Thursday, 24 October 2019

కల్పవృక్షం కింద కూర్చుని ఏది అనుకుంటే అది జరిగిపోతుంది - నిజమేనా!

భౌతిక ప్రపంచంలో ఏది కావాలన్నా పని చెయ్యాలి.ఇంతవరకే తెలుసుకుంటే కల్పవృక్షం గురించి చెప్పినది అభూత కల్పన అనిపిస్తుంది.తపస్సు చేస్తే కల్పవృక్షత్వం సిద్ధిస్తుంది అనేది అర్ధం కావాలంటే తపస్సు అనే మాటకు అర్ధం తెలియాలి.కల్ప-సంకల్ప-వికల్పాలను నియంత్రించటమే తపస్సు!

మనం రోజూ చేసే పనుల్ని కొంచెం దగ్గరనుంచి గమనించితే మనకు తెలియకుండానే తపస్సు చేస్తూ తపస్సు వల్ల వచ్చే ప్రయోజనాల్ని పొందుతున్నట్టు తెలుస్తుంది.మనకు చీర కావాలి.మన దగ్గిరున్న డబ్బుల్ని చీరను తయారుచేసిన ఇంకొకరికి ఇచ్చి అతని దగ్గిరున్న చీరను తెచ్చుకునే వ్యవహారంలో జరుగుతున్నది ఏమిటి?చీర కావాలి అనేది కల్పం/అవసరం, చీరను కొనడం అనేది సంకల్పం, దానికి మనం డబ్బును ఇవ్వడం వికల్పం - ఇంతకీ చీర అనే పదం,వస్తువు మొదట ఉనికిలోకి ఎలా వచ్చాయి?అనేకమంది వ్యక్తుల సమిష్టి ఉత్పత్తి చీర - ఒక కణం తర్వాత ఒక కణం కలిసి ప్రత్తి అనేది సృష్టిలో ఆవిర్భవించడం,దాని ఉపయోగం తెలిసిన కొందరు ఒక ప్ర్ణాళిక వేసుకుని ప్రత్తి విత్తనాల్ని నాటి ఎరువులు వేసి కోసి అమ్మితే మరికొందరు దారాలు తీసి అల్లి రంగులద్ది మన ముందు ఉంచడం వెనక ఉన్నది అనేక తపశ్శక్తుల కలయిక కాక మరేమిటి?మొదట కొందరు చీర అనేది తయారయ్యాక దేనికి ఉపయోగపడుతుందో వూహించి తయారు చేసి మన ముందు ఉంచి దాని ఉపయోగం గురించి చెప్పాకనే కదా మనకు చీర అవసరం అయ్యింది!

ప్రాచీన భారతీయ ఋషులు చేసినది కూడా ఇదే - ఫలానా ఋషి ఫలానా లక్ష్యం కోసం తపస్సు చేసి దైవకృప చేత దాన్ని సాధించాడు అనటంలోని అర్ధం అతను కళ్ళు మూసుకుని కూర్చున్నాడని కాదు, ఆ లక్ష్యం కోసం తపించి శ్రమించాడు.ఎవరినీ యాచించకుండా మన కోరికల్ని ధర్మబద్ధమైన పద్ధతిలో సాధించాలంటే మనం చేరుకోవలసిన మానసిక స్థితిని సాధించడమే యమ, నియమ, ప్రాణాయామాలతో కూడుకున్న యోగప్రక్రియల ప్రయోజనం!అదే అన్నింటినీ సాధించిపెడుతుందనేది మూఢనమ్మకం మాత్రమే - ఆ రకమైన మానసిక స్థితిలో ఉండి చేసే పనులు సత్వర ఫలితాలను ఇస్తాయి కాబట్టి దుష్కరమైన లక్ష్యాలను పెట్టుకున్నవారు మొదట వాటిని సాధన చేసేవారు.

ఆయుర్వేదం లాంటి విద్యలను లోకానికి అందించిన ఋషులే కాదు హిరణ్యకశిపుడి లాంటివాళ్ళు ఆమరత్వం కోసం చేసిన తపస్సులు కూడా ఇవే కోవలోకి వస్తాయి.అయితే, వాళ్ళు చేసిన అసలు శ్రమ యేమిటో తమ లక్ష్యాలను సాధించటానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఏమిటో సూక్ష్మమైన వివరాలు తెలియక పోవడం చేత ఆ కృషికి సంబంధంచిన గుర్తింపుని తపస్సుకి అంటగట్టెయ్యడం వల్ల జరిగిన ప్రమాదం అది, అంతే!

ఎవరినీ యాచంచకుండా ఎవరినీ దోచుకోకుండా తను దోపిడీకి గురి కాకుండా బతకాలనే సంకల్పం ఉన్న ప్రతి మానవుడూ ఒక కల్పవృక్షమే!

2 comments:

  1. Sudheer chowdary balla13 November 2019 at 05:07

    Awesome sir .. .. This thought will change the entire perception towards puranad

    ReplyDelete
  2. https://www.quora.com/What-is-the-PhD-thesis-of-Kanhaiya-Kumar-of-the-JNU-fame-about-Did-he-write-it-himself

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...