Showing posts with label మధుర వచనం. Show all posts
Showing posts with label మధుర వచనం. Show all posts

Thursday, 7 November 2019

నన్నయ భారతం లోని యయాతికి అనువైన పద్యం పోతన భాగవతం లోని మురారికి కూడా వర్తిస్తుందా?

జలధి విలోల వీచి విలస త్కలకాంచి సమంచితావనీ
తలవహనక్షమం బయిన దక్షిణహస్తమునన్ దదున్నమ
ద్గళదురుఘర్మవారికణ కమ్ర కరాబ్జము వట్టి నూతిలో
వెలువడ గోమలిం దిగిచె విశ్రుతకీర్తి యయాతి ప్రీతితోన్
-నన్నయ
(శ్రీ మదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, తృతీయాశ్వాసం)
కీర్తిమంతుడైన యయాతి, మధురధ్వని చేస్తూ చలించే అలలనే  ప్రకాశించే వడ్డాణాన్ని ధరించిన భూమిని మోయడానికి సమర్థమైన తన కుడి చేతిని చాచాడు. విపరీతంగా చెమట బిందువులు జారుతున్న పద్మం లాంటి అందమైన చేతిని అందుకుని  ప్రేమతో ఆ కోమలిని నూతిలోంచి పైకి తీశాడు.

ఇది శర్మిష్ఠ బావిలోనికి తోసేసి నగరానికి వెళ్ళీపోయాక వేటకు వచ్చిన యయాతి బావిలో ఒక తీగకు వ్రెళ్ళాడుతున్న దేవయానిని చెయ్యి పట్టుకుని బావిలోనుండి పైకి లాగి భూమి మీదకి దించటాన్ని అవ్ర్ణించే పద్యం కదా!

జలధి విలోల వీచి విలస త్కలకాంచి సమంచితావనీ
తలవహనక్షమం బయిన దక్షిణహస్తమునన్ దదున్నమ
ద్గళదురుఘర్మవారికణ కమ్ర కరాబ్జము వట్టి తేరుపై
వెలువడ గోమలిం దిగిచె విశ్రుతకీర్తి మురారి ప్రీతితోన్
-నన్నయ
(శ్రీ మదాంధ్ర భాగవతం, దశమ స్కంధము, రుక్మిణీ గ్రహణంబు)
కీర్తిమంతుడైన మురారి, మధురధ్వని చేస్తూ చలించే అలలనే  ప్రకాశించే వడ్డాణాన్ని ధరించిన భూమిని మోయడానికి సమర్థమైన తన కుడి చేతిని చాచాడు. విపరీతంగా చెమట బిందువులు జారుతున్న పద్మం లాంటి అందమైన చేతిని అందుకుని  ప్రేమతో ఆ కోమలిని రధం పైకి లాగాడు.

ఇది రుక్మిణి అగ్నిద్యోతనుల వారితో కబురు పంపిస్తే వస్తానని చెప్పిన ద్విబాహు రపరో హరి నగరానికి బైట దేవి ఆలయం దగ్గిర ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, కని తదీయ రూప వయో లావణ్య వైభవ గాంభీర్య చాతుర్య తేజో విశేషంబులకు సంతసించి, మనోభవశరాక్రాంతయై రథారోహణంబు గోరుచున్న య వ్వరారోహం జూచి, పరిపంథి రాజలోకంబు చూచుచుండ మందగమనంబున గంధసింధురంబు లీలం జనుదెంచి ఫేరవంబుల నడిమి భాగంబుఁ గొనిచను కంఠీరవంబు కైవడి, నిఖిల భూపాలగణంబుల గణింపక దృణీకరించి, రాజకన్యకం దెచ్చి హరి తన రథంబుమీఁద నిడికొని పోవు సందర్భమునకు ఈ కలికాలపు హరికాలం అతికించిన చోద్యం, ఎలా వుంది?

Thursday, 24 October 2019

కల్పవృక్షం కింద కూర్చుని ఏది అనుకుంటే అది జరిగిపోతుంది - నిజమేనా!

భౌతిక ప్రపంచంలో ఏది కావాలన్నా పని చెయ్యాలి.ఇంతవరకే తెలుసుకుంటే కల్పవృక్షం గురించి చెప్పినది అభూత కల్పన అనిపిస్తుంది.తపస్సు చేస్తే కల్పవృక్షత్వం సిద్ధిస్తుంది అనేది అర్ధం కావాలంటే తపస్సు అనే మాటకు అర్ధం తెలియాలి.కల్ప-సంకల్ప-వికల్పాలను నియంత్రించటమే తపస్సు!

మనం రోజూ చేసే పనుల్ని కొంచెం దగ్గరనుంచి గమనించితే మనకు తెలియకుండానే తపస్సు చేస్తూ తపస్సు వల్ల వచ్చే ప్రయోజనాల్ని పొందుతున్నట్టు తెలుస్తుంది.మనకు చీర కావాలి.మన దగ్గిరున్న డబ్బుల్ని చీరను తయారుచేసిన ఇంకొకరికి ఇచ్చి అతని దగ్గిరున్న చీరను తెచ్చుకునే వ్యవహారంలో జరుగుతున్నది ఏమిటి?చీర కావాలి అనేది కల్పం/అవసరం, చీరను కొనడం అనేది సంకల్పం, దానికి మనం డబ్బును ఇవ్వడం వికల్పం - ఇంతకీ చీర అనే పదం,వస్తువు మొదట ఉనికిలోకి ఎలా వచ్చాయి?అనేకమంది వ్యక్తుల సమిష్టి ఉత్పత్తి చీర - ఒక కణం తర్వాత ఒక కణం కలిసి ప్రత్తి అనేది సృష్టిలో ఆవిర్భవించడం,దాని ఉపయోగం తెలిసిన కొందరు ఒక ప్ర్ణాళిక వేసుకుని ప్రత్తి విత్తనాల్ని నాటి ఎరువులు వేసి కోసి అమ్మితే మరికొందరు దారాలు తీసి అల్లి రంగులద్ది మన ముందు ఉంచడం వెనక ఉన్నది అనేక తపశ్శక్తుల కలయిక కాక మరేమిటి?మొదట కొందరు చీర అనేది తయారయ్యాక దేనికి ఉపయోగపడుతుందో వూహించి తయారు చేసి మన ముందు ఉంచి దాని ఉపయోగం గురించి చెప్పాకనే కదా మనకు చీర అవసరం అయ్యింది!

ప్రాచీన భారతీయ ఋషులు చేసినది కూడా ఇదే - ఫలానా ఋషి ఫలానా లక్ష్యం కోసం తపస్సు చేసి దైవకృప చేత దాన్ని సాధించాడు అనటంలోని అర్ధం అతను కళ్ళు మూసుకుని కూర్చున్నాడని కాదు, ఆ లక్ష్యం కోసం తపించి శ్రమించాడు.ఎవరినీ యాచించకుండా మన కోరికల్ని ధర్మబద్ధమైన పద్ధతిలో సాధించాలంటే మనం చేరుకోవలసిన మానసిక స్థితిని సాధించడమే యమ, నియమ, ప్రాణాయామాలతో కూడుకున్న యోగప్రక్రియల ప్రయోజనం!అదే అన్నింటినీ సాధించిపెడుతుందనేది మూఢనమ్మకం మాత్రమే - ఆ రకమైన మానసిక స్థితిలో ఉండి చేసే పనులు సత్వర ఫలితాలను ఇస్తాయి కాబట్టి దుష్కరమైన లక్ష్యాలను పెట్టుకున్నవారు మొదట వాటిని సాధన చేసేవారు.

ఆయుర్వేదం లాంటి విద్యలను లోకానికి అందించిన ఋషులే కాదు హిరణ్యకశిపుడి లాంటివాళ్ళు ఆమరత్వం కోసం చేసిన తపస్సులు కూడా ఇవే కోవలోకి వస్తాయి.అయితే, వాళ్ళు చేసిన అసలు శ్రమ యేమిటో తమ లక్ష్యాలను సాధించటానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఏమిటో సూక్ష్మమైన వివరాలు తెలియక పోవడం చేత ఆ కృషికి సంబంధంచిన గుర్తింపుని తపస్సుకి అంటగట్టెయ్యడం వల్ల జరిగిన ప్రమాదం అది, అంతే!

ఎవరినీ యాచంచకుండా ఎవరినీ దోచుకోకుండా తను దోపిడీకి గురి కాకుండా బతకాలనే సంకల్పం ఉన్న ప్రతి మానవుడూ ఒక కల్పవృక్షమే!

Friday, 11 March 2016

అవే దృశ్యాలు,అవే భావాలు,అవే మాటలు ,అవే స్మృతులు - అయినా ఎంత నిత్య నూతనం!

     మా అమ్మాయి పుట్టినప్పుడు నన్నసలు హాస్పిటల్ దరిదాపులకే పోనివ్వలేదు మా బంగారం కేకలు విని తట్టుకోలేనని, పాపాయినీ వెంటనే చూడనివ్వలేదు!తెల్లవారుఝామున, పక్కన ఎవరన్నా మాట్లాడుకుంటుంటే నీటిలో మునిగి వింటున్నట్టు అనిపించేటంత మాగన్ను నిద్రలో ఉన్నప్పుడు మా మామయ్య "ఇదుగోనయ్యా!నీ కూతురు, చూసుకో - కలవరిస్తున్నావుగా" అని కొంచెం విసురుగానే నా పక్కలో పడుకోబెడితే,ఆ విసురుకి గాబోలు కదిలి కాలు కొంచెం ఝాడించింది!ఇప్పటికీ ఆ సన్నివేశం గుర్తొస్తే పక్కటెముకల దగ్గిర అప్పటి మెత్తని కాలితాపు స్పర్శ తెలుస్తూనే ఉంటుంది - ఏమిటీ మహామాయ?తనని మొదటిసారి చూడగానే అధాట్న కాలంలో వెనక్కి వెళ్ళిపోయి నా చిన్నప్పటి నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది!చిన్నప్పుడు నన్ను ఇట్లా చూసిన మానాన్నకీ ఇట్లానే అనిపించి ఉండాలి!

     ఇంకా వెనక్కి వెళ్తే మా నాన్న పుట్టినప్పుడు వాళ్ళ నాన్న కూడా ఇట్లాగే అనుకుని ఉండాలి.ఇంకా వెనక్కి వెళ్తే...?మళ్ళీ మా అమ్మాయి మొదటిసారి మాటలు నేర్చినప్పుడూ అదే అనుభూతి!మామూలుగా అందరూ మొదట అమ్మా నాన్నల్ని "అమ్మా!" అనీ "నాన్నా!" అనీ పిలుస్తారు, కానీ మా బుజ్జిగాడు మమ్మల్ని అందరూ పిలిచే పిలుపుల్ని విని పట్టేసి నన్నేమో "హబాబూ!" అనీ మాధవినేమో "మాధీ" అనీ మొదలుపెట్టి తర్వాత "హరిబాబూ!","మాధవీ!" అని మా పేర్లతోనే పిల్చేది!తర్వాతెప్పుడో బాగా పెద్దయ్యాక తనే "అమ్మా","నాన్నా" అనడం నేర్చుకుంది గానీ మాకు మాత్రం మొదటి పిలుపులే నచ్చాయి - వీళ్ళు తేడా మనుషులు అనుకునేటట్టు ఉంటుందని పనిగట్టుకుని అట్లాగే పిలవమని ఒత్తిడి పెట్టలేదు గానీ ఇంకొంతకాలం అట్లానే పిలిస్తే బాగుండును కదా అని చాలాకాలం పాటు బెంగ అనిపించేది మాకు!

     ఈ మాటలు నేర్చుకున్నప్పటి ఒక సుదీర్ఘకాలం పాటు మా ఇద్దరి మధ్యనా జరిగిన హాస్యకదంబం ఎప్పటికీ నవ్వొస్తూనే ఉంటుంది.అన్ని మాటలూ తొందరగానే నేర్చుకున్నది గానీ "డాబా","డబ్బా" అనే రెండు మాటల విషయంలో మాత్రం చాలా టైము తీసుకుంది.ఎవరైనా తప్పులు చేస్తుంటే సరిద్దటం విషయంలో నా చాదస్తం మీకు తెలుసు కదా!నా పట్టుదల కొద్దీ ఎంత మెల్లగా స్పష్టంగా కూనిరాగం తీస్తూ తలని పైనించి కిందకి ఇట్లాగే చెప్పు అన్నట్టు ఆడిస్తూ "డబ్బా!" అనమని చూపిస్తే, అది కూడా అచ్చు నేను ఎంత దీర్ఘం తీశానో అంతే దీర్ఘంతో తలని కూడా నాలాగే ఆడిస్తూ "బడ్డా!" అని మాత్రమే అనేది:-)

     తను తొలిసారి కింద పదకుండా వూగుతూ వూగుతూ వొచ్చి మీద వాలిపోయి నడిచింది నాలుగడుగులే అయినా గొప్ప ఘనకార్యం చేసినట్టు నవ్వుతుంటే అప్పుడు కూడా తను కాదు నడక నేర్చుకున్నది నేను అన్న గర్వం!ఐశ్వర్యాలు కోరుకుని,వైభవాల కోసం ఆరాటపడి,అసహనాలతో రగిలిపోయి చూడటం లేదు గానీ మనలోనే ఉంది సుఖజీవనసారం!మనపక్కనుంచే మనల్ని రాసుకుంటూనే ఒక భోగయాత్ర నిరంతరం నడుస్తూనే ఉన్నది - ఐతే, చూడాలనుకుంటేనే కనబడే మార్మికత ఉంది అందులో!ఎవరు ఏ దృక్కోణంతో చూస్తే ఆ విధంగా కనబడే మార్మిక లోకం ఇది!నాకో కూతురు పుట్టటం, ఆ పాపాయి నడక నేర్చుకోవటం, అప్పుడు నా మనస్సులో పుట్టే ఆలోచనలూ అనుభూతులూ ఆనందాలూ నాకు మాత్రమే జరిగినవి అనుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో నాకు జరిగినవి నాకు మాత్రమే ప్రత్యేకంగా జరగడం లేదనీ, మానవసమూహం అనుబంధాలతో పెనవేసుకోవటం మొదలుపెట్టినప్పటి నుంచీ ప్రతి మనిషికీ జరుగుతున్నవేననీ తెలిసినప్పుడు అంత విచిత్రంగా అనిపిస్తుంది!జననం,బాల్యం,యవ్వనం,కౌమారం,వార్ధక్యం,మరణం - పునరపిగా నిరంతరం జరిగే ఈ దృశ్యాదృశ్య జీవన సంరంభం ఎప్పుడు ఆగుతుంది?అసలు ఆగుతుందా, ఎప్పటికీ ఆగదా!

     మనుషుల్ని కులాలుగా,మతాలుగా,జాతులుగా,ముఖ్యమంత్రులుగా,రిక్షావాళ్ళుగా విడగొట్టకుండా  హఠాత్తుగా వీళ్ళిప్పుడు ఏమి చేస్తూ ఉండి ఉంటారు అని ఆలోచిస్తే మనుషులు అతి మామూలుగా చేసే పనులు ఏమిటి?తొలిసారి తల్లి గర్భం నుంచి బొడ్డుతాడు తెగి జారిపడగానే ఉలిక్కిపడి గుక్కపట్టి ఏడవటం,తల్లి దగ్గిరకి తీసుకోగానే మళ్ళీ సంబాళించుకోవటం,తనకి పాలిస్తున్న తల్లిని గుర్తుపట్టటం,తల్లి మాటల్ని వింటూ మాటలు నేర్చుకోవటం, అమ్మ చంకన ఎక్కటమే కొండకొమ్ముల నెక్కినంత గొప్పగా అనిపించటం,అమ్మ ఎవరివైపు చూసి నవ్వితే వాళ్ళు మంచివాళ్ళనీ ఎవరివైపు కోపంగా చూస్తే వాళ్ళు చెడ్డవాళ్లనీ నేర్చుకోవటం,కొత్తగా నడక నేర్చుకున్న హుషారులో గడపల్ని చూస్కోకుండా పరిగెడుతుంటే "పడిపోతావు!" అనే వెనకనుంచి వినబడే ఆందోళనకి "ఈ మాత్రానికే?" అనుకోవటం,కొత్తసైకిలు కోసం నాన్నని అడగటం,కుదరదంటే "మా నాన్న పీనాసి" అనేసుకుని కొనిచ్చేవరకు అన్నం తిననని మారాం చెయ్యటం,కొనిస్తే అన్నీ మర్చిపోయి "మా నాన్న మంచోడు!" అనేసుకుని నవ్వుకోవటం,పరీక్షల్లో తప్పినప్పుడు తిడుతుంటే తల వేళ్ళాడేసుకుని నిలబడ్డం,డిస్టింక్షన్ కొడితే కాలరెగరెయ్యటం,ఫ్రెండ్సుతో క్లాసులూ టెస్టులూ ఎగ్గొట్టి మ్యాట్నీలకి చెక్కెయ్యటం,మనకి నచ్చిన హీరో హీరొయిన్ల గురించి వాళ్లు నచ్చని ఫ్రెండ్సుతో తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఆవేశపడిపోవటం,ఇంట్లోవాళ్ళు ఇక పెళ్ళి చేసెయ్యాలన్నప్పుడు మొదట బోల్డు కంగారు పడిపోయి పిదప తెగ సిగ్గుపడిపోయి ఆఖరికి ఉషారుగా రెడీ అయిపోవటం,పెళ్ళంటే తర్వాత వచ్చే పాలడబ్బాల ఖర్చులూ స్కూలుఫీజుల బరువులూ తెలియకపోవటంచేత పాలగ్లాసూ మల్లెపూలూ మాత్రమే గుర్తొచ్చి రోజుల తరబడి వాటి గురించి వీరలెవెల్ల్లో వూహించేసుకుని తీరా మొదటిరాత్రి తెల్లవారిన తర్వాత "ఓసింతేనా?దీని కోసమా ఇంత హడావిడి!ఈపాటిదానికి ఇవన్నీ అవసరమా?!" అని నవ్వుకోవడం,పెళ్ళి చేసి పంపించేటప్పుడు ఆడపిల్ల తలిదండ్రులు ఎంత ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయినా తెల్లారేసరికి "హమ్మయ్య, ఒక గండం గడిచింది.ఇంక అక్కడెట్లా ఉంటుందో!" అనుకుని పెళ్ళిలో జరిగిన తప్పులూ ఒప్పులూ కోపాలూ తాపాలూ విరగబాట్లూ సర్దుబాట్లూ చెప్పుకుంటూ నవ్వుకోవటం,పెళ్ళయ్యేవరకు పుట్టింట్లో మహారాణిలా పెరిగిన కొత్త పెళ్ళికూతురు రెండో రోజుకల్లా పుట్టింటికే ఎవరో చుట్టాలింటికి వచ్చినట్టు నాల్రోజులుండి వెళ్ళిపోవటం,కొత్త జంటలో ఒకరికొకరు ఇంకా కొత్తముఖాల్లాగే అనిపిస్తూ అందర్లో తిరిగేటప్పుడు జరిగే చిరు తగిలింతలు కూడా పెను పులకింతలై నునుసిగ్గుల మెరుపుల చిరునవ్వుల్ని పుట్టించటం,కాస్త పాతబడిపోగానే అవే కదలికలు "నలుగుర్లో ఉన్నామనే ఇంగితం కూడా లేకుండా ఇంకా ఏమిటీ మోటు సరసం?" అని విసుగు తెప్పించటం,పిల్లలు పుట్టుకురాగానే పాలడబ్బాల ఖర్చులూ స్కూలుఫీజుల బరువులూ మోస్తూ రోజూ పొద్దున్నే లంచ్ బాక్సులు సర్దేసుకుని సగం తిని సగం వదిలేసి ఉరుకులు పరుగులతో సిటీబస్సు అందుకుని చెమట్లు గక్కుతూ పోయి ఆఫీసులో పడి మళ్ళీ చెమట్లు గక్కుకుంటూ రాత్రి కొంపకి జేరి తిన్నామా పడుకున్నామా లేచామా అని ఒకటే హడావిడి పడుతూ తిట్టుకుంటూ విట్టుకుంటూ నెట్టుకుంటూ గానుగెద్దు జీవితం గడుపుతూ జుట్టులో తెల్లవెంట్రుకలు కనపడ్డాక "అప్పుడేనా?ఓర్నాయినో!ఏమీ ఎంజాయ్ చెయ్యనే లేదు, ఇప్పుడెట్లా?!" అని బెంగేట్టుకోవటం,తనకి తల నెరిసిందంటే అర్జెంటుగా పిల్లలకి పెళ్ళిళ్ళు  చెయ్యాల్సిన వయసొచ్చిందని గుర్తొచ్చి హడిలిపోవటం,అసలెంత నిలవెంత కొసరెంత ఇంట్లో ఎంత బ్యాంకులో ఎంత సంబంధా లెప్పుడు వెతకాలి ఏ సంబంధం ఖాయం చేసుకోవాలి నిశ్చితార్ధాని కెంత పెళ్ళిపనులు ఎప్పుడు మొదలెట్టాలి చుట్టాలెవరెవర్ని ఎట్లా ఎట్లా పిలవాలి ఆ ముహూర్తానికి ఏ పెళ్ళిమండపం దొరుకుతుంది అని ఎక్కాల పుస్తకంలో ఉన్న ఎక్కాలన్నీ కవరయ్యేలా లెక్కలు వేసుకుని చచ్చీచెడి శాయంగల విన్నపములై అన్నట్టు ఆ పని కాస్తా ముగించి "ఇంక నాపనయిపోయిందిరోయ్, దేవుడోయ్!" అని గావుకేక పెట్టి వాలుకుర్చీలో కూలబట్టం,పిల్లలు ప్రయోజకులై వాళ్ళ ఘనకార్యాలు చెప్తుంటే పొంగిపోతున్నప్పటి ఆనందంలో గభాల్న "నాన్న కూడా ఉంటే ఎంత బావుండేది!" అనిపించినప్పుడు చెమ్మగిల్లిన తడికన్నులతో నవ్వటం,మనవలూ మనవరాళ్లతో పోటీపడి పరిగెత్తలేనప్పుడు ఇంక మనకి చివరిబండి సిద్ధమయ్యిందని తెలిసిపోవటం,ఎప్పుడొస్తుందో తెలియని మలుపుకోసం ఎదురు చూట్టం - లీనమై బతికితే దేవుడు కూడా ఈర్ష్యపడేటంత సప్తవర్ణ సంశోభితమైన స్వరరాగ గంగాప్రవాహమే కదా మానవజీవితం!

