Friday, 12 November 2021

భాగవతం ప్రకారం సృష్టి ఎలా జరిగింది,ఎలా పెరిగింది, ఎలా నడుస్తుంది,ఎలా అంతమౌతుంది?

 ద్వితీయ స్కంధము : విరాట్స్వరూపము తెలుపుట

భగవంతుడైన విష్ణుని విరాటస్వరూపంలో జరిగిన, జరగనున్న, జరుగుతున్న ప్రపంచమంతా గోచరిస్తుంది. భూమి, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకారము, మహత్తత్త్వము అనే ఆవరణాలు ఏడూ మహాండకోశమైన విరాట్పురుషుని శరీరమే అయి ఉన్నాయి. ఆ శరీరంలో ధారణకు నెలవై విరాట్పురుషుడు ప్రకాశిస్తున్నాడు. ఆ మహాత్ముడికి పాతాళం అరికాలు; రసాతలం కాలిమడమ మునివ్రేళ్ళు; మహాతలం చీలమండలు; తలాతలం పిక్కలు; సుతలం మోకాళ్ళు రెండు; వితలము అతలము తొడలు; భూతలం పిరుదు; ఆకాశం బొడ్డు; గ్రహాలూ తారకలూ మొదలైన జ్యోతిస్సమూహంతో కూడిన నక్షత్రలోకం వక్షస్థలం; మహర్లోకం మెడ; జనలోకం ముఖం; తపోలోకం నొసలు; సత్యలోకం శిరస్సు; ఇంద్రుడు మొదలైనవారు భుజదండాలు; దిక్కులు చెవులు; శబ్దం శ్రోత్రేంద్రియం; అశ్వినీ దేవతలు ముక్కుపుటాలు; గంధం ఘ్రాణేంద్రియం; అగ్ని నోరు; అంతరిక్షం కళ్లు; సూర్యుడు నేత్రేంద్రియం; రేయింబవళ్ళు కనురెప్పలు; బ్రహ్మపదం కనుబొమలు; జలాలు దవడలు; రసం జిహ్వేంద్రియం; సమస్త వేదాలు భాషణాలు; తుదిలేని సృష్టులే కడగంటి చూపులు; సిగ్గు లోభం పెదవులు; ధర్మ మార్గాలు కడుపు; కొండలు ఎముకలు; నదులు నాడులు; చెట్లు రోమాలు; వాయువు నిట్టూర్పులు; కడలేని కాలమే ప్రాయం; పలువిధాలైన ప్రాణులతో గూడిన సంసారాలు కర్మలు; మబ్బులు శిరోజాలు; సంధ్యలు కట్టుబట్టలు; ప్రధానం హృదయం; చంద్రుడు వికారాలన్నింటికీ నెలవైన మనస్సు; మహత్తత్త్వం చిత్తం; రుద్రుడు అహంకారం; గుఱ్ఱాలు, కంచరగాడిదలు, ఒంటెలు, ఏనుగులు గోళ్ళు; పశువులు, మృగాదులు కటిప్రదేశం; పక్షులు చిత్రమైన మాటల నేర్పులు; మనువు బుద్ధి; పురుషుడు నివాసం; దానవులు వీర్యం. అంతేకాదు. ఆ మహాప్రభువునకు బ్రాహ్మణులు ముఖం; క్షత్రియులు బాహువులు; వైశ్యులు తొడలు; శూద్రులు పాదాలు; వసువులు రుద్రులు మొదలైన పెక్కు దేవతల పేర్లే నామాలు; హవిర్భాగాలు ద్రవ్యాలు; యజ్ఞప్రయోగాలు కర్మలు అవుతున్నాయి.

కలలు కనేటప్పుడు జీవుడు ఉబలాటంతో పలు శరీరాలు తాలుస్తాడు. పలుపేర్లతో వ్యవహరింప బడతాడు. ఇంద్రియాల ద్వారా విశేషాలన్నీ గమనిస్తాడు. పిమ్మట మెళకువ వచ్చిన తరువాత, తన్ను తాను తెలుసుకుంటాడు. ఇలాగే సమస్తానికి అంతరాత్మగా ఉన్న పరమేశ్వరుడు, సర్వ ప్రాణుల హృదయాలలో ఉండి ప్రజ్ఞావంతుడై బుద్ధివ్యాపారా లన్నింటినీ పరిశీలిస్తుంటాడు. తానే అన్నిటికీ ప్రభువు కాబట్టి, దేనికీ బద్ధుడు కాడు. తాను సత్యస్వరూపుడు. ఆనదంతో నిండిన విజ్ఞానమూర్తి.

పూర్వం ఆదిలో బ్రహ్మ జగత్తును సృష్టించాలనుకొన్నాడు. పెక్కేండ్లు ప్రయత్నించాడు. అయినా నేర్పరి కాలేకపోయాడు. ఆ పైన ఏకాగ్రచిత్తంతో నారాయణుని ప్రార్థించాడు. మహోన్నతమైన బుద్ధి వికాసం పొందాడు. పిమ్మట ప్రాణి కోట్ల పుట్టుకను నిర్ణయించి జగన్నిర్మాణదక్షుడై విహరించాడు.

 

ద్వితీయ స్కంధము : సృష్టి క్రమంబు

గొప్ప పుణ్యం వల్ల బ్రహ్మలోకం చేరిన వారు మరొక కల్పంలో తమ తమ పుణ్యాల హెచ్చు తగ్గులను బట్టి ఆయా అధికారాలను పొందుతారు. బ్రహ్మ మొదలైన దేవతలను సేవించి శరీరత్యాగం చేసినవాడు ఆ బ్రహ్మ జీవించినంతకాలం బ్రహ్మలోకంలో నివసించి కడపట ముక్తి పొందుతారు. శ్రీహరి పాదపద్మాలపై అత్యంత భక్తి కలిగి దేహం వీడినవారు స్వేచ్ఛతో నిరాటంకంగా పయనం సాగించి బ్రహ్మాండాన్ని భేదించుకొని అత్యున్నతమైన వైష్ణవస్థానం అధిష్ఠించి ప్రకాశిస్తారు.ఈశ్వరు డధిష్ఠించిన ప్రకృతి అంశంతో మహత్తత్త్వం పుడుతుంది.మహత్తత్త్వం అంశంతో అహంకారం పుడుతుంది.అహంకారం అంశంతో శబ్దతన్మాత్ర పుడుతుంది.శబ్దతన్మాత్ర అంశంతో (1) ఆకాశం పుడుతుంది.ఆకాశం అంశంతో స్పర్శ తన్మాత్ర పుడుతుంది.స్పర్శతన్మాత్ర అంశంతో (2) వాయువు పుడుతుంది.రూపతన్మాత్ర అంశంతో (3) అగ్ని పుడుతుంది.అగ్ని అంశంతో రసతన్మాత్ర పుడుతుంది.రసతన్మాత్ర అంశంతో (4) జలం పుడుతుంది. జలం యొక్క అంశతో గంధ తన్మాత్ర పుడుతుంది. గంధ తన్మాత్ర అంశతో (5) పృథ్వి పుడుతుంది. వీటన్నిటి కలయిన వల్ల పదునాల్గు భువనాల స్వరూపమైన విరాడ్రూపం ఉద్భవిస్తుంది.

ఆ రూపానికి కోటి యోజనాల విస్తీర్ణమైన అండకటాహమే మొదటి ఆవరణమైన భూమి అవుతుంది. కొందరు దీనిని ఏబదికోట్ల యోజనాల విశాలమని వర్ణిస్తారు. ఈ ఆవరణం మీద జలం, తేజస్సు, వాయువు, ఆకాశం, అహంకారం, మహత్తత్త్వం అనే ఆరు ఆవరణాలున్నాయి. అవి క్రమంగా ఒకదాని కొకటి పదేసి రెట్లు పెద్దవిగా ఉన్నాయి. ఆ యేడావరణాల మీద ఎనిమిదవదైన ప్రకృత్యావరణం గొప్పగా వ్యాపించి ఉంది.

 

 

 

 

ద్వితీయ స్కంధము : బ్రహ్మ అధిపత్యం బొడయుట

మాయ ఈశ్వరుని దృష్టిపథంలో ప్రవేశించడానికి శంకించి సిగ్గుతో కుంచించుకపోతుంది.శరీరనిర్మాణానికి ఉపయోగపడే పృథివ్యాది పంచ మహాభూతాలు, పుట్టుకకు హేతువులైన కర్మలు, కర్మ ప్రవృత్తికి హేతువైన కాలము, కాల మార్పులకు కారణమైన స్వభావము, వీటిన అనుభవించే జీవుడు సమస్తము ఆ శ్రీమన్నారాయణుడే. అన్యమైనది ఏది లేదు. ఇది నిజం. ఈ లోకాన్ని నియమించే వాడు వాసుదేవుడే. వేల్పులు నారాయణుని శరీరంనుండి పుట్టినవారే; వేదాలు, యాగాలు, తపస్సులు, ప్రాణాయామాది యోగాలు, విజ్ఞానము సమస్తం నారాయణుని ఆరాధనా రూపమైనవే; జ్ఞానం వల్ల సాధించే ఫలం కూడా నారాయణుని అధీనంలోనే వుంది. నిర్వికారుడు, సర్వాంతర్యామి, సర్వదర్శనుడు అయిన భగవంతుని క్రీగంటిచూపుచే ప్రేరేపింపబడి, గుణరహితుడైన ఈశ్వరుని నుండి రజస్సు, సత్త్వము, తమస్సు అనే మూడు గుణాలు పుడుతున్నాయి. అవి ఉత్పత్తికి, స్థితికి, లయాలకి హేతువు లవుతున్నాయి. కార్యభావంలోనూ, కారణభావంలోనూ, కర్తృభావంలోనూ ద్రవ్యాలైన పృథివ్యాది పంచ మహాభూతాలనూ, జ్ఞానరూపాలైన బ్రహ్మాది దేవతలనూ, క్రియారూపాలైన ఇంద్రియాలనూ ఆశ్రయిస్తున్నాయి. జీవుడు సదా ముక్తుడే అయినా మాయతో కూడి ఉండడం వల్ల ఆ త్రిగుణాలు అతణ్ణి బంధిస్తున్నాయి. జీవుణ్ణి కప్పివేసే ఉపాధులైన ఈ మూడు గుణాలను కల్పించి తద్ద్వారా ఈశ్వరుడు ఇతరులకు ఏ మాత్రం గోచరించక తనకు మాత్రం గోచరించే తత్త్వంతో ఈ విధంగా వినోదిస్తూ ఉంటాడు.

మాయకు నియామకుడు ఈశ్వరుడు, ఆ ప్రభువుకు తన మాయవలన, దివ్యమైన యోగము వలన కాలము, జీవదృష్టము, స్వభావము అప్రయత్నంగా సిద్ధించాయి. వాటిని ఆయన వివిధరూపాలుగా చేయాలని నిశ్చయించుకొని సృష్టి కార్యానికి సహకారులుగ స్వీకరించాడు. ఈశ్వరునిచే అధిష్ఠింపబడ్డ మహత్తత్త్వం కారణంగా కాలంనుండి జన్మములు సిద్ధించాయి. రజోగుణం చేతా, సత్త్వగుణం చేతా, వృద్ధిపొందిన మహత్తత్త్వం వికారానికి లోనయింది. దానినుంచే తమోగుణ ప్రధానమైనదీ, పంచభూతాలు, పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు రూపంగా కలదీ అయిన అహంకారం జనించింది. ఆ అహంకారం మళ్లీ వికారానికి లోనై ద్రవ్యశక్తి యైన తామసమనీ, క్రియాశక్తియైన రాజసమనీ, జ్ఞానశక్తియైన సాత్త్వికమనీ మూడు రూపాలుగా పంచభూతాలకూ మూలకారణమైన తామసాహంకారం నుండి ఆకాశం పుట్టింది. ద్రష్ట అయిన ఆత్మకూ, దృశ్యమైన జగత్తుకూ బోధకమూ, సూక్ష్మరూపమైన వున్న శబ్దం ఆకాశానికి గుణమయింది. వికారానికి లోనైన ఆకాశం నుండి స్పర్శ గుణప్రధానమైన వాయువు పుట్టింది. తనకు కారణనైన ఆకాశమందలి శబ్దమూ, తనకు సహజమైన స్పర్శమూ అనే రెండు గుణాలు వాయువున కున్నాయి. వాయువు శరీరాలలో ప్రాణరూపంలో వుంటుంది. అది ఇంద్రియ పాటవానకీ, మనోబలానికీ, శారీరక శక్తికీ హేతువవుతున్నది. వికారం పొందిన వాయువు నుండే రూపం, స్పర్శం, శబ్దం అనే మూడు గుణాలతో పాటు తేజస్సు జనించింది. తేజస్సు నుండి రసం, రూపం, స్పర్శం, శబ్దం అనే నాలుగు గుణములతో జలము పుట్టినది. జలమువలన గంధ, రసం, రూపం, స్పర్శం, శబ్దంబులు అనెడి అయిదు గుణాలతో పృథ్వి పుట్టింది. పై జెప్పినవనన్నీ తామసాహంకారంనుండి కల్గినవే. వికారానికి లోనైన సాత్త్వికాహంకారం నుండి మనస్సు పుట్టింది. దానికి చంద్రుడు అధిదేవత, అంతేకాక ఆ సాత్త్వికాహంకారం నుండే దిక్కులు, వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్వినీ దేవతలు, అగ్ని, ఇంద్రుడు, ఉపేంద్రుడు, మిత్రుడు, ప్రజాపతి అనే పదిమంది దేవతలు పుట్టారు. తైజసమైన రాజసాహంకారం నుండి శ్రవణం మొదలైన ఐదు జ్ఞానేంద్రియాలూ, వాక్కు మొదలైన ఐదు కర్మేంద్రియాలూ, బుద్ధీ, ప్రాణమూ కలిగాయి. ఆ పది యింద్రియాల అధిదేవతల వివరమిలా ఉన్నాయి; శ్రవణేంద్రియానికి దిక్కులూ, త్వగింద్రియానికి వాయూవూ, నేత్రేంద్రియానికి సూర్యుడు, రసనేంద్రియానికి ప్రచేతసుడూ, ఘ్రాణేంద్రియానికి అశ్వినీదేవతలూ, వాగింద్రియానికి అగ్నీ, హస్తేంద్రియానికి ఇంద్రుడూ, పాదేంద్రియానికి ఉపేంద్రుడూ, గుదేంద్రియానికి మిత్రుడూ, ఉపస్థేంద్రియానకి ప్రజాపతీ దేవతలుగా ఉన్నారు. బుద్ధి జ్ఞానం కలిగించే అంతకరణంలో ఒక భాగం ప్రాణం క్రియను కల్గించే అంతకరణం. శ్రోత్రం మొదలైన పది యింద్రియాలతో కూడిన భూతాలు, ఇంద్రియాలు, మనస్సు, శబ్దస్పర్శాది గుణాలు విడివిడిగా ఉన్నప్పుడు బ్రహ్మాండమనే శరీరాన్ని నిర్మించలేక పోయాయి. ఇల్లు కట్టాలంటే అనేక వస్తువులను ఒక్కచోట చేర్చితే కాని సాధ్యం కాదు గదా అదే రీతిగా పైన జెప్పిన భూతాలు, ఇంద్రియాలు, మనస్సు. గుణాలు భగవంతుని శక్తివల్ల ప్రేరణ పొంది ఒక్కటిగా చేరాయి. సమష్టిగానూ, వ్యష్టిగానూ కలిసి చేతనాలనూ, అచేతనాలనూ కల్పించాయి. అలా యీ బ్రహ్మాండాన్ని నిర్మించాయి.

 

ద్వితీయ స్కంధము : లోకంబులు పుట్టుట

ప్రపంచ స్వరూపుడైన ఆ ఈశ్వరుడు ఒక భవనం లాగ ఉన్న బ్రహ్మాండాన్ని విడివిడిగాచేసి విపులమైన చతుర్దశభువనాలుగా తీర్చిదిద్దాడు.ఈ పదునాలుగు లోకాలలో, పై యేడు లోకాలూ శ్రీ మహావిష్ణువునకు నడుమునుండి పై శరీరమంటారు. అలాగే క్రింది యేడు లోకాలూ నడుమునుండి క్రింది శరీరమని చెపుతారు. ప్రపంచమే భగవంతునికి శరీరం. ఆయన ముఖంనుండి బ్రహ్మకులము, బాహువులనుండి క్షత్రియకులము, తొడలనుండి వైశ్యకులము, పాదాలనుండి శూద్రకులము పుట్టాయని వర్ణిస్తారు. ఆ మహావిష్ణువుకు కటిస్థలం భూలోకం, నాభి భువర్లోకం, హృదయం సువర్లోకం, వక్షం మహర్లోకం, కంఠం జనలోకం, స్తనాలు తపోలోకం, శిరస్సు సనాతనమైన బ్రహ్మ నివసించే సత్యలోకం, జఘనం అతలం, తొడలు వితలం, మోకాళ్లు సుతలం, పిక్కలు తలాతలం, చీలమండలం మహాతలం, కాలిమునివేళ్లు రసాతలం, అరికాలు పాతాళం; ఈ కారణంగా ఆయనను లోకమయుడని భావిస్తారు. మరికొంతమంది ఆయన పాదతలం నుండి భూలోకమూ, బొడ్డునుండి భువర్లోకమూ, శిరస్సునుండి స్వర్లోకమూ పుట్టాయని మూడు లోకాల సృష్టినీ వివరిస్తారు. శ్రీమన్నారాయణుని ముఖంనుండి సమస్త ప్రాణుల వాక్కులూ, వాక్కుల కధిష్ఠానమైన అగ్నీ పుట్టాయి. చర్మం, రక్తం, మాంసం, మెదడు, ఎముకలు, మజ్జ, శుక్లం అనే ఇవి యేడు ఆ దేవుని యేడు ధాతువులని చెబుతారు. మరొక పద్ధతిలో రోమాలు, చర్మం, మాంసం, ఎముకలు, స్నాయువులు, మజ్జ, ప్రాణాలు అనే ఇవి ఏడు ధాతువులని వర్ణిస్తారు. వాటిలో రోమాలు ఉష్ణికం ఛందస్సనీ, చర్మం ధాత్రీఛందస్సనీ, మాంసం త్రిష్టుప్ ఛందస్సనీ, స్నాయువు అనుష్టుప్ ఛందస్సనీ, శల్యం జగతీఛందస్సనీ, మజ్జ పంక్తిచ్ఛందస్సనీ, ప్రాణం బృహతీ ఛందస్సనీ వ్యవహరిస్తారు. దేవతల కర్పించే పురోడాశరూపమైన హవ్యానికీ, పితృదేవతలకిచ్చే చరురూపమైన కవ్యానికీ, అమృతాన్నానికీ, తీపి మొదలయిన ఆరు రసాలకీ, రసనేంద్రియానికీ, రసానికీ అధీశ్వరుడైన వరుణుడికీ విష్ణుదేవుని రసనేంద్రియమే జన్మస్థానం. అలాగే అన్ని ప్రాణాదులకు, వాయువుకూ విష్ణుని నాసా రంధ్రం నెలవు. దగ్గరగానూ, దూరంగానూ వ్యాపించే వాసనలకూ, ఓషధులకూ, అశ్వినీ దేవతలకూ ఆ పరమేశ్వరుని ఘ్రాణేంద్రియం స్థానం. దేవలోకానికీ, సత్యలోకానికీ, తేజస్సుకూ, సూర్యుడికీ, సకల నేత్రాలకూ లోకనేత్రుడైన పరమాత్ముని చక్షురింద్రియమే నివాసం, దిక్కులకూ, ఆకాశానికీ, శ్రవణాంశాలకూ, శబ్దానికీ సర్వేశ్వరుని శ్రోత్రేంద్రియం జన్మభూమి. ప్రశస్తాలైన వస్తువులకూ, కొనియాడదగిన సౌందర్యాలకూ పరమ పురుషుని శరీరమే స్థానం. స్పర్శానికీ, గాలికీ, సకల స్నిగ్దత్వాలకి ఆ దివ్యశరీరుని త్వగింద్రియమే గృహం. యాగపశువును బంధించే స్తంభాది యజ్ఞపరికరాలైన చెట్లూ, పొదలూ, తీగలూ మొదలైన వాటికి పురుషోత్తముని రోమాలు స్థానాలు, రాళ్లూ, లోహాలు ఆ విశ్వమయునికి గోళ్లు, మబ్బులు సరోజాక్షుని శిరోజాలు. మెరపులు సర్వేశ్వరుని మీసాలు, భూలోక భువర్లోక సువర్లోకాలను కాపాడే లోకపాలకుల పరాక్రమాలకు, భూలోకం మొదలైన లోకాల క్షేమానికీ, శరణానికీ నారాయణుని పరాక్రమం నట్టిల్లు. ఎల్లకోరికలకూ, శ్రేష్ఠమైన వరాలకూ ఆ పవిత్రపాదుని పాదపద్మాలే నిలయాలు. జలాలు, శుక్లం, పర్జన్యు, ప్రజాపతి సృష్టి అనే వీటన్నింటికీ ఆ సర్వేశ్వరుని పురుషాంగం జన్మస్థలం. సంతతికీ, కామం మొదలైన పురుషార్థాలకూ, మనస్సుకూ కలిగించే ఆనందాలకూ, శరీరసుఖానికీ అచ్యుతుని గుహ్యేంద్రియం స్థానం. యముడికీ, మిత్రుడికీ, మలవిసర్జనానికీ ఆ దేవుని గుదేంద్రియం ఇల్లు. హింసకూ, నిరృతికీ, మృత్యువుకూ, నరకానికీ ఆ సర్వరూపుని గుదం నెలవు. అవమానానికీ, అధర్మానికీ, అవిద్యకూ, చీకటికీ, అంతము లేని ఆ దేవుని పృష్ఠప్రదేశం నివాసం. నదనదీ సమూహాలకు ఈశ్వరుని నాడీ సంఘం పుట్టిల్లు. కొండలకు అధోక్షజని ఎముకలు జన్మస్థానాలు. ప్రధానానికీ, అన్నరసానికీ, సముద్రాలకూ, భూతాల విలయానికీ ఆ బ్రహ్మాండగర్భుని ఉదరం ఉనికిపట్టు. మానసిక వ్యాపార రూపమైన లింగదేహానికి గొప్పమహిమ గల ఆ దేవుని హృదయం సృష్టి స్థానం. అంతే కాదు.

 

ద్వితీయ స్కంధము : శ్రీహరి ప్రధానకర్త

జగతీతల మంతా వ్యాపించివున్న ఈశ్వరుని మాయ అనేది లేకపోతే జీవునికి దేహంతో సంబంధం కలుగదు. నిద్రించే వేళ స్వప్నంలో దేహాలతో సంబంధం గోచరిస్తుదికదా, అలాగే నారాయణుని యోగమాయా ప్రభావంవల్ల జీవుడు పంచభూతాలతో కూడిన దేహంతో సంబంధం కలవాడవుతాడు. ఆ మాయాగుణాలవల్లనే క్రమంగా బాల్యం, కౌమారం, యౌవనం అనే దశలు పొందుతాడు. మనుష్య, దేవతాది ఆకారాలను గూడ స్వీకరిస్తాడు. నేను అనే అహంకారాన్ని, నాది అనే మమకారాన్ని పెంచుకొంటాడు. సంసారమాయలో బద్దుడవుతాడు.

ప్రకృతికి, పురుషుడికి అతీతమైన బ్రహ్మస్వరూపాన్ని ఎప్పుడు జీవుడు తీవ్రంగా ధ్యానిస్తాడో, అప్పుడు మోహంనుండి విడివడుతాడు. అహంకార మమకార మయమైన సంసారంనుండి విముక్తుడై ముక్తి పొందుతాడు. అంతేకాదు. జీవుడికి, ఈశ్వరుడికి, శరీరాలతో సంబంధాలు కనిపిస్తున్నాయి. భగవంతుడుకూడ శరీరం ధరించే ఉన్నాడు. అట్టి భగవంతుడి మీద భక్తి గలిగి ఉంటే జీవుడి కెలా ముక్తి సిద్ధిస్తుంది అని అడిగావు. అవిద్యకు లోనైనవాడు జీవుడు. అవిద్య ప్రభావంవల్ల అతడు కర్మ ననుసరించి సంప్రాప్తించిన శరీరాన్ని ధరిస్తాడు. ఆ దేహం మిథ్యారూప మైనది. భగవంతుడు యోగమాయతో గూడినవాడు. ఆయన తన యోగమాయాప్రభావం వల్ల తన ఇష్టానుసారం జ్ఞానమయమైన లీలాశరీరం కల్పించుకొంటాడు.

దేవాదిదేవుని పాదాలమీద భక్తి గల్గివుండడంలోని పరమ రహస్యాన్ని ఉపదేశించినవాడు, దేవతల కందరికి అధినేత అయిన విధాత కల్పారంభంలో తనకు నెలవైన పద్మానికి మూల మేమిటో పరిశీలించాలనుకొన్నాడు. నీళ్లలో వెదకడం ప్రారంభించాడు. ఎంత వెదకినా ఆ పద్మానికి మొద లెక్కడ వుందో తెలుసుకోలేకపోయాడు. చివరికి విసిగి వేసారి మరలివచ్చి ఆ పద్మంలోనే ఆసీను డయ్యడు. జగత్తును సృష్టించాలనే సంకల్పం ఆయన హృదయంలో ఉదయించింది. ఎంతో ఆలోచించాడు. కాని సృష్టికి సంబంధించిన పరిజ్ఞానం ఆయన మనస్సుకు అందక క్రిందుమీదయ్యాడు. అలసత్వం ఆవహించింది. లోకాలను సృష్టించలేక పోయాడు. అతని చిత్తం మోహాయత్త మయింది. చింతాక్రాంతు డయాడు.

సమయంలో నీటిలో నుండి ఒక శబ్దం వినిపించింది. మొదలు వరకూ ఉండే స్పర్శాక్షరాలలో పదువారవదీ ఇరవై యొకటవదీ అయినతపఅనే రెండు అక్షరాలవల్ల శబ్దం ఏర్పడింది. “తపఅనే పదం మహర్షులకు అమూల్యమైన ధనం. మాట రెండుసార్లుతప తపఅని ఉచ్చిరింపబడింది. బ్రహ్మ దాన్ని విన్నాడు. శబ్దాన్ని ఉచ్చరించిన పురుషుణ్ణి చూడాలనుకొన్నాడు. నాలుగు దిక్కులకు వెళ్లి వెతికాడు. ఎక్కడా పురుషుడు గోచరించలేదు. తిరిగివచ్చి తన నివాసమైన పద్మంలోనే కూర్చున్నాడు. కొంత సేపు ఆలోచించాడు. తన్ను తపస్సు చేయమని హేచ్చరించటానికే శబ్దం వినపించింది అనుకొన్నాడు. ప్రాణాయామం ప్రారంభించాడు. జ్ఞానేంద్రియాలనూ, కర్మేంద్రియాలనూ స్వాధీనం చేసుకొన్నాడు. మనస్సును ఏకాగ్రం చేసుకొని వెయ్యి దివ్య సంవత్సరాలు అలా తపస్సు చేసాడు. దారుణ తపస్సుకు లోకాలన్ని తపించిపోయాయి. అప్పుడు శ్రీహరి ప్రసన్నుడై బ్రహ్మకు ప్రత్యక్షమయ్యాడు. వెంటనే బ్రహ్మ వైకుంఠపురాన్ని దర్శించాడు. పురం రాజసగుణానికి, తామసగుణానికి గుణాలతో మిశ్రమైన సత్త్వగుణానికి అతీత మయినది. కేవల సత్త్వగుణానికి నివాస మయింది. కాలానికి అక్కడ ప్రాబల్యం లేదు. ఆది అన్ని లోకాలకంటే అత్యున్నత మైనది. సమస్త దేవతలకు ప్రస్తుతింప దగినది. అక్కడ లోభం, మోహం, భయం అనేవి లేవు. అక్కడికి పోయినవారు మళ్లీ తిరిగి రావడమంటూ జరగదు. తుది లేని తేజస్సుతో అది ప్రకాశిస్తు ఉన్నది. అలాంటి వైకుంఠపురాన్ని సరోజ సంభవుడు సందర్శించాడు.

 

ద్వితీయ స్కంధము : వైకుంఠపుర వర్ణనంబు

అక్కడ వైకుంఠపురంలో మేడలు, విమానాలు, గోపురాలు, మిద్దెలు, మండపాలు, దివ్యమణికాంతులతో దేదీవ్యమానంగా తేజరిల్లుతున్నాయి. ఆ దీప్తులు సూర్యచంద్రాగ్నుల తేజస్సులను చొరనీయటం లేదు. ఇంకా ఆ వైకుంఠపురంలో పూలగుత్తులతో నిండి కోరిన ఫలాలు ప్రసాదించే కల్పవృక్ష సమూహాలు ఉన్నాయి. బంగారు కఱ్ఱలకు తగిలించిన రంగు రంగుల పతాకలు గాలికి రెపరెప లాడుతున్నాయి. వికసించిన కలువల్లోనూ, కమలాల్లోనూ మకరందముం గ్రోలుతూ మధుకర బృందాలు ఆనందంతో ఝంకారం చేస్తున్నాయి. అక్కడి తటాకాలు ఆ శబ్దానికి మేల్కొన్న కలహంసలతో కనులపండువుగా శోభిస్తున్నాయి.

ఆ వైకుంఠపురంలో ఉన్నట్టి రామచిలుకలు “కేశవుని కంటె పరదైవం లేదు అని నేర్పుగా పలుకు తున్నాయి. గోరువంకలు “విశ్వమంతా విష్ణుమయం అని మహిమతో చదువుతున్నాయి. కోయిలలు అతిశయంగా “పద్మనేత్రా! నీదే జయం అని పాడుతున్నాయి. నెమళ్లు ఉత్సాహముగా “మధుసూదనుడ! నీకు మంగళం అని ఆడుతున్నాయి. తుమ్మెదల గుంపులు ఆసక్తితో “శ్రౌషట్ వషట్ స్వధా ఇత్యాది శబ్దాలతో ఝంకారం చేస్తున్నాయి. ఈ విధంగా అన్నింటినీ మించి సాటిలేని వైభవోపేతమైన వైకుంఠమందిరం సమస్త దివ్య మంగళ లీలావిలాసాలతో పరమసుందరంగా వుంది.

విష్ణు పరిచారకులు సునందుడు, నందుడు, అర్హణుడు, ప్రబలుడు మొదలైనవారు భగవానుని భక్తితో భజిస్తున్నారు. వాళ్ళు నల్లకలువల్లాగా నీలమై నిగనిగలాడే శరీరాలతో నివ్వటిల్లుతున్నారు. పచ్చని కొంగ్రొత్త వస్తములను కట్టుకొన్నారు. తెల్లతామర రేకుల వంటి కన్నులతో శోభిల్లుతున్నారు. వారివి సుతిమెత్తని దేహాలు, వాళ్లు ధగధగలాడే రత్నాభరణాలూ, కంఠహారాలూ, కంకణాలూ, ముత్యాల సరాలూ, భుజకీర్తులూ, అందెలూ ధరించి వున్నారు. మాసిపోని యౌవనంతో భాసిస్తున్నారు. పవిత్రమైన ప్రవర్తన కలిగి వున్నారు. అందరు హరిరూపాలు ధరించి జాజ్వల్యమానంగా వెలుగొందుతున్నారు. వారు వైడూర్యాలతోటి, పగడాలతోటి, తామర తూండ్లతోటి సమానమైన శరీరాలు కలిగి వున్నారు. వారు అందరు భక్తితో శ్రీమన్నారాయణుని భజిస్తున్నారు.

ఆ భగవంతుని కోమల పాదపద్మాలనుండే సమస్త పాపాలనూ కడిగివేసే గంగానది ఉద్భవించింది. తన కడగంటి చూపుతో కలుములన్నీ ప్రసాదింపగల శ్రీమహాలక్ష్మి ఆయన వక్షఃస్థలంలోనే నివసిస్తున్నది. ఆయన సూర్యచంద్రులనే సుందరమైన కన్నులు కలవాడు. ఆ కనులలో కరుణా తరంగాలు పొంగిపొరలుతూ వుంటాయి. జగత్తును సృష్టించడంలో నిపుణుడైన బ్రహ్మ ఆ భగవంతుని నాభికమలం నుండే జన్మించాడు. శేషుడే ఆయనకు తల్పం గరుడుడే ఆయనకు వాహనం. ముక్కోటి దేవతలు, మునులు ఆయనను సేవిస్తు వుంటారు. ఆయన సమస్తలోకాలకు తండ్రి. అలాంటి పరమేశ్వరుణ్ణి బ్రహ్మదేవుడు కన్నులకరవు దీరేటట్టుగా చూచాడు.

చక్కని రూపరేఖావిలాసాలతో చక్కగా ఒప్పి వున్న లక్ష్మీదేవి, తన కోమలమైన పాణి పద్మాలతో ప్రాణేశ్వరుని పాదపద్మాలను ఒత్తుతున్నది.అంతే కాదు, శ్రీ మహాలక్ష్మి రత్నకాంతులతో విరాజిల్లే బంగారపు తూగుటూయెలలో ఊగుతు ఉన్నది. ఆమె కొప్పులో ముడుచుకొన్న సుమమాలికల సుగంధం మీది అశతో గుమిగూడిన తుమ్మెదలు మనోజ్ఞంగా జుమ్మని రొద చేస్తూ విహరిస్తున్నాయి. ఆ భ్రమర ఝుంకారమే శ్రుతిగా శ్రీదేవి తన పతి శ్రీపతిమీద పాటలు పాడుతున్నది.

అలాంటి పరమపదంలో. ఎల్ల వేళల జ్ఞానము, సంపద, కీర్తి బలము, ఐశ్వర్యము మొదలైన గుణాలతో కూడినవాడు, భువనాలకు ప్రభువు, యజ్ఞానికి అధీశ్వరుడు, తుది లేనివాడు, చ్యుతి లేనివాడు, వికసించుచున్న పద్మాలవంటి నేత్రాలు కలవాడు, లక్ష్మీవల్లభుడు, మొదలు తుద వికారము లేనివాడు, దయాసముద్రుడు, సాత్వతులకు అధినాథుడు, వృద్ధిశీలుడు, సహనశీలుడు, అంతటా వ్యాపించిన వాడు, కల్యాణగుణాలతో విరాజిల్లేవాడు, కాంతిమంతుడు అయిన శ్రీహరిని బ్రహ్మదేవుడు దర్శించాడు.

చిరునవ్వుల అమృతాన్ని కురిపించే మోము వానిని, తన భక్తులను పాలించు పరమాత్ముని, ఎఱ్ఱ కలువరేకుల వంటి కన్నుల వానిని, పట్టు బట్ట ధరించు వానిని, ముల్లోకాలలో మనోహరమైన వానిని, చరణమంజీరాలు, కిరీటము, చెవికుండలములు మున్నగు ఆభరణాలు ధరించువానిని, యోగిశ్రేష్ఠులకు ప్రభువైన వానిని, వక్షస్థలమున లక్ష్మి వసించువానిని, కృపాసముద్రుని, చతుర్భుజములవానిని శ్రీమహావిష్ణువును బ్రహ్మదేవుడు దర్శించాడు.

అంతేకాక బ్రహ్మదేవునికి సాక్షాత్కరించిన శ్రీమన్నారాయణు వెలకట్టలేనంతటి విలువైన రత్నాలు పొదిగిన సింహాసనంపై ఆసీనుడై ఉన్న వాడు; కమలాల వంటి కన్నులు కల వాడు; నందుడు, సునందుడు, కుముదుడు మున్నగువారు సేవిస్తున్న వాడు; చతుశ్శక్తులు అనెడి 1ప్రకృతి, 2పురుషుడు, 3మహత్తు, 4అహంకారములు; పంచ కర్మేంద్రియములు అనెడి 1చేతులు, 2కాళ్ళు, 3నోరు, 4పాయువు, 5ఉపస్తు; పంచ జ్ఞానేంద్రియములు అనెడి 1కన్ను, 2ముక్కు, 3చెవి, 4నాలుక, 5చర్మము; మనస్సు; పంచ మహాభూతములు అనెడి ఆకాశము, అగ్ని, వాయువు, జలము, భూమి; షోడశశక్తులును; పంచతన్మాత్రలు అనే శబ్దము, స్పర్శము, రూపము, రుచి, వాసన వాని పంచ మూల తత్వములు సర్వం చుట్టు పరివేష్టించి ఉన్న వాడు. తన స్వరూపంతో స్వయంగా కోటి సూర్యుల ప్రకాశంతో వెలిగిపోతున్నవాడు; తనకు తప్ప ఇతరులకు అందరాని స్వభావసిద్ధమైన సమస్తమైన ఐశ్వర్యాలతో అతిశయించి ఉన్నవాడు; సర్వేశ్వరుడు; పరమపురుషుడు; పురుషోత్తముడు; విఙ్ఞానమునందు వసించి ఉండువాడు కనుక నారాయణుడు అని పిలవబడువాడు { నారం విజ్ఞానం తదయ సమాశ్రయో యస్యసః నారాయణః, రిష్యతే క్షీయతే యితరః రిజ్క్షయే ధాతుః స నభవతీతి నరః అవినాశ్యాత్మాః (వ్యుత్పత్తి)}; అట్టి ఆ పద్మాక్షుని దర్శించిన బ్రహ్మదేవుని హృదయము పరమానందముతో తృప్తిచెందింది. ఆనందభాష్పాలు ధారలుకట్టి ప్రవహించుటచే చెక్కిళ్ళు తడసిపోయాయి.

తనకు ఇష్ఠుడు, నాభి యందు జనించినవాడు, ప్రథమ సంతానము, దేవతలందరకు అధిదేవుడు, సమస్తమైన భూతజాలమును సృష్టించెడి వాడు, తన ఆజ్ఞానువర్తి, సృష్టి నంతటిని ధరించువాడు అగు బ్రహ్మదేవుడు అలా ప్రణామములు చేయగా శ్రీమహావిష్ణువు పరమ సంతోషంతో కూడిన చిరునవ్వులు చిందించే మోము కలవాడయ్యాడు. అతని దేహమును చనువుగా హస్తపద్మములతో తాకుతు, దయ ఉట్టిపడుచుండగా ఇలా చెప్పాడు.

"దొంగ మునులు దొంగ తపస్సులు చేస్తుంటే ఎంత కాలానికైనా నేను వారిని అనుగ్రహించనయ్యా. ఓ పద్మసంభవ! బ్రహ్మదేవుడ! గాఢమైన తపస్సమాధి పొంది చక్కటి సృష్టి చేయాలనే సంకల్పంతో వర్తిస్తున్ననిన్ను అనుగ్రహిస్తాను" అని బ్రహ్మదేవునికి సాక్షాత్కరించిన హరి అనుగ్రహించాడు.

"ఓ పరమ పుణ్యుడ దేవాధిదేవుడనైన నా యొక్క పాదదర్శనం పొందావు. నీ విపత్తి ఆపత్తులు సర్వం తొలగిపోతాయి. జ్ఞనానికి హృదయానికి ప్రతీక యైన పద్మమునందు ఉద్భవించిన ఓ బ్రహ్మదేవుడ! నీకు శుభమగు గాక. నీవు కోరిన వరం ఇస్తాను కోరుకో" అన్నాడు విష్ణుమూర్తి.

"ఓ కమలసంభవుడ! నీ యెడల ప్రసన్నుడను అయ్యాను కనుక నీకు వైకుంఠదర్శనం అనుగ్రహించాను. అదంతా అహేతుకమైన నాయొక్క కృపాకటాక్షము మాత్రమే. అంతే తప్ప నువ్వు చేసిన తపోప్రభావంవల్ల కాదు అని తెలుసుకో. అవును, నీ తపస్సంతా నా అనుగ్రహభాషణల కోసమే కదయ్యా బ్రహ్మదేవుడ!" అంటు హరి అనుగ్రహ భాషణ చేస్తున్నాడు.

"పుత్రా! బ్రహ్మదేవ! తపస్సు అంటేనే నా స్వరూపం. తపస్సు అనే వృక్షానికి ఫలాన్ని నేనే. ఆ తపస్సు చేతనే సృష్టి స్థితి లయాలు సర్వం నిర్వహిస్తుంటాను." అంటు బ్రహ్మదేవునికి తపస్సు యొక్క రహస్యాన్ని నారాయణుడు వెలిబుచ్చాడు.

“ఓ పద్మగర్భుడ! నీ మనసులో నా భక్తికి తపస్సు ఎలా మూలాధారమో గ్రహించి, ఈ విధంగా గాఢమైన తపస్సు చేసావు.కనుక ఇంక నీవు మోహ కర్మల నుండి ముక్తుడవు అయ్యావు". అని సాక్షాత్కరించిన నారాయణుడు అనుగ్రహించాడు.

ఆలా అనుగ్రహించిన విష్ణుమూర్తి ఇంకా ఇలా అన్నాడు. "ఓ పద్మభవ! నీ మనోవాంఛితము ఏదైనా సరే, కోరుకో. కోరిన కోరికతీరుస్తాను". అంతట బ్రహ్మదేవుని ముఖము సంతోషంతో వికసించింది.

నారాయణుని భాషణములు వినిన బ్రహ్మదేవుడు "ఓ పరమపదానికి ప్రభువా! పరమ యోగులు నిన్ను చేరాలని నిత్యం భావిస్తు ఉంటారు. దేవాధిదేవ! ఈ సమస్తమైన లోకము నందు నీకు తెలియని విషయం ఒక్కటైన లేదు కదా. అయినప్పటికి నా మనసులో మెదలిన కోరికను వినిపిస్తాను కృపాదృష్టితో అనుగ్రహించుము." అని విన్నవించుకుంటున్నాడు.

"ఓ దేవా! నీవు సకల భూతాల అంతరాత్మవు అయి ఉండేవాడవు, భగవంతుడవు. నీకు నమస్కరించి నా కోరిక విన్నవించుకుంటాను. అనుగ్రహించు. అవ్యక్త స్వరూపాలలో ప్రకాశించే నీ యొక్క స్థూల సూక్ష్మ రూపాలను; సకల శక్తులతో కూడిన బ్రహ్మదేవుడు మున్నగు రూపములును సమస్తం సృష్టి స్థితి లయములను సాలెపురుగు గూడు అల్లినట్లు నీ అంతట నీవె ధరించి నిర్వహించుచు ఉంటావు. అమోఘ స్వసంకల్పశక్తితో లీలావిభూతితో క్రీడిస్తు ఉంటావు. అట్టి నీ మహిమను నాకు విశదీకరించు. నీ ఆజ్ఞానువర్తిని అయి జగత్తు నిర్మించే సమయంలో బ్రహ్మదేవుడను అనే మోహం అహంకారం తప్పక జనిస్తాయి కదా. దానికి పరిహారం అనుగ్రహించ మని వేడుకుంటున్నాను. నన్ను కృపాదృష్టితో కటాక్షించి అనుగ్రహించు" అని బ్రహ్మదేవుడు ప్రార్థించాడు. అది విన్న పద్మాక్షుడు ఇలా చెప్పసాగాడు.

 

నారాయణుడు కటాక్షించి తెలుపుతున్నాడు. "ఓ పద్మసంభవ! బ్రహ్మదేవుడ! నీ మన్సులో శాస్త్రాలను చర్చించుకొని అర్థం చేసికొనుట, భక్తి, చక్కగా యదార్థ స్థితిని తెలిసికొనుట అనే ఈ మూడింటిని బాగుగ నిలుపుకొనవలయును."

 

"ఓ పద్మజుడ! బ్రహ్మదేవుడ! తెలిసికొంటే, నా యొక్క స్వరూపము, స్వభావములు, మహిమలు, అవతారాలు - కృృత్యములు అధ్యయనం చేయవలెను. దానితో నా దయవలన తత్వవిజ్ఞానము లభించును. ఈ జగత్తు సృష్టించబడుటకు ముందు నుండి నేను ఒక్కనిగనే (ఏకలుడగనే) ఉన్నాను. ఏ కర్మబంధాలు నాకు అంటవు. స్థూల సూక్ష్మ స్వరూపాలు, కారణభూతమైన ప్రకృతి సమస్తం నా అంశలే. అవన్నీ నాలో లీనమై ఉంటాయి. పుత్రా! బ్రహ్మదేవుడ! నాకు ఇతరమైనది ఏదీ లేనే లేదు. అలాగే సృష్ఠి జరిగుతుండె కాలంలో వచ్చేవి సర్వం నా స్వరూపమే అని గ్రహించు." అని విష్ణుదేవుడు వివరించసాగాడు.

