Wednesday, 5 March 2014

ఇక ఆంధ్ర ప్రదేశ్ పునర్నిర్మాణానికి ఒక నూతన రాజకీయ ఆర్ధిక వ్యవస్థ కావాలి - 3

                    అసలు సాంకేతికపరమయిన విషయానికి వెళ్ళబోయే ముందు కొన్ని విహంగ వీక్షణలు చేద్దామనుకుంటున్నాను.మనకి యెన్ని రకాల అస్తిత్వాలు ఉన్నాయి?ఒక అంతరువులో భారతీయుడిగా, ఒక అంతరువులో తెలుగువాడిగా, ఒక అంతరువులో ఆంధ్రా వాడిగా - ఇన్ని రకాల అంతరువులు ఉన్నప్పుడు అతని సార్వకాలికమయిన గుర్తింపు యేమిటి?ఒక మనిషి తన చుట్టూ ఉన్న సమాజంలో కలవాలి అనుకున్నప్పుడే అస్తిత్వానికి సంబంధించిన ఆలోచన కలుగుతుంది. ఒకే ఒక మనిషి - సంతానాన్ని పెంచటానికి కావలసిన సహచరి కూడా లేకుండా - ఈ భూమి మొత్తానికి ఒకే ఒక మనిషి ఉంటే అతనికి అస్తిత్వానికి సంబంధించిన విచికిత్స అనవసరం. ఇవ్వాళ డబ్బు అని మనం పిలుచుకునే మారక విలువతో కూడా పని లేదు.యేక్ నిరంజన్:-) సబ్ కా మాలిక్ యేక్:-)

                    వేరే వాళ్ళతో కలిసినప్పుడే అతనికి ఇంతమందిలో ఉన్నా నేను ఫలానా అని చెప్పుకుని నా ప్రత్యేకత ఇదీ అని గర్వించటానికి పనికొచ్చేదిగా ఉండే ఒక వాస్తవికమయిన ప్రాతిపదిక చాలా అవసరం.ఇవ్వాళ ఆర్ధిక సరళీకరణ ప్రపంచాన్ని కుదించేస్తున్నప్పుడు దాని వల్ల అనివార్యంగా వొచ్చిపడే పరాయీకరణను తట్టుకోవాలంటే ప్రతి మనిషీ తన అస్తితాన్ని నిర్ధారించుకోవటం తప్పనిసరి.

                    రష్యన్ విప్లవ రధసారధి కామ్రేడ్ లెనిన్ విప్లవ ప్రభుత్వం యేర్పాటు చేసె తొలి రోజుల్లోనే ఒక అద్వ్హుతం చేసాడు!అప్పుదు రష్యా అంతా జార్ ప్రభువుల పాలనలో  మగ్గిపోయి ఉంది. దేశమంతా దివాళాలో ఉంది.మరొకడయితే వెంఠనే కమ్యునిష్తు సాంప్రదాయాల్ని రుద్దేద్దాం, మన తడాఖా చూపిద్దాం అని రెచ్చిపోయేవాడు. కానీ లెనిన్ అలా చెయ్యలేదు, 'సమానంగా పంచాలంటే ముందు పళ్ళెంలోకి యెంతో కొంత రావాలి కదా' అనే ఉద్దేశంతో ఒక అయిదేళ్ళ పాటు పెట్టుబడి దారీ పధ్ధతినే ఫాలో అవుదాం అని మొదలెట్టాడు.సరిగ్గా అయిదేళ్ళు పూర్తి కాగానే ఇక చాలు అని అన్నాడు. అంత పెద్ద భూభాగాన్ని అలా మంత్రదండంతో శాసించినట్టుగా మరే రాజ్యాధినేతా శాసించలేకపోయాడు. అతనికి అంత ప్రాభవం రావటానికి కారణం ఒకటే. ప్లానింగ్!యెంత అమోఘమయిన ప్లానింగ్ అంటే రహస్య జీవితం గడుపుతున్నప్పుడే అతను రేపు అధికారంలోకి వస్తే యేమి చెయ్యాలో అప్పుడే ప్రణాలికలు రాశేసి ఉంచుకున్నాడు.స్వతంత్రం యేర్పడిన వెంటనే అతను చేసిన ప్రతిపాదనల్లో అతి ముఖ్యమయినది - 'జాతుల స్వయం నిర్ణయాధికారం' అనే ప్రకటన.అంటే సెర్బియన్లు, బోత్స్నియన్లు అనే రకరకాల జాతులకి సంబంధిచిన ప్రజలంతా యేకాండ శిలలాగా ఒకే ముక్కగా ఉండాల్సిన అవసరం లేకుండా యెవరి ప్రాంతాన్ని వారు పరిపాలించుకోగలిగే స్వేచ్చని బేషరతుగా ఇచ్చేశాడు!ఆ ఉదారత్వమే అతనికి ప్రజల్లో అతని మాట పట్ల గౌరవాన్ని పెంచింది. ఫలితం వాళ్ళందరూ మేం మీ నాయకత్వం లోనే కలిసే ఉంటాం అని ముందుకి రావటం.

