలిచినవాళ్ళు చాలామంది ఉన్నారు!

          మొత్తం వ్యహారమంతా అచ్చు సినిమాల్లో చూస్తున్నట్టు చాలా నాటకీయంగా ఉంటుంది.యెక్కడో ఒక చిన్న కాకా హోటల్లో కూర్చుని నిముషానికో సెల్ ఫొనుని మారుస్తూ యేదేదో మాట్లాడేస్తున్న మనిషి మీకు కనబడ్డాడనుకోండి అతను ఫోను పిచ్చోడు కాదు - కూలీల్నీ,కూతపిట్టల్నీ,నిఘా పోలీసుల్నీ,ఫారెస్టు రేంజర్లనీ కలుపుతున్న స్మగ్లింగు సామ్రాజ్యానికి సంబంధించిన సింధువులో ఒక బిందువు కావచ్చు!మాసిపోయిన బట్టల్తో రోడ్డుపక్కన బీడీ కాల్చుకుంటూ ఉండే వ్యక్తి కూడా - గట్టిగా పోలీసులు దబాయిస్తే "ఇక్కద తిరిగేవాళ్ళనతా స్మగ్లర్లేనా?" అని నిర్లక్ష్యంగా జవాబిచ్చినా మరు నిముషంలోనే పోలీసుల గురించి ఉప్పందించే కూతపిట్ట కావచ్చు!శేషాచలం అడవుల పరిసర ప్రాంతాలలోని పోలీసు స్టేషన్ల గోడల మీద ఆయా ప్రాంతాలకి చెందిన చాలామంది రాజకీయనాయకుల ముఖారవిందాలు జేబుదొంగల పక్కనే కనిపిస్తాయి,అయినా వాళ్ళకి సిగ్గు కానీ మరొకటి గానీ లేవు?

          మన దేశపు రాజకీయ వ్యవస్థ యెంత దారుణంగా ఫెయిలయిందో చూదండి!అవేం పాల డబ్బాలా సిల్కు రుమాళ్ళా అగ్గిపెట్టెలా కనబకుండా దాచేసి అమాయకులైన అధికార్లని మోసం చేసి దాటించుకుపోవడానికి?అంత పెద్ద సైజులో ఉన్న యెర్ర్రచందనం దుంగల్ని స్మగ్లర్లు ఇన్నేళ్ళుగా అంత నిర్భయంగా కొన్ని వందల వేల మైళ్ళు దేశపు సరిహద్దుల లోపల తిప్పుతున్నా, క్షేమంగా దేశపు సరిహద్దులు దాటిస్తున్నా,దానివల్ల ప్రజాప్రభుత్వాల ఖజానాలకి యెంత నష్టమో తెలిసి కూడా యేమాత్రమూ సంకోచించకుండా స్మగ్లర్ల నుంచి సహాయాలు పొందుతూ వాళ్ళకి సహాయాలు చెయ్యడం కోసమే అధికారంలోకి వస్తున్నది మనం వేస్తున్న వోట్లతోనే గదా?వాళ్లకి వత్తాసు పలికేవాళ్ళు అధికార పార్టీలోనూ ఉన్నారు కదా,ఈ ప్రభుత్వాన్ని నిజంగా నమ్మగలమా?


యధా రాజా తధా ప్రజా అన్నది అప్పటి మాట!
యధా ప్రజా తధా రాజా అన్నది ఇప్పటి మాట?

Saturday, 31 January 2015

ఇద్దరు బెమ్మచారులు పాలిస్తున్నారండయా మన దేశపు జనాల్ని?!

     "బ్రహ్మచారీ శతమర్కటః" అని యెందుకన్నారా అని చాలా కాలం నుంచి దురదగా వుందేది.మనకి వున్నయ్యి బాల్యము,యవ్వనము,కౌమారము,వార్ధక్యము అని నాలుగే గదా ఈ బ్రహ్మచర్యం అనేది యెలా వచ్చిందీ అని కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే చదువుకీ బ్రహ్మచర్యానికీ లింకు పెట్టారు.మామూలుగా రోజువారీ పన్లకి నోటిలెక్కలు సరిపోయేవి.కానీ ఇవ్వాల్టి వుద్యోగాల మాదిరి యేదయినా పెద్దయెత్తున పనికొచ్చేది నేర్చుకోవాలంటే మాత్రం యెవరో ఒక గురువుని పట్టుకుని ఆయన గారి ఆశ్రమమలో చేరి చదువుకుని ఆయనో కుర్రాడో ఇక చాలనుకునే వరకూ వుండి వెళ్ళేటప్పుడు గురుదక్షిణ చెల్లించి జనం మీదనో రాజుగారి మీదనో పడేవాళ్ళు!