     అక్కడా ఇక్కడా నిన్నా మొన్నా ఇదే జగన్నాటకం పదే పదే జరుగుతూనే ఉన్నా చిన్న చిన్న ఎదురుదెబ్బలు కూడా ఇంతకుముదు ఇంకెవరికీ తగలనట్టు హడావిడి చేస్తూ ఇప్పుడే తమకొకరికే ఇట్లా జరిగినట్టు అతిగా వూహించేసుకుని పెద్దలు చెప్పిన అనుభవసారమంతా మర్చిపోయి ఇప్పటివరకు చెప్పినదంతా పరగడుపైన వాళ్ళు తమ బతుకు పుస్తకాల్ని మధ్యలో మూసేస్తున్నారు - ఎంత పిచ్చివాళ్ళు వాళ్ళు?చావుని పొగిడేవాళ్ళు,చావుకి ఎదురు నడిచేవాళ్ళు, పనిగట్టుకుని చావుని కెలికేవాళ్ళు మంచివాళ్ళు కానేకాదు - చచ్చిపోవటానికి తప్ప ఇంకెందుకూ పనికిరాని వాళ్ళు!వాళ్ళ మాటల్లో ఒక్క మాట కూడా నిజం కాదు - అస్సలు నమ్మొద్దు, అటువైపు పోవద్దు!దేవుడు కూడా ముచ్చట పడి ఇక్కడ పుట్టి బతికి చూపించిన ఇంత గొప్ప బతుకును సగంలో ముగించి ఏం సాధిస్తావు నువ్వు?ఇవ్వాళ్టి పార్ధుడికి ఇప్పటి గీతాచార్యుడు యుద్ధం గురించి చెప్పడం లేదు, ఒక భోగయాత్రని గురించి చెప్తున్నాడు - చెవులు రిక్కించుకుని విను!

     ఈ విశ్వం మొత్తానికి నువ్వే కేంద్రబిందువు - అనుకో, పర్లేదు!నువ్వే నేననీ నేనే నువ్వనీ కూడా అనుకో, నేనేమీ అనుకోను!ప్రపంచమొక నిరంతర భోగయాత్ర!అవును, నీచుట్టూ నేనొక భోగయాత్రని కల్పించాను - చూడు!నడిచి,నడిపించు!భోగయాత్ర అంటే - గడప దాటి బైటికెళ్తే ఛస్తానని భయపడుతూ ఇంటిపట్టున కూర్చుని రేపటి కోసం దాచుకుని తింటూ ఎక్కడ కూర్చోబెడితే అక్కడ పీఠమేసుకుని కూర్చోవటం కాదు, రేపటి గురించి ఆలోచించని ధీరుడివై ఉన్నది సమస్తం మూటగట్టుకుని సామగ్రిని ఒంటెమీద కెక్కించి ఇల్లు వదిలి నీలాంటి భోగయాత్రికుల్ని కలుపుకుని వూళ్ళు పట్టుకు తిరగటం - సరికొత్త దేశదిమ్మరి తనం!

     నీ సాటివాడు బీడీ కాలుస్తున్నాడు,నీకూ కాల్చాలనిపించింది,జేబులు తడుముకున్నావు, లేదు!ఏం మొహమాట పడకుండా "అన్నా!నేనూ ఓ దమ్ము లాగనా?" అని సూటిగా అడిగెయ్యి.అతను కూడా "దాందేముంది తమ్ముడూ!పూర్తి బీడీయే తీసుకో!" అని కొత్తదే ఇస్తాడు.నీ సాటివాడు "అన్నా, దాహమేస్తుంది!ఓ గుక్క తాగుతానేం!" అని నీ నడుము కున్న సొరకాయ బుర్రని చనువుగా తీసుకుంటాడు.నువ్వు కూడా "ఒక్క గుక్కేం ఖర్మ,మొత్తం తాగేసినా పర్లెదు - వచ్చే చెలమ దగ్గిర నింపుదాంలే!" అంటావు.భోగయాత్రలో ఉన్న కిటుకే అది - ఖరీదుఅమ్మడం, కొనడం, లాభం, నష్టం, మోసం, ద్వేషం - ఇవేవీ ఉండవు, అంతా పంచుకొనుడే - "కలిసి నడుద్దాం. కలిసి మాట్లాడుకుందాం. కలిసి మెలిసి ఒకరి మనస్సు లొకరం తెలుసుకుందాం. మన పూర్వులు దేవీభాగాన్ని యెలా పంచుకునేవారో అలాంటి జ్ఞానాన్ని ఉపాసించుదాం!"నీ దగ్గిర లేనిది ఎదటివాడి దగ్గిర ఉంటే అడిగి తీసుకోవచ్చు - అయితే, అతను సంతోషంగా ఇస్తేనే తీసుకోవాలి. జులుం చేసి గుంజుకోవొద్దు. అటు వైపు నుంచి తీసుకున్న ప్రతి రూపాయికీ పది రూపాయలు చేసి ఇటు వైపు నుంచి ఇవ్వు - అదీ భోగయాత్రికుడి లక్షణం!

     కొందరుంటారు, తీసుకోవడానికి చూపించే తొందర ఇవ్వడానికి చూపించరు.ఒక వూరిలో ఒక బావి ఉంది.పొరుగూరి వాడొకడు అందులోకి జారిపడ్డాడు.పెద్ద లోతు కూడా లేదు.వాడు గట్టిగా ఎగిరితే వీళ్ళు చెయ్యి పట్టుకుని లాగెయ్యొచ్చు.కానీ,చెవుడేమో అనుకుని అరిచి చెప్పినా మూగేమో అనుకుని సైగలు చేసి చెప్పినా వెర్రి చూపులు చూస్తాడే తప్ప ఎగరడే!వాలకం చూస్తే పిచ్చోడిలా లేడు, వాడి ఖర్మకి వాణ్ణి వొదిలేద్దామా అంటే వీళ్ళంతా పాపం మంచి ముండా వాళ్ళు!ఆఖరికి ఒకడొచ్చి లటక్కన లాగేశాడు?!వీళ్ళందరికీ దిమ్మదిరిగి మైండు బ్లాంకయ్యింది.అనుమానమొచ్చి "బాబూ, నీ పేరు పండుగాడు కదూ!" అనడిగారు, వాడు కాదనేశాడు?మరీ కంగారెత్తిపోయి ఈసారి మొహమాటం లేకుండా అసలు డౌటు అడిగేశారు,"మేమందరం అంతసేపు తంటాలు పడ్డా లాగలేక పోయాం,మరి నువ్వు చేసిన ట్రిక్కు యేంటీ?" అని.దానికి వాడు మొహమంతా నవ్వు చేసుకుని "మీరేమన్నారు?నీ చెయ్యిటివ్వు లాగేస్తాం అని,కదా!నేనేమన్నాను?నా చెయ్యి పట్టుకో లాగేస్తాను అని, కదా!ఆడు మా వూరోడే. తీసుకోవటమే తప్ప ఇవ్వటం ఆడి జన్మకి చెయ్యడు" అన్నాడు.అటువంటి వాళ్ళు ఈ భోగయాత్రకి పనికిరారు!

     భోగ యాత్రిక లక్షణాలు వంటబట్టాలంటే నువ్వు తప్పకుండా చెట్లని చూసి నేర్చుకోవాల్సిందే!చెట్టు చేమలన్నీ ఎప్పట్నుంచో భోగయాత్రలోనే నడుస్తున్నాయి. నిరాడంబరంగా జీవిస్తూనే వైభవోజ్వలంగా ప్రకాశించదల్చుకుంటే అందుకో చక్కని రాజమార్గం ఉంది, చెప్పనా?చూడు...పచ్చగా ఎదిగే చెట్టుని చూడు!ఆ చెట్టులాగే సారవంతమైన నేలవంటి కఠినసత్యప్పు పునాదుల మీద నీతినియమాలతో నిండిన నీ ప్రవర్తన అనే ధృఢమైన కాండాన్ని నిలబెట్టి ఉంచు.అందుకోసం మొదట నీ జిజ్ఞాసల వేర్లని మహనీయుల బోధనల్లోకి వీలైనంత పొడుగ్గా సాగించి ఉంచు.అప్పుడిక విజృంభించి నలుదిక్కులకీ శాఖల్ని విస్తరించు.ఆ శాఖలు నీ హృదయంలో పొంగిపొర్లుతున్న సౌజన్యాన్ని ప్రతి కణుపులోనూ నిండుగా నింపుకున్న స్నేహామృత హస్తవారధులే కదూ!ఆత్మీయంగా కనబడే రూపం,మోహనంగా వెలిగే చిరునవ్వూ,సదా స్వాగతించే హస్తచాలనంతో నిలబడి నీకు దగ్గిరగా వచ్చిన ప్రతి మనిషినీ ప్రియభాసహణతో అలరించు.ప్రతి నిముషమూ నీకు పరిచయమౌతున్న అసంఖ్యాక జనసందోహం నుంచి సాధ్యమైనంత  తక్కువ సమయంలో వీలయినంత ఎక్కువమందిని నీకోసం ప్రాణమిచ్చే స్నేహితులుగా పెంచుకుంటూ ఎదుగు.ఐతే,నీ స్నేహానికి తగనివాళ్ళైన కొందరు చీడపురుగుల్ని మాత్రం అసలు దగ్గిరకే రానివ్వకు.అప్పుడు మొహమాట పడి మితిమీరిన చనువిస్తే తర్వాత నీకే ప్రమాదం!ఇతర్లని వెక్కిరించి ఆనందించే వాళ్ళనీ,తమ అవసరం కోసం మమకారం నటించే వాళ్ళనీ - వాళ్ళ బుద్ధి తెలిసిన మరుక్షణమే వాళ్ళతో నీకున్న అనుబంధాన్ని కత్తిరించేసి వాళ్ళని అంతటితో విస్మరించి పారెయ్యి.చిరుమొలకలుగా ఉన్నప్పట్నించీ తెగుళ్ళనీ,చీడపీడల్ని ఎప్పుడు హింసించటం మొదలుపెడితే అప్పుడు తడబడకుండా అడ్డుకోగలిగినవే నేడిలా మహావృక్షాలై నిలబడ్డాయని తెలుసుకో!అనునిత్యం జీవం తొణికిసలాడుతూ, స్నేహమధురవసంతాల చిగుళ్ళు తొడుగుతూ ఆప్తులందరికీ సతతతహరితంగా కనబడు.ప్రియమిత్రులకి నిరాఘాటంగా ఆతిధ్యపు నీడనిచ్చి, అవసరమై వచ్చి సహాయ మడిగితే బెట్టు చెయ్యకుండా చెయ్యాల్సిన త్యాగసముదాయాల్ని పండిన ఫలాలుగా అందించి నిగర్వంగా ఉండటాన్ని నేర్చుకో!

     భోగయాత్రలో కదలాలంటే కలివిడితనం ఉండాలె!పూనుకుని మాట కలుపాలె.మాటకి మాట కలుపాలె.కష్టం సుఖం కలబోసుకోవాలె.పగలల్లా కష్టపడాలె,రాత్రికోసం ఎదురుచూడాలె.రాత్రికి మంచి చోటు చూసుకుని డేరాలు బిగించి మజిలీ వేస్తారు చూడు, అప్పుడు మొదలవుతుంది కోలాహలం!రాత్రయింది గదాని కడుపునిండా పట్టించి ముసుగుతన్ని పడుకోవద్దు!నువ్వు వండిన వంటకం నువ్వు మాత్రమే తినకు - అదే అసలైన దరిద్రం!అక్కడ కోలాహలాగ్ని దగ్గిర తక్కిన భోగయాత్రికులు సందడి చేస్తుంటే నువ్విక్కడ ఒంటికాయ సొంటికొమ్ములా కూర్చుంటే కుదరదు!ఎదటివాడు తనని ముట్టుకుంటే తను మైలపడతాననే ఆలోచన మనస్సులోకి వచ్చిన వాడెవడయినా అస్పృశ్యుడే అవుతాడు!తనని ముట్టుకున్న ప్రతివాడికీ తననుంచి పవిత్రతని ప్రవహింపజెయ్యగలిగినవాడు మాత్రమే నిజమైన బ్రాహ్మణుడు కాగలడు!వెళ్ళు వెళ్ళు, అక్కడ వెలుగుతున్న కోలాహలాగ్ని దగ్గిర కెళ్ళు!ఈ మోసం,ద్వేషం,ఎక్కువ,తక్కువ,స్వార్ధం - అన్నింటినీ బైటికి తీసి కోలాహలాగ్నిలో తగలెయ్!ప్రతివాడినీ హృదయానికి హత్తుకో!కలం ఝళిపించి కొత్త పాట రాసెయ్!గొంతు పెకలించి కొత్త రాగం పాడెయ్!గజ్జె కదిలించి కొత్త చిందు వేసెయ్!చేతి కొద్దీ దరువెయ్!కాలి కొద్దీ ఎగిరెయ్!అలిసిపోయినా వెనకబడిపోకు, పక్కనే పానశాలలో సాకీ ఉంది!మధుపాత్ర నింపు, ఖాళీ చెయ్!అలుపు తీర్చుకుని మళ్ళీ వొచ్చిపడు!ఆడుతున్నవాళ్లకి చప్పట్లు కొట్టి వాళ్లని మరింత హుషారు చెయ్!పాడుతున్నవాళ్ళకి పక్కతాళం వేసి నువ్వు మరింత రెచ్చిపో!ఇప్పుడున్న గుడారం నచ్చకపోతే వెంటనే పక్కదాంట్లోకి వెళ్ళు!ఈ భోగయాత్రలో ఎవడికీ ఏ డేరానీ హక్కుభుక్తం రాసివ్వలేదు నేను!గొడవలొస్తే వెనక్కి తగ్గొద్దు!నువ్వు నాలుగు తిట్లు తిట్టు!నువ్వు నాలుగు తిట్లు తిను! ఏదయినా చెయ్యి గానీ, నువ్వు ఏడవొద్దు - ఎవర్నీ ఏడిపించొద్దు!

     ఏడుపే అసలైన చావు!అసలు చావనేది లేనే లేదు.నువ్వు చావనుకుంటున్నది చావు కాదు.నిన్నటి మీ తలిదండ్రులు ఇప్పటి మీ భార్యాభర్తలుగా బతికి ఉన్నారు.ఇప్పటి మీ భార్యాభర్తలు రేపటి మీ కొడుకూ కోడళ్ళలో కూతురూ అల్లుళ్ళలో బతికి ఉంటారు - కొత్తవాళ్ళకి చోటుకోసం పాతవాళ్ళని ఖాళీ చేయించే సత్రమిది, అంతే!ఈ గొలుసుకట్టును తెగనివ్వకు.నడుస్తున్న భోగయాత్రని ఆగనివ్వకు.ఏడుస్తూ బతికినా నవ్వుతూ బతికినా ఒకసారి చచ్చిపోయాక మళ్ళీ తిరిగి రావడం కుదరదన్నది సత్యం.యేది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!యేది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!

సత్యం శివం సుందరం!!!

Saturday, 20 February 2016

గతమెంతొ ఘనకీర్తి గలవోడ!చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ!!

          2001 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 79 మిలియన్లు!ప్రపంచం మొత్తం మీద ఫ్రెంచ్ మాతృభాష అయినవాళు 75 మిలియన్లు.ఆంధ్రప్రదేశ్.తెలంగాణ రాష్ట్ర్రాలు రెండింటిలో కలిపి  61 మిలియన్లు,తమిళనాడులో 3 మిలియన్లు,కర్నాటకా చత్తీస్ గడ్ మహారాష్ట్రల్లో ఒక్కో మిలియన్ చొప్ప్పున వ్యాపించి ఉన్నారు.లక్షద్వీప్ నుంచి ఒరిస్సా వరకూ తెలుగువాళ్ళు అసలు లేని చోటంటూ లేదు.ఈ మధ్యన తెలుగువాణి తరపున స.వెం.రమేష్ గారు ప్రపంచమంతటా చుడుతున్నారు తెలుగువాళ్ళ జాడలు కనిపెట్టటానికి.ఇప్పటికి శ్రీలంక, బంగ్లాదేశ్, బెంగాల్ లాంటి చోట్ల ఉన్న తెలుగువాళ్ల వివరాలు చదువుతుంటే చదువుతున్న ప్రతిసారీ అశ్చర్యం, ఆనందం, విషాదం అన్నీఒకేసారి ముప్పిరిగొంటున్నాయి నన్ను. ఆశ్చర్యం దేనికంటే, ఇన్నాళ్ళూ తెలుగువాళ్ళు అంటే ఒక్క రాష్త్రంలో ఉన్నవాళ్ళ గురించే వూహించుకుంటూ గడిపేశాం గానీ ఎక్కడెక్కడికి వ్యాపించిపోయారు మనవాళ్ళు అని. ఆనందం దేనికంటే ఇక్కడున్న తెలుగువాళ్ళలా "అండి","రి" గురించీ "చెప్పాలె","చెప్పాలి"ల గురించీ కొట్టుకు చావకుండా భాషని నిజంగా ప్రేమిస్తూ దాన్ని వొదులుకోకుండా ఉంటున్నందుకు. విషాదం దేనికంటే పాపం వీళ్ళంతా పొట్ట చేతపట్టుకుని పోయి ఇప్పటికీ దిక్కు లేనివాళ్లలా బతుకున్నందుకు. వాళ్ళు తమ మూల రాష్ట్రాల నుంచి అండ అవసరమైన కడుబీదవాళ్ళు - కానీ ఇప్పుడిక్కడ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఇద్దరికిద్దరూ తెలుగుదనం మీద ప్రీతి లేని బందిపోట్లు!