                    ఇవ్వాళ ప్రపంచ రాజకీయ రంగంలో జరుగుతున్న మార్పులు భారత్ మరింత పలుకుబడిని పెంచుకుని అగ్రరాజ్య హోదాని సొంతం చేసుకోవటానికి కొన్ని అడుగులే ఉన్నాయనిపించే దూరంలో ఉంది. యేనాడయినా ఒక అమెరికన్ ప్రెసిదెంట్ స్వయంగా మీ మార్కెట్లో మాకు చోటివ్వండి అని బతిమాలతాడని ముందుగా యెవరయినా వూహించగలిగారా? ఆ సన్నివేశం యాదృచ్చికంగా జరిగింది  కాదు.కానీ ఆ నాలుగడుగులూ పడాలంటే ఇప్పటి లాగా బధ్ధకంతో నిదానంగా కదిలితే ఉదరదు.చాలా వాటిల్లో తొందర పడి చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి.మొదటిది అధికార వికేంద్రీకరణ, రెండోది విద్యని మార్కెట్ కి అనుసంధానించటం, మూడవది వ్యవసాయాన్ని వ్యవస్థీకరించి లాభసాటిగా తీర్చిదిద్దటం,నాలుగోది మన సంస్కృతి మూలాల్ని పరాయీకరణకి గురి కాకుండా రక్షించుకోవటం.

                    ఈ నాలుగింటిలో యే ఒక్కదాన్నీ నిర్లక్ష్యం చెయ్యకూడదు.ప్రాధాన్యతా క్రమం కూడా అదే. ఇంతకీ మన ఆస్తిత్వాన్ని నిర్ధారించే అంతరువు యేది?నా దృష్టిలో జిల్లా యే! యెందుకంటే ప్రజోపయోగ కరమై ప్రజా పాలనకి సంబంధించిన అన్ని అంశాలూ జిల్లా తోనే అనుసంధానించబడి ఉన్నాయి.కేంద్ర ప్రభుత్వం లోక్ సభ సభ్యులతో నడిచినా, రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సభ్యులతో నడిచినా వాళ్ళందరూ విషయ సేకరణ నుంచీ కార్యక్రమ నిర్వహణ వరకూ ఆధార పడుతున్నది జిల్లా యంత్రాంగం మీదనే.అటు జరిపీ ఇటు జరిపీ యెలా సర్దారో తెలియదు గానే ఇవ్వాళ ఆంధ్రా, రాయల సీమ మరియు తెలంగాణా ల్లో ప్రతి జిల్లాకీ ఒక ప్రత్యేకమయిన సంస్కృతి కొట్టొచ్చినట్టుగా తెలుస్తుంది చూడండి.ప్రతీ జిల్లాకీ కట్టే బట్ట దగ్గిర్నించీ మాటల్లో వినబడే పలుకుబడుల వరకూ ఒక గంట సేపు కలిసి తిరిగితే "వీదు ఈ జిల్లా వాడు" అని గుర్తు పట్టగలిగేటంత ప్రత్యేకంగా ఉన్నాయి. కాబట్టి నేను ఆ జిల్లాలనే క్షేత్ర స్థాయిలో ప్రజలు తమ ప్రాంతాన్ని తాము బాగు చేసుకోవటానికి వీలయ్యే ఈ నూతన రాజకీయ విధానానికి పునాదిగా తీసుకుంటున్నాను.ముందరి భాగాల్లో ఇక సాంకేతిక పరమయిన విషయాలు చర్చించాలి కాబట్టి తరవాతి వ్యాసానికి విరామం కొంచెం యెక్కువ కావచ్చు.

