Saturday, 20 February 2016

గతమెంతొ ఘనకీర్తి గలవోడ!చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ!!

          2001 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 79 మిలియన్లు!ప్రపంచం మొత్తం మీద ఫ్రెంచ్ మాతృభాష అయినవాళు 75 మిలియన్లు.ఆంధ్రప్రదేశ్.తెలంగాణ రాష్ట్ర్రాలు రెండింటిలో కలిపి  61 మిలియన్లు,తమిళనాడులో 3 మిలియన్లు,కర్నాటకా చత్తీస్ గడ్ మహారాష్ట్రల్లో ఒక్కో మిలియన్ చొప్ప్పున వ్యాపించి ఉన్నారు.లక్షద్వీప్ నుంచి ఒరిస్సా వరకూ తెలుగువాళ్ళు అసలు లేని చోటంటూ లేదు.ఈ మధ్యన తెలుగువాణి తరపున స.వెం.రమేష్ గారు ప్రపంచమంతటా చుడుతున్నారు తెలుగువాళ్ళ జాడలు కనిపెట్టటానికి.ఇప్పటికి శ్రీలంక, బంగ్లాదేశ్, బెంగాల్ లాంటి చోట్ల ఉన్న తెలుగువాళ్ల వివరాలు చదువుతుంటే చదువుతున్న ప్రతిసారీ అశ్చర్యం, ఆనందం, విషాదం అన్నీఒకేసారి ముప్పిరిగొంటున్నాయి నన్ను. ఆశ్చర్యం దేనికంటే, ఇన్నాళ్ళూ తెలుగువాళ్ళు అంటే ఒక్క రాష్త్రంలో ఉన్నవాళ్ళ గురించే వూహించుకుంటూ గడిపేశాం గానీ ఎక్కడెక్కడికి వ్యాపించిపోయారు మనవాళ్ళు అని. ఆనందం దేనికంటే ఇక్కడున్న తెలుగువాళ్ళలా "అండి","రి" గురించీ "చెప్పాలె","చెప్పాలి"ల గురించీ కొట్టుకు చావకుండా భాషని నిజంగా ప్రేమిస్తూ దాన్ని వొదులుకోకుండా ఉంటున్నందుకు. విషాదం దేనికంటే పాపం వీళ్ళంతా పొట్ట చేతపట్టుకుని పోయి ఇప్పటికీ దిక్కు లేనివాళ్లలా బతుకున్నందుకు. వాళ్ళు తమ మూల రాష్ట్రాల నుంచి అండ అవసరమైన కడుబీదవాళ్ళు - కానీ ఇప్పుడిక్కడ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఇద్దరికిద్దరూ తెలుగుదనం మీద ప్రీతి లేని బందిపోట్లు!

          పక్కనున్న తమిళనాడులో అక్కడి ప్రభుత్వం దుర్మార్గంగా వేధిస్తుంటే కోర్టులు కలగజేసుకుని ఆపినాయే తప్ప చీమ కుట్టినంతగా కూడా చలించని వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళ గురించి ఆలోచిస్తారా?అదీగాక వాళ్ళు వమెరికాల్లోనూ సింగప్పూరుల్లోనూ ఉండి రెండు చేతులా సంపాదిస్తూ బలిసిన వాళ్ళు కూడా కాదాయె - బుక్కా పకీరు వెధవలు, ఎందుకు పనికొస్తారు వీళ్ళు?కులము గల్గువాడు, గోత్రంబు గల్గువాడు, విద్యచేత విర్రవీగువాడు పసిడి గల్గువాని బానిస కొడుకులు అన్నాడు కదూ వేమన్న ఎప్పుడో! కులగోత్రాలను అడ్డుపెట్టుకుని గొప్పవాళ్ళవ్వాలని అనుకునేవాళ్ళూ, చదువుకున్నవాళ్ళం అని గొప్పగా చెప్పుకునేవాళ్ళూ పోయి పోయి డబ్బున్నవాళ్ళ చంకలు నాకడానికి ఎట్లా పోటీలు పడుతున్నారో ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాం గదా!అలా డబ్బు కోసం ఆత్మలని అమ్ముకునే వాళ్ళు ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ సంస్కృతిని మర్చిపోవడంలో ఆశ్చర్య మేముంది?చక్కని భాష  కానివ్వండి,మంచితనం కానివ్వండి, తరాల తరబడి కొనసాగించుకుంటూ రావలసిన జీవనవిధానం కానివ్వండి - ఈ దబ్బుపిచ్చి లేనివాళ్ల దగ్గిరే సజీవంగా ఉంటున్నాయి!