          పక్కనున్న తమిళనాడులో అక్కడి ప్రభుత్వం దుర్మార్గంగా వేధిస్తుంటే కోర్టులు కలగజేసుకుని ఆపినాయే తప్ప చీమ కుట్టినంతగా కూడా చలించని వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళ గురించి ఆలోచిస్తారా?అదీగాక వాళ్ళు వమెరికాల్లోనూ సింగప్పూరుల్లోనూ ఉండి రెండు చేతులా సంపాదిస్తూ బలిసిన వాళ్ళు కూడా కాదాయె - బుక్కా పకీరు వెధవలు, ఎందుకు పనికొస్తారు వీళ్ళు?కులము గల్గువాడు, గోత్రంబు గల్గువాడు, విద్యచేత విర్రవీగువాడు పసిడి గల్గువాని బానిస కొడుకులు అన్నాడు కదూ వేమన్న ఎప్పుడో! కులగోత్రాలను అడ్డుపెట్టుకుని గొప్పవాళ్ళవ్వాలని అనుకునేవాళ్ళూ, చదువుకున్నవాళ్ళం అని గొప్పగా చెప్పుకునేవాళ్ళూ పోయి పోయి డబ్బున్నవాళ్ళ చంకలు నాకడానికి ఎట్లా పోటీలు పడుతున్నారో ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాం గదా!అలా డబ్బు కోసం ఆత్మలని అమ్ముకునే వాళ్ళు ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ సంస్కృతిని మర్చిపోవడంలో ఆశ్చర్య మేముంది?చక్కని భాష  కానివ్వండి,మంచితనం కానివ్వండి, తరాల తరబడి కొనసాగించుకుంటూ రావలసిన జీవనవిధానం కానివ్వండి - ఈ దబ్బుపిచ్చి లేనివాళ్ల దగ్గిరే సజీవంగా ఉంటున్నాయి!

          మియన్మార్ దేశంలో ఎన్నో తెలుగు సమూహాలు ఉన్నాయి.1960ల వరకు స్కూళ్ళలో తెలుగు సబ్జెక్ట్ ఉండేది.మౌల్మీన్ నగరంలో ఒక వీధికి "మల్లెపూల దిబ్బ" అని పేరు పేట్టుకున్నారు, ఎంత బావుంది!.తూర్పు మియన్మార్ ప్రాంతంలో తైలంగ్ సమూహం ఉంది - బహుశా చోళుల కాలంలో ఇక్కడి నుండి వెళ్ళిన వారు కావచ్చు!వారి నోట వినపడే ఒక జోలపాటలో దూరాన ఉన్న తెలంగాణ అనే ప్రాంతం గురించి గుర్తు తెచ్చుకంటున్నట్టు ఉంటుంది. "తెలుగదేల యన్న దేశంబు తెలుగు" అన్న శ్రీకృష్ణదేవరాయలు మరొక మాట కూడా అన్నాడు,"తెలుగు తలచిన దేశంబు తెలంగాణ్యము" అని కూడా అన్నాడు.అయితే ఆ తెలంగాణ 2014లో ఏర్పడిన పదిజిల్లాల తెలంగాణ కాదు, మొత్తం తేలుగు మాట్లాడే అన్ని ప్రాంతాలనీ భాషాపరంగా కలిపేసి తెలంగాణ ఆని పిలిచేవాళ్ళు అప్పట్లో!

          ఇవ్వాళ ప్రాచీన భాష హోదా కోసం గోదాలో దిగి పోటీలు పడుతున్నభాషలలో ఏ ఒక్క భాషని గురించి కూడా ఎప్పుడు పుట్టిందో నిర్ధారణగా ఎవరూ చెప్పలేరు.నిర్ధారణగా చెప్పాలంటే ఆధారాలు కావాలి, అదీ లిఖిత పూర్వకమైనవి కావాలి.కానీ అసలు తొలి మానవుడు గొంతు పెకలించి కేకలూ,అరుపులూ,గర్జనలూ,ధ్వనుల నుంచి ఒక లయను సృష్టించుకుంటున్నప్పుడు అతను వెంటనే దాన్ని వ్రాసి చూసుకోవాలని అనుకోలేదు - కొత్తగా పుట్టిన నాలుగైదు మాటల్ని తేలికగానే గుర్తుంచుకోవచ్చు కదా!మెల్లమెల్లగా పదాల వాడకం పెరిగి భాష విస్తృతమైనాకనే లిపి అవసరమైంది. ఒక విచిత్రం చూడండి - ఒక భాష చాలా ముందుగానే పుట్టినా చాలా కాలం వరకూ లిపి ఏర్పారుచుకోకుండా ఉండిపోయి,మరొక భాష దాని తర్వాత పుట్టినా ముందు లిపిని ఏర్పాటు చేసుకుంటే రెండవది ముందు పుట్టిందని తీర్మానించితే మొదటి భాషకి అన్యాయం జరిగినట్టే కదా!కానీ ప్రస్తుతానికి భాషల ప్రాచీనతని కొలవడానికి అంతకన్నా శాస్త్రీయమైన పద్ధతి కూడా లేదు గాబట్టి ప్రాచీనతకి లిపినే తీసుకుంటున్నారు.అలా చూస్తే తెలుగుభాష వయస్సు 2,400 సంవత్సరాలు. 

          క్రీ.పూ 525 నాటి చోళ రాజుల శాసనాలలో మరాఠీ ప్రాకృతంలో కలిసిపోయిన కొన్ని తెఉగు పదాల ఆనవాళ్ళు కనబడుతున్నాయి.క్రీ.పూ 200 నుండి క్రీ.శ 200 మధ్యలో రచించబడినదని భావిస్తున్న గాధాసప్తశతి మహారాష్త్ర ప్రాకృత భాషలో ఉన్నదే అయినా అక్కడక్కడా కొన్ని తెలుగు పదాలు కూడా కనబడుతున్నాయి.గాధ అంటే ఇప్పటి అర్ధంలో మనం చెప్పుకంటున్న కధ అని కాదు.ప్రేమ,హాస్యం,వేదాంతం మొదలైన అన్నింటినీ స్పృశిస్తూ హుషారును పుట్టించే పులిసిన ఫ్రెంఛి మద్యం లాంటి తొలి వచన కవితా రూపం!ఇప్పటి హైకూల మాదిరి చిన్నవిగా ఉంటాయి.కానీ చెళ్ళున తగిలే చెణుకులోనూ భావంలోని విరుపులోనూ ఇప్పటి హైకూలు అప్పటి గాధల ముందు దిగదుడుపే!

          తెలుగు భాష మొదట్లో ద్రవిడ మూలం నుంచి ఎదిగినా మిగిలిన అన్ని ద్రవిడ భాషల కన్నా ఎక్కువగా సంస్కృతంతోనూ కలిసిపోయి దానికి దీటుగా నిలబడగలిగింది. ప్రపంచంలోని ఏ భాషకైనా రెండు రూపాలు ఉంటాయి - గద్యం, పద్యం.అయితే ప్రపంచంలోని భాష లన్నిటిలోనూ దేనివలన సంస్కృతం ప్రత్యేకంగా నిలబడుతున్నదో ఆ చందస్సుని ఒక్క తెలుగు మాత్రమే సమర్ధవంతంగా ఇముడ్చుకుని కావ్యరచనలో సంస్కృత సాహిత్యానికి దీటుగా నిలబడింది.నన్నయ్యకు పూర్వమే తెలుగులో చందోబద్ధమైన కవితారచన గొప్పగానే జరిగింది.కానీ కావ్యరచనయే జరగలేదు. ఆ లోటును పూరించడానికే నన్నయ భారతాంధ్రీకరణ మొదలుపెట్టాడు. దానికన్నా తెలుగుభాషకి నన్నయ చేసిన మహోపకారం ఒకటి ఉంది. తెలుగుకి ఒక శుద్ధమైన వ్యాకరణం వ్రాయటం - అందుకే ఆయనని వాగనుశాసనుడు అన్నారు!ముందుగా తరతరాలకూ తరగని వెలుగై నిలవాలంటే భాష ఎట్లా ఉండాలో తీర్చిదిద్ది ఆ తర్వాత దానిని ఇట్లా ఉపయోగించుకోవాలి అని మహాభారత కావ్యరచన ద్వారా కొత్తదారి చూపించాడు.తర్వాతి కవులందరూ ఆయన చూపిన దారినే నడిచారు.అందువల్లనే ఆయనని ఆదికవి అంటున్నది. అప్పటి కాలంలోనే మనవాళ్ళు వ్రాసిన ఒక పాలిండ్రోం చూదండి:

కాళిదాసళిదాయోమా చంద్రంతేరిపురంజకమ్ |
కంజరంపురితేంద్రంచ మాయోదాళిసదాళికా|

          కర్ణాటక సంగీతం మొత్తం దక్షిణ భారతదేశ మంతటా వ్యాపించినా వాగ్గేయకారులు ఏ ప్రాంతం వారైనా తమ కృతుల రచనకి సంస్కృతం తర్వాత తెలుగునే ఎన్నుకోవటానికి కారణం దీని అజంత మాధుర్యమే!వినడానికి ఇంత తియ్యగా ఉన్నప్పటికీ దీన్ని నేర్చుకోవడం మాత్రం చాలా కష్టం,ఎందుకంటే, ఇది అల్లాటప్పా భాష కాదు, దీని వ్యాకరణం విభక్తులు,ప్రత్యయాలు,సంధులు,సమాసాలు వంటివాటితో కూడి ఉండి అచ్చు కుందేళ్ళ వంటి చిన్న చిన్న సాధుజంతువుల నుంచి సింహశార్దూలమత్తేభాల వంటి పెద్ద పెద్ద క్రూరజంతువులతో నిండి ఉన్న గహనాటవిని తలపిస్తుంది మరి!సంస్కృతం తర్వాత అంత సుసంపన్నమైనదీ,సంక్లిష్తమైనదీ అయిన తెలుగుభాష మీద గట్టిపట్టును సాధించటం మట్టిబుర్రలకి ఒక పట్టాన సాధ్యం కాదు!

          తెలుగుభాష కున్న అసలైన స్పెషాల్టీ ఒత్తులండోయ్!రెండు మూడు రకాల ధ్వనుల్ని పలికే అక్షరాల్ని కూడా ఒక్కటిగా కలిపి మాట్లాడెయ్యొచ్చు, దాదాపు అన్ని భాషల్లోనూ సంయుక్తాక్షరాలు ఉన్నాయి గానీ తెలుగుకి ఈ ప్రత్యేకత లిపిలో కూడా ఉండటం మరింత అపురూపం!దీనివల్ల మనం వింటున్న ప్రతి ధ్వనినీ పలకగలం, రాయగలం, చదవగలం!తెలుగుభాషని దాని ఒత్తులూ గుణింతాలూ దీర్ఘాలతో సహా స్వచ్చంగా పలకగలిగితే ప్రపంచంలోని ఏ భాషనయినా దాని సొంత ఉచ్చారణతో చాలా తేలిగ్గా మాట్లాడవచ్చు.దీని మీదనే ఒక తెలుగు  పండితుడు మంచి పద్యం కూడా రాసేశాడు!

క్రమముగ "శ్రీమ త్సకల గుణ సంపన్న"
యని యున్న జదివెడు నఱవవాడు

కడగి "చిరిమదు చగల కుణ చంపన్న"
యని,కన్నడము వాడు యొనసి

"సిరిమతు సగల గోణ" యని తోడనే
"శంపణ్ణ" యని,మహారాష్ట్రుండు పని వడివడి

జెలగుచు "శ్రీమతూ సెకల గుణానె
సంపన్నాసె" యని,యోఢ్రభాషణుండు

వెలయు "శ్రీమొతో సొకొలొ గుణ సొంపన్నో"
యని,యికెన్ని వేల యన్య భాష
లాంధ్రు డున్నయట్లెయలరు బఠించు
నంచు హాస్యవేది యాడు నాడు....
                                                                                           - శ్రీ కొక్కొండ వేంకతరత్నం పంతులు గారు


          చూశారుగా, తెలుగుభాష వేళాకోళానికి పనికివచ్చినంతగా మరే భాషా పనికిరాదు:-)తెలుగు కున్న మరో స్పెషాళ్టీ సామేత లండోయ్!ప్రోవెర్బులనీ అవనీ ఇవనీ అన్ని భాషల్లోనూ ఉన్నాయి గానీ తెలుగు సామేతల కున్న ప్రత్యేకఫ భావాన్ని బట్టి పదాల ఎంపిక విపరీతమైన తేడా వచ్చేస్తుంది.హాస్యం చిలికే సామెతల్లో వచ్చే పదాలు గుర్తుకొస్తే చాలు చక్కిలిగింతలు పెట్టినట్టు ఉంటుంది.అదే తాత్వికమైన సామెతలు గుర్తుకొస్తే మనస్సు గంభీరంగా మారిపోతుంది!ఈ వైవిధ్యం తెలుగుకి మాత్రమే సొంతం.

          తెలుగుభాష కున్న మరో ప్రత్యేకత కొత్త పదాల్ని పుట్టించుకోగలగటం, ఇతర భాషల పదాల్ని ఇముడ్చుకోగలగటం.ఏ భాషలోని ఎలాంటి పదానికైనా సరే చివర్న ప్రధమా విభక్తి ప్రత్యయాల్ని అతికించేస్తే చాలు అసలది ముందునుంచీ తెలుగు పదమేనేమో అనిపించేటట్టు తెలుగు పదమై కూర్చుంటుంది!కొత్తపదాల్ని పుట్టించటానికి ఉదాహారణ చెప్పాల్సి వస్తే స్వర్ణయుగపు తెలుగు సినిమా మాటల రచయిత పింగళి నాగేంద్రరావు గారినే చెప్పాలి. తన ప్రతి సినిమాలోనూ పాత్రల పేర్లలో గానీ పాటల్లో గానీ పాత్రధారుల సంభాషణల్లో గానీ ఎన్నో కొత్త మాటల్ని పరిచయం చేశారు.

          వడ్డెర, చెంచు భాషలు తెలుగుకి కొంచెం దగ్గిరగా ఉంటాయి.తెలుగు భాష లోని కొన్ని ప్రముఖమైన యాసలు దొమ్మర,దాసరి,సాలెవారి,తెలంగాణి,వరంగల్,పాలమూరు,గద్వాల,నారాయణపేట,శ్రీకాకుళం,విశాఖపట్నం,తూర్పుగోదావరి,పశ్చిమగోదావరి,నెల్లూరు,ప్రకాశం,గుంటూరు,తిరుపతి.సాధారణంగా ప్రపంచంలోని ప్రతి భాషలోనూ మంచి సాహిత్యం తన జన్మస్థానంలోనే పుడుతుంది. కానీ తెలుగు జన్మభూమి,కర్మభూమి అనే భేదం లేకుండా ఎక్కడున్నా చిలవలు పలవలుగా సాహితీ నిర్మాణం జరిగిపోతుంది.దీనికి కారణం అతి తేలిక్గా మౌఖిక సాహిత్యాన్ని పుట్టించగలిగే వెసులుబాటు ఉండటం - తన వేదనకి సాంత్వన కోసం గొంతెత్తి పాడుకోవటానికి అనువైన భాషలో సాహిత్యం పుట్టటానికి నిరుపహతి స్థలములూ,రమణీ ప్రీయదూతిక తెచ్చి ఇచ్చు కప్పుర విడెములూ,ఇంకెవరో తొడిగే గండపెండేరములూ అక్కర్లేదు కదా!

          తెలుగు మౌఖిక సాహిత్యం కుల పురాణాలు,కొలువులు-గేయ కధలు,సామేతలు అనే మూడు విభాగాల్లోనూ ఎంతో అద్భుతమైన స్థాయిని అందుకున్నది. తెలుగునాట ఉన్న 196 కుల్లాల్లో ప్రతి కులానికీ అనుబంధంగా వారి కులపురాణం ఉంది.గౌడ కులస్తులకు గౌడ పురాణం, చాకలి కులస్తులకు రజక పురాణం - ఈ కుల పురాణం ప్రతి కులం వారికీ తమ తమ సంప్రదాయిక విధుల్ని శాస్త్రోక్తంగా నెరవేర్చుకోవటానికి చాలా అవసరం.ఎవరో ఒకరు నిష్ణాతుడైన వ్యక్తి గానం చేసే పద్ధతిలో 3 గంటల నుంచి 14 రాత్రుల పాటు గానం చెయ్యగలిగిన విస్తృత స్థాయిలో ఈ కులపురాణసాహిత్యం ఉన్నది.దీనిని బట్టి ప్రస్తుతం మనం నమ్ముతున్నట్టు ప్రతి కులం వారూ తమ కులం మిగతా కులాల కన్నా తక్కువస్థాయిది అని అనుకోకుండా తమ కుల వారసత్వం పట్ల ఒక రకమైన గర్వాన్ని కలిగి ఉండేవారని అర్ధమవుతుంది!కొలువులు అంటే దేవతలకి జరిగే జాతరల వంటి ఉత్సవాలలో ప్రత్యేకించి ఆ దేవతని కొలుస్తూ పాడే పాటలూ, చెయ్యాల్సిన పూజల సంగతులూ ఉంటాయి.ఇక్కడ దేవత,సన్నివేశం,సాహిత్యం - ఈ మూడింటిలో దేన్నీ విడదియ్యలేనంత చిక్కురొక్కురుగా అల్లేసిన సాహిత్య రూపం కొలువు దరువు!ఈ మౌఖిక సాహిత్య సృష్టికర్తలలో ఉన్న ముఖ్యవిశేషం ఆవసరమైన చోట గీర్వాణ భాషనీ,గ్రాంధిక  రూపాల్నీ కూడా ఏమాత్రం నదురూ బెదురూ లేకుండా వాడుకోగలగటం!బుర్రకధలు,హరికధలు చెప్పేవారిలో కొందరు పౌరాణిక కధల్ని సంప్రదాయిక పండితుల కన్నా గొప్పగా వ్యాఖ్యానిస్తూ చెప్పగలగటం మనకు తెలిసిందే కదా!నిజానికి ఒక చందోబద్ధమైన కావ్యరచన కన్నా ఒక మౌఖిక సాహిత్య రూపాన్ని సృజించటానికే ఎక్కువ ప్రతిభ కావాలి.

          తెలుగుభాషకీ నేటి కాలపు తెలుగు,కన్నడ ప్రాంతాలను పరిపాలించిన ఆంధ్రశాతవాహనులకీ అవినాభావ సంబంధం ఉంది.మౌర్యులకు సామంతులైన వీరు మౌర్యుల మాదిరిగానే బ్రాహ్మీ లిపిని ఉపయోగించారు.దాదాపు చాలా ద్రవిడ భాషలు బ్రాహ్మీ లిపి నుంచే తమ భాషలకు లిపిని తీర్చి దిద్దుకున్నాయి.వాటిలో తెలుగుభాష ఒక్కటే తన లిపిని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుకోగలిగింది - ఈ అక్షరాల్ని చూస్తుంటేనే వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లల వలె ఎంతో ముద్దొస్తూ ఉంటాయి!