జై గారు కొరుకుంటున్నట్టు ఒక ఖచ్చితమయిన -Implimentation Plan- ఉండేలాగా చూస్తాను.
-----------------------------------------------------------------------------------------------------------------
1 2 3 4 5

5 comments:

  1. వికేంద్రీకరణ అనే ఆదర్శం కాగితం మీద ఎంత బాగున్నా, ప్రణాళిక రూపకల్పన మరియు చిత్తశుద్ధి లేకపోతె క్షేత్రస్తాయిలో ఎలా దిగజారుతుందో తెలుసుకోవాడానికి ఒక ఉదాహరణ (case study) ఇస్తాను.

    ప్రపంచ బాంకు అధ్వర్యంలో ప్రవేశపెట్టిన ఇరిగేషన్ సంస్కరణలకు సాగునీటి వినియోగదారుల సంఘాలు (WUA) అతిముఖ్య అంశం. వీటి ద్వారా ఆశించిన పరిణామాలు: 1. వినియోగదారులను భాగస్వాములుగా చేయడం (PIM) 2. నీటి చార్జీల వసూళ్లు పటిష్టం చేసి తద్వారా ఖజానా గండి అరికట్టడం 3. మరమ్మతులలో కాలయాపన అంతం 4. సరయిన సమయానికి సమపాళ్ళలో సాగు నీరు అందడం.

    పథకం భాగంగా వేలాది సంఘాలు ఏర్పడ్డాయి. వీటికి ప్రభుత్వం ధనసహాయం చేసింది. సంఘానికి ప్రభుత్వం పురమాయించిన పనులు: 1. రైతులను సమన్వయపరిచి అవసరం మేరకు నీటిని పంపిణీ చేయడం 2. నీటి చార్జీల వసూలు 3. మరమ్మత్తు ప్రాజెక్టుల పర్యవేక్షణ.

    అధికార పార్టీకి చెందినా పెద్ద ఆసాములే సింహభాగం పదువులు గెలుచుకున్నారు. వీరిలో పెక్కు మంది పెద్దకులస్తులు. తమ భూమిని కౌలుకిచ్చి చిన్నాచితకా కాంట్రాక్టులు & రాజకీయ కార్యకలాపాలలో మునిగి తేలే వారే (absentee landlords) అత్యంత శాతం. పదవుల మాట అటుంచి, కౌలుదారులకు సభ్యత్వమూ లేదు, పట్టాలూ లేవు.

    దీని పర్యవసానం ఏమిటో ఊహించుకోవడం కష్టతరం కాదు. నీటి పంపిణీ దొరవారి పొలాలకు మాత్రమె జరిగింది. నీటి చార్జీల వసూళ్లు మునపటికంటే హీనస్తాయికి చేరింది. ప్రభుత్వం పంచిన నిధులతో ప్రసిడెంటు గారికి అడిగిన రేటుకు (అవసరం ఉన్నా లేకపోయినా) మరమ్మత్తు పనుల కాంట్రాక్టులు దొరికాయి. ఒక్క లక్ష్యం నెరవేరలేదు సరికదా పరిస్తితి అధ్వాన్నం అయ్యింది.