మొట్టమొదట గురువుగారు చేసే పని యేమిటంటే తన దగ్గిర కొచ్చిన కుర్రాడికి జంఝప్పోగు తగిలించటం?అందుకే బ్రాహ్మలకే గాదు కంసాలులకీ,ఇంకా విశేషవృత్తుల వారికి కూడా జంధ్యం వుండేది!అ కాలంలో అది వేశారు అంటే కుర్రాడు వున్నతవిద్యలో వున్నట్టు లెఖ్ఖ!ఆ వీరతాడు వేసిన గురువుగారు పెట్టే ఆతి ముఖ్యమయిన కండిషను "బ్రహ్మచర్యం!" చదువుకునే వయస్సులో ఇప్పట్లాగ అమాయిలకి లైన్లెయ్యటం అస్సలు కుదరదన్న మాట?వేస్తే వీపు చీరేస్తారు,తన్ని తగిలేస్తారు,మధ్యలో బయటికెళ్తే యెందుకూ  కొరగాకుండా ఐపోతాడు?!అప్పటి వరకూ యెంత అందమైన ఆడపిల్ల కనపడినా మాతృభావన చేసి పక్కకి తప్పుకోవలసిందే,ఓరి దేవుడోయ్?!

ఆ చదువు కాస్తా పూర్తయ్యాక ప్రభుత్వోద్యోగిగానో సీనియర్ల దగ్గిర సహాయకుడిగానో కుదురుకుని పెళ్ళి చేసుకునే వరకూ మాత్రం కుర్రాడు అచ్చోసిన ఆంబోతు లాగా యెన్ని తిరుగుళ్ళయినా తిరచొచ్చు.ఈ దశలోనే కుదురు తక్కువ వాళ్ళు అప్పటిదాకా కట్టుకున్న కచ్చడాలు తొలిగిపోతాయి గనక మర్కటాల మాదిరి ఆవేశపడి పోయేవాళ్ళు?!వాస్తవానికి ఆ పెళ్ళికాని ప్రసాదులకి అప్పట్లో ప్రత్యేకమయిన పేరు లేకపోవటంతో ఆ బ్రహ్మచారి క్యాటగిరీలోనే లాగించేశారు.

ఈ దశలోని బ్రహ్మచారులు అత్యంత ప్రశస్తమైన వాళ్ళు.మళ్ళీ వీళ్లలో రకాలు కూడా వున్నాయి!"అస్ఖలిత బ్రహ్మచారులు","నిష్కళంక బ్రహ్మచారులు","ఘోటక బ్రహ్మచారులు" అనేవి ముఖ్యమైనవి. మొదటిది అప్పటికింకా స్త్రీ సాంగత్యం కుదరకపోయినా కుదిరితే ఆ బ్రహ్మచర్యాన్ని వొదిలేసే మామూలు రకం!రెండో రకం యెందుకనో పెళ్ళి పట్ల విముఖత వుండి దానితో పాటు ఆధ్యాత్మికత కూడా కలిసి పెళ్ళికీ స్తీ సాంగత్యానికీ దూరంగా వుండటం -  ఇప్పటికీ రా.కృ.మి లో కనపడుతున్నారు?మూడో రకం ప్రమాదకరమైనది - వాళ్ళు మాత్రమే  బ్రహ్మచర్యానికి అంకితమై పోవడంతో సరిపెట్టుకోకుండా మిగతా వాళ్లని కూడా ప్రభావితం చెయ్యాలని చూస్తారు?!

వీళ్లు కాకుండా "నాతి గల బ్రహ్మచారులు" మరో రకం?!పెళ్ళి చేసుకున్నాక కొంతకాలానికి జ్ఞానోదయమై అటు పూర్తిగా సన్యాసానికీ ఇటు పూర్తిగా సంసారానికీ కాకుండా కేవలం భార్యకి శృంగారపరంగా దూరంగా మాత్రం వుంటూ గృహస్థుగానే చెలామటీ అవుతూ వుంటారు - కత్తి మీద సామే అయినా తప్పదు మరి?!