          మియన్మార్ దేశంలో ఎన్నో తెలుగు సమూహాలు ఉన్నాయి.1960ల వరకు స్కూళ్ళలో తెలుగు సబ్జెక్ట్ ఉండేది.మౌల్మీన్ నగరంలో ఒక వీధికి "మల్లెపూల దిబ్బ" అని పేరు పేట్టుకున్నారు, ఎంత బావుంది!.తూర్పు మియన్మార్ ప్రాంతంలో తైలంగ్ సమూహం ఉంది - బహుశా చోళుల కాలంలో ఇక్కడి నుండి వెళ్ళిన వారు కావచ్చు!వారి నోట వినపడే ఒక జోలపాటలో దూరాన ఉన్న తెలంగాణ అనే ప్రాంతం గురించి గుర్తు తెచ్చుకంటున్నట్టు ఉంటుంది. "తెలుగదేల యన్న దేశంబు తెలుగు" అన్న శ్రీకృష్ణదేవరాయలు మరొక మాట కూడా అన్నాడు,"తెలుగు తలచిన దేశంబు తెలంగాణ్యము" అని కూడా అన్నాడు.అయితే ఆ తెలంగాణ 2014లో ఏర్పడిన పదిజిల్లాల తెలంగాణ కాదు, మొత్తం తేలుగు మాట్లాడే అన్ని ప్రాంతాలనీ భాషాపరంగా కలిపేసి తెలంగాణ ఆని పిలిచేవాళ్ళు అప్పట్లో!

          ఇవ్వాళ ప్రాచీన భాష హోదా కోసం గోదాలో దిగి పోటీలు పడుతున్నభాషలలో ఏ ఒక్క భాషని గురించి కూడా ఎప్పుడు పుట్టిందో నిర్ధారణగా ఎవరూ చెప్పలేరు.నిర్ధారణగా చెప్పాలంటే ఆధారాలు కావాలి, అదీ లిఖిత పూర్వకమైనవి కావాలి.కానీ అసలు తొలి మానవుడు గొంతు పెకలించి కేకలూ,అరుపులూ,గర్జనలూ,ధ్వనుల నుంచి ఒక లయను సృష్టించుకుంటున్నప్పుడు అతను వెంటనే దాన్ని వ్రాసి చూసుకోవాలని అనుకోలేదు - కొత్తగా పుట్టిన నాలుగైదు మాటల్ని తేలికగానే గుర్తుంచుకోవచ్చు కదా!మెల్లమెల్లగా పదాల వాడకం పెరిగి భాష విస్తృతమైనాకనే లిపి అవసరమైంది. ఒక విచిత్రం చూడండి - ఒక భాష చాలా ముందుగానే పుట్టినా చాలా కాలం వరకూ లిపి ఏర్పారుచుకోకుండా ఉండిపోయి,మరొక భాష దాని తర్వాత పుట్టినా ముందు లిపిని ఏర్పాటు చేసుకుంటే రెండవది ముందు పుట్టిందని తీర్మానించితే మొదటి భాషకి అన్యాయం జరిగినట్టే కదా!కానీ ప్రస్తుతానికి భాషల ప్రాచీనతని కొలవడానికి అంతకన్నా శాస్త్రీయమైన పద్ధతి కూడా లేదు గాబట్టి ప్రాచీనతకి లిపినే తీసుకుంటున్నారు.అలా చూస్తే తెలుగుభాష వయస్సు 2,400 సంవత్సరాలు. 