          ప్రతి అక్షరానికీ తిక్క లేని ఒక లెక్క ఉంది - అచ్చులు,హల్లులు అని రెండు ముఖ్యమైన వర్గాలు ఉన్నాయి. వీటిలో మళ్ళీ ఉచ్చారణలో నాలుక దేన్ని తగులుతుందనే దాన్ని బట్టి చేసిన దంత్యములు, తాలవ్యములు, ఓష్ఠ్యములు అనే మరొక విభజన కూడా ఉంది.సున్నా,అరసున్నా,విసర్గలు కూడా భావవ్యక్తీకరణలో ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకుని ఉండేవి.అరసున్నాని ఇప్పుడెవరూ వాడటం లేదు గానీ ఒకప్పుడు దీనినీ విరివిగానే వాడేవాళ్ళు.పండితులు సభదీర్చి తీర్మానం చేసి దీనిని తొలగించదల్చినప్పుడు ఒక పండితుడు ఎలిజీ రాసి మరీ దుఃఖించాడు!

          జంతుశాస్త్రం చెప్తున్న దాని ప్రకారం ఇండియన్ అయినా,అమెరికన్ అయినా,రష్యన్ అయినా,చైనీస్ అయినా,జపనీస్ అయినా అందరూ ఒకే జాతి - మానవ జాతి.కానీ ఈ మానవ జాతిలో ఇవ్వాళ ప్రత్యేకించి విడదీసి జాతులుగా చూస్తున్న మానవ సమూహాల్లో ప్రతి జాతికీ ఒక మాతృభాష ఉంటుంది!రాజకీయంగా,సామాజికంగా ఎలాంటి స్థితిలో ఉన్నా ఈ భాషకి సంబంధించిన అస్తిత్వాన్ని కోల్పోవడం రెండు విధాలుగా మాత్రమే జరుగుతుంది - ఒకటి ఆ జాతి పూర్తిగా నశించిపోవడం,రెండు ఆ జాతి మరొక జాతి అధిపత్యంలోకి వెళ్ళడం!ప్రపంచంలో ఒకప్పుడు ఉండి ఇప్పుడు లేని సంస్కృతుల చరిత్రలలో ఎక్కువగా ఇదే జరిగింది.తెలుగుభాషకీ తెలుగుజాతికీ ఈ రెండింటిలో ఒకటి గానీ మూడవది గానీ అయిన దుర్గతి పట్టగూడదని కోరుకుంటున్నాను.దానికి మనం చెయ్యవలసింది స.వెం.రమేస్ లాంటివారికి మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వడం.ఆంధ్ర - తెలంగాణ రాష్ట్రాల లోని ప్రజలు రాజకీయ నాయకుల విద్వేష ప్రసంగాలకి ఉద్రేకపూరితులు కాకుండా ఈ రెండు రాష్ట్రాల లోనే కాదు ప్రపంచంలోని అన్నిచోట్లా ఉన్న ప్రతి తెలుగు సమూహం గురించీ ఆలోచించాలి. వారిలో కొందరు మనకన్నా ఎంతో అధ్వాన్న స్థితిలో ఉన్నారు. మన ప్రభుత్వాల నుంచి సహాయాన్ని కోరుకుంటున్నారు.అంతటి అధ్వాన్న స్థితిలో ఉండి కూడా వారు తమని పలకరించటానికి వచ్చిన సాటి తెలుగువాళ్ళని ఆప్యాయంగా పలకరిస్తుంటే వారికన్నా ఎంతో కొంత మెరుగైన స్థితిలో ఉన్న మనం ఇక్కడ చిన్న చిన్న విషయాలకే ఒకరినొకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ సతమతమైపోతున్నాం!

          రాష్ట్రాన్ని విడదీసిన వాళ్ళు మీలాంటి నాలాంటి ప్రజల గురించి ఆలోచించి విడదియ్యలేదు - పై స్థాయిలో చేతులు మారే వేల కోట్ల విలువ చేసే కాంట్రాక్టులను ఎవరు దక్కించుకోవాలన్న లెక్కలతో కొందరూ,ఒక రాష్ట్రం రెండయితే అదనంగా సృష్టించబడే రాజకీయ పదవుల కోసం కొందరూ - తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు చేశారు. అందుకే మనల్ని రెచ్చగొట్టి విద్వేషాలు పెంచిన అన్ని పార్టీల వాళ్ళూ ఇప్పుడు పదవుల్ని పంచుకోవడం కోసం వాళ్ళలో వాళ్ళు అంత ఐకమత్యంగా కలిసిపోగలుగుతున్నారు - కళ్ళు తెరుచుకుని చూదండి!ఈ మేకమెడచంటిపాల కోసం ఎంత ఆశపడినా లాభం లేదని త్వరలోనే తేటతెల్ల మవుతుంది ఎల్లరకూ!ఏ మనిషి ఏ దేశంలో ఏ కాలంలో వృద్ధిలోకి వచ్చినా అతని నైపుణ్యమే కారణం. మీలోని నైపుణ్యాన్ని పెంచుకోండి,అది ఆర్జనని పెంచుతుంది,అది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది - అప్పుడు ఈ విభేదాలూ ద్వేషాలూ వాతంతటవే మాయమై పోతాయి.ఆ రోజున వెనక్కి తిరిగి చూసుకుంటే అనవసరంగా ఆవేశపడ్డామని పశ్చాత్తాపపడకుండా ఉండటానికయినా ఈరోజున కొంచెం విచక్షణతో ప్రవర్తించండి!

మనుషుల్ని కలపటానికి పుట్టిన భాషని మనుషుల్ని విడదియ్యటానికి వాడటం పైశాచికత్వం!

Thursday, 11 February 2016

ఏది ప్రణయ మేది ప్రళయం - ఏది సాధుజీవనవైభవం?

ప్రణయం అంటే మనసుల్ని కలిపేది - హాయి నిస్తుంది,అవునా?
ప్రళయం అంటే తనువుల్ని నలిపేది - చావు తెస్తుంది,అవునా?

ఒకరికి ఒకరై ఒద్దికగా కలిసుంటేనే అది దాంపత్యం,అవునా?
ఎవరికి వారై దారులు వేరైతే బలవంతపు తద్దినం,అవునా?

"జనం కోరింది మనం శాయడమా?మనం చేసింది జనం చూడడమా?" అని పింగళి డింగరి శిస్యుణ్ణి అడిగాడు!
"కోరికల వెంట అడ్డదిడ్డాన పరిగెత్తడమా?కోర్కెలకి కళ్ళెమేసి రహదారిన పోవడమా?"  -  చిచ్చరపిడుగు ప్రశ్న?

శృంగారం రుచిచూపించి బాలచంద్రుణ్ణి తన కడకొంగున కట్టెయ్యడమా?
రసభంగం చేసి తన పతిదేవుణ్ణి హంవీర చూడామణిగా నిలబెట్టడమా?
మగువ మాంచాలకి కలిగిన సందేహానికి కన్నతల్లి చెప్పిన ధర్మసూక్ష్మం -
ఒకటి నీ సౌభాగ్యాన్ని నిలబెడుతుంది, ఒకటి నీ భర్త శౌర్యాన్ని నిలబెడుతుంది,
అయితే ఇట్లాంటివి పరులు నీమీద రుద్దరానివి గనక నీకు నువ్వే తేల్చుకో అని!
మాంచాల రెండవది కోరుకున్నది గనకనే దంపతు లిద్దరూ ధన్యజీవు లయ్యారు,లేకుంటే?!

భర్త సానిని మరిగాడని తనూ తప్పుదారిన నడిస్తే మాంచాలని ఇప్పుడెవరు తలిచేవారు?
మాల కొంపల్లోనూ మహా పతివ్రత లుంటారు రాచ కుటుంబాల్లోనూ రంకులాడు లుంటారు!
సతీత్వం పుట్టుకతో రాదు - ఋణమూలం,నదిమూలం,స్త్రీమూలం ఎప్పుడూ అడగకూడదు.

మనసునూ తనువునూ కలిపి మగనికి అంకితమిచ్చిన మగువ పతివ్రత గాని
మనసును చంపి తనువును పదిమందికి పంచిన మగపోడుముల పడతి కాదు.

మనసు నొకనారికే అంకితమిచ్చి ఆలిని రాణిని చేసినవాడల్లా రాముడు గాని
కులకాంతను కాలదన్ని సానుల కోసం పోయేవాడు అసలు పురుషుడే కాడు.

స్వాధీన మనస్కులు కానివారు కోరికల పద్మవ్యూహంలోకి దూకి క్షేమంగా బయటపడే దెట్లాగ?
హరోంహర యని నైతికపతనపు అగ్గిలో దూకినాక చివరకు మిగిలేది గాలికెగిరే బూదియే కదా!

వస్తువాహనాల్లో వైభవాల్ని లెక్కిస్తే అవి పగిలిపోయినప్పుదు దుఃఖం కలుగుతుంది.
మనుషుల్ని దబ్బుని బట్టికాక దమ్ముని బట్టి తూచినప్పుడు దుఃఖం తొలగుతుంది.
మనసున పుండై పరులకు పండై జలపాతంలా కాక సెలయేరులా బతికేది సాధుజీవనవైభవం!

Monday, 1 February 2016

నీ ప్రేమ నాకు భవరాగ బంధమోక్షణం!శ్రీ రుక్మిణీనాధ, నీ ప్రేమ నాకు దివ్యౌషధం!

పల్లవి:నీ ప్రేమ నాకు భవరాగ బంధమోక్షణం!
            శ్రీ రుక్మిణీనాధ,నీ ప్రేమ నాకు దివ్యౌషధం!

చరణం 1:  ఆలుబిడ్డలు అన్నదమ్ము లైనాను
                   బ్బుదస్క ముంటేనె ఇష్టంగ వస్తారు
                   డబ్బు లేని కాలాన దూరంగ పోతారు
                   నన్ను మెచ్చనివారి రాకపోకలు లెక్కజెయ్యను
                   నువ్వు నాకు దూరమైతేనె నీరసించి అణగారి అల్లాడిపోతాను - హరిఓం!
||పల్లవి||
చరణం 2:  చచ్చీ చావక బతికే బానిసీడులు కొందరు
                   చచ్చీ చావక నిలిచే పుణ్యమూర్తులు కొందరు
                   మందిని చంపి పెరిగే ధూర్తజనులు కొందరు
                   కాలాని కెదురీది దేహధారు లెవ్వరు బతకలేరు
                   నువ్వు చూపిన దారిలో నడిస్తేను అందరి బంధువులై నిలుస్తారు- హరిఓం!
||పల్లవి||
చరణం 3:  తన్ను కాదన్నాదని ముఖాన్ని మైలజేసి పాడుజేసేది
                   తన పక్కకు రాలేదని ఇంకెవ్వరి పక్కకు పోనివ్వనిది
                   తను మెచ్చింది తనకే దక్కాలనేది సహజప్రేమ కాదు
                   మెచ్చినది పచ్చగ ఉండాలని కోరుకునేది గొప్పమనసు
                   బతికించేది తప్ప చంపిపాతరేసేది దౌర్జన్యప్రేమ నాకొద్దు నాకొద్దు - హరిఓం!
||పల్లవి||
చరణం 4:  గట్టిగ రాసిన పరిక్ష తన్నేసిందని చచ్చేటివాళ్ళు
                   మెచ్చిన పడుచు పక్కకు రాలేదని చచ్చేటివాళ్ళు
                   హెచ్చుగ భోగాలు ఒరిగిపడలేదని చచ్చేటివాళ్ళు
                   నీ తత్వ మెరుగలేరు నిన్నెన్నడు కనుగొనలేరు
                   నిన్ను నమ్మిన వాడెవ్వ డనాధ కాడు, నన్ను మాత్రమట్లు చావనీకు - హరిఓం!
||పల్లవి||
చరణం 5:  ఆకలిదప్పులకు మాడి చావనివ్వకు
                   ఆలుబిడ్డల దుఃఖము చూడనివ్వకు
                   తీర్చలేని అప్పుల బారిన పడనివ్వకు
                   రాకపోకల మర్యాదలందు లోటు రానివ్వకు
                   తిండీబట్టాఇల్లూపరువు లివ్వుచాలు నిన్ను పొగుడుకుంటు కాలం గడిపేస్తాను - హరిఓం!
||పల్లవి||
-----------------------------------------------------------------------------------------------------------------
(01/02/2016)

Thursday, 21 January 2016

ఏవి తల్లీ నిరుదు కురిసిన హిమ సమూహములు?లేవు నాకు ఉగాదులు ఉషస్సులు లేవు!

పెట్టుబడిదారీ విధానం - శ్రామీక వర్గ నియంతృత్వం
బ్రాహ్మణాధిక్యత - దళిత అనుకూల ప్రభుత్వం

స్త్రీక్ నిజమైన శత్రువు పురుషుడు కాదు - స్త్రీయే
కార్మిలులకి నిజమైన శత్రువులు తమలోని లుంపెన్ ప్రొలెటేరియట్లే
దళితులకి నిజమైన శత్రువులు బ్రాహ్మణులు కాదు - దళిత నేతలే
హిందువులకి నిజమైన శత్రువులు ఇతర్లు కాదు - హిందువులే

పెట్టుబడిదారు .> శ్రామికుడు = కమ్యునిజం
బ్రాహ్మణుడు -> దళితుడు = దళిత వాదం
పురుషుడు -> స్త్రీ = స్త్రీవాదం

ఆస్తికులు - నాస్తికులు
హిందువులు - ముస్లిములు
శైవులు - వైష్ణవులు
ముస్లిములు - క్రైస్తవులు
షియాలు - సున్నీలు
ప్రొటెస్టెంటులు - క్యాదలిక్కులు
కమ్యునిష్టులు - నాన్ కమ్యునిష్టులు
లెఫ్టిస్టులు - రైటిస్టులు

రోమిల్లా ధాపర్ - కమ్యునిష్టు ఎజేండాతో ఆర్య ద్రావిడ అభూత కల్పన చేసి చరిత్రకి బొక్కలు వెయ్యటం
ముప్పాళ రంగనాయకమ్మ - ఇల్లు కదలకుండా పాప్యులారిటీ తెచ్చుకోవటానికి హిందూ పురాణాల అవహేళన
కంచె ఐలయ్య - కులరహితసమాజం కోసం అనే వంకతో కులసమీకరణాల సాంకేతిక జ్యోతిష్యం చెప్పటం

ఆంధ్రా అధిపత్య వర్గాల దోపిడి - తెలంగాణ విభజన
అధిపత్య ప్రాంతం వారి జులుం - రాయలసీమ విభజన

విద్యార్ధి సంఘాలు
అరాచకవాద బీజాలు

కొన్ని వేలమంది ఈ దేశపౌరుల్ని చంపిన యాకూబ్ మెమన్ కోసం ప్రార్ధనలు చెయ్యటం
ఆ దుడుకుతనాన్ని నిరసించినందుకు సామూహిక దాడి చేసి ఆస్పత్రి పాలు చెయ్యటం

విశ్వ విద్యాలయాలు 
శవ రాజకీయాలు

ఆత్మహత్య చేసుకున్న ప్రతివాడూ దళితుడేనా?
ఉరి తియ్యబడ్డ ప్రతివాడూ అమరవీరుడేనా?
అయితే యాకూబ్ మెమన్ పేరుతో అభిమాన సంఘాలు పెట్టడం,
అతన్ని కూడా అంబేద్కర్ సరసన నిలబెట్టడం ఒక్కటే మిగిలి ఉంది.
అది కూడా చేస్తే శుద్ధక్షవరం లాంటి పతనంలో ఆఖరి దశ కూడా పూర్తవుతుంది!

దొంగలంజెకొడుకు లసలే మెసిలే ఈ ధూర్తలోకంలో
తలవంచుకు వెళిపోవడమేనా అమాయకులకి మిగిలింది?!

Saturday, 12 December 2015

ఇద్దరిదీ నీలివర్ణమే, అంతవరకే పోలిక!బుధ్దుల్లో,ముఖ్యంగా చేతల్లో ఎన్ని తేడాలు?అయినా ఐద్దరూ ఒకటే నట - ఏమిటో ఈ గందరగోళం?!

     ఒకాయన దర్జాగా రాజుగారి ఇంట్లో రాణీగారి కడుపున పుట్టి మనిషిలా బతికి చూపించాడు!ఒకాయన గర్భవాసం జోలికే పోకుండా అధాటున వాళ్ళ ముందు కొచ్చేసి కనబడ్డమే 12 యేళ్ళ పిల్లాడిగా కనబడి "నేను మీకు కొడుకునౌతున్నానోచ్" అని చెప్పి తిన్నగా శిశువై ఒళ్ళోకి దూరాడు!

     ఒకాయన బుధ్ధిమంతుడల్లే క్లాసులో ఉన్నాడా అనిపించేటట్టు ఉన్నా చదవాల్సినవన్నీ చదివేసిన సైలెంటు బాబు!ఒకాయన సాటి పిల్లలకి లీడరైపోయి అల్లరి చేస్తూ వెన్న దొంగతనాలు చేస్తూ వాళ్ళతో చల్దులారగిస్తూ ఈ పిల్లాడు దేముడేంటీ అని బ్రహ్మ దేవుడికి కూడా అనుమానమొచ్చేలా పెరిగిన వైలెంటు బాంబు!

     ఒకాయన ఏకపత్నీవ్రతమనే కఠినాతికఠినమైన నైతికనియమాన్ని తనకి తనుగా చేపట్టి తనయంతట తనుగా వలచి వచ్చిన ఎలనాగను కూడా కాదని తోసిపుచ్చి పుంసాం మోహనరూపాయ అని పొగిడించుకోగలిగిన శీలవంతుడు!ఒకాయన చిన్ననాడే వ్రజభామినులకి మగపోడుముల ముచ్చటైన తాకిడిని కూడా రుచిచూపించి ఏ వనిత కా వనితకు తానొక్కడినే అయినట్టు ఆమెకే సొంతమయినట్టు చెలరేగిపోయిన అష్టమహిషుల మనోహరుడు!

     ఒకాయన సరిగ్గా రేపు పట్టాభిషేకం అనగా ఇవ్వాళ వనవాసానికి వెళ్ళమన్నా కొంచెం కూడా బాధపదకుండా తండ్రి నన్ను ఖైదు చేసి రాజువికా అని హింటు ఇచ్చినా నాకఖ్ఖర్లేదని అదవులకి వెళ్ళగలిగిన త్యాగశీలియైన జగదేకధనుర్ధరుడు!ఒకాయన అప్పటిదాకా తను ఆడి,పాడి,అల్లరి చేసిన వ్రజభూమి తనది కాదు అని తెలిసినప్పుడు కూడా ఇతర్లని ఓదార్చాడే తప్ప తను కన్నీరు పెట్టకుండా ఉండగలిగిన స్థితప్రజ్ఞుడైన గీతాచార్యుడు!

     ఒకాయన వీళ్ళు క్షమించరాని తప్పు చేశారు అనుకున్నవాళ్ళని తను స్వయంగా పూనుకుని కోదండధారియై వధించి ధృఢవిక్రము డనిపించుకున్నాడు!ఒకాయన తన శత్రువుల్ని కూడా వాళ్లతో వీళ్ళతో చంపించి తన చేతికి మట్టంటకుండా చూసుకుని యోగీశ్వరు డనిపించుకున్నాడు!

     ఒకాయన చిన్న తప్పు చేసిందని తను ఎంతగానో ప్రేమించి తనని తప్ప ఇంకెవ్వర్నీ పెళ్ళి చేసుకోనని వ్రతం కూడా పట్టినవాడు, ఆ ఒకే ఒక్క భార్యని పదిమందిలో అవమానించేశాడు - నిన్నసలు భార్యగానే స్వీకరించను పొమ్మనేశాడు!ఒకాయన పెళ్ళాం కాలితో తన్నినా సహించి "అయ్యయ్యో కఠినమైన నా తలకి తగిలి సుకుమారమైఅన్ నీ కాలుకి గాయం అయ్యిందేమో!" అని గారాబం కూడా చేసి ఆమె కోరుకున్న పువ్వు కోసం చెట్టునే కొట్టుకొచ్చేశాడు!