ఈ నాతిగల బ్రహ్మచర్యం గురించి చెప్పాక మెల్లగా మీకూ లైటు వెలిందనుకుంటాను ఇదంతా అప్రస్తుత ప్రసంగం కాదని?!ఇవ్వాళ మననేలుతున్న వాడు నాతిగల బ్రహ్మచారి?ఇప్పుడు చాన్సు తప్పిపోయింది గానీ ఆ సీటు మా ఫామిలీదే అని ధీమాగా వున్న రాహు బాబు ఘోటక బ్రహ్మచారి!పైగా ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా లేకపోయినా ప్రతిపక్షంలో వున్న అతిపెద్ద పార్టీకి నాయకుడిగా వుండటం వల్ల ఇప్పుడు కూడా మనని ప్రభావితం చేస్తున్నట్టే గదా!ఇంతవరకూ తను ప్రచారం పేరుతో అడుగుపెట్టిన ప్రతి యెన్నికల్లోనూ విజయావకాశాలు వున్నచోట కూడా అపజయాన్నే తెచ్చిపెట్టటం చూసి జ్ఞాననేత్రం కొంచెం వికసించటం వల్ల కాబోలు అప్పుడప్పుడూ కాంగిరేసు వారికే ఈ బ్రహ్మచారి యేం గట్టెక్కిస్తాడు అనిపించి నాయనమ్మ పోలికల్తో వున్నఅనుంగు సోదరిని పిలుద్దామా ఆంటే ఆవిడా తన మొగుడు బంగారం మూలంగా చెడతాననో యేమో తనూ వెనకాడుతున్నాది?!ఆక్కడ మరో అసలు సిసలు నికార్సయిన మర్కటమూర్తి ఒకడున్నాడు?!అవిడ మొగుడికి నోటిదూలెక్కువై ఆత్తగారి యేలుబడిలో వున్నదని కూడా చూసుకోకుండా "ఈ దేశపు జనం అరిటి పండు రాజ్యపు వెధవలు" అనేసి అక్కడా ఒక మర్కటం వుందనిపించాడు?!పాపం భరతమాత దగ్గిరున్న ఒకే ఒక అరిటిపండు కోసం యెన్ని మర్కటాలు పోటీ పడుతున్నాయో?!



దళితేతరులు దళితులకి న్యాయం చెయ్యలేరు గాబట్టి దళిత అనుకూల ప్రభుత్వం కోరుకుంటున్నట్టు బ్రహ్మచారి సంసారులకి న్యాయం చెయ్యలేడు గాబట్టి వుద్యమం చేద్దామా అంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు నాతి గల బ్రహ్మచారి నుంచి ఘోటక బ్రహ్మాచారి కిందకి వెళ్తామా అని భయంగా వుంది?!

ఆ ఘోటక బ్రహ్మచారి యేమో అమాయకంగా కాంగ్రెసుని మళ్ళీ అధికారంలోకి తెచ్చేవరకూ పెళ్ళి చేస్కోననేశాడు.ఈ లెక్కన కాంగ్రెసు మళ్ళీ లేవలెక పూర్తిగా అదృశ్యమై పోతే కాంగ్రెసుతో పాటూ గాంధీ - నెహ్రూ కుటుంబాలకి సంబంధించిన ఈ ఒకే ఒక వారసుడితో ఆ రెండు ఇంటిపేర్లూ కూడా భారత రాజకీయ రంగం నుంచి అదృశ్యమై పోతాయా?!

శుభం భూయాత్!!!
_______________________________________________________________
చిత్రములు:గూగులమ్మి!

Friday, 23 January 2015

నేను లేస్తే మనిషిని కాను!కానీ ఇప్పుడప్పుడే లేవను?నువ్వు వందసార్లు చెప్పినా నాకు అసలు చెప్పనట్టే?!

ఒకప్పుడు పెళ్ళిళ్లలో కలిసిన చుట్టాలు పాత సంగతుల్ని నెమరేసుకోవటానికి "క్రిష్ణా పుష్కరా లప్పుడు","గోవర్ధనం పెళ్ళప్పుడు","అచ్యుతరావు వాళ్లబ్బాయి బారసాలప్పుడు", అని పుష్కరాల లెక్కనో బారసాలనో పెళ్ళినో కలిపి అప్పుడు జరిగింది అని చెప్పుకునేవాళ్ళు!ఇవ్వాళ రోజులు మారాయి గదా - "చికెన్ గన్యా రోజుల్లో","స్వైన్ ఫ్లూ మొదటిసారి వొచ్చినప్పుదు","లైలా తుఫాను ఇరగదీసినప్పుడు" అని రోగాలూ,గొడవలూ,భీభత్సాలతో కలిపి చెప్పుకుంటున్నాం?