 

"ఓ కమలసంభవుడ! బ్రహ్మదేవుడ! కల్పాంతమున వచ్చే ప్రళయకాలంలో కూడ ఆది అంతము లేని విధంగా సంపూర్ణ శాశ్వత మహత్వముతోటి పరమాత్ముడనుగా నేను ప్రకాశిస్తుంటాను అని తెలిసికొనుము." అని హరి తత్త్వము మరియు బోధించసాగాడు.

 

ద్వితీయ స్కంధము : మాయా ప్రకారంబు

 

అంతేకాకుండ, ఈ జగత్తు సృష్టింపబడిన విధానాలను నువ్వు అడిగావు కదా వివరిస్తాను శ్రద్ధగా విను. ఆల్చిప్పలలో వెండి ఉన్నట్లు బ్రాంతి కలుగుతుంది. తరచి చూసినచో లేదని తెలుస్తుంది. అలాగే ఏదైతే లేకుండానే ఉన్నట్లు భ్రాంతి కనబడుతుంటుందో. సరిగా చూస్తే లేదని తెలుస్తుంది. దానినే నా మాయగా గ్రహించు. అంతేగాకుండా లేనిది ఉన్నట్లు కనబడుటకు, ఉన్నది లేనట్లు అనిపించుటకు, ఇద్దరు చంద్రుళ్ళు ఆకాశంలో ఒకరు, కింద నీటిలో ఒకరు ఉన్నట్లు కనబడుటకు, చీకట్లు వ్యాపించినట్లు అనిపించుటకు నా మాయాప్రభావంతో కలిగెడి భ్రాంతులుగా తెలిసికొనుము. ఏవిధంగా అయితే ఆకాశం, నిప్పు, వాయువు, నీరు, భూమి, మనస్సు భౌతిక స్వరూపాలు కలిగిన కుండ, బట్ట మున్నగువాని యందు ప్రవేశించి ఉంటాయో. అదేవిధంగా నేను భూతములు, భౌతికములు సమస్తమునందు జీవు లందు ప్రవేశించి కార్య రూపంలో ఉంటాను. భౌతికమైనవి, భూతములకు కారణభూతములై ఉంటాయి. అలాగే సర్వ భూతములు, భౌతికములు కారణభూతములై నాయందు కనబడలేవు. సర్వప్రదేశములలో సర్వకాలములలో ఏదైతే తెలియబడుతుంటుందో అదే బ్రహ్మస్వరూపం. నీవంటి తత్త్వ జిజ్ఞాసువులకు నీకు చెప్పబడినదే సత్యం అని తెలియుము. ఇదే సర్వోత్కృష్ట మయినది. కనుక ఏకాగ్ర దృష్టితో వినుము. నీ మనస్సులో పదిలముగ నిలుపుకొనుము. నీకు సృష్టించుట మున్నగు కార్యములలో మోహం కలుగకుండ ఉంటుంది". అని వైకుంఠుడు చతుర్ముఖ బ్రహ్మకు వివరించి వైకుంఠంతో సహా అంతర్థానం అయ్యాడు.

 

ద్వితీయ స్కంధము : నారాయణుని వైభవం

 

ఇకపోతే, ఈ సృష్టిస్థితిలయాలు సర్వం దేనియందు ప్రకాశిస్తు ఉంటాయో దానిని “ఆశ్రయం అంటారు. అదే “పరమాత్మ, “పరబ్రహ్మ అను పేరులతో కూడ పిలువబడుతుంది. ఇది సమస్తము నందు ఉంటు సమస్తమునకు పరమై ఉండెడిది. దానిని ప్రత్యక్ష అనుభవంగా తెలుపుటకు, అది ఏకమయినను ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మికము మున్నగు విభాగములగా చెప్తుంటారు. అవి ఏవనగా, ఆత్మ ఆధ్యాత్మికము, అధిదైవకము, ఆది భౌతికము అని మూడు విధాలు. నేత్రం మున్నగు గోళకాల యందు తెలియబడుతు ఉండెడివి “ఆధ్యాత్మికం. నేత్రాది ఇంద్రియాభిమానం కలిగి ద్రష్ట అవుతున్న జీవుడే “ఆధిదైవికుడు. నేత్రాదులైన అధిష్ఠానలలో అభిమానం కల దేవత యై సూర్యాది తేజస్సులే శరీరంగా కలవాడైన యెవనిలో ఆధ్యాత్మిక, ఆధిదైవికాలు అనే ఈ రెండు విభాగాలు సంభవిస్తాయో అతడే “ఆధిభౌతికుడు, “విరాట్స్వరూపుడు కూడ అవుతున్నారు. అందుచేత “చూసేవాడు. “చూసే సాధనము, “చూడదగినది అనబడే ఈ మూడింటిలోను ఏ ఒక్కటి లేకున్నా, మరొకటి కనిపించదు. “త్రిపుటి అనబడే ఈ మూడింటిని ఎవరు తెలుసుకుంటారో, అతడే సర్వలోకాలకు “ఆశ్రయుడై ఉంటాడు. “పరమాత్మ కూడ అతడే. వినోదం కొరకు జగత్తును సృష్టించాలి అనే తలంపు ఆ మహాత్ముడికి కలిగింది. ఆ సంకల్పంతో ఆయన బ్రహ్మాండాన్ని నిర్భేదించారు. తనకు సుఖస్థానాన్ని కోరి మొదట పవిత్రమైన నీళ్ళను సృష్టించారు. ఆయన సహజంగా పరిశుద్ధుడు. అందువల్ల తాను సృష్టించిన అపారపారావారంలో నున్న జలరాశిలో శయనించాడు.

 

ఉపాధాన కారణ మైన ద్రవ్యం “సంచితం, “ప్రారబ్దం, “ఆగామి అనే మూడు విధాలైన “కర్మము, “కళ, “కాష్ఠ మున్నగు ఉపాధులచే భిన్నమైన “కాలము, జ్ఞానము మొదలైన జీవుని “స్వభావము, అనుభించే “జీవుడు, ఇవన్నీ ఆయన అనుగ్రహం వల్ల ఉనికి కలిగి ఉన్నాయి. ఆయన ఉపేక్షిస్తే వాటికి ఉనికిలేదు. అలాంటి మహిమ కలవాడు ఆ సర్వేశ్వరుడు. తాను మొదట ఒకడు అయినా ఆ పరమాత్ముడు దేవ మనుష్యాది రూపాలతో అనేకం కావాలని సంకల్పించాడు. స్వాత్మానుభవ రూపమైన యోగశయనంలో మేలుకొని ఉండి తన సంకల్పంతో హిరణ్మయమైన తన శరీరాన్నే అధిదైవతం, ఆధ్యాత్మికం, ఆదిభూతం అనే పేర్లతో మూడు విధాలుగా సృష్టించాడు.

 

ద్వితీయ స్కంధము : శ్రీహరి నిత్యవిభూతి

 

ఇలాంటి విరాట్పురుషుని శరీరం లోపలి ఆకాశం నుండి ప్రవృత్తి సామర్థ్యరూపమైన ఓజస్సు. వేగసామర్థ్యం, బలం అనే ధర్మాలు కలిగాయి. సూక్ష్మరూపమైన క్రియాశక్తి వల్ల ప్రాణం పుట్టింది. అది సమస్త ప్రాణులకు ముఖ్యమైనది. యజమాని ననుసరించు సేవకులలాగ ప్రాణాలు జీవి ననుసరించి వెడలిపోతుంటాయి. విరాట్పురుషునకు జఠరాగ్ని దీపించగానే ఆకలిదప్పులు ఏర్పడ్డాయి. ముఖం నుండి దవుడలు, నాలుక మొదలైననవి పుట్టాయి. అందుండే ఆరు విధాలైన రసాలు జనించాయి. ఆ రసభేదా లన్నీ నాలుకతోనే గ్రహింపబడుతున్నాయి. ముఖం సంభాషించాలని భావించింది.

 

ముఖం నుండి వాక్కు అనే ఇంద్రియం పుట్టింది. దానికి అగ్ని అధిష్ఠానదేవత. వాగింద్రియం నుండి, అగ్నినుండి సంభాషణం పుట్టింది. జగత్తంతా జలవ్యాప్తం కావటం వల్ల అగ్నికి జలం వల్ల నిరోధం కల్గింది. అందువల్ల అగ్నికి జలమే ప్రతిబంధక మయింది. మిక్కిలిగా చలించే మహా వాయువు నుండి ఘ్రాణం పుట్టింది. దానికి వాయువు అధిదేవత. ఆ ఘ్రాణేంద్రియం గ్రంధాన్ని గ్రహించటంలో నేర్పుగల దయింది. విరాట్పురుషుడు కంటికి కనిపించని ఆత్మను తనలో చూడగోరాడు. అప్పుడు సూర్యుడు దేవతగా కలిసి, రూపం గ్రహించేవీ అయిన నేత్రాలు రెండు తేజస్సు నుండి పుట్టాయి. మును లందరు భగవంతుని ప్రార్థించగా ఆయన దిక్కులు దేవతగా కలిగి, శబ్దాన్ని గ్రహించే శ్రోత్రింద్రియాన్ని ఉద్భవింపజేసాడు. సృష్టికర్త యైన పురుషుని నుండి త్వగింద్రియానికి అధిష్ఠానమైన చర్మం పుట్టింది. ఆ చర్మం ఆయా వస్తువులలోని మార్థవాన్ని, కాఠిన్యాన్ని, తేలికదనాన్ని, బరువును, వేడిమిని, చల్లదనాన్ని గ్రహిస్తుంది. చర్మమునుండి వెంట్రుకలు పుట్టాయి. వాటికి చెట్లు అధిదేవత లయ్యాయి. త్వగింద్రియాన్ని అధిష్టించినవాడు, స్పర్శ మనే గుణం కలవాడు, లోపలా బయట వ్యాపించిన వాడు నయిన వాయువు నుండి హస్తాలు పుట్టాయి. అవి బలం కలవి, వస్తుగ్రహణంలో నేర్పు కలవి, అనేకమైన పనులు చేయగలవి. వాటికి ఇంద్రుడు అధిదేవత. తనకు ఇచ్చవచ్చిన చోటికి పోయే సామర్థ్యం కల ఈశ్వరుని నుండి పాదాలు పుట్టాయి. వాటికి విష్ణువు అధృతదేవత.

ప్రజానంద మనే అమృతాన్ని కాంక్షించి, భగవంతుని నుండి పురుషాంగం, ఉపస్థు జనించాయి. వాటికి అధిదేవత ప్రజాపతి. స్త్రీసంభోగం మొదలైనవి వాటిపనులు. మిత్రుడు అధిదేవతగా గల “పాయువు అనే ఇంద్రియాన్ని “గుదం అని కూడ అంటారు. అది భుక్త పదార్థాలలోని నిస్సారమైన అంశాన్ని, యోగసాధనలో విడిచే మలమును త్యజించటానికి సాధన మవుతుంది. అనగా స్థూల సూక్ష్మ, ఉభయ మలములను వర్జిస్తుంది.

ఒక శరీరాన్ని వదలి మరొక శరీరం ధరింపగోరి నప్పుడు, మొదటి శరీరం వదలటానికి సాధనంగా “బొడ్డు అనే ద్వారం పుట్టింది. ప్రాణం, అపానం బంధింపబడే స్థానం అదే. ఆ బంధం విడిపోవడమే మృత్యువు. పై శరీరాన్ని, క్రింద శరీరాన్ని వేరుచేసేది కూడ ఆ నాభి స్థానమే. ఆహార పానీయాదులను ధరించడానికి పేగులు, పొట్ట, నాడీ సమూహము కల్పితము లైనాయి. వాటికి నదులు, సముద్రాలు అధిదేవతలు. వాటివల్ల తుష్టి, పుష్టి అనే ఉదరాన్ని భరించే రస పరిణామాలు కలిగాయి.

ఆ విరాట్పురుషుడు తన మాయను ధ్యానించేటప్పుడు కామానికి, సంకల్పాదులకు స్థానమైన హృదయం పుట్టింది. ఆ హృదయం నుండి మనస్సు, చంద్రుడు, కాముడు, సంకల్పము పుట్టాయి. అటుపిమ్మట జగత్తును సృష్టించే విరాట్పురుషుని శరీరంలో త్వక్కు, చర్మం, మాంసం, రక్తం, మేధస్సు, మజ్జ, ఎముకలు అనే సప్తధాతువులు, పృథివి, జల, తేజో రూపాలైన ఏడు ప్రాణాలు, ఆకాశ జల వాయువుల నుండి జనించిన గుణరూపాలైన ఇంద్రియాలు, అహంకారాన్ని కలిగించే గుణాలు, అన్ని వికారాలు స్వరూపంగా కల మనస్సు, విజ్ఞాన రూపమైన బుద్ధి జనించాయి. ఇదంతా ఆ సర్వేశ్వరుని స్థూలశరీరమే. ఇంతేకాదు.

 

ఆ స్థూలవిగ్రహం క్రమంగా పృథివి, జలం, తేజం, వాయువు, గగనం, అహంకారం, మహత్త్వం, అవ్యక్తం అనే ఎనిమిది ఆవరణాలలో వ్యాప్తమై ఉంది. గొప్ప వైభవంతో బ్రహ్మాండాన్ని మించినదై అత్యుజ్జ్వలంగా ప్రకాశిస్తున్నది.విరాట్పురుషుని సూక్ష్మరూపం విలక్షణమైనది. దానికి మొదలు తుది లేవు. అది నిత్యమైనది, సూక్ష్మమైనది. ఆలోచించి చూసిన మనస్సుకు, వాక్కుకు గోచరం కానిది.స్థూలమని, సూక్ష్మమని రెండు రూపాలతో విలసిల్లే ఆ భగవదాకారాన్ని ఆ పరమాత్ముని మాయాప్రభావంవల్ల దివ్య తేజోధనులైన మునులు కూడ తెలిసికొనలేకున్నారు. వాచ్యమై, వాచకమై, నామరూపక్రియలు దాల్చిన ఈశ్వరుడు సమస్త లోకాలకు నియామకుడు అయ్యి ఉన్నాడు. చిన్మయ స్వరూపుడైన ఆ శ్రీమన్నారాయణుడు ప్రజాపతులను, ఋషులను. పితృదేవతలను ప్రీతితో సృష్టిస్తున్నాడు.

 

జీవులు తాము చేసిన నానా విదాలైన కర్మల్ని అనుసరించి సురలు, సిద్ధులు, సాధ్యులు, కిన్నరులు, చారణులు, గరుడులు, గంధర్వులు, రాక్షసులు, పిశాచాలు, భూతాలు, బేతాళాలు, కింపురుషులు, కూశ్మాండులు, గుహ్యకులు, డాకినులు, యక్షులు, యాతుధానులు, విద్యాధరులు, అచ్చరలు, నాగులు, గ్రహాలు, మాతృగణాలు, తోడేళ్ళు, సింహాలు, సూకరాలు, పక్షులు, మృగాలు, ఎలుగుబంట్లు, చేపలు, పశువులు, చెట్లు మున్నగు బహు జాతులలో పుట్టి నీటిలోను, నింగిలోను, నేలమీద సంచరిస్తారు. సత్త్వగుణ, రజోగుణ, తమోగుణాలు కల్కి ఉంటారు. ఈ ప్రాణిజాత మంత తిర్యక్కులు, సురలు, అసురులు, నరులు, గిరులు ఇలా విభిన్న రూపాలతో ఉంటుంది.

 

లక్ష్మీకాంతుడు చతుర్ముఖుడై జగత్తును సృష్టిస్తాడు. విష్ణు స్వరూపుడై దానిని రక్షిస్తాడు. సంహార సమయంలో హరునికి అంతర్యామిగా ఉంటు, వాయువు మబ్బులను హరించినట్లే సమస్త విశ్వాన్ని సంహరిస్తాడు.ఈ విధంగా ఆ దేవుడు ధర్మస్వరూపుడై తానే పశుపక్ష్యాదులు, నరులు, సురలు మున్నగు సమస్త రూపాలు ధరిస్తాడు. తానే ఈ విశ్వాన్ని సృష్టిస్తాడు, పోషిస్తాడు, సంహరిస్తాడు.శ్రీహరినుండి ఆకాశం పుట్టింది. ఆకాశం నుండి వాయువు పుట్టింది. వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు పుట్టాయి. నీటి నుండి భూమి పుట్టింది. భూమి నుండి నానావిధ జీవజాలము పుట్టింది. దీనంతటికి మూలమై ప్రకాశించేవాడు ఆ నారాయణుడే. ఆయన జ్ఞానానంద స్వరూపుడు, అవ్యయుడు, పుట్టుకలేని వాడు, అంతంలేనివాడు, ప్రభువు, ఆదిమధ్యాంత రహితుడు, జనన మరణాలు లేనివాడు.

 

తృతీయ స్కంధము : జగదుత్పత్తి లక్షణంబు

 

ఈ విశ్వంలోగల సమస్త జీవుల దేహాలూ భగవంతుని స్వరూపాలు. సమస్తమైన ఆత్మలూ ఆయనే. ఆయనే సర్వానికీ ప్రభువు. పరాత్పరుడు. అనేక విధాలయిన బుద్ధులకు ఉపలక్షణమైన మహానుభావుడు. అటువంటి భగవంతుడు తన మాయవల్ల తన లోనే లీనమైన ప్రపంచాన్ని. తన గర్భంలో ధరించి ఒక్కడుగా అద్వైతుడై వెలుగుతూ ఉంటాడు. ఆ పరమాత్మ పుట్టుక లేనివాడు. సమస్తమూ పై నుండి చూచేవాడు అయినప్పటికీ, వేరే మరే వస్తువూ లేకుండా తానే సర్వమూ అయినప్పుడు ఇక ద్రష్ట కాడు. కాని-మాయాప్రధాన శక్తి కలవాడై ప్రపంచాన్ని నిర్మించే కోరికతో గొప్ప చిచ్ఛక్తి గల్గి తనను తాను లేనివాడుగా మనస్సులో భావించు కొంటాడు. సృష్టికి ఉపక్రమించిన పిమ్మట ద్రష్ట అవుతాడు.

 

ఇలా భగవంతునికి సృష్టి చేయాలనే సంకల్పం కలగగానే కార్యకారణాల రూపమై ఘనత వహించినదై మహత్తరమైన మాయశక్తిగా ప్రకాశించే అవిద్య రూపొందుతుంది. అందు తన అంశనుండి ఆవిర్భవించిన మాయను తన శక్తిగా ప్రతిష్ఠించి, పుట్టుక లేనివాడూ పురుషోత్తముడూ ఐన ఈశ్వరుడు తన కడుపులో ఉన్న విశ్వాన్ని ఉద్భవింపజేశాడు.

 

తృతీయ స్కంధము : మహదాదుల సంభవంబు

 

కాలచోదితమూ, అవ్యక్తమూ, ప్రకృతి అనే పేర్లతో వ్యవహృతమైన తన మాయవల్ల మహత్తత్త్వాన్ని పుట్టించాడు. మాయకు సంబంధించినదీ, కాలము మొదలైన గుణాలు కలదీ అయిన ఈ మహత్తత్త్వం భగవంతుని కంటికి మాత్రమే కనిపిస్తూ ప్రపంచాన్ని నిర్మించాలనే కోరిక కల్గడంతో ఇంకొక రూపాన్ని పొందింది. రూపాంతరం పొందిన అటువంటి మహత్తత్త్వంలో నుంచి క్రమంగా కారణం, కార్యం, కర్త అనే భేదాలు ఏర్పడి అవి వరుసగా పంచభూతాలు-ఇంద్రియాలు-మనస్సు అను రూపములుగా గోచరించాయి. ఈ మూడింటి నుండి సత్త్వరజస్తమోగుణాలతో కూడిన అహంకారం ఏర్పడింది.

 

మార్పు చెందుతున్న సాత్త్వికాహంకారం వల్ల మనస్సూ, వికారము చెందు కార్యరూపులైన ఇంద్రియాల ఆధిదేవతలైన దేవతా గణాలూ ఉదయించాయి. రాజసాహంకారం వల్ల జ్ఞానేంద్రియాలైన చర్మం, కన్నులు, చెవులు, నాలుక, ముక్కు, కర్మేంద్రియాలైన వాక్కు, హస్తాలు, పాదాలు, పాయువు, ఉపస్థు, జన్మించాయి. తామసాహంకారం వల్ల శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం అనే పంచ తన్మాత్రలు ఆవిర్భవించాయి. వీనిలో శబ్దం వల్ల ఆకాశం పుట్టింది. ఆకాశం కాలమాయాంశ యోగంతో పుడరీకాక్షుని నిరీక్షణంతో స్పర్శతన్మాత్రవల్ల వాయువును పుట్టించింది. వాయువు ఆకాశంతో కలసి కాలమాయాంశ యోగంతో పుండరీకాక్షుని నిరీక్షణంతో రూపతన్మాత్రవల్ల లోకలోచనమైన తేజస్సును పుట్టించింది. తేజస్సు వాయువుతో కలసి కాలమాయాంశ యోగంతో పుండరీకాక్షుని నిరీక్షణంతో రసతన్మాత్రవల్ల జలాన్ని కలిగించింది. జలం తేజస్సుతో కలిసి కాల మాయంశయోగంతో పుండరీకాక్షుని నిరీక్షణంతో గంధతన్మాత్రవల్ల పృథ్విని పుట్టించింది.

ఈ విధంగా ఏర్పడ్డ పంచభూతాలలో ఆకాశానికి గుణం శబ్దం, వాయువునకు శబ్ద స్పర్శాలు గుణాలు, తేజస్సుకు శబ్దస్పర్శ రూపాలు గుణాలు, జలానికి శబ్దస్పర్శరూపరసాలు గుణాలు, పృథ్వికి శబ్ద స్పర్శరూపరస గంధాలు గుణాలై ఉంటాయి. కాల మయాంశ లింగ స్వరూపులై మహదాదులందు అభిమానం గల దేవతలు విష్ణుదేవి కళలే. ఐనా మహదాది తత్త్వాలూ, పంచభూతాలూ, పంచేంద్రియాలూ, పంచతన్మాత్రలూ వేరువేరుగా ఉండి అన్నీ సమైక్యం కాకపోవడంతో ప్రపంచాన్ని సృష్టించడానికి సామర్థ్యం వానికి చాలలేదు.

 

తృతీయ స్కంధము : విరాడ్విగ్రహ ప్రకారంబు

 

మహత్తు మొదలగు తత్త్వాలకు పరస్పరం పొత్తు కుదరక పోవడం వల్ల సమస్తజగత్తును సృష్టించే శక్తి లభ్యం కాకపోవటాన్ని తెలుసుకున్నాడు. అప్పుడు కాలవేగంతో ఉద్రేకం పొందిన ప్రకృతితోకూడి నిజశక్తిని నిక్షేపించి ఉరుక్రముడై ఇరవైయేడు తత్త్వాలలో ఏకకాలంలో తాను ప్రవేశించి ఘన పరిణామరూపుడై విడివిడీగా ఉన్న వానికి ఏకత్వం కలిగించాడు. పంచభూతాలు-పంచతన్మాత్రలు-పది ఇంద్రియాలు-కాలం, ప్రకృతి, మహత్తు, మనస్సు, బుద్ధి, చిత్తం అహంకారం అనే అంతఃకరణ చతుష్టయం. ఇవి ఇరువదియేడు తత్త్వాలు.అలా ప్రపంచాన్ని నిర్మించడంలో వాటికి నేర్పు కలగజేస్తూ శ్రీహరి క్రమానుసారంగా అన్నింటికీ పరస్పరమైత్రి కల్పించాడు. ఇలా శ్రీహరి అనుగ్రహంచేత ప్రేరేపింపడి సృష్టిక్రియకు సమర్థమైన తత్త్వసమూహం, తమ తమ అంశలతో విరాడ్విగ్రహంగా రూపొందింది. విష్ణుదేవుని కళాంశలతో ఒకటి మరొక్కదానితో ఏకీభావం పొంది, పరిపక్వమై ఇంకొక రూపం ధరించింది. ఏ తత్త్వం ఈ జగత్తంతా నిండి ఉందో హిరణ్మయమైన ఆ విరాట్ స్వరూపం ధరించిన పరమాత్మ సమస్త జీవులలో నిండి యున్న వాడయ్యాడు.

 

ఈ విరాట్ పురుషుడు మొదటి జలాలలో ఏర్పడ్డ బ్రహ్మాండం అనే గర్భరూపంతో వేయి సంవత్సరాలు ఉన్నాడు. దాని నుండే సమస్త సృష్టి కార్యరూపంగా వెలువడింది.దైవం, కర్మ, ఆత్మ అనువాటి శక్తి వ్యాపించి భగవంతుడు తానే బహుళ రూపాలతో వెలుగొందుతాడు. అపుడు సంకల్పమయమైన సృష్టి చైతన్యంతో విస్తరిస్తుంది గాని దేహం ఏర్పడదు.ఆ చైతన్య శక్తికి రూపాలుగా ఏర్పడే లక్షణం ఏర్పడుతుంది. అదే కర్మశక్తి. దీనివల్ల అనేక ప్రవృత్తి భేదాలు ఉద్భవిస్తాయి. దాని యందు పది విధాలైన ప్రాణాలు స్పందిస్తాయి. ఇన్ని శక్తులతో గూడిన ప్రజ్ఞవల్ల తాను అనగా ఏమో తనకు తెలిసే శక్తి ఏర్పడుతుంది.అధ్యాత్మం, అధిభూతం, అధిదైవం అనబడే మూడు భేదాలు కలిగి ఈ విరాటం స్వరూపం జీవులకు తాను ఆత్మగా మెలగుతుంది.సమస్తానికి జీవమై పరమాత్మకు స్థానమై తొలి అవతారమైన ఆ విరాట్ పురుషుని గర్భం నుండి భూతమయ మైన ఈ సమస్త ప్రపంచం పుట్టింది.

 

ఆ శ్రీహరి, పరమాత్ముడు, ఈశ్వరుడు, అజుడు, ఆఢ్యుడు, అనంతుడు, అనంతమూర్తి, లక్ష్మీరమణుడు, నిర్వికారుడు, నిత్యమంగళస్వరూపుడు, కరుణాసముద్రుడు, నిర్మలహృదయుడు, సమస్త శక్తిమంతుడు, కమదళ నేత్రుడు, సకల బుధ సంస్తవనీయ చరిత్రుడు, పరమ పవిత్రుడు.సర్వేశ్వరుడైన పరాత్పరుడు అలా మహదాది తత్త్వాల మనస్సులలోని గొప్ప ఆలోచనలన్నీ తెలుసుకున్న వాడై. ఆ తత్త్వాల ప్రవర్తనలన్నీ సఫలం కావటానికి తన చైతన్యం శక్తిని ఉపయోగించాలని నిశ్చయించాడు. తన కళలతో కూడిన విరాట్టు స్వరూపంలో అగ్ని మొదలైన దేవత లందరికీ నివాసాలు కల్పించాడు.

 

ఆ దివ్యమూర్తియైన విరాట్పురుషుని నుండి కొంతభాగం వేరయింది. అది ముఖంగా రూపొందింది. ఆ పరమేశ్వరుని అంశ గలవాడై వాయుదైవుని మిత్రుడైన అగ్నిదేవుడు ముఖాన్ని నిజస్థానంగా చేసుకొన్నాడు. అందువల్ల జీవుడు శబ్దాన్ని పలుక గలుగుతున్నాడు. విరాట్ పురుషునినుండి మరికొంత భాగము వేరై కన్నులుగా రూపొందాయి. సూర్యుడు చక్షురింద్రియానికి అధికారియై రూప విజ్ఞానాన్ని జీవునకు కలుగజేస్తున్నాడు. అట్లే విరాట్పురుషునిలో కొంతభాగం వేరై చర్మంగా ఏర్పడింది. ఈశ్వరాంశ అయిన వాయువు త్వగింద్రియంలో నిల్చాడు.

 

జీవునకు స్పర్శజ్ఞానాన్ని కలగించు విరాట్పురుషు నుండి వేరైన చెవులయందు ఈశ్వరాంశలైన దిక్కులు జీవుని శ్రవణేంద్రియాన్ని కూడి జీవునకు శబ్ద జ్ఞానాన్ని కలిగిస్తున్నవి. అట్లే వేరైన తాలువులందు లోకపాలకుడైన వరుణుడు ఈశ్వరాంశతో ప్రవేశించి జీవుని రసనేంద్రియంగా ప్రకాశిస్తున్నాడు. అందువల్ల ప్రాణి రుచులను తెలుసుకొంటాడు. పరమేశ్వరుని నాసికేంద్రియం వేరై ఆయన అంశగల అశ్వినీ దేవతలకు అధిష్టాన మయింది. అందువల్ల జీవునకు వాసన చూచే శక్తి కలిగింది. పరమపురుషునుండి వేరైన చర్మం ఓషధులు ఆయన అంశలైన కేశాలను కూడడంచేత జీవునకు కండూయమానస్థితి (గోకుకొనుట) ఏర్పడింది. అట్లే పరమేశ్వరుని నుండి వేరైన పురుషాంగంలో ఈశ్వరునినుండి వేరైన గుదస్థానంలో అచ్యుతాంశమైన మిత్రుడు, వాయువుతో కూడి ప్రవేశించటంవల్ల జీవునకు మలవిసర్జన శక్తి కలుగుతున్నది. విరాట్పురుషుని నుండి వేరైన చేతులందు ఈశ్వరాంశమైన ఇంద్రుడు ప్రవేశించటం వల్ల ఇచ్చిపుచ్చుకొను శక్తి కలవాడై. నిజస్థానాన్ని పొందిన జీవుడు జీవనోపాధిని పొందుతున్నాడు. విరాటం పురుషుని నుండి వేరైన పాదాలను విష్ణువు అధిష్ఠించి గమన శక్తి కలిగించటం వల్ల జీవుడు నడచుటకు శక్తి మంతు డగుతున్నాడు. పరమేశ్వరుని నుండి బయటికి వచ్చిన హృదయం పొందుతున్నాడు. వేర్పాటు చెందిన అహంకారంలో అహంకృతియుక్తుడైన రుద్రుడు నిజస్థానంగా ప్రవేశించి నప్పుడు జీవుడు కర్తవ్యాలను నిర్వర్తిస్తాడు. విడివడిన బుద్ధి వాగీశ్వరుని ఆవాసమై హృదయంతో కలిసి జ్ఞానాంశతో వెలిగినప్పుడు జీవునకు గ్రహణశక్తి కలుగుతుంది. వేరుపడిన చిత్తం బ్రహ్మకు ఆవాసమై చేతనాంశం పొందినప్పుడు జీవుడు విజ్ఞానాన్ని పొందుతాడు.

అటువంటి విరాట్పురుషుని శిరస్సునుండి స్వర్గమూ, పాదాల నుండి భూమీ, నాభి నుండి ఆకాశమూ కలిగాయి. సత్త్వరజస్తమోగుణాల మార్పుచేత జీవులు అమరు లయ్యారు. సత్త్వగుణం అధికంగా ఉండడంచేత ఆ దేవతలు స్వర్గాన్ని పొందారు. రజోగుణంవల్ల మనుష్యులూ, గోవులూ మొదలైన జీవులు భూమిని పొందారు. విరాట్పురుషుని ముఖం నుండి వేదాలు పుట్టాయి.

 

బ్రాహ్మణులూ, వేదాలూ ఆ విరాట్ పురుషుని ముఖం నుండి పుట్టడం వల్ల బ్రాహ్మణుడు సమస్త వర్ణాలకు జ్యేష్ఠుడూ, శ్రేష్ఠుడు అయ్యాడు.బ్రాహ్మణాది వర్ణాల వారు దొంగలూ దుండగులూ మొదలైన వారి వల్ల బాధలు పొందకుండా వారిని రక్షించడానికే ఆ పురుషోత్తముని భుజాల నుండి క్షత్రియజాతి జన్మించింది.వ్యవసాయం, గోసంరక్షణం, వ్యాపారం మొదలైన కార్యాలను నిర్వహించటం కోసం ఆ సర్వేశ్వరుని తొడల నుండి వైశ్యజాతి ఆవిర్భవించింది.ఆ దేవదేవుని పాదాలనుండి సేవావృత్తియే ధర్మంగా గల శూద్రజాతి పుట్టింది. వీరంతా తమకై విధింపబడిన పనులు చేస్తూ, జగజ్జనకుడు మహితాత్ముడు అయిన విష్ణుమూర్తిని పూజిస్తుంటారు.

----------------------

అలా మైత్రేయ మహాముని అత్యంత మంగళప్రదాలైన హరిలీలా మహత్త్వాలను విదురునికి విశదీకరించగా విని మైత్రేయునితో విదురుడు మళ్ళీ ఇలా అన్నాడు."ఓ సౌజన్యమూర్తీ! మైత్రేయా! భగవంతుడు నిర్గుణ పరబ్రహ్మ కదా; మరి ఈ లోకాలన్నీ పుట్టించటం రక్షించటం లయం చెయ్యటం ఆయన క్రీడావిశేషాలు కదా; నిర్గుణుడైన వానికి ఈ క్రీడలూ, ఈ లీలలూ ఎలా పొసగుతాయి? నిర్గుణుడైన ఈశ్వరుడు సగుణుడుగా ఎలా ఉంటాడు? ఇది పరస్పర విరుద్ధంగా లేదా?”

 

అని అడిగి విదురుడు, ఒక వేళ భగవంతుడు బాలునిలాగ క్రీడిస్తాడేమో అనుకొని, మైత్రేయుణ్ణి చూచి మళ్ళీ ఇలా అన్నాడు “బాలుడు ఆడుకోవాలి అనుకున్నప్పుడు అతడి మనస్సు క్రీడలలో లగ్నమౌతుంది. అందుకు తగినట్లుగా ఆడుకుంటాడు. బాలుడు ఆడుకోటానికి ఆటవస్తువులు కావాలి. లేదా మరికొందరు బాలకులు కావాలి. అప్పుడు ఆనందంగా ఆట సాగుతుంది. కాని భగవంతుడు ఎటువంటి కోరికలు లేని వాడూ, నిత్య సంతృప్తుడూ గదా? అటువంటి వానికి ఆట లందు ఆసక్తి కలగటం అశ్చర్యంగా ఉంది. త్రిగుణాత్మకమైన మాయను సృష్టించి ఆ మాయవల్ల సమస్తలోకాలనూ కల్పించే కుతూహలం ఆయనకు ఎలా కలిగిందో చిత్రంగా ఉంది.ఓ పుణ్య మైత్రేయుడా! తన మాయచేత ఈ లోకాలన్నింటినీ సృష్టించి, పాలించి, లయంచేసే ఆ పరమాత్ముడు దేశం కాలం మొదలైన అవస్థలను కల్పించుతున్నాడు. ఇతరులను సృష్టించి వారియందు అఖండమైన జ్ఞానంతో వర్తిస్తున్నాడు. కేవలం జ్ఞాన స్వరూపుడైన భగవంతుడు ఆ ప్రకృతితో తాను ఏ విధంగా కలసి ఉంటాడు? దేవుడు ఒక్కడై ఉండి అన్ని శరీరాల్లోనూ జీవుడూగా వసించి ఉంటున్నాడు గదా; దేవుడైన జీవునకు భరింపరాని గర్భనరకం వంటి కష్టాలు ఏ కర్మ వల్ల సంభవిస్తున్నాయి? ఈ సందేహాలతో నామనస్సు చాల వ్యాకుల పడుతున్నది. ఈ అజ్ఞానావస్థ నుండి బయట పడలేక తల్లడిల్లి పోతున్నాను.ఈ నా మనస్సులోని సందేహాలను తొలగించడానికి విద్వాంసులలో అగ్రగణ్యుడవైన నీవే సమర్థుడవు అని విదురుడు మైత్రేయుణ్ణి వేడుకున్నాడు.

 

కల్యాణదాయకమైన కమలనాభుని మధుర కథా సుధారసాన్ని ఆస్వాదించాలనే కుతూహలంతో ఉవ్విళ్ళూరుతున్న విదురునితో మహనీయుడైన మైత్రేయుడు ఇట్లా అన్నాడు.“ఓ విదురా! వినవయ్యా! వికసించిన కమలాలవంటి కన్నులు గల విష్ణుదేవుని మాయ అజేయమైనది. కేవలం పిడివాదాలైన ఈ తర్కవితర్కాలు ఆ మాయను స్పృశింపలేవు. ఆయన ఆద్యుడు, అనంతుడు, నిత్యుడు అయిన కారణంగా నిత్య మంగళ స్వరూపుడైన ఆ పరమేశ్వరుణ్ణి ఈ బంధాలు, ప్రతి బంధాలూ, విపత్తులూ, విషాదాలూ అంటవు. ఆయన వీటి కన్నింటికీ అతీతుడు.ఇంకా విను. పురుషుడు నిద్రపోయే సమయంలో ఏవేవో కలలు వస్తాయి. ఎన్నో సుఖాలు పొందుతున్నట్లూ, తనను ఎవరో చంపేసినట్లూ, తన శిరస్సు ఖండించి వేసినట్లూ కలలు కంటాడు. మెలకువ వచ్చిన పిమ్మట అవన్నీ అసత్యాలని తెలుసుకుంటాడు. ఆ విధంగానే దేవుడు జీవుడుగా నటించునప్పుడు ఈ కష్టసుఖాలు ఏవీ ఆయనకు అంటవు. అయితే స్వప్నంలో ఉన్నంత కాలమూ జీవుడు పడే చిక్కులూ బాధలూ జీవుడుగా ఉన్న భగవంతునకు మాత్రం ఎందుకు కలుగవు అనే సందేహం కలిగినట్లైతే విను. భగవంతుడికి ఆ విధమైన బాధలూ బంధనాలూ ఏవీ అంటవు. అది ఎలాగంటే అందంగా అటూ ఇటూ కదలుతూ ఉన్న స్వచ్ఛమైన కోనేటి నీటిలో ప్రతిబింబించే నిండు పున్నమి నాటి చంద్రబింబం ఆ నీటి కదలిక వల్ల కదులు తున్నట్లు కన్పిస్తుంది. జలం కదలిక వల్ల ప్రతిబింబం కదలినా ఆకాశంలో ఉన్న చంద్రబింబం ఏ మాత్రం చలించదు. అదే విధంగా, సర్వజీవుల శరీర ధర్మాలను కలిగి క్రీడించే ఈశ్వరునకు కర్మబంధాలు ఏ మాత్రమూ అంటవు.కనుకనే, జీవునకు మాత్రమే అజ్ఞాన ప్రభావంవల్ల కర్మబంధాలు కలుగుతున్నాయి. కాని సర్వభూతాల్లో అంతర్యామిగా ఉండే పరాత్పరునకు బంధనాలు ప్రాప్తించవు.మానవునకు తన శరీరం నుండి పుట్టిన గుణాలను పోగొట్టడానికి నారాయణుని పాదసరోజాలమీద విశేషించి విస్పష్టమైన భక్తి ఒకటే చాలు. అలాగే ఆపదలను బాపుకొనడానికి పంచేంద్రియాలను భగవంతుని అధీనంచేసి మనస్సును, చలించని ఉన్నతమైన ఏకాగ్రభావంతో నింపి ఆ సరోజాక్షుని సంకీర్తనం చేస్తే చాలు.ఓ విదురా! నీవు విద్వజ్జనులుచే వినుతింపదగిన వర్తన గల వాడవు. ఎవరైతే శ్రీహరి పాదపద్మాలను పూజించుతూ సన్నుతించుతూ నిరంతరమూ భక్తియోగంలో సమాసక్తులై ఉంటూ ఉంటారో వారు, శివుడికీ బ్రహ్మదేవుడికీ సైతం అందకోరాని దివ్యమైన స్థానాన్ని చేరుకుంటారు. అటువంటి పుణ్యపురుషుల పూర్వజన్మ సుకృత విశేషాన్ని పొగడడానికి ఎటువంటి వారికైనా సరే చేతకాదు.”

----------------------

భగవంతుడు ఇంద్రియాలతో కూడిన మహదాదులకు పరస్పర సంబంధం కల్పించి విరాట్ దేహాన్ని పుట్టించి అందు నివాసం చేస్తూ ఉంటాడు గదా బ్రహ్మవేత్తలైనవారు ఆ పరాత్పరుణ్ణి సహస్రశీర్షునిగా సహస్రపాదునిగా సహస్రబాహునిగా పేర్కొంటున్నారు. ఆ విరాట్పురుషునిలో అఖిల లోకాలూ అలజడి పొందకుండా ఉంటున్నాయి. అటువంటి విరాటం స్వరూపం నుండే పది ప్రాణాలూ, ఇంద్రియగోచరా లయిన విషయాలూ, ఇంద్రియాల కధిపతులైన దేవతలూ, మూడువిధాలైన బ్రాహ్మణాది వర్ణాలూ ఏర్పడ్డాయి.

 

తృతీయ స్కంధము : బ్రహ్మ జన్మ ప్రకారము

 

పూర్వం ప్రళయనమయంలో విశ్వమంతా జలమయంగా ఉన్నప్పుడు శ్రీమన్నారాయణుడు ఆదిశేషుణ్ణి పాన్పుగా చేనుకొని సముద్రమధ్యంలో పవ్వళించాడు. ఆ ఆదిశేషుడు స్వచ్ఛమైన అమృతపు నురుగులవంటి తెల్లనైన శరీరం కలవాడు. అతని తెల్లని శరీర కాంతులు అతని వేయి తలలపై తళతళలాడే రత్నాల కాంతులతో చెలిమి చేస్తున్నట్లుగా వెలుగొందాయి. నారాయణుడు తన కడుపులో అగ్నిని దాచుకొన్న కట్టెలా లోపల చైతన్యశక్తి కలవాడై ఉన్నాడు. అనంతమైన తత్త్వదీప్తితో అద్వితీయుడై ఆనందమయుడై కపటనిద్ర నభినయిస్తూ కన్నులు మూసుకొని ఉన్నాడు. కుతూహలం కలిగి కూడా కోర్కెలు లేనివానిలా నిష్కళంకమైన స్వరూపంతో విరాజిల్లాడు.అలా యోగమాయకు కూడా దూరంగా వెయ్యి యుగాల పర్యంతం సమస్త లోకాలను తన కడుపులో దాచుకొని వెలుగొందుతూ ఆ పైన కాలమూ శక్తీ చక్కగా అభివ్యక్తం కాగా సమత్వం వహించి సృష్టికార్యం నిర్వహించటానికి ఆసక్తు డైనాడు.

 

అలా తన కడుపులో దాచుకున్న లోకాలన్నింటిని తిరిగి సృష్టించడానికి ఉపకరణాలైన సూక్ష్మ పదార్థాలను మనస్సులో భావించి, కాలానుగుణంగా రజోగుణాన్ని సృష్టించాడు.ఆ విధంగా పుట్టించిన రజోగుణంవల్ల నారాయణుని నాభిలో నుండి మొగ్గతో కూడీన ఒక తామరతూడు జన్మించింది. సృష్టికార్యప్రభావితమైన కాలాన్ని అనుసరించి భగవంతుడు తన తేజస్సుచేత వృద్ధిపొందిన నీటినడుమ ఆ తామరమొగ్గను సూర్యునిలాగా వికసింపజేశాడు. లోకాలకు ఆశ్రయం ఇచ్చే స్థితినీ, సకలగూణాలతో ప్రకాశించే ప్రకృతినీ కలిగిఉన్న ఆ కమలంలో పరాత్పరుడు తన కళతోకూడిన అంశాన్ని ప్రసరింప జేశాడు. అప్పుడు ఆ పద్మంలో నుంచి సంపన్నుడూ, స్వయంభువుడూ, చతుర్ముఖుడూ అయిన బ్రహ్మదేవుడు ఉద్భవించాడు.

 

పద్మంలోనుంచి ప్రభవించిన ఆ బ్రహ్మ పద్మం పైభాగన నిలబడి, కన్నులు బాగా తెరచి లోకాలనూ, దిక్కులనూ, ఆకాశాన్ని తన నాల్గుమోములతో పరికించి చూడసాగాడు.అంతులేని ప్రళయకాలం. చుట్టూ మహాజలం. ప్రచండమైన గాలులు వీస్తున్నాయి. అలలు లేచిపడుతున్నాయి ఆ జలమధ్యంలో ఒక పద్మం ఆ పద్మంమధ్య దుద్దుపై తాను స్పష్టమవుతూ ఉన్న లోకాల స్వరూపం ఇదంతా ఏమిటో అర్థంకాక. తెలుసుకోలేక చతుర్ముఖుడు తన మనస్సులో చాలా విచారాన్ని పొంది ఇలా వితర్కించాడు.