          క్రీ.పూ 525 నాటి చోళ రాజుల శాసనాలలో మరాఠీ ప్రాకృతంలో కలిసిపోయిన కొన్ని తెఉగు పదాల ఆనవాళ్ళు కనబడుతున్నాయి.క్రీ.పూ 200 నుండి క్రీ.శ 200 మధ్యలో రచించబడినదని భావిస్తున్న గాధాసప్తశతి మహారాష్త్ర ప్రాకృత భాషలో ఉన్నదే అయినా అక్కడక్కడా కొన్ని తెలుగు పదాలు కూడా కనబడుతున్నాయి.గాధ అంటే ఇప్పటి అర్ధంలో మనం చెప్పుకంటున్న కధ అని కాదు.ప్రేమ,హాస్యం,వేదాంతం మొదలైన అన్నింటినీ స్పృశిస్తూ హుషారును పుట్టించే పులిసిన ఫ్రెంఛి మద్యం లాంటి తొలి వచన కవితా రూపం!ఇప్పటి హైకూల మాదిరి చిన్నవిగా ఉంటాయి.కానీ చెళ్ళున తగిలే చెణుకులోనూ భావంలోని విరుపులోనూ ఇప్పటి హైకూలు అప్పటి గాధల ముందు దిగదుడుపే!

          తెలుగు భాష మొదట్లో ద్రవిడ మూలం నుంచి ఎదిగినా మిగిలిన అన్ని ద్రవిడ భాషల కన్నా ఎక్కువగా సంస్కృతంతోనూ కలిసిపోయి దానికి దీటుగా నిలబడగలిగింది. ప్రపంచంలోని ఏ భాషకైనా రెండు రూపాలు ఉంటాయి - గద్యం, పద్యం.అయితే ప్రపంచంలోని భాష లన్నిటిలోనూ దేనివలన సంస్కృతం ప్రత్యేకంగా నిలబడుతున్నదో ఆ చందస్సుని ఒక్క తెలుగు మాత్రమే సమర్ధవంతంగా ఇముడ్చుకుని కావ్యరచనలో సంస్కృత సాహిత్యానికి దీటుగా నిలబడింది.నన్నయ్యకు పూర్వమే తెలుగులో చందోబద్ధమైన కవితారచన గొప్పగానే జరిగింది.కానీ కావ్యరచనయే జరగలేదు. ఆ లోటును పూరించడానికే నన్నయ భారతాంధ్రీకరణ మొదలుపెట్టాడు. దానికన్నా తెలుగుభాషకి నన్నయ చేసిన మహోపకారం ఒకటి ఉంది. తెలుగుకి ఒక శుద్ధమైన వ్యాకరణం వ్రాయటం - అందుకే ఆయనని వాగనుశాసనుడు అన్నారు!ముందుగా తరతరాలకూ తరగని వెలుగై నిలవాలంటే భాష ఎట్లా ఉండాలో తీర్చిదిద్ది ఆ తర్వాత దానిని ఇట్లా ఉపయోగించుకోవాలి అని మహాభారత కావ్యరచన ద్వారా కొత్తదారి చూపించాడు.తర్వాతి కవులందరూ ఆయన చూపిన దారినే నడిచారు.అందువల్లనే ఆయనని ఆదికవి అంటున్నది. అప్పటి కాలంలోనే మనవాళ్ళు వ్రాసిన ఒక పాలిండ్రోం చూదండి:

కాళిదాసళిదాయోమా చంద్రంతేరిపురంజకమ్ |
కంజరంపురితేంద్రంచ మాయోదాళిసదాళికా|

          కర్ణాటక సంగీతం మొత్తం దక్షిణ భారతదేశ మంతటా వ్యాపించినా వాగ్గేయకారులు ఏ ప్రాంతం వారైనా తమ కృతుల రచనకి సంస్కృతం తర్వాత తెలుగునే ఎన్నుకోవటానికి కారణం దీని అజంత మాధుర్యమే!వినడానికి ఇంత తియ్యగా ఉన్నప్పటికీ దీన్ని నేర్చుకోవడం మాత్రం చాలా కష్టం,ఎందుకంటే, ఇది అల్లాటప్పా భాష కాదు, దీని వ్యాకరణం విభక్తులు,ప్రత్యయాలు,సంధులు,సమాసాలు వంటివాటితో కూడి ఉండి అచ్చు కుందేళ్ళ వంటి చిన్న చిన్న సాధుజంతువుల నుంచి సింహశార్దూలమత్తేభాల వంటి పెద్ద పెద్ద క్రూరజంతువులతో నిండి ఉన్న గహనాటవిని తలపిస్తుంది మరి!సంస్కృతం తర్వాత అంత సుసంపన్నమైనదీ,సంక్లిష్తమైనదీ అయిన తెలుగుభాష మీద గట్టిపట్టును సాధించటం మట్టిబుర్రలకి ఒక పట్టాన సాధ్యం కాదు!