పాతకాలం వాళ్ళు తుఫాన్లూ వరదలూ మన దురదృష్టం కొద్దీ దేవుడే మనమీదకి రప్పిస్తాడని సరిపెట్టుకునే వాళ్ళు.నిన్నటి దాకా కరువుల గురించి కూడా అలాగే అనుకునే వాల్ళు, కానీ కొత్తగా ఎకనమిక్సు లో DRAUGHT ECNOMY| అనేది ఒకటి మొదలయింది!దాని ప్రకారం అంతకు క్రితం ప్రభుత్వాల దుర్మారమయిన ఆర్ధిక నిర్వహణయే కరువులకి కారణమని బలమయిన ఆధారాలు కనిపిస్తున్నాయట! ఈ నాలెడ్జి యేమీ లేకుండానే ప్రపంచంలోని అతి ఘోరమయిన కరుల్లో ఒకటైన బెంగాలు కరువు "కర్జను" అనే ఒక్కడి వల్ల వొచ్చిందనేది అందరికీ తెలిసిన విషయమే గదా!

ఇదివరలో కరువంటే అందరూ భయపడి చచ్చే వాళ్ళు!ఈ రోజుల్లో కరువు కూడా కొందరికి లాభసాటి వ్యాపారమైపోయింది.అనంతపురం కరువు జిల్లా అని అందరికీ తెలుసు,కానీ ప్రపంచ మార్కెట్టులో కొత్త మోడలు కారు యేది రిలీజయినా తెల్లారేసరికల్లా ఆనంతపురం రోడ్ల మీద కూడా తిరుగుతుందట?అదెట్లా అంటే కరువు సహాయక నిధుల మీదా పశుగ్రాసం వాటాల మీదా పెరిగిన కొందరు "గుద్ విల్ కాలనీ" దొరల వైభోగ మది!మనం రోడ్దు మీద వెళ్తుంటే శవాల మీద వేసిన రూపాయీ అర్ధ రూపాయీ యేరుకునే వాళ్లని ఈసడించుకుంటాం,కానీ అదే పని భారీ యెత్తున చేసిన వాళ్ళు "శుభకామన విలాసు" లయ్యారు.చేస్తే శుధ్ధ క్షవరమే చెయ్యమన్న పెద్దల మాటని బహుచక్కగా పాటించారు గదా మరి!

ఇత్లాంటిదే ఒక పాతముచ్చట గుర్తుకొస్తున్నది - రీడర్స్ దైజస్ట్ లో చదివాను.ఒకానొక చిన్న నగరంలో ఒక వీధిలో ఒక ఫొటోగ్రాఫరు తన భార్యయే మోడల్ అవటానికి సిధ్ధపడితే ఆమె నగ్నచిత్రాలే అవుగాక సౌందర్యభరితంగా తీసి వాటిమీద వచ్చే ఆదాయంతో బతుకుదామనుకున్నాడు?చుట్టుపక్కల వున్న సంసారు లంతా అతన్ని వెంటాడి వేధించి ఆ చండాలాన్ని అపేయించారు.అతను అక్కణ్ణుంచి మరోచోటికి వెళ్ళిపోయాడు.అదే పని "ప్లే బాయ్" అనే పత్రిక చేస్తే ఆ పత్రికాధిపతి ప్రపంచ ప్రసిధ్ధి గాంచిన ప్రముఖుల్లో ఒకడయ్యాడు,తేడా యెక్కడుంది?స్థాయీ భేదంలో వుంది!

మనని నష్టపెట్టి తను లాభం గుంజే పని ఇంటి పక్కవాడో,దగ్గిర్లో వున్న ఫ్యాన్సీ షాపు వాడో చేస్తే యేమయినా చెయ్యగలం, కానీ ప్రభుత్వంలో వున్నవాళ్ళు చేస్తే యేవరేమి చెయ్యగలరు?స్వైన్ ఫ్లూ బాధితులూ,చికెన్ గన్యా పీడితులూ వీళ్ళందరి దుస్థితీ ఇదే!చాలాకాలం క్రితం నుంచే డాక్టర్లంతా చాలా రోగాలకి మన చుట్టూ వున్న అపరిశుభ్రతే కారణం అని చెవినిల్ల్లు గట్టుకుని చెప్తున్నా చెప్పింది తమకు కాదన్నట్టు పన్నులు కడుతున్న ప్రజలకి పరిశుభ్రమైన పరిసరాలను సమకూర్చితే చాలు వాళ్ళు ఆయురారోగ్యాలతో వుంటారు,అరోగ్యంగా వున్నవాళ్ళు మరింత హుషారుగా వుత్పాదన పెంచుతారు అనే చిన్న విషయం కూడా వాళ్లకి యెవరయినా అరటి పండు వొలిచి పెట్టినట్టు చెబితే గానీ తెలియదా?నిజంగా తెలియకనే పారిశుధ్య శాఖకి అంత తక్కువ నిధులు కేటాయిస్తున్నారా!