 

ఈ నీటపై ఈ పద్మం ఏ విధంగా పుట్టింది? ఒంటరిగా నేను ఈ తామర గద్దెపై ఎలా ఉంటున్నాను? నా పేరు ఏమిటి? నాకు ఈ పుట్టుక రావడానికి కారణం ఏమిటి? ఎంత ఆలోచించినా ఈ క్రమం ఏమిటో తెలుసుకోలేక పోతున్నాను అని బ్రహ్మదేవుడు ఆశ్చర్యచకితు డైనాడు.ఆ తామరతూడు ఎక్కడ నుంచి పుట్టిందో, దాని మొదలు ఎక్కడో తెలుసుకోవాలని ఆ నీటిలో వెదకడంకోసం బ్రహ్మదేవుడు పద్మనాళం వెంట లోపలికి ప్రవేశించాడు.

 

మిక్కిలి లోతూ, మిక్కిలి విరివీ కలిగిన ఆ సముద్రపు నీటిలో మునిగినవాడై ఆ బ్రహ్మ వేయి దేవతావత్సరాలు ఎంతో జాగ్రత్తగా వెదికాడు. అయిన ఆ తామరతూడు మూలాన్ని తెలుసుకోలేక పోయాడు. భగవంతుని మాయాప్రభావం మూలాన ఆయనకు ఆ మూల రహస్యం అంతు చిక్కలేదు. మతి కోల్పోయి బెదరిపోయి మళ్లీ ఆ తామర పూవు పైకే చేరాడు.

 

తృతీయ స్కంధము : బ్రహ్మకు హరి ప్రత్యక్ష మగుట

 

అలా చతుర్ముఖుడు ఆ పద్మపీఠంపై కూర్చుండి అష్టాంగయోగంపై ఆసక్తి గలవాడైనాడు. గాలిని బంధించి, ఏకాగ్రభావంతో తపస్సు చేసాడు. ఈ విధంగా నూరేళ్ళు గడిచాయి.బ్రహ్మదేవుడు ఇలా చేసిన యోగాభ్యాసం వల్ల విజ్ఞానాన్ని పొందాడు. ఆ విజ్ఞానం వల్లకూడా అతడు విష్టువును చూడలేకపోయాడు. అప్పుడు తన ధ్యానాన్ని తన హృదయంలో నిలిపాడు. అక్కడ పరాత్పరుని దర్శించి తన హృదయంలో ఉన్నవాడే తనను కన్నవా డని తెలుసుకొన్నాడు.ఈ విధంగా అచంచలమైన భక్తితో కూడిన యోగమాహాత్మ్యం వల్ల బ్రహ్మదేవుడు శుభచరిత్రుడూ, పరమపవిత్రుడూ, లక్ష్మీకళత్రుడూ, అయిన శ్రీమన్నారాయణుని దర్శించాడు. ఆయన వేలుపు పెద్దల వినతులు అందుకొనే వాడు. దానవసైన్యాలను తరిమికొట్టేవాడు. వికసించిన కమలాలవంటి కన్నులు కలవాడు. క్రొత్తదై వెలిగిపోతూ ఉన్న నీలమేఘంతో సమానమైన దేహం కలవాడు గరుడవాహనుడు.

 

అంతేకాదు. ఆ మహానుభావుడు గొప్పవైన పడగలనే గొడుగుల చివర గల స్వచ్ఛమైన రత్నాల కాంతులతో ప్రళయకాలంలోని చీకట్లను పోకార్చుతూ కొంగ్రొత్త తామరతూడులాంటి తెల్లని దేహసంపద కలిగన ఆదిశేషుణ్ణి పాన్పుగా చేసికొని మిక్కిలి నిర్మలంగా ఉన్న నీళ్ళమధ్యలో శయనించి ఉన్నాడు.కట్టుకొన్న మేలైన పట్టుస్ర్తాల కాంతులు సాయంకాలపు మేఘాల కాంతులు కాగా, పెట్టుకొన్న సుందర సువర్ణ కిరీటం బంగారు శిఖరం కాగా, రొమ్ముపై వ్రేలాడే ముత్యాలహారాలు చరియలపై నుండి జాలువారే సెలయేళ్ళు కాగా, అందాలు చిందే తులసీమాలలు దరుల్లో ప్రకాశించే ఓషధీలతలు కాగా, ఉన్నతభుజాల చెంగట ఉన్న మొదళ్ళు కాగా, పాదాలు ముంగిట ఉన్న తరుగుల్మాలు కాగా, పచ్చని దేహంతో పచ్చల పర్వతంలాగా ప్రకాశిస్తున్నాడు ఆ పరాత్పరుడు.

 

అంతేకాక ఆ మహాత్ముని దివ్యదేహం వేరుపరుపరానిది. సాటిలేనిది. సమస్త లోకాలను తనలో ఇముడ్చుకొన్నది. చాలా విశాలమై గుండ్రనై నిడివి కలిగి ఉన్నది. విచిత్రమైన మనోజ్ఞమైన అనేక దివ్యభూషణాలను ధరించి వాటిని స్వచ్ఛమైన తన కాంతులచే అలంకరిస్తున్నది. పలువిధాలైన కోర్కెలు కోరుతూ యాథావిధిగా పూజించే పుణ్యపురుషులకు కామధేనువు అనదగిన చరణ కమలద్వయం కలిగి ఉన్నది. ఫాలఫలక కాంతులకు ఓడిపోయిన చంద్రుడు అనుగ్రహింప బడినవాడై ఆయన పాదపద్మాలను అనేక రూపాల్లో ఆశ్రయించాడా అన్నట్లు ఉన్నాయి ఆయన కాలిగోళ్లు. శ్రీదేవికీ, భూదేవికీ తలగడలా అన్నట్లు, నున్నని అరటిస్తంభాల నీలద్యుతిని అతిశయిస్తున్నాయి అతని తొడలు ఉన్నాయి. ఆయన కటిప్రదేశం మణులు చెక్కిన బంగారు ఒడ్డాణంతో మనోహరమై ఉన్నది. ఆయన నడుము కడిమిపువ్వుల కేసరాల కాంతులొలికే పట్టుపీతాంబరంతో ప్రకాశిస్తున్నది. ఆయన నాభి శృంగారతరంగిణి సుడివలె ఉన్నది. ఆయన మధ్యప్రదేశం (నడుము) కడుపులో సమస్త జగత్తులూ మాటిమాటికీ పుట్టుతున్నందువల్ల కృశించిందా అన్నట్లు ఉన్నది.

 

ఆయన వక్షఃస్థలం మంచి ముత్యాలు కూర్చిన ముగ్గులతో ముచ్చటగా ప్రకాశిస్తూ, క్రొంగ్రొత్త తులసీమాలలనే చిగురుల పాన్పుతో ఒప్పుతూ పూలదండలతో అలంకృతమై, పచ్చకర్పూరం కస్తూరి మంచి గందం పూతలతో పరిమళిస్తూ, కౌస్తుభరత్న కాంతులతో వెలిగిపోతూ, శ్రీవత్సశోభితమై లక్ష్మీదేవు విహరించే విలాసమందిరమా అన్నట్లు ఉన్నది. శృంగార క్రీడకు ముందు గట్టిగా కౌగిలించుకొన్న లక్ష్మీదేవి చేతులందలి మణులు చెక్కిన బంగారుగాజులు ఒత్తుకున్న గుర్తులా ఉన్నట్లు ఆయన కంఠాన మూడురేఖలు కన్పిస్తున్నాయి.

 

ఆయన చేతులు వెలకట్టరాని రమణీయ రత్నకాంతులతో విరాజిల్లే భుజకీర్తులతో, కంకణాలతో, ఉంగరాలతో అలంకృతములై ఉన్నాయి. ఆయన చెక్కుటద్దాలు సమస్తలోకుల బాధలను పోగొట్టగల చిరునవ్వు వెన్నెలలతో తెల్లనై కర్ణకుండలాల మణిప్రభల నాట్యాలతో తళతళలాడుతూ ఉన్నాయి.

 

ఆయన క్రిందిపెదవి పండిన దొండపండులాగా, పగడంలా, చిగురుటాకులాగా అరుణారుణమై అలరారుతున్నది. ఆయన ముక్కు చక్కని సంపెంగ పువ్వులా, సమస్తలోకాలను పాలించడానికి చాలిన దానిని నేనంటే నే నని వాదులాడే కన్నులకు సరిహద్దుస్తంభం అన్నట్లు ఉన్నది. ఆయన కన్నులు కమలాలకూ, కలువలకూ శోభ చేకూర్చుతూ, కరుణామృతం పొంగిపొరలే కటాక్ష వీక్షణాలతో చెవులవరకు విస్తరిల్లి ఉన్నాయి. ఆయన చెవులు శ్రీకారానికి అక్షరానికి అక్షరమైన ఆకారం చేకూరుస్తున్నాయి. ఆయన కనుబొమలు మన్మథుని ధనుస్సూలా అన్నట్లు ఉన్నాయి. ఆయన నెన్నుదురు బహుళపక్షం అష్టమినాటి చంద్రుడా అన్నట్లు కన్నుల విందు చేస్తున్నది.

 

ఆయన శిరస్సుమీద పద్మరాగమణులు పొదిగిన బంగారు కిరీటం నీలపర్వత శిఖరంమీద ఉండే భాలసూర్యుణ్ణి తిరస్కరిస్తున్నది. సూర్యుడు, చంద్రుడు, వాయువు. ఆగ్ని వీని ప్రకాశానికి కూడా అవకాశం ఇవ్వకుండా, మూడులోకాల్లోనూ వ్యాపించడానికి సమర్థమైన తేజోవిశేషంతో విరాజిల్లుతూ ఉన్న ఆ దేవదేవుడు రణరంగాలలో రాక్షసుల సమూహాన్ని చించి చెండాడ గల్గిన సుదర్శనం మొదలైన దివ్యాయుధాలు ధరించి ఉన్నాడు. అనన్యసామాన్యమైన దివ్యరూపంతో దేదిప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నాడు.

 

ఆ మహాత్ముడు హారాది అలంకారాలు పుష్పసమూహాలుగా, వెలకట్టరాని రత్నాలు చెక్కిన భుజకీర్తులతో ఉంగరాలతో, విరాజిల్లే వేలకొలది బాహువులు శాఖోపశాఖలుగా ప్రకాశిస్తూ, భువనానికి ఆత్మయై మూలం తెలియరానిదై పడగవిప్పిన మహాసర్పం చుట్టుకున్న చందన వృక్షంలా ఉన్నాడు.పడగవిప్పిన సర్పరాజుతో కలిసి మెలసి ఉన్నందువల్లా, భూమిని మోస్తూ ఉండటంవల్లా, శిరోవిభూషణాలుగా ప్రకాశించే వేలకొలది కిరీటాలవంటి బంగారు శిఖరాలవల్లా, సముద్రజలమధ్యంలో నివసించడం వల్లా, మనోహరమైన కౌస్తుభాది రత్నాలు కలిగివుండటం వల్లా మహావిష్ణువు మైనాక పర్వతంలా చూడదగినవాడు అయ్యాడు.

 

విష్ణువు వైభవోపేతంగా ప్రకాశించే కీర్తి అనే పూలదండలు ధరించాడు; వాటికి ఆకర్షించబడి వేద సమూహాలు అనే విశేషమైన తుమ్మెదలు మూగాయి; అవి సామాన్యమైన తుమ్మెదలా? విస్తారమైన భావంతో జ్ఞానం, జపం, స్తోత్రం ఆనే తేనెలు త్రాగటంచే సంతోషించే విశేషమైన తుమ్మెదలు. అట్టి విష్ణుమూర్తిని చతుర్ముఖబ్రహ్మ చూసాడు.

 

తృతీయ స్కంధము : బ్రహ్మదేవుని విష్ణుస్తోత్రంబు

 

అలా బ్రహ్మదేవుడు సృష్టి అంతటికి ప్రభువూ, ఆది అంతమూ లేనివాడూ ధన్యుడూ, సకల భువనాలకూ మాన్యుడూ అయిన మహానుభావుని దర్శించాడు; అంతేకాదు ఆయన బొడ్డునుంచి పుట్టిన కమలాన్ని, జలాన్ని, అగ్నిని ఆకాశాన్ని మహాజగత్తు సృష్టించాలనే దృష్టినీ దర్శించాడు; ఆయనకు ఇంక ఇతరమైనవి ఏవి కనపడ లేదు; తనదైన సృష్టికార్యానికి బీజాంకురం అయిన రజోగుణం అతనిలో జనించింది; అమోఘమైన ప్రజా సృష్టికి సుముఖుడు అయినాడు;“సర్వప్రపంచాన్ని, సృష్టించడానికి పూనుకున్న నన్ను అందాలు చిందే కమలాలవంటి కన్నులతో వీక్షించి రక్షించడానికై, విధంగా సాక్షాత్కరించిన పరాత్పరుడు నా దుఃఖాన్ని దూరంచేయు గాకఅని తలవంచి నమస్కరించాడు.

 

పద్మంలో పుట్టినవాడు అయిన బ్రహ్మదేవుడు కేవలం తపస్సు పై ఆసక్తి కలవాడై పద్మాక్షుడూ, గోవిందుడూ, అనంతుడూ, పురుషోత్తముడూ అయిన పరమేశ్వరుణ్ణి ఎంతో ప్రస్తుతించాడు. అమృతం తాగే దేవతలకే దేవదేవుడైన హరి అనుగ్రహించాడు. సమస్త విశ్వాన్ని సంస్థాపించాలనే దృష్టితో ప్రళయాన్ని సృష్టించిన మహా జలప్రవాహం వైపు అలా అలవోకగా ఒక మాటు అవలోకించాడు.

 

అలా చూసి ఆర్తితో అడుగుతున్న బ్రహ్మదేవుని కోర్కె తీర్చాలని మదిలో భావించాడు. అతనిలోని వ్యామోహాన్ని తొలగించగలిగిన అమృతముతో సమానమైన తీయని మాటలతో ఇలా అన్నాడు.“నీవు పూనుకొని చేస్తున్న పని వదలవద్దు. అనవసరంగా మనస్సుకు తెచ్చి పెట్టుకున్న దుఃఖాన్నిమాను. సృష్టి నిర్మాణం నా లీలలలో, ప్రధానమైనది. సృష్టి నిర్మాణ కార్యం చేయాలనే బుద్ధి హృదయంలో ప్రతిష్ఠించుకొని, సమాధినిష్ఠుడవై భక్తితో తపస్సు చేసి నన్ను ప్రసన్నుని చేసుకో. నీ కోరికలు నెరవేరుతాయి.నీ తపస్సంపద వైభవం వెల్లడయ్యే సృష్టి నిర్మాణ కార్యాన్ని మొదలెట్టు. అప్పుడు, లోకం అంతా స్తుతించే బ్రహ్మా! సమస్తమైన లోకాలు అన్నిటిలోనూ ప్రకాశించే నన్ను కనుగొనగలవు. విశ్వం అంతా వినుతించే బ్రహ్మా! కఱ్ఱల లోపల దాగి ఉన్న నిప్పులా, నాలో దాగి ఉన్న ప్రాణి సమూహాలన్నీ నీకు తప్పకుండా కనిపిస్తాయి. ఏదీ నువ్వు ఇప్పుడు చూడు.సరోజసంభవా! బ్రహ్మా! సకల జీవులలోనూ అంతర్యామినై ఉండే నన్ను చక్కగా తెలుసుకొని సేవించు; నీదోషాలన్నీ తొలగిపోతాయి. (1. పృథివి, 2. జలము, 3. తేజస్సు, 4. వాయువు, 5. ఆకాశము ఇవి పంచ భూతాలు; 1. కళ్ళు, 2. ముక్కూ, 3. చెవులు, 4. నోరు, 5. చర్మము, 6. నాలుక, 7. చేతులు, 8. కాళ్ళు, 9. మలద్వారము, 10. జననేంద్రియం ఇవి దశేంద్రియాలు). పంచభూతాలకూ, దశేంద్రియాలకూ అతీతుడైన జీవుడే ఆత్మ. పరిశుద్ధుడైన ఆత్మనూ, పరమాత్ముడనైన నన్నూ అభేదంగా దర్శించే మానవుడు మోక్షమార్గంలో పయనించేవాడు అయి ప్రకాశిస్తాడు. బ్రహ్మాండం అనే గోళంలో అనేక రకాల కర్మలకూ సానుకూలమై ప్రవర్తించే ఆయా అనేక రూపాలు గల జీవులను నీవు సృష్టించుకున్నప్పటికీ నీమనస్సు నిత్యం నాపాదపద్మాల మీదనే లగ్నమై ఉన్నందువలన నీలోని రాజసగుణం నీకు పాపాన్ని కలిగించదు. పితామహా! బ్రహ్మా! అంతేకాదు, నేను జీవులు ఏనాడూ తెలియలేని పుణ్యమూర్తిని, తేజోనిధిని, పరమేశ్వరుడను, అటువంటి నేనే ఇప్పుడు నీముందు సాక్షాత్కరించాను. చూసావు కదా.1. పృథివి, 2. జలము, 3. తేజస్సు, 4. వాయువు, 5. ఆకాశము ఇవి పంచ భూతాలు; 1. కళ్ళు, 2. ముక్కూ, 3. చెవులు, 4. నోరు, 5. చర్మము, 6. నాలుక, 7. చేతులు, 8. కాళ్ళు, 9. మలద్వారము, 10. జననేంద్రియం ఇవి దశేంద్రియాలు; 1, సత్వగుణము, 2. రజోగుణము, 3. తమోగుణము ఇవి త్రిగుణాలు. నేనే పంచభూతాలకూ, పది ఇంద్రియాలకూ, త్రిగుణాలకూ, అంతరాత్మను అనీ, జగత్తు అంతటా వ్యాపించినవాడననీ, నన్ను నీ మనస్సులో భావించు. అప్పుడు పద్మంకింద కాడ లో ఉన్న కన్నం వెంట వెళ్లి నీటిలో ఉన్న నన్ను చూడాలనుకున్న నా స్వరూపం ఇప్పుడు నీకు దర్శనం అయింది.ఇప్పుడు నీకు దర్శనం అయిన నా స్వరూపంలోని సౌందర్య విశేషాలన్నీ దేవతలూ, ఆదిశేషుడూ, చివరకు పరమశివుడు కూడా మాటలలో వర్ణించలేరు. మనస్సులో ఊహించను కూడా ఊహించలేరు.కమలభవా! బ్రహ్మా! నిర్గుణుడనై, వినోదంకోసం జగత్తులను సృష్టించాలనుకున్న నన్ను సగుణ పరబ్రహ్మగా ప్రస్తుతించావు. నాకు ఎంతో సంతోషమైంది.బ్రహ్మా! నా సంతోషం కోసమే నిన్ను సృష్టికర్తగా సృష్టించాను. నాలో లీనమై దాగి చలనం లేకుండా ఉండే లోకాలను అన్నింటి నీవు చక్కగా సృజించు. పుణ్యచరితుడా! బ్రహ్మా! అహంకారమే, మూలతత్వంగా గ్రహించి నువ్వు సృష్టి చెయ్యిఅని బ్రహ్మను ఆజ్ఞాపించి, అనంతరం భగవంతుడైన విష్ణువు అంతర్హితుడైనాడు.

 

తృతీయ స్కంధము : బ్రహ్మ మానస సర్గంబు

 

పద్మాక్షుడు విష్ణువు ప్రసాదించిన వరాల ప్రభావము వల్ల, బ్రహ్మ వంద దివ్య సంవత్సరములు భగవంతుణ్ణి గూర్చి తపస్సు చేసాడు. అప్పుడు మహావాయువు వీచింది. గాలికి తన నివాసమైన పద్మం చలించింది. నీరు చలించింది. అది చూసి బ్రహ్మదేవుడు తన తపశ్శక్తిచేత వృధ్దిపొందిన విద్యాబలంతో వాయువును నిరోధించాడు. మహా జలాన్ని అంతా ఒక్క పర్యాయంగా త్రాగాడు. అనంతరం పైకి చూడగా ఆకాశమంతా నిండిన జలం కనిపించింది.

 

పద్మసంభవుడు, జ్ఞానులకు వందనీయుడు అయిన బ్రహ్మ, అప్పుడు తన హృదయంలో రాక్షసులకు శత్రువైన వాడూ, జలాలలో విహరించువాడూ, అందమైన హారాలు ధరించువాడూ, సమస్త దేవతల చేత నమస్కరించబడేవాడూ, లక్ష్మీదేవి హృదయాన్ని పొందినవాడూ, బహు ఉదారుడూ, సంసారదుఃఖాలను దూరం చేసేవాడూ, భవబంధాలను త్రెంచువాడూ, విద్వాంసులు వినుతించేవాడు, పాపాలను పటాపంచలు గావించేవాడూ అయిన భగవంతుణ్ణి తన మనస్సులో ధ్యానించాడు.ఇలా ధ్యానించిన పద్మభవుడైన బ్రహ్మదేవుడికి ఆకాశంలో ఒక పద్మం కనిపించింది. తామర రేకులలో దాగి ఉన్న లోకాలన్నీ కనిపించాయి. అప్పుడు బ్రహ్మ తాను శ్రీహరిచే నియమింపబడినవాడ నని భావించాడు.శ్రీ మహావిష్ణువు అనుజ్ఞ లభించినట్లు గ్రహించిన బ్రహ్మదేవుడు, మెల్లగా తామరపువ్వు లోనికి ప్రవేశించాడు. మొట్టమొదట అందులో ఉన్న మూడులోకాలనూ అవలోకించాడు. తర్వాత మహత్తరమైన తన శక్తి వినియోగించి, సులువుగా పద్నాలుగు భువనాలను చక్కగా సృష్టించాడు.

 

ప్రతిఫలం, ఆశించని తన పరమధర్మానికి, ఫల స్వరూపముగా, దేవతలు, పశు పక్ష్యాదులు, మానవులు ఇంకా అనేక రకాలైన స్ధావరాలు మొదలైన వాటితో కూడిన నానావిధాలైన సృష్టిని క్రమంగా బ్రహ్మదేవుడు కొనసాగించాడు.మొదలు తుది లేనిదీ, తరిగిపోనిదీ అయిన తత్వమే సృష్టికంతటికి ప్రధాన కారణం. అందువల్ల గుణాలూ, ఇంద్రియార్థాలూ మహత్తూ, పంచభూతాలూ, తన్ను ఆశ్రయించగా, ఈశ్వరుడు కాలానికి అనురూపమైన రూపం ధరించిన వాడై వినోదానికై తనను తాను సృష్టించుకున్నాడు. ఈవిధంగా సృష్టించిన సమస్త లోకాలందూ ఈశ్వరుడు ఉంటాడు. ఈశ్వరుని యందు సమస్త లోకాలూ ప్రకాశిస్తూ ఉంటాయి. కాబట్టి విశ్వానికి కార్యము కారణమూ రెండూ తానే. పరమపురుషుని శరీరంనుండి విడివడి విశ్వం విరాజిల్లుచున్నది. ఈవిధంగా వర్తమానసృష్టి ఏర్పడింది.పురుషోత్తముని మాయ వలన, జగత్తు అంతా ఒక క్రమంలో పుట్టి, పెరిగి నశిస్తూ ఉంటుంది. ఇలాగే పూర్వకాలంలో జరిగింది. భవిష్యత్కాలంలో కూడ ఇదే విధంగా జరుగుతుంది.

 

అటువంటి సృష్టి తొమ్మిది విధాలు. వాటిలో ప్రాకృతాలు, వైకృతాలు అనేవి రెండు రకాలు. కాలం, ద్రవ్యం, గుణం అనే రకాలు మూడు భేదాలతో ఉంటాయి. అవి పరస్పరం సంకరం అవుతూ ఉంటాయి. వాటిలో మహత్తత్వం మొదటి సృష్టి. ఆది నారాయణుని సమీపంలో గుణభేదాన్ని పొందుతుంది. ద్రవ్య జ్ఞాన క్రియాత్మకమైన అహంకారం తత్త్వం రెండవ సృష్టి. శబ్ద స్పర్శ రూప రస గంధాలు అనే పంచ తన్మాత్రల ద్రవ్యశక్తితో కూడిన పృథివి మున్నగు పంచభూతాల సృష్టి మూడవది. జ్ఞానేంద్రియాలైన చర్మం, కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు మరియు కర్మేంద్రియాలైన నోరు, చేతులు, కాళ్ళు, పాయువు, జననేంద్రియం కలిసి పది ఇంద్రియాల పుట్టుక నాలుగవ సృష్టి. సాత్వికాహంకారం వలన పుట్టిన దేవతాగణాల సృష్టి అయిదవది. అది కేవలం మనోమయమై ఉంటుంది. సకల ప్రాణులకు అజ్ఞాన కృత్యాలైన ఆవరణ విక్షేపాలు కలిగించే తామస సృష్టి ఆరవది. ఆరూ భగవంతుని లీలా విలాసాలయిన ప్రాకృత సృష్టులు. ఇక ఏడవదాని నుండి వైకృత సృష్టులను వినిపిస్తాను. విను, పూలు పూయకుండానే ఫలించే రావి, మేడి, పనస, మఱ్ఱి మొదలైన వనస్పతులు, పూచి ఫలించిన వెంటనే నశించే వడ్లు(బియ్యం), యవలు (గోధుమలు), పెసలు మున్నగు ఓషధులు, పైకి ఎగపాకడానికి అవకాశం లేని మాలతి, మల్లె, మొదలైన తీగలు, గట్టి బెరడు కలిగిన వెదుళ్ళు మొదలైనవి, నేలలో దృఢమైన వేళ్ళు కలిగి నేలపై బాగా విస్తరించే లతా విశేషాలైన దుబ్బులు, పొదలూ, పుష్పించి ఫలాలను ఇచ్చే మామిడి మొదలైన వృక్షాలు, అవ్యక్తమైన చైతన్యంతో పైకి పెల్లుబుకుతూ తమోమయాలై లోపల మాత్రమే స్పర్శ జ్ఞానం కలిగినవై కదలి పోలేని ఆరూ ఏడవ సృష్టి. ఇక ఎమిమిదవ సృష్టితో ఇరవై ఎనిమిది రకాల భేదాలు ఉన్నాయి. రేపు అనే జ్ఞానం లేనివై, ఆహారం మొదలైన వాటి యందు మాత్రమే ఆసక్తి కలవై, వాసన చూసి తెలుసుకోదగిన వాటిని తెలుసుకుంటూ, మనస్సులో పెద్దగా ఆలోచన చేయలేనివై, చీలిన గిట్టలు కలవైన ఎద్దు, ఎనుము, మేక, జింక, పంది, ఒంటె, గురుపోతు, నల్లచారల దుప్పి, పొట్టేలు తొమ్మిది; చీలని గిట్టలు గలవైన గాడిద, గుఱ్ఱం, కంచరగాడిద, గౌరమృగం, శరభమృగం, చమరీమృగం ఆరూ; అయిదు గోళ్ళు గలవైన కుక్క, నక్క, తోడేలు, పులి, పిల్లి, కుందేలు, ఏదు పంది, సింహం, కోతి, ఏనుగు, తాబేలు, ఉడుము పన్నెండు (ఇవన్నీ భూచరాలు) మొసలి మొదలైన జలచరాలూ, రాబందు, గ్రద్ద, కొంగ, డేగ, తెల్లపిట్ట, గబ్బిలం, నెమలి, హంస, బెగ్గురు పక్షి, జక్కవ పిట్ట, కాకి, గుడ్లగూబ, మొదలైన ఆకాశాన సంచరించేవి తిర్యక్కుల సృష్టి ఎనిమిదవది. ఇక తొమ్మిదవది మానవ సృష్టి. ఇది రజోగుణంతో పురికొల్పబడి కర్మలు చేయటంలో నేర్పు కలిగి ఉంటుంది. దుఃఖంలో కూడా సుఖాన్నే కోరుతుంది. మూడు విధాలైన సృష్టులు వైకృత సృష్టులు. ఇక దేవ సర్గాన్ని గురించి చెప్తాను విను. అది కూడా ఎనిమిది విధాలు. అందులో విబుధులు, పితృదేవతలు,సురాదులు మూడు భేదాలు; గంధర్వులు, అప్సరసలూ, ఒకటీ; యక్షులు, రాక్షసులు, ఒకటీ; భూత, ప్రేత, పిశాచాల ఒకటీ, సిద్ధ చారణ విద్యాధరులు ఒకటీ, కిన్నర కింపురుషులు ఒకటీ; ఎనిమిది కలిసి దేవ సర్గం అయింది. ఇక మనువులనూ, మన్వంతరాలనూ తెలియజెప్తాను. కల్పారంభంలలో ఇదే విధంగా తన్ను తాను సృజించుకునే వాడూ, మొక్కవోని తలంపు కలవాడూ అయిన మహావిష్ణువు రజోగుణంతో కూడిన వాడై సృష్టికర్త అయి తన స్వరూపమే అయిన విశ్వాన్ని తన సామర్థ్యం వలన కల్పించాడు. ఈశ్వరుని మాయా విశేషం వలన సృష్టిలో నదులలోని నీటి సుడులలో పడి తిరిగే చెట్లలాగే ముందు వెనుకలు తెలియకుండా ఉంటాయి. కల్పంలో ఉన్న దేవతలూ, రాక్షసులూ మొదలైనవారు ఇలాగే ప్రతి మన్వంతరంలోనూ ఆయా నామ రూపాలతో వ్యవహరించబడతారు. ఇందులో మరో విశేషం ఉంది. అదేమిటంటే, కౌమారసర్గం అనేది దేవ సర్గంలో ఒక భాగమే అయినా ప్రాకృత వైకృతాలు రెంటి స్వభావమూ కలది. అందులో దైవత్వం మానుషత్వం కలిసి ఉంటాయి. ఇదే సనత్కుమారాది సర్గం. సఫల సంకల్పుడైన పురుషోత్తముడు తనకు తానే విధంగా వివిధ భేదాలతో కూడిన విశ్వాన్ని కల్పించాడు.

 

తృతీయ స్కంధము : కాల నిర్ణయంబు

 

భగవంతుని సృష్టి కార్యానికి అంతు అనేది లేదు. దానికి వేరే వస్తువులతో, సంయోగంకూడా అవసరం లేదు. జగత్తులో కుండలు, బట్టలు, తయారయ్యే తీరు వేరు; సృష్టి నిర్మాణ తీరు వేరు. కుండ లోకంలో తయారు కావాలంటే, 1. మట్టి (ఉపాదానకారణం), 2. మట్టిని కుండగా రూపొందించటం (సమవాయ కారణం), 3. కుండను చేసేవాడు (నిమిత్త కారణం) అవసరం. అలానే బట్ట నిర్మాణం కూడా 1. ప్రత్తి (ఉపాదానం), దారాలు నేత (సమవాయి), బట్ట నేసే వాడు (నిమిత్తం). లోకంలో, కార్యానికైనా పై మూడూ అవసరం. భగవంతుని సృష్టిలో భగవంతుడు సమవాయ కారణం అవుతాడు. సూర్యుని కాంతి కిటికీలో నుండి ప్రసరించేటప్పుడు మన కంటికి కనిపించే, చిన్నచిన్న రేణువులలో, ఆరవ భాగానికి పరమాణువు అని పేరు. పరమాణువుపై ఒక ప్రక్క నుండి మరియొక ప్రక్కకు సూర్యకిరణం పయనించే కాలానికి, సూక్ష్మకాలం అని పేరు. సూక్ష్మకాలాన్ని కేవలం ఊహించుకోవలసిందే. అది మిక్కిలి అత్యల్పమైన కాల పరిమాణం. సూర్యుడు మేషం మొదలైన పన్నెండు రాసులలో పయనించే కాల పరిమాణం పేరు మహత్కాలం. దీనికే, సంవత్సరం అని పేరు.

 

రెండు పరమాణువులు ఒక అణువు. మూడు అణువులు ఒక త్రసరేణువు. మూడు త్రసరేణువులు ఒక త్రుటి. నూరు త్రుటులు వేధ, మూడు వేధలు ఒక లవం, మూడు లవాలు ఒక నిమేషం. మూడు నిమేషాలు ఒక్క క్షణం. ఐదు క్షణాలు ఒక్క కాష్ఠ. పది కాష్ఠలు ఒక లఘువు. పదిహేను లఘువులు ఒక నాడి. రెండు నాడులు ఒక ముహూర్తం. అట్టి నాడులు ఆరు కాని, ఏడు కాని అయినచో మనుష్యునకు ఒక ప్రహరం అవుతుంది. దానినే యామ మనీ లేదా జాము అని అంటారు. దిన పరిమాణాన్ని కొలిచే విధానం చెప్తాను విను, ఆరు ఫలాల రాగితో పాత్ర సిధ్ధం చేసి, తులంలో మూడవవంతు బరువు గల బంగారంతో నాలుగు అంగుళాల పొడవైన కమ్మీ తయారుచేసి, దానితో పాత్ర క్రింద రంధ్రం, చేస్తే, రంధ్రంగుండా తూమెడు నీరు పూర్తిగా క్రిందకు కారడానికి ఎంత కాలం పడుతుందో అంతకాలాన్ని ఒక నాడి అంటారు. నాలుగు జాములు ఒక పగలు అవుతుంది. అదే విధంగా నాలుగు, జాములు ఒక రాత్రి అవుతుంది. పగలు రాత్రి కలిస్తే మానవులకు ఒక దినం. పదిహేను దినాలు ఒక పక్షం , శుక్లపక్షం కృష్ణ పక్షం అని రెండు పక్షాలు. రెండు పక్షాలూ కలిపి ఒక నెల. అది పితృ దేవతలకు ఒక దినం. రెండు నెలలు ఒక ఋతువు. ఆరు నెలలు ఒక ఆయనం, దక్షిణాయనం, ఉత్తరాయణం అని ఆయనాలు రెండు. రెండు కలిసిన పన్నెండు నెలలు ఒక సంవత్సరం. సంవత్సరం దేవతలకు ఒక్క దినం అవుతుంది. నూరు సంవత్సరాలు మానవులకు పరమాయువు. కాలమే ఆత్మగా గల సూర్యభగవానుడు గ్రహాలతో నక్షత్రాలతో కూడిన తారాచక్రంలో ఉన్న వాడై పరమాణువు మొదలుకొని సంవత్సర పర్యంతమైన కాలంలో పన్నెండు రాసులను చుట్టి వస్తాడు. విధమైన సూర్యగమనం వలన సౌరమానం చంద్రమానం నక్షత్రమానం, అనే భేదాలతో సంవత్సర కాలము ఏర్పడుచున్నది. ఇది సంవత్సరము, వరీవత్సరం, ఇడావత్సరం, అనువత్సరం, వత్సరం అనే భేదాలు కలిగి ఉంటుంది. ఐదు విధాలైన వత్సరాలను ప్రవర్తింపచేసే సూర్యుడు విత్తనాలనుండి అంకురాలు మొలకెత్తించినట్లు కాలరూపమైన తన శక్తితో జీవ సృష్టిని అనుకూలం చేసుకుంటూ, ఆయుష్షు హరిస్తూ, మానవుల విషయాసక్తిని విస్తరింపచేస్తూ, కోరికలు కలవారికి యజ్ఞాల ద్వారా స్వర్గ ఫలాన్ని సమకూరుస్తూనే, ఆకాశంలో పరుగులు తీస్తుంటాడు.

 

తృతీయ స్కంధము : చతుర్యుగ పరిమాణంబు

 

కృతయుగం నాలుగువేల దివ్యసంవత్సరాలు ప్రమాణం కలది. దాని సంధ్యాకాలం ఎనిమిదివందల ఏళ్ళు. ఒక యుగానికి మరొక యుగానికి మధ్య కాలాన్ని, సంధ్య అంటారు. త్రేతాయుగ ప్రమాణం మూడువేలదివ్య సంవత్సరాలు. సంధ్యాకాలం ఆరువందల ఏళ్ళు. ద్వాపరయుగ ప్రమాణం రెండువేల దివ్యసంవత్సరాలు. సంధ్యాకాలం నాలుగువందల సంవత్సరాలు. కలియుగ ప్రమాణం వెయ్యి దివ్యసంవత్సరాలు. సంధ్యాకాలం రెండువందల సంవత్సరాలు. సంధ్యాకాలం మధ్య కాలంలో ధర్మం అధికంగా ఉంటుంది. సంధ్యాంకంలో ధర్మం అల్పమై ఉంటుంది.

 

ధర్మదేవత కృతయుగంలో నాలుగు పాదాలతోనూ, త్రేతాయుగంలో మూడు పాదాలతోనూ, ద్వాపరయుగంలో రెండు పాదాలతోనూ, కలియుగంలో ఒక్క పాదంతోనూ నడుస్తూ ఉంటుంది. పాదాల వ్యత్యాసాల వలన ప్రజలు పరిధులు తప్పి నడుస్తారు. మర్యాదలు తగ్గిపోతూ ఉంటాయి. దానితో సమంగా అధర్మం ఆవిర్భవించి అభివృద్ధి పొందుతుంది. లోకంలో బ్రాహ్మణులు విపరీత బుద్ధులు యందు ఆసక్తిగలవారు అయి మెలగుతారు.

 

భూలోకం, భువర్లోకం, స్వర్గలోకం కంటె పైన సత్యలోకం అని ఒకటుంది. సత్యలోకంలో ఉండే బ్రహ్మదేవునికి, కృత, త్రేత, ద్వాపర, కలి యుగాలు నాలుగు కలిపిన మహాయుగాలు వేయి గడిస్తే, ఒక్క దినం అవుతుంది. రాత్రి కూడా అంతే పరిమాణం కలిగి ఉంటుంది. బ్రహ్మ నిద్రపోతే, లోకాలకు ప్రళయం వస్తుంది. నిద్ర మేల్కొని చూస్తే మళ్లి లోకాలు పుడతాయి. బ్రహ్మదేవుని ఒక్క దినంలో పద్నాలుగు మంది మనువులు ఉద్భవిస్తారు. అంటే పద్నాలుగు మన్వంతరాలు గడుస్తాయి అన్నమాట. వారిలో ఒక్కొక్క మనువు కాలం (మన్వంతరం) డెబ్బది ఒక్క దివ్యయుగాలు. అట్టి మనువు కాలాన్నే మన్వంతరం అంటారు. మనువులు, దేవతలు, మునులు, సప్తర్షులు, భగవంతుని అంశతో ఆయా మన్వంతరాలలో పుట్టి లోకాలను పాలిస్తారు. మన్వంతరాలలో శ్రీహరి పితృ, దేవ, పశు, పక్షి, మానవ రూపాల్లో ఉద్భవించినవాడు అయి ఆత్మ శక్తితో పౌరుష ప్రతాపాలతో విశ్వాన్ని పరిపాలిస్తాడు.

 

అలా బ్రహ్మకు పగలు పూర్తి అయి రాత్రి కాగానే నిద్రపోతాడు. ఆయన శక్తి సామర్ధ్యాలు అంధకారంతో ఆచరింపబడతాయి. బ్రహ్మదేవుని రాత్రి సమయంలో మూడు లోకాలూ సూర్యచంద్రులతోపాటు కటిక చీకటితో కప్పబడి ఉంటాయి. సర్వాత్ముడైన విష్ణుదేవుని శక్తిరూపమైన సంకర్షణాగ్ని విజృంభిస్తుంది. అగ్ని జ్వాలలు ముల్లోకాలను దహించివేస్తాయి. తీక్షణమైన మంటల వేడికి తట్టుకోలేక తపించి మహర్లోక వాసులు జన లోకానికి వెళతారు. అప్పుడు ప్రళయకాలంలో భయంకరంగా ప్రచండ వాయువులు వీస్తాయి. వాయువుల వేగానికి ఉత్తుంగతరంగాలతో ఉప్పొంగిన మహాసముద్ర జలాలు మూడు జగాలనూ ముంచి వేస్తాయి. మహాసముద్ర మధ్యంలో రమాపతి, శ్రీమన్నారాయణుడు శయనించి ఉంటాడు.

 

అందమైన మంచిగంధలాగా, వజ్రంలాగ, కర్పూరంలాగ, మంచు బిందువులు లాగా, హంసలాగా, నిండు వెన్నెలలాగా, తామరతూడులాగా, ముత్యాలహారంలాగ, పున్నమ నాటి చందమామలాగా, రెల్లుపూవులాగా, మల్లెమొగ్గలాగ, తెల్లని కాంతులు విరిసే శేషశయ్య మీద, యోగనిద్రా ముద్రితుడై, చల్లగా శయనించి ఉన్న నల్లనయ్య ఉదరంలో భూ భువర్ సువర్ మున్నగు సహా ఎల్ల లోకాలూ విలసిల్లుతుంటాయి.జనలోక నివాసులైన పుణ్యాత్ములు ఎన్నో విధాల స్తుతిస్తుండగా, సాటిలేని దివ్యమైన వెలుగులు వెదజల్లుతూ, శేషతల్పంమీద కన్నులు మోడ్చి స్వామి చక్కగా శయనించి ఉంటాడు.

 

ఈవిధంగా అనేక విధాలైన కాలగమనాలతో కూడిన, పగళ్ళు రాత్రులు గడిచిపోతుంటాయి. మానవుల ఆయుఃప్రమాణం వంద సంవత్సరాలు. అలాగే బ్రహ్మదేవుని ఆయుఃప్రమాణం కూడా నూరు బ్రహ్మ సంవత్సరాలే. నూరు సంవత్సరాల మొదటి సగాన్ని పూర్వపరార్ధం అని; రెండవ సగాన్ని ద్వితీయపరార్ధ మని అంటారు. ఇలాంటి పూర్వపరార్ధం కాలం బ్రహ్మకల్పం అన్నారు. దీనినే శబ్ధబ్రహ్మం అని కూడా అంటారు.లోకాలు అన్నింటికీ ఆశ్రయమై ఉండే పద్మం, పద్మనాభుడు నారాయణుని నాభి అనే సరస్సునుంచి, ఉద్భవించిన సమయం పద్మకల్పంగా ప్రసిద్ధికెక్కింది.ద్వితీయపరార్ధం మొదట్లో హరి వరాహ రూపాన్ని ఎప్పుడు ధరిస్తాడో అది వరాహకల్పం అంటారు. అటువంటి వరాహకల్పం ఇప్పుడు జరుగుతూ ఉంది.

 

కాలస్వరూపుడు అయి ప్రకాశించేవాడూ, కమలాల వంటి కన్నులు గలవాడు, ఆద్యంతాలు లేని మహాపురుషుడు, పురాణపురుషుడు, అఖిల లోకాలకూ ఆత్మ అయినవాడు అయిన పరమేశ్వరునకు, పరమాణువు మొదలుకుని పరార్ధం పర్యంతం గల కాలం ఒక్క నిమేషంతో సమానం అవుతుంది. కనుకనే భగవంతుడే కాలానికి కర్త; కాని కాలం భగవంతునికి కర్త కాదు. అంతేకాక దేహాలూ, గృహాలూ, సంపదలూ, మొదలైన వాటియందు అభిమానం కలవారికి ఆశ్రయమైనది కాలం. భగవంతుడు గుణాలకు అతీతుడు. అందుకే ఆయన కర్త యై కాలాన్ని నడిపించుతాడు. కానీ ఆయన్ని కాలం నడిపించదు.

 

ఏకాదశేంద్రియములు 11 [పంచ జ్ఞానేంద్రియములు (కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మము), పంచ కర్మేంద్రియములు (కాళ్ళు, చేతులు, వాక్కు, గుదము, గుహ్యేంద్రియము), బుద్ధి] మరియు పంచ భూతములు 5 (భూమి, జలము, వాయువు, అగ్ని, ఆకాశము) అనే పదహారు వికారములతో కూడి; పృథ్వి జలం వాయువు తేజస్సు ఆకాశం అనే పంచభూతాలతో అవరించబడి; 1 పృథివి 2 వాయువు 3 అప్పు 4 తేజస్సు 5 ఆకాశము 6 అహంకారము 7 మనోమయము 8 జ్ఞానమయము 9 మహత్త్వము 10 ప్రకృతి అనే పది విధాలైన ఆవరణలు కలిగి; అయిదు వందల కోట్ల యోజనాల విస్తీర్ణం కలది అయి బ్రహ్మాండకోశం విరాజిల్లుతుంది.