          తెలుగుభాష కున్న అసలైన స్పెషాల్టీ ఒత్తులండోయ్!రెండు మూడు రకాల ధ్వనుల్ని పలికే అక్షరాల్ని కూడా ఒక్కటిగా కలిపి మాట్లాడెయ్యొచ్చు, దాదాపు అన్ని భాషల్లోనూ సంయుక్తాక్షరాలు ఉన్నాయి గానీ తెలుగుకి ఈ ప్రత్యేకత లిపిలో కూడా ఉండటం మరింత అపురూపం!దీనివల్ల మనం వింటున్న ప్రతి ధ్వనినీ పలకగలం, రాయగలం, చదవగలం!తెలుగుభాషని దాని ఒత్తులూ గుణింతాలూ దీర్ఘాలతో సహా స్వచ్చంగా పలకగలిగితే ప్రపంచంలోని ఏ భాషనయినా దాని సొంత ఉచ్చారణతో చాలా తేలిగ్గా మాట్లాడవచ్చు.దీని మీదనే ఒక తెలుగు  పండితుడు మంచి పద్యం కూడా రాసేశాడు!

క్రమముగ "శ్రీమ త్సకల గుణ సంపన్న"
యని యున్న జదివెడు నఱవవాడు

కడగి "చిరిమదు చగల కుణ చంపన్న"
యని,కన్నడము వాడు యొనసి

"సిరిమతు సగల గోణ" యని తోడనే
"శంపణ్ణ" యని,మహారాష్ట్రుండు పని వడివడి

జెలగుచు "శ్రీమతూ సెకల గుణానె
సంపన్నాసె" యని,యోఢ్రభాషణుండు

వెలయు "శ్రీమొతో సొకొలొ గుణ సొంపన్నో"
యని,యికెన్ని వేల యన్య భాష
లాంధ్రు డున్నయట్లెయలరు బఠించు
నంచు హాస్యవేది యాడు నాడు....
                                                                                           - శ్రీ కొక్కొండ వేంకతరత్నం పంతులు గారు


          చూశారుగా, తెలుగుభాష వేళాకోళానికి పనికివచ్చినంతగా మరే భాషా పనికిరాదు:-)తెలుగు కున్న మరో స్పెషాళ్టీ సామేత లండోయ్!ప్రోవెర్బులనీ అవనీ ఇవనీ అన్ని భాషల్లోనూ ఉన్నాయి గానీ తెలుగు సామేతల కున్న ప్రత్యేకఫ భావాన్ని బట్టి పదాల ఎంపిక విపరీతమైన తేడా వచ్చేస్తుంది.హాస్యం చిలికే సామెతల్లో వచ్చే పదాలు గుర్తుకొస్తే చాలు చక్కిలిగింతలు పెట్టినట్టు ఉంటుంది.అదే తాత్వికమైన సామెతలు గుర్తుకొస్తే మనస్సు గంభీరంగా మారిపోతుంది!ఈ వైవిధ్యం తెలుగుకి మాత్రమే సొంతం.