అమితాబ్బచనుకి ఒక్కసారి గాజుపెంకు గుచ్చుకుందని ట్వీటు చేస్తే ఆయన అభిమానులు యెంతమంది అయ్యో అనుకున్నారో కుయ్యోమని మూలిగారో గానీ మనం నిర్లక్ష్యంగా గాజుపెంకుల కన్నా ప్రమాదకరమైన వాట్ని చెత్తకింద విసిరేస్తుంటే కొంతమది ప్రతిరోజూ వుత్తచేతుల తోనే వాట్ని యెత్తుతున్నారు గదా?స్వచ్చభారత్ పేరుతో మోదీ గారూ,రాష్త్రం మొత్తాన్న్నే సింగపూరులా చేస్తాననే బాబు గారూ,మొత్తం హైదరాబాదుని టాంకుబండుతో సహా బహుళ అంతస్తుల భవనాలు లేపి మురికివాడలు లేని నగరంగా చేస్తాననే రావు గారూ పారిశుధ్య శాఖ అనే ప్రభుత్వ శాకహ ఒకటి వున్నదనీ దాన్ని నిక్కచ్చిగా పని చేయించడానికి వీళ్ళు చెప్తున్న వాటికయ్యే  డాబుసరి ఖర్చుల కన్నా చాలా తక్కువ ఖర్చుతోనే ఆ పని చెయ్యవచ్చునని తెలియనంత అమాయకులా?!నమ్మి చెడిన వారు లేరు అని చాదస్తంగా నమ్మేవాళ్ళు వున్నారేమో గానీ నేను మాత్రం నమ్మను!?

ఆ మురికి నలాగే వుంచేసి ఈ వాటా కింద కొత్తగా నిధులు కేటాయించి అందులో కూడా సొంతానికి నొక్కేసి చేసే జబర్దస్త్ దోపిడీ కాదా ఇది?మన పన్లు మనం చేసుకోలేని రోజుల్లో మన మలమూత్రాలు కడిగి మనల్ని శుభ్రం చేసిన తల్లికి దణ్నం పెట్టటం వరకూ మనం మంచివాళ్ళమే గానీ అదే పని మొత్తం సమాజాని కంతా చేస్తున్న పారిశుధ్యపు పనివాళ్లని గురించి న్యాయంగా ఆలోచించకపోవడం వల్ల మనం కూడా ద్రోహులమేనా అనిపిస్తుంది ఒక్కొక్కప్పుడు నాకు?!

ప్రతి పారిశుధ్య కార్మికుడికీ చేతులకి గ్లవుజులూ,కాళ్ళకి బూట్లూ,వొంటికి యెంత మురికి కూపం లో దిగినా ఆ మురికి అంటని యూనిఫారం - ఇవ్వలేరా?జీతాలు పెంచి వాళ్లది కూడా గౌరవనీయమైన పనియే అనే గుర్తింపుని ఇవ్వలేరా?ఇప్పుడు ఆ శాఖలో పనిచేస్తున్న కార్మికులకే వాళ్ళు సంతోషంగా వాళ్ళ పని చెయ్యగలిగే యేర్పాట్లు చేస్తే ఇఇప్పుడున్న మురికి కన్నా రెండింతలు యెక్కువ మురికినైనా వొదిలించగలరు!