 

లెక్కలేనన్ని మహా బ్రహ్మాండకోశాలు తన ఉదరంలో పదిలపరచుకొని ఉండే పరమేశ్వరుడైన విష్ణువు, పరమాణు రూపంతో బ్రహ్మాండకోశంలో ప్రకాశిస్తూ ఉంటాడు. తాజాగా వికసించిన కమలాలవంటి కన్నులు గల వాడు, అంతం లేనివాడూ, ఆదిదేవుడూ, అక్షర పరబ్రహ్మమూ అయిన పరమాత్మ సమస్త కారణాలకూ కారణమైనవాడే అయినప్పటికీ వాటితో ఎటువంటి సంబంధం లేనివాడై ఉంటాడు.

 

తృతీయ స్కంధము : సృష్టి భేదనంబు

 

బ్రహ్మదేవుడు సృష్టి ఆరంభంలో అహంకార పూరితమైన దేహాభిమానం గలమోహంపుట్టింది; దేహాభిమానం వల్ల స్త్రీ సంభోగం, చందనం, పూలదండలు, మొదలైన గ్రామ్య భోగాలపై ఆసక్తి గలమహామోహంపుట్టింది; కోరికలకు విఘ్నం వలన కలుగు క్రోధంలో కనులు మూసుకుపోయే స్థితి (మహా అజ్ఞానం /గుడ్డి చీకటి) ఏర్పడింది. అదేఅంధతామిస్రం; శరీరమోహం వలన శరీరనాశన భయం మృత్యుభీతి నేను చచ్చిపోతాను అనే భయం ఏర్పడింది. ఇదితామిస్రంఅజ్ఞానం / చీకటి; పై అన్నిటితో మనస్సుకు సంచలనం ఏర్పడింది. ఇదిచిత్త విభ్రమం; 1) మోహం, 2) మహామోహం, 3) అంధతామిస్రం, 4) తామిస్రం, 5) చిత్త విభ్రమం అనే అయిదింటికి అవిద్యాపంచకం, అని పేరు; అవిద్యాపంచకంతో కూడిన భూతకోటిని పుట్టించుట తాను చేసినపాపకార్యంఅని బ్రహ్మదేవుడు గుర్తించాడు. మనసులో పశ్చాత్తాపం చెందాడు. బ్రహ్మదేవుడు భగవంతుణ్ణి భగవంతుని ధ్యానం అనే అమృతం వలన ఆయన మనసు పావనం అయింది. అలా పవిత్రుడైన చతుర్ముఖుడు తన దివ్యదృష్టితో అస్ఖలిత బ్రహ్మచారులు, పరమ పావనులు, సత్వగుణ సంపన్నులు, ధీరవరేణ్యులు, మాన్యులు అయిన సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అను నలుగురు మునులను సృష్టించాడు. భగవదనురక్తులైన వారితోమీమీ అంశలతో ప్రజల్ని సృష్టించి ప్రపంచాన్ని వృద్ధి చేయండిఅన్నాడు. బ్రహ్మదేవుని మాటలు విన్న సనకాదులకు నవ్వు వచ్చింది. మోక్షాసక్తులు, శ్రీమహావిష్ణువు పరమ భక్తులు అయిన వారు పద్మసంభవుని అపహాస్యం చేస్తూ ప్రపంచ నిర్మాణానికి ప్రతికూలంగా మాట్లాడారు. వారు తన ఆజ్ఞను తిరస్కరించినందుకు చతుర్ముఖునికి కోపం వచ్చింది. బుద్ధిబలంతో ఆగ్రహాన్ని ఎంత నిగ్రహించుకున్నా ఆయన కనుబొమల నడుమ నుండి నీలం, ఎరుపు రంగుతోనీలలోహితుడుపుట్టాడు. అతడు పుడుతూనే పెద్దగా రోదనం చేసాడు.

 

ఆవిధంగా జన్మించిన నీలలోహితుడు బ్రహ్మదేవుని దేవా! నేను ఎవరిని? నా పేరు ఏమిటి? నా నివాస స్థలం ఏమిటి?” అంటూ ప్రశ్నించాడు. అప్పుడు పద్మం లో పుట్టిన చతుర్ముఖుడు అతనిని లాలిస్తూ ఇలా అన్నాడుపుత్రా! నువ్వు పుట్టగానే గట్టిగా ఏడ్చావు కదా!అలా పుట్టగానే రోదన చేయటం వలన నీకురుద్రుడుఅనే పేరు స్థిరపడింది. 1) చంద్రుడు, 2) సూర్యుడు, 3) అగ్ని, 4) వాయువు, 5) జలం, 6) ఆకాశం, 7) భూమి, 8) ప్రాణం, 9) తపస్సు, 10) హృదయం మరియు 11) ఇంద్రియాలు అనే పదకొండు నీకు నివాస స్థానాలు.” అని బ్రహ్మదేవుడు చెప్పాడు. వాటిని ఏకాదశ రుద్ర నివాస స్థానాలు అంటారు.

 

అలా చెప్పిన బ్రహ్మదేవుడు రుద్రునితో ఇంకా ఇలా అన్నాడుఅంతేకాదు కుమారా! మన్యువు, మనువు, మహాకాలుడు, మహత్తు, శివుడు, ఋతధ్వజుడు, ఉరురేతసుడు, భవుడు, కాలుడు, వామదేవుడు, ధృతవ్రతుడు అనే ఏకాదశనామాలు కలిగి ఉండు. ధీ, వృత్తి, అశన, ఉమ, నియుతి, సర్పి, ఇల, అంబిక, ఇరావతి, సుధ, దీక్ష అనే పేర్లు కలిగిన ఏకాదశ పత్నులుతో కూడి, ఇంతకు ముందు నిర్దేశించిన ఏకాదశ నామాలతో, ఏకాదశ భార్యలతో ఆయా ఏకాదశ స్థానాలు (చంద్రుడు, సూర్యుడు, అగ్ని, వాయువు, జలం, ఆకాశం, భూమి, ప్రాణం, తపస్సు, హృదయం, ఇంద్రియాలు) యందు ఉంటూ ప్రజల్ని సృష్టించుఅని విశ్వానికి గురువు అయిన బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాడు. ప్రకారంగా తనతో సమానమైన సత్తువ (బలం), ఆకారం, స్వభావం కలిగిన ప్రజలను సృష్టించాడు.

 

రుద్రుడు విధంగా రుద్రుడు సృష్టించిన రుద్రగణాలు విశ్వాన్నంతా అనాయాసంగా, అమాంతం మ్రింగేశాయి. మహా ప్రమాదాన్ని శాంతింపచేయటానికై బ్రహ్మదేవుడు వారిని చేరపిలిచికుమారులారా! చూసారా! మీ చూపుల అగ్నిజ్వాలలలో సమస్తలోకాలూ మండిపోయాయి.నాయనలారా! మీరు బుద్ధిమంతులు, ధైర్యవంతులు, నా మాట వినండి. ఇంక చాలు; మీరు సృష్టించటం చాలించండి. చక్కగా అరణ్యాలకు వెళ్ళి ఏకాగ్రచిత్తులై, తపస్సు చేసుకోండి. మీకు తప్పక శుభం కలుగుతుంది.శ్రీమన్నారాయణుడు భగవంతుడు, పురుషోత్తముడు కరుణాసముద్రుడు, లక్ష్మీవల్లభుడు, సద్గుణసంపన్నుడు, అచ్యుతుడు, పరమాత్ముడు, పరంజ్యోతి, సర్వేశ్వరుడు, సర్వాంతర్యామి, అధోక్షజుడు, జగన్నాధుడు, ఆర్త జన రక్షా పరాయణుడు; అయనను సుఙ్ఞానులు తమ తపశ్శక్తివల్ల దర్శించగలుగుతారు. మీరు కూడా తపస్సు చేసి ఆయనను దర్శించండిఅన్నాడు బ్రహ్మదేవుడు.

 

సచ్చరిత్రులైన రుద్రులు చతుర్ముఖుని ఆజ్ఞానుసారం తమ రౌద్రావేశాన్ని అణుచుకున్నారు. ఉద్రేకాన్ని తగ్గించుకున్నారు. అరణ్యాలకు వెళ్ళి తపోనిమగ్నులైయ్యారు. అనంతరం బ్రహ్మ ప్రపంచాన్ని సృష్టించాలనే దృష్టి కలవాడై ఈసారి మానవ లోకానికి శరణ్యులూ మతిమంతులలో, అగ్రగణ్యులూ అయిన వారిని సృజించాడు.భగవంతుని అనుగ్రహ బలంతో కూడిన సద్గుణాలు కలవారు, జీవుల అభివృద్ధికి కారణభూతులు, బ్రహ్మతో సమానమైన ప్రభావం కలవారు, విశాలమైన యశస్సు కలవారు, అయిన పదిమంది కొడుకులు బ్రహ్మదేవుడుకు జనించారు.

 

బ్రహ్మ బొటనవ్రేలు నుండిదక్షుడు, తొడనుండినారదుడు, నాభి నుండిపులహుడు, చెవులనుండిపులస్త్యుడు, చర్మంనుండిభృగువు, చేతి నుండిక్రతువు, ముఖంనుండిఅంగిరసుడు, ప్రాణంనుండి వశిష్టుడు, మనస్సునుండి మరీచి, కన్నులనుండిఅత్రిఆవిర్భవించారు. ఈవిధంగా పదిమంది కుమారులు పుట్టారు. ఇంకా బ్రహ్మ దేవుని కుడి వైపు స్తనంనుండిధర్మంజనించింది. వెన్నునుండి లోకభయంకరమైనమృత్యువూ, జనించాయి. ఆత్మనుండిమన్మథుడుపుట్టాడు.బ్రహ్మదేవుని కనుబొమ్మలనుండిక్రోధం , పెదవులనుండి, “లోభంపుట్టింది; ముఖమునుండిసరస్వతి; పురుషాంగం నుండిసముద్రాలు; మలద్వారం నుండి పాపాశ్రయుడైననిరృతి, నీడనుండి దేవహుతి భర్త యగుకర్దముడుజన్మించారు.

 

అంత బ్రహ్మదేవుడు తన దేహం నుండి పుట్టిన సరస్వతిని చూసి ఆమె సౌందర్యానికి మోహపరవశుడు అయ్యాడు. మన్మథుని పుష్పబాణాలు ఆయన హృదయాన్ని భేదించాయి. కన్నకూతురు అనే సంకోచం లేకుండా పాపానికి వెనుకాడక వ్యామోహంతో ఆమె వెంటపడ్డాడు. తమ తండ్రి దుశ్చర్యను మరీచి మొదలుగాగల మునివర్యులకు తెలిసింది.బ్రహ్మదేవుని దుశ్చర్యను మరీచి మొదలుగాగల మునివర్యులు తెలుసుకొని ఇలా అన్నారు.“ పద్మంలో పుట్టిన బ్రహ్మదేవుడా! చాలు చాలయ్యా. సన్మార్గాన్ని కాలదన్ని కన్నకూతురుపై కన్నేసి కలవాలని చూస్తున్నావు. ఇదెక్కడి ధర్మమయ్యా! ఎంతటి మోసగాడిని అయ్యావు. ఇంతటి పాపానికి ఒడిగట్టి, నీ న్యాయం, పెద్దరికం మట్టిపాలుచేసావు. నీ శీలం అంతా పోయింది. ఇలా చేసిన ఘనులు ఇంతకుముందు ఎప్పుడైనా ఉన్నారా.నీవు మహానుభావుడవు. నిర్మల చరిత్ర కలవాడవు. కదా లోకులు వింటే ఏమనుకుంటారు? విధాత విధినిషేధాలు తెలియకుండా ప్రవర్తించాడనుకోరా? బ్రహ్మదేవుడు వావి వరుసలు వదలిపెట్టి మన్మథబాణాలకు లొంగిపోయి, కన్నబిడ్డనే కామించాడని చెడతిట్టరా?పాపకృత్యం అని అనుకోకుండా క్షణికమైన సౌఖ్యానికి నీచానికి పాల్పడ్డావు. కామాంధుడికి కళ్ళు కన్పించవు. అని లోకోక్తి ఉండనే ఉన్నది కదా.”

 

ఇలా మునీంద్రులు మందలించి పలికిన ములుగుల వంటి పలుకులు విని బ్రహ్మదేవుడు సిగ్గుతో తలవంచుకున్నాడు. వెంటనే తన శరీరాన్ని విడిచిపెట్టాడు. దిక్కులు వచ్చి శరీరాన్ని ఆక్రమించాయి. వెంటనే దిక్కులలో నుంచి చీకటి, మంచూ ఉద్భవించాయి.అటుమీద బ్రహ్మదేవుడు ధైర్యం వదలక, మరొక దేహాన్ని ధరించాడు. సృష్టికి పూర్వం సంప్రాప్తమైన సృజన శక్తి తనకు అప్పుడు లేకపోవడంతో అంతరంగంలో ఎంతగానో చింతిస్తూ ఉండిపోయాడు. అంతలో అతని ముఖంనుండి పరమధర్మ ప్రబోధాలైన వేదాలు పరిపూర్ణ స్వరూపాలతో ఆవిర్భవించాయి.అంతేకాదు, యజ్ఞాలు, పుణ్య కృత్యాలు, తంత్రాలు సదాచారాలు, బ్రహ్మచర్యం మున్నగు చతురాశ్రమాలు, ఆయన నాలుగు మోములనుండి జన్మించాయి.

తృతీయ స్కంధము : స్వాయంభువు జన్మంబు

 

బ్రహ్మదేవుని తూర్పు వైపు ముఖమునుండి “ఋగ్వేదము, దక్షిణ ముఖంనుండి “యజుర్వేదము, పశ్చిమ ముఖంనుండి “సామవేదము, ఉత్తర ముఖంనుండి “అధర్వణవేదము ఉద్భవించాయి.

యజ్ఞ నిర్వహణకు “హోత, “అధ్వర్వుడు, “ఉద్గాత, “బ్రహ్మ అని నలుగురు ఋత్విక్కులు ఉంటారు. హోత అనే ఋత్విక్కులు ఆచరించు గానం చేయబడనివి అయిన “శస్త్రములు అను మంత్ర స్తోత్రాలు తూర్పు ముఖం నుండి వెలువడ్డాయి;

అధ్వర్వుడు ఆచరించు విధి రూపమైన “ఇజ్య, గాన యోగ్యాలైన “స్తుతులు అనే మంత్ర స్తోత్రాలూ దక్షిణ ముఖం నుంచి ఉదయించాయి. ఉద్గాత ప్రయోగించే “స్తోమాలు అనే ఋగ్వేద మంత్రాలు పశ్చిమ ముఖంనుంచి ఉద్భవించాయి.

బ్రహ్మ అనే నాల్గవ ఋత్విక్కు ఆచరించే ప్రాయశ్చిత్త కాండ ఉత్తర ముఖంనుంచి ఉద్భవించింది.

ఉపవేదాలలో, ఆయుర్వేదం తూర్పుముఖం నుంచి, ధనుర్వేదం, దక్షిణ ముఖంనుంచి, గాంధర్వవేదం పశ్చిమ ముఖంనుంచి, విశ్వకర్మకు సంబంధించిన స్ధాపత్యమనే శిల్పవేదం ఉత్తర ముఖంనుంచి ఉత్పన్నమయినాయి.

పంచమవేదమైన ఇతిహాస పురాణాల సముదాయం బ్రహ్మదేవుని అన్ని ముఖాలనుంచి ఆవిర్భవించింది. ఇవి కాక కర్మ తంత్రము లయిన షోడశి, ఉక్థ్యము; చయనము, అగ్నిస్టోమము; అప్తోర్యామము, అతిరాత్రము; వాజపేయము, గోసవము; అనే నాలుగు జంటలూ, ధర్మపాదాలు అయిన విద్య, ధనం, దానం, తపస్సు, అనేవి క్రమంగా బ్రహ్మ నాలుగు ముఖాల నుంచి వెలువడినాయి.

బ్రహ్మచర్యం, గార్హపస్థ్యం, వానప్రస్థం, సన్యాసం అనే ఆశ్రయ చతుష్టయంకూడా, చతుర్ముఖుని చతుర్ముఖాల నుండి క్రమంగా జనించాయి. పై నాలుగు ఆశ్రమాలలో, ఒక్కొక్కటీ నాలుగు విధాలైన వృత్తులు ఉంటాయి.

బ్రహ్మచర్యంలో వృత్తులు నాలుగు. అవి 1. సావిత్రం (సవిత అంటే సూర్యుడు. ఆయన్ని ఆరాధించే గాయత్రి ఇందులో ప్రధానం కనుక దీనికి ఈ పేరు వచ్చింది.) అనగా ఉపనయనం మొదలుకొని మూడు దినాల పర్యంతం గాయత్రీ మంత్రం జపించటం; 2. ప్రజాపత్యం అనగా వేదాలు నాలుగు చదువుకొనుట; 3. బ్రాహ్మం అనగా వేదవ్రతాలు నాల్గింటిలో ఒక్కొక్కొటి ఒక్కొక్క సంవత్సర పర్యంతం ఆచరించేది; 4. బృహత్తన నైష్ఠికం అనగా వేదం పూర్తిగా నేర్చుకున్న అనంతరం ఆచరించేది;

గృహస్ఠ వృత్తులు నాలుగు. అవి 1. నిషిద్ధం కాని వ్యవసాయం జీవనోపాధిగా గలవారు వార్త అంటారు; 2. యజ్ఞయాగాది కర్మలకు ఉపయోగించే పనులు చేసి జీవించుట సంచయం అంటారు; 3. పరులను యాచించకుండా ఉండటం శాలీనం; 4. పొలాలలో రాలిన ధాన్యం కంకులు ఏరుకొని, వానిని శిలలపై నూర్చుకొని జీవించటం శిలోంఛం;

వానప్రస్ధ వృత్తులు నాలుగు. అవి 1. పండించకుండా లభించిన ఆహారాలు తీసుకొనేవారు వైఖాసనులు. 2. క్రొత్త పంట లభించగానే పూర్వం దాచిపెట్టిన పదార్ధాలను మిగలకుండా ఇతరులకు పంచిపెట్టేవారు వాలఖిల్యులు, 3. ప్రొద్దున లేవగానే ఏ దిక్కు కనిపిస్తుందో ఆ దిక్కుకు పోయి అక్కడ ఆయాచితంగా లభించిన పదార్ధాలను భుజించేవారు ఔదుంబరులు. 4. చెట్టునపండి రాలిన ఫలాలను తిని జీవించేవారు ఫేనపులు. సన్యాసంలో కూడా నాలుగు వృత్తులు ఉన్నాయి. 1. సొంత కుటీరం ఉండి చేయదగిన కర్మలు చేసేవాడు కుటీచకుడు. 2. కుటీరం లేకుండా కర్మలు అప్రధానంగా జ్ఞానియై సంచరిస్తుండేవాడు బహూదుడు. 3. కేవలం జ్ఞానాభ్యాసం చేసేవాడు హంసుడు. 4. జ్ఞానాభ్యాసం కూడా లేకుండా పరబ్రహ్మతత్వం అలవడినవాడు నిష్క్రియుడు.

అన్వీక్షకి, త్రయి, వార్తా, దండనీతి అనే నాలుగు న్యాయవిద్యా చతుష్కం; వీనిలో 1. అన్వీక్షకి అంటే ఆత్మానాత్మ వివేకంకలిగి మోక్షాన్ని ప్రసాదించేవిద్య; 2. త్రయి అంటే స్వర్గాధిఫలాలను అందించే వేదకర్మానుష్ఠానం; 3. వార్త అంటే జీవనోపాధికోసం చేసే కృషి మొదలైన విద్యలు; 4. దండనీతి అంటే అర్ధ సంపాదనమే ప్రయోజనంగా గల విద్య; ఈ నాలుగు విద్యలలో అన్వీక్షకి మోక్షానికి, త్రయి కామానికి, వార్త ధర్మానికి, దండనీతి అర్ధానికి సాధనాలు. ఈ అన్వీక్షకి, త్రయి, వార్తా, దండనీతి న్యాయవిద్యా చతుష్కం నాలుగు బ్రహ్మదేవుని తూర్పు ముఖంనుండి పుట్టాయి; భూః భువః సువః అనే వ్యాహృతులు బ్రహ్మదేవుని దక్షిణ, పశ్చిమ, ఉత్తర ముఖాలనుండి క్రమంగా ఉదయించాయి.

అతని హృదయంలోని ఆకాశంనుండి ఓంకారం పుట్టింది; రోమాలనుండి ఉష్ణిక్ ఛందస్సు, చర్మం నుండి గాయత్రీ ఛందస్సు, మాంసం వలన త్రిష్టుప్ ఛందస్సు, కీళ్ళువల్ల అనుష్టుప్ ఛందస్సు, ఎముకలనుండి జగతీ ఛందస్సు, మజ్జవల్ల పంక్తి ఛ్చందస్సు, ప్రాణంవల్ల బృహతీ ఛందస్సు పుట్టాయి. హల్లులలో క వర్గం మొదలు ప వర్గం వరకూ అయిదు వర్గాలతో స్పర్శాత్మకుడైన జీవుడూ; అకారాది అచ్చులతో స్వరాత్మకమైన దేహమూ; శ, ష, స, హ లతో ఊష్మవర్ణాత్మకాలైన ఇంద్రియాలూ ఏర్పడ్డాయి; య, ర, ల, వ, అనే అంతస్థాలూ; 1. షడ్జం, 2.ఋషభం, 3. గాంధారం, 4. మధ్యమం, 5. పంచమం, 6. నిషాదం, 7. దైవతం, అనే సప్తస్వరాలూ; ఆత్మ బలమైన శబ్ధ బ్రహ్మమూ, ఇవన్నీ చతుర్ముఖుని లీలావిశేషాల వల్ల పుట్టాయి. పరమేశ్వరునకు వ్యక్తము, అవ్యక్తము అని రెండు రూపాలు. వ్యక్తరూపం వైఖరీవాక్కు; పరా, పశ్యంతీ, మధ్యమా అనే వాక్కులు అవ్యక్తరూపం. ఈ వ్యక్తావ్యక్తరూపాలు రెండింటికి ప్రణవమే ఆత్మ. భగవంతుడు, అవ్యక్తాత్ముడు కావటంవల్ల పరిపూర్ణుడు. వ్యక్తాత్ముడు కావటంచేత ఇంద్రాది శక్తి సంయుక్తుడు అయి కనిపిస్తాడు.

అనంతరం అనంత వీర్యవంతులైన ఋషుల సంతానం సవిస్తారమై వృద్ధి కాలేదని తలచి బ్రహ్మ తన పూర్వ శరీరాన్ని వదిలాడు. నిషిద్ధం కాని కామంపై ఆసక్తి కల మరొక్క దేహాన్ని ధరించాడు. నిత్యం ప్రజా సృష్టి యందు ఆసక్తుడు అయ్యాడు. అయినా ప్రజాభివృద్ధి జరుగ లేదు. కారణం తెలియక ఆశ్చర్యపడ్డాడు. అది వృద్ధి అయ్యే విధానాన్ని గూర్చి ఆలోచించాడు. దైవం ఇచట ప్రతికూలం; కాబట్టి దైవానుకూలత అవసరం అనుకున్నాడు; దైవానుకూలత కోసం ఎదురు చూస్తూ దైవాన్ని ధ్యానిస్తూ సందర్భోచిత కర్తవ్యాలు నిర్వర్తించసాగాడు.

అంతట బ్రహ్మదేవుని దేహం రెండు భాగలయింది. అందొకటి స్వరాట్టు అయిన, స్వాయుంభువు మనువుగా; మరొకటి అతని భార్య శతరూప అనే అంగనగా రూపొందాయి. ఆది మిథునమైన ఆ దంపతులకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, అనే ఇద్దరు పుత్రులూ; ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే ముగ్గురు పుత్రికలూ పుట్టారు. వారిలో ఆకూతిని రుచి ప్రజాపతికి; దేవహూతిని కర్దమ ప్రజాపతికి; ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహం చేసారు. ఈ దంపతుల వల్ల కలిగిన అనంత ప్రజా సంతతుల వల్ల జగత్తంతా నిండుగా అయ్యాయి.

 

స్వాయంభువుడు తన భార్య శతరూపతో కూడా బ్రహ్మదేవునకు నమస్కారం చేసాడు. వినయంతో తల వంచుకొని, చేతులు జోడించి ప్రీతి పూర్వకంగా ఇలా అన్నాడు. “ఓ పద్మంలో జనించిన బ్రహ్మదేవా! ఈ విశ్వంలోని సకల ప్రాణులనూ పుట్టించుటకూ, పోషించుటకూ, సంహరించుటకూ, కారణభూత మైన వాడవు నీవే. మేము చేయవలసిన పని ఏమిటో, మాకు ఆజ్ఞాపించు. ఎలాంటి పని చేస్తే నీకు మిక్కిలి సంతోషం కలుగుతుందో, అది చేస్తాము. తండ్రికి భక్తితో సేవ చేసిన తనయుడు ఈ లోకంలో, ఆ లోకంలో అఖండ యశస్సు ఆర్జిస్తాడు. అందరి అభిమానానికి పాత్రుడవుతాడు.అందుచేత, ఆ సుకార్యాలు అన్నీ తెలియజెప్పు పితామహా! బ్రహ్మదేవా!"

 

అని పలికిన స్వాయంభువుని మృదు మధుర వాక్యాలకు చతుర్ముఖ బ్రహ్మదేవుడు చాలా సంతోషించాడు. అంతరంగంలో అనురాగం పొంగిపొరలగా అనుంగు నందనునితో కమలసంభవుడు ఇలా అన్నాడు.“నాయనా! స్వాయంభువా! కన్నతండ్రి ఆజ్ఞను శిరసావహించి తనకు తగిన పని యని ఏ పని చెబితే ఆ పనిని దక్షతతో తక్షణం చేయడం; పద్మాక్షుడైన శ్రీహరి పాదసేవ చేయడం; తండ్రి ఆజ్ఞానుసారం ప్రజలను పాలించటం; తనయుడు తన తండ్రికి సేవచేయడం క్రిందకే వస్తాయి.పుణ్యాత్మా! స్వాయంభువా! శ్రీమహావిష్ణువు యజ్ఞపురుషుడూ, పరమపురుషుడూ, హృషీకేశుడూ, కేశవుడూ, పద్మాక్షుడూ. అయన గూర్చి అధికమైన భక్తితో యజ్ఞాలు చెయ్యి. అలా చేస్తే ఆ శ్రీపతి ఎంతగానో సంతోషిస్తాడు. ఆ దేవుడు సంతోషిస్తే లోకాలన్నీ సంతృప్తి చెందుతాయి. అందుకని నీవు యజ్ఞాలు ఆచరించు.పవిత్రమైన చిత్తశుద్ధితో పరమేశ్వరార్పణ బుద్ధితో యజ్ఞకార్యాలు చేయాలి. అలాకాకుండా స్వార్ధబుద్ధితో పనులు చేయడం అంటే, వరిపొట్టును దంచి బియ్యం రాలేదని బాధపడటం లాంటిది. అందుచేత ధననాశమే గాని లవలేశం కూడా లాభం ఉండదు. హరి భక్తులు కాని వారు తాము ఆశించిన మోక్షాన్ని అందుకోలేరు.అందుచేత, కుమారా! స్వాయంభువా! పాపాలనే తీగలకు కొడవలివంటివాడవైన నీవు నిర్వికారుడైన శ్రీహరినిగూర్చి యజ్ఞం చేయాలని సంకల్పించు. నీ సంకల్పం సత్య స్వరూపమై శుభప్రదమవుతుంది. నీవు, నీ కుమారులూ సంతోషంతో భూమండలాన్ని ఏలే భారం వహించండి. నిర్మలమైన ధర్మ మార్గంలో, సజ్జనులైన ప్రజలను రక్షిస్తూ, పరిపాలించండి.”

 

తృతీయ స్కంధము : దేవమనుష్యాదుల సృష్టి

 

జీవులకు అగోచరుడూ, పురుషోత్తముడూ, యోగమాయా సమేతుడూ, కాలస్వరూపుడూ, నిర్వికారుడూ అయిన జగన్నివాసుడు ఆదికాలంలో సృష్టిని గురించి తీవ్రంగా ఆలోచించాడు. ఆ ఆలోచనా ఫలితంగా సత్త్వం, రజస్సు, తమం అనే మూడు గుణాలు పుట్టాయి. ఆ మూడు గుణాలలో రజోగుణం నుండి మహత్తత్త్వం పుట్టింది. ఆ మహత్తత్త్వం నుండి మూడు గుణాల అంశలు కల అహంకారం పుట్టింది. ఆ అహంకారం నుండి పంచతన్మాత్రలు పుట్టాయి. వాటినుండి సమస్త సృష్టికి మూలకారణాలైన పంచభూతాలు పుట్టాయి.ఆ పంచభూతాలలో ఏ ఒక్కదానికీ ప్రత్యేకంగా లోకాన్ని సృష్టించడం చేతకాక, అన్నీ ఒక గుంపుగా కలిసి పాంచభౌతికమైన ఒక బంగారు గ్రుడ్డును సృష్టించాయి. ఆ గ్రుడ్డు మహాజలాలలో తేలియాడుతూ వృద్ధి పొందుతూ ఉండగా నారాయణుడనే పేరుతో ప్రసిద్ధి కెక్కే పరబ్రహ్మం వెయ్యి దివ్యసంవత్సరాలు ఆ అండాన్ని అధిష్టించి ఉన్నాడు. ఆ వాసుదేవుని బొడ్డునుండి వేయి సూర్యుల కాంతితో వెలుగుతూ, సమస్త ప్రాణిసమూహంతో కూడిన ఒక పద్మం పుట్టింది. ఆ పద్మంలో నుండి భగవదంశతో చతుర్ముఖ బ్రహ్మ పుట్టాడు. స్వయం ప్రకాశుడైన ఆ బ్రహ్మ నామ రూప గుణాలు అనే సంకేతాలు కలిగి సమస్త జగత్తులనూ సృష్టించాడు.

 

బ్రహ్మదేవుడు తామిస్రం, అంధతామిస్రం, తమం, మోహం, మహామోహం అనే ఐదు విధాలైన మోహస్థితి కలిగిన అవిద్యను పుట్టించి, అది తనకు మోహమయమైన శరీరమని భావించి ఏవగించుకొని, ఆ దేహాన్ని వదిలివేశాడు. బ్రహ్మ వదిలిపెట్టిన ఆ దేహం ఆకలి దప్పులకు స్థానమై రాత్రమయ మయింది. దానిలో నుండి యక్షులూ, రక్షస్సులూ అనే ప్రాణులు పుట్టగా వారికి ఆకలి దప్పులు అధికం కాగా కొందరు బ్రహ్మను భక్షిద్దా మన్నారు, మరి కొందరు రక్షిద్దా మన్నారు.

 

ఈ విధంగా పలుకుతూ వారు బ్రహ్మ సమీపానికి వెళ్ళగా, బ్రహ్మ భయకంపితుడై “నేను మీ తండ్రిని. మీరు నా కుమారులు. నన్ను హింసించవద్దు అంటూ “మా భక్షత... రక్షత అనే శబ్దాలను ఉచ్చరించాడు. ఆ కారణంగా వారికి యక్షులు, రక్షస్సులు అనే పేర్లు వచ్చాయి. ఆ తరువాత బ్రహ్మ తేజోమయమైన మరొక దేహాన్ని ధరించి, సత్త్వగుణంతో కూడినవారూ, ప్రకాశవంతులూ అయిన దేవతలను ప్రముఖంగా సృష్టించి, ఆ తేజోమయమైన దేహాన్ని వదలివేయగా అది పగలుగా రూపొంది దేవతలందరికీ ఆశ్రయ మయింది. తరువాత బ్రహ్మ తన కటిప్రదేశం నుండి మిక్కిలి చంచలచిత్తులైన అసురులను సృష్టించాడు. వారు అతికాముకులు కావడం వల్ల ఆ బ్రహ్మదేవుణ్ణి చుట్టుముట్టి రతిక్రియను అపేక్షించి, సిగ్గు విడిచి వెంట పడగా బ్రహ్మ నవ్వుతూ పరుగులు తీసి, శరణాగతుల కష్టాలను తొలగించేవాడూ, భక్తులు కోరిన రూపంలో దర్శనం ఇచ్చేవాడూ అయిన నారాయణుని చేరి ఆయన పాదాలకు ప్రణమిల్లి ఇలా అన్నాడు.“సమస్త దేవతలచేత పొగడబడేవాడా! విశ్వానికి క్షేమాన్ని కలిగించేవాడా! రక్షించు! రక్షించు! ఉపేక్షించక నన్ను రక్షించు. నా మాటను ఆలకించు. నేను నీ ఆజ్ఞను తలదాల్చి క్రమంగా ఈ ప్రజలను సృష్టించగా వారిలో పాపాత్ములైన ఈ రాక్షసులు నన్నే రమించాలని రాగా చింత చెంది ఇక్కడికి వచ్చాను. ఓ సుచరిత్రా! నన్ను రక్షించు.అంతేకాక లోకంలో ఉండేవారికి కష్టాలను కలిగించడానికి, కష్టాలు పడేవారి కష్టాలను దూరం చేయడానికి నీకంటె సమర్థు లెవరున్నారు?” అని స్తోత్రం చేయగా, బ్రహ్మదేవుని దైన్యాన్ని తెలిసికొని నిస్సందేహంగా అందరి హృదయాలను దర్శించే శ్రీహరి “ఓ బ్రహ్మా! నీ ఈ ఘోరమైన శరీరాన్ని విడిచిపెట్టు అని ఆజ్ఞాపించగా బ్రహ్మ ఆ దేహాన్ని త్యాగం చేసాడు.

 

అప్పుడు ఆ దేహం నుండి మణులు పొదిగిన క్రొత్త బంగారు కాలి అందెలు ఘల్లుఘల్లుమని మ్రోగే పాదపద్మాలు కలది, మెత్తని పట్టుచీరపై మిలమిల మెరుస్తున్న మొలనూలుతో ఇసుకతిన్నెలవలె ఉన్న కటిప్రదేశం కలది, ఒకదానితో ఒకటి ఒరసికొంటున్న కుచకుంభాల బరువుకు నకనకలాడే నడుము కలది, మద్యపానం మత్తుతో చలిస్తున్న అప్పుడే వికసించిన పద్మాలవంటి కన్నులు కలది, కృష్ణపక్షపు అష్టమినాటి చంద్రుని పోలిన నుదురు కలది, మదించిన తుమ్మెదలకు సాటి వచ్చే శిరోజాలు కలది, అందమైన సంపంగి పువ్వు వలె సోగదేలిన ముక్కు కలది, చిరునవ్వులు చిందే చూపుల కలది, తామరపూలవంటి చేతులు కలది అబ్జపాణి అని పిలునదగిన ఆ సుందరి సంధ్యారూపంలో పుట్టగా, రాక్షసులు చూచి కౌగలించి, తమలో తాము ఇలా మాట్లాడుకున్నారు.“ఈ సౌకుమార్యం, ఈ నవయౌవనం, ఈ సౌందర్యం, ఈ జాణతనం, ఈ సౌభాగ్యవిశేషం ఏ స్త్రీలకూ లేదు. ఇది చాల చిత్రంగా ఉంది.అని ఆశ్చర్యపడి ఆ రాక్షసులు “మనమంతా ఈమెను చూచినప్పటినుండి కామోత్కంఠులమై ఉండగా ఈమె మాత్రం మన మీద ఏమాత్రం మక్కువ చూపకుండా ఉండటానికి కారణం ఏమిటి?” అని అనేక విధాలుగా అనుకొని, ఆ సంధ్యాసుందరితో ఇలా అన్నారు."అరటి బోదెల లాంటి నున్నటి తొడలు గల సుందరీ! నీదే కులం? నీదే ఊరు? నీ తల్లిదండ్రులు ఎవరు? ఎందుకు నీవు ఇక్కడ వంటరిగా తిరుగుతున్నావు? మాకు తెలిసేలా చెప్పు.నీ సౌందర్య సంపదతో ఇంపైన ఈ పుణ్యభూమిలో మోహంతో నీవెంట పడిన దుర్బలులమైన మమ్మల్ని ఎందుకు చేరనివ్వవు? మన్మథుని బాధ మాకు ఎక్కువయింది కదా!" అంటూ వాళ్ళు ఆమె సౌందర్యాన్ని వర్ణించడానికి అలవి కాక ఆలోచిస్తూ కుచకుంభాల బరువువల్ల జవజవలాడే నడుము ఆకాశం కాగా, అందమైన చిగురాకువంటి హస్తంలో ప్రకాశించే పూలచెండు అస్తమించే సూర్యబింబం కాగా, నల్లగా మెరుస్తూ విప్పారిన కొప్పుముడి చీకటి రేకలు కాగా, స్వచ్ఛమైన భావాలను వెల్లడిస్తూ మెరిసే చూపులు నక్షత్రాలు కాగా, శరీరానికి పూసుకున్న గంధపు పూత సంధ్యారాగం కాగా, స్త్రీరూపాన్ని ధరించిన ఆ సంధ్యాదేవిని అసురులు చుట్టుముట్టి, హృదయాలలో పెచ్చరిల్లిన మోహావేశంతో ఆమెతో మళ్ళీ ఇలా అన్నారు."క్రొత్తగా వికసించిన తామరపువ్వు వంటి ముఖం కలదానా! పద్మం ఒకే స్థలంలో ఉంటుంది, కాని నీ పాదాలనే పద్మాలు అనేక స్థలాలలో అనేక ప్రకారాలుగా ప్రకాశిస్తున్నాయి కదా!” అని ఈ విధంగా ఆ రాక్షసులు పలుకుతూ తమ మనసులో తమకం అధికం కాగా ఆ సంధ్యాసుందరిని పట్టుకున్నారు. అది చూచి బ్రహ్మ తన మనస్సులో ఎంతో సంతోషించాడు.

 

అప్పుడు బ్రహ్మ తన చేతిని వాసన చూడగా గంధర్వులూ అప్సరసలూ పుట్టారు. బ్రహ్మ తన శరీరాన్ని వదలివేయగా అది వెన్నెల రూపాన్ని పొందగా, ఆ దేహాన్ని విశ్వావసువు ముందు నడుస్తున్న గంధర్వులూ అప్సరసలూ తీసుకున్నారు. మళ్ళీ బ్రహ్మ కునుకుపాటు, ఉన్మాదం,ఆవులింత, నిద్రలతో కూడిన శరీరాన్ని ధరించి పిశాచాలనూ, గుహ్యకులనూ, సిద్ధులనూ, భూతాలనూ పుట్టించగా వాళ్ళు దిగంబరులై వెండ్రుకలు విరబోసుకొని ఉండడం చూచి బ్రహ్మ కన్నులు మూసుకొని అప్పటి తన శరీరాన్ని వదలి వేయగా దానిని పిశాచులు గ్రహించారు. అనంతరం బ్రహ్మ తనను అన్నవంతునిగా భావించి అదృశ్య శరీరుడై పితృదేవతలనూ సాధ్యులనూ పుట్టించగా వారు తమను పుట్టించిన అదృశ్యదేహానికి కార్యమైన దేవభాగాన్ని అందుకొనగా ఆ కారణం వల్ల శ్రాద్ధ సమయాలలో పితృగణాలనూ సాధ్యగణాలనూ ఉద్దేశించి హవ్యకవ్యాలను సమర్పిస్తారు.

 

బ్రహ్మదేవుడు తిరోధానశక్తి వల్ల నరులను, సిద్ధులను,విద్యాధరులను పుట్టించి వారికి తిరోధానం అనే పేరుగల ఆ దేహాన్ని ఇచ్చాడు. తర్వాత బ్రహ్మ తనకు ప్రతిబింబంగా ఉన్న శరీరంనుండి కిన్నరులనూ, కింపురుషులనూ పుట్టించగా వారు ఆ బ్రహ్మదేవుని ప్రతిబింబాలైన శరీరాలను ధరించి ఇద్దరిద్దరు జతకూడి బ్రహ్మదేవునికి సంబంధించిన గీతాలను గానం చేయసాగారు. అప్పుడు బ్రహ్మ తన మనస్సులో తాను చేసిన సృష్టి అభివృద్ధి చెందకుండా ఉన్నందుకు బ్రహ్మ చింతించి, నిద్రించి, కాళ్ళూ చేతులూ విదిలించగా రాలిన రోమాలన్నీ పాములుగా మారాయి.బ్రహ్మదేవుడు తాను పూనిన పని నెరవేరినట్లుగా భావించి తన అంతరాత్మ తృప్తిపడే విధంగా సమస్త జగత్తులో పవిత్రులూ, ముల్లోకాలలో శ్రేష్ఠులూ ఐన మనువులను సృష్టించాడు.

 

ఆ విధంగా పుట్టించి బ్రహ్మ వారికి పురుషరూపమైన తన దేహాన్ని ఇవ్వగా ఆ మనువులు తమకంటే ముందుగా సృష్టింపబడిన వారితో కలిసి బ్రహ్మతో ఇలా అన్నారు. “దేవా! సకల లోకాలకు సృష్టికర్తవైన నీవు చేసిన ఈ విస్తృతమైన సుకృతం ఆశ్చర్యకరమైనది. యజ్ఞాలు మొదలైన క్రియాకాండ అంతా ఈ మనువులను సృష్టించడం వల్ల ప్రశంసనీయమయింది. యజ్ఞాలలోని హవిర్భాగాలను మా నాలుకలతో ఆస్వాదించే అవకాశం మాకు లభించింది అని అంతరంగాల్లో సంతోషం పెల్లుబుకుతూ ఉండగా బ్రహ్మదేవుని ప్రస్తుతించారు.బ్రహ్మ శ్రేష్ఠమైన తపస్సు, యోగం, విద్య, సమాధి వీటితో కూడినవాడై ఋషివేషాన్ని ధరించి, ఇంద్రియాలతో కలిసిన ఆత్మస్వరూపుడై ఋషిగణాలను సృష్టించి, వారికి తన శరీరాంశాలైన సమాధి, యోగం, ఐశ్వర్యం, తపస్సు, విద్య, వైరాగ్యం అనే వాటిని క్రమంగా ఒక్కొక్కరికి సంక్రమింపచేసాడు.

 

తృతీయ స్కంధము : కపిల దేవహూతి సంవాదంబు

 

గాఢమైన సంసారబంధానికీ మోక్షానికీ జీవుని చిత్తమే కారణం. అది సత్త్వరజస్తమోగుణాలతో సమ్మేళనం పొందినప్పుడు సంసారబంధానికి హేతువవుతుంది.ఆ చిత్తం శ్రీమన్నారాయణుని మీద సంసక్తమైనపుడు మోక్షానికి హేతువవుతుంది.సకలపదార్థాలకూ సంబంధించిన యథార్థస్వరూపాన్ని పూర్తిగా తెలియజేసేవి వేదాలు. వేదసంబంధమైన సత్కర్మలకూ సదాచారాలకూ దేవతలు సంతృప్తులౌతారు. సహజమూ నిర్హేతుకమూ అయిన భగవంతుని సేవారూపమైన భక్తి ముక్తికంటె గొప్పది. జీర్ణాశయమందలి జఠరాగ్ని తిన్న అన్నాన్ని జీర్ణం చేసినట్లుగా భగవద్భక్తి జీవులు కావించిన కర్మలనూ కర్మఫలాలనూ లోగొంటుంది. అందువల్ల జీవుని లింగమయ శరీరం నశిస్తుంది.

 

అనాది యైనవాడూ, పురుషశబ్ద వాచ్యుడూ, సత్త్వరజస్తమోగుణాలు లేనివాడూ , ప్రకృతి గుణాలకంటె విలక్షణమైన గుణాలు కలవాడూ, ప్రత్యక్షస్వరూపం కలవాడూ, తనంతతాను వెలిగేవాడూ, విశ్వమంతటా ఉన్నవాడూ అయిన పరమాత్మ గుణత్రయాత్మకమూ, అవ్యక్తమూ, భగవంతుని అంటిపెట్టుకున్నదీ అయిన ప్రకృతిలో అప్రయత్నంగా అలవోకగా లీలగా ప్రవేశించాడు. ఆ ప్రకృతి గుణత్రయ మయమైన స్వరూపంతో సాకారమైన ప్రజాసృష్టి చేయటం ప్రారంభించింది. అది చూచి పురుషుడు వెంటనే మోహాన్ని పొంది విజ్ఞానం మరుగుపడగా, గుణత్రయాత్మకమైన ప్రకృతిని ఆశ్రయించి, పరస్పరం మేళనం పొందారు. అప్పుడు పురుషుడు ప్రకృతి గుణాలను తనయందే ఆరోపించుకొని జరుగుతున్న కార్యాలన్నింటికీ తానే కర్తగా భావించుకొని సంసారబంధంలో కట్టుబడి పరాధీనతకు లోనవుతాడు. ఈశ్వరుడు కర్త కాకున్నా జరుగుతున్న కర్మలకు సాక్షీభూతుడు కావటంవల్ల ఆత్మకు కార్యకారణ కర్తృతాలు లేవనీ, అవి ప్రకృతికి అధీనమైనవనీ, సుఖదుఃఖాలు అనుభవించడం ప్రకృతికంటె విలక్షణుడైన పురుషునిదనీ అనుభజ్ఞులు తెలుసుకుంటారు.