          తెలుగుభాష కున్న మరో ప్రత్యేకత కొత్త పదాల్ని పుట్టించుకోగలగటం, ఇతర భాషల పదాల్ని ఇముడ్చుకోగలగటం.ఏ భాషలోని ఎలాంటి పదానికైనా సరే చివర్న ప్రధమా విభక్తి ప్రత్యయాల్ని అతికించేస్తే చాలు అసలది ముందునుంచీ తెలుగు పదమేనేమో అనిపించేటట్టు తెలుగు పదమై కూర్చుంటుంది!కొత్తపదాల్ని పుట్టించటానికి ఉదాహారణ చెప్పాల్సి వస్తే స్వర్ణయుగపు తెలుగు సినిమా మాటల రచయిత పింగళి నాగేంద్రరావు గారినే చెప్పాలి. తన ప్రతి సినిమాలోనూ పాత్రల పేర్లలో గానీ పాటల్లో గానీ పాత్రధారుల సంభాషణల్లో గానీ ఎన్నో కొత్త మాటల్ని పరిచయం చేశారు.

          వడ్డెర, చెంచు భాషలు తెలుగుకి కొంచెం దగ్గిరగా ఉంటాయి.తెలుగు భాష లోని కొన్ని ప్రముఖమైన యాసలు దొమ్మర,దాసరి,సాలెవారి,తెలంగాణి,వరంగల్,పాలమూరు,గద్వాల,నారాయణపేట,శ్రీకాకుళం,విశాఖపట్నం,తూర్పుగోదావరి,పశ్చిమగోదావరి,నెల్లూరు,ప్రకాశం,గుంటూరు,తిరుపతి.సాధారణంగా ప్రపంచంలోని ప్రతి భాషలోనూ మంచి సాహిత్యం తన జన్మస్థానంలోనే పుడుతుంది. కానీ తెలుగు జన్మభూమి,కర్మభూమి అనే భేదం లేకుండా ఎక్కడున్నా చిలవలు పలవలుగా సాహితీ నిర్మాణం జరిగిపోతుంది.దీనికి కారణం అతి తేలిక్గా మౌఖిక సాహిత్యాన్ని పుట్టించగలిగే వెసులుబాటు ఉండటం - తన వేదనకి సాంత్వన కోసం గొంతెత్తి పాడుకోవటానికి అనువైన భాషలో సాహిత్యం పుట్టటానికి నిరుపహతి స్థలములూ,రమణీ ప్రీయదూతిక తెచ్చి ఇచ్చు కప్పుర విడెములూ,ఇంకెవరో తొడిగే గండపెండేరములూ అక్కర్లేదు కదా!

          తెలుగు మౌఖిక సాహిత్యం కుల పురాణాలు,కొలువులు-గేయ కధలు,సామేతలు అనే మూడు విభాగాల్లోనూ ఎంతో అద్భుతమైన స్థాయిని అందుకున్నది. తెలుగునాట ఉన్న 196 కుల్లాల్లో ప్రతి కులానికీ అనుబంధంగా వారి కులపురాణం ఉంది.గౌడ కులస్తులకు గౌడ పురాణం, చాకలి కులస్తులకు రజక పురాణం - ఈ కుల పురాణం ప్రతి కులం వారికీ తమ తమ సంప్రదాయిక విధుల్ని శాస్త్రోక్తంగా నెరవేర్చుకోవటానికి చాలా అవసరం.ఎవరో ఒకరు నిష్ణాతుడైన వ్యక్తి గానం చేసే పద్ధతిలో 3 గంటల నుంచి 14 రాత్రుల పాటు గానం చెయ్యగలిగిన విస్తృత స్థాయిలో ఈ కులపురాణసాహిత్యం ఉన్నది.దీనిని బట్టి ప్రస్తుతం మనం నమ్ముతున్నట్టు ప్రతి కులం వారూ తమ కులం మిగతా కులాల కన్నా తక్కువస్థాయిది అని అనుకోకుండా తమ కుల వారసత్వం పట్ల ఒక రకమైన గర్వాన్ని కలిగి ఉండేవారని అర్ధమవుతుంది!కొలువులు అంటే దేవతలకి జరిగే జాతరల వంటి ఉత్సవాలలో ప్రత్యేకించి ఆ దేవతని కొలుస్తూ పాడే పాటలూ, చెయ్యాల్సిన పూజల సంగతులూ ఉంటాయి.ఇక్కడ దేవత,సన్నివేశం,సాహిత్యం - ఈ మూడింటిలో దేన్నీ విడదియ్యలేనంత చిక్కురొక్కురుగా అల్లేసిన సాహిత్య రూపం కొలువు దరువు!ఈ మౌఖిక సాహిత్య సృష్టికర్తలలో ఉన్న ముఖ్యవిశేషం ఆవసరమైన చోట గీర్వాణ భాషనీ,గ్రాంధిక  రూపాల్నీ కూడా ఏమాత్రం నదురూ బెదురూ లేకుండా వాడుకోగలగటం!బుర్రకధలు,హరికధలు చెప్పేవారిలో కొందరు పౌరాణిక కధల్ని సంప్రదాయిక పండితుల కన్నా గొప్పగా వ్యాఖ్యానిస్తూ చెప్పగలగటం మనకు తెలిసిందే కదా!నిజానికి ఒక చందోబద్ధమైన కావ్యరచన కన్నా ఒక మౌఖిక సాహిత్య రూపాన్ని సృజించటానికే ఎక్కువ ప్రతిభ కావాలి.