చెయ్యాల్సింది చెయ్యకుండా ఫొటోలకి పోజులిచ్చి పత్రికల్లో బొమ్మలు వేయించుకుంటే ఆ పేరున మరింత చెత్త పెరగడం తప్ప వుపయోగం యేమయినా వుందా?!లోపలా బయటా ఇంత మురికి పేరుకుపోయినా దాన్ని తొలగించుకుందామనే తొందర పుట్టటం లేదేమిటి?లోపలా బయటా ఇంత మురికి పేరుకుపోయినా దాన్ని తొలగించుకుందామనే తొందర పుట్టటం లేదేమిటి?ఈ పారిశుధ్య కార్మికుల దగ్గిర్నుంచీ అల్పాదాయ వర్గాలు యెవ్వరూ తమ పిల్లల్ని ఖరీదయిన స్కూళ్ళలో చదివించుకోలేరు!ప్రభుత్వ పాఠశాలల్ని వుద్దేశపూర్వకంగా నీరుగార్చి అస్మదీయుల స్కూళ్ళకి గిరాకీ పెంచుతున్నారు!పరిశుభ్రమైన దేహాలతో ఆరోగ్యాన్నీ వాళ్ళకున్న తక్కువ ఆదాయంలోనే విద్యనీ అందిస్తే యే రిజర్వేషన్లూ అక్కర్లేకుండానే కోట్లలో సంక్షేమ పధకాల తాయిలాలూ పంచనక్కర్లేకుండానే వాళ్ళకేమి కావాలో వాళ్ళే సాధించుకోగలుగుతారు గదా?!వాట్ని పనిగట్టుకుని దూరం చేసి యెప్పటికీ తమ మీదనే ఆధార పడి ఆ కృతజ్ఞతతో మళ్ళీ మళ్ళీ తమకే వోట్లు వేసే వ్యూహమే ఇది?!ఆకబారు వూళ్ళోకి తెచ్చినందుకు కూడా జనాన్ని చంపేసిన నిజాము కాలానికీ ఇప్పటి ప్రజాస్వామిక ప్రభుత్వాధినేతలకీ తేడా యేమయినా వుందా?

సీ || పోయెన్ కుసుమ కోమలోజ్వల సౌరభ
     ములు భూమిపై నుండి - మూక పెరిగి,

     ఇరుకుతనము పెరిగి,మురికియును, మరి
     కిలుము జిడ్డు ముదిరి, కర్బన ద్వ

     యాంలజని విషపదార్ధమై , కరగని
     ధూళులు నీటి యందమితమై పె

     రుగుచు ధరణి పెద్ద రొచ్చుగుంటై పోయె!
     మనుషుల ఆంతర్యములును సరిగ

తే || లేవు - పరధనాసక్తియు, లోభము, మర
     సూయలున్ మస్తుగా మనసులకు పట్టి
     వేసెను, మనిషి నుండి వివేకము తొల
     గంగ - ముక్కులు బద్దలౌ కంపు మిగిలె!
(27/08/1996)

ఇవ్వాళ జరగాల్సింది స్వచ్చభారత్ హడావిడి కాదు,ఘర్ వాపసీ గందరగోళం కాదు - మురికిని ద్వేషంచే మనస్తత్వం పెరగాలి,ప్రజలూ ప్రభుత్వం రెండూ కేవలం నినాదాలతో సరిపెట్టకుండా యుధ్ధమే చెయ్యాలి!బయటి మురికికీ లోపలి మురికికీ అవినాభావ సంబంధం ఖచ్చితంగా వుంది - క్షాళన రెండు చోట్లా జరగాలి!?మురికి,దుర్గంధం,అజ్ఞానం,అలసత్వం యెక్కడ కనిపించినా సహించకూడదు.దోపిడీకి అసలైన పునాది దోపిడీకి గురయ్యే వాడి అమాయకత్వం అని తెలిస్తే విద్య నేర్పి అజ్ఞానాన్ని తొలగించదం యెంత అవసరమో తెలుస్తుంది?!కులపిచ్చి,మతపిచ్చి ప్రాంతం పిచ్చి ఇవన్నీ అమాయకమైనవి కావు - తమాషాకి చెయ్యడం లేదు వాళ్ళు!శ్రీశ్రీ చెప్పినట్టు న్యాయంగా ఆడితే పాయింట్లు యెదటివాడికే పోతాయని తెలిసి రిఫరీని "నువ్వూ నేనూ ఒక్కలాంటివాళ్ళం,వాడు వేరే కాబట్టి నాకు పాయింట్లు వెయ్యి" అనే విధంగా బెల్లించి గెలవటం!అలాంటివాళ్ళు నీతిసూత్రాలకి లొంగరు.ఆ లాభాన్ని వాళ్ళకి దక్కకుండా చేస్తేనే తిక్క కుదురుతుంది!కానీ అలా చెయ్యగలమా?ఈ ట్రిక్కు నంతా యెన్నికల రోజున జరిగే తంతుకి అప్లై చేసి అక్కద రిఫరీలం మనమే అని తెలుసుకుంటే కాస్త వివేకం పెరుగుతుందేమో?!