     ఒకాయన భార్య మీద బెంగతో పొర్లిగింతలు పెట్టి యేడ్చి తమ్ముడు ఓదారిస్తే తేరుకుని మానవప్రయత్నంతోనే తన కార్యం సానుకూలం చేసుకుని ఆదర్శవంతమైన ప్రవర్తనతో జీవితం గడిపి విగ్రహమాన ధర్ముడైనాడు!ఒకాయన చిన్నప్పట్నుంచే ఇతరుల సంకల్పాల్ని నియంత్రించడం అనే ఒక్కటి తప్పించి అన్నిరకాల అతిమానుష శక్తుల్ని చూపించి తనకు తనే దేవుడినని ప్రకటించుకుని విశ్వరూప ప్రదర్శన కూడా చేసి లీలా మానుష విగ్రహధారియైనాడు!

అయినా ఇద్దరూ హిందువులకి సమానంగానే పూజనీయు లయ్యారు - రామ రామ కృష్ణ కృష్ణ!"ఏ యుగాని కైనా ఏ జగాని కైనా రాముడే దేవుడు" అని కొందరు కీర్తించారు."బృందావన మది అందరిదీ గోవిందుడు అందరివాడే" అని కొందరు కీర్తించారు.ఎవర్ని ఫాలో అవాలి?ఎవర్ని సారీ అనాలి?ప్రశాంతంగా "కృష్ణా రామా" అనుకోనివ్వకుండా ఈ హరిబాబొకడు ఇన్ని మడతపేచీలు పెట్టాడు, ఇదేం ఖర్మరా దేవుడా?

తెలియని వాళ్ళకి ఎప్పటికీ తెలియని గందరగోళం?తెలిసిన వాళ్ళకి తెలిసినకొద్దీ పెరిగే భక్తిచైతన్యం!

Tuesday, 29 September 2015

శ్రీ రాఘవం!శ్రీ మాధవం!ఆశ్రిత జన మనోహరం!!

-----------------------------------------------------------------------------------------------------------------
గద్య కవిత
-----------------------------------------------------------------------------------------------------------------
ఒక్కొక్క జీవుని యందొక్కొక్క వేదన?

ముజ్జగాల కెల్ల
ముచ్చటైన కరిమేని సొంపువాడు,
సరిలేని రాజసాన ముజ్జగాల నేలెడువాడు!
ఆతదహో!జగదేకధనుర్ధరధీరమతి కరుణాసింధు
వార్తత్రాణపరాయణు డఖిలాండకోటిబ్రహ్మాండనాయకుడు,
మా చూడి కొడుత్త నాంచారు ప్రియవిభుడతడు!

యేమి వేణుగానమది!
నవ రంధ్రముల ఈ తనువా మోవిని తాకి
యెద ఝల్లుమని పులకించి ఇటు రవళించినదో?
లోకాల పాలించుగోపాల బాలుని  
పేదవులు తగిలిన ఆ వెదురు జన్మ మెంతటి ధన్యమో గద!
అంతటి భాగ్యమీఎ జడున కెన్నడు కల్గునో గద?

ఇట్టిది నా జీవుని వేదన!
-----------------------------------------------------------------------------------------------------------------
పద్య కవిత
-----------------------------------------------------------------------------------------------------------------
సీ||యేమి వేణువది?ఆ మోఅహనరవళి ఎ
       చటినుండి తీగలు సాగుతున్న

       దో గద!అంగిలి తాకని సవ్వడి
       నవరంధ్రముల ఈ తనువున యేల

       పుట్టెను?ఆ మోవియొకవేళ తగిలి యె
       డద ఝల్లుమనగ ఇటు రవళించె

       నో?లోకపాలకుదౌ గోపాలబాలుని
       పేదవులు తగిలిన వెదురు జన్మ

తే||మెంత ధన్యమో గద!మరి అంత భాగ్య
      మీ జడున కెప్డు కల్గునో?మాయదారి
      పిల్లగాడొక డూదిన పిల్లగోరు
      కాదు - జీవుల కడతేర్చు గానమోయి?!

సీ||అంతర్యామి!సుజన మంగళకరుడు!ము
       చ్చట గూర్చు కరిమేని సొంపువాడు!

       ఆతడహో,జగదేక దనుర్ధర
       ధీరమతి కరుణాసింధు వార్త

       త్రాణపరాయణు డఖిలాందకోటి
       బ్రహ్మాండనాయకుడు!అంతకుల వైరి!

       సరిలేని రాజసాన నఖిల లోకాల
       నేలెడు వాడు!తనే మనిషిగ

తే||వచ్చి పెద్దాయన నడిగి వేడ్క పెండ్లి
      యాడి మా చూడికొడుత నాంచారు కెంతొ
      నచ్చిన నిజవిభుడతడు!అతని నేన
      డిగెద నక్షయసౌఖ్యాల నెల్లరకును?!
-----------------------------------------------------------------------------------------------------------------

Sunday, 28 June 2015

ఇప్పుడిక్కడ రెండు చీలుదారుల శృంగాటక జంఝాటంలో ఇరుక్కుని ఉన్నాం!?

ఇప్పుడిక్కడ రెండు చీలుదారుల శృంగాటక జంఝాటంలో ఇరుక్కుని ఉన్నాం మనం.దేన్ని యెంచుకోవటమా అనేది తప్పనిసరి మొహమాటాల్తోనూ కీర్తిప్రతిష్ఠల వ్యామోహాల్తొనూ నిర్ణయించుకోవాల్సిన పని లేదు - అంత గందరగోళమూ లేదు!దేనికి దానికి ఖచ్చితమైన లాభనష్టాల మదింపు - ఈ యెంచుకున్న దారిలో నడవాలంటే ఏ దుర్గుణాల్ని ప్రయత్నించి వొదుల్చుకోవాలి,ఏ మంచి లక్షణాల్ని నేర్చుకుని సాధించాలి అనే అవగాహన  - స్పష్టంగానే ఉంది.

ఒక దారి - వ్యామోహాల వల్ల కలిగే భీభత్స విషాదాల్తో కలగుండువడి తలదించుకు తిరగాల్సిన నిత్య నిరంతర దాసత్వం - రాజీ మార్గం.ఈ దారిలొ నడిచేవాళ్లు తలని మోకాళ్ళ మధ్యకి చేర్చుకుని గూని గొడుగులా వంచుకుని యెదురైన ప్రతి అడ్డగాడిదకీ వంగి వంగి సలాములు చేస్తూ ఇతర్ల కాళ్లకి అడ్డం పడకుండా చూసుకుంటూ తన కాళ్ళని అడ్డదిడ్డంగా ఝాడిస్తూ నడవాల్సి ఉంటుంది,తప్పదు!ప్రతివాడూ తన వ్యక్తిత్వాన్ని కొంచెం కొంచెం కించపరుస్తున్నా నవ్వుతూ భరించగలిగితే యెంతటి అవమానానికైనా తిరుగుబాటు చెయ్యని నిరపాయకరమైన వ్యక్తి అని నమ్మించగలిగితే మంచివాడూ మాననీయుడూ అనే బిరుదుల్ని ఇవ్వడం జరుగుతుంది.

నీ దగ్గిరున్నదాన్ని గుంజుకునేటప్పుడు నీకు నెప్పి తెలియకుండా ఇచ్చే ఆ ఘనమైన పొగడ్తలన్నీ నిన్ను బాగానే సంతృప్తి పరుస్తాయి.అప్పుడప్పుడూ నీ కన్నా చవటల దగ్గిర్నుంచి లాక్కుని "అప్పుడప్పుడూ నేనూ సమర్ధుణ్నే సుమా!" అని నువ్వూ మురిసిపోవచ్చు.స్వతంత్రంగా దేనికీ ప్రయత్నించకపోవటం వల్లనూ యే గొప్ప పనికీ నాయకత్వం వహించకపోవటం వల్లనూ తీరిగ్గా వైఫల్యాల గురించి బెంగపెట్టుకోవాల్సిన సన్నివేశమేదీ యెదురుకాకుండానే హాయిగా కాలం గడిచిపోతుంది - అది చాలు నీకు!పరిస్థితులు యెంత ప్రతికూలంగా ఉన్నా శీతలరక్తజంతువుకి మల్లే చక్కగా సర్దుకుపోగలిగి ఉండి స్థిమితమైన బతుకును కోరుకునే ప్రశాంతమనస్కులకి ఈ దారి అత్యంతమొ భద్రత నిస్తుంది.

కానీ,స్వాభిమానం ఆబిజాత్యం లాంటి ఉన్నత లక్షణాల్ని గురించి మాత్రం ఆలోచించకూడదు.అవమానాలకి రోషపడి ప్రతిఘటించటం లాంటి అలవాటు లేని దుందుడుకు పనులు కొత్తగా మొదలు పెట్టిన మరుక్షణమే నీ జీవితంలో ఒడిదుడుకులు మొదలవుతాయి,జాగత్తగా ఉండు!నీ శక్తికి మించిన కష్టాలు యెదురవడం వల్ల నీ బౌధ్ధికపునాదులు కదిలిపోవచ్చు - కనుక తార్కికంగా ఆలోచించడం ఈ దారిలో వెళ్ళడానికి లాభసాటి కాదు?!

మరో దారి - ఠీవిగా రొమ్ము విరుచుకుని శిరస్సు నిఠారుగా నిలబెట్టి అడుగులు ధాటిగా వేస్తూ ఆత్మాభిమానం గలవారు మాత్రమే నదవగలిగిన త్యాగభరిత జీవనం - రాజమార్గం!ఈ దారిలో నడిచేవాళ్ళు దృష్టిని దిగంతాల వరకు ప్రసరిస్తూ ఎవరికీ అతివినయాలు చూపకుండా స్థిరమైన గమనంతో కదలగలుగుతారు.ఐతే,చూపు ప్రసరించినంత మేరలో కనిపించే యెంత చిన్న అంశాన్నీ నిర్లక్ష్యం చెయ్యని సమదర్శిత్వం ఉండాలి.ఇంకా క్రిందటి క్షణం వరకూ మనం ప్రాణాధికంగా ప్రేమించిన దేన్నైనా సరే క్షణమాత్రపు సంకల్పంతో ఆ అర్వాత మరెన్నడూ దాన్ని వదిలినందుకు బాధపదకుండా త్యజించగల నిర్మోహత్వం అలవర్చుకుంటే అది కొన్ని సందిగ్గ్ధ క్షణాల్లో అక్కరకొస్తుంది.

ఈ దారిలో కదలడమంటే వ్యామోహాల్ని జయించి - ఒక పధ్ధతీ పాడూఒ లేని సామాజిక స్థితి మన వ్యక్తిత్వాల మీదకి విసిరే - ప్రలోభాల్ని తప్పించుకుంటూ సాధ్యపడినప్పుదు తోటివార్ని కూడా ఉచ్చుల్లోంచి బైటపడేస్తుండటం గనక ఇతరుల మీదకి వలలు విసిరి తమ ఉచ్చుల్లో చిక్కుకున్న అమాయకుల్ని పీల్చిపిప్పి చెయ్యడమే జీవనోపాధిగా పెట్టుకున్న వారు అక్కసుతో నిన్ను ణౌతికంగానూ మానసికంగానూ హింసకి గురి చెయ్యవచ్చును కూడా!అందుకు సిధ్ధంగా ఉండి ఆ హింసకు ప్రతిహింస చెయ్యటానికి ఆయుధం పట్టాల్సిన తప్పనిసరి సందర్భంలో దానికీ నువ్వ్వు వెనుకాడకూడదు.ఐతే శత్రువు మీద చేసే దాడిలో ఆత్మరక్షణ పరిధిని దాటి ఒక్క అమాయకుడినైనా నీ చేతినుంచి ప్రయోగించబడిన ఆయుధం గాయపర్చినా,నీ తడాఖా చూపించి యెదటివాణ్ణి భయపెట్ట్ నెగ్గుకురావాలనే ఉబలాటం నీ అమనస్సులో కదిలినా - ఉత్తరక్షణంలో నువ్వు ధర్మమార్గం నుంచి తప్పుకుని నీ మమలు వెనక్కి తిరిగిపోయి ఆ పిశాచాల గుంపులోనే కలిసిపోయినట్టు లెఖ్ఖ!

ఒక్కటి గుర్తుంచుకో,ధర్మవీరులైన వారిలో తాము నడిపే ఉద్యమాల్లో శత్రువుల మీద చేసే న్యాయపూరితమైన దాడిలో పోరాటానికి దూరంగా ఉన్న అమాయకులు బలి కాకుండా చూదతం యెత్లాగన్న తపన యే స్థాయిలో ఉంటుందో,తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆ లక్ష్యాన్ని యెంత సమర్ధవంతంగా నిర్వహించుకు రాగలరో అంతవరకే సాధుసజ్జనుల దృష్తిలో ఆదర్శప్రాయులౌతారు! 
(18/09/1991)

ధర్మానికి కట్టుబడిన వాడు ఓడితే ధర్మం ఓడినట్టు - సాధుసజ్జనులకు ప్రమాదం కలుగుతుంది!ఓటమిని గర్వంగా చెప్పుకోవాలనుకోవడం తప్పు, ఓడిపోకూడదనే పంతంతోనే యోధుడు యుధ్ధం చెయ్యాలి!ఓడిపోతామని తెలిసినా ఒళ్ళు దాచుకోకుండా పోరాడగలిగిన వాడే నిజమైన యోధుడు!యుద్ధం చెయ్యకుండా వెనక్కి తగ్గే భీరుత్వం యెనాటికీ గౌరవప్రదం కాదు.ఇవన్నీ నిక్కచ్చిగా జరిగి తీరాలంటే ముందు నీ శత్రువుని గుర్తుపట్టాలి,శత్రువు ఫలానా అని తెలుసుకోవడంలోనే యోధుడికి వివేకం అవసరమౌతుంది!చెయ్యగూడని వాడితో యుధ్ధం చేసి అంతా అయిపోయాక అమాయ్కుణ్ణీ వేధించానని పశ్చాత్తాప పదటం యోధలక్షణం కాదు!

క్షాత్రమా దాస్యమా అనే ప్రశ్న వస్తే నేను క్షాత్రం వైపుకే ముగ్గు చూపుతాను!ఒక మహానుభావుడు "శాంతి అనెది రెందు యుధ్ధాల మధ్యన వచ్చే విరామం లాంతిది" అన్నాడు, మరో మేధావి "శాంతి కోసం సమరమే సాధనం" అన్నాడు!అవును,శాంతిని భగ్నం చేసేవాళ్ల మీద యుధ్ధం చేసి వాళ్లని నిగ్రహించడం వల్లనే మనం శాంతిని స్థాపించగలము,ఆ యుద్ధం ఆగితేనే అశాంతి పైకి లేస్తుంది.యెప్పటికీ నాకు స్పూర్తి నిచ్చే మంత్రవాక్యం ఒకే ఒక చిన్నమాట:

శాంతి కోసం సమరమే సాధనం!!!

Sunday, 21 June 2015

యేది సత్యం యేద సత్యం ఓ మహాత్మా?యేది ధర్మం యేద ధర్మం ఓ మహర్షీ!

          "యేకం సత్ విప్రాణి బహుధా వదంతి" అన్న పెద్దలే "సత్యమేకం లలితాఖ్యం వస్తు,సత్యం వదిష్యామి" అన్నారు!"ఆలస్యం అమృతం విషం" అన్న పెద్దలే "నిదానమే ప్రధానం" అని కూడా అన్నారు?సినీమాయాజగత్తులో తెలుగుభాషలో కనపడే బొమ్మల నోటినుంచి వినపడే మాటల్లో యెన్నెన్నో మాయలు చేసి యెవరూ వినని పదాల్ని వుపయోగించీ అవసరార్ధం తనే కొత్త పదాల్ని సృష్టించీ అసదృశంగా నిలబడిన పింగళివారు పాతాళభైరవిలో నేపాళ మాంత్రికుడి ద్వారా "జనం కొరింది మనం శాయడమా?మనం చేసింది జనం చూడడమా?" అని అడిగించి, సదాజపుడి చేత "యెప్పుడూ జనం కోరింది చేస్తున్నారుగా ఈసారికి మీరు చేసింది చూపండి" అని చెప్పించి కొత్తదారి చూపిస్తారు.విమర్శకులొకరు అందులో చాలా లోతైన అర్ధాన్ని వెదికారు!రచయిత,నటుడు,ప్రయోక్త - ఇట్లా సృజనశీలురైన వ్యక్తులకి కూడా ఈ సందేహం అప్పుడప్పుడూ కలుగుతుంది కాబట్టి అది కేవలం ఒక గారడీ విద్యలు చేసేవాడు తమాషాకి వేసిన ప్రశ్న కాదనేశారు!

          ఒక్కొక్క విప్రవరుడూ ఒక్కొక్క రకంగా చెప్పిన వాటిల్లోనుంచి మౌలికసత్యాన్ని కనుక్కోవడం యెట్లా?ధర్మం అన్ని కాలాల్లో అన్ని తావుల్లో అందరికీ ఒక్కలాగే ఆచరణీయ మవుతుందా?ధర్మం అనే మాటకి యెవడికి తోచిన అర్ధం వాడు చేప్పుకుని ఇది నా స్వధర్మం అంటే యేమి చెయ్యాలి?స్వధర్మాన నిధనం శ్రేయ మెందు కయింది?పరధర్మం భయావహ మెందు కయింది?హిందూ సన్యాసి వివేకానందుల వారు ధార్మికక్షాత్రాన్ని బోధించాడు!కమ్యునిష్టు కవి శ్రీరంగం శ్రీనివాస రావు అధర్మనిధనం కోసం ఖడ్గసృష్టి చేస్తున్నానన్నాడు!రెంటికీ తేడా యేమిటి?సాయుధ పోరాట సిధ్ధాంత కర్తలు తాము పెట్టుబడిదారుల్ని దునిమేస్తే అది శ్రేయోరాజ్యం కోసం చేసిన మహత్కార్యం అంటున్నారు,వారే మళ్ళీ హిందూధర్మం గురించి ప్రస్తావన వస్తే మాత్రం మాట తిప్పేసి అది భయంకరమైనదనీ అందులోని భాగమైన గీత హింసని బోధిస్తుందనీ భయపెడుతున్నారు?రాజులంతా బూజులని జనాన్ని నలిపేశారని అంటున్నప్పుడు స్టాలిన్ చేసిన హత్యల్ని గురించి యెత్తితే మాత్రం గప్చుప్ సాంబారుబుడ్డి అయిపోతారు,యెందుకనో?

          యెన్ని ప్రశ్నలు వేసుకున్నా జవాబు ఒక్కటే!సత్యం అనేది అనేక రకాలుగా ఉండదు.చిన్న సత్యం పెద్ద సత్యం అని చెప్పగలమా, లేదే!ఈ ప్రపంచం గురించి తెలుసుకోవలసినది చాలా ఉంది.మనకి కనపడుతున్న వాటి గురించే మనకి తెలిసినది చాలా తక్కువ. ఇప్పటికి తెలిసినది కూడా యే ఒక్క మనిషికో బోధపడినది కాదు.ఒక్కొక్కరి జ్ఞానం ఒక్కొక్క ఇటుకగా  ఒకదాని పైన ఒకటి పేర్చి కడుతూ వస్తున్న అసంపూర్తి భవనం మనకి తెలిసిన విజ్ఞానమంతా, యెప్పటికి పూర్తవుతుందో యెవరికీ తెలియదు!యెవరి అనుభవాన్న్ని బట్టి వారు నేర్చుకున్నది ప్రత్యేకమైన విషయమే అయినా ఇంతకు ముందు తెలిసిన జ్ఞానంతో అది కలిసిపోగలుగుతున్నది - అనుభవాలు వేరు గనక వైవిధ్యత ఉంటుంది,చెప్తున్నది ఒకే విషయాన్ని నిరూపిస్తున్నది గనక సారూప్యత ఉంటుంది,అదే పరమసత్యం!సత్యానికి కొలబద్ద యేకోన్ముఖత!ఒక విషయం గురించి యెంత చెప్పినా అంటే ఒక్క వాక్యమే చెప్పినా వెయ్యి వాక్యాలు చెప్పినా మరెన్ని వాక్యాలు చెప్పినా మొదటి వాక్యానికీ చివరి వాక్యానికీ అర్ధంలో వైరుధ్యం ఉండకూడదు, వైరుధ్యం కనిపిస్తున్నదీ అంటే అది అబధ్ధమే!ప్రయోగాలతో నిరూపించగలిగినవీ ప్రయోగాలతో నిరూపించలేనివీ అయిన రెండు రకాల జ్ఞానసంబంధమైన విషయాలకీ మొదట సారాంశాన్ని మాత్రమే చూసినప్పుడు వాటిలోని సత్యాసత్యాల్ని తేల్చడానికి ఈ కొలబద్దనే వాడుతున్నారు ప్రపంచమంతటా!