 

త్రిగుణాత్మకం, అవ్యక్తం, నిత్యం, సదసదాత్మకం, ప్రధానం అనేవి ప్రకృతి విశేషాలు. ఈ విశేషాలతో కూడి ఉన్నది కనుక ప్రకృతిని విశిష్టం.ఆ ప్రకృతి ఇరవై నాలుగు తత్త్వాలు కలదై ఉంటుంది. ఎలాగంటే పృథివి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలూ; శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం అనే పంచ తన్మాత్రలూ; చర్మం, కన్ను, ముక్కు, చెవి, నాలుక అనే పంచ జ్ఞానేంద్రియాలూ; వాక్కు, చేతులు, కాళ్ళు, మలావయవం, మూత్రావయవం అనే పంచ కర్మేంద్రియాలూ; మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే అంతఃకరణ చతుష్టయమూ కలిసి ఇరవైనాలుగు తత్త్వాలు కలిగి సగుణబ్రహ్మకు సంస్థానం అయిన ప్రకృతిని వివరించాను. ఇక కాలం అనే ఇరవై ఐదవ తత్త్వాన్ని గురించి చెబుతాను. కొందరు పురుష శబ్ద వాచ్యుడైన ఈశ్వరుని స్వరూపమే కాలంగా చెప్పబడుతున్నదంటారు. అహంకార మోహితుడై ప్రకృతితో సంబంధం పెట్టుకున్న పురుషుడు జీవుడై భయాదులను అనుభవిస్తాడు. ప్రకృతి గుణాలన్నింటిలో సమానంగా అంతర్యామియై నిర్విశేషుడై ప్రవర్తించే భగవంతుని చేష్టా విశేషాలను కలుగచేసేదే కాలం అనబడుతుంది. అదికూడా జీవరాసులలో అంతర్యామిగా ఉన్నప్పుడు పురుషుడు అనీ, వానికి వెలుపల వ్యాపించి ఉన్నపుడు కాలం అనీ అనబడుతుంది. ఆత్మమాయ కారణంగా ప్రకృతి తత్త్వాలలో విలీనమైన జీవునివల్ల కదిలింపబడినదీ, జగత్తుకు కారణమైనదీ అయిన ప్రకృతియందు భగవంతుడు సృజనాత్మకమైన తన వీర్యాన్ని ఉంచగా ఆ ప్రకృతి తనలోనుంచి హిరణ్మయమైన మహత్త్వాన్ని పుట్టించింది. అనంతరం సకల ప్రపంచానికి మూలమైనవాడూ, లయవిక్షేప శూన్యుడూ అయిన ఈశ్వరుడు తన సూక్ష్మవిగ్రహంలో ఆత్మగతమైన మహదాది ప్రపంచాన్ని వెలిగిస్తూ, తన తేజఃప్రసారం చేత తనను నిద్రింపజేసే తమస్సును హరించి వేశాడు.

 

వాసుదేవం, సంకర్షణం, ప్రద్యుమ్నం, అనిరుద్ధం అనే దివ్యమైన ఈ నాలుగు వ్యూహాలూ ముల్లోకాలలోనూ సేవింపదగినవి.వాసుదేవవ్యూహం ఆకలిదప్పులు, శోకమోహాలు, జరామరణాలు అనే ఆరు ఊర్ములనుండి విడివడినదై ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, శ్రీ, జ్ఞానం, వైరాగ్యం అనే షడ్గుణాలతో పరిపూర్ణమై సత్త్వగుణ ప్రధానమై, నిర్మలమై, శాంతమై, నిత్యమై, భక్తజన సంసేవ్యమై అలరారుతూ ఉంటుంది. మహత్తత్త్వం నుండి క్రియాశక్తి రూపమైన అహంకారం పుట్టింది. ఆ అహంకారం వైకారికం, తైజసం, తామసం అని మూడు విధాలుగా విడివడింది. వానిలో వైకారికాహంకారం అనేది మనస్సుకూ, పంచేంద్రియాలకూ, అకాశాది పంచభూతాలకూ ఉత్పత్తి స్థానమై దేవతారూపమై ఉంటుంది. తైజసాహంకారం బుద్ధిరూపాన్నీ, ప్రాణరూపాన్నీ కలిగి ఉంటుంది. తామసాహంకారం ఇంద్రియార్థాలతో సమ్మేళనం పొంది ప్రయోజనమాత్రమై ఉంటుంది. ఇంకా వైకారికమైన సాత్త్వికాహంకారాన్ని అధిష్ఠించి సంకర్షణ వ్యూహం ఒప్పుతుంటుంది. వేయి పడగలతో ప్రకాశించేవాడూ, అనంతుడూ అయిన సంకర్షణ పురుషుడు మహానుభావుడై పంచభూతాలతో, పంచేంద్రియాలతో, మనస్సుతో నిండి ఉంటాడు. కర్త, కార్యం, కారణం అనే రూపభేదాలు కలిగి శాంతత్వం, ఘోరత్వం, మూఢత్వం మొదలైన లక్షణాలతో ఉల్లాసంగా ఉంటాడు. ఈ మేటి వ్యూహమే రెండవదైన సంకర్షణ వ్యూహం. దీనినుంచే మనస్తత్త్వం పుట్టింది.

 

తృతీయ స్కంధము : బ్రహ్మాండోత్పత్తి

 

అది ఎలాగంటే ఈ మనస్తత్త్వానికి చింతనం సహజం. ఆ చింతనం సామాన్య చింతనం, విశేష చింతనం అని రెండు విధాలు. వీనినే క్రమంగా సంకల్పం, వికల్పం అని పేర్లు. ఈ సంకల్ప వికల్పాల వల్లనే సృష్టిలోని వస్తువులు వేరువేరు లక్షణాలతో మనకు కనిపిస్తాయి. వీనివల్లనే వివిధ కామాలు ఉత్పన్నమౌతాయి. కనుకనే ఇది ప్రద్యుమ్న వ్యూహం అని చెప్పబడుతుంది. ఇక అనిరుద్ధ వ్యూహం సంగతి చెబుతాను. ఇదే ఇంద్రియాలన్నిటికి అధీశ్వరమై, యోగీంద్రు లందరకు సంసేవ్యమై, శరత్కాల మందలి నల్లకలువ వలె శ్యామల వర్ణంతో విరాజిల్లుతూ ఉంటుంది. తైజసాహంకారం వల్ల బుద్ధితత్త్వం పుట్టింది. ద్రవ్యాన్ని ప్రకాశింపజేసే జ్ఞానం, ఇంద్రియానుగ్రహం, సంశయం, మిథ్యాజ్ఞానం, నిద్ర, నిశ్చయం, స్మృతి అనేవి బుద్ధితత్త్వ లక్షణాలు. ఈ తైజసాహంకారం వల్లనే ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, క్రియాజ్ఞాన సాధనాలు ఏర్పడుతాయి. ఈ తైజసాహంకారం వల్లనే ప్రాణానికి సంబంధించిన క్రియాశక్తి, బుద్ధికి సంబంధించిన జ్ఞానశక్తి కలుగుతాయి. ఈ రెండు శక్తులూ కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను పనిచేయిస్తాయి. భగవద్భక్తివల్ల ప్రేరేపించబడిన తామసాహంకారంనుండి శబ్దతన్మాత్రం పుట్టింది. ఈ శబ్ద తన్మాత్రంనుండి ఆకాశం పుట్టింది. ఆకాశం నుండి శ్రోత్రేంద్రియం (చెవి) పుట్టింది. శ్రోత్రం శబ్దాన్ని గ్రహిస్తుంది. అదే శబ్దం అర్థానికి ఆశ్రయమై శబ్దం వినేవానికి జ్ఞానజనకం అవుతున్నది. ఈ శబ్దతన్మాత్రం వల్ల ఆకాశం ఏర్పడింది. ఈ ఆకాశం సకల జీవులకు లోపల వెలుపల అవకాశం ఈయటమే కాక ఆత్మకూ, ప్రాణాలకూ, ఇంద్రియాలకూ ఆశ్రయంగా ఉంటుంది. కాలగమనం వల్ల మార్పు చెందే శబ్దతన్మాత్ర లక్షణమైన ఆకాశం వల్ల స్పర్శమూ, స్పర్శంవల్ల వాయువూ, ఆ వాయువువల్ల స్పర్శను గ్రహించగల చర్మమూ పుట్టి స్పర్శజ్ఞానాన్ని కలిగించింది. మెత్తదనం, గట్టిదనం, చల్లదనం, వెచ్చదనం ఇవి స్పర్శజ్ఞానానికి లక్షణాలు. వాయువునకు కదలుట, కదలించుట, వేరుచేయుట, కలుపుట, ద్రవ్యనేతృత్వం, శబ్దనేతృత్వం, సర్వేంద్రియాత్మకత్వం అనేవి లక్షణాలు. గంధంతో కూడిన ద్రవ్యాలను ఆఘ్రాణింపజేయటం ద్రవ్యనేతృత్వం. దూరంగా ఉన్న శబ్దాన్ని చెవికి వినిపింప జేయటం శబ్దనేతృత్వం. భగవత్ప్రేరణతో స్పర్శతన్మాత్రం వల్ల పుట్టిన వాయువువల్ల రూపం పుట్టింది.ఈ రూపం వలన తేజస్సు కలిగింది. నేత్రేంద్రియం వల్ల గ్రహింపదగింది రూపం. నేత్రాన్ని పొందిన రూపానికి అనగా కనుపించునటువంటి ఆకారానికి వృత్తులు ఉపలంభకత్వం (అనుభవం కలుగడం), ద్రవ్యాకారసమత్వం (ద్రవ్యంయొక్క ఆకారాన్ని ఉన్నదున్నట్లుగా చూపడం), ద్రవ్యోపసర్జనం (ద్రవ్యం అప్రధానం కావడం), ద్రవ్యపరిణామ ప్రతీతి (ద్రవ్యంయొక్క మార్పు తెలియడం). ఇక తేజస్సుకు సాధారణాలైన ధర్మాలు ద్యోతం, పచనం, పిపాస, ఆకలి, చలి. ద్యోతానికి ప్రకాశం, పచనానికి బియ్యం మొదలైన పాకం, పిపాసకు పానం, ఆకలికి ఆహారం, చలికి శోషణం అనేవి వృత్తులు. దైవప్రేరితమై మార్పు చెందిన తేజస్సువల్ల రసతన్మాత్రం పుట్టింది. ఈ రసతన్మాత్ర వల్ల జలం పుట్టింది. జిహ్వ అనే పేరుగల రసనేంద్రియం రసాన్ని గ్రహించేది అయింది. ఆ రసం ఒకటే అయినా ద్రవ్యాల కలయికలోని మార్పువల్ల వగరు, చేదు, కారం, పులుపు, తీపి, ఉప్పు అనే రుచులుగా మారి వాటి కలయిక వల్ల ఇంకా అనేకవిధాలుగా మార్పు చెందింది. తనలో చేరిన ద్రవ్యాల మార్పులనుబట్టి ఆర్ద్రం కావడం, ముద్ద గట్టడం, తృప్తినివ్వడం, జీవనం, అందలి మాలిన్యాన్ని నివారించడం, మెత్తపరచడం, తాపాన్ని పోగొట్టడం, బావిలో జలలు ఏర్పడి అడుగున ఉన్న జలం పైకెగయడం అనేవి ఈ జలవృత్తులు. రసతన్మాత్రవల్ల దైవప్రేరణతో మార్పుచెందిన జలంనుండి గంధతన్మాత్రం పుట్టింది. ఈ గంధతన్మాత్రం వలన పృథ్వి (భూమి) ఏర్పడింది. ఘ్రాణేంద్రియం (ముక్కు) గంధాన్ని గ్రహించేదయింది. ఈ గంధం ఒకటే అయినా ఇంగువ మొదలైన పదార్థాలతో కలిసిన కారణంగా మిశ్రమగంధం అనీ, నిలువ ఉన్న పెరుగు ముద్ద, జంతుమాంసం మొదలైన వానితో కలిసినప్పుడు దుర్గంధం అనీ, కర్పూరం మొదలైనవానితో కలిసినపుడు సుగంధం అనీ, తామరపూలు మొదలైన వానితో కలిసినపుడు శాంతగంధం అనీ, వెల్లుల్లి మొదలైన వానితో కలిసినపుడు ఉగ్రగంధం అనీ, పాసిపోయిన చిత్రాన్నం వంటి వాటితో కలిసినపుడు ఆమ్లగంధం అనీ వేరువేరు పదార్థాలతో కలిసినపుడు మరెన్నో విధాలుగా పేర్కొనబడుతుంది. భూమికి సంబంధించిన సాధారణ ధర్మాలు ఏవనగా ప్రతిమల రూపాన్నీ వాటి ఆకారాలనూ నిలుపుకోవడం, జలం మొదలైన వాటితో అవసరం లేకుండా స్వతంత్రంగా నిలబడగలగటం, జలాదులకు తాను ఆధారమై ఉండటం, ఆకాశం, వాయువు, తేజస్సు, బలం వీనిని విభజించడం, సకల జీవరాసులకు దేహంగా పనిచేయటం అనేవి పృథ్వీవృత్తులు.ఆకాశానికి అసాధారణగుణం శబ్దం. దీనిని శ్రవణేంద్రియం గ్రహిస్తుంది. వాయువుకు అసాధారణగుణం స్పర్శం. దీనిని త్వగింద్రియం గ్రహిస్తుంది. తేజస్సుకు అసాధారణగుణం రూపం. దీనిని నేత్రేంద్రియం గ్రహిస్తుంది. జలానికి అసాధారణగుణం రసం. దీనిని జిహ్వేంద్రియం గ్రహిస్తుంది. పృథివికి అసాధారణగుణం గంధం. దీనిని ఘ్రాణేంద్రియం గ్రహిస్తుంది. ఆకాశం మొదలైన అన్నింటితో సంబంధం ఉండడం వల్ల భూమికి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అసాధారణ గుణాలు అయినాయి. మహత్తు, అహంకారం, పంచతన్మాత్రలు అనే ఈ ఏడు తత్త్వాలు ఒకదానితో ఒకటి కలిసి భోగానుభవానికి పాత్రుడైన పురుషుని కల్పించటానికి అసమర్థంగా ఉన్న ఆ సమయంలో కాలస్వరూపుడూ అంతుపట్టని అస్తిత్వం కలవాడూ, జగత్కారణుడూ, సత్త్వరజస్తమోగుణాలకు అతీతుడూ, సమస్తాన్ని నియమించేవాడూ, నిరంజనాకారుడూ అయిన సర్వేశ్వరుడు పైన చెప్పబడిన పురుషునిలో ప్రవేశించాడు. అప్పుడు ఒకదానితో ఒకటి కలగాపులగమై ఘర్షణ పొంది కలిసిపోయిన మహదాదుల వలన అధిష్ఠాతయైన భగవంతుని చైతన్యం కోల్పోయిన ఒక అండం పుట్టింది.

 

ఆ అండంలో మహత్తరమైన శక్తితో విరాట్పురుషుడు విరాజిల్లుతూ ఉంటాడు. ఆ అండాన్ని పొదువుకొని పృథివి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, అహంకారం, మహత్తు అనే ఆవరణాలు ఒకదానికంటె ఒకటి పదింతల ప్రమాణం కలిగి ఉంటాయి. లోకాలకు మేల్కట్టు చాందినీలవలె ఒప్పియున్న ఆ పొరలలో నుంచి విష్ణుదేవుని తేజస్సు ప్రకాశిస్తూ ఉంటుంది. జలంతో తేలుతూ ఉన్న బంగారుమయమైన ఆ అండంలో మహానుభావుడు, అభవుడు, శ్రీహరి, దేవదేవుడు, విశ్వవిజేత అయిన నారాయణుడు ప్రవేశించి గగనమండలాన్ని భేదించి వేస్తాడు.

 

తృతీయ స్కంధము : విరాట్పురుష ప్రకారంబు

 

ఆ అండంలో విరాట్పురుషుడు వెలుగుతూ ఉంటాడు. అతని ముఖం నుండి వాణి, వాణితోపాటు అగ్ని పుట్టాయి. ముక్కునుండి ప్రాణాలు, ఘ్రాణేంద్రియం పుట్టాయి. ఘ్రాణేంద్రియం నుండి వాయువులు, ప్రాణవాయువులు ఆవిర్భవించాయి. ప్రాణవాయువుల వల్ల కన్నులు, కన్నులవల్ల సూర్యుడు పుట్టారు. వానియందు ధ్యాన మేర్పడగా చెవులు పుట్టాయి. వానివల్ల శ్రోత్రేంద్రియం దిక్కులూ పుట్టాయి. చర్మంనుండి గడ్డం, మీసాలు మొదలగు రోమసమూహమూ, ఓషధులూ జనించాయి. ఇంకా చర్మం వలన మూత్రావయవం పుట్టింది. దానినుండి రేతస్సు పుట్టింది. రేతస్సువల్ల జలం పుట్టింది. దానివల్ల అపానం పుట్టింది. దానివల్ల మృత్యువు పుట్టింది.విరాట్పురుషుని చేతులవల్ల బలం, చేతుల బలంవల్ల ఇంద్రుడు, పాదాలవల్ల గమనం, పాదగతులవల్ల ఉపేంద్రుడు ఉద్భవించటం జరిగింది.

 

విరాట్పురుషుని నాడులవల్ల రక్తమూ, రక్తంవల్ల నదులూ, జఠరం వల్ల ఆకలిదప్పులూ, ఈ రెండింటివల్ల సముద్రాలు పుట్టాయి.విరాట్పురుషుని హృదయంవల్ల మనస్సూ, మనస్సువల్ల చంద్రుడూ, బుద్ధీ, చిత్తంవల్ల బ్రహ్మ, క్షేత్రజ్ఞుడు కలిగారు. ఇలా ఆ అండం నుండి సృష్టికారకుడైన పురుషుడు పుట్టాడు.ఇంకా విరాట్పురుషునిలో జన్మించిన ఆకాశం మొదలైన పంచభూతాలూ, శబ్దం మొదలైన పంచతన్మాత్రలూ, వాక్కు మొదలైన ఇంద్రియాలూ, ఆ ఇంద్రియాల అధిదేవతలూ వేరువేరుగా ఉండిపోయాయి. అవి తమలో తాము సమైక్యం పొందనందువల్ల జీవుణ్ణి ప్రవర్తింపజేయలేక పోయాయి. ఆ యా దేవతలు అధిష్ఠించిన ఇంద్రియాలు, తాము ప్రత్యేకంగా క్షేత్రజ్ఞుని లోకవ్యవహారానికి ప్రేరేపింపజాలక వరుసగా ఆయా స్థానాలలో ఉండిపోయాయి. విరాట్పురుషుని ముఖాన అగ్ని వాగింద్రియంతో కూడి వర్తించి నప్పటికీ విరాట్పురుషుని కార్యమైన ఇతరేతర జీవుల శరీరోత్పత్తి కలుగలేదు. అట్లే విరాట్పురుషుని నాసికలో వాయువు జ్ఞానేంద్రియంతో వర్తించినప్పటికీ జీవోత్పత్తి కాలేదు. అదే విధంగా కన్నులలో సూర్యుడు చక్షురింద్రియంతో కూడి వర్తించినా వ్యర్థమే అయింది. అలాగే చెవులలో దిక్కులు శ్రోత్రేంద్రియంతో కూడినప్పుడు కూడ విరాట్పురుషుని కార్యం సాధించటంలో వృథా అయ్యాయి. రోమాలలో త్వగింద్రియంతో ఓషధులు వర్తించి విఫలమయ్యాయి. అలాగే జలం అధిదేవతగా కల పురుషాంగం రేతస్సును పొందికూడా సృష్టికి సమర్థం కాలేదు. మలావయవం మృత్యువుతోకూడి అపానేంద్రియాన్ని చేరి నిరర్థకమే అయింది. హరిదేవతాకాలైన పాదాలు గతితో కూడి శక్తిహీనాలు అయ్యాయి. ఇంద్రదేవతాకాలైన చేతులు బలాన్ని పొంది కూడా నిరుపయోగాలైనాయి. నదీ దేవతాకాలైన నాడులు రక్తంతో కూడినప్పటికీ నిరర్థకాలైనాయి. కడుపు సముద్రాలతో కూడి ఆకలిదప్పులను పొందినప్పటికీ నిష్ప్రయోజనమైంది. హృదయం మనస్సుతో చంద్రుణ్ణి పొందికూడా ఊరక ఉంది. అట్లే బుద్ధి హృదయాన్ని పొందినప్పటికీ, చిత్తం రుద్రుణ్ణి చెందినప్పటికీ విరాట్పురుషుని కార్యాలు ఉత్పన్నం కాలేదు. అనంతరం అన్నిటికీ సమైక్యం కుదుర్పగల క్షేత్రజ్ఞుడు హృదయాన్ని అధిష్ఠించి, చిత్తంలో ప్రవేశించాడు. అప్పుడు విరాట్పురుషుడు, జలాలలో తేలుతున్న బ్రహ్మాండాన్ని అధిష్ఠించి సృష్టికార్యాన్ని ప్రవర్తింప గలిగాడు. నిద్రించిన జీవుని ప్రాణాలు మొదలైనవి తమ సొంతబలంతో కదలాడలేవు. లేవటానికి సమర్థాలు కావు. ఆ విధంగా అగ్ని మొదలైనవి తమకు అధిష్ఠానాలైన ఇంద్రియాలతో దేవాది శరీరాలు పొందికూడా, అవి శక్తిహీనా లయ్యాయి. క్షేత్రజ్ఞుడు ప్రవేశించగానే మెలకువ వచ్చినట్లు ఆయా శరీరభాగాలు పనిచేయటం ప్రారంభించాయి. అటువంటి విరాట్పురుషుని ఎడతెగని భక్తితో వివేకం కలిగి విరక్తులైన మహాత్ములు ధ్యానిస్తారు. ప్రకృతి, పురుషుల యథార్థజ్ఞానం వల్ల మోక్షమూ, కేవలం ప్రకృతి సంబంధంతో సంసారబంధమూ కలుగుతుంది.

 

తృతీయ స్కంధము : ప్రకృతి పురుష వివేకంబు

 

సత్త్వరజస్తమో గుణాలతో నిండి, ప్రకృతి వల్ల ఏర్పడిన శరీరాన్ని ఆశ్రయించి కూడ పురుషుడు ప్రకృతి సంబంధమైన సుఖదుఃఖ మోహాలకు లోనుగాడు. ఎటువంటి వికారాలు లేకుండా, త్రిగుణాలకు అతీతుడై, తేటనీటిలో ప్రతిబింబించిన సూర్యబింబాన్ని ఆ జలం అంటని విధంగా సత్త్వరజస్తమో గుణాలు పురుషుణ్ణి స్పృశింపలేవు. అలా కాకుండా జీవుడు ప్రాకృతిక గుణాలలో చిక్కుకున్నట్లయితే ఈ జరుగుతున్న అన్ని సన్నివేశాలకు నేనే కర్తనని అహంకారంతో వ్యామోహంతో ప్రవర్తిస్తాడు. అతిశయమైన సంగం వల్ల అతడు ప్రకృతి దోషాలు పొంది సుర నర పశు పక్షి వృక్షాది నానావిధ యోనులందు జన్మించి కర్మవాసనలను విస్తరింపజేసికొని సంసార బంధాలలో చిక్కుపడి చరిస్తూ, విషయసుఖాలను స్మరిస్తూ, కలలో కనిపించే ఐశ్వర్యాల వంటి సుఖాలలో మునిగి తేలుతూ ఉంటాడు. అతని మనస్సు చెడుమార్గాలలో ప్రవర్తిసుంది. అతడు చంచలబుద్ధితో భ్రమిస్తూ ఉంటాడు.

 

అందుచేత,మోక్షంపై ఆసక్తి కలవాడు అఖండమైన భక్తియోగాన్ని అవలంబించాలి. విషయసుఖాలమీద విరక్తుడు కావాలి. యమం నియమం మొదలైన యోగమార్గాలను అభ్యసించి మనస్సును వశపరచుకొని చలించని శ్రద్ధాసక్తులతో నాయొక్క సత్యస్వరూపాన్ని తెలుసుకోవాలి. నా పాదాలు సేవించాలి. నా కథలను ఆకర్ణించాలి. సర్వజీవులయందు సమబుద్ధితో ప్రవర్తిందాలి. ఎవ్వరితోను వైరం లేకుండా ఉండాలి. బ్రహ్మచర్యం, మౌనం మొదలైన ఆత్మధర్మాలను అవలంబించాలి. ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలి. మితంగా భుజించాలి. ఏకాంతంగా ఉండాలి. మననశీలుడై ఉండాలి. మాత్సర్యాన్ని దూరం చేసుకోవాలి. మైత్రి, కరుణ అభ్యసించాలి. ఆత్మజ్ఞానం అలవరచుకోవాలి. తన శరీరం మీద, ఆత్మీయులైనవారి మీద ఆసక్తి తగ్గించుకోవాలి. అవి బంధనానికి హేతువు లవుతాయి. ఇంకా జీవేశ్వరుల యథార్థస్వరూపం (త్రిగుణాత్మకమైన ప్రకృతిలో చిక్కుకొన్నవాడు జీవుడనీ, త్రిగుణాలకు అతీతుడై వానిని నడిపించేవాడు ఈశ్వరుడనీ) తెలుసుకొనడంవల్ల బుద్ధి అంతర్ముఖ మౌతుంది. అందువల్ల బుద్ధియందలి సంకల్ప వికల్పాల క్రమం తెలుస్తుంది. అప్పుడు ఇతర పదార్థాలేవీ కన్పించవు. జీవాత్మజ్ఞానంతో కంటితో సూర్యుణ్ణి చూచినంత సూటిగా ఆత్మనాయకుడైన శ్రీమన్నారాయణుని దర్శనం లభిస్తుంది. అప్పుడు అహంకారానికి తావుండదు. అది మిథ్యాభూతమై తొలగిపోతుంది. సత్యం ప్రకాశమాన మవుతుంది. అందువల్ల ప్రధానకారణమైన మూలప్రకృతికి ఆధారమూ, సమస్త సృష్టినీ దృష్టివలె ప్రకాశింప చేసేదీ, విశ్వంలోని సమస్త కార్యకారణాలకూ మూలభూతమూ, పరిపూర్ణమూ, సర్వాంతర్యామి అయిన పరబ్రహ్మాన్ని పొందగలుగుతాడు.

 

ఆత్మస్వరూపం తెలిసినవానికి పరమాత్మ స్వరూపం తెలుస్తుంది. ఎలాగంటే ఆకాశంలోని సూర్యుని కిరణాలు నీళ్ళలోనూ, ఇంటిగోడలలోని కిటికీసందులలోను ప్రసరించటం వల్ల సూర్యుడున్నట్లు మనం తెలుసుకుంటాము. మనస్సు బుద్ధి అహంకారం అనే ఈ మూడింటిలో ప్రసారమయ్యే ప్రకాశం ద్వారా పరమాత్మ స్వరూపాన్ని పరిపూర్ణంగా గుర్తించవచ్చు. చరాచర ప్రపంచంలో అంతర్యామిగా ఉండే ఆ మహామూర్తి ఆత్మవేత్తలైన మహాత్ముల అంతరంగాలలో అఖండ శోభావైభవంతో దర్శనమిస్తాడు. ఇంకా జీవుడు సుషుప్తిలో భగవంతునితో ప్రగాఢమైన సంబంధం కలిగి ఉంటాడు. వానియందలి పంచభూతాలు మొదలైన తత్త్వాలు ప్రకృతిలో విలీనాలై సంస్కార మాత్రంగా ఉంటూ, తమ పనులను చేయలేని స్థితిలో ఉంటాయి. ఆ సమయంలో సాధకుని ఆత్మ తానుమాత్రం మేల్కొని ఉండి ఎటువంటి అవరోధం లేనిదై పరమాత్మను భావన చేస్తూ ఉంటుంది.

 

{సాధకుడైన పురుషుడు ఎటువంటి ఫలాన్ని కోరకుండా తన ధర్మాలను తాను నిర్వర్తిస్తూ ఉండాలి. తన మనస్సును ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంచుకోవాలి. నాయందు అచంచలమైన భక్తి కలిగి ఉండాలి. పుణ్యకథలను ఆసక్తితో వినాలి. ప్రకృతి పురుష సంబంధమైన యథార్థజ్ఞానాన్ని అవగతం చేసుకోవాలి. కోరికలను దూరంగా పారద్రోలి వైరాగ్యాన్ని పెంపొందించుకోవాలి. తపస్సుతో కూడిన యోగాభ్యాసం చేయాలి. అఖండమైన ఏకాగ్రతను అవలంభించాలి. ఈ సాధనవల్ల పురుషుని అంటుకొని ఉన్న ప్రకృతి దందహ్యమానమై అదృశ్యమైపోతుంది. అరణినుంచి ఉదయించిన అగ్ని అరణిని కాల్చి వేసినట్లు జ్ఞానం వల్లనూ, తత్త్వదర్శనం వల్లనూ పటిష్ఠమూ బలిష్ఠమూ దోషభూయిష్ఠమూ అయిన ప్రకృతిని అనుభవిస్తున్న జీవుడు సగంలోనే మొగం మొత్తి పరిత్యాగం చేస్తాడు.

 

ప్రకృతి తన సహజ ప్రభావం వల్ల తనకు అధీశ్వరుడై తనలో ప్రవర్తించే పురుషునకు అమంగళాన్నీ, అనర్థాన్నీ ఆచరించలేదు.మానవుడు నిద్రపోతున్నపుడు పీడకలలలో పొందే కష్టనష్టాలు మేలుకొనగానే అసత్యాలని తెలుసుకుంటాడు. అదే విధంగా ఆత్మనాథుడూ, కర్మసాక్షీ అయిన పరమేశ్వరునకు ప్రకృతికి సంబంధించిన దోషాలు ఎన్నటికీ అంటవు.ఆత్మజ్ఞాన సంపన్నుడైనవాడు బ్రహ్మపదం ప్రాప్తించే వరకు ఎంతకాలమైనా ఎన్ని జన్మలైనా ఎత్తుతూనే ఉంటాడు. వాని వైరాగ్యం చెక్కు చెదరదు.ఇంకా అణిమ గరిమ మొదలైన అష్టసిద్ధులు మోక్షానికి విఘ్నాన్ని కలిగిస్తాయి. అందువల్ల వాటిమీద మమకారాన్ని వదలిపెట్టి నా పాదపద్మాలను హృదయంలో పదిలపరచుకున్నవాడు మృత్యువును తిరస్కరించి మోక్షాన్ని పొందుతాడు.)

 

శక్తి వంచన లేకుండా తన ధర్మాలను తాను ఆచరించడం, శాస్త్రాలలో నిషేధింపబడిన కర్మలను మానడం, దైవికంగా అనగా తన ప్రయత్నం లేకనే లభించిన ధనంతో సంతోషించడం, మహాత్ములైన భగవద్భక్తుల దివ్యపాదపద్మాలను సేవించడం, ఇతరులకు ఏవగింపు కలిగించే పనులను మానుకొనడం, మోక్షధర్మాలైన శాంతి అహింస మొదలైన విషయాలపైన ఆసక్తి కలిగి ఉండటం, పరిశుద్ధమైన ఆహారాన్ని మితంగా తినడం, ప్రశాంతమై ఇబ్బందిలేని ఏకాంతప్రదేశంలో నివాసం చేయడం, హింస చేయకుండా ఉండడం, సత్యమార్గాన్ని తప్పక పోవడం, ఇతరుల వస్తువులను దొంగిలించకుండా ఉండడం, తనకు ఎంత అవసరమో అంతవరకే ధనం గ్రహించడం, బ్రహ్మచర్యాన్ని పాటించడం, తపశ్శౌచాలు కలిగి ఉండడం, సద్గ్రంధాలు చదవడం, సర్వేశ్వరుణ్ణి పూజించడం, మౌనంగా ఉండడం, ఎక్కువకాలం అనుకూలమైన పద్ధతిలో భగవంతుని ధ్యానిస్తూ కూర్చోవడం, ఈ ఆసనవిజయం వల్ల స్థిరత్వం సంపాదించడం, ప్రాణవాయువును స్వాధీనం చేసుకోవడం, ఇంద్రియాలను విషయాలనుండి నిగ్రహించడం, ఇంద్రియాల నుండి మరలిన మనస్సునందు హృదయాన్ని నిల్పడం, దేహమందున్న మూలాధారం మొదలైన స్థానాలలో ఏదో ఒక స్థానమందు హృదయంలో కల మనస్సుతో కూడా ప్రాణధారణ చేయడం, శ్రీమన్నారాయణుని దివ్య చరిత్రలోని లీలలను ధ్యానించడం, మనస్సును ఏకాగ్రంగా ఉంచుకోవడం, పరమాత్మ అయిన పద్మనాభుడు అంతటా నిండి ఉన్నాడని విశ్వసించడం ఇత్యాదులు యోగధర్మాలు. ఇవే కాకుండా ఇతర వ్రతాలను, దానాలను ఆచరించాలి. మనోమాలిన్యంతో కూడిన చెడుమార్గాలను విడిచిపెట్టాలి. ప్రాణాయామపరుడై చక్కగా ఆలోచించి శుచియైన ప్రదేశంలో ఎటువంటి ఆటంకం లేకుండా దర్భాసనంపై ఒక జింకచర్మాన్ని, దానిపైన వస్త్రాన్ని పరచి సుఖాసనంపై కూర్చోవాలి. శరీరాన్ని నిటారుగా నిలుపుకొని కుంభక పూరక రేచక రూపమైన ప్రాణాయామంతో అన్నమయ ప్రాణమయాది కోశాలను శుద్ధి చేసుకొని చంచలమైన చిత్రాన్ని సుస్థిరం చేసుకొని, తీవ్రమైన సాధనతో బాగా కాచి కరిగించి మాలిన్యం పోగొట్టిన బంగారాన్ని వలె మనస్సును స్వచ్ఛం చేసుకోవాలి. ఈ విధంగా వాయువును వశం చేసుకొన్న యోగికి ప్రాణాయామం అనే అగ్ని చేత వాతపీత్తశ్లేష్మాలనే దోషాలు నశిస్తాయి. ఏకాగ్రత వల్ల పాపాలు రూపుమాసిపోతాయి. మనోనిగ్రహం వల్ల చెడు సంసర్గాలు విడిపోతాయి. అటువంటి యోగి ధ్యానంవల్ల రాగద్వేషాలకు, త్రిగుణాలకు అతీతుడై తన ముక్కు చివరి భాగాన దృష్టిని కేంద్రీకరించాలి.

 

తృతీయ స్కంధము : విష్ణు సర్వాంగ స్తోత్రంబు

 

అప్పుడే వికసిస్తున్న పద్మాలవంటి అందమైన కన్నులు కలవాడు, వక్షస్థలంపై అందమైన శ్రీవత్సం అనే పుట్టుమచ్చ కలవాడు, నల్లని మేఘంలా, నల్లకలువలా శ్యామలవర్ణం కలవాడు, తుమ్మెదలకు విందుచేసే వైజయంతీ మాలికతో విరాజిల్లేవాడు, కౌస్తుభమణితో శోభించే ముత్యాలహారం కంఠమందు ధరించినవాడు, యోగిజనుల హృదయకమలాలకు దగ్గరైనవాడు, ఎప్పుడును ప్రసన్నమైన చిరునవ్వు చిందులాడే ముఖపద్మం కలవాడు, కోటి సూర్యుల తేజస్సుతో దేదీప్యమానంగా ప్రకాశించేవాడు, విలువైన రమణీయ రత్నకుండలాలు, కిరీటం, హారాలు, కంకణాలు, కటకాలు, భుజకీర్తులు, అంగుళీయకాలు, అందెలు మొదలైన అలంకారాలతో విలసిల్లేవాడు, కటి ప్రదేశమందు ఘల్లు ఘల్లుమనే గజ్జెల మొలనూలు అలంకరించుకొన్నవాడు, భక్తులను లాలించి పాలించేవాడు అయిన శ్రీమన్నారాయణుని (ధ్యానం చేయాలి).

 

పద్మకేసరాల రంగుతో మిసమిసలాడే పసుపుపచ్చని పట్టువస్త్రం కట్టుకున్నవాడు, లోకాలను తనలో పెట్టుకున్నవాడు, శత్రుభయంకరాలైన శంఖ చక్ర గదా పద్మాలను చతుర్బాహువులలో ధరించేవాడు, మోహాన్ని హరించేవాడు, స్తోత్రం చేసే భక్తులకు జ్ఞాననేత్రాన్ని అనుగ్రహించేవాడు, సుగుణాలనే సురుచిర భూషణాలను పరిగ్రహించేవాడు, నిత్యయౌవనుడు, భువనపావనుడు, సౌందర్యశీలుడు, యశోవిశాలుడు, సమస్త లోకాలూ నమస్కరించే పాదపద్మాలు కలవాడు, భక్తజనులను ఆదరించే భావాలు కలవాడు, కోరిన కోరికలను ప్రసాదించేవాడు, మహనీయ కీర్తితో ప్రకాశించేవాడు అయిన శ్రీహరిని (ధ్యానించాలి).

 

సాటిలేని మేటి సుగుణాలతో నిండియున్న వానిని, పాపాలను చెండాడే వానిని, స్థిరమైన వానిని, నడచివస్తున్న వానిని, వచ్చి కూర్చున్న వానిని, సుఖంగా పరుండిన వానిని, హృదయాంతరాలలో నివసించిన వానిని, సర్వేశ్వరుని, శాశ్వతమైన వానిని, సంస్తుతింపదగిన సచ్చరిత్ర కలవానిని (ధ్యానించాలి).

 

పరిశుభ్రము, పరిశుద్ధము అయిన మనస్సుతో, విజ్ఞాన తత్త్వ ప్రబోధకమైన సంకల్పంతో ఆ దివ్యమూర్తి రూపవైభవాన్ని ధ్యానించి అన్ని అవయవాలను విడమరచి చూచేటట్లు చిత్తాన్ని తదాయత్తం చేసి ఆ పరాత్పరుని ఒక్కొక్క శరీర భాగాన్నే పరిశుద్ధమైన అంతరంగంలో అనుసంధానం చేసికొని ధ్యానించాలి.

 

3-929-సీ.

హల కులిశాంకుశ జలజధ్వజచ్ఛత్ర-

లాలిత లక్షణలక్షితములు

సలలిత నఖచంద్రచంద్రికా నిర్ధూత-

భక్తమానస తమఃపటలములును

సురుచిరాంగుష్ఠ నిష్ఠ్యూత గంగాతీర్థ-

మండిత హరజటామండలములు

సంచిత ధ్యానపారాయణజన భూరి-

కలుష పర్వత దీపకులిశములును

 

3-929.1-తే.

దాసలోక మనోరథదాయకములు

జారుయోగి మనఃపద్మ షట్పదములు

ననగఁ దనరిన హరిచరణాబ్జములను

నిరుపమధ్యానమున మది నిలుపవలయు.

భావము:

హలం, వజ్రం, అంకుశం, కమలం, ధ్వజం, ఛత్రం మొదలైన మంగళకరమైన రేఖలు కలవీ, చంద్రుని వెన్నెల వెలుగులవంటి గోళ్ళకాంతులతో భక్తుల మనస్సులలోని అజ్ఞానాంధకారాన్ని దూరం చేసేవీ, మనోజ్ఞమైన కాలి బొటనవ్రేలినుండి పుట్టిన గంగాతీర్థంచే శివుని జటాజూటాన్ని అలంకరించేవీ, భక్తితో ఆసక్తితో ధ్యానించే భక్తుల పాపాలనే పర్వతాలను వజ్రాయుధంలా పటాపంచలు చేసేవీ, దాసుల కోర్కెలు తీర్చేవీ, యోగుల హృదయాలనే పద్మాలలో విహరించే తుమ్మెదల వంటివీ అయిన హరి పాదపద్మాలను నిరంతరం హృదయాలలో స్మరిస్తూ ఉండాలి.

3-930-చ.

కమలజు మాతయై సురనికాయ సమంచిత సేవ్యమానయై

కమలదళాభనేత్రములు గల్గి హృదీశ్వర భక్తి నొప్పు న

క్కమల నిజాంకపీఠమునఁ గైకొని యొత్తు పరేశుజాను యు

గ్మము హృదయారవిందమున మక్కువఁ జేర్చి భజింపగా దగున్.

భావము:

బ్రహ్మకు తల్లియై, దేవతలందరికీ ఆరాధ్యురాలై, కమల దళాలవంటి కన్నులుగల లక్ష్మీదేవి తన హృదయేశ్వరుడైన శ్రీహరి మోకాళ్ళను ఎంతో భక్తితో ఒడిలో చేర్చుకొని ఒత్తుతూ ఉన్న మనోహర దృశ్యాన్ని మనస్సులో మననం చేసుకోవాలి.

3-931-ఉ.

చారు విహంగవల్లభు భుజంబులమీఁద విరాజమానసు

శ్రీరుచినుల్లసిల్లి యతసీకుసుమద్యుతిఁ జాల నొప్పు పం

కేరుహనాభు నూరువుల కిల్బిషభక్తి భజించి మానసాం

భోరుహ మందు నిల్పఁదగుఁబో మునికోటికి నంగనామణీ!

భావము:

సొగసైన గరుత్మంతుని భుజాలమీద కాంతి సంపదలతో పెంపొందుతూ, విరిసిన దిరిసెనపువ్వు వన్నెలతో కన్నులవిందు చేసే పద్మనాభుని అందమైన ఊరుయుగ్మాన్ని అచంచలమైన భక్తితో భావిస్తూ మునులైనవారు తమ మనఃకమలాలలో నిల్పుకోవాలి.

3-932-క.

పరిలంబిత మృదుపీతాం

బర కాంచీగుణ నినాదభరితం బగున

ప్పురుషోత్తముని నితంబముఁ

దరుణీ! భజియింపవలయు దద్దయుఁ బ్రీతిన్

భావము:

అమ్మా! ఒయ్యారంగా అంచులు వ్రేలాడుతూ ఉండే మెత్తని పట్టుపీతాంబరం కట్టుకొని మొలనూలు మువ్వల సవ్వడి నివ్వటిల్లే పురుషోత్తముని కటిప్రదేశాన్ని భక్తితో భజించాలి.

3-933-క.

విను భువనాధారత్వం

బునఁదగి విధిజననహేతుభూతంబగున

వ్వనజాతముచేఁగడుమిం

చిన హరినాభీసరస్సుఁజింతింపఁదగున్

భావము:

ఇంకా విను. అఖిల లోకాలకు ఆధారభూతమై, బ్రహ్మపుట్టుకకు హేతుభూతమైన పద్మంతో విరాజిల్లే సరోవరం వంటి విష్ణుమూర్తి నాభీమండలాన్ని సంస్మరించాలి.

3-934-తే.

దివ్య మరకతరత్న సందీప్త లలిత

కుచములను మౌక్తికావళిరుచులఁ దనరి

యిందిరాదేవి సదనమై యెసక మెసఁగు

వక్షమాత్మను దలపోయవలయుఁ జుమ్ము.

భావము:

దివ్యమైన మరకతమాణిక్య దీప్తులు కలిగి, ముత్యాలహారాల కాంతులతో నిండిన కుచములు కలిగిన లక్ష్మీదేవికి నివాసమైన వక్షస్థ్సలాన్ని ఆత్మలో భావిస్తూ ఉండాలి.

3-935-మ.

నిరతంబున్ భజియించు సజ్జన మనోనేత్రాభిరామైక సు

స్థిర దివ్యప్రభ గల్గు కౌస్తుభరుచిశ్లిష్టంబునై యొప్పు నా

వర యోగీశ్వరవంద్యమానుఁ డగు సర్వస్వామి లక్ష్మీశు కం

ధర మాత్మం గదియించి తద్గుణగణధ్యానంబుసేయం దగున్.