    వ్యవసాయం దండగ అన్నవారు ఓడిపోయి రైతురాజ్యం తెస్తానన్న వారు వచ్చాక ఒకే ఒక్క మార్పు: ఈ తడవ ఇవతలి పార్టీ & కులం వ్యక్తులు గద్దెనెక్కారు. ఖజానా గండి అలాగే ఉంది, రైతులకు నీళ్ళు లేవు, నీటి చార్జీలు కట్టే నాధుడే లేడు, (కొత్త) దొరవారి కాంట్రాక్టులు షరా మామూలే.

    Lessons learnt: 1. భూసంస్కరణలు జరగకుండా సాగు నీటి వ్యవస్తను సంస్కరించలేము 2. ఏలినవారికి సంస్కరణ కంటే చోటామోటా నాయకులకు వచ్చే లబ్ది తద్వారా తమ పార్టీకి వచ్చే వోట్ల మీదే ఆసక్తి ఉంటె ఇలాగే జరుగుతుంది 3. most important: పథకాలను ప్రవేశపెట్టే ముందు అన్ని అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే తప్ప కాలు పప్పులో పడుతుంది

    ReplyDelete
    Replies
    1. మీ ఉదాహరణ బాగుంది.మొదట్లో కంగారు పడ్డా, నా ప్లాను కూడా ఇలాగే తుస్సు మంటుందా అని. కానీ పై విషయం ఒక sub system వికేంద్రీకరణను ఫాలో అవుతున్నా దాని పైన ఉండి దాన్ని కంట్రోల్ చేసే main system ఇంకా కేంద్రీకృతంగానే ఉండటం వల్ల అలా అయిందనిపిస్తున్నది.
      మొదట్లో నేను పై పైన కొన్ని సూచనల్తో వొదిలేద్దామనుకున్నాను. కానీ మీరు చెప్పిన ఈ ఉదాహరణ చూశాక కొంచెం శ్రమ అయినా సరే ఇలాంటి వాటిని కట్టడి చేసే విధంగా పక్కా ప్లాన్ తయారు చెయ్యాలని నిర్ణయించుకున్నా. యెందుకంటే పైన జరిగిన విషయాలన్నీ రాజకీయ నాయకత్వం అధికార కేంద్రీకరణ ద్వారా వొచ్చిన వెసులుబాటును ఉపయోగించుకోవటం వల్ల కాబట్టి దాన్ని తగ్గించడమే నా ప్లాను ఉద్దేశం.

      ప్రస్తుతం పేపర్ వర్క్ లో మునిగి ఉన్నా. సోమ వారం మొదటి భాగం ప్రచురిస్తా.

      Delete
    2. మనకు (అంటే సామాన్య ప్రజలకు) రాజకీయనాయకులకు ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయి: 1. చిత్తశుద్ధి 2. సొంత జేబు నింపుకుందామన్న కక్కుర్తి లేకపోవడం 3. సద్విమర్శలను స్వీకరించే మనస్తత్వం. అంచేత మీ ప్లాన్ ఖచ్చితంగా ఆచరణ యోగ్యంగా ఉంటుందని నా నమ్మకం. ఒకవేళ మొదటి ప్లానులో లోపాలున్నా సమీక్ష తరువాత మెరుగు పడుతుందని గురించడం అవసరం. A plan that is based on a sound premise can become actionable after a thorough objective review.

      Delete
    3. అవును.ఇది మన లాంటి వాళ్ళందరి కోసం మనం తయారు చేసుకుంటున్నది. కొత్త పోష్టు తయారయింద్ది. అక్కడ కలుద్దాం. అసలు పనంతా అక్కడే, మిగతా వార్ని కూడా ఆహ్వానిద్దాం!

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...