          ప్రపంచంలోని అతి ప్రాచీనమైన నాగరికతలలో నేటికీ సజీవంగా కొనసాగుతున్న వాటిలోకల్లా ప్రాచీనమైనదీ భరతఖండంలో అత్యంత ప్రాచీన కాలం నుంచీ కొనసాగుతున్న సనాతన ధర్మం అవిచ్చిన్నంగా కొనసాగటానికి ఈ లక్షణం బీజప్రాయమై ఉండటమే కారణం!ఒక సంస్కృతి ఇంత కాలం పాటు కొన్ని వందల తరాల మానవుల్ని ఆ సంస్కృతికి అంటుగట్టుకుపోయి ఉండగలిగేలా చేస్తున్నదంటే అది వారికి క్షేమాన్ని ప్రసాదిస్తుండటమే కారణమని వేరే చెప్పాలా!పాటించడానికి తనని కష్టపెడితే యే మనిషీ ఆ ధర్మాన్ని పాటించడు,అవకాశం దొరకగానే ఎడంకాలితో తన్ని పారేస్తాడు.అట్లాగని యెప్పటి కెయ్యది ఆకర్షణీయమో దాని వెంబడే పరిగెడితే మౌలికలక్షణంలో గుర్తు పట్టలేనంత మార్పుని తీసుకొచ్చి ఆ సంస్కృతి లోని యేకోన్ముఖతని నాశనం చేస్తుంది, మరింక అక్కడున్నది ఒకే సంస్కృతి అని చెప్పడ మెట్లా కుదురుతుంది?దేనిని వదలకుండా పట్టి ఉంచాలి,దేనిని కాలాని కనుగుణంగా మార్చుకోవాలి అనే రెండు అంశాల పట్లా శధ్ధ వహించడం చేతనే తనకన్నా తర్వాత పుట్టిన అనేక సంస్కృతులు కొద్దికాలంలోనే అంతరించిపోయినా ఈ భారతీయ జీవన ధర్మం మాత్రం నేటికీ తొలినాటి జవసత్వాలతోనే సజీవంగా నిలబడి ఉంది!

          ఈ సంస్కృతి విశిష్టత తన చుట్టూ ఉన్న ప్రకృతిని అర్ధం చేసుకుని ఆ ప్రకృతిని ధిక్కరించకుండా ఉండటంలోనూ తను దేనివలన ఈ ప్రపంచంలో క్షేమంగా ఉండగలడో ఆ ప్రకృతిని చెగొట్టకుండా తీసుకున్నదానికి పదింతలుగా ప్రకృతికి మేలు చేస్తూ ఆ ప్రకృతిలోనే ఆనందంగా కలిసిపోవడాన్ని శోధించి సాధంచి బోధించి ధ్యానించడంలోనూ ఉంది!నాల్గు వేదాలు,అష్టాదశ పురాణాలు,అసంఖ్యాకమైన ఉపనిషత్తులు,అరణ్యకాలు,గీత - అన్నింటిలోనూ ఉన్న యేకోన్ముఖత అంతా ఈ నాలుగు వాక్యాల్లో ఉంది:
శ్లో:ఈశా వాస్య మిదం సర్వం
     యత్కించ జగత్యాం జగత్
                                                                 తేన త్యక్తేన భుంజీధాం
                                                                 మా గృధః కస్యస్విర్ధనః!
          భగవంతుడు యెవరు,అతనెలా ఉంటాడు,అతనెక్కడ వుంటాడు,అతని కేది ఇష్టం - యేది కాదు,మనిషి చెయ్యాల్సినది యేమిటి,మనిషి  చెయ్యగూనిది యేమిటి - అన్నీ ఇందులో కొండ అద్దమందు కొంచెమై ఉన్నట్టు ఇమిడి ఉన్నాయి!లక్షల సంఖ్యలో పౌరాణికులు,బోధకులు యెన్నో గ్రంధాలు రాసి మళ్ళీ వాటికి వ్యాఖ్యానాలు చేర్చి బయటి వాళ్ళకి చూడగానే సంక్లిష్టంగా కనిపించే హైందవ ధర్మ సారం మరీ ఇంత చిన్నదా అనిపిస్తుంది గదూ!అవును,ఇట్లా తేలికగా అర్ధమయ్యే రీతిలో ఉండటం వల్లనే ఆచరణ మరింత తేలికైంది, అర్ధంలో గందరగోళం లేకపోవటం వల్ల దీన్ని అతిక్రమించాలనే ఆలోచన కూడా యెవరికీ రాలేదు!ఈశ్వరుడు అన్నింటినీ అవరించి ఉన్నాడు - యెట్లా?ఒక దుప్పటిలాగా పైన మాత్రమే కాకుండా యెంత చిన్న అంశంగా విడగొట్టి చూసినా లోపలా బైటా కూడా కనిపించే విధంగా నిండి ఉన్నాడు!కాబట్టి పరిత్యక్తుడవై భుజించు!పొరపాటున కూడా ఇతరులకి సంబంధించిన దాన్ని సంగ్రహించకు!పరిత్యక్తత అనే పదాన్ని విశ్లేషించడానికే భగవద్గీతలో స్థితప్రజ్ఞుడు అనే సూత్రం ప్రతిపాదించబడింది - "యేదీ నాకు అధికారికంగా దఖలు పడలేదు,నా మేనిలో ప్రాణమున్నంత వరకూ నాకు అందుబాటులో భగవంతుడు ఉంచినది, అవసరం మేరకు మాత్రమే నేను తీసుకోవాలి" అనే గమనికయే స్థితప్రజ్ఞుని జీవన విధానమైన పరిత్యక్తత!

          కరువులూ,మశూచికాలూ వచ్చి నశించినప్పుడు తప్ప మిగిలిన కాలమంతా దృఢంగా ఆరోగ్యంగా చిరకాలం జీవించి యెంతో గంభీరమైన వేదాంత భావనల్ని కూడా హాస్యస్పూర్తితో సామెతలుగా మనకందించిన వారికి మూఢనమ్మకాల్ని అంటగడుతున్న మనం యెన్ని మూఢనమ్మకాల్ని వైజ్ఞానిక సత్యాలుగా భావిస్తున్నామో తెలుసుకుంటే అంత సుదీర్ఘకాలం అజ్ఞానంలో బతికినందుకు యెంతటి వాడికయినా నిర్వేదంగా అనిపించటం ఖాయం!పాండిత్యం వాదనల్లో గెలవడానికి పనికొస్తుంది.వివేకం జీవితంలో సుఖపడడానికి పనికొస్తుంది.రెండూ తెలివికి సంబంధించిన పర్యాయ పదాలే గానీ ఒకదాన్ని వాడాల్సిన చోట మరొకదాన్ని వాడితే ఇప్పటి మన సమాజంలాగే దరిద్రంగా అఘోరిస్తుంది!



          ప్రాణావసరమైన తిండి విషయంలోనే చూస్తే రోజుకి రెండు లేక మూడు సార్లు పళ్ళెంలో తెల్లని వరి అన్నం రాశిగా పోసుకుని నాలుగైదు కూరలు కలిపి ముద్దలు చేసుకుని కుంభాలకి కుంభాలు లాగించడమే భోజనం అనుకుంటున్నాం,కానీ ఆ ఒక్క ఆహారపు టలవాటు మనకి గ్రహపాటుగా యెట్లా మారిందో తెలుసుకోలేక పోతున్నాం!ఇదివరలో ఒక్క వరినే కాదు,జొన్నలు,సజ్జలు,రాగులు కూడా పండించే వాళ్ళు - మరి ఇప్పుడెందుకు పండించటం లేదు?ఒకసారి మీ చిన్నప్పుడు చూసిన జొన్న చేనుని గుర్తుకి తెచ్చుకోండి,జొన్న చేను చుట్టూ పాతకాలంలో అల్లిన శృంగారం రంగరించిన గాధల్ని గుర్తుకు తెచ్చుజోండి?హఠాత్తుగా జొన్నచేలు మాయమైపోయినయ్యేమిటి మన జీవితాల్లోంచీ సాహిత్యం లోంచీ మనల్ని వెర్రివెధవల్ని చేస్తూ?వూచబియ్యం అనే మాట యెవరికయినా గుర్తుందా!చిన్నప్పుడు మాకూ ఓ జొన్నచేను ఉండేది,ఓ ఆదివారం పెద్దవాళ్ళు కాపలా అతనికి ఒక కబురు అందించమని పంపిస్తే వెళ్ళాను.ఆ సమయానికి తను  కంకులు తుంచుతూ ఉన్నాడు గనక అతను చిదుగులు యేరటం,నిప్పు రాజెయ్యటం,కంకి మీద ఉండే వెంట్రుకలు మాత్రం మాడేలాగ కాల్చటం,అతని పైపంచెలోనే మడిచి కర్రతో చిన్నగా కొట్టటం దగ్గిర్నుండి చూశాను,తిన్నాక ఆ పాలకంకుల రుచి నన్నిప్పటికీ ఆ సీను గుర్తుంచుకునేలా చేసింది!ఇవ్వాళ బొత్తిగా వెరయిటీ లేకుండా ఈ వరి అన్నం ఒక్కదానికే అంటుగట్టుకు పోవడానికి హోటళ్ళు మొదలయ్యాక వాళ్ళు వ్యాపారం పెంచుకోవడానికి బొమ్మకట్టి చూపించిన దృశ్యానికి బలయిపోవటమే కారణమా?!



          ఒక్క పిడికెడు జొన్నలు తింటే ఇక రోజంతా యేమీ తినకపోయినా ఫర్వాలేదనిపిస్తుందనేది యెంతమందికి తెలుసు?ఇక్కడ బ్లాగుల్లోనూ పూర్ణచంద్ గారు వరన్నం,పాలు,పంచదార లాంటి తెల్లనివన్నీ యమ డేంజరు,పళ్ళెంలో రంగు పడితేనే ఒంట్లో రంగు పడుద్ది అంటున్నా ఇంకా ఈ వరన్నం మీద వ్యామోహం పోకపోతే యెట్లా?అసలవి కూడా అఖ్ఖర్లేదు ఒక రెండో నాలుగో అరటిపళ్ళు తిన్నా చాలు గదా!అంత పెద్ద ఆనకట్ట,అదీ ఆ కాలంలో అంతమంది మనుషులతో తను కూడా వాళ్లలో ఒకడిగా కలిసిపోయి పని చేయించి కట్టిన అంత గొప్ప వ్యక్తి ఆర్ధర్ కాటన్ కేవలం అరటిపళ్ల మీదనే ఆధారపడి బతికాడంటే నమ్మగలరా!రావు బాలసరస్వతి గుర్తుందిగా,ఆవిడ ఈ మధ్యనే ఆంధ్రజ్యొతి కిచ్చిన ఇంటర్వూలో నేను ఇప్పటివరకూ కొన్ని కోర్టు కేసుల్ల్లో ఇరుక్కుని ఉన్నాను, అవన్నీ నాకు అనుకూలంగా వచ్చి పరిస్థితి మళ్ళీ ఇదివరకట్లాగ కుదురుకున్నది గనక ఖాళీగా ఉండకుండా మళ్ళీ సినిమాలు తీద్దామనుకుంటున్నాను అనేసరికి కళ్ళు తిరిగినంత పనయింది - యెందుకంటే ఆవిడ వయసు చూస్తే 85 దాటింది,సినిమా తియ్యడం అంటే మాటలా?అంత ధీమాగా చెప్తున్న ఆవిడ ఆహారం పళ్లరసాలు!మనలాగ రోజుకి రెండుమూడుసార్లు ఫుల్లుమీల్సు లాగించకుండా ఆకలేసినప్పుడల్లా  కొంచెం కొంచెం ఫ్రూట్ జ్యూసు తాగుతూ ఆవిడంత గట్టిగా బతుకుతుంటే పూర్ణచంద్ గారు చెప్పినట్టు వరన్నం వల్లనే మనమిలా నీరసంగా తయారయ్యామా, యేమో?నాకింకా దీర్చంగా ఆలోచిస్తే ఇవ్వాళ్టి రోజున దేశాల మధ్యనా రాష్ట్రాల మధ్యనా రావణ కాష్ఠాలు రగిలిస్తూ పెరిగిపోతున్న ఈ నీటి తగాదాలకి కారణం కూడా వరన్నమే ననిపిస్తుంది - వరన్నం అభిమానులు అనామకంగా వచ్చి నన్ను శాపనార్ధాలు పెట్టకుందురు గాక!మీరే ఆలోచించండి,వరి పొలాల కోసమే గదా నారుమళ్ళు చెరువుల్లాగ నింపటం,వాటిల్లో యేకొంచెం నీరు తగ్గినా పంటలు పాడైపోవటం,రైతులు బేజారవ్వటం జరుగుతున్నది,అటు చూస్తే జొన్నలకీ రాగులకీ ఈ గొడవలేమీ అఖ్ఖర్లేదు గదా!ఈ పొలిటికల్ సంగతు లిక్క దేనికి గానీ నాకయితే మనలాంటి ఉద్యొగస్థులు కూడా పొద్దున్నే ఆఫీసుకు పోవటానికి ముందు లంచ్ బాక్సుల్లో వరన్నమూ కూరలూ కలుపుకోవటానికి కాళ్ళు తొక్కుకుంటూ అవస్థలు పడే బదులు బాటిళ్ళలో పళ్ళరసాల్తో ప్రయోగం చేస్తే యెట్లా ఉంటుందా అనిపిస్తుంది,కానీ కుదురుతుందా?కాకపోతే ఈప్లానులో ఒకటే ఈక్నెసు - లంచవరు మిస్సయిపోద్ది,ఆ పేరుతో కొట్టే హస్కు తగ్గిద్ది!



          లంచనీ సప్పరనీ యెక్కువ మొత్తంలో ఒకేసారి తినడం వల్ల జీర్ణక్రియ మీద యెక్కువ భారం పడుతుంది గనక యాండ్రాయిడ్ ఫోన్లలో మాదిరి ఉన్న కొంచేం శక్తిని పొదుపు చెయ్యదం కోసమని నిద్దరొస్తుంది - అదే పై పధ్ధతికి మళ్ళితే రోజంతా హుషారుగా ఉండగలుగుతాము కదా!నిద్ర కూడా రోజూ పదింటికి ఠంచనుగా పక్క యెక్కెయ్యాలనీ 7 గంటల లోపల లేవరాదనీ అనుకోకుండా దేహానికి నిద్ర అవసరమైనప్పుడే నిద్ర పోవాలి - ఆందోళనలు యెక్కువై అసలు నిద్రపట్టకపోతే కంగారు పడాలి గానీ మామూలప్పుడు అలాంటి మిలిటరీ దిసిప్లిను అఖ్ఖర్లేదు!కానీ లేవడం మాత్రం సూర్యొదయానికి ముందు లేచి స్నానాదికాలన్నీ పూర్తి చేసుకుని సూర్యోదయాన్ని సర్వేంద్రియాలతో అనుభవిస్తే ఆ రోజంతా ప్రత్యేకంగా ఉంటుంది!నిద్ర రావడ మంటూ వస్తే పక్కనే బాంబులు పేలినా పట్టించుకోకూడదన్నంత గట్టిగా వస్తేనే పడుకోండి - తిరిగి నిద్ర లేచేలోపు ఈ లోకం యెట్లా పోయినా నాకనవసరమనిపించేటంత గాఢంగా నిద్రపోవాలి,కాకుంటే చుట్టుపక్కల బాడీ లాంగ్వేజి స్పెషలిష్టులు  యెవరైనా ఉన్నారేమో చూసుకోండి - యెందుకంటే మీరు నిద్రపోయే భంగిమని బట్టి మీకున్న మాయరోగాల్ని కూడా కనిపెట్టగలిగేటంతగా ఆరితేరిపోయారు వాళ్ళీమధ్యన!



          ఇక దుస్తుల సంగతి చెప్పాలంటే అదో పెద్ద మైరావణ చరిత్ర!తెల్లోడు మనల్ని నలిపేస్తున్నప్పుడు కాలెజీల్లో కుర్రాళ్ళూ ముసలాళ్ళూ కూడా స్వదేశీ మత్తులో పంచెకట్టులోనూ చీరకట్టులోనూ తిరిగి స్వతంత్రం రాగానే తొక్కలో స్వదేశీని అమాంతం విసిరిపారేసి ప్యాంటుల్లోకీ స్కర్టుల్లోకీ దిగిపోయారు,అప్పటి వాళ్ళెందు కట్లా చేశారో నాకిప్పటికీ మిస్టరీయే!సరిగ్గా భూమధ్యరేఖ మీద తిరుగుతూ ఉన్న మన వేడి ప్రాంతానికి నూలు దుస్తులూ పట్టు చీరలూ ప్రశస్తం,కానీ వినేవాడెవడు?పంచె కడితే విడాకు లిచ్చేస్తానని మా బంగారం యెప్పుడో వార్నింగు ఇచ్చింది గాబట్టి నేనంటే గిట్టని నీహారిక లాంటి వాళ్ళు యెంత బలవంతపెట్టినా నేను కట్టను గాక కట్టను, ఇంక మీకు చెపితే "యెదటివారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి" అనే ప్రేమనగర్ పాట యెత్తుకుంటారు నా మొహమ్మీదనే!మా నాన్నగారు పోయినప్పుడు కార్యం చేయించడానికొచ్చిన పంతులుగారు ఆ కబురూ ఈ కబురూ చెప్తూ ఇవ్వాళ జనంలో భయమూ భక్తీ పెరిగినాయి గనక మాకుర్రాళ్లకి ఆదాయం బాగానే పెరిగింది గానీ పెళ్ళిళ్ళు మాత్రం కావట్లేదు,మా అమ్మాయిలు గూడా ఈ అచ్చివాయ్ బుచ్చివాయ్ మంత్రాలు చదివే పిలక రాయుళ్ల కన్నా నీటుగా ఏసీల్లో తిరిగే సాఫ్టువేరు కుర్రాళ్ళని చేసుకోవటానికే చూస్తున్నారు అన్నాడు,కాబట్టి ఆడవాళ్ళు తమ కిష్టమైన మగాణ్ణి పంచెకట్టులో చూడాలనేటంతగా మారేవరకూ మనం మగధీరుడి లాగ పంచె కట్టుకు తిరిగాలని ఆశ పెట్టుకునే పని లేదు,అవునా?యేమైనా సరే పంచెకట్టి సాంప్రదాయం నిలబెట్టాల్సిందే నన్న పట్టుదల యే మగాడిలో నైనా ఉంటే నాలుగు రోజుల్లో సన్నాసుల్లో గలిసిపోవడం ఖాయం గనక ఇంటి కన్నా గుడి పదిలం అని నమ్మేవాళ్ళు మాత్రమే సాహసించాలి!