భావము:

యోగీశ్వరులచే నమస్కరాలు అందుకునేవాడూ, అందరికీ ప్రభువూ, లక్ష్మీపతీ అయిన ఆ మహావిష్ణువు యొక్క మెడ; నిత్యం కొలిచే సజ్జనుల మనోనేత్రాలకు ఆనందాలు పంచేటటువంటిదీ, అద్భుతమైన కౌస్తుభమణికాతులలో తేలియాడేదీనూ. అట్టి ఆ విష్ణుమూర్తి మెడను మనసులో నిలుపుకుని దాని గుణాలను ధ్యానం చేయాలి.

3-936-క.

ఘన మందరగిరి పరివ

ర్తన నికషోజ్జ్వలిత కనకరత్నాంగదముల్

దనరార లోకపాలకు

లను గలిగిన బాహు శాఖలను దలఁపఁదగున్.

భావము:

సాగరమథన సమయంలో బరువైన మందర పర్వతం రాపిడిచే మెఱుగుపెట్టబడిన రత్నాల భుజకీర్తులు కలిగి లోకపాలకులకు అండదండలైన విష్ణుదేవుని బాహుదండాలను సంస్మరించాలి.

3-937-వ.

మఱియు విమత జనాసహ్యంబులైన సహస్రారంబులు గలుగు సుదర్శనంబును, సరసిజోదరకరసరోరుహం బందు రాజహంస రుచిరం బయిన పాంచజన్యంబును, నరాతిభటశోణిత కర్దమలిప్తాంగంబై భగవత్ప్రీతికారణి యగు కౌమోదకియును, బంధుర సుగంధ గంధానుబంధ మంథర గంధవహాహూయమాన పుష్పంధయ ఝంకార నినద విరాజితం బైన వైజయంతీ వనమాలికయును, జీవతత్త్వం బైన కౌస్తుభమణియును, బ్రత్యేకంబ ధ్యానంబు సేయందగు; వెండియు, భక్త సంరక్షణార్థం బంగీకరించు దివ్యమంగళవిగ్రహంబున కనురూపంబును, మకరకుండల మణి నిచయ మండిత ముకురోపమాన నిర్మల గండమండలంబును, సంతత శ్రీనివాస లోచనపంకజకలితంబును, లాలిత భ్రూలతాజుష్టంబును, మధుకర సమానరుచి చికురవిరాజితంబును నైన ముఖకమలంబు ధ్యానంబు గావింపవలయు; మఱియు, శరణాగతుల కభయప్రదంబు లగుచు నెగడు పాణిపంకేరుహంబుల మనంబునఁ దలఁపవలయు.

భావము:

ఇంకా శత్రుసమూహాలకు సహింపరాని వేయి అంచుల సుదర్శన చక్రాన్ని, పద్మనాభుని కరపద్మంలో రాజహంసవలె విరాజిల్లే పాంచజన్య శంఖాన్ని, రాక్షసుల నెత్తురు చారికలతో కూడి దామోదరునికి ఆమోదదాయకమైన కౌమోదకి అనే గదను, గుప్పుమంటున్న కొంగ్రొత్త నెత్తావులు గుబుల్కొన్న కమ్మ తెమ్మరల పిలుపు లందుకొని సంగీతాలు పాడే తుమ్మెదలతో కూడిన వైజయంతి అనే వనమాలికను, అఖిల లోకాలకు ఆత్మస్వరూపమైన కౌస్తుభమణిని వేరువేరుగా ధ్యానం చేయాలి. ఇంకా భక్తరక్షణ పరాయణత్వాన్ని స్వీకరించే దివ్యమంగళ రూపాపానికి తగినదై, మకరకుండలాల మణికాంతులు జాలువారే చక్కని చెక్కుటద్దాలతో ఎల్లవేళలా జయశ్రీకి మందిరాలైన అందాల కందమ్ములతో వంపులు తిరిగిన సొంపైన కనుబొమలతో, ఎలదేటి కదుపుల వంటి నల్లని ముంగురులతో, ముద్దులు మూటగట్టే ముకుందుని ముఖకమలాన్ని ధ్యానం చేయాలి. ఆర్తులై శరణాగతులైన భక్తులకు అభయమిచ్చే కరపద్మాలను మనస్సులో ధ్యానించాలి.

3-938-క.

గురు ఘోరరూపకంబై

పరఁగెడు తాపత్రయం బుపశమింపఁగ శ్రీ

హరిచేత నిసృష్టము లగు

కరుణాలోకములఁ దలఁపఁగాఁదగు బుద్ధిన్.

భావము:

1) ఆదిభౌతికము, 2) ఆధ్యాత్మికము, 3) ఆదిదైవికము అనెడి కారణములు కలిగిన మూడు బాధలు (తాపములు) తాపత్రయం అనబడతాయి, భయంకరాతి భయంకరములు అయిన ఆ తాపత్రయాలను ఉపశమింప చేయగలిగిన శ్రీమన్నారాయణుని దివ్య కటాక్షవీక్షణాలను మనస్సునందు స్మరించుకోవాలి.

3-939-క.

ఘనరుచిగల మందస్మిత

మున కనుగుణ మగు ప్రసాదమును జిత్తమునన్

మునుకొని ధ్యానముసేయం

జను యోగిజనాళి కెపుడు సౌజన్యనిధీ!

భావము:

సౌజన్యానికి నిధి వంటి ఓ తల్లీ! భక్తియోగాన్ని అవలంబించినవారు కమనీయకాంతులు ప్రసరించే విష్ణువుయొక్క ముసిముసి నవ్వులలోని ప్రసన్నతను మలినం లేని మనస్సులో మాటిమాటికి మననం చేసుకోవాలి.

3-940-తే.

పూని నతశిరులైనట్టి భూజనముల

శోకబాష్పాంబుజలధి సంశోషకంబు

నత్యుదారతమము హరిహాస మెపుడుఁ

దలఁపఁగావలె నాత్మలోఁ దవిలి వినుము.

భావము:

తలలు వంచి నమస్కరించే దాసుల శోకబాష్ప సముద్రాలను ఎండించి కోరికలు పండించే హరియొక్క సుందర మందహాసాన్ని ఎడతెగకుండా భావించాలి.

3-941-సీ.

మునులకు మకరకేతనునకు మోహనం-

బైన స్వకీయ మాయావిలాస

మున రచితం బైన భ్రూమండలంబును-

ముని మనఃకుహర సమ్మోదమానుఁ

డగు నీశ్వరుని మందహాసంబు నవపల్ల-

వాధర కాంతిచే నరుణ మైన

మొల్లమొగ్గల కాంతి నుల్లసం బాడెడు;-

దంతపంక్తిని మదిఁ దలఁపవలయు

 

3-941.1-తే.

వెలయ నీరీతి నన్నియు వేఱువేఱ

సంచితధ్యాన నిర్మల స్థానములుగ

మనములోఁ గను" మని చెప్పి మఱియుఁ బలికె

దేవహూతికిఁ గపిలుండు దేటపడఁగ.

భావము:

మహామునులకే కాకుండా మన్మథునకు సైతం మరులు రేకెత్తించే మాధవుని మాయావిభ్రమ విరచితమైన భ్రూమండలాన్ని, మునీంద్రుల మనస్సులకు ఆనందాన్ని అందించే మందహాసాన్ని, క్రొంగ్రొత్త చిగురు తొగరు పెదవులను, ఆ పెదవుల కాంతికి జాజువారిన మొల్ల మొగ్గల చెలువాన్ని పరిహసించే పలువరసను తలపోయాలి. ఈ విధంగా అన్ని అవయవాలను వేరువేరుగా మనస్సులో నిలిపి ధ్యానం చేసుకోవాలి అని దేవహూతికి కపిలుడు తేటతెల్లంగా తెలిపి మళ్ళీ ఇలా అన్నాడు.

 

తృతీయ స్కంధము : సాంఖ్యయోగంబు

 

పురుషుడు తన జీవితానికి అంతిమ గమ్యాన్ని భావిస్తూ అన్య విషయాలనుండి నివృత్తమైన చిత్తంతో ఆత్మజ్ఞానమందు నిశ్చలమైన నిష్ఠ కలవాడై సుఖ దుఃఖాలను లక్ష్యపెట్టక అవి అహంకార ధర్మాలని గుర్తించి వర్తిస్తాడో పురుషునికి ఆత్మతత్త్వం సాక్షాత్కరిస్తుంది. అటువంటి వానినే జీవన్ముక్తుడని ప్రాజ్ఞులంటారు. అటువంటివాడు తన శరీరం నిలుచుండటం, కూర్చుండటం, తిరగడం మొదలైనవి ఏవీ తెలియకుండా ఉంటాడు.మద్యపానం చేసి మైకంలో ఉన్న మనుష్యుడు పైబట్టను మరచిపోయి ప్రవర్తించిన విధంగా జీవన్ముక్తుడైనవాడు తన శరీరం దైవాధీనమనీ, అది ఎప్పుడో నశించిపోయేదనీ భావించి ఆత్మతత్త్వాన్ని అవగతం చేసుకొని ఉపేక్షాభావంతో ఉంటాడు. అంతేకాకుండా ఏకాగ్రభావంతో ఆత్మ సాక్షాత్కారం పొందినవాడై కర్మఫలం అనుభవింప వలసినంత వరకు భార్యాపుత్రులతో కూడిన సంసారాన్ని స్వప్నంలో లాగా అనుభవిస్తాడు. తర్వాత కలనుండి మేల్కొన్నవానిలాగా సంసార బంధాలన్నీ వదలిపెట్టి వర్తిస్తాడు.

 

సర్వ భూతాలలోను అనన్య భావంతో, సర్వత్ర ఆత్మగా వెలుగుతూ ఉంటుంది. దివ్యజ్యోతి ఒక్కటే అయినా పెక్కింటివలె కనిపిస్తుంది. ప్రకృతిగతమైన ఆత్మ దేవతలు, మనుష్యులు, జంతువులు, స్థావరాలు మొదలైన వేరువేరు యోనులలో వేరువేరు భావాన్ని పొందుతూ భిన్న గుణాలతో భిన్నంగా వెలుగుతూ ఉంటుంది. నిజానికి దేహాలు మాత్రమే వేరు కాని వెలుగు ఒక్కటే.ఆత్మ సదసదాత్మకమై, భావాతీతమై, ఆత్మీయ భావంతో వర్తిస్తూ తన ఉజ్జ్వల తేజస్సుతో ప్రకృతిని తిరస్కరించి లోబరచుకుంటుంది.

 

(ఇక్కడితో సృష్టి నిర్మాణం జరిగిన సాంకేతిక పరిజ్ఞానం ముగుస్తుంది.కపిలముని చెప్పిన సాంఖ్యం వేదాంతం కాదు, సృష్టిరచనకు వ్యాఖ్యానమే!విశ్వం యొక్క స్వభావజ్ఞానం గురించి చెప్తున్నది సాంఖ్యం.తర్వాత భూమండలం, ఖగోళం గురించి పంచమస్కంధంలో వస్తుంది.అయితే, దానికి పరిచయం అనిపించే ప్రియవ్రతుని కధ చతుర్ధ స్కంధంలో వస్తుంది.మొదట అది తెలుసుకుని పంచమ స్కంధంలోకి వెళ్తే విషయానికి సమగ్రత వస్తుంది.)

చతుర్థ స్కంధము : స్వాయంభువు వంశ విస్తారము

 

స్వాయంభువ మనువునకు శతరూప అనే భార్యవల్ల ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే ముగ్గురు కుమార్తెలు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కుమారులు జన్మించారు. వారిలో పెద్దదైన ఆకూతిని మనువు పుత్రికాధర్మాన్ని ఆశ్రయించి రుచి అనే ప్రజాపతికి ఇచ్చి పెండ్లి చేశాడు. ఆకూతికి సోదరులు ఉన్నప్పటికీ తన సంతానం విస్తరిల్లటంకోసం స్వాయంభువమనువు పుత్రికా ధర్మాన్ని పాటించాడు. అందుకు మనువు భార్య శతరూప ఆనందంతో అంగీకరించింది.

 

విధంగా పెండ్లాడిన రుచి ప్రజాపతి బ్రహ్మతేజస్సు కలవాడు, సద్గుణ సంపన్నుడు, మనస్సును భగవంతునియందే లగ్నం చేసినవాడు కనుక అతనికి ఆకూతియందు శ్రీమహావిష్ణువు యజ్ఞుడు అనే పుత్రుడుగా, లోకేశ్వరి అయిన ఆదిలక్ష్మి విష్ణువును ఎప్పుడూ విడిచి ఉండదు కనుక తన అంశతో దక్షిణ అనే కన్యకగా జన్మించారు. స్వాయంభువుడు ఎంతో సంతోషించి తన కూతురి కుమారుడు, అత్యంత తేజోవంతుడు, శ్రీవిష్ణుదేవుని అవతారము అయిన యజ్ఞుని తన ఇంటికి తెచ్చుకున్నాడు. రుచి ప్రజాపతి కామగమన అయిన దక్షిణను తన దగ్గరనే ఉంచుకున్నాడు. తరువాత సకల మంత్రాలకు అధిదేవత అయిన యజ్ఞుడు తనను భర్తగా కోరిన దక్షిణను చేపట్టాడు. వారిద్దరూ ఆదిదంపతులు కనుక అన్నాచెల్లెళ్ళ వివాహం లోకవిరుద్ధం కాలేదు.

 

దంపతులకు యామ అనే పేర్లుగల దేవతలు మహాబలవంతులైన పుత్రులుగా జన్మించారు. పుత్రులు తోషుడు, ప్రతోషుడు, సంతోషుడు, భద్రుడు, శాంతి, ఇడస్పతి, ఇధ్ముడు, కవి, విభుడు, వహ్ని, సుదేవుడు, రోచనుడు అని పన్నెండుమంది. వీరిని తుషితులు అనికూడా అంటారు. స్వాయంభువ మన్వంతరంలో తుషితులు దేవగణాలయ్యారు. మరీచి మొదలైన మునీశ్వరులు, యజ్ఞుడు, దేవేంద్రుడు, మనువు కుమారులైన ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, వారి పుత్రులు, మనుమలు, మునిమనుమలు అందరితోనూ స్వాయంభువ మన్వంతరం నిండి కొనసాగింది.మనువు తన మూడవ కూతురైన ప్రసూతి అనే కన్యను బ్రహ్మ కుమారుడైన దక్షప్రజాపతికి ఇచ్చాడు. దక్షునికి ప్రసూతికి పుట్టిన సంతతితో మూడులోకాలు నిండిపోయాయి. కర్దముని పుత్రికలు బ్రహ్మర్షులకు భార్యలయ్యారు.

 

పంచమ స్కంధము - పూర్వ : ప్రియవ్రతుని బ్రహ్మదర్శనంబు

 

రాజైన ప్రియవ్రతుడు నారద మహర్షి పాదసేవ చేస్తూ ఒకసారి అధ్యాత్మ సత్త్రయాగం చేయడానికి సంకల్పించి దీక్ష వహించగా రాజ్యపాలనను చేపట్టవలసిందిగా తండ్రి ఆజ్ఞాపించినా అది తన జ్ఞానానికి ఆటంకమని భావించి అంగీకరించలేదు. ఇదంతా తెలుసుకున్న బ్రహ్మదేవుడు ప్రియవ్రతునికి రాజ్యపాలన పట్ల ఆసక్తిని కలిగించడానికి సంకల్పించి, ఇంద్రాదులు తనను సేవిస్తుండగా, సన్మునీంద్రులు సన్నుతిస్తుండగా, చుక్కలతో కూడిన చంద్రునిలాగా వేదాలతో కూడి వెలిగిపోతూ, హంస వాహన మెక్కి సత్యలోకంనుండి మెల్లమెల్లగా తారాపథంలో బయలుదేరి వచ్చాడు.

 

దారుల కిరువైపులా నిల్చి సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు, చారణులు, గరుడులు, కింపురుషులు స్తుతిస్తూ ఉండగా, గంధమాదన పర్వతం చరియలను ప్రకాశింపజేస్తూ బ్రహ్మదేవుడు వస్తూ ఉండగా చూసి నారదుడు స్వాయంభువ ప్రియవ్రతులతో పాటు చేతులు జోడిస్తూ ఎదురేగి స్తుతులనే పూలగుత్తులతో పూజించాడు. బ్రహ్మ సంతోషించి ప్రియవ్రతుణ్ణి చూసి నవ్వుతూ ఇలా అన్నాడు.“రాజా! విష్ణుమూర్తి నా నోటితో నీకు చెప్పమన్న విషయాన్ని చెప్తున్నాను. అందుచేత నా మాటలను శ్రీహరి మాటలుగానే భావించి నిశ్చలమైన మనస్సుతో విను.నీవు, నారదుడు, నేను అందరం శ్రీహరి ఆజ్ఞను మీరక ప్రవర్తించే వాళ్ళమే. కనుక అతని ఆజ్ఞను తప్పరాదు.ఇంకా శ్రీహరి ఆజ్ఞానుసారం జీవుడు తపస్సు చేయడం, విద్యలు నేర్చుకొనడం, యోగాన్ని అభ్యసించడం, శౌర్యాన్ని ప్రదర్శించడం, జ్ఞానాన్ని సంపాదించడం, ఆర్థిక వనరులను సమకూర్చుకొనడం, ధర్మం పాటించడం మొదలైన కర్మలు చేస్తాడు. కర్మాదులకు కర్త దేవుడే కాని జీవుడు కాడు. అటువంటప్పుడు వీటినుండి ఎవడైనా తప్పుకోవడం కాని, మరొకరిని తప్పించడం కాని శక్యం కాని పని. పుట్టడానికి కాని, చావడానికి కాని, భయానికి కాని, సుఖానికి కాని, దుఃఖానికి కాని ఈశ్వరుడే కర్త. జీవుడు కానే కాడు. శ్రీహరి వాక్కులే వేదాలు. మన మందరం సత్త్వరజస్తమో గుణాలనే ముప్పేటల త్రాటితో కట్టబడిన వాళ్ళం. ముకుతాడు వేసిన పశువులు యజమాని చెప్పు చేతలలో ఉండే విధగా మనం ఈశ్వరాజ్ఞకు లోబడి ఉంటాము. మానవుని సుఖ దుఃఖాలకు ఈశ్వరుడే కర్త. కళ్ళున్నవాడు గుడ్డివాణ్ణి ఎలా నడిపిస్తాడో అలాగే ఈశ్వరుడు మనలను నడిపిస్తాడు. అతనికి లోబడి, అతడు ప్రసాదించిన సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాము. కలలో చూచిన పదార్థాలను నిద్ర మేలుకొన్న తరువాత అబద్ధమని అనుకున్నట్లు ముక్తి కోసం ప్రయత్నించే జ్ఞాని తాను పొందవలసిన సుఖ దుఃఖాలను అనుభవిస్తూ రాబోయే కర్మఫలాలకు దూరంగా ఉంటాడు. అడవికి పోయినా ఇంద్రియ వ్యాపారాలను జయించలేక కామాదులకు లొంగిన వానికి సంసార బంధాలే మిగులుతాయి. గృహస్థాశ్రమంలో ఉన్నా ఇంద్రియాలను జయించి ఆత్మజ్ఞానం కలిగిన పురుషునికి మోక్షం తప్పక సిద్ధిస్తుంది. శత్రువులను గెలవడానికి సిద్ధమైనవాడు కోటలోనే ఉండి వారిని జయించినట్లుగా మోక్షం కోరే పురుషుడు గృహస్థాశ్రమంలో ఉంటూ శ్రీమన్నారాయణుని చరణారవిందాలనే కోటను ఆశ్రయించి కామక్రోధాది అరిషడ్వర్గాన్ని జయిస్తాడు. అలాగే నీవు కూడా ఈశ్వర కల్పితాలైన భోగాదులను అనుభవిస్తూ ముక్త సంగుడవై ముక్తిని దక్కించుకోఅన్నాడు. అప్పుడు ప్రియవ్రతుడు ముల్లోకాలకు గురువైన బ్రహ్మదేవుని వాక్యాలను తలవంచి గౌరవపూర్వకంగా అంగీకరించాడు.

 

సత్యసంధుడైన స్వాయంభువ మనువు బ్రహ్మ సంకల్పంతో నారదుని అనుమతితో తన కుమారుడైన ప్రియవ్రతునికి రాజ్యభారాన్ని అప్పగించాడు. విధంగా స్వాయంభువ మనువు భూచక్రాన్ని పరిపాలించడానికి ప్రియవ్రతునికి పట్టాభిషేకం చేసి, దాటరాని ఇంద్రియార్థాల నుండి బయటపడి అరణ్యాలకు వెళ్ళిపోయాడు.రాజైన ప్రియవ్రతుడు భగవంతుని ఆదేశంతో కర్మతంత్రపరుడైనా శ్రీహరి పాదపద్మాలను స్మరిస్తూ, రాగద్వేషాలను వదలిపెట్టి అనుదినం నిత్యానందాన్ని అనుభవిస్తూ ప్రజలను గొప్పగా పరిపాలించాడు.

 

పంచమ స్కంధము - పూర్వ : ఆగ్నీధ్రాదుల జన్మంబు

 

విధంగా ప్రియవ్రతుడు రాజ్యం చేస్తూ విశ్వకర్మ ప్రజాపతి కుమార్తె అయిన బర్హిష్మతి అనే యువతిని పెళ్ళాడి ఆమెవల్ల శీలంలోను, ప్రవర్తనలోను, గుణంలోను, రూపంలోను, పరాక్రమంలోను, ఔదార్యంలోను తనతో సమానులైన ఆగ్నీధ్రుడు, ఇధ్మజిహ్వుడు, యజ్ఞబాహువు, మహావీరుడు, హిరణ్యరేతసుడు, ఘృతపృష్ఠుడు, సవనుడు, మేధాతిథి, వీతిహోత్రుడు, కవి అనే పదిమంది కొడుకులను, ఊర్జస్వతి అనే కుమార్తెను కన్నాడు. వారిలో కవి, మహావీరుడు, సవనుడు అనేవారు చిన్నవారైనా బ్రహ్మచర్యం అవలంబించి బ్రహ్మవిద్యా నిష్ణాతులై శాంతమే స్వభావంగా గలవారై పరమహంస యోగాన్ని పొందినారు. సమస్త జీవులకు ఆవాసమైనవాడు, సంసార భయ భ్రాంతులకు శరణ్యమైనవాడు, సర్వాంతర్యామి, భగవంతుడు అయిన వాసుదేవుని పాదపద్మాలను సర్వదా స్మరించడం వల్ల లభించిన భక్తియోగం ప్రభావంతో మనస్సు మరింత పరిశుద్ధం కాగా ఈశ్వర తాదాత్మ్యం పొందారు.

 

ప్రియవ్రతుడు మరొక భార్యవల్ల ఉత్తముడు, తామసుడు, రైవతుడు అనే ముగ్గురు కుమారులను కన్నాడు. వారు చాలా గొప్పవారు. మనువులై మన్వంతరాలకు అధిపతులయ్యారు. ముందు పుట్టిన కవి, మహావీరుడు, సవనుడు నాశనం లేని మోక్షపదాన్ని అందుకున్నారు. తరువాత ప్రియవ్రతుడు తన బాహుబలంతో సమస్త శత్రుసమూహాన్ని ఓడించాడు. బర్హిష్మతి మీద అతిశయించిన అనురాగంతో యౌవన వికాసాలైన హాసలీలావిలాసాలలో మనస్సును లగ్నం చేసి వివేకం కోల్పోయిన వానివలె అఖండ భోగాలను అనుభవించాడు.

 

ప్రియవ్రతుడు పదకొండు అర్బుద సంవత్సరాలు రాజ్యం చేసాడు. ఒకనాడు మేరు పర్వతానికి ప్రదక్షిణం చేస్తున్న సూర్యునికి ఆవలి భాగంలో కనిపించే చీకటిని రూపుమాపాలని అనుకున్నాడు. భగవంతుణ్ణి నిరంతరం ధ్యానించడం వల్ల కలిగిన శక్తితో సూర్యుని రథంతో సమానమై తేజోమయమైన రథం ఎక్కి రాత్రులను పగళ్ళుగా మారుస్తానంటూ రెండవ సూర్యునిలాగా వెలిగిపోతూ ఏడుమార్లు సూర్యుని చుట్టూ ప్రదక్షిణం చేసాడు. అప్పుడు ప్రియవ్రతుని రథచక్రాలు గాళ్ళ వలన పడిన దారులు సప్త సముద్రా లయ్యాయి. గాళ్ళకు నడుమ ఉన్న భూమిపై సప్తద్వీపాలు ఏర్పడ్డాయి.జంబూద్వీపం, ప్లక్షద్వీపం, శాల్మలీద్వీపం, కుశద్వీపం, క్రౌంచద్వీపం, శాకద్వీపం, పుష్కరద్వీపం అనేవి సప్తద్వీపాలు. వాటిలో జంబూద్వీపం ఒక లక్ష యోజనాల విస్తీర్ణం కలిగి ఉంటుంది. ఇలాగే ఒకదాని కొకటి రెట్టింపు వైశాల్యం కలిగి వరుసగా ఏడు ద్వీపాలు ఉన్నాయి. వాటి నడుమ ఉప్పు సముద్రం, చెరకు సముద్రం, మద్యసముద్రం, ఘృతసముద్రం, పాల సముద్రం, పెరుగు సముద్రం, మంచినీటి సముద్రం ఏడు సముద్రాలు ఉన్నాయి. ఒక ద్వీపంతో మరొక ద్వీపం కలిసిపోకుండా ఉండడానికి సముద్రాలు ఏర్పడ్డాయి. అవి ద్వీపాల చుట్టూ అగడ్తల లాగా ఉన్నాయి. ద్వీప సముద్ర నిర్మాణాలు సకల జీవులకు ఆశ్చర్య జనకాలు.

 

అటువంటి ద్వీపాలలో ప్రియవ్రతుడు తనంతటివారైన ఆగ్నీధ్రుడు, ఇధ్మజిహ్వుడు, యజ్ఞబాహువు, హిరణ్యరేతసుడు, ఘృతపృష్ఠుడు, మేధాతిథి, వీతిహోత్రుడు అనే కుమారులకు పట్టం కట్టించాడు. ఊర్జస్వతి అనే కన్యను భర్గుని కుమారుడైన శుక్రునికి ఇచ్చి పెళ్ళి చేసాడు. దంపతులకు దేవయాని అనే కన్యారత్నం పుట్టింది. తరువాత మహా పరాక్రమవంతుడైన ప్రియవ్రతుడు విరక్తుడై ఒకనాడు తన గురువైన నారదుని పాదసేవవల్ల ప్రాప్తించిన రాజ్యసంపదలను, సంసార బంధాలను తలచుకొని ఇలా అనుకున్నాడు.“అయ్యో! నేను ఇంద్రియాలకు కట్టుబడి బంధనాల నుండి తప్పించుకోలేక అజ్ఞానంతో నిండిన విషయసుఖాలనే చీకటినూతిలో పడిపోయాను. విలాసవతులైన సతులకు వినోదమృగంగా అయినాను. ఇక అటువంటి సుఖాలను నేను ఏమాత్రం ఇష్టపడనుఅని ప్రియవ్రతుడు నిశ్చయించుకున్నాడు. శ్రీహరి దయవల్ల అబ్బిన ఆత్మవిద్యను అందుకున్నాడు. తనవెంట వచ్చిన కుమారులందరికీ వారి వారి రాజ్యాలను స్థిరపరిచి, భార్యలను పరిత్యజించి, ధనాన్ని వదలుకొని, చిత్తంలో శ్రీహరిని నిలుపుకొని గొప్పదైన నారదుని స్థాయికి చేరాడు.

 

పంచమ స్కంధము - ఉత్తర : భూ ద్వీప వర్ష విస్తారములు

 

సముద్రాలు, ద్వీపాలు, వర్షాలు అన్నీ శ్రీహరి మాయవల్ల పుట్టిన వైభవాలే.పద్మాకారమైన భూమి మధ్య జంబూద్వీపం తామరరేకు వలె గుండ్రంగా కనిపిస్తుంది. అది లక్ష యోజనాల పొడవు, లక్షయోజనాల వెడల్పు కలిగి ఉంటుంది. దానిలో గుండ్రటి ఆకారాలతో తొమ్మిది వేల యోజనాల విస్తీర్ణం కలిగిన తొమ్మిది వర్షాలు ఉన్నాయి. వాటి నన్నిటినీ విభజించే సరిహద్దులుగా ఎనిమిది పర్వతాలు ఉన్నవి. తొమ్మిది వర్షాలలో నట్టనడుమ ఇలావృతం అనే వర్షం ఉంది. దాని నడుమ బంగారు రంగుతో కూడి మేరుపర్వతం భూమి పద్మానికి కర్ణిక వలె ప్రకాశిస్తున్నది. కులపర్వతాలకే రాజుగా కనిపిస్తుంది. దానిని చూచి దేవతలంతా ఆశ్చర్యపడతారు.

 

మేరు పర్వతం లక్ష యోజనాల ఎత్తు కలిగి ఉంది. దాని పాదప్రదేశం పదారువేల యోజనాల విస్తృతి కలిగి అంతే కొలత గల లోతు కలిగి ఉంది. అది పైన ముప్పది రెండు వేల యోజనాల విస్తృతి కలిగి ఉంది. దానికి ఉత్తరపు దిక్కులో నీలం, శ్వేతం, శృంగవంతం అనే పర్వతాలు ఆకాశాన్ని తాకుతూ నిలిచి ఉన్నాయి. వీని విస్తారము రెండు వేల యోజనాలు. ఇవి తూర్పు నుండి పడమర వరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు విస్తరించి ఉంటాయి.

 

తూర్పు పడమరలలో ఉప్పునీటి సముద్రం వరకూ ఉన్న సరిహద్దు పర్వతాలలో నీల శ్వేత శృంగవత్పర్వతాలు క్రమంగా ఒకదాని కంటె ఒకటి పది యోజనాలు తక్కువ పొడవు కలిగి ఉంటాయి. మూడు పర్వతాల నడిమి ప్రదేశంలో రమ్యకం, హిరణ్మయం, కురు అనే మూడు వర్షాలు ఉన్నాయి. అవి ఒక్కొక్కటి తొమ్మిది వేల యోజనాల విస్తృతి కలిగి ఉన్నాయి. ఇవన్నీ సముద్రం దాకా వ్యాపించి ఉన్నాయి. మూడు వర్షాల పొడవు నీల శ్వేత శృంగవత్పర్వతాల పొడవుతో సమానంగా ఉంటుంది. ఇలావృత వర్షానికి దక్షిణంగా మూడు సరిహద్దు పర్వతాలు ఉన్నాయి. అవే నిషధ పర్వతం, హేమకూట పర్వతం, హిమవత్పర్వతం. ఇవి తూర్పునుండి పడమటి వరకు పొడవు, ఉత్తరం నుండి దక్షిణం వరకు వెడల్పు కలిగి ఉన్నాయి. వీని నిడివి నీల శ్వేత శృంగవత్పర్వతాలతో సమానంగా ఉంటుంది. మూడు పర్వతాల నడుమ మూడు భూప్రదేశాలు ఉన్నాయి. అవే హరివర్షం, కింపురుషం, భారతవర్షం అనేవి. ఇలావృత వర్షానికి పడమట మాల్యవంతం, తూర్పున గంధమాదనం అనే సరిహద్దు పర్వాలున్నాయి. అవి తూర్పు పడమరలకు పొడవూ, ఉత్తర దక్షిణాలకు వెడల్పూ కలిగి నీలపర్వత నిషధపర్వతాలను ఆనుకొని ఉన్నాయి. వాని విస్తృతి రెండు వేల యోజనాలు. మాల్యవంతం, గంధమాదనం అనే రెండూ కేతుమాల భద్రాశ్వ వర్షాలకు సరిహద్దు పర్వతాలుగా ఉన్నాయి. సుమేరు పర్వతానికి తూర్పున మందర పర్వతం, దక్షిణాన మేరుమందర పర్వతం, పడమట సుపార్శ్వ పర్వతం, ఉత్తరాన కుముద పర్వతం ఉన్నాయి. నాలుగు పర్వతాలు పదివేల యోజనాలు ఎత్తు కలిగి ఉన్నవి. ఇన్నిటికి నడుమ మేరుపర్వతం ఎత్తుగా పొడుగైన స్తంభంలాగా ఉంటే మిగిలిన పర్వతాలు నాలుగు ప్రక్కల నాటిన పొట్టి గుంజల లాగా ఉన్నాయి. నాలుగు పర్వత శిఖరాల మీద పతాకాల లాగా క్రమంగా పెద్ద పెద్ద మామిడి చెట్లూ, నేరేడు చెట్లూ, కడిమి చెట్లూ, మఱ్ఱిచెట్లూ ఉంటాయి. వృక్షరాజాలు ఒక్కొక్కటి పదకొండు వందల యోజనాల పొడవు, నూరు యోజనాల వెడల్పు కలిగి ఉంటాయి. ఇంతేకాక నాలుగు పర్వత శిఖరాల మీద వంద యోజనాల విస్తీర్ణం కలిగిన నాలుగు పెద్ద పెద్ద సరోవరాలు ఉన్నాయి. క్రమంగా వాటి పేర్లు క్షీరసరస్సు, మధు సరస్సు, ఇక్షురస సరస్సు, నిర్మల జల సరస్సు. సరస్సులలో స్నానం చేసేవారికి స్వభావం చేతనే యోగనిష్ఠ, అణిమాది సిద్ధులు సిద్ధిస్తాయి. ఇంకా పర్వత శిఖరాలపై నందనం, చైత్రరథం, వైభ్రాజకం, సర్వతోభద్రం అనే దేవోద్యానాలు ఉన్నాయి. ఉద్యానవనాలలో దేవతలు దేవకాంతలతో కూడి గంధర్వుల ఆటపాటలను ఆలకిస్తూ, ఆలోకిస్తూ ఆనందంగా విహరిస్తారు.

 

మందర పర్వతం మీది మామిడి చెట్ల పండ్లు పర్వత శిఖరాలంత పెద్దవి. పండ్ల రుచి అమృతంతో సమానంగా ఉంటుంది. బాగా మాగిన పండ్లు చెట్లమీదనుండి కొండమీద రాలుతాయి. పండ్లు పడి పగిలినపుడు పండ్లరసం అద్భుతమైన మహాప్రవాహమై అరుణోదం అనే నదిగా ప్రవహిస్తుంది.మిక్కిలి తీయగా, సుగంధంతో కూడి, ఎఱ్ఱని రంగు కలిగిన రసాలు ప్రవహించే నది మందరాచలం నుండి బయలుదేరి తూర్పు వైపుగా ఇలావృత వర్షాన్ని ఒరుసుకుంటూ సాగిపోతుంది. నదీ తరంగాలు అందరినీ పవిత్రం చేస్తూ ఉంటాయి. నదీజలాలలో పార్వతీదేవి చెలికత్తెలు స్నానం చేస్తారు. వారి శరీరమందలి దివ్యపరిమళాన్ని గ్రహించిన వాయువు పదివేల యోజనాల పర్యంతం సుగంధాలను వెదజల్లుతుంది.మేరుమందర పర్వతం మీద నేరేడు పండ్లున్నాయి. పండ్లు పెద్ద ఏనుగులంత ఉంటాయి. చెట్లనుండి రాలిపడి పగిలిన పండ్ల రసమే ప్రవాహంగా కొండమీద జాలువారుతుంది.

 

నేరేడు పండ్ల రసం జంబూనదిగా ప్రవహిస్తూ ఇలావృత వర్ష ప్రదేశాన్ని తడుపుతూ భూభాగం మీద ప్రవహిస్తుంది. జంబూనదీ జలంతో బాగా నానిన మట్టి వాయు సూర్య సంపర్కంవల్ల పరిపక్వమై బంగారంగా మారిపోతుంది. కారణంగా బంగారానికి జాంబూనదం అనే పేరు వచ్చింది. మంచి వన్నె గల శుద్ధ సువర్ణాన్ని దేవతలు భూషణాలుగా చేసుకొని అలంకరించుకొంటారు.ఇంకా సుపార్శ్వమనే పర్వతం మీద పెద్ద కడిమి చెట్టున్నది. వృక్ష కోటరాల నుండి ఐదు మధుధారా ప్రవాహాలు ఐదు దిక్కులా ప్రవహిస్తూ ఉంటాయి. ఒక్కొక్క ప్రవాహం ఐదు బారల వెడల్పు కలిగి చిన్న నదిగా ఉంటుంది. ఐదు ప్రవాహాలు సుపార్శ్వ పర్వత శిఖరం మీదనుండి క్రిందికి ప్రవహిస్తూ ఇలావృత వర్షం పడమటి భాగాన్ని తడుపుతూ ఉంటాయి. ఐదు తేనె ప్రవాహాలను ఆస్వాదించినవారి ముఖాల నుండి వెలువడిన పరిమళం నూరు యోజనాల పర్యతం వ్యాపిస్తుంది.

 

కుముద పర్వత శిఖరం మీద బాగా పెరిగిన పెద్ద మఱ్ఱిచెట్టు ఉన్నది. చెట్టునుండి పాలు, పెరుగు, నేయి, తేనె, బెల్లం ఇంకా రకరకాల రుచులు కలిగిన ఆహార పదార్థాలు ఎప్పుడూ ఉత్పన్నమౌతూ ఉంటాయి. వస్త్రాలు, పాన్పులు, ఆసనాలు, నగలు మొదలైన వస్తువులను వటవృక్షం ప్రసాదిస్తుంది. కోరికలు తీర్చే మఱ్ఱిమాను ఇలావృత వర్షంలో నివసించే ప్రజల కందరికీ సమస్త విధాలైన సుఖ సంపత్తిని ప్రసాదిస్తుంది. ఆహార పదార్థాలను వాడడం వల్లను, ప్రదేశంలో అయాచితంగా దక్కే సుఖ భోగాలను అనుభవించడం వల్లను అక్కడ ఎవరికీ ముసలితనం రాదు. చర్మ ముడతలు పడదు. జుట్టు నెరసిపోదు. శరీర దుర్గంధం ఉండదు. మరణభయం అసలు లేదు. చలి, ఎండల బాధలు ఉండనే ఉండవు.దేవతలు, రాక్షసులు, దివ్య మునీంద్రులు, గంధర్వులు మొదలైన వారందరూ కుముద పర్వతాన్ని ఆశ్రయించి పట్టరాని సంతోషంతో విహరిస్తూ ఉంటారు.

 

మేరుపర్వతం తామరదుద్దు. దాని చుట్టూ కురంగం, కురరం, కుసుంభం, వైకంకతం, త్రికూటం, శిశిరం, పతంగం, రుచకం, విషధం, శితివాసం, కపిలం, శంఖం మొదలైన పర్వతాలు కేసరాలుగా ఉన్నాయి. మేరుపర్వతానికి తూర్పుభాగంలో జఠరగిరి, దేవకూటం అనే పర్వతాలున్నాయి. పడమట పవనగిరి, పారియాత్రం అనే పర్వతాలున్నాయి. నాలుగు పర్వతాలు ఒక్కొక్కటి దక్షిణం నుండి ఉత్తరం వరకు పద్దెనిమిది యోజనాల పొడవు, తూర్పు నుండి పడమటి వరకు రెండువేల యోజనాల వెడల్పు కలిగి ఉంటాయి. మేరువు చుట్టూ ఉన్న ఎనిమిది కొండలు అగ్నిహోత్రునికి ప్రదక్షిణం చేస్తున్న జ్వాలల వలె నిలిచి ఉన్నాయి. మేరుపర్వత శిఖరంలో బ్రహ్మపురం ఉంది. అది పదివేల యోజనాల పొడవు, అంతే వెడల్పు కలిగిన ప్రదేశం. అదంతా బంగారు భూమి. బ్రహ్మపురానికి ఎనిమిది దిక్కులలోను అష్టదిక్పాలకుల పట్టణాలున్నాయి.

 

బ్రహ్మపట్టణంలో నారాయణుడు త్రివిక్రమత్వాన్ని ప్రదర్శించాడు. అప్పుడాయన కాలిగోటి దెబ్బకు బ్రహ్మాండం పైభాగం చిట్లి బ్రద్దలయింది. విధంగా నారాయణుని ఎడమకాలి గోటిచేత బ్రహ్మాండం పైకప్పు బ్రద్దలు కాగా ఒక రంధ్రం ఏర్పడింది. అప్పుడు అంతవరకు వెలుపలి వైపు ప్రవహిస్తున్న జలధార అంతర్వాహినియై త్రివిక్రమదేవుని పాదాన్ని స్పృశిస్తూ ప్రవహించింది. ప్రవాహమే భగత్పాది అనే పేరుతో సకల లోకాల పాపాలను పరిహరిస్తూ చాలాకాలం స్వర్గంలో విహరించింది. ఉత్తానపాదుని కుమారుడు, భాగవతులలో అగ్రేసరుడు అయిన ధ్రువుడు తన ఇలవేల్పు అయిన శ్రీహరి పాదోదకాన్ని ప్రతిదినం నిమీళిత నేత్రుడై భక్తితో స్వీకరిస్తూ, ఆనంద బాష్పాలతో పులించిన దేహంతో ఎంతో ఆదరంతో నేటికీ తలపై చల్లుకొంటూ ఉంటాడు. ధ్రువునికి దిగువ భాగంలోనే మండలాధిపతులైన సప్తర్షు లున్నారు. వారు శ్రీమన్నారాయణుని పాదోదక ప్రభావం తెలిసికొని ఆకాశగంగలో స్నానం చేయడమే తమ తపస్సిద్ధి అని భావిస్తారు. అలా స్నానం చేయడం వల్ల తమ జన్మ చరితార్థ మౌతున్నట్లు విశ్వసిస్తారు. అఖిల జగత్తులో అంతర్యామిగా ఉన్న శ్రీమన్నారాయణునిపై భక్తి దృఢంగా నిలిపి, వేరే ప్రాపంచికమైన వస్తువులపై అపేక్ష లేకుండా, మోక్షం కోరే వ్యక్తి ముక్తిమార్గాన్ని గౌరవించినట్లు భక్తి గౌరవాలతో సప్తర్షులు ఆకాశగంగా జలాన్ని తమ జటాజూటాలలో ఈనాటికీ ధరిస్తూ ఉంటారు.

 

విష్ణుమూర్తి పాదంనుండి వినిర్గతమైన ఆకాశగంగ లెక్కలేనన్ని దివ్యవిమానాలతో నిండి సువిశాలంగా ఉండే దేవమార్గం గుండా వచ్చి చంద్రమండలాన్ని ఒరుసుకుంటూ మేరుపర్వత శిఖరాగ్రానికి చేరుకుంటుంది. అక్కడి బ్రహ్మపట్టణం నాలుగు ద్వారాల గుండా సీత, చక్షువు, భద్ర, అలకనంద అనే నాలుగు పేర్లతో నాలుగు విధాలుగా ప్రవహించి చివరకు లవణ సముద్రంలో కలిసిపోతుంది. గంగాజలాలు తమను దర్శించే వారికి, తమలో స్నానం చేసేవారికి అమృతత్వాన్ని ప్రసాదిస్తూ ఉంటాయి.సీత అనే పేరుతో ప్రఖ్యాతమైన నదీ ప్రవాహం బ్రహ్మపురం తూర్పుద్వారం నుంచి ప్రవహించి కేసరగిరి శిఖరాలను తడుపుతూ గంధమాదన పర్వతం మీదుగా సాగి భద్రాశ్వ వర్షాన్ని పవిత్రం చేస్తూ తూర్పువైపున లవణ సముద్రంలో ప్రవేశిస్తుంది. బ్రహ్మపురం పడమటి ద్వారం నుండి వెలువడిన చక్షువు అనే ప్రవాహం మాల్యవంత పర్వతాన్ని దాటి కేతుమూల వర్షాన్ని పవిత్రం చేస్తూ పడమటి సముద్రంలో సంగమిస్తుంది. బ్రహ్మపట్టణం ఉత్తరద్వారం గుండా వెలువడిన భద్ర అనే ప్రవాహం కుముదం, నీలం, శ్వేతం అనే పర్వత శిఖరాల మీదుగా ప్రవహిస్తూ, శృంగనగరం చేరుకొని అక్కడనుండి మానసోత్తరాలైన కురుభూములను పవిత్రం చేస్తూ ఉత్తర సముద్రంలో కలుస్తుంది. బ్రహ్మనగరం దక్షిణద్వారం నుండి వెలువడిన అలకనందా ప్రవాహం మిక్కిలి దుర్గమాలైన పర్వత పంక్తుల గుండా ప్రవహించి హేమకూటం, హిమకూటం అనే పర్వతాలను దాటి వచ్చి మిక్కిలి ఉరవడితో కర్మక్షేత్రమైన భారతవర్షాన్ని పవిత్రం చేస్తూ దక్షిణ సముద్రంలో కలుస్తుంది.