నీతిసూత్రాలు యెక్కువగా దంచడం నాకూ ఇష్టం లేదు గాబట్టి ఒక సినిమా కధ చెప్తాను.బాటసారి అక్కినేని నాగేశ్వర రావు నటించిన సినిమాల్లో కల్లా అత్యధ్బుతంగా నటించిన సినిమా.అన్ని సినిమాల్లోనూ చేసిన నటన కన్నా ప్రత్యేకంగా ఇష్టపడి చేశాడు.మీ సినిమాల్లోకల్లా మీకిష్తమైన సినిమా యేది అని యెప్పుడు యెవరడిగినా ఆ పాత్ర గురించే చెప్పేవాడు!సినిమా లో తనది హీరోఇజం అస్సలు లేని పాత్ర.ఒక రకంగా భానుమతి హీరోయినుగా వున్న సినిమాలో తను సైడు క్యారెక్టరు చేసినట్టు లెఖ్ఖ!ఇవ్వాళ శ్రీయ నేర్చుకుని చేస్తున్నానని చెప్పే మెథడ్ యాక్టింగ్ ఆ రోజుల్లోనే వుపయోగించాడు ఆపాత్రలో.సినిమా అంతా ఒక బాల వితంతువు చుట్టూ తిరుగుతుంది.దేవదాసులో కొంత రొమాన్సూ,భగవాన్లు పాత్రతో చేసే క్యామిడీ అన్నా వుంది,ఇందులో అస్సలు అవేమీ లేవు.మామ్మూలు ప్రేక్షకు డెవ్వడూ వోపిగ్గా చూదలేడు.కానీ అందులో ఒక డైలాగు వుంటుంది అది తను యెలా చెప్పాడు అనే కుతూహలంతో చూద్దామని నా బెజవాడ లయోలా కాలేజి న్యూ హాస్టలు రోజుల్లో విశ్వప్రయత్నం చేశాను!కుదర లేదు.సినిమా హాలు గేటు దాకా వెళ్ళి వెనక్కి తిరగాల్సొచ్చింది - టిక్కెట్లు దొరక్క కాదు?మా ఫ్రెండ్సులో ఒకడు "ఇందులో కామిడీ లేదు బోరుగా వుంటుందిరా" అని వినపడీ వినపడనట్టు నసిగేసరికే బృందంలో మిగిలిన వాళ్లంతా భయపడి వెనక్కి తిప్పేశారు.ఆ ఒక్క ముక్కకే వాళ్ళలా యెందుకు భయపడ్డారో తెలుసా - ఆ ముక్క అన్నవాడు ప్రేమాభిషేకం పదిహేను రోజుల్లోనే ముఫ్ఫయ్ సార్లు చూసిన ఏన్నార్ పంఖా?!పోనీ నేనొక్కణ్నే చూద్దామా అంటే సెకండు షో తర్వాత బెంజి కంపెనీ నుంచి పోస్టలు కాలనీ దాకా ఒక్కణ్నే నడుచుకుంటూ రావాలి!అంత దృశ్యం లేదు నాకు:-<>)

అప్పుడు కుదరనిది యూట్యూబు పుణ్యమా అని ఈమధ్యనే చూశాను.ఆ డైలాగు పట్ల నాకంత పిచ్చ యెందుకు పట్టిందీ అంటే మా మామయ్యల్లో ఒక చాదస్తుడు అది చదివి ఆ సన్నివేశాన్ని పైకి వాగి నా బుర్రలోకి యెక్కించాడు!ఈయనా నేనూ మిగతా విషయాల్లో గజకచ్చపాల్లాగా పోట్లాడుకునే వాళ్ళం గానీ పుస్తకాల విషయంలో మా ఇద్దరి టేష్టూ ఒకటే!ఆ డయలాగ్ నాకు యెక్కినట్టు మీకూ యెక్కాలంటే కధ కొంచెంగానన్నా మీకూ తెలియాలి.భానుమతి క్యారెక్టరు పేరు మాధవి.బాల్య వివాహం జరగడమూ ముసలి భర్త తొందరగా పోవడంతో పిల్లలు లేకుండానే వితంతువు ఐపోయింది.కానీ యేడుస్తూ కూర్చునే మనిషీ కాదు.జమీందార్లు కావడంతో అన్నీ తనే చూసుకుంటూ వుండేది."భూమి జనించీ భుక్తి కొసగనీ ఫలము లున్నవీ కొన్ని" అని తన స్నేహితురాలే అన్యాపదేశంగా దేవుణ్ణి తిడుతుంటే "వేదశాస్త్రములు చదివిన వారే యెరుగరు సృష్తి విలాసం" అని జవాబిచ్చేసి సరిపెట్టుకునే మనస్తత్వంలో వుంది!చెల్లెలికి చదువు చెప్పించి పెళ్ళి చేసి పంపించడం ఒక్కటే తన పని ఆ వాతావరణంలోకి హీరో వొచ్చి పడతాడు.