          తిన్నాక తలుపులు బిగించుకుని గమ్మున తొంగుందామనుకున్నఇంటి విషయాని కొస్తే మరీ ఘోరంగా వుంది పరిస్థితి!కాంతి గాని గాలి కాని చొరబడకుండా పట్టపగలు కూడా లైట్లూ ఫ్యాన్లూ వేసుకుని తిరగాల్సిన దరిద్రంలో ఉన్నారు నగరవాసులు!ప్రతిరోజూ ఇంత ధారాళంగా ఎలెక్ట్రిసిటీని వాడుతూ యేడాది కొకసారి ఎర్తవరు పేరుతో ముక్కీ మూలిగీ ఒక గంట ఆపేసినంత మాత్రాన ఉరికిపడే సౌభాగ్యం యేముంటుంది?పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు పైరుపచ్చలతో వాగువంకలతో గువ్వాగోరింకల తేట్రింతలతో పిల్లతెమ్మెరలతో కొబ్బరాకుల గలగలలతో కళకళలాడుతూ ఉండాల్సిన పల్లెటూళ్ళు కూడా నగరాలకి కాపీక్యాట్ అయిపోతున్నాయి - కొంతకాలం సిటీలైఫుకి అలవాటు పడి పల్లెటూళ్ళకి వెళ్ళేవాళ్ళు గొప్పకోసం ఆ వైభవాల దరిద్రాన్ని కూడా తమతోపాటు మోసుకురావడంతో!మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని శాస్త్రీయంగా విశ్లేషించి చూస్తే శక్తి నిత్యత్వ నియమం ప్రకారం భూమి మీద కొత్తగా జీవరాశిని పుట్టించలేమని తెలుస్తుంది,తమ చుట్టూ ఉన్న వాతావరణం నుంచి కొంత సారం తమలోకి తీసుకుంటూ అధికంగా చేరిన సారంతో సంఖ్యని పెంచుకుంటూ ఉన్న మొత్తం జీవధాతుసంచయంలో ఒకచోట శిధిల మవుతుంటే ఒకచోట కిసలయిస్తున్నది!అందుకే ఒక ప్రాంతంలోని జీవుల ద్రవ్యరాశిని మొత్తం లెక్కించి బయో మాస్ ఇండెక్స్(BMI) అనే ప్రామాణిక సూచితో కొలుస్తారు.మనిషి ఒక్కడే కాకుండా,అతను పెంచుకునే పెంపుడు జంతువులైన ఆవు,గేదె,కుక్క,చిలుక లాంటి ప్రతి జీవికీ ఆ జీవి జీవనక్రియలు ఆరోగ్యంగా జరగాలంటే వాటికి యెంత గాలి అవసరం,యెంత నీరు కావాలి,వాటిమీద యెంత మేర కాంతి ప్రసరించాలి అనే లెక్కలు స్పష్టంగా ఉన్నాయి.వీటిలో యేది లోపించినా ఆ జీవుల ఆరోగ్యం దెబ్బతింటున్నదని పరిశోధనలు వెల్లడిస్తూనే ఉన్నాయి,అయినా భవన నిర్మాణంలో వీటిని ఉపయోగించుకోవాలనే తెలివిడి అటు కట్టేవారిలోనూ లేదు,ఇటు ఉండేవారిలోనూ లేదు!సౌకర్యం,సౌందర్యం లేని తమ ఇంటితీరు వల్లనే ఒకప్పటి వాళ్ళకి లేని నీరసాలకి బలవుతున్నామనీ, వచ్చేవరకూ వూహించనయినా వూహించలేని కొత్త కొత్త రోగాల బారిన పడుతున్నామనీ యెంతమందికి తెలుసు?సిమెంటు రోజు మొత్తంలో వేడిని మెల్లగా పీల్చుకుంటుంది,తర్వాత వదలడం కూడా అంత మెల్లగానే వదుల్తుంది - దీన్ని హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటారు - ఇవ్వాళ కొంచెం ఉష్ణోగ్రత పెరగ్గానే నాకంతా తెలిసునని చెప్పుకోవడానికీ యెవణ్ణో ఒకణ్ణి తిట్టడానికీ పనికొచ్చే ఓజోను హోలు గురించి లెక్చర్లు దంచుతారు గానీ యేదైనా రాయిని చూసుకుని - గ్రానైట్ అయినా సరే - దానిమీద యెండ తగ్గి సాయంకాలపు గాలి వీచిన కొద్దిసేపటికి కూర్చుని చూడండి - చాలా చల్లగా ఉంటుంది!భవనాల నిర్మాణంలో సిమెంటు వాడకం ద్వారానూ గాలీ వెల్తురూ చొరబారని చీకటి గుయ్యారాల వల్లనూ ఇంటిలోపల వేడి పెరుగుతుంటే దానికి పరిష్కారంగా ఫ్యానులూ, ఏసీలూ, ఫ్రిజ్జులూ తెచ్చుకుని ఎలెక్ట్రిసిటీని యెక్కువగా వాడుతూ ఖర్చుల్నీ జబ్బుల్నీ పెంచుకుంటున్నాం?పెరిగిన ఖర్చుల్ని తట్టుకోవడానికి తిండికీ నిద్రకీ కూడా తీరిక లేనంతటి యాంత్రికజీవనానికి అలవాటు పడిపోతున్నాం - కనీసం ఇట్లా బతకటం అవసరమా అనే ప్రశ్న కూడా పుట్టదం లేదేమిటి?



          రోగమొస్తే వేసుకునే మందులు కూడా విషాల కన్నా ప్రమాదకరమైనా అవే మింగుతూ కూడా యేదో ఒక చిరుతిండిలో మాత్రమే ఉన్నట్టు ఆ ఒకటీ నిషేధిస్తే చాలునని అల్లరి చేస్తున్న వాళ్ళు యెంత పిచ్చి వాళ్ళు?ఇవ్వాళ క్రిమి సంహారక మందులుగా వాడుతున్నవి నిన్న మొన్నటి ప్రపంచ యుధ్ధాల్లో శత్రుసైనికుల్ని చంపడానికి వుపయోగించినవని యెంతమందికి తెలుసు?మనుషుల్నే చంపగలిగినవి పురుగుల్ని చంపలేవా!వాటిని చంపటానికి పంటల మీద పిచికారీ చేస్తే వాటిని తిన్న మనుషులే చస్తున్నారు తామెందుకు తొందరగా చస్తున్నామో కూడా తెలుసులేని అమాయకత్వంతో!



          మన లోపల జరిగే జీవరసాయనిక క్రియల లోని అసలు మర్మమేమిటో ఇక్కడ వివరిస్తాను,కొంచెం శ్రధ్ధగా చదవండి. ఇప్పుడు చెప్పబోయే విషయం మీద నాకు యెంత అధికారం ఉన్నా మీరు కూడా శ్రధ్ధ చూపిస్తే గానీ యెక్కదు!యెముకలు,దంతాలు,గోళ్ళు,వెంట్రుకలు లాంటివన్నీ కాల్షియం,సల్ఫర్ లాంటి నిర్జీవ మూలకాలతో ఉంటే మిగతా శరీరం మొత్తం గ్లూకోజ్,ప్రోటీన్,ఫ్యాట్ అనే మూడు ముఖ్యమైన మాలిక్యూల్స్ విభిన్న నిష్పత్తులలో కలిసి అనేక రకాలైన కణజాలాల్ని యేర్పరుస్తాయి. కణజాలం అంటే ఒకే రకమైన కణాల గుంపు.నాడీ మండలం యొక్క నిర్మాణ మంతా నాడీ కణాల కలయికతో యేర్పడుతుంది.కండరాలలో ఉండే కణాలన్నీ ఒక రకంగా ఉంటాయి.వాటి వాటి పనుల కోసం నిర్మాణంలో వైవిధ్యం ఉన్నా అన్ని కణాలకీ సామాన్యమైన నిర్మాణం ఒకే రకంగా ఉంటుంది.కణం యొక్క బయటి వాతావరణం నుంచి కణద్రవ్యాన్ని వేరు చేస్తూ ఒక పొర,ఈ జీవద్రవ్యంలో ఒక కేంద్రకం ఉంటాయి.ఈ జీవద్రవ్యంలో జరిగే భౌతిక రసాయనిక క్రియలలోని ఒక విచిత్రమైన అతి చిన్న గారడీయే తన చుట్టూ ఉన్న నిర్జీవ ప్రపంచం నంచి జీవానికి ప్రత్యేకత నిస్తుంది.చిన్నప్పుదు మనం చదువుకున్న ఆస్మాసిస్ పాఠం గుర్తుంది కదా,జీవద్రవ్యంలో కూడా ఈ ఆస్మాసిస్ యెప్పుడూ జరుగుతూనే ఉంటుంది. మనం ప్రయోగశాలలో చూసే ఆస్మాసిస్ అటూ ఇటూ సమానమైన గాఢత వచ్చేశాక ఇక ఆగిపోతుంది - దాన్ని ఈక్విలిబ్రియం అంటారు!అయితే జీవద్రవ్యంలో జరిగే భౌతికరసాయనిక చర్యలన్నీ పూర్తిగా ఈక్విలిబ్రియం వరకూ వెళ్ళకుండా నిలిపి ఉంచబడతాయి.దీన్ని స్టడీ స్టేట్ అంటారు.ఇదెలా జరుగుతుందంటే మనం ప్రయోగం చేస్తున్న సమతాస్థితిలో ఉన్న ద్రవాల్లో ఒక వైపున గాఢతని పెంచినా తగ్గించినా అవి రెండూ సమానమయ్యేటంత వరకూ ఆస్మాసిస్ మళ్ళీ మొదలవుతుంది కదా - సరిగ్గా ప్రాణుల లోపల స్టడీ స్టేట్ కదలకుండా పట్టి వుంచే అలాంటి మోడిఫికేషనే తన చుట్టూ ఉన్న నిర్జీవ ప్రపంచాన్నుంచి జీవాన్ని వేరు చేస్తున్నది!మనం తీసుకునే ఆహారం చాలా సంక్లిష్టంగా ఉంటుంది.దీన్ని బద్దలు చేసి కణాల వరకూ పంపించటానికి శక్తి కావాలి,ఇవి కణాలలో దహించబడినప్పుడు పుట్టే శక్తి ఈ స్టడీ స్టేట్ అనేదాన్ని పట్టి ఉంచుతుంది!దుర్గంధం రాగానే అనుకోకుండానే ముక్కు మూసుకోవడానికి కారణం అది జీవరసాయనికచర్యల్ని స్టడీ స్టేట్ నుంచి ఈక్విలిబ్రియం వైపుకి బలంగా తొయ్యడం వల్ల జీవధాతువులు ప్రకంపించి పోవటమే కారణం - జీవరసాయనిక చర్యలు పూర్తిగా ఈక్విలిబ్రియం దగ్గిరకి వెళ్ళటం అంటే హంస లేచిపోయిందన్న మాటే?!



          ప్రాచీన భారతీయ వైద్య విధానమైనా ఆధునిక పాశ్చాత్య వైద్య విధానమైనా కారణం లేని రోగం ఉండదు అనే మూలసూత్రాన్ని గట్టిగా నమ్ముతున్నాయి.అందుకే రోగనిర్ధారణ అనేది రెంటిలోనూ అతి ముఖ్యమైనది. శారీరక రోగాలకే కాదు మానసిక రోగాలకి కూడా అవి మనల్ని బాధ పెట్టటానికీ ఆ బాధ తొలగిపోవటానికీ ఒక బలమైన కారణమే ఉంటుంది.యే రోగమూ కారణం లేకుండా రాదు,వచ్చిన యే రోగమూ దానంతటదే తగ్గిపోదు.శారీరక వ్యాధులకి కారణాలు ఇంద్రియాలకి కనపడతాయి గనక వైద్యశాస్త్రంతో సంబంధం లేనివాళ్ళు కూడా గుర్తుపట్టగలుతారు, కానీ మనోవ్యాధుల్ని యెట్లా తెలుసుకోవాలి?అందుకే ఒకప్పుడు ఈ మనోవ్యాధుల్ని తగ్గించటానికి మరోమార్గం కనబడక మంత్రతంత్రాలతో కూడిన భూతవైద్యాన్ని వాడేవాళ్ళు!తొలిసారిగా దీన్ని బద్దలు కొట్టి మానసిక రోగాల్ని సమర్ధవంతంగా నిర్ధారించి నివారణ మార్గాల్ని సూచించటానికి పనికొచ్చే శాస్త్రీయమైన విధానాన్ని ఆధునిక మనోవైజ్ఞానికశాస్త్ర పితామహుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ మేధావులైన స్నేహితులూ గురువులూ కూడా ఒక పట్టాన ఒప్పుకోలేనంత విప్లవాత్మకమైన సూత్రీకరణలతోనూ ఆ సూత్రీకరణల్ని ఉపయోగించి తను కొంతమంది వ్యాధిగ్రస్తుల్ని పూర్తి ఆరోగ్యవంతుల్ని చెయ్యడంతోనూ ఒక కుదుపుని తీసుకొచ్చాడు!అతని సూత్రీకరణల్ని యధాతధంగా ఇప్పటి సైకియాట్రిస్టులు రోజువారీ కేసుల్ని పరిష్కరించటానికి వాడకపోయినా కొన్ని జటిలమైన వాటికి మాత్రం ఫ్రాయిడియన్ సైకోఎనాలిసిస్ యొక్క సహాయాన్ని తీసుకుంటున్నారు.ప్రతి కేసుకీ వాడకపోవటానికి కారణం ఫ్రాయిడ్ చెప్పినవి నమ్మటానికి ఇబ్బందిగా అనిపించటమే!ఉదాహరణకి ఒక డాక్టరు తన పేషెంటుకి నువ్వు చిన్నప్పుడు నీ తల్లిని కామించావు అని చెబితే అతను ఒప్పుకోగలడా,మళ్ళీ ఆ డాక్టరు దగ్గిరకి వైద్యం చేయించుకోవటానికి వస్తాడా?ఫ్రాయిడ్ కూడా తన సిధ్ధాంతాన్ని కేవలం ఒక డాక్టరు తన దగ్గిరకొచ్చిన పేషెంటుకి వైద్యం చెయ్యటానికి పనికొచ్చేటందుకు మాత్రమే పరిమితం చెయ్యకుండా మానవాళి సమస్తానికీ ఉపయోగ పడేటందుకు - తమలోనికి చూసుకుని తమలోని దౌర్బల్యాల్ని జయించటానికి పనికొచ్చే తత్వశాస్త్రం లాగ తయారు చేశాడు!"ఆత్మానం విద్ది" అన్న ప్రాచ్య దేశపు జ్ఞానులూ "know thy self" అన్న పశ్చిమ దేశపు జ్ఞానులూ ఆ తెలుసుకోవడం యెట్లా అనేది మాత్రం ఇతమిత్ధంగా చెప్పలేక పోయారు ,ఫ్రాయిడ్ ఆ పనిని పూర్తి చేశాడు - అతడు జ్ఞాని!



          ఆ జ్ఞానంలోని మెచ్చుతునకలు కొన్ని వివరిస్తాను,మొదట నమ్మటానికి ఇబ్బందిగా ఉన్నా స్థిమితంగా ఆలోచిస్తే అవి నిజమేనని ఒప్పుకోవాలనిపిస్తుంది!అమాయకమైన బాల్యం అనేదాన్ని అతడు నిరాకరించాడు. తమ జననేంద్రియాల మధ్యన గల విభిన్నతని  గమనించిన తొలిబాల్యపుదశలొనే యెవరూ చెప్పకుండానే మగపిల్లలకి ఆధిక్యతాభావం ఆడపిల్లలకి అత్మన్యూనతా వస్తాయి.అయితే తలిదండ్రులు మనోవైజ్ఞానిక శాస్త్రం చదవకపోయినా తమ పిల్లల్ని సంస్కారవంతులుగా తీర్చిదిద్దాలని ఆశిస్తే వారు తమ పిల్లలందర్ని సమానంగా చూసి పెంచడం ద్వారా వారిలోని అవలక్షణాల్ని వదిలించగలరు.ఈ వయసులో పాజిటివ్ ధోరణి ఉన్నా ఒకవేళ పెరిగి పెద్దయ్యాక పదే పదే తమమీద ఇతర్లు దాడి చేసే పరిస్థితుల్లో బతకటం తప్పనిసరి అయినప్పుడు నెగెటివ్ ధోరణికి మళ్ళటం జరగవచ్చు - అది దురదృష్టకరమే!అయినా అక్కడ ఆ మనిషి గనక కొంతకాలానికి తప్పు తెలుసుకుని ఆ దుస్థితి నుంచి  బయటపదే అవకాశం ఉంది.కానీ ఈ వయస్సులో నెగిటివ్ ధోరణికి వెళ్ళిన వాళ్ళు మాత్రం ఒకంతట పాజిటివ్ ధోరణికి మళ్ళరు,దానికి కారణం తమలోని తప్పుల్ని తప్పులుగా గుర్తించని స్థాయికి అప్పటికే వెళ్ళిపోవటం!



          ఫ్రాయిడ్ తన కొచ్చిన "ఇర్మా ఇంజక్షన్" అనే కలని విశ్లేషించుకోవడం ద్వారా సూత్రీకరణల్ని యేర్పరచుకోవటం మొదలు పెట్టి అప్పటిదాకా పూర్తి ఆరోగ్యంగా ఉండి హఠాత్తుగా పక్షవాతానికి గురయిన ఒక పేషెంటుని తన పధ్ధతి నుపయోగించి స్వస్థతకి తీసుకురావటంతో ఇక వెనుదిరిగి చూసుకోకుండా తన కాలపు మేధావుల్నీ తద్వారా ప్రపంచంలోని మనోవైజ్ఞానికశాస్త్రజ్ఞు లందర్నీ ప్రభావితం చెయ్యగలిగాడు.మనోవ్యాధికి మందు లేదు,నిజమే!ఇప్పటికీ సైకియాట్రిస్టులు యే రోగాన్నీ మందులతో నయం చెయ్యరు - అదీగాక పూర్తిగా కూడా నయం చెయ్యలేరు!శరీరవైద్యశాస్త్రానికీ మనోవైద్యశాస్త్రానికీ సంబంధించి ఒక జోక్ వుంది,అదేమిటంటే మొదటిదానికి సంబంధించిన పుస్తకాలు చదివితే అక్కడ చెప్పిన జబ్బులన్నీ మనకి ఉన్నట్టు అనిపిస్తుంది,రెండోదానికి సంబంధించిన పుస్తకాలు చదివితే అక్కడ చెప్పిన రోగాలు పక్కవాళ్ళ కున్నట్టు అనిపిస్తుంది!



          పైన చెప్పుకున్న మొదటి పేషెంటు కధ ఇట్లా ఉంది:ఫ్రాయిద్ తన ఫ్రీ అసోసియషన్ అని పేరు పెట్టిన హిప్నాటిక్ ట్రాన్సులోకి వెళ్ళి ఆ అమ్మాయి చెప్పింది యేమిటంటే తన తండ్రి చావు బతుకుల్లో ఉన్న సమయంలో అతడికి సేవ చేస్తూ ఉన్నపుడు ఒకానొక సందర్భంలో మితిమీరిన శృంగార భావనలు చెలరేగడం?!తంద్రిని జాగ్రత్తగా చూసుకోవలసిన సమయంలో అట్లా ఆలోచించినందుకే తండ్రి మరణించాడేమో అనే ఆలోచన కూడా తోడవటంతో అపరాధ భావనకి లోనైంది.శరీరానికి మనం ఇచ్చే పోషణ మనస్సుని యెట్లా ప్రభావితం చేస్తుందో మనస్సు కూడా శరీరాన్ని ప్రభావితం చెయ్య్యగలదు - దీన్ని సైకోసొమాటిక్ ఎఫెక్ట్ అంటారు!"నీ తండ్రి అట్లా పడివుంటే నువ్వు శృంగారం గురించి ఆలోచించావు - నువ్వు నీచురాలివి?" అనే ఒక వాదనా "లేదు,నేను తప్పు చెయ్యలేదు - నేను అమాయకురాలిని!" అనే ప్రతివాదనా చెరోవైపునా అంతరంగంలో యెదతెరిపి లేకుండా సంఘర్షించడంతో మనస్సు అలిసిపోయి దేహాన్ని శిధిలం చేసింది! తనలోనే ఉండి తనని విమర్శించే భాగం యొక్క వ్యతిరేకత నుంచి తప్పించుకోవటానికి కవచంగా కూడా ఈ శరీరం చచ్చుబడిపోవటం ఉపయోగ పడింది - చూడు యెట్లా అయిపోయానో అని జాలి పుట్టించి విమర్శల నుంచి తప్పించుకోఅవచ్చు కదా!ఈ అపరాధ భావన నుంచి తప్పించుకోవటానికి వాడుకునే షీల్డింగ్ మెకానిజమే మనోవైజ్ఞానిక శాస్త్రజ్ఞులకి పని కల్పించే లక్షోపలక్షల మనోవ్యాధులకి మూలం!



          ఈ షీల్డింగ్ మెకానిజం రెండు రకాలుగా ఉంటుంది - ఆ అమ్మాయిలో పాసివ్ షీల్డింగ్ ఉండటం వల్ల  తనకు పక్షవాతాన్ని తెచ్చుకుని కృశించింది,అగ్రెసివ్ షీల్దింగ్ మెకానిజం ఉంటే తన చుట్టూ ఉన్న మనుషుల్ని విసిగించి ఉండేది.షీల్డింగ్ పాసివ్ స్ట్రాటజీలో ఉన్నా అగ్రెసివ్ స్ట్రాటజీలో ఉన్నా తనలో సమాజం అనుమతించని భావాలు ఉండటం వల్ల సమాజం శిక్షిస్తుందనే భయమూ తనకు ఆ భావాల పట్ల మమకారం ఉండటం వల్ల వాట్ని వదులుకోలేని మోహమూ ఒకేసారి విజృంభించటంతో గందరగోళం,అసహనం,కోపం లాంటివి ప్రవర్తనలో ప్రముఖంగా కనపదతాయి!ఆత్మహింస, పరహింస - ఈ రెంటిలో దేనినైనా సరే యే స్థాయిలోనైనా చెయ్యడానికి వెనుదీయని మొండిధైర్యం మాత్రం అధికంగా ఉంటుంది. ఈ సంక్లిష్టతలేవీ లేని మిగతా వారి కన్నా ప్రత్యేకంగా ప్రవర్తిస్తారు.ఈ ప్రత్యేకతలకి తోడు స్వానురాగం కూడా తోడైతే అగ్నికి వాయువు తోడైనట్టే!ఇటువంటి అగ్రెసివ్ షీల్డింగ్ మెకానిజం ప్రభావంలో ఉన్న వ్యక్తులతో వాదనకి దిగితే అవతలి వారు గెలవటం కష్టమే కాదు అసంభవం!యెందుకంటే, యెదటివారి మీద పైచేయిగా ఉంటేనే తమ ఆత్మన్యూనత పైకి లేవకుండా ఉంటుంది గాబట్టి యెంత అడ్డదిడ్డంగా వాదించి అయినా సరే తమదే ఆఖరి మాట అయ్యేటట్టు జాగ్రత్త పడతారు!అవతలివారికి విసుగు పుట్టి ఆపెయ్యాల్సిందే తప్ప వీరి వైపు నుంచి మాత్రం చర్చ ఆపరు గాక ఆపరు!వారికి కావలసిన షీల్డింగ్ గెలవటం - అంతే?!"రాముడిపై నా ఆరోపణలు రెండు...ఒకటి స్త్రీలపై హింసను మొదలుపెట్టిందే రాముడు. రెండు వివాహ వ్యవస్థలో విడాకులు తీసుకువచ్చిందే రాముడైతే ఆదర్శ దాంపత్యం ఎలా అయింది ?అన్న కొద్దిసేపట్లోనే "మీరు రాముడిని కేవలం అభిమానిస్తున్నారు,నేను రాముడిని అనుకరించాలని ప్రయత్నిస్తున్నాను.అని కూడా అనగలరు. యేదో ఒక విధంగా యెదటివాళ్ళ వాదనల్ని యెట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకుని వాళ్ళ కన్నా తక్కువగా ఉండటానికి సిధ్ధపదకపోవటం వల్ల్ల "నేను కాశ్మీర్ సమస్యని పరిష్కరించటానికే రామజన్మభూమి సమస్యలో వేలు పెట్టాను" అని కానీ "సంస్కృతం నేర్చుకోవాలన్న కోరికా తీరికా లేవు . రామాయణాన్ని చదివే ఉద్దేశ్యం ప్రస్థుతానికి లేదు.ఉర్దూ నేర్చుకున్నా ఇంగ్లీష్ నేర్చుకున్నా నాకు ఉపయోగపడుతుంది.నా ప్రాజెక్ట్ కొంచెం ముందుకెళుతుంది.రాముడిని ద్వేషించినా తరించవచ్చు అని ఆర్యుల ఉవాచ !సామాన్యులకు అర్ధమయ్యేలాగా చెప్పవలసిన బాధ్యత రాముడి తరుపున వకాల్తా పుచ్చుకున్న వారిదే !" అని కానీ మరోరకమైన వాదన కానీ యెంతో గంభీరంగా చెయ్యగలరు, మనకి తెలితక్కువగా అనిపిస్తుంది గానీ వారికి కాదు - వారిలో ఉన్న ఆత్మన్యూనత+స్వానురాగం ఆపని చెయ్యనివ్వదు!ఈ అగ్రెసివ్ స్ట్రాటజీ యెట్లా పని చేస్తుందంటే "నేను వీళ్ళందరి కన్నా యెంతో ప్రత్యేకమైన యెన్నో రెట్లు ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తిని,నేను వీళ్ళని శిక్షించగలనే కానీ నాముందు ఓటమి నంగీకరించిన వీళ్ళు నన్ను శిక్షించలేరు" అనే సమర్ధన దొరుకుతుంది అపరాధ భావనకి కవచంగా!తను ద్వెషించే తన అసలు ప్రవరనని మరుగుపరుస్తూ మారుపేర్లతో పూర్తి భిన్నమైన వ్యక్తిలా వ్యవహరించటం కూడా షీల్డింగ్ చేసే గారడీయే,ఇక్కడ తక్కువ గానీ అమెరికా వంటి దేశాల్లో ఒకే మనిషి నాలుగైదు విభిన్న వ్యక్తిత్వాల్ని ప్రదర్శించే కేసులు చాలా బయట పడ్డాయి,వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ తను ఒక రకమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తున్న సమయంలో తనదే అయిన మరో వ్యక్తిత్వానికి సంబంధించిన కనీసపు జ్ఞాపకం కూడా ఉండదు వాళ్ళకి - మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్దర్ అంటారు దీన్ని! తమకి అపరాధభావన కలగజేసే విషయాల ప్రభావం లేనప్పుడు యెంతో తెలివిగా కనపడటం వల్ల ఇతర్లకి వింతగా అనిపిస్తుంది - అంత తెలివిగా ఉన్నవాళ్ళు ఇంత పిచ్చిగా మాట్లాడుతున్నా రేమిటని?ఇలాంటి యెన్ని కేసుల్ని తరచి చూసినా ఇలాంటివారి కందరికీ రెండే రెండు అంత్యదశలు కనబడుతున్నాయి - ఒకటి తనలోని లోపాన్ని తెలుసుకుని మనసులోని అపరాధ బావనల్ని తగ్గించుకుని సమాజానికీ తనకీ ఉండే సంతులనాన్ని కాపాడుకుంటూ ఆరోగ్యకరమైన ప్రవర్తనకి మళ్లటం, లేదా మార్క్ ట్వయిన్ రాసిన విచిత్రవ్యక్తి కధ చివర్లో పరిపూర్ణమైన ఆనందాన్ని అనుభవించే చర్చి ఫాదర్ పాత్ర లాగ స్థిరపడి పోవటం?విజ్ఞులైన వారు యెవ్వరూ ఆ స్థాయిలో అపరాధభావనలు తమలో ఉండకుండా జాగ్రత్త పడాలి. తమకు తెలిసిన వారిలో ఉంటే వీలయితే వారిని సరిదిద్దటానికి ప్రయత్నించటం లేదంటే వారికి వీలయినంత దూరంగా ఉండటం తప్ప తమకూ అది అంటుకోకుండా ఉండటానికి మరో మార్గం లేదు?!మానసిక వైద్యం కూడా ఆ వ్యక్తి సంసిధ్ధత లేకుండా పని చెయ్యదు!మనోవైద్యులు చేసేది కూడా ఆ వ్యక్తికి తన రుగ్మతని తొలగించుకోవటానికి సూచనలు ఇస్తూ సహాయం చెయ్యటమే తప్ప సొంతంగా పూనుకుని చేసే వైద్యం అంటూ ఉండదు అక్కడ!చంద్రమా మానసో జాతః అన్నట్టు అన్ని సమస్యలకీ మనస్సు ముఖ్యం అని తెలిసిన వాళ్ళు గనకనే మనసుని నిర్మలంగా ఉంచుకోవటానికి సూర్యనమస్కారాల నుంచి మొదలు పెట్టి యోగాసనాల వరకూ యెన్నో సాధనాల్ని సమకూర్చి ఉంచారు మన ప్రాచీనులు, వాటిని ఉపయోగించుకోకుండా దాని అవసరం కూడా తెలియని అల్లోపతి వెంట పడటాన్ని తగ్గించుకోవడం మంచిది!



          అల్లోపతి మందులకి సంబంధించి సైడ్ ఎఫెక్ట్స్ గురించి వింటూనే ఉంటారు,అవి చేసే పని ఈ స్టడీ స్టేట్ మెకానిజం బలహీన పడేలా చెయ్యటమే!అల్లోపతి మందులు వాడేవాళ్ళకీ ఇచ్చేవాళ్ళకీ కావలసిన శీఘ్ర నివారణ ఆ మందుల్ని వాళ్ళు ఆ పవరు కోసం పడే పాట్లు సైడ్ ఎఫెక్ట్స్ గురించి పట్టించుకోకుండా చేస్తున్నాయి?దీనికి బిన్నంగా భారతీయ సాంప్రదాయిక వైద్యవిధానంలో రోగాన్ని తగ్గించటానికి పనికొచ్చే అసలు మందుతో పాటు ఈ సైడ్ ఎఫెక్ట్స్ మీద పనిచేసే మరో దినుసుని కూడా కలపటం అనేది చాలా పట్టుదలగా చేస్తారు,స్టడీ స్టేట్ మెకానిజంని దెబ్బతియ్యకుండా ఉండటానికే యెక్కువ సమయం తీసుకుంటారు!మన సాంప్రదాయక వైద్యవిధానం యొక్క శక్తిని నేను మా ఇంట్లోనే కళ్ళారా చూశాను.నగర జీవనం ఆడవాళ్ళ సుకుమారమైన దేహాల మీద చూపించే ప్రభావం మా బంగారం మీద కూడా పడింది!అల్లోపతిలో ఆపరేషన్ చేసినా పూర్తిగా నయమవుతందనే గ్యారెంటీ లేని ఒక సున్నితమైన సమస్యకి ఆయుర్వేదంలో మంచి ఫలితం కనిపించింది!మొదత్లో మామూలు నడకే కష్టంగా ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు తన ఇదివరకటి స్థితికి కేవలం మూడువారాల్లో వచ్చేసింది - ఖర్చు కూడా కేవలం రూ.30,000 మాత్రమే!ఆ పంతులు గారు భయమూ భక్తీ పెరిగాయన్నది కరెక్టే - హాస్పిటల్ కెళ్తున్నా రోగం తగ్గుతుందో లేదో అనే గ్యారెంటీ లేకపోతేనూ ఖర్చు తడిసి మోపెడవుతుందేమో ననిపిస్తేనూ మొదట గుర్తొచ్చేది దేముడే కదా!



          యెందరో పురాణ పురుషుల్ని కళ్లకి కట్టినట్టు చూపించి తిరపతి భక్తుల్తో మొక్కించుకుని దేవుడల్లే బతికి రాజకీయాలలోకి తారాజువ్వలాగ వొచ్చి కాంగ్రెసు పార్టీ ధణుతెగరగొట్టి వచ్చినవాడు ఫల్గుణుదు అన్నట్టు యెకాయెకి ముఖ్యమంత్రి పీఠానికే యెక్కిన యెంటీవోడు యెక్కడో యెవడో గొట్టాంగాడుఒక అత్యాచారం చేస్తే తను విరక్తి ఫీలయ్యి కాషాయం కట్టాడు,కానీ కట్టిన తీరు మాత్రం కన్యాశుల్కంలో గిరీశం వేషంలో తను కట్టిన షోకిల్లా పధ్ధతిలో చెంగు ధోవతి జేబులోకి దోపాడు - దాని కిక్కునిచ్చే యెఫెక్టు వల్లనే కాబోలు అతి కొద్దికాలంలోనే మళ్ళీ సంసారి అయ్యి తెల్లధోవతికి మారాడు!?ఆ కాలంలో యెవరయినా మగాడు ఆ తీరులో పంచె కట్టి మణికట్టుకి మల్ల్లెపూలు చుట్టి గడప దాటితే "యెక్క్కడికి వెళ్తున్నావు?" అని అడిగిన వాడు పాపాత్ముడు?!కులస్త్రీలకి శ్రంగారం నిషేధం -  భర్తగారు కోరుకుంటే దగ్గిర కొచ్చి కోరిక తీర్చిపోవటం తప్ప తానుగా నవ్వను కూడా నవ్వకూదదు?పురుషులకి మాత్రం స్వేచావిహారం - వెలయాలు ప్రియురాలిగా లేనివాడు అసమర్ధుడే!ఇప్పటికీ ఆడది నాకు అలా ఉంటే బాగుంటుంది అని రొమాన్సు గురించి మాట్లాడితే కంగారు పడని మగవాళ్ళు చాలా తక్కువ - అన్ని మైనారిటీ వర్గాల కన్నా మంచివాళ్ళు అనే వర్గం మరీ దిక్కూ దివాణం లేని మైనారిటీ ఇవ్వాళ!శృంగారం అనేది మగవాడు ఆడదాని నుంచి ఆనందం పొందడానికే తప్ప ఆడదాని మనోభావాలకి అందులో తావులేదని అనుకోవడం వల్లనే ఇవ్వాళ స్త్రీల మీద అన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి.బలం ఉన్నవాడు బలాత్కారం చేస్తున్నాడు,తెలివి ఉన్నవాడు కల్లబొల్లి కబుర్లు చెప్పి తన కోరిక తీరాక తన దారిన తను పోతున్నాడు,సౌజన్యం ఉన్నవాడు స్నేహంతో ఆకట్టుకుంటున్నాడు - మనిషి ప్రవర్తనలో కనబడే అన్ని రకాల పాజిటివ్,నెగటివ్ ఆలోచనల మీద కూడా ఆ మనిషి యొక్క శృంగార జీవితం లోని అంశాలు ప్రభావం చూపిస్తున్నాయని ఇటెవలి పరిశోధనల ద్వారా నిర్ద్వందంగా నిరూపించబడింది.అయితే పశ్చిమ దేశాల విజ్ఞానం ఈరోజు చెప్తున్న దానిని మన ఋషులు యెప్పుడో గ్రహించారు - వాత్స్యాయన ఋషి రచించిన కామసూత్ర గ్రంధం యెప్పటిది?వేదాంతం గురించి చెప్పే భగవద్గీతలో "కామమ్ము లందు ధర్మావిరుధ్ధ కామమ్ము నేను" అని ప్రస్తావించడ మంటే దానికెంతటి విలువనిచ్చారో తెలుస్తున్నది గదా!కామి గానివాడు మోక్షగామి కాడు అనే ఉద్దశంలో కాబోలు మానవు లంతా తప్పక సాధించాల్సిన నాలుగు పురుషార్ధాలలో మోక్షానికి ఒక మెట్టు కింద మూడో పురుషార్ధంగా నిలబెట్టారు.వాత్స్యాయనుడు శ్రంగారం పురుషుడు స్రీని సంతోషంగా ఉంచడం కోసం ఆమెకి ఇష్టమైన పధ్ధతిలోనే చెయ్యదం తన కర్తవ్యంగా భావించాలని  - అంటే పురుషుడి కోసం స్త్రీ కాదు స్త్రీ కోసమే పురుషుడు అని బల్ల గుద్ది చెప్తున్నాడు, ఇప్పటి మన నమ్మకాలకి పూర్తి విరుధ్ధంగా ఉంది కదూ!

          అపారమైన జలరాశి మధ్య నిలబడినా మన దోసిలి పట్టినంత నీటినే మనం తాగగలం - చెంబు కొద్దీ గంగ!జ్ఞానం కూడా అంతే - తిండీ,నిద్రా,బట్టా,నిద్రా,ఇల్లూ,శ్రంగారం లాంటివాటిలో ఉన్నట్టుగానే మితమైన జ్ఞానమే హితం.పరిధిని మించిన జ్ఞానం ప్రమాదం?మన ముందున్న సమస్యకి కొత్త సమస్యల్ని తెచ్చిపెట్తని ఒక చక్కని పరిష్కారం సాధించుకోవటానికి పనికొచ్చేటంత జ్ఞానం చాలు.చదివింది అర్ధం చేసుకుని అవసరం వచ్చినప్పుడు ఉపయోగించుకునే లక్షణం లేకుండా దెభ్భైవేల పుస్తకాలు చదివినా లక్ష పుస్తకాలు చదివినా వ్యర్ధమే?అబధ్ధాలతో పేనవేసుకున్న సంస్కృతీ ప్రభావం వల్ల మనలో కొత్తగా దిగబడిన ఈ వింతైన మూఢనమ్మకాల్ని పోగొట్టుకోవటానికి న్యాయబుధ్ధితో ఆలొచించి సత్యసౌందర్యంతో విలసిల్లే ధర్మమార్గం వైపుకి నడిచే ఉద్దేశం లేనంతకాలం మనం యెవరినైనా గానీ యెవరైనా మనని గానీ దీర్ఘాయుష్మాన్ భవ అని యెంత నిండు మనస్సుతో దీవించినా అది పనిచెయ్యదు!

          అదేమిటో,పరాధీనతలో ఉండగా పౌరుషంతో స్వతంత్రభావనల్ని మానసాల్లో నింపుకున్నామన్నారు, ఆ స్వతంత్రం రాగానే వల్లమాలిన నిర్లక్ష్యంతో పరాధీనులైపోయారు - యేమి చిత్రమైన జాతిరా ఇది!పరాధీనతని జాతికంతటికీ నీచంగా చూపి స్వపరిపాలన రాగానే ప్రజల్ని స్వాభిమానంతో తలయెత్తుకు తిరిగేలా చేస్తామని ప్రగల్భించారు,ఆ స్వాధీనత ప్రాప్తించగానే మన సంస్కృతినే పరిహసిస్తూ హాస్యానికి కాదు నిజంగానే మనవాళ్లుత్త వెధవాయలోయ్ అనుకునేటట్టు ప్రవర్తిస్తున్నారు - యెంత నికృష్టమైన వాళ్ళురా వీళ్ళు?


యేది సత్యమో అదే శివమూ అవుతుంది!యేది శివమో అదే సుందరమూ అవుతుంది!!
సత్యం శివం సుందరం!!!
-----------------------------------------------------------------------------------------------------------------
(చిత్రదాత:గూగులమ్మ)

ఏడుపు గురించి కూడా యాడవాల్సింది చాలా ఉందండోయ్!

పాపం చెట్లకి ఏడుపు రాదు . వాటికి ఏడుపు రాకపోవటమే మంచిదైంది . చెట్లకి కాక మిగిలిన అన్ని జంతువుల ఏడుపులకే ఇంత విసుగొస్తుంటే వాటి...