          తెలుగుభాషకీ నేటి కాలపు తెలుగు,కన్నడ ప్రాంతాలను పరిపాలించిన ఆంధ్రశాతవాహనులకీ అవినాభావ సంబంధం ఉంది.మౌర్యులకు సామంతులైన వీరు మౌర్యుల మాదిరిగానే బ్రాహ్మీ లిపిని ఉపయోగించారు.దాదాపు చాలా ద్రవిడ భాషలు బ్రాహ్మీ లిపి నుంచే తమ భాషలకు లిపిని తీర్చి దిద్దుకున్నాయి.వాటిలో తెలుగుభాష ఒక్కటే తన లిపిని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుకోగలిగింది - ఈ అక్షరాల్ని చూస్తుంటేనే వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లల వలె ఎంతో ముద్దొస్తూ ఉంటాయి!



          ప్రతి అక్షరానికీ తిక్క లేని ఒక లెక్క ఉంది - అచ్చులు,హల్లులు అని రెండు ముఖ్యమైన వర్గాలు ఉన్నాయి. వీటిలో మళ్ళీ ఉచ్చారణలో నాలుక దేన్ని తగులుతుందనే దాన్ని బట్టి చేసిన దంత్యములు, తాలవ్యములు, ఓష్ఠ్యములు అనే మరొక విభజన కూడా ఉంది.సున్నా,అరసున్నా,విసర్గలు కూడా భావవ్యక్తీకరణలో ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకుని ఉండేవి.అరసున్నాని ఇప్పుడెవరూ వాడటం లేదు గానీ ఒకప్పుడు దీనినీ విరివిగానే వాడేవాళ్ళు.పండితులు సభదీర్చి తీర్మానం చేసి దీనిని తొలగించదల్చినప్పుడు ఒక పండితుడు ఎలిజీ రాసి మరీ దుఃఖించాడు!

          జంతుశాస్త్రం చెప్తున్న దాని ప్రకారం ఇండియన్ అయినా,అమెరికన్ అయినా,రష్యన్ అయినా,చైనీస్ అయినా,జపనీస్ అయినా అందరూ ఒకే జాతి - మానవ జాతి.కానీ ఈ మానవ జాతిలో ఇవ్వాళ ప్రత్యేకించి విడదీసి జాతులుగా చూస్తున్న మానవ సమూహాల్లో ప్రతి జాతికీ ఒక మాతృభాష ఉంటుంది!రాజకీయంగా,సామాజికంగా ఎలాంటి స్థితిలో ఉన్నా ఈ భాషకి సంబంధించిన అస్తిత్వాన్ని కోల్పోవడం రెండు విధాలుగా మాత్రమే జరుగుతుంది - ఒకటి ఆ జాతి పూర్తిగా నశించిపోవడం,రెండు ఆ జాతి మరొక జాతి అధిపత్యంలోకి వెళ్ళడం!ప్రపంచంలో ఒకప్పుడు ఉండి ఇప్పుడు లేని సంస్కృతుల చరిత్రలలో ఎక్కువగా ఇదే జరిగింది.తెలుగుభాషకీ తెలుగుజాతికీ ఈ రెండింటిలో ఒకటి గానీ మూడవది గానీ అయిన దుర్గతి పట్టగూడదని కోరుకుంటున్నాను.దానికి మనం చెయ్యవలసింది స.వెం.రమేస్ లాంటివారికి మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వడం.ఆంధ్ర - తెలంగాణ రాష్ట్రాల లోని ప్రజలు రాజకీయ నాయకుల విద్వేష ప్రసంగాలకి ఉద్రేకపూరితులు కాకుండా ఈ రెండు రాష్ట్రాల లోనే కాదు ప్రపంచంలోని అన్నిచోట్లా ఉన్న ప్రతి తెలుగు సమూహం గురించీ ఆలోచించాలి. వారిలో కొందరు మనకన్నా ఎంతో అధ్వాన్న స్థితిలో ఉన్నారు. మన ప్రభుత్వాల నుంచి సహాయాన్ని కోరుకుంటున్నారు.అంతటి అధ్వాన్న స్థితిలో ఉండి కూడా వారు తమని పలకరించటానికి వచ్చిన సాటి తెలుగువాళ్ళని ఆప్యాయంగా పలకరిస్తుంటే వారికన్నా ఎంతో కొంత మెరుగైన స్థితిలో ఉన్న మనం ఇక్కడ చిన్న చిన్న విషయాలకే ఒకరినొకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ సతమతమైపోతున్నాం!