వీళ్ళు వుండేది కలకత్తాలో.అతను కూడా జమీందారే.సవతి తల్లి మొదట్లో గారాబంగా పెంచి తర్వాత మరీ దద్దమ్మ లాగా తయారవుతున్నాడని కొంచెం ఈసడిస్తున్నట్టు ఒక మాటతో పొడుస్తుంది.అంతే!ట్రంకు పెట్టెలో బట్టలు సర్దుకుని కొంప నుంచి బయట పడి పోలీసు స్టేషను వరకూ వెళ్ళి అక్కణ్ణించి ఈమె ఇంటికి తన చెల్లెలికి లెక్కలు నేర్పే ట్యూటరుగా అడుగు పెడతాడు.కళ్ళజోడు పగిలిపోతే అది బాగు చేయించుకోవడం కూడా తెలీక పోగా బడదీదీ అని అందరూ పిల్చే హీరోయిను బాగు చేయించి పెడితే కనీసం యెవరు బాగు చేయించారు అని అడగటం గానీ థాంక్సు చెప్పటం గానీ తెలియని మొద్దావతారం అతను!యెంత హఠాత్తుగా వచ్చాడో అంత హఠాత్తుగా మాయమైపోతాడు?ట్యూషను చెప్పడం తప్ప మిగిలిన సమయాల్లో ఇతని యవ్వారమంతా కలకత్తా వీధుల్లో చక్కర్లు కొట్టటం.అలా చక్కర్లు కొడుతుండగా ఇతని కోసం వెతుకుతున్న మనిషొకడు అమ్మగారు మీకోసం బెంగెట్టుకున్నారు పదండి వెళ్దాం అనగానే అట్నించటే రైలెక్కేశాడు!వీళ్ళ పనివాడొకడు యెవర్నో రైలెక్కించడానికొచ్చి చూసి చెప్పాడు గాబట్టి తెలిసి ఒక నిట్టూర్పుతో సరిపెట్టుకుంటుంది.కానీ తన జమీకి తిరిగి వెళ్ళాక మాత్రం తెలివిగా వుండి జమీందారీని చూసుకుంటుంటాడు.అప్పుడొస్తుంది ఈ మాట.దివాను డబ్బు దాని యొక్క ప్రాముఖ్యత గురించి తనకి లెక్చరు ఇస్తుంటే నెమ్మదిగానే అన్నా స్థిరంగా "డబ్బుతో కొనలేనివి కూడా వున్నాయి ఆళ్వార్!" అంటాడు?!మా మామయ్య నా చెవుల్లోకి ఇది యెక్కించిన రోజుల్లోనే మరో మంచి కొటేషను ఆంధ్రజ్యొతి దినపత్రికలో ఎడిటోరియల్ పైన ఇచ్చే బాక్సులో చదివాను,"డబ్బుతో దేన్నయినా సాధించగలను అనుకున్న వాడే డబ్బు కోసం యే గడ్డయినా కరవడానికి సిధ్ధ పడతాడు?" అని!ఈ రెండూ నన్ను అతాలాకుతలం చేసేసి ఆఖరికి యెముకల్లోకంటా ఇంకిపోయాయి.ఒకటి గుండెకి పట్టే ఆర్ద్రత నిండినది.ఒకటి కొరకంచు లాగా కాల్చే వ్యంగ్యం నిండినది.మిత్రులంతా ఇవ్వాళ నా భాషని మెచ్చుకుంటున్నది ఆ రెండూ 50-50 లాగా కలిసి పోవటం వల్లనే!


ఆ అరెండు ముక్కలూ యెవరికి యెక్కినా డబ్బు పిచ్చి తప్పకుండా వొదుల్తుంది.అది వొదిల్తే మిగతావీ వొదుల్తాయి,అవునా కాదా?!మురికి,దుర్గంధం,అజ్ఞానం,అలసత్వం - వీట్ని వొదిలించుకోకుండా యెవ్వడూ బాగుపద లేడు?!

ఏడుపు గురించి కూడా యాడవాల్సింది చాలా ఉందండోయ్!

పాపం చెట్లకి ఏడుపు రాదు . వాటికి ఏడుపు రాకపోవటమే మంచిదైంది . చెట్లకి కాక మిగిలిన అన్ని జంతువుల ఏడుపులకే ఇంత విసుగొస్తుంటే వాటి...