 

ప్రపంచంలో మేరువు వంటి పర్వతాలకు పుత్రికలేమో అన్నట్లుగా వేల కొలది పుణ్యతీర్థాలు ఉన్నాయి. జంబూద్వీపంలో భారతవర్షం కర్మభూమి. తక్కిన వర్షాలు భోగభూములు. స్వర్గం నుండి భూమికి దిగి వచ్చినవారు అక్కడ పుణ్యఫలాలను అనుభవిస్తారు.భూలోకస్వర్గం వంటి వర్షాలలో జీవించేవారు పదివేల సంవత్సరాల ఆయుర్దాయం కలిగి ఉంటారు. పదివేల ఏనుగుల బలం కలిగి ఉంటారు. దేవతలతో సమానులుగా ఉంటారు. వజ్రాలవంటి దృఢమైన దేహాలు కలిగి ఉంటారు. ఎంతో సంతోషంతో జీవిస్తారు. వారి ప్రవర్తనలో ఎటువంటి పొరపాట్లు ఉండవు. వారు పూజ్యులు, పుణ్యాత్ములు.

 

ఇంకా ఎనిమిది వర్షాలలో ఉన్నవారు సురత సుఖానంద పరవశులై మోక్షాన్ని సైతం కోరుకోరు. అక్కడి స్త్రీలు ఎప్పుడైనా ఒకసారి మాత్రమే బిడ్డలను కంటూ ఉంటారు. అక్కడ ఎల్లప్పుడూ త్రేతాయుగమే ప్రవర్తిస్తూ ఉంటుంది. ఎనిమిది వర్షాలలోను దేవతలు తమ సేవకులు చేసే ఉపచారాలను గ్రహిస్తూ విహరిస్తూ ఉంటారు. అన్ని ఋతువులలోను చివుళ్ళతో, పువ్వులతో, ఫలాలతో నిండిన తీగెలు, వృక్షాలు గల వనాలు అక్కడ ఉంటాయి. సరోవరాలలో వికసించిన పద్మాలు ఉంటాయి. పద్మాల పరిమళం ఆఘ్రాణిస్తూ రాజహంసలు, కలహంసలు విహరిస్తూ ఉంటాయి. నీటికోళ్ళు, కొక్కెరలు, బెగ్గురు పక్షులు, జక్కవలు కొలకులలో ఈదులాడుతూ ఉంటాయి. మత్తెక్కిన తుమ్మెదలు ఝంకారాలు చేస్తుంటాయి. అటువంటి వనాలలో, సరస్సులలో, కొండ లోయలలో దేవతాస్త్రీలు విహరిస్తూ విలాసంగా ఆడుతూ, పాడుతూ, పకపక నవ్వుతూ, ప్రక్కచూపులు చూస్తూ, కామేద్రేకం కలిగిస్తూ సంచరిస్తూ ఉంటారు. వారి విలాస చేష్టలకు ఆకర్షితులైన పురుషులు అక్కడ స్వేచ్ఛావిహారాలు చేస్తుంటారు.

 

తొమ్మిది వర్షాలలోను జీవులకు సరియైన జ్ఞానం అనుగ్రహించడం కోసం నారాయణుడు అనేక లీలావిలాసాలు ప్రదర్శిస్తూ సంచరిస్తూ ఉంటాడు.ఇలావృత వర్షానికి త్రిపురాసుర సంహారకుడైన శివుడు అధిపతి. ఇలావృత వర్షంలో పార్వతీదేవి విహరించే ఉద్యానవనం ఉంది. పార్వతి శాపం వల్ల వనంలోనికి పురుషు లెవరైనా ప్రవేశిస్తే స్త్రీలుగా మారుతారు. అక్కడ పార్వతీదేవి వేలకొలది చెలికత్తెలతో వచ్చి ప్రతినిత్యం పరమేశ్వరుణ్ణి పరమభక్తితో సేవిస్తూ ఉంటుంది. ఇలావృతవర్షంలోని జనులు ఎంతో సంతోషంతో ఆయా మంత్ర తంత్రాలతో పరమేశ్వరుణ్ణి పూజించి సదా సంస్మరించి తరిస్తూ ఉంటారు.భద్రాశ్వ వర్షానికి భద్రశ్రవుడు అధిపతి. అతడు మేరుపర్వతం వంటి ధైర్యం కలవాడు. అతడు సముద్రాలు హద్దుగా గలిగిన భూమిని పరిపాలించాడు. భద్రశ్రవుని ఇష్టదైవమైన హయగ్రీవ మూర్తిని ధ్యానాలతో, జపాలతో, స్తోత్రాలతో, అనుష్ఠానాలతో సజ్జనులు సేవించి తరిస్తూ ఉంటారు. హయగ్రీవ తత్త్వాన్ని ప్రకాశింపజేసే ప్రధాన మంత్రాల మహిమతో వర్షంలోని వారు హయగ్రీవుని అర్చించి, స్తుతించి, ధ్యానించి ముక్తిని పొందుతున్నారు.

 

హరివర్షానికి అధిపతి నరసింహుడు. అక్కడున్న జనులు దైత్య దానవ వంశాలలో ఉత్తములైనవారు. వారు ఎల్లప్పుడూ ప్రహ్లాదుడు మొదలైన పెద్దలతో కలిసి స్నానం చేసి శుచులై నరసింహుని సేవిస్తూ ఉంటారు. రమణీయాలైన పట్టుబట్టలు కట్టుకొని నరసింహ తత్త్వాన్ని ప్రకాశింపజేసే మంత్రం జపిస్తూ, మంత్రానికి సంబంధించిన తంత్ర కార్యాలను నిర్వహిస్తూ, నరసింహునికి ప్రీతిపాత్రమైన ధ్యానాలు, జపాలు, తపాలు, స్తోత్రాలు చేస్తూ నిలుకడ గల బుద్ధితో స్వామిని సేవిస్తూ ఉంటారు. స్వామి కరుణకు పాత్రులై ఇహపర సుఖాలను అనుభవిస్తూ ఉంటారు.

 

ఇంకా కేతుమాల వర్షంలో భగవంతుడు శ్రీదేవిని సంతోషపెట్టడం కోసం మన్మథరూపంలో సాక్షాత్కరిస్తాడు. కామదేవుని అస్త్ర ప్రభావం వల్ల ప్రజాపతి కుమార్తెలైన రాత్రులకు అధిదేవతలైనవారి గర్భాలు సంవత్సరకాలం సంరక్షింపబడి నప్పటికీ నిర్జీవములై స్రవిస్తాయి. కామదేవుని రూపంలో ఉన్న శ్రీహరి తన నడకల సొగసులతో, విలాస వీక్షణాలతో, అందమైన కనుబొమలతో, పద్మాలవంటి మనోహర ముఖ కాంతులతో రమాదేవిని సంతోషపెడతాడు. భగవంతుని మాయకు ప్రతిరూపమైన శ్రీదేవి కూడా ప్రజాపతి పుత్రికలు, పుత్రులు అయిన రాత్రులతో, పగళ్ళతో కామదేవుణ్ణి స్తుతిస్తూ, పూజలు చేస్తూ, ధ్యానిస్తూ, ఆరాధిస్తూ ఉంటుంది.

 

ఇంకా రమణీయమైన రమ్యక మనే వర్షానికి మత్స్యరూపుడైన హరి అధిదేవత. రమ్యక వర్షానికి మనువు అధిపతి. అతడు తన కొడుకులతో, మంత్రులతో మత్స్యరూపుడైన శ్రీహరిని సాటిలేని భక్తితో ఆరాధిస్తూ ఉంటాడు.అక్కడి జనులు మత్స్యమూర్తిని ప్రకాశింపజేసే మంత్రాలతో, స్తోత్రాలతో అర్చిస్తూ, ధర్మకార్యాలు నిర్వహిస్తూ, అగ్నికార్యాలు నెరవేరుస్తూ పుణ్యాత్ములై భక్తి ముక్తులను ఆనందంగా అనుభవిస్తారు.

 

హిరణ్మయ వర్షానికి కూర్మావతారం ధరించిన శ్రీహరి అధిదేవత. పాపరహితుడు, పితృదేవతలకు అధిపతి, మహాత్ముడు అయిన ఆర్యముడు దానిని పరిపాలిస్తూ ఉంటాడు.ఆర్యముడు హిరణ్మయ వర్షంలోని జనులతో కలిసి కూర్మరూపుడైన శ్రీహరిని మనస్సులో ధ్యానిస్తూ, సంస్తుతిస్తూ భుక్తి ముక్తులను అందుకుంటాడు.ఉత్తర కురువర్షానికి వరాహదేవుడు అధిపతి. అక్కడ భూదేవి వరాహ రూపుడైన శ్రీహరిని మనస్సులో నిలుపుకొని పూజలు చేస్తుంటుంది. ఉత్తర కురువర్షంలోని ప్రజలు వరాహమూర్తిని అనుదినమూ సేవిస్తూ, సంభావిస్తూ, సంస్తుతులు గావిస్తూ మోక్షపదాన్ని చేరుకొంటారు.

 

కింపురుష వర్షానికి సీతా లక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రుడు అధిదేవత.అటువంటి కింపురుష వర్షంలో అంజనాదేవి కుమారుడైన ఆంజనేయుడు కింపురుష గణాలతో కూడి మహనీయాలైన మంత్ర స్తోత్రాలతో శ్రీరామచంద్రుని ఆరాధిస్తూ ఉంటాడు.

 

భారతవర్షానికి బదరికాశ్రమవాసి అయిన నారాయణుడు అధిపతి. భారతవర్షంలోని వారు మహాత్ములైన నారదాది మునుల సాంగత్యంతో సాంఖ్యయోగాన్ని ఉపదేశంగా పొంది తమ జన్మలను సార్థకం చేసుకొంటారు. నారాయణ దేవుణ్ణి ఆరాధించి దేవునికి ప్రియమైన మంత్ర స్తోత్రాదులతో పూజలు చేస్తారు. భక్తితో మ్రొక్కి ముక్తి దక్కించుకొంటారు.భారతవర్షంలో లెక్కలేనన్ని పుణ్యపర్వతాలు ఉన్నాయి. అంతేకాక లోతయిన నదీప్రవాహాలు కూడా ఉన్నాయి.భారతవర్షంలో మలయం, మంగళప్రస్థం, మైనాకం, త్రికూటం, ఋషభం, కూటరం, గోల్లం, సహ్యాద్రి, వేదాద్రి, ఋశ్యమూకం, శ్రీశైలం, వేంకటాద్రి, మహేంద్రగిరి, మేఘపర్వతం, వింధ్యపర్వతం, శుక్తిమంతం, ఋక్షగిరి, పారియాత్రం, ద్రోణగిరి, చిత్రకూటం, గోవర్ధనం, రైవతకం, కుకుంభం, నీలగిరి, కాకముఖం, ఇంద్రకీలం, రామగిరి మొదలైనవి ప్రసిద్ధ పర్వతాలు. పర్వతాలకు పుత్రికల వంటివైన చంద్రవట, తామ్రపర్ణి, అవటోద, కృతమాల, వైహాయసి, కావేరి, వేణి, పయస్విని, పయోద, శర్కరావర్త, తుంగభద్ర, కృష్ణవేణి, భీమరథి, గోదావరి, నిర్వింధ్య, పయోష్ణ, తాపి, రేవా, శిలా, సురస, చర్మణ్వతి, వేదస్మృతి, ఋషికుల్య, త్రిసమ, కౌశికి, మందాకిని, యమున, సరస్వతి, దృషద్వతి, గోమతి, సరయువు, భోగవతి, సుషమ, శతద్రువు, చంద్రభాగ, మరుద్వృథ, వితస్త, అసిక్ని, విశ్వ మొదలైనవి ప్రధానమైన నదులు. నర్మద, సింధు, శోణ అనేవి నదాలు. ఇటువంటి మహానదులు భారతవర్షంలో ఎన్నో ఉన్నాయి. వీటిలో స్నానం చేసిన మానవులకు ముక్తి కరతలామలకం. భారతవర్షంలో పుట్టిన మానవులు మూడు విధాలైన కర్మలను చేస్తుంటారు. కొన్ని తెల్లనివి, కొన్ని ఎఱ్ఱనివి, కొన్ని నల్లనివి. తెల్లనివి సత్త్వగుణ ప్రధానమైన కర్మలు. ఎఱ్ఱనివి రజోగుణ ప్రధానమైన కర్మలు. నల్లనివి తమోగుణ ప్రధానమైన కర్మలు. ఇటువంటి కర్మల కారణంగా భారతవర్షంలో పుట్టిన ప్రజలు క్రమంగా దేవలోకం, మానవలోకం, నరకలోకం చేరుకొంటారు. ఇంకా విను. రాగద్వేషాలు లేనివాడు, వాక్కులకు కాని మనస్సుకు కాని అందనివాడు, సర్వానికి తానే ఆధారమైనవాడు అయిన శ్రీవాసుదేవమూర్తియందు హృదయం పదిలంగా నిలుపుకొని భక్తితో ఆరాధించేవారు ఉత్తమగతిని తప్పక పొందుతారు. అటువంటి మహాత్ములు అజ్ఞానం రూపుమాసి పోగా పరమ భాగవతులు పొందే పుణ్యలోకాలకు యోగ్యు లవుతారు. అందువల్ల మహాపురుషులు భారతవర్షం ఉత్తమోత్తమ మైనదని విధంగా కొనియాడుతూ ఉంటారు.

 

భారతవర్షంలో పుట్టిన జీవుల అదృష్టమే అదృష్టం. భారతవర్షంలోనే శ్రీమన్నారాయణుడు ఎన్నో అవతారాలను ఎత్తాడు. ఇందలి మానవులకు తత్త్వం ఉపదేశించాడు. వారితో స్నేహం చేసాడు. ఆత్మబంధువు వలె జీవుల కష్టసుఖాలలో భాగం పంచుకొని వారిని కృతార్థులను చేసాడు.భారతవర్షంలో పుట్టిన జనులకు సాధ్యం కానిదంటూ లేనే లేదు. శ్రీమన్నారాయణుని సంస్మరణం సమస్త పాపాలను పటాపంచలు చేస్తుంది. అతని స్మరణం లేని యజ్ఞాలు, తపస్సులు, దానాలు నిరర్థకాలు. వాటివల్ల పాపాలు పోవు. పునర్జన్మ మళ్ళీ వస్తుందేమో అన్న భయంతో ఇతర ప్రదేశాలలో బ్రహ్మకల్పం చివరిదాకా జీవించటం కంటే భారతవర్షంలో క్షణకాలం జీవించి సర్వసంగ పరిత్యాగం చేసినట్లయితే అటువంటి పురుషశ్రేష్ఠునికి శ్రీమన్నారాయణ పదప్రాప్తి చాల సులభంగా దక్కుతుంది. అందుచేత అందరూ భారతవర్షంలో జన్మించాలని కోరుకుంటారు. అదీగాక స్థలంలో వైకుంఠనిలయుని పుణ్యకథల వాసన ఆవంత అయినా ఉండదో, ప్రదేశంలో పుణ్యపురుషులైన భాగవతోత్తములు ఉండరో, స్థలంలో యజ్ఞేశ్వరుని ఉత్సవాలు జరుగవో అటువంటి ప్రదేశం దేవేంద్ర లోకమైనా ప్రదేశంలో నివసించరాదు. మానవజన్మ ఎత్తి జ్ఞానం, సదనుష్ఠానం, ద్రవ్యసంపత్తి అన్నీ ఉండికూడా తపస్సు ద్వారా ముక్తి అందుకోలేని మానవులు పశువులలాగా తమకు తామే బంధనాల పాలవుతారు. భారతవర్షంలోని ప్రజలు శ్రద్ధతో యజ్ఞాలు నిర్వహించినట్లయితే, హోమాలలోని హవిస్సును అనేక నామాలతో పుండరీకాక్షుడు అందుకొని ప్రసన్నుడై వారికి తనమీది భక్తిని అతిశయింప జేస్తాడు. భారతవర్షంలోని ప్రజలమీద అపరిమితమైన అనుగ్రహం ప్రకటిస్తూ, భగవంతుడు ఇహపర సౌఖ్యాలను వారికి ప్రసాదిస్తాడు. జంబూద్వీపంలోని సగరుని కుమారులు అపహరింపబడిన అశ్వమేధాశ్వాన్ని వెదకుతూ నలువైపులా భూమిని త్రవ్వినపుడు ఎనిమిది ఉపద్వీపాలు ఏర్పడ్డాయి. అవే స్వర్ణప్రస్థం, చంద్రశుక్లం, ఆవర్తనం, రమణకం, మందేహారుణం, పాంచజన్యం, సింహళం, లంక అనేవి.

 

జంబూద్వీపం లక్షయోజనాల వైశాల్యం కలిగి ఉంది. దాని చుట్టూ అంతే ప్రమాణం గల లవణసముద్రం ఉంది. తరువాత ప్లక్షద్వీపం రెండు లక్షల యోజనాల విస్తృతి కలిగి ఉంది. దానిని అంతటి పరిమాణం గల చెరకు రస సముద్రం పరివేష్టించి ఉంటుంది. ప్లక్షద్వీపం నట్టనడుమ ఒక పెద్ద జువ్విచెట్టు ఉంది. చెట్టు కారణంగానే దానికి ప్లక్షద్వీపం అనే పేరు వచ్చింది. ద్వీపంలో నివసించే వారికి అగ్నిదేవుడు అధిదేవత. ద్వీపాన్ని ప్రియవ్రతుని కుమారుడైన ఇధ్మజిహ్వుడు పరిపాలిస్తున్నాడు.ఇధ్మజిహ్వుడు ప్లక్షద్వీపాన్ని ఏడు వర్షాలుగా విభజించాడు. వర్షాల పేర్లు కలిగిన తన ఏడుగురు కుమారులు శివుడు, యశస్యుడు, సుభద్రుడు, శాంతుడు, క్షేముడు, అభయుడు, అమృతుడు అనే వారిని వాటికి అధిపతులను చేసాడు. తరువాత ఇధ్మజిహ్వుడు నిస్సంగుడై తపస్సుకై అడవికి వెళ్ళిపోయాడు. విభజింపబడిన ఒక్కొక్క వర్షంలో ఒక్కొక్క కులపర్వతం, ఒక్కొక్క మహానది ఉన్నాయి. విధంగా సప్తవర్షాలలో వరుసగా మణికూటం, వజ్రకూటం, ఇంద్రసేనం, జ్యోతిష్మంతం, ధూమ్రవర్ణం, హిరణ్యగ్రీవం, మేఘమాలం అనేవి కులపర్వతాలు. అరుణ, సృమణ, అంగిరసి, సౌమిత్రి, సుప్రభాత, ఋతంభర, సత్యంభర అనేవి మహానదులు. నదులలో స్నానం చేసి నాలుగు వర్ణాలవారు పాపం పోగొట్టుకుంటారు. నాలుగు వర్ణాలవారిని హంసులు, పతంగులు, ఊర్ధ్వాయనులు, సత్యాంగులు అని వ్యవహరిస్తారు. ప్లక్షద్వీపంలో నివసించే పురుషుల ఆయుర్దాయం వేయి సంవత్సరాలు. వారు దేవతలతో సమానమైనవారు. కేవలం చూపుతోనే శ్రమ స్వేదాదులు లేని సంతానాన్ని అనుగ్రహింపగలవారు. వేదస్వరూపుడు, స్వర్గానికి ద్వారమైనవాడు, భగవంతుడు అయిన సూర్యుణ్ణి వారు ఋగ్యజుస్సామ వేద మంత్రాలతో సేవిస్తుంటారు. ప్లక్షద్వీపం మొదలైన ముందు చెప్పబోయే ఐదు ద్వీపాలలోని పురుషులకు ఆయుర్బలం, ఇంద్రియపటుత్వం, తేజోబలం పుట్టుకతోనే సంక్రమిస్తాయి.

 

ప్లక్షద్వీపం చుట్టూ రెండు లక్షల యోజనాల విస్తృతి కలిగిన చెరకురస సముద్రం ఉంది. దీనికి రెట్టింపు విస్తృతితో శాల్మలీ ద్వీపం ఉంది. ద్వీపంలో ఉన్న శాల్మలీవృక్షం (బూరుగు చెట్టు) ప్లక్షద్వీపంలోని జువ్విచెట్టంత ఉంది. బూరుగు చెట్టు దిగువభాగంలో పక్షులకు రాజైన గరుత్మంతుడు స్థిరనివాసం చేస్తుంటాడు. ప్రియవ్రతుని కుమారుడైన యజ్ఞబాహువు ద్వీపాన్ని పరిపాలిస్తుంటాడు. అతడు తాను పాలించే భూభాగాన్ని ఏడు వర్షాలుగా విభజించాడు. ఒక్కొక్క వర్షంలో ఒక్కొక్క పర్వతం, ఒక్కొక్క నది ఉన్నాయి. అతడు సురోచనుడు, సౌమనస్యుడు, రమణకుడు, దేవబర్హుడు, వారిబర్హుడు, ఆప్యాయనుడు, అభిజ్ఞాతుడు అనే తన ఏడుగురు కుమారులను వారి పేర్లతోనే వ్యవహరింపబడే ఏడు వర్షాలకు అభిషిక్తులను చేసాడు. ఏడు వర్షాలలో స్వరసం, శతశృంగం, వామదేవం, కుముదం, ముకుందం, పుష్పవర్షం, శతశ్రుతి అనే పర్వతాలు; అనుమతి, సినీవాలి, సరస్వతి, కుహువు, రజని, నంద, రాక అనే ఏడు మహానదులు ఉన్నాయి. వర్షంలోని పురుషులు శ్రుతధరులు, విద్యధరులు, ఇధ్మధర్ములు అని పిలువబడతారు. వారు భగవత్ స్వరూపుడు, వేదమయుడు, ఆత్మస్వరూపుడు అయిన సోముణ్ణి వేదమంత్రాలతో ఆరాధిస్తారు. ద్వీపం చుట్టూ నాలుగు లక్షల యోజనాల విస్తృతి కలిగిన సురా (కల్లు) సముద్రం ఉంది.

 

సురాసముద్రం ఆవల కుశద్వీపం ఉంది. అది ఎనిమిది లక్షల యోజనాల విస్తృతి కలిగింది. దాని మధ్య ఒక పెద్ద కుశస్తంబం (దర్భదుబ్బు) మొలిచి ఎత్తుగా పెరిగి ఉంది. అది దివ్యకాంతులతో దిక్కులను వెలిగింపజేస్తుంది. కారణం వల్లనే దీనికి కుశద్వీపం అనే పేరు కలిగింది. ప్రియవ్రతుని పుత్రుడు హిరణ్యరేతసుడు అనేవాడు దీనికి అధిపతి. అతడు తన కుమారుల పేర్లతో ద్వీపాన్ని ఏడు వర్షాలుగా విభజించాడు. విధంగా హిరణ్యరేతసుడు వసుదానుడు, దృఢరుచి, నాభి, గుప్తుడు, సత్యవ్రతుడు, విప్రుడు, వామదేవుడు అనే కుమారుల పేర్లతో ఏడు వర్షాలను ఏర్పాటు చేసి వారిని అందులో నియమించి తపస్సు చేయడానికి వెళ్ళిపోయాడు. కుశద్వీపంలోనివర్షములలో బభ్రువు, చతుశ్శృంగం, కపిలం, చిత్రకూటం, దేవానీకం, ఊర్ధ్వరోమం, ద్రవిణం అనే ఏడు పర్వతాలు, రసకుల్య, మధుకుల్య, శ్రుతనింద, మిత్రవింద, దేవగర్భ, ఘృతచ్యుత, మంత్రమాల అనే ఏడు మహానదులు ఉన్నాయి. కుశలులు, కోవిదులు, అభియుక్తులు, కులకులు అనే నాలుగు వర్ణాలవారు పవిత్ర నదీజలాలలో స్నానం చేసి శుచులై భగవంతుడైన యజ్ఞపురుషుని ఆరాధిస్తుంటారు.

 

కుశద్వీపం చుట్టూ ఎనిమిది లక్షల యోజనాల పరిమాణం కలిగిన ఘృత (నేతి) సముద్రం ఉన్నది. నేతి సముద్రం ఆవల పదునారు లక్షల యోజనాల విస్తృతి కలిగిన అందమైన క్రౌంచద్వీపం ఉన్నది. ద్వీపం మధ్యభాగంలో క్రౌంచాద్రి ఉన్నది. పర్వతం వల్లనే ద్వీపానికి పేరు వచ్చింది. ఒకసారి షణ్ముఖుడు దివ్యశరాన్ని ప్రయోగించగా అది క్రౌంచపర్వతానికి కన్నం చేస్తూ దూసుకుపోయింది. కన్నంగుండా పాలవెల్లి ప్రవాహం వెలువడింది. ప్రవాహమే క్రౌంచద్వీపాన్ని తడుపుతూ ఉంది. వరుణదేవుడు ప్రదేశాన్ని కాపాడుతూ ఎవరికీ ఏమాత్రం భయం లేకుండేవిధంగా చూస్తూ ఉంటాడు.

 

ప్రియవ్రతుని కుమారుడైన ఘృతపృష్ఠుడు క్రౌంచద్వీపానికి అధిపతి. అతనికి ఆమోదుడు, మధువహుడు, మేఘపృష్ఠుడు, సుదాముడు, ఋషిజ్యుడు, లోహితార్ణుడు, వనస్పతి అని ఏడుగురు కుమారులున్నారు. అతడు తన కుమారుల పేరు మీదుగా క్రౌంచద్వీపాన్ని ఏడు వర్షాలుగా విభజించి ఒక్కొక్క వర్షానికి ఒక్కొక్క కుమారుని రాజుగా నియమించాడు. తరువాత తాను మంగళ గుణనిలయుడైన శ్రీహరి పాదపద్మాలను సేవిస్తూ తపం చేయడానికి అడవులకు వెళ్ళాడు. క్రౌంచద్వీపంలోని ఏడు వర్షాలలో శుక్లం, వర్ధమానం, భోజనం, ఉపబర్హణం, ఆనందం, నందనం, సర్వతోభద్రం అనే ఏడు కొండలు; అభయ, అమృతౌఘ, ఆర్యక, తీర్థవతి, తృప్తిరూప, పవిత్రగతి, శుక్ల అనే ఏడు నదులు ఉన్నాయి. నదీజలాలలో స్నానం చేసి గురువులు, ఋషభులు, ద్రవిణకులు, దేవకులు అనే నాలుగు వర్ణాలవారు జలాంజలులను సమర్పిస్తూ వరుణదేవుని సేవిస్తూ ఉంటారు.క్రౌంచద్వీపం చుట్టూ పదునారు వేల యోజనాల విస్తృతిలో పాలసముద్రం ఉంది. క్రౌంచద్వీపానికి ఆవల శాకద్వీపం ప్రసిద్ధి పొందిన ద్వీపం. ద్వీపం ముప్పదిరెండు లక్షల యోజనాల విస్తృతి కలిగింది. ద్వీపంలో ఒక పెద్ద శాకవృక్షం ఉంది. దాని సుగంధంవల్ల ద్వీపమంతా పరిమళవంతంగా ఉంటుంది. కారణంగానే ద్వీపానికి శాకద్వీపం అనే పేరు వచ్చింది. ద్వీపానికి ప్రియవ్రతుని కుమారుడైన మేధాతిథి అధిపతి.

 

ప్రియవ్రతుని కుమారుడైన మేధాతిథి తన కుమారులైన పురోజనుడు, మనోజనుడు, వేపమానుడు, ధూమ్రానీకుడు, చిత్రరథుడు, బహురూపుడు, విశ్వాచారుడు అనే ఏడుగురి పేర శాకద్వీపాన్ని ఏడు వర్షాలను విభజించి, వారికి పట్టంగట్టి తాను శ్రీహరి పాదసేవ చేస్తూ తపోవనానికి వెళ్ళాడు. ఏడు వర్షాలలో క్రమంగా ఈశానం, ఉరుశృంగం, బలభద్రం, శతకేసరం, సహస్రస్రోతం, దేవపాలం, మహానసం అనే ఏడు సరిహద్దు పర్వతాలు; అనఘ, ఆయుర్ద, ఉభయసృశ్టి, అపరాజిత, పంచపరి, సహస్ర సృతి, నిజధృతి అనే ఏడు నదులు ఉన్నాయి. ద్వీపవాసులు నదీ జలాలను సేవిస్తూ ప్రాణాయామం చేస్తూ రజోగుణ, తమోగుణాలను నశింపజేసికొని సమాధి నిష్ఠులై వాయురూపుడైన భగవంతుని ఆరాధిస్తారు. అక్కడ ఋతవ్రతులు, సత్యవ్రతులు, దానవ్రతులు, సువ్రతులు అనే నాలుగు వర్ణాలవారు ఉన్నారు.

 

శాకద్వీపం చుట్టూ అంతే పరిమాణం కలిగిన దధి (పెరుగు) సముద్రం ఉంది. దాని తర్వాత అరవైనాలుగు లక్షల యోజనాల విస్తృతి కలిగిన పుష్కరద్వీపం ఉంది. మహాద్వీపంలో పదివేల బంగారు రేకులు కలిగి బ్రహ్మదేవునికి ఆసనమైన పద్మం ఉంది. ద్వీపం నడుమ మానసోత్తరం అనే పెద్ద పర్వతం ఉంది. తూర్పు పడమరలలో గల రెండు వర్షాలకు మానసోత్తరం సరిహద్దు పర్వతం. విధంగా లోపల వెలుపల ఉన్న వర్షాలకు సరిహద్దుగా ఉన్న మానసోత్తర పర్వతం పదివేల యోజనాల విస్తీర్ణం, అంతే ఎత్తు కలిగి ఉంది. పర్వతానికి నాలుగు దిక్కులలోను నలుగురు లోకపాలకుల పట్టణాలు ఉన్నాయి. మానసోత్తర పర్వత శిఖరంపై సంవత్సరాత్మకమైన సూర్యరథచక్రం తిరుగుతూ రాత్రింబగళ్ళు మేరువునకు ప్రదక్షిణం చేస్తూ ఉంటుంది. పుష్కరద్వీపానికి అధిపతి వీతిహోత్రుడు. అతనికి రమణకుడు, ధాతకుడు అని ఇద్దరు కుమారులు. వీతిహోత్రుడు పుష్కరద్వీపాన్ని రెండు వర్షాలుగా విభజించి వాటికి తన కొడుకులను రాజులను చేసాడు. తన అన్నల అడుగు జాడల్లో వీతిహోత్రుడు భగవత్ప్రీతికరాలైన కార్యాలను ఆచరిస్తూ తపోవనానికి వెళ్ళిపోయాడు.

 

పుష్కరద్వీపంలో నివసించే పురుషులు వేదోక్త కర్మలను ఆచరిస్తూ బ్రహ్మదేవుణ్ణి కొలుస్తుంటారు. వారు నిశ్చలమైన బుద్ధిబలం, నియమ నిష్ఠలు కలవారు.పుష్కరద్వీపంలో నాలుగు వర్ణాల విభాగం లేదు. అక్కడి వారంతా భేదభావం లేకుండా సమభావంతో కలిసి మెలిసి సంచరిస్తారు.ఇంకా పుష్కరద్వీపం అరవై నాలుగు లక్షల యోజనాల విస్తృతి కలిగి ఉంటుంది. దాని చుట్టూ అంతే విస్తీర్ణం కలిగి పరిశుద్ధమైన జలంతో నిండిన సముద్రం ఉంది. సముద్రానికి ఆవల లోకాలోకం అనే పర్వతం ఉంది. సముద్రానికి పర్వతానికి మధ్యగల ప్రదేశం రెండు కోట్ల యోజనాల విస్తీర్ణం కలిగి ఉంటుంది. అక్కడ మానవ సంచారం లేదు. భూమి అద్దంలాగా స్వచ్ఛంగా ఉంటుంది. అది దేవతల నివసించడానికి ప్రయత్నించినా చేతికందదు. పైన ఎనిమిది కోట్ల యోజనాల ప్రదేశం బంగారు భూమిలాగా ప్రకాశిస్తూ ఉంటుంది. సూర్యుని నుండి ధ్రువతార వరకు వ్యాపించిన జ్యోతిర్గణం మధ్య ఉండడం వల్ల పర్వతానికి లోకాలోక పర్వతమనే పేరు సార్థకం అవుతున్నది. భూమండలమంతా యాభైకోట్ల యోజనాల విస్తృతి కలిగి ఉందు. అందులో నాల్గవవంతు లోకాలోక పర్వతం. పర్వతం మీద సకలలోక గురుడైన బ్రహ్మదేవుడు ఋషభం, పుష్కరచూడం, వామనం, అపరాజితం అనే దిగ్గజాలను లోకరక్షణార్థం నిలిపి ఉంచాడు.

 

లోకాలోక పర్వతం మీద ఆదిదేవుడు, జగద్గురుడు, భగవంతుడు అయిన శ్రీమన్నారాయణుడు లోకాలను రక్షించడం కోసం యోగమాయా సమేతుడై కల్పాంత పర్యంతం ఉంటాడు. దేవతల సమూహమంతా అతని వైభవ స్వరూపమే. దేవతల తేజస్సును, పరాక్రమాన్ని విస్తరింపజేయడం కోసం విష్ణు భగవానుడు ధర్మం, జ్ఞానం, వైరాగ్యం అనే విభూతులతో ప్రకాశించే విష్వక్సేనుడు మొదలైన పార్షదులతో కూడి చతుర్బాహువులలో శ్రేష్ఠమైన ఆయుధాలను ధరించి పర్వతం మీద ప్రకాశిస్తాడు. విధంగా వివిధ మంత్రాలను రహస్యంగా రక్షించడానికి పర్వతం మీద ఉన్న భగవంతుడు తప్ప లోకాలోక పర్వతం ఆవల ఎవ్వరికి సంచరించడానికి శక్యం కాదు. బ్రహ్మాండానికి మధ్య భాగంలో సూర్యుడు ఉన్నాడు. సూర్యునికి ఇరువైపులా ఇరవై అయిదు కోట్ల యోజనాల దూరంలో బ్రహ్మాండ కటాహం ఉంది. సూర్యభగవానుడే ఆకాశం, దిక్కులు, స్వర్గనరకాలు, మోక్షం అనే వాటిని నిర్దేశిస్తాడు. దేవతలకు, మానవులకు, జంతువులకు, సర్పాలకు, పక్షులకు, గడ్డిపోచలకు, తీగలకు, పొదలకు, సర్వజీవరాసులకు సూర్యుడే ఆత్మ.

 

పంచమ స్కంధము - ఉత్తర : భగణ విషయము

 

బ్రహ్మాండం మధ్యలో ప్రకాశించే సూర్యుడు తన వెలుగుతో, వేడిమితో ముల్లోకాలను ముంచెత్తుతూ ప్రకాశింప జేస్తాడు.అటువంటి సూర్యునికి ఉత్తరాయణం, దక్షిణాయనం, విషువత్తు అనే మూడు గమనాలు ఉన్నాయి. ఉత్తరాయణంలో ఆ గమనం మందకొడిగా, దక్షిణాయనంలో తీవ్రంగా, విషువత్తులో సమానంగా ఉంటుంది. సూర్యుని ఈ మూడు గమనాలను అనుసరించి ఆరోహణ, అవరోహణ, సమస్థానాలలో రాత్రింబవళ్ళు దీర్ఘాలుగా, హ్రస్వాలుగా, సమానాలుగా మారుతూ ఉంటాయి.

 

మేషరాశిలో, తులారాశిలో సూర్యుడు సంచరిస్తున్నపుడు పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య అనే ఐదు రాసులలో సంచరించే సమయంలో ఒక్కొక్క గడియ ప్రకారం రాత్రి తగ్గుతూ వస్తుంది.సూర్యుడు వృశ్చికం, ధనుస్సు, మకరం, మీనం అనే ఐదు రాసులలో ఉన్నపుడు ఒక్కొక్క గడియ ప్రకారం రాత్రి పెరుగుతుంది. పగటికాలం తగ్గిపోతుంది.

 

ఈ ప్రకారంగా అహోరాత్రాలను ఉత్తరాయణ, దక్షిణాయనాలలో పెంచుతూ తగ్గిస్తూ ఒక్కదినంలో తొమ్మిది కోట్ల యాభైఒక్క లక్షల యోజనాల పరిమాణం కలిగిన దూరం మానసోత్తర పర్వతం నలువైపులా సూర్యరథం తిరుగుతూ ఉంటుంది. ఈ పర్వతం తూర్పున దేవధాని అనే ఇంద్రుని పట్టణం, దక్షిణంలో సంయమని అనే యముని పట్టణం, పశ్చిమంలో నిమ్లోచన అనే వరుణుని పట్టణం, ఉత్తరంలో విభావరి అనే సోముని పట్టణం ఉన్నాయి. ఈ నాలుగు పట్టణాలలోను సూర్యుడు క్రమంగా ఉదయం, మధ్యాహ్నం, అస్తమయం, అర్ధరాత్రం అనే కాల భేదాలను కల్పిస్తూ ఉంటాడు. ఈ ఉదయం మొదలైనవి అక్కడి జీవుల ప్రవృత్తి నివృత్తులకు కారణా లవుతుంటాయి. సూర్యుడు ఇంద్రనగరం నుండి యమనగరానికి పయనించేటప్పుడు పదిహేను గడియలలో రెండు కోట్ల ముపై ఏడు లక్షల డెబ్బై ఐదు వేల యోజనాలు అతిక్రమించి యమనగరానికి, ఇదే విధంగా అక్కడి నుంచి వరుణ, సోమ నగరాలకు చంద్రాది గ్రహాలతో, నక్షత్రాలతో సంచరిస్తాడు. పన్నెండు ఆకులూ, ఆరు కమ్ములూ, మూడు కుండలూ (నాభి ప్రదేశాలు) కలిగి ఏకచక్రంతో కూడి సంవత్సరాత్మకమైన సూర్యుని రథం ఒక ముహూర్తకాలంలో ముప్పై నాలుగు లక్షల ఎనిమిది వందల యోజనాలు ప్రయాణం చేస్తుంది.

 

సూర్యుని రథ చక్రానికి ఒక ఇరుసు అమర్చబడి ఉంది. ఆ ఇరుసుకు ఒకవైపు మేరు పర్వతం, రెండవవైపు మానసోత్తర పర్వతం ఉన్నాయి. రెండువైపులు వాయుపాశాలతో గట్టిగా బిగింపబడి ఉన్నాయి. ఇవి భూమి రెండు ధ్రువాలకు అంటి ఉన్నాయి. అటువంటి సూర్యరథానికి అమర్చబడిన కాడి ముప్పై ఆరు లక్షల యోజనాల పొడవు ఉంటుంది. ఆ కాడి సూర్యరథానికి కట్టిన గుఱ్ఱాల మెడలపై మోపబడి ఉంటుంది.ఆ సూర్యరథానికి గాయత్రి ఉష్టిక్ త్రిష్టుప్ అనుష్టుప్ జగతీ పంక్తి బృహతి అనెడి ఏడు ఛందస్సులు గుఱ్ఱాలుగా ఉన్నాయి. సూర్యునికి అరుణుడు రథసారథి. అతడు సూర్యుని ముందు భాగంలో కూర్చుండి రథాన్ని నడుపుతుంటాడు. బొటనవ్రేలి కణుపు పరిమాణం దేహం కలిగిన వాలఖిల్యులు అనే ఋషిపుంగవులు అరవై వేల మంది జ్యోతిర్మయ స్వరూపాలను ధరించినవారు సూర్యుని ముందుండి వేద సూక్తాలతో స్తోత్రం చేస్తుంటారు. ఎందరో మునులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, నాగులు, అప్సరసలు, గరుడులు మొదలైనవారు క్రమం తప్పకుండా సూర్యుణ్ణి సేవిస్తూ ఉంటారు. తొమ్మిది కోట్ల యాభైఒక్క లక్షల యోజనాల పరిమాణం కలిగిన భూమండలం చుట్టూ సూర్యుడు క్షణానికి రెండువేల యాభై యోజనాల చొప్పున అహోరాత్రంలో సంచరిస్తాడు.

 

శుకయోగీంద్రునితో పరీక్షిత్తు ఇలా అన్నాడు.“మునీంద్రా! సూర్యుడు మేరువుకు, ధ్రువునికి ప్రదక్షిణంగా తిరుగుతూ ఉంటాడని చెప్పావు కదా! బ్రహ్మ స్వరూపుడైన సూర్యుడు పన్నెండు రాసులలోను అభిముఖుడై తిరిగుతాడని కూడా అన్నావు. అది ఎలా పొసగుతుంది?”అని ప్రశ్నించిన పరీక్షిత్తును చూచి శుకయోగి దయాపూర్ణుడై మనస్సులో శ్రీహరిని తలచుకొని “విను అంటూ మళ్ళీ ఇలా చెప్పాడు.

 

కుమ్మరిసారె వేగంగా గిరగిరా తిరుగుతుంటుంది. ఆ సారెమీద చీమల బారులు తిరుగుతుంటాయి. అయితే వాటి గమనం ఆ చక్ర భ్రమణానికి భిన్నంగా ఉంటుంది. అదే విధంగా నక్షత్రాలతో, రాసులతో కూడిన కాలచక్రం తిరుగుతున్నది. ఆ కాలచక్రం ధ్రువ మేరువులను ప్రదక్షిణం చేస్తూ తిరిగేటప్పుడు ఆ కాలచక్రం వెంట తిరిగే సూర్యాది గ్రహాలు నక్షత్రాలలోను, రాసులలోను సంచరిస్తూ ఉంటాయి. అందువల్ల సూర్యాది గ్రహాలకు కాలచక్ర గమనం, స్వగమనం అనే రెండు రకాల గమనాలు కలుగుతున్నాయి. అంటే తమంత తాము తిరగడం, కాలచక్ర గమనంతో తిరగడం. ఆదినారాయణుడే సూర్యుడుగా ప్రకాశిస్తున్నాడు. ఆ సూర్యభగవానుడు సమస్త లోకవాసుల యోగక్షేమాలు ప్రసాదించేవాడు. అతడు ఋగ్యజుస్సామ వేదస్వరూపుడు. మానవులు నిర్వహించే కర్మలకు సిద్ధి ప్రదాత. ఆ దేవుని స్వరూపాన్ని దేవర్షి గణాలు వేదాంతపరంగా భావించి సంభావిస్తారు. అటువంటి సూర్యుడు తన స్వరూపాన్ని పన్నెండు విధాలుగా విభజించి వసంతం గ్రీష్మం మొదలైన ఋతువులను ఆయా కాలాలలో కలుగజేస్తూ ఉంటాడు. అటువంటి పరమ పురుషుని మహిమను అర్థం చేసుకొన్న మహాత్ములు వర్ణాశ్రమాలను పాటిస్తూ వేదాలలో చెప్పబడ్డట్టు అతిశయమైన భక్తితో ఆయనను ఆరాధిస్తూ క్షేమంగా ఉంటారు. సూర్య రూపుడైన ఆదినారాయణమూర్తి జ్యోతిశ్చక్రంలో తిరుగుతూ తన తేజస్సుతో గ్రహగోళాలను వెలిగిస్తూ ద్వాదశ రాసులలో ఒక సంవత్సరకాలం సంచరిస్తాడు. ఆ ఆదిపురుషుని గమన విశేషాన్ని లోకులు అయనాలు, ఋతువులు, మాసాలు, పక్షాలు, తిథులు అనే పేర్లతో వ్యవహరిస్తూ ఉంటారు. రాసులలో ఆరవ భాగం సంచారం చేసే కాలాన్ని ఋతువని వ్యవహరిస్తారు. ఆ రాసులలో సగభాగం సంచరిస్తూ ఆరు రాసులలో తిరిగే కాలాన్ని అయన మంటారు. రాసులన్నిటిలోను పూర్తిగా తిరిగిన కాలాన్ని సంవత్సర మని నిర్ణయిస్తారు. ఆ సమగ్ర రాశి సంచారంలో మూడు రకాలైన గమనాలు ఉంటాయి. మొదటిది శ్రీఘ్రగతి. రెండవది మందగతి. మూడవది సమగతి. ఈ గతుల కారణంగా సంవత్సరంలో కలిగిన మార్పులను వరుసగా వత్సరం, పరివత్సరం, ఇడావత్సరం, అనువత్సరం, ఇద్వత్సరం అని ఐదు విధాలుగా చెబుతారు. ఇదే పద్ధతిలో చంద్రుడు సూర్యమండలం మీద లక్ష యోజనాల దూరం నుండి సంవత్సరం, పక్షాలు, రాసులు, నక్షత్రాలు భుక్తులను గ్రహిస్తూ ముందుండి వేగంగా సంచరిస్తాడు. చంద్రుని వృద్ధి క్షయాల వల్ల పితృగణాలకు పూర్వపక్షం, అపరపక్షం అనేవి ఏర్పడతాయి. వీటివల్లనే పగలు రాత్రులు కలుగుతాయి. చంద్రుడు ఒక్కొక్క నక్షత్రంలో ముప్పై ముహూర్తాల కాలం సంచరిస్తాడు. పదహారు కళలతో మనోమయ, అన్నమయ, అమృతమయ దేహంతో ఒప్పుతూ ఉంటాడు. దేవతలకు, పితృగణానికి, మానవులకు, భూతాలకు, జంతువులకు, పక్షులకు, పాములు మొదలైనవాటికి, తీగలకు, పొదలకు ప్రాణప్రదమైన తన స్పర్శవల్ల సంతృప్తిని కలిగిస్తూ చంద్రుడు సర్వసముడుగా ప్రకాశిస్తాడు.