          రాష్ట్రాన్ని విడదీసిన వాళ్ళు మీలాంటి నాలాంటి ప్రజల గురించి ఆలోచించి విడదియ్యలేదు - పై స్థాయిలో చేతులు మారే వేల కోట్ల విలువ చేసే కాంట్రాక్టులను ఎవరు దక్కించుకోవాలన్న లెక్కలతో కొందరూ,ఒక రాష్ట్రం రెండయితే అదనంగా సృష్టించబడే రాజకీయ పదవుల కోసం కొందరూ - తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు చేశారు. అందుకే మనల్ని రెచ్చగొట్టి విద్వేషాలు పెంచిన అన్ని పార్టీల వాళ్ళూ ఇప్పుడు పదవుల్ని పంచుకోవడం కోసం వాళ్ళలో వాళ్ళు అంత ఐకమత్యంగా కలిసిపోగలుగుతున్నారు - కళ్ళు తెరుచుకుని చూదండి!ఈ మేకమెడచంటిపాల కోసం ఎంత ఆశపడినా లాభం లేదని త్వరలోనే తేటతెల్ల మవుతుంది ఎల్లరకూ!ఏ మనిషి ఏ దేశంలో ఏ కాలంలో వృద్ధిలోకి వచ్చినా అతని నైపుణ్యమే కారణం. మీలోని నైపుణ్యాన్ని పెంచుకోండి,అది ఆర్జనని పెంచుతుంది,అది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది - అప్పుడు ఈ విభేదాలూ ద్వేషాలూ వాతంతటవే మాయమై పోతాయి.ఆ రోజున వెనక్కి తిరిగి చూసుకుంటే అనవసరంగా ఆవేశపడ్డామని పశ్చాత్తాపపడకుండా ఉండటానికయినా ఈరోజున కొంచెం విచక్షణతో ప్రవర్తించండి!

మనుషుల్ని కలపటానికి పుట్టిన భాషని మనుషుల్ని విడదియ్యటానికి వాడటం పైశాచికత్వం!

5 comments:

  1. హరిబాబు గారు ...
    ఒకొక్కసారి మీ లోతైన విశ్లేషణలు చూస్తుంటే అబ్బురమనిపిస్తుంది. విషయ సేకరణ, క్రోడీకరణ వెరసి ప్రదర్శనం అద్భుతమనిపింప జేస్తుంది. ఎక్కడెక్కడి విషయాలూ, ఎన్నెన్ని సోదాహరణలూ, వివరణలూ ... గ్రేట్ ...
    kudos ...

    ReplyDelete
    Replies
    1. ప్రశంసలకి కృతజ్ఞతలు!

      Delete
  2. My analysis of GHMC results (part 1):

    http://jaigottimukkala.blogspot.in/2016/02/ghmc-results-analysis-part-1.html

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...