 

చంద్రుని పైన లక్షయోజనాల ఎత్తు ప్రదేశంలో నక్షత్ర మండలం ఉంది. అందలి నక్షత్రాలన్నీ అభిజిత్తుతో కూడా కలిసి మేరుపర్వతానికి ప్రదక్షిణం చేస్తూ ఉంటాయి.నక్షత్ర మండలానికి రెండు లక్షల యోజనాల ఎత్తున శుక్రుడు సంచరిస్తూ ఉంటాడు. ఇతడు సూర్యునికి ముందూ, వెనుకా ఉదయిస్తూ సూర్యునిలాగే సంచారం చేస్తాడు. ఇతని గమనం కొన్నిసార్లు మెల్లగా, కొన్నిసార్లు మృదువుగా, కొన్నిసార్లు తొందరగా సాగుతుంది. ఈ శుక్రుడు ప్రజల కందరికీ అనుకూలుడై వర్షం కురుపిస్తాడు. వర్షాలకు ఆటకం కలిగించే గ్రహాలకు శాంతి చేసినట్లయితే శుక్రుడు సంతుష్టి పొంది శుభం కలుగజేస్తాడు. శుక్రుని కంటె పైన రెండు లక్షల యోజనాల దూరంలో బుధుడు తిరుగుతూ ఉంటాడు. అతడు సూర్యమండలాన్ని వదలి దూరంగా కనిపించినా ప్రజలందరికీ కరువు కాటకాలు, దోపిడీల భయాన్ని కలిగిస్తాడు.

 

బుధునికంటే పైన రెండు లక్షల యోజనాల దూరంలో అంగారకుడు ఉన్నాడు. అతడు మూడు పక్షాల కాలంలో ఒక్కొక్క రాశి దాటుతూ సంచారం చేస్తాడు. ఈ విధంగా పన్నెండు రాసులలో రాజసంతో సంచరిస్తూ ఉంటాడు. వక్రగతిలో కాని, వక్రగతిలో లేనప్పుడు కాని అంగారకుడు ప్రజలకు పీడలే కలిగిస్తాడు. అతనికి రెండు లక్షల యోజనాల దూరంలో బృహస్పతి సంచరిస్తున్నాడు. అతడు ప్రతి ఒక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరం సంచరిస్తూ ఉంటాడు. ఇతడు వక్రగతిలో ఉన్నా బ్రాహ్మణులకు ఎప్పటి కప్పుడు శుభపరంపరలను ప్రసాదిస్తూ ఉంటాడు.

 

బృహస్పతి కన్న రెండు లక్షల యోజనాలకు పైన శని తిరుగుతూ ఉంటాడు. ఇతను ప్రతిరాశిలోను ముప్పై మాసాలు చరిస్తాడు. ఈ ముప్పై మాసాలలోను శని ప్రజలకు కష్టాలే కలిగిస్తాడు.

 

శనికి పదకొండు లక్షల యోజనాల దూరంలో సప్తర్షి మండలం ఉంది. ఇందులోని ఋషులు బ్రాహ్మణులకు, ప్రజలకు మేలు కోరుతుంటారు.

 

సప్తర్షి మండలం కంటె పదమూడు లక్షల యోజనాల దూరంలో శింశుమారచక్రం ఉంది. ఇదే ఆకాశంలో అన్నిటికన్న పైన ఉన్న చక్రం.ఆ శింశుమారచక్రంలో పరమ భక్తుడైన ధ్రువుడు ఉన్నాడు. అతడు ఇంద్రుడు, వరుణుడు, కశ్యపుడు, యముడు మొదలైన దేవతలతో, ప్రజాపతులతో విష్ణుపదానికి ప్రతినిత్యం ప్రదక్షిణం చేస్తూ ఉంటాడు. అతడు కల్పం చివరిదాకా జీవిస్తాడు.ధాన్యం నూర్చే కళ్ళంలో పశువులను కట్టడం కోసం మధ్యలో పాతిన స్తంభంలాగా ధ్రువుడు ఆ శింశుమారచక్రం నడుమ ప్రకాశిస్తూ ఉన్నాడు. అతని చుట్టూ గ్రహాలు, నక్షత్రాలు ఉన్నాయి. అవన్నీ కాలవిభాగంలో నిమేషమాత్రం కూడా ఏమరుపాటు లేక ధ్రువుని చుట్టూ ప్రదక్షిణంగా తిరుగుతూ ఉంటాయి. ఆకాశంలో మేఘాలు, డేగలు మొదలైన పక్షులు కర్మానుసారంగా గాలికి లోబడి ఆకాశంలో ఎలా పరిభ్రమిస్తున్నాయో అలా జ్యోతిర్గణాలు కర్మను అవలంబించి ప్రకృతి పురుషులకు లోబడి గగనాన తిరుగుతూ ఉంటాయి. ఈ కారణం వల్లనే ఆ గ్రహాలు నేలమీద పడడం లేదు.

 

శింశుమారచక్రం తలక్రిందుగా, గుండ్రంగా అందంగా ఉంటుంది. ఆ చక్రం తోక చివర ధ్రువుడు సర్వదా ప్రకాశిస్తూ ఉంటాడు.ఆ శింశుమారచక్రం తోకభాగంలో ప్రజాపతి, అగ్ని, ఇంద్రుడు, ధర్ముడు ఉన్నారు. తోక ముందుభాగంలో ధాత, విధాత ఉన్నారు. నడుము భాగంలో సప్తర్షులు ఉన్నారు. కుడివైపుకు చుట్టుకొని కుండలీభూతంగా ఉన్నదానికి ఉత్తరభాగంలో ఉత్తరాయణ నక్షత్రాలు, దక్షిణభాగంలో దక్షిణాయన నక్షత్రాలు, వీపుమీద దేవమార్గం అనబడే తారకాసముదాయం, అక్కడే ఆకాశగంగ ఉన్నాయి. ఉత్తరభాగంలో పునర్వసు, పుష్యమి నక్షత్రాలు; దక్షిణభాగంలో ఆర్ద్ర, ఆశ్లేషలు; కుడిపాదంలో అభిజిత్తు; ఎడమపాదంలో ఉత్తరాషాఢ; కుడివైపు ముక్కుపుటంలో శ్రవణం; ఎడమవైపున పూర్వాషాఢ ఉన్నాయి. కుడి ఎడమ నేత్రాలలలో ధనిష్ఠ, మూల ఉన్నాయి. కుడి ఎడమ చెవులలో మఘ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ నక్షత్రాలు ఉన్నాయి. ఎడమ ప్రక్క దక్షిణాయన నక్షత్రాలు, కుడిప్రక్క కృత్తిక, రోహిణి, మృగశిర అనే మూడు నక్షత్రాలు ఉన్నాయి. ఇవికాక ఉత్తరాయణ నక్షత్రాలు కూడా అక్కడే ఉన్నాయి. ఎడమ కుడివైపుల మూపులయందు శతభిషం, జ్యేష్ఠం నక్షత్రాలున్నాయి. పై దవడ ప్రదేశంలో అగస్త్యుడు, క్రింది దవడ స్థానంలో యముడు, ముఖంలో అంగారకుడు, మర్మావయవ స్థానంలో శని, పురుషాంగంగా బృహస్పతి ఉన్నారు. వక్షోభాగంలో సూర్యుడు, నాభిలో శుక్రుడు, మనసులో చంద్రుడు, స్తనాలలో అశ్వినులు, ప్రాణాపానాలలో బుధుడు, కంఠభాగంలో రాహువు ఉన్నారు. అయితే కేతువు మాత్రం అన్ని అవయవాలను ఆవరించి ఉంటాడు. ఈ శింశుమార చక్రానికి రోమాలుగా ఇంకా ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి. ఇది సర్వదేవతామయమైన నారాయణుని దివ్య స్వరూపం. ఇది స్థిరమైనది, ధ్రువమైనది.

 

శ్రీమన్నారాయణుని దివ్య శరీరమైన ఈ శింశుమారచక్రాన్ని ఎవరు ప్రతిదినం సంధ్యాకాలంలో మనసులో నిలుపుకొని దీక్షతో, నియమంతో, భక్తితో స్మరిస్తారో, తత్త్వాన్ని గ్రహించి మౌనవ్రతం చేపట్టి ఏ చక్ర దర్శనం చేస్తూ ఎవరు ఈ స్తోత్రాన్ని ప్రీతితో జపించి నమస్కరిస్తారో, ఎవరు ప్రశస్తమూ మునీంద్ర సేవ్యమూ జ్యోతిస్స్వరూపమూ అయిన శింశుమార చక్రానికి వందనం వందనం అంటూ మ్రొక్కులు చెల్లిస్తారో అటువంటి వారికి ఇహలోకంలో సకల సిద్ధులు, పరలోకంలో ముక్తి లభిస్తాయి.

 

సూర్యమండలానికి దిగువ పదివేల యోజనాల దూరంలో రాహుమండలం ఉన్నది. ఈ రాహువు అపసవ్యంగా నడుస్తూ ఉంటాడు.రాక్షసులలో అధముడైన రాహువు బ్రహ్మ వరంవల్ల అమరత్వాన్ని పొంది గ్రహాలలో తానూ సాటిలేని ఒక గ్రహమై విహరిస్తున్నాడు.ఈ రాహువు పదివేల యోజనాల విస్తృతి కలిగిన సూర్యమండలాన్ని, పన్నెండు వేల (12,000) యోజనాల విస్తృతి కలిగిన చంద్రమండలాన్ని కప్పేస్తాడు. రాహుమండలం పదమూడువేల యోజనాల వైశాల్యం కలిగింది. పూర్ణిమ పర్వదినంలో చంద్రుణ్ణి, అమావాస్య పర్వదినంలో సూర్యుణ్ణి రాహువు మాటు పరుస్తాడు. దీనినే గ్రహణం అంటారు. ఆ గ్రహణ కాలంలో జనులంతా తమ తమ జపతపో రూపాలైన ధర్మాలను చక్కగా ఆచరించుకొంటారు. అయితే దయామయుడైన శ్రీహరి సుదర్శన చక్రం సూర్య చంద్ర మండలాలను రక్షించడానికి వస్తుందేమో అన్న భయంతో ఐదారు ఘడియలలోనే రాహువు వారిని వదిలిపెట్టి తొలగిపోతాడు.

 

రాహువుకు దిగువ పదివేల యోజనాల దూరంలో సిద్ధులు, చారణులు, విద్యాధరులు స్థిరనివాసం ఏర్పరచుకొని తిరుగుతూ ఉంటారు.సిద్ధ విద్యాధరుల నివాసస్థానానికి క్రింద పదివేల యోజనాల దూరంలో రాక్షసులు, పిశాచాలు సేవిస్తుండగా యక్షులు, భూత ప్రేతాలు తిరుగుతుంటారు.వారి క్రింద గాలికి చలిస్తూ ఉండే మేఘమండలం ఉంది. మేఘమండలం పైన ఉంటే దానికి క్రింది భాగంలో భూమండలం ఉంది.

 

పంచమ స్కంధము - ఉత్తర : పాతాళ లోకములు

 

అటువంటి భూమండలం క్రింద ఒకదాని క్రింద ఒకటిగా అతలం, వితలం, సుతలం, తలాతలం, రసాతలం, మహాతలం, పాతాళం అనే ఏడు లోకాలున్నాయి. ఈ లోకాలలో ఒక్కొక్కదానికి మధ్య పదివేల యోజనాల దూరం ఉంటుంది. ఇవి క్రింద ఉన్నా స్వర్గం వంటివే. ఈ క్రింది స్వర్గాలు పైనున్న స్వర్గం కంటే ఎంతో గొప్పవి. ఇక్కడ దైత్యులు, దానవులు, నాగులు మొదలైన దేవజాతికి చెందినవాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఐశ్వర్యం వల్ల సంక్రమించిన ఆనందానుభవంతో సుఖభోగాలతో తులతూగుతూ జీవిస్తారు. సర్వాంగ సుందరాలైన ఉద్యానవనాలలో, క్రీడా ప్రదేశాలలో విహరిస్తూ ఉంటారు. వారు తమ భార్యలతో, బిడ్డలతో, చెలికాండ్రతో, దాస దాసీ జనంతో మణులు చెక్కిన రమణీయమైన గృహాలలో సర్వదా సంతోషం అనుభవిస్తూ ఉంటారు. ఈశ్వరుని కరుణ వల్ల వారికి దైహికాలైన వ్యాధులు లేవు. మాయలతో నిర్మింపబడ్డ కొంగ్రొత్త కేళీగృహాలలో, విహార మంటపాలలో, చిత్ర విచిత్రమైన ఉద్యానవనాలలో క్రీడా వినోదాలతో సంచరిస్తూ ఉంటారు.

 

అటువంటి పాతాళలోకాలలో మయుడు నిర్మించిన మాయా పట్టణాలు ఎన్నో ఉన్నాయి. ఆ పట్టణాలలో నానావిధ రత్నాలతో నిర్మించిన ప్రాకరాలు, గోపురాలు, సౌధాలు, విశాలమైన సభా సమావేశ స్థలాలు, చైత్యాలు ఉన్నాయి. వాటిలో దైత్య దానవ నాగ దంపతులు విహరిస్తూ ఉంటారు. మాయతో వాళ్ళు నిర్మించుకున్న విహార ప్రదేశాలలో చిలుకలు, కోకిలలు, గోరువంకలు కలకలారావాలు చేస్తుంటాయి. పూల వాసనలు, చిగురుటాకుల గుత్తుల బొత్తులు, రకరకాల ఫలాలు సమృద్ధిగా కలిగిన ఆ ఉద్యానవనాలలో లతాసుందరులు పెనవేసుకున్న తరుశాఖలు కన్నుల పండుగ చేస్తుంటాయి.ఇంకా మనస్సుకు, ఇంద్రియాలకు ఆహ్లాదం కలిగించే సరస్సులు కూడా అక్కడ ఉన్నాయి. ఆ సరోవరాలలో రకరకాలైన నీటిపక్షుల జంటలు విహరిస్తుంటాయి. అక్కడ నీరు నిర్మలంగా ఉంటుంది. చేపలు ఈదుతూ కోనేటిలో కదలికలను కలిగిస్తాయి. ఆ సరోవరాలలో తెల్ల కలువలు, నల్ల కలువలు, ఎఱ్ఱ కలువలు, రంగు రంగుల తామరపూలు ఉన్నాయి. అటువంటి సరస్సులు కలిగిన ఉద్యానవనాలలో వాళ్ళు ఇళ్ళు ఏర్పరచుకొంటారు. స్వర్గ భోగాలను మించిన భోగాలు వారికి అందుబాటులో ఉంటాయి. వారికి పగలు, రాత్రి అనే కాలభేదాలు ఉండవు. శేషుడు మొదలైన సర్పరాజుల పడగల మీద ఉన్న దివ్యమైన మణులవల్ల వారికి చీకట్లు ఉండవు. అక్కడ ఎప్పుడూ పట్టపగలు లాగా ఉంటుంది. అక్కడివారు దివ్యమైన మూలికలను, రస రసాయనాలను ఆహారంగా స్వీకరించడం వల్ల దేహవ్యాధులు కాని, మనోవ్యాధులు కాని వారికి ఉండవు. దేహం పాలిపోదు. ముడతలు పడదు. జుట్టు నెరసిపోదు. ముసలితనం రాదు. రోగాలు లేవు. చెమట, దుర్వాసనలు ఉండవు. ఆకర్షణీయమైన ఆకారాలు కలిగి ఉంటారు. వారికి సుదర్శన చక్ర భయం తప్ప మరే మృత్యుభయం లేదు. అంతేకాక అటువంటి పాతాళలోకంలో విష్ణుచక్రం ఎప్పుడు ప్రవేశిస్తుందో అప్పుడే రాక్షసస్త్రీలకు గర్భస్రావం కలుగుతుంటుంది.

 

అతలం అనే లోకంలో మయుని కుమారుడైన బలాసురుడు స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటాడు. అతడు తొంభై ఆరు విధాలైన మాయలతో వినోదిస్తూ ఉంటాడు. ఈ మాయలకు భూలోకంలోని వారు కొందరు లొంగిపోయి సమ్మోహితులై చరిస్తుంటారు.అటువంటి బలాసురుని ఆవులింతల నుండి స్వైరిణులు, కామినులు, పుంశ్చలులు అనే స్త్రీ సమూహాలు పుట్టారు. ఆ స్త్రీలు పాతాళంలో ప్రవేశించిన పురుషునికి హాటకరసం అనే సిద్ధ రసఘుటికను ఇచ్చి అతనిని శృంగారరస సిద్ధుణ్ణి చేస్తారు. తమ తళుకు బెళుకు చూపులతో, అనురాగ ప్రదర్శనలతో, చిరునవ్వులతో, సరస సల్లాపాలతో, కౌగిలింతలతో అతనిని లోబరచుకొంటారు. తమకు నచ్చిన రీతిలో ఆ పురుషునితో విహారం సాగిస్తారు. అపుడు పాతాళం ప్రవేశించిన ఆ పురుషుడు తానే సిద్ధపురుషుడనని భావిస్తాడు. దర్పంతో అతని కళ్ళు నెత్తి కెక్కుతాయి. తాను పదివేల ఏనుగుల బలం కలవాడనని భావించుకొని రకరకాల రతిక్రీడలతో పరమానందం అనుభవిస్తుంటాడు.

 

వితలం అనే లోకానికి హాటకేశ్వరుడనే పేరు గలవాడు, పార్వతీపతి అయిన శివుడు అధి దేవత. భూతగణ సమేతుడైన శివుడు బ్రహ్మసృష్టిని వృద్ధి పొందించటం కోసం పార్వతీ సంభోగ పరవశుడౌతాడు. అపుడు అతని వీర్యం నుండి హాటకి అనే నది పుట్టింది. ఆ నదిలోని జలరూపమైన వీర్యాన్ని వాయువుతో కూడా అగ్ని ఆహారంగా తీసుకొని ఉమియగా హాటకం అనే పరిశుద్ధమైన బంగారం పుట్టింది. ఆ వితలలోకంలోని వారి కందరికీ ఆ బంగారం భూషణ రూపంలో ఉపయోగ పడుతున్నది.

 

వితలం క్రింద సుతలం ఉంది. సుతలంలో బలి చక్రవర్తి ఉన్నాడు. అతడు పుణ్యవంతుడైన విరోచనుని కుమారుడు. శ్రీమన్నారాయణుడు ఇంద్రుణ్ణి సంతోషపెట్టాలనుకొని అదితి గర్భంలో వామనుడై పుట్టాడు. త్రివిక్రమ రూపం ప్రదర్శించి ముల్లోకాలను ఆక్రమించాడు. చివరకు విష్ణువు బలి చక్రవర్తికి సుతలంలో ఇంద్రత్వం అనుగ్రహించాడు. ఆ బలి ఎన్నో పుణ్యకర్మలు చేసాడు. శ్రీహరి పాదపద్మాలను సేవించాలనే అభిలాష కలవాడు. అతడు ఎంతో ఉత్సాహంతో లక్ష్మీశుడైన శ్రీమన్నారాయణుని ఆరాధిస్తూ ఉంటాడు.సకల జగద్గురుడైన శ్రీమన్నారాయణుడు తన వారిపట్ల దయ కలిగిన వాడై శంఖం, చక్రం మొదలైన ఆయుధాలతో గదను ధరించి ఆ బలిచక్రవర్తి గృహద్వారంలో ఇప్పటికీ కాపలా కాస్తున్నాడు. అటువంటి బలిచక్రవర్తి ఉండే సుతలలోకాన్ని జయించాలనే వాంఛ గొన్న రావణుడు అనుజ్ఞ లేకుండా సుతలం లోనికి ప్రవేశించినప్పుడు ఆ శ్రీహరి తన కాలి బొటన వ్రేలితో లంకేశ్వరుణ్ణి పదికోట్ల యోజనాల దూరంలో పడేటట్లు చిమ్మివేశాడు.

 

ఆ సుతలానికి క్రింది భాగంలో తలాతలం ఉంది. రాక్షసుల పట్టణాలను నిర్మించిన మహాశిల్పిగా ప్రసిద్ధుడైన మయుడు ఆ తలాతలాన్ని పాలిస్తుంటాడు.ముల్లోకాలకు హితం కలిగించడానికి శ్రీహరి శివునిచేత త్రిపురాలను బూడిద చేయించాడు. అప్పుడు మయుడు విష్ణువును శరణు పొందాడు. శ్రీహరి మయుణ్ణి కనికరించి తలాతలానికి రాజుగా చేసాడు. అతనికి విష్ణుదేవుని సుదర్శన చక్రం వల్ల తప్ప మరి దేనివల్లను మరణభయం లేదు.

 

తలాతలానికి క్రింద మహాతలం ఉంది. ఆ మహతలంలో కద్రువ కొడుకులైన సర్పరాజులు ఉన్నారు. వారికి ఒక్కొక్కరికి పెక్కు పడగ లున్నాయి. ఆ సర్పగణం కోపోద్రేకంతో ప్రవర్తిస్తూ ఉంటారు.ఇంకా ఆ మహాతలంలో కుహకుడు, తక్షకుడు, కాళియుడు, సుషేణుడు మొదలైన సర్ప ముఖ్యు లున్నారు. వారు సాటిలేని మేటిరూపం కలవారు. ఆదిపురుషుడైన నారాయణుని వాహనమైన గరుత్మంతుని భయంవల్ల కలవరపడుతూ ఎల్లప్పుడూ భార్యలతో, బిడ్డలతో, మిత్రులతో, బంధువులతో కలిసి ఉంటారు. మహాతలం క్రింద రసాతలం ఉంది. ఆ రసాతలంలో దైత్యులు, దానవులు అయిన హిరణ్యపురవాసులు, నివాతకవచులు, కాలకేయులు అనేవారు నివాసం చేస్తుంటారు. వారు దేవతల పట్ల శత్రుత్వం వహించి ఉంటారు. వారు మహా సాహసవంతులు, తేజోవంతులు. అయినా అన్ని లోకాలకు ప్రభువైన శ్రీహరి తేజస్సుకు లొంగినవారై పుట్టలలో దాగిన సర్పాల మాదిరిగా భయంతో బ్రతుకుతుంటారు. ఇంద్రుని దూతి అయిన సరమ ఉచ్చరించే మంత్రాలకు భయపడుతూ ఉంటారు.

 

అన్నిటికన్నా దిగువ పాతాళలోకం ఉంది. ఆ పాతాళలోకం లోని నాగజాతివారు ఎంతో తెలివి గలవారై ఎంతో ఉత్సాహంగా తిరుగుతూ ఉంటారు.వాసుకి, శంఖుడు, కుళికుడు, మహాశంఖుడు, శ్వేతుడు, ధనంజయుడు, ధృతరాష్ట్రుడు, శంఖచూడుడు, కంబళుడు, అశ్వతరుడు, దేవదత్తుడు మొదలైనవారు పాతాళలోక వాసులైన మహానాగులు. వారిలో కొందరు ఐదు తలలవారు, కొందరు నూరు తలలవారు, వేయి తలలవారూ ఉన్నారు. వారి పడగల మీద మణులు మెరుస్తూ ఉంటాయి. ఆ మణుల కాంతులు పాతాళంలోని చీకట్లను పారద్రోలుతుంటాయి.

 

పాతాళలోకం అడుగున ఆదిశేషుడు ఉన్నాడు. అతడు ముప్పైవేల యోజనాల వెడల్పున చుట్ట చుట్టుకొని ఉంటాడు. విష్ణుదేవుని మహత్తర శరీరమైన ఆ ఆదిశేషునికే అనంతుడు, సంకర్షణుడు అని పేర్లు. అనంతుడని పేరు కలిగిన ఆదిశేషుని తలమీద ఆవగింజలాగా ఈ భూమండలం ఉన్నది. ప్రళయకాలంలో లోకాలను సంహరించే నిమిత్తం ఈ ఆదిశేషుడు ప్రచండమైన కోపంతో పదకొండు మంది రుద్రులను సృష్టిస్తాడు.ఆ రుద్రమూర్తు లందరూ మూడు కన్నులు కలవారు. అందరూ త్రిశూలధారులు. ఆ లోకంలోని సర్పరాజులు ఆదిశేషుని పాదపద్మాలపై భక్తి కలిగి ఉంటారు.ఆ సర్పరాజులు ఆదిశేషుని పట్ల వినమ్రత కలవారై ప్రతిదినం తమ పడగల మీది రత్నాల కాంతులతో ఆయనకు నీరాజనాలు అర్పిస్తుంటారు.

 

ఇంకా సంకర్షణమూర్తి అయిన ఆ ఆదిశేషుని దగ్గరికి తమ కోరికలు తీర్చుకోడానికి నాగకన్యలు వస్తుంటారు. ఆయన సమక్షంలో తమ శరీర విలాసాలు ప్రదర్శిస్తూ ఉంటారు. అగరు, చందనం, కుంకుమపువ్వు కలిపిన సుగంధ లేపనాలతో ఆయనను అర్చిస్తారు. ఆ తరువాత ఆ అనంతుని అపురూపమైన రూపాన్ని తనివితీరా చూడడం వల్లను, ఆ మూర్తిని తాకడం వల్లను కామోద్రేకం కలిగినవారవుతారు. ఆ కారణంగా చిరునవ్వును చిందిస్తూ, సిగ్గు లొలకబోస్తూ, క్రీగంటి చూపులు ప్రసరింపజేస్తూ ఆయన వంక చూస్తూ ఉంటారు. అప్పుడు అనంత గుణ సంపన్నుడైన అనంతుడు తన సహజ కోపాన్ని వదలిపెట్టి శాంతుడౌతాడు. లోకాలన్నింటికి క్షేమాన్ని కాంక్షిస్తాడు. దేవతలు, అసురులు, సిద్ధులు, గంధర్వులు, విద్యాధరులు, మునులు అనంతుని సదా ధ్యానం చేస్తుంటారు. అపుడు అనంతుడు సంతోషంతో అరగన్నుమోడ్పులతో లలిత గీతాలతో కూడిన మనోహరమైన వాద్య ధ్వనులకు ఆనందిస్తుంటాడు. తన పరిజనాన్ని ప్రీతితో కటాక్షిస్తుంటాడు. వైజయంతీ వనమాలికలను ధరిస్తుంటాడు. ఆ మాలికలు అప్పుడే కూర్చిన తులసీ మంజరులతో కూడినవై ఉంటాయి. ఆ మంజరుల మకరంద సుగంధాలకు క్రమ్ముకొన్న తుమ్మెదలు జుంజుమ్మని పాటలు పాడుతుంటాయి. అతడెప్పుడూ నల్లని వస్త్రాలు ధరించి నాగలిని ఆయుధంగా పట్టుకొని ఉంటాడు. అతణ్ణి మహేంద్రుడో, శివుడో అని జనులు భావిస్తుంటారు. ఆ శేషుడు మోక్షార్థులై తనను ధ్యానించే వారి హృదయ గ్రంధిని తొలగించి ఆధ్యాత్మవిద్యతో కూడిన ఆనందాన్ని కలిగిస్తాడు. అందువల్లనే ముక్తిని కోరేవారు ఆనంతుని భక్తితో ఆరాధిస్తుంటారు.

 

ఈ లోకంలోని జీవులకు సత్త్వరజస్తమో గుణాలను అనుసరించి శ్రద్ధలు వేరువేరుగా ఉంటాయి. సాత్త్విక శ్రద్ధ, రాజస శ్రద్ధ, తామస శ్రద్ధ అనే వానికి అనుగుణంగా వారి కార్యకలాపాలు కూడా వివిధంగా ఉంటాయి. ఈ తారతమ్యాలు ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటాయి.ఇది తగదని చెప్పడం ప్రతిషిద్ధం. తగదని చెప్పిన పనులను చేయడం అధర్మం. అటువంటి ప్రతిషిద్ధ లక్షణమైన అధర్మాన్ని ఆచరించే మానవుని శ్రద్ధ విపరీతంగా ఉంటుంది. శ్రద్ధయే భిన్నంగా ఉండడం వల్ల కర్మఫలాలు కూడా భిన్నంగానే ఉంటాయి.

 

పంచమ స్కంధము - ఉత్తర : నరక లోక విషయములు

 

ముల్లోకాలకు ఆవల దక్షిణ దిక్కులో భూమ్యాకాశాల మధ్య మహా భయంకరమైన నరకాలు ఉన్నాయి.అంతేకాకుండా దక్షిణంలోనే ఉన్న అగ్నిష్వాత్తులు మొదలైన పితృదేవతలు కూడా తమ తమ గోత్రాలలో పుట్టిన వారికి శుభం కలగడం కోసం సత్యమైన దీవెన లిస్తుంటారు. అక్కడ పితృపతి అయిన యముడు కూడా తనలోకం చేరుకొనే జీవులకు జీవితకాలంలో వారు చేసిన కర్మలకు తగిన ఫలం ప్రసాదిస్తూ శిక్షిస్తుంటాడు. ఆ యమలోకంలో తామిస్రం, అంధతామిస్రం, రౌరవం, మహారౌరవం, కుంభీపాకం, కాలసూత్రం, అసిపత్రవనం, సూకరముఖం, అంధకూపం, క్రిమిభోజనం, సందంశం, తప్తోర్మి, వజ్రకంటకశాల్మలి, వైతరణి, పూయోదం, ప్రాణరోధం, విశసనం, లాలాభక్షణం, సారమేయోదనం, అవీచిరయం, రేతఃపానం అనే ఇరవై ఒక్క నరకాలున్నాయి. అవే కాకుండా క్షారమర్దమం, రక్షోగణభోజనం, శూలప్రోతం, దందశూకం, అవటనిరోధనం, అపర్యావర్తనం, సూచీముఖం అనే మరి ఏడు నరకాలున్నాయి. వెరసి దక్షిణంలో ఇరవై ఎనిమిది నరకాలున్నాయని కొందరు చెబుతారు. అందులో ఇతరుల బిడ్డలు, భార్యలు అనే ఆదరభావం ఏమాత్రం లేకుండా అకారణంగా వారిని అపహసించే పాపాత్ముణ్ణి యమకింకరులు తాళ్ళతో బంధించి పరిపరి విధాలుగా బాధిస్తారు.

 

అంతే కాకుండా వారిని తామిస్రం అనే నరకంలో పడవేసి అన్నం పెట్టక, కొండపైనుండి దొర్లిస్తూ, కఱ్ఱతో చావమోదుతూ, బెదరిస్తూ యమకింకరులు నానావిధాలుగా శిక్షిస్తారు. ఆ బాధలకు తాళలేక జీవులు భయకంపితులై మూర్ఛ పోతుంటారు.మగడు ఉండగానే అతణ్ణి మోసగించి అతని భార్యను లొంగదీసుకున్నవాణ్ణి పట్టుకొని యమకింకరులు సంకోచం లేకుండా కోపంతో అంధతామిస్రం అనే నరకంలో పడవేస్తారు.

 

ఎవరైతే తమ కుటుంబపోషణ కోసం ఇతరులకు ద్రోహం చేస్తారో అటువంటివారు రౌరవ నరకంలో పడతారు. ఎవరైతే ఈ లోకంలో ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ, ఇతరులకు అపకారం తలపెట్టని పశు పక్షి మృగాదులను బాధిస్తారో అటువంటి పాపాత్ములను ఆయా మృగాలు భయంకర రూపాలతో నానాబాధలు పెడతాయి. వారు రౌరవ, మహారౌరవ నరకాలలో పడతారు. ఎవరైతే తమ కడుపు నింపుకొనడానికి ఎలుకల కన్నాలు మూసి వాటిని చంపుతారో అటువంటి నిర్దయులను కుంభీపాక నరకంలో కాగుతున్న నూనెలో పడవేసి హింసిస్తారు.

 

తల్లిదండ్రులకు, బ్రాహ్మణులకు కీడు తలపెట్టినవాడు కాలసూత్రం అనే భయంకర నరకంలో పడతాడు. అక్కడ పదివేల యోజనాల పొడవు గల లోహపాత్రలమీద అతణ్ణి నడిపిస్తారు. పైన ఎండ మండిపోతుండగా, క్రింద మంటలు భగభగ మండుతుండగా ఆ పాత్రల మీద పరుగెత్తుతూ, పడుతూ, లేస్తూ, నిలబడుతూ, పక్కకు తప్పుకుంటూ ఆకలితో, దప్పికతో అలమటిస్తాడు. ఆవు ఒంటిమీద ఎన్ని రోమాలున్నాయో అన్ని సంవత్సరాలు అక్కడ యమకింకరులు అతణ్ణి బాధిస్తారు.

 

ఇంకా వేదమార్గాన్ని వదలిపెట్టి పాషండమార్గం అవలంబించే పురుషుణ్ణి అసిపత్రవనం అనే నరకంలో పడవేస్తారు. అక్కడ కత్తుల చెట్ల నడుమ ఇరుప్రక్కల కత్తుల వంటి చెట్ల ఆకులు తగిలి శరీర భాగాలు తెగిపోతూ ఉంటాయి. అపుడా జీవుడు అడుగడుగునా మొరపెడుతున్నా వినకుండా యమకింకరులు వాణ్ణి వేధిస్తుంటారు.దండింప దగని వారిని దండించి, బ్రాహ్మణ శ్రేష్ఠులను శారీరకంగా హింసించిన దుర్మార్గుణ్ణి కాలసూత్ర నరకంలో పడవేసి కఠినంగా దండిస్తారు.

 

ఆ కాలసూత్ర నరకంలో అటువంటి దుర్మార్గుణ్ణి పట్టుకొని యమకింకరులు చెరకు గడ విరిచినట్లుగా నడిమికి విరిచి హింసిస్తుంటే వాడు మూర్ఛపోతూ మొరపెడుతూ ఉంటాడు.విధి నియమించిన విధంగా తమ బ్రతుకు తాము బ్రతుకుతున్న జంతువులను హింసించేవాణ్ణి అంధకూపం అనే నరకంలో పడవేస్తారు. వాడు పూర్వం తాను చేసిన భూత ద్రోహం కారణంగా ఆ నరక కూపంలో దొర్లుతూ ఏ జీవులనైతే తాను బాధించాడో ఆ పక్షులు, పశువులు, పాములు, దోమలు, నల్లులు, ఈగలు వాణ్ణి క్రూరంగా పీక్కు తింటాయి. కటిక చీకటిలో నిద్రకు నోచుకోక, తిండికి మొగం వాచి, కుత్సిత శరీరంలోని జీవునిలాగా సగం చచ్చిపడి ఉంటాడు.

 

ఎవ్వడు తన సంపదను తన బంధువులకు పెట్టకుండా, తానొక్కడే కాకిలాగా భక్షించాడో అటువంటివాడు శీఘ్రంగా క్రిమిభోజనం అనే నరకంలో పురుగుగా పడి లక్ష యోజనాల విస్తీర్ణం కల పురుగుల గుంటలో కూరుకుపోయి పురుగులను ఆహారంగా తింటూ ఉంటాడు.

 

ఇంకా ఈ భూలోకంలో ఎవడైతే తనకు ఎటువంటి కష్టం లేకపోయినా బ్రాహ్మణాదుల బంగారాన్ని, రత్నాలను, విలువైన వస్తువులను దొంగిలిస్తాడో అటువంటివాణ్ణి అగ్నితప్తం అనే నరకంలో పడవేస్తారు. ఎఱ్ఱగా కాలిన ఇనుపచువ్వలను గ్రుచ్చుతారు. మోహంతో, కామంతో కళ్ళు కనబడక వావి వరుసలు లేకుండా ప్రవర్తించిన స్త్రీ పురుషులను యమలోకంలో తీవ్రమైన కొరడాలతో కొట్టి కనకన మండుతున్న ఉక్కు బొమ్మలను కౌగిలించుకొమ్మని ఆజ్ఞాపిస్తారు.

 

జంతువులతో సంగమం చేసినవాణ్ణి పట్టుకొని, వజ్రాల మేకులు గల బూరుగుచెట్టుకు కట్టి చితుక కొడతారు.

 

ఎవడైతే పాషండమతం పట్ల ఆసక్తి పెంచుకొని ధర్మమార్గాన్ని పరిత్యజిస్తాడో అటువంటివాడు నరకలోకంలో వైతరణీ నదిలో పడి పొర్లుతూ ఉంటాడు.ఇంకా ఆ వైతరణీ నదిలోని మొసళ్ళు పాషండమతం పట్ల మోజు పెంచుకొన్నవాణ్ణి పీక్కుతింటాయి. వాడు తన ప్రాణాలు పోతూంటే తాను చేసిన తప్పులను తలచుకుంటూ మలమూత్రాలు, చీము, నెత్తురు, వెంట్రుకలు, గోళ్ళు, ఎముకలు, కొవ్వు, మాంసం కలిసిన ప్రవాహంలో మునుగుతూ తేలుతూ పడి కొట్టుకొంటూ ఉంటాడు.

 

ఎవడైతే బ్రాహ్మణుడై కూడ సిగ్గు విడిచి పశువులాగా ప్రవర్తిస్తూ, శూద్రస్త్రీతో సంబంధం పెట్టుకొని శుచిత్వం, సదాచారం వదలిపెడతాడో అతడు నరకలోకంలో మలమూత్రాలు, లాలాజలం, కఫంతో కూడిన ప్రవాహంలో పడి అసహ్యమైన ఆ వస్తువులనే భుజిస్తూ ఉంటాడు.వేటకుక్కలను పెంచి ఎల్లప్పుడు వేటకు పోతూ తన తిండి కోసం అడవిలోని మృగాలను చంపిన నీచ మానవుని యమభటులు అస్త్రాలతో పొడుస్తారు.ఎవడైతే డాబు కోసం పశువులను చంపి ఆడంబరంగా యాగాలు నిర్వహిస్తాడో అతణ్ణి యమకింకరులు పొలికేకలు వేస్తూ రంపాలతో కోస్తుంటారు.

 

ఎవడైతే కామంతో కళ్ళు మూసుకుపోయి తన భార్య చేత రేతఃపానం చేయిస్తాడో ఆ పాపాత్ముణ్ణి రేతస్సుతో కూడిన మడుగులో త్రోసి ఆ రేతస్సునే వానిచేత త్రాగిస్తారు. రాజభటులైనా, దొంగలైనా ధనవంతుల గ్రామాలపై పడి ఇళ్ళను తగులబెట్టేవాళ్ళను, విష ప్రయోగాదులతో ఇతరులను చంపేవాళ్ళను వజ్రాల కోరలున్న ఏడువందల ఇరవై కుక్కలు ప్రతిదినం చుట్టుముట్టి పీక్కుతింటాయి.

 

లంచం పుచ్చుకొని దొంగసాక్ష్యం చెప్పి ఎదుటివారిని మోసగించిన పాపాత్ముణ్ణి వీచి అనే నరకంలో పడవేస్తారు. అక్కడ వాణ్ణి పట్టుకొని బంధించి నూరు యోజనాల ఎత్తైన కొండ శిఖరం నుండి తలక్రిందుగా క్రిందికి విసరివేస్తారు. అప్పుడు వాడు పెడబొబ్బలు పెడుతూ అలలు లేని కొలనులాగా నున్నగా ఉన్న చట్రాతి మీద పడిపోతాడు. అలా పడి శరీరం ముక్కలు ముక్కలై మళ్ళీ అవి అతుక్కొంటుంతే చావు రాక, బ్రతుకలేక వ్యాకులపాటుతో అవస్థ పడుతుంటాడు.

 

సోమయాజి పెండ్లాన్ని కామించి అనుభవించినవాణ్ణి, సోమపానం అంటూ దొంగచాటుగా మద్యపానం చేసే వైశ్యులను, క్షత్రియులను పట్టుకొని సంభ్రమంతో వాళ్ళ రొమ్ము త్రొక్కి, ముఖం దిమ్మ తిరిగేటట్లు మొత్తి, అగ్నిలో ఎఱ్ఱగా కాల్చిన ఉక్కు ద్రవాన్ని నోట్లో పోస్తారు.ఇంకా తక్కువ కులం వాడు నియమ నిష్ఠలతో తపస్సు, దానాలు, విద్యార్జనం చేస్తూ పెద్దలను అవమానిస్తే అటువంటివాణ్ణి క్షారకర్దమం అనే నరకంలో తలకిందులుగా వ్రేలాడదీసి బాధిస్తారు. స్త్రీలైనా పురుషులైనా తమ ప్రాణాలు కాపాడుకొనడానికి పశువులను, మనుష్యులను బలి ఇస్తే వాళ్ళను నిరయం అనే నరకంలో వేసి యమకింకరులు చురకత్తులతో పొడిచి ఆ రక్తాన్ని త్రాగుతారు. గ్రామాలలోని, అడవులలోని జంతువుల కడుపులలో శూలాలను గ్రుచ్చి హింసిస్తూ ఆనందించినవాళ్ళను శూలప్రోతం అనే నరకంలో పడవేసి కడుపులలో శూలాలను గ్రుచ్చుతారు. వాళ్ళు ఆకలి దప్పులచే బాధపడుతుంటే రాబందులు, గ్రద్దలు పదునైన ఉక్కు ముక్కులతో వాళ్ళ దేహాలను పొడుచుకు తింటాయి. ఇంతేకాక ధూర్త స్వభావంతో జంతువులను హింసించిన పాపాత్ములను దందశూకం అనే నరకంలో పడవేస్తారు. అక్కడ ఐదు, ఏడు తలలు గలిగిన సర్పాలు వాళ్ళను కరుస్తూ ఉంటాయి.

 

తమ పెరళ్ళలో కాని, ఇండ్లలో కాని తిరిగే పశువులను, పక్షులను, లేళ్ళను హింసించే పాపాత్ములను విషాగ్ని జ్వాలలలో త్రోస్తారు.తన ఇంటికి వచ్చిన అతిథిని కోపంతో చూచినవాణ్ణి వజ్రాల కోరలు గలిగిన రాబందులు, గ్రద్దలు పొడుచుకొని తింటాయి.

 

ధనవంతుడై ధర్మకార్యాలు, దానలు చేయకుండా ఉన్న మానవుణ్ణి పట్టుకొని యమలోకంలోని సూచీముఖం అనే నరకంలోకి త్రోసి “నిధికి కాపలా ఉన్న దయ్యమా!” అంటూ యమకింకరులు తాళ్ళతో కట్టి కోపంతో బాధిస్తారు.ఇటువంటి నరకాలు యమలోకంలో వేలసంఖ్యలో ఉన్నాయి. ఆ నరకాలలో యమదూతలు అధర్మపరులను ఎల్లప్పుడూ బాధిస్తూ ఉంటారు.

 

ధర్మపరులైన మానవులు స్వర్గంలో సుఖాలను అనుభవిస్తారు. వారు వారు చేసుకొన్న పుణ్యపాపాల శేషఫలం వల్ల తిరిగి భూలోకంలో పుడుతూ ఉంటారు.ఈశ్వరుని స్థూలశరీరం తెలిసిన వారికి శ్రద్ధాభక్తుల వల్ల భగవంతుని సూక్ష్మశరీరం తెలుస్తుంది.

 

ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

1 comment:

  1. Unknown 12 hours ago
    మరి ఆతులు, సంకలో బొచ్చు ఎవరు?
    ahri.S.babu
    మీరూ మీ అక్కసెళ్ళెళ్ళూ